నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు
రాజమహేంద్రవరం రూరల్: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్, నియంత్రణ) చట్టం, 2002, 2007 నిబంధనల ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు లేకుండా రోగులకు వైద్య సేవలు అందించరాదన్నారు. రోగుల నుంచి అధికంగా వసూలు చేయడం, నిబంధనల ఉల్లంఘనలపై చర్యల కోసం ప్రత్యేకంగా మూడు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని, భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏదైనా అన్యాయం జరిగితే బాధితులు సంబంధిత అధికారులను లేదా వైద్య విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. ఆసుపత్రుల్లో శుభ్రత పాటించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలన్నారు. అన్ని విభాగాల్లో అర్హులైన వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, ల్యాబ్ టెక్నీషియన్లకు సర్టిఫికెట్లు ఉండాలని స్పష్టం చేశారు. ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ వంటి ఏర్పాట్లు ఉండాలన్నారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు ప్రత్యేక స్థలం కేటాయించాలని తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసే సామర్థ్యంతో ల్యాబ్ తప్పనిసరన్నారు. ఆసుపత్రికి అనుబంధంగా నడిచే ఫార్మసీ సేవలను డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం నిర్వహించాలని, మందుల ధరలపై పారదర్శకత పాటించాలని, ఆసుపత్రి సేవల ధరలను స్పష్టంగా బోర్డులపై ప్రదర్శించాలని వెంకటేశ్వరరావు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment