కందుకూరి స్ఫూర్తితో పోరాటాలు
● ప్రజలకు సీపీఎం నేత ఉమామహేశ్వరరావు పిలుపు
● జిల్లా మహాసభలు ప్రారంభం
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్ఫూర్తితో ప్రజలు విశాల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక కోటిపల్లి బస్టాండ్ సెంటర్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం లౌకికతత్వం వైపు ఉంటుందా.. సనాతన ధర్మం వైపు ఉంటుందా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం కోసం అంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాతుర్వర్ణ వ్యవస్థను సమర్థిస్తారా అని నిలదీశారు. పార్టీ రాష్ట్రవర్గ సభ్యుడు మంతెన సీతారాం మాట్లాడుతూ, 6 నెలల్లోనే చంద్రబాబు పాలన ఘోరంగా విఫలమైందని అన్నారు. అనేక హామీలతో ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సభకు అధ్యక్షత వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ మాట్లాడుతూ, నూతన జిల్లా ఏర్పడి ఏళ్లు గడిచినా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు నిధులు కేటాయించలేదని అన్నారు. ఫలితంగా ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు అనేక వ్యయప్రయాసలతో బొమ్మూరులోని కలెక్టరేట్‌కు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాలో సాగుకు ప్రోత్సాహం కరువైందని, నిడదవోలు, ఉండ్రాజవరం, గోదావరి డెల్టాలో పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను అమలు చేస్తోందని దుయ్యబట్టారు. తొలుత కార్యకర్తలు మున్సిపల్ స్టేడియం నుంచి తాడితోట సెంటర్, మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. 24వ మహాసభలకు అద్దం పట్టేలా 24 భారీ ఎర్ర జెండాలతో రెడ్ షర్ట్ వలంటీర్లు చేపట్టిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన గీతాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.సుందర్‌బాబు, వై.బేబీరాణి, పి.తులసి, బి.పవన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment