హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శుక్రవారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సీతారాం వివరాలు వెల్లడించారు. జవహర్‌నగర్ ముత్తుస్వామి కాలనీలో సందిరి స్వామి (35), భార్య కావ్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే కాలనీకి చెందిన ప్రణయ్‌కుమార్‌తో కావ్య గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. జల్సాలకు అలవాటు పడిన ప్రణయ్ కావ్య నుంచి 6 తులాల బంగారు నగలు తీసుకుని అమ్మి డబ్బులు తీసుకున్నాడు.
అంతేగాక ఆమె లోన్ యాప్ ద్వారా మరో రూ.3 లక్షలు రుణం తీసుకుని ప్రణయ్‌కు ఇచ్చింది. ఈ విషయం స్వామికి తెలియడంతో అతను కావ్యను నిలదీశాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను ఎలాగైనా తప్పించాలని ప్రియుడు ప్రణయ్‌తో కలిసి పథకం వేసింది. గత నెల 26న పథకం ప్రకారం ప్రణయ్ స్వామిని నిజామాబాద్ జిల్లా మాధవరం గ్రామంలోని ఓ వెంచర్ వద్దకు తీసుకెళ్లాడు. ప్రణయ్ స్నేహితులు రోహిత్, నగేష్ అక్కడ వారితో జత కలిశారు.అనంతరం నలుగురు కలిసి మద్యం తాగారు. స్వామి ఫుల్లుగా తాగి నిద్రిస్తుండగా అదే అదునుగా భావించిన ప్రణయ్, రోహిత్ అతడిని కత్తితో పొడిచి హత్య చేశారు.
మృతి చెందాడని నిర్ధారించుకున్న అనంతరం కారు ఢిక్కీలో వేసుకుని కౌకూర్ అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టారు. అనంతరం మృతుడి భార్య కావ్య ప్రణయ్‌కు రూ.47 వేలు గూగుల్‌పే ద్వారా పంపించింది. ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరక్కుండా పథకం ప్రకారం హత్య చేసినప్పటికీ అత్యాధునిక టెక్నాలజీ, క్లూస్ టీమ్, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితులు ప్రణయ్, రోహిత్, నగేష్‌లను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన పోలీసులను రాచకొండ సీపీ సుధీర్‌బాబు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment