ముగిసిన డ్రాగన్ బోట్ పోటీలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద ప్రధాన పంట కాలువలో కోనసీమ సంక్రాంతి సంబరాల పేరిట సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ– 2025 పడవలు, స్విమ్మింగ్ తదితర పోటీలు సోమవారంతో ముగిశాయి. కేరళ తరహాలో పచ్చని చెట్లు, పంట కాలువలతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే గోదావరి పరీవాహక కోనసీమ ప్రాంతంలో మూడు రోజుల పాటు ఆయా పోటీలు విశేషంగా అలరించాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఏపీ పర్యాటక శాఖ పర్యవేక్షణలో గౌతమి– వశిష్ట నదుల మధ్య సెంట్రల్ డెల్టా ప్రధాన పంట కాలువలో మూడు రోజులపాటు జరిగిన డ్రాగన్ బోటు, ఈత పోటీలు, అదే ప్రాంతంలో రంగవల్లులు, గాలిపటాల పోటీలు ఉత్కంఠగా సాగాయి.
విజేతలు వీరే..
ఆర్థర్ కాటన్– సంక్రాంతి సంబరాలు, గోదావరి ట్రోఫీ 2025 డ్రాగన్ బోట్ ఫైనల్ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు టీమ్‌లు పోటీ పడగా, జంగారెడ్డిగూడెం జైంట్స్, పల్నాడు తండర్స్ హోరా హోరీగా తలపడి సమాంతరంగా గమ్యానికి చేరుకున్నాయి. దానితో న్యాయ నిర్ణేతలు ఆ రెండు జట్లకు మొదటి బహుమతి ప్రకటించారు. ఆ మేరకు రూ.లక్ష నగదు చొప్పున, ట్రోఫీ, సర్టిఫికెట్లు, తృతీయ స్థానంలో నిలిచిన ఎన్టీఆర్ ఈగల్స్ టీమ్‌కు రూ.30 వేల నగదు, ట్రోఫీ, సర్టిఫికెట్ అందజేశారు.
● రంగవల్లుల పోటీల్లో ఎ.అమ్మాజీ (రావులపాలెం) మొదటి బహుమతి రూ.10 వేలు, ఫ్రిజ్, కె.సృజన (ఈతకోట) రెండో బహుమతి రూ.7500, మిక్సీ, టి.ఆదిశ్రీ (రాజమహేంద్రవరం) మూడో బహుమతి రూ.5 వేలు, కుక్కర్ అందించారు. మిగతా వారికి ప్రోత్సాహకాల కింద రూ. వెయ్యి, పతకం, సర్టిఫికెట్ అందజేశారు.
● సీనియర్స్ పతంగుల పోటీల్లో ఎం.సీతారామరాజు (ఊబలంక) ప్రథమ స్థానంలో నిలిచి రూ.4,500, ఆర్.చంటి (ఉచ్చిలి) ద్వితీయ స్థానంలో నిలిచి రూ.3,500, వి.శాంతరాజు (ఆత్రేయపురం) తృతీయ స్థానంలో నిలిచి రూ.2,500, ఎ.శ్రీనివాసు (అంకంపాలెం) నాలుగో స్థానంలో నిలిచి రూ.2500 బహుమతి గెలుచుకున్నారు. జూనియర్స్ పతంగుల పోటీల్లో వరుసగా ఎం.ప్రణీత్ వర్మ (హైదరాబాద్), ఎం.దుర్గా సుబ్రహ్మణ్యం (ఆత్రేయపురం), ఎ.పూజితాదేవి(రాజోలు), టి.సన్నీ (కొత్తపేట) బహుమతులు సాధించారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, డీసీసీబీ మాజీ డైరెక్టర్ ఆకుల రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, వాడపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, టీడీపీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు, కంఠంశెట్టి శ్రీనివాసరావు, ముళ్లపూడి భాస్కరరావు, తహసీల్దార్ టీవీ రాజేశ్వరరావు, ఎంపీడీఓ వెంకటరమణ, ఈవెంట్ ఆర్గనైజర్ దండు శివ తదితరులు పాల్గొన్నారు.
విజేతలుగా జంగారెడ్డిగూడెం,
పల్నాడు టీమ్‌లు
తృతీయ స్థానంలో ఎన్టీఆర్ ఈగల్
Comments
Please login to add a commentAdd a comment