ఇంటి పెద్దను ఇంటికి రప్పించండి
జగిత్యాలక్రైం: కుటుంబ బాధ్యతలకు భయపడి, ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేననే మానసిక ఒత్తిడితో స్వదేశానికి రాకుండా పదేళ్లుగా సౌదీలో తలదాచుకుంటున్న ఓ గల్ఫ్ కార్మికుడిని స్వదేశానికి రప్పించాలని శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రవాసి ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. వివరాలు.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన గూడూరి భూమేశ్వర్ ఏప్రిల్ 2014లో సౌదీ వెళ్లాడు. అప్పటి నుంచి ఫోన్ చేయకపోవడం లేదని, అసలు బతికి ఉన్నాడో లేదో తెలియని పరిస్థితిలో తానూ, తన ముగ్గురు కూతుళ్లు తీవ్ర మానసిక క్షోభ అనుభవించామని భార్య లత ఆవేదన వ్యక్తం చేశారు. సౌదీలో ఉన్న తమ గ్రామస్తులు, తెలిసినవారు ఇటీవల అతన్ని ముహాయిల్ అభా ప్రాంతంలో వెతికి జాడ తెలుసుకున్నారని, ఇండియాకు రావడానికి విముఖత చూపుతున్నాడని వాపోయింది. తన ముగ్గురు కూతుళ్లు మౌనిక, మానస, సహస్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని తన భర్తను సౌదీ నుంచి ఇండియాకు రప్పించాలని, తమ పిల్లల చదువుకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆమె వెంట ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి, టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ అడ్వయిజర్ బొజ్జ అమరేందర్‌రెడ్డి, తిప్పర్తి పుల్లయ్య చారి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment