అత్యవసర సేవలోనే ‘సంక్రాంతి’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వారికి సేవలోనే పండుగ.. ఆపదలో ఉన్నవారికి సత్వర వైద్య సేవలందించడమే ఆనందం.. అదే వారికి సంక్రాంతి.. అంతులేని ఆనందాన్నిచ్చే వేడుక. లోకమంతా సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకుంటుంటే.. 108 వైద్య సిబ్బంది మాత్రం ఆరోజు వైద్యపరంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా.. క్షణాల్లో అక్కడ వాలిపోయారు. ప్రథమ చికిత్స చేసి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్సులు నేటికీ నిర్విరామంగా సేవలందిస్తూనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నెల 14న పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో విధులు నిర్వహించిన సిబ్బంది పలువురి ప్రాణాలు కాపాడారు.
226 మంది ఈఎంటీలు, పైలెట్లు
సంక్రాంతి రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 179 మందికి అత్యవసర వైద్య సేవలందించారు. అందులో ట్రామా : 35 కేసులు, ప్రమాదాలు : 30, ప్రెగ్నెన్సీ కేసులు : 18, ఫీవర్ : 19, కడుపునొప్పి సంబంధిత : 25, గుండె సంబంధిత : 7, శ్వాస సంబంధిత 9, ఆత్మహత్యాయత్నాలు 5, ఇతర కేసులు 32 నమోదయ్యాయి. వీరిలో 12 మంది ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. వారి పరిస్థితిని బట్టి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 112 మంది ఎమర్జెన్సీ మెడికట్ టెక్నీషియన్లు(ఈఎంటీ), 114 మంది పైలెట్లు విధుల్లో ఉన్నారు.
పండుగ రోజూ విధుల్లో 108 సిబ్బంది
12 మంది ప్రాణాలు కాపాడిన వైనం
ఉమ్మడి జిల్లాలో 179 మందికి అత్యవసర వైద్యం
ప్రాణాలు కాపాడితే సంతృప్తి
మా సిబ్బంది పండుగలు, దినోత్సవాలకు ప్రాధాన్యం ఇవ్వరు. ఇంకా చెప్పాలంటే.. పండుగ రోజు మేం మరింత అప్రమత్తంగా ఉంటాం. ఆ రోజు ప్రైవేటు అంబులెన్సులు, వైద్యసేవలు తక్కువగా అందుబాటులో ఉంటాయి. అందుకే, రోజూవారీ కంటే ఆరోజు 24 గంటలపాటు సేవలందిస్తాం. 14వ తేదీన మొత్తం 179 మందికి వైద్య సేవలందించాం. పేషెంట్ల ప్రాణాలు కాపాడితే.. మాకు సంతృప్తి లభిస్తుంది. – సలీం, 108 ప్రోగ్రాం ఉమ్మడి జిల్లా మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment