ప్రమాద తీవ్రతకు అద్దం పట్టే దృశ్యం. ఒకవైపు పూర్తిగా దెబ్బతిన్న బస్సు
సాక్షి, బళ్లారి: విద్యార్థులంతా సరదాగా పాఠశాల వార్షికోత్సవంలో ఆడిపాడి స్కూలు బస్సులో ఇళ్లకు వస్తుండగా ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఆదివారం అర్ధరాత్రి బాగల్‌కోటె జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని జమఖండి తాలూకా అలగూరు సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో శ్వేత పాటిల్ (11), గోవింద సదాశివ జంబగి (11), బసవరాజ్ (15), సాగర్ గురులింగ కడకోళ (16) అనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది బాలలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఓవర్ టేక్ చేస్తూ..
వివరాలు.. అలగూరులోని వర్ధమాన మహావీర పాఠశాలలో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. 10వ తరగతి లోపు విద్యార్థులు ఆ వేడుకలో పాల్గొని స్కూలు మినీ బస్సులో కవటగిలోని తమ ఇళ్లకు బయల్దేరారు. అలగూరు సమీపంలో భారీ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ బస్ డ్రైవర్ ముందుకు వెళ్లాడు. ఇంతలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ను– బస్సు ఢీకొనింది. వేగం ఎక్కువగా ఉండడంతో రెండు వాహనాలు తుక్కు తుకై ్క బోల్తా పడ్డాయి. బస్సులోని విద్యార్థులు కకావికలమయ్యారు. ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు చనిపోయారు. మరో 8 మంది తీవ్రంగా, 12 మంది బాలలు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి జమఖండి పోలీసులు చేరుకుని క్షతగాత్రులను జమఖండి, విజయపుర ఆస్పత్రులకు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ కూడా గాయపడ్డాడు.
కలెక్టర్, ఎస్పీ పరామర్శ
ప్రతి రోజు మాదిరిగా ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బాధితుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో ఘటనాస్థలం బీభత్సంగా మారింది. ఈ ఘటనతో అలగూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం ఉదయం మంత్రి ఆర్‌బీ తిమ్మాపుర, జిల్లా కలెక్టర్ కేఎం జానకి, ఎస్పీ అమరనాథ్ రెడ్డి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. స్కూలు బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడమే కారణమని స్థానిక సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment