దొడ్డబళ్లాపురం: ప్రియునితో ఘర్షణ పడ్డ ప్రియురాలు అతడిపై కత్తితో దాడి చేసిన సంఘటన హాసన్ పట్టణంలోని బీఎం రోడ్డులో చోటుచేసుకుంది. దాడికి గురైన యువకుడిని ఏ.గుడుగనహళ్లికి చెందిన మనుకుమార్ (25). ఒకే గ్రామానికి చెందిన మనుకుమార్, భవాని ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవలే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి దూరంగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి కొత్త ఏడాది వేడుకలకు ఒక హోటల్‌కు వచ్చిన మనుకుమార్‌తో గొడవపడిన భవాని కత్తితో దాడి చేసింది. గాయపడ్డ బాధితున్ని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేఆర్ పురం పోలీసులు కేసు నమోదు చేశారు.
నదిలో దూకి ఇంజినీర్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: అందరూ కొత్త ఏడాది సంతోషంలో ఉండగా, అతడు మాత్రం జీవితంపై విరక్తి చెందాడు. హేమావతి నదిలో దూకి ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హాసన్ తాలూకా గురూరుశెట్టిహళ్లి వద్ద చోటుచేసుకుంది. ప్రమోద్ (35) మృతుడు. హాసన్ ఇందిరా నగరకు చెందిన ప్రమోద్ ప్రైవేటు కంపెనీలో ఇంజినీరు. గత నెల 29న మొబైల్‌ఫోన్‌ను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపు మొదలైంది. ఘటనాస్థలిలో హేమావతి నది వద్ద జూపిటర్ స్కూటర్ నిలిపి ఉంది. అందులో బ్యాంకు పాస్‌బుక్, ఇతర డాక్యుమెంట్లు ఉన్నాయి. అనుమానం వచ్చి పోలీసులు, ఫైర్ సిబ్బంది నదిలో శోధించగా ప్రమోద్ మృతదేహం లభించింది. ప్రమోద్‌కు భార్యతో గొడవలు ఉన్నాయని, దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది.
ఐఐఎం కేసులో స్టే జారీ
● డైరెక్టర్‌కు ఉపశమనం
శివాజీనగర: బెంగళూరు ఐఐఎం–బీలో ఓ ప్రొఫెసర్‌ను కులం పేరుతో కించపరిచారనే కేసులో సంస్థ డైరెక్టర్ రిషికేశ్ టీ.కృష్ణన్, మరో ఏడుమందిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది. తనను రిషికేశ్, మరికొందరు కులం పేరుతో చిన్నచూపు చూస్తున్నారని ఐఐఎంబీ మార్కెటింగ్ విభాగపు సహాయక ప్రొఫెసర్ గోపాల్ దాస్ డిసెంబరు 20న మైకో లేఔట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదులో పేర్లు ఉన్నవారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇది అన్యాయమని, కేసును కొట్టివేయాలని రిషికేశ్ సహా ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయమూర్తి హేమంత్ చందనగౌడర్ ప్రస్తుతానికి కేసును నిలిపివేయాలని మద్యంతర ఆదేశాలిచ్చారు. దీంతో రిషికేశ్ తదితరులకు ఉపశమనం దక్కింది.
ఫాంహౌస్ కేసులో
నటి హేమకు ఊరట
యశవంతపుర: బెంగళూరు హెబ్బగోడి జీఎం ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ కేసులో తెలుగు నటి అరెస్టు అయి విడుదల కావడం తెలిసిందే. ఆమె డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. మత్తు పదార్థాలను సేవించినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, ఆ కేసును కొట్టివేయాలని ఆమె హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసును ఎలా నమోదు చేస్తారని అన్నారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి హేమంత్ చందనగౌడర్ విచారించి, హేమపైనున్న కేసు విచారణను నిలిపివేయాలని స్టే జారీ చేశారు. దీంతో హేమకు ఊరట దక్కింది. ఫాంహౌస్ కేసులో పోలీసులు 1,086 పేజీల చార్జిషీట్‌ను గతంలోనే సమర్పించారు.
భారీగా మద్యం గుటక
బనశంకరి: న్యూ ఇయర్ నేపథ్యంలో బెంగళూరు సిటీలో మంగళవారం ఒక్కరోజే రూ.308 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. రూ.250 కోట్ల విలువచేసే మద్యం, రూ.57.75 కోట్ల విలువచేసే 2,92,339 బీరు బాటిళ్లను తాగేశారు. గత ఏడాదితో పోలిస్తే మద్యం వ్యాపారం ఎక్కువగా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment