ఎన్నికల కోలాహలం..
● జీపీ ఎన్నికలకు యంత్రాంగం ఏర్పాట్లు ● మూడు విడతల్లో నిర్వహించేలా ప్రణాళిక ● త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం ● పోరుకు సిద్ధమవుతున్న ఆశావహులు
ఖమ్మంవన్‌టౌన్: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందనే ప్రచారంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పండుగలు, పబ్బాలకు తాయిలాలు ఇస్తుండడమే కాక శుభ, అశుభ కార్యాల్లో స్థానికులతో మమేకమవుతున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు సంకేతాలు ఇస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోపక్క ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండేలా అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇప్పటికే జీపీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధమవగా పోలింగ్ కేంద్రాలను సైతం గుర్తించారు. జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 589 జీపీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించి ఆ మేరకు బ్యాలెట్ బాక్సులు సమకూర్చుకుంటూ ఇతర ఏర్పాట్లపై కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
సర్వం సన్నద్ధం
ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం కాగా, జిల్లాలో ఉన్న బ్యాలెట్ బాక్సులను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేయించారు. ఇలా 3,146 బ్యాలెట్ బాక్సులు సమకూరగా ఇంకా అవసరమైన వాటిని సమీపాన ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి సమకూర్చుకోనున్నారు. అలాగే, బ్యాలెట్ పత్రాలలో అభ్యర్థుల పేర్లు ఉండకుండా గుర్తులే ఉంటుండడంతో బ్యాలెట్ పత్రాల ముద్రణకు టెండర్లు సైతం ఆహ్వానించారు. జిల్లాలోని 589 పంచాయతీలు, 5,398 వార్డుల ఆధారంగా వార్డు సభ్యులు, సర్పంచ్ పదవులకు అవసరమైన బ్యాలెట్ పత్రాలను ముందుగానే ముద్రించాలని నిర్ణయించారు. ఇక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఉద్యోగులను గుర్తించి శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్ ట్రెయినర్లను సైతం ఎంపిక చేశారు. మొదటి దశలో 2,393, రెండో దశలో 2,343, మూడోశలో 2,090 మంది కలిపి మొత్తంగా ఎన్నికల విధుల్లో 6,826 మంది అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేలా సిద్ధమవుతున్నామని జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు.
సంక్రాంతికి సందడే...
పల్లెపోరుకు ఈసారి యువతీయువకులు ఆసక్తి చూపుతున్నారు. గత పదేళ్లుగా బీఆర్‌ఎస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి చెందిన వారే వార్డుసభ్యులు, సర్పంచ్‌లుగా గెలుపొందారు. ఇప్పుడు అధికార మార్పిడి జరగడంతో కాంగ్రెస్ నుండి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఉవ్విళ్లూరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను తరచూ కలిసి తమకే టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఇక సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో ముగ్గుల పోటీలు, ఇతర క్రీడాపోటీలు నిర్వహించి పెద్దమొత్తంలో నగదు బహుమతులు ఇవ్వడం ద్వారా తమ పోటీపై సంకేతాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా, ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తుండడంతో తమ విజయం సులభమవుతుందని కాంగ్రెస్ నుంచి పోటీకి దిగనున్న వారు నమ్ముతుండగా.. హామీల అమలులో వైఫల్యమైన కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి, తమ విజయానికి బాటలు వేస్తుందని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ఇలా రకరకాల సమీకరణలతో పల్లెపోరు మరింత రసవత్తరంగా మారే అవకాశముంది.
జిల్లాలో జీపీలు, వార్డుల వివరాలు
మొత్తం పంచాయతీలు 589
వార్డులు 5,398
పోలింగ్ కేంద్రాలు 5,438
మొత్తం ఓటర్లు 8,64,702
మహిళలు 4,46,527
పురుషులు 4,18,151
ఇతరులు 24
సిద్ధంగా ఉన్న బ్యాలెట్‌బాక్సులు 3,146
మొదటి దశ ఎన్నికలు జరిగే మండలాలు
మండలం జీపీలు వార్డులు కూసుమంచి 41 364
తిరుమలాయపాలెం 40 356
ఖమ్మం రూరల్ 31 312
నేలకొండపల్లి 32 300
ముదిగొండ 25 246
కామేపల్లి 24 218
మొత్తం 193 1,796
రెండో దశ
ఏన్కూరు 25 216
తల్లాడ 27 252
కల్లూరు 31 288
పెనుబల్లి 33 298
సత్తుపల్లి 21 208
వేంసూరు 26 244
సింగరేణి 41 356
మొత్తం 204 1,862
మూడో దశ
రఘునాథపాలెం 37 308
కొణిజర్ల 27 254
వైరా 22 200
ఎర్రుపాలెం 31 284
మధిర 27 236
బోనకల్ 22 210
చింతకాని 26 248
మొత్తం 192 1,740
Comments
Please login to add a commentAdd a comment