సెంట్రల్ టీమ్ పర్యటన వాయిదా!
కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 2,3 తేదీల్లో జరగాల్సిన సెంట్రల్ టీమ్ పర్యటన వాయిదా పడింది. 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పెద్దకడుబూరు, కౌతాళం మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించింది. ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ నామ్స్ ప్రకారం జిల్లా యంత్రాంగం నివేదిక పంపింది. ఎన్‌డీఆర్‌ఎప్ నామ్స్ ప్రకారం రెండు కరువు మండలాలకు కేంద్రం నుంచి రూ.13.64 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ పరిహారం విడుదల కావాలంటే ముందుగా సెంట్రల్ టీమ్ పర్యటించాల్సి ఉంది. ముందుగా ప్రకటించిన ప్రకారం సెంట్రల్ టీమ్ ఈ నెల 2,3 తేదీల్లో కరువు మండలాల్లో పర్యటించాల్సి ఉండగా వాయిదా పడినట్లు డిజాస్టర్ మేనేజ్‌మెంటు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనుపమ తెలిపారు. మళ్లీ ఎప్పుడు పర్యటించేది త్వరలోనే తెలుస్తుందన్నారు.
నేడు ఏకసభ్య కమిషన్ రాక
కర్నూలు(అర్బన్): షెడ్యూల్డు కులాల్లోని ఉప – వర్గీకరణపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం నియమించిన రిటైర్డు ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఈ నెల 2వ తేదీ గురువారం జిల్లాకు రానుందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కే తులసీదేవి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కమిషన్ మధ్యాహ్నం 2.30 గంటలకు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సమావేశం నిర్వహించి జిల్లా అధికారులు, వివిధ ఉప కులాల సభ్యులు, సంఘాలతో వినతి పత్రాలను స్వీకరిస్తుందన్నారు. స్వీకరించిన వినతి పత్రాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికల రూపంలో పంపుతుందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థల్లో ఎస్‌సీ ఉప వర్గాల ప్రాతినిధ్యానికి సంబంధించిన వినతులను పరిశీలించడం జరుగుతుందన్నారు. అలాగే ఎస్సీ కులాల్లోని వివిధ ఉప వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా పరంగా ఉన్న వెనుకబాటును పరిశీలిస్తుందన్నారు. కమి షన్‌కు వినతులు అందించే వారు కర్నూలు జిల్లాకు చెందిన వారై ఉండాలని, తమ వినతి పత్రాలపై రెండు అంశాలకు సంబంధించిన వాస్తవాలకు తగు ధ్రువీకరణ ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలని డీడీ కోరారు.
నేడు మద్దికెరలో గ్రామీణ మార్కెట్ ప్రారంభం
కర్నూలు(అగ్రికల్చర్)/మద్దికెర: గ్రామీణ మార్కెట్‌లను నెలకొల్పేందుకు నాబార్డు విశేషంగా కృషి చేస్తోంది. జిల్లాలో టమాట, పచ్చిమిర్చి ఇతర కూరగాయల క్రయవిక్రయాలకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేదు. దీనిని గుర్తించిన నాబార్డు గ్రామీణ మార్కెట్ నిర్మాణాలను చేపడుతోంది. గత మూడేళ్లలో డోన్ మండలం గోసానిపల్లి, ఆస్పరి మండలం బిల్లేకల్, దొర్నిపాడుల్లో నాబార్డు మార్కెట్లను నిర్మించింది. ఈ మార్కెట్లలో అన్ని రకాల కూరగాయల హోల్‌సేల్ వ్యాపారంతో పాటు రిటైల్ వ్యాపారం కూడా జరుగుతోంది. తాజాగా నాబార్డు నిధులతో మద్దికెరలో టమాట, మిర్చి, కూరగాయల క్రమ,విక్రయాలకు గ్రామీణ మార్కెట్‌ను నిర్మించారు. ఇందుకు నాబార్డు రూ.15 లక్షలు మంజూరు చేయగా, దాత కొత్తపేట వెంకటేశ్వరరెడ్డి రూ.3 లక్షలు, గ్రామ పంచాయతీ రూ.3 లక్షలతో మార్కెట్ సముదాయాన్ని నిర్మించారు. పనులు పూర్తి కావడంతో గురువారం ప్రారంభిస్తున్నట్లుగా నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి తెలిపారు.
టమాట కిలో గరిష్ట ధర రూ.18
పత్తికొండ(తుగ్గలి): పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం కిలో టమాట గరిష్టంగా రూ.18 పలికింది. మార్కెట్‌కు 158.40 క్వింటాళ్ల టమాట దిగుబడి రాగా కనిష్ట ధర రూ.10, సరాసరి రూ.15 చొప్పున అమ్మకాలు జరిగినట్లు మార్కెట్‌యార్డు కార్యదర్శి కార్నోలిస్ తెలిపారు.
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: ఇలకై లాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీశైలాని కి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూల ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఆలయంలో పలు ఆర్జిత సేవలు, మల్లన్న స్పర్శదర్శనం సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. క్యూలలో ఎటువంటి ఇబ్బందుల కలగకుండా దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment