సమగ్ర ‘శిక్ష’ ఇంకెన్నాళ్లు!
సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన సమ్మె 23 రోజులు దాటినా సర్కారులో చలనం కనిపించడం లేదు. ఫలితంగా కేజీబీవీల్లో విద్యాబోధన ఆగిపోగా.. పరీక్షల వేళ పట్టుదలగా చదవాల్సిన విద్యార్థులు గురువులు లేక ఆటపాటలతో గడుపుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులను కేజీబీవీలకు పంపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ విద్యార్థినులు వారిని ఆమోదించడం లేదు. మండల వనరుల కేంద్రాల్లో పనులు ఆగిపోయాయి. నిధులు వచ్చినా మధ్యాహ్న భోజన బిల్లులు చేసే వారు లేక వంట ఏజెన్సీ మహిళలు విలవిలలాడుతున్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసిన గత ప్రభుత్వం.. సమగ్ర శిక్షా ఉద్యోగులను పట్టించుకోలేదు.
పాపన్నపేట(మెదక్): విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు 2003లో ప్రభుత్వం రాజీవ్ విద్యా మి షన్‌ను ఏర్పాటు చేసింది. అనంతరం అది సమగ్ర శిక్షా అభియాన్‌గా, ఆ తర్వాత సమగ్ర శిక్షాగా మా రింది. ఇందులో పనిచేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిన అప్పట్లో ఉద్యోగులను నియమించారు. జిల్లాస్థాయి లో ఏపీఓలు, సిస్టం ఆనలిస్టులు, మండలస్థాయిలో సీఆర్పీలు, ఎంఐఎస్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెసెంజర్లు, పీటీఐలు, కేజీబీవీల్లో ఎస్‌ఓలు,సీఆర్టీలు, అకౌంటెంట్‌లు, హెడ్‌కుక్‌లు, వాచ్‌మెన్‌లు, ఏఎన్‌ఎంలు, పీజీ సీఆర్టీలు పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 580 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీరికి రూ. 7 వేల నుంచి రూ. 32 వేల వరకు జీతాలు చెల్లిస్తున్నారు.
ఆటపాటల్లో విద్యార్థులు
బడి మధ్యలో మానేసిన విద్యార్థినుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు సుమారు 22 ఏళ్ల క్రితం కస్తూర్బా బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 13 ఉన్నత పాఠశాలలు, 6 జూనియర్ కాలేజీలు ఉండగా 3,810 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇందులో విద్యాబోధన చేసే సీఆర్టీలు, ఎస్‌ఓలు తమ డిమాండ్ల సాధన కోసం 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో కేజీబీవీల్లో బోధన ఆగిపోయింది. మార్చిలో పది, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. 23 రోజులుగా చదువులు అటకెక్కడంతో విద్యార్థినులు ఆట పాటలతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో విద్యాశాఖ సమీప ప్రభుత్వ పాఠశాలల నుంచి టీచర్లను సర్దుబాటు చేస్తుండగా, తమ టీచర్లు తమకే కావాలని.. ఇతరులు వద్దంటూ విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారు. డీఈఓ ఇటీవల పాపన్నపేటకు వచ్చి విద్యార్థులను సముదాయించారు. అయినా మొక్కుబడి పాఠాలే కొనసాగుతున్నట్లు సమాచారం. కేజీబీవీల్లో పనిచేయాలంటే మహిళా టీచర్లే అవసరం. కానీ సమీప ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా టీచర్లు అన్ని సబ్జెక్టుల్లో అందుబాటులో లేక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎంఈఓ కార్యాలయాల్లో మధ్యాహ్న భోజన బిల్లులు, టీచర్ల ప్రొసిడింగులు, అప్పర్ ఐడీ కార్యక్రమం, గోదాం నుంచి బియ్యం తేవడం, బడి బయట పిల్లల సర్వే నమోదు, విద్యార్థుల ఫేసియల్ రికగ్నేషన్ నమోదు తదితర కార్యక్రమాలు నిలిచిపోయాయి.
రెగ్యులరైజ్ చేయాలి
ప్రభుత్వం స్పందించి జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. రూ. 10 లక్షల జీవిత బీమా, ఆరోగ్య బీమా వర్తింపచేయాలి. పదవీ విరమణ పొందుతున్న, పొందిన ఉద్యోగులకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 25 లక్షలు అందజేయాలి. ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజ్ కల్పించాలి. ఉద్యోగుల రీ ఎంగేజ్ విధానం పూర్తిగా రద్దు చేయాలి.
– రాజు, జిల్లా యూనియన్ అధ్యక్షుడు
23 రోజులుగా సాగుతున్న సమ్మె
పరీక్షల వేళ అటకెక్కిన చదువులు
ఆగమవుతున్న 3,810 మంది విద్యార్థులు
మండల వనరుల కేంద్రంలోఆగిన పనులు
Comments
Please login to add a commentAdd a comment