పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న అల్లు అర్జున్ వైపు బాలీవుడ్ పరిశ్రమ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ సినిమాల ఎంపిక విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే షారుక్ ఖాన్ 'జవాన్'లో అవకాశం వచ్చినా బన్నీ తిరస్కరించాడు. తాజాగా మరో భారీ బడ్జెట్ సినిమాను కూడా అల్లు అర్జున్ రిజక్ట్ చేశాడు.
'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్'
2019లో బాలీవుడ్ నుంచి వచ్చిన 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన ఆదిత్య ధర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమాతో ఆయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఆయన సినిమాలో నటించేందుకు చాలా మంది హీరోలే క్యూ కట్టే రేంజ్‌కు చేరుకున్నాడు. దీంతో ఆయన నుంచి వస్తున్న ‘అమర్ అశ్వథ్థామ’ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో నటించమని విక్కీ కౌశల్‌కు ఆదిత్య ధర్ మొదటగా అడిగారట కానీ కొన్ని కారణాల వల్ల అతను నిరాకరించడంతో, ఈ ప్రతిపాదన రణ్‌వీర్ సింగ్‌కి వెళ్లింది. కానీ అతను కూడా వెనక్కి తగ్గాడంతో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఈ సినిమా ఆఫర్ వచ్చింది.
'అమర్ అశ్వథ్థామ'కు నో చెప్పిన బన్నీ
ఈ ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చిన తర్వాత ఆయన ఆసక్తిగా ఉన్నా.. ఆ పాత్రలో నటించేందుకు బన్నీ సంకోచించాడట. అందుకోసం వారి ప్రతిపాదన గురించి ఆలోచించడానికి కొంత సమయం కూడా తీసుకున్నాడట. 'పుష్ప' సక్సెస్ తర్వాత 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉండటం ఒక కారణం అయితే.. ఈ సినిమాల్లో బన్నీ చేసిన క్యారెక్టర్ నుంచి ఒక్కసారిగా.. అశ్వథ్థామ అనే ఇతిహాసం కథలో తన పాత్రను తెరపై చూపించడం అంటే అది ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందోనని ఆయన ఆలోచించారట. ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ ఆధారంగానే ఎక్కువగా సీన్లను తెరకెక్కించనున్నారని, ఇది ఒకరకంగా తన సినీ కెరీర్‌లో పెద్ద ఛాలెంజ్ అవుతుందని ఆయన భావించారట.
(ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి ఫిక్స్ !)
ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ ఉన్న ఈ సినిమాలో నటించడం ఎందుకని చాలా ఆలోచించే 'అమర్ అశ్వథ్థామ' ప్రాజెక్ట్‌ను బన్నీ వదులుకున్నాడట. ఇదే విషయాన్ని ఆ సినిమా మేకర్స్‌కు అల్లు అర్జున్ తెలిపాడట. అట్లీ దర్శకత్వం వహించిన షారుక్ ఖాన్ 'జవాన్'లో బన్నీకి ఒక పాత్ర ఆఫర్ వచ్చింది. పాత్ర చిన్నదే అయినా చాలా ముఖ్యమైనది అయితే, 'పుష్ప 2' షూటింగ్ బిజీగా ఉన్నందున అట్లీ ఆఫర్‌ను బన్నీ తిరస్కరించాడు. పుష్ప 2 2024లో విడుదల కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా కూడా ఉంది. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment