వలసవాదులను ఎస్టీలుగా గుర్తించాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ
ములుగు: దశాబ్దాలుగా ఏజెన్సీలోకి వలస వచ్చి జీవనం కొనసాగిస్తున్న వలసవాదులను సైతం ఎస్టీలుగా గుర్తించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ అన్నారు. ఇటీవల 6,7వ తేదీలలో ఏటూరునాగారంలో నిర్వహించిన పార్టీ జిల్లా రెండో మహాసభలో 13రకాల ఏకగ్రీవ తీర్మానాలను పార్టీ ఆమోదించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రిటైర్ట్ ఉద్యోగుల సంఘం భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం జిల్లా ప్రజలకు గోదావరి నీటిని అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల హామీ మేరకు కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించాలన్నారు. జిల్లాలో పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. సన్నాలతో పాటు రైతులు పండించే అన్ని రకాల పంటలకు బోనస్ ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. దొడ్ల –మల్యాల బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. జిల్లాలో వివాదంలో ఉన్న భూములకు అటవీ–రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేపట్టి పరిష్కారం చూపాలన్నారు. గ్రామీణ ప్రాంతాల రోడ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న అటవీ అనుమతులు తీసుకొని గిరిజనులకు అండగా నిలబడాలన్నారు. ఏజెన్సీలో ప్రత్యేక బీఈడీ కళాశాలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలన్నారు. ఏటూరునాగారం, ములుగు ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయడంతో పాటు పలు తీర్మానాలను పార్టీ అమోదించడంతో పాటు నూతన జిల్లా కార్యవర్గం ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రత్నం రాజేందర్, ఎండీ దావూద్, కొప్పుల రఘుపతి, పొదిళ్ల చిట్టిబాబు, ఎండీ గఫూర్, సోమ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
సీపీఎం జిల్లా నూతన కార్యదర్శిగా భీరెడ్డి సాంబశివను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా తుమ్మల వెంకట్‌రెడ్డి, రత్నం రాజేందర్, పొదిళ్ల చిట్టిబాబు, కొప్పుల రఘుపతి, గ్యానం వాసు, ఎండీ దావూద్, జిల్లా కమిటీ సభ్యులుగా ఎండీ గఫూర్, తీగల ఆదిరెడ్డి, సోమ మల్లారెడ్డి, గొంది రాజేష్, చిరంజీవి, శ్రీను, రాములు, చిన్న, నరసింహాచారి, దేవయ్య, దామోదర్, కృష్ణబాబు, సౌమ్యలను ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment