వినతుల పరిష్కారానికి కృషి
ఏటూరునాగారం: గిరిజన దర్బార్‌లో పలు సమస్యలపై గిరిజనులు అందించిన వినతుల పరిష్కారానికి కృషి చేస్తానని పీఓ చిత్రామిశ్రా తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 18వినతులు రాగా పీఓ స్వీకరించారు. ఈ గిరిజన దర్బార్‌కు ఓ దివ్యాంగురాలు సమస్యను విన్నవించేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పీఓ హాల్ నుంచి ఆమె వద్దకు చేరుకున్నారు.విషయం తెలుసుకుని వినతిని స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చి ఆమెలో మనోధైర్యాన్ని నింపారు.
వినతుల వివరాలు ఇలా..
వాజేడు మండలం పూసూరు గ్రామానికి చెందిన నల్లెబోయిన శ్రావణి చిరుతపల్లి ఆశ్రమ పాఠశాలలో పీఈటీగా నియమించాలని వేడుకున్నారు. ఇదే మండలంలోని చెరుకురు గ్రామానికి చెందిన చింత సాంబయ్య గిరివికాసం కింద బోరు మంజూరు చేయాలని విన్నవించారు. వెంకటాపురం(కె) మండల కేంద్రానికి చెందిన గడ్డమీద సాంబయ్య తన వ్యవసాయ భూమికి బోరు మంజూరు చేయాలని కోరారు. మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన బొగ్గం సుశీలతో పాటు మరో 9మంది కలిసి ఎస్టీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన సున్నం సమ్మయ్యతో పాటు మరో 13మంది కలిసి రామచంద్రునిపేటలో ఎస్టీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని వేడుకున్నారు. ఇలా పలువురు తమతమ సమస్యలను విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేష్‌బాబు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ డీటీ కిశోర్, జేడీఎం కొండల్‌రావు, ఏఈ ప్రభాకర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం మేనేజర్ మహేందర్, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్, జియాలజిస్ట్ కిశోర్ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
కలెక్టరేట్‌లో 50వినతుల స్వీకరణ
ములుగు: ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో వారు వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రెవెన్యూ శాఖకు చెందినవి 13, గృహ నిర్మాణ శాఖ 7, పింఛన్లు 3, జిల్లా ఉపాధి కల్పన అధికారికి 3, ఇతర దరఖాస్తులు 24 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా వచ్చిన 50దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment