రోడ్డు భద్రతా ప్రమాణాలపై ర్యాలీ నిర్వహించాలి
ములుగు: రోడ్డు భద్రతా ప్రమాణాలపై జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ తర్వాత భారీ అవగాహన ర్యాలీ నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు నిర్వహించారు. జిల్లా తరఫున కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ర్యాలీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను భాగస్వాములు చేయాలన్నారు. రవాణా, పోలీస్, విద్యాశాఖ,, రోడ్డు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో నడుచుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.
సమ్మె విరమించిన
సీఆర్‌టీలు
ఏటూరునాగారం: మండల కేంద్రంలో సీఆర్‌టీలు చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు రెసిడేన్షియల్ టీచర్స్(సీఆర్‌టీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోదెం రవీందర్ తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు సమ్మెను విరమించినట్లు శనివారం లేఖను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 3న హైదరాబాద్‌లో మంత్రి సీతక్క, ట్రైబల్ కమిషనర్ శరత్ జరిపిన చర్చల్లో భాగంగా సానుకూలంగా హామీలు రావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు. తమ డిమాండ్‌లను పూర్తిగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూక్య రాములు, యాప సంపత్‌కుమార్, భూక్య శ్రీను, జిగట భాస్కర్, సృజన్, పాపారావు, వాణి, లక్ష్మి, పార్వతి, సరిత, సరళ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సునీతకు కృత్రిమ కాలు
వెంకటాపురం(కె): మండల పరిధిలోని వీఆర్‌కే పురం గ్రామానికి చెందిన డర్రా సునీతకు కొంతకాలం కిందట పామునూరు గుట్టల సమీపంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఎడమ కాలు పోగొట్టుకుంది. కాగా శనివారం సునీతకు భారతీయ వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్టు, వెంకటాపురం పోలీసుల సహకారంతో ఆమెకు కృత్రిమ కాలును అమర్చారు. ఈ మేరకు సునీతకు కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు ఆర్థిక సాయం అందించడంతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావ్ సునీతకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం మోహనరావు, నాయకులు మద్దుకూరి ప్రసాద్, రమేష్, డర్ర రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
రామప్ప సరస్సులోకి గోదావరి జలాలు
వెంకటాపురం(ఎం): దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా భీంఘన్‌పూర్ పంప్‌హౌస్ నుంచి ఒక మోటార్ ద్వారా రామప్ప సరస్సులోకి గోదావరి జలాలను మూడు రోజులుగా అందిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఐబీ డీఈ రవీందర్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. రామప్ప సరస్సులో నీటిని నిల్వ చేయకుండా రామప్ప నుంచి పాకాల సరస్సుకు పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు, అంతేకాకుంగా గణపురం చెరువుతో పాటు రామచంద్రాపురం పరిధిలోని సుమారు 6వేల ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నట్లు వెల్లడించారు. 35 అడుగుల నీటి సామర్థ్యం గల రామప్ప సరస్సులో ప్రస్తుతం 29.6 అడుగుల నీటిమట్టం ఉందని తెలిపారు. 30అడుగుల లోపే రామప్ప సరస్సులో దేవాదుల నీటిని నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు పంపింగ్ చేపడుతున్నామన్నారు. రెండు నెలల పాటు గోదావరి జలాల తరలింపు ప్రక్రియ చేపట్టునున్నట్లు వెల్లడించారు. రామప్ప సరస్సు కింద సుమారు 6వేల ఎకరాల యాసంగి సాగుకు నాలుగు రోజుల క్రితం నీటిని విడుదల చేసినట్లు డీఈ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment