No Headline
బనగానపల్లె: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల అక్రమాలు, కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చివరకు దేవుడి మాన్యం అయినా వదలడం లేదు. పలుకూరు గ్రామంలోని రామేశ్వరస్వామి (శివాలయం) ఆలయానికి సర్వే నంబరు 308లో 4 ఎకరాల మాన్యం ఉంది. ఇందులో కోట్లాది విలువ చేసే నాపరాయి(బ్లాక్‌స్టోన్) ఉంది. ఈ భూమిని ఇప్పటికే కొందరు మైనింగ్ యజమానులు ఆక్రమించుకుని నాపరాయి వెలికి తీసి రూ.లక్షల్లో సొమ్ము చేసుకోగా ఇటీవల కూటమి ప్రభుత్వానికి చెందిన ఓ సానుభూతిపరుడు శివాలయానికి సంబంధించిన మాన్యం భూమిలో అక్రమ మైనింగ్‌కి పాల్పడుతూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడు.
20 రోజుల నుంచి యథేచ్ఛగా నాపరాయి వెలికి తీసి జేబు నింపుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన ఆలయ అర్చకులు భాస్కరయ్య ఈ భూమి ఆలయానికి సంబంధించినదని వాదించినా, ఆక్రమణదారుడు ఏ మాత్రం పట్టించుకోకుండా భూమి తనదేనంటూ మైనింగ్‌కు పాల్పడుతున్నాడు. మాన్యం భూమిని రీ సర్వే చేసి రక్షించాలని ఆలయ అర్చకులు గ్రామ సచివాలయంతో పాటు దేవదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ స్పందించిన దాఖలాలు లేవు. ఈక్రమంలో గ్రామానికి చెందిన కొందరు శివమాలధారులు, ప్రజలు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న కూటమి సభ్యుడిపై వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక తాత్కాలికంగా మైనింగ్‌ను ఆపివేశాడు. రెవెన్యూ, దేవదాయశాఖ అధికారులు స్పందించి దేవుడి మాన్యాన్ని సర్వే చేయించి హద్దులు వేయించాలని గ్రామస్తులు, శివస్వాములు కోరుతున్నారు.
దేవుడి మాన్యాన్ని కాపాడాలి
గ్రామంలో రామేశ్వరస్వామికి సంబంధించిన నాలుగు ఎకరాల విలువైన భూమి ఉంది. ఆ భూమిలో కొందరు అక్రమంగా మైనింగ్ చేస్తుంటే గ్రామ పెద్దల సహకారంతో ప్రస్తుతానికి నిలిపి వేయించాం. రెవెన్యూ అధికారులు, దేవదాయశాఖ అధికారులు వెంటనే సర్వే చేయించి దేవుడి మాన్యాన్ని కాపాడాలి. – భాస్కరయ్య, ఆలయ అర్చకులు
Comments
Please login to add a commentAdd a comment