సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఢిల్లీ తదుపరి సీఎం ఎవరు అనేది సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
ఈ తరుణంలో లిక్కర్ కేసులో అరెస్టైనా.. సీఎంగా కేజ్రీవాలే కొనసాగుతారని, ఆయన ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన కొనసాగిస్తారని ఢిల్లీ మంత్రి, ఆప్‌నేత అతిషీ అన్నారు. అయితే, అతిషీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు వరుస కౌంటర్లు ఇస్తున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారి ‘గ్యాంగ్స్ రన్స్ ఫ్రమ్ జైల్, నాట్ గవర్నమెంట్’ అంటూ ఎద్దేవా చేశారు.
కేజ్రీవాల్ అరెస్ట్‌తో స్వీట్లు పంచారు
‘జైళ్ల నుంచి ముఠాలే నడుస్తాయి..ప్రభుత్వాలు కావు’ అంటూ మనోజ్ తివారి ఏఎన్‌ఐతో మాట్లాడారు. కేజ్రీవాల్ ఢిల్లీని దోచుకున్నారని, ఆయన అరెస్ట్ గురించి ఎవరూ చర్చించకపోవడంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. అందుకే, అరెస్ట్ తర్వాత స్వీట్లు పంచున్నారని తెలిపారు.
ఏ పని చేయకపోగా దోచుకున్నారు
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏ పనీ చేయలేదు. పైగా దోచుకున్నారు. జేబులు నింపుకున్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతామని పదే పదే చెబుతున్న వారు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. జైళ్ల నుంచి ప్రభుత్వాలు నడవవు. ముఠాలు నడుస్తాయని మేం చూశాము’ అని ఏఎన్‌ఐకి చెప్పారు. ఆప్ నిరసనలు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌లు మీడియాలో మాత్రమే కవర్ చేస్తున్నారని, ప్రజలు వాటి గురించి కూడా చర్చించడం లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment