బీఆర్‌ఎస్‌ను ప్రజలు మర్చిపోయారు
నిజామాబాద్ సిటీ: బీఆర్‌ఎస్‌ను ప్రజలు మర్చిపోయారని, ఆ పార్టీ నాయకులు రాజకీయ ఉనికి కోస మే అనవసర వాఖ్యలు చేస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల గడీల పాలనకు ప్రజలు చరమగీతం పాడి కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 13 నెలలుగా ప్రజాపాలన అందిస్తూ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పులు చేస్తే, తమ ప్రభుత్వం ప్రతి నెలా రూ.22 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. అయినప్పటికీ ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని, ఏకకాలంలో రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేశామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చామన్నారు. సాగుచేసే భూములకే ‘ఇందిరమ్మ రైతు భరోసా’ ఇస్తామ ని స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు. ఈ నెల 26 తర్వాత కొత్త రేషన్‌కార్డులు జారీచేస్తామని, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
భారతీయ జూటాపార్టీ
బీజేపీ పక్కా జూటా పార్టీగా మారిందన్నారు. కేవలం మాటాలకే పరిమితమైందని విమర్శించారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురావడం లేదన్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి వంటివారు కాంగ్రెస్‌ను విమర్శించడం సరికాదన్నారు. మతం పేరుతో ఓట్లు దండుకోవడమే బీజేపీ అజెండా అని విమర్శించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, రూరల్ అధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు అగ్గు భోజన్న, క్యాతం హన్మాండ్లు, పొలసాని శ్రీనివాస్, కౌలాస్ మోహన్, కెతావత్ ప్రకాశ్‌నాయక్, బోర్గాం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి
ఉనికి కోసమే అనవసర వ్యాఖ్యలు
పసుపు బోర్డు ఎక్కడుందో ఎంపీ
అర్వింద్ చెప్పాలి
26 తరువాత కొత్త రేషన్‌కార్డులు ఇస్తాం
విలేకరుల సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని తాను డిమాండ్ చేస్తున్నానని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితకు హఠాత్తుగా బీసీ రిజర్వేషన్లు గుర్తుకువచ్చాయని, పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ప్రశ్నించారు. తాము బీసీ రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలుచేసి తీరుతామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీస్తున్నామని, ఆ కేసుల్లో కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. నిజామాబాద్‌లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన మాట ఏమైందో ఎంపీ అర్వింద్ చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment