ఆనందోత్సాహాలతో సీతకొండ జాతర
పర్లాకిమిడిః: గుసాని సమితి సరియాపల్లి పంచాయతీ పరిధిలోని సీతకొండపై బుధవారం కనుమ సందర్భంగా జాతర నిర్వహించారు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. త్రేతాయుగంలో సీతారాముల వనవాసంలో భాగంగా ఈ కొండపైనే స్నానమాచరించినట్టు స్థలపురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కొండను సీతకొండగా పిలుస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే జరిగే ఈ వేడుక కోసం కిలోమీటరున్నర నడిచి కొండపైకి చేరుకోవాలి. అక్కడ ఇటీవల ఆంజనేయ స్వామి మందిరం కూడా విశ్వహిందూపరిషత్ నాయకులు నిర్మించారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లకు చెందిన పాత మిత్రులు ఈ కొండపైకి వచ్చి కలుసుకుంటారు. ఇక్కడ స్నేహం ఏర్పడితే మరుజన్మలోనూ కొనసాగుతుందని నమ్మకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా మందస నుంచి గోప్పిలి మీదుగా ఈ కొండపైకి అధిక సంఖ్యలో జనం తరలివస్తారు.
సౌకర్యాల కల్పన..
సీతకొండ జాతరకు వచ్చే భక్తుల కోసం ఒడిశా అధికారులు తాగునీరు, విద్యుత్, బస్సు సౌకర్యాలను కల్పించారు. గ్రామీణ అమొ బస్సులతో పాటు ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలు పర్లాకిమిడి, మందస, గొప్పిలి, పలాస మీదుగా బస్సులు నడుపుతున్నారు. మోహనా, రాయఘడ బ్లాక్ నుంచి విచ్చేసే భక్తులకు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు సహాయ సహకారాలు అందించినట్టు వీహెచ్‌పీ నాయకులు కై లాష్ గౌడో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment