వైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక గోపూజలు
రాయగడ: స్థానిక కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో పవిత్ర సంక్రాంతి పర్వదినాల్లో భాగంగా కనుమ రోజైన బుధవారం నాడు సంఘం కార్యాలయం ప్రాంగణంలో సామూహిక గోపూజ కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్షులు కింతలి అమర్‌నాథ్ ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో అధికసంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. ప్రముఖ అర్చకులు గణపతి శాస్త్రి మంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోవులకు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం వాటికి బెల్లం, పచ్చగడ్డి, కూరగాయలను ఆహారంగా తినిపించారు. అలాగే కొత్త వస్త్రాలను గోవులపై వేసి పూజించారు. సంక్రాంతి పండుగ మూడో రోజున కనుమకు ప్రత్యేకత ఉందని.. సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం, ధర్మానికి ప్రతిరూపమైన వృషభం అనుగ్రహాలను భక్తులు పొందాలన్న ఉద్దేశంతో గోపూజలను నిర్వహించామని ఈ సందర్భంగా అమర్‌నాథ్ వివరించారు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారం తినిపించడం, నమస్కరించడం, గోవుతోకకు ప్రణమిల్లి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని అన్నారు. కార్యక్రమంలో స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు గుడ్ల గౌరి ప్రసాద్, అప్పల రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment