పీఎంఏవై ప్రచార రథం ప్రారంభం
రాయగడ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రచార రథం ప్రారంభమైంది. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ్ కుమార్ ఖెముండొ శుక్రవారం సదరు సమితి కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రథాన్ని ప్రారంభించారు. అందరికీ పక్కా ఇళ్ల కేటాయింపు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సర్వేకు సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ రథం తోడ్పడుతుందన్నారు. అర్హులైన వారి పేర్లను నమోదు చేసే ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సమితి చైర్మన్ టున్ని హుయిక, ఏబీడీవో కాలూచరణ్ నాయక్, నీలమణి పండ తదితరులు పాల్గొన్నారు.
28న బీజేడీ పార్లమెంటరీ సభ్య సమావేశం
భువనేశ్వర్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాశాలు పురస్కరించుకుని బిజూ జనతా దళ్ పార్లమెంటరీ సభ్య సమావేశం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అధ్యక్షతన ఈ నెల 28న ఈ సమావేశం జరగనుందని బీజేడీ పార్లమెంటు సభ్యుడు మానస్ మంగరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బీజేడీ వైఖరిపై చర్చిస్తారు. ఈ నేపథ్యంలో 7 మంది రాజ్యసభ సభ్యుల్ని ఉద్దేశించి నవీన్ పట్నాయక్ ప్రసంగిస్తారు.
218 కిలోల గంజాయి పట్టివేత
● ఒకరి అరెస్టు ● వ్యాన్ సీజ్
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహానా నియోజికవర్గం అడవ పీఎస్ పరిధిలో అంతరాబ వద్ద పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు అటుగా వెళుతున్న మ్యాక్స్ పికప్ వ్యానును తనిఖీ చేశారు. వ్యాన్‌లో తొమ్మిది బ్యాగుల్లో గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. అందులో ఉన్న గంజాయి మాఫియా అభయ కోరాడాను అదుపులోకి తీసుకున్నారు. మోహానా తహసీల్దార్ సమక్షంలో గంజాయి బస్తాలను తూకం వేయగా సుమారు 218 కిలోలు ఉన్నట్టు నిర్ధారించారు. గంజాయి బస్తాలు ఆర్.ఉదయగిరి బ్లాక్ అంతరాబ నుంచి బరంపురం తరలిస్తుండగా పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద అడవ పోలీసుస్టేషన్‌లో నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు అడవ ఐఐసీ శుభ్రాంత్‌కుమార్ పండా తెలియజేశారు. దాడిలో ఎస్సై ప్రశాంత్ పలక, అడవ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
జయపురం: ఎలుగుబంటి దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి డొమునాయికగుడ గ్రామానికి చెందిన కమళ లోచన చంద్రపొడియ(55)గా తెలిసింది. బొయిపరిగుడ సమితి కెందుగుడ గ్రామ పంచాయతీ డొంబునాయికగుడ గ్రామానికి చెందిన కమళ లోచన చంద్ర పొడియకు భార్య వంట చేసేందుకు కట్టెలు తేవాలని కోరింది. దీంతో ఉదయం తొమ్మిది గంటల సమయంలో గ్రామ సమీపంలోని బాతడొంగర పర్వతంపైకి కట్టెలు సేకరించేందుకు కమళ లోచన చంద్ర పొడియ వెళ్లాడు. ఎండు కర్రలు సేకరిస్తున్న సమయంలో హఠాత్తుగా తుప్పల్లో నుంచి ఎలుగుబంటి వచ్చి అతనిపై దాడి జేసింది. దీంతో భయంతో అతను రక్షించాలని కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు విని అక్కడకు చేరుకొని గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి సమీపంలో ని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. ఎలుగు దాడిలో గాయపడిన కమళలోచనను ద్విచక్ర వాహనంపై బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్పించారు. కమళలోచనకు కాలు, చేతులు, గుండైపె బలమైన గాయాలు అయినట్లు సమాచారం. ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉండటంతో జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment