రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం బీజేడీ అభ్యర్థన
భువనేశ్వర్: 16వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని విపక్ష బిజూ జనతా దళ్ అభ్యర్థించింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించిందని విపక్ష నేత నవీన్ పట్నాయక్ తెలిపారు. ప్రతిపక్ష హోదాలో రాష్ట్రం, రాష్ట్ర ప్రజల పట్ల బీజేడీ నిబద్ధత ఎప్పటికీ తగ్గేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా పరిధిని ప్రస్తుత స్థాయి 42 శాతం నుండి 50 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. రాష్ట్ర పాలన పనితీరు ఆధారంగా అనుబంధ కార్యక్రమాలకు సముచిత ప్రోత్సాహకాలతో ప్రోత్సహించడం అనివార్యంగా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల స్థితిగతుల దృష్ట్యా రాష్ట్రం ఎదుర్కొనే ప్రమాదం ఉన్నందున 15వ ఆర్థిక సంఘం సిఫార్సులలో 10 శాతం ప్రాధాన్యతని 20 శాతానికి పెంచాలని, విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల, రోడ్లు, వంతెనలు, ఆనకట్టలు, రిజర్వాయర్లు మొదలైన వాటిలో విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఈ పెంపు ఉపకరిస్తుందని బీజేడీ వివరించింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న విపత్తు నిర్వహణ నిధి వాటా 90:10 బదులుగా 100 శాతం కేంద్ర ప్రభుత్వం భరించాలని బీజేడీ ప్రతిపాదించింది.
కేరళ దంపతులకు చిన్నారి దత్తత
పర్లాకిమిడి: స్థానిక కలెక్టర్ చాంబర్‌లో గురువారం కేరళకు చెందిన దంపతులకు చిన్నారిని జిల్లా పాలనాధికారి బిజయ కుమార్ దాస్, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి ఆధ్వర్యంలో అధికారికంగా అప్పగించారు. మూడేళ్ల క్రితం సంతానం లేని కేరళ రాష్ట్రానికి చెందిన దంపతులు కేంద్ర సంతాన దత్తత రిసోర్స్ కేంద్రం (ఢిల్లీ) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు మాసాల చిన్నారికి వైద్య పరీక్షలు చేసిన అనంతరం కేరళ దంపతులు దత్తత తీసుకోవడానికి అంగీకరించారు. ఇప్పటివరకు జిల్లా నిశాన్ సలోన్ శిశు దత్తత కేంద్రం నుంచి 67 మంది శిశువులను వివిధ రాష్ట్రాల వారికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంరక్షణ సమితి అధ్యక్షులు అశ్వినీకుమార్ మహాపాత్రో, జిల్లా శిశు సంరక్షణ అధ్యక్షుడు అరుణ్ కుమార్ త్రిపాఠి, చైల్డ్ వెల్ఫేర్ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment