రాహుల్, వాద్రాలకు కోట్లు దోచి పెట్టేందుకు రేవంత్ కుట్ర: కేటీఆర్
ఏడు గ్యారంటీల మోసాన్నిహరియాణాలో తిప్పికొట్టారు
బెదిరించి మా చెల్లెలిని జైల్లోపెట్టినా మేం మోదీకి తలవంచలేదు
సెక్యులర్ విధానాలతోనే భవిష్యత్తు రాజకీయాలు చేస్తామని వ్యాఖ్య
బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకుడు అలావుద్దీన్ పటేల్
సాక్షి, హైదరాబాద్: ‘‘సంక్షేమ పథకాల్లో ప్రజల నుంచి కమీషన్లు రావనే ఉద్దేశంతోనే వాటి అమలును పక్కనపెట్టి మూసీ ప్రాజెక్టు పేరిట రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారు. మూసీ ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని రూ.లక్ష కోట్లు మింగొచ్చని.. రాహుల్‌గాం«దీ, వాళ్ల బావ వాద్రాకు కోట్ల రూపాయలు దోచిపెట్టొచ్చని రేవంత్ భావిస్తున్నారు..’’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతి విధానాలను ప్రజలు గల్లా పట్టి అడిగేంత వరకు ఈ మోసం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అలావుద్దీన్ పటేల్ తన అనుచరులతో కలసి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను పక్కనపెట్టి.. సమస్యలు వస్తే కలెక్టర్ల వద్దకు వెళ్లాలని సీఎం అంటున్నారు. కానీ మనం తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలను నిలదీయాలి. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ తరహాలో గ్యారంటీల పేరిట మోసం చేయాలని చూసిన కాంగ్రెస్‌కు హరియాణా ఓటర్లు సరైన బుద్ధిచెప్పారు.
తలవంచకుండా పోరాడాం: ప్రధాని మోదీ మమ్మల్ని బెదిరించాలని చూసి, మా చెల్లెలిని జైల్లో పెట్టారు. అయినా తలవంచకుండా మోదీతో పోరాటం చేశాం. అదే పోరాట స్ఫూర్తితో సెక్యులర్ విధానాలను కొనసాగిస్తూ మనిíÙని మనిషిగా చూసే రాజకీయాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. పేదలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుంది.
అరచేతిలో వైకుంఠంతో అధికారంలోకి..
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిoది. ఈ పది నెలల్లోనే అన్నివర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. కేసీఆర్ అధికారంలో లేరనే బాధ రాష్ట్రంలో ప్రతీ పౌరుడిలోనూ కనిపిస్తోంది. పేదల కోసం పాటుపడిన కేసీఆర్, బీఆర్‌ఎస్ ఉన్నంత వరకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ అధికారంలో లేకపోవడంతో పండుగ కళ తప్పింది. బుల్డోజర్ రాజ్‌తో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
వరంగల్‌లో తహసీల్దార్‌పై జరిగిన దాడి ఘటన రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోంది. రూ.2 లక్షలు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ.2,500,వృద్ధాప్య పెన్షన్ రూ.4వేలు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం వంటి హామీలు అటకెక్కాయి. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అక్రమంగా భూములు లాక్కుంటున్నారు.
దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ పాదయాత్ర చేస్తున్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయడం సరికాదు. సీఎం రేవంత్ గత ప్రభుత్వమిచ్చిన ఉద్యోగాలను సిగ్గులేకుండా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారు. తప్పుడు లెక్కలతో నిరుద్యోగులను తప్పుదోవ పట్టించడం దుర్మార్గం..’’అని కేటీఆర్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment