ఆ సొమ్ముతో ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపాటు
వాషిం/థానే: విపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఆ పార్టీని అర్బన్ నక్సలైట్ల ముఠా నడిపిస్తోందని ఆరోపించారు. ప్రమాదకరమైన కాంగ్రెస్ ఎజెండాను ఓడించడానికి ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. పేదలను లూటీ చేయడం, స్వార్థ రాజకీయాల కోసం వారి సంక్షేమాన్ని పక్కనపెట్టడం కాంగ్రెస్‌కు అలవాటేనని మండిపడ్డారు. పేదలను ఎప్పటికీ పేదలుగా ఎలా ఉంచాలో ఆ పార్టీకి బాగా తెలుసని అన్నారు. ప్రజలంతా ఒక్కటైతే దేశాన్ని ముక్కలు చేయాలన్న ఎజెండా ముందుకు సాగదని కాంగ్రెస్ భయపడుతోందని చెప్పారు. అధికారం కోసం దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ప్రధాని మోదీ శనివారం మహారాష్ట్రలో పర్యటించారు. వాషిం జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత సొమ్ము విడుదల చేశారు. 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు రూ.20,000 కోట్లు బదిలీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మన దేశాన్ని ద్వేషించేవారితో కాంగ్రెస్ సన్నిహితంగా మెలుగుతోందని ధ్వజమెత్తారు. ఇటీవల ఢిల్లీలో రూ.వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పోలీసులు స్వా«దీనం చేసుకున్నారని, వీటిని వెనుక కాంగ్రెస్ నాయకుడొకరు కీలకంగా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. యువతకు డ్రగ్స్ అలవాటు చేసి, ఆ డబ్బుతో ఎన్నికల్లో నెగ్గాలన్నదే కాంగ్రెస్ కుట్ర అని దుయ్యబట్టారు.
బంజారాలపై కాంగ్రెస్‌కు చిన్నచూపు
కాంగ్రెస్ పార్టీది మొదటినుంచీ విదేశీ ఆలోచన ధోరణేనని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. బ్రిటిష్ పాలన తరహాలో కాంగ్రెస్ కుటుంబం దేశంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలను ఏనాడూ సమానంగా చూడలేదన్నారు. కేవలం ఒక్క కుటుంబమే దేశాన్ని పరిపాలించాలన్నది కాంగ్రెస్ ఉద్దేశమని విమర్శించారు. బ్రిటిష్ పాలనలో బంజారా వర్గం ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని, దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పాలనలోనూ పరిస్థితి ఏమాత్రం మారలేదన్నారు. బంజారాలంటే కాంగ్రెస్‌కు ఎప్పటికీ చిన్నచూపేనని విమర్శించారు. పంట రుణాలు రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ ఇస్తున్న హామీలు నమ్మి మోసపోవద్దని మహారాష్ట్ర రైతులను కోరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో పంట రుణాల మాఫీ కోసం ప్రజలు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment