మల్లాపూర్ వీఎన్‌ఆర్ గార్డెన్‌లో జరిగిన సభలో మాట్లాడుతున్న కేటీఆర్
మల్లాపూర్/గౌతంనగర్(హైదరాబాద్): కాంగ్రెస్ మాటల ప్రభుత్వమని.. ఆ పార్టీ చేసిన 420 హమీ లకు ప్రజలు మోసపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం మల్లాపూర్ వీఎన్‌ఆర్ గార్డెన్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజయోత్సవ సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హజరై మాట్లాడారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని 100 రోజు ల్లో బొంద పెట్టడం ఖాయమని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడొచ్చు..కానీ అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడే అనాగరిక వ్యాఖ్యలు సరికాదన్నారు.
కరెంట్ బిల్లు సీఎం కడతాడా...సోనియాగాంధీ కడుతుందా చె ప్పాలన్నారు. చీకటిలో ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని, కాంగ్రెస్ పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పపాలన తెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీల అమలుకు 1. 57 కోట్ల మంది ఆడబిడ్డలు, 70 లక్షల మంది రైతులు రూ.15 వేల కోసం మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఖాతాలో ఎప్పుడు వేస్తారని, రెండు లక్షల రుణమాఫీ కోసం రైతులు, 46 లక్షల మంది పెన్షన్ కోసం ఇలా అందరూ ఎదురు చూస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.
అనంతరం నెహ్రూనగర్‌కు చెందిన దివ్యాంగుడు అంజికి స్కూటీ, బీఆర్‌ఎస్ కార్యకర్త కుమార్తెకు మెడికల్ సీటుకు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్ రావు శ్రీధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు భద్రారెడ్డి, తాడూరి శ్రీనివాస్, రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, శాంతి సాయిజెన్‌శేఖర్, బొంతు శ్రీదేవి, బన్నాల గీతాప్రవీణ్, ప్రభుదాస్, సింగిరెడ్డి శిరీషారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సేవాసమితి ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.
ఆరు గ్యారంటీలు ఇచ్చి...అయోమయంలో పడ్డారు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చలేక అయోమయంలో పడిందని కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలోని లక్ష్మీసాయి గార్డెన్స్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేయకుంటే సీఎం రేవంత్‌రెడ్డిపై గళమెత్తుదామన్నారు. మల్కాజిగిరి ప్రజలను ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసినా, వేధింపులకు పాల్పడినా రాష్ట్రవ్యాప్తంగా అందరం వచ్చి మల్కాజిగిరిలో దిగుతామన్నారు. మల్కాజిగిరి ప్రజలు దైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసి చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు మేకల సునీత రాముయాదవ్, శాంతి శ్రీనివాస్‌రెడ్డి, మీనా ఉపేందర్‌రెడ్డి, సబితకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment