సాక్షి, తాడేపల్లి: చిలకలూరిపేటలో మూడు పార్టీల సభ వెలవెలబోయిందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. నన్న క్షమించు మోదీ.. సీఎం జగన్ నుంచి నన్ను కాపాడు మోదీ అని చంద్రబాబు వేడుకున్నారని సెటైర్లు వేశారు. ఐదేళ్ల కిందట చంద్రబాబు ఎందుకు తిట్టారు.. ఇప్పుడు మోదీ ఎందుకు కావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మోదీ ఉగ్రవాదిలాంటి వారు అన్న చంద్రబాబు.. ఐదేళ్లు తిరిగే సరికి విశ్వగురులా కనిపించారని ఎద్దేవా చేశారు.
కాకినాడలో పాచిపోయిన లడ్డూలు చిలకలూరిపేటలో ఎలా తాజాగా మారాయని పేర్ని నాని దుయ్యబట్టారు. చంద్రబాబులో ఈ మార్పుకు కారణం ఏంటి? బాబు భజన మాములుగా లేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మాట్లాడుతుంటే మైక్ మూగపోయిందని, సభ జరుపుకోవడం చాతకాని వాళ్లు.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించారు. మీ పొత్తులు ఒప్పందాలు రాష్ట్రానికి అవసరం లేదని తేల్చి చెప్పారు. మళ్లీ జగన్‌కే ఎందుకు ఓటు వేయాలని సిద్ధం సభల్లో చెప్పామన్న మాజీ మంత్రి.. రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటేయ్యాలో చెప్పలేదని అన్నారు. తమకు ఓటు వేస్తే ఏం చేస్తారో చిలకలూరి పేట సభలో నేతలు చెప్పలేదని తెలిపారు.
చదవండి: చిలకలూరిపేటలో ప్రజలకు చేరని గళం
‘ఐదేళ్ల క్రితం చంద్రబాబురాబు అవినీతి పరుడని గుంటూరు సభలో చెప్పలేదా? అమరావతి ఒక రియల్ ఎస్టేట్ స్కాం అని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పలేదా?. అమరావతి స్కామ్‌పై దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో ఎందుకు చెప్పలేదు. మోదీ చారెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చారని చంద్రబాబు తిట్టలేదా? పగలు మోదీతో.. రాత్రి కాంగ్రెస్‌తో చేతులు కలిపే వ్యక్తి చంద్రబాబు. పోలవరం ఏటీఎమ్‌లా వాడుకున్నారని మీరు అన్నారు కదా?. చంద్రబాబు ఎలా పునీతుడు అయ్యాడో.
ఆ ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారో లేదో చెప్పలేదు. పవన్ ఒక్క డిమాండ్ అయినా మోదీ ముందు పెట్టారా?. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని సభలో ఎందుకు చెప్పలేదు. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ ఒకటే అంటే ఎవరైనా నమ్ముతారా?. బీజేపీ టీడీపీ కార్యకర్తలు కూడా నమ్మరు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీ.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తిని పక్కన పెట్టుకొని ఆయనను గౌరవిస్తామంటే ఎలా నమ్ముతారు. పీకి న్యాయం చేస్తామన్న మోదీ.. ప్రత్యేకంగా ఏం చేశారో చెప్పాలి. 2014 నుంచి 18 వరకు డబుల్ సర్కార్ ఏం చేసింది. ఈ రాష్ట్రానికి జరిగిన న్యాయం ఏంటి’. అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment