ఢిల్లీ: భారత్ జోడో న్యాయ్ యాత్రకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మిలింద్ దేవరా రాజీనామా చేశారు. గత 55 ఏళ్లుగా పార్టీతో ఉన్న సంబంధాన్ని ముగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాహుల్ రాజకీయం ప్రారంభించిన నాటి నుంచి ఒక్క మిలింద్ దేవరానే కాకుండా చాలా మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. 2019 నుంచి కాంగ్రెస్ పార్టీని వీడిన 11 మంది కీలక నేతలు.
మిలింద్ దేవరా
కేంద్ర మాజీ మాజీ మంత్రి మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆదివారం రాజీనామా చేశారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు చేరిపోనున్నారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముంబయి సౌత్ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్‌గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కపిల్ సిబల్
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి 2022 మే 16న రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అప్పట్లో ఈ ప్రకటన చేశారు. తన నిర్ణయం అకస్మాత్తుగా తీసుకోలేదని పేర్కొంటూ ఏ పార్టీలో చేరబోనని అప్పట్లో చెప్పారు.
గులాం నబీ ఆజాద్
కాంగ్రెస్ కురువృద్ధుడు గులాం నబీ ఆజాద్ రూపంలో 2022లో పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరైన ఈయన.. ఐక్య జమ్ము కశ్మీర్‌కు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. రాహుల్ గాంధీని పరిక్వతలేని వ్యక్తిగా విమర్శించి పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు తన ప్రాంతీయ పార్టీని జమ్ము కశ్మీర్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని ప్రారంభించారు.
హార్దిక్ పటేల్..
గుజరాత్ పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ రాజీనామా లేఖతో మే 2022లో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. 2019లో కాంగ్రెస్‌లో చేరిన ఈయన రాహుల్ గాంధీని విమర్శిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. పార్టీ అగ్రనేతలు మొబైల్ ఫోన్‌ల లోనే నిమగ్నమవుతారని పేర్కొంటూ.. గుజరాత్ కాంగ్రెస్ నేతలు అగ్రనాయకులకు చికెన్ శాండ్‌విచ్‌లు అందించడంలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నారని దుయ్యబట్టారు. రాజీనామా చేసిన నెల రోజుల తర్వాత బీజేపీలో చేరారు.
అశ్వినీ కుమార్..
కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ పంజాబ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఫిబ్రవరి 2022లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. 2019 ఎన్నికలలో ఓటమి పాలైన తరువాత పార్టీని విడిచిపెట్టిన మొదటి సీనియర్ యూపీఏ కేబినెట్ మంత్రి.
సునీల్ జఖర్..
పంజాబ్‌లో కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన సునీల్ జఖర్.. 2022లో రాజీనామా చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని విమర్శించినందుకు జఖర్‌పై చర్యలు తీసుకున్నందుకు ఆయన పార్టీని విడిచిపెట్టారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అదే సంవత్సరం జూలైలో పంజాబ్ బీజేపీ చీఫ్‌గా నియమించబడ్డారు.
ఆర్‌పీఎన్ సింగ్
కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టి జనవరి 2022న బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు పార్టీని మారిన కీలక నేతగా అప్పట్లో రాజకీయాల్లో నిలిచారు. ప్రియాంక గాంధీ నేతృత్వంలో యూపీ ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన కులాల నాయకుడైన సింగ్‌ను పక్కన పెట్టినందుకు ఆయన కలత చెందినట్లు నివేదికలు వచ్చాయి.
జ్యోతిరాదిత్య సింథియా
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్ పార్టీని వీడి 2020లో బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్‌లో తన వర్గం ఎమ్మెల్యేలతో వీడి కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని అప్పట్లో పడగొట్టారు. బీజేపీ నేతృత్వంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఏర్పడటానికి సహాయం చేశారు. ఈయన మాజీ కేంద్ర మంత్రి మాదవ్ రావ్ సింథియా కుమారుడుగా మధ్యప్రదేశ్‌లోనే గాక దేశంలోనే ప్రధాన నేతల్లో ఒకరు.
జితిన్ ప్రసాద
ఒకప్పుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడైన కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద.. 2021లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు బీజేపీలో చేరారు. యూపీలో బ్రాహ్మణ వర్గానికి కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహించిన ప్రముఖ నేత. "బీజేపీ మాత్రమే నిజమైన రాజకీయ పార్టీ. ఇది ఏకైక జాతీయ పార్టీ. మిగిలినవి ప్రాంతీయ పార్టీలు" అని ఆయన అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అల్పేష్ ఠాకూర్
మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకోర్ జూలై 2019లో కాంగ్రెస్ పార్టీని వీడారు. రెండు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాత ఈయన రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ సౌత్ నుంచి గెలుపొందారు.
అనిల్ ఆంటోని
కాంగ్రెస్ కురువృద్ధుడు ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గత ఏడాది జనవరిలో కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే అభివృద్ధి చెందుతుందని ప్రశంసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడి నిర్ణయంపై మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ నిరాశను వ్యక్తపరిచారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు..
Comments
Please login to add a commentAdd a comment