సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర. పద్నాలుగేళ్ల అధికార అనుభవం. ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ జిల్లాలో నేల విడిచి సాము చేస్తోంది. అధినేత చంద్రబాబు నాయకత్వంలో ఆ పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. దీంతో ఎన్నికలు వచ్చేసరికి పార్టీకి అభ్యర్థులు కరువై పోవడంతో వలస నేతల కోసం అర్రులు చాస్తున్నారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకుని వెన్నంటి ఉన్న వారికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా పొగబెడుతున్నారు. దీంతో జిల్లా టీడీపీ నేతలలో అంతర్మథనం ప్రారంభమైంది. కష్టకాలంలో ఉన్న వారిని కాదని వలస నేతలకు రెడ్ కార్పెట్ వేయడంపై భగ్గుమంటున్నారు.
►కావలి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మాలేపాటికి పార్టీ ఇన్‌చార్జ్ పదవి ఇచ్చి చేతి చమురు వదిలించిన పార్టీ వెంటనే యూటర్న్ తీసుకోవడంతో నియోజకవర్గంలో తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. మైనింగ్ మాఫియా డాన్‌గా ఉన్న డీవీ కృష్ణారెడ్డికి దాదాపు టికెట్ ఖరారు చేశారన్న ప్రచారం సాగడంతో తమ్ముళ్లు అధిష్టానంపై గుర్రుమంటున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు సహజ వనరులను దోచేస్తున్నారంటూ గోలగోల చేస్తున్న టీడీపీ క్యాడర్ సహజ వనరులను కొల్లగొట్టి వేల కోట్లు దోచుకున్న మైనింగ్ డాన్‌కు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలియడంతో అవాక్కవుతున్నారు.
► ఉదయగిరి టీడీపీలో కూడా వర్గ రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. కానీ ఉన్న పళంగా చినబాబు సన్నిహితుడినని చెప్పుకుంటూ ఎన్‌ఆర్‌ఐ ఒకరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు పేరుతో విరివిగా ప్రచారం చేసుకుంటున్నారు. బొల్లినేని వ్యతిరేక వర్గాన్ని కూడగట్టి ఈ ధపా టికెట్ నాదేనంటూ హడావుడి చేస్తుండడంతో పార్టీ ఇన్‌చార్జ్ బొల్లినేనికి తలనొప్పిగా మారింది.
►జిల్లాలో టీడీపీలో ఒకప్పుడు హవా నడిపించిన మాజీ మంత్రి సొమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరిస్థితి కూడా ఇప్పుడు దారుణంగా తయారైంది. వరుసుగా మూడు ధపాలు ఓటమి చెందిన వారికి ఈసారి టికెట్ లేదని చినబాబు ప్రకటన చేయడంతో సోమిరెడ్డి పరిస్థితి దయనీయంగా మారింది. దీనికితోడు అర్థ, అంగ బలాలున్న వలస నేతల రాకతో ఆయన పరపతి మరింత దిగజారే అవకాశం ఉంది.
► నెల్లూరు రూరల్‌లో పార్టీకి అండగా ఉన్న అబ్దుల్ అజీజ్‌ను కాదని వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. మైనార్టీలకు కాదని వలస వాదులకు పెద్దపీట వేసినా చివరకు జనసేన పొత్తుల కుంపటిలో నెల్లూరు రూరల్ జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా ఉంది.
► ఇక ఆత్మకూరులో ఎన్నాళ్లగానో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, గూటూరు కన్నబాబులను కాదనుకుని వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి పెద్దపీట వేశారు. గతంలో యువగళం పాదయాత్ర నిర్వహణ అంతా ఆయనకే అప్పజెప్పారు. తీరా ఎన్నికల వేళ చేయించుకున్న సర్వేల్లో ఓటమి తప్పదని భావించిన ఆనం ఆత్మకూరు వద్దని సిట్టింగ్ స్థానం వెంకటగిరి ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఆత్మకూరులో అభ్యర్థి కోసం మరోసారి అన్వేషణ ప్రారంభమైంది.
► నెల్లూరు సిటీ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీమంత్రి నారాయణ గడిచిన నాలుగేళ్లుగా ప్రజాక్షేత్రంలో తిరిగిన దాఖలాలు లేవు. ఎన్నికల సమయంలో టికెట్ నాకేనంటూ హడావుడి చేస్తున్నాడు. ఇదే నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తూ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. తీరా ఎన్నికల సమయంలో టికెట్ ఇతరులు తన్నుకుపోవడంతో నిరాశ చెందుతున్నారు.
► కోవూరులో మూడు ముక్కలాట కొనసాగుతోంది. పార్టీని నమ్ముకుని ఉన్న చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిలు ఎప్పుటి నుంచో టికెట్ ఆశించి ప్రతిసారీ భంగపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనయుడు దినేష్‌కు సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దినేష్ పార్టీలోని వర్గాలను కలుపుకోని పోయే పరిస్థితి లేదు.
వలస నేతలు
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు పట్టుమని ఇరవై రోజుల వ్యవధి కూడా లేదు. ఓవైపు వైఎస్సార్‌సీపీ ఉత్సాహంతో నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల రంగంలోకి దింపింది. వైఎస్సార్‌సీపీని ఒంటరిగా ఎదుర్కోలేని టీడీపీ జనసేనతో జతకట్టి వచ్చినా ఇప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయలేక నాన్చుడు ధోరణిలో ఉండడంతో కేడర్ నిరుత్సాహంలో ఉంది.
జిల్లాలో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతుండడంతో అధిష్టానం దిక్కుతోచక వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలను ఆహ్వానించి.. రాజకీయ వలస వాదులకు పెద్దపీట వేసింది. అప్పటి వరకు పార్టీకి అండగా ఉన్న స్థానిక నాయకత్వాన్ని కాదని వలస వాదులకు పెద్దపీట వేయడంతో స్థానిక నాయకత్వం భగ్గుమంటోంది.
Comments
Please login to add a commentAdd a comment