టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్. చిత్రంలో ఉద్యోగ సంఘాల నేతలు
రెవెన్యూ సంఘాల నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి
కొత్త సంవత్సరం డైరీ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: త్వరలో అమల్లోకి రానున్న కొత్త ఆర్వోఆర్ చట్టంతోనే భూ సమస్యలకు శాశ్వత పరి ష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చె ప్పారు. రాష్ట్రంలోని రైతులకు మెరుగైన రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ సర్విసెస్ అసోసియేషన్ (టీజీఆర్‌ఎస్‌ఏ) రూపొందించిన నూతన సంవత్సర డైరీని సీఎం గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి తదితరులతో..కొత్త ఆర్వోఆర్ చట్టం, దానిలోని అంశాల గురించి సీఎం చర్చించారు. ధరణితో రాష్ట్రంలో భూసమస్యలు పెరిగాయని, సమస్యలు పరిష్కరించడంతో పాటు రైతులకు, ప్రజలకు రెవెన్యూ సేవలను వేగంగా, సులభంగా అందించే లక్ష్యంతోనే భూభారతిని తీసుకొచ్చినట్లు తెలిపారు.
కొత్త చట్టంలో రెవెన్యూ అధికారులకు వివిధ స్థాయిల్లో అధికారాలను కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కొత్త చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులు, ఉద్యోగులపైనే ఉందన్నారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల సమయంలో తహసీల్దార్లను వివిధ జిల్లాలకు బదిలీ చేశారని, వారిని సొంత జిల్లాలకు పంపాల ని సీఎంను లచ్చిరెడ్డి కోరారు. దీంతో సాధ్యమైనంత త్వరలోనే బదిలీల ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
చట్టం అమలుకు ఉద్యోగులు కృషి చేయాలి
భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది సమష్టి్టగా, చిత్తశుద్ధితో కృషి చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాది పురస్కరించుకుని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్విసెస్ అసోసియేషన్(ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం గురువారం ముఖ్యమంత్రిని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని, సీసీఎల్‌ఏ నవీన్ మిత్తల్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. భూభారతి అమలుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని సంఘం నేతలు ఈ సందర్భంగా తెలియజేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షుడు కె.నిరంజన్‌రావ్ ఈ బృందంలో ఉన్నారు.
దీప్తికి సీఎం అభినందనలు
పారా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి అర్జున పురస్కారానికి ఎంపికైన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా యువతి దీప్తి జివాంజీకి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ప్రజాప్రభుత్వ క్రీడా విధానంలో భాగంగా.. ఇటీవల దీప్తికి రూ.కోటి, కోచ్ నాగపురి రమేశ్‌కు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశామని గుర్తు చేశారు. దీప్తికి గ్రూప్–2 ఉద్యోగంతో పాటు వరంగల్‌లో 500 గజాల స్థలం కేటాయించాలని నిర్ణయించామన్నారు. ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన గూకేష్ (చెస్), హర్మన్‌ప్రీత్ సింగ్(హాకీ), ప్రవీణ్‌కుమార్ (పారా అథ్లెటిక్స్), మనుబాకర్(షూటింగ్) తదితరులకు కూడా సీఎం అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment