కొమ్మాది చైతన్య కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న పీడీఎస్‌వో నాయకులు
మధురవాడ: కొమ్మాదిలోని చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రూపశ్రీ బలవన్మరణంపై ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై సాంకేతిక విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. పూర్తి స్థాయి విచారణ జరిపి 24 గంటల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవాలను వెలికి తీసే క్రమంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని విచారణ కమిటీగా నియమించినట్టు పేర్కొన్నారు.
కమిటీ సభ్యులు వీరే
పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. చంద్రశేఖర్ నేతృత్వంలో విశాఖపట్నం పాలిటెక్నిక్ మెటలర్జీ విభాగాధిపతి కె. రత్నకుమార్, సివిల్ ఇంజినీరింగ్ లెక్చరర్ డాక్టర్ కె. రాజ్యలక్ష్మి సభ్యులుగా నియమించింది.
సమగ్రంగా విచారణ
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. దీనికి కారకులను గుర్తించేందుకు సీసీ పుటేజీలతో పాటు యాజమాన్య ప్రతినిధులు, ఫ్యాకల్టీ, ఇక్కడ పనిచేస్తున్న పురుష సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. శుక్రవారం విశాఖ సిటీలో ఓ సీఐతో పాటు భీమిలి, పద్మనాభం పోలీస్ స్టేషన్ల చెందిన సీఐలు దర్యాప్తు చేపట్టారు. అయితే ఘటన జరిగి 36 గంటలు దాటుతున్నా పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడంతో బాలిక తల్లి తండ్రులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కళాశాల గుర్తింపు రద్దు చేయాలి
కొమ్మాది చైతన్య కళాశాలలో విద్యార్థిని మృతికి కారణమైన కామాంధ ఫ్యాకల్టీని కఠినంగా శిక్షించాలని జనజాగరణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వాసు డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అధికారులు సమగ్ర విచారణ చేసి చైతన్య ఇంజినీరింగ్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పీడీఎస్‌వో ఆందోళన : విద్యార్థిని మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని కళాశాల వద్ద పీడీఎస్‌వో ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్, నాయకులు రుద్రి, ఎల్. భాను తదితరులు మాట్లాడుతూ విద్యార్థిని మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావుకు మెమోరాండం ఇచ్చినట్టు చెప్పారు.
ముగ్గురు వైద్యులతో పోస్టుమార్టం
మహారాణపేట: కళాశాల విద్యార్థిని భౌతిక కాయానికి ముగ్గురు వైద్యుల బృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించినట్టు ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుచ్చిరాజు తెలిపారు. గైనిక్,పెథాలజీ,ఫోరెన్సిక్ విభాగ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. వారు నివేదికను ప్రిన్సిపాల్‌కు అందజేస్తారు.
కాగా కేసు దర్యాప్తు గురించి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కర్రి జయశ్రీ రెడ్డి శనివారం పీఎంపాలెం సీఐ రామకృష్ణతో మాట్లాడారు. ఎవరిపై కేసు నమోదు చేశారు.. ఏ సెక్షన్లు పెట్టారో తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment