రాబోయేది ప్రజాపోరాటాల కాలం
భువనగిరి : రాబోయేది ప్రజాపోరాటాల కాలమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ తెలిపారు. బుధవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధి, చిన్ననీటి ప్రాజెక్టులు, ప్రజారోగ్యాలపై ప్రభావం చూపే పరిశ్రమలు, కార్మికులకు కనీస వేతనాలు, విద్య, ఉపాధి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చౌటుప్పల్ జిల్లా మహాసభల్లో తీర్మానం చేసినట్లు తెలిపారు. వీటితో పాటు రామన్నపేటలో నిర్మించతలబెట్టిన అంబుజా సిమెంట్ పరిశ్రమకు వ్యతిరేకంగా, గోదావరి జలాల సాధన, మూసీ ప్రక్షాళన, బస్వాపూర్ రిజర్వాయర్‌కు నిధులు విడుదల చేయాలని పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం,దాసరి పాండు, జిల్లా కమిటి సభ్యులు దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేశ్, నాయకలు వనం రాజు తదితరులు పాల్గొన్నారు.
4.76 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు
మోత్కూరు : జిల్లాలో ఇప్పటి వరకు 19,593 మంది రైతుల వద్ద 4,76,777 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత తెలిపారు. మోత్కూరు మండలం అనాజిపురంలోని మహా లక్ష్మి పత్తి మిల్లు కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. పత్తి విక్రయించిన రైతులకు నగదు చెల్లింపుల వివరాలను కంప్యూటర్‌లో ఆమె పరిశీలించారు. ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు, వలిగొండ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని 12 జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు చేసినట్లు తెలిపారు. 17,915 మంది రైతులకు రూ.3.267 కోట్లు చెల్లించినట్లు వివరించారు. కొందరు రైతుల డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు వివరంగా లేకపోవడంతో బిల్లులు ఆగినట్లు తెలిపారు.ఆమె వెంట మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి కె.ఉమామహేశ్వర్, పత్తి కొనుగోలు అధికారి ఆర్.రవీందర్ ఉన్నారు.
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు కొనసగాయి. వేకువజామున సుప్రభాతం సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అర్చన, అభిషేకంతో కొలిచారు. అనంతరం ప్రధానాలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. ఆయావేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
కొనసాగుతున్న సీఎం కప్
భువనగిరి : సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా బుధవారం యోగా, చెస్, ఫుట్‌బాల్, సైక్లింగ్, బాస్కెట్‌బాల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు, ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోపాల్, పీడీలు, పీఈటీలు ధశరథరెడ్డి, పాండురంగం, రఘువీర్, కేశనాగు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment