అన్నదాతకు ఊరట
భారం తగ్గుతుంది
నాకు మూడు ఎకరాల సాగు భూమి ఉంది. యాసంగి సీజన్‌లో మొత్తం వరి సాగు చేస్తున్నాం. డీఏపీపై రాయితీ ఇస్తుండడం వల్ల నాలాంటి రైతులు మరెందరికో ప్రయోజనం కలుగతుంది. డిసెంబర్ 31న రాయితీ గడువు ముగియగా.. పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. రాయితీ గడువు పెంపు వల్ల పాత ధరకే డీఏపీ దొరుకుతుంది.
–నర్సింహ, రైతు, రామన్నపేట
రామన్నపేట : డీఏపీ (డై అమ్మోనియం పాస్పేట్) ఎరువుపై కేంద్ర ప్రభుత్వం రాయితీ గడువును పొడిగించడం రైతులకు ఊరటనిచ్చింది. వాస్తవానికి రాయితీ గడువు గత 2024 డిసెంబర్ 31తో ముగిసింది. రాయితీ గడువు పొడిగించడం ద్వారా రైతులకు 50కిలోల డీఏపీ పాత ధర రూ.1350కే లభించనుంది.
1,04,190 టన్నుల డీఏపీ అవసరం
జిల్లాలో 2,71,578 మంది రైతులు ఉన్నారు. అధికారుల అంచనా ప్రకారం ప్రస్తుత యాసంగి సీజన్‌లో 2,98,000 ఎకరాల్లో వరి, 22వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఈ సీజన్‌కు సుమారు 1,04,190 టన్నుల డీఏపీ అవసరం. కేంద్ర ప్రభుత్వం టన్ను డీఏపీకి రూ.3500 రాయితీ భరిస్తుంది. ఈ లెక్కన జిల్లా రైతులకు రూ.36.47 కోట్ల సబ్సిడీ లభించనుంది.
ముమ్మరంగా వరి నాట్లు
యాసంగి సీజన్‌కు సంబంధించి వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్లపూర్తి కాగా ఆలస్యంగా నారుపోసిన రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. సంక్రాంతి వరకు నాట్లు పూర్తయ్యే అవకాశం ఉన్నది. స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి సైతం కూలీలు నాట్లు వేసేందుకు వస్తున్నారు. ఎకరా పొలం నాటు వేసేందుకు రూ.5,000 నుండి రూ.5,500 వరకు డిమాండ్ చేస్తున్నారు. గుత్తా కావడంతో తెల్లవారే వరకు కూలీలు పొలాల్లో దర్శనమిస్తున్నారు.
డీఏపీపై రాయితీ గడువు పెంపు
ఫ పాత ధరకే విక్రయం
ఫ జిల్లా రైతులకు రూ.36.47 కోట్లు లబ్ధి
Comments
Please login to add a commentAdd a comment