TS Special
-
పారిశుధ్య కార్మికులతో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు సోమవారం పారిశుధ్య కార్మికులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కార్మికులతో ముచ్చటిస్తూ సహపంక్తి భోజనం చేశారు. సెల్పిలు దిగారు. కాగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పారిశుధ్య కార్మికులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి చేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని చెప్పారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కలి్పంచడంతో పాటు ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో తమకూ మెడికల్ లీవ్ సౌకర్యం ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పారిశుధ్య కార్మికులకు మూడు పర్యాయాలు వేతనం పెంచిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. సమస్యలను మేయర్ గద్వాల విజయలక్ష్మి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నేతలు, కార్యకర్తల స్వాగతం నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోలు, సెల్పిలు దిగారు. సుమారు ఐదు గంటల పాటు తెలంగాణ భవన్లో గడిపిన కేటీఆర్ కార్యకర్తలను కూడా కలిశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులున్నారు. కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, నగేష్, టీఆర్ఎస్వీ నాయకులు శ్రీకాంత్ గౌడ్, తుంగ బాలు, కాటం శివ తదితరులు కేటీఆర్‌ను కలిశారు. -
విద్యకు ‘నూతన’ జవసత్వాలు!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో విద్యా రంగం వినూత్న జవసత్వాలను సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గణనీయ మార్పులు, కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖపై జరిపిన సమీక్ష తర్వాత రాష్ట్రంలో మార్పులపై సంకేతాలు వస్తున్నాయి. ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ స్థాయి వరకు కొత్త అడుగులు పడవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) వంటి సంస్థలు కూడా ఈ ఏడాది కీలక సంస్కరణల అమలుకోసం సిద్ధమవుతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ఆశలు రాష్ట్రంలో 26 వేలకుపైగా ప్రభుత్వ బడులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 12 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లకు పదోన్నతులు కలి్పస్తే మరో 10 వేల వరకు పోస్టులు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా 22 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉండనుంది. గత ఏడాది 5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి కార్యాచరణ చేపట్టినా అడుగు ముందుకు పడలేదు. అయితే త్వరలో మెగా డీఎస్సీ చేపడతామని రాష్ట్ర సర్కారు ప్రకటించడం విద్యాశాఖలో ఆశలు రేపుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కేవలం ఏడు జిల్లాల్లోనే పర్యవేక్షణ అధికారులు ఉన్నారు. దీంతో విద్యలో నాణ్యత తగ్గిందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు పదోన్నతులు, బదిలీలు కూడా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం టీచర్లలో హర్షం వ్యక్తమవుతోంది. కాలేజీ విద్యకూ మంచి రోజులు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో 2,400 బోధన సిబ్బంది పోస్టుల భర్తీ కోసం గత ఏడాది ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కానీ రోస్టర్ పాయింట్ విషయంలో న్యాయపరమైన ఇబ్బందితో భర్తీ ప్రక్రియ ముందుకు కదల్లేదు. నిజానికి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులు 1,200 మందే ఉన్నారు. 4,007 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. జూనియర్ కాలేజీల్లో 6,008 పోస్టులుంటే.. 4 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేసేందుకు అవసరమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. కొత్త ఏడాదిలో కాలేజీ విద్యకు మంచిరోజులు వచ్చినట్టేనని అంటున్నారు. ఇక రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 3 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఉన్నత విద్యా మండలి, విశ్వవిద్యాలయాల ప్రక్షాళన, సమన్వయ పాలన వ్యవహారాలపై సర్కారు దృష్టి పెట్టిందని.. ఇవన్నీ 2024 ఏడాదిలో కీలక పరిణామాలకు దారి తీయవచ్చని అంటున్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేలా.. ఫిబ్రవరిలో ఇంటర్, మార్చిలో టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. గతంలో పేపర్ లీకులు, ఇంటర్ ఫలితాలపై విద్యార్థుల ఆందోళన వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో ఈసారి ప్రభుత్వం పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం, విద్యార్థులను ముందు నుంచే సన్నద్ధం చేస్తూ భయం పోగొట్టడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు చెప్తున్నారు. మారుతున్న సిలబస్.. ఈ ఏడాది నుంచి పాలిటెక్నిక్ సిలబస్ మారనుంది. విదేశాల్లోని డిప్లొమా చదువులకు అమలు చేస్తున్న పాఠ్య ప్రణాళికను ఆధారంగా చేసుకుని కొత్త ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఒక్కో డిప్లొమా బ్రాంచీకి ఒక్కో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సింగపూర్, చైనా దేశాల్లోని సిలబస్‌లను ఈ కమిటీలు పరిశీలిస్తాయి. పాలిటెక్నిక్ విద్యలో ఇంటర్న్‌షిప్, ఆన్లైన్ మూల్యాంకనం, ఓపెన్ బుక్ విధానం వంటి సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరిన్ని డీమ్డ్ వర్సిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ ఏడాది కీలక మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది. ఇప్పటికే సంబంధిత ముసాయిదాపై అన్ని వర్గాల ఆమో దం తీసుకున్నారు. మూడేళ్లు వరుసగా న్యాక్ ఏ ప్లస్‌తోపాటు గ్రేడ్‌లో నాలుగు పాయింట్లకుగాను కనీసం 3.4 పాయింట్లు సాధించిన కాలేజీలకు డీమ్డ్ హోదా ఇవ్వాలని యూజీసీ నిర్ణయించింది. దీనిని బట్టి తెలంగాణలో పది కాలేజీలకు డీమ్డ్ హోదా లభించే వీలుంది. మరోవైపు విదేశీ విద్యాలయాలు మన దేశంలో బ్రాంచీల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. వాటికి యూజీసీ, సాంకేతిక విద్యా మండలి సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. విదేశీ యూనివర్సిటీల రాకతో విద్యా బోధనలో మార్పు రావొచ్చని నిపుణులు చెప్తున్నారు. -
ప్రజాపాలన తర్వాత నామినేటెడ్‌పై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత నామినేటెడ్ పోస్టులను ఖరారు చేసే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. మొదటి నుంచీ చర్చ జరుగుతున్న విధంగా సంక్రాంతి లోపు మొదటి దఫా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేందుకు తనను కలిసిన విలేకరులతో సీఎం రేవంత్ ఈ మేరకు తన మనసులో మాట చెప్పారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే క్రమంలో తనతో ఉన్న సాన్నిహిత్యం, పార్టీలో పలుకుబడి పనిచేయవని, పార్టీ కోసం కష్టపడ్డవారికి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో భాగంగా త్యాగం చేసిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. తీవ్ర పోటీ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు, సిఫారసులు తీసుకుని ఆరో తేదీ తర్వాత ముఖ్యమంత్రి కసరత్తు పూర్తి చేయనున్నారు. అనంతరం ఆ జాబితాను పార్టీ అధిష్టానానికి పంపి అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత సంక్రాంతిలోపు ఈ పదవుల పందేరంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా, పదేళ్ల తర్వాత అధికారం దక్కిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ పారీ్టలో తీవ్ర పోటీ నెలకొంది. రాజకీయంగా గుర్తింపు ఉండే కీలక కార్పొరేషన్లతో పాటు ఇతర కార్పొరేషన్లకు చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్ల కోసం పోటీ పడుతున్న వారి జాబితా చాంతాడంత తయారయింది. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలు, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, పార్టీలో అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితా తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం జరిగే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా సీఎం రేవంత్ ఈ పోస్టులపై మరింత స్పష్టత ఇస్తారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
వర్సిటీల్లో ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల పాలనాపరమైన వ్యవహారాల్లో సమూలమార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం అన్ని యూనివర్సిటీల సమగ్ర నివేదికలు తెప్పించుకుంది. ఉన్నతవిద్యలో కీలక పదవులు నిర్వహించినవారు, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని అధ్యాపక సంఘాలతో వర్సిటీల్లో చోటుచేసుకున్న ఘటనలపై సీఎంకు నివేదికలు అందాయి. ఇటీవలి విద్యాశాఖ సమీక్షలో సీఎం వీటిని ప్రస్తావించినట్టు తెలిసింది. వర్సిటీల వీసీలు, ఉన్నతవిద్య ఉన్నతాధికారుల మధ్య వైరం, వర్సిటీల్లో కీలకవ్యక్తుల మధ్య వివాదాలు వంటి అంశాలపై సీఎంకు స్పష్టత ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. త్వరలో కీలక మార్పులకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోపణలపై ఆరా విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ల నియామకంలో రాజకీయ ప్రాధాన్యం అనేక దుష్ఫలితాలకు దారి తీస్తోందని పలువురు ప్రొఫెసర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీసీని నియమించేటప్పుడు సెర్చ్ కమిటీ అన్ని విషయాలపై నివేదిక ఇస్తుంది. కానీ ఈ కమిటీకి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు చెబుతున్నారు. ఓ వర్సిటీ వీసీ నియామకాన్ని సెర్చ్ కమిటీ తీవ్రంగా తప్పుబట్టినా పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు పీహెచ్డీ చేసే విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చిన విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. ఇలాంటి వ్యక్తిని వీసీగా పెట్టడం వల్ల పాలనపరమైన పోస్టుల భర్తీలోనూ అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయని సీఎంకు తెలిపారు. మితిమీరిన ఐఏఎస్‌ల ప్రభావం విద్యాశాఖ కమిషనర్ల పాత్ర కూడా వర్సిటీల్లో కొత్త సమస్యలకు దారి తీస్తోందని నిపుణులు అంటున్నారు. ఇటీవల ఓ ఐఏఎస్ అధికారి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయనకు నచ్చిన విషయాలను వర్సిటీ పాలక మండలిలో ఆమోదం పొందేందుకు ఒత్తిడి తెచ్చినట్టు విమర్శలున్నాయి. దీంతో ఆయనకు, వీసీకి మధ్య జరిగిన ప్రచ్ఛన్నపోరు వర్సిటీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందని పలువురు సీఎం దృష్టికి తెచ్చారు. అధికారులపై తన మాట నెగ్గించుకునేందుకు చేసిన ఒత్తిడి వల్ల అనేక కొత్త సమస్యలు ఎదురైనట్టు తెలిపారు. మరో యూనివర్సిటీలో ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తిని రిజిస్టర్‌గా కొనసాగించిన తీరు కూడా అనేక విమర్శలకు కారణమైంది. దీని వెనుక వీసీ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు. ఈ తరహా పరిణామం గతంలో ఎన్నడూ లేదని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్‌లో అయితే ఇష్టారాజ్యం హైదరాబాద్‌లోని కొన్ని యూనివర్సిటీల్లో వీసీల ఇష్టారాజ్యం నడుస్తోందని ఓ ప్రొఫెసర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ వర్సిటీ వీసీ ఇష్టానుసారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం చేపట్టారు. ఇందులో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారినట్టు విమర్శలున్నాయి. అనుబంధ గుర్తింపు ఇచ్చే క్రమంలోనూ ఆయన ప్రైవేటు కాలేజీల నుంచి వసూళ్లు చేపట్టినట్టు ఆరోపణలున్నాయి. రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తున్నారని, విద్యార్థులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్న వీసీలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. నిబంధనల పేరుతో ఒక వీసీ వ్యవహరించిన తీరుపై ఇప్పటికే సీఎం ఆరా తీసినట్టు తెలిసింది. బాసరపై ప్రత్యేక దృష్టి బాసర ట్రిపుల్ ఐటీపై వస్తున్న ఆరోపణలపై సీఎం సమగ్ర నివేదిక తెప్పించుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా అక్కడ అనేక రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు, ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థులను బెదిరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టుల వ్యవహారంలో అవినీతి, వీసీ, డైరెక్టర్ బాసర ట్రిపుల్ ఐటీకి ఎప్పుడో ఓసారి వెళుతున్న తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రక్షాళన అనివార్యమని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. -
సంపూర్ణంగా సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజ్‌భవన్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క) ఆయన వెంట ఉన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాజ్‌భవన్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డి. గవర్నర్ దంపతులకు శాలువ కప్పి సత్కరించారు. అనంతరం గవర్నర్‌తో దాదాపుగా 15 నిమిషాల పాటు విడిగా భేటీ అయ్యారు. ఏమైనా ఇబ్బందులుంటే తెలియజేయాలని, వెంటనే పరిష్కరిస్తామని గవర్నర్‌ను సీఎం కోరారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన పాలన వ్యవస్థలను మళ్లీ గాడిలో పెడుతున్నామని వివరించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని, వెంటనే కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని తెలియజేసినట్టు సమాచారం. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని అందువల్ల త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, చర్యలు, ప్రణాళికలను రేవంత్ వివరించినట్టు సమాచారం. ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నూతన సంవత్సర ఆరంభం పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో కేక్ కట్ చేశారు. ఓపెన్‌హౌస్ నిర్వహించి అతిథుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర సీనియర్ అధికారులు, 2,500 మంది సాధారణ ప్రజలు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ పిలుపు మేరకు పూలబోకేలకు బదులుగా చాలామంది అతిథులు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను కానుకలుగా ఇచ్చారు. దీంతో 25,000 నోట్‌బుక్స్ రాజ్‌భవన్‌కు అందాయి. ఈ పుస్తకాలను జీహెచ్ఎంసీ, గిరిజన ప్రాంత మురికివాడల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ రాజ్‌భవన్‌కు సంబంధించిన వాట్సాప్ చానల్ ( https:// whatsapp. com/ channel/0029VaIxdrC4 NVicOQDVvY3 L)ను కూడా ఆవిష్కరించారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమాల వార్తలు, ఫొటోలను దీనిద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేయనున్నారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయండి: గవర్నర్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, వర్సిటీల్లో తక్షణమే బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని గవర్నర్ సూచించినట్టు తెలిసింది. రాజ్‌భవన్ తరఫున కొత్త ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తమిళిసై హామీ ఇచ్చింనట్టు సమాచారం. -
రద్దు చేయం.. సరిచేస్తాం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమ ప్రభుత్వం మెట్రో మార్గం, ఫార్మాసిటీ సహా దేనినీ రద్దు చేయడం లేదని.. ప్రజోపయోగకరంగా మార్పులు మాత్రమే చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం ఆస్తులు సృష్టిస్తుందే తప్ప.. రాష్ట్రానికి భారమయ్యే ఏ పనీ చేయబోదని వివరించారు. ఫార్మాసిటీ స్థానంలో ఫార్మా విలేజీలు నిర్మిస్తామన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా, తక్కువ ఖర్చుతోనే శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైల్‌ను అనుసంధానిస్తామని తెలిపారు. చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాలు శాచురేషన్కు వచ్చాయని.. రాష్ట్రం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా, ఎయిర్‌పోర్టుకు అవతలివైపు కోటిన్నర ప్రజలతో కొత్త సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ ఆధ్వర్యంలోనే మెట్రో విస్తరణ చేపడతాం. మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు విస్తరిస్తాం. అవసరమైతే రామచంద్రాపురం వరకు పొడిగిస్తాం. నాగోల్–ఎల్బీనగర్–ఒవైసీ ఆస్పత్రి మీదుగా ఫలక్‌నుమా–శంషాబాద్ వరకు.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైల్ విస్తరిస్తాం. అలాగే మైండ్‌స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు విస్తరించి పూర్తిస్థాయిలో వినియోగిస్తాం. గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు విస్తరణ కోసం రూ.9వేల కోట్లు వ్యయం చేయడానికి సిద్ధమైంది. అలాగే బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు మరోలైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు విస్తరించకుండా కొత్తగా చేపట్టడం అనవసర వ్యయమే. అక్కడి నుంచి మెట్రో ఎక్కేవారు ఎవరూ ఉండరు. అది నిర్మించి ఉంటే.. కాళేశ్వరం తరహాలో రాష్ట్రానికి భారంగా మారేది. మేం చేసిన మార్పులతో నగరంపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. దీనికి కేంద్రం పూర్తిగా నిధులు సమకూర్చే అవకాశం ఉంది. ప్రస్తుత మెట్రోకు అనుసంధానం చేయడం వల్ల వ్యయం కూడా తగ్గుతుంది. ఫార్మాసిటీకి బదులు ఫార్మా విలేజ్‌లు 25వేల ఎకరాల్లో ఒకే చోట ఫార్మాసిటీ నిర్మిస్తే.. చివరికి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పనికిరాకుండా పోతుంది. న్యూయార్క్ ఎయిర్‌పోర్టు మాదిరిగా అవుతుంది. అందుకే ఔటర్ రింగ్‌రోడ్డు– రీజనల్ రింగ్‌రోడ్డు మధ్య పది ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. నిరుపయోగంగా భూములు తీసుకుని ఒక్కో క్లస్టర్లో వెయ్యి నుంచి మూడు వేల ఎకరాల్లో జీరో పొలుష్యన్ ఉండేలా ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తాం. ఒక్కోదానిలో పది పరిశ్రమలు ఉండేలా చూస్తాం. అక్కడ పనిచేసే వారికి అదే క్లస్టర్లో గృహాలతోపాటు అన్ని సౌకర్యాలతో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రతిపాదిత ఫార్మాసిటీ ప్రాంతంలో కాలుష్య రహిత పరిశ్రమలు, టౌన్íÙప్లు, విద్యాలయాలు, ఆస్పత్రులు, వాణిజ్య భవన సముదాయాలు, వినోద సంబంధిత మల్టీప్లెక్స్‌లు వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. బీవైడీ వంటి ఎల్రక్టానిక్ కార్ల కంపెనీలు సహా రాష్ట్రానికి వచ్చే ఎలాంటి పరిశ్రమలనూ వదులుకోబోం. వారికి అవసరమైన రాయితీలు కల్పిస్తాం. ప్రఖ్యాత కంపెనీల ఆధ్వర్యంలో వర్సిటీలు.. రాష్ట్రంలో ప్రత్యేక నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం అగ్రశ్రేణి కంపెనీలను ఆహా్వనించాం. టాటా, మహీంద్రా, సెంచురీ సంస్థల ఆధ్వర్యంలో అవి ఏర్పాటవుతాయి. ఒక్కో పరిశ్రమ ఐదు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తుంది. ఇంటర్ పూర్తిచేసిన వారికి ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు ఉంటాయి. విద్యాశాఖ పర్యవేక్షణలోనే ఈ వర్సిటీలు ఉంటాయి. వీటిలో అభ్యసించే వారికి ఆ సంస్థలే ఉపాధి కల్పించడం, క్యాంపస్ రిక్రూట్మెంట్లు వంటి చర్యలు చేపడతాయి. నైపుణ్యంతో కూడిన డిగ్రీ ఉంటే వారికి ఉపాధి గ్యారంటీ అవుతుంది. ఒక్కో యూనివర్సిటీకి ప్రభుత్వం రెండు వందల ఎకరాల వరకు భూమి ఇస్తుంది. ప్రస్తుతం టాటా సంస్థ రూ.1,400 కోట్లు ఐటీఐలపై వెచ్చిస్తే.. మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.400 కోట్లు వెచ్చిస్తుంది. రాష్ట్ర అతిథి గృహంగా.. వైఎస్సార్ క్యాంప్ ఆఫీసు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాంపు కార్యాలయంగా వినియోగించిన భవనాన్ని రాష్ట్ర అతిథిగా గృహంగా మారుస్తున్నాం. నివాస భవనాన్ని మంత్రి నివాసంగా కేటాయించాం. కేసీఆర్ క్యాంపు కార్యాలయంగా వినియోగించిన భవనాన్ని కొత్తగా ప్రారంభించనున్న ‘మహాత్మా జ్యోతిబా పూలే ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆన్ సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్’ కోసం వినియోగిస్తాం. వంద పడకల ప్రతి ఆస్పత్రికి నర్సింగ్ కళాశాల రాష్ట్రంలో వంద పడకలున్న ప్రతీ ఆస్పత్రికి అనుబంధంగా ఓ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాం. నర్సులకు విదేశాల్లోనూ అధిక డిమాండ్ ఉంది. మధ్య తరగతిలో వృద్ధులను చూసుకునే అవకాశాలు తగ్గుతున్నాయి. వారికి చేదోడువాదోడుగా ఉండే నర్సులకు స్థానికంగానూ ఉపాధి లభిస్తుంది. విదేశాల్లో పనిచేసే నైపుణ్యం ఉన్న, లేనివారికి కూడా ఓరియంటేషన్ ఇప్పిస్తాం. విదేశాల్లోని పరిశ్రమలతో ప్రభుత్వమే సంప్రదింపులు జరిపి ఉద్యోగాలు కల్పిస్తాం. వేతనాలను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. వారికి ఏ ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది..’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రజల ప్రభుత్వం మాది మాది ప్రజలతో మమేకమయ్యే ప్రభుత్వం. ప్రజావాణి కోసం ప్రజలంతా రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళుతోంది. మంత్రులందరినీ కూడా ప్రజల దగ్గరకే వెళ్లాలని కోరాను. 80శాతం సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం అవుతాయి. మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండటమే ప్రజా ప్రభుత్వం. మంత్రులు పూర్తి స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. గతంలో ఒక్కరే పనిచేసేవారు. ఆయనే ఫోటోలో, ప్రచారంలో ఉండేవారు. ఇప్పుడు మంత్రులంతా ప్రజల్లోనే ఉంటున్నారు. మా పాలనలో పరిపాలన వికేంద్రీకరణ చేశాం. వందరోజులు టార్గెట్‌గా పనిచేస్తున్నాం. -
TS: బండ్ల గణేష్‌కు కీలక బాధ్యతలు!
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన సచివాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ పూలమొక్కను బహుమతిగా అందించారు. ఈ ఫొటోలు ఎక్స్‌లో వైరల్ అవుతుండగా.. ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. బండ్ల గణేష్ మొదటి నుంచి కాంగ్రెస్ హార్డ్‌కోర్ అభిమాని. ఎన్నికల్లో ప్రత్యక్షంగా మద్ధతు ఇస్తూ వస్తున్నారు కూడా. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పి మరీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈసారి ఎన్నికలకు ముందు.. రెండు రోజుల ముందే ఎల్బీ స్టేడియంకు వెళ్లి పడుకుంటానంటూ ప్రకటించడంతో.. మరోసారి ట్రోలింగ్ మెటీరియల్ అవుతారేమోనని కొందరు భావించారు. కానీ, ఈసారి బండ్ల గణేష్ జోస్యం తప్పలేదు. తెలంగాణలో బీఆర్ఎస్కు చెక్ పెట్టి.. కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌తో పదవులేం ఆశించకుండా చిత్తశుద్ధితో ఒక కార్యకర్తగా పని చేస్తానని బండ్ల గణేష్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విధేయతకు మెచ్చి త్వరలో కీలక బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం ఊపందుకుంది. అదేంటంటే.. సంక్రాంతిలోపు తెలంగాణలో ఖాళీలుగా ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. బండ్ల గణేష్‌కు ఏదైనా కార్పొరేషన్ అప్పజెప్పొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కార్పొరేషన్లలో వీలు కాకుంటే.. సినీ రంగానికి-తెలంగాణ ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా బండ్ల గణేష్‌కు సరికొత్త బాధ్యతలు అప్పగించవచ్చనే చర్చా నడుస్తోంది. ఇవేవీ కాకుంటే.. పార్టీ తరఫున అయినా ఆయనకు కీలక పదవి కచ్చితంగా దక్కవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే బండ్ల గణేష్ మాత్రం పదవులక్కర్లేదనని.. పార్టీ కోసం పని చేస్తానంటున్నారు. మరి బండ్ల గణేష్‌కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందా?.. లేదా.. స్పష్టత రావాలంటే.. ఇంకా కొన్నిరోజులు ఆగాల్సిందే. -
Hyd: భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. మద్యం ఎంత తాగారంటే?
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. వివరాల ప్రకారం.. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1241 కేసులు నమోదు అయినట్టు పోలీసులు తెలిపారు. ఇక, సైబరాబాద్‌లో బ్రీత్ అనలైజర్ కౌంట్ 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నట్టు వెల్లడించారు. సైబరాబాద్‌లో ఇద్దరు మహిళలతోపాటు తాగి వాహనాలు నడిపన 1239 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. కాగా, జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. కొత్త ఏడాది సందర్బంగా మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది. డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్ , లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. దీంతో, ఆదివారం ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక, గడిచిన మూడు రోజుల్లో తెలంగాణలో రూ.658 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది కూడా చదవండి: న్యూ ఇయర్ వేడుకలు.. ఐటీ ఉద్యోగిని ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం! -
TSRTC: న్యూ ఇయర్లో షాకిచ్చిన ఆర్టీసీ.. సిటీలో ప్రయాణికులకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గట్టి షాకిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల్లో ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పూర్తి టికెట్ ధరతో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే, ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల రద్దీ కోసం టీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ప్రవేశపెట్టింది. దీనికి మంచి స్పందన కూడా లభించింది. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పుడు ప్రయాణికులే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల నుంచి ఎదురుచూపులతో ఆర్టీసీకి డిమాండ్ పెరిగింది. దీంతో ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ఉపసంహరించుకుంది. ఈ సందర్బంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 31, 2023 ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు’ అని తెలిపారు. -
మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం
హైదరాబాద్: మార్నింగ్ వాక్కు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జి.రాజేశ్వరి, రవికుమార్ దంపతులు తమ కుమారుడు లోకేషకుమార్‌తో కలిసి మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 30న రాజేశ్వరి మార్నింగ్‌వాక్‌కు వెళుతున్నట్లు చెప్పి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. మధ్యాహ్నం లోకేష్ అత్తగారికి ఫోన్ చేసి తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, తాను చనిపోనని, ఇంటికి మాత్రం రానని చెప్పింది. ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో లోకేష్ ఆదివారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సిటీ బస్.. టాప్ గేర్
హైదరాబాద్: సిటీ బస్సు ఇక రయ్‌రయ్‌మని పరుగులు తీయనుంది. నూతన సంవత్సరం కొత్త సరీ్వసులు అందుబాటులోకి రానున్నాయి. కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో ఇప్పటి వరకు కొత్తవాటిని ప్రవేశపెట్టకపోవడంతో ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులను నడపడం అసాధ్యంగా మారింది. మహిళా ప్రయాణికులకు ఉచిత సదుపాయంకల్పించినప్పటి నుంచి ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. దీంతో పలు మార్గాల్లో అదనపు బస్సులను నడపడం తప్పనిసరిగా మారింది. ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల డిమాండ్ మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో నగర శివార్లలోని ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు కూడా రద్దీ కారణంగా సకాలంలో చేరుకోలేకపోతున్నారు. దీంతో యుద్ధప్రాతిపదికన 340 బస్సులను అద్దెకు తీసుకొనేందుకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ చర్యలు చేపట్టింది. ఇంచుమించు కొత్త ఏడాది ఆరంభంలోనే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల తరహాలోనే మరో 500 కొత్త బస్సులను నగరంలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ నాటికి ఈ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కొత్త సంవత్సరం 840 కొత్త బస్సులు నగరంలో వినియోగంలోకి రానున్నాయి. ఈ బస్సులతో ప్రయాణికులకు కొంత మేరకు ఊరట లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కోటిన్నర దాటి.. మహాలక్ష్మి పథకం గ్రేటర్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి రోజు సుమారు 8 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నట్లు అంచనా. డిసెంబరు 9వ తేదీన ఈ పథకం అందుబాటులోకి వచి్చన సంగతి తెలిసిందే. గతంలో 4 నుంచి 5 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణం చేయగా.. ఈ పథకం వినియోగంలోకి వచి్చన తర్వాత ఏకంగా 8 లక్షలకు చేరింది. రోజు రోజుకు మహిళా ప్రయాణికులు పెరుగుతున్నారు. దీంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య కోటిన్నర దాటినట్లు అంచనా. గతంలో 67 నుంచి 69 శాతం వరకు ఉన్న ఆక్యుపెన్సీ రేషియో కూడా 80 శాతం దాటింది. రద్దీ రూట్లలో మహిళలు సైతం ఫుట్‌బోర్డుపై ప్రయాణం చేయాల్సివస్తోంది. మరోవైపు ఉచిత ప్రయాణ సదుపాయంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఉదయం కాలేజీలకు వెళ్లే విద్యారి్థనులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం పూట కాలేజీకి వెళ్లాల్సిన సమయంలో బస్సులు కిక్కిరిసిపోతుండటంతో ప్రయాణం అసాధ్యంగా మారుతోంది. దీంతో అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేయాలని విద్యారి్థనులు డిమాండ్ చేస్తున్నారు. నగర శివార్లలో పెరిగిన రద్దీ... ఉచిత ప్రయాణ సదుపాయంతో శివారు ప్రాంతాల్లోంచి నగరంలోకి రాకపోకలు సాగించే బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. డిమాండ్‌కు తగినవిధంగా బస్సులు లేకపోవడంతో అందుబాటులో ఉన్న బస్సుల్లోనే ప్రయాణం చేయాల్సివస్తోంది. ‘సాధారణంగానే కొద్ది రోజులుగా రాకపోకలు పెరిగాయి. ఈ పథకం వినియోగంలోకి వచి్చన తర్వాత రద్దీ మరింత ఎక్కువైంది. కానీ కొత్త బస్సులు వచ్చే వరకు ట్రిప్పులను పెంచడం సాధ్యం కాదు కదా’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. డిపోల్లో స్పేర్‌లో ఉండే 10 శాతం బస్సులను సైతం నడుపుతున్నట్లు చెప్పారు. గ్రేటర్లో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తేనే రోడ్లపై వాహనాల రద్దీ తగ్గుతుంది. ఈ దిశగా కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని ఆశిద్దాం. ఫ్యామిలీ–24 టికెట్లు రద్దు మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్లో జారీ చేసే ఫ్యామిలీ–24, టి–6 టికెట్లను నేటి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జరార్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఫ్యామిలీ– 24, టి–6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ–24, టి–6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా బస్ సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. దీంతో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతోనే ఈ టికెట్లను ఉపసంహరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం నుంచి సిటీ బస్సుల్లో ఈ టికెట్లు లభించవు. -
Hyderabad: 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైరదాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 83వ అఖిలభారత పారిశ్రామిక పదర్శన (నుమాయిష్) సందర్భంగా ఆయా మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే 45 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ► ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలను ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు. ► బషీర్‌బాగ్, పోలీస్ కంట్రోల్‌రూమ్ వైపు నుంచి వెళ్లే భారీ, ఆర్టీసీ బస్సులను ఎల్బీస్టేడియం మీదుగా బీజేఆర్ విగ్రహం నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు. ► బేగంబజార్ ఛత్రి, మాలకుంట ప్రాంతాల నుంచి నాంపల్లి వైపు వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలను దారుసలాం జంక్షన్ నుంచి ఏక్‌మినార్ వైపు మళ్లిస్తారు. ► బహదూర్‌పురా పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలను సిటీ కాలేజ్ మీదుగా నయాపూల్ వైపు మళ్లిస్తారు. -
పంటలపై శాటి‘లైట్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏయే పంటలను, ఎంతెంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే వివరాలను పక్కాగా తేల్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం శాటిలైట్ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పంటల నమోదు ప్రక్రియ పక్కాగా ఉండాలన్న లక్ష్యంతో ఇప్పటికే 20 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద శాటిలైట్ సర్వే ప్రారంభించారు. డిసెంబర్ 20 నుంచి 23 వరకు.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. 144 మండలాల్లోని 318 క్లస్టర్లలో ప్రక్రియను పూర్తి చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శాటిలైట్ సర్వే చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో.. రాష్ట్రంలో ఇప్పటివరకు పంటల నమోదు ప్రక్రియ కొంత అశాస్త్రీయంగా ఉందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ క్రమంలోనే శాటిలైట్ సర్వే చేపట్టడానికి అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. క్లస్టర్ల వారీగా ప్రతి 300 మీటర్ల పరిధిలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు అవుతున్నాయనేది ఈ ప్రక్రియలో భాగంగా లెక్కిస్తారు. ఈ యాప్‌లో ‘గ్రౌండ్ ట్రూత్ పాయింట్ (జీటీ పాయింట్)’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు ఆయా క్లస్టర్ పరిధిలోని సంబంధిత పాయింట్ వద్దకు వెళ్లి పరిశీలించి.. పంటల వివరాలు నమోదు చేస్తారు. క్షేత్రస్థాయికి వెళితేనే వివరాలు కనిపించేలా.. వ్యవసాయ శాఖలో కొన్నేళ్లుగా ఏఈవోలు రోజువారీ హాజరు, రైతుబీమా, రైతుబంధు నమోదు కోసం ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లు, మొబైల్ ఫోన్లలో యాక్టివ్ ౖలాగర్ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్ ద్వారా సర్వే నంబర్ల ఆధారంగా పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. మొదట్లో రైతు యూనిట్‌గా పంటల సర్వే చేపట్టగా.. పంటలు అమ్ముకునే సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో సర్వే నంబర్ల ఆధారంగా పంటలను అప్లోడ్ చేశారు. ఈ విధానంలో ఏఈవోలు క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు రైతులు, రెవెన్యూ అధికారులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇలాంటి లోటుపాట్లను సరిచేసి కచ్చితత్వంతో పంటల నమోదు చేపట్టేందుకు తాజాగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. సంబంధిత సర్వే నంబర్ ప్రాంతానికి వెళ్లినప్పుడే వివరాలు కనిపించేలా తీర్చిదిద్దారు. ఏఈవోలు ఏదైనా సర్వే నంబర్ వద్దకు వెళ్లాల్సి వస్తే.. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆ లొకేషన్‌కు చేరుకోవచ్చు. శాటిలైట్ ద్వారా 300 మీటర్ల పరిధిలో ఉన్న సర్వే నంబర్ వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. ఇలా పక్కాగా పంటల నమోదు జరిగితే.. రాష్ట్రవ్యాప్తంగా ఏ పంటలు ఎంతమేర సాగు చేస్తున్నారనేది కచ్చితంగా లెక్కించవచ్చని అధికారులు చెప్తున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో ఏదైనా పథకానికి పంటల సాగుకు లింక్ పెట్టాల్సి వచ్చినా.. ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమాచారం ఉంటుందని అంటున్నారు. -
సైబర్ క్రైమ్ @ 5
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ప్రధానంగా ఐదు రకాల నేర పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది నమోదైన నేరాల్లో 16శాతం సైబర్ నేరాలే ఉన్నాయి. ఇటీవల తెలంగాణ పోలీస్ వార్షిక నివేదికలో ఈ వివరాలు పొందుపరించారు. జాతీయ స్థాయిలో నమోదవుతున్న సైబర్‌నేరాల్లో తెలంగాణలోనే 2.5 శాతం మేర ఉన్నాయి. ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సైబర్‌నేరగాళ్లవిగా గుర్తించిన మొత్తం 28,610 సిమ్‌కార్డులనుపోలీసులు బ్లాక్ చేశారు. సైబర్‌నేరగాళ్లకు సంబంధించిన 58446 క్రైం లింక్‌లను తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులతో పంచుకున్నారు. దీంతో ఒకే తరహా మోసాలు పలు రాష్ట్రాల్లో చేస్తున్న సైబర్‌నేరగాళ్ల గుర్తింపులో ఇది కీలకంగా మారింది. ఫెడ్ఎక్స్ కొరియర్ సైబర్‌నేరగాళ్లు ఫెడ్ఎక్స్ ఉద్యోగుల పేరిట, పోలీసులు, కస్టమ్స్ అధికారుల పేరిట ముందుగా ఫేక్ ఫోన్‌కాల్స్ చేస్తారు. మీ పేరిట వచ్చిన పార్సిల్లో డ్రగ్స్, ఇతర అనుమతి లేని పదార్థాలు ఉన్నాయని, మీపై కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బు ఇవ్వాలని అమాయకులను డిమాండ్ చేస్తారు. ఇలాంటి ఫేక్‌కాల్స్‌కు స్పందించకూడదు. మెసేజ్‌లలో ఉండే లింక్‌లపై కూడా క్లిక్ చేయవద్దు. అడ్వర్టయిజ్మెంట్ పోర్టల్ ఆన్లైన్లో పలు రకాల వస్తువుల సేల్స్, ఆఫర్ల పేరిట ఇచ్చే యాడ్స్‌లో మోసపూరితమైనవి ఉంటాయన్నది గ్రహించాలి. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లను ప్రస్తావించి సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలు చేస్తున్నారు. అధికారిక వెబ్సైట్లలో మాత్రమే వివరాలు తెలుసుకోవాలి. మోసపూరిత లింక్‌లపై క్లిక్ చేయవద్దు. బిజినెస్‌లో పెట్టుబడుల పేరిట తక్కువ పెట్టుబడి, అతి తక్కువ సమయంలోనే అత్యధిక లాభాలు అని ఊదరగొడుతున్నారంటే అది మోసపూరితమైనదే అని అనుమానించాలి. అసాధారణమైన హామీలు ఇస్తున్నారంటే వెంటనే వివరాలు తప్పక పరిశీలించాలి. ఎక్కువగా రియల్ఎస్టేట్లో పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ సంబంధిత పెట్టుబడులు, పిరమిడ్ స్కీంలు, మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు ఈ తరహావే. ఆన్లైన్ లోన్లు ఆర్థిక అవసరాలే బలహీనతగా ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే ఆన్లైన్లో రుణాలు ఇస్తామంటూ మోసం చేస్తారు. వ్యక్తిగత, బ్యాంకు వివరాలు తీసుకొని ఆర్థిక మోసాలు ఒక తరహావి అయితే, ఆన్లైన్ యాప్‌లలో రుణాలు ఇచ్చి తర్వాత అత్యధిక వడ్డీల కోసం వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఉంటున్నాయి. వీలైనంత వరకు ఆన్లైన్ రుణ యాప్‌ల జోలికి వెళ్లవద్దు. ఆర్బీఐ అనుమతి ఉందా లేదా అని తప్పకచూడాలి. క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాల సేకరణ బ్యాంకు అధికారులుగా చెబుతూ కేవైసీ అప్డేషన్, మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు బ్లాక్ అయ్యిందంటూ.. సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి మోసాలకు పాల్పడతారు. మన నుంచే బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు తెలుసుకొని ఆన్లైన్లో డబ్బు కొల్లగొడతారు. బ్యాంకు అధికారులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఖాతాదారులకు ఫోన్ చేసి వివరాలు అడగరనేది అందరూ గుర్తించాలి. -
సోషల్ మీడియా క్యాష్ పార్టీ..
సాక్షి, అమరావతి: యువత బలహీనతలు సోషల్ మీడియా సంస్థలకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రతీ విషయాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తూ యూజర్ల రక్షణ, హానికర కంటెంట్‌ను అరికట్టడంలో అవి అలక్ష్యం వహిస్తున్నాయి. సోషల్ మీడియా సంస్థలు తమకు వచ్చే ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికే పనిచేస్తున్నాయని హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ అధ్యయనం వెల్లడిస్తోంది. తాజా నివేదిక ప్రకారం..2022లో అమెరికాలోని 18 ఏళ్ల లోపు యూజర్ల కేటగిరీలో ఏకంగా రూ.91,541 కోట్లను సోషల్ మీడియా సంస్థలు ఆర్జించాయి. ఇందులో 12 ఏళ్లలోపు కేటగిరీలో ఏకంగా రూ.17,476 కోట్లు ప్రకటనల రాబడి ఉండటం విశేషం. స్నాప్‌చాట్, టిక్‌టాక్, యూట్యూబ్ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయం 30–40% యువ యూజర్ల వీక్షణల ద్వారా సోషల్ మీడియా సంస్థలకు సమకూరుతోంది. ఈ ట్రెండ్ ఏటా పెరుగుతూనే ఉంది. ఈ లెక్కన కొత్త సంవత్సరంలో వీటి ఆదాయంలో మరింత వృద్ధి కనిపించనుంది. స్నాప్‌చాట్‌కు అధిక రాబడి: హార్వర్డ్ వర్సిటీ బృందం అమెరికాలోని ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, ఎక్స్(ట్విట్టర్), యూట్యూబ్ వినియోగదారులపై పరిశోధన చేసింది. 12 ఏళ్ల లోపు యూజర్ల కేటగిరీలో ప్రకటనల ద్వారా యూట్యూబ్ రూ.7,983 కోట్లు, ఇన్‌స్ట్రాగామ్ రూ.6,676 కోట్లు, ఫేస్బుక్ రూ.1,140 కోట్లను రాబట్టినట్లు నివేదిక పేర్కొంది. 13–17 ఏళ్ల లోపు యూజర్ల వినియోగంలో టిక్‌టాక్ రూ.16,644 కోట్లు, యూట్యూబ్ రూ.9,986 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. మొత్తం ప్రకటనల ఆర్జనలో స్నాప్‌చాట్ 41%, టిక్‌టాక్ 35%, యూట్యూబ్ 27%, ఇన్‌స్ట్రాగామ్ 16% వాటా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోనూ గణనీయంగా వృద్ధి: భారత్‌లో సగటు వ్యక్తి సోషల్ మీడియా వినియోగం రోజుకు 192 నిమిషాలుగా ఉన్నట్లు పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటా (ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్) స్థూల ప్రకటనల ఆదాయం రూ.18,308 కోట్లుగా నమోదైంది. ఇది 2022 ఆర్థిక సంవ్సతరంతో పోలిస్తే 13% వృద్ధి చెందింది. త్వరలోనే మెటా యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించే అవకాశాన్ని అన్వేషిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రెడిసీర్ నివేదిక ప్రకారం దేశంలో డిజిటల్ ప్రకటనల విలువ 2020లో రూ.24,966 కోట్ల నుంచి 2030కి రూ.2.91 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయంగా ఇన్‌స్ట్రాగామ్ ప్రకటనల కోసం ప్రతి క్లిక్కి సగటున రూ.66.06 వసూలు చేస్తోంది. టెక్ కంపెనీల నుంచి ఎక్కువ పారదర్శకత ఉండాలన్నా..యువత మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావాలను అరికట్టాలన్నా ప్రభుత్వ జోక్యం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ నియంత్రణ ఉంటే చిన్నా రులు, యుక్త వయస్కులను లక్ష్యంగా చేసుకుని వచ్చే హాని కరమైన ప్రకటన పద్ధతులను తగ్గించవచ్చని వీరు అభిప్రా యపడుతున్నారు. భారత ప్రభుత్వం కూడా డిజిటల్, సోషల్ మీడియా నియంత్రణలపై డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేస్తోంది. -
‘కరెంట్’ వడ్డన ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించడానికి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇచ్చిన గడువు జనవరి 2తో ముగియనుంది. విద్యుత్ టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారం.. ఏటా నవంబర్ 30లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) అంచనాలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గడువు పెంచాలని డిస్కంలు విజ్ఞప్తి చేయగా.. ఈఆర్సీ జనవరి 2 వరకు గడువు ఇచ్చింది. మరోవైపు టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించేందుకు కొత్త ప్రభుత్వం నుంచి డిస్కంలు ఇంకా అనుమతి పొందలేదు. దీంతో జనవరి 30వరకు మరోసారి గడువు పొడిగించాలని ఈఆర్సీని కోరేందుకు డిస్కంల యాజమాన్యాలు సిద్ధమైనట్టు తెలిసింది. టారిఫ్ ప్రతిపాదనల్లో ఏం ఉంటాయంటే..? 2024–25లో రాష్ట్రంలో మొత్తం ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది? అందుకు ఎన్ని రూ.వేల కోట్ల ఆదాయం అవసరం? ప్రస్తుత విద్యుత్ చార్జీలనే 2024–25లో కొనసాగిస్తే ఎంత ఆదాయ లోటు ఏర్పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న సబ్సిడీ నిధులు ఎంత, ఇంకా ఎంత లోటు ఉంటుంది? ఆ లోటును పూడ్చుకోవడానికి 2024–25లో ఏయే కేటగిరీల వినియోగదారుల చార్జీలను ఎంతమేర పెంచాలన్న అంశాలు డిస్కంల ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ రాతపూర్వకంగా అభ్యంతరాలను సేకరించి, బహిరంగ విచారణ నిర్వహించి.. కొత్త టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. రూ.30వేల కోట్లకు చేరిన ఆర్థిక లోటు 2022–23 నాటికి రాష్ట్రంలో డిస్కంల నష్టాలు రూ.62,461 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సగటున ప్రతి నెలా రూ. 1,386 కోట్లు లెక్కన మరో రూ.11,088 కోట్ల నష్టాలు వచ్చినట్టు ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో డిస్కంల నష్టాలు రూ. 73,549 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.11,500 కోట్ల విద్యుత్ సబ్సిడీనే కొనసాగిస్తే.. 2024–25లో డిస్కంలకు కొత్తగా మరో రూ.16,632 కోట్ల నష్టాలు వస్తాయని అంచనా. నష్టాలను అధిగమించాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.31,632 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉండనుంది. లేకుంటే లోటును భర్తీ చేసుకోవడానికి విద్యుత్ చార్జీలు పెంచాల్సి వస్తుంది. కొత్త సర్కారు ముందు సవాళ్లు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యుత్ సంస్థల నిర్వహణ సవాలుగా మారింది. విద్యుత్ సబ్సిడీలను ఏటా రూ.30వేల కోట్లకు పెంచడం లేదా ఏ ఏడాదికా ఏడాది లోటు భర్తీ చేసుకోవడానికి చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికితోడు ప్రభుత్వం ఏర్పడిన ఏడాదే విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతిస్తే విమర్శలను, వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన ఉంది. దీంతో టారిఫ్ ప్రతిపాదనల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉచితంగా 200 యూనిట్లపైప్రతిపాదనలు సిద్ధం కాంగ్రెస్ సర్కారు హామీ మేరకు ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసే అంశాన్ని 2024–25 టారిఫ్ ప్రతిపాదనల్లో చేర్చడంపై డిస్కంలు కసరత్తు పూర్తిచేశాయి. 200యూనిట్లలోపు వినియోగించే వినియోగదారులు ఎందరు? వారికి ఉచిత విద్యుత్ కో సం అయ్యే వ్యయం ఎంత? అన్న గణాంకాలతో ప్రతి పాదనలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే.. ఈ పథకాన్ని 2024 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అమలు చేసేందుకు ఈఆర్సీ అనుమతిని కోరనున్నాయి. ఈ పథకాన్ని అమలు చేస్తే.. ప్రభుత్వం అదనంగా రూ.3,500 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసినట్టు అధికారులు చెప్తున్నారు. -
ఇక రౌడీలపై పాజిటివ్ షీట్లు
సాక్షి, హైదరాబాద్: నేర ప్రవృత్తిని వీడనాడే రౌడీలపై ఇక నుంచి పాజిటివ్ షీట్లు తెరుస్తామని, దీంతో వారు చేసే మంచి పనులు కూడా రౌడీ షీట్ రికార్డులో నమోదవుతాయని, మార్పు పూర్తిగా వస్తే రౌడీ షీట్‌ను తొలగిస్తామని రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుదీర్ బాబు తెలిపారు. మార్పు కోసం ప్రయత్నించే రౌడీలకు సమాజ సేవ చేసే అవకాశం కూడా కల్పిస్తామన్నారు. ఆదివారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో వందకు పైగా రౌడీ షీటర్లు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో నేరాలకు పాల్పడిన వారు వాటిని వీడనాడి ప్రస్తుత సమాజంతో నవజీవనాన్ని గడుపుతూ హుందాగా జీవించాలని సూచించారు. తొందరపాటులో నేరాలు చేసి నా సరే.. తప్పు చేయని వారి కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందన్నారు. డాక్టర్ బిడ్డలు డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్ల పిల్లలు పోలీసులు అవుతున్నారని.. రౌడీ షీటర్ల పిల్లలు కూడా తల్లిదండ్రులను అనుసరిస్తే నేరస్తులుగా తయారు అవుతారని పేర్కొన్నారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి ఇదో మంచి అవకాశమని, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇక నుంచి డిసెంబర్ 31 అంటే రౌడీ మార్పు దినోత్సవంగా గుర్తిండిపోవాలని పిలుపునిచ్చారు. రౌడీషీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూ కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకి ధారావత్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఎస్ఓటి డీసీపీ –1 గిరిధర్ రావుల, ఎస్ఓటి డీసీపీ–2 మురళీధర్ పాల్గొన్నారు. -
గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ / సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సును తీసుకురావాలని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకున్నారు. 2024లో సైతం అన్ని రకాల సామాజిక రుగ్మతలపై పోరాటాన్ని విజయవంతంగా కొనసాగించడంతో పాటు, సమానత్వం, శాంతియుత, సుస్థిర, ఆరోగ్యకర సమాజం కోసం కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. -
4న ఆటో డ్రైవర్ల మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’పథకంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా బస్స్టాండ్లు, బస్ డిపోల ముందు భిక్షాటన చేస్తామని ప్రకటించారు. అలాగే ఈ నెల 4న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ‘మహా ధర్నా’నిర్వహిస్తామని ప్రకటించారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఉపాధి దెబ్బతిన్న ఆటో కార్మికులకు ప్రభుత్వం ప్రతీనెల రూ.15 వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలు రూప్ సింగ్, జి.రాంబాబు యాదవ్, వేముల మారయ్య తెలంగాణభవన్‌లో ఆదివారం ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల 9వ తేదీ నుంచి అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది ఆటో, టాటా మ్యాజిక్, ఓలా, ఉబర్, సెవెన్ సీటర్ వాహన డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని వేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశం మేరకు డ్రైవర్ల స్థితిగతులను ఆధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు కార్మిక విభాగం నేతలు వెల్లడించారు. -
యాది మరువలేదు.. ‘సాక్షి’ కథనంపై స్పందించిన సీఎంఓ
సాక్షి, కామారెడ్డి: ‘రేవంతన్నా.. నన్ను యాది మరవకు’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌లో ఆదివారం ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. సీఎంఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో భిక్కనూరు లక్ష్మి ఇంటికి వెళ్లారు ఆమె కుటుంబ వివరాలు సేకరించారు. గతేడాది మార్చి 28న జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్‌రెడ్డి కూలిపోయిన ఇంట్లో ఉంటున్న భిక్క నూరు లక్ష్మి బాధలు ఆలకించారు. అధికారంలోకి రాగానే ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై సీఎంఓ స్పందించి, వివరాలు సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో వెంటనే రెవెన్యూ ఇన్స్పె క్టర్ పూల్‌సింగ్, ఏడీ నర్సింహారెడ్డి చిన్నమల్లా రెడ్డి గ్రామానికి వెళ్లి లక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కూలిపోగా మిగిలిన కొద్ది భాగంలో లక్ష్మి కుటుంబం నివసిస్తున్న విషయాన్ని నోట్ చేసుకున్నారు. ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఉంటే పొరుగునే ఉన్న తిమ్మక్‌పల్లిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తా మని అధికారులు చెప్పారు. అయితే కూలిపోయిన ఇంటి స్థలంలోనే కొత్త ఇల్లు నిర్మాణానికి సాయం అందించాలని లక్ష్మి కోరడంతో ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపిస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొ న్నారు. ఈ సందర్భంగా లక్ష్మితో పాటు ఆమె కు టుంబ సభ్యులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కోసం ప్రత్యేక పరికరాలు న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల ఆంక్షలు విధించారు. డ్రగ్స్‌ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదీ చదవండి: Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్! -
నేటి అర్ధరాత్రి వరకు మద్యం
హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 31వ తేదీ అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చూసి ఉంటాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇక బార్లు, క్లబ్బులు, పర్మిషన్తో జరిగే ఈవెంట్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నూతన సంవత్సరానికి వీడుకోలు పలికే డిసెంబర్ 31 వేడుకలను పురస్కరించుకొని పలు ఆంక్షలు, మార్గదర్శకాలను జారీచేశారు. పోలీసులు నేటి రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులకు సిద్దం కాగా.. తాగి వాహనాలు నడిపితే బండిని సీజ్ చేయటంతో పాటు రూ. 10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. -
New Year 2024: ఇట్స్ పార్టీ టైం! చిల్@ సేఫ్
‘హాయ్ ఏంటి నీ న్యూ ఇయర్ ప్లాన్?’ అంటూ పరస్పరం ప్రశ్నల పరంపర సిటీలో జోరందుకుంది. అప్పటి దాకా ఏ ప్లాన్ లేని వారిని కూడా ఆ ప్రశ్న నిద్రలేపుతోంది. ‘మా ఇంటికి దగ్గర్లోనే మా క్లబ్ ఉంది. ఏటా మా ఫ్యామిలీ అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం...ఈ ఇయర్ కూడా అంతే’ అంటూ సింపుల్‌గా తేల్చి చెప్పేసే నిజాం, సికింద్రాబాద్ క్లబ్‌ల వంటి క్లబ్‌ల సభ్యులతో పాటు... ‘ఎవ్విరి ఇయర్ డిఫరెంట్ స్టైల్ ట్రై చేస్తా. ఈ సారి ఓ రివర్ సైడ్ స్టే టెంట్స్‌లో ప్లాన్ చేశా’ అంటూ చెప్పే కార్పొరేట్ ఉద్యోగులకూ కొదవలేదు. వేడుకలకు తెరతీసే వేడుక... హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పార్టీ కల్చర్ విడదీయలేని భాగం. దాదాపు ఏడాది మొత్తం పారీ్టలకు సై అనే జోష్ వయసులకు అతీతంగా సిటిజనుల్లో కనపడుతుంది. అందునా... ఏడాది ప్రారంభంలో వచ్చే సందడి, పార్టీలకు పెద్దన్న లాంటి న్యూ ఇయర్ పార్టీని దాదాపుగా పార్టీ లవర్స్ ఎవరూ మిస్ కారు. ‘మన హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ కలిసి చేసుకునే మిగిలిన పారీ్టస్తో పోలిస్తే ఇది డిఫరెంట్. దాదాపుగా ప్రపంచం అంతా మనతో కలిసి చేసుకునే ఫెస్టివల్ ఇదొక్కటే’ అని నగరానికి చెందిన ఐటీ ఉద్యోగి హర్ష చెప్పారు. ఫ్యామిలీస్‌తో వెళితే అలా... ఫ్రెండ్స్‌తో అయితే లలలా... నగరంలో కుటుంబ సమేతంగా న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకునేవారు తమకు సభ్యత్వాలున్న క్లబ్స్, ఫార్మ్ హౌస్‌లు, లేదా మరికొన్ని కుటుంబాలతో ఎవరో ఒక ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అదే ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసేవారు ఎక్కువగా ఓపెన్ ఎయిర్ పార్టీలు, పబ్స్ వగైరాలను సెలక్ట్ చేసుకుంటుంటే, ప్రేమికులు మాత్రం రిసార్ట్స్, శివార్లలో జరిగే ఈవెంట్స్‌ని ఎంచుకుంటున్నారు. హనీమూన్తో పాటే... ఓ వైపు కార్తీక మాసంలో భారీ స్థాయిలో నగరంలో పెళ్లిళ్లు జరిగాయి. ప్రస్తుతం మాఘమాసం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో పలు కొత్త జంటలు న్యూ ఇయర్ వేడుకలకు పేరొందిన ప్లేస్‌లకు హనీమూన్స్ ప్లాన్ చేసుకున్నారు. ‘రీసెంట్గా మ్యారేజ్ అయింది. దాంతో అటు న్యూ ఇయర్ కూడా కలసి వచ్చేలా హనీమూన్ ప్లాన్ చేశాం. ప్రస్తుతం మేం ఇటలీలో ఉన్నాం. ఓ వారం ముందు నుంచే ఫుల్ జోష్ నడుస్తోంది ఇక్కడ’ అంటూ నగరానికి చెందిన సినీ నటి శ్రావ్య ఫోన్లో ‘సాక్షి’కి చెప్పారు. పెళ్లయిన వారు అనే కాకుండా చాలా మంది ఇప్పటికే నగరం నుంచి విభిన్న ప్రాంతాలకు, ఊర్లకు బయలుదేరి వెళ్లారు. డెస్టినేషన్ పారీ్టస్ చేసుకునే ఉద్దేశ్యంతో కొందరు స్వస్థలాల్లో తమ వారితో కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలని ఆశతో మరికొందరు ఉన్నారు. ఇక అందరూ స్వాగత వేడుకను సంతోషభరితంగా సురక్షితంగా జరపుకోవాలని కోరుకుందాం. శృతిమించొద్దు! సాక్షి, హైదరాబాద్: ‘డిసెంబర్ 31’ని జీరో ఇన్సిడెంట్..జీరో యాక్సిడెంట్ నైట్‌గా చేయడానికి పోలీసు విభాగం కసరత్తు పూర్తి చేసింది. న్యూ ఇయర్ పారీ్టల విషయంలో సభ్యత, భద్రత మరువద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వీటిని నిర్వహించుకోవాలని చెబుతున్నారు. సాధారణ సమయాల్లో హోటళ్లు, పబ్స్, క్లబ్స్‌ను రాత్రి 12 వరకే తెరిచి ఉంచాలి. అయితే న్యూ ఇయర్ పారీ్టల నేపథ్యంలో ఒక గంట అదనంగా అనుమతించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఒంటి గంట తర్వాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు. ఒంటి గంటకు మూతపడాలంటే యాజమాన్యాలు 12.30 గంటల నుంచే కస్టమర్లను సన్నద్ధం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి పారీ్టలకు సంబంధించి పోలీసుల మార్గదర్శకాలివీ. ► కార్యక్రమాలకు వచ్చే ఆరి్టస్టులు, డీజేలకూ నింధనలున్నాయి. వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. ► అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పారీ్టల నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. ► న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు రానివ్వొద్దు. ► యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పారీ్టలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. ► బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. ► నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడం, ఆడియో మిషన్ల సాయంతో శబ్ధ తీవ్రతనూ కొలుస్తారు. ► పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్‌రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పైనా కన్నేసి ఉంచుతారు. ► బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. ఈసారి మద్యంతో పాటు డ్రగ్స్ తీసుకున్న వారినీ గుర్తించడం కోసం ప్రత్యేక ఉపకరణాలు వాడుతున్నారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... కొత్త సంవత్సర వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించామన్నారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఎనీ్టఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించామన్నారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్, డబీర్‌పుర ఫ్లైఓవర్ల మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను ఆదివారం రాత్రి పూర్తిగా మూసి ఉంచుతారని తెలిపారు. వాహనదారులు ఈ విషయాలను గమనించాలని సూచించారు. కొత్తగా ఇంటికి వచ్చే అతిథిని ఎదురేగి ఆహా్వనించడానికి ఆ ఇంటికి సంబంధించిన వాళ్లు మాత్రమే రెడీ అవుతారు. కాని ఇప్పుడొచ్చే చుట్టం అందరిదీ. విశ్వవ్యాప్త అతిథి. ఏడాది పాటు వద్దన్నా మనతోనే ఉంటుంది. అందుకే విశ్వమంతా ఈ సంబరం..అందుకే విశ్వనగరంలోనూ అది తాకుతోంది అంబరం..అదే నూతన సంవత్సర సంరంభం. నిబంధనలు పాటించండి: సీపీ పరిమితులకు లోబడే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించవద్దని నగరవాసులకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త ఊహలు, కొత్త వ్యూహాలను అమలు చేయాలని భావిస్తుంటారు. అందుకు కొత్త ఏడాది ఒక నాందిలాగా భావిస్తుంటాం. ఈ సందర్భంగా వేడుకలాగా చేసుకోవడం ఒక ఆనవాయితీ అని ఇది మంచిదే తప్పేంకాదు. కాకపోతే పోలీసు శాఖ సూచించిన మార్గదర్శకాలు, ఆంక్షలకు లోబడి ఈ వేడుకలు జరుపుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా సరే ఈ పరిధి దాటితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. క్షణికావేశంలో తప్పులు చేసి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. పబ్స్, రెస్టారెంట్లు, ఈవెంట్ మేనేజర్లు నిరీ్ణత వేళలు, పరిమితులు పాటించాలన్నారు. -
Hyderabad: నేడు అర్ధరాత్రి వరకు మెట్రో
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడుపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వివిధ కారిడార్లలో ఆఖరి సర్విసు రాత్రి 12.15 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున ఒంటిగంటకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుంది. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనే నగరవాసులు తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరుకొనేందుకు వీలుగా సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మద్యం సేవించి మెట్రో రైళ్లలో, స్టేషన్లలో ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పోలీసులతో పాటు,మెట్రో సెక్యూరిటీ సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తారని చెప్పారు. మెట్రో రైళ్ల నిర్వహణకు ప్రయాణికులు సహకరించాలని ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సీఈవో కేవీబీ రెడ్డి కోరారు. -
ఓ నేపాలీ కుటుంబం దరఖాస్తు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ప్రతిష్టాత్మక అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమానికి స్థానికులే కాకుండా స్థానికేతరులు కూడా హాజరై పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ సంఘటనలు స్థానికులను, అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రానికి ఓ నేపాలీ కుటుంబం తమకు కూడా రూ.500లకు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాలు వర్తింపజేయాలంటూ దరఖాస్తులు అందజేశారు. నేపాల్‌కు చెందిన దుర్గా, బును దంపతులు జూబ్లీహిల్స్‌లో అద్దెకుంటూ స్థానికంగా హోటల్లో పని చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. మేం ఇక్కడే పుట్టి పెరిగామని, మాకు కూడా తెల్లరేషన్ కార్డు కూడా ఉంది, ఇటీవల ఎన్నికల్లో ఓటు కూడా వేశాం, ఆధార్ కార్డు సైతం పొంది ఉన్నామని అందుకే మాక్కూడా అభయహస్తం పథకాలు ఇవ్వాలంటూ తమ దరఖాస్తును అధికారులకు అందజేశారు. వీరిచ్చిన దరఖాస్తును సంబంధిత అధికారులు స్వీకరించి వారికి రశీదు అందించారు.