TS Special
-
Hyderabad: ఆ కేంద్రంలో దరఖాస్తుదారులే లేరు
హైదరాబాద్: అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలకు పలుచోట్ల ప్రజలు వెల్లువలా వస్తుంటే..మరికొన్ని చోట్ల దరఖాస్తులు దారులు లేక క్యూ లైన్లు వెలవెలబోతున్నాయి. శనివారం బంజరాహిల్స్రోడ్ నెం.12లోని బడాబాబులు నివసించే వేమిరెడ్డి ఎన్క్లేవ్ నివాసితుల కోసం ప్రజాపాలన కేంద్రాన్ని బంజారాహిల్స్ రోడ్ నెం.13లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఈ కాలనీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా రాకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసి అధికారులు వెళ్లిపోయారు. మరోవైపు జూబ్లీహిల్స్ రోడ్ నెం 72లోని ప్రశాసన్‌నగర్ కాలనీవాసుల కోసం శనివారం జూబ్లీహిల్స్ క్లబ్ ఎదురుగా ఉన్న వార్డు కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కాలనీ నుంచి కూడా ఒక్క దరఖాస్తు అందలేదు. బస్తీవాసులు ఉంటున్న ప్రాంతాల్లో ప్రజాపాలన కేంద్రాలు కిక్కిరిసిపోతుండగా కాలనీవాసుల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఈ లెక్కన చూస్తే కాలనీవాసులకు పెద్దగా సమస్యలు లేనట్లే. -
ఎంజీఎంలో అర్ధరాత్రి పవర్‌కట్.. రోగి మృతి
ఎంజీఎం: షార్ట్ సర్క్యూట్‌తో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారి ఆస్పత్రి చీకటిమయంగా మారడంతో రోగులతోపాటు వారివెంట ఉన్న బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఓ రోగి చనిపోయాడు. అయితే ఆ రోగి వ్యాధి తీవ్రతతోనే చనిపోయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. ఎంజీఎం ఆస్పత్రిలో ఏఎంసీ వార్డు వెనుకాల ఉన్న విద్యుత్ తీగలపై కోతులు చేసిన ఆగ డాలతో వైర్లు ఒక్కోటి పరస్పరం తాకాయి. షార్ట్ సర్క్యూట్ జరిగి వైర్లు కాలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రిలో సాధారణ వార్డుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. జనరేటర్ ద్వారా అత్యవసర వార్డుల(ఏఎంసీ, ఐఎంసీ, ఆర్ఐసీయూ, ఎస్ఎన్సీయూ, ఎంఓటీ, ఈఓటీ)కు విద్యుత్ సరఫరా జరిగేది. కానీ జనరేటర్‌తో లింక్ ఉన్న ఉన్న విద్యుత్‌వైర్లు కూడా కాలిపోవడంతో గంటపాటు అంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో మృతి: రోగి బంధువుల ఆరోపణ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ఏర్పడిన విద్యుత్ అంతరాయం కారణంగా ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్లు రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజేశ్వర్‌రావు పల్లె గ్రామానికి చెందిన భిక్షపతి ఆల్కహాల్ లివర్ సిరోసిస్ సమస్యతో శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు అతనికి ఆర్ఐసీయూలో వెంటిలెటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భిక్షపతికి అమర్చిన వెంటిలైటర్ నిలిచి శ్వాస తీసుకోవడం తీవ్రమైనట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. దీంతో చనిపోయాడని వాపోతున్నారు. ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన విషయం వాస్తవమేనని తెలిపారు. బాధితుడి మృతిచెందిన సమయంలో వెంటిలెటర్ బ్యాటరీ బ్యాకప్‌తో కొనసాగుతోందని పేర్కొన్నారు. భిక్షపతి మృతికి విద్యుత్ అంతరాయం కాదని, వ్యాధి తీవ్రతే కారణమని స్పష్టం చేశారు. -
కోవిడ్ అడ్వాన్స్‌లకు ఈపీఎఫ్ఓ చెక్
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కోవిడ్–19 అడ్వాన్స్ మంజూరును నిలిపివేసింది. ప్రస్తుతం కోవిడ్–19 పరిస్థితులు పూర్తిగా సద్దుమణగడం, ఉద్యోగావకాశాలు పెరిగిన నేపథ్యంలో కోవిడ్–19 కారణంగా భవిష్యనిధి నుంచి నగదు ఉపసంహరణ అవకాశాన్ని ఈపీఎఫ్ఓ రద్దు చేసింది. ఇకపై భవిష్యనిధి నుంచి సాధారణ కారణాలతో నగదు ఉపసంహరించుకునే అవకాశాన్ని మాత్రం కొనసాగిస్తోంది. కోవిడ్–19 ప్రభావంతో 2020 మార్చిలో లాక్డౌన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర కాలంలో పలుమార్లు వివిధ కంపెనీలు లాక్డౌన్ పాటించాల్సిరావడం, ఫలితంగా తయారీ రంగంతో పాటు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉపాధి కోల్పోవడంతో వారి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈపీఎఫ్ఓ కోవిడ్–19 అడ్వాన్స్‌ల విడుదలకు నిర్ణయించింది. ఇందులో భాగంగా 2020 ఏప్రిల్ నెల నుంచి ప్రారంభించిన ఈ ఉపసంహరణ ప్రక్రియతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.25 కోట్ల మంది ఖాతాదారులు రూ.50 కోట్ల మేర భవిష్య నిధిని ఉపసంహరించుకున్నారు. నిధి మెరుగుపడేలా.. దాదాపు మూడున్నరేళ్ల పాటు కోవిడ్–19 ఆడ్వాన్స్ విడుదలకు ఈపీఎఫ్ఓ అవకాశం కల్పించింది. ఈ కాలంలో ఖాతాదారులు దాదాపు మూడుసార్లు నిధి నుంచి అర్హత మేరకు ఉపసంహరించుకున్నారు. మూలవేతనం నుంచి దాదాపు 3 రెట్ల నగదును ఉపసంహరించుకునేలా వెసులుబాటు ఉండడంతో దాదాపు 2.25 కోట్ల మంది ఈమేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 7.25 కోట్ల మంది ఈపీఎఫ్ఓలో చందాదారులుగా ఉన్నారు. మారిన పరిస్థితుల దృష్ట్యా తాజాగా కోవిడ్–19 అడ్వాన్స్ ఉపసంహరణను ఈపీఎఫ్ఓ నిలిపివేసింది. భవిష్యత్ అవసరాల కోసం, పదవీ విరమణ పొందిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా చందాదారులు జీవించేందుకు వినియోగించుకోవాల్సిన ఈపీఎఫ్ నిధి నుంచి ఉపసంహరణ ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తే చివరి నాటికి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఉపసంహరణల ప్రక్రియకు కాస్త బ్రేక్ వేస్తూ సాధారణ పద్ధతిలో మాత్రమే నిధిని వెనక్కు తీసుకునే అవకాశాలను కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు ఉపసంహరణలతో తగ్గిన నిధిని తిరిగి మెరుగుపర్చే దిశగా ఈపీఎఫ్ఓ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. -
‘విద్యుత్’ డైరెక్టర్లకు ఉద్వాసన?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో సుదీర్ఘకాలం నుంచి డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారికి ఉద్వాసన పలికేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వారి స్థానంలో కొత్త డైరెక్టర్ల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు విద్యుత్ శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పిడీసీఎల్ తదితర సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు (సీఎండీ)గా ఐఏఎస్ అధికారులను నియమించింది. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేసింది. తదుపరి చర్యగా కొత్త డైరెక్టర్ల నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్సర్విస్, రిటైర్డ్ విద్యుత్ అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనుంది. 2012 మే 14న ఇంధన శాఖ జారీ చేసిన జీవో 18 ప్రకారం నియామకాలు చేపట్టనున్నారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోల ఇన్చార్జి సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసి.. ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్ లిస్టును రూపొందించి ప్రభుత్వానికి అందించనుంది. ఈ సెలెక్షన్ కమిటీలో ఆయా విద్యుత్ సంస్థల సీఎండీలు కన్వినర్లుగా, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వం నామినేట్ చేసే విద్యుత్ రంగ స్వతంత్ర నిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ సిఫార్సు చేసినవారి నుంచి డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది. అర్హతలు ఉంటేనే కొలువు గతంలో కనీస అర్హతలు లేనివారిని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్లుగా నియమించడంతోపాటు అడ్డగోలుగా పదవీ కాలాన్ని పొడిగించినట్టు ఆరోపణలున్నాయి. డైరెక్టర్‌గా ఎంపికయ్యే వారికి కనీసం చీఫ్ ఇంజనీర్‌గా మూడేళ్ల అనుభవం ఉండాల్సి ఉన్నా.. డీఈలుగా రిటైరైన వారిని సైతం నియమించి కీలక విభాగాలను అప్పగించినట్టు విమర్శలున్నాయి. దీంతో ఈసారి పక్కాగా నిబంధనలను అనుసరించి నియామకాలు జరపాలని నిర్ణయించి, పాత ఉత్తర్వులను వెలికితీశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం డైరెక్టర్ పదవికి ఎంపిక కావాలంటే.. సంబంధిత విద్యుత్ విభాగాల కార్యకలాపాల్లో కనీసం 15 ఏళ్ల అనుభవంతోపాటు మొత్తంగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీసం 25 ఏళ్లు పనిచేసి ఉండాలి. కనీసం మూడేళ్లపాటు చీఫ్ ఇంజనీర్/చీఫ్ జనరల్ మేనేజర్/ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేదా తత్సమాన హోదాల్లో పనిచేసి ఉండాలి. నోటిఫికేషన్ నాటికి వయసు 65 ఏళ్లకు మించరాదు. పదవీకాలం రెండేళ్లే.. నిబంధనల ప్రకారం డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలెక్షన్ కమిటీ సిఫార్సులతో ఏడాది చొప్పున రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించడానికి వీలుంది. ప్రస్తుతం ట్రాన్స్‌కోలో నలుగురు, జెన్కోలో ఏడుగురు, టీఎస్ఎస్పీడీసీఎల్లో 8 మంది, ఎన్పిడీసీఎల్లో 8 మంది కలిపి మొత్తం 27 మంది డైరెక్టర్లు కొనసాగుతున్నారు. వీరిలో కొందరు ఉమ్మడి రాష్ట్రం నుంచీ, మరికొందరు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచీ కొనసాగుతున్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు వీరే డైరెక్టర్లుగా కొనసాగుతారంటూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇలా సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. కొందరి వయసు 85ఏళ్లకు చేరినా డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం. ఇప్పుడు వీరంతా ఇంటిబాట పట్టనున్నారు. ట్రాన్స్‌కో కొత్త జేఎండీకి అందని బాధ్యతలు ఇటీవల ట్రాన్స్‌కో జేఎండీగా ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ ఝాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే సంస్థ సీఎండీ ముర్తుజా రిజ్వీ ఇంకా సందీప్‌కుమార్ ఝాకు అధికారికంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఆయన విద్యుత్ సౌధలోని రెండో అంతస్తులో ఖాళీగా కూర్చుంటున్నారు. గత ప్రభుత్వహయాంలో ట్రాన్స్‌కో జేఎండీగా ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన సి.శ్రీనివాసరావునే ఆ పోస్టులో కొనసాగిస్తున్నారు. శ్రీనివాసరావు పదవీకాలం వచ్చే ఏప్రిల్‌లో ముగియనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీలన్నీ శ్రీనివాసరావుకు తెలిసి ఉండటంతో.. ఆయనను పదవీకాలం ముగిసేవరకు కొనసాగించవచ్చనే అభిప్రాయం ఉంది. తర్వాత కూడా శ్రీనివాసరావును కొనసాగించాలని భావిస్తే.. కొత్త జేఎండీ సందీకుమార్ ఝాకు రెండో జేఎండీగా హెచ్ఆర్ వంటి విభాగాల బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. -
అప్పుల ఊబిలో విద్యుత్ రంగం
మణుగూరు రూరల్: విద్యుత్ సెక్టార్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టివే సిందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. విద్యుత్ కొనుగోలుకు రూ.30,406 కోట్లు, బకాయిల పేరుతో రూ.59,580 కోట్లు అప్పు చేసి లెక్కలు లేకుండా తారుమారు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను శనివారం భట్టి సందర్శించారు. జెన్కో అధికారులతో కలిసి వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి వివరాల గురించి అడిగి తెలుసుకు న్నారు. అనంతరం సీఈ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. బీటీపీఎస్‌తో వచ్చే సమస్యలు అధిగమించేందుకు.. ప్రస్తుతం బీటీపీఎస్‌తో అనేక సమస్యలు తలె త్తుతున్న క్రమంలో వాటిని అధిగమించేందుకు భవిష్యత్‌లో ఉన్నత మైన ప్రణాళికలు రూపొందిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. బీటీపీ ఎస్‌లో సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సి ఉండగా.. సబ్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వినియోగిస్తున్నా రని, దీంతో పర్యావర ణానికి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ సమస్య లను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. జమలాపురం ఆలయాన్ని, మామునూరు పేట చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, రేమిడిచర్లలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మిస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో జెన్కో సీఎండీ సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి కృష్ణభాస్కర్, పినపాక, వైరా ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్ పాల్గొన్నారు. -
గుండెపోటు ముప్పు పెంచిన కరోనా
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 18–45 మధ్య వయస్కుల గుండెపోటు మరణాలు సాధారణంగా ఏడాదికి లక్షకు నాలుగు ఉంటాయి. కానీ కరోనా కాలంలో ఈ సంఖ్య పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే కరోనా కాలంలో యువతీ యువకులు అత్యధికంగా ఆకస్మిక గుండెపోటుకు గురై చనిపోయారు. దీనిపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రీయ అధ్యయనం చేసింది. దీని ప్రకారం కరోనా రాని యువకులతో పోలిస్తే వైరస్ సోకిన వారు మొదటి వారంలో గుండెపోటుకు గురయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ ఉంది. అదే రెండో వారంలో రెండున్నర రెట్లు, 30 రోజుల తర్వాత రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తేలింది. ఆల్కహాల్, సిగరెట్, డ్రగ్స్, మితిమీరిన వ్యాయామం లాంటి కారణాలతో పాటు కరోనా సోకడం యువతకు ముప్పు పెంచిందని నిర్ధారించింది. ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు సంభవించలేదని అధ్యయనం తేల్చింది. పైగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 31.6% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు మరణించిన 729 యువకుల్లో 31.6 శాతం మంది అసలు వ్యాక్సిన్ తీసుకోలేదు. కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరినవారు 2.3 శాతం మంది ఉన్నారు. అందులో పొగతాగేవారు 26 శాతం ఉన్నారు. ఆల్కహాల్ తీసుకునేవారు 27 శాతం ఉన్నారు. చనిపోవడానికి 48 గంటలకు ముందు మితిమీరి ఆల్కహాలు తీసుకున్నవారు 7 శాతం ఉన్నారు. గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ తీసుకున్నవారు 1.7 శాతం ఉన్నారు. ఏ రకమైన వ్యాయామం చేయనివారు 81 శాతం, 48 గంటలకు ముందు మితిమీరిన శారీరక శ్రమ లేదా అధిక వ్యాయామం చేసినవారు 3.5 శాతం ఉన్నారు. సాధారణ వ్యాయామం చేసినవారు 16 శాతం ఉన్నారు. ఆకస్మికంగా మరణించిన ఆ యువకులకు చెందిన 10 శాతం మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. అంటే గుండెపోటుకు సంబంధించి కుటుంబ చరిత్ర ఉన్నవారు అన్నమాట. కుటుంబ సభ్యులంటే తల్లి, తండ్రి, తోబుట్టువులని ఐసీఎంఆర్ పేర్కొంది. కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన యువకుల్లో సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఆకస్మిక మరణాలు నాలుగు రెట్లు అధికంగా సంభవించాయి. 48 గంటలకు ముందు మితిమీరిన మద్యం తీసుకుంటే మరణాలు ఆరు రెట్లు ఎక్కువ. విపరీతమైన శారీరక శ్రమ చేయడం వల్ల మూడు రెట్లు రిస్క్ ఎక్కువగా ఉంది. డ్రగ్స్‌తో నాలుగు రెట్లు, పొగతాగడం వల్ల రెండు రెట్లు రిస్క్ ఎక్కువగా ఉంది. వ్యాయామం చేస్తున్నప్పుడు సాధారణంగా రెండు నిమిషాల్లోనే శ్వాస అదుపులోకి వస్తుంది. కానీ 10 నిమిషాల పాటు కొనసాగితే దాన్ని మితిమీరిన వ్యాయామం అంటారు. అటువంటి వారిలో మరణాలు సంభవించాయి. వ్యాక్సిన్ వల్ల గుండెపోట్లు తగ్గాయి... కోవిడ్ వ్యాక్సిన్ వల్ల యువకులు ఆకస్మిక మరణాలకు గురైనట్లు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐసీఎంఆర్ వీటిపైనా అధ్యయనం చేసింది. వార్తల్లో కథనాలను ఆధారంగా చేసుకొని పరిశోధన కొనసాగించింది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు సంభవించలేదని తేల్చింది. పైగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఆకస్మిక మరణాలపై అధ్యయనం దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 47 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల పరిధిలో ఐసీఎంఆర్ పరిశోధన చేసింది. 2021 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు కరోనా కాలంలో యువకుల ఆకస్మిక మరణాలపై అధ్యయనం చేసింది. ఆయా కాలేజీల పరిధిలో 18–45 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించిన 29,171 మంది యువకుల్లో 729 మందిపై ప్రత్యేకంగా పరిశో ధన చేసింది. వారి మరణాలకు కారణాలపై డేటా సేకరించి విశ్లేషించింది. నాలుగింట మూడొంతుల మంది మరణాల వివరాలను ప్రత్యక్ష సాక్షుల నుంచే తీసుకుంది. కరోనా సామాజికంగా కూడా దెబ్బతీసింది అలవాటు లేని శారీరక శ్రమ, వ్యాయామం అతిగా చేయడం వల్ల యువకుల్లో ఆకస్మిక మరణాలు సంభవించాయి. తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలిక జబ్బులు కూడా దోహదపడ్డాయి. కోవిడ్ అనేది సాధారణ జబ్బే కాదు. అది సామాజికంగా కూడా దెబ్బతీసింది. ఉద్యోగం కోల్పోవడం లాంటివి పరోక్షంగా ప్రభావం చూపించాయి. మరోవైపు మానసిక రుగ్మతలు 25 శాతం పెరిగాయి. వదంతులు, ప్రచారాలు కూడా ప్రజలపై మానసికంగా ప్రభావం చూపాయి. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
రేయ్ అని పిలిచే హక్కు వారికే ఉంటుంది
లక్డీకాపూల్ (హైదరాబాద్): చరిత్ర నిర్మాతలు ప్రజలేనని మాజీ ఎమ్మెల్యే, సైఫాబాద్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి ఈటల రాజేందర్ చెప్పారు. శనివారం సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో జరిగిన మెగా అల్యూమ్ని వేడుకలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఎన్ఆర్ఐలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ కాలేజీలో 1981 నుంచి 84 వరకు చదువుకున్నానని, కాలేజీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించారంటూ ఈటల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అరే అని పిలవగలిగే హక్కు స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్‌కు మాత్రమే ఉంటుందన్నారు. సైఫాబాద్ కాలేజీ ఇచ్చిన చైతన్యంతో పెరిగిన తనపై ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదన్నారు. తాను బయాలజీ విద్యార్థినే కానీ ఆర్థికవేత్తను కాదన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్థిక మంత్రిగా తన ప్రసంగంలో మొదటిపేరాలో.. ‘ఈ డబ్బు, బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజలు తమ రక్త మాంసాలతో కష్టపడ్డ చెమటతో కట్టిన డబ్బులు.. ఈ డబ్బుకు పేదల కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత ఉంద’ని చెప్పానన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కె. సురేందర్, రాజస్తాన్ హైకోర్టు, న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్, ఓయూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మణ్ నాయక్, పూర్వ విద్యార్థులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈ.వెంకట్ నర్సింహా రెడ్డి, రాచకొండ డీసీపీ ఇందిర ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
బలమైన జాతి నిర్మాణమే ఐ ఫోకస్ లక్ష్యం
ఉప్పల్ (హైదరాబాద్): బలమైన జాతి నిర్మాణమే ‘ఐ ఫోకస్’సంస్థ లక్ష్యమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ 18 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో సంస్థ సభ్యులకు ఆయన అభినందలు తెలిపారు. ఉప్పల్ భగాయత్ శిల్పారామంలో ‘జయప్రద–2023’పేరిట శనివారం నిర్వహించిన ఐ ఫోకస్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలోని లేని యువత భారత్‌కు ఉందని, 2047 నాటికి స్వతంత్ర భారత్ వందేళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు. అప్పటికి భారత్ ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఐ ఫోకస్’శివానంద మూర్తి కళలు కన్న భారత్‌ను చూస్తామని, ఆ యజ్ఞంలో ఇక్కడి సభ్యులంతా భాగస్వాములుగా ఉంటారన్నారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తున్న ఐ ఫోకస్ సంస్థ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 18 ఏళ్ల క్రితం పిడికెడు మందితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు 15 వేల మంది సభ్యులను సంపాదించుకుందన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఉద్యోగుల్లో సమర్థత, యువతలో చైతన్యం, నూరిపోయడం, ప్యావారుల్లో నైప్యుణాన్ని పెంపొందించడానికి ఐ ఫోకస్ కృషిచేస్తోందన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి వస్తుండగా, ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో కిషన్‌రెడ్డి, హరీశ్‌రావు నాగోల్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కి గమ్యానికి చేరుకున్నారు. -
త్వరలో మెగా డీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దని.. విద్యార్థులు లేరంటూ మూసివేసిన అన్ని బడులను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోండి..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని సూచించారు. శనివారం సచివాలయంలో విద్యాశాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పాఠశాల లేని గ్రామ పంచాయతీ ఉండొద్దని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంత మారుమూల గ్రామమైనా, తండా అయినా కూడా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాలని.. పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి రానీయొద్దని సూచించారు. విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాలలు మూతపడొద్దన్నారు. ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. ఆ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తిచేసి, రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని సూచించారు. సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులతో మన ఊరు–మన బడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందనే ఫిర్యాదుల నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. ఇక ఉపాధ్యాయుల పదోన్నతులు. బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని.. అవాంతరాలను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యా సంస్థల విద్యుత్ బిల్లుల కేటగిరీ మార్పునకు తీసుకోవాల్సిన చర్యలపైనా అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరీ కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కారి్మకులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాలను సూచించాలని కోరారు. ఉమ్మడి జిల్లాకో నైపుణ్య విశ్వవిద్యాలయంం రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలు సాధించి, ఉద్యోగాలు పొందగలిగేలా ఈ స్కిల్ యూనివర్సిటీలు ఉండాలని అధికారులకు సూచించారు. వాటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘకాల కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో గుజరాత్, హరియాణా, రాజస్థాన్, ఒడిశా, ఏపీ తదితర రాష్ట్రాల్లో ఉన్న స్కిల్ యూనివర్సిటీలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది జిల్లాల్లో ఈ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశంపై విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగిన ప్రతిపాదనలను సమరి్పంచాలని సీఎస్‌ను ఆదేశించారు. సీఎం సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్య కమిషనర్ దేవసేన, సీఎంవో అధికారులు శేషాద్రి, షానవాజ్ కాశీం తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలపై విచారణ! రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయింబర్స్మెంట్, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి అన్ని అంశాలపై పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సరైన మౌలిక వసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండానే ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని ప్రైవేటు వర్సిటీలు ఎలా చెప్తున్నాయో పరిశీలించాలన్నారు. ఇండ్ల ప్లాట్ల కింద రిజిస్ట్రేషన్లు అయిన భూములను, ధరణిలో వివాదంలో ఉన్న భూముల్లో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారని.. దీనివల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపైనా సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందిపడ్డారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల అమలు పరిశీలన రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు నడవడం సరికాదని విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్ల అమలు కోసం అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా ఉన్నత విద్యా మండలి ప్రక్షాళన అంశంపైనా సమీక్షలో చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచి్చనా.. తిరిగి వారిని సమావేశానికి ఆహా్వనించడం చర్చనీయాంశంగా మారింది. -
Telangana: ఇక డ్రగ్స్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: మత్తులో జోగుతూ వాహనాలు నడిపేవాళ్ల కట్టడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారు. కొత్త ఏడాది నుంచి ఇక తెల్లవారులూ ప్రధాన నగరాల్లో.. పట్టణాల్లో మందు బాబుల భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర పోలీస్ శాఖ. ఈ తరుణంలో.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రయోగాత్మకంగా డ్రగ్స్ డ్రైవ్ నిర్వహణకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో సిద్ధమైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల తరహాలోనే.. డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నిర్ణయించుకుంది. ఇందుకోసం కొత్త కిట్లను రప్పించుకుని పోలీస్ శాఖకు అప్పగించింది. ఇక శాంపిల్స్, ల్యాబ్ టెస్టులు పాత ముచ్చట. ఈ కొత్త కిట్ల ద్వారా మూడు రోజుల తర్వాత కూడా రక్త, మూత్ర పరీక్షల ద్వారా డ్రగ్స్ తీసుకున్న సంగతి బయపడుతుంది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ రాగానే అప్పటికప్పుడే డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే.. పాజిటివ్ రిపోర్టు రాగానే మరిన్ని పరీక్షల కోసం మూత్ర పరీక్షలు అధికారులు చేస్తారు. రెండింటిలోనూ పాజిటివ్ రిపోర్టు వస్తే సదరు వ్యక్తిని అదుపు తీసుకుంటారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం అరికట్టడమే లక్ష్యం నార్కోటిక్ బ్యూరో చర్యలు తీసుకుటోంది. ఇప్పటికే కొత్త పరికరాలు ఒక్కో కమిషనరేట్‌కు పాతిక దాకా పంపించారు. డ్రగ్ డిటేక్షన్ పరీక్షలపై పోలీసులకు ఇప్పటికే శిక్షణ పూర్తి అయిందిని అధికారులు తెలిపారు. ట్రై కమిషనరేట్ పరిధిలో జంక్షన్ల వద్ద డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ టెస్టులు ఇచ్చే ఫలితం ఆధారంగా.. వారాంతాల్లో రెగ్యులర్‌గా ఇలాంటి చెకింగ్లు నిర్వహించే యోచనలో ఉంది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. మరోవైపు రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టే విషయంలో తెలంగాణ కొత్త సర్కార్ సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించుకుంది. కఠిన చర్యలు తప్పవు నయా సాల్ వేడుకల్లో మత్తులో ఊగితే కఠిన చర్యలు తప్పవని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. పబ్బు, రిసార్ట్ మేనేజర్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాం. ఎవరైనా డ్రగ్స్ వాడినట్లయితే వారిపై చర్యలు ఉంటాయి. పబ్బులపైన పూర్తిస్థాయిలో నిఘా పెట్టాం. పబ్బుల్లో.. రిసార్టుల్లో డ్రగ్స్ దొరికితే వారి లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్తులో వారికి లైసెన్స్ రాకుండా చేస్తాం. కొన్ని రంగాల వారికి డ్రగ్స్ అవసరాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది. ఆయా ఫీల్డ్ వారిని కూడా హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ వాడొద్దు అని హెచ్చరించారాయన. అలాగే.. కొత్త సంవత్సర వేడుకలు సందర్భంగా నగరంలో ఆంక్షలు ఉంటాయని తెలిపారు. నగరంలో పలు బ్రిడ్జిలపై రాకపోకలు నిషేధిస్తామని తెలిపారాయన. రాత్రి 10 గంటల నుంచి ‘పీవీ ఎక్స్‌ప్రెస్ వే’ను మూసివేస్తాం. అయితే.. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు టికెట్‌ను చూసి పీవీ ఎక్స్‌ప్రెస్ మార్గంలో అనుమతిస్తాం. రాత్రి ఒంటిగంట వరకే వ్యాపారాలను అనుమతిస్తాం. ఒంటి గంట తర్వాత ఎట్టి పరిస్థితిలో వ్యాపారాలు అనుమతించబడవు.. మూసేయాల్సిందే. -
నా మనోవ్యధను అర్థం చేసుకున్నారు: మాజీ డీఎస్పీ నళిని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో.. తన డీఎస్పీ పదవికి దూరమై వార్తల్లోకి ఎక్కారు నళిని. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆమె పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యమకారులకు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందని.. ఆమె కోరుకుంటే అదే ఉద్యోగం కుదరకుంటే వేరే ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సీఎస్‌ను ఆదేశించారు కూడా. ఈ తరుణంలో.. శనివారం ఆమె రేవంత్‌రెడ్డిని కలిశారు. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనను ఆమె ఇదివరకే తిరస్కరించారు. తనకు ఉద్యోగంలో ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేవలం మర్యాదపూర్వక భేటీ జరిగిందంతే. గత సమీక్షలో తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అధికారులు సమాచారం అందించగా ఆమె సీఎం రేవంత్‌ను ఇవాళ కలిశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డిని కలువడం సంతోషంగా ఉంది. ఉద్యోగం ఇప్పుడు నాకు అవసరం లేదు. డబ్బు, భౌతిక ప్రపంచం నుండి బయట పడ్డాను. ఇప్పుడు నాది ఆధ్యాత్మిక మార్గం. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను.. సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వేదం , యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నా. సనాతన ధర్మం ప్రచారం చేస్తా. గతంలో నేను, సహఉద్యోగులు డిపార్ట్ మెంట్లో ఎదుర్కొన్న సమస్య పై సీఎంకు రిపోర్ట్ ఇచ్చాను. నాలాగా ఎవరు భాద పడవద్దన్నదే నా అభిప్రాయం. అప్పుడే నాకు బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయింది. అందుకే ఆధ్యాత్మిక బాట ఎంచుకున్నా. నా విషయంలో జరిగిన అన్ని పరిణామాలు సీఎం దృష్టికి తీసుకెళ్లా. ఇప్పుడు నా మనసుకు నచ్చినట్లు సేవ చేస్తున్నా. ఇన్నాళ్ల నా మనోవ్యధను గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి.. సీఎం రేవంత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారామె. -
మాతోనే కరెంట్ అని భారీగా అప్పులు: మంత్రి భట్టి
భద్రాద్రి కొత్తగూడెం: విద్యుత్ కొనుగోలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.59 వేల కోట్ల బకాలున్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన శనివారం భద్రాది థర్మల్ ప్రాజెక్టును సందర్శించారు. స్వయంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమతోనే కరెంట్ అని చెప్పిన గత ప్రభుత్వానికి చెందినవారు భారీగా అప్పలు చేశారని మండిపడ్డారు. సింగరేణికి రూ.19వేల కోట్లు బకాయి పడ్డారని తెలిపారు. అన్ని శాఖల్లో గత ప్రభుత్వం అప్పులు చేసి ఆందోళనకర పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టివేసిందని భట్టి విక్రమార్క అన్నారు. అందుకే వాస్తవ విషయాలు అసెంబ్లీలో శ్వేతపత్రం రూపంలో తాము చెప్పడానికి ప్రయత్నం చేశామని తెలిపారు. ఇదేవిధంగా అన్ని ప్రాజెక్టులను సందర్శించి వాటిపై కూడా సమగ్రమైన సమాచారం సేకరించి ప్రజల ముందుకు తీసకువస్తామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 81,514 కోట్ల అప్పులు చేసిందని అన్నారు. ప్రభుత్వం నుంచి డిస్కంలకు 28వేల కోట్ల బకాయి పడి ఉన్నామని తెలిపారు. తాము ఉంటేనే కరెంట్ సాధ్యం అని చెప్పిన గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు రూ. 50,000 కోట్ల అప్పు ఉందని అన్నారు. అప్పుల నుంచి విముక్తులై గాడిలో పెట్టడానికి రివ్యూ చేస్తూ ప్రయత్నం చేస్తున్నాని తెలిపారు.ఇవన్నీ గాలి లెక్కలు కాదని.. ఉన్నరికార్డ్స్ ప్రకారం మీకు అందిస్తున్నామని చెప్పారు.గత ప్రభుత్వం పవర్ సెక్టార్‌ను పీకలదాకా ముంచేసిందని మండిపడ్డారు.తమ ప్రభుత్వం ఈ అప్పుల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తోందని అన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకొని పర్యావరణానికి హని కలుగకుండా మేధావుల సూచనల మేరకు ముందుకు వెళ్తామని వెల్లడించారు. చదవండి: పథకాల అమలులో కాలయాపన చేసే ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత -
ప్రజా పాలన.. వాళ్లు అప్లై చేయక్కర్లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారెంటీల ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. అలాగే దరఖాస్తు విషయంలో ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఓ స్పష్టత ఇచ్చారాయన. ప్రజా పాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే.. ప్రజా పాలన ఫామ్‌లు బయట అమ్ముతుండడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇక.. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టంగా సూచించారు. -
HYD: 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోరవాణా, రహదారి, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తోపాటు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో మెరుగైన ప్రయాణం కోసం కొత్త బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. నేడు 80 బస్సులు ప్రారంభించామని, త్వరలో మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు. మే జూన్ కల్ల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. రూ. 400 కోట్లతో ఈ కొత్త బస్సులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రభుత్వం ఉచిత ప్రయాణం తీసుకొచ్చిందన్న సజ్జనార్.. ఈ 21 రోజుల్లో మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసి సిబ్బంది ఎంతో కష్టపడి పని చేస్తున్నారని.. వచ్చే రోజుల్లో ఓపికతో ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఇప్పటికీ ఆరు కోట్ల ఉచిత టికెట్లు విక్రయించినట్లు తెలదిపారు. కండక్టర్, డ్రైవర్లకు ప్రయాణికులు సహకరించాలని తెలిపారు. ఆర్టీసి సిబ్బంది, ఆర్టీసి బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగిందని, బస్సులపై ఓవర్ లోడ్ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని అధిగమించేoదుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పురుష ప్రయాణికుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి బస్సుల చార్జీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. LIVE : Minister Ponnam Prabhakar Inaugurates 80 New RTC Buses https://t.co/C2TMl4o6rp — Telangana Congress (@INCTelangana) December 30, 2023 రూ. 400 కోట్లతో 1,050 కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైనసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు న్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, జిల్లాల్లో 500 బస్సులను కూడా అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ విడతల వారీగా వచ్చే మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. లీజుకు ఆర్టీసీ భూములు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీఎస్ఆర్టీసీ భూములు లీజుకు ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు ఈ-టెండరు దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానించింది. కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్‌లో 2.83 ఎకరాలు, శామీర్‌పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు.. ఇలా మొత్తం 13.16 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనుంది. పూర్తి వివరాలకు https://www.tsrtc.telangana.gov.in/ వెబ్సైట్లో చూడాలని సూచించింది. టెండర్లకు వచ్చే ఏడాది జనవరి 18 చివరి తేదీగా పేర్కొంది. -
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో ఆన్ డ్యూటీ(OD)లను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లల ఓడీలను ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, తెలంగాణ రవాణాశాఖలో ముగ్గురు జేటీసీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్ అడ్మిన్‌గా బదిలీ అవ్వగా, హైదరాబాద్ జేటీసీ అడ్మిన్‌గా ఉన్న మమతా ప్రసాద్‌ను ఐటీ అండ్ వీఐజీకి బదిలీ అయ్యారు. హైదరాబాద్ జేటీసీ ఐటీ అండ్ వీఐజీగా ఉన్న రమేష్‌ను హైదరాబాద్ జేటీసీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
తెలంగాణ రవాణాశాఖలో ముగ్గురు జేటీసీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రవాణాశాఖలో ముగ్గురు జేటీసీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్ అడ్మిన్‌గా బదిలీ అవ్వగా, హైదరాబాద్ జేటీసీ అడ్మిన్‌గా ఉన్న మమతా ప్రసాద్‌ను ఐటీ అండ్ వీఐజీకి బదిలీ అయ్యారు.హైదరాబాద్ జేటీసీ ఐటీ అండ్ వీఐజీగా ఉన్న రమేష్‌ను హైదరాబాద్ జేటీసీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
తెల్లకాగితంపై సమస్య రాసిచ్చినా తీసుకోవాల్సిందే..!
హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం రెండోరోజు శుక్రవారం వివిధ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆశావహులు ఉదయం నుంచే కేంద్రాల వద్ద బారులు తీరారు. ఆరు గ్యారంటీల అమలు లక్ష్యంగా చేపట్టిన వార్డు సభలకు ఉదయం నుంచే అధిక సంఖ్యలో జనం విచ్చేసి దరఖాస్తులతో తంటాలు పడ్డారు. వంద కుటుంబాలకు ఒకరుచొప్పున ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో అన్ని డివిజన్లలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. విమర్శలు తలెత్తకుండా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ ధోత్రే పక్కా ప్రణాళికతో అన్ని కేంద్రాల వద్ద అందుబాటులో దరఖాస్తులను ఉంచారు. అలాగే తెల్లకాగితం మీద తమ సమస్య రాసిచ్చినా తీసుకోవాలని గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని కేంద్రాల వద్ద జనం బారులు తీరినా దరఖాస్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. సమీప నియోజకవర్గాల పరిధిలో దరఖాస్తు ఫారాలు కలర్లో ఉంటేనే తీసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో అప్పటికప్పుడు అటు జోనల్ కమిషనర్, డీఎంసీ స్పందించి సర్కిల్–17, 18 పరిధిలో ఎవరు కాగితంపై సమస్య రాసిచి్చనా తీసుకోవాలని సూచించారు. చాలా మంది రేషన్ కార్డు కోసం తెల్లకాగితంపై అర్జీలు పెట్టుకున్నారు. దరఖాస్తుల్లో ఎక్కువగా తెల్ల రేషన్ కార్డు కోసమే దరఖాస్తులు వెల్లువెత్తాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్ డివిజన్లలో మొత్తం 10 ప్రజాపాలన కేంద్రాలు ఏర్పాటు చేశారు. సందేహాలతో కుస్తీ పడ్డ జనం... ► ఫారంలో నాలుగు పేజీలు ఉండగా ఎక్కడా లబి్ధదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతా నెంబర్‌ను ప్రస్తావించలేదు. దీంతో చాలా మంది నగదు సహాయం ఎక్కడ జమ చేస్తారు. వాటి వివరాలు ఎక్కడ తీసుకుంటారు అనే అయోమయానికి గురయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే అధికారుల నుంచి జవాబు కరువైంది. ► గృహ జ్యోతి పథకంలో యజమాని పేరు విషయంలోనూ చాలా మంది అయోమయానికి గురయ్యారు. ►గ్యాస్ కనెక్షన్ల విషయానికి వస్తే ఒకటికంటే ఎక్కువ ఉన్నాయి, ఒక వేళ అన్ని కనెక్షన్ల నెంబర్లు వివరాలు ఇస్తే ఒకదానికి రాయితీ వచ్చి మిగిలిని వాటికి రాదేమోనన్న ఆందోళన మహిళల్లో కనిపించింది. ► ఒక ఇంట్లో రెండుకంటే ఎక్కువ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కొన్ని ఇళ్లల్లో అద్దెకుంటున్నవారూ ఉన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగానికి రాయితీ ఇందులో ఏ కనెక్షన్‌కు వర్తిస్తుంది అంటూ విధుల్లో ఉన్న ఉద్యోగులను అడగగా తమకేమీ తెలియదని కేవలం దరఖాస్తులు మాత్రమే తీసుకుంటున్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే జనం చాలా సమస్యలతో సతమతమవుతూ ఆ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కేంద్రాల వద్ద ప్రయతి్నంచినా ఏ ఒక్కరూ సరైన సమాధానం ఇవ్వలేకపోవడంతో ఏదోఒకటి ఇచి్చపోదామనే ధోరణిలోనే చాలా మంది కనిపించారు. మొత్తం 14015 దరఖాస్తులు జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధిలో శుక్రవారం వివిధ పథకాల లబ్ధి కోసం 8628 దరఖాస్తులు వచ్చాయి. గురు, శుక్రవారాల్లో కలిపి మొత్తం 14015 దరఖాస్తులు వచి్చనట్లు అధికారులు వెల్లడించారు. పింఛన్ కోసం వచ్చా ఇప్పటి వరకు దివ్యాంగుల పెన్షన్ కోసం నాలుగుసార్లు గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్నాను. మా బస్తీకి ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో అభ్యర్ధులు వచి్చనప్పుడు వారి కాళ్లు పట్టుకొని వేడుకున్నా. అయితే ఇప్పటి వరకు పింఛన్ మాత్రం మంజూరు కాలేదు. పింఛన్‌కు నేను పూర్తి అర్హుడిని అయినాసరే అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజాపాలన అంటూ ఈ సభలు ఏర్పాటు చేయడంతో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చాను. ఈ సారైనా మంజూరు అవుతుందనే ఆశతో ఉన్నాను. – బాలపీరు, దివ్యాంగుడు, అంబేడ్కర్‌నగర్ నేడు ప్రజాపాలన జరగనున్న కేంద్రాలివే... ► బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని సీఎంటీసీ బిల్డింగ్‌లో కమాన్ ఎన్బీటీ నగర్ బస్తీవాసులకు.. ► బంజారాహిల్స్ రోడ్ నెం. 13లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో వేమిరెడ్డి ఎన్క్లేవ్ కాలనీవాసులకు... ► బంజారాహిల్స్ రోడ్ నెం. 12 ఎన్బీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఎన్బీ నగర్ బస్తీవాసులకు. ► ప్రేమ్‌నగర్ కమ్యూనిటీ హాల్లో భోలానగర్ బస్తీవాసులకు... ► బంజారాహిల్స్ రోడ్ నెం. 7 మీసేవా బిల్డింగ్‌లో సంజయ్ నగర్ బస్తీవాసులకు... ► బంజారాహిల్స్ రోడ్ నెం. 10 ఇబ్రహీంనగర్ కమ్యూనిటీ హాల్లో నూర్‌నగర్ బస్తీవాసులకు. ► పంజగుట్ట ప్రతాప్‌నగర్ కమ్యూనిటీ హాల్లో దేవరకొండ బస్తీ వాసులకు... ► గౌరీ శంకర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో సింగాడికుంట బస్తీవాసులకు... ► జూబ్లీహిల్స్ క్లబ్ ఎదురుగా ఉన్న వార్డు కార్యాలయంలో ప్రశాసన్‌నగర్ కాలనీవాసులకు. ► భగత్‌సింగ్ నగర్ కమ్యూనిటీ హాల్లో జ్ఞానిజైల్‌సింగ్‌నగర్ బస్తీవాసులకు... ► జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్లో ఇందిరానగర్ బస్తీవాసులకు... ► గౌతంనగర్ కమ్యూనిటీ హాల్లో దుర్గా భవానీనగర్ బస్తీవాసులకు. -
బంజారహిల్స్‌లో భారీ దొంగతనం.. వజ్రాలు, బంగారం మాయం
హైదరాబాద్: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళ కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. వివరాలివీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 8లోని వైట్‌హౌస్ సెలెస్టియా అపార్ట్‌మెంట్స్‌లో నివసించే కొడాలి ధనలక్ష్మి అక్టోబర్ 16వ తేదీన మంగోలియా దేశం విజిట్చేసేందుకు బ్యాగులో మూడు వజ్రాలు పొదిగిన గాజులు, ఒక బంగారు గాజు, మరో వాచీని సర్దుకుంది. ఆ బ్యాగు తీసుకొని మంగోలియా యాత్రకు వెళ్లిది. అక్కడికి చేరిన తర్వాత బ్యాగు తెరిచి చూడగా అందులో ఉండాల్సిన రూ. 10 లక్షల వజ్రాభరణాలు, వాచ్ కనిపించలేదు. ఈ నెల 24వ తేదీన ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో చూడగా ఎక్కడా కనిపించలేదు. బ్యాంకు లాకర్లో కూడా దొరకలేదు. అయితే ఇంట్లో పని చేసే శ్రీలత అనే పనిమనిషి తాను మంగోలియా వెళ్లే సమయంలో బ్యాగును సర్దిందని ఆ సమయంలో వాటిని తస్కరించి ఉంటుందని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
వారంలోగా నిర్ణయం తీసుకోండి: టూరిజం ఎండీ సస్పెన్షన్ ఎత్తివేతపై హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ బోయినపల్లి మనోహ ర్రావు సస్పెన్షన్ ఎత్తివేతపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో ఆశాఖ ముఖ్యకార్యదర్శికి కోర్టుధిక్కారం కింద నోటీసులు జారీచేసి విచారణ జరపాల్సి ఉంటుందని హెచ్చ రించింది. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ మనోహర్‌రావును సస్పెండ్ చేస్తూ గతనెల 17న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఎండీతోపాటు ఓఎస్డీ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మనోహర్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారిక సమావేశంలో భాగంగా తిరుమ ల వెళ్లానని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఎన్నికల సస్పెన్షన్లు దీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరంలేదని, సస్పెన్షన్ ఎత్తి వేతపై నిర్ణయం తీసుకోవాలని గత విచారణ సందర్భంగా ఆదేశించింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మరోసారి విచా రణ చేపట్టింది. తమ ఆదేశాలపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాల రవాణా, విక్ర య ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ రవిగుప్తా పునరుద్ఘాటించారు. మత్తుపదార్థాలు అమ్మినా, కొన్నా, వాడినా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఎంతటివారున్నా ఈ విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల కట్టడి, సైబర్ నేరాల అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రానున్న ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. 2022తో పోలిస్తే 2023లో రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదు 8.97 శాతం పెరిగినట్టు వెల్లడించారు. సైబర్ నేరాల నమోదు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ స్టేట్ పోలీస్ వార్షిక నివేదిక 2023ను డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్, రోడ్డు భద్రత విభాగం అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ఐజీలు రమేశ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రానున్న ఏడాదిలో పోలీస్‌శాఖ భవిష్యత్ కార్యాచరణ అంశాలను డీజీపీ వివరించారు. డీజీపీ పేర్కొన్న కీలక అంశాలు: ♦ మత్తుపదార్థాల విషయంలో అత్యంత కఠిన వైఖరితో ఉంటాం. ఒక్క డ్రగ్స్ కేసు నమోదైనా పీడీయాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ♦ పబ్బులు, క్లబ్బులు, ఫాంహౌస్‌లు, బార్లలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా అత్యంత కఠినచర్యలు తప్పవు. ♦ తల్లిదండ్రులు, విద్యా సంస్థలు సైతం మత్తుపదార్థాల కట్టడిలో పోలీస్‌శాఖతో కలిసి రావాలి. విద్యా సంస్థల్లోనూ యాంటీ డ్రగ్స్వాడకంపై దృష్టి పెట్టాలి. ♦ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాం. సైబర్ నేరాలపై ఇప్పటివరకు 90 వేల ఫిర్యాదులు అందాయి. ♦ సైబర్‌నేరాలపై 14,271 ఎఫ్ఐఆర్ల నమోదుతో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాం. ♦ రోడ్డు ప్రమాదాలు తగ్గిడంలో ఈ ఏడాది సఫలం అయ్యాం. ♦ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ఎంతో మెరుగైంది. రాష్ట్రంలో ఇప్పుడు సరాసరి రెస్పాన్స్ టైం 7 నిమిషాలు. ♦ అతి త్వరలోనే 15,750 మంది వివిధ శాఖల్లోని కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రారంభిస్తాం. -
అటెన్షన్ ఉంటే..టెన్షన్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్ : పరీక్షల ఫోబియాతోనే ఇంటర్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సగానికి తగ్గుతోంది. హైటెన్షన్‌కు గురయ్యే విద్యార్థులు 36 శాతం ఉంటుండగా, పరీక్షల షెడ్యూల్ వచ్చాక టెన్షన్‌కు లోనయ్యేవారు 23 శాతం మంది ఉంటున్నారు. దీనికి సంబంధించి వైద్య, విద్యాశాఖలు రెండేళ్ల అధ్యయనం చేశాయి. మొదటి పరీక్ష కాస్త కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం ఫస్టియర్ పరీక్షలు 4.09 లక్షల మంది రాస్తున్నారు. సెకండియర్ పరీక్షలు 3.82 లక్షల మంది వరకూ రాస్తున్నారు. వీరిలో సగటున 40 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. దీంతో పరీక్షలు రాసే ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల టెన్షన్ దూరం చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రిపరేషన్‌కు ఇదే అదును రెండు నెలల ముందు నుంచే పరీక్షలకు సన్నద్ధమైతే విద్యార్థుల్లో టెన్షన్ ఉండదని ఇంటర్ అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలనుకుంటున్నారు. ముందుగా విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేస్తారు. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వడానికి నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై లెక్చరర్లు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులోనూ విద్యార్థి వెనుకబడి ఉన్న సబ్జెక్టులు, పాఠ్యాంశాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రిన్సిపల్స్‌కు ఇస్తారు. మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ఈ 60 రోజులూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో టెన్షన్ దూరం చేయడం తేలికని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పరీక్షల టైంటేబుల్‌ను బోర్డు విడుదల చేసింది. త్వరలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తీసుకునే చర్యలపైనా జిల్లా ఇంటర్ అధికారులు టైం టేబుల్ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సిలబస్ సకాలంలో పూర్తికాకపోవడం కూడా విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్‌కు ఓ కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతుందని అధ్యయన నివేదికల సారాంశం. ఫెయిల్ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకొని కొన్ని జిల్లాలపై ఇంటర్ అధికారులు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్‌లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు కనబరుస్తున్న జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ వంటి జిల్లాలున్నాయి. సెకండియర్‌లో మెదక్, నాగర్‌కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని ముఖ్యాంశాలు... ♦ ప్రతీ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు – 7 లక్షలకుపైగా ♦ ఫెయిల్ అవుతున్న వారు – 2.5 లక్షల మంది ♦ పరీక్షల ఫోబియా వెంటాడుతున్న విద్యార్థులు – 1.02 లక్షల మంది ♦ పరీక్ష షెడ్యూల్ ఇవ్వగానే భయపడే వారు – 28 వేల మంది ♦ సిలబస్‌పై టెన్షన్ పడుతున్న విద్యార్థులు – 51 వేల మంది మానసిక ధైర్యం నింపాలి ఈ 60 రోజులూ లెక్చ రర్లది కీలకపాత్ర. పరీక్షల భయం ఉన్న వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి. వెనుకబడ్డ సబ్జెక్టులపై రివిజన్ చేయించడం ఒక భాగమైతే, వీలైనంత వరకూ పరీక్ష తేలికగా ఉంటుందనే భావన ఏర్పడేలా చూడాలి. దీనివల్ల ఎగ్జామ్ ఫోబియా తగ్గుతుంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్, ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లిదండ్రులదీ కీలకపాత్రే పరీక్షల భయం వెంటాడే విద్యార్థి సైకాలజీని బట్టి అధ్యాపకులు వ్యవహ రించాలి. వారిని ప్రణాళిక బద్ధంగా చదివించే విధా నం అనుసరించాలి. సాధ్యమైనంత వరకూ పరీక్ష వెంటాడుతోందన్న భావనకు దూరం చేయాలి. చదివే ప్రతీ అంశం గుర్తుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు ర్యాంకులు, మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా జాగ్రత్త పడాలి. పరీక్షల పట్ల భయం అనిపిస్తే నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇప్పించాలి. – రావులపాటి సతీష్‌బాబు, మానసిక వైద్య నిపుణుడు స్టడీ అవర్స్ పెడుతున్నాం విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టేందుకు 60 రోజుల పాటు ప్రత్యేక కార్య క్రమాలు చేపడుతున్నాం. వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి, స్పెషల్ క్లాసులు నిర్వహించమని ఆదేశాలిచ్చాం. టెన్షన్ పడే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వమని ప్రిన్పిపల్స్కు చెప్పాం. అవసరమైతే టెలీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. – జయప్రదాబాయ్,ఇంటర్ పరీక్షల విభాగం అధికారిణి -
పాస్‌పోర్ట్‌కు అధిక స్లాట్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో డిమాండ్‌కు అనుగుణంగా పాస్‌పోర్ట్ దరఖాస్తులకు అధికంగా స్లాట్లు పెంచుతామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జె.స్నేహజ వెల్లడించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పాస్‌పోర్ట్‌ల జారీలో దేశవ్యాప్తంగా ఐదో స్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 7.85 లక్షలకుపైగా పాస్‌పోర్ట్‌లను జారీ చేసి గత రికార్డులను బద్దలు కొట్టినట్లు పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఏడాది పొడవునా శనివారం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించామని చెప్పారు. వరంగల్‌లో అధిక డిమాండ్ తెలంగాణలో ఉన్న 5 పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ప్రతి రోజూ సగటున 4 వేల పాస్‌పోర్ట్ దరఖాస్తులను తీసుకున్నామని స్నేహజ వివరించారు. పాస్‌పోర్టులకు వరంగల్‌లో అధిక డిమాండ్ ఉందన్నారు. సాధారణ పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సమయం పడుతుందంటూ కొందరు అత్యవసరం లేకపోయినా తత్కాల్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారని, దీనివల్ల అవసరమైనవారికి దొరకని పరిస్థితి నెలకొంటోందని చెప్పారు. ప్రస్తుతం సాధారణ స్లాట్లు సరాసరి 22 రోజులకు దొరుకుతుండగా, తత్కాల్‌కు ఐదు రోజులకు దొరుకుతుందన్నారు. బ్రోకర్లను నమ్ముకొని మోసపోవద్దు బ్రోకర్లను నమ్ముకొని మోసపోవద్దని స్నేహజ సూచించారు. పాస్‌పోర్ట్‌కు అవసరమైన పుట్టిన రోజు ధ్రువీకరణకు ఆధార్‌కార్డును గుర్తించబోమని ఆమె స్పష్టం చేశారు. పాన్, పదో తరగతి, పుట్టినరోజు ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి ఉండాలన్నారు. అదనపు డాక్యుమెంటేషన్ అవసరమయ్యే దరఖాస్తుదారులకు మెరుగైన సేవలందించేందుకు విచారణ అపాయింట్మెంట్ సిస్టమ్‌ను సవరించామన్నారు. అది ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిందన్నారు. ప్రతి సోమ, మంగళ, శుక్రవారాల్లో 250 ఆన్లైన్ అపాయింట్మెంట్లు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు. ప్రతి గురువారం ఆ మూడుగంటల్లోఅపాయింట్మెంట్ లేకుండా రావొచ్చు దరఖాస్తుదారులు ప్రతి గురువారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 మధ్య అపాయింట్మెంట్ లేకుండా వాక్–ఇన్ పద్ధతిలో రావొచ్చని స్నేహజ సూచించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొన్ని పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో నియామకాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామ ఈ ఏడాది జూన్‌లో సికింద్రాబాద్‌లోని ఆర్పీఓ ప్రాంగణంలో ప్రారంభించిన క్యాంపు మోడ్ సర్వీస్ శుక్రవారంతో ముగిసిందనీ, మళ్లీ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సహకారంతో హజ్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశామని ఆమె వివరించారు. గత పది రోజుల్లో 400కుపైగా దరఖాస్తుల ప్రక్రియ చేపట్టామని స్నేహజ చెప్పారు. -
న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే!
లక్డీకాపూల్: వేలాది మంది అభ్యర్ధులకు అన్యాయం జరిగి, వారిలో కొందరి చావుకి కారణమైన పోలీస్ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో మూకుమ్మడి ఆత్మహత్యలే తమకు శరణ్యమని పోలీసు ఉద్యోగాల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లోని ‘ప్రజావాణి’లో నష్టపోయిన ఎస్.ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా పోరాట సమితి ప్రతినిధి ఆకాష్ మాట్లాడుతూ.. తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలను ఇవ్వాలని, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు. యాసం ప్రదీప్ మాట్లాడుతూ పోలీస్ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేసి.. ప్రిలిమ్స్ నుంచి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అదనంగా 2 సంవత్సరాల వయోపరిమితిని పెంచి ఇప్పటివరకు మిగిలి ఉన్న పోస్టులన్నీ కలిపి ఒక మెగా రిక్రూట్మెంట్ని విడుదల చేయాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగిపాలిటెక్నిక్ కాలేజీలకే బదిలీ చేయాలి రేషనలైజేషన్ చేసి దూర ప్రాంతాలకు బదలీ చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను య«థావిధిగా పాత పాలిటెక్నికల్ కళాశాలలకే బదిలి చేయాలని తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నికల్ అండ్ కమిషనరేట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మారెపల్లి సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. జీవో నెం.317తో స్ధానికతను కోల్పోయి నష్టపోయిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని స్ధానికత సాధన సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి. శ్రీనివాసరావు, కె. శ్రీశైలం డిమాండ్ చేశారు. మల్లారెడ్డి నుంచి మా భూములు మాకిప్పించండి.. సూరారంలోని రూ.190 కోట్ల విలువైన సర్వే నెం.95, 96, 97, 98లకు చెందిన 9.1 గుంట పట్టా భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని.. అదేమంటే తమపై పోలీసు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కుద్బుల్లాపూర్‌కి చెందిన నర్సిమ్మ తనయుడు కృష్ణ ఆవేదన చెందారు. సర్వే నెం.107లోని ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేసి తమ బినామీలు మహేంద్రరెడ్డి, సుధీర్‌రెడ్డి, ప్రవీణ్ కుమార్, చెన్నారెడ్డిల పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం రేవంతన్న న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పేద సినీ కళాకారులను పట్టించుకోవాలి తెలంగాణ సినీ కార్మికుల కష్టాలను ఆలకించి.. పేద కళాకారులను పట్టించుకోవాలని నటుడు నాని వెంకట్ జైరాజ్ కోరారు. ధరణి తప్పిదాల వల్ల తమ ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయలేకపోతున్నానని రంగారెడ్డి జిల్లాకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. ముౖఫై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ పట్టా భూమికి అధికారులు సర్వే సర్టిఫైడ్ కాపీ ఇవ్వడం లేదని ములుగు జిల్లా నల్లగుంటకు చెందిన పబ్బ వెంకటరమణయ్య వాపోయారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నోడల్ అధికారి హరిచందన తెలిపారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను తెలుసుకుని, దరఖాస్తులు స్వీకరించారు. 12 కౌంటర్ల ద్వారా 24 మంది అధికారులు అర్జీదారుల నుండి 2,445 దరఖాస్తులు స్వీకరించారు. -
రోడ్డెక్కనున్న కొత్త బస్సులు
సాక్షి,హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రవాణా, రహదారి, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తోపాటు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు హాజరవుతారు. రూ. 400 కోట్లతో 1,050 కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైనసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు న్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, జిల్లాల్లో 500 బస్సులను కూడా అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ విడతల వారీగా వచ్చే మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. -
ప్రాణహిత–చేవెళ్ల పునరుద్ధరణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రూ.38 వేల కోట్లతో 16.40 లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పారు. రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి కాల్వలు కూడా తవ్వించామని, అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు మార్చిందని విమర్శించారు. ఎన్ని కల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించడంలో విఫల మైందని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని శుక్రవారం ఐదుగురు మంత్రుల బృందం పరిశీలించింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్ బాబు, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వీరిలో ఉన్నారు. కాగా ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మంత్రులు మాట్లాడారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచే ఎన్నో అనుమానాలు ఉన్నాయని, తాము చెబుతూ వచ్చిన విషయాలే ఇప్పుడు నిజమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు పేరొస్తుందనే: కోమటిరెడ్డి ‘ప్రాణహిత పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందనే సగం వరకు పనులు జరిగిన ప్రాజెక్టును వదిలేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని చేపట్టింది. తుమ్మిడిహెట్టి వద్ద 3 వేల ఎకరాలు సేకరించి ఉంటే గ్రావిటీతో నీళ్లు వచ్చేవి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ చర్యలన్నీ తుగ్లక్ చర్యల్లా ఉన్నాయి. కొండపోచమ్మ ఎప్పుడూ నిండుగా ఉంటుంది. కానీ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తప్ప ఇతర పొలాలకు నీరు పోదు. ఇక ఈ ప్రాజెక్టు పంపు హౌస్‌లలో నాణ్యత లేని మోటార్లు బిగించారు. ఇవన్నీ అసెంబుల్డ్ మోటార్లు. మోటార్లకు రూ.1,000 కోట్లకు బదులు రూ.4 వేల కోట్లు చెల్లించారు. నల్లగొండ జిల్లాకు సాగు నీరందించే ప్రాజెక్టులను చిన్నచూపు చూశారు..’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలారు.. పొంగులేటి: ‘కేసీఆర్ ప్రతిచోటా తన మార్కు ఉండాలనే తాపత్రయంతో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. కాళేశ్వరం విషయంలో మొదటి నుంచి హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడం వల్లే ఇంత పెద్ద నష్టం జరిగింది. డయా ఫ్రం వాల్ ఆర్సీసీతో కట్టి ఉంటే ప్రమాదం జరిగేదా? సీకెండ్ ఫైల్ ఫెయిల్ అయినందుకే మేడిగడ్డ పియర్స్ రోజురోజుకూ కుంగిపోయాయి. ప్రొటెక్షన్ పనులు ఒక్క వరదకే పోయాయంటే ఎంత నాసిరకంగా చేశారో అర్థమవుతోంది. ప్రమాదం ఉందని 2022లోనే ఈఈ పై అధికారులకు లేఖ రాసినా చర్యలు తీసుకోలేదు. కుంగుబాటు కొన్ని పిల్లర్లతో ఆగుతుందని నేను అనుకోవడం లేదు...’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజలకు వివరించేందుకే..: శ్రీధర్‌బాబు ‘కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం, జరిగిన నష్టం ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర సంపద సక్రమంగా వినియోగించాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. గోదావరి జలాలతో భూపాలపల్లి, పెద్దపల్లికి సాగునీరు, తాగునీరు అందించాలని, ప్రత్యేక ప్రణాళిక ద్వారా మంథని ముంపు ప్రాంతాలను ఆదుకోవాలని సహచర మంత్రులను కోరుతున్నా..’ అని శ్రీధర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వ మానస పుత్రిక: పొన్నం ‘కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం మానస పుత్రిక. దీని కోసం ఎంత విద్యుత్ వాడారో చెప్పాలి. రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది..’ అని పొన్నం ప్రభాకర్ అన్నారు. అనంతరం మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రదేశాన్ని పరిశీలించింది. అన్నారం బ్యారేజీని సందర్శన తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లింది. ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరే, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. రూ. లక్ష కోట్లకు లక్ష ఎకరాల ఆయకట్టా?: ఉత్తమ్ ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.95,000 కోట్లు ఖర్చు చేసినట్లు గత పాలకులు చెబుతున్నారు. కానీ దానివల్ల ఏర్పడిన కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలే. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు. అద్భుతం అన్నారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ కావడం దురదృష్టకరం. బ్యారేజీ కుంగిపోయినా ఆనాటి ముఖ్యమంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ నోరు మెదపలేదు. మేడిగడ్డ ఒక్కటే కాదు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా నష్టం జరిగింది. వాటిని పరిశీలించి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ చేపడతాం..’అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.