TS Special
-
HYD: కరోనా కొత్త వేరియంట్ అలర్ట్.. మళ్లీ పెరిగిన కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పట్ల జాగ్రత్తలు పాటించడం మంచింది. రాష్ట్రంలో కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం తెలంగాణలో మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14కు చేరుకుంది. కాగా, కొత్తగా నమోదైన కేసులన్నీ హైదరాబాద్‌లోనే నమోదు కావడం గమనార్హం. దీంతో, ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు భారత్‌లోనూ నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు జేఎన్-1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారినపడినట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్‌పై దృష్టిసారించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం సజావుగా సాగాలని ఆయన కోరారు. కోవిడ్ ఇంకా ముగియలేదని, కాబట్టి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దని కోరారు.. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్‌లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు. -
వారం రోజులుగా ఇంట్లో శవం పెట్టుకొని...
హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్లో చనిపోయిన మహిళ మృతదేహం వారం రోజులుగా ఇంట్లోనే ఉంది. కుటుంబసభ్యులు మృతదేహంకి అంత్యక్రియలు చేయలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో మహిళ (40) చనిపోయి వారం రోజులు అయింది. కుళ్లిపోయి పురుగులు పట్టినా.. అదే ఇంట్లో కుటుంబీకులు సాధారణ జీవనం గడుపుతున్నారు. ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
బైక్ ట్యాక్సీలకు ‘మహాలక్ష్మి’ గండం
హైదరాబాద్: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచి్చంది’ అన్నట్లుంది తెలంగాణలో బైక్ ట్యాక్సీల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటంతో.. దీని ప్రభావం ప్రత్యక్షంగా ఆటోలు, క్యాబ్‌లు, బైక్ ట్యాక్సీలపై పడుతోంది. మహిళలు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం చాలా వరకు తగ్గించారు. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన వారం రోజుల్లోనే గ్రేటర్లో 5 లక్షలకు పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర బైక్ ట్యాక్సీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాయి. బైక్ ట్యాక్సీల బుకింగ్‌లు తగ్గిపోవడంతో కస్టమర్లను ఆకర్షించేందుకు బైక్ ట్యాక్సీ కంపెనీలు ధరలను తగ్గించాయి. దీంతో బైక్ క్యాపె్టన్ల ఆదాయం సగానికి పైగా తగ్గిపోయింది. తగ్గిన ఆదాయం.. ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి అగ్రిగేటర్లు బైక్ ట్యాక్సీ సేవలను అందిస్తున్నాయి. సాధారణంగా ఈ బైక్ ట్యాక్సీలను నిరుద్యోగులు, విద్యార్థులు పార్ట్‌టైం జాబ్‌గా నడుపుతుంటారు. ప్రస్తుతం గ్రేటర్లో సుమారు 70 వేల మంది బైక్ ట్యాక్సీ క్యాపె్టన్లు ఉండగా.. వీరిలో మహిళా బైక్ క్యాపె్టన్లు 300 నుంచి 400 మంది ఉంటారు. వీరికి కిలోమీటర్ల చొప్పున ఆయా కంపెనీలు బైక్ క్యాపె్టన్లకు కమీషన్ ఇస్తుంటాయి. అయితే మహాలక్ష్మి పథకం అమలుకు ముందు ఒక్కో క్యాపె్టన్కు రోజుకు 20కి పైగా బుకింగ్‌లు వస్తుండేవి. పెట్రోల్ ఖర్చులు పోను రోజుకు రూ.1,000 పైగానే ఆదాయం సమకూరేది. అయితే ఉచిత బస్సు ప్రయాణం అమలుల్లోకి వచ్చాక బుకింగ్‌లు చాలా వరకు తగ్గిపోయాయని ఓలా బైక్ క్యాపె్టన్ శ్రీను తెలిపారు. నష్టాలను పూడ్చుకునేందుకు అగ్రిగేటర్ సంస్థలు కూడా బైక్ క్యాప్టెన్ల కమీషన్లను సగానికి పైగా తగ్గించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ధరలను తగ్గించాయన్నారు. గతంలో 15–25 కిలో మీటర్ల బుకింగ్‌కు కనిష్టంగా రూ.150–180 వరకు ఛార్జీ వచ్చేదని, కానీ ఇప్పుడు రూ.60–80కి మించి రావడం లేదన్నాడు. మార్గదర్శకాలు రూపొందించాలి.. సాధారణంగా వాహన అగ్రిగేటర్లే ధరలను నిర్ణయిస్తుంటారు. కంపెనీల వద్ద కస్టమర్ల డేటా నిక్షిప్తమై ఉండటంతో ఆల్గరిథం సాంకేతికతతో కస్టమర్ల డేటా, రోజు, డిమాండ్‌ను బట్టి సంస్థలు ధరలను మారుస్తుంటాయని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సల్లావుద్దిన్ తెలిపారు. అందుకే ఆటో, క్యాబ్, బైక్ అగ్రిగేటర్లు ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని, ఇందుకోసం విధానాలు, మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. ఆటోలు, క్యాబ్‌ల తరహాలోనే బైక్ ట్యాక్సీలను కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలని కోరారు. -
డిసెంబర్ 31 సెలబ్రేషన్స్.. హద్దు మీరొద్దు
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల బందోబస్తుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. త్రీస్టార్, అంతకు మించి స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, బార్లు న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహణకు ముందస్తు పోలీసు అనుమతులు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకే కార్యక్రమాలు నిర్వహించాలని, సమయం దాటితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనలివీ.. ►ప్రతి ఈవెంట్ నిర్వహణ, భద్రత, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలి. వేదిక ప్రవేశం, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ ప్లేస్ వద్ద సీసీటీవీ కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఈవెంట్లో అశ్లీల నృత్యాలు, సంజ్ఙలు ఇ తరత్రా చర్యలకు పాల్పడకూడదు. 45 డెసిబుల్స్‌కు మించి శబ్దాలు చేయకూడదు. ఈవెంట్లోకి ఎలాంటి తుపాకులు, ఆయుధాలను అనుమతించకూడదు. టపాసులు పేల్చకూడదు. సామర్థ్యానికి మించి పాస్‌లు, టికెట్లు, కూపన్లు జారీ చేయకూడదు. ►జంటల కోసం నిర్వహించే ఈవెంట్లలో మైనర్లను అనుమతించకూడదు. ఈవెంట్లలో ఎలాంటి నార్కోటిక్ డ్రగ్స్ వినియోగించకూడదు. నియంత్రించడంలో విఫలమైన యాజమాన్యంపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయి. ఎక్సైజ్ విభాగం అనుమతించని సమయానికి మించి మద్యాన్ని విక్రయించకూడదు. మద్యం మత్తులో ఉన్న కస్టమర్లు సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరుకునేందుకు ఈవెంట్ నిర్వాహకులు డ్రైవర్లు, క్యాబ్‌లను ఏర్పాటు చేయాలి. డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన వాహనదారుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు గరిష్టంగా 6 నెలల పాటు జైలు శిక్ష ఉంటుంది. -
స్పీడ్ పెంచిన సీఎం రేవంత్.. ఇక GHMC, HMDA వంతు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్షలు నిర్వహించారు. ఇక, తాజాగా కొత్త ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏపై సమీక్ష చేపట్టనుంది. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 25వ తేదీ తరువాత జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏ పరిధిలో రిపోర్టు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్, పెండింగ్ పనుల లిస్ట్‌పై బల్దియా కసరత్తు మొదలు పెట్టింది. ఇక, హెచ్ఎండీఏ పరిధిలో ఓఆర్ఆర్ టెండర్లు, భూముల వేలంతో పాటు పెండింగ్ పనుల లిస్ట్‌ను అధికారులు సిద్దం చేస్తున్నారు. మరోవైపు, ఆదాయ మార్గాల్లో భాగంగా రెండింటిపై ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి వద్దే మున్సిపల్ శాఖ ఉన్న విషయం తెలిసిందే. -
కరోనా వేరియంట్ భయం.. గాంధీ ఆసుపత్రి రాజారాం కీలక వ్యాఖ్యలు
కరోనా మళ్లీ కలవరపెడుతోంది. రూపం మార్చుకుని మళ్లీ వచ్చేస్తోంది. కరోనా కొత్త వేరియంట్ JN.1 విజృభిస్తోంది. రెండురోజులుగా కొత్త వేరియంట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏకంగా మళ్లీ కరోనా మరణాలను గుర్తుచేస్తోంది. అసలు జెఎన్–వన్ వెరియంట్ ఎంటీ? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? కొత్త వెరియంట్ ఎంత వరకు ప్రమాదకరం.. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ బారినపడి ఆరుగురు మృతి చెందారు. ఈ తాజా పరిణామాలు ప్రజలను మళ్లీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. రెండేళ్ల క్రితం దేశంలో ఒమిక్రాన్ వెరియంట్ వేగంగా విస్తరించింది. చాలా మందిని ఇబ్బందిని పెట్టింది. అనారోగ్యానికి గురిచేసి అవస్థల పాలు చేసింది. తాజాగా ఈ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన సబ్ వెరియంటే JN-1. ఒమిక్రాన్ రూపం మార్చుకుని జెఎన్-1 గా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులను ధరించాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు.. కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రత్యేకంగా కరోనా వార్డ్‌లో బెడ్స్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇక, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల, సంక్రాంతి పండుగ సందర్భంలో కొత్త వేరియంట్ కట్టడి సవాల్‌గా మారనుంది. సో.. బీ కేర్ ఫుల్.. బీ అలెర్ట్. ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా: జేఎన్.1 వేరియెంట్ లక్షణాలేంటి? -
TS: ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్లతో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సర్కార్ హామీతో జూడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, సమ్మె నిర్ణయంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని జూడా ప్రతినిధులు మీడియాకు తెలిపారు. టైం టు టైం స్టైఫండ్ రిలీజ్‌తో పాటు పలు డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని జూనియర్ డాక్టర్లు భావించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ వాళ్లతో చర్చించారు. డిమాండ్లకు ఆయన సానుకూలంగా స్పందించడంతో జూడాలు వెనక్కి తగ్గారు. స్టైఫండ్ కోసం గ్రీన్‌ఛానెల్ ఏర్పాటుతోపాటు ప్రతి నెలా 15వ తేదీ లోపు స్టైఫండ్ విడుదలయ్యేలా చూస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా జూడాలకు హామీ ఇచ్చారు. అలాగే హాస్టల్స్ వసతులతో పాటు కొత్త హాస్టల్స్ ఏర్పాటును పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిస్తామని జూడాలతో మంత్రి చెప్పారు. అంతేకాదు.. జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారమే అన్ని వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని జూడాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె నిర్ణయంపై జూనియర్ డాక్టర్లతో చర్చించి వీలైనంత త్వరగా తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. -
‘ప్రసాద్ తల్లిని కూడా హత్య చేయాలనుకున్నారు’
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురు హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఆమె మంగళవారం కేసు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతానికి తీసకువెళ్లి హత్య చేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కేసు నమోదైనట్లు తెలిపారు. ప్రశాంత్‌తో పాటు గుగులోతు విష్ణు, బానోతు వంశీ, వడ్డమ్మ, మరో మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నవంబర్ 29 రోజు ప్రసాద్‌ను రాళ్లతో కొట్టి చంపి పూడ్చిపెట్టారని నిందితులను విచారిస్తే తెలిసిందన్నారు. ఈ హత్యలు చేయడానికి వాడిన టాటా ఆల్ట్రోజ్ కారు, భూమి పత్రాలు, రూ.30 వేలు, ఐదు సెల్ ఫోన్లు దొరికినట్లు చెప్పారు. ఆ ఫొన్లు కూడా మృతి చెందినవారివిగా గుర్తించామని అన్నారు. వారి ప్రణాళిక ప్రకారం ప్రసాద్ వాళ్ల అమ్మను కూడా హత్య చేయాలనుకున్నారని తెలిపారు. ఈ ఆరుగురి హత్యల్లో నిందితుడు ప్రశాంత్ తల్లి పాత్ర కూడా ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. పలు అనుమానాల ఆధారంగా ఇది కేవలం ప్రథమిక విచారణ అన్నారు. ఈ కేసులో అన్నివైపుల నుంచి లోతుగా తదుపరి దర్యాప్తు కొనస్తామని తెలిపారు. చదవండి: ఇంటిపై కన్నేసి ఇంటిల్లిపాదినీ బలిగొన్న స్నేహితుడు -
కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు... డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు
హైదరాబాద్: తెలంగాణలో 6 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో సోమవారం (డిసెంబర్ 18) కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి మంత్రులు, కాంగ్రెస్ నేతలకు మంత్రి ఉత్తమ్ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ లేదు. ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి. రేషన్ కోసమే కాకుండా, ఆరోగ్యశ్రీ తదితర సేవలకూ రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. -
ప్యార్ పైసా చాహియే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ..రాజధాని నగరమైన హైదరాబాద్ అభివృద్ధి ఎలాంటి దిశను తీసుకుంటుందోనని సర్వత్రా చర్చలు సాగుతున్నాయి. మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనవద్దే ఉంచుకోవడంతో అందులో భాగమైన జీహెచ్ఎంసీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..ఏయే పనులు చేపడతారోనని అటు అధికారులు.. ఇటు నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు. జీహెచ్ఎంసీ పనులపై సమీక్ష నిర్వహిస్తే.. సీఎం మనోగతం వెల్లడి కాగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనుల పూర్తికి శ్రద్ధ చూపుతారా..లేక కొత్త పనులు చేపడతారా అన్న చర్చలు జీహెచ్ఎంసీ వర్గాల్లో సాగుతున్నాయి. మరోవైపు నగరానికి సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు ప్రాధాన్యతనిస్తారా? ముఖ్యంగా ఆస్తిపన్ను బకాయిలపై పెనాల్టీలు ఎప్పుడు ఎత్తివేస్తారోనని పలువురు ఎదురు చూస్తున్నారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలికల్లో ఆస్తిపన్ను, ఇంటిపన్ను బకాయిలపై పెనాల్టీలను రద్దుచేస్తామని హామీనిచ్చారు. దానితో పాటు మరికొన్ని హామీలిచ్చారు. వాటిల్లో నగర ప్రజలకు సంబంధించిన వాటిల్లో దిగువ పేర్కొన్నవి ఉన్నాయి. తెల్ల రేషన్కార్డులున్న ఇళ్ల యజమానులకు ఇంటి పన్ను తగ్గింపు. ►మురికివాడల్లోని పేదలకు కాలనీల్లోని వారి మాదిరిగా నీరు, విద్యుత్, డ్రైనేజీ, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో నాణ్యమైన ప్రాథమిక సేవలు. సబ్సిడీతో కూడిన సర్విస్ కార్డులు. ► నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు కలుపుతూ స్కైవాక్‌ల నిర్మాణం. ► పార్కింగ్ సమస్య పరిష్కారానికి పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణం. ► బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు ద్వారా పేద ప్రజల పిల్లలకు ఆధునిక విద్య. ► సెట్విన్ బస్సుల్ని పెంచి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల పెంపు. ► ఎల్బీ నగర్– బీహెచ్ఈఎల్ (వయా ఆరాంఘర్, మెహిదీపట్నం, గచి్చ»ౌలి)మార్గాల్లో కొత్త మెట్రోలైన్ల విస్తరణ. ► మురికివాడల సమగ్రాభివృద్ధి కోసం స్లమ్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. ► ప్రతి ఇంటికీ 25 వేల లీటర్ల మంచినీరు ఉచిత సరఫరా. ప్రాజెక్టులకు నిధులు కావాలి.. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి ఎస్సార్డీపీ కింద 42 పనులు చేపట్టగా వాటిల్లో 32 పూర్తయ్యాయి. మరో 9 పురోగతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.6 వేల కోట్లు ఖర్చు కాగా, పురోగతిలోవి పూర్తయ్యేందుకు మరో వెయ్యి కోట్లు కావాలి. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన జీహెచ్ఎంసీకి మళ్లీ అప్పుచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆ నిధులు విడుదల చేసి మిగిలిన పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. వరద నివారణ పనుల కోసం ఎస్ఎన్డీపీ కింద తొలిదశలో దాదాపు వెయ్యి కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. అవి సగమే పూర్తయ్యాయి. వాటిని పూర్తిచేయడంతోపాటు రెండో దశకు అవసరమైన నిధులు కేటాయించాలి. రెండో దశ పనులకు గ్రేటర్ లోపల, వెలుపల వెరసి రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చుకాగల పనులకు ప్రతిపాదనలు చేశారు. సమస్య పరిష్కారానికి పాత ప్రతిపాదనల పనులే చేస్తారా? లేక కొత్త ప్రణాళికలు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఏం చేసినా సదుపాయవంతమైన జీవనం కలి్పస్తే బాగుంటుందని నగర ప్రజలు ఆశపడుతున్నారు. వీటికీ ప్రాధాన్యం ఇవ్వండి.. మేనిఫెస్టోలో పేర్కొన్న వాటితోపాటు..పేర్కొనని దిగువ సమస్యలనూ పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ► వరద ముంపు లేకుండా నాలాల ఆధునీకరణ. దశాబ్దాల తరబడి ఈ సమస్యకు వివిధ ప్రభుత్వాలు చర్యలకు శ్రీకారం చుట్టినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ ఈ అంశం ఉంది. చెరువుల్ని ప్రక్షాళన చేసి నీరు నిలిచేలా చేయడం.. ఒక చెరువు నిండాక దిగువప్రాంతాల్లోని చెరువులకు వెళ్లేలా చేయడం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుంది. ► మేనిఫెస్టోలో ఉన్న మరో అంశం పార్కింగ్. నగరంలో పార్కింగ్ సమస్య వాహనదారులందరికీ తెలిసిందే. అడ్డగోలు పార్కింగ్ చార్జీలను కూడా అరికట్టాలని కోరుతున్నారు. ► నగరంలో ప్రధాన రహదారులు కాస్త బాగున్నా..కాలనీల్లోని రోడ్లు పరమ అధ్వానంగా మారాయి. ప్రధాన రహదారులతోపాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాఫీ ప్రయాణం సాగేలా, వర్షం వచి్చనా ఇబ్బందుల్లేకుండా రోడ్లుండాలి. ►మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బాగుంది. దాంతోపాటు అవసరమైన అన్ని మార్గాల్లో బస్సుల సంఖ్య పెంచి ఇబ్బందుల్లేకుండా చూడాలి. మెట్రో స్టేషన్ల నుంచి లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయానికి మినీబస్సులు నడపాలి. ► నగరంలో తరచూ అగి్నప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకు చెప్పుకోదగ్గ కారణాల్లో అక్రమ నిర్మాణాలు ఒకటి. అక్రమ నిర్మాణాలను అరికట్టాలి. -
కాళేశ్వరం పిటిషన్: రెండు వారాలకు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలైంది. టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ ఈ పిటిషన్ వేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటీషన్లో కోరారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన అంశంపై పిటిషనర్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిన ఘటన జరిగిన సమయంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులను అనుసరించి రాష్ట్ర సీఎస్‌కు లేఖ రాసిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి. సీఎస్ నుండి సమాచారం తీసుకుని రెండు వారాల్లోపు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు వెల్లడించింది. -
HYD: బేగంపేట రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో శీతాకాలం విడిది కోసం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ము ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల దాకా బొల్లారం నుంచి బేగంపేట రూట్లో ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రిస్తారు. కాబట్టి.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. ప్రతీయేడులాగే.. ఈసారి కూడా శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. సోమవారం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ విడిదిలో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే వీలుంది. అయితే అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 20వ తేదీన భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించి చేనేత ప్రదర్శనలో పాల్గొంటారు. ఈనెల 23న రాష్ట్రపతి ముర్ము తిరిగి ఢిల్లీ బయల్దేరే అవకాశాలు ఉన్నాయి. -
‘గృహలక్ష్మి’ దరఖాస్తులు పరిశీలించొద్దు!
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం చివరలో ప్రారంభించిన గృహలక్ష్మి పథకం కోసం సేకరించిన 15 లక్షల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని పూర్తిగా పక్కన పెట్టి కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని భావిస్తోంది. మంజూరు చేసే వేళ ముంచుకొచ్చిన ఎన్నికలు గత ప్రభుత్వం తొలుత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ యూనిట్ కాస్ట్‌తో, దేశంలో ఎక్కడా లేనట్టుగా ఉచితంగా రెండు పడక గదులతో కూడిన ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. కానీ వాటి యూనిట్ కాస్ట్ సరిపోవటం లేదంటూ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటం, సాంకేతికంగా కొన్ని లోపాలు చూపి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులు నిలిపేయటం, కొన్ని అంతర్గత లోపాలు.. వెరసి ఆ పథకం అంత వేగంగా ముందుకు సాగలేదు. దీంతో ఏడాది క్రితం.. దాని స్థానంలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. సొంత జాగా ఉండి ఇల్లు లేని పేదలకు రూ.3 లక్షలను అందించి వారే ఇళ్లను నిర్మించుకునేలా దీన్ని రూపొందించారు. ఇంచుమించు ఇందిరమ్మ పథకం తరహాలోనే డిజైన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని దరఖాస్తులు ఆహ్వానించింది. 15 లక్షల దరఖాస్తులు వచ్చి పడ్డాయి. వాటిల్లో 12 లక్షలు అర్హమైనవిగా గుర్తించారు. వాటిల్లో నుంచి 4 లక్షల దరఖాస్తులు ఎంపిక చేసే వేళ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. చివరి తేదీ రాత్రి వరకు దాదాపు2 లక్షల దరఖాస్తులకు సంబంధించి జాబితాను సిద్ధం చేశారు. వారికి నిధులు ఇచ్చేందుకు వీలుగా ఎన్నికల సంఘం నుంచి అనుమతి కూడా వచ్చింది. కానీ, అప్పటికే ప్రచారం తారస్థాయికి చేరుకోవటంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ దరఖాస్తులను రిజెక్టు చేస్తుందేమోనన్న భయంతో కొందరు దరఖాస్తుదారులు కూడా అధికారులపై ఒత్తిడి చేయకుండా ఎన్నికలయ్యే వరకు వేచిచూసే ధోరణి అవలంబించాలని నిర్ణయించారు. వారు అనుకున్నట్టే ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం తమ దరఖాస్తులను పరిశీలిస్తుందని వారు ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ, వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఆ దరఖాస్తులను పరిశీలించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ సభల్లో కొత్త దరఖాస్తులు.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించేవారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాత ప్రభుత్వం సేకరించిన దరఖాస్తులను పక్కన పెట్టి కొత్తగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇటీవల హైకోర్టులో గిరిజనప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ అంశంపై ఓ కేసు విచారణకు వచ్చింది. నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా జరగాల్సి ఉంటుంది. గిరిజనులకు దక్కాల్సిన లబ్ధి గిరిజనేతరులు తన్నుకుపోతున్నారన్న ఉద్దేశంతో వారికి రక్షణగా ఈ నిబంధన ఏర్పాటు చేశారు. గృహలక్ష్మి పథకంలో దరఖాస్తుల స్వీకరణలో ఈ నిబంధనల పాటించలేదన్నదని ఫిర్యాదు. నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ జరిగిందన్న వాదనను ఇప్పుడు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. సరిగ్గా ఎన్నికల వేళ దరఖాస్తుల పరిశీలన జరిగిన నేపథ్యంలో మొత్తంగా ఆ దరఖాస్తులను పక్కనపెట్టనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
కొలిక్కిరాని మేడిగడ్డ పునరుద్ధరణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వ్యవహారం కొలిక్కి రాలేదు. సొంత ఖర్చుతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మరోసారి నిరాకరించింది. నీటిపారు దల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీలు సి.మురళీ ధర్, బి.నాగేందర్ రావు, నల్లా వెంకటేశ్వర్లుతో కలిసి ఎల్ అండ్ టీ డైరెక్టర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్వీ దేశాయ్ బృందంతో సమావేశమై బ్యారేజీ పునరు ద్ధరణపై చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో నాణ్యత లోపాలు ఎలా చోటుచేసుకున్నాయని మంత్రి ఎల్ అంట్ టీ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక లేఖ రాసి బ్యారేజీ పునరుద్ధరణ నుంచి తప్పుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. 2020 జూన్ 29 నాటికి బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని, ఒప్పందం ప్రకారం పని పూర్తయి నట్టు ధ్రువీకరిస్తూ 2021 మార్చి 25న ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ లేఖ సైతం ఇచ్చారని ఎల్ అండ్ టీ బృందం వివరించింది. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ సైతం ముగిసిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని పేర్కొంది. గత అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోగా, మరుసటి రోజే బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమదేనని అంగీకరిస్తూ ఎల్ అండ్ టీ జనరల్ మేనేజర్ సురేశ్‌కుమార్ విడుదల చేసిన ప్రకటనను నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు మంత్రికి చూపించారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే స్థాయి కానీ, అధికారం కానీ సురేశ్‌కుమార్‌కు లేదని ఎల్ అండ్ టీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దేశాయ్ చెప్పినట్లు తెలిసింది. అప్పట్లో ఆయనపై ఒత్తిడి చేసి ప్రకటన ఇప్పించారని ఆరోపించినట్టు సమాచారం. ఎల్ అండ్ టీ బోర్డు సమావేశంలో చర్చించి ఆమోదించాకే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తయినా ఒప్పందం ప్రకారం చేయాల్సిన కొన్ని పనులు ఇంకా పూర్తి కాలేదని, చివరి బిల్లును సైతం ఇప్పటివరకు చెల్లించలేదని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతికంగా పనులు పూర్తికానట్టేనని వాదించారు. ఇంకా అంచనాలే రూపొందించలేదా? మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణలో భాగంగా గోదావరిలో ఎగువ నుంచి వస్తున్న జలాలను దారి మళ్లించడానికి కాఫర్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుందని, ఇందుకు రూ.55.5 కోట్ల మేర ప్రతిపాదనలు సమర్పించాలని ఎల్ అండ్ టీ ప్రతినిధు లు ఉత్తమ్‌కు వివరించారు. కాఫర్ డ్యామ్‌కు అంత వ్యయం కాదని ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు బదులిచ్చారు. మీ అంచ నాల ప్రకారం ఎంత వ్యయం అవుతుందని ఉత్తమ్ ఆయన ను ప్రశ్నించారు. ఇంకా అంచనాలు రూపొందించలేదని వెంకటేశ్వర్లు బదులివ్వగా, మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా పునాది కింద దృఢత్వం కోసం కటాఫ్ పైల్స్ వేయాల్సి ఉంటుందని, వీటిని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడానికే 45 రోజుల సమయం పడుతుందని ఎల్ అండ్ టీ ప్రతినిధులు వివరించారు. అనుభవం కోసమే సర్టిఫికెట్ ఇచ్చి ఇరుక్కున్నారు.. మేడిగడ్డ పనులు చేసిన అనుభవం వాడుకుని కొత్త కాంట్రాక్టులు దక్కించుకోవడానికి ఎల్ అండ్ టీ సంస్థ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ కోరగా, ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ జారీ చేసేయడంతోనే సమస్య ఉత్పన్నమైందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒప్పందం ప్రకారం పనులన్నీ పూర్తికాకుండానే ఎలా జారీ చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సర్టిఫికెట్‌ను అడ్డంపెట్టుకుని ఎల్ అండ్ టీ సంస్థ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. కారణమేంటో తేల్చండి! మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదన్న అంశంపై వివాదాన్ని పక్కనపెట్టి అసలు బ్యారేజీ కుంగడానికి కారణాలను వెలికి తీయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. సమస్యకు మూల కారణం తెలిసిన తర్వాత పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిని తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహించాలని, ఇందుకోసం నిర్మాణ సంస్థలను పిలిపించి మాట్లాడాలని ఆదేశించారు. తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రితో సమావేశం అనంతరం కాఫర్ డ్యామ్ నిర్మాణం పనులను ప్రారంభించే అంశంపై ఎల్ అండ్ టీ బృందంతో ఈఎన్సీలు చర్చించారు. తక్షణమే పనులు ప్రారంభించాలని, అదనపు పనులకు ఏదైనా ఆర్థిక సహాయం అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. -
22న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం తరఫున ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. కాగా, రాష్ట్రమంతా ఈ వేడుకలను నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కాంతి వెస్లీ వెల్లడించారు. ప్రభుత్వం ఏటా ఆనవాయితీగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తోందని ఆమె వివరించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు వెల్లడించారు. -
‘ఇదేం అభిమానం!’ బిగ్‌బాస్ గొడవపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్-7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఫినాలే పూర్తి అయిన తర్వాత కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో అమర్ ఫాన్స్, పల్లవి ప్రశాంత్ అభిమనులు గొడవకు దిగారు. అయితే ఈ గొడవలో ఆర్టీసి బస్సుల అద్దాలను ఫాన్స్ ధ్వంసం చేశారు. తాజాగా ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఫాన్స్ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
చైతన్యపురి హిట్ అండ్ రన్: ఇద్దరి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: చైతన్యపురి హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు మరిన్ని వివరాలు తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైతన్యపురి సీఐ తెలిపారు. మరో ఐదుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎంఆర్వో హరికృష్ణదిగా గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఎల్బీనగర్-ఉప్పల్ రోడ్లో వేగంగా దూసుకుపోతున్న కారు రాజీవ్ గాంధీనగర్ కమాన్ వద్ద ప్రమాదానికి గురైంది. కారు చౌటుప్పల్ ఎంఆర్ఓ హరికృష్ణ సతీమణి పేరుతో ఉన్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో హరికృష్ణ కొడుకు సాయికార్తీక్ అతని ఫ్రెండ్స్ ఆ కారులో ఉన్నటులు సమాచారం. కమాన్‌ను డీకొట్టడంతో కారులో ఉన్నఏడుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కమాన్ వద్ద ఉన్న యువకుడికి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కార్తీక్ తన తండ్రి కారును తీసుకుని తన స్నేహితులతో కలిసి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో.. నలుగురు యువకులను గాంధీ ఆస్పత్రి కి తరలించి, సాయి కార్తీక్‌తో పాటు మరో ఇద్దరు యువకులని కొత్తపేట ఓమ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ.. కంటిన్యూ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ మరో మూడు రోజులు కొనసాగనుంది. ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన తెలంగాణ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ 21వ తేదీకి వాయిదా వేసింది. సింగరేణిలో నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. ఈసారి ఎన్నికలు ఇప్పటికే ఆలస్యంగా కాగా.. డిసెంబర్ 27వ తేదీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు . ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలై.. ఎన్నికల నిర్వహణ కసరత్తులు జరుగుతున్నాయి. అయితే.. రాష్టంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం తో పాటు వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన, వనరుల శాఖ కోరింది. మార్చిలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్ దాఖలైంది. అదే సమయంలో వాయిదా యత్నాలను పసిగట్టి ముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏఐటీయూసీ సంఘం. దీంతో ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్ పై స్టే ఇవ్వకుండా విచారణ చేపట్టింది హైకోర్టు. -
ఆ.. మద్యం... ఏం చేద్దాం..?
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి పరిమితికి మించి కొనుగోలు చేసిన మద్యం తీసుకెళ్తుండగా ఎక్కడికక్కడ పోలీసులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టుకున్నాయి. వీటిని ఆయా పోలీస్ స్టేషన్లలో అప్పగించి వారిపై పెట్టి కేసులు కూడా నమోదు చేశారు. అయితే స్వాదీనం చేసుకున్న మద్యం సీసాలతో పోలీస్ స్టేషన్ల గదులు నిండిపోయాయి. ఈ మద్యాన్ని ఎంత తొందరగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా అప్పగిద్దామా అని ఆయా ఠాణాల పోలీసులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, ఖైరతాబాద్, పంజగుట్ట, లేక్ పోలీస్‌స్టేషన్, నారాయణగూడ, అబిడ్స్, దోమలగూడ తదితర 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో 2727 లీటర్ల మద్యం స్వాదీనం చేసుకున్నారు. ఒక్క జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే అధిక మొత్తంలో మద్యాన్ని తీసుకెళ్తుండగా 11 కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధి కిందకు వచ్చే జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, బోరబండ, పంజగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో 1509 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకొని వీరిపై కేసులు కూడా నమోదు చేశారు. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా ఆ రోజు నుంచే నగదు, మద్యం సరఫరాను నియంత్రించేందుకు పోలీసులు, ఎఫ్ఎస్టీ బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో పెద్ద ఎత్తున మద్యం పట్టుబండింది. నమూనాల సేకరణ... ఎన్నికల సమయంలో స్వాదీనం చేసుకున్న మద్యంలో ఒక్కో బ్రాండ్‌కు సంబంధించి ఒక సీసాను పోలీసులు సీజ్ చేసి సీల్ వేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ల్యా»ొరేటరీకి పంపించారు. ఉదాహరణకు 12 బీరుసీసాలు స్వాధీనం చేసుకుంటే అందులో ఒక బీరుసీసాను సీజ్ చేసి ఎక్సైజ్ ల్యా»ొరేటరీకి పంపించడం జరుగుతుంది. మిగతా మద్యం అంతా ఠాణాల్లోని గదుల్లో భద్రపరిచారు. సీజ్ చేసిన పంపించిన మద్యం నాటు సరుకా..? ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కరా..? అనే విషయాన్ని కెమికల్ ల్యాబ్ రిపోర్ట్ రాగానే పోలీసులు ఆ మొత్తాన్ని డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ వద్ద డిపాజిట్ చేస్తారు. డీసీ ఇచ్చిన రశీదును జత చేసి చార్జిషీట్ దాఖలు చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా పెండింగ్‌లోనే ఉంది. ఇంత వరకు కెమికల్ ల్యాబ్ రిపోర్ట్ పోలీసులకు అందలేదు. కనీసం పంపించిన నమూనాలు కూడా కెమికల్ ల్యాబ్‌లో ఇంకా పరిశీలించలేదని తెలుస్తున్నది. ఈ రిపోర్ట్ వచ్చేదాకా పోలీసులు స్వాదీనం చేసుకున్న మద్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. స్వా«దీనం చేసుకున్న మద్యం సీసాల్లో ఒక్కటి మిస్ అయినా సంబంధిత దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకుంటారు. దీంతో ఠాణాల్లో పేరుకుపోయిన మద్యం సీసాలను కాపాడుకోవడానికి దర్యాప్తు అధికారులు పడుతున్న పాట్లు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. కష్టపడి స్వాదీనం చేసుకున్న మద్యాన్ని డిప్యూటీ కమిషనర్‌కు అప్పగించేదాకా జరుగుతున్న ప్రాసెస్ అంతా ఇంతా కాదు. పోలీసులకు ఈ మద్యం చుక్కలుచూపిస్తున్నది. గత ఎన్నికలతో పోలిస్తే భారీగా నగదు స్వాదీనం... ► 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నగదు పట్టుబడింది. నిబందనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి రూ. 50 వేలకంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్తుండగా ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో పాటు ఎఫ్ఎస్టీ బృందాలు నగదును పెద్ద మొత్తంలో స్వా«దీనం చేసుకున్నాయి. ► జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఎఫ్ఎస్టీ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో రూ. 17.80 లక్షలు పట్టుబడగా ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 61.46 లక్షలు పట్టుబడ్డాయి. ఈ మొత్తాన్ని జిల్లా గ్రీవెన్స్ సెల్‌కు పోలీసులు అప్పగించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను బాధితులు చూపిస్తే పోలీసులు ఆ డబ్బును తిరిగి వారికి అప్పగిస్తారు. ► ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో రూ. 5 కోట్ల 51 లక్షల నగదు ఎన్నికల సమయంలో పట్టుబడింది. అలాగే రూ. 3.97 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు కూడా స్వాదీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 18 బస్తాల రేషన్ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. -
నేను ఏ ఉద్యోగం చేయలేను
సాక్షి, హైదరాబాద్: తాను ఇప్పుడు ఏ ఉద్యోగం చేసే స్థితిలో లేనని, తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని మాజీ డీఎస్పీ నళినీ చెప్పారు. తెలంగాణ ఉద్యమం తర్వాత 12 ఏళ్లకు తెలంగాణ మూలాలున్న సీఎంగా రేవంత్‌రెడ్డి ఇన్నాళ్లకు తన పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ఫేస్బుక్లో బహిరంగ లేఖను పోస్ట్ చేశారు. కొద్దిరోజులుగా మీడియా మిత్రులు తన ప్రతిస్పందన తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ఫేస్బుక్లో బహిరంగ లేఖ పెడుతున్నానని చెప్పారు. తన లేఖ చివరిలో డి.నళినీ ఆచార్య, యజ్ఞ బ్రహ్మ, వేద ప్రచారకురాలు అని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నది నిరూపితమైంది. గతం ఒక రీల్ మాదిరి నా కళ్ల ముందు కదులుతోంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్‌గా ‘సోషల్ స్టిగ్మా (కళంకం)’ను మోశాను. నన్ను ఆనాటి ప్రభుత్వం మూ డేళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. క్షణక్షణం ఒక గండంలా గడిచింది’అని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో ప్రజలకు దగ్గరైనా.. తన బంధుమిత్ర పరివారమంతా వెలివేసిందని, పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయి జీవచ్ఛవంలా బతికానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేవుడు నన్ను క్రిమినాలజీ (నేర శాస్త్రం) నుంచి ఫిలాసఫీ (వేదాంతం) వైపు నడిపించాడు. రెండేళ్ల క్రితం నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. మీరు (సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి) రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్‌ను నేను స్వతంత్రంగా ఉంటూనే వేద, యజ్ఞ, ధారి్మక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను’అని పేర్కొన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలా లైన ’వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నానని, అందువల్ల సీఎం రేవంత్‌రెడ్డిని కలవలేకపోతున్నట్టు నళినీ చెప్పారు. -
శీతాకాల విడిదికి రాష్ట్రపతి రాక నేడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తున్నారు. రాష్ట్రపతి దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయంలో దిగనున్నారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా, మేడ్చల్ జిల్లా కలెక్టర్, రాచకొండ కమిషనర్ తదితరులు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈనెల 20వ తేదీ న భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించను న్నారు. అక్కడ చేనేత ప్రదర్శన తిలకిస్తారు. ఈనెల 23 వరకు శీతాకాల విడిది చేస్తారు. ఈ విడిది సమయంలో రాష్ట్రపతి పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే అవకాశమున్నట్టు సమాచారం.ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు, పర్యటన సందర్భంగా ట్రాఫిక్ దారి మళ్లించే చర్యలను అధికారులు చేపట్టారు. ఈనెల 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్తారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
9 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐపీఎస్‌లు, పోలీసు అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఆదివారం తొమ్మిది మంది ఐపీఎస్‌లు, ఐదుగురు నాన్ కేడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. ఐపీఎస్‌ల బదిలీకి సంబంధించి ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, నాన్ కేడర్ ఎస్పీల బదిలీలపై హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ వేర్వేరుగా జీఓలు జారీ చేశారు. ► హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీ పి.విశ్వప్రసాద్‌ను హైదరాబాద్ నగర ట్రాఫిక్ సీపీగా బదిలీ చేశారు. ► ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసిన వరంగల్ మాజీ సీపీ రంగనాథ్‌ను హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ (క్రైమ్స్ అండ్ సిట్)గా నియమించారు. ► ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న ఎస్ఎం విజయ్‌కుమార్‌ను హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీగా.. ఇప్పటివరకు వెస్ట్‌జోన్ డీసీపీగా ఉన్న జోయల్ డేవిస్‌ను హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా బదిలీ చేశారు. ► మెదక్ ఎస్పీగా ఉన్న రోహిణి ప్రియదర్శినిని హైదరాబాద్ సిటీ నార్త్‌జోన్ డీసీపీగా నియమించారు. ► సిద్దిపేట సీపీ ఎన్.శ్వేతను హైదరాబాద్ సిటీ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీగా బదిలీ చేశారు. ► పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న ఎల్.సుబ్బారాయుడును హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–1 డీసీపీగా నియమించారు. ► టాస్క్ ఫోర్స్ డీసీపీ నితిక పంత్, గజరావు భూపాల్, చందనాదీప్తి తదితర అధికారులను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఐదుగురు నాన్‌కేడర్ ఎస్పీలు బదిలీ.. ► వెయిటింగ్లో ఉన్న అధికారి ఎన్.వెంకటేశ్వర్లుకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–3 డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–3 డీసీపీగా పనిచేస్తున్న డి.శ్రీనివాస్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ► రాచకొండ కమిషనరేట్‌లో రోడ్డు భద్రత విభాగం డీసీపీగా ఉన్న శ్రీబాలదేవి హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమితులయ్యారు. ► మాదాపూర్ డీసీపీగా ఉన్న జి.సందీప్‌ను రైల్వేస్ ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. రైల్వేస్ ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న జె.రాఘవేందర్రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అరవింద్ కుమార్‌కు ‘విపత్తు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిధిలోని విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దాన కిశోర్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా స్థానచలనం కల్పించింది. కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్, పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ పదవుల అదనపు బాధ్యతల నుంచి సైతం అరవింద్‌కుమార్‌ను తప్పించింది. ఆ రెండు పోస్టుల అదనపు బాధ్యతలనూ దానకిశోర్కే అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో లీజుపై అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అప్పగింతపై నిర్వహించిన టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అప్పట్లో రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్‌గా అరవింద్ కుమార్ స్పందిస్తూ రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో అరవింద్‌కుమార్‌ను అప్రధానమైన విపత్తుల నిర్వహణ విభాగానికి బదిలీ చేయడం గమనార్హం. గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా వ్యవహరించిన రాహుల్ బొజ్జాను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అదనపు బాధ్యతల్లో ఆయన్ను కొనసాగించింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను తప్పించి ఆమెను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను విద్యాశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ క్రిస్ట్రీనా జెడ్.చొంగ్తును కీలకమైన వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించడం విశేషం. -
ఇంజనీరింగ్ కాలేజీల ఎదురీత
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి. దశాబ్ద కాలంగా ఏటా కళాశాలలు మూతపడు తున్నాయి. 2015 నాటికి రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 159కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీలే ఎక్కువగా మూతపడుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 48 కాలేజీలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 11కు తగ్గింది. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 11కుగాను ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయి. ఇలా ప్రతీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఆఖరుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ 2015లో 74 కాలేజీలుంటే, 20 కాలేజీలు మాయమై 54 మిగిలాయి. ఇటీవల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మరికొన్ని కాలేజీలు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నత విద్యామండలి అధికారులు అంటున్నారు. ఎందుకీ పరిస్థితి? సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో డిమాండ్ బాగా తగ్గింది. ఈ కోర్సుల్లో 40 శాతం కంటే తక్కువే అడ్మిషన్లు జరుగుతున్నాయి. కొన్ని కాలేజీల్లో మెకానికల్, సివిల్ బ్రాంచీల జోలికే వెళ్లడం లేదు. 2023 ప్రవేశాల్లో దాదాపు 30 కాలేజీల్లో సివిల్ బ్రాంచ్‌లో సగానికి పైగానే సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 58 శాతం కంప్యూటర్ కోర్సుల్లోనే ప్రవేశాలుంటున్నాయి. సీఎస్ఈ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యకు ఎక్కువ మంది హైదరా బాద్‌ను ఎంపిక చేసుకుంటుండగా, ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యనూ ఇక్కడే పూర్తి చేయాలని భావిస్తున్నారు. చదువుకునే సమయంలోనే పార్ట్ టైం ఉద్యోగం వెతుక్కునే అవకాశం నగరంలో ఉందని భావిస్తున్నారు. అరకొర విద్యార్థులతో జిల్లాల్లో కాలేజీలను నడిపే పరిస్థితి లేదని నిర్వాహకులు అంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులకు మౌలిక వసతుల కల్పనపై ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. దీంతో విద్యార్థులు ఆ కాలేజీల వైపు వెళ్లే పరిస్థితి లేదు. అందువల్ల అవి క్రమంగా మూతపడుతున్నాయి. ప్రైవేటు వర్సిటీలొస్తే మరీ ప్రమాదం ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు కేంద్ర విద్యాశాఖ ఆహ్వానం పలుకుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీలోని ప్రధాన కాలేజీలు ఇక్కడ బ్రాంచీలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులను ఆకట్టుకునేందుకు అవి ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతు న్నారు. ఈ పోటీని మన ఇంజనీరింగ్ కాలేజీలు తట్టుకునే అవకాశం తక్కువనే వాదన విన్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం కాలేజీల నాణ్యత పెంచాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రానికి సూచించింది. న్యాక్ అక్రిడిటేషన్ పరిధిలోకి వస్తేనే అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ తరహా పోటీని తట్టుకునే ప్రైవేటు కాలేజీలు 20కి మించి లేవు. ఇంజనీరింగ్ విద్యలోనూ మార్పులు వస్తున్నాయి. బోధన ప్రణాళికను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్‌లో మరికొన్ని కాలేజీలు మూతపడేందుకు కారణాలవుతాయని అంటున్నారు. పోటీ పెరిగితే మనుగడ ప్రైవేటు యూనివర్సిటీలు పెరుగు తున్నాయి. కొత్త కోర్సుల దిశగా అవి దూసుకెళ్తున్నాయి. భవిష్యత్ లోనూ ఇదే ట్రెండ్ కన్పిస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులకే ప్రాధాన్య మిస్తున్నారు. జిల్లాల్లోని ప్రైవేటు కాలేజీలు ఈ పోటీని తట్టుకునేలా లేవు. ఇందుకు తగ్గట్టుగా ముందుకెళ్లే పరిస్థితి రావాలి. అప్పుడే వాటికి మనుగడ ఉంటుంది. – ప్రొఫెసర్ డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ -
పురపాలికల్లో మోగుతున్న అవిశ్వాస గంట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పురపాలికల్లో కొత్త ఎత్తులు మొదలయ్యాయి. సుమారు నాలుగేళ్లుగా పదవుల్లో కొనసాగుతున్న పాలక మండళ్ల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లతోపాటు మేయర్లపై ‘అవిశ్వాస పరీక్ష’అనే కత్తి వేలాడుతోంది. గత జనవరితో మూడేళ్ల పదవీ కాలం పూర్తవడంతో మునిసిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లను గద్దె దించాలని కొందరు సభ్యులు చేసిన ప్రయత్నాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెరవేరలేదు. దాదాపు 95 శాతం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో బీఆర్ఎస్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లే ఉండటంతో అవిశ్వాసం ద్వారా ఎవరిని గద్దె దించినా.... రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతో గులాబీ పెద్దలు వీరి ప్రయత్నాలకు చెక్ పెట్టారు. దీంతో రాష్ట్రంలోని 130 మునిసిపాలిటీలకుగాను 34 చోట్ల అవిశ్వాస తీర్మానం నోటీసులు జిల్లాల కలెక్టర్లకు ఇచ్చినప్పటికీ, ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 15 మంది చైర్మన్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కిన నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లకు అవిశ్వాసంపై పెద్దగా టెన్షన్ లేనప్పటికీ, బీఆర్ఎస్లోనే ఉన్న మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లలో పదవీగండం భయం పట్టుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచిన జిల్లాల్లో బీఆర్ఎస్లో ఉన్న మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు అవసరమైతే పార్టీ మారేందుకూ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్ వాళ్లతో కలిసి ప్రస్తుత పాలక మండళ్ల చైర్మన్లను, వైస్ చైర్మన్లను గద్దె దించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. చాలాచోట్ల ప్రయత్నాలు షురూ ప్రస్తుతం రాష్ట్రంలోని నల్లగొండ, నేరేడుచర్ల, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్, కోస్గి, ఆంథోల్ మునిసిపాలిటీల్లో ఇప్పటికే అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఇందులో బెల్లంపల్లి మునిసిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, సభ్యులు అవిశ్వాస నోటీసు ఇవ్వడం గమనార్హం. ఆర్నెల్ల క్రితం అవిశ్వాస నోటీసులు ఇచ్చిన మునిసిపాలిటీల్లో 15 మంది బీఆర్ఎస్ చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, చాలాచోట్ల సభ్యులు వారిని గద్దె దించాలనే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు ఉన్న అన్ని మునిసిపాలిటీల్లో కలెక్లర్లకు అవిశ్వాస నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అసంతృప్త సభ్యులకు కాంగ్రెస్ సభ్యులు కూడా తోడవుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో సగం మునిసిపాలిటీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. ఇల్లందు, వైరా, జనగాం, భూపాలపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, పెద్దపల్లి, సుల్తానాబాద్, కోరుట్ల, హుజూర్నగర్, మిర్యాలగూడ, కోదాడ, యాదగిరిగుట్టలో అవిశ్వాస నోటీసులు ఇచ్చేందుకు అసమ్మతి సభ్యులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర సభ్యులతో కలిసి ఈ మేరకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు మునిసిపాలిటీల్లోనూ అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. కార్పొరేషన్లలో సైతం రాష్ట్రంలోని 13 మునిసిపల్ కార్పొరేషన్లలో హైదరాబాద్ మినహా మిగతా కార్పొరేషన్లలో సైతం అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్, నిజాంపేట, బోడుప్పల్, ఫిర్జాదీగూడ కార్పొరేషన్లతోపాటు నిజామాబాద్, రామగుండం, ఖమ్మం వంటి కార్పొరేషన్లలో కూడా అవిశ్వానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ మేయర్, చైర్మన్లు ఉన్న పట్టణాల్లో కొంత భిన్నమైన వైఖరి ఉండే అవకాశం ఉంది. కలెక్టర్లకు నోటీసులు ఇచ్చిన తరువాత నెల రోజుల్లోపు అవిశ్వాస తీర్మానానికి గడువు ఇచ్చి ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. అయితే అవిశ్వాస తీర్మానాలపై ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలియాల్సి ఉంది.