Devotion
-
స్నాతక పాఠం అంటే..?
ఒక వయసులో ఒక స్త్రీ ఒకపురుషుడికి నచ్చిందనీ, ఒక పురుషుడు ఒక స్త్రీకి నచ్చాడనీ...కాబట్టి కలసి జీవించడం... అనేది శాస్త్ర సమ్మతం కాదు. కాలం గడిచేకొద్దీ ధనం వెళ్ళిపోతుంది, నీ వాళ్ళనుకున్న వాళ్ళు వెళ్లిపోతారు, అధికారం పోతుంది, జ్ఞాపకశక్తి కూడా పోతుంది.. అన్నీ పోతాయి... అలాగే యవ్వనం కూడా. కానీ మిగిలిపోయేది ఏదయినా ఉంటే.. ఆ వ్యక్తి ధార్మికంగా బతికాడా..అన్నదే! పెళ్ళి ఎందుకు చేస్తున్నారు, వారిద్దర్నీ ఎందుకు కలుపుతున్నారు... ప్రస్థానం అంటే వారిద్దరూ కలిసి ఏం చేయాలి? అన్న దాని గురించి అవగాహన కల్పించడం కోసం గృహస్థాశ్రమ స్వీకారానికి ముందు గురువుని తీసుకొచ్చి మంచి విషయాలు చెప్పిస్తారు. దానిని స్నాతక పాఠం అంటారు. స్నాతక పాఠంగా కాకపోయినా పెద్దల్ని తీసుకొచ్చి ‘‘మీరు వివాహం చేసుకోవాలి. ఇద్దరూ అన్యోన్యంగా బతకడం మీద ఎన్నో జీవితాల అభ్యున్నతి ఆధారపడి ఉంది. ఈ ఏర్పాటు మీ వ్యక్తిగత జీవితం కోసం మాత్రమే కాదు సుమా! మీ పెద్దల కీర్తి ప్రతిష్ఠలు, నీ తోబుట్టువుల తృప్తి, మీ బిడ్డల భవిష్యత్తు.. ఇలా చాలా ముడిపడి ఉన్నాయి. ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు. దీనిని మీరు లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అవగాహనపరిచే ప్రయత్నం చేస్తారు. అది సనాతన ధర్మానికి ఉన్న గొప్పదనం. అన్నపానీయాలుగానీ, మరేవయినాగానీ వాటిని సంస్కరించకుండా స్వీకరించం. అటువంటి ఒక ఏర్పాటును నీవు జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు.. ఇక అక్కడినుంచి నీ జీవితం పండవలసిన అవసరం ఉంది. ఇది బ్రహ్మచర్యం అన్న కట్టువిప్పి గృహస్థాశ్రమం అన్న కొత్తకట్టు వేయడం కాదు. బ్రహ్మచర్యం అన్న కట్టు విప్పేయడం అన్నమాట ఉండదు. కారణం – ఆ ఆశ్రమంలో క్రమశిక్షణ, విద్యాభ్యాసం, గురువుపట్ల చూపే గౌరవమర్యాదలు ...ఇవన్నీ ఉన్నాయి. గృహస్థాశ్రమంలోకి వచ్చినప్పుడు ఆ కట్టుబాటు ఎటు పోయింది? ఎటూ పోలేదు. దాని మీద మరో కట్టు వచ్చి చేరింది. కట్టుమీద కట్టు. ΄పొలంలో పచ్చిగడ్డికోసి మోపుకట్టిన తండ్రిని చూసి కొడుకు ‘‘మోపు గట్టిగా కట్టలేదు’’ అంటే తండ్రి బాధపడతాడని... ‘‘అది వదులుగా ఉన్నట్లుంది. ఎందుకైనా మంచిది, మరో కట్టు వేస్తాను’’ అని మోపును మోకాళ్ళతో అదిమి గట్టిగా కట్టి తలమీద పెట్టుకుని ఇంటిబాట పడతాడు. తండ్రి వేసిన కట్టును విప్పి ఆయనను అగౌరవ పరచలేదు. ఆ కట్టు వదులుగా ఉన్నందువల్ల ఎక్కడో దానంతట అదే జారిపోయింది. అంతే.గృహస్థాశ్రమం అన్న కట్టు వేసినప్పుడు బ్రహ్మచర్య నియమాలు జారిపోతాయి తప్ప బ్రహ్మచర్యంలో ఏ బంధాలున్నాయో అవి, అక్కడ అలవర్చుకున్న సంస్కారం మాత్రం జీవితాంతం ఉంటాయి. ఎప్పటికప్పుడు ఎలా సంస్కరిస్తే వ్యక్తి జీవితాన్ని పండించుకుంటాడో దానికి అవసరమయిన విషయాలను అందించి ఆశ్రమాన్ని మారుస్తారు. -
ధర్మం అంటే..? మంచిమాట
ప్రకృతి ఎలా ప్రవర్తించాలి, ప్రాణికోటి ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే ధర్మం. అది మార్పు చెందే ప్రసక్తే ఉండదు. మనిషికి ఆధ్యాత్మికోన్నతి అందించేదే ధర్మం. మానవ ధర్మాల్లో ముఖ్యమైనవి– నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం, అలాగే మనిషిని దహింప జేసేవి– అత్యాశ, ద్వేషం, పరదూషణ, పగ. మనిషి ఆధ్యాత్మిక కర్మలను ధర్మబద్ధంగా ఆచరించినప్పుడే తనను, సమాజాన్ని, ఇతరప్రాణుల్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు. ధర్మం అనేది లేకపోతే పై వాటికి రక్షణ లేదు. మానవునికి ధర్మాచరణ ముఖ్యం, తాను జీవిస్తున్న సమాజ భద్రతకు, తన జీవన క్రమశిక్షణకు మానవుడు విధిగా ఆచరించవలసిన కొన్ని విశేష ధర్మాలను భాగవతం చెప్పింది. సత్యనిష్ఠ, దయాగుణం, తపస్సు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, నిజాయితీ, నిష్కపటం, ఓర్పు, వినయం మొదలైనవి ప్రతి వ్యక్తి పాటించవలసిన ఉత్తమ ధర్మాలు. ఇవి వ్యక్తిగతంగా తనకే గాక తాను జీవిస్తున్న సమాజానికి, సర్వమానవాళికి కూడా శ్రేయస్సును కలిగిస్తాయి. మానవులకు, జంతువులకు, వస్తువులకు పరమాత్మ ధర్మాలను నిర్దేశించాడు. వినయం, సహనం, ఆచారం, పరాక్రమం మనిషికి సంస్కారం అందించే సాధనాలు. తనకు నచ్చని అంశాలను పరులమీద రుద్దకుండా చేయటం ధర్మం. తన దారిలో ఎవరి మాట వినకుండా ముందుకు నడవడం అధర్మం. అగ్ని వేడిని, నీరు చల్లదనాన్ని అందిస్తాయి. సింహం గర్జిస్తుంది. అటు ఇటూ పరుగెత్తుతూ చపలత్వాన్ని ప్రదర్శించడం లేడి లక్షణం. ఈ రకంగా ప్రతిదీ తన ధర్మాన్ని పాటింపజేయడం కేవలం పరమాత్మ సృజన. ఆయన సంకల్పం లేనిదే మానవ ధర్మం మృగ్యమే. ప్రతి పనిలో మనిషి అభివృద్ధిని ఆశిస్తాడు. అది సాధించాలంటే కఠోర సాధన అవసరం. సాధనే ధర్మం. అది మనిషిని పతనం కానివ్వకుండా కాపాడుతుంది. ధర్మాచరణ వ్యక్తి మనఃస్థితిని బట్టి ఆధారపడి వుంటుంది. తన వ్యక్తిగత ధర్మాన్ని విడిస్తే అది అభివృద్ధిని నిరోధిస్తుంది. అటువంటి వ్యక్తికి సుఖ సంతోషాలు, శాంతి లభించవు. ప్రతి వ్యక్తి ధర్మాన్ని రక్షించాలి. ప్రతి పనినీ ధర్మబద్ధంగా చేయాలి. ధర్మాచరణను కొనసాగించాలి. ‘ధర్మో రక్షతి రక్షితః’. ధర్మాన్ని ఎవరు రక్షిస్తాడో, అట్టి వ్యక్తిని ధర్మమే కాపాడుతుంది. ధర్మానికి హాని చేసేవాడిని ధర్మమే హతమారుస్తుంది. కొలిమిద్వారా పుట్టిన వేడివల్ల ఇనుము వేడెక్కుతుంది. బంగారం శుద్ధి అవుతుంది. అట్లే ధర్మాచరణ వ్యక్తిని, మనసును శుద్ధిపరుస్తుంది. ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేలా చేసుకోవాలి గాని అధర్మం చేస్తూ ఇతరులను భయపెట్టకూడదు. ఎంత సంపాదించినా పైకి తీసుకొని పోయేటపుడు కేవలం పాపపుణ్యాలే కాని మణి మాణిక్యాలు కావు. మన తర్వాత ఉన్నవాళ్లు మనం సంపాదించింది తింటారో తినరో వారికే విధంగా విధి రాసి ఉందో తెలియదు. వారికి భగవంతుడే విధంగా తినేప్రాప్తిని రాసి పెట్టాడో వారు అలానే ఉంటారు. కనుక రాబోయే తరాలకు నువ్వు సంపాదించి ఇచ్చే తాపత్రయం పెంచుకోకూడదు. ధర్మం అంటే పరస్పర రక్షణ. దాన్ని ఆచరించి, రక్షించే ఉత్తమ యోగ్యతనీ బాధ్యతనీ మనిషికి భగవంతుడు ప్రసాదించాడు. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. అదే ధర్మో రక్షతి రక్షితః. ధర్మం వల్ల అన్నీ సాధ్యమౌతాయి: ధర్మాచరణ వలన అర్థప్రాప్తి, ధర్మాచరణం వల్లనే సుఖం, ధర్మం వల్లనే సమస్తం సాధించవచ్చని ధర్మ సారమే ఈ విశ్వమన్న సత్యం మనకు తెలుస్తోంది. స్వధర్మానికి బాధ కలిగించేది–విధర్మం, ఇతరుల ప్రేరణచే ఇతరుల ధర్మాన్ని ఆచరించేది – పరధర్మం, భగవంతుడి పట్ల విశ్వాసరహితులైన వారు చేసేది, చెప్పేది – ఉపధర్మం. తన «దర్మాన్ని నిర్లక్ష్యం చేయడం, చెప్పబడిన ధర్మానికి విపరీతార్థాలను తీసి వివరించడం అనే అయిదు ‘అధర్మాలు’ త్యజించవలసినవిగా వేదవ్యాసుడు పేర్కొన్నాడు. కరుణ, ఆదర్శ గృహస్థ జీవనం, నిత్యకర్మాచరణ శీలత లోక కల్యాణకార కాలు, భగవద్భక్తి మార్గ నిర్దేశాలు. వీటిని మరవడం మన ధర్మాన్ని మనం మరచిపోవడమేనన్నది సత్యం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
Ramadan 2024: సమతా మమతల పర్వం ఈదుల్ ఫిత్ర్!
అల్లాహు అక్బర్ .. అల్లాహు అక్బర్ .. లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్ ..! ఈ రోజు ఎటువిన్నా ఈ స్తోత్ర గానమే, ఆ దయామయుని కీర్తిగానమే వినిపిస్తూ హృదయాలను పులకింపజేస్తూ ఉంటుంది. ఊరు, వాడ, పల్లె, పట్నం, చిన్నా పెద్దా, ఆడా మగా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఈ అమృత వచనాలే జాలువారుతూ ఉంటాయి. కొత్తబట్టలు, కొత్తహంగులు, తెల్లని టోపీలు మల్లెపూలలా మెరిసిపోతుంటాయి. అత్తరు పన్నీరు పరిమళాలు, అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్‌లు, చిరునవ్వుల కరచాలనాలు, ఆలింగనాల ఆనంద తరంగాలు, అలయ్ బలయ్ లతో విశ్వాసుల హృదయాలు సంతోషసాగరంలో ఓలలాడుతూ ఉంటాయి. సేమ్యాలు, షీర్ ఖుర్మాలు, బగారా, బిర్యానీల ఘుమఘుమలతో, ఉల్లాస పరవళ్ళ హడావిడితో ముస్లిముల లోగిళ్ళు కిలకిల నవ్వుతూ, కళకళలాడుతూ ఉంటాయి. ఇళ్ళలో ఆడాళ్ళ హడావిడికి, పిల్లల సందడికి హద్దులే ఉండవు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగ కాదుగదా! నెల్లాళ్ళపాటు భక్తిప్రపత్తులతో జరుపుకున్న పండుగకు అల్విదా చెబుతున్న ముగింపు ఉత్సవం. రమజాన్ నెలరోజులూ ముస్లింల వీధులు ‘సహెరీ’,‘ఇఫ్తార్’ ల సందడితో నిత్యనూతనంగా కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ వింత అనుభూతుల్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్ర గ్రంథ పారాయణా మధురిమను గ్రోలుతూ వినూత్న అనుభూతులతో పరవశించి పోతుంటారు. అవును.., ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాలు, అనుభూతుల సమ్మేళనమే పండుగ. ఇలాంటి ఓ అద్భుతమైన, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్ ’. దీన్నే రమజాన్ పండుగ అంటారు. ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఇది మొదటిదీ, అతి పవిత్రమైనదీను. ఈ నెలలో ముస్లింలు అత్యంత నియమనిష్టలతో రోజావ్రతం పాటిస్తారు. భక్తిశ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్రఖురాన్ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేస్తూ, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారిపై సలాములు పంపుతూ ఉంటారు. దైవనామస్మరణలో అనునిత్యం వారి నాలుకలు నర్తిస్తూ ఉంటాయి. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయులవుతుంటారు. దానధర్మాలు చేస్తారు, ఫిత్రాలు చెల్లిస్తారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాసదీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటితేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉన్న కారణంగా ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి చెందింది. రమజాన్ ఉపవాస దీక్షలు, పవిత్ర ఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకు పోయి ఉంది. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, మానవీయ విలువల్ని జనింపజేయడానికి సృష్టికర్త ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్దునిగా చేయడమే ఉపవాస దీక్షల అసలు లక్ష్యం. ఒక నిర్ణీత సమయానికి మేల్కొనడం, సూర్యోదయం కాకముందే భుజించడం(సహెరి), సూర్యాస్తమయం వరకూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా, రోజూ ఐదుసార్లు దైవారాధనచేస్తూ సూర్యాస్తమయం తరువాత రోజా విరమించడం(ఇఫ్తార్), మితాహారం తీసుకోవడం, మళ్ళీ అదనపు ఆరాధనలు అంటే తరావీహ్ నమాజులు చేయడం, మళ్ళీ తెల్లవారు ఝామున లేవడం – ఈవిధంగా రమజాన్ ఉపవాస వ్రతం మనిషిని ఒక క్రమశిక్షణాయుతమైన, బాధ్యతాయుతమైన, దైవభక్తి పరాయణతతో కూడుకున్న జీవనవిధానానికి అలవాటు చేస్తుంది. మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే వ్రతాన్ని పరాత్పరుడైన అల్లాహ్ వారికి అనుగ్రహించినందుకు, వాటిని వారు నెలరోజులూ త్రికరణ శుద్ధిగా పాటించ గలిగినందుకు సంతోష సంబరాల్లో తేలిపోతూ కృతజ్ఞతాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, పవిత్ర రమజాన్ నెలలోనే సమస్త మానవాళి సన్మార్గ దీపిక అయిన మహత్తర గ్రంథరాజం ఖురాన్‌ను దేవుడు మానవాళికి ప్రసాదించాడు. సమస్త మానవజాతికీ మార్గదర్శక జ్యోతి పవిత్ర ఖురాన్. సన్మార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథరాజం మానవులందరికీ సన్మార్గ బోధన చెయ్యడానికి అవతరించిన ప్రబోధనా జ్యోతి. దైవ ప్రసన్నతను చూరగొనడానికి రోజా పాటించడం,‘తరావీహ్ ’లు ఆచరించడం, దానధర్మాలు చేయడంతో పాటు, ఈ నెల చివరిలో‘లైలతుల్ ఖద్ర్’ అన్వేషణలో అధికంగా ఆరాధనలు చేస్తారు. లైలతుల్ ఖద్ర్ అంటే అత్యంత అమూల్యమైన రాత్రి అని అర్థం. ఉపవాసం పాటించడంవల్ల పేదవాళ్ళ ఆకలి బాధలు అర్థమవుతాయన్నారు. సంపన్నులకు, ముప్పూటలా సుష్టుగా తినేవారికి నిరుపేదల ఆకలికేకలు వినబడవు. అలాంటివారు గనక ఉపవాసం పాటించినట్లయితే ఆకలి బాధ ఎలా ఉంటుందో వారికీ తెలుస్తుంది. తద్వారా పేదసాదలను ఆదుకోవడం, వారికి పట్టెడన్నం పెట్టడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా రమజాన్ నెల ఆరంభంనుండి అంతం వరకు ఒక క్రమపద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఈనెలను గడిపినవారు ధన్యులు. నిజానికి ఇలాంటివారే పండుగ శుభకామనలకు అర్హులు. అందుకే ’ఈద్ ’(పండుగ)ను శ్రామికుని వేతనం(ప్రతిఫలం)లభించే రోజు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఒక ఉన్నతమానవీయ విలువలుకలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదర భావాలకు పునాదివేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్ధం. సదాచరణల సంపూర్ణప్రతిఫలం లభించిన సంతోషంలో అంబరాన్నంటేలా సంబురాలు జరుపుకొని ఆనంద తరంగాల్లో తేలియాడే రోజు ఈదుల్ ఫిత్ర్ . – ఆరోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్ఖు సోదరులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు.‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. పవిత్ర ఖురాన్ రూపంలో అవతరించిన సృష్టికర్త మహదనుగ్రహం దానవుడి లాంటి మానవుణ్ణి దైవదూతగా మలిచింది. అజ్ఞానం అంధకారాల కారు చీకట్లనుండి వెలికి తీసి, విజ్ఞానపు వెలుగుబాటకు తీసుకు వచ్చింది. నైచ్యపు అగాథాలనుండి పైకిలాగి పవిత్రతా శిఖరాలపై నిలిపింది. మానవుల్లోని పశుప్రవృత్తిని మానవీయ పరిమళంతో పారద్రోలింది. ఆటవికతను నాగరికతతో, అజ్ఞాన తిమిరాన్ని జ్ఞానదీపికతో, అవివేకాన్ని వివేకంతో పారద్రోలి మనుషుల్ని మానవోత్తములుగా సర్వతోముఖంగా తీర్చిదిద్దింది. మానవాళికి ఇంతటి మహదానుగ్రహాలు ప్రసాదించి, వారి ఇహపరలోకాల సఫలతకు పూబాటలు పరిచిన నిఖిల జగన్నాయకునికి కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకోవడమే ఈ పండుగ ఉద్దేశ్యం. ఈదుల్ ఫిత్ర్ పర్వదిన శుభాకాంక్షలు – మదీహా అర్జుమంద్ -
ఓ అల్లాహ్ ..ఇదంతా నీవు పెట్టిన భిక్ష!
ముఫ్ఫై రోజుల రమజాన్ ఉపవాసాలు పూర్తయ్యాయి... సహరీ, ఇఫ్తార్ ల ద్వారా సహనశీలత, కృతజ్ఞతాభావం అలవడ్డాయి.. ఖురాన్ పారాయణం, తరావీహ్ నమాజులు ఆత్మకు నెమ్మదిచ్చాయి. మండే ఎండల్లో రోజాలో ఉంటూ ఆకలిని తట్టుకునే సహనం అలవడింది. ఓ అల్లాహ్! ఇదంతా నీ కృపాకటాక్షాలతోనే సాధ్యమైంది! ! ఓ అల్లాహ్! నీకు వేనవేల షుక్రియా (కృతజ్ఞతలు) అంటూ అల్లాహు అక్బర్... అల్లాహు అక్బర్ నినాదాన్ని బిగ్గరగా పఠిస్తూ ఈద్గాహ్ కు చేరుకుంటారు. ‘తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్ కుమ్’ మా రమజాన్ ఆరాధనలన్నీ స్వీకరించు ప్రభూ! అంటూ వేడుకుంటారు. నెల రోజుల రమజాన్ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తిచేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపునే శుభ సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్’ రమజాన్ పర్వదినం. ఈద్గాహ్ మైదానానికి చేరుకుని అల్లాహ్ ఘనతను, గొప్పతనాన్ని చాటిచెప్పే ముస్లిముల హృదయాలు పులకించిపోతాయి. ఓ అల్లాహ్ మేము 30దినాలు పాటించిన రమజాన్ రోజాలు, నమాజులు, సహరీ, ఇఫ్తార్లు ఇవన్నీ నీవు పెట్టిన భిక్షయే అల్లాహ్ అని ఆనంద భాష్పాలు రాల్చే శుభఘడియలు. రంజాన్‌లో అల్లాహ్‌కు ఇచ్చిన వాగ్దానాలు మిగతా 11నెలలూ ఆచరణాభాగ్యానికి నోచుకోవాలని రోదిస్తారు. రాబోయే రంజాన్ వరకూ రంజాన్ స్ఫూర్తి కొనసాగించే భాగ్యాన్నివ్వమని అల్లాహ్ కు విన్నవించుకుంటారు. రెండు రకాతుల షుక్రానా నమాజు చేస్తారు. రమజాన్ మొదలు మళ్లీ వచ్చే రంజాన్ వరకూ స్వర్గాన్ని ఉపవాసకుల కోసం ముస్తాబు చేస్తారు. అలాంటి రంజాన్‌ను మరోసారి ఇచ్చినందుకు అల్లాహ్‌కు షుక్రియా తెలుపుకుంటారు. కేవలం మేము రంజాన్ వరకే ముస్లిమ్గాగా ఉండకుండా మిగతా 11నెలలూ ముస్లిమ్‌గా జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించు అని అల్లాహ్‌ని వినమ్రంగా వేడుకుంటారు. నెలంతా ఎన్నెన్ని ఆరాధనలు, మరెన్ని పుణ్యకార్యాలు చేసినా వాటిపట్ల రవ్వంత గర్వాన్ని కూడా రానీయకూడదు. నెలసాంతం పాటించిన ఉపవాసాలు, పఠించిన ఖురాన్ పారాయణం, రాత్రుళ్లు నిద్రను త్యాగం చేసి ఆచరించిన నమాజులు, జకాత్, ఫిత్రా దానాలను నీవు నీ ప్రత్యేక కారుణ్యంతో స్వీకరించు ప్రభూ! మా శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ప్రసాదించు అని వేడుకుంటారు. నమాజు తరువాత ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు. అందరి పండుగ.. ఈదుల్ ఫిత్ర్ పండుగ నాడు ప్రతీ ముస్లిమ్ కుటుంబం ఉన్నదాంట్లో గొప్పగా జరుపుకుంటుంది. ఇంటిల్లిపాది కొత్తబట్టలు ధరించడం, అత్తరు పరిమళాలు పూసుకోవడం ప్రవక్త సంప్రదాయంగా భావిస్తారు. షీర్ ఖుర్మా పాయసాన్ని తమ ఆత్మీయులకు, దగ్గరి బంధువులకు, ఇరుగు పొరుగు వారికి అందించి ప్రేమను చాటుకుంటారు. తమకు అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహ భాగ్యాలను చాటుకోవాలన్నది ప్రవక్త బోధన. ఫిత్రా, జకాత్ దానాలతో నిరుపేదలు సైతం పండుగను సంతోషంగా జరుపుకుంటారు. కుటుంబంలోని ఎంతమందైతే ఉన్నారో ప్రతీ ఒక్కరూ ఫిత్రా దానాన్ని లెక్కించి నిరుపేదలకు పంచాలన్న ప్రవక్త సూక్తిని ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందే. అర్హులై ఉండి ఫిత్రా చెల్లించకపోతే ఉపవాసాలు స్వీకరించబడవన్నది కూడా ప్రవక్త హెచ్చరిక. ఈదుల్ ఫిత్ర్ ఇలా... ఈదుత్ ఫిత్ర్ పర్వదినంనాడు ముహమ్మద్ ప్రవక్త (స) కొన్ని ఖర్జూరపు పండ్లు తిని నమాజుకోసం ఈద్గాహ్కు వెళ్లేవారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముస్లిములు ఖర్జూరాలు తిని ఈద్గాహ్ కు చేరుకుంటారు. ఈద్గాహ కు కాలినడకన వెళ్లడం ఉత్తమం. ఈద్ నమాజు తరువాత పిల్లలకు ఈదీ (ఈద్ కానుక)లు ఇస్తారు. ఖజా రోజాలు... రమజాన్ నెలలో ఎలాంటి కారణం లేకుండా ఒక్క రోజాను వదిలేసినా మిగతా రోజుల్లో ఏడాదంతా ఉపవాసం పాటించినా సరితూగదన్నది ప్రవక్త బోధనల సారాంశం. అయితే కొంతమందికి రమజాన్ నెల ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంది. బాలింతలు, రుతుక్రమంలో ఉన్న స్త్రీలు, రోగగ్రస్తులు మిగతా రోజుల్లో ఆ ఉపవాసాల సంఖ్యను పూరించాలన్నది ఖురాన్ ఉద్బోధ. ఇలాంటి రోజాలను ఖజా రోజాలు అని అంటారు. వీలయినంత త్వరగా ఈ రోజాలను పూర్తిచేయాలని ఉలమాలు సందేశమిస్తారు. రంజాన్ లో తప్పిపోయిన రోజాలను తొలి తీరికలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. రమజాన్ స్ఫూర్తిని ఏడాదంతా కొనసాగించాలి. ఖురాన్ ప్రబోధనలు ►మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైనరీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేసే అవకాశం లభిస్తుందేమో అనే దురుద్దేశ్యంతో దానిని న్యాయనిర్ణేతల వద్దకు తీసుకునిపోకండి. (2:188) ►ధర్మం విషయంలో నిర్బంధంకానీ, బలాత్కారంకానీ లేవు. (2:253) న్యాయం పలకాలి. ►అనాథుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు.(4:10) ►తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాథులూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. (4:36) ►మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరి తోనూ సహకరించండి. పాప కార్యాలలో అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి. (5:2) ►అల్లాహ్‌కు పరిశుద్ధతను పాటించేవారు అంటేనే ఇష్టం.(9:108) ►పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము వారికీ ఉపాధిని ఇస్తాము, మీకూ ఇస్తాము. వాస్తవానికి వారిని హత్య చేయటం ఒక పెద్ద నేరం. (17:29) నీవు అనాథులపట్ల కఠినంగా ప్రవర్తించకు.యాచకుణ్ణి కసురుకోకు.(93.10) (చదవండి: హలీమ్.. రుచికి సలామ్) -
చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు?
“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు , దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. అంతటి విశిష్టత గల చైత్ర మాసంలో దాగున్న విశిష్టతలేంటో సవివరంగా తెలుసుకుందామా!. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు. చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది. ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లు, చేమలే కాదు, పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. ఏడాదికి యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది, ఉగాది అయ్యింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుంచి సంవత్సరాదిని జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు. మనం సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాం. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు , రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు , మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి, నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి, చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది. రామాయణం లోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు , వనవాసానికి వెళ్ళటం , దశరథుని మరణం , సీతాపహరణం , రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం , శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి. చైత్రంలో జరపుకునే పండుగలు.. చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి , మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు. చైత్ర శుద్ధ తదియ – డోలాగౌరీ వ్రతం(సౌభాగ్య గౌరీ వ్రతం), సౌభాగ్య శయన వ్రతం, ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి , డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు , చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని , పుత్రపౌత్రాదులను , భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ రోజు మత్స్య జయంతి కూడా. – శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి , వేదాలను రక్షించిన రోజు. చైత్ర శుద్ధ పంచమి – లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు పూజించాలి. అనంత , వాసుకి , తక్షక , కర్కోటక , శంఖ , కుళిక , పద్మ , మహాపద్మ అనే మహానాగులను పూజించి , పాలు , నెయ్యి నివేదించాలి. అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామునిగా అవతరించిన రోజు.. శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది. ఒకవేళ చేయలేకపోయినా , శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది. చైత్ర శుద్ధ అష్టమి –భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి, అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది. చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి . శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈ రోజు ఊరూరా, వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం. చైత్ర శుద్ధ ఏకాదశి – వరూధిన్యేకాదశి , కామద ఏకాదశి అని అంటారు. చైత్ర శుద్ధ పౌర్ణమి – స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. చైత్ర బహుళ త్రయోదశి – యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు. ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు , ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని , రామాయణ సారాన్ని గ్రహించి ఆచరించే యత్నం చేద్దాం. సీతారాముల కళ్యాణం చూసి తరిద్దాం. ఈ ఏడాది కొత్తగా అయోధ్యలో ఏర్పాటైన రామాలయంలో సీతా రాముల కళ్యాణం వైభవోపతంగా జరగనుండటం విశేషం. (చదవండి: Ugadi 2024 : ఈ ఏడాది ఉగాది పేరేంటి? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ ) -
చైత్రంలోనే ఉగాది ఎందుకు జరుపుకోవాలి?
చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో ఆ నెలకు ఆ మాసం పేరు వస్తుంది. ఇది అందరికీ తెలిసింది. ఎన్నో పవిత్రమైన నెలలు ఉండగా పనిగట్టుకుని ఈ చైత్రంలోనే ఉగాది పండుగ ఎందుక జరుపుకుంటున్నాం. పైగా ఈ కాలం సూర్యుడి భగభగలతో ఇబ్బంది పడే కాలం కూడా అయినా కూడా ఈ నెలకే ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారు. అదీగాక చైత్రమాసాన్ని విశిష్ట మాసం కూడా చెబుతారు. ఎందుకు అంటే.. నిజాని విఘ్నాలను తొలగించే వినాయకుని పండుగ వచ్చేది భాద్రపదమాసంలో కాబట్టి అంతకు మించి ఉత్క్రుష్టమైన నెల ఇంకొకటి ఉండదు. అలాగే అన్ని నెలల్లోకెళ్ళా శ్రేష్ఠమైంది మార్గశిర మాసం. ''మాసానాం మార్గశీర్షోహం'' అని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే. ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో , లక్ష్మీ, సరస్వతి, కనకదుర్గాదేవిల పూజలు నిర్వహిస్తాం. పోనీ చాతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనో, ఉత్థాన ద్వాదశి వచ్చే కార్తీకమాసం..ఇంతటీ పవిత్రమైన నెలలన్నింటిని పక్కన పెట్టి మరీ చైత్రంలోనే ఉగాది ఎందుకు జరుపుకుంటున్నాం అంటే.. చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి, వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసం వచ్చేటప్పటికీ శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం, పగుళ్ళు, పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు - ఇలా అంతా లబ్దికరంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. చలికాలంలో, వర్షాకాలంలో ఉండే మండగోడితనం వసంతఋతువు నుండి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం. జీవిత సత్యం.. నిశితంగా చూస్తే..ఇది మనిషి జీవితానికి అర్థం వివరించేలా ఉంటుంది. ఎందుకంటే కష్టాలతో కడగండ్ల పాలై డీలా పడి ఉన్నప్పుడూ ఆగిపోకూడదని, సూచనే ఈ వసంతకాలం. ప్రకృతిలో ఆకురాలు కాలం ఉన్నట్లుగానే మనిషి జీవితంలో పాతాళానికి పడిపోయే ఆటుపోట్లు కూడా ఉంటాయని అర్థం. కాలగమనంతో అవి కూడా కొట్టుకుపోయి మనికి మంచి రోజులు అంటే.. వసంతకాలం చెట్లు చిగురించినట్లుగా జీవితం కూడా వికసిస్తుందని, చీకట్లుతోనే ఉండిపోదని చెప్పేందుకు. చలి అనే సుఖం ఎల్లకాలం ఉడదు, మళ్లీ కష్టం మొదలవుతుంది. ఇది నిరంతర్ర చక్రంలా వస్తునే ఉంటాయి. మనిషి సంయమనంతో భగవంతుడిపై భారం వేసి తాను చేయవలసిని పని చేస్తూ ముందుకు పోవాలన్నదే "కాలం" చెబుతుంది. "కాలం" చాలా గొప్పది. అదే మనిషిని ఉన్నతస్థాయికి తీసుకొస్తుంది. మళ్లీ అదే సడెన్‌గా అగాథంలోకి పడేసి పరిహసిస్తుంటుంది. అంతేగాదు కాలం ఎప్పుడూ మనిషిని చూసి నవ్వుతూ ఉంటుందట. ఎందుకంటే ఎప్పుడూ మనమీద గెలిచేది తానే (కాలమే) అని. ఎందుకంటే బాధ రాగానే అక్కడితో ఆగిపోతుంది మనిసి గమనం. వాటితో నిమిత్తం లేకుండా పయనం సాగిస్తేనే నువ్వు(మనిషి)అని కాలం పదే పదే చెబుతుంది. కనీసం ఈ ఉగాది రోజైన కాలానికి గెలిచే అవకాశం ఇవ్వొద్దు. కష్టానికే కన్నీళ్లు వచ్చేలా మన గమనం ఉండాలే సాగిపోదాం. సంతోషం సంబంరంగా మన వద్దకు వచ్చేలా చేసుకుందాం..! (చదవండి: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు?) -
Ugadi 2024: క్రోధిని కార్యసాధనంగా మలచుకుందాం!
ఉగాది తెలుగువారి తొలిపండుగ. ప్రభవతో మొదలు పెట్టి అక్షయ వరకు తెలుగు సంవత్సరాలు 60. ఈ వరుసలో ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఉగాదికి క్రోధి నామ సంవత్సర ఉగాది అని పేరు. క్రోధి అంటే కోపం కలవారని సామాన్యార్థం. క్రోధి అనే పదానికి కొన్ని నిఘంటువులు కోప స్వభావులైన కుక్క, దున్న΄ోతు అని అర్థం చెప్పినప్పటికీ, దానిని పరిగణనలోకి తీసుకోనక్కరలేదు. అన్ని స్వభావాల లాగే మనిషికి కోపం లేదా క్రోధం కూడా అవసరమే. మనకు ఎంత అవసరమో, అంతవరకు మాత్రమే కోపాన్ని ఉంచుకోవాలి. మిగిలిన దానిని నిగ్రహించుకోవాలి. ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడు కూడా కొన్ని సందర్భాలలో కోపించాడు. అలా మన జీవితాలకు అవసరమైన మేరకు మాత్రమే కోపాన్ని ఈ ఉగాది ఇస్తుందని, ఇవ్వాలనీ ఆశిద్దాం. ఉగాదితో చాంద్రమాన సంవత్సరం మొదలవుతుంది. పౌర్ణమిచంద్రుడు చిత్త లేదా చిత్ర నక్షత్రంతో కూడి ఉన్న మాసాన్ని చైత్రమాసంగా పిలుస్తారు. చైత్రమాసం తొలిరోజు అంటే చైత్రశుక్ల పాడ్యమి రోజు ఉగాది అవుతుంది. చంద్రుడు ఒక నక్షత్రంతో మొదలుపెట్టి, భూమి చుట్టూ తిరిగి మళ్లీ ఆ నక్షత్రం దగ్గరకు రావడానికి పట్టే కాలం నక్షత్రమాసం అవుతుంది. ఆ రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. కాలానికి సూర్య, చంద్ర గమనాలుప్రాతిపదిక కాబట్టి ఈ మేరకు చాంద్ర–సౌర సంవత్సరం అవుతుంది. వ్యావహారిక శకానికి పూర్వం తొలిదశలో సప్తఋషులు నక్షత్ర సంవత్సరాన్ని, చాంద్ర–సౌర సంవత్సరాన్ని కలిపి పంచాంగాన్ని అమలులోకి తెచ్చారు. మూడు, ఐదు సంవత్సరాలలో వచ్చే అధికమాసాలను కలుపుకుని ఐదు సంవత్సరాలతో ఒక యుగం అని పంచాంగ పరంగా అమలు చేశారు. అప్పట్లో ఆ యుగం ఆరంభం శరత్ విషువత్, శరత్ ఋతువు లో ఉండేది. ఈ ఐదు సంవత్సరాల యుగంలో మొదటి సంవత్సరంలో మొదటి రోజు యుగాది అయింది; అదే ఉగాది అయింది. ఈ యుగం జ్యోతిష శాస్త్రానికి అనుగుణం గా కూడా రూపొందింది. ‘జ్యోతి’ అంటే నక్షత్రం అనీ ‘షం’ అంటే సంబంధించిన అనీ అర్థం. జ్యోతిషం అంటే నక్షత్రానికి సంబంధించినది అని అర్థం. చాంద్ర– సౌర గమనాలప్రాతిపదికన మన పంచాంగం నిర్మితమైంది. పంచాంగం ప్రకారం మనకు ఉగాది నిర్ణీతమైంది. విశ్వామిత్ర మహర్షి పంచాంగంలోనూ, కాలగణనంలోనూ కొన్ని ప్రతిపాదనలను, మార్పులను తీసుకు వచ్చాడు. ఆ తరువాత కాలక్రమంలో జరుగుతూ వచ్చిన ఖగోళమార్పులకు తగ్గట్లు గర్గ మహాముని సంవత్సరాదిని వసంత విషువత్కు మార్చాడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు దాన్నే కొనసాగించారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. సాంప్రదాయిక సంవత్సరాన్ని లేదా ఆచార వ్యవహారాల కోసం సంవత్సరాన్ని చైత్రమాసంతో మొదలుపెట్టారు. వసంతం, వసంతంతోపాటు ఉగాది... ఈ రెండు ప్రాకృతిక పరిణామాల్ని మనం మన జీవితాలకు ఆదర్శంగా తీసుకోవాలి, వసంత ఋతువు రావడాన్ని వసంతావతారం అని కూడా అంటారు. వసంతావతారం సంవత్సరానికి ఉన్న అవతారాలలో గొప్పది, ఆపై శోభాయామానమైంది. సంవత్సరానికి శోభ వసంతం. వసంతం మనకు వచ్చే ఋతువుల్లో ప్రధానమైంది లేదా కేంద్రభాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, చెట్లకు కొత్త చివుళ్లు, కోయిలల గానాలు, పచ్చదనం, పువ్వుల కళకళలను తీసుకు వచ్చేది వసంతమే. అందుకే వసంతంలో ఎక్కువ వేడి, చలి ఉండవు. వాతావరణం ఉల్లాసకరంగా ఉంటుంది. వసంతం శ్రేష్ఠమైంది కాబట్టే శ్రీకృష్ణుడు భగవద్గీతలో తాను ఋతువుల్లో వసంతాన్ని అని చె΄్పాడు. నాటి కవులు, పండితులు మొదలుకొని కళాకారుల వరకు అందరికీ వసంత రుతువంటేనే మక్కువ. వసంతాన్ని కుసుమాకరం అనీ, కుసుమాగమం అనీ అంటారు. కుసుమానికి పుష్పం, పండు, ఫలం అని అర్థాలు ఉన్నాయి. ఈ మూడూ మనకు ఎంతో అవసరం అయినవి. తప్పకుండా మనం వీటిని పొందాలి. మన జీవితాలు కూడా నిండుగా పుష్పించాలి, పండాలి, ఫలవంతం అవ్వాలి. వసంతాన్ని ప్రకృతి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి. వసంతం ఒక సందేశం దాన్ని మనం అందుకోవాలి, అందుకుందాం. సంవత్సరంలో ఉండే మంచితనం వసంతం. వసంతం ప్రకృతి నుంచి మనకు అందివచ్చే మంచితనం. ‘...సంతో వసంతవల్లోకహితం చరంతః ...‘ అని వివేక చూడామణిలో జగద్గురు ఆదిశంకరాచార్యులవారు అన్నారు. అంటే మంచివాళ్లు వసంతంలాగా లోకహితాన్ని ఆచరిస్తారు అని అర్థం. వసంతం వంటి హితం. హితం వంటి వసంతం మనకు, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం. శుభానికి తొలి అడుగుగా, మంచితనానికి మారు పేరుగా అన్ని ఆరంభాలకూ ఆది అయిన తొలి పండుగగా ఉగాదికి విశిష్టత ఉంది. ఇతర పండుగలలా కాకుండా ఉగాది కాలానికి, ప్రకృతికి సంబంధించిన పండుగ. మనిషి కాలానికి, ప్రకృతికి అనుసంధానం అవ్వాలని తెలియజెప్పే ఒక విశిష్టమైన పండుగ. ఆరు ఋతువులకు ఆదిగా వచ్చేది ఈ పండుగ. సంవత్సరంలోని ఆరు ఋతువులకు ప్రతీకలుగా తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపుల్ని తీసుకుని ఆ రుచుల కోసం కొత్త బెల్లం, మిరియాల΄÷డి, వేపపువ్వు, మామిడి పిందెలు, ఉప్పు, కొత్త చింతపండు కలిపి తయారు చేసిన ఉగాది పచ్చడిని మనం తీసుకుంటున్నాం. నింబకుసుమ భక్షణం అని దీనికి పేరు. ఇది ఉగాది పండుగలో ముఖ్యాంశం. మరో ముఖ్యాంశం పంచాంగశ్రవణం. ఆదిలోనే ఎవరి రాశి ప్రకారం వారికి సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉన్న మేలు, కీడులను ఆయా రాశి గల వ్యక్తులకు సూచన్రపాయంగా పంచాంగం తెలియచెబుతుంది. పంచాంగ శ్రవణానికి ముందుగా మనం అభ్యంగన స్నానం చేసి, మామిడి తోరణాలతో, పుష్పాలతో ఇళ్లను అలంకరించుకుని దైవపూజ చెయ్యాలి. ప్రకృతి ఇచ్చిన సందేశాలుగా అందివచ్చిన ఉగాదిని, వసంతాన్ని ఆకళింపు చేసుకుని, ఆదర్శంగా తీసుకుని, మనం మనకు, ఇతరులకు ఈ ఏడాదిలోని అన్ని ఋతువుల్లోనూ హితకరం అవుదాం. కాలం ఒక ప్రవాహం కాలం నదిలాంటిది. ముందుకు ప్రవహిస్తుందే కానీ, వెనక్కి తిరగదు. అలా ముందుకు ప్రవహించే నదిలో ఎన్నో సెలయేర్లు, వాగులు, వంకలు కలిసి ఉన్నట్టే... కాలవాహినిలో తృటి, క్షణం, ముహూర్తం, దినం మొదలైన కాలగతి సూచికలు మిళితమై ఉంటాయి. వీటిన్నింటి మేలు కలయికే కాల ప్రవాహం. ఇటువంటి కాలాన్ని ఉగాది రూపంలో ఆరాధించాలన్నదిప్రాచీనుల నిర్దేశ్యం. ప్రతి కొత్త సంవత్సరం శుభపరంపరలతో కొనసాగాలని కోరుకోవడంతోపాటు శుభాచరణకు మనల్ని మనం సమాయత్తం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆరు రుచులలో అనేక అర్థాలు ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరు రుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈ సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి. పంచాంగ శ్రవణ ఫలమేమిటి? ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు. ఉగాది పంచాంగ శ్రవణం వల్ల. భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. వీటితోపాటు సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వల్ల గ్రహదోషాలు నివారితమై , వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందంటారు పెద్దలు. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణను చేపట్టవచ్చు. నూతనత్వానికి నాంది బ్రహ్మదేవుడు సృష్టినిప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలుప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదనే కదా అర్థం. – డి.వి.ఆర్. భాస్కర్ -
సోమావతి అమావాస్య అంటే.. రావిచెట్టుకి ప్రదక్షిణాలు ఎందుకు?
అమావాస్య గనుక సోమవారం నాడు వస్తే ఎంతో పుణ్యప్రదమైనది. మన దక్షిణాదిన కన్నా ఉత్తరాదిన దీనిని చాలామంది ఆచరించడం మనం చూస్తాం. హరిద్వార్‌లోని ప్రయాగలో ఈరోజు పది లక్షల మంది స్నానాలు ఆచరిస్తారు. అంత పవిత్రమైన రోజునే పాశ్చాత్య దేశాల్లో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అందువల్ల ఈ అమావాస్య మరింత విశేషమైనది. సోమావారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమావతి అమావాస్య అనిపిలుస్తారు. ఈ రోజు ఏం చేస్తారు?, ఏ దేవుడిని పూజిస్తారు? సవివరంగా తెలుసుకుందామా..! అమావాస్యా తు_సోమేన, సప్తమీ_భానునాయుతా చతుర్థీ భౌమవారేణ బుధవారేణ చాష్టమీ। చతస్రస్తిథయస్త్వేతాస్సూర్యగ్రహణ సన్నిభాః స్నానం, దానం, తథాశ్రాద్ధం సర్వం తత్రాక్షయం భవేత్ ॥ ఎప్పటి నుంచి ఆచరిస్తున్నారంటే.. దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అలాగే అల్లుడైన పరమశివున్ని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు. శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్లిన సతీదేవి అవమానానికి గురై శరీరాన్ని త్యాగం చేస్తుంది. సతీదేవి మరణ వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. సమస్త ప్రమథ గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరిని చితకబాదుతాడు. శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు. ఆ సమయంలో ఒంటినిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివున్ని శరణు వేడుకుంటాడు. చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన భోళాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు. ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుడి పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమవతి అమావాస్యగా మనం జరుపుకుంటున్నాం. ఇవాళ ఉదయం అమావాస్య ఉన్నందువలన ఉదయం మనం ఆచరించే స్నాన, దానాదులకుశ్రాద్ధకర్మకు అక్షయమైన ( తరిగిపోని ) పుణ్యఫలమని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇవాళ ఉదయం నదీస్నానం , పితృతర్పణం, శక్తి కొలది దానము చేయాలి. ఆడవారు సోమవతీ అమావాస్య వ్రత కథ చదువుకుని,ఉపవాసముతో ఉండి అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ ( రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు ) 108 చేస్తే మంచిది. అంతేగాదు ఈ సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలన్ని తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. ఈ రోజు విష్ణువుని, తులిసీ చెట్టుని పూజిస్తే ధనానికి లోటు ఉండదు. చేయకూడనవి.. ఈరోజు జుట్టు గోర్లు కత్తిరించకూడదు. మహిళలు తలస్నానం చేయకూడదు. మాంసము మద్యానికి దూరంగా ఉండాలి. ఈ రోజున సొరకాయ, దోసకాయ శనగలు, జీలకర్ర, ఆవాలు, ఆకుకూరలు తినకూడదు. ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు. ఈరోజు వస్తువులు కొనడం మానుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. -
పెళ్ళి... ఇద్దరి మధ్య వ్యవహారం కాదు
ధర్మం, కామం, అర్థం సమంగా ఉంటే... మోక్షం అనేది కొత్తగా ప్రయత్నించి తెచ్చుకోనక్కరలేదు. అదే వస్తుంది. అంటే ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన కామం ఉండాలి. నేను డబ్బు సంపాదిస్తే ధార్మికంగా సంపాదించానా ? ఖర్చుపెడితే.. ధర్మంకోసం ఖర్చు పెట్టానా? నాకు మనసులో ఒక కోరిక పుడితే ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? దీనిని నేను నెరవేర్చుకోవచ్చా? ... ఈ పరిశీలన అలవాటయితే అర్థం. కామం ధర్మానికి ముడిపడిపోయినట్టే. సామాన్యులకు కూడా ప్రయోజనం చేకూరాలని మన రుషులు ప్రవేశపెట్టిన మార్గం ఇది.. అదే గృహస్థాశ్రమం. గృహస్థు అంటే కేవలం ఒక గృహంలో ఉన్నవాడని కాదు. గృహస్థాశ్రమ స్వీకారం చేశాడు... అంటే ధర్మాన్ని స్వీకరించాడు.. అని. తరువాత నిత్యకర్మ చేయకుండా ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. ఏదో కర్మ చేయవలసిందే. దీనివల్ల చివరకు ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా మోక్షమే కలుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. రామాయణంలో భరతుడు ఒక మాటంటాడు. నాలుగు ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం శ్రేష్ఠమైనది–అని. అంతకన్నా గొప్పది మరొకటి లేదు. కోటలో యుద్ధం చేయడం గృహస్థాశ్రమం. కోట బయట చేసేవి ఇతర ఆశ్రమాలు. అవి జన్మతః వైరాగ్యం కలిగిన మహాపురుషులకే సాధ్యం. ఎన్నో జన్మల అనుష్ఠాన బలం వారిది. వారు కారణజన్ములు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు, చంద్రశేఖర భారతీ మహాస్వామివారు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, అరుణాచల భగవాన్ రమణులు... ఇటువంటివారు ఎక్కడో కోట్లలో ఒకరుంటారు. కానీ అందరికి అందుబాటులో ఉండేది, అర్థకామములను ధర్మం తో ముడివేసుకోవడానికి యోగ్యమైనది – గృహస్థాశ్రమం. దీని ప్రవేశం... కేవలం ఒక పురుషుడికో, ఒక స్త్రీకో సంబంధించినది కాదు. అంటే పెళ్ళి ఎప్పుడూ పూర్తిగా వ్యక్తిగత విషయం కానే కాదు. ఇక్కడ సక్రమంగా ప్రవర్తించకపోతే... దాని చెడు ప్రభావం సమాజం మీద పడుతుంది. కచ్చితంగా మూడవ వ్యక్తిమీద అది ప్రభావం చూపి తీరుతుంది. అదే దంపతులిద్దరూ అన్యోన్యంగా బతకగలిగితే... మూడవ వ్యక్తికి ఆదర్శంగా నిలుస్తారేమో గానీ, సమాజాన్ని అది చెడుగా ప్రభావితం చేసే అవకాశమేలేదు. వాళ్ళిద్దరూ పుట్టుకనుంచి కలిసి ఉన్నవారు కాదు, కలిసి చదువుకోలేదు, కలిసి బతకలేదు. అకస్మాత్తుగా ఇద్దరు కలుసుకుని జీవిత ప్రయాణానికి, ఒక ఆశ్రమ నియమానికి కట్టుబడటానికి సిద్ధమవుతున్నారు. మనం ఒక ఉద్యోగంలో చేరితేనే... సవాలక్ష నియమాలకు అంగీకరించినప్పడే దానిలో కొనసాగగలం. అటువంటిది ఒక జీవితకాలం పూర్తిగా కలిసి ఇద్దరూ ప్రయాణించాలి. పుట్టిన సంతానానికి మార్గదర్శకంగా నిలవాలి... అంటే దానికి ఎంతో పరిణతి ఉండాలి. జీవితం అంటే పూలపడవ కాదు కదా... వెలుతురు, చీకటి, కష్టాలు, సుఖాలు... అన్నింటినీ చక్కగా సమన్వయంతో, అవగాహనతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వంశాభివృద్ధి చేసుకుంటూ సంసారనావను నడపాల్సి ఉంటుంది. అటువంటి సంసారంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది సమాజాన్ని సానుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ ప్రభావితం చేస్తుంటుంది. అందుకే పెళ్ళి ఎప్పుడూ ఇద్దరి మధ్య వ్యవహారం కాదు. -
తానెంతో జగమంత
ప్రతిమనిషి, సరిగా చెప్పాలంటే ప్రతి జీవి ప్రపంచం అంతా తన వంటిదనే అనుకుంటుంది. తన దృష్టికోణం లోనే చూస్తుంది. అందుకే అబద్ధాలాడేవారికి అందరూ అబద్ధాలు చెపుతారనే అభిప్రాయమే ఉంటుంది. ఎవరి మాటనీ ఒక పట్టాన నమ్మరు. తాను అబద్ధం చెప్పనప్పుడు ఎదుటివారు అబద్ధం చెపుతున్నారేమో అనే అనుమానం ఎందుకు వస్తుంది? పైగా తను చెప్పేది నిజం అని నమ్మమని ఒకటికి పదిసార్లు నొక్కి వక్కాణిస్తూ ఉంటారు. అవతలి వారు నమ్మరేమోననే సందేహం ఎందుకు వస్తుంది? తాను చెప్పే మాట మీద తనకే నమ్మకం లేదు కనుక. ఇతరులని మోసం చేసే గుణం ఉన్నవారు ఇతరులు తమని మోసం చేస్తారేమో నని భయపడుతూనే ఉంటారు. మోసం చేసే బుద్ధి తనకి లేక పోతే ఎదుటివారు తనని మోసం చేస్తారేమో ననే అనుమానం కూడా రాదు. పరాయి ఆడపిల్లలని చెడుదృష్టితో చూసేవారు తమ ఇంటి ఆడవారిని బయటకు పంపటానికి ఇష్టపడరు. దీనికి పెద్ద ఉదాహరణ రావణుడే. కనపడిన ప్రతి స్త్రీని కామదృష్టితో చూసి, చేజిక్కించుకోవా లనుకునే గుణం ఉన్నవాడు కనుకనే తన భార్యలని కట్టడిలో ఉంచాడు. మేలిముసుగు లేకుండా వారిని బయటికి రానిచ్చేవాడు కాదు. ఆ విషయాన్ని రావణ వధానంతరం యుద్ధభూమిలో పడి ఉన్న రావణుణ్ణి చూసి మండోదరి ‘‘మేలిముసుగు లేకుండా నీ భార్యల మైన మేము ఇక్కడికి వస్తే ఏమి అనటం లేదేమి?’’ అని ప్రశ్నించటంలో తెలుస్తుంది. అదే రావణుడు తన చెల్లెలు శూర్పణఖ విషయంలో అవేవీ పాటించ నక్కర లేదని చెప్పి స్వేచ్ఛగా వదిలేశాడు. రాక్షసవంశంలోనే పుట్టిన ప్రహ్లాదుణ్ణి ‘‘కన్నుదోయి కన్యకాంత లడ్డం బైన మాతృభావము చేసి మరలువాడు’’ అని పోతనామాత్యుల వారు వర్ణించారు. స్త్రీల పట్ల సద్భావం కలవాడు కనుక తన తల్లిని, ఇతర స్త్రీలని కూడా గౌరవభావంతో చూడటం తటస్థించింది. జంతువులన్నీ ఇతర జంతువులు, ముఖ్యంగా మనుషుల మీద దాడి చేయటానికి కారణం వాటికి ఉన్న అభద్రతా భావం. అవి ఎదుటి జంతువులని తినటమో, బాధించటమో చేస్తాయి కనుక ఎదుటి జంతువులు కూడా తమని బాధిస్తాయేమోనని ఎదురు దాడి చేస్తాయి. నాగుపాముని చూస్తే ఈ విషయం బాగా అర్థ మౌతుంది. మంచి జాతి సర్పం ఎదురు పడగానే మనిషి భయపడితే అది కూడా భయ పడుతుంది. దాని వంక ప్రేమగా, లేక భక్తితో చూస్తే అది కూడా అదే భావంతో చూసి తొలగిపోతుంది. అందుకే త్రాచుపాము కనపడగానే చేతులు జోడించి నమస్కారం చేసి కదలకుండా ఉండమని చెపుతారు. తేలుకి ఎదుటి ్ప్రాణి తనని బాధిస్తుందనే సందేహం ఉంటుంది కనుక ఏది అడ్డు తగిలితే దానిని కుట్టుకుంటూ పోతుంది. ఇటువంటి లక్షణాలే మనుషులలో కూడా కనిపిస్తాయి. అకారణంగా ఇతరులని బాధించేవారు, భయం వల్లనే బాధిస్తారు. పచ్చకామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది కదా! అదేవిధంగా ‘‘ఆత్మవత్ సర్వభూతాని’’ అని భావించి ఎదుటివారి కష్టం తనది భావించి తదనుగుణంగా స్పందించేవారు, ఎవరికి మేలు కలిగినా తమకే కలిగి నంతగా సంతోషించేవారు ఉన్నారు. ఎవరికి ఆపద కలిగినా వీరి కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎవరికి మంచి జరిగినా వీరు పండగ చేసుకుంటారు. అంటే, ఈ కోవకి చెందిన వారు జంతు ప్రవృత్తి నుండి కొంత ఎదిగినట్టు చెప్పవచ్చు. ఈ విధంగా ఉండి అందరు తన లాగానే ఉంటారు అనుకోవటం వల్ల లౌకికంగా నష్టపోయిన వారూ ఉన్నారు. కాని, మానవతా దృక్పథంలో వారు ఉన్నత స్థానానికి చేరుకున్నారని అర్థం. ప్రతిస్పందన కన్న సహ అనుభూతి ఉత్తమ స్థాయి. – ఎన్. అనంతలక్ష్మి -
రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా?
ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత రుతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు.. మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే..? ఆ రుతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. అంతేనా ఆ కొమ్మలపైన కుహు.. కుహు.. అంటూ మనసు పులకరించేలా కోయిలమ్మ మధురగానాలతో వీనుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కృతమవుతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న, పెద్ద, ఆడ, మగ తేడాలు లేకుండా కులమతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పండుగ రంగుల పండుగ.. అదో ఆనంద కేళీ… ప్రజలు ఎంతో ఇష్టంగా పాల్గొనే పండుగ. వసంతాగమనంలో వస్తుంది ఈ రంగుల హోలీ. గజగజా వణికించిన చలికి టాటా చెబుతూ.. వేసవి వెచ్చదనంలోకి అడుగుపెడుతున్న వేళ హోలీ వస్తుంది. భారతీయ పండుగల్లో హోలీ మరీ ప్రత్యేకం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు హోలీని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. సంవత్సరంలో కేవలం ఒక్క సారి మాత్రమే ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం చూస్తే విష్ణు భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుడిని చంపడానికి రాక్షసి హోలికా ప్రయత్నిస్తుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడం, తనని మాత్రమే పూజించాలన్నా.. తన మాట వినకపోవడంతో హిరణ్యకశ్యపుడే తన కొడుకు ప్రహ్లాదుడిని చంపాలని హోలికాకి ఆదేశాలు ఇచ్చాడు. ఎందువల్ల ఇలా చేస్తాడంటే..రాక్షస రాజు.. హిరణ్యకశ్యపుడు .. కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు.. అది హిరణ్యకశ్యపుడికి నచ్చదు దీంతో భక్త ప్రహ్లాదుని చంపేయాలి అనుకుంటాడు. తన సోదరి అయిన హోలికను పిలుస్తారు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటలలో ఆహుతి చేయమని ఆమెను కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని, మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయతో ప్రహ్లాదుడు బయటపడతాడు. హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చిక్కుకొని చనిపోతుందట. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సతీవియోగంతో తపస్సులో ఉన్న శివునికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి దేవతలు వివాహం చేయాలనుకుంటారు. కానీ తపస్సులో ఉన్న శివునికి ఎలా తపో భంగం కలిగించాలోనని ఆలోచించి మన్మథున్ని శివుని మీదకు పంపుతారు. కామదేవుడు శివుని తపస్సును భగ్నం చేసేందుకు పూల బాణాలు వదలడంతో శివుని మనస్సు పెండ్లి వైపు మరలిస్తాడు. దీంతో పార్వతీ పరమేశ్వరుల వివాహం జరుగుతుంది. మన్మథ బాణం ప్రభావం తగ్గగానే శివుడు తనకు మన్మథుడి వల్ల తపో భంగం కలిగిందని తన మూడో నేత్రంతో కామదేవుడిని భస్మం చేస్తాడు. పతీ వియోగంతో కామదేవుడి భార్య రతీదేవి శివునితో తన భర్త కామదేవున్ని బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బతికిన రోజు కావడంతో కాముని పున్నమిగా పిలుస్తారు. పూర్వం ఈ పండుగ రోజున రకరకాల పూలను ఒకరిపై ఒకరు చల్లుకుని.. అలా వారి సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూల స్థానంలో రకరకాల రంగులు వచ్చాయి. ఈ రంగులను నీళ్ళలో కలుపుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రేమ తోపాటు, సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి అని అందరూ భావిస్తారు. హోలీ ఎలా వచ్చిందంటే.. ఇక మరో కథనం ప్రకారం.. అప్పట్లో శ్రీకృష్ణుడు గోపికలతో కలసి బృందావనంలో పువ్వులు, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకునేవారు. ఇలా చేయడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. పురాణ కథల ప్రకారంగా.. కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉంటుంది. ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి రాధ గురించి చెబుతాడు. రాధ మేని మెరుపు తన ఒంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంది, ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు యశోద బదులిస్తూ, రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి, శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అలా హోలీ మొదలైంది ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఈ రోజునే మహాలక్ష్మీ ఆవిర్భావం.. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి. శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు. నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦! ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!! ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦. (చదవండి: జీవితం వర్ణమయం) -
మనుషులకూ.. మూగ ప్రాణులకు ఒక ధర్మాచరణ ఉంది!
నరజన్మకూ, మిగిలిన ప్రాణులకూ ఒక ప్రత్యేకమైన భేదం ఉంది. ఇతరప్రాణులకు ఒకే ధర్మం–పశుధర్మం. ఆకలి, నిద్ర, ప్రత్యుత్పత్తి.. అంతకుమించి వాటికి ధర్మం అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కానీ ఒక్క మనిషికి మాత్రం అత్యంత ప్రధానమైనది – ధర్మాచరణ. అయితే దీనిలో ఒక సంక్లిష్టత ఉంది. ఇదే ధర్మము.. అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. ధర్మం నిరంతరం మారిపోతుంటుంది. భార్యముందు నిలబడితే–భర్త ధర్మం. తల్లి ముందు నిలబడితే–పుత్ర ధర్మం. సోదర ధర్మం... ఉద్యోగ ధర్మం.. అలా నిరంతరం మారిపోతుంటుంది. దేశాన్నిబట్టి, కాలాన్నిబట్టి మారిపోతుంది. ఉత్తర భారతదేశంలో చలి కారణం చేత వీలయినంతగా శరీరాన్ని కప్పుకుని పూజాదులు చేయడం అక్కడి ధర్మం. దక్షిణ భారతదేశంలో.. కేవలం ఉత్తరీయం పైన వేసుకుని అభిషేకాలు, పూజలు చేయడం ఇక్కడి ధర్మం. అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు, సన్యాసికి.. ఇలా ధర్మం మారుతుంటుంది. బ్రహ్మచారి ఏదీ కూడబెట్టకూడదు. విద్యార్థిగా గురువుగారు చెప్పింది శ్రద్ధగా విని మననం చేసుకోవడం ఒకటే ధర్మం. అదే గృహస్థాశ్రమంలో భోగం అనుభవించవచ్చు. భార్యాబిడ్దలతో సుఖసంతోషాలతో గడపవచ్చు. రేపటి అవసరాలకోసం సంపాదించి దాచుకోవచ్చు. వానప్రస్థు భార్యతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఆత్మవిచారం చేస్తూ గడపవచ్చు. చిట్టచివరన అన్నీ పరిత్యజించి ఏకాకిగా వైరాగ్యంలో ఉండడం ధర్మం. అలా ధర్మం మారిపోతున్నా ఎక్కడికక్కడ ధర్మం నియమాలకు కట్టుబడి ఉంటుంది. అసలు ధర్మం లేకుండా ఉండడం, దానిని పాటించకుండా జీవించడం సాధ్యం కాదు. ధర్మాచరణతోనే మనుష్యప్రాణి ఉత్తమగతులు పొందగలడు. శాస్త్రం చెప్పినట్టుగా ధర్మాచరణ చేస్తూ శరీరం పతనమయిన తరువాత స్వర్గలోకం వెళ్ళవచ్చు. పుణ్యఫలితం అయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి చేరుకోవచ్చు.‘నాకు శాస్త్రం మీద నమ్మకం లేదు. ఈ పుణ్యకర్మలు నేను చేయను. నాకు ఏది సంతోషం అనిపిస్తే, నా ఇంద్రియాలకు ఏది సుఖం అనిపిస్తే, నా మనసుకు ఏ భోగం అనుభవించాలనుకుంటే దానిని అనుభవిస్తూ శాస్త్రాన్ని పక్కనబెట్టి ప్రవర్తిస్తే.. ఆ పాటిదానికి నరజన్మ అవసరం లేదని తిర్యక్కుగా (వెన్నుపూసలేని జీవిగా) జన్మ లభిస్తుంది. అలా కాదు, నాకు పాపమూ వద్దు, పుణ్యమూ వద్దు. నేను ఈ మంచిపని చేసి పుణ్యం కావాలనుకోవడం లేదు, నేను కేవలం భగవంతుడు చెప్పినట్లు బతకడం నాకు సంతోషం. నేను చేయవలసినివి కాబట్టి చేస్తున్నా.. దానినుంచి నేను ఏ ప్రయోజనమూ ఆశించడం లేదనుకున్నప్పుడు అది చిత్తశుద్ధిని సూచిస్తుంది. ఇది ఏదో ఒకనాడు భగవంతుని అనుగ్రహానికి కారణమయి, జ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని ఇస్తుంది. అంటే ధర్మాన్ని అనుష్ఠానం చేసి దేవతాపదవిని అధిష్టించగలడు. ధర్మాచరణను పక్కనబెట్టి పతనమమై తిర్కక్కు అయిపోగలడు. ఏ ఫలితాన్ని ఆశించకుండా ధర్మాచరణచేసి మోక్షాన్ని పొందగలడు. కాబట్టి ధర్మం కన్నా గొప్పది మరొకటి లేదు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇవి చదవండి: మీరెంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట! -
HOLI 2024: జీవితం వర్ణమయం
మానవ జీవితం రంగుల మయం. ఆ మాటకొస్తే అసలీ ప్రపంచమే రంగులమయం. ఎందుకంటే మన జీవనవిధానమే రకరకాల రంగులతో మమేకమై ఉంది. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో వేనవేల రంగులున్నాయి. ఈ ప్రకృతిలోని రంగులన్నీ జీవన తత్త్వాన్ని బోధిస్తాయి. ఆ రంగులతో చేసుకునే సంబరమే హోలీ. అందుకే హోలీని ఆలయాలలో కూడా ఒక వేడుకగా... ఉత్సవంగా నిర్వహిస్తారు. చిగురించే మోదుగులు. పూసే గురువిందలు. పరిమళించే మల్లెలు. మొగ్గలు తొడిగే మొల్లలు... రాలే పొగడ పుప్పొడి రేణువులు. చిందే గోగు తేనెలు. గుబాళించే గోరింట పూలు. ఎర్రని చివుళ్లతో మామిళ్లు... తెల్లని పూతాపుందెతో వేప చెట్లు... ఇందుకే కదా కవులు కీర్తించేది... వసంతాన్ని రుతువులకే రారాజని! మధుమాస వేళలో జరిగే వసంతోత్సవాన్ని భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంటుంది. గతంలో రాజు, పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ రంగునీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకొని సంతోషించేవారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోళీ జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం పూర్ణిమనాడు జరుపుకునే పండుగ కనుక ఫాల్గుణోత్సవమని... వసంత రుతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని పిలుచుకుంటాం. హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి. యోగనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన పూలబాణాలను ప్రయోగిస్తాడు. ఆ బాణాల తాకిడికి ధ్యాన భంగం అయిన శివుడు ఆగ్రహంతో తన మూడో కంటిని తెరచి మన్మథుడిని మసి చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి తనకు పతి భిక్ష పెట్టవలసిందిగా ప్రాధేయపడటంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మథుడు.. రతీదేవికి మాత్రమే శరీరంతో కనిపించేలా వరమిచ్చాడు. అలా మళ్లీ మన్మథుడు రతీదేవికి దక్కాడు. ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ ఓ కారణమైందని విశ్వసిస్తారు. అన్నింటికీ మించి హోలీ పండుగ పుట్టుకకు మరో కథను చెబుతారు. శ్రీకృష్ణుడు నల్లనివాడు, రాధ మేలిమి బంగారం. ఓరోజున వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వనవిహారం చేస్తుండగా రాధ చేతిపక్కన ఉన్న తన చేయి నల్లగా ఉండటం చూసి దిగులు పడ్డాడట కృష్ణుడు. కన్నయ్య విచారానికి కారణం తెలుసుకున్న యశోదమ్మ ‘నాయనా! రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమె ఒంటినిండా రంగులు కలిపిన నీళ్లు పోయి’ అని సలహా ఇచ్చిందట. అమ్మ మాట మేరకు నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా ఉద్యానవనం నుంచి బయటకు పరుగులు తీసిందట. రాధాకృష్ణులిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు... ఆనందోత్సాహాలతో రంగుల పండుగ చేసుకున్నారట. ఆనాడు ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం, పెద్దఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పైన చెప్పుకున్న కథల నుంచి మనం గ్రహిం^è వలసినది ఏమిటంటే... మనందరమూ మనుషులమే కాబట్టి ఏదో ఒక లోపం ఉండితీరుతుంది. అలాంటి లోపాలను తీసుకు వచ్చే దుర్గుణాలను దూరం చేసుకోవడం అవసరం. అన్ని రంగులు ఉంటేనే.. ప్రకృతికి అందం. అందరిని కలుపుకుంటేనే మనసుకి అందం. అన్ని ఆలోచనలను పరిగణించి, చక్కని దారిన కలిసి నడిస్తేనే మనిషికి అందం. హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేవి రంగులు కావు. అనురాగ ఆప్యాయతలు కలసిన పన్నీటి పరిమళ జల్లులు. హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. వసంతకాలం అంటే చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం కదా! అంటే మనలో ఉన్న దుర్గుణాలనే ఎండుటాకులను రాల్చేసి, వాటి స్థానంలో ఉల్లాసం, ఉత్సాహం, ప్రేమ, అనే సుగుణాలతో కూడిన ఆకులను చిగురింప చేసుకోవాలి. మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామక్రోధలోభమోహమదమాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మనస్సును మథిస్తాయి. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ ఆరుగుణాలనూ అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకునేందుకే, ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు, గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారుచేసి, ఊరేగింపుగా తీసుకెళతారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. మన జీవితాలలో అనేక విధాలైన అలకలు, కినుకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, ఆవేశకావేశాలు, అలజడులు, అపశ్రుతులు, తడబాట్లు, ఎడబాట్లు ఉండొచ్చు. అందువల్ల ఈ హోళీ రోజు మనకు దగ్గరగా ఉన్న వారితోనే మాట, ఆట కాకుండా.... మనసుకు దగ్గర అయిన బంధు మిత్రులతో, మనవల్లో, వారి వల్లో ఏర్పడిన మానసిక దూరాన్ని తగ్గించుకుని, మనమే ముందుగా ఒక అడుగు వేసి అందరినీ దగ్గర చేసుకుని జీవితాలను వర్ణమయం... రాగ రంజితం చేసుకుందాం. హోలీ పర్వదినాన్ని అందరూ ఆప్యాయతతో కలిసే రంగుల రోజుగా మార్చుకుందాం. – డి.వి.ఆర్. భాస్కర్ -
హోలీ రోజున అక్కడ దుస్తులు చించేసి..ఏకంగా తేళ్లతో..!
హోలీ అనగానే చిన్నా, పెద్దా రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. మత పర భేదం లేకుండా అందరూ రంగులతో ఆనందహేళిలో మునిగి తేలుతుంటారు. అలాంటి హోలీని భారతదేశంలోని పలు రాష్ట్రల ప్రజలు విభిన్న సంప్రదాయాల్లో చేసుకుంటారు. అక్కడి ఆచారాలకు అనుగుణం చేసుకోవడం వరకు ఓకే. కానీ కొన్ని చోట్ల హోలీ పండుగా చాలా విచిత్రంగా జరుపుకుంటారు. ఎంతలా అంటే వామ్మో..! ఏంటిది..! అని విస్తుపోయాలా వింతగా జరుకుంటారు. అంత విలక్షణమైన సంప్రదాయాలు ఎక్కడున్నాయంటే.. రంగులు బదులు కర్రలతో.. ఉత్తరప్రదేశ్‌లోని బర్సానాలో హోలీ రోజున రంగులు చల్లుకోవడమే కాదు మహిళలు కర్రలతో పురుషులను వెంటపడి కొడతారు. స్త్రీలంతా కర్రలనే తమ ఆయుధాలుగా ధరించి ఎక్కడ పురుషులు కనిపించినా వారిని వెంబడించి మరీ కొడతారు. అయితే ఇది సరదాగా ఆడే సంప్రదాయమే. ఈ సంప్రదాయం శ్రీకృష్ణుడు గోపికల మధ్య జరిగిన కథకు గుర్తుగా జరుపుకుంటారు. ఆ రోజున బర్సానాలో చిన్న చిన్న యుద్ధ పోటీలు, పాటలు, నృత్యాలు, వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటారు. బూడిద జల్లుకుంటూ.. వారణాసిలో చితా భస్మా హోలీని నిర్వహిస్తారు. అక్కడ సాధువులు, అఘోరాలు... తమ భక్తులతో మణికర్ణిక ఘాట్ దగ్గర కలిసి చితి నుంచి వచ్చే బూడిదను తీసి హోలీగా ఆడతారు. వారణాసి అంటే మనం ముక్తి నగరంగా భావిస్తాం. అందుకు గుర్తుగా తమ శరీరాలపై ఈ చితా భస్మాన్ని పూసుకుంటారు. తద్వారా శివునికి తమ భక్తిని తెలియజేస్తారు. వీరంతా వీధుల్లో తిరుగుతూ శివనామస్మరణ చేస్తారు. నిజానికి శ్మశానేశ్వరుడైన శివుడు నిత్యం ఈ చితా భస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు కాబట్టి తాము కూడా నీలోని వాళ్లమే, నీ బిడ్డలమే అని చెప్పేందుకు ఇలాంటి వింత ఆచారాన్ని అక్కడ వారణాసి ప్రజలు పాటిస్తారు. గంజాయితో హోలీ.. భాంగ్ అంటే గంజాయితో చేసిన పేస్టు. ఏంటీ గంజాయిని హోలీలోనా..! అని ఆశ్చర్యపోవద్దు. అయితే ఆరోజు ఇలా చేసినా.. పోలీసులు అరెస్ట్ చెయ్యరు. అందువల్లే దీన్ని హోలీ వేడుకల్లో భాగంగా అక్కడి ప్రజలు ధైర్యంగా ఉపయోగించి పండుగ జరుపుకుంటారు. అంతేగాదు ఆరోజు తయారు చేసిన పానీయాలు, ఆహారాలలోనూ కూడా ఈ పేస్టును వినియోగిస్తారు. గంజాయిపై నిషేధం ఉన్నప్పటికీ హోలీ సమయంలో మాత్రం దీన్ని చట్టబద్ధంగా వినియోగిస్తారు. భాంగ్ తయారీ అనేది అక్కడ ఒక కళగా చెప్పుకుంటారు. కుటుంబ వంటకాలలో దీన్ని భాగం చేసుకుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని చాలా చోట్ల హోలీ రోజున భాంగ్‌ను ఆహారంగా వాడతారు. తేళ్లతో హోలీ.. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో సంతన అనే గ్రామం ఉంది. అక్కడ స్థానికులు హోలీ వచ్చిందంటే సాహసోపేతమైన సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ పవిత్రమైన రోజున బైసన్ దేవి ఆలయం కింద ఉన్న రాతి భూభాగంలో ఉన్న తేళ్ళను సేకరించి తమ శరీరాలపై పెట్టుకుంటారు. అయితే ఆ తేళ్లు తమని కుట్టమని ఆ గ్రామస్తుల నమ్మకం. దుస్తులు చించేసి.. మధుర సమీపంలో దౌజీ అనే గ్రామం ఉంది. ఇక్కడ మాత్రం హోలీ మరుసటి రోజు వేడుకలు నిర్వహించుకుంటారు. పురుషులు, స్త్రీలు రంగులు జల్లు కావడం తోపాటు స్త్రీలు, పురుషుల దుస్తులను చింపివేయడం వంటివి చేస్తారు. ఇది చాలా వేడుకగా జరుగుతుంది. (చదవండి: 'పఖాలా'తో వేసవి తాపం పరార్!) -
భక్తి అంటే..?
భక్తి అంటే ఏమిటి? వేదాంత గ్రంథాలిచ్చే నిర్వచనాల జోలికి వెళ్లవద్దు మనం. మామూలు మాటల్లో అర్థం కావటానికి భక్తి అంటే ఏమిటి? చాలామంది అభిప్రాయంలో ఫోటో పెట్టి, దండలు వేసి, పూలు, అగరొత్తులు, దీపాలు పెట్టి నివేదన చెయ్యటం, దణ్ణం పెట్టటం అనుకుంటారు. అది భక్తా? ఒకరకంగా తను మారకుండా ఉండటాన్ని సమర్థించుకునే ప్రయత్నం. ‘‘ఆయన మహానుభావుడు కనుక అట్లా చేయగలిగాడు. మనవంటి సామాన్యులకి సాధ్యమా?’’ అని తప్పించుకునే మార్గం. అట్లా పూజ చెయ్యటం తప్పు అని కాని, చెయ్య కూడదని కాని చెప్పటం లేదు. అది ఒకరకం. దానివల్ల ఒరిగేది ప్రత్యేకంగా ఏమీ లేదు. అది ఒక క్రమశిక్షణ. చిత్త శుద్ధిని కలిగిస్తుంది. ఇది మొదటిమెట్టు అని చెప్పవచ్చు. కానీ చాలా మంది ఇదే పరమార్థం అనుకుంటారు. కొంతమంది అనుకరించటమే భక్తి అనే భ్రమలో ఉంటారు. అనుకరించటానికి, అనుసరించటానికి చాలా వ్యత్యాసం ఉంది. వారిలాగా ఉండే ప్రయత్నం అనుకరణ. ఇది భౌతికంగా తమ ఆదర్శమూర్తుల లాగా ఉండేట్టు చేస్తుంది. చూడగానే ఫలానా వారి అభిమానులని తెలియ చేస్తుంది. కాని వారిస్థాయికి చేర్చదు. అయితే అనుకరణ పనికి రానిదని చెప్పటానికి వీలు లేదు. అది రెండవ మెట్టు. ఒకరిపట్ల భక్తి ఉన్నది అంటే వారు చెప్పిన దానిని చెప్పినట్టు అనుసరించటమే. భక్తిలో ప్రశ్నలకు, సందేహాలకు, వాదోపవాదాలకు తావుండదు. నోటితోనే చెప్పనక్కరలేదు. వారి ప్రవర్తనను చూసి అనుసరించవలసి ఉంటుంది. ‘‘మీ బొమ్మకి పూజ చేస్తాం, కాని, మీరు చెప్పినట్టు చెయ్యటం మావల్ల కాదు, మీరు ఉన్నట్టు ఉండటం అసాధ్యం’’ అంటే అది భక్తి అనిపించుకోదు. భగవంతుడివిషయంలోనైనా అంతే! దేవుణ్ణి గదికే పరిమితం చేసి, పూజచేసిన కొద్దిసేపు మాత్రం ఆయన్ని తలచుకొని, తరువాత దుర్మార్గంగా లోకకంటకంగా ప్రవర్తిస్తే అది భక్తి అనిపించుకోదు. పరమాత్మ నిర్దేశించిన విధంగా, ఆయన మెప్పు వడసే పద్ధతిలో ప్రవర్తిస్తే అది నిజమైన భక్తి. సాటిమనిషి మీద సానుభూతి, జాలి చూపించలేని వాడు, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమించ లేని వాడు, తనకి హాని చేసిన శత్రువుని కాక పోయినా కనీసం ఎదుటివాడిని క్షమించలేనివాడు విశ్వాసి ఎలా అవుతాడు? పొరుగువారిని తనవలే ప్రేమించమని చెప్పిన ఏసు క్రీస్తు అంటే భక్తి ఉంటే ఆయన చెప్పిన మాటలని పాటించాలి, ఆయనలాగా ప్రవర్తించాలి. ఆయన మార్గాన్ని అనుసరించాలి. ఎక్కువసేపు వాళ్ళతో ఉండటం వల్లనో, పోలికలు రావటం వల్లనో మనవలు, మనవరాళ్ళు తరచుగా తాతానాయనమ్మల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాతలకి నాయనమ్మలకి, అమ్మమ్మలకి మనవలు, మనవరాళ్ళు అంటే ఇష్టం ఉండటానికి కూడా ఇదే కారణం. మనుషుల విషయంలోనే ఇలా ఉంటే భగవంతుడి విషయంలో ఆయన చెప్పినట్టు ప్రవర్తిస్తే ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భగవంతుడికి, భక్తుడికి ఉండే సంబంధాన్ని భ్రమరకీట న్యాయంగా చెప్పటం ఈ కాణంగానే. తన చుట్టూ తిరుగుతున్న భ్రమరం చేసే ఝుమ్మనే నాదం విని గూటిలో సుప్తావస్థలో ఉన్న కీటకం దానిని అనుసరిస్తూ తాను కూడాఅటువంటి నాదం చేసే ప్రయత్నంలో భ్రమరం లాగా రూపాంతరం చెందుతుంది. ఈ అనుసరణ అన్నది తానే లక్ష్య వస్తువు అయ్యేట్టు చెయ్యగలదు. ఒక గురువునో, నాయకుణ్ణో అనుకరించేవారు వారి వలె తయారౌతారే కాని, వారుగా అయిపోరు. వారుగా, కనీసం వారంతటి వారుగా అయిపోవటానికి కావలసినది అనుసరణ మాత్రమే. భగవత్తత్త్వాన్ని అందుకోవాలంటే కూడా అంతే! శ్రీరాముడు పితృభక్తి కలవాడు అని చెపుతాం. అంటే అర్థం తండ్రి చెప్పిన విధంగా జీవించాడు అని. ఆయన మాట జవదాట లేదు. ఆయన తనతోచెప్పిన మాటనే కాదు ఆయన ఎవరికిచ్చిన మాటనైనా పాటించాడు. రాముడిపితృభక్తి, గురుభక్తి విశ్వామిత్రుడు తాటకను సంహరించమన్నప్పుడు మారు మాటాడక సంహరించటంలో వ్యక్తమౌతాయి. తల్లితండ్రులని వృద్ధాశ్రమాలలో ఉంచి ‘‘మేము రామభక్తులం’’ అంటే రాముడిపట్ల అపచారం చేసినట్టే. ఆయనలో ఉన్న కొన్నిగుణాలనైనా అలవరచుకుంటే రామభక్తులు అనిపించుకోగలుగుతారు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
భగీరథ యమధర్మరాజ సంవాదం
పూర్వం భగీరథ చక్రవర్తి సమస్త భూమండలాన్ని పరిపాలిస్తుండేవాడు. ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు అయిన భగీరథుడు నిత్యం తన రాజ్యంలో యజ్ఞయాగాది క్రతువులను జరిపించేవాడు. ఆయన రాజ్యం సర్వసుభిక్షంగా ఉండేది. రాజ్యంలోని ప్రజలెవరూ ధర్మం తప్పేవారు కాదు. భగీరథుడి కీర్తిప్రతిష్ఠలు ముల్లోకాలకూ వ్యాపించాయి. భగీరథుడి కీర్తిప్రతిష్ఠలు విని యమధర్మరాజు ఒకసారి ఆయనను స్వయంగా కలుసుకోవాలనుకున్నాడు. ఒకనాడు యమధర్మరాజు భగీరథుడి వద్దకు వచ్చాడు. భగీరథుడు ఎదురేగి యమధర్మరాజుకు స్వాగతం పలికాడు. ఘనంగా అతిథి సత్కారాలు చేశాడు. భగీరథుడి సేవలకు యమధర్మరాజు సంతృప్తి చెందాడు. ‘భగీరథా! నువ్వు చాలా ధర్మాత్ముడివి. నీ కీర్తి ముల్లోకాలకూ వ్యాపించింది. అది వినే నేను నిన్ను స్వయంగా కలుసుకోవాలని వచ్చాను. నీ జీవితం మానవులందరికీ ఆదర్శప్రాయం’ అని ప్రశంసించాడు. ‘సమదర్శీ! నా మీద నీ అనుగ్రహానికి ఆనందభరితుణ్ణవుతున్నాను. అయితే, నాకు కొన్ని ధర్మసందేహాలు ఉన్నాయి. సకలలోక ధర్మాధర్మ విచక్షణాదక్షుడవైన నువ్వే నా సందేహాలను తీర్చగలవు. అవేమిటంటే, ధర్మాలంటే ఏవి? ధర్మాచరణ చేసేవారికి ఎలాంటి లోకాలు ప్రాప్తిస్తాయి? దయచేసి వివరించు’ అని వినయంగా అడిగాడు భగీరథుడు. ‘ధర్మం అనేది రకరకాలుగా ఉంటుంది. ధర్మం గురించి సంపూర్ణంగా చెప్పాలంటే లక్ష సంవత్సరాలైనా సరిపోవు. అయినా నువ్వు అడిగావు కాబట్టి సూక్ష్మంగా చెబుతున్నాను విను. లోకంలో బ్రాహ్మణులకు, ఆధ్యాత్మికవేత్తలకు చేసే దానం అత్యుత్తమమైనది. స్వయంగా కూప తటాకాది జలాశయాలు తవ్వినా, ఇతరులను నియమించి తవ్వింపచేసినా వచ్చే పుణ్యఫలం అనంతం. బావులు, చెరువులు తవ్వే పనిలో స్వల్పమైన సాయం చేసినా గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. ఇందుకు ఉదాహరణగా నీకు వీరభద్ర మహారాజు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు: పూర్వం గౌడదేశాన్ని వీరభద్రుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతడు మహాదానశీలి, ధర్మాత్ముడు, అమిత పరాక్రమవంతుడు. వీరభద్రుడి భార్య చంపకమంజరి. వీరభద్రుడు ప్రతినిత్యం యజ్ఞయాగాదులు నిర్వర్తించేవాడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడేవాడు. వీరభద్రుడి రాజ్యంలో ప్రజలందరూ ధర్మబద్ధులై ఉండేవారు. అతడి మంత్రులందరూ విద్యావంతులు, ధర్మాధర్మ విచక్షణ కలిగిన విజ్ఞులు కావడంతో పరిపాలన సజావుగా సాగేది. వీరభద్రుడి రాజ్యం భూతలస్వర్గంగా ప్రసిద్ధి పొందింది. ఒకనాడు వీరభద్రుడు తన మంత్రులు, పరివారంతో కలసి సమీప అరణ్యానికి వేటకు బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు వేట కొనసాగించారు. మధ్యాహ్నవేళ వీరభద్రుడు సహా అతడి పరివారమంతా బాగా అలసట చెందారు. అందరికీ విపరీతమైన దాహం వేయసాగింది. సమీపంలో నీటిజాడ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని అందరూ వెదకసాగారు. కొంత దూరం ముందుకు వెళ్లాక కొండ మీద ఒక చెరువు కనిపించింది. అక్కడకు వెళ్లి చూశారు. చెరువులో చుక్క నీరైనా లేదు. ‘అసలు ఇంత ఎత్తులో ఎవరు ఈ చెరువు తవ్వించారు? ఇందులో నీళ్లు ఎందుకు లేవు?’ అని స్వగతంగా అన్నాడు వీరభద్రుడు. అక్కడే ఉన్న వీరభద్రుడి మంత్రి బుద్ధిసాగరుడు చెరువును మరికొంత లోతుకు తవ్వమని భటులను పురమాయించాడు. మూడడుగులు తవ్వేసరికి చెరువులోకి నీళ్లూరాయి. చెరువు కొంతవరకు నీళ్లతో నిండింది. అందరూ ఆ చెరువులో నీళ్లు తాగి సేదదీరారు. ‘మహారాజా! ఈ చెరువు వానాకాలంలోనే నిండేలా ఎవరో తవ్వించారు. మరికొంత లోతుకు తవ్విస్తే సర్వకాలాల్లోనూ ఇందులో నీళ్లు నిలిచి ఉంటాయి. బాటసారులకు దాహార్తి తీర్చేలా ఈ చెరువు మరింత లోతుకు తవ్వించేందుకు అనుమతించండి’ అన్నాడు బుద్ధిసాగరుడు. అందుకు వీరభద్రుడు సరేననడంతో మంత్రి బుద్ధిసాగరుడు దగ్గర ఉండి భటులతో చెరువును మరింత లోతుగా తవ్వించాడు. దానికి పటిష్ఠంగా రాతిగోడలు నిర్మించారు. కొంతకాలానికి ఆయుష్షుతీరి బుద్ధిసాగరుడు, వీరభద్రుడు నా లోకానికి వచ్చారు. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాల చిట్టాను పరిశీలించి, కొండ మీద తటకాన్ని తవ్వించిన వారి మహత్కార్యాన్ని నాకు చెప్పాడు. ధర్మవిమానంలో వారు స్వర్గానికి వెళ్లడానికి అర్హులని గ్రహించి, వారిని విమానంలో స్వర్గానికి పంపాను. స్వర్గానికి బయలుదేరే ముందు వారు నన్ను కొండ మీద ఆ చెరువు చరిత్ర చెప్పమని అడిగారు. ‘పూర్వం సైకతపర్వతం మీద ఈ చెరువు ఉన్నచోట ఒక లకుముకి పిట్ట తన ముక్కుతో రెండంగుళాలు తవ్వింది. కొంతకాలానికి ఒక వరాహం అక్కడకు వచ్చి, తన ముట్టెతో రెండు మూరలు తవ్వింది. దాంతో అందులోకి అప్పుడప్పుడు కొంత నీరు చేరసాగింది. చుట్టుపక్కల వన్యప్రాణులు అందులోని నీరుతాగుతూ దాహార్తి తీర్చుకునేవి. మూడేళ్లు గడిచాక ఒక ఏనుగుల గుంపు వచ్చి, దానిని మరింత లోతుగా తవ్వడంతో చిన్న చెరువుగా మారింది. అప్పటి నుంచి ఏటా వానాకాలంలో ఆ చెరువు పూర్తిగా నీటితో నిండసాగింది. మీరు వేసవి ప్రారంభంలో వేటకు వెళ్లడం వల్ల ఆ చెరువు ఎండిపోయి కనిపించింది. అంతకు ముందు అందులోకి నీరు ఇంకి ఉండటం వల్ల కొద్ది లోతు తవ్వగానే నీరు దొరికింది. వీరభద్రా! నీ మంత్రి సూచనతో నువ్వు ఆ చెరువును మరింత లోతుగా తవ్వించి, పటిష్ఠంగా గోడ నిర్మించి, ఏడాది పొడవునా నీరు నిలిచేలా చేశావు. ఈ పనిచేసినందుకు నువ్వు, నీ మంత్రి, నీ పరివారం అభినందనీయులు’ అని చెప్పి ధర్మవిమానంలో వారిని స్వర్గానికి సాగనంపాను. ‘భగీరథా! తటాకాలను తవ్వించిన వారికి సమస్తపాపాలూ నశించి, అనంత పుణ్యఫలం లభిస్తుంది’ అని చెప్పాడు యమధర్మరాజు. భగీరథుడు ప్రణమిల్లి, అతడికి సాదరంగా వీడ్కోలు పలికాడు. ఇవి చదవండి: హెల్త్: గుటక వేయడం కష్టమవుతోందా? అయితే ఇలా చేయండి.. -
రంజాన్ ఉపవాసాలపై డబ్యూహెచ్ఓ మార్గదర్శకాలు!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లీంలకు అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి ఈ రంజాన్ మాసం. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్లో తొమ్మిదవ నెల ఈ మాసం. ఈ రంజాన్ మాసం భారత్‌లో మార్చి 12( మంగళవారం) నుంచి ప్రారంభమవుతోంది. ఈ మాసంలో ముస్లీం సోదరులంతా ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. ఈ పవిత్ర మాసం ప్రారంభమయ్యేది సరిగ్గా వేసవికాలం. ఈ నేపథ్యంలో ఆ ఉపవాసలు చేసే సమయంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఏడాదిలోనే ఈ రంజాన్ మాసంలో కూడా కొన్ని మార్గదర్శకాలను అందించింది. ఉపవాసాలు చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునే యత్నం చేయమని కోరింది. ఈ ఉపవాస సమయాల్లో సమతుల్య ఆహారం తీసుకోవాలిన సూచించింది. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది కాబట్టి డీ హైడ్రేట్ అయ్యి అలిసిపోకుండా ఉండేలా బలవర్థకమైన ఆహారం తీసుకోమని సూచించింది. తీసుకునే ఆహారంలో ఉప్పు మితంగా ఉండేలా చూసుకోమని సూచించింది. అలాగే ఈ ఉపవాస సమయాల్లో బేకింగ్‌తో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోవద్దని చెబుతోంది. అలాగే డీప్ ఫ్రై చేసే వంటకాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. సాధ్యమైనంత వరకు ఆవిరిపై ఉడికించినవి, కాల్చిన పదార్థాలను తీసుకోవడం ఉత్తమని చెబుతోంది. అలాగే కాస్త వ్యాయామం చేయమని చెబుతోంది. ఎందుకంటే ఉపవాసం విరమించాక ఎక్కువ మొత్తంలో తెలియకుండా ఆహారం తీసుకుంటాం కాబట్టి ఫిట్‌గా ఉండేలా చూసుకోవడం ముఖ్యం అని సూచించింది. అలాగే పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండమని ఆరోగ్య సంస్థ కోరింది. ఆహ్లాద భరితంగా ఈ రంజాన్ మాసాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తోపాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుకోమని సూచించింది. (చదవండి: ఇవాళ నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..ఆ దేశాల్లో మాత్రం..!) -
ఇవాళ నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..ఆ దేశాల్లో మాత్రం..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ముస్లీంలకు అత్యంత పవిత్రమైన మాసం ఇది. మక్కాలో చంద్రుని దర్శనం ఆధారంగా రంజాన్ మాసం భారత్‌లో ఎప్పుడూ ప్రారంభమవుతుందనేది నిర్ణయిస్తారు ముస్లీం మత పెద్దలు. నెలవంక ఆకారంలో ఉండే చంద్రుడు ఈసారి సౌదీ అరేబియాలో మార్చి 10వ తేదీన ఆదివారం సాయంత్రం దర్శనం ఇచ్చింది. కాబట్టి మార్చి 11వ తేదీ సోమవారం నుంచి అక్కడ చంద్రుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో మరుసటిరోజున చంద్రుడు దర్శనమిస్తాడు. అందుకే సౌదీ తర్వాతి రోజు నుంచి మన దేశంలో ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. అంటే ఈ ఏడాది మన దేశంలో ఇవాళ(మార్చి 12వ తేదీ (మంగళవారం)) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయి. ఎలా జరుపుకుంటారంటే.. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ రంజాన్ మాసం. ఈ నెలల్లో ముస్లీంలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాసకాలంలో వారు రెండు సార్లు ఆహారాన్ని స్వీకరిస్తారు. వాటిని సుహూర్, ఇఫ్తార్‌గా పిలుస్తారు. ఇఫ్తార్ అనేది సూర్యాస్తమయం తర్వాత తీసుకునే ఆహారం. సుహూర్ అంటే తెల్లవారుజామున తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉపవాస దీక్ష విరమించుకునే రోజు సాయంత్రం తమ కుటుంబం\ సభ్యులను బంధువులను పిలచుకుని ఇఫ్తార్ విందు ఆరగిస్తారు. అంతేగాదు ఈ మాసంలో దాన ధర్మాలు, పేదలకు ఆహారం అందించడం వంటవి చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉపవాస సమయాల్లో వ్యత్యాసం.. ఈ ఉపవాస సమయాలు ప్రపంచవ్యాప్తంగా మారుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వాటి ఉపవాస సమయం వ్యవధి చాలా విభిన్నంగా ఉంటుంది. దక్షిణార్థ గోళంలో సూర్యని వంపు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటంలో ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువ సమయం ఉపవాసం పాటించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి నార్వేలోని ఓస్లోలో ముస్లింలు దాదాపు 15 గంటల 15 నిమిషాల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. అదే లండన్‌లో దాదాపు 14 గంటల 11 నిమిషాల పాటు ఉపవాసం ఉంటారని స్టాటిస్లా నివేదిక పేర్కొంది. ఇక జకర్తాలో ఉపవాసం నిడివి సుమారు 13 గంటల నుంచి 13 నిమిషాలు ఉంటుందని స్టాటిస్లా నివేదిక అంచనా వేసింది. #Ramadan starts on Sunday evening, with the first day of fasting on Monday, March 11 this year. While the number of days of Ramadan are equal for all Muslims observing it around the world, the length of the daily fast is not. — Statista (@StatistaCharts) March 8, 2024 (చదవండి: నేటి నుంచే రంజాన్ మాసం ప్రారంభం!) -
సింగపూర్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
మన ఋషులు వేద ప్రమాణంగా నిర్దేశించిన దిశను, సాంప్రదాయ, అనుష్ఠానాలని కొనసాగించాలన్న ముఖ్య ఉద్దేశంతో సింగపూర్‌లో నివసించే తెలుగువారు, సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజంగా ఏర్పడి , ధర్మ నిరతి, ధర్మానుష్టానం కొరకు 2014 నుంచి అనేక కార్యక్రమాలు అయిన నిత్యసంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, మాస శివరాత్రి సందర్భంగా ప్రతినెలా రుద్రాభిషేకం ఘనంగా నిర్వహిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం దశమ వార్షికోత్సవం జరుపుకోబోతున్న ఈ శుభసందర్భంలో అనేక కార్యక్రమాలు రూపొందించామని నిర్వాహుకులు తెలిపారు. ఇందులో భాగంగా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుక్రవారం 8 మార్చి 2024 రాత్రి 11 గంటలు నుండి శనివారం ఉదయం 6 గంటలు వరకు శ్రీ అరసకేసరి శివాన్ మందిరంలో పంచారామ ప్రతీకగా లింగ్గోద్భవ సమయంలో ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించబడింది. భారతదేశం నుండి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్నుతో పంచ లింగాలను, పార్థివ లింగములుగా సమంత్రకముగా రూపొందించారు. ఈ సందర్భంగా పంచ రుద్రులుకి ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. సుమారు 7 గంటలు జరిగిన ఈ క్రతువులో దాదాపు 50 మందికి పైగా రుత్వికులు పాల్గొన్నారు. వందమందికి పైగా భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలు లలితా పారాయణం, హారతి గానంతోఅందరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అనంతరం అతిథులకు తీర్ధ ప్రాసాదాలందించారు. మహాశివరాత్రి రోజున అభిషేకం, అందునా పంచారామ లింగార్చనతో కూడుకొన్నజాగరణ తదితర కార్యక్రమాలపై భక్తులు హర్షం వ్యక్తం చేసారు, కార్యక్రమ రూపకర్తలకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. -
ఆ సుఖం...నిజమైన సుఖం కాదు!
అది ‘కురువుల’ పట్టణం. దాని సమీపంలో యమునా నది. చల్లని నీడనిచ్చే మామిడి చెట్ల వనం. అందులో అగ్ని భరద్వాజుని ఆశ్రమం. ఆ సమయంలో బుద్ధుడు ఆ ఆశ్రమంలో ఉంటున్నాడు. అగ్ని భరద్వాజుడు బుద్ధునికి తగిన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు బుద్ధుడు ఆ పట్టణంలోకి వెళ్ళి భిక్ష స్వీకరించి వచ్చి, ఈ వనంలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. సమయం మధ్యాహ్నం దాటింది. అగ్ని భరద్వాజుని దగ్గరకు మాగందియుడు అనే తాపసి వచ్చాడు. పరస్పర కుశల ప్రశ్నల తర్వాత వారిద్దరూ కలిసి మామిడి తోటలో బుద్ధుడున్న చోటుకు వెళ్లారు. అప్పటికీ మాగందియుని విషయం బుద్ధునికి తెలుసు. వారు వచ్చాక కొంత సంభాషణ కామసుఖాల మీద జరిగింది... ‘‘మాగందియా! కామసుఖాలకంటే సుఖాన్నిచ్చే గొప్పసుఖం వేరే ఉంది.’’ అన్నాడు బుద్ధుడు. వారిద్దరూ శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ‘‘నేను యువరాజుగా ఉన్నప్పుడు నాకోసం మూడు ప్రత్యేక భవంతులు నిర్మించారు. వేసవిలో, వర్షాకాలంలో, హేమంత కాలాల్లో నివసించడానికి అనువైన భవనాలు అవి. ఆయా కాలాల్లో హాయిని చేకూర్చే భవనాలు. దివ్య సుఖాన్నిచ్చే భవనాలు నేను ఆ నాలుగు నెలూ ఆ భవనాలు దిగి వచ్చేవాడినే కాదు. చివరికి ఈ కామ సుఖాల బేలతనాన్ని తెలుసుకున్నాను. నాలో కామతృష్ణ తొలగిపోయింది. పిపాస నశించింది. రాగం వదిలిపోయింది. అప్పుడు కూడా ఆనందించాను. కామం, తృష్ణ, పిపాసలు ఇవ్వలేని ఆనందాన్ని కూడా పొందాను. ఆనందం, దుఃఖం భవనాల్లో లేవు. మన మనస్సులోనే ఉంటాయి.’’ అని వారివైపు చూశాడు బుద్ధుడు. శ్రద్ధగా వింటూ కనిపించారు. ‘‘మాగందియా! రాగం ద్వేషం, పిపాస ఉన్న మనస్సునే ప్రక్షాళన చేయాలి. కుష్ఠు వ్యాధి శరీరం, వేడి గ్రహించి హాయి పొందినట్లు రాగద్వేషాలతో ఉన్న మనస్సు కూడా వాటిని పొందినప్పుడు హాయి పొందుతుంది. రాజ భవనాల్లో నేను పొందిన హాయి అలాంటిదే! కుష్ఠువ్యాధి తగ్గిన శరీరం వేడికి హాయి పొందదు. దానికి వేడితో పనిలేదు. అలాగే రాగరహిత హృదయానికి భవనాలు సుఖాలు అవసరం లేదు. ఆరోగ్యమైన శరీరానికి మంటల వేడి అవసరం లేనట్లే... ఆరోగ్యమైన మనస్సుకి కోర్కెలు అవసరం లేదు. మాగందియా! ఈ కామభోగలాలసలు గతంలోనూ, భవిష్యత్‌లోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఇంద్రియాల్ని లోబరుచుకుంటూనే ఉంటాయి. వీటికి లోబడి పొందే సుఖం, కుష్ఠువారు వేడివల్ల పొందే సుఖం లాంటిది. ఆ సుఖం సుఖం కాదు. దుఃఖమే!’’ అన్నాడు. ‘‘భగవాన్! చల్లని మీ మాటల ద్వారా ఏది నిజమైన సుఖమో, ఏది సత్యమైన దుఃఖరహిత మార్గమో... తెలుసుకోగలిగాను. నన్ను కూడా ఇకనుంచి మీ అనుయాయిగా స్వీకరించండి’’ అంటూ ప్రణమిల్లాడు మాగందియుడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!! -
ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!!
ముత్తుస్వామి దీక్షితార్ గొప్ప వాగ్గేయకారులు. పుస్తకం పట్టి శాస్త్రాధ్యయనం చేయక పోయినా గంగానదీతీరాన గురు శుశ్రూష చేస్తూ చాలా ధర్మసూక్ష్మాలను తెలుసుకున్నారు. తదనంతర కాలంలో ఆయన గంగాదేవి గొప్పదనాన్ని కీర్తిస్తూ చేసిన కీర్తనలో ఆయన విషయగాఢత మనకు బోధపడుతుంది. ‘‘...అక్రూర పూజితే అఖిల జనానందే/సకలతీర్థమూలే...’’ అన్నారు. అన్ని తీర్థాలూ గంగానదిలోనే ఉన్నాయన్నారు. ఎందుకలా...!!! తీర్థయాత్ర చేసివచ్చాం అంటారు గానీ భగవత్ దర్శన యాత్ర చేసివచ్చాం అనరు. తీర్థయాత్ర అంటే.. మజ్జనం అంటే.. స్నానం. తీర్థంలో స్నానం చేస్తారు. వేదాలకు భాష్యం చెబుతూ పెద్దలు ఒక మాటన్నారు. అంగీరసాది మహర్షులు ఊర్థ్వలోకాలకు వెడుతూ... వెళ్ళేముందు తమ తమ నియమాలను, తపోదీక్షను, తపఃఫలితాన్ని నీటిలో కొన్నిచోట్ల నిక్షేపించి వెళ్ళారు. అవి ఎక్కడ నిక్షేపింపబడ్డాయో అవి తీర్థములు. అటువంటి తీర్థాల్లోకెల్లా గొప్ప తీర్థమేది... అంటే మణికర్ణిక. అది ఎక్కడుంది... గంగానదిలో! మణికర్ణికా వైభవం అంతా ఇంతా కాదు. ‘మణికర్ణికాష్టకమ్’ అని శంకరాచార్యులవారు ఒక అష్టకం చేశారు. ఆయన ఒక నదిని గురించి చెప్పడమే చాలా గొప్ప. సాధారణంగా ఆయన క్షేత్ర ప్రసక్తి తీసుకురారు. అటువంటిది గంగాష్టకమ్, నర్మదాష్టకమ్, యమునాష్టకమ్ చేశారు. ఒక్క మణికర్ణిక మీద ఒక అష్టకమ్ చేశారు. తీర్థం ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన ఒక శ్లోకంలో అద్భుతమైన వర్ణన చేశారు. ‘‘కాశీ ధన్యతమా విముక్తనగరీ సాలంకృతా గంగయా/ తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ / స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణా/ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’. కాశీ చాలా చాలా గొప్ప నగరం. అసలు కాశీ ఒకసారి వెడితే చాలు.. అనుకుంటాం. కాశీ అంటేనే ప్రకాశం. కాశీ విముక్తనగరి. అంత గొప్పది కాశీ .... ఆ కాశీకి మళ్ళీ అలంకారం గంగానది. తత్రేయం మణికర్ణికా. అక్కడ మణికర్ణికా తీర్థం కూడా ఉంది. దీనికున్న గొప్పదనం ఏమిటంటే – ‘‘మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః/ స్వీయైరబ్ధ శతైశ్చతుర్ముఖధరో వేదార్థ దీక్షాగురుః/యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత/స్త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివమ్’’... మధ్యాహ్నం 12 గంటలవేళ మణికర్ణికాతీర్థంలో స్నానం చేస్తున్న వారికోసం శివకేశవ రూపాల్లో పరబ్రహ్మం పోట్లాడుకుంటుందట... నే తీసుకువెడతా అంటే నే తీసుకువెడతా అని.. ‘నీయందు ఎవరయినా స్నానం చేస్తే వారికి మోక్షం ఇస్తాను’ అని ముక్తిదేవత ఒక సేవకురాలిలాగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటుందట. ఇంతమంది దేవతలతో కూడుకున్న స్వర్గలోకం గొప్పదా? కాశీపట్టణం గొప్పదా ? అని ఒకప్పుడు బ్రహ్మగారికి సందేహం వచ్చిందట. పెద్ద త్రాసు సృష్టించి ఒక పళ్ళెంలో స్వర్గలోకాన్ని మరో పళ్ళెంలో కాశీపట్టణాన్ని, గంగానదిని, మణికర్ణికా తీర్థాన్ని ఉంచాడట...‘‘ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’ కాశీ బరువుకు అది ఉంచిన పళ్ళెం కిందికి దిగితే.. స్వర్గలోకం ఉన్న పళ్ళెం పైకి తేలిపోయిందట. అటువంటి కాశీ పట్టణం ఉన్న ఈ దేశం గొప్పది, ఇక్కడ పుట్టడం కూడా గొప్ప అదృష్టం కదూ! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Maha Shivratri 2024 ఉపవాసం, జాగారం, ఇంట్రస్టింగ్ సంగతులు
మహా శివరాత్రి అంటే సృష్టి, స్థితి, లయకారులలో శివుడికి లయకారుడైనా మహాశివుడకి ఎంతో ప్రీతి పాత్రమైన రోజు. భక్తితో కొలిచే తన భక్తులతోపా పాటు క్రిమికిటకాదులకు కూడా మోక్షమిచ్చి సాక్షాత్కరించే బోళా శంకరుడు. భక్తజన రక్షకుడు. సనాతనుడు, భూతనాథుడు, వైద్యనాథుడు, పశుపతి నాథుడు, చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు, చంద్రశేఖరుడు. ప్రతిమాసంలోనూ బహుళ పక్షం వచ్చే చతుర్ధశికి మాస శివరాత్రి అని పేరు. అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి. అన్నింటిలోనూ మహిమాన్వితమైనది మహాశివరాత్రి. శివరాత్రి అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన రాత్రి అని అర్థం. శివ పార్వతులిరువురికి సంబంధించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం. శివరాత్రి పర్వదినం క్షీరసాగర మథనంలో అమృతంకంటే ముందు పుట్టిన హలాహలం ముల్లోకాలను దహించివేస్తుందన్న ప్రమాదమున్న కారణంగా ముక్కోటి దేవతలు పరమేశ్వరుణ్ణి వేడుకోవడంతో ఆ గరళాన్ని గొంతులో బంధించి గరళ కంఠుడుడయ్యాడు. కంఠం నీలంగా మారి మారడంతో నీలకంఠుడయ్యాడు. సంప్రదాయ ప్రియులు జరుపుకునే ప్రతి పండుగకూ ఏదో ఒక పురాణగాథ ఉన్నట్లే మహాశివరాత్రికీ ఒకటి రెండు ఐతిహ్యాలున్నాయి. పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము ‘నేను గొప్ప అంటే నేను గొప్ప ’ అని వాదించుకున్నారు. ఈ వివాదం పెరిగి పెరిగి భయంకరమైన యుద్ధానికి దారితీసింది. అరివీర భయంకరమైన ఆ యుద్ధానికి త్రిలోకాలూ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మవిష్ణువుల మధ్య వెలసింది. ఆ మహాలింగాన్ని చూసిన బ్రహ్మ, విష్ణువులిరువురూ లింగాన్ని సమీపించారు. అప్పటివరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పో రు కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగి ఆ మహాలింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తిగా మారింది. దాంతో బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు శ్వేతవరాహరూపంలో లింగం ఆదిని కనుక్కోవడానికీ బయల్దేరారు. ఎంతదూరం ఎగిరినా బ్రహ్మకు లింగం అంత్యభాగం కనపడలేదు. వరాహరూపంలో ఉన్న విష్ణువు పా పాతాళందాటి వెళ్లినా లింగం మొదలు కనిపించ లేదు. ఇంతలో లింగం పక్కనుంచి ఒక కేతకపుష్పం (మొగలిపువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ మొగలిపువ్వును ఆపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన సంవాదాన్ని వివరించి, తనకు సహాయం చేయమని అడిగాడు. ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజ మేనని సాక్ష్యం ఇవ్వమనిప్రా పాధేయపడ్డాడు బ్రహ్మ. సాక్షాత్తూ సృష్టికర్తయే తనని బతిమాలేసరికి కాదనలేకపో యింది మొగలిపువ్వు. వారిద్దరూ కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపో యానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే మొగలిపువ్వును అడగమని చెప్పా డు. ‘నిజమే’నంది మొగలిపువ్వు.దాంతో తాను ఓడిపో యానని విష్ణువు ఒప్పుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతక పుష్పం అంటే మొగలిపువ్వు నాటినుంచి తనను అర్చించడానికి అవకాశం లేదన్నాడు. అంతేకాదు భక్తులెవ్వరూ మొగలిపువ్వులతో తనను పూజించరాదని శాసించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండీ అల్పవిషయంలో అసత్యం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఎవరూ పూజ చేయరాదని, ఆలయాలు కట్టకూడదని శాసించాడు. సత్యం చెప్పిన విష్ణువును మెచ్చుకుని, భూలోకంలో తనతో సమానంగా పూజలందుకునే విధంగా ఆశీర్వదించాడు. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఈశ్వరుణ్ణి శ్రేష్ఠమైన ఆసనం మీద కూర్చుండబెట్టారు. హారాలు, నూపురాలు, కిరీటం, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టువస్త్రాలు, పూలమాలలు, పువ్వులు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు, ధూపం, శ్వేతఛత్రం, వింజామరలు వంటి దివ్యమైన వస్తువులను సమర్పించి షోడశోపచారంగా పూజించారు. ఆ పూజకు ఈశ్వరుడు ఎంతగానో సంతోషించాడు. ఆ ఈ రోజు తనను మూర్తిని, లింగాన్ని పూజించే వారికి మోక్షం లభిస్తుందన్నాడు. శివరాత్రినాడు పార్వతీసమేతంగా తనను అర్చించే వారు మహోన్నత ఫలాలు పొందే విధంగా అనుగ్రహించాడు. మహాశివరాత్రి పండుగ శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపా పాన్ని ధ్యానిస్తూ, శివ నామస్మరణం చేయడం. మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు.. నాలుగు జాములు నిద్రపో కుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి పునర్జన్మ ఉండదని స్కాంధ పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పా పాపా పాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనో, ఎలాంటి ప్రయోజనం లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివ గాథలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజుకి ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపా పాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రి కి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. ఉపవాసం ఎలా? శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, మినహా శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా, శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఉపవాసం అంటే ‘దగ్గరగా ఉండడం’ అని! ఆరోగ్యపరంగా చూసినప్పుడు, ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతోపాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉప వసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించడం కష్టం. శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. అంతేకాదు జాగారం వుండి శివ పంచాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారాయన భక్తులు. కనుకనే మహాశివరాత్రి నాడు నమశ్శివాయ అంటూ మారుమోగుతాయి శివాలయాలన్నీ. ‘త్రయంబకం యజామహే...‘ అంటూ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగబాధలూ తగ్గి, పూర్ణాయుష్షు లభిస్తుందని ప్రతీతి. శివరాత్రి నాడు కలిగినంతలో దానాలు చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. అందుకే చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవా అన్నారు. ఇవేవీ చేయ(లే)కపో యినా నిర్మలమైన మనస్సు తో వీలైనన్ని సార్లు ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేసినా చాలు, ఆ బోళాశంకరుడుపొంగిపో యి వరాలిస్తాడు. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కో అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపా పాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. ఆయన శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. శివుడి దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. రెండు స్వరూపాలు శివుడు కేవలం రుద్రస్వరూపుడే కాక ప్రేమస్వరూపుడు కూడా. రుద్రస్వరూపంగా అయితే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. జగతః మాతా పితరౌ శివ పార్వతులు తమ కల్యాణ మహోత్సవానికి చక్కగా చిగిర్చే పూచే వసంతకాలాన్ని మనకిచ్చి ఆకులు రాలే శిశిరాన్ని ఎంచుకున్నారు ఆ దంపతులు. వెన్నెల మెండుగా కాసే పున్నమిని మనకిచ్చి కన్ను పొడుచుకున్నా కానరాని బహుళ చతుర్దశిని తాము తీసుకున్నారు. రాత్రివేళ అయితే అది మనకి ఇచ్చింది అని భావించి తెల్లవారుజామున మంచిదనుకున్నారు ఆ తలిదండ్రులు. మల్లెల్నీ మొల్లల్నీ మనకి విడిచి వాసన, రూపసౌందర్యం లేని తుమ్మిపూవుల్ని సిద్ధం చేసుకున్నారు. చందనాన్ని మన పరం చేసి విభూతిని పులుముకున్నారు. ఊరేగింపునకి ఎద్దునీ, అలంకారాలుగా పా పాముల్నీ ... ఇలా జగత్తుకోసం ఇన్ని త్యాగాలు చేసిన ఆ ఆది దంపతుల కల్యాణ మహోత్సవానికి పిల్లలమైన మనం తప్పక హాజరు కావాలి. ఆశీస్సులు అందుకోవాలి. అందుకే ఈ జాగరణం. -
శివతాండవానికి సరస్వతీపుత్రుడి తెలుగు నట్టువాంగం
ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా ప్రచారంలో ఉన్న “జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం” సంస్కృత స్తోత్రమే గుర్తుకు వస్తుంది. ఇది రావణాసురుడు రాసి, ఎకో సిస్టంలో దిక్కులు పిక్కటిల్లేలా క్రమ, ఘన, ఝట పద్ధతుల్లో స్వయంగా పాడాడని ఆ స్తోత్రం చివర ఉంటుంది. కానీ- మంత్ర శాస్త్ర రహస్యాలు తెలిసినవారు- ఇది రావణాసురుడు రాసినది కాదని అనాదిగా వాదిస్తున్నారు. తెలుగులో అంతటి శివతాండవం ఉంది. “సరస్వతీపుత్ర” పుట్టపర్తి నారాయణాచార్యులు రచించి, గానం చేసిన శివతాండవం అర్థం చేసుకోవడానికి సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాల పరిచయం అవసరం. శ్రీ వైష్ణవుడై ఉండి నారాయణాచార్యులు శివతాండవం రాయడం ఒక విశేషం. ఆరు దశాబ్దాల పాటు ఆయన రాసిన నూట పది కావ్యాల్లో శివతాండవం ఒక్కటే అన్నిటినీ పక్కకు నెట్టి…వెలుగుతూ ఉండడం మరో విశేషం. పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పుట్టపర్తిని తెలుగువారు గుర్తించాల్సినంతగా గుర్తించలేదు. ఆ బాధ ఆయన మాటల్లో తెలిసేది. నిజానికి బాధపడాల్సింది మనం. పదమూడో ఏట ఆయన రాసిన చిన్న కావ్యం “పెనుగొండ లక్ష్మి” విద్వాన్ పరీక్షలో ఆయనకే పాఠం. ప్రపంచ సాహితీ చరిత్రలో ఇంకే కవికి ఇలాంటి సందర్భం బహుశా వచ్చి ఉండదు. పుట్టపర్తి వారి శివతాండవంలో శివుడు తెలుగు మువ్వలు కట్టుకుని, తెలుగులో ఎలా తాండవం చేశాడో చూద్దాం. ఇప్పటికి కనీసం పదిహేనుసార్లు ముద్రితమయిన శివతాండవం కావ్యానికి రెండు, మూడు ముద్రణలకు పుట్టపర్తివారే ముందుమాటగా, చివరి మాటగా కొంత వివరణ ఇచ్చారు. శివుడి తాండవ ఉద్ధృతికి తగినట్లు తాండవగతి అంతా మహోద్ధతిలో సాగుతుంది. పార్వతి లాస్యభాగం చాలా మృదువైనది. ఆ రచన తేలికగా, పూల అలంకరణలా సాగుతుంది. భాష తెలియకపోయినా ఆసేతుహిమాచలం శివతాండవం ఆయన పాడగా విని ఊగిపోయింది. ఆ శబ్దమే శివతాండవాన్ని కళ్లముందు ప్రత్యక్షం చేస్తుంది. నిజానికి ఆ శైలి చదవడం కోసం కాదు. పాడడం కోసం. ఆ పాట కూడా శివుడి నాట్య వేగంతో సమానంగా సాగే సామగానసహిత సాహిత్య ప్రవాహం. పుట్టపర్తి శివతాండవం పాడగా విన్నవారిది అదృష్టం. పుట్టపర్తివారి శివతాండవ కావ్యసారమిది అని చెప్పేంత మంత్ర, నాట్య, సంగీత, సాహిత్య శాస్త్రాల పరిజ్ఞానం నాకు లేదు. ఇరవై ఏళ్ల వయసులో హిందూపురంలో ప్రఖ్యాత తెలుగు విద్వాంసుడు కర్రా వేంకట సుబ్రహ్మణ్యం సార్ దగ్గర కొన్నేళ్లపాటు తెలుగు, సంస్కృత వ్యాకరణం, ఛందస్సు- అలంకారాలు నేర్చుకునే భాగ్యం కలిగింది. ఆయన దగ్గరికి వెళ్లేవరకూ తెలుగులో పుట్టపర్తి నారాయణాచార్యులు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అన్న రెండు సాహితీ హిమవన్నగాలు ఉన్నాయనే నాకు తెలియదు. భాషలో ఏ ఉదాహరణ అయినా వీరిద్దరి కావ్యాల ప్రస్తావనతోనే చెప్పేవారు. కడప రామకృష్ణ ఉన్నత పాఠశాలలో ఆయన పుట్టపర్తివారితో కలిసి పనిచేశారు. అలా నాకు శివతాండవమంటే పులకింత. పూనకం. ఒళ్లు తెలియదు. అర్థం తెలియకుండానే కొన్నేళ్లపాటు పాడుకుంటూ ఉండేవాడిని. శివతాండవం మొదలు కావడానికంటే ముందే ప్రకృతి పరవశించి సిద్ధమవుతోంది. గాలులు పులకింతతో చల్లగా వీస్తున్నాయి. గాలి తాకిడికి కొమ్మల్లో పూలు నేల రాలుతున్నాయి. రాలుతున్న పూలు ముసి ముసిగా మువ్వల్లా నవ్వుతున్నాయి. పార్వతి మెడలో పూలహారం అలంకారంగా వెళుతున్నాం కదా! శివతాండవాన్ని ముందు వరుసలో కూర్చుని చూడబోతున్నామని రాలే పూలు మెరిసిపోతున్నాయి. మురిసిపోతున్నాయి. జింకలు చెంగు చెంగున ఎగురుతూ కళ్లల్లో ఆనందబాష్పాలు చిందిస్తున్నాయి. తాండవానికి సిద్ధమవుతున్న శివుడిని జింకలు అలా కన్నీళ్లతో కాళ్లు కడిగాయి. పైన మబ్బులు బంగారు వర్ణం పులుముకుని గొడుగు పడుతున్నాయి. అప్సర యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పక్షుల కిలకిలలు వేదనాదాలుగా వినిపిస్తున్నాయి. బ్రహ్మ దగ్గరుండి శివుడికి ఒక్కొక్క పామును ఒక్కో ఆభరణంగా వాటి ఆకార పరిమాణాన్ని బట్టి సర్దుబాటు చేస్తున్నాడు. తుమ్మెదల గుంపు శ్రుతి పడుతోంది. సెలయేళ్లన్నీ ఉప్పొంగుతున్నాయి. సాయం సూర్యుడు కొండల్లో దిగిపోకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో శివ తాండవం మొదలయ్యింది. శివుడి తలపై గంగ అలలు అలలుగా ఎగసిపడుతోంది. నెలవంక అటు ఇటు కదులుతోంది. నుదుటిమీద ముంగురులు నాట్యమాడుతున్నాయి. మూడో కంట్లో నుండి నిప్పులు రాలుతున్నాయి. పెదవిమీద నవ్వులు నాట్యమాడుతున్నాయి. శివుడి నాట్యవేగానికి పాములు జారిపోతూ మళ్లీ గట్టిగా చుట్టుకుంటున్నాయి. సముద్రం పొంగినట్లు, కొండలు ఎగిరినట్లు, భూగోళం తిరిగినట్లు, బ్రహ్మాండాలు బంతులాడినట్లు చూస్తున్నవారికి రెండు కళ్లు చాలలేదు. మొగలిపూల వాసనలు చల్లినట్లు మత్తెక్కుతోంది. అంతదాకా లేని వసంత శోభ ఒక్కసారిగా విచ్చుకుంటోంది. ఆ నాట్యం నవ్వుకు నడకలు నేర్పుతోంది. మువ్వలకు మాటలు నేర్పుతోంది. సూర్యుడికి వెలుగునిస్తోంది. తీగలకు సోయగమిస్తోంది. భంగిమల్లో విశ్వమంతా ప్రతీకలుగా ఒదిగిపోతోంది. ముద్రల్లో భావాలు భాష్యాలు పలుకుతున్నాయి. కైలాస శిఖరం అంచులు నిక్కి నిక్కి తేరిపార చూస్తున్నాయి. ఆకాశం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసి ఆనందిస్తోంది. ముందువరుసలో కూర్చున్న విష్ణువు ఆనందం పట్టలేక కళ్లతోనే మాట్లాడుతున్నాడు. ఆ కంటిబాసకు శివుడు నాట్యం చేస్తూనే స్పందనగా ఒక నవ్వు విసిరాడు. ఇద్దరి నవ్వులో లోకాలు ఆనంద నర్తనం చేశాయి. శివుడు విష్ణువయ్యాడు. విష్ణువు శివుడయ్యాడు. చివరికి ఇద్దరూ ఒకటయ్యారు. “ఆడెనమ్మా శివుడు. పాడెనమ్మా భవుడు. ఏమానందము? భూమీతలమున! శివ తాండవమట! శివ లాస్యంబట!” ఈలోపు పార్వతిలాస్యం మొదలయ్యింది. కళ్లలో నవ్వుల కాంతులు చిందుతున్నాయి. చిరుపెదవిలో శివుడి కళలు, కలలు కదులుతున్నాయి. సాక్షాత్తు పార్వతి కాలు కదిపితే తాము పక్కవాద్య సహకారమందించాలని కోటివీణలు తమకు తాముగా కదిలి మధురగానం చేస్తున్నాయి. ఆమె కాలి గజ్జెల్లో ప్రతి మువ్వ ఒక్కొక్క భావాన్ని పలికిస్తోంది. బ్రహ్మ మొదలు రుషులందరూ ఆమె లాస్యానికి తలలూపుతూ తన్మయంతో తేలిపోతున్నారు. పార్వతి లాస్యానికి పరవశుడై శివుడు కూడా చేయి కలిపాడు. శివపార్వతులు ఒక్కటై నాట్యం చేస్తున్నారు. సరస్వతి చేతి వీణ కచ్ఛపి మీటువేగం పెరిగింది. దిక్కులన్నీ పూలు చల్లాయి. దిగ్దిగంతాల్లో శివపార్వతుల నాట్యమే ప్రతిఫలిస్తోంది. ప్రతిధ్వనిస్తోంది. ఇక్కడికి కావ్యం సమాప్తం. శివ అంటే చైతన్యం. ప్రాణం. స్పందన. శుభం. మంగళం. శివతాండవం అంటే ఆ ప్రాణ స్పందనకు ప్రతిరూపం. లేదా విశ్వ స్పందనకు సంకేతం. ఈశా అన్న మాటే శివ అవుతుంది. ప్రాణముంటే శివం. ప్రాణం లేకపోతే శవం. పార్వతి ప్రకృతి. శివపార్వతుల నాట్య, లాస్యాలు- ప్రాణి, ప్రకృతి స్పందనల సంకేతాలు. కడప ఆకాశవాణి వారు పుట్టపర్తివారు శివతాండవం పాడగా రికార్డు చేశారు. అయితే అప్పటికే ఆయన ఏడు పదులకు దగ్గరగా ఉన్నారు. బహుశా అంతంత గంభీర సమాసాలు ఊపిరి బిగబట్టి పాడడం సాధ్యం అయి ఉండకపోవచ్చు. కానీ అర్ధ శతాబ్దం పాటు ఆయన తిరిగిన ప్రతిచోటా శివతాండవం పాడారు. శివుడి తాండవాన్ని తన శబ్దాలతో, గాన గంగా ప్రవాహంతో ప్రత్యక్ష ప్రసారంగా చూపించారు. కొన్ని వేల వ్యాసాలు రాసినా, వందల విమర్శలు చేసినా, వందకు పైగా కావ్యాలు రాసినా…పుట్టపర్తి అంటే శివతాండవం. శివతాండవమంటే పుట్టపర్తి. సరస్వతీ పుత్రుడి కీర్తి కిరీటంలో శివతాండవమే కలికి తురాయి. నారాయణాచార్యులు కడప జిల్లా ప్రొద్దుటూరు అగస్తేశ్వరాలయంలో నలభై రోజులు నిష్ఠగా ప్రదక్షిణలు చేస్తూ అక్కడే కూర్చుని రాసిన కావ్యమిది. శివుడి తాండవానికి, పార్వతి లాస్యానికి తెలుగు నట్టువాంగమిది. పోతనచేత రాముడు భాగవతాన్ని రాయించినట్లు- పుట్టపర్తి చేత అగస్తేశ్వరుడు రాయించిన శివతాండవమిది. చదవాలంటే అదృష్టం ఉండాలి. వినాలంటే రాసిపెట్టి ఉండాలి. శివతాండవం శైలిలో కృష్ణ తాండవం కూడా పుట్టపర్తి రాస్తే చూడాలని లోకం కోరుకుంది. కుదరలేదు. హిందీలోకి శివతాండవాన్ని ఆయనే అనువదించాలని అనుకున్నారు కానీ- సాధ్యపడలేదు. ఆకాశవాణిలో పనిచేసి రిటైరయిన ఆయన కూతురు పుట్టపర్తి నాగపద్మిని శివతాండవాన్ని అదే ఉద్ధతిలో హిందీలోకి అనువదించి అనేక వేదికల మీద పాడారు. పాడుతున్నారు. ఆ హిందీ అనువాద గ్రంథం ఇటీవల ముద్రణకు నోచుకుంది. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018 -
Maha Shivratri: నేడు తినాల్సినవి/తినకూడని ఆహారాలు ఇవే!
మహా శివరాత్రి పర్వదినం కావడంతో అందరూ తమ శక్తి మేరకు ఎంతో కొంత ఉపవాసం ఉంటారు. కొందరూ మధ్యహ్నాం వరకు తినరు మరికొందరూ రోజంతా ఏం తినకుండా రాత్రి జాగరం కూడా చేసి మరసటి రోజు ఉదయం గానీ తినరు. ఇలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు పళ్లు, పాలు వంటివి తీసుకోని ఆ భోళా శంకరుడుని ప్రార్థించొచ్చు. అలాంటి వారు ఈ పర్వదినం రోజు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో చూద్దామా!. సగ్గుబియ్యం: ఇది తక్షణ శక్తి ఇస్తుంది. ఉపవాసం చేసే వాళ్లకు చాలా మంచిది. ఈ సగ్గుబియ్యందో చేసిన జావా లేదా పాలతో చేసే సగ్గుబియ్యం జావా తాగితే మంచిది. ఉపవాసం ఉన్న వాళ్లకు మంచి ఎనర్జీ బూస్టప్‌గా ఉంటుంది. బంగాళ దుంప!: ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి చక్కగా ఉడక బెట్టుకుని లేదా దానికి సంబంధించిన రెసిపీలు తీసుకుంటే మంచిది. అయితే ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయాలు లేకుండా నచ్చిన రెసిపీ చేసుకుంటే మంచిది పాల సంబంధిత రెసిపీలు.. శివుడికి పాల సంబంధిత పదార్థాలను నైవద్యంగా పెట్టడం జరుగుతంది. అలాంటివి తీసుకుంటే ఉపవాసం ఉన్నవాళ్లు కళ్లు తిరగడం వంటివి తలెత్తవు. పండ్లు, డ్రైఫ్రూట్స్ పండ్లు తినడం మంచిదే కానీ, మరీ సిట్రస్ ఎక్కువగా ఉండే పుల్లటి పండ్లు తినకపోవడమే మంచిది. ఉపవాసం కారణంగా పొట్టలో ఆటోమేటిగ్గా యాసిడ్లు ఫామ్ అవుతాయి. ఇక ఇలాంటి పుల్లటి పళ్లు తీసుకుంటే మరింత గ్యాస్ ఫామ్ అయ్యే ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంది. తీసుకోకూడని పదార్థాలు.. తృణ ధాన్యాలు.. గోధుమలు, అరికెలు, జొన్నలు, సామలు వంటి తృణ ధాన్యాలకు సంబంధించిన పదార్థాలు వినియోగించకూడదు. అలాగే ఎలాంటి పిండి పదార్ధాలు వినియోగించ కూడదు. ఉల్లి, వెల్లుల్లి.. సాధారణంగా ఇలాంటి పర్వదినాల్లో ఉల్లి, వెల్లుల్లి జోలికిపోరు. ఇవి తమో రజో గుణాలను ప్రేరిపిస్తుందని మునులు వీటిని ఇలాంటి పర్వదినంలో త్యజించమని సూచించారు. ఉప్పు ఉప్పు లేని పదార్థాలే తీసుకోవాలి. అదికూడా సైంధవ లవణమైతే వినియోగించొచ్చు. స్సైసీ ఫుడ్స్ మసాలతో కూడిన పదార్థాలు నిషిద్ధం. నాన్ వెజ్ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్‌వెజ్ జోలికి పోకూడదు. మహా శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఉపవాసంతో ఆ ముక్కంటి అనుగ్రహం పొందేలా చేసుకునే పవిత్రమైన రోజు. (చదవండి: లావుగా ఉన్నావంటూ భార్యతో సహా బిడ్డను వదిలేశాడు..కానీ ఆమె..!) -
మహాశివరాత్రి: ఈ ఆలయాన్ని సందర్శిస్తే.. ఏడాదిలో వివాహం!
భారతదేశంలో వివాహం అనేక ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరికీ అదొక సామాజిక అవసరం. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మందికి పెళ్లి వయసు వచ్చిన వివాహం కావడం లేదని ఆందోళనకు గురవుతుంటారు. అడుగడుగునా అడ్డంకులు ఎదురౌతూ ఉంటాయి. వీటినుంచి విముక్తి కోసం రకరకాల పూజలు, శాంతులు చేస్తూ ఉంటారు. జాతకాలు, దోషాలు అంటూ నానా తంటాలు పడుతుంటారు. కానీ ఈ శివాలయానికి వెళితే సంవత్సరం తిరిగే లోపే వివాహం అవుతుందని భక్తులు చెబుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఒక దేవాలయం గురించి , దాన్ని ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. తంజావూరు జిల్లా కుట్టాలమ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయం కళ్యాణసుందర్ ఆలయం. కావేరీ నదీతీర ప్రాంతంలో నిర్మితమైన ఈ ఆలయంలోని పార్వతీ పరమేశ్వరులు పాణిగ్రహణ (చేతిలో చేయి వేసి పట్టుకున్న) స్థితిలో దర్శనమిస్తారట. ఆదిదంపతుల వివాహం జరిగిన పవిత్రమైన స్థలంగా భక్తులవిశ్వాసం. అందుకే పెళ్లికాని వారు ఒక్కసారి ఈ ఆలాయన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏడాది తిరిగే లోగా ఆమూడుముళ్ల వేడుక జరుగుతుందని భక్తులు నమ్ముతారు . తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలోని లాల్గుడి బ్లాక్‌లో ఉందీ దేవాలాయం. దీని పేరే మంగళాంబి సమేత మాంగళీశ్వర దేవాలయం. మాంగల్య మహర్షి ఇక్కడ విరివిగా వివాహాలను నిర్వహించారని ప్రతీతి. ఈ దేవుడి ఆశీస్సుల వల్లే బైరవ, వశిష్టర్, అగస్తియర్ల వివాహాలు జరిగాయట. ముఖ్యంగా ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు క్రమం తప్పకుండా సందర్శించే దేవాలయం. పురాణాల ప్రకారం, మాంగల్య మహర్షి స్వయంగా ఉత్తర నక్షత్రంలో జన్మించాడట. మాంగల్య మహర్షి తపస్సు చేసి సంపాదించిన అపారమైన శక్తి మహిమతో ఇది సాధ్యమవుతుందని చెబుతారు. ఆయన దేవదూతలకు గురువైనందున, ఆయన ఆశీర్వాదంతో శ్రీఘ్రమే వివాహాలు జరుగుతాయని, అమోఘమైన వరాలను అనుగ్రహిస్తారని నమ్ముతారు.వివాహానికి సంబంధించిన ప్రతీ ముహూర్తాన్ని దేవదూతలు పైనుండి ఆశీర్వది స్తారని కూడా నమ్ముతారు. నిజానికి తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పట్టు జిల్లా, చెన్నైలోని తిరువిందందై అనే గ్రామంలో ఉన్న నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయం సహా ఇలాంటి టెంపుల్స్ చాలా ఉండటం విశేషం.