Sagubadi
-
ప్రతిష్టాత్మక అగ్రి షో ‘కిసాన్ 2024’ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద అగ్రి షో ‘కిసాన్ 2024’ 2వ ఎడిషన్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పలువురు రైతులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణలోనే అతిపెద్ద అగ్రి షో - కిసాన్ 2024 వ్యవసాయ రంగంలోని ప్రముఖులు, నిపుణులు, ప్రగతిశీల రైతులను వేదిక పైకి తీసుకువచ్చింది. ఫిబ్రవరి 1వ నుంచి 3వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమం వ్యవసాయంలో తాజా పురోగతుల ప్రదర్శనపై దృష్టి సారించింది. ముఖ్యంగా కిసాన్ హైదరాబాద్ 2024.. వ్యవసాయ పరిశ్రమలోని విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎగ్జిబిటర్లకు శక్తివంతమైన వేదికను అందిస్తోంది. ఎగ్జిబిషన్లో వ్యవసాయ యంత్రాలు-పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, వాటర్-ఇరిగేషన్ సొల్యూషన్స్, ప్లాస్టికల్చర్, వివిధ రకాల పనిముట్లు(టూల్స్), ఐఓటీ ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్‌తో సహా విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తున్నారు. అధునాతన రక్షిత సాగు సాంకేతికతలు, వ్యవసాయం అనుకూల క్లియరెన్స్ మొబైల్ యాప్‌లు సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ పొందుపరిచారు. ఈ అద్భుత వ్యవసాయ ప్రదర్శనలో 140 మందికి పైగా ఎగ్జిబిటర్లు, అగ్రి పరిశ్రమల ప్రముఖుల నుండి ఇన్నోవేటివ్ స్టార్టప్‌ల వరకు పాల్గొన్నారు. ఈ వేదికపై వ్యవసాయానికి అనుకూలమైన తాజా ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి 140కి పైగా కంపెనీలను, 20,000 మంది సందర్శకులను కలుపుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. "కిసాన్ హైదరాబాద్ అనేది వ్యవసాయంలో విభిన్న వాటాదారులను విజయవంతంగా ఒకచోట చేర్చిన ఒక వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం అద్భుతమైన ఆవిష్కరణలను ప్రదర్శించడమే కాకుండా తెలంగాణలో వ్యవసాయ రంగం యొక్క స్థిరమైన వృద్ధికి అవసరమైన సంభాషణలను, ప్రోత్సాహాకాలను రైతులకు అందిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు." 3 రోజుల అగ్రి షో నేపథ్యంలో తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు నాలెడ్జ్ సెషన్లను అందించడానికి ఏకకాల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో సమగ్ర ప్రదర్శన, సమాచార సెమినార్లు, ఇంటరాక్టివ్ సెషన్లు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో తాజా పురోగతులు, ఉత్పత్తులు, సేవలను అన్వేషించే అవకాశాన్ని హాజరైన వారికి అందిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల నుండి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే! -
బొట్టు.. బొట్టు.. మెట్ట భూముల్లో పచ్చని పంట చిగురించేట్టు!
మారుతున్న కాలానుగుణంగా.. వ్యవసాయ పద్ధతులలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకు నిదర్శనంగా.. కొందరు రైతులు మైదానంలాంటి మెట్ట భూముల్లో కూడా పంటలు పండిస్తున్నారు. వర్షాకాలం వరకు ఎందుకు ఎదురుచూపులంటూ.. వారి వద్దనున్న నూతన టెక్నాలజీతో కూడిన పరికరాలను ఉపయోగించి పచ్చని పంటలు పండిస్తున్నారు. వారిని గురించి తెలుసుకుందాం. స్ప్రింక్లర్లతో సాగు చేస్తున్న కొత్తిమీర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మాడుగులపల్లి మండలంలోని సాగర్ ఆయకట్టేతర ప్రాంత రైతులు బిందు, తుంపర సేద్యంపై దృష్టి సారించారు. డ్రిప్పు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకొని మెట్ట భూముల్లో పచ్చని పంటలు పండిస్తున్నారు. తీగజాతి కూరగాయలు, ఆకుకూరలు, వేరుశనగ తదితర పంటలను సాగు చేస్తున్నారు. మండలవ్యాప్తంగా 3 నుంచి 4 వేల ఎకరాల్లో వేరుశనగ, కొత్తమీర, దోస, ఇతర కూరగాయలు పండిస్తున్నట్లు మండల ఉద్యానశాఖ అధికారి అనంతరెడ్డి తెలిపారు. ప్రభుత్వం బిందు, తుంపర సేద్యం పరికరాలు సబ్సిడీపై అందిస్తే మరింత మంది రైతులు ప్రత్యామ్నాయ పంట సాగు చేసి ఆదాయం గడించే అవకాశం ఉంది. ఇవి చదవండి: ఈ సీసన్లో.. బెండసాగుతో అధిక దిగుబడులు! -
ఈ సీసన్లో.. బెండసాగుతో అధిక దిగుబడులు!
రైతులు బెండసాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొంటున్నారు. హార్టికల్చర్ కన్సల్టెంట్ సుందరి సురేష్. దీనివలన భూసారంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. రసాయన ఎరువుల ఖర్చులను ఆదా చేసుకుని అధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జించవచ్చని సూచిస్తున్నారు. వచ్చే వేసవి బెండ సాగుకు అనుకూలమని, పంట సాగుకు అవలంబించాల్సిన పద్ధతులు ఆయన మాటల్లోనే.. వాతావరణం : వేడి వాతావరణం అనుకూలం. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. అందు వలన పంట వర్షాకాలం, వేసవికాలంలో పండించడానికి అనుకూలమైనది. నేలలు : సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు, మురుగు నీటి సౌకర్యం గల తేలికపాటి రేగడి నేలలు అనుకూలం. విత్తే సమయం : వర్షాకాలపు పంటకు జూన్ నుంచి జూలై వరకు, వేసవి పంటను జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తన మోతాదు : వేసవి పంటకు ఎకరాలకు 7 నుంచి 8 కిలోల విత్తన సరిపోతుంది. రకాలు : పర్భని క్రాంతి, అర్కఅనామిక, అభయ విత్తన శుద్ధి.. విత్తనాలను విత్తే ముందు 12గంటలు నీటిలో నాన బెట్టాలి. ఆవు మూత్రం ద్రావణంలో (1:5 నిష్పత్తిలో నీటిలో కలిపి) 30 నిమిషాలు శుద్ధి చేయాలి. విత్తనశుద్ధికి 100 మి.లీ. ఆవు మూత్రం, 100 గ్రాములు ఆవు పేడ, 100 గ్రాములు గట్టుమట్టి, లేదా పుట్ట మట్టి కలిపిన నీటిలో ఒక గంట వరకు నానబెట్టి, నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. భీజామృతం లేదా అమృత జలం లేదా పంచగవ్యం ద్రావణంలో 8గంటలు నీటిలో నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. పొలం తయారీ, విత్తే పద్ధతి.. నేలను 4–5 సార్లు బాగా దున్నాలి. వర్షాకాలపు పంటను 60 సెం.మీ ఎడంలో బోదెలపై 30 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. నేలను మళ్లుగా చేసి, వరుసల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 15 నుంచి 20 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక్కో రంధ్రానికి 2–3 విత్తనాలను విత్తుకోవాలి. పోషకాల యాజమాన్యం.. 10 నుంచి 15 మి.లీ. కోడిగుడ్లు, నిమ్మకాయ రసం ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి దిగుబడులు పెంచవచ్చు. మొక్కలు మొలిచిన 3–4 రోజుల్లో తొలిసారి 3 శాతం పంచగవ్య ద్రావణం పిచికారీ చేయాలి. పూత దశకు ముందే 5 శా తం పంచగవ్య పిచికారీ చేయాలి. పంట రెండు వారాల వయస్సులో 400 లీటర్ల జీవామృతం సాగు నీటిలో అందించాలి. మొక్క 4–6 ఆకుల దశలో తులసీ–కలబంద కషాయం పిచికారీ చేయాలి. పంటపై 2 శాతం పంచగవ్య పిచికారీ చేస్తే దిగుబడులు పెరుగుతాయి. రక్షణ పంటలు : తోట చుట్టూ జొన్న, సజ్జ, బంతి మొక్కలను పెంచాలి. అంతర పంటలు : పైరు మధ్యలో బంతి మొక్కలను ఎర పంటగా వేయాలి. అంతర పంటలుగా ముల్లంగి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. నీటియాజమాన్యం : గింజలు విత్తిన వెంటనే నీరు కట్టాలి. తరువాత 4–5 రోజులకు రెండోసారి నీరు పారించాలి. వేసవి పంటకు అయితే ప్రతి 4–5 రోజులకు ఒకసారి తప్పనిసరిగా నీరు పెట్టాలి. దిగుబడి : 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. భూసార యాజమాన్యం ఇలా.. దబోల్కర్ పద్ధతిలో వివిధ రకాల విత్తనాలను విత్తి పెరిగిన తర్వాత భూమిలో కలియదున్నాలి. ఎకరానికి పశువుల ఎరువు 10 టన్నులు, 500 కిలోల ఘనజీవామృతం, వేప పిండి 100 కిలోలు, వేరుశనగ పిండి 32–40 కిలోలు, 2 కిలోలు అజోస్పైరిల్లం, 2 కిలోలు పాస్పోబ్యాక్టీరియా, ఆఖరి దుక్కిలో వేసి, కలియదున్నాలి. ఎకరానికి 200 లీటర్ల జీవామృతం, 15 రోజుల వ్యవధిలో సాగు నీటిలో అందించాలి. -
బియ్యం,గోధుమల్లో బలం సగమే, పైగా.. : షాకింగ్ రిపోర్ట్
తిండికి కటకటలాడుతూ ఓడలో ధాన్యం వస్తేనే దేశం ఆకలి తీరే పరిస్థితుల్లో హరిత విప్లవ సాంకేతికత (జిఆర్టి)ల అమలు మన దేశంలో 1960వ దశకంలో ప్రాంరంభమైంది. అధిక దిగుబడినిచ్చే వరి/గోధుమ ఆధునిక వంగడాలు తయారుచేసుకొని వాడుతున్నాం.. నీటి పారుదల, రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పంటలు పండిస్తున్నాం.. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు తెల్ల బియ్యం, గోధుమలు అందిస్తున్నది. ఏభయ్యేళు గడచిపోయాక.. వెనక్కి చూస్తే జనం కడుపు నిండుతోంది. కానీ, పోషకలోపం వెంటాడుతోంది. ముందెన్నడూ లేనట్లుగా రోగాలు ముసురుకుంటున్నాయి. దీనికి మూలకారణం ఏమిటో ఓ తాజా అధ్యయనం విడమర్చి చెబుతోంది. ప్రసిద్ధ వంగడాలపైనే అధ్యయనం వరి, గోధుమల్లో పోషకాల స్థాయిని తెలుసుకునేందుకు ఐసిఎఆర్, ఐసిఎంఆర్ పరిశోధన సంస్థల్లో పనిచేస్తున్న నేలల నిపుణుడు డా. సోవన్ దేబనాద్, మరో 11 మంది శాస్త్రవేత్తలతో కలసి విస్తృత పరిశోధనలు చేశారు. డా. సోవన్ ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఐసిఎఆర్– సెంట్రల్ ఆగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త. పశ్చిమబెంగాల్లోని ఐసిఎఆర్– బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ, హైదరాబాద్‌లోని ఐసిఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌కు చెందిన మరో 11 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 1960వ దశకం నుంచి ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు 1,199 వరి, 448 గోధుమ, 417 మొక్కజొన్న, 223 జొన్న అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన (50 లక్షల హెక్టార్ల కన్నా ఎక్కువగా సాగైన) వంగడాల్లో నుంచి ఒక్కో దశాబ్దానికి 2–4 రకాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా పండించి మరీ అధ్యయనం చేశారు. జయ నుంచి స్వర్ణ సబ్ 1 వరకు.. ఈ విధంగా ఎంపికచేసిన 16 వరి, 18 గోధుమ రకాలను 2018–2020 మధ్యకాలంలో మూడేళ్ల పాటు సాగు చేశారు. ఎంపికైన వరి రకాల్లో 1960ల నాటి జయ, పంకజ్, 1970ల నాటి ఐఆర్8, స్వర్ణ, రాశి, 1980ల నాటి ఐఆర్ 36, క్షితిశ్, సాంబ మసూరి, లలత్, 1990ల నాటి ఐఆర్ 64, ఖందగిరి, రంజిత్, త్రిగుణ, 2000ల నాటి నవీన్, ప్రతిక్ష్య, స్వర్ణ సబ్ 1 వున్నాయి. గోధుమ రకాల్లో 1960ల నాటి సొనాలిక నుంచి 2010లలో విడుదలైన హెచ్డి–3059 రకాలను ఎంపిక చేశారు. 2009లో విడుదలైన స్వర్ణ సబ్ 1 తర్వాత 5 లక్షల హెక్టార్లకు పైగా సాగైన లాండ్మార్క్ వరి వంగడాలు లేక΄ోవటం వల్ల 2010లలో విడుదలైన ఏ వరి వంగడాన్నీ అధ్యయనం చేయలేదని డా. సోవన్ తెలి΄ారు. వరి విత్తనాలను కటక్‌లోని ఎన్ఆర్ఆర్ఐ నుంచి, గోధుమ విత్తనాలను కర్నల్‌లోని ఐఐడబ్లు్యబిఆర్ల నుంచి సేకరించారు. వీటన్నిటినీ ఒకే రకమైన మట్టి మిశ్రమంతో కూడిన ప్రత్యేక కుండీల్లో సాగు చేశారు. అలా పండించిన తెల్ల బియ్యం, గోధుమ పిండిలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో సరిపోల్చి విశ్లేషించటం ఈ అధ్యయనం లక్ష్యం. 45శాతం తగ్గి పోయిన పోషకాలు మన దేశంలో ప్రజలు రోజువారీ ప్రధాన ఆహారంగా తినే వరి బియ్యం లేదా గోధుమల ద్వారానే రోజుకు అవసరమైన శక్తిలో 50%కి పైగా సమకూరుతుంది. ఈ రెండు ధాన్యాలు గత 50 ఏళ్లలో 45% పోషక విలువలను కోల్పోయినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. గత 50 ఏళ్లలో, వరి బియ్యంలో అత్యవసరమైన పోషకాలైన జింక్ 33%, ఇనుము 27% తగ్గిపోయాయి. గోధుమలో జింక్ 30%, ఇనుము 19% తగ్గిపోయాయి. ఈ సమస్యను ఇప్పటికైనా సరిచేయకపోతే 2040 నాటికి వరి బియ్యం, గోధుమలు తినటానికి పనికిరానంతగా పోషకాలన్నిటినీ కోల్పోతాయని డా. సోవన్ ఆందోళన వ్యక్తం చేశారు. పోషకాలు బాగా తగ్గి΄ోవటంతో పాటు మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. ఈ ధాన్యాల్లో విషతుల్య పదార్థాలు చాలా పెద్ద ఎత్తున పోగుపడటం. ఆర్సెనిక్ (పాషాణం) ఏకంగా 1,493 శాతం మేరకు పెరిగిపోయింది. భార ఖనిజాలతో జబ్బులు ఈ అధ్యయనం మనకు తెలియజెప్తున్నదేమిటంటే.. రోజువారీగా ప్రధాన ఆహారంగా మనం తింటున్న తెల్ల అన్నం, గోధుమ రొట్టెల్లో పోషకాలు సగానికి తగ్గటంతో పాటు ఆరోగ్యానికి హాని చేసే భార ఖనిజాలు మెండుగా చేరాయన్న మాట. షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఊబకాయం, కేన్సర్ వంటి అసాంక్రమిక వ్యాధులు పెచ్చుమీరిపోవడానికి వరి, గోధుమల్లో ΄ోషకాలు లోపించటంతో పాటు భార ఖనిజాలు కూడా కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఫాస్ఫరస్, కాల్షియం, సిలికాన్, వనాడియం వంటి పోషకాలు ఎముకల అభివృద్ధికి దోహదం చేస్తాయి. రోగనిరోధక శక్తి, పునరుత్పాదక శక్తికి, నరాల బలానికి జింక్ కీలకం. రక్తవృద్ధికి ఇనుము చాలా ముఖ్యం. రోజూ ఎక్కువ మొత్తంలో తినే ఆహారంలో ఈ పోషకాలు లోపిస్తే నరాల బలహీనత, సంతానలేమి, కండరాలు, ఎముకల క్షీణతకు దారితీస్తుందని నేచర్ పత్రికలో ప్రచురితమైన వ్యాసాల్లో నిపుణులు చెబుతున్నారు. ఆర్సెనిక్, క్రోమియం, బేరియం, స్ట్రాంటియమ్ వంటి విషతుల్య భార ఖనిజాలు ఊపిరితిత్తుల కేన్సర్లు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, హైపర్కెరటోసిస్, కిడ్నీల సమస్యలు, ఎముకల్లో కాల్షియం లోపించటం వంటి జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్వం మాదిరిగా జొన్న తదితర చిరుధాన్యాలు తినటం తగ్గిపోవటం, వరి, గోధుమల వినియోగం బాగా పెరిగి΄ోవటం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. 1990–2016 మధ్యకాలంలో అసాంక్రమిక వ్యాధులు 25% పెరిగి΄ోయాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) నివేదికలు చెబుతున్నాయి. బయోఫోర్టిఫైడ్ వంగడాలతో సమస్య తీరేనా? ధాన్యాల్లో పోషకాల లేమిని అధిగమించేందుకు ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉండే బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొదించటంపై ఐసిఏఆర్ పదేళ్ల క్రితం నుంచే పని ప్రారంభించింది. ఇప్పటికి 142 బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొందించింది. ఇందులో 124 ధాన్యపు పంటలు. వీటిలో 10 వరి, 43 గోధుమ, 20 మొక్కజొన్న, 13 రకాల కొర్ర వంటి చిన్న చిరుధాన్యాలు, 11 సజ్జ రకాలు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాల లోపాన్ని కొంతమేరకు అధిగమించవచ్చన్నది శాస్త్రవేత్తల మాట. దేశవ్యాప్తంగా 6% సాగు భూమిలో ఈ వంగడాలు సాగవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. సాగు భూమిలో పోషకాలు తగ్గిపోయాయి కాబట్టి ఆహారంలో పోషకాలు తగ్గి పోతున్నాయని ఇన్నాళ్లూ అనుకున్నాం. అయితే, వరి, గోధుమ మొక్కలకు నేలలో ఉన్న పోషకాలను తీసుకునే శక్తి కూడా తగ్గిపోయిందని ఇప్పుడు రూఢి అయ్యింది. ఇంతకన్నా ఆందోళన కలిగించే మరో విషయాన్ని కూడా ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. నేలలో భార ఖనిజాలు వంటి విషతుల్య పదార్థాలను కంకుల్లోని ధాన్యాలకు చేరకుండా ఆపి వేసే సహజసిద్ధమైన విచక్షణా జ్ఞానం మొక్కలకు ఉంటుంది. అయితే, అధిక దిగుబడుల కోసం తయారు చేసిన ఆధునిక వరి, గోధుమ విత్తనాల బ్రీడింగ్ ప్రక్రియల్లో గత ఏభయ్యేళ్లలో చేసిన కీలక మార్పుల వల్ల ఈ పంటల్లో ఆ తెలివి లోపించింది. అందువల్లే ఇప్పుడు వరి బియ్యం, గోధుమల్లోకి ప్రాణాంతక భార ఖనిజాలు అధిక పాళ్లలో చేరుతున్నాయి. వీటిని తిన్న మనుషులకు పోషకాలు లోపించటం వల్ల మాత్రమే కాదు, భార ఖనిజాల వల్ల కూడా రకరకాల జబ్బులొస్తున్నాయని తేలింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, భారతీయ వైద్య పరిశోధనా మండలి సమన్వయంతో అత్యంత కీలకమైన ఈ అధ్యయనం చేయటం విశేషం. గత నవంబర్‌లో ‘నేచర్’ లో ఈ అధ్యయన పత్రం అచ్చయ్యింది. ఇందులోని వివరాలు సంక్షిప్తంగా.. ► గత ఏభయ్యేళ్లలో 45% మేరకు పోషకాలు కోల్పోయిన వరి, గోధుమలు.. ►2040 నాటికి పూర్తిగా తగ్గే ప్రమాదం.. ►అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల్లో దశాబ్దానికి ఒకటి, రెండు ప్రాచుర్యం ΄పొందిన రకాలపై ఐసిఏఆర్, ఐసిఎంఆర్ సంయుక్త అధ్యయనం ►సాంబ మసూరి, స్వర్ణ సబ్ 1 తదితర 16 రకాల వరి, 18 రకాల ►గోధుమ అధిక దిగుబడి వంగడాలపై అధ్యయనం ►భారఖనిజాల శాతం పెరగటంతో ప్రజారోగ్యానికి ముప్పు ►బయోఫోర్టిఫైడ్ వంగడాలు మేలంటున్న శాస్త్రవేత్తలు నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Brown Top Millet ఒక్కసారి విత్తితే.. నాలుగు పంటలు!
అండుకొర్ర.. చిన్న చిరుధాన్యా(స్మాల్ మిల్లెట్స్)ల్లో విశిష్టమైన పంట. పంట కాలం 90–100 రోజులు. ధాన్యపు పంట ఏదైనా కోత కోసి, దుక్కి చేసిన తర్వాత మళ్లీ పంట రావాలంటే తిరిగి విత్తనాలు ఎదపెట్టాల్సిందేనని మనకు తెలుసు. అయితే, అండుకొర్ర పంటను రెండేళ్లుగా సాగు చేస్తున్న కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కె. హేమాద్రిరెడ్డి అనుభవం అందుకు భిన్నంగా ఉంది. 2022 జూౖలై లో తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తనం వేసి, అక్టోబర్‌లో పంట కోసుకున్నారు. నవంబర్‌లో దుక్కిచేసి మినుము చల్లి, నీటి తడి పెట్టారు. అండుకొర్ర వత్తుగా మొలవటంతో ఆశ్చర్యం కలిగింది. అండుకొర్ర కోత కోసే సమయంలో రాలిన ధాన్యమే నెల రోజుల తర్వాత దుక్కి చేసి తడి పెట్టగానే మొలిచిందన్నమాట. మినుము మొలకలు కనిపించినా అవి ఎదగలేకపోయాయి. అండుకొర్ర ఏపుగాపెరిగింది. సరే.. ఇదే పంట ఉండనిద్దామని నిర్ణయించుకొని.. ట్రాక్టర్‌తో సాళ్లు తీసి అండుకొర్ర పంటనే కొనసాగించారు. అదే విధంగా మూడు పంటలు పూర్తయ్యాయి. నాలుగో పంట ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉందని, ప్రతి పంటలోనూ ఎకరానికి 10 క్వింటాళ్ల అండుకొర్ర దిగుబడి వస్తోందని, పంట పంటకు దిగుబడి ఏమాత్రం తగ్గలేదని, తక్కువ ఖర్చుతోనే అండుకొర్ర పంట అధికాదాయాన్ని అందిస్తోందని రైతు హేమాద్రి రెడ్డి సంతోషంగా చెప్పారు. అనంతపురంలో ఇటీవల జరిగిన మూడు రోజుల చిరుధాన్యాల సమ్మేళనం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ‘సాక్షి సాగుబడి’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. కదిరికి చెందిన ఎర్త్ 360 సంస్థ వ్యవస్థాపకులు దినేశ్ సూచనలు, సహాలతో చిరుధాన్యాల సాగు చేపట్టానని ఆయన తెలిపారు. కలుపు బాధ లేని అండుకొర్ర పంట 40 ఎకరాల ఆసామి అయిన హేమాద్రిరెడ్డి సాగు భూమిని చాలా కాలంగా కౌలుకు ఇస్తూ వచ్చారు. రెండేళ్ల క్రితం మనుమడి సూచన మేరకు 5 ఎకరాల్లో అండుకొర్ర చిరుధాన్యాల సాగు ్ర΄ారంభించారు. కూలీల కొరతతో ఇబ్బంది అవుతుందని తొలుత సంశయించానని, అయితే అండుకొర్ర పంటకు కలుపు సమస్య లేక΄ోవటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నానని ఆయన అన్నారు. పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేని చక్కని పంట అండుకొర్ర అన్నారాయన. కలుపు మొక్కల కన్నా అండుకొర్ర మొక్కలు వేగంగా పెరుగుతుంది. అందువల్ల కలుపు పెరిగే అవకాశమే లేదన్నారు. దీంతో ప్రయాస లేకుండానే పంట చేతికి వస్తోందని, యంత్రంతో కోతలు జరుపుతున్నారు. ఇప్పుడు మొత్తం 20 ఎకరాలకు అండుకొర్ర సాగును విస్తరించారు. మోళ్లు కలియదున్నుతాం.. దుక్కి చేసిన తర్వాత గొర్రెలను పొలంలో నిల్వగడతారు. గొర్రెల మలమూత్రాలు పొలాన్ని సారవంతం చేస్తాయి. ఆ తర్వాత కలియదున్నిన తర్వాత వరుసల మధ్య 15 అంగుళాలు ఉండే ట్రాక్టర్ గొర్రుతో ఎకరానికి 5 కిలోల అండుకొర్ర విత్తనాలను తొలి ఏడాది విత్తారు. రెండో పంట నుంచి.. పంట కోత తర్వాత మోళ్లను రొటవేటర్‌తో భూమిలో కలియదున్నుతున్నారు. పంట కాలంలో మూడు దఫాలు హంద్రీ నది నుంచి మోటారుతో తోడిన నీటిని పారగడుతున్నారు. నల్లరేగడి నేల కావటంతో ఎక్కువగా తడి ఇవ్వటం లేదని, ఇది మెట్ట పంట కాబట్టి నీరు ఎక్కువ పెడితే రొట్ట పెరుగుతుంది తప్ప దిగుబడి రాదని హేమాద్రి రెడ్డి వివరించారు. గొర్రెలు ఆపటానికి ఎకరానికి రూ. 1,500 ఖర్చవుతోంది. దుక్కి, అంతర సేద్యం అంతా సొంత ట్రాక్టర్‌తోనే చేస్తున్నారు. బయటి ట్రాక్టర్‌తో ఈ పనులు చేస్తే ఎకరానికి పంటకు రూ. 3 వేలు ఖర్చు వస్తుంది. ‘అంతకు మించి చేసేదేమీ లేదు. చీడపీడలు, తెగుళ్ల సమస్య లేదు కాబట్టి పురుగుమందుల పిచికారీ అవసరం రావటం లేద’న్నారాయన. కలుపు, చీడపీడల సమస్యలు లేని, కూలీల అవసరం పెద్దగా లేని అండుకొర్ర పంటను సునాయాసంగా సాగు చేస్తూ.. క్వింటాకు రూ. 9,500 ఆదాయం పొందుతున్నానని హేమాద్రిరెడ్డి తెలిపారు. మిషన్‌తో పంట కోత ఖర్చు, గడ్డి అమ్మితే సరిపోతోందన్నారు. కొర్ర కూడా సాగు చేస్తున్నానని, వచ్చే సీజన్ నుంచి అరికలు కూడా వేద్దామనుకుంటున్నానన్నారు. అండుకొర్ర అద్భుత పంట అద్భుతమైన చిరుధాన్య పంట అండుకొర్ర.. కలుపును ఎదగనివ్వదు. ఈ విత్తనానికి నిద్రావస్థ పెద్దగా ఉండదు. గింజ బాగా తయారైన తర్వాత కోత కోసి నూర్పిడి చేస్తే, వారం రోజుల తర్వాత మొలుస్తుంది. ఒక్కసారి విత్తి వరుసగా నాలుగో పంట తీసుకుంటున్న హేమాద్రిరెడ్డి సాగు అనుభవం రైతులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. పంట కోసిన తర్వాత మోళ్లను భూమిలోకి కలియదున్నటం, గొర్రెలను నిలపటం వల్ల భూమి సారవంతమవుతోంది. మార్కెట్లో అండుకొర్రలు సహా అన్ని చిరుధాన్యాలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. ధర తగ్గే ప్రమాదం లేదు. దినేశ్ (94408 70875), చిరుధాన్యాల నిపుణుడు, ఎర్త్ 360, కదిరి క్వింటా రూ.9,500 రెండేళ్ల క్రితం తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పంటా ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. తొలి పంట క్వింటా రూ. 5 వేలకు అమ్మాను. రెండో పంటను క్వింటా రూ.7,500కు అమ్మాను. గత ఏడాది ఖరీఫ్‌లో మరో 15 ఎకరాల్లో కూడా అండుకొర్ర వేశా. మూడో పంటను క్వింటా రూ. 9,500కు అమ్మాను. నాలుగో పంట కొద్ది రోజుల్లో కోతకు సిద్ధమవుతోంది. రైతులకు విత్తనంగా కూడా ఇస్తున్నాను. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చులు పోగా మంచి నికరాదాయం వస్తోంది. 3 సార్లు నీరు కడుతున్నాం. నీరు ఎక్కువైతే దిగుబడి తగ్గిపోతుంది. ఒక పొలంలో జనుము సాగు చేసి రొటవేటర్ వేస్తే ఆ తర్వాత అండుకొర్ర దిగుబడి ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు వచ్చింది. ప్రయాస లేని పంట అండుకొర్ర. – కె. హేమాద్రిరెడ్డి (92469 22110), అండుకొర్ర రైతు, కోడుమూరు, కర్నూలు జిల్లా -
విత్తుకు.. మున్ముందుకు..
రాజానగరం: వ్యవసాయ రంగం ఆధునీకత వైపు పరుగులు తీస్తుంది.. దీనిని అందిపుచ్చుకుంటే సాగు బంగారమే.. కొత్తగా వస్తున్న మార్పులను ఆకలింపు చేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చని కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇందుకు గాను తాము రూపొందించి, వాడుకలోకి తెచ్చిన డ్రమ్ము సీడర్‌తో ఎంతగానో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. మెట్ట ప్రాంతంలో వరి విత్తనాలు నాటే విధానానికి డ్రమ్ము సీడర్ అనుకూలమైంది. దీనివల్ల సమయం ఆదాతోపాటు కూలీ సమస్య ఉండదు. శ్రమ, ఖర్చు తగ్గుతాయి. ఈ సాధనాన్ని ఉపయోగించి వరి విత్తనాలను చల్లితే క్రమపద్ధతిలో వరి మొక్కలు రావడంతోపాటు దుబ్బు బాగా కట్టి, మంచి దిగుబడులు సాధించవచ్చు. డ్రమ్ము సీడర్‌తో మొలకెత్తిన వరి విత్తనాలను నేరుగా పొలాల్లో విత్తుకుంటే పంట త్వరగా రావడంతోపాటు ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని, దిగుబడి 5 నుంచి 10 శాతం వరకూ పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డ్రమ్ము సీడర్ని వినియోగించే విధానాన్ని రైతులకు ప్రయోగాత్మకంగా చూపిస్తున్నారు. గత 16 ఏళ్లుగా జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఈ పద్ధతిలో అనేక ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేసి వరి సాగులో మంచి ఫలితాలు సాధించారు. నీటి సమస్య అధిగమించొచ్చు పొలంలో నేరుగా విత్తనాలు చల్లాలన్నా, మడులు కట్టి నారు పెంచాలన్నా పొలంలో సమృద్ధిగా నీరు ఉండాలి. అంతేకాక కూలీల అవసరం ఉంటోంది. ఈ సమస్యలను పూర్తిగా అధిగమించేందుకు పొలాల్లో నేరుగా డ్రమ్ము సీడర్‌తో వరి విత్తనాలను నాటుకోవచ్చు. ఈ పరికరం తయారు చేసే విధానాన్ని కూడా కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం సహాయకులు రైతులకు వివరిస్తున్నారు. మొలకెత్తిన విత్తనం వేసేందుకు వీలున్న నాలుగు ప్లాస్టిక్ డబ్బాలను కలిపి, ప్రతి డబ్బాకు 20 సెం.మీ. దూరంలో రంధ్రాలు చేయాలి. పరికరం సులువుగా కదలడానికి ఇరువైపులా రెండు పెద్ద చక్రాలు ఏర్పాటు చేయాలి. దానిని లాగడానికి అనువుగా హ్యేండిల్ను అమర్చుకోవాలి. ఇలా తయారు చేసిన తరువాత దీని బరువు 10 కిలోలను మించి ఉండదు. కొద్దిగా మొలకెత్తిన విత్తనాలను ఆ నాలుగు డబ్బాల్లో పోసి, దమ్ము చేసి, చదును చేసిన పొలాల్లో పెట్టి ముందుకు లాగడం ద్వారా విత్తనాలను నాటుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఎకరాకు 10 నుంచి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఇద్దరు మనుషులు మూడు గంటల్లో ఒక ఎకరం పొలంలో ఈ విధంగా విత్తనాలు విత్తేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానంలో మొక్కల పెరుగుదలతోపాటు కలుపు కూడా పెరిగే అవకాశం ఉన్నందున 15 నుంచి 20 రోజుల్లో కలుపు నివారణకు మందులను వాడాలని అధికారులు సూచించారు. అలాగే దమ్ములో 150 కిలోల సూపర్ పాస్ఫేట్తోపాటు 15 కిలోల పొటాష్ ఎరువును, విత్తిన 15 రోజులకు నత్రజని ఎరువును వేయాలని తెలిపారు. -
సెమీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉందని మీకు తెలుసా?
'రసాయనిక ఎరువులు, పురుగుమందులు.. జన్యుమార్పిడి విత్తనాలను అస్సలు వాడకుండా పంటలు పండించే సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు దేశ విదేశాల్లో ‘ఆర్గానిక్’ సర్టిఫికేషన్ గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ‘మంచి వ్యవసాయ పద్ధతుల(జి.ఎ.పి.)’తో పండించే ఆహారోత్పత్తులకు ‘గ్యాప్’ సర్టిఫికేషన్‌కు కూడా అదే మాదిరి గుర్తింపు ఉంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో ‘గ్లోబల్‌గ్యాప్’ ప్రమాణాలు అమల్లో ఉన్నాయి. ఈ ఆహారోత్పత్తులకు ఆయా దేశాల్లోని వినియోగదారులు, రిటైలర్ల ఆదరణతో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి గిరాకీ ఉంది. ‘గ్లోబల్‌గ్యాప్’కు అనుగుణంగా దేశీయంగా రైతులు, ప్రాసెసింగ్ పరిశ్రమదారులు పాటించవలసిన ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలను భారత ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా (క్యు.సి.ఐ.) 2021లో అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రమాణాలను రైతులకు మొట్టమొదటగా అందుబాటులోకి తెచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కటం విశేషం. తొలుత ఈ ప్రమాణాలను పాటించటం అలవాటు చేసుకునే రైతులకు.. భవిష్యత్తులో సేంద్రియ సర్టిఫికేషన్ పొందటం సులువు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘గ్లోబల్‌గ్యాప్’, ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలు, వాటి ప్రయోజనాల పూర్వాపరాలపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..' ఆహారం ప్రజలకు స్థానికంగా, సరసమైన ధరలో, అందరికీ అందుబాటులో ఉంటే ప్రజలకు ఆహార భద్రత (ఫుడ్ సెక్యూరిటీ) ఉన్నట్లు. ఆ ఆహారం మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించని ప్రమాణాలతో పండించి, నిల్వ చేసినదై ఉంటే అది క్షేమదాకమైన ఆహారం (సేఫ్ ఫుడ్). తగుమాత్రంగా రసాయనాలు వాడుతూ, ఇతర జాగ్రత్తలు పాటిస్తూ సేఫ్ ఫుడ్‌ను పండించడానికి రైతులకు ఉపకరించేవే ‘మంచి వ్యవసాయ పద్ధతులు’. వీటిని ‘గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ (జి.ఎ.పి.– గ్యాప్) అంటారు. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ‘గ్లోబల్‌గ్యాప్’ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందినవే ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలు. ఈ ప్రమాణాల ద్వారా రైతుల ఉత్పత్తులకు గిరాకీ పెరిగి, వారి నికరాదాయం పెరుగుతుందని అనుభవాలు చెబుతున్నాయి. పసుపు తోటలో శ్రేష్ట ఎఫ్‌పిసి రైతు నెర్ల విజయేంద్రరెడ్డి ‘గ్లోబల్‌గ్యాప్’ పుట్టుపూర్వోత్తరాలు.. తెలిసో తెలియకో పరిమితికి మించి రసాయనిక ఎరువులు, పురుగుమందులను విచ్చలవిడిగా వాడుతూ పంటలు పండిస్తున్నందు వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోంది. కొందరు రైతులు నిషిద్ధ పురుగుమందులను సైతం వాడుతున్నారు. పురుగుమందులు చల్లటానికి, పంట కోతకు మధ్య పాటించాల్సిన వ్యవధిని సైతం పాటించకపోవటం వల్ల విష రసాయనాల అవశేషాలు పరిమితికి ఎన్నో రెట్లు ఎక్కువ కనిపిస్తున్న సందర్భాలు లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కోసిన తర్వాత కలుషిత నీటిలో కడగటం వంటి, రవాణా, నిల్వ పద్ధతుల్లో కూడా టోకు, చిల్లర వ్యాపారులు నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోవటం పరిపాటిగా మారింది. ఇటువంటి సురక్షితం కాని ఆహారోత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. మన రాష్ట్రం, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఇదే. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఆహార వ్యవస్థలో గుణాత్మక మార్పులు తేవడానికి యూరప్‌లో చిల్లర వర్తకులు 1997లో ‘యూరోప్గ్యాప్’ పేరుతో మంచి వ్యవసాయ పద్ధతుల అమలుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వారి కృషి ఫలితంగా మెరుగుపరిచిన ప్రమాణాలు 2007లో ‘గ్లోబల్‌గ్యాప్’ పేరుతో ప్రపంచ దేశాలకు అందుబాటులోకి వచ్చాయి. ధాన్యపు పంటలు, కూరగాయలు, పండ్లు, పూల సాగుతో పాటు ఆక్వా సాగుకు కూడా ‘గ్లోబల్‌గ్యాప్’ ప్రమాణాలు వర్తింపజేస్తున్నారు. పంట పొలాలు, తోటలు, ఆక్వా చెరువుల్లో సాగు పద్ధతుల్లో ప్రతి దశలోనూ.. అదేవిధంగా ఆహారోత్పత్తుల సేకరణ, రవాణా, నిల్వ, ప్రాసెసింగ్ వ్యవస్థల్లో పాటించాల్సిన ప్రమాణాలను ‘గ్లోబల్‌గ్యాప్’ ప్రమాణాల సంస్థ నిర్దేశిస్తోంది. భారత్ సహా 130 దేశాల్లో ఇప్పటికి 1,95,000 మంది రైతులు గ్లోబల్‌గ్యాప్ సర్టిఫికేషన్ పొందారు. 43 లక్షల హెక్టార్లలో రైతులు అందుకు అనుగుణంగా సాగు చేస్తూ.. సాధారణ ఉత్పత్తులతో పోల్చితే అధిక ధరకు అమ్ముకుంటున్నారు. 25 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల చేపలు, రొయ్యలతో పాటు.. 2.1 కోట్ల టన్నుల సర్టిఫైడ్ కాంపౌండ్ ఫీడ్‌ను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. టర్కీలో గ్యాప్ ప్రమాణాలు పాటించిన రైతుల పొలాల్లో రసాయనిక ఎరువుల వాడకం 19–31% మేరకు తగ్గింది. రసాయనిక పురుగుమందుల వాడకం 50%, శిలీంధ్రనాశనులు 25%, కలుపు మందులు 70% తగ్గిందని ఒక అధ్యయనంలో తేలింది. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులు, పెద్ద రైతులు అనుసరించదగిన మంచి వ్యవసాయ పద్ధతులను క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా (క్యు.సి.ఐ.) ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలను 2021లో ప్రకటించింది. 2023 ఆగస్టులో గ్లోబల్ గ్యాప్ ప్రమాణాలతో ఇండిగ్యాప్ను అనుసంధానం చేశారు. 180కి పైగా గ్లోబల్‌గ్యాప్ సర్టిఫికేషన్ సంస్థలు అంతర్జాతీయగా రైతులకు సేవలందిస్తున్నాయి. మన దేశంలో ‘ఇండిగ్యాప్’ సర్టిఫికేషన్ విస్తరణ సేవలను వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావటం విశేషం. క్వాలిటీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గున్వత్తా సంకల్ప్ పథకం కింద ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ కార్యక్రమం అమలవుతోంది. తొలి ఏడాది 33 ఎఫ్‌పిసిలకు శిక్షణ ఇచ్చారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఇండ్‌గ్యాప్ అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కృషిగ్యాప్ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ ఇందుకు తోడ్పడుతోంది. స్పైసెస్‌బోర్డు ద్వారా మిరప, పసుపు తదితర సుగంధ ద్రవ్య పంటల్లో సైతం ఏపీ, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇండిగ్యాప్ సర్టిఫికేషన్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఖర్చుతోనే పరీక్షలు.. ‘ఇండిగ్యాప్’ సర్టిఫికేషన్ పొందే ప్రయత్నాలను దేశంలో మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 2023 ఖరీఫ్ నుంచి ప్రారంభించింది. తొలుత 20 వ్యవసాయ, 13 ఉద్యాన ఎఫ్‌పిసిలకు శిక్షణ ఇచ్చాం. ఇప్పటికే కొందరు రైతులు తక్కువ ఖర్చుతో, రసాయనిక అవశేషాల్లేని ఆహారం పండించి రైతులు అధిక ఆదాయం పొందారు. పరిమితికి మించి రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులను పండించిన తర్వాత శాంపుల్స్‌ను బెంగళూరు పంపి ప్రభుత్వ ఖర్చులతోనే 200 వరకు రసాయనాలకు సంబంధించి పరీక్ష చేయిస్తున్నాం. ఒక్కో శాంపిల్‌కు రూ. 10–12 వేలు ఖర్చు అవుతోంది. ఏపీలోనే రూ.2.6 కోట్లతో అధునాతన లాబ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండ్‌గ్యాప్ సర్టిఫికేషన్ పొందే రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు 130 దేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఆర్గానిక్ సర్టిఫికేషన్‌ను రైతులకు అందించడానికి సంబంధించి అపెడా ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన రైతుల బ్రాండెడ్ ఉత్పత్తులను దేశ విదేశాల్లో మంచి ధరకు విక్రయించి అధికాదాయం రాబట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. – డా. ఎ. త్రివిక్రమరెడ్డి (97393 16931), డైరెక్టర్, ఏపీ విత్తన, సేంద్రియ ధృవీకరణ అథారిటీ, గుంటూరు రైతుల్లో మార్పు వస్తోంది! మా శ్రేష్ట ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలో 300 మంది రైతులు ఉన్నారు. ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ కోసం రూ. 18 వేలు ఫీజు చెల్లించి నమోదు చేసుకున్నాం. మొదటి ఏడాది 24 మంది రైతులు 50 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి 100 మంది రైతులు 500 ఎకరాల్లో పసుపు సాగు చేయించాలన్నది లక్ష్యం. మా రైతులు 10% రసాయనిక ఎరువులు 90% సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. నిషేధిత పురుగుమందులు వాడకుండా ఇండిగ్యాప్ నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తున్న విధంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నాం. పసుపు పండిన తర్వాత ప్రభుత్వమే పరీక్ష చేయించి, ఇండిగ్యాప్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్ ఉంటే దేశ విదేశాల్లో మా ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ కోసం పనిచేస్తున్న మా సభ్య రైతుల్లో మార్పు కనిపిస్తోంది. ఇండిగ్యాప్ మామిడి, మిరప, అరటి రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అన్ని వివరాలూ మాన్యువల్‌గా నమోదు చేస్తున్నాం. వచ్చే ఏడాది ఆన్లైన్ సదుపాయం అందుబాటులోకి వస్తే వెసులుబాటుగా ఉంటుంది. – ఉయ్యూరు సాంబిరెడ్డి (93969 62345), శ్రేష్ట ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, కొల్లిపర, గుంటూరు జిల్లా చిన్న, సన్నకారు రైతుల కోసం..! విదేశాల్లో రిటైల్ స్టోర్లలో పక్కపక్కనే సాధారణ రసాయనిక వ్యవసాయంలో పండించిన ఆహారోత్పత్తులు, సేంద్రియ సర్టిఫైడ్ ఆహారోత్పత్తులతో పాటు.. మంచి వ్యవసాయ పద్ధతుల (గ్యాప్) ద్వారా పరిమితంగా రసాయనాలు వాడి పండించిన సర్టిఫైడ్ ఉత్పత్తులు కూడా పక్కపక్కనే పెట్టి అమ్ముతూ ఉంటారు. వినియోగదారులు తమ స్థోమతను బట్టి వాటిని కొనుగోలు చేస్తుంటారు. యూరప్‌లో 1997లో రిటైల్ వర్తకుల చొరవ వల్ల ‘గ్లోబల్‌గ్యాప్’ సర్టిఫికేషన్ ప్రారంభమైంది. ఆ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో క్వాలిటీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలను నిర్దేశించింది. ఈ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించటం, సర్టిఫికేషన్ పొందే ప్రక్రియకు సంబంధించిన అంశాలపై మా సంస్థ అనేక రాష్ట్రాల్లో అధికారులు, ఎఫ్‌పిసిలు, రైతులకు శిక్షణ ఇస్తున్నాం. గతంలో మహారాష్ట్రం, ఏపీలకు చెందిన ద్రాక్ష రైతులకు కూడా శిక్షణ ఇచ్చాం. ఔషధ మొక్కల పెంపకంపై స్పైసెస్ బోర్డు తోడ్పాటుతో రైతులకు శిక్షణ ఇస్తున్నాం. శంషాబాద్‌లో క్షేత్రస్థాయిలో ఇండిగ్యాప్, సేంద్రియ సర్టిఫికేషన్లకు అనుగుణంగా శాస్త్రవేత్తలు, అధికారులు, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఆచరణాత్మక శిక్షణ ఇచ్చేందుకు త్వరలో నమూనా క్షేత్రాన్ని నిర్మిస్తున్నాం. ‘ఇండిగ్యాప్’ ప్రమాణాల ప్రకారం రైతులు పంటలు పండించి ఎఫ్పిఓలు, కోఆపరేటివ్‌ల ద్వారా గ్రూప్ సర్టిఫికెట్ పొందొచ్చు. పరిమితికి మించి రసాయనిక పురుగుమందుల అవశేషాల్లేని మంచి ఆహారానికి ఇటు దేశీయ మార్కెట్లలోగాని, అటు అంతర్జాతీయ మార్కెట్లలో గాని మంచి గిరాకీ ఉంది. రైతులు అధికాదాయం పొందవచ్చు. – కోటెల శ్రీహరి (98480 34740), వ్యవస్థాపకులు, కృషిగ్యాప్ డిజిటల్ సొల్యూషన్స్, హైదరాబాద్, www.krishigap.com – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు!
చెట్లకు పండ్లను పండించడం విన్నాం. కానీ ఇలా చెట్లకే కుర్చీలను పండించడం గురించి వినలేదు కదా!ఎక్కడైనా చెట్లను పెంచి వాటిని కట్ చేసి కుర్చీల ఆకృతిలో తయారు చేస్తారు. కానీ ఏకంగా ఓ పండు మాదిరిగా కుర్చీలను చెట్లకు పెంచడం ఏమిటీ? అసలు అదెలా సాధ్యం? అనిపిస్తుంది కదా!. అయితే ఇక్కడో రైతు ఈ వినూత్న ఆలోచనతో పెద్ద వ్యాపారమే చేస్తున్నాడు. లక్షల్లో లాభలు కూడా ఆర్జిస్తున్నాడు. ఎలా చేస్తాడంటే..యూకేకి చెందిన గావిన్, ఆలిస్ మున్రో జంట ఈ వినూత్న వ్యవసాయాన్ని మొదటు పెట్టారు. ఇద్దరు ఫర్నీచర్ ఫామ్‌ని చేస్తారు. వారు తమ పొలంలో కుర్చీల్లా ఎదిగేలా చెట్లను పెంచుతారు. ఫర్నీచర్ కోసం పరిపక్వానికి వచ్చిన చెట్లను నరికేసి భారీగా కార్బన్ ఉద్గారాలు పెరిగే ప్రమాదానికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఒక చెట్టును 50 ఏళ్లపాట్లు పెంచి ,నరికి కుర్చీగా తయారు చేసే బదులు చెట్లకే నేరుగా కావాల్సిన ఆకృతిలో కుర్చీలను పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది గావిన్ అనే రైతుకి. అనుకున్నదే తడువుగా ఆ భార్యభర్తలిద్దరూ ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసేలా కుర్చీలను పండిస్తున్నారు. దీన్ని గావిన్ ఒక రకమైన జెన్ త్రీడీ ప్రింటింగ్ అంటారని చెబుతున్నారు. ఆయనకు ఈ ఆలోచన తాను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడూ కుర్చీలా ఉండే బోన్సాయ్ చెట్లను చూసి ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు. అదీగాక గావిన్ చిన్నతనంలో వంగిన వెన్నుపూసతో జన్మించాడు. దీంతో చాలా కాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. అక్కడ వైద్యులు వెన్నుని సరిచేసే నిమిత్తం మెటల్ ఫ్రేమ్‌ని అమర్చారు. దాంతోనే చాలా ఏళ్లు గడిపాడు. అప్పుడే గావిన్కి తెలిసింది..ఏదైన సరైన ఆకృతిలో రావాలంటే పెరుగుతున్న క్రమంలోనే ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే సెట్‌రైట్ అవుతుందని. ఆ తర్వాత గావిన్ తన ఆలోచనకు(చెట్లకు కుర్చీలు పెంచడ) రూపమిచ్చే పనిలో నిమగ్నమయ్యాడు. అందుకోసం విల్లో అనే ప్రత్యేకమైన చెట్లును ఉపయోగించాడు. విల్లో చెట్టు కొమ్మలు చాలా సరళంగా ఉంటాయి. అదేవిధంగా, ఓక్, యాష్, సైకమోర్ వంటి బలమైన తీగలు ఉన్న చెట్లను కూడా ఫర్నిచర్ పెంచడానికి ఉపయోగిస్తారు. చెట్ల తీగలను కుర్చీలుగా మార్చడానికి గావిన్ ఇనుప ఫ్రేమ్‌లను ఉపయోగిస్తాడు. ఈ ఫ్రేమ్‌ల లోపల చెక్క కుర్చీని అమర్చి పెంచుతారు. కుర్చీల ఆకారం చెడిపోకుండా ఉండటానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చెట్టు కత్తిరిస్తాడట. అయితే ఒక్కో కుర్చి ఖరీదు మాత్రం రూ. 6 నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుంది. ఈ క్రమంలో వారు చెట్ల పెరుగుదలను అడ్డురాకుండా మంచి ఆకృతిలో పెంచేందుకు ఒక మార్గాన్ని కూడా కనుగొనవల్సి వచ్చింది. ఈ సేంద్రీయ మొక్కలను పెంచడానికి చాలా శ్రమ, సమయంల ఖర్చు అవుతుందని చెబుతున్నాడు గావిన్. ఈ మొక్కల పెంపకంలో అతడి భార్య ఆలిస్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇలా ఈ దంపతులు 2012లో ఫుల్ గ్రోన్ అనే కంపెనీని స్థాపించారు. అంతేగాదు సగటున ఒక కుర్చీ పెరగడానికి ఆరు నుంచి 9 సంవత్సరాలు పట్టగా ఎండడానికి ఒక ఏడాది పడుతుంది. అంటే ఒక కుర్చీ తయారవ్వడానకి ఇంచుమించు ఏడు నుంచి పదేళ్లు పట్టొచ్చు. పైగా ధర కూడా లక్షల్లో ఉంటుంది. చెట్లకు కుర్చీలనే పెంచడమే ఒక వింత అనుకుంటే వాటిని ఇన్ని లక్షలు పోసి కొనడం మరింత విడ్డూరంగా ఉంది కదా!.అంతేగాదు గావిస్ ఆలిన్ ఇంత సమయం పట్టకుండా ఉండేలా ఏటా పండించేలా చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. 2024 కల్లా ఆ లక్ష్యం నెరవేరగా దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆ గావిన్ ఆలిస్ దంపతులు. (చదవండి: 30 ఏళ క్రితం పోయిన బ్యాగ్ మళ్లీ యజమాని చెంతకు..! 11 ఏళ్ల చిన్నారి..) -
ఆవిష్కర్తలకు ఆత్మీయ దిక్సూచి!
'వ్యవసాయం రైతులకు గిట్టుబాటు కావాలంటే పనిసౌలభ్యంతో పాటు ఉత్పత్తి ఖర్చులు తగ్గించే యాంత్రీకరణ అత్యవసరం. ఆవిష్కరణలను సాంకేతికంగా, ఆర్థికంగా ప్రోత్సహించినప్పుడే వినూత్న యంత్రాలు రైతులకు అందుబాటులోకి వస్తాయి. అందుకు ఇంక్యుబేషన్ కేంద్రాలు దోహదం చేస్తాయి. అటువంటి కేంద్రాల్లో విలక్షణమైనది హైదరాబాద్ పిజెటిఎస్ఎయు ఆవరణలో కొలువుదీరిన అగ్రిహబ్ ఫౌండేషన్. టెక్నీషియన్ల నుంచి గ్రామీణుల వరకు ఎవరైనా అగ్రిహబ్ సేవలను అందుకోవచ్చు.' అగ్రిహబ్.. వ్యవసాయం, ఆహార సంబంధమైన అనుబంధ రంగాల్లో ఇటు సాంకేతిక నిపుణుల ఆవిష్కరణలకు, అటు గ్రామీణ ఆవిష్కర్తలకు మార్గదర్శిగా నిలుస్తున్న సంస్థ. రెండు అంచెల వ్యవస్థగా పనిచేస్తున్న తొలి అగ్రి ఇంక్యుబేటర్ కావటం దీని ప్రత్యేకత. అంతేకాదు, అగ్రిటెక్ స్టార్టప్‌ల ఆవిష్కరణలను క్షేత్రస్థాయిలో పరీక్షించి, వాటి యోగ్యతను నిర్థారించే విలక్షణ వేదిక అగ్రిహబ్. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోవటంలోనూ ఆవిష్కర్తలకు చేదోడుగా నిలుస్తోంది. అర్హులైన ఆవిష్కర్తలకు నాబార్డు గ్రాంట్‌కు సిఫారసు చేస్తోంది. కొన్ని స్టార్టప్‌ల ఆవిష్కరణల్లో ఈక్విటీ ఫండింగ్ సమకూర్చుతోంది. ఆలోచనతో వస్తే చాలు.. సాంకేతిక నిపుణులు, పరిశో«దకులు, విద్యార్థులు వ్యవసాయం, ఆహారోత్పత్తులకు సంబంధించి వినూత్న ఆలోచనతో వస్తే.. ఆ ఆలోచనను ఆచరణాత్మక ఆవిష్కరణగా తీర్చిదిద్దటానికి ఇంక్యుబేషన్ సేవలందిస్తున్నామని అగ్రిహబ్ ఫౌండేషన్ సీఈవో, డైరెక్టర్ విజయ్ నడిమింటి ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ చెప్పారు. ఆవిష్కరణలపై మేధోహక్కులకు పేటెంట్ హక్కులు పొందటానికి కూడా అగ్రిహబ్ తోడ్పడుతుంది. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఈ సేవలు అందుకోవచ్చు. ఇప్పటి వరకు 350కి పైగా స్టార్టప్‌లకు అగ్రిహబ్ సేవలందించింది. 825 డిజైన్ థింకర్స్‌కు తోడ్పాటునందించింది. 25 స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం నెరపింది. 8 స్టార్టప్‌లు రూపొందించిన డ్రోన్లు, రోబోలు వంటి సాంకేతికతలను క్షేత్రస్థాయిలో వాలిడేట్ చేసింది. గ్రాంట్లు పొందటానికి నలుగురు ఆవిష్కర్తలకు తోడ్పడింది. 8 స్టార్టప్‌లకు ఈక్విటీ ఫండింగ్ అందించింది అగ్రిహబ్. cco@ag-hub.co 040 23014515 -అగ్రిహబ్ సీఈవో విజయ్ ప్రయోగాత్మకంగా సోలార్ సేద్యం! రైతుల వ్యవసాయ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఉపకరించే అగ్రిటెక్ స్టార్టప్‌ల సాంకేతికతలను పొలాల్లో వినియోగించి, వాటి ప్రయోజకత్వాన్ని ధృవీకరించటం అగ్రిహబ్ ప్రత్యేకత. ఇప్పటికి 8 సాంకేతికతలను వాలిడేట్ చేశారు. ఈ క్రమంలో.. అగ్రి ఫొటో ఓల్టాయిక్ (ఎపివి) సిస్టం వాలిడేషన్ ప్రక్రియ అగ్రిహబ్‌లో గత రబీ కాలం నుంచి కొనసాగుతోంది. పొలాల్లో పంటల సాగుతో పాటే ఏకకాలంలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ పద్ధతిని అగ్రివోల్టాయిక్స్ లేదా సోలార్ సేద్యంగా చెప్పుకోవచ్చు. సౌర కాంతిని పంటల సాగుతో పాటు విద్యుత్తు ఉత్పత్తికి కూడా వాడుకోవటం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంది. అయితే, సాధారణ సోలార్ ఫలకాల నీడ కింద పంటలు పెరగవు. అందుకే వాటిని బంజరు భూముల్లోనో, కాలువల మీదనో పెడుతున్నారు. పంట పొలాల్లో కూడా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాలంటే సౌర ఫలకాలు ఎండను కిందికి ప్రసరింపజేసేలా పారదర్శకమైనవై ఉండాలి. ఇటువంటి వినూత్న ఫలకాలనే రూపొందించింది బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ రెన్బ్యూక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఫలకాలను వినియోగించి అగ్రిహబ్ ద్వారా పిజెటిఎస్ఎయులోని వాటర్ టెక్నాలజీ సెంటర్ డైరెక్టర్ డా. అవిల్ కుమార్ పర్యవేక్షణలో గత ఏడాది (2022–23) రబీ కాలం నుంచి పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. క్యాబేజి, బ్రోకలి, కాళిఫ్లవర్, క్యారట్, చెట్టుచిక్కుడు, వేరుశనగ, మిరప వంటి సుమారు 15 రకాల పంటలను 65 వాట్ల సామర్థ్యం గల 40 సోలార్ ప్యానళ్ల కింద 300 చ.మీ. విస్తీర్ణంలో గత నవంబర్ నుంచి పలు పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికి రబీ, ఖరీఫ్ పంటలు సాగు చేశారు. మళ్లీ రబీ పంటలు ఇటీవలే వేశారు. ‘రెన్బ్యూక్ సోలార్‌ప్యానల్స్ నుంచి ప్రసరించే సూర్యరశ్మిలో 70% వరకు నేల మీద పంటలపై పడుతోంది. సాధారణ సోలార్ ప్యానళ్ల కన్నా ఈ ప్యానళ్ల ద్వారా 10–12% అదనంగా విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఈ ప్యానళ్ల కింత సాగైన క్యారట్ పంట దిగుబడి ఏమీ తగ్గలేదు. వేరుశనగ వంటి పంటల్లో కొంచెం తగ్గింది. నీటి వినియోగంలో మార్పు లేదు. అయితే, మరికొన్ని పంటకాలాలు పండించిన తర్వాత ఏయే పంటలకు ఈ సోలార్ సేద్యం అనుకూలమో తెలుస్తుంది’ అన్నారు డా. అవిల్ కుమార్(99513 35111). గ్రామీణులకు ప్రత్యేకం.. గ్రామీణ ఆవిష్కర్తలకు ఇంక్యుబేషన్ సేవలందించటం కోసం జగిత్యాల, వరంగల్, వికారాబాద్‌లలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో అగ్రిహబ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని గ్రామీణ యువత, రైతులు, ఎఫ్పిఓలు, కోఆపరేటివ్‌ల నిర్వాహకులు తమ కలలను అగ్రిహబ్ తోడ్పాటుతో సాకారం చేసుకోవటానికి ఎప్పుడైనా తమను సంప్రదించవచ్చని అగ్రిహబ్ ఎండీ డా. కల్పనా శాస్త్రి తెలిపారు. పేటెంట్లకూ తోడ్పడుతున్నాం! ఎంటర్ప్రెన్యూర్లు, శాస్త్రవేత్తల అగ్రిటెక్ స్టార్టప్‌లతో పాటు రైతులు, గ్రామీణుల ఆవిష్కరణలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తున్న ఏకైక ఇంక్యుబేషన్ సంస్థ అగ్రిహబ్ ఒక్కటే. సాంకేతిక ఆవిష్కరణలతో పాటు రైతుల వంగడాలకు కూడా పేటెంట్లు పొందేందుకు మేం తోడ్పడుతున్నాం. ఇన్నోవేటర్ల తరఫున ఇప్పటికి మొత్తం 13 పేటెంట్లకు దరఖాస్తు చేశాం. – డా. కల్పనా శాస్త్రి, మేనేజింగ్ డైరెక్టర్, అగ్రిహబ్ ఫౌండేషన్, పిజెటిఎస్ఎయు, హైదరాబాద్ ఇవి చదవండి: మిచాంగ్ తుఫానుకు దెబ్బతిన్నా.. తిరిగి విరగ్గాసిన సేంద్రియ పత్తి! -
మిచాంగ్ తుఫానుకు దెబ్బతిన్నా.. తిరిగి విరగ్గాసిన సేంద్రియ పత్తి!
'రసాయన మందులేమీ వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో బీటీ హైబ్రిడ్ సీడ్ పత్తిని సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు రైతు ఏకుల లక్ష్మీనారాయణ. వ్యవసాయమే జీవనంగా బతుకుబండిని నడిపిస్తున్న లక్ష్మీనారాయణ తనకు కౌలుకు ఇచ్చిన భూ యజమాని కోటగిరి చైతన్య సూచనల మేరకు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో బీటీ హైబ్రిడ్ విత్తన పత్తిని రెండేళ్లుగా సమర్ధవంతంగా చేస్తూ విశేషమైన దిగుబడులతో పాటు అధిక నికరాదాయం పొందుతున్నారు.' లక్ష్మీనారాయణది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట. శివారు గ్రామమైన సీతారామపురంలో కోటగిరి చైతన్య మామిడి తోటకు పక్కనే ఉన్న మూడెకరాల ఎర్ర నేలను కౌలుకు తీసుకొని విత్తన పత్తిని రెండేళ్లుగా సాగుచేస్తున్నారు. ఒక ఎకరానికి డ్రిప్ వేశారు. రెండెకరాలకు నీటిని పారగడుతున్నారు. 120 రోజుల దశలో ఉన్న పత్తి మొక్కలన్నీ ఆరోగ్యంగా ఎదుగుతూ ఇంకా కొత్త చిగుర్లు వేస్తున్నాయి. మొక్కకు 90 నుంచి 110 వరకు కాయలతో చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తనకు దిగుబడి 12 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.20 వేల చొప్పున మూడెకరాలకు రూ.60 వేలకు కౌలుకు తీసుకొని విత్తన పత్తిని సాగు చేస్తున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చైతన్య కరోనా కాలంలో ఇంటి దగ్గర ఉన్న కాలంలో సేంద్రియ సాగులో మెళకువలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. ఇప్పుడు బెంగళూరు తిరిగి వెళ్లినా అక్కడి నుంచే లక్ష్మీనారాయణకు సూచనలిస్తూ పత్తి సాగు చేయిస్తున్నారు. ఆవు పేడతో జీవామృతం, అనేక రకాల జీవన ఎరువులు కలిపి మగ్గబెట్టి ప్రత్యేకంగా రూపొందించిన ఎన్రిచ్డ్ కంపోస్టును మూడెకరాల్లో దుక్కి 3 టన్నులు వేశారు. పత్తి విత్తిన 20 రోజులకు మరో 3 టన్నుల కం΄ోస్టును మొక్కల మొదళ్ల వద్ద వేశారు. లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలతో సమీకృత చీడపీడల యాజమాన్య మెళకువలు పూర్తిగా పాటిస్తున్నారు. పంచగవ్య, పుల్లటి మజ్జిగతోపాటు అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం తదితర కషాయాలను విడతల వారీగా లక్ష్మీనారాయణ సొంతంగా తయారు చేసుకుంటూ ఐదు రోజులకోసారి ఏదో ఒకటి అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు. దీంతో పత్తి మొక్కలు విత్తి 120 రోజులు అయినప్పటికీ ఇంకా బలంగా ఎదుగుతున్నాయి. అంతేగాకుండా ఒక్కొక్క చెట్టుకు కాయలు కూడా అధిక సంఖ్యలో వచ్చాయి. నెలకొరిగినా తిప్పుకుంది! డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన మిచాంగ్ తుఫానుకు మూడెకరాల్లోని పత్తి పంటంతా నేల వాలింది. దీంతో రైతు లక్ష్మీనారాయణ తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఏదైతే అది అవుతుందని.. పడిపోయిన మొక్కలను కూలీలతో లేపి నించోబెట్టి మొదళ్లలో మట్టిని వేయించారు. ఆ తర్వాత రెండు రోజులకే తోటంతా ఆశ్చర్యకరంగా నిలదొక్కుకుంది. వానపాములు నేలను గుల్లగా ఉంచటం, వేరువ్యవస్థ బలంగా, లోతుగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందని రైతు చెప్పారు. ఎంతో ఆరోగ్యంగా పెరుగుతున్న ఈ పంటను ఇటీవల పరిశీలించిన ప్రసిద్ధ వ్యవసాయ నిపుణులు దేవేంద్ర శర్మ, డా. జీవీ రామాంజనేయులు, పాలాది మోహనయ్య తదితరులు లక్ష్మీనారాయణ కృషిని ప్రశంసించారు. ఇతర రైతులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. మిచాంగ్ తుఫాను గాలులకు నేలకొరిగిన లక్ష్మీనారాయణ పత్తి పంట (ఫైల్) 3 ఎకరాల్లో విత్తన పత్తి సాగు: రూ. 7 లక్షల నికరాదాయం! 3 ఎకరాల పొలంలో విత్తన పత్తి క్రాసింగ్ కోసం అరెకరంలో పోతు (మగ) మొక్కల్ని పెంచుతున్నాను. అంటే.. నికరంగా 2.5 ఎకరాల్లోనే పత్తి పంట ఉన్నట్లు లెక్క. చెట్టుకు సగటున 90–100 కాయలున్నాయి. మొదటి విడత పత్తి తీశాం. మరో మూడుసార్లు తీస్తాం. ఎకరానికి 12–14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటున్నాం. కనీసం 30 క్వింటాళ్ల సీడ్ పత్తి వస్తుందనుకున్నా.. 18 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, 12 క్వింటాళ్ల దూది వస్తుంది. విత్తనాలు క్వింటా రూ. 53,000, దూది క్వింటా రూ. 14,000కు అమ్ముతా. మొత్తం మీద రూ. 4.5 లక్షల ఖర్చులు పోగా నికరాదాయం రూ. 7 లక్షలకు తగ్గదు. తుఫాను దెబ్బకు కొన్ని కాయలు పాడవ్వకపోతే మరో రూ. లక్ష అదనంగా వచ్చి ఉండేది. – ఏకుల లక్ష్మీనారాయణ (95509 84667), అన్నేరావుపేట,రెడ్డిగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా – ఉమ్మా రవీంద్ర కుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు (చదవండి: రైతు శాస్త్రవేత్త విజయకుమార్‌కు ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం) -
రైతు శాస్త్రవేత్త విజయకుమార్‌కు ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం!
చిరుధాన్య పంటల జీవవైవిధ్యానికి విశేష కృషి చేస్తున్న వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రముఖ సేంద్రియ రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయకుమార్(60)కు ప్రతిష్టాత్మక ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం లభించింది. అహ్మదాబాద్‌లోని భగవత్ విద్యాపీఠంలో ఈ నెల 23 నుంచి 26 వరకు జరుగుతున్న సాత్విక్ సంప్రదాయక ఆహారోత్సవంలో సోమవారం విజయకుమార్‌కు గుజరాత్ మాజీ ప్రధాన కార్యదర్శి పి.కె. లహరి, ఐఐఎం అహ్మదాబాద్ డైరెక్టర్ భరత్ భాస్కర్, అహ్మదాబాద్ ఐఐఎం మాజీ ఆచార్యులు ప్రొ. అనిల్ కె గుప్తా జీవవైవిధ్యం విభాగంలో సృష్టి సమ్మాన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రొ.అనిల్ కె గుప్తా నెలకొల్పిన సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనీషియేటివ్స్ ఫర్ సస్టయినబుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ (సృష్టి) సంస్థ 1995 నుంచి ప్రతి ఏటా గ్రామీణ రైతు శాస్త్రవేత్తలు, జీవవైవిధ్యం పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు జాతీయ స్థాయిలో సృష్టి సమ్మాన్ పురస్కారాలు ప్రదానం చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని ఈవీ పల్లె గ్రామంలో పుట్టిన కొమ్మూరి విజయకుమార్ వర్షాధార భూముల్లో సేంద్రియ పద్ధతుల్లో చిరుధాన్యాల సాగును పునరుద్ధరించటానికి విశేష కృషి చేస్తున్నారు. చిరుధాన్యాల విత్తనాలను అనేక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులకు ఉచితంగా పంపిణీ చేయటం ద్వారా తిరిగి చిరుధాన్యాల సంప్రదాయ సేంద్రియ సాగు వ్యాప్తికి కృషి చేశారు. స్థానికంగా లభించే అనేక మొక్కల వినూత్న కషాయాలను రూపొందించి రైతులకు అందిస్తూ సేంద్రియ వ్యవసాయంలో అనేక పంటలను ఆశించే చీడపీడల నియంత్రణకు విజయకుమార్ కృషి చేస్తున్నారు. ఆయన కృషిపై గత దశాబ్దకాలంగా అనేక కథనాలు ‘సాక్షి సాగుబడి’ పాఠకులకు సుపరిచితమే. ఆయనకు గతంలో బళ్లారికి చెందిన సఖి ట్రస్ట్, రైతునేస్తం ఫౌండేషన్ పురస్కారాలు లభించాయి. గతంలో ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం అందుకున్న వారిలో ఖమ్మంకు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత దరిపల్లి రామయ్య కూడా ఉన్నారు. (చదవండి: అరుదుగా కనిపించే భారీ నిమ్మకాయలు.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!) -
ఇవి నిజంగానే 'గజ' నిమ్మకాయలు!
సాధారణంగా నిమ్మకాయలు ఏ సైజులో ఉంటాయో అందరికీ తెలిసిందే. మహా అయితే బాగా పెరిగితే కోడిగుడ్డు సైజుకి దగ్గరగా ఉండొచ్చు అంతేగానీ బాహుబలి రేంజ్లో నిమ్మకాయలు పెరగడం అనేది జరగదు. దబ్బకాయలాంటి నిమ్మజాతి పండ్లు పెద్దగా ఉంటాయి. అవి కూడా మోస్తారుగా ఓ బత్తాకాయ సైజులో ఉంటాయి అంతే!. కానీ ఈ నిమ్మకాయి మాత్రం అన్నింటిని తలదన్నేలా భారీ సైజులో ఉంది. ఎక్కడంటే..? కర్ణాటకలో కొడుగు జిల్లాలోని పలిబెట్ట ప్రాంతానికి చెందిన విజు సుబ్రమణి ఈ భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం క్యూ కడుతుండటం విశేషం. ఇవి అరుదుగా ఐరోపా వంటి దేశాల్లోనే కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఊరగాయాలు, శీతల పానీయాల తయారీకి ఉపయోగిస్తారని వెల్లడయ్యింది. ఈ మొక్కలు ఆ రైతు వద్దకు ఎలా వచ్చాయంటే..? విజు సుబ్రమణి నాలుగేళ్ల క్రితం మైసూర్ వెళ్లినప్పుడు అక్కడ ఒక మార్కెట్లో ఈ విత్తనాలను కొనుగోలు చేశానని తెలిపారు. ఆ తర్వాత వాటిని తన ఇంటి సమీపంలో ఉన్న గార్డెన్లో పెంచానని అన్నారు. అయితే పెరిగిన మొక్కలను తీసి కాఫీ తోటలో సాగు చేసినట్లు చెప్పుకొచ్చారు. మూడేళ్లకు ఈ నిమ్మచెట్లు పెరిగి పెద్దవయ్యాయని తెలిపారు. అయితే ఆ చెట్లకు నిమ్మ పువ్వులు, కాయలు గానీ రాలేదు. దీంతో ఇది నిమ్మ చెట్టేనా..! అనే అనుమానం వచ్చింది. ఈలోగా కొద్దిరోజులకే పంట రావడం మొదలైంది. చూస్తుండగానే నిమ్మకాయలు పెద్దగా భారీ పరిమాణంలో కాసాయని చెప్పారు రైలు సుబ్రమణి. సాధారణంగా నిమ్మకాయ 60 గ్రాముల బరువు ఉండి, రెండు నుంచి మూడు అంగుళాల పొడవే ఉంటాయి. ఈ నిమ్మకాయ మాత్రం ఒక్కొక్కటి ఏకంగా 5 కిలోల బరువు ఉండి.. ఆరడగులు వరకు పెద్దగా పెరగడం విశేషం. ఇక్కడ కర్ణాటక రైతు ఆ నిమ్మకాయలను ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ నిమ్మకాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల తోపాటు ఔషధ ఉపయోగాలున్నాయని చెబతున్నారు నిపుణులు. (చదవండి: మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్‌లు ఇవే..!) -
చెరకు పంట జాగ్రత్తలు మరవకు! లేదంటే?
'చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. కానీ పంటలు వేసినప్పటీ నుంచి చేతికందే వరకు రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. సరైన పద్ధతులు పాటించకుండా పాత పద్ధతులను పాటిస్తే నష్టపోతారు. కొంత మంది రైతులు చెరకు పక్వానికి రాకముందే క్రషింగ్‌కు తరలిస్తూ ఉంటారు. దీంతో చక్కెర ఉత్పత్తి తగ్గడమే కాకుండా సరాసరి చక్కెర ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. చెరకు పంట పక్వానికి వచ్చిందా ?లేదా? కొన్ని మెలకువలు పాటించాలి.' - ప్రస్తుతం చేతికొచ్చిన చెరకు పంటను నరకుటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బసంత్‌పూర్–మామిడ్గి గ్రామాల శివారులో గల ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎం.విజయ్‌కుమార్ మాట్లాల్లోనే.. పక్వానికి వచ్చిందా.. లేదా? పక్వానికి వచ్చిన చెరకు తోటల ఆకులు పచ్చ రంగులోంచి పసుపు రంగులోకి మారుతాయి. చెరకులో కొత్తగా మొవ్వుటాకులు రావడం ఆగిపోతాయి. గడలు లావై అక్కడక్కడ చిరు పగుళ్లు ఏర్పడి కన్నులు బాగా ఉబ్బినట్లు అవుతాయి. తోటలో కొత్తగా మొవ్వుటాకులు రావడం ఆగిపోతాయి. చిట్ట చివర నాలుగైదు కణుపులు దగ్గర దగ్గర ఏర్పడి వాటి నుంచి పుట్టు ఆకులు ఒకే చోట కుచ్చువలె ఏర్పడుతాయి. కొన్ని రకాల్లో పూత పూయడం కనబడుతుంది. శాసీ్త్రయంగా గమనిస్తే చెరకును రెండు భాగాలు నరికి వాటి రసంను వేర్వేరుగా గానుగాడిస్తే వాటిలోని ఘన పదార్థాలు సమానంగా ఉండాలి. చేతి రిఫ్రాక్టో మీటర్ ద్వారా కూడా చెరకు పక్వానికి వచ్చింది తెలుసుకోవచ్చు. వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు! చీడ పీడలు ఆశించిన చెరకును ముందుగా క్రషింగ్‌కు తరలించాలి. లేదా బెల్లం తయారీకి వాడాలి. ఆలస్యం చేస్తే దిగుబడులతో రసం నాణ్యత తగ్గుతుంది. బెల్లం తయారు చేశాక మెత్తగా ఉంటే నిల్వకు పనిరాదు. ఏదైనా ప్రమాదశాత్తు చెరకు కాలిపోతే ముందుగా దాన్ని నరికివేయాలి . లేకపోతే తూకం తగ్గి రోజుకు 3 శాతం చొప్పున తగ్గుతుంది. పూత వచ్చిన, బెండు బారిన చెరకును నరకడం ఆలస్యం చేయరాదు. పూత వచ్చిన చెరకు గడల్లో చివరి ఆరు కండాలు తీసేసి మిగిలిన చెరకును ఫ్యాక్టరీకి తరలించాలి. చెరకును భూ మట్టానికి నరకాలి. రెండు మూడు అంగుళాలు వదిలి నరకడం వల్ల ఎకరానికి రెండు మూడు టన్నులు దిగుబడి తగ్గుతుంది. కింది భాగంలో పంచదార పాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా చెరకు వేర్లు భూమిలోకి చొచ్చుకొని పోయి బలమైన గాలులు వీచినా చెరకు ఒరిగిపోదు. చెరకు క్రషింగ్‌కు తరలించే ముందు చెత్త, ఎండుటాకులు, వేర్లు, మట్టి లేకుండా తరలించాలి. చెత్తా చెదారంతో తరలించడం వల్ల పంచదార దిగుబడిలో 10 శాతం నష్టం వాల్లుతుంది. నీటి ముంపునకు గురైన తోటల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కణుపుల వద్ద వచ్చే వేర్లను తొలగించాలి. వేర్లను తీసేయకుండా చెరకును అలాగే క్రషింగ్‌కు తరలిస్తే 0.4 నుంచి 0.6 శాతం మేర పంచదార దిగుబడి తగ్గుతుంది. నరికిన తర్వాత నరికిన చెరకును 24 గంటల్లో ఫ్యాక్టరీకి సరఫరా చేయాలి. ఆలస్యమైన కొద్ది చెరకు తూకంలో 2 నుంచి 4 శాతం, రసనాణ్యతలో ఒక శాతం తరుగుదల కనిపిస్తోంది. నరికిన చెరకు తొందరగా ఫ్యాక్టరీకి తరలించలేని పక్షంలో కట్టిన చెరకు మోపులను నీడలో పెట్టి వాటిపై చెత్తను కప్పి నీరు పలుచగా పోయాలి.\ రైతులు సాగు మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఇలాంటి మెలకువలు పాటిస్తేనే లాభాలు సాధిస్తారని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇవి చదవండి: బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ.. పనస వైభవం! -
బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ.. పనస వైభవం!
కేరళలోని కొట్టాయంకు చెందిన రైతు వి.ఎ. థామస్ 8 ఏళ్ల క్రితం రబ్బర్ సాగుకు స్వస్తి చెప్పారు. 70 ఏళ్ల వయసులో రసాయనిక వ్యవసాయం వదిలి సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. ఇంత వరకే అయితే పెద్ద విశేషం లేదు. కొట్టాయం దగ్గర్లోని చక్కంపుఝ గ్రామంలోని తమ 5 ఎకరాల కుటుంబ క్షేత్రాన్ని 400 రకాల పనస చెట్లతో జీవవైవిధ్యానికి చెరగని చిరునామాగా మార్చారు థామస్. బడ్ గ్రాఫ్టింగ్ లేదా బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ కొత్త రకాలను సృష్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పనస తొనలను రుచి చూస్తారు. నచ్చిన రకాల మొక్కల్ని వెంట తెచ్చి నాటుకుంటారు. రెండేళ్లు, ఏడాదిన్నరలోనే కాపుకొచ్చే వియత్నాం, కంబోడియాల నుంచి కూడా కొన్ని పనస రకాలను సేకరించారు. మొక్కలతో పాటు ఎండబెట్టిన పనస తొనలను అమ్ముతూ ఎకరానికి ఏటా రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఎండబెట్టిన పచ్చి పనస కాయలను కిలో రూ. వెయ్యి. ఎండబెట్టిన పనస పండ్లను కిలో రూ. 2 వేలకు అమ్ముతుండటం విశేషం! ఇవి కూడా చదవండి: ‘వ్యవసాయ’ ఉద్గారాలు 31% కాదు.. 60%! -
‘వ్యవసాయ’ ఉద్గారాలు 31% కాదు.. 60%!
'వాతావరణంలోకి విడుదలయ్యే మొత్తం ఉద్గారాల్లో వ్యవసాయం, ఆహార సంబంధిత ఉద్గారాల వాటా 31% అని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రకటించగా.. ఇవి 60% మేరకు ఉంటాయని పద్మశ్రీ పురస్కార గ్రహీత డా‘‘ సుభాష్ పాలేకర్ అంచనా వేస్తున్నారు. పశువుల ఎరువు/ వర్మీ కంపోస్టు/ కంపోస్టు వంటివి ఏటా ఎకరానికి 10 టన్నుల మేరకు వేస్తుండటం కూడా భూతాపం విపరీతంగా పెరగడానికి ఓ ముఖ్య కారణంగా అందరూ గుర్తించాలని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ, ఆహార రంగాల ఉద్గారాలు తగ్గాలంటే.. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వాడకం కూడా మాని, రైతులందరూ సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిని అనుసరించాలన్నారాయన. భవిష్యత్తులో పెను తుపాన్లు, కరువులను తట్టుకోవాలన్నా.. పోషక విలువలున్న ఆహారం అందరికీ అందాలన్నా ఇదొక్కటే మార్గమన్నారు. దేశవ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు తాను చెప్పిన పద్ధతిలో సాగు చేస్తున్నారని, సుసంపన్న దిగుబడులిస్తున్న వారి క్షేత్రాలే ఇందుకు నిదర్శనాలన్నారు. రోగ కారకం కాని ఆహారం విలువను వినియోగదారులు గుర్తించి ఉద్యమ స్ఫూర్తితో రైతులను ప్రోత్సహిస్తేనే పర్యావరణహితమైన వ్యవసాయం విస్తరిస్తుందని పాలేకర్ స్పష్టం చేస్తున్నారు. భారతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (ఐసిఎఆర్–మేనేజ్)లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొన్న డా‘‘ పాలేకర్‌తో ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..' • పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులపై మీరు చాలా ఏళ్లుగా స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా రైతులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? డా. పాలేకర్: శిక్షణా శిబిరాల ద్వారా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా లక్షలాది మంది సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిని సోషల్ మీడియా (వెబ్సైట్, యూట్యూబ్, వాట్సప్) ద్వారా నేర్చుకుంటున్నారు. నీతి ఆయోగ్ తోపాటు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో విస్తారంగా రసాయనిక ఎరువులతో పాటు ఎకరానికి ఏటేటా పది టన్నుల చొప్పున పశువుల ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు వంటి సేంద్రియ ఎరువులు కూడా వాడకుండా.. నేను చెప్పినట్లు అనేక నమూనాల ప్రకారం పంటలు పండిస్తున్నారు. నేను చెప్పింది చెప్పినట్లు చేసిన వారు తొలి ఏడాదిలోనే రసాయనిక వ్యవసాయానికి తగ్గకుండా దిగుబడులు పొందుతున్నారు. రసాయనాలు వాడకుండా.. నేలలో పోషకాలను రూపుమార్చి మొక్కల వేర్లకు అందించేందుకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వంటి బెస్ట్ మైక్రోబియల్ కల్చర్‌ను వినియోగిస్తే చాలు. • దేశంలో ఎంత మంది రైతులు మీ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు? డా. పాలేకర్: సుమారు 70 లక్షల మంది రైతులు అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకుంటూ, వాట్సప్ ద్వారా సందేహాలు తీర్చుకుంటున్నారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో చాలా మంది ఫాలో అవుతున్నారు. నీతి ఆయోగ్ నా టెక్నాలజీతో కన్విన్స్ అయ్యింది. హైదరాబాద్‌లోని ‘మేనేజ్’ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో ఆశ్చర్యకరమైన దిగుబడులు సాధిస్తున్న రైతుల క్షేత్రాలను నేనే స్వయంగా రైతులకు చూపిస్తున్నాను. మొన్న వికారాబాద్ జిల్లాలో విజయరామ్ సాగు చేస్తున్న ఫైవ్ లేయర్ మోడల్ క్షేత్రాన్ని వందలాది మందికి చూపించాను. ఈ నెల 24,25 తేదీల్లో అహ్మదాబాద్ దగ్గర క్షేత్ర సందర్శన ఉంది. నేను రూపాయి పారితోషికం ఆశించకుండా ఉచితంగానే కర్బన ఉద్గారాలు లేని వ్యవసాయం గురించి ప్రచారం చేస్తున్నాను. • పర్యావరణ సంక్షోభంపై దుబాయ్‌లో ఇటీవల ముగిసిన శిఖరాగ్రసభ ‘కాప్28’లో వ్యవసాయ ఆహార వ్యవస్థల ఉద్గారాల గురించి ప్రధానంగా చర్చ జరిగింది కదా..! డా. పాలేకర్: అవును. చైనా, అమెరికా తర్వాత మన దేశమే ఎక్కువ ఉద్గారాలను వెలువరిస్తున్నది. కానీ, భారత ప్రభుత్వం సంతకం చేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది. • మన దేశపు తలసరి ఉద్గారాలు తక్కువ. గతం నుంచీ ఎక్కువగా కాలుష్యానికి కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు విపత్తులకు నష్టపోతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారం ఇవ్వాలని, ఆధునిక టెక్నాలజీ ఇవ్వాలని మన దేశం అడుగుతోంది కదా..! డా. పాలేకర్: సంపన్న దేశాలు ఏమీ విదల్చటం లేదు కదా. పైగా, కుట్రపూరితంగా కాలుష్య కారక ఫ్యాక్టరీలు మనలాంటి దేశాల్లో పెట్టిస్తూ, వస్తువుల్ని ఆ దేశాలు కొనుక్కుంటున్నాయి. దీర్ఘకాలిక పంటైన బాస్మతి బియ్యం కిలో పండించడానికి 5,600 లీటర్ల నీరు ఖర్చవుతోంది. స్వల్పకాలిక వరి రకాలతో కిలో బియ్యం పండించడానికి 2,500 లీటర్ల నీరు ఖర్చవుతోంది. పైగా వరి పొలాల్లో నీటిని నిల్వగట్టటం వల్ల, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు, శిలీంద్రనాశన రసాయనాల వల్ల పెద్ద ఎత్తున మిథేన్ వంటి అత్యంత ప్రమాదకర ఉద్గారాలు వెలువడుతున్నాయి. సంపన్న దేశాలు డబ్బులు ఇచ్చే వరకు మనం ఈ ఉద్గారాలు వెలువరించటం మానుకోకూడదా? రసాయనిక వ్యవసాయం ఒక్కటే కాదు.. సేంద్రియ ఎరువుల వల్ల కూడా పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు వెలువడుతూ భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. గాలిలో ఉద్గారాలు 280 నుంచి 480 పీపీఎంకి పెరిగాయి. ఫలితం ఇప్పటికే చూశారుగా ప్రకృతి విపత్తులు ఎలా పెరిగిపోయాయో. గత ఏడాది గోధుమల దిగుబడి 30% తగ్గిపోయింది. గడచిన ఏడాది అంతా యూరప్‌లో, మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మనం వ్యవసాయ ఉద్గారాలు తగ్గించకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఉంటే.. మున్ముందు చాలా ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తాయి. వాటి కోసం ఎదురుచూద్దామా? ఎఫ్.ఎ.ఓ. చెప్తున్నట్లు అన్ని రకాల ఉద్గారాలలో వ్యవసాయ ఆహార వ్యవస్థ వెలువరిస్తున్న ఉద్గారాలు 31% కాదు, 60%కి పైగా ఉంటాయి. నేనంటాను.. విపత్తుల నుంచి రక్షించుకోవాలంటే వెంటనే మనం ఉద్గారాలు తగ్గించేందుకు పనిని ప్రారంభించాలి. దేశంలో రసాయనిక వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని కూడా వెంటనే నిషేధించాలి. ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు, రైతులు, ముఖ్యంగా రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తిని డయాబెటిస్, కేన్సర్, కరోనా వంటి జబ్బుల పాలవుతున్న వినియోగదారులైన ప్రజలు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. • రసాయనిక ఎరువుల తయారీలో శిలాజ ఇంధనాలు వాడుతారు కాబట్టి ప్రమాదమే. సేంద్రియ ఎరువులతో ప్రమాదం ఎలా? డా. పాలేకర్: ఎకరానికి ప్రతి ఏటా 20 బండ్ల లేదా 10 టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు లేదా కంపోస్టు వేస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక వ్యవసాయం కన్నా కూడా ఇది అనేక రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడినది. అందుకే రైతులు పట్టించుకోవటం లేదు. అంతేకాదు, రసాయనిక వ్యవసాయంలో మాదిరిగానే పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్టు, కంపోస్టు, నూనెగింజల తెలగ పిండిని పొలాల్లో వెదజల్లబడుతుంది. అందులో నుంచి కర్బనం విడుదలై ఆక్సీకరణం చెంది కార్బన్ డయాక్సయిడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్ వంటి హరిత గృహ విష వాయువులు వెలువడి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. మన నేలల్లో సేంద్రియ కర్బనం 0.03% మాత్రమే మిగిలి ఉండటం వల్ల ఈ సేంద్రియ ఎరువులు వాడినా నేలల్లో హ్యూమస్ (జీవన ద్రవ్యం) ఏర్పడటం లేదు. ఈ విధంగా రసాయనిక ఎరువుల వల్లనే కాకుండా టన్నుల కొద్దీ వేసే పశువుల ఎరువు వల్ల కూడా పెద్ద మొత్తంలో ఉద్గారాలు వెలువడుతున్నాయి. అందువల్లనే, వ్యవసాయ ఆహార ఉద్గారాలు ఇతరత్రా మొత్తం ఉద్గారాల్లో 60%కి పైగా ఉంటాయని నా అంచనా. • మీరు కూడా ఆవు పేడతో తయారు చేసిన ఘనజీవామృతం, జీవామృతం వాడమంటున్నారు కదా..? డా. పాలేకర్: ఈ రెండూ సేంద్రియ ఎరువులు కాదు. నేలలో రసాయనాల వల్ల అంతరించిపోయిన సూక్ష్మజీవరాశిని పెంపొందించే మైక్రోబియల్ కల్చర్లు మాత్రమే. ఎకరానికి ఏటా మహా అయితే 400 కిలోల ఘన జీవామృతం చాలు. ‘సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి’ ద్వారా ఒక్క గ్రాము కర్బన ఉద్గారాలు వెలువడవు. నేను చెప్పినట్లు చేస్తే మారిన మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు. పది శాతం నీటితోనే ఆరుతడి పద్ధతిలో మిథేన్ వెలువడకుండా వెద వరి సాగు చేయొచ్చు. • పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే మాటకు బదులు ‘సుభాష్ పాలేకర్ కృషి’ అని అంటున్నారెందుకని? డా. పాలేకర్: పెట్టుబడి లేకుండా పనులు జరగవు. మనం పొలంలో పనిగట్టుకొని చేసే వ్యవసాయ పనులేవీ ప్రకృతిలో ఉండవు. అలాంటప్పుడు ప్రకృతి వ్యవసాయం అనటం సరికాదు అనిపించి పేరు మార్చాను. ‘సుభాష్ పాలేకర్ కృషి’ పద్ధతి అని పిలవమని చెబుతున్నాను. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్, మేనేజ్ తదితర సంస్థలన్నిటికీ చెప్పాను. • పర్యావరణ అనుకూల సాగు పద్ధతుల వ్యాప్తి నెమ్మదిగా ఉండటానికి కారణం? డా. పాలేకర్: ప్రభుత్వాలతో పాటు ప్రజలు చైతన్యవంతులై పోషకాల సాంద్రతతో, ఔషధ గుణాలతో కూడిన ఆరోగ్యదాయకమైన పంట దిగుబడులు పండించడానికి రైతులను ప్రోత్సహించాలి. డయాబెటిస్, కేన్సర్ వంటి జబ్బుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇది అవసరమని వాళ్లు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. యూరప్, అమెరికాలో ప్రజలు ఈ విషయం గుర్తించి జాగ్రత్తపడుతున్నారు. మన ప్రజలూ గుర్తెరగాలి. • రైతులకు శిక్షణా శిబిరాలేమైనా పెడుతున్నారా? డా. పాలేకర్: రంగారెడ్డి జిల్లాలోని రామచంద్రమిషన్ ఆవరణలో 6 వేల మంది రైతులకు 2024 ఏప్రిల్‌లో పది రోజుల శిక్షణా శిబిరం నిర్వహించబోతున్నాం. దీనికి సహకరించమని టీటీడీని కోరుతున్నాం. (డా. సుభాష్ పాలేకర్: వాట్సప్– 98503 52745, palekarsubhash@yahoo.com / spk.org.in) - ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు -
సరోగసీ ద్వారా పుంగనూరు కోడెదూడ జననం
సాక్షి, అమరావతి/ రైల్వేకోడూరు : దేశంలోనే తొలిసారి ఓ నాటు ఆవుకు పుంగనూరు జాతి కోడెదూడ జన్మించింది. చింతలదీవి పశు క్షేత్రంలో అభివృద్ధి చేసిన ఏడు రోజుల వయస్సున్న ఘనీకృత పుంగనూరు జాతి పిండాన్ని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన పమిడిగంటం హరిరావుకు చెందిన నాటు ఆవు గర్భంలో స్థానిక పశువైద్యుడు డాక్టర్ ప్రతాప్ మార్చి 4న ప్రవేశపెట్టగా, మే 25న ఈ నాటు ఆవు చూలు కట్టినట్లుగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ ఆరీఫ్ నిర్థారించారు. చూలుకాలంలో పశువు ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.2,500 విలువైన దాణా, ఖనిజ లవణాలతో కూడిన మేతను ఆర్బీకే ద్వారా ఉచితంగా అందించారు. ఈ నాటు ఆవు ఈనెల 17వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో మేలుజాతి పుంగనూరు జాతి కోడెదూడెకు జన్మనిచ్చింది. కోడెదూడ చాలా ఆరోగ్యంగా ఉందని పశువైద్యులు ధృవీకరించారు. దేశంలోనే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్సఫర్ విధానంలో పుంగనూరు కోడెదూడ జన్మించడం ఇది తొలిసారి. తొలిసారిగా సాహివాల్ దూడకు..: గతేడాది ఇదే విధానంలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించింది. తిరుపతి ఎస్వీ గో సంరక్షణ శాలలో మేలు జాతి ఆవుల అండాలు సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్ ల్యాబ్‌లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేసి టీటీడీ గోసాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా సాహీవాల్ దూడకు జన్మనిచ్చేలా చేశారు. ఈసారి ఓ రైతు ఇంట ఓ నాటు ఆవు గర్భంలో సరోగసి విధానంలో పిండమార్పిడి చేసి మేలుజాతి పుంగనూరు దూడకు జన్మనివ్వడం గమనార్హం. సమీప భవిష్యత్‌లో మేలుజాతి దేశీ ఆవుల సంతతిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ సహకారంతో కృషిచేస్తామని చింతలదీవి పశు క్షేత్రానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మిల్లెట్స్ తింటున్నారా? ఆ వ్యాధులను పూర్తిగా మాయం చేయగలదు!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్యాలను రోజువారీ ప్రధాన ఆహారంగా తీసుకోవటానికి అలవాటు పడితే యావత్ మానవాళికి ఆహార /పౌష్టికాహార భద్రతతో పాటు ఆరోగ్య/ పర్యావరణ భరోసా దొరుకుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ‘చిరుధాన్యాలతో ప్రపంచ ప్రజలకు ఆహార భద్రత’ అనే అంశంపై రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్)లో మంగళవారం ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీ రౌండ్‌టేబుల్ సమావేశంలో 31 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ‘మేనేజ్’తో కలసి ఆఫ్రికా ఆసియా గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎఎఆర్‌డిఓ) నిర్వహిస్తున్న ఈ రౌండ్‌టేబుల్ ప్రారంభ సమావేశంలో మిల్లెట్ మాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్ వలితో పాటు ప్రకృతి వ్యవసాయ పితామహుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ ప్రధాన స్రవంతి వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలసి తొలిసారి వేదికను పంచుకోవటం విశేషం. డా. ఖాదర్ వలి కీలకోపన్యాసం చేస్తూ, భూగోళంపై వేల ఏళ్లుగా ప్రజలు ప్రధాన ఆహారంగా తింటున్న చిరుధాన్యాలే అసలైన ఆహారమన్నారు. అయినప్పటికీ.. ఆంగ్లేయులు, పాశ్చాత్యులు ఇది మనుషుల ఆహారం కాదని చెప్పటం ప్రారంభించి గోధుమలు, వరి బియ్యాన్ని హరిత విప్లవం పేరుతో ప్రోత్సహిస్తూ కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పారిశ్రామిక ఆహారోత్పత్తులను ముందుకు తేవటం వల్ల చిరుధాన్యాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నదని, ఇందువల్లనే ఆహార భద్రత సమస్య ఉత్పన్నమైందన్నారు. పారిశ్రామిక ఆహారం కారణంగానే మానవాళి ఎన్నో జబ్బుల పాలవుతున్నదని మానవాళి, శాస్త్రవేత్తలు, పాలకులు గుర్తెరగాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మనుషులను రోగగ్రస్థంగా మార్చుతున్న కార్పొరేట్ ఆహారాన్ని వదిలించుకుంటేనే మానవాళికి జబ్బుల నుంచి, ఎడతెగని ఔషధాల వాడకం నుంచి సంపూర్ణ విముక్తి దొరుకుతుందన్నారు. సిరిధాన్యాలు (స్మాల్ మిల్లెట్స్) దివ్యౌషధాలుగా పనిచేస్తున్నాయని 8 ఏళ్లుగా తాను వందలాది మంది రోగులతో కలసి చేసిన అధ్యయనంలో వెల్లడైందని డా. ఖాదర్ వలి పేర్కొన్నారు. శాస్త్రీయంగా ఫలితాలను నమోదు చేశామని, 140 రకాల జబ్బుల్ని ఆరు నెలల నుంచి 2 ఏళ్లలోపు నయం చేయటమే కాదు పూర్తిగా మాయం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. సిరిధాన్యాలను రోజువారీ ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటే డయాబెటిస్, బీపీ, ఊబకాయం, కేన్సర్ వంటి జబ్బులకు వాడుతున్న మందులను క్రమంగా మానివేస్తూ పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చన్నారు. సిరిధాన్యాలు సకల పోషకాలను అందించటంతోపాటు దేహంలో నుంచి కలుషితాలను బయటకు పంపటంలోనూ కీలకపాత్రపోషిస్తున్నాయన్నారు. ఇవి వర్షాధారంగా పండే అద్భుత ఆహార ధాన్యాలని అంటూ సాగు నీటితో పండించే ఆహారం అనారోగ్య కారకమనటంలో ఏ సందేహమూ లేదని డా. ఖాదర్ వలి తెలిపారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ ప్రసంగిస్తూ పోషకాల గనులైన చిరుధాన్యాలను రసాయనాలతో సాగు చేయటం విచారకరమన్నారు. రసాయనాలతో పండించటం వల్ల చిరుధాన్యాల్లో పోషకాలు తగ్గిపోవటమే కాకుండా, రసాయనిక అవశేషాల వల్ల ప్రజలకు హాని కలుగుతుందన్నారు. చిరుధాన్యాల వేలాది వంగడాలను అనాదిగా ఆదివాసులు సంరక్షిస్తున్నారని, మనకు తెలియని చిరుధాన్య రకాలు ఇప్పటికీ వారి వద్ద ఉన్నాయన్నారు. శాస్త్రవేత్తలు వాటిపై దృష్టి కేంద్రీకరిస్తే మరింత ఎక్కువ పోషకాలున్న చిరుధాన్యాలు వెలుగులోకి రావచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రోత్సహించటంపై పాలకులు దృష్టి కేంద్రీకరిస్తే ఆహార భద్రత సమస్య, పర్యావరణ సమస్య కూడా తీరిపోతుందని పాలేకర్ సూచించారు. భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) సంచాలకులు డా. సి.తార సత్యవతి ప్రసంగిస్తూ చిరుధాన్యాల సాగును విస్తృతంగా చేయాలన్నారు. వరి కోతల తర్వాత ఆ పొలాల్లో జొన్న తదితర చిరుధాన్యాలను సాగు చేసి అధిక దిగుబడి సాధించవచ్చని తమ అధ్యయనంలో రుజువైందన్నారు. చిరుధాన్యాలను అన్నం, రొట్టెలతో పాటు 300 రకాల ఉత్పత్తులుగా మార్చి తినవచ్చన్నారు. ఐఐఎంఆర్ ప్రపంచ దేశాలకు ఆధునిక చిరుధాన్య ఉత్పత్తులకు సంబంధించిన సాంకేతికతను అందిస్తోందన్నారు. ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ డా. పి. చంద్రశేఖర ప్రసంగిస్తూ ఆహార భద్రత సాధించాలంటే చిరుధాన్యాల ఉత్పత్తిని పెంపొందించడానికి అందరూ సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎఎఆర్‌డిఓ ప్రధాన కార్యదర్శి మనోజ్ నర్దేవ్సింగ్, డా.సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'కోళ్ల ఫారాల కాలుష్యానికి' ఇకపై చెక్! ఎలాగో తెలుసా?
కోళ్ల ఫారంలో కోళ్ల విసర్జితాల వల్ల కోళ్ల రైతులు, కార్మికులకే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు ఈగలు, దుర్వాసన పెద్ద సమస్యగా ఉంటుంది. కోళ్ల విసర్జితాలను ఆశించే ఈగలు మనుషులకు, కోళ్లకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కోళ్ల విసర్జితాల నుంచి విడుదలయ్యే అమ్మోనియా వాయువు వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు, రైతులకు కళ్లు మండటం, తలనొప్పి వంటి సమస్యలు రావటంతో పాటు కోళ్లకు సైతం తలనొప్పి, కంటి చూపు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. లేయర్, బ్రీడర్ కోళ్ల ఫారాల కింద పోగుపడే కోళ్ల విసర్జితాల దుర్వాసన, ఈగల నివారణకు రసాయనాలు చల్లినప్పటికీ ఇది తీరని సమస్యగానే మిగిలిపోతోంది. జనావాసాలకు దగ్గరగా ఉండే కోళ్ల ఫారాల దుర్గంధాన్ని, ఈగలను భరించలేని ప్రజలు వాటిని మూయించే పరిస్థితులు కూడా నెలకొంటూ ఉంటాయి. అయితే, ఈ సమస్యలను పర్యావరణహితంగా పరిష్కరించే ఓ మార్గాన్ని సూచిస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు యడ్లపాటి రమేష్. బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) అనే హానికరం కాని ఈగకు చెందిన పిల్ల పురుగులను కోళ్ల ఫారంలోని విసర్జితాలపై వదిలితే కోళ్ల ఫారాల నుంచి దుర్వాసన సమస్య, విసర్జితాల యాజమాన్య సమస్యలు తీరిపోతాయని రమేష్ తెలిపారు. కోళ్ల వ్యర్థాలను – వర్మి కంపోస్ట్ ప్రక్రియ లాగా మారుస్తూ బిఎస్ఎఫ్ లార్వా (పిల్ల పురుగులు) పెరుగుతాయి. నెలకొకసారి వీటిని కోళ్ల ఫారంలో విసర్జితాలపై వేసుకుంటే చాలు. కోళ్ల ఫారాల నుంచి వ్యర్థాల దుర్వాసన నుంచి 95% పైగా విముక్తి కలిగించడానికి సహజ ప్రక్రియ అయిన బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా ఒక మంచి పరిష్కారమని ఆయన చెబుతున్నారు. గత ఐదారేళ్లుగా బిఎస్ఎఫ్ లార్వా ఉత్పత్తిపై పనిచేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కోళ్ల రైతులకు ఈ లార్వాను అందిస్తూ కాలుష్య నియంత్రణకు, ఆరోగ్య రక్షణకు కషి చేస్తున్నామని ఆయన అన్నారు. లార్వాను కోళ్ల విసర్జితాల (లిట్టర్)పై నెలకోసారి చల్లటం వల్ల ఉపయోగాలు: ► సాధారణ ఈగలు పూర్తిగా తగ్గిపోతాయి. కోళ్ల విసర్జితాలపై ఈగలు అరికట్టేందుకు ఉపయోగించే మందులు, అలాగే ఈగల లార్వాను నిర్మూలించడానికి, ఫీడ్‌లో ఇచ్చే మందులు అసలు అవసరం లేదు. ► దుర్వాసన తగ్గుతుంది, కోళ్ల విసర్జితాల నుంచి వెలువడే అమ్మోనియా తగ్గిపోతుంది. ► కోళ్ల ఫారంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. కళ్ళు మంటలు, సిఆర్డి సమస్య తగ్గుతుంది. ► విసర్జితాలను బిఎస్ఎఫ్ పిల్ల పురుగులు ఎరువుగా మార్చే క్రమంలో, విసర్జితాల్లో తేమ తగ్గిపోయి, దుర్వాసన కూడా తగ్గుతుంది. ► సున్నం, బ్లీచింగ్ అవసరం ఉండదు. వీటి ఖర్చు తగ్గుతుంది. ► విసర్జితాల నిర్వహణకు కూలీలు, స్పేయ్రర్లు, మందుల ఖర్చు ఆదా అవుతుంది. కోళ్ల విసర్జితాలపై ఉండే సాల్మొనెల్లా, ఈ–కొలి వంటి హానికారక సూక్ష్మక్రిములను అరికడతాయి ► ఆర్గానిక్ కంపోస్ట్‌గా మారిన కోళ్ల విసర్జితాలను రైతులు మంచి ధరకు విక్రయించుకోవచ్చు. బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను విసర్జితాలపై చల్లటం అనే సహజ సిద్ధమైన ప్రక్రియ వల్ల.. కోళ్లకు, పనివారికి, చుట్టపక్కల నివసించే ప్రజలకు ఇబ్బందులు తప్పటమే కాకుండా, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ► చనిపోయిన కోళ్లను, పగిలిపోయిన గుడ్లను త్వరగా కుళ్ళబెట్టడానికి, దుర్వాసన, బాక్టీరియా తగ్గడానికి కూడా బిఎస్ఎఫ్ లార్వా ఉపయోగపడుతుంది. ► కోళ్ల ఫారం పరిసర ప్రాంతాలు ఆరోగ్యకరంగా, కాలుష్యరహితంగా తయారై కోళ్ల ఆరోగ్యం బాగుంటుంది. ► ఉత్పాదకత 1–2 శాతం పెరుగుతుంది. బిఎస్ఎఫ్ గుడ్డు నుంచి ఈగ వరకు జీవితకాలం మొత్తం 45 రోజులు. గుడ్డు నుంచి పిల్లలను ఉత్పత్తి చేయటం అనేది తక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమ గల వాతావరణంలో జరగాల్సి ఉంటుంది. మరోన్నో ఉపయోగాలు.. ► 20 రోజుల వయసులో గోధుమ రంగులో ఉండే బిఎస్ఎఫ్ పురుగులు బతికి ఉండగానే లేయర్ కోళ్లకు, బ్రాయిలర్ కోళ్లకు, నాటు కోళ్లకు 10–20% మేరకు సాధారణ మేత తగ్గించి మేపవచ్చు. ► వంటింటి వ్యర్థాలు, ఆహార వ్యర్థాలపై ఈ బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను వేసి పెంచవచ్చు. ► 15 రోజుల తర్వాత ఆ లార్వాను పెంపుడు కుక్కలకు /పిల్లులకు /పక్షులకు మేతగా వేయొచ్చు. బతికి ఉన్న పురుగులు మేపవచ్చు. లేదా ఎండబెట్టి లేదా పొడిగా మార్చి కూడా వాడుకోవచ్చు. 'ఆక్వా చెరువుల్లో రోజుకు మూడు సార్లు మేత వేస్తూ ఉంటారు. ఒక మేతను బిఎస్ఎఫ్ లార్వాను మేపవచ్చని రమేష్ చెబుతున్నారు.' వివరాలకు: 9154160959 - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!? -
మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!?
వ్యవసాయ పనుల్లో శారీరక శ్రమ తగ్గించే యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చిన కొద్దీ రైతులకు పని సులువు కావటంతో పాటు ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది. పట్టు పురుగుల పెంపకంలో భాగంగా జరిగే మల్బరీ తోటలు సాగు చేసే రైతులు సాధారణంగా 28 రోజుల్లో ఒక విడత పట్టు గూళ్ల పెంపకం పని పూర్తి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మల్బరీ మొక్కల్ని పెంచి, కొమ్మల్ని కత్తిరించి వాటిని షెడ్లో పెరిగే పట్టు పురుగులకు ఆహారంగా వేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు బ్రష్ కట్టర్‌తో వ్యవసాయ కార్మికుడు కొమ్మ కత్తిరిస్తే, ఆ కొమ్మలను మరో కార్మికుడు కట్టకట్టి షెడ్డుకు చేరుస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో మూడు దశల్లో కార్మికుల అవసరం ఉంటుంది. కూలీల కొరతతో కూలి పెరిగిపోవటం వల్ల ఖర్చు పెరిగింది. కొడవళ్లతో కొమ్మ కత్తిరింపు, సేకరణ అధిక శారీరక శ్రమతో కూడిన పని కావటంతో పెరిగిన దశలో పట్టు పురుగులు అధిక మొత్తంలో మల్బరీ ఆకులు మేపాల్సి ఉంటుంది. ట్రాక్టరుకు జోడిండి వాడే పరికరం.. అయితే, గ్రామీణ ఆవిష్కర్త, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన యువకుడు కొడిముంజ ప్రవీణ్ రూపొందించిన పరికరం ద్వారా సులువుగా, త్వరగా, తక్కువ మంది కూలీలతోనే ఏ రోజు కత్తిరించిన ఆకులను ఆ రోజు పురుగులకు మేపటం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ప్రవీణ్ గత 12 ఏళ్లుగా రైతులకు ఉపయోగపడే పవర్ వీడర్లు, ట్రాక్టర్‌కు జోడించి ఉపయోగించే వ్యవసాయ పరికరాలను తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పట్టుపురుగుల పెంపకందారుల సూచన మేరకు 2023 ఆగస్టులో మల్బరీ కొమ్మలు కత్తిరించే ట్రాక్టర్ అటాచ్‌మెంట్‌ను తయారు చేశారు. 3 అడుగుల దూరంలో వరుసలుగా నాటిన మల్బరీ మొక్కలను నేల నుంచి 5 అంగుళాల ఎత్తులో కత్తిరించి పక్కకు పడేసేలా దీన్ని రూపొందించారు. సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లోని నలుగురు రైతులకు ఈ పరికరాలను విక్రయించారు. పలమనేరు రైతుల సూచనలతో.. ప్రవీణ్ ఈ పరికరం గురించి పల్లెసృజన సంస్థకు తెలియజేయగా, మల్బరీ సాగు విస్తారంగా జరుగుతున్న చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంత రైతులకు ఈ పరికరాన్ని చూపించారు. కొమ్మ కత్తిరించటంతోపాటు కట్ట కట్టి పడేసేలా దీన్ని అభివృద్ధి చేస్తే కూలీల అవసరం బాగా తగ్గుతుందని రైతులు సూచించారు. ప్రవీణ్ రెండు నెలలు శ్రమించి ఈ పరికరాన్ని రైతుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయటంలో విజయం సాధించారు. నెల నెలా మల్బరీ కొమ్మ కత్తిరించడానికే కాకుండా.. ఏడాదికి, రెండేళ్లకోసారి మల్బరీ చెట్టు దుంప కొట్టడానికి కూడా ఈ పరికరం చక్కగా ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారని ప్రవీణ్ తెలిపారు. బ్రష్ కట్టర్‌తో 8–9 గంటల్లో చేసిన పనిని తాను రూపొందించిన పరికరాన్ని ట్రాక్టర్‌కు జోడించి ఒక గంటలో పూర్తి చేయొచ్చని ప్రవీణ్ చెబుతున్నారు. 200 కిలోల బరువుండే ఈ పరికరాన్ని స్థానికంగా కొనుగోలు చేసిన ఇనుముతో తయారు చేయడానికి రూ. 1,65,000 వరకు ఖర్చయ్యింది. పెద్ద సంఖ్యలో తయారు చేస్తే 10–15% ఖర్చు తగ్గుతుందంటున్నారు ప్రవీణ్. పత్తి రైతులకూ ఉపయోగమే! మల్బరీ కొమ్మల కత్తిరింపు, సేకరణకు సంబంధించి 5–6గురు కూలీలు చేసే పనిని 2–3గురు కూలీలతోనే సులువుగా చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారు. మల్బరీకే కాకుండా పత్తి తీత పూర్తయిన తర్వాత పత్తి కట్టె కొట్టడానికి, కంది కట్టె కొట్టడానికి, పశుగ్రాసం కోయడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుందని రైతులు చెబుతుంటే సంతోషంగా ఉంది. – కొడిముంజ ప్రవీణ్ (88863 81657), మల్బరీ కత్తిరింపు పరికరం రూపకర్త, జిల్లెళ్ల గ్రామం, తంగళ్లపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రకృతి సేద్యానికి ప్రమాణాలు! మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రైతులు చాలా సంవత్సరాలుగా విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ నిర్దుష్ట ప్రమాణాలు లేవు. భారతీయ నమూనా ప్రకృతి సేద్యం అంతకంతకూ విస్తరించటం.. ఎఫ్.ఎ.ఓ. వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌కు సహకార వ్యవస్థ ఏర్పాటవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి, ఉత్పత్తుల లేబులింగ్‌కు భారతీయ ప్రమాణాలను నిర్వచించుకోవాల్సిన అవసరం వచ్చింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఒక ముసాయిదా పత్రాన్ని వెలువరించింది. 27 పేజీల డ్రాఫ్ట్ స్టాండర్డ్స్‌ను వెబ్సైట్లో పెట్టింది. ప్రకృతి సాగు పద్ధతులు, ద్రావణాలు, కషాయాలు, అంతర పంటలు, మిశ్రమ పంటలు, ఆగ్రోఫారెస్ట్రీ.. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, నిల్వ, ప్యాకేజింగ్‌తో పాటు.. సేంద్రియ–ప్రకృతి వ్యవసాయాల మధ్య వ్యత్యాసాలు ఇందులో ఉన్నాయి. శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, రైతు శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు, సంస్థలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నది. తుది గడువు 2023 డిసెంబర్ 26. 14 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళావిశాఖపట్నంలో ఈ నెల 8–10 తేదీల్లో జరగాల్సిన ఆర్గానిక్ మేళా పెనుతుపాను కారణంగా ఈ నెల 14–17 తేదీలకు వాయిదా పడింది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, సుస్థిర వ్యవసాయ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 14న ఉ. 10 గంటలకు సేంద్రియ/ప్రకృతి రైతులు– రైతు శ్రేయోభిలాషుల సమ్మేళనం, 15న గ్రాడ్యుయేట్ ప్రకృతి వ్యవసాయదారులు, విద్యార్థుల సదస్సు, 16న ఏపీ ఛాంబర్ ఆఫ్ ఆర్గానిక్స్ సమావేశం, 17న ఇంటిపంటలు/మిద్దెతోటలపై సదస్సు జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 78934 56163, 86862 24466. -
వంట పండింది!
జీవితంలో సమస్యలు రావడం సాధారణం. ఒక్కోసారి ఇవి ఊపిరాడనివ్వవు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా వాటిని ఎదుర్కొనాలి. తానేమిటో నిరూపించుకోవాలి. అలానే చేసింది బిందు. తన కూతుళ్లకు మంచి చదువును అందించేందుకు ఒక పక్క గరిట తిప్పుతూనే మరోపక్క నాగలి పట్టి పొలం సాగు చేస్తూ ‘‘మనం కూడా ఇలా వ్యవసాయం చేస్తే బావుంటుంది’’ అనేంతగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడులోని తెనై జిల్లా బొమ్మినాయకన్పట్టి గ్రామానికి చెందిన బిందు, పిచ్చయ్య దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పిచ్చయ్య సొంత పొలంలో చెరకు పండించేవాడు. అయితే ఏటా అప్పులు తప్ప ఆదాయం వచ్చేది కాదు. గ్రామంలో చాలామంది రైతులు చెరకు, పత్తిని పండించి నష్టపోవడాన్ని చూసి ఇతర పంటలను పండించాలని నిర్ణయించుకుంది బిందు. మొక్కజొన్న, వంగ పంటను పొలంలో వేసింది. మరోపక్క సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లో చేరి చుట్టుపక్కల రైతులు ఏం పండిస్తున్నారో తెలుసుకునేది. ఇతర రైతుల సలహాలు, సూచనలతో సాగును మెరుగు పరుచుకుంటూ, ఎస్‌హెచ్‌జీ ద్వారా కృషి విజ్ఞాన్ నిర్వహించే వ్యవసాయ కార్యక్రమాలకు హాజరవుతూ మెలకువలు నేర్చుకుంది. అధికారులు చెప్పిన విధంగా పప్పుధాన్యాలు, మిల్లెట్స్, మినుములు కూడా సేంద్రియ పద్ధతి లో సాగుచేసింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. విరామంలో... పంటకు పంటకు మధ్య వచ్చే విరామంలో కూరగాయలు పండించడం మొదలు పెట్టింది. అవి నాలుగు నెలల్లోనే చేతికి రావడంతో మంచి ఆదాయం వచ్చేది. విరామ పంటలు చక్కగా పండుతుండడంతో.. కొత్తిమీర, కాకర, ఇతర కూరగాయలను పండిస్తోంది. పంటను పసుమయిగా ... ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చాలా కూరగాయలు వృథా అయ్యేవి. అలా వ్యర్థంగా పోకుండా ఉండేందుకు ‘పసుమయి’ పేరిట ఎండబెట్టిన కూరగాయలు, పొడులను విక్రయిస్తోంది. ఇడ్లీ పొడి, నిమ్మపొడి, ధనియాల పొడి వంటి అనేక రకాల పొడులను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. నెలకు వందల సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపారవేత్తగా ఎదిగింది బిందు. ఆమె పెద్దకూతురు ఎం.ఎస్. పూర్తి చేస్తే, చిన్నకూతురు బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. అలా సేద్యంతో పిల్లల చదువులనూ పండించుకుంది బిందు. -
‘నల్ల తామర’కు ముకుతాడు?
సాక్షి సాగుబడి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మిరప రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న నల్ల తామరను తట్టుకునే మిరప రకాలను రూపొందించుకునే పరిశోధనల్లో వరల్డ్ వెజిటబుల్ సెంటర్ గణనీయమైన పురోగతి సాధించింది. తైవాన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వెజిటబుల్ సెంటర్ (డబ్ల్యూ.వి.సి.) దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానం పఠాన్‌చెరులోని ఇక్రిశాట్ ఆవరణలో ఉంది. ఈ కేంద్రంలో సాగులో ఉన్న నల్లతామరను తట్టుకునే గుణాలున్న 9 మిరప రకాలతో కూడిన ప్రదర్శన క్షేత్రాన్ని ఆసియా అండ్ పసిఫిక్ సీడ్ అసోసియేషన్(ఎపిఎస్‌ఎ)కు చెందిన 50 ప్రైవేటు విత్తన కంపెనీల ప్రతినిధులు పరిశీలించారు. ఆసక్తి కలిగిన విత్తన కంపెనీలతో కలసి త్వరలో చేపట్టనున్న బ్రీడింగ్ ప్రాజెక్టు ద్వారా నల్లతామర, తదితర చీడపీడలను చాలావరకు తట్టుకునే సరికొత్త సంకర వంగడాలను రూపొందించనున్నట్లు డబ్ల్యూ.వి.సి. ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ తెలిపారు. 10 రాష్ట్రాల్లో మిరపకు నల్లతామర ప్రపంచంలో మిరపను అత్యధిక విస్తీర్ణంలో పండిస్తూ, వినియోగిస్తూ, ఎగుమతి చేస్తున్న దేశం భారత్. అంతేకాకుండా, దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న రెండో పెద్ద కూరగాయ పంట మిరప. హెక్టారుకు రూ. 2.5–3 లక్షల వరకు పెట్టుబడి అవసరమైన ఈ పంట దేశంలో సుమారు 7.30 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. తామర పురుగులు గతం నుంచి ఉన్నప్పటికీ అంత ప్రమాదకరం కాదు. అయితే, ఇండోనేసియా నుంచి బొప్పాయి ద్వారా మన దేశంలోకి ప్రవేశించిన నల్ల తామర 2015లో తొలుత మిరపను ఆశించి విధ్వంసం సృష్టిస్తోంది. గత రెండు–మూడేళ్లుగా ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో మిరప తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. నల్ల తామర తాకిడిని తట్టుకోవడానికి అతి తరచూ పురుగుమందులు పిచికారీలు చేసినా దిగుబడి నష్టం 40–50 శాతం ఉంటుంది. ఏభయ్యేళ్ల పరిశోధన ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో దీన్ని తట్టుకునే వంగడాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కూరగాయ పంటలపై గత ఏభయ్యేళ్లుగా పరిశోధనలు చేస్తూ మెరుగైన వంగడాల అభివృద్ధికి, స్థానిక వంగడాల అభివృద్ధికి దోహదపడుతున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వెజిటబుల్ సంస్థ. తైవాన్‌లోని ప్రధాన పరిశోధన స్థానం కలిగిన డబ్లు్య.వి.సి. ప్రధానంగా మిరప, టొమాటో, కాకర, గుమ్మడి, బెండ, పెసర, వెజ్‡సోయాబీన్స్, తోటకూర పంటలకు సంబంధించి చీడపీడలు తట్టుకునే మెరుగైన వంగడాల అభివృద్ధిపై ఈ సంస్థ గత ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. అయితే, పటాన్‌చెరులోని డబ్ల్యూ.వి.సి. కేంద్రంలో ముఖ్యంగా మిరప, టొమాటో, పెసర, వెజ్ సోయాబీన్ పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి. మెరుగైన వంగడాలు వాడితే తక్కువ పిచికారీలు చాలు తైవాన్‌లోని డబ్ల్యూ.వి.సి. పరిశోధనా కేంద్రంలో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు 7 రకాల మిరప వంగడాల్లో గుర్తించారు. పటాన్చెరు కేంద్రంలో గుర్తించిన మరో 2 మిరప రకాలను గుర్తించాం. ఈ 9 రకాలపై రెండేళ్లుగా పరిశోధనలు చేయగా, ఇందులో 6 రకాల్లో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు కనిపించాయి. ఈ లక్షణాలకు కారణమైన జన్యువులను, వాటికి సంబంధించిన మార్కర్లను గుర్తించాలి. ఇందుకు ఆసక్తి గల స్థానిక ప్రైవేటు విత్తన కంపెనీలతో కలసి తదుపరి దశ పరిశోధనలు సాగించాల్సి ఉంది. ఈ పరిశోధనలన్నీ పూర్తయి నల్లతామరను చాలా మటుకు తట్టుకునే మెరుగైన మిరప విత్తనాలు రైతులకు చేరటానికి మరో 3–4 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు చాలా సార్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి వస్తున్నది. మెరుగైన విత్తనాలు వాడితే తక్కువ పిచికారీలు సరిపోతాయి. ఈ మెరుగైన విత్తనాలను వాడుతూ రైతులు మంచి వ్యవసాయ పద్ధతులను పాటించటం అవసరం. దీర్ఘకాలం పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునేందుకు అనువైన మిరప వంగడాల అభివృద్ధికి దోహదపడటమే మా లక్ష్యం. – డా. నల్లా మనోజ్‌కుమార్, అసిస్టెంట్ సైంటిస్ట్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా పరిశోధనా కేంద్రం, ఇక్రిశాట్ ఆవరణ, పటాన్చెరు -
నేల, నీరే జీవనాధారం!
వాతావరణ మార్పు వల్ల కరువు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు విరుచుకుపడుతున్న నేపథ్యం ఇది. పంటల సాగు, పశుపోషణ, ఆక్వా సాగులో రైతులు అనేక కష్టనష్టాలకు గురవుతున్న కలికాలం. మనతో పాటు సకల జీవరాశి మనుగడకు నేల, నీరే మూలాధారాలు. నేలను, నీటిని ప్రాణప్రదంగా పరిరక్షించుకుంటూనే సేద్యాన్ని కొనసాగించేలా ఐక్యరాజ్యసమితికి చెందిన వ్యవసాయ ఆహార సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రజలు, రైతులను చైతన్యవంతం చేస్తూ పాలకులకు దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. రసాయనాల్లేకుండా, లోతుగా దుక్కి దున్నకుండా, ఒకటికి నాలుగు పంటలు కలిపి వేసుకోవటం ద్వారా పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అనుసరించటం ద్వారా నేలను, నీటిని సంరక్షించుకోవటం సాధ్యమవుతుందని సమాజంలో ప్రతి ఒక్కరం గుర్తించాల్సిన తరుణం ఇది. మానవాళికి 95% ఆహారాన్ని అందిస్తున్న నేలలను పరిరక్షించుకోవాలన్న స్ఫూర్తిని కలిగించడానికి ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ నేలల లేదా భూముల దినోత్సవాన్ని ఎఫ్.ఎ.ఓ. నిర్వహిస్తోంది. ఈ ఏడాది నినాదం: ‘నేల, నీరే జీవరాశి అంతటికీ జీవనాధారం’! ఎఫ్.ఎ.ఓ. ఇంకా ఏం చెబుతోందో చదవండి.. ఈ నెల 8,10 తేదీల్లో విశాఖ ఆర్గానిక్ మేళా గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 8,9,10 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 8న ఉ. 10 గంటలకు రైతుల సమ్మేళనం, 9న గ్రాడ్యుయేట్ రైతుల సదస్సు, 10న ఇంటిపంటలపై సదస్సు, 11న సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారుల చర్చాగోష్ఠి జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. వివరాలకు.. 78934 56163, 86862 24466. 11న ప్రకృతి సేద్య కార్యకర్తల సమావేశం ప్రముఖ ప్రకృతి సేద్య నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాశ్ పాలేకర్ డిసెంబర్ 11న ఉ.10 నుంచి. మ.1 గం. వరకు హైదరాబాద్ దోమల్‌గూడలోని రామచంద్రమిషన్‌లో ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేసే కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో ముచ్చటిస్తారు. పర్యావరణ సంక్షోభం నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని స్వతంత్ర ఉద్యమంగా గ్రామస్థాయిలో రైతుల్లో విస్తరింపజేయటంపై చర్చిస్తారు. వివరాలకు.. సేవ్ స్వచ్ఛంద సంస్థ: 63091 11427. 14 నుంచి పల్లెసృజన శోధాయాత్ర ప్రకృతితో మమేకమై జీవించే గ్రామీణులు ముఖ్యంగా రైతులు, వృత్తిదారులు, కళాకారుల విజ్ఞానాన్ని తెలుసుకోవటం.. అజ్ఞాతంగా మిగిలిపోయిన గ్రామీణ ఆవిష్కరణలను వెలికితేవటమే లక్ష్యంగా పల్లెసృజన స్వచ్ఛంద సంస్థ శోధాయాత్రలు నిర్వహిస్తోంది. 47వ చిన్న శోధాయాత్ర అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి వెంకట రాజంపేట వరకు డిసెంబర్ 14 నుంచి 17 వరకు జరుగుతుంది. వలంటీర్లు కాలినడకన పయనిస్తూ ప్రజలతో ముచ్చటిస్తారు. ఆసక్తి గల వారు రిజిస్ట్రేషన్ చేసుకొని యాత్రలో పాల్గొనవచ్చు. వివరాలకు.. బ్రిగేడియర్ పి.గణేశం – 98660 01678, 99666 46276, 99859 19342. 9, 10 తేదీల్లో సుందర రామన్ శిక్షణ తమిళనాడుకు చెందిన ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎస్.ఆర్. సుందర రామన్ డిసెంబర్ 9,10 తేదీల్లో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కామ్యవనంలో రైతులకు రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. రసాయనాలతో సాగుచేస్తున్న భూమిని ప్రకృతి వ్యవసాయంలోకి ఎలా మార్చాలి? నేలలో సేంద్రియ కర్బనం ఎలా పెంచాలి? ఉద్యాన పంటలకు పిచికారీ లేకుండా సమగ్ర పోషకాలు ఎలా అందించాలి? వంటి అనేక ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ముందస్తు రిజిస్ట్రేషన్ల వివరాలకు.. 94495 96039, 99490 94730. 15న పాలేకర్ ఫైవ్ లేయర్ క్షేత్ర సందర్శన వికారాబాద్ జిల్లా థారూరు మండలం బూరుగడ్డ గ్రామంలో సేవ్ స్వచ్ఛంద సంస్థ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో అభివృద్ధి చేసిన ఐదు అంతస్థుల ఉద్యాన పంటల నమూనా క్షేత్రాన్ని డిసెంబర్ 15 (శుక్రవారం)న ఉ. 10.–సా.5 వరకు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాశ్ పాలేకర్ సందర్శిస్తారు. ప్రతి అంశం వెనుక గల శాస్త్రీయతను పాలేకర్ వివరిస్తారు. 4 రాష్ట్రాల రైతులు పాల్గొంటున్నారు. ప్రసంగం తెలుగు అనువాదం ఉంటుందని విజయరామ్ తెలిపారు. 3 కి.మీ. నడవగలిగిన వారే రావాలి. భోజన ఏర్పాట్లు ఉన్నాయి. నేరుగా వచ్చే వారికి ప్రవేశ రుసుం రూ. 100. హైదరాబాద్ రామకృష్ణమిషన్ దగ్గర గల సేవ్ కార్యాలయం నుంచి బస్సులో వెళ్లే వారికి రూ. 500. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వివరాలకు.. 63091 11427. (చదవండి: ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్ !) -
చిరుధాన్యాలు నిరుపేదలకూ అందాలి!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటే పౌష్టికాహార లోపాన్ని సులువుగా జయించవచ్చని, నిరుపేదలు సైతం చిరుధాన్యాలను రోజువారీ ఆహారంగా తిసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం సందర్భంగా భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)–న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో నోవోటెల్ హోటల్లో సోమవారం ప్రారంభమైన అంతర్జాతీయ చిరుధాన్య సమ్మేళనం మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డా. తమిళిసై ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలను తాను ప్రతి రోజూ తింటానన్నారు. వైద్యురాలిగా కూడా చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో తిరిగి ప్రజలంతా భాగం చేసుకోవటం అవశ్యమన్నారు. జొన్నలు, రాగులు, సజ్జలకు మాత్రమే పరిమితం కావద్దని అంటూ.. వీటితో పాటు కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలు తదితర స్మాల్ మిల్లెట్స్‌ను కూడా మార్చి మార్చి తినాలని సూచించారు. ఒక్కో చిరుధాన్యంలో వేర్వేరు ప్రత్యేకతలున్నాయంటూ, ఒక్కో దాంట్లో ఒక్కో రకం వ్యాధుల్ని పారదోలే ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు, పీచుపదార్థాలు వేర్వేరు పాళ్లలో ఉన్నాయని డా. తమిళిసై వివరించారు. ఈ మిల్లెట్స్ చిన్నసైజులో ఉంటాయి కాబట్టి చిన్నచూపు చూడకూడదన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో యోగాతో పాటు చిరుధాన్యాలను ప్రపంచానికి తిరిగి పరిచయం చేయటం హర్షదాయకమన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్‌లో శిక్షణతో పాటు ఆర్థిక సాయం పొంది చిరుధాన్యాల ఆహారోత్పత్తుల వ్యాపారం చేపట్టిన పలు స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు గవర్నర్ తమిళిసై గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందించి ప్రశంసించారు. ముగింపు సమావేశానికి ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈవో డా. బి. దయాకర్‌రావు అధ్యక్షతవహించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్‌సైన్స్) డా. శర్మ ప్రసంగిస్తూ వచ్చే నెలతో ముగియనున్న అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం తర్వాత 2033 వరకు చేపట్టనున్న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్‌ను త్వరలో వెలువరిస్తామని ప్రకటించారు. క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రాచుర్యంలోకి తెస్తున్నామని, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తున్నామన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సిఎసిపి) చైర్మన్ డాక్టర్ విజయపాల్ శర్మ ప్రసంగిస్తూ ప్రస్తుతం చిరుధాన్యాలు పేదలకు అందుబాటులో లేవని, వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. కనీస మద్దతు ధర పెంపుదలలో కేంద్రం ఇప్పటికే చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడినందున రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. సి.తార సత్యవతి మాట్లాడుతూ మెరుగైన చిరుధాన్య వంగడాల తయారీకి జన్యు సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్ !) -
ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: అన్ని విధాలుగా ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాల ఆహారంపై అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023 సందర్భంగా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతమైన ప్రజా చైతన్యం వెల్లివిరుస్తోందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. సురేశ్ కుమార్ చౌదరి అన్నారు. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) తోడ్పాటుతో భారత ప్రభుత్వం సకల పోషకాల గనులైన చిరుధాన్యాలను శ్రీఅన్నగా పేర్కొంటూ ఫ్యూచర్ హెల్దీ సూపర్ ఫుడ్‌గా సరికొత్త రూపాల్లో తిరిగి పరిచయం చేయటంలో సఫలీకృతమైందని ఆయన తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో మనుషుల ఆరోగ్యానికే కాకుండా భూగోళం ఆరోగ్యానికి కూడా దోహదపడే అసలైన ఆహార ధాన్యాలు చిరుధాన్యాలేనని జీ20 తదితర అంతర్జాతీయ వేదికల్లోను, దేశీయంగాను చాటి చెప్పటంలో మన దేశం విజయవంతమైందని అంటూ, భవిష్యత్తులో చిరుధాన్యాల ప్రాధాన్యం మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రధాన జీవన స్రవంతిలోకి తిరిగి చిరుధాన్యాలు- ఇప్పుడు, తర్వాత’ అనే అంశంపై నొవోటెల్ హోటల్లో రెండు రోజుల అంతర్జాతీయ చిరుధాన్యాల సమ్మేళనం సోమవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థలోని న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి డా. సురేశ్ కుమార్ చౌదరి అధ్యక్షతవహించారు. దేశంలో చాలా రాష్ట్రాలు మిల్లెట్ మిషన్లను ప్రారంభించాయని, ప్రజలు నెమ్మదిగా చిరుధాన్యాల వినియోగం వైపు మళ్లుతున్నారన్నారు. అయితే, చిరుధాన్యాల రైతులకు మరింత ఆదాయాన్ని అందించే పాలకులు విధాన నిర్ణయాలు తీసుకొని ప్రోత్సాహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 2023 తర్వాత కాలంలో చిరుధాన్యాలు మన ఆహారంలో మరింతగా భాగం కావాలంటే కేవలం ప్రభుత్వ చర్యలే సరిపోవని, ప్రభుత్వేర సంస్థలు, వ్యక్తులు, ప్రైవేటు ఆహార కంపెనీలు కూడా సంపూర్ణ సహకారం అందించాలని డా. సురేశ్ కుమార్ చౌదరి విజ్ఞప్తి చేశారు. ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. సురేశ్ కుమార్ చౌదరి చిరుధాన్యాల పుట్టిల్లు భారత్: ఎఫ్.ఎ.ఓ. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) భారత్ ప్రతినిధి టకయుకి హగివర ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలకు భారత్ పుట్టిల్లని, చిరుధాన్యాల వాణిజ్యానికి భారత్ మూలకేంద్రంగా మారే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. క్లైమెట్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆకలి, పౌష్టికాహార లోపం, ఆహార అభద్రతలను అధిగమించడానికి చిరుధాన్యాలు ఉపకరిస్తాయని భారత్ ప్రపంచానికి శక్తివంతంగా చాటిచెప్పిందన్నారు. ఐసిఎఆర్, ఐఐఎంఆర్ చేసిన కృషి అనితరసాధ్యమైనదన్నారు. అంతర్జాతీయ సంస్థలతో పాటు, ఆహార వాణిజ్యంలో దిగ్గజాల్లాంటి బహుళజాతి కంపెనీలు కూడా చిరుధాన్యాల వైపు దృష్టి సారిస్తున్నాయన్నారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి చిరుధాన్యాలతో కూడిన సుస్థిర వ్యవసాయం దోహదం చేస్తుందన్నారు. రైతులకు దక్కుతున్నది స్వల్పమే చిరుధాన్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా 300కుపైగా అధునాతన, వినూత్న ఆహారోత్పత్తులను ఉత్పత్తి చేసే సాంకేతికతలను రూపొందించటంలో హైదరాబాద్‌లోని ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ విశిష్ట ప్రాతను పోషించిందని, ప్రపంచానికే ఇది మార్గదర్శకమని ఐసిఎఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా. డి.కె. యాదవ్ తెలిపారు. గతంలో చిరుధాన్యాలు ఎగుమతి చేసేవారమని, ఇప్పుడు అధునాతన తినుబండారాలను ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిందన్నారు. అయితే, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను అమ్మి వ్యాపారులు సంపాదించే మొత్తంలో 15-20% మాత్రమే చిరుధాన్యాల రైతులకు దక్కుతున్నదని, కనీసం 50% దక్కేలా విధానపరమైన చర్యలు తీసుకోగలిగితే చిరుధాన్యాలు ప్రధాన ఆహార ధాన్యంగా ప్రధాన జీవన స్రవంతిలోకి వస్తుందన్నారు. రూ. 250 కోట్లతో ఐఐఎంఆర్ను అంతర్జాతీయ చిరుధాన్యాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేశామని డా. యాదవ్ వివరించారు. వరి, గోధుమలకు దీటుగా రైతులకు ఆదాయాన్నందించేలా అధిక దిగుడినిచ్చే 9 రకాల చిరుధాన్యాల వంగడాలను అందుబాటులోకి తెచ్చామని, సర్టిఫైడ్ సీడ్‌కు కొరత లేదన్నారు. భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐఐఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ సి. తార సత్యవతి ప్రసంగిస్తూ చిరుధాన్యాలను పెద్దలతో పాటు పిల్లలు, యువత కూడా ఇష్టంగా తినేలా వినూత్న ఉత్పత్తులను న్యూట్రిహబ్ ద్వారా అందుబాటులోకి తెచ్చామన్నారు. గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో ప్రయోగాత్మక సాగులో మేలైన జొన్న వంగడాల ద్వారా హెక్టారుకు 7-8 టన్నుల జొన్నల దిగుబడి సాధించినట్లు తెలిపారు. గుజరాత్లో బంగాళదుంపలు సాగు చేసిన తర్వాత ఆ పొలాల్లో హెక్టారుకు 7-8 టన్నుల సజ్జ దిగుబడి వచ్చిందన్నారు. దశాబ్దాల నిర్లక్ష్యం తర్వాత చిరుధాన్యాలకు పునర్వైభవం రానుందన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈఓ డా. బి. దాయకర్‌రావు ప్రసంగిస్తూ గతంలో చిరుధాన్యాలు కొనే వారే ఉండేవారు కాదని, ఇప్పుడు కొందామంటే 40% మేరకు కొరత ఏర్పడిందన్నారు. న్యూట్రిహబ్ ద్వారా వినూత్న ఉత్పత్తులు తయారీలో స్టార్టప్‌లకు, ఆహార కంపెనీలకు ప్రపంచంలోనే ఎక్కడా లేని అధునాతన సాంకేతికతను అందిస్తున్నందున ఎగుమతులు పెరిగాయని, ప్రపంచ దేశాలు ఇప్పుడు మన వైపే చూస్తున్నాయన్నారు. చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచి, రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చేలా స్టార్టప్‌లు, కంపెనీలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ఈ సమ్మేళనంలో రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. చిరుధాన్యాల సాగు, వినియోగం పెంపుదలకు విశిష్ట కృషి చేస్తున్న పలువురు శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, పాత్రికేయులకు ఈ సందర్భంగా ‘పోషక్ అనాజ్’ జీవన సాఫల్య పురస్కారాలను అందించారు. పురస్కారాలు అందుకున్న వారిలో డాక్టర్ పివి వరప్రసాద్, డా. జీవీ రామాంజనేయులు, డా. హేమలత, డా. మీరా తదితరులతో పాటు ‘సాక్షి సాగుబడి’ సీనియర్ న్యూస్‌ఎడిటర్ పంతంగి రాంబాబు ఉన్నారు. మంగళవారం కూడా ఈ సమ్మేళనం కొనసాగుతుంది. ఈ సందర్భంగా నోవోటెల్లో ఏర్పాటైన స్టాళ్లలో సుమారు 200 స్టార్టప్‌లు చిరుధాన్యాల ఆహారోత్పత్తులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. (చదవండి: వరి ఆకారపు మిల్లెట్లు! మిల్లెట్లు తినేవారిగా మార్చేలా) -
ఎర్ర బంగారం ఇక ఎంతైనా ఎగుమతి!
ఎర్ర చందనం.. ప్రపంచంలో కేవలం మన దేశంలో మాత్రమే ఉన్న అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన జాతి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో విస్తరించిన తూర్పు కనుమల్లోని అడవుల్లో సహజ సిద్ధంగా ఎర్ర చందనం అనాదిగా పెరుగుతోంది. దీనితోపాటు, కొందరు రైతులు వర్షాధార భూముల్లో ఎర్రచందనం తోటలను చాలా ఏళ్లుగా సాగు చేస్తున్నారు. అంతరించిపోయే ప్రమాదం అంచుల్లో ఉన్న అరుదైన జాతి కావటంతో ఎర్రచందనం కలప ఎగుమతిపై 19 ఏళ్లుగా అంతర్జాతీయంగా పరిమితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల కృషి మేరకు ఎర్రచందనం ఎగుమతులపై పరిమితులు ఇటీవలే తొలగిపోయాయి. ఇక ఎంతయినా రైతులు ఎగుమతి చేయొచ్చు. మంచి ధర వచ్చే వరకు నిల్వ చేసుకొని మరీ ఎగుమతి చేసుకోవచ్చు. మెట్ట ప్రాంతాల్లో ఎర్రచందనం సాగు పుంజుకునేందుకు దోహదపడనున్న ఈ తాజా పరిణామంపై ప్రత్యేక కథనం. అంతర్జాతీయంగా ఆర్థికంగా ముఖ్యమైన చెట్ల జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఎర్రచందనం చేవ కర్రకు ఔషధ గుణాలు ఉన్నాయి. మన దేశంలోని తూర్పు కనుమలు విస్తరించిన దక్షిణ ప్రాంతంలో సహజ అడువుల్లో విస్తారంగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. రైతులు కూడా తమ భూముల్లో సాగు చేస్తున్నారు. సుదీర్ఘకాలం పెంచాల్సి రావటం, చెట్లు నరకడానికి, అమ్మకానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉండటం వంటి పరిమితులు ఉన్నప్పటికీ.. అంతర్జాతీయంగా గిరాకీ, అధిక ధర, మార్కెట్ డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవటం వల్ల ఎర్రచందనం సాగుకు కొంత మంది రైతులు ఆసక్తి చూపుతూ వచ్చారు. ఎగుమతిపై పరిమితులు ఇటీవల రద్దయిన నేపథ్యంలో ఎర్రచందనం సాగు మరింత పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నది నిపుణుల మాట. ఎర్రచందనం చెట్టు కాండం మధ్యలో పెరిగే ఎర్రటి చేవ కర్రను వస్త్రాలు, ఆహారం, ఔషధాల్లో సేంద్రియ రంగు కోసం వాడుతున్నారు. ఖరీదైన ఫర్నీచర్, బొమ్మలు, సంగీత వాయిద్యాల తయారీకి వాడుతున్నారు. షుగర్, చర్మవ్యాధులకు ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నది. జపాన్, చైనా, ఐరోపా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. అడవుల్లోని ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు గతంలో విచక్షణారహితంగా నరికివేసిన కారణంగా ఈ వృక్ష జాతి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొనే దశకు చేరింది. అందువల్ల ఎర్రచందనం జాతిని అంతరించిపోకుండా పరిరక్షించడానికి ప్రత్యేక చర్యలు అవసరమయ్యాయి. 2004 నుంచి ఎగుమతిపై పరిమితులు జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ చట్టబద్ధ సంస్థ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్డేంజర్డ్ స్పెసీస్ (సిఐటిఇఎస్ – ‘సైట్స్’)లో 1976 నుంచి భారత్ సభ్యదేశంగా కొనసాగుతోంది. ఎర్రచందనం దుంగల ఎగుమతిపై 2004లో ‘సైట్స్’ పూర్తిగా నిషేధించలేదు గానీ, పటిష్టమైన సంరక్షణ చర్యల్లో భాగంగా పరిమితిని విధించింది. ఏటేటా ఈ జాతి చెట్ల స్థితిగతులను పరిశీలించి ఎగుమతి పరిమాణాన్ని సైట్స్ స్థాయీ సంఘం నిర్దేశిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఈ చెట్ల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టింది. మరోవైపు అటవీ భూముల్లో ఎర్రచందనం మొక్కలు నాటడం కూడా జరిగింది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు గుజరాత్లో కూడా కొందరు రైతులు బంజరు భూముల్లో ఎర్రచందనాన్ని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. అటవీ భూముల్లోని ఎర్రచందనం చెట్లను పరిరక్షించటంతో పాటు రైతుల భూముల్లోనూ సాగు చేస్తుండటంతో ఈ జాతి అంతరించే ముప్పు నుంచి బయటపడింది. 19 ఏళ్ల తర్వాత.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నివేదికల ఆధారంగా తాజా పరిస్థితిని నవంబర్ 6–10 తేదీల్లో జెనీవాలో జరిగిన ‘సైట్స్’ 77వ స్థాయీ సంఘం సమావేశం సమీక్షించి సంతృప్తిని వ్యక్తం చేసింది. మన దేశం నుంచి సైట్స్ మేనేజ్మెంట్ అథారిటీ–ఇండియా తరఫున అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎస్.పి. యాదవ్ సారథ్యంలోని ఉన్నతాధికార బృందం ఈ సమావేశంలో పాల్గొని పరిస్థితిని వివరించింది. దీంతో, భారత్ నుంచి ఎర్రచందనం ఎగుమతులపై 19 ఏళ్లుగా అమల్లో ఉన్న పరిమితిని తొలగిస్తూ ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది. దీంతో, జెనీవాలోని సైట్స్ స్థాయీ సంఘానికి బదులు.. ఇక మీదట ఎర్రచందనం ఎగుమతుల వ్యవహారాలపై న్యూఢిల్లీలోని సైట్స్ మేనేజ్మెంట్ అథారిటీ–ఇండియా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలిగింది. రైతులకు గొప్ప ప్రోత్సాహం ఎర్రచందనం ఎగుమతిపై పరిమితిని రద్దు చేస్తూ సైట్స్ స్థాయీ సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు. మన దేశం గత 19 ఏళ్లుగా సైట్స్ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించటమే కాకుండా ఎర్రచందనం వృక్ష జాతి పరిరక్షణ చర్యలు సమర్థవంతంగా పాటించినందున సైట్స్ సానుకూల నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ‘ఈ పరిణామం ఎర్రచందనం తోటలు సాగు చేసే రైతులకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంద’ని ఆయన అన్నారు. ఎర్రచందనం సాగు పద్ధతులు ఎగుమతిపై పరిమితి తొలగిన నేపథ్యంలో ఎర్రచందనం సాగు పద్ధతులపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ దూలపల్లిలోని అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్బి) ఎర్రచందనం సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తోంది. గత ఏడాది కరదీపికను వెలువరించింది. ఆ వివరాలు...ఎర్రచందనం ప్రకృతిసిద్ధంగా తక్కువ నీటి వనరులున్న కొండ ప్రాంతాల్లో పెరుగుతుంది. అంతగా సారవంతం కాని గ్నీస్, క్వార్ట్జైట్, లాటరైట్ లోమ్ నేలలు బాగా అనుకూలం. సారవంతమైన నేలలు, నీటి సదుపాయం ఉన్న నేలలు ఎర్రచందనం సాగుకు అనువైనవి కావు. ఈ నేలల్లో సాగు చేస్తే చెట్లు బాగా ఎత్తుగా, లావుగా పెరుగుతాయి. అయితే, కాండం లోపల చేవదేలడానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది. చేవను బట్టే ఎర్రచందనం నాణ్యత, ధర ఆధారపడి ఉంటాయి. పాక్షిక శుష్క ఉష్ణమండలంలోని ఆకురాల్చే అడవులు పెరిగే ప్రాంతం దీనికి అనుకూలం. 700 నుంచి 1200 ఎం.ఎం. మేరకు వార్షిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. కనీసం 700 ఎం.ఎం. వర్షం అవసరం. ఏడాదిలో అప్పుడప్పుడూ వర్షాలు పడుతూ ఉండే ప్రాంతాలు ఎర్రచందనం సాగుకు అనుకూలం. అధిక వర్షపాత ప్రాంతాలు అనుకూలం కాదు. పొడి వాతావరణంతో పాటు 26–28 డిగ్రీల సెల్షియస్ (గరిష్టంగా 48 డిగ్రీల సెల్షియస్) ఉష్ణోగ్రతలు ఉండాలి. నర్సరీ బెడ్లపై పెంచిన 1–2 ఏళ్ల నారు మొక్కల్ని నాటుకోవాలి. ఎర్రచందనం గింజలు చాలా తక్కువ శాతం మొలకెత్తుతాయి. అందువల్ల వీటికి బదులు కొందరు ప్రైవేటు నర్సరీ వాళ్లు రైతులకు ఏగిశ మొక్కల్ని ఎర్రచందనం మొక్కలని నమ్మబలికి అంటగడుతూ ఉంటారని, రైతులు అప్రమత్తతంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏగిశ మొక్కలు కొన్ని సంవత్సరాల వరకు ఎర్రచందనం మాదిరిగానే కనిపిస్తాయట. కాండం కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. కాబట్టి మొక్కలను కొనుగోలు చేసేటప్పుడే రైతులు జాగ్రత్తవహించాలి. అటవీ శాఖ ద్వారా మొక్కల్ని కొనుగోలు చేయటం ఉత్తమం అని ఐఎఫ్బి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 30 ఏళ్లలో చెట్టుకు 59 కిలోల చేవ అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్బి) సమాచారం ప్రకారం.. ఎర్రచందనం మొక్కల్ని 3“3 మీటర్ల దూరంలో (హెక్టారుకు 1,111 మొక్కలు) నాటుకోవచ్చు. ఎర్రచందనం చెట్టు కోతకు రావటానికి 30 ఏళ్లు పడుతుందని ఐఎఫ్బి నిపుణులు తెలిపారు. నాటిన 20 ఏళ్లకు కాండం లోపలి భాగం (హార్డ్ వుడ్) చేవదేలటం ప్రారంభమవుతుంది. కాండంపై బెరడు కింద తెల్ల చెక్క ఉంటుంది. దాని లోపల ఎర్రగా చేవదేలి ఉంటుంది. ఆ ఎర్రని చేవ గల కర్రే విలువైనది. 30 ఏళ్ల వయసున్న చెట్టు నుంచి 59 కిలోల చేవగల ఎర్రచందనం దుంగ వెలువడుతుంది. పోయిన చెట్లు పోగా 30 ఏళ్లకు హెక్టారుకు కనీసం 275 చెట్లు మిగులుతాయి. ఈ లెక్కన హెక్టారుకు 16.2 మెట్రిక్ టన్నుల బరువైన ఎర్రచందనం లభిస్తుంది. 40 ఏళ్లకు 38 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని ఐఎఫ్బి అంచనా. 2017లో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వేలంలో మెట్రిక్ టన్ను ఎర్రచందనం దుంగలు రూ. 27.8 లక్షలకు అమ్ముడయ్యాయి. రాళ్ల భూముల్లో పెరుగుతుంది! ఎర్రచందనం ఎగుమతిపై పరిమితులు రద్దవటం వల్ల రైతులకు ఇబ్బందులు తొలగిపోతాయి. మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతులు నేరుగా ఎగుమతిదారులను సంప్రదించడానికి వీలవుతుంది. ఎర్రచందనం తోటల సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఇతరత్రా పంటలు సాగుకు అనువుకాని రాళ్లు రప్పలతో కూడిన మెట్ట భూములు, గుట్టల్లో ఎర్రచందనం చెట్లు పెరుగుతాయి. ఒక సంవత్సరం మొక్కల్ని నీరు పోసి రక్షిస్తే చాలు. తర్వాత వాటికవే పెరుగుతాయి. ఎరువులు అవసరం లేదు. 30 ఏళ్లలో కోతకు వస్తాయి. ఐఎఫ్బిలో ఎర్రచందనం మీద చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నాం. వన విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రతి ఏటా రైతులు, అటవీ సిబ్బంది, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ఎర్రచందనం పెంపకం మాన్యువల్, ఎర్రచందనం–ఏగిశ (బిజసాల్) మధ్య వ్యత్యాసాలు, ఎర్రచందనాన్ని ఆశించే చీడపీడలు, నియంత్రణ చర్యలపై కరపత్రాలను విడుదల చేశాం. – వెంకట్‌రెడ్డి, సంచాలకులు, అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్బి), దూలపల్లి, హైదరాబాద్ director_ifb@icfre.org ఎర్రచందనం రైతులకు ప్రయోజనకరం అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న జీవజాతుల పరిరక్షణ చర్యలను జెనీవాలోని ‘సైట్స్’ అనే అంతర్జాతీయ సంస్థ నియంత్రిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎర్రచందనం దుంగలను ఈ సంస్థ నిర్ణయించే పరిమితి మేరకే ఏటా ఎగుమతి జరుగుతోంది. దీంతో ఆ కోటా కన్నా ఎక్కువ ఎర్రచందనం మన రైతుల దగ్గర ఉన్నా ఎగుమతి చేసే వీలుండేది కాదు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల కృషి మేరకు ఎగుమతిపై ఉన్న పరిమాణాత్మక పరిమితిని ‘సైట్స్’ ఇటీవల రద్దు చేసింది. దీంతో ఎర్రచందనం ఎగుమతుల నియంత్రణ అంశం మన దేశంలోని ‘సైట్స్’ ఇండియా అథారిటీ పరిధిలోకి వచ్చింది. ఎర్రచందనం ఎగుమతిదారులు ఇక మీదట సైట్స్ ఇండియా అనుమతి తీసుకుంటే సరిపోతుంది. ఎర్రచందనం సాగు చేసే రైతులకు ఇది ప్రోత్సాహకర పరిణామం. సాగు చేసిన ఎర్రచందనం దుంగలను అప్పటికప్పుడు అమ్మెయ్యాల్సిన అవసరం లేదు. నిల్వ చేసి అయినా మంచి ధరకు రైతులు అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది. ఎర్రచందనం సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. – వై. మధుసూదన్ రెడ్డి, అటవీ దళాల అధిపతి (పిసిసిఎఫ్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ (చదవండి: పేదరికం తగ్గిన ఆహార వినియోగం పెరగలేదు!)