Aasara Pension Scheme
-
దివ్యాంగుల పింఛన్లలో కోత!
సాక్షి, అమరావతి: పింఛన్‌దారుల(pensioners) పట్ల చంద్రబాబు ప్రభుత్వం(chandrababu government) కనికరం చూపడంలేదు. సాధ్యమైనంత మంది లబ్ధిదారులకు పింఛను రద్దు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. దివ్యాంగులు, వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వారినీ వదలడంలేదు. అంగ వైకల్యం(Disabled), వివిధ రకాల వ్యాధులకు గురై పింఛన్లు పొందుతున్న మొత్తం 8,18,900 పింఛన్‌దారుల అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలన చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీరిలో పక్షవాతం, తీవ్ర కండరాల బలహీనత వంటి జబ్బులతో పింఛను పొందుతున్న 24,091 మందినీ పరీక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకు ఇచ్చన మార్గదర్శకాలూ కఠినంగా ఉన్నాయి.నిర్ణీత సమయానికి వారికి పరీక్ష జరగకపోతే పింఛను రద్దయినట్లే. పక్షవాతం, కండరాల వ్యాధులతో బాధ పడుతున్న వారిని వైద్య బృందాలు ఇంటికి వెళ్లి పరీక్షించాలని ఆదేశించింది. ప్రభుత్వ వైద్యులు ఇంటికి వచ్చిన సమయంలో వీరు అందుబాటులో లేకపోతే పింఛను రద్దయినట్లే. దివ్యాంగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 7.95 లక్షల మంది ప్రభుత్వం నిర్ణయించిన తేదీన వైద్యుల కమిటీల ముందు పునః పరీక్షలు చేయించుకోవాలని మార్గదర్శకాలలో పేర్కొంది. వీరు నిర్ణీత తేదీన వైద్యుల బృందం ముందు హాజరు కాకపోతే పింఛను నిలిపివేస్తారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మెమో జారీ చేశారు. నేటి నుంచే తొలి దశ పరీక్షలుతొలి దశలో శనివారం నుంచే పక్షవాతం, తీవ్ర కండరాల బలహీనత తరహా వ్యాధులతో బాధపడుతూ పింఛన్లు తీసుకుంటున్న 24,091 మందికి ఇంటింటికీ వెళ్లి అర్హత పరీక్షలు చేస్తారు. ఇందు కోసం 112 వైద్య బృందాలను నియమించారు. ప్రతి బృందంలో ఎముకల డాక్టర్, జనరల్ మెడిసిన్, లబ్ధిదారుని ఏరియా స్థానిక పీహెచ్సీ వైద్యుడు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. 88 రోజుల పాటు తొలి దశ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత మిగిలిన 7.95 లక్షలమంది దివ్యాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, ఇతర రోగాల కారణంగా పింఛన్ పొందుతున్న వారికి ప్రభుత్వాసుపత్రుల వద్ద కొత్తగా వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.పరీక్షల నిర్వహణకు కమిటీలు⇒ ఈ పరీక్షల నిర్వహణకు ప్రతి జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఆర్డీఏ పీడీ కన్వీనర్‌గా 11 మంది జిల్లా స్థాయి అ«ధికారులతో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జిల్లా కమిటీలు మండలాలు, మున్సిపాలిటీల వారీగా లబ్ధిదారుల వైద్య పరీక్షలకు షెడ్యూల్ రూపొందిస్తాయి.⇒ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని పింఛనుదారులకు ఏ తేదీలో పరీక్షలు చేయాలో నిర్ణయించి, ఆ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ముందుగా లబ్ధిదారులకు నోటీసులు అందజేస్తారు. వైద్య బృందం ఇంటికి వెళ్లినప్పుడు పక్షవాతం లేదా కండరాల వ్యాధితో పింఛను పొందుతున్న లబ్ధిదారు లేకపోతే పింఛను నిలిపివేస్తారు. అదేవిధంగా దివ్యాంగులు, ఇతర వ్యాధుల పింఛనుదారులు నిర్ణయించిన తేదీకి నిర్ణీత వైద్య బృందం ఎదుట హాజరు కాకపోయినా తని పింఛన్‌ను హోల్డ్‌లో పెట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.⇒ ఒక్కొ వైద్య బృందం రోజుకు 25 మంది పింఛనుదారులకు అర్హత– అనర్హతల పరిశీలనతో పాటు తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టారు. లబ్ధిదారునికి గతంలో పింఛను పొందేందుకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కాకుండా కొత్త వారి ద్వారా ఇప్పుడు పరీక్షలు చేస్తారు.⇒ఈ మొత్తం కార్యక్రమం పర్యవేక్షణకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తారు. వైద్య బృందాలు పరీక్షలు చేసే పింఛన్‌దారులపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. పునఃసమీక్షలో నిర్ధారించిన వాటిలో కనీసం 5 శాతం లబ్ధిదారులను కలెక్టర్లు సోషల్ ఆడిట్ చేయడానికి అదనంగా ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేస్తారు. -
పెన్షన్లు లాకుంటున్న రేవంత్ సర్కార్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
TG: 'ఆసరా' పక్కదారి..
సాక్షి, హైదరాబాద్: ఆపన్నులకు ఇచ్చే ఆసరాలోనూ దుర్వినియోగం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. సెర్ప్ తనిఖీల్లో బాగోతం వెలుగులోకి వచ్చింది. కొంతమంది ప్రభుత్వం ఉద్యోగులు, వారి కుటుంబీకులు.. రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు ఆపన్నులకు, అభాగ్యులకు, వృద్ధులకు అందించే ఆసరా పెన్షన్లను అందుకుంటున్నట్లు బయట పడింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5650 మంది అటు ఉద్యోగ పెన్షన్లతో పాటు.. ఆసరా పెన్షన్లు అందుకున్న జాబితాలో ఉన్నట్లు ఇటీవలి సెర్ప్ సర్వేలో వెల్లడైంది. వీరిలో 3824 మంది ఇప్పటికే చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మిగతా 1826 మంది ఇప్పటికీ రెండు పెన్షన్లు అందుకుంటున్నట్లు తేలింది. జూన్ నెల నుంచి వీరికి ఆసరా పెన్షన్‌ను ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే.. అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 427 మంది అక్రమంగా డబుల్ పెన్షన్లు అందుకుంటున్నారు.గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా వీరికి చెల్లించిన ప్రజాధనం భారీ ఎత్తున దుర్వినియోగమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్నేళ్లుగా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబీకులు... ఈ విధంగా డబుల్ పింఛన్లు అందుకున్నట్లు గత నెలలో నిర్వహించిన తనిఖీల్లోనే తేలిపోయింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే దాదాపు రూ.2.50 కోట్లు ఈ అక్రమంగా చెల్లించిన ఆసరా పెన్షన్లతో దుర్వినియోగమైనట్లు అక్కడి జిల్లా అధికారుల విచారణలో తేలింది.రాష్ట్రవ్యాప్తంగా తేలిన లెక్క ప్రకారం భారీ మొత్తంలోనే ప్రజాధనం పక్కదారి పట్టినట్లు అంచనా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వితంతువులు, ఒంటరి మహిశలు, వృద్ధులు,బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, వికలాంగులు, డయాలసిస్, ఫైలేరియా, ఎయిడ్స్ రోగులకు ఆసరా పథకం వర్తిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్లరేషన్ కార్డు ఉన్నవారు ఈ పెన్షన్ పొందేందుకు అర్హులు. గత ప్రభుత్వం ఆసరా పేరుతో పెన్షన్లు ఇవ్వగా కొత్త ప్రభుత్వం వీటిని ‘చేయూత’ పెన్షన్లుగా పేరు మార్చింది.మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని.. ఇదంతా అమానవీయమైన చర్య అని ట్వీట్ చేసిన వ్యవహారం కూడా ఈ అనర్హుల జాబితాలోనే ఉండటం గమనార్హం. దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఏఎన్ఎంగా పని చేసేది. 2010లో ఆమె మరణించింది. ఆమెకు పెళ్లి కాకపోవటంతో డిపెండెంట్‌గా ఉన్న తల్లి దాసరి మల్లమ్మకు రూ.24073 ఫ్యామిలీ పెన్షన్‌గా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆమెకు మరోవైపు ఆపన్నులకు అందే ఆసరా పెన్షన్ కూడా అందుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలింది. అందుకే జూన్ నెల నుంచి ఆసరా పెన్షన్ ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారు. అనర్హులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జాతీయ రహదారులు, రోడ్లకు కూడా రైతుబంధు చెల్లించి దాదాపు రూ.25,672 కోట్లు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. అదే తీరుగా ఆసరా పెన్షన్ల పేరిట భారీఎత్తున నిధులు పక్కదారి పట్టిన వ్యవహారం తాజా సంఘటనలో తేలిపోయింది. -
చేయూతనిచ్చాం.. ఆసరాగా నిలిచాం
రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ను ఇచ్చి ‘ఆసరా’గా నిలవడంతో పేద మహిళలు మహారాణులుగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. ‘ఒక సమాజం పురోగతిని.. ఆ సమాజంలోని మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను’ అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్న మాటలనే ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. ఇందుకు తగ్గట్టే రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న మహిళల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సామాజికంగా, ఆర్థికంగా వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా వారికి తోడ్పాటును అందిస్తోంది. – సాక్షి, అమరావతి మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. లక్షలాది మంది పేద కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి. ఈ మేరకు వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో చోటుచేసుకున్న మార్పులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన బడ్జెట్ ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. మహిళా సాధికారత కోసం.. రాష్ట్ర జనాభాలో సగం ఉన్న మహిళలు సంక్షేమం, సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వాములుగా చేయడంతో తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. దీనిద్వారా ఆర్థిక అడ్డంకులను అధిగమించి సాధికారతను సాధిస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్యం, రక్షణ, వారి సమగ్రాభివృద్ధికి సంబంధించి 2021–22 నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా జెండర్ – చైల్డ్ బేస్డ్ బడ్జెట్లను ప్రవేశపెడుతోంది. పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను అందించాం. దీనిద్వారా 43.61 లక్షల మంది మహిళలకు రూ.26,067 కోట్లు ఇచ్చాం. ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరింది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో చేరే విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019లో 87.80 శాతం ఉండగా 2023 నాటికి 98.73 శాతానికి పెరిగింది. అలాగే ఉన్నత, మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019లో 46.88 శాతం ఉండగా, 2023కి అది 79.69 శాతానికి చేరుకుంది. టీడీపీ ప్రభుత్వ వైఫల్యంతో అప్పుల ఊబిలోకి మహిళలు.. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మద్దతు ఇవ్వడంలో గత టీడీపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. దీంతో మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీ మేరకు 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాలకు ఉన్న రుణ బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేసింది. దీనికింద 2019 నుంచి రూ.25,571 కోట్లను తిరిగి చెల్లించింది. తద్వారా 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మందికి మేలు చేకూర్చింది. సున్నావడ్డీతో క్రియాశీలకంగా సంఘాలు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వయంసహాయక సంఘాలు మనుగడ కోల్పోయాయి. తిరిగి వీటిని క్రియాశీలకం చేయడానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మహిళలకు రూ.4,969 కోట్లను ప్రభుత్వం అందించింది. ఫలితంగా అప్పట్లో 18.63 శాతంగా ఉన్న మొండి బకాయిలు గణనీయంగా తగ్గిపోయాయి. దేశంలోనే అతి తక్కువ స్థాయి 0.17 శాతానికి చేరాయి. అలాగే వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు, వారి జీవనోపాధికి శాశ్వత భద్రత కల్పించేందుకు రూ.14,129 కోట్లను అందించాం. జగనన్న పాలవెల్లువ పథకం కింద 3.60 లక్షల మంది మహిళలు డెయిరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు రూ.2,697 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా మహిళలు, పిల్లలకు పటిష్ట భద్రతలో భాగంగా దిశ మొబైల్ యాప్, దిశ పెట్రోల్ వాహనాలు, 26 దిశ పోలీసుస్టేషన్లను ప్రారంభించాం. ఏకంగా కోటి మందికి పైగా మహిళలు దిశ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. -
నూతన సంవత్సరంలో పింఛన్ పెంపు మహోత్సవాలు..
అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, చేతి వృత్తిదారులకు ఇస్తున్న రూ.2,750 పింఛన్‌ను ఈ నెల నుంచి రూ.3వేలకు పెంచింది. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు అన్ని మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో పింఛన్ పెంపు మహోత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమి తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలన్నారు. జనవరి నెలకు సంబంధించి 2,93,493 మంది పింఛన్‌దారులకు రూ.87.92 కోట్లు విడుదలైందన్నారు. ఇందులో కొత్తగా మంజూరైన పింఛన్లు 5,234 ఉన్నాయన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో 2,31,513 మంది రూ.3వేల పింఛన్లు అందుకోనున్నారన్నారు. మండల, మున్సిపల్ కేంద్రాల్లో పింఛన్ పెంపు మహోత్సవాలు జరిగినప్పటి నుంచి పింఛన్ల పంపిణీ ఉంటుందన్నారు. ఈ మార్పును పింఛన్‌దారులు గమనించాలని కోరారు. ఈ నెల మూడో తేదీ అనంతపురం అర్బన్, గార్లదిన్నె, గుమ్మఘట్ట, గుంతకల్లు రూరల్, గుంతకల్లు అర్బన్, కళ్యాణదుర్గం రూరల్, కూడేరు, నార్పల, రాప్తాడు, రాయదుర్గం రూరల్, శింగన మల, తాడిపత్రి అర్బన్, తాడిపత్రి రూరల్‌లో పింఛన్ పెంపు మహోత్సవాలు జరుగుతాయన్నారు. 4న బెళుగుప్ప, అనంతపురం రూరల్, బొమ్మనహాళ్, బుక్కరాయసముద్రం, డి.హీరేహాళ్, గుత్తి రూరల్, గుత్తి అర్బన్, కళ్యాణదుర్గం అర్బన్, పెద్దపప్పూరు, 5న ఆత్మకూరు, కణేకల్లు, పామిడి రూరల్, పామిడి అర్బన్, పుట్లూరు, రాయదుర్గం అర్బన్, శెట్టూరు, ఉరవకొండ, యాడికి, యల్లనూరు, విడపనకల్లు, 6న వజ్రకరూరు, బ్రహ్మసముద్రం, పెద్దవడుగూరు, కుందుర్పి, కంబదూరులో పింఛన్ పెంపు మహోత్సవాలు నిర్వహిస్తారన్నారు. వలంటీర్లందరూ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారన్నారు. పంపిణీ సమయంలో ముఖ్యమంత్రి లేఖను పింఛన్‌దారులకు అందజేస్తారన్నారు. నూతన సంవత్సరంలో ‘సంక్షేమ’ జాతర నూతన సంవత్సరంలో ‘సంక్షేమ’ జాతర జరగనుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు పింఛన్ల పెంపు సహా మూడు ప్రధాన పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ‘ఆసరా’. ఈ నెల 23 నుంచి 31 వరకు ‘ఆసరా’ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పథకం కింద నాలుగో విడత ద్వారా జిల్లాలో 24,100 డ్వాక్రా సంఘాలకు రూ.183.59 కోట్ల లబ్ధి చేకూరనుంది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగో విడతలోనూ ఆర్థిక సాయం అందించేందుకు ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 1,18,881 మంది మహిళలకు రూ.35.96 కోట్లు అందజేయనున్నారు. ఇవి చదవండి: AP: బలంగా.. బడుగుల అడుగులు -
పింఛన్ పెంచుకుందాం: సీఎం కేసీఆర్
వాళ్లు అరచేతిలో వైకుంఠం చూపుతారు కాంగ్రెస్ ఒక్క అవకాశం ఇవ్వాలని ఇప్పుడు అడుగుతోంది. మొన్నటిదాకా 50ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేసింది? నాడు రైతులు చనిపోతున్నా పట్టించుకోలేదు. ఆపద్బంధు కింద రూ.50 వేలు ఇస్తామనీ సరిగా ఇవ్వలేదు. రూ.500 పెన్షన్ ఇవ్వలేదు. అలాంటి కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని అంటున్నారు. వారు అధికారంలో ఉన్న కర్ణాటకలో పెంచకుండా ఇక్కడ పెంచుతామని మాయ మాటలు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఆపద మొక్కులు మొక్కుతారు. అరచేతిలో వైకుంఠం చూపుతారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. మనం పెన్షన్ మొత్తాన్ని పెంచుకుందాం. ఎంతనేది త్వరలోనే ప్రకటిస్తా. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి నల్లగొండ/ సూర్యాపేట: రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని.. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గతంలో కంటే ఐదారు సీట్లు ఎక్కువే గెలుస్తామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరెవరో వస్తారని.. వారి మాయ మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఆగమవుతామని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. త్వరలోనే ఆసరా పింఛన్లు పెంచుకుందామని చెప్పారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, జిల్లా పోలీస్ కార్యాలయంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రగతి నివేదన సభలో మాట్లాడారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడలోని మోతె మండలం వరకు ఎలా వచ్చాయో మీకు తెలుసు. ఒకప్పుడు కరెంటు రాకపోతే, మోటార్లు కాలిపోతే రైతులు ఇబ్బందులు పడేవారు. వాటిని చూసి ఉద్యమ సమయంలో నేను కంటతడి పెట్టాను. ఇప్పుడు కాళేశ్వరం జలాలు వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఒకడు మోటార్లకు మీటర్లు పెట్టాలంటడు, మరొకడు 3 గంటలు కరెంటు చాలంటడు. కాంగ్రెస్ వాళ్లు కర్ణాటకలో కరెంటు సరిగా ఇవ్వక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మనం మళ్లీ అలా గోసపడదామా? లేదంటే 24 గంటల కరెంటు కావాలా? ఆలోచించాలి. ధరణి వద్దంటే దళారుల దందానే.. కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్లీ పైరవీకారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ధరణితోనే ఇప్పుడు రైతుబంధు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. ధాన్యం అమ్ముకున్నా ఖాతాలోనే సొమ్ము పడుతోంది. కాంగెస్ వస్తే రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలు ఉండవు. గతంలో పాస్బుక్ల విషయంలో ఎమ్మార్వో, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్, సీసీఎల్ఏ, మంత్రి ఇలా ఎవరు పడితే వారు పెత్తనం చేసేవారు. వీఆర్వోలు ఇష్టానుసారంగా పేర్లు మార్చేశారు. అందుకే ఆ వ్యవస్థను రద్దుచేశాం. దాని స్థానంలో ధరణిని తీసుకువచ్చాం. అధికారులకు ఉన్న పవర్‌ను ధరణితో రైతుల బొటనవేలికే ఇచ్చాం. రికార్డులను ఎవరూ మార్చలేరు. కాంగ్రెస్ ధరణిని తీసేస్తామంటోంది. మళ్లీ దళారుల దందా రావాలా? వాళ్లు నల్లగొండను పట్టించుకోలేదు కాంగ్రెస్ పాలనలో నల్లగొండ జిల్లాను పట్టించుకోలేదు. సూర్యాపేట ప్రజలకు మురుగునీటినే తాగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే మిషన్ భగీరథ ద్వారా రక్షిత తాగునీటిని అందిస్తున్నాం. నల్లగొండ జిల్లా అభివృద్ధికి కావాల్సినన్ని ని«ధులు ఇచ్చాం. మంత్రి జగదీశ్‌రెడ్డి కొట్లాడి మరీ నల్లగొండ జిల్లాకు విద్యుత్ ప్లాంట్ సాధించారు. రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్న దానిని త్వరలోనే ప్రారంభించుకుంటాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించాలి. బీసీలందరికీ ఆర్థిక సాయం బీసీలందరికి ఆర్థిక సాయం అందుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరూ అనుమానం పెట్టుకోవద్దు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్న వారంతా ఇప్పుడు గ్రామాలకు వచ్చి, పనులు చేసుకుంటున్నారు. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం. ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలి. సూర్యాపేటకు సీఎం వరాలు సూర్యాపేట జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల చొప్పున.. సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, జిల్లాలోని మిగతా నాలుగు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నాం. కళాభారతి నిర్మాణానికి రూ.25 కోట్లు ఇస్తాం. స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కోసం జీవో జారీ చేస్తాం. అతిథి గృహం మంజూరు చేస్తాం. రూ.37 వేల కోట్లు రుణామాఫీ చేశాం కరోనాతో రుణమాఫీ విషయంలో కొంత ఆలస్యమైంది. ఇప్పుడు రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేశాం. దేశంలో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడిప్పుడే రైతులు ఒకరి వద్ద చేయి చాచకుండా బతుకున్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఖమ్మంలో సీతారామ వంటి ప్రాజెక్టులతో దిగుబడి 4 కోట్ల టన్నులకు పెరుగుతుంది. దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచాం తెలంగాణ ఏర్పాటయ్యాక అద్భుత పనితీరుతో మానవాభివృద్ధి, తలసరి ఆదాయంలో దేశంలోనే టాప్‌లో నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట కొత్త కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ప్రారంభించుకుంటున్నామని.. కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ, సెక్రటేరియేట్లు కూడా ఈ స్థాయిలో లేవని కేసీఆర్ చెప్పారు. సూర్యాపేటలో సీఎం కార్యక్రమాల్లో మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సర్కారును నడిపడమంటే.. సంసారం నడిపించినట్టే.. సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఛలోక్తులతో సాగింది. ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తావిస్తూ. ‘‘సర్కారు నడిపించాలంటే.. సంసారం నడిపించినట్టే..’’ అని కేసీఆర్ పేర్కొనడంతో సభలో నవ్వులు విరిశాయి. తర్వాత ‘‘60 ఏళ్ల నుంచి రూ.200 పింఛన్ ఇవ్వలేని కాంగ్రెస్ వాళ్లు ఇవాళ రూ.4వేలు ఇస్తరట.. అంటే నేను రూ.5వేలు ఇవ్వాలా? ఇదేమన్నా వేలం పాటనా?’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగంలో సూర్యాపేటలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎంను కోరారు. తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘జగదీశ్‌రెడ్డి ఇంత హుషారని అనుకోలేదు. మనకు అన్ని ఇచ్చారు, సూర్యాపేట జిల్లా కూడా ఇచ్చారు. అన్నీ అయిపోయాయి. సభకు వచ్చిపోతే చాలు. ఏమీ అడగనని అక్కడ చెప్పిండు. ఇప్పుడు అవికావాలి, ఇవి కావాలి అని అందరి ముందూ అడుగుతున్నారు..’’ అని పేర్కొన్నారు. -
దివ్యాంగులకు దిగులులేని మరింత దివ్యమైన ‘ఆసరా’
నెక్కొండ: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దివ్యాంగులకు అందించే ఆసరా పింఛన్‌ను అదనంగా రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రూ.3,016 ఇస్తుండగా రూ. వెయ్యి పెంపుతో రూ.4,016 అందుకోనున్నారు. తాజా నిర్ణయంతో జిల్లాలోని 15,585 మందికి లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా ప్రభుత్వం వివిధ రూపాల్లో వారికి అండగా నిలుస్తోంది. దివ్యాంగులకు నెలనెలా పింఛన్లతోపాటు ఉపకరణాలు, వాహనాలు, ఇతర పథకాలను అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, బోదకాలు, డయాలసిస్ రోగులు మొత్తం 1,27,089 మంది ప్రతి నెలా ఆసరా పింఛన్లు పొందుతున్నారు. 13 మండలాలు.. 15,585 మంది లబ్ధిదారులు సీఎం ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా 13 మండలాల పరిధిలోని మొత్తం 15,585 మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు. వీరికి ప్రతి నెలా రూ.47 కోట్లను ఆసరా పింఛన్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తాజా పెంపుతో అదనంగా రూ.1.55 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. మరీ ముఖ్యంగా దివ్యాంగులు ఎలాంటి పని చేయలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో పింఛన్ పెంపుతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్వులు రాగానే పంపిణీ.. జిల్లాలోని 13 మండలాల పరిధిలో మొత్తం 15,585 మంది దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం వీరికి రూ. 3,016 చొప్పున పింఛన్ అందిస్తోంది. సీఎం ప్రకటనతో వీరికి అదనంగా రూ.1000 కలిపి రూ.4,016 పింఛన్ అందనుంది. ఉత్తర్వులు రాగానే పంపిణీ చేస్తాం. పోరాడి సాధించుకున్నాం.. సంఘటితంగా దివ్యాంగులు చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వం పింఛన్‌ను పెంచింది. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పింఛన్ పెంచాలని సంఘం తరఫున ఉద్యమించాం. దాని ఫలితంగా రాష్ట్రంలో రూ.4,016 అందుకోనుండడం సంతోషంగా ఉంది. జిల్లాలో ఇంకా అర్హులైన దివ్యాంగులు ఉన్నారని, వారందరికీ ధ్రువపత్రాలు జారీ చేసి పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి. రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం. వచ్చే నెలలో అమలు చేస్తామని చెప్పడం హర్షణీయం. –కృష్ణమూర్తి, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు, నెక్కొండ -
పెన్షన్.. పరేషాన్! నగదు జమ కాక లబ్ధిదారుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్లకు తిప్పలు తప్పడం లేదు. తాజాగా బ్యాంక్ ఖాతాలకు కేవైసీ ప్రక్రియ చిక్కుముడిగా తయారైంది. బ్యాంకు ఖాతాల ద్వారా కొంత కాలంగా ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో రెండు, మూడు నెలలుగా పింఛన్ సొమ్ము జమకాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆధార్ అప్డేట్ సమస్య కూడా వెంటాడుతోంది. లబ్ధిదారులు తహసీల్ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమస్యకు సరైన సమాధానం లభించని పరిస్థితి నెలకొంది. దీంతో పేదలు పింఛన్ల కోసం ఆందోళన చెందుతున్నారు. కార్డుల పంపిణీలో నిర్లక్ష్యమే ఆసరా పింఛన్ గుర్తింపు కార్డుల పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. ఇటీవల కొత్తగా పింఛన్లు మంజూరైన వారిలో పాటు పాత లబ్ధిదారులకు సైతం ప్రభుత్వం ఆసరా గుర్తింపు కార్డులను ముద్రించింది. లబి్ధదారులు ఇళ్లు మారడంతో పాటు పంపిణీకి చిరునామా సమస్య తలెత్తింది. దీంతో సగానికి పైగా కార్డులు తహసీల్దార్ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. కనీసం వార్డుల సమావేశాలు నిర్వహించి పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కేవలం ఎమ్మెల్యేల ద్వారా కొన్ని కార్డులు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇటీవల 65 ఏళ్ల వృద్ధులతో పాటు 57 ఏళ్లు నిండిన వారికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు గతేడాది మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకున్న అర్హులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తోంది. బ్యాంక్ ఖాతాకు కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ప్రధాన సమస్యగా పరిణమించింది. చదవండి: Revanth Reddy: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
బయోమెట్రిక్ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు
సాక్షి, వెల్గటూర్(ధర్మపురి): వృద్ధాప్యంలో ఆసరా ఉంటుందని రాష్ట్రప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తోంది. అయితే, కొందరు అక్రమార్కులు వీటిని కాజేస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల కొన్ని ఇలాంటివి వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా వెల్గటూర్ మండలంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియలో చాలా మోసాలు జరుగుతున్నట్లు వృద్ధులు, నిరక్షరాస్యులు ఆవేదన చెందుతున్నారు. బయోమెట్రిక్ పరికరంలో పింఛన్‌దారుల వేలుముద్రలు తీసుకుని తమ బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమచేసుకుంటున్నారు. వేలుముద్రలు రావడం లేదని పింఛన్‌దారులను ఇళ్లకు పంపిస్తున్నారు. కొందరు అనుమానంతో బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయిస్తే.. అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో అక్రమార్కులను నిలదీస్తే.. ఏవేవో మాయమాటలు చెబుతూ.. పింఛన్‌దారుల డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు. మండల కేంద్రంతోపాటు స్తంభంపల్లి అనుబంధ కొత్తపల్లిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. (చదవండి: స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. కూతురి పెళ్లిరోజే రాష్ట్రస్థాయి పదవి) -
Telangana: ఆసరా ఆలస్యం.. కొన్ని జిల్లాల్లో రెండు మూడు నెలలు కూడా!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఆసరా ఆలస్యమవుతోంది. పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ప్రతినెలా మొదట్లోనే అందాల్సిన సొమ్ము కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్ని జిల్లాల్లో రెండు మూడు నెలలు ఆలస్యంగా పింఛన్ డబ్బులు ఇస్తుంటే.. మరికొన్ని చోట్ల మరింత ఆలస్యంగా చెల్లింపులు జరుగుతున్నాయి. దీనితో పింఛన్‌పై ఆధారపడి బతుకీడుస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు. మందులు, ఇతర నెలవారీ అవసరాలు తీరక అవస్థల పాలవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లబ్ధిదారుల్లో కొందరికి పోస్టాఫీస్ ద్వారా, మరికొందరికి బ్యాంక్ అకౌంట్ల ద్వారా పింఛన్ సొమ్ము అందుతుంది. దీనితో పలు ప్రాంతాల్లో వృద్ధులు పింఛన్ సొమ్ము జమ అయిందో, లేదో తెలుసుకునేందుకు పోస్టాఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా మంజూరు చేసినా.. రాష్ట్రంలో ఆసరా పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ, ఫైలేరియా బాధితులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికుల కేటగిరీల్లో మొత్తంగా 35,95,675 మందికి పింఛన్లు అందేవి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా మరింత మందికి పింఛన్లు మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్ వయసును 57 ఏళ్లకు తగ్గించడంతో మరో 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పటికే వివిధ కేటగిరీల పింఛన్ కోసం వచ్చిన మరో 3 లక్షల దరఖాస్తులు కలిపి.. మొత్తంగా 14 లక్షల దరఖాస్తులు అయ్యాయి. ఇందులో ప్రభుత్వం ఇటీవల కొత్తగా 9.38 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసింది. దీనితో మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య అక్టోబర్ చివరినాటికి 44,14,915 మందికి చేరింది. మరో 4.6 లక్షల మంది పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. అందక.. మంజూరుగాక.. తెలంగాణ ఏర్పడే నాటికి నెలకు రూ.200గా ఉన్న పింఛన్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు రూ.3,016కు.. వృద్ధులు, వితంతువులు ఇతర కేటగిరీల్లో రూ.2,016కు పెంచింది. దీనితో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపశమనం కలిగింది. నెలవారీ మందులు, నిత్యావసరాలకు కష్టం తీరింది. కానీ ఇటీవల ఆసరా పింఛన్ల సొమ్ము అందడంలో జాప్యం జరుగుతుండటంతో ఇబ్బంది మొదలైంది. వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించినా.. ఆ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నవారిలో కొన్ని లక్షల మందికి ఇంకా మంజూరు కాలేదు. మంజూరు అయినవారిలోనూ కొందరికి పింఛన్ సొమ్ము అందడం లేదని వాపోతున్నారు. వృద్ధుల వేలిముద్రలు అరిగిపోవడం, బ్యాంకు ఖాతాల్లో మార్పులు, ఆధార్‌తో అనుసంధానం వంటి సమస్యలతోనూ పింఛన్లు సరిగా అందని పరిస్థితి నెలకొంది. ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యం, ఇతర అంశాలపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ సమస్యలను గుర్తించింది. పలు జిల్లాల్లో సమస్యలివీ.. ► సూర్యాపేట జిల్లాలో గత ఐదు నెలలుగా 25వ తేదీ తర్వా పింఛన్ల సొమ్ము అందుతోంది. అక్టోబర్ పింఛన్ సొమ్ము ఇప్పటికీ అందలేదని లబ్ధిదారులు చెప్తున్నారు. 57 ఏళ్లు దాటినవారి వృద్ధాప్య పింఛన్ల కోసం 30వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. కొత్తగా మంజూరైన వారిలోనూ కొందరికి సొమ్ము రావడం లేదు. ► కరీంనగర్ జిల్లాలో కొత్తగా పింఛన్ మంజూరైన వారిలో 4 వేల మంది వరకు ఇంకా సొమ్ము అందడం లేదు. ఇదేమిటంటే వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, మీసేవ వాళ్లు తప్పుగా నమోదు చేశారని చెప్తూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4,61,988 మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. కొత్తగా వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో వేల మంది ఇంకా మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. మంజూరైన పింఛన్లలోనూ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్, ఇతర సమస్యలతో కొందరిని పింఛన్ సొమ్ము అందడం లేదు. ఇక భార్యాభర్త ఇద్దరికీ పెన్షన్ ఉండటం, సొంత ఇళ్లు, వాహనాలు ఉండటం వంటి కారణాలతో కొందరి పింఛన్లను తొలగించారు. ► ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పింఛన్ సొమ్ము ఆలస్యంగా అందుతోందని లబ్ధిదారులు చెప్తున్నారు. అర్హత ఉన్నా తమకు మంజూరుకావడం లేదని వాపోతున్నవారు వేలలో ఉన్నారు. గోస పడుతున్నం ఈమె పేరు భూతం రాములమ్మ. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కోటపహాడ్ గ్రామం. వయసు 85ఏళ్లు. భర్త, పిల్లలు ఎవరూ లేరు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆసరా పింఛనే దిక్కు. ఈ సొమ్ము నెల నెలా సమయానికి అందడం లేదని, ఖర్చుల కోసం ఇబ్బంది అవుతోందని ఆమె వాపోతోంది. ప్రతీ నెల మొదటివారంలో పింఛన్ పంపిణీ చేయాలని కోరుతోంది. మంజూరై రెండు నెలలైనా.. ఈ వ్యక్తి పేరు సంక రాజేందర్. జగిత్యాల జిల్లా సిరికొండ గ్రామం. కిడ్నీ వ్యాధి బాధితుడు. రెండు నెలల కింద డయాలసిస్ కేటగిరీలో పింఛన్ మంజూరైంది. గుర్తింపు కార్డు సైతం ఇచ్చారు. కానీ ఇప్పటివరకు పింఛన్ డబ్బులు రావడం లేదని వాపోతున్నాడు. -
డయాలసిస్ రోగులందరికీ పింఛన్లు ఇస్తున్నాం
సాక్షి, హైదరాబాద్/వెంగళరావునగర్: రాష్ట్రంలోని ప్రతి డయాలసిస్ రోగికి ఎలాంటి నిబంధనలు లేకుండా ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 వేల మంది డయాలసిస్ రోగులున్నారని, వారిలో 10 వేల మంది ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లోనే ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నారని తెలిపారు. వివిధ కేటగిరీల్లో అందిస్తున్న సామాజిక పింఛన్ల పరిధిలోకి రాని 5 వేల మంది డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్ల కింద ప్రతి నెలా రూ. 2,016 అందిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ)లో డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్ కార్డులను మంత్రి హరీశ్‌రావు అందించారు. ఆసరా పింఛన్ అందని డయాలసిస్ రోగులు అధికారులను సంప్రదిస్తే పింఛన్లు మంజూరు చేస్తారన్నారు. రాష్ట్రంలో 102 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఇప్పటికే 83 కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామని.. అతిత్వరలో మిగతా చోట్ల కూడా డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెస్తామని వివరించారు. కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలతోపాటు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, జీవితకాలం ఉచితంగా మందులు, ఉచిత బస్‌పాస్‌లు మొదలైనవి ప్రభుత్వం అందిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సింగిల్ యూజ్ సిస్టమ్‌తో డయాలసిస్ పరీక్షలను రాష్ట్రంలో ప్రవేశపెట్టినట్టు మంత్రి హరీశ్‌రావు వివరించారు. గతంలో ఒక ఫిల్టర్‌ను ముగ్గురు, నలుగురికి వాడితే ఇన్ఫెక్షన్లు వచ్చేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. మానసిక ఆందోళనలను దూరం చేసేలా... అనంతరం టెలి మెంటల్ హెల్త్ సర్వీసుల (టెలి–మానస్) కాల్‌సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవనశైలి మార్పుల వల్ల చాలా మందిలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని... వాటిని అరికట్టే చర్యల్లో భాగంగా టెలి–మానస్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్న వారు 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఉచితంగా వైద్య సలహాలు పొందొచ్చన్నారు. అలాగే అవసరమైతే వారికి సంబంధిత ఆస్పత్రులకు రెఫర్ చేస్తామని చెప్పారు. ఈ కేంద్రంలో 25 మంది సైకాలజిస్ట్‌లు, కౌన్సిలర్లు పనిచేస్తున్నారని, వారికి ప్రత్యేకంగా బెంగళూరులో శిక్షణ సైతం ఇప్పించినట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. -
Aasara Pension: అందని ఆసరా గుర్తింపు కార్డులు..!
ముషీరాబాద్ భోలక్‌పుర్‌కు చెందిన మహిళకు వితంతు పింఛన్ మంజూరైంది. కొత్తగా పింఛను మంజూరు కావడంతో గుర్తింపు కార్డు కోసం తహాసిల్ ఆఫీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఆశ్రయించింది. ఫించన్ మంజూరైంది కానీ.. కార్డు రాలేదంటూ నాలుగైదు రోజులుగా సమాధానం చెబుతూ వచ్చి... చివరకు కార్డు వచ్చింది... ఒంటరిగా రా ఇస్తానని చెబుతున్నాడని ఆరోపిసూ సదరు మహిళ కుటుంబ సభ్యులు, బస్తీ వాసులతో కలిసి తహసీల్దార్ సమక్షంలోనే సదరు సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సాక్షి, హైదరాబాద్: కొత్త ఆసరా ఫించన్‌దారులకు గుర్తింపు కార్డులు అందని ద్రాక్షగా తయారయ్యాయి. ఆసరా పింఛన్లు మంజూరైనా..గుర్తింపు కార్డులు పంపిణీ నత్తలకు నడకనేర్పిస్తోంది. గత నెలలో నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల చేతులు మీదుగా ఫించను గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టినా... కనీసం 30 శాతం పూర్తి కాలేదు. కొందరికి కార్డు దక్కి మిగతా వారికి పంపిణీ కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో లబ్ధిదారులు తహాసిల్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ సంబంధిత సిబ్బందిచే ఛీత్కారాలు, వేధింపులకు గురవుతున్నారు. మహిళలకు వేధింపులే... ఆసరా పించన్ల విషయంలో వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఒక వైపు సిబ్బంది, మరోవైపు దళారులు మహిళల పేదరికం, అవసరాన్ని ఆసరా చేసుకొని వివిధ రకాలుగా వేధించడం పరిపాటిగా తయారైంది. గుర్తింపు కార్డులు అందని వారు తమకు ఫించన్ మంజూరు కాలేదన్న భయం... కొందరు సిబ్బంది.. దళారులకు కలిసి వచ్చే అవకాశంగా తయారైంది. తాము సహకరస్తామంటూ తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. కార్డుల పంపిణీ అంతంతే.. సరిగ్గా మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఆఫ్‌లైన్ ఆసరా దరఖాస్తులకు, ఏడాది అనంతరం ఆన్లైన్ ఆసరా దరఖాస్తులకు మోక్షం లబించి కొత్త పింఛన్లు మంజూరైనా గుర్తింపు కార్డుల పంపిణీ అంతంత మాత్రంగా తయారైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం మీద సుమారు 80,824 మంది ఆసరా పింఛన్లు మంజూరైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 58,066 మంది వద్దులకు, 15,210 మంది వితంతులకు, 3,265 మంది వికలాంగులకు, 2,197 ఒంటరి మహిళలకు, ఇద్దరు బీడీ కార్మికులకు, 1,194 మంది కళాకారులకు, 892 యాలసిస్ బాధితులకు, ఆరుగురు ఫైలేరియా, ఇద్దరు చేనేత కార్మికులను అసరా పింఛన్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీ కింద 1.96 లక్షల మంది సరా పింఛన్లు పొందుతున్నారు. (క్లిక్ చేయండి: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్‌కు..!) -
ట్రాన్స్జెండర్లకు ‘ఆసరా’ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులందకీ ఇస్తున్నట్లే ట్రాన్స్జెండర్లకు కూడా ఆసరా పింఛన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ మేరకు జీవో నంబర్ 17లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. ట్రాన్స్జెండర్లకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ట్రాన్స్జెండర్లకు ఉచిత బియ్యం, ఉచిత కోవిడ్ వ్యాక్సినేషన్ లాంటి సౌకర్యాలు అందడం లేదని.. వారికి కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి పథకాలు అందేలా చూడాలని కోరుతూ.. వైజయంతి వసంత మోగ్లీ అలియాస్ ఎం.విజయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్ సహా వైద్యారోగ్య, సివిల్ సప్లయ్, హోం, ఆర్థిక, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది జైనాబ్ వాదనలు వినిపించారు. ట్రాన్స్జెండర్లకు ఆధార్ సహా ఇతర గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సర్వే ప్రకారం రాష్ట్రంలో 58,000 మంది ట్రాన్స్జెండర్లు ఉండగా, 12,000 మందికే కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశారని చెప్పారు. కర్ణాటక, ఏపీ లాంటి రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని... రాష్ట్రంలోనూ వారి కోసం పథకాలు అమలు చేసేలా చూడాలన్నారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది రాధివ్‌రెడ్డి వాదిస్తూ ట్రాన్స్జెండర్లు ఉన్న ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్ చేపట్టామని చెప్పారు. పిటిషన్ వేసే నాటికి 12,000 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినా.. ప్రస్తుతం దాదాపు అందరికీ పూర్తయిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ట్రాన్స్జెండర్లకు అసరా వర్తింజేయాలంటూ విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది. -
ఆసరా కోసం వెళ్తే చనిపోయావన్నారు!
ఆసరా పెన్షన్ కోసం ఓ వ్యక్తి ఏడాది క్రితం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో ఆ వ్యక్తి గురువారం తన దరఖాస్తును పరిశీలింగా చనిపోయినట్లు చూపడంతో ఒక్కసారిగా కంగుతున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో జరిగింది. తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన పాతనబోయిన పుల్లయ్య చనిపోయినట్లు చూపడంతో గత ఏడాది గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేశాడు. కానీ ఆన్లైన్లో పుల్లయ్య చనిపోయినట్లు చూపిస్తోంది. బతికి ఉన్న తనను ఏకంగా రికార్డుల్లో తప్పుగా నమోదు చేíసి చంపేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. –తిరుమలగిరి (నాగార్జునసాగర్) -
హైదరాబాద్‌లో భారీగా కొత్త ఆసరా పింఛన్లు.. ఎంత మందికి అంటే?
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో కొత్తగా లక్షన్నర మందికి ఆసరా పింఛన్ల లబ్ధి చేకూరనుంది. పాత పెండింగ్ దరఖాస్తులకు మోక్షం లభించింది. ఇప్పటికే తుది జాబితా సిద్ధంగా ఉండటంతో కొత్త పింఛన్ల మంజూరుకు మార్గం సుగమమైంది. పంద్రాగస్టు తర్వాత కొత్త పింఛన్లు అందనున్నాయి. వాస్తవంగా గత మూడేళ్లుగా ఆసరా కొత్త పింఛన్ల ఊసే లేకుండా పోయింది. ఆసరా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ వచ్చింది. దరఖాస్తులపై ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి విచారణ పూర్తయి అర్హులను గుర్తించినా... . మంజూరు మాత్రం పెండింగ్‌లో పడిపోతూ వచ్చింది. ప్రభుత్వం నంచి గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో కొత్త పింఛన్లకు మోక్షం లభించలేదు. తాజాగా ముఖ్యమంత్రి ప్రకటనతో ఆసరా పెండింగ్ ప్రతిపాధనలకు కదలిక వచ్చినట్లయింది. దీంతో వితంతు,వికలాంగుల, ఒంటరి మహిళాలతోపాటు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు పింఛన్లు మంజూరు కానున్నాయి. ఇప్పటికే సెర్ప్ వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వ ఆదేశాలతో వాటికి మోక్షం లభించినట్లయింది. (చదవండి: 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. రోడ్డుకు నోచుకోని తండాలు) మరో లక్షన్నర సడలింపు దరఖాస్తులు వయస్సు సడలింపు దరఖాస్తులు సుమారు లక్షన్నర పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం వయస్సు సడలింపుతో అర్హులైన వారి నుంచి మీ సేవా ఆన్లైన్ ద్వారా ఆగస్టులో పక్షం రోజులు, ఆ తర్వాత సెప్టెంబర్‌లో పక్షం రోజులు దరఖాస్తులు స్వీకరించారు. బోగస్ దరఖాస్తులకు రాకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో దరఖాస్తుదారులు వ్యక్తిగతంగా మీ సేవా కేంద్రాలకు వెళ్లి పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. కాగా, వాటిపై ఇప్పటి వరకు సరైన ఆదేశాలు లేక కనీసం క్షేత్ర స్థాయి విచారణ లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం పెండింగ్‌లో పడిపోయాయి. (చదవండి: కేంద్రం ఇచ్చింది 3శాతం కంటే తక్కువే..) -
మూడు వారాలు గడిచినా అందని ‘ఆసరా’.. ఇక కొత్త పింఛన్లు వచ్చేదెప్పుడో?
ఈమె పేరు నర్సమ్మ. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మున్సి పాలిటీలో విలీనమైన తుప త్రాల్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ఆసరా పింఛనే ఆధారం. భర్త ఇదివరకే మృతిచెందగా ఇద్దరు కుమారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ప్రతినెలా ఆలస్యంగా వస్తున్న పింఛన్ వల్ల కాళ్ల నొప్పుల మందులు కొనుక్కోనేందుకు ఇబ్బంది పడుతోంది. గత నెల 22న పింఛన్ రాగా ఈ నెల ఇప్పటివరకు రాలేదని చెప్పింది. పింఛన్ పడిందేమోనని ఇప్పటికే నాలుగుసార్లు 4 కి.మీ. దూరంలోని అయిజ బ్యాంకుకు వెళ్లానని.. ప్రతిసారీ భోజనానికి రూ.50, చార్జీలు రూ. 20 అవుతున్నాయని తెలిపింది. ఈ గిరిజన మహిళ పేరు బుడ్డమ్మ. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పెద్దతండా గ్రామంలో నివసిస్తోంది. ఉన్న ఒక్క కొడుకు, కోడలు బతుకుదెరువుకు హైదరాబాద్ వలస వెళ్లారు. భర్త కాలం చేయగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ఉన్న పొలం ముంపునకు గురైంది. ఉన్న కొద్దిపాటి పొలం చూసుకుంటూ జీవిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛనే ఆమెకు అండగా మారింది. కానీ గత కొన్ని నెలలుగా పింఛన్ సకాలంలో అందక ఇబ్బంది పడుతోంది. పింఛన్ కోసం గ్రామ పంచాయతీకి రోజూ వెళ్లి వాకబు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇది ఒకరిద్దరి వ్యథ మాత్రమే కాదు... రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పింఛన్ లబ్ధిదారులందరి దీన గాథ ఇదే. ఆసరా లేని పేదలకు సాయం అందించి ఆదుకోవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలనెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. అయితే కొంతకాలంగా ప్రతి నెలా పింఛన్ డబ్బు లు సకాలంలో అందక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు మరికొన్ని వర్గాల లబ్ధిదారులు ఇబ్బం దులు పడుతున్నారు. 2–3 నెలల నుంచి మరీ ఆలస్యం.. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, ది వ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, బీడీ వర్కర్లు, ఫైలేరియా బాధితు లు సుమారు 38.75 లక్షల మందికి నెలనెలా ఆస రా పింఛన్లు అందుతున్నాయి. గతంలో వీరికి ప్రతి నెలా మొదటి వారంలోనే పింఛన్ డబ్బులు అందేవి. కరోనా కాలంలో అంటే 2020 నుంచి పెన్షన్ పంపిణీలో జాప్యం చోటుచేసుకుంది. 2021లో ఆర్థిక వ్యవస్థ గాడి న పడిన తర్వాత పెద్దగా ఆలస్యం జరగలేదు. కానీ ఇటీవల 2–3 నెలల నుంచి పింఛన్ డబ్బులు 20వ తేదీ తర్వాతే బ్యాంకులు, పోస్టాఫీసు ఖాతాల్లో జమ వుతున్నాయి. గత నెలలో 25 తర్వాతే డబ్బులు జమవగా వరుస సెలవుతో 28వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందాయి. ఈ నెలలో ఇప్పటి వరకూ డబ్బులు ఖాతాల్లో జమకాకపోవడంతో పింఛ న్‌దారులు ఆందోళనలో కొట్టుమిట్టాడు తు న్నారు. పోస్టాఫీసులు, మండల కేంద్రాల్లోని బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంకా నెరవేరని ‘కుదింపు’ హామీ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు కనీస వయసు పరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు కుదించింది. 2018లో ఎన్నికల సమయంలో వృద్ధులకు ఈ మేరకు అధికార టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో సైతం పెట్టింది. ఈ మేరకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించినా కార్యరూపం దాల్చలేదు. మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆసరా పింఛన్లకు రూ. 11,728 కోట్లు కేటాయిస్తున్నామని.. కుదించిన వయసు మేరకు లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అయినా ఇప్పటివరకు పురోగతి లేదు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది కొత్త పింఛన్లు ఎప్పుడొస్తాయా అని మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కొడుకులు పట్టించుకోవట్లేదు.. నాకు బీపీ, షుగర్ ఇతర మందులకు నెలకు రూ. 1,500 వరకు ఖర్చవుతుంది. పింఛన్ వస్తదని నా కొడుకులు పట్టించుకోవట్లేదు. కానీ 3 నెలలుగా ఆలస్యంగా వస్తుండటంతో ఇబ్బంది పడుతున్నా. – పోచయ్య, వృద్ధుడు, జంగరాయి, చిన్నశంకరంపేట, మెదక్ ముసలోళ్లమని ఎవరూ చేబదులివ్వట్లేదు గత రెండు నెలలుగా ఆలస్యంగా పింఛన్ రావడంతో సకాలంలో మందులు కొనుక్కోలేకపోతున్నా. ఈ నెల ఇప్పటివరకు పింఛన్ రాలేదు. ఎవరినైనా డబ్బులు బదులు అడిగితే ముసలోళ్లమని ఇవ్వట్లేదు. – నాగవ్వ, వృద్ధ్యాప్య పింఛన్ లబ్ధిదారురాలు, బాల్కొండ, నిజామాబాద్ -
అంగన్వాడీ ఆయా ప్రభుత్వ నౌకరా!.. ఎమ్మెల్యేను ప్రశ్నించిన వృద్ధురాలు
సాక్షి, కామారెడ్డి: తాను రూ. 3వేల జీతంతో అంగన్వాడీ ఆయాగా పనిచేసి ఐదేళ్ల క్రితం రిటైర్ అయితే రూ. 30వేలు ఇచ్చారని, ఇప్పుడు ఆయా పని లేక, వృద్ధాప్య పింఛన్ రాక ఎలా బతకాలని రామారెడ్డికి చెందిన 75ఏళ్ల వృద్ధురాలు దుడుక సత్తవ్వ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ను ప్రశ్నిచింది. ఆదివారం రామారెడ్డి పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన సత్తవ్వ తనకు పింఛన్ ఇవ్వాలని కోరింది. తనతో పాటు మరో 8 మంది వృద్ధులు ఆయాలుగా పనిచేసి రిటైర్ అయినా పింఛన్ల రావడం లేదని చెప్పింది. తమకు అంగన్వాడీ నుంచి ఎలాంటి పింఛన్లు ఇవ్వనప్పుడు ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించింది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
రేపటి నుంచి ఆసరా పింఛన్లకు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ‘57 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ల’కు సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు అన్ని ‘మీ’సేవా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు. వృద్ధాప్య పించన్ల వయసును 57ఏళ్లకు తగ్గించినా చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారని పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అర్హులైన వారందరికీ ఈ పింఛన్లు అందుతాయని సీఎం వారికి హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో శనివారం సమీక్ష నిర్వహించిన సీఎస్... దరఖాస్తు తేదీలను పొడిగించాలని సంబంధిత అధికారులైన పీఆర్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీఎస్టీఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వర్‌రావులను ఆదేశించారు. -
మూడు వారాలు గడిచినా అందని ‘ఆసరా’
సాక్షి, నెట్వర్క్: ఈ నెల ‘ఆసరా’ లేక పింఛన్‌దారులు ఆగమాగమవుతున్నారు. పింఛన్ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయంలో ఉన్నారు. మందులు కొనలేకపోతున్నారు. నిత్యవసరాలు సమకూర్చుకోలేకపోతున్నారు. ప్రతినెలా మొదటి వారంలోనే చేతికందే ‘ఆసరా’పెన్షన్ ఈ సారి మూడు వారాలు గడిచినా ఇంకా జాడలేదు. గతంలో ఎప్పుడూలేని రీతిలో ఈసారి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ డబ్బులు వస్తాయన్న ధీమాతో కొడుకులు, కూతుళ్లకు దూరంగా ఉంటున్న వృద్ధులు, వితంతువులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజూ పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే తాము ఫైనాన్స్ విభాగానికి నివేదించామని, వారు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. ఎదురుచూపుల్లో 38 లక్షల మంది... ఆసరా పింఛన్ కింద ప్రతి నెలా ఆయా వర్గాలకు ప్రభుత్వం 2,016 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఆగస్టు నెల కింద అందాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 38 లక్షల 71 వేల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వీవర్స్, హెచ్ఐవీ బాధితులు, బోదకాలు బాధితులు ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అయినవారికి దూరంగా ఉంటున్నవారే. ఇంకా పలువురు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చూస్తున్న వారూ ఉన్నారు. మస్తు ఇబ్బంది అవుతోంది చిల్లర ఖర్సులకు మస్తు ఇబ్బంది పడుతున్న. రోజూ పోస్ట్ ఆఫీస్‌కు వచ్చి పోతున్న. ఇప్పుడు, అప్పుడు అంటున్నరు. ఎప్పుడు ఇస్తారో ఏమో. మస్తు ఇబ్బంది అవుతుంది. – అమ్రు, హజీపూర్, కామారెడ్డి జిల్లా పింఛన్ రాక మస్తు ఇబ్బంది పడుతున్నాం. ఆఫీసర్లను అడిగితే రేపు మాపంటున్నరు. ఇంతకు ముందు ఆరో తారీఖు ఇస్తుండిరి. ఇప్పుడు పదిహేను రోజులైనా అస్తలేవు. – రుక్కవ్వ, సోమార్పేట్, కామారెడ్డి జిల్లా -
చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతారు..
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ సమయంలో ప్రపంచం మొత్తం అల్లాడిపోతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల హామీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా పని చేస్తున్నారని కొనియాడారు. గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిగిన ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో మంతి వెల్లంపల్లి పాల్గొన్నారు. వేడుకల ముగింపు సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. అనంతరం ఆర్పీలకు, డ్వాక్రా గ్రూప్ లీడర్లకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఇంటి వద్దకే పధకాలను చేరుస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి దేవినేని అవినాష్ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాత్రం మాటలతో కాలక్షేపం చేస్తున్నాడని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గంలో రూ.250 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం ముందుకు వెళ్తుందని తెలిపారు. చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో భూములన్నీ బినామిలకు దోచిపెట్టాడని దుయ్యబట్టారు. ఆలయాలపై దాడులు పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారుని మండిపడ్డారు. చంద్రబాబు చేసే కుట్ర రాజకీయాల వలన రాబోయే ఎన్నికల్లో కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయం అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈసారి తప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తెలిపారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. గతంలో చంద్రబాబు మహిళలని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. జగన్ మహిళలుకి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి దేశంలోనే రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా నిలిచారని కొనియాడారు. మరో 30 ఏళ్లపాటు వైఎస్ జగన్ తప్పకుండా ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలు అందరి ఆశీస్సులు సీఎం జగన్‌కి ఉన్నాయని గుర్తుచేశారు. 30లక్షల మందికి త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. దివంగత వైఎస్సార్ కన్న కలలు అన్ని జగన్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడాలని సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా రుణమాఫీ ద్వారా సీఎం జగన్ మహిళలుకి మరింత చేరువయ్యారని అన్నారు. మహిళలు అందరూ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని దేవినేని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు పాల్గొన్నారు. -
‘డబుల్’ పింఛన్లపై వేటు!
సాక్షి, హైదరాబాద్: ఆసరా వృద్ధాప్య పింఛన్లలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. నిబంధనలకు విరుద్ధంగా 14,975 మంది పింఛన్లను కాజేసినట్లు తేలింది. పండుటాకులకు ఆపన్నహస్తం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో దంపతుల్లో ఒకరు మాత్రమే పింఛన్‌కు అర్హులు కాగా, అధికారుల కళ్లుగప్పి ఇరువురు పింఛన్ పొందుతున్నట్లు అంతర్గత విచారణలో పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తేల్చింది. ఈ మేరకు మే నెలకు సంబంధించి దాదాపు 30 వేల (దంపతుల) మంది పింఛన్లను నిలిపివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇన్నాళ్లూ పొందిన పింఛన్ సొమ్మును రికవరీ కూడా చేయాలని నిర్ణయించింది. అక్రమంగా పింఛన్ తీసుకున్నవారి జాబితాను తయారుచేసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిçషనర్లకు పంపింది. లబ్ధిదారుల జాబితాను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి అర్హులు/అనర్హుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది. ఈ నివేదిక అనంతరం అర్హులుగా తేలితే వారి పింఛన్‌ను విడుదల చేయాలని, అనర్హులుగా గుర్తిస్తే సొమ్మును రికవరీ చేయాలని స్పష్టం చేసింది. సామాజిక భద్రత చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్ బాధితులకు రూ.2,016, వికలాంగులకు ప్రతి నెలా రూ.3,016 పింఛన్‌ను అందజేస్తోంది. అయితే ఈ పథకానికి కుటుంబసభ్యుల్లో ఒకరు మాత్రమే అర్హులు కాగా.. చాలాచోట్ల భార్యాభర్తలు లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన సెర్ప్ యంత్రాంగం జాబితాను తయారు చేసింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 1,766, నల్లగొండ 763, మంచిర్యాల 756, కరీంనగర్ 674, రంగారెడ్డి 643, జగిత్యాల 626, నారాయణపేట 623, మేడ్చల్ 585, ఖమ్మం 558, వరంగల్ అర్బన్ జిల్లాలో 546 మంది ఉన్నారు. ఈ మేరకు మే నెలకు సంబంధించి డబుల్ పింఛన్లను ఆపేసింది. ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు కూడా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులెవరైనా వృద్ధాప్య పింఛన్ తీసుకున్నట్లు తేలితే తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబసభ్యులు పింఛన్ పొందేందుకు అనర్హులు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేయడంతో నెలానెలా వచ్చే పింఛన్ సొమ్మే వారికి ఆసరా అవుతోంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల పోçషణాభారం భరించని ఉద్యోగుల వేతనాల నుంచి కట్ చేసి.. నేరుగా వారి ఖాతాలో జమ చేయాలని చట్టం చెబుతుంది. ఈ నేపథ్యంలో వృద్ధుల పింఛన్ కట్ అయిన పక్షంలో నెలవారీ కొంత మొత్తాన్ని ఉద్యోగులు తమ తల్లిదండ్రులకు ఇచ్చేలా చూడాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించింది. అదేవిధంగా ఇప్పటివరకు అక్రమంగా పొందిన పింఛన్ సొమ్మును ఆయా ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు పొందుతున్న లబ్ధిదారుల జాబితాను స్వయంగా తనిఖీ చేసి నివేదికలు పంపాలని ఎంపీడీవోలు, పురపాలకసంఘాల కమిషనర్లను ఆదేశించింది. -
దంపతుల్లో ఒక్కరికే ఆసరా..
వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల వడబోత ప్రారంభించింది. దంపతులిద్దరికి వృద్ధాప్య పింఛన్లు ఉంటే సర్కారు కత్తెర పెడుతోంది. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా 368 మంది లబ్ధిదారులకు మే నెల పింఛన్ సొమ్ము జమ చేయలేదు. దీంతో వీరికి ఇక పింఛన్ లేనట్లేనని బల్దియా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరి«ధిలో ఆసరా పథకం కింద ప్రభుత్వం 68,889 మంది పింఛన్ పొందుతున్నారు. అందులో వికలాంగులు 8,720, బీడీ కార్మికులు 5,909, ఒంటరి మహిళలు 1,786, వృద్ధులు 20,044, గీత కార్మికులు 639, చేనేత కార్మికులు 1,833, వితంతువులు 29,958మంది ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా సామాజిక పింఛన్లను ప్రభుత్వం అమలుచేస్తోంది. గత ఏడాది నుంచి ప్రభుత్వం పింఛన్ సొమ్ము రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఆహార భద్రత కార్డు, సదరన్ సర్టిఫికెట్, మరణ ధ్రువీకరణ తదితర పత్రాల ద్వారా అర్హులను ఎంపిక చేయడం జరుగుతోంది. సామాజిక పింఛన్లలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఏరివేతపై దృష్టిసారించింది. ఒకే కుటుంబంలో ఇద్దరు వృద్ధాప్య పింఛన్ పొందుతున్నవారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందికిపైగా ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో చేపట్టిన ఏరివేత కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా 368 మంది పింఛన్ సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమ చేయలేదు. అంతేకాకుండా దంపతుల్లో భార్య లేదా భర్తలో ఒకరికి మాత్రమే పింఛన్ పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. ఈ మేరకు వారం రోజులుగా బల్దియా పన్నుల విభాగం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో విచారణ చేపడుతున్నారు. అయితే ప్రజాప్రతినిధుల పైరవీలు, బల్దియా సిబ్బంది చేతివాటం కారణంగా ఇంత కాలం పింఛన్ పొందిన వారికి చెక్ పడినట్లైంది. -
6.62 లక్షల మందికి...కొత్త 'ఆసరా'
సాక్షి, హైదరాబాద్: మరింత మంది వృద్ధులకు ‘ఆసరా’దక్కనుంది. 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో కొత్తగా 6.62 లక్షల మందికి ప్రయోజనం లభించనుంది. అసహాయులైన పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. ప్రస్తుతం 65 ఏళ్లుపైబడిన వృద్ధులకు ఆసరా పింఛన్లను అందజేస్తోంది. ఈ ఆర్థిక ఏడాది నుంచి ఈ వయోపరిమితిని 57 ఏళ్లకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పంపిణీ చేస్తున్న 12.46 లక్షల వృద్ధాప్య పింఛన్లకు అదనంగా మరో 6.62 లక్షలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. గతేడాది నుంచే దీన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అప్పట్లో క్షేత్రస్థాయిలో సర్వే జరిపి అర్హుల జాబితాను సేకరించింది.దీనికి అనుగుణంగా ఈ మేరకు వృద్ధాప్య పింఛన్లు పెరుగుతాయని లెక్కతీసింది. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా గ్రామాలవారీగా ఓటర్ల జాబితాను సేకరించి.. అందులో 57 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాలను నమోదు చేస్తోంది. కేవలం దీన్నే ప్రామాణికంగా తీసుకోకుండా.. క్షేత్రస్థాయిలో శిబిరాలు జరిపి వయస్సును నిర్ధారించాలని నిర్ణయించింది.ఆధార్, ఓటర్ ఐడీ తదితర ధ్రువీకరణల ఆధారంగా జాబితాను స్క్రీనింగ్ చేయనుంది. అదనంగా నెలకు రూ.133.45 కోట్ల భారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లకు ప్రభుత్వం 2019–20లో రూ.9,402 కోట్లు కేటాయించగా, 2020–21 వార్షిక సంవత్సరానికి రూ.11,758 కోట్లకు పెంచింది. పెంచిన రూ.2,356 కోట్లు ఈసారి అదనంగా పెరిగే వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కొత్తగా పెరిగే 6.62 లక్షల పింఛన్లతో నెలకు రూ.133.45 కోట్ల మేర భారం పడనుందని అంచనా. ఏప్రిల్ నుంచి ఈ పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, దీనిపై కరోనా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పోస్టాఫీస్‌లో సొత్తు స్వాహా..!
సాక్షి, చింతపల్లి (దేవరకొండ): ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన అధికారే జిల్లా స్థాయి అధికారుల కళ్లు కప్పి రూ.33లక్షల లక్షలను స్వాహా చేశాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని తపాలా కార్యాలయంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. చింతపల్లి మండల తపాలా కార్యాలయం పరిధిలోని చింతపల్లి, నసర్లపల్లి, గడియగౌరారం, వింజమూరు, కుర్రంపల్లి, మధనాపురం, తక్కెళ్లపల్లి గ్రామాల్లో తపాలా సేవలు అందుతున్నాయి. ఇటీవల మండల కేంద్రానికి ఎస్పీఎంగా వచ్చిన ఓ ఉద్యోగి గ్రామాల్లోని బీపీఎంలకు తక్కువ నగదు ఇచ్చి ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో బీపీఎంలు ఉపాధి హామీ, పెన్షన్ తదితర సేవలు అందిస్తుంటారు. అయితే వీరికి మండల కేంద్రంలోని తపాలా కార్యాలయం నుంచి నిత్యం లావాదేవీలు కొనసాగుతుంటాయి. ఇదే అదునుగా భావించిన తపాలా కార్యాలయం ఎస్పీఎం, బిపిఎంలకు ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి బీపీఎంలకు మాత్రం తక్కువ నగదు ఇచ్చి జిల్లా అధికారులకు ఎక్కువ డబ్బులు ఇచ్చినట్లుగా తెలిపాడు. ఇదిలా ఉండగా జిల్లా స్థాయి అధికారులు కూడా గ్రామ బీపీఎంలు ఇచ్చే రికార్డులను సరిపోల్చుతారు. దీంతో రూ.33లక్షల సొమ్ము తేడా రావడంతో తీరా ఎస్పీఎం సొమ్ము స్వాహా చేసినట్లు గుర్తించారు. చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారి రూ.33లక్షల సొమ్మును స్వాహా చేయగా గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టడమే కాకుండా అధికారులు అక్రమార్కున్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం బయటకు చెప్పకుండా విచారణ చేసి స్వాహా అయిన సొమ్మును రికవరీ చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అధికారిని కాపాడే ప్రయత్నంలో జిల్లా అధికారులు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగిన ఆసరా పెన్షన్లు గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్‌ను తపాలా కార్యాలయం నుంచి పంపిణీ చేస్తోంది. చింతపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు ఈనెల మొదటి వారం నుంచే ఆసరా పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా కార్యాలయానికి రావాల్సిన పెన్షన్ ఇప్పటికీ జమ కాలేదు. దీంతో దసరా పండుగ సందర్భంగా ఆసరా అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. సెలవుల్లో ఎస్పీఎం తపాలా కార్యాలయంలో అవినీతికి పాల్పడిన సంబంధిత అధికారి గత వారం రోజుల నుంచి సెలవుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతికి పాల్పడిన అధికారిపై జిల్లా అధికారులు విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే తేల్చారు. ఈ విషయం బయటికి పొక్కకుండా జిల్లా అధికారులు జాగ్రత పడుతున్నట్లు సమాచారం. అధికారుల సూచన మేరకే సదరు ఉద్యోగి సెలవుల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
బతికున్నట్లుగా సెల్ఫీ అప్లోడ్ చేస్తేనే పింఛను!
బోధన్ మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తికి ప్రతీ నెలా వృద్ధాప్య పింఛను మంజూరవుతోంది. పింఛన్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమవుతున్నాయి. వాస్తవానికి ఆ వ్యక్తి చనిపోయి చాలా నెలలవుతోంది. అయితే ఇటీవల సదరు వ్యక్తి భార్య వితంతు పింఛన్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుంది. డీఆర్డీఏ పింఛన్ విభాగంలో అధికారులు ఈ దరఖాస్తును పరిశీలించారు. చనిపోయిన భర్త పేరు తెలుసుకుని మంజూరువుతున్న పింఛన్ జాబితాలో ఉందో లేదో చూశారు. ఇప్పటికీ ఆమె చని పోయిన తన భర్త పేరుపై వృద్ధాప్య పింఛ న్ ప్రభుత్వం నుంచి మంజూరు అవుతోందని తెలిసి షాక్ అయ్యారు. ఇలా మున్సిపా లిటీ ల్లో చనిపోయిన వారి పేరుతో బోగస్ పింఛన్లు డ్రా అవుతున్నాయి. సాక్షి, నిజామాబాద్: మున్సిపాలిటీ ప్రాంతాల్లోని బోగస్ పింఛన్లకు త్వరలో చెక్ పడనుంది. చనిపోయిన వ్యక్తుల పేరిట మంజూరువుతున్న పింఛన్లను గుర్తించి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త సాంకేతిక విధానాన్ని అమలుల్లోకి తేనుంది. అదే ‘లైవ్యాప్’ సిస్టం. ఈ మొబైల్ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని లబ్ధిదారులు సెల్ఫోన్లో ఒక సెల్ఫీ ఫొటో దిగి అందులో అప్లోడ్ చేస్తేనే ఇకపై పింఛన్ మంజూరు కానుంది. అయితే ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా పింఛన్ డబ్బులు పొందుతున్న లబ్ధిదారులు మూడు, ఆరు నెలలకోసారి వారు బతికున్నట్లుగా మున్సిపాలిటీల నుంచి లైవ్ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వానికి చూపాల్సి ఉంటుంది. ఈ విధానం అమలవుతున్నా లైవ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగడం లేదు. దీంతో పింఛన్లు పొందే లబ్ధిదారులు బతికున్నారో, చనిపోయారో తెలియడం లేదు. పింఛన్ డబ్బులు మాత్రం నెలనెలా వారి ఖాతాల్లో జమ అవుతుండగా, కుటుంబ సభ్యులు వాటిని డ్రా చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. అదే గ్రామాల్లోని లబ్ధిదారుల విషయానికి వస్తే ప్రతీ నెలా లబ్ధిదారులే పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్ డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో లబ్ధిదారులు బతికున్నట్లుగా తెలిసిపోతుంది. కానీ మున్సిపాలిటీ ప్రాంతాల్లో అలా కాకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతున్నాయి. లబ్ధిదారులు బతికున్నారో, లేదో తెలుసుకోవడానికి వీలు పడదు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 2లక్షల 60వేలకు పైగా ఉన్నాయి. వికలాంగులకు రూ.3016 కాగా మిగతా అందరికీ రూ.2,016 పింఛన్ అందుతోంది. వచ్చే నెలాఖరు వరకు అమలయ్యే ఛాన్స్.. లైవ్ మొబైల్ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సంగారెడ్డిలో అమలు చేసి విజయవంతమైంది. వచ్చే నెలాఖరు వరకు రాష్ట్రం అంతటా ఈ విధానాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీ ప్రాంతాల వారే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు కూడా మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని సెల్ఫీ దిగి ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నిరక్ష్యరాసులు, వృద్ధులకు ఇది సాధ్యం కాని పని అయినప్పటికీ తెలిసిన వారితో ఫోన్లో సెల్ఫీ ఫొటో దిగి యాప్‌లో అప్లోడ్ చేయాల్సిందే. ఇలా ప్రతీఒక్కరూ ప్రతీ మూడు నెలలకు ఒకసారి చేస్తేనే పింఛన్ ప్రభుత్వం నుంచి మంజూరు కానుంది. కొత్త విధానం వల్ల మున్సిపాలిటీ ప్రాంతాల్లో చనిపోయిన వ్యక్తులు సెల్ఫీ ఫొటో దిగే అవకాశం ఉండదు కాబట్టి ఇకపై ఆ వ్యక్తికి పింఛన్ మంజూరు కాబోదు. దీంతో జిల్లాలో చాలా బోగస్ పింఛన్లు తొలగిపోయే అవకాశం ఉంది.