bore wells
-
రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులకు ఉచితంగా బోర్లు
భవానీపురం (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్ జలకళ పథకం కింద రాష్ట్రంలోని రెండు లక్షల మంది రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్విస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ అన్నారు. భూగర్భజల శాఖ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం భూగర్భజల వ్యవస్థలు, సవాళ్లు, అవకాశాలు అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకుని నీటి ప్రాధాన్యతను తెలియచేసేలా ఎంతో బాధ్యతతో భూగర్భజల శాఖ విధులు నిర్వహిస్తుందని చెప్పారు. భావి తరాలకు తాగు, సాగు నీరు అందించేందుకు నీటిని పొదుపుగా వాడటంలో, భూగర్భ జలాల వివరాలను తెలియచేయటంలో భూగర్భజల శాఖ గత ఐదు దశాబ్దాలుగా విశేష కృషి చేసిందని తెలిపారు. జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో జలవనరులు కీలకమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం దేశంలోనే తొలి హైడ్రాలజీ ప్రాజక్ట్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు సుస్థిర స్థానం ఉందన్నారు. ఈ స్వర్ణోత్సవ వేళ నిర్వహించిన ఈ సదస్సు భావితరాలకు, తదుపరి ప్రణాళికలకు ఒక వేదికగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 13 జిల్లాల అధికారులు రూపొందించిన 13 పుస్తకాలను, గత 50 ఏళ్లుగా భూగర్భ జలశాఖ అమలు చేసిన ప్రణాళికలు, పరిశోధనల సమాహారంగా రూపొందించిన పుస్తకం, సావనీర్‌ను మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఆవిష్కరించారు. -
పుడమి పుక్కిట గంగ.. నీటికి లేదిక బెంగ
సాక్షి, అమరావతి: సకాలంలో పుష్కలంగా వర్షాలు.. నిండుగా పారిన వాగులు, వంకలు.. పొంగిన నదులు.. భూమాతకు జలాభిషేకం చేశాయి. ఎండి బీళ్లువారిన పుడమి ఆ జలాలను పుక్కిటపట్టింది. జలవనరులు నిండుగా తొణికిసలాడుతున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలకు గాను 12 జిల్లాల్లో భూగర్భ జలమట్టం బాగా పెరిగింది. పలు ప్రాంతాల్లో భూగర్భంలోంచి జలాలు పైకి ఉబుకుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మోటర్లు వేయకుండానే బోర్ల నుంచి నీరు వస్తోంది. రాయలసీమ ప్రాంతంలో వెయ్యి నుంచి 1,400 అడుగుల లోతు బోర్లు వేస్తే గానీ నీటి జాడ కనిపించని పరిస్థితి నుంచి నాలుగైదు అడుగుల లోతులోనే నీరు కనిపిస్తోంది. కుండపోత వర్షాలు, వరదల వల్ల కొంత పంట నష్టం వాటిల్లినప్పటికీ వచ్చే రెండు మూడేళ్లు కరువు మాట ఉండదని అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న వేసవిలో ఎక్కడా తాగు, సాగునీటి ఎద్దడి రాదని భరోసాతో ఉన్నారు. ఏటా జనవరి చివరి వారం నుంచి వేసవి సన్నద్ధత కోసం విపత్తు నిర్వహణ, వ్యవసాయం, పశుసంవర్ధక, గ్రామీణ మంచినీటి సరఫరా, పురపాలక, పట్టణాభివృద్ధి తదితర శాఖల అధికారులు సమావేశమయ్యేవారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేవారు. పశుగ్రాసం కొరతను ఎలా అధిగమించాలి.. తాగునీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలు.. వంటి అంశాలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. ఈ ఏడాది జలవనరుల్లోను, భూగర్భంలోను పుష్కలంగా నీరుండటంతో తాగునీటి ఎద్దడి మాటే ఉండదు. భూమి çపచ్చగా ఉన్నందున పశుగ్రాసానికి ఇబ్బంది ఉండదు. అందువల్ల ఈ ఏడాది వేసవి సన్నద్ధత సమావేశాల అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. రాయలసీమలో అనూహ్యంగా పెరుగుదల నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి.. గత ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 27 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమలో ఏకంగా 57 శాతం ఎక్కువగా వర్షం కురవడం గమనార్హం. కోస్తాంధ్రలో 17 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 860 మిల్లీమీటర్ల సగటు సాధారణ వర్షపాతం కాగా 1,087 మిల్లీమీటర్లు నమోదైంది. ఇదేకాలంలో కోస్తాంధ్రలో 954 మిల్లీమీటర్లకుగాను 1,111 మిల్లీమీటర్లు (17 శాతం ఎక్కువ), రాయలసీమలో 648 మిల్లీమీటర్లకుగాను 1,003 మిల్లీమీటర్లు ( 57 శాతం అధిక) వర్షపాతం రికార్డయింది. దీంతో రాయలసీమ ప్రాంతంలో భూగర్భ జలమట్టం అనూహ్యంగా పెరిగింది. 2020 జనవరితో పోలిస్తే జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 3.8 మీటర్ల ( 12.46 అడుగుల) మేరకు భూగర్భ జలమట్టం పెరిగింది. ఇదే సమయంలో రాయలసీమలో పెరుగుదల 8.1 మీటర్లు (26.57 అడుగులు) ఉండటం గమనార్హం. వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో పాతాళగంగ పైకి వస్తోంది. కొన్నిచోట్ల మోటర్లు వేయకుండానే బోరు పైపుల నుంచి నీరు కొద్దిగా బయటకు వస్తోంది. వాగులు, వంకల్లో సుదీర్ఘకాలం ఊట (జేడు) నీరు ప్రవహిస్తుండటంతో కొండ దిగువ ప్రాంతాల్లోని భూముల్లో నీరు ఊరుతోంది. గత ఏడాది జనవరితో పోలిస్తే 12 జిల్లాల్లో భూగర్భ జలమట్టం పైకి వచ్చింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రం నామమాత్రంగా 0.7 మీటర్ల మేర తగ్గింది. మూడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడలేదు పాపాఘ్ని నది నాలుగు నెలలుగా ప్రవహిస్తూనే ఉంది. గత మూడు దశాబ్దాల్లో ఈ నది వరుసగా మూడునెలలు ప్రవహించిన దాఖలాలు లేవు. భారీ వర్షాలవల్ల భూగర్భ జలం భూమిపైకి ఉబికి వస్తోంది. వరిగడ్డి వాములు కిందనుంచి రెండడుగులమేర తడిచిపోయాయి. – రామలింగారెడ్డి, కమలాపురం, వైఎస్సార్ కడప జిల్లా. మోటరు వేయకుండానే నీరు మా ఊరు కొంత తగ్గులో ఉంది. పైన ఏట్లో నీరు ప్రవహిస్తున్నందున మా భూముల్లో ఊటెక్కింది. మోటర్లు వేయకుండానే లోతట్టు ప్రాంతాల్లోని బోరు పైపుల నుంచి నీరు ఉబికి వస్తోంది. – వెంకటరామిరెడ్డి, వంగిమళ్ల, వీరబల్లి మండలం, వైఎస్సార్ కడప జిల్లా పుష్కలమైన వర్షాలే కారణం రాష్ట్ర వ్యాప్తంగా 2020 కేలండర్ ఇయర్లో మంచి వర్షాలు కురిశాయి. దీనివల్లే భూగర్భ జలమట్టం బాగా పెరిగింది. వచ్చే రెండు మూడేళ్లు భూగర్భ జలమట్టంపై ఈ వర్షాల ప్రభావం ఉంటుంది. సాధారణంగా జూన్ నుంచి మే నెల వరకు వాటర్ ఇయర్ అని అంటారు. రాష్ట్రంలో సంవత్సరం మొత్తంలో కురిసే వర్షంలో జూన్–అక్టోబరు మధ్య నైరుతి రుతుపవనాల సీజన్లోనే 65 శాతానికిపైగా కురుస్తుంది. మరో 25 శాతం ఈశాన్య రుతుపవనాల సీజన్లో పడుతుంది. మిగిలిన 10 శాతం వర్షం ఇతర నెలల్లో కురుస్తుంది. రాయలసీమ ప్రాంతంలో గత ఏడాది విపరీతమైన వర్షాలు కురిశాయి. అందువల్ల జలమట్టం బాగా పైకి వచ్చింది. – ఎ.వరప్రసాదరావు, భూగర్భజలశాఖ రాష్ట్ర సంచాలకుడు -
వైఎస్సార్ జలకళ ద్వారా మార్చి నాటికి 22,400 ఉచిత బోర్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జలకళ పథకం ద్వారా మార్చి నెలాఖరు కల్లా రైతుల పొలాల్లో 22,400 ఉచిత బోర్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వాటర్ షెడ్ డైరెక్టర్ పీవీఆర్ఎం రెడ్డి బుధవారం 13 జిల్లాల డ్వామా పీడీలతో సమావేశం నిర్వహించి జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరిలో 3,200, ఫిబ్రవరిలో 9,600, మార్చిలో 9,600 చొప్పున ఉచిత బోర్లు తవ్వేందుకు జిల్లాల వారీగా ప్రణాళికలు ఖరారు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల దరఖాస్తులు నిబంధనల మేరకు తిరస్కరణకు గురయ్యాయన్నారు. ఆయా రైతులు కనీసం రెండున్నర ఎకరాలుండేలా గ్రూపులుగా ఏర్పడి తిరిగి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా అధికారులకు సూచించారు. -
ఉచిత బోరుకు ప్రతి రైతు అర్హుడే
సాక్షి, అమరావతి: ఉచిత బోరు పథకానికి విస్తీర్ణంతో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు అర్హుడే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్సార్ జలకళ పథకం విధివిధానాలను సవరిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జులై 3వ తేదీ పథకం విధివిధానాలపై జారీ చేసిన ఉత్తర్వుల్లో ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులనే అర్హులుగా పేర్కొన్నారు. తాజా నిబంధనల ప్రకారం ఇప్పటి దాకా బోరు వసతి లేని, ఫెయిల్ అయిన బోర్ ఉన్న రైతులంతా అర్హులేనని పేర్కొన్నారు. ► గతంలో ఉచిత బోరు తవ్వకానికి రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలని, ఒక రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి లేకపోతే, గరిష్టంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడాలన్న నిబంధనను తాజా విధివిధానాలలో సవరించారు. ► బోరు తవ్వకానికి ప్రత్యేకంగా ఎటువంటి విస్తీర్ణం పరిధిని పేర్కొనలేదు. అంటే రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతు మిగిలిన వారితో సంబంధం లేకుండా తన భూమిలో ఉచిత బోరు తవ్వకానికి అర్హుడేనని అధికారులు వెల్లడించారు. ► భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్న రాష్ట్రంలోని 1094 రెవిన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకం అమలు కాదని పేర్కొన్నారు. అయితే భూగర్భ జల మట్టాన్నిబట్టి ఈ గ్రామాల సంఖ్యలో మార్పులు ఉంటాయన్నారు. సన్న, చిన్నకారు రైతులకు పంపుసెట్, పైపులు, వైర్ ఉచితం ► సన్న, చిన్నకారు రైతులకు (ఐదు ఎకరాలలోపు భూమి ఉండే వారు) ఉచిత బోరుతో పాటు మోటార్ (పంపుసెట్) కూడా ఉచితంగా అందజేస్తారు. ఈ మేరకు సీఎం ప్రకటనకు అనుగుణంగా తాజాగా మరో ఉత్తర్వు జారీ చేశారు. ► పైపులు, విద్యుత్ వైరు, ప్యానల్ బోర్డు వంటి అనుబంధ పరికరాలను కూడా ఉచితంగా అందించనున్నట్టు పేర్కొన్నారు. ► హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించాకే బోరు బావి తవ్వకం ప్రారంభిస్తారు. అర్హత కలిగిన రైతులు ఫొటో, పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ► డ్రిల్లింగ్ అనంతరం గంటకు కనీసం 4,500 లీటర్లు తోడడానికి అవకాశం ఉన్న దానినే విజయవంతమైన బోరు బావిగా పరిగణిస్తారు. అనంతరం జియో ట్యాగింగ్‌తో కూడిన డిజిటల్ ఫొటోలతో రికార్డు చేస్తారు. పారదర్శకత కోసం సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. -
అండగా నిలబడతాం..
-
రైతు కోసం మరో అడుగు ముందుకేశాం: సీఎం జగన్
-
ఇక బోరుబావుల్లో పడ్డ చిన్నారులు సురక్షితం!
కొత్తవలస (శృంగవరపుకోట): ఎక్కడో చోట బోరుబావుల్లో చిన్నారులు పడిపోవడం.. వారికోసం అంతా హైరానా పడటం అందరికీ తెలిసిందే. బోరుబావుల్లో పడ్డ చిన్నారులను కొన్నిసార్లు రక్షిస్తున్నా.. మరికొన్నిసార్లు వారిని కాపాడుకోలేకపోతున్నాం. ఈ సమస్యకు విజయనగరం జిల్లాకు చెందిన యువ ఇంజనీర్ కురుమోజు శరత్ చంద్ర పరిష్కారం చూపాడు. అతడు చదివింది ఈఈఈలో డిప్లొమా మాత్రమే అయినా తన మేధస్సుతో బోర్వెల్ చిల్డ్రన్ లిఫ్టింగ్ మెషిన్‌ను రూపొందించాడు. ఈ యంత్రంతో 20 అడుగుల లోతులో పడ్డవారిని వెంటనే వెలికి తీయొచ్చని చెబుతున్నాడు. దీనికి మరింత సాంకేతికత జోడిస్తే 300 నుంచి 500 అడుగుల లోతులో ఉన్నవారినైనా రక్షించవచ్చని అంటున్నాడు. వివరాల్లోకెళ్తే.. ► కొత్తవలస మండలం తుమ్మికాపల్లికి చెందిన శరత్ చంద్ర తల్లి అతడి చిన్నతనంలోనే మరణించడంతో అమ్మమ్మ దగ్గర పెరిగాడు. ► పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయ్యాక చిన్న ఉద్యోగం చేసినా లాక్‌డౌన్‌తో జీవనోపాధిని కోల్పోయాడు. ► దీంతో రోజూ కూలి పనులకు వెళ్లి ఆ ఆదాయంతోనే బతుకీడుస్తున్నాడు. అందులో కొంత డబ్బును వెచ్చించి మెషిన్‌ను తయారుచేశాడు. యంత్రం పనితీరు ఇలా.. ► బోరుబావి సైజును బట్టి మూడు ప్రత్యేక మోటార్ల సాయంతో ఈ యంత్రం పనిచేస్తుంది. ► సీసీ కెమెరా, ఎల్ఈడీ లైట్లతోపాటు మానిటర్‌కు అనుసం«ధానమై ఉంటుంది. ఇది సీకాట్ కేబుల్ సాయంతో పనిచేస్తుంది. ► బోరుబావిలో చిన్నారులు పడ్డప్పుడు గేర్‌వైర్ సాయంతో బావిలోకి దింపిన యంత్రం బాలుడిని మూడు మర చేతులతో పట్టుకుంటుంది. ► పై నుంచి నియంత్రించేందుకు సీసీ మానిటర్ నుంచి దీన్ని ఆపరేట్ చేస్తారు. ► విద్యుత్ ఆగిపోయినా, సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా చిన్నారిని మాత్రం వదలకుండా పట్టుకుని ఉండటం ఈ యంత్రం ప్రత్యేకత. ► అంతేకాకుండా చిన్నారికి ఆక్సిజన్‌ను అందించే సదుపాయాన్ని ఇందులో అమర్చవచ్చు. ► తన యంత్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు ఆర్థిక సాయం అందించాలని శరత్ కోరుతున్నాడు. -
శివార్లను పీల్చి.. సిటీకి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ శివార్లలో నీటివ్యాపారం కోట్లు దాటింది. చాలామంది రైతులు తమభూముల్లో బోరుబావులు తవ్వి నీటిని గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు విక్రయిస్తున్నారు. ఫలితంగా వ్యవసాయం ‘నీరు’గారింది. నీటివ్యాపారం చేసే రైతులు, ట్యాంకర్ యజమానుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, రైతుల కంటే ట్యాంకర్ మాఫియాకు కోట్లాది రూపాయల లాభాలు సమకూరుతున్నాయని ఐఐటీ గౌహతి, నెదర్లాండ్స్‌కు చెందిన వేజ్ నింజెన్ వర్సిటీ నిపుణులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. ‘నీళ్లు ఎవరివి.. లాభాలు ఎవరికి’అన్న అంశంపై జరిగిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో వెలుగుచూసిన పలు అంశాలు ఇవీ.. తగ్గిన వ్యవసాయభూములు ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాల రైతులు వ్యవసాయం కంటే ఇతర వృత్తులపైనే ఆధారపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ, బీపీవో, పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్కులు, ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరించడంతో ఇక్కడ వ్యవసాయ భూముల సంఖ్య తగ్గింది. రైతులకు నష్టపరిహారంతోపాటు హెచ్ఎండీఏ లే అవుట్లలో నివాస స్థలాలు కేటాయించింది. ఆ ప్లాట్లలో ఇప్పుడు బోరుబావులు తవ్వి ఆ నీటిని ఫిల్టర్‌ప్లాంట్లు, ఇతర పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు రైతులు విక్రయించి ఉపాధి పొందుతున్నారు. ప్రధానంగా కోకాపేట్, ఆదిభట్ల ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. విచక్షణా రహితంగా బోరుబావులు విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం కారణంగా శివార్లలో భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సరాసరిన 1,000–1,500 అడుగుల లోతుకుపైగా బోరుబావులు తవ్వాల్సి వస్తోంది. వర్షపునీటి నిల్వ చేసేందుకు ఆయా ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార, రియల్టీ వర్గాలు చర్యలు తీసుకోవడంలేదు. నీటిలేమి కారణంగా చిన్న రైతులు వ్యవసాయం వీడి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారు. రైతులవి నీళ్లు..లాభాలు ట్యాంకర్ మాఫియాకు.. రైతులు నీటిని విక్రయిస్తే.. ఒక్కో ట్యాంకర్(ఐదువేల లీటర్లు)కు రూ.150 నుంచి రూ.200 వరకు మాత్రమే లభిస్తోంది. అదే నీటిని తీసుకెళ్లి వాణిజ్య, పారిశ్రామిక, రిక్రియేషన్, రిసార్ట్స్,కార్పొరేట్ కంపెనీలు, విద్యాసంస్థలకు విక్రయిస్తున్న ట్యాంకర్ యజమానులకు ఒక్కో ట్రిప్పునకు రూ.800 నుంచి రూ.1200 వరకు గిట్టుబాటవుతోంది. సాగు తగ్గడానికి కారణాలు.. - రైతులు తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో సాగుచేస్తే వచ్చే దిగుబడులు ఆశాజనంగా లేకపోవడం - వర్షపాత లేమి , చీడపీడల నివారణకు అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తుండడం - పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు ఆశించిన మేర గిట్టుబాటు ధర లభించకపోవడం -
సిటీకి దూపైతాంది
సాక్షి, హైదరాబాద్: చినుకుల సీజన్లోనూ గ్రేటర్లో భూగర్భజలాలు అథఃపాతాళానికి చేరుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంతలు చాలినన్ని లేకపోవడం, విచక్షణారహితంగా బోరు బావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ పైకి రావడంలేదు. ఈ జూన్ భూగర్భ జలమట్టాలను గతేడాది జూన్‌తో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 1 నుంచి 3 మీటర్ల మేర తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. కాగా నగరం సరాసరి భూగర్భ జలమట్టాలను పరిశీలిస్తే.. గతేడాది 20.53 మీటర్ల లోతున భూగర్భజలాలు కనిపించగా, ప్రస్తుతం 22.53 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. కాగా శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీట్ మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భ జలాల వినియోగం రెట్టింపవుతోంది. -
వే‘గంగా’ పడిపోతోంది..!
సాక్షి, హైదరాబాద్: పాతాళగంగ రోజురోజుకూ పడిపోతోంది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వేసవి తీవ్రత పెరగడం, చివరిదశలో ఉన్న పంటలకు బోర్ల ద్వారా భూగర్భ జల వినియోగం ఎక్కువ కావడంతో భగూర్భమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర సగటు భూగర్భ నీటిమట్టం 13.40 మీటర్లకు అడుగంటింది. గతేడాది మార్చి మట్టాలతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 1.52 మీటర్ల దిగువకు పడిపోయాయి. ఈ ఏడాది మార్చిలో సాధారణ వర్షపాతం 865 మిల్లీమీటర్లు ఉండగా, కేవలం 724 మిల్లీమీటర్ల మేర మాత్రమే వర్షపాతం నమోదైంది. ఏకంగా 16 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. 33 జిల్లాలకు గానూ 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 17 జిల్లాలో 20 నుంచి 59 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావంతో చాలా జిల్లాలో చెరువులు నిండలేదు. ప్రాజెక్టుల్లోనూ నీటి చేరిక తక్కువగా ఉండటంతో కాల్వల ద్వారా నీటి విడుదల జరగలేదు. ఈ కారణంగా భూగర్భమట్టాల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. రాష్ట్రంలో 5 మీటర్ల కన్నా తక్కువమట్టంలో భూగర్భజలాల లభ్యత కేవలం 4.6 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఉండగా, 5 నుంచి 10 మీటర్ల పరిధిలో 33.5 శాతం, 10 నుంచి 15 మీటర్ల పరిధిలో 27 శాతం, 15 నుంచి 20 శాతం పరిధిలో 19.2 శాతం, 20 మీటర్లకు ఎక్కువన 15.6 శాతం మేర భూగర్భ మట్టాలున్నాయి. 4 మీటర్ల కంటే లోతుకు భూగర్భ జలమట్టం రాష్ట్రంలోని 584 మండలాల పరిధిలో భూగర్భమట్టాలను పరిశీలించగా గతేడాది మార్చిలో రాష్ట్ర సగటు నీటిమట్టం 11.88 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 13.40 మీటర్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 1.52 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. గతేడాదితో పోలిస్తే 4 మీటర్ల కంటే లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయిన జిల్లాల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్ , నారాయణపేట, మేడ్చల్, హైదరాబాద్ ఉన్నాయి. వికారాబాద్ మండల బట్వారంలో ఏకంగా 41.51 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పడిపోగా, మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట, షాద్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్‌లో 40 మీటర్ల మేర భూగర్భమట్టం పడిపోయింది. రాష్ట్రంలోని 69 శాతం బోరుబావుల్లో నీరు ఇంకిపోయినట్లు భూగర్భ జలవిభాగ నివేదిక వెల్లడిస్తోంది. -
పడిపోతున్న భూగర్భ నీటిమట్టాలు
-
తెలంగాణలో జల ఘంటికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి నీటి ముప్పు ముంచుకోస్తోంది. వేసవి రాక ముందే భూగర్భ జలాలు పాతాళానికి చేరుతున్నాయి. గతేడాది వర్షపాతం లోటుతోపాటు ‘రబీ’ సాగుకు బోరుబావులపై ఆధారపడటంతో భూగర్భ జలాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర సగటు నీటి మట్టం 11.91 మీటర్లు. గతేడాదితో పోలిస్తే ఇది 1.83 మీటర్ల మేర పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది. అవసరానికి మించి బోర్ల ద్వారా నీటిని తోడేస్తుండటంతో నీటి వృథా జరుగుతోందని భూగర్భ జలశాఖ అంచనా వేస్తోంది. భయపెడుతున్న నీటి మట్టాలు... ఈ ఏడాది జనవరి నాటికి రాష్ట్రంలో 852 మిల్లిమీటర్ల వర్షపాతానికిగాను 721 మిల్లిమీటర్లే నమోదైంది. గతేడాదితో పోలిస్తే 15% తక్కువగా రికార్డయింది. 31 జిల్లాలకుగాను 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొంది. 284 మండలాల్లో 20% నుంచి 59% వర్షపాతం తక్కువగా నమోదైంది. గతేడాది జనవరిలో 10.08 మీటర్ల రాష్ట్ర సరాసరి నీటిమట్టాలుండగా ఈ ఏడాది జనవరి చివరి నాటికి అది 11.91 మీటర్లకు చేరింది. భూగర్భ జలమట్టాల్లో 1.83 మీటర్ల తగ్గుదల నమోదైంది. ఇవే మట్టాలను 2017తో పోలిస్తే 2.55 మీటర్ల మేర పడిపోయాయి. కేవలం 11 జిల్లాల్లోనే 0.11 మీటర్ల నుంచి 1.56 మీటర్ల మేర పెరుగుదల కనిపించగా 20 జిల్లాల్లో 7.49 మీటర్ల నుంచి 0.17 మీటర్ల వరకు తగ్గాయి. ముఖ్యంగా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూగర్భ నీటిమట్టాలు ఊహించని రీతిలో పడిపోయాయి. సంగారెడ్డిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 7.49 మీటర్ల మేర నీటిమట్టాలు తగ్గాయి. అతిఎక్కువగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలో ఏకంగా 44.68 మీటర్లకు భూగర్భ నీటిమట్టం పడిపోవడం గమనార్హం. ఏకంగా 117 మండలాల్లో 20 మీటర్ల దిగువకు వెళ్తేగానే నీరు లభించట్లేదు. ప్రాజెక్టుల్లోనూ క్షీణత.. రక్షణ చర్యలే కీలకం ఇప్పటికే నీళ్లు లేక బోరుబావులు వట్టిపోయాయి. ఉన్న కొద్దిపాటి నీళ్లను ఉపయోగించి రైతులు పంటల సాగు చేస్తున్నారు. దీనికితోడు మంజీరా, సింగూరు, నిజాంసాగర్‌లలో ఇప్పటికే చుక్క నీటి లభ్యత లేకపోగా ఎస్సారెస్పీ, కడెం, లోయర్ మానేరులో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ఇక హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఆధారపడ్డ శ్రీశైలంలో నిల్వలు కనీస నీటిమట్టాలకు దిగువకు చేరాయి. 885 అడుగుల మట్టానికిగాను కనీస నీటిమట్టం 834 అడుగులకన్నా తక్కువగా 831.40 అడుగులకు తగ్గిపోయింది. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తగ్గడంతో భూగర్భ జలాలు మున్ముందు మరింత క్షీణించే అవకాశం ఉంది. వేసవికి ముందే ఇలాంటి పరిస్థితులు ఉంటే నిండు వేసవిలో ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్నది ఆందోళన రేపుతోంది. నీటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల రోజురోజుకూ భూగర్భజలాలు పడిపోతున్నాయి. నీటిని భూమిలోకి ఇంకించడానికి అవసరమైన ప్రాంతాల్లో కాంటూరు కందకాలు, చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. నీరున్న చోట వాటి నిర్మాణాలకు డ్వామా అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నా నీరు లేనిచోట నిర్మించడం లేదు. ఫలితంగా నీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలు అత్యంత మఖ్యమని భూగర్భ జలశాఖ హెచ్చరిస్తోంది. డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా వ్యవసాయ సాగును ప్రోత్సహించాలని, ఐడీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని సూచిస్తోంది. భూగర్భాలు అత్యంత దారుణంగా పడిపోయిన మండలాలు మండలం మట్టం (మీటర్లలో) దౌల్తాబాద్ (సిధ్దిపేట) 44.68 బట్వారం (వికారాబాద్) 41.77 కొల్చారం (మెదక్) 40.10 ఫరూఖ్‌నగర్ (రంగారెడ్డి) 37.70 మిడ్జిల్ (మహబూబ్‌నగర్) 36.55 -
జూన్‌లో వర్షాలకు బోర్లు పూర్తిగా రీచార్జ్!
కందకాలు తవ్వించడం వల్ల ఈ ఏడాది జూన్‌లో కురిసిన 4, 5 వర్షాలకు భూగర్భ నీటి మట్టం బాగా పెరిగిందని, మూడు బోర్లూ పుష్కలంగా జలకళను సంతరించుకున్నాయని చింతా నరసింహరాజు చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అర్మాయిపేట గ్రామ పరిధిలో ఆయనకున్న 27 ఎకరాల నల్లరేగడి భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2017 నవంబర్‌లో తీవ్ర సాగునీటి కొరత ఏర్పడింది. మూడు బోర్లుంటే.. ఒక బోరే ఒక మోస్తరుగా పోసేది. మిగతా రెండు దాదాపు ఎండిపోయాయి. నాలుగు రోజులకోసారి పది నిమిషాలు నీరొచ్చే దుస్థితిలో ఉండేవి. అటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో కందకాల ద్వారా ‘చేనుకిందే చెరువు’ సాధించుకోవచ్చంటూ నిర్వహిస్తున్న ప్రచారోద్యమం గురించి మిత్రుడు క్రాంతి ద్వారా రాజు తెలుసుకున్నారు. పొలం అంతటా 50 మీటర్లకు వాలుకు అడ్డంగా ఒక వరుసలో.. మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తీసుకుంటే.. ఎంతటి కరువు ప్రాంత మెట్ట పొలాల్లో అయినా సాగు నీటి కొరత ఉండదని తెలుసుకున్నారు. కందకాలు తవ్వడానికి ఖర్చు అవుతుంది కదా అని తొలుత సందేహించినా.. నీరు లేకపోతే భూములుండీ ఉపయోగం లేదన్న గ్రహింపుతో కందకాలు తవ్వించారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ (ఇరిగేషన్) సంగెం చంద్రమౌళి (98495 66009), సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్‌రెడ్డి (94407 02029)లను తమ పొలానికి ఆహ్వానించి, వారి ఉచిత సాంకేతిక సహకారంతో కందకాలు తవ్వించామని రాజు తెలిపారు. నల్లరేగడి నేల కావడంతో కందకాలలో అంత త్వరగా నీరు ఇంకదు. కందకాలు నిండగా పొంగిపొర్లి వెళ్లిపోయే నీటిని కూడా ఒడిసిపట్టుకోవడానికి మట్టికట్టతో కూడిన ఫాం పాండ్‌ను కూడా తవ్వించారు. కందకాలు, ఫాం పాండ్ తవ్వడానికి రూ. 2 లక్షల వరకు ఖర్చయిందన్నారు. గత ఏడాది నవంబర్ తర్వాత కురిసిన వర్షాలతోపాటు ఈ ఏడాది జూన్‌లో కురిసిన వర్షాలకు 4, 5 సార్లు కందకాలు పూర్తిగా నిండాయి. జూలైలో వర్షం పడలేదు. ఆగస్టులో వర్షాలకు రెండు, మూడు సార్లు కందకాలు నిండాయి. దీంతో భూగర్భ నీటి మట్టం బాగా పెరిగి, మూడు బోర్లూ పుష్కలంగా నీటిని అందిస్తున్నాయి. ఫాం పాండ్ దగ్గరలో ఉన్న బోరు పూర్తి సామర్థ్యంతో నీటిని అందిస్తున్నదని రాజు ‘సాగుబడి’కి వివరించారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో కందులు (అంతరపంటలుగా మినుము, పెసలు, కొర్రలు), 5 ఎకరాల్లో తెలంగాణ సన్నాలు వరి పంట వేసినట్లు తెలిపారు. కొంత ఖర్చు అయినప్పటికీ, కందకాల ప్రభావం అద్భుతంగా ఉందని నరసింహరాజు (90084 12947) ఆనందంగా తెలిపారు. నీటి భద్రత రావటంతో పంటలకు ఇబ్బంది లేకుండా ఉందన్నారు. నీటికి ఇబ్బంది లేకుండా ఉండాలనుకునే రైతులు కందకాల ఆవశ్యకతను గుర్తించాలని సూచించారు. -
'బోరు'మంటున్నాయి
సరైన వానలు లేక యేటేటా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో బోర్లు, బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. వేసవికాలం వచ్చిందంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కొన్ని గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు మంచి నీరు కూడా దొరకని పరిస్థితి. కనీసం చేతిపంపు నీటితోనైనా గొంతు తడుపుకుందామనుకుంటే అవి మొరాయిస్తున్నాయి. యేటా వీటి మరమ్మతులకు నిధులు మంజూరువుతున్నాయి. వాటిని అధికారులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఏమో తెలియదు కానీ స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆళ్లగడ్డ: చేతిపంపుల మరమ్మతుల పేరుతో అధికారులు ధన దాహం తీర్చుకుంటున్నారు. కొంత మంది నాయకులు వీరికి సహకరిస్తున్నారు. జిల్లాలో 54 మండలాల్లో 821 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, ఆత్మకూరు, మున్సిపాలిటీలు, ఆళ్లగడ్డ, గూడూరు, కోడుమూరు, నందికొట్కూరు నగర పంచాయతీలున్నాయి. వీటన్నింటిలో మొత్తం 25,542 చేతిపంపులున్నాయి. వీటితో పాటు మోటార్ల ద్వార నీరందించే బోర్లు మరో 1000 దాకా ఉన్నాయి. వాస్తవంగా ప్రతి 250 బోర్లకు ఒక మెకానిక్ ఉండాలి. 500 బోర్లకు కూడా ఒక మెకానిక్ లేడు. 54 మండలాలలకు కలిపి 14 మందే ఉన్నారు. దీంతో చేతిపంపుల నీటిపైనే ఆధారపడే ఆళ్లగడ్డ, కోవెంలకుంట్ల, నంద్యాల వంటి ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ మరమ్మతులకు గురైన చేతిపంపులు బాగు చేయాలంటే సంవత్సరాలు పడుతోంది. మోకానిక్‌ల కొరత ఒక కారణమైతే వచ్చిన నిధులు కొందరు అధికారులు, అధికారపార్టీ నాయకులు మధ్యలోనే స్వాహా చేయడం మరో కారణంగా కనిపిస్తోంది. నిధులు కరిగిపోయినా.. మెరుగవ్వని బోర్లు జిల్లాలో మొత్తం 25 వేల దాక బోర్లుండగా వీటిలో చాలా బోర్లు చిన్నచిన్న మరమ్మతులతో నిరుపయోగంగా మారాయి . అయితే వీటిని ఉపయోగం లోకి తీసుకొచ్చి వేసవిలో నీటి ఎద్దడిని తీర్చాలనే లక్ష్యంతో ఒక్కో బోరుకు ఏడాదికి రూ. 2 వేల ( ఆరు నెలల కోసారి 1000) చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించి ఒక్కో బోరుకు రూ. 1000 చొప్పున జనవరి నెలలోనే ఎంపీడీఓల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. జిల్లా మొత్తానికి రూ. 2.5 కోట్లు నిధులు విడుదలైనట్లు సమాచారం. వీటితో అదనపు పైపులు, బోరు మరమ్మతులు, మెకానిక్ (కాంట్రాక్ట్)ల కూలీ ఖర్చులకు వెచ్చించాలి. కానీ చాలా చోట్ల బోర్ల మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత అవసరాలకు సామగ్రి జిల్లాలోని అనేక మంది అధికార పార్టీకి చెందిన సర్పంచులు చేతిపంపులకు అదనపు పైపులు అవసరమని తీసుకెళ్తున్నారు. తర్వాత వాటిని వేయకుండా తమ సొంతానికి వాడుకుంటున్నారు. కొందరు పశువుల పాకలకు, రేకుల షెడ్డుకు ఉపయోగించుకుంటున్నారు. ఈవిషయం అధికారులు తెలిసినా చూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. -
ప్రమాద ఘంటికలు
మెదక్: జిల్లాలో చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో సాగు నీరు కోసం రైతన్న భగీరథ ప్రయత్నాలు చేస్తున్నాడు. పాతాళగంగను పైకి తెచ్చేందుకు ప్రతి ఏటా విరివిగా బోర్లు తవ్వుతూనే ఉన్నారు. దీని కోసం లెక్కకు మించిన అప్పులు చేసి మరీ బోర్లు వేస్తున్నారు. విచ్చలవిడిగా బోర్లు తవ్వడంతో భూగర్భ జలాలు ప్రమాదస్థాయికి పడిపోయాయి. జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 1.30 లక్షల బోర్లు పనిచేస్తున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన బోర్లు 90 వేలు ఉండగా 10వేల బోర్లు గృహ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. మరో 30 వేల బోర్లు తాగునీటి కోసం, కంపెనీల యజమాన్యాలు తవ్వినవి. కొన్ని గ్రామాలకు మాత్రమే.. సరైన వర్షాలు లేకపోవడంతో పాతాళంలోనుంచి నీటిని బోర్లు ఎత్తిపోస్తున్నాయి. ఫలితంగా ప్రమాదస్థాయికి నీరు పడిపోయింది. జిల్లాలో పాపన్నపేట, మండలంతోపాటు మెదక్, కొల్చారం, హవేళిఘణాపూర్ మండలాల్లోని కొన్ని గ్రామాలకు మాత్రమే ఘనపూర్ ప్రాజెక్టు నుంచి ఎఫ్ఎం, ఎంఎ కాల్వలద్వారా సాగు నీరందుతోంది. కొంతకాలంగా సరైన వర్షాలు లేక చెరువు, కుంటలు నెర్రలు బారాయి. దీంతో సాగునీటికోసం రైతులు పోటీపడి మరి బోర్లుతవ్వుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకదగ్గర జిల్లాలో 40 నుంచి 50 వరకు బోర్లు తవ్వుతున్నారు. ప్రస్తుతం ఎండలు ముదురుతున్న క్రమంలో ఈ సంఖ్యామరింత పెరిగే అవకాశం ఉందని అధికారులే చెబుతున్నారు. కాగా పాలకులు, అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నీటి జాడ కరువు గతంలో బోరుబావిని తవ్వాలంటే 250 అడుగుల లోతు వేసేవారు. నేడు ఏకంగా 350 నుంచి 400 ఫీట్ల లోతుకు వెళ్తే తప్ప నీరు కనిపించని దుస్థితి. కొన్న చోట్ల ఎంత కిందకు వెళ్లినా నీటిజాడ దొరకని మండలాలు అనేకం ఉన్నాయి. సాగునీటికోసం చేసే ప్రయత్నంలో రైతులు అప్పుల పాౖలౌవుతున్నారు. ప్రమాద స్థాయిలోకి.. వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేయడంతో ఈ సమస్య మరింత జటిలమవుతుంది. దీంతో రైతులు స్థాయికి మించి పంటలను సాగు చేస్తున్నారు. బోరుబావిలో వచ్చే నీటిని కాకుండా సదరు రైతుకు బోరువద్ద ఎంత భూమి ఉంటుందో పూర్తి స్థాయిలో సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో సాగుచేసిన పంటకు నీటి తడులు అందక పోవడంతో 24 గంటల పాటు బోరును నడిపిస్తున్నాడు. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతూ ప్రమాద స్థాయికి చేరుతున్నాయి. నీటి తడులు అందడం లేదు.. నాకున్న రెండు ఎకరాల భూమిలో ఇటీవలే రెండు బోర్లువేశాను. ఒక దాంట్లో మాత్రమే కొద్దిపాటిగా నీరు వచ్చింది. ఆనీటి ఆధారంగా ఎకరం పొలంలో వరి నాటు వేశాను. కాగా ఆ నీటితో పొలానికి సరిపడ నీటితడులు అందడం లేదు. పంటను రక్షించుకోవాలనే తాపత్రయంతో మరో బోరు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. –బాగయ్య, రైతు -
‘వాల్టా’తో బోరు బావులకు చెక్ !
భూగర్భ జలాలు బాగా అడుగంటిన గ్రామాల్లో వాల్టా చట్టం అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరిధిలోని 1,227 గ్రామ పంచాయతీల్లో వాల్టా చట్టం – 2002 అమలులో ఉంటుందంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జనవరి 25న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలోని 18 గ్రామాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం ప్రకటించిన గ్రామాల్లో కొత్తగా వ్యక్తిగత బోర్లు, బావుల తవ్వకాలపై ఆంక్షలు వర్తిస్తాయి. ఇప్పటికే ఉన్న బోర్లు, బావుల నుంచి నీటి తోడకంపైనా ఆంక్షలు ఉంటాయి. వాల్టా చట్టంలోని ఛాప్టర్ – 3 సెక్షన్ 8 (2) ప్రకారం బోర్లు, బావుల నుంచి నీటి తోడకానికి ఉపయోగించే మోటార్లకు విద్యుత్ వినియోగంపైన ఆంక్షలు వర్తిస్తాయి. ఈ చట్టం అమలయ్యే గ్రామాల పరిధిలోని ఇసుక తవ్వకాలపైన కూడా నిషేధం ఉంటుంది. సామూహిక తాగునీటి అవసరాలకు భూగర్భ జల వనరుల శాఖ అధికారుల అనుమతితో మాత్రమే తవ్వకాలకు అవకాశం ఉంటుంది. చిలకలూరిపేట : వాల్లా చట్టం అమలులో ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆయా గ్రామాల్లో వాల్టా (వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్) చట్టం అమలులో ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వర్షాలు కురవని సందర్భాలలో భూగర్భ జలాలు అడుగంటిపోయి కరువుకాటకాలు ఏర్పడుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో రోజువారీ అవసరాల కోసం మనుషులతో పాటు పశువులకు తాగేందుకు సరిపడ నీరు దొరకని పరిస్థితులు ఉంటాయి. చెరువులు, వాగులు ఎండిపోవటంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి ప్రమాదాన్ని అంచనా వేసి ముందస్తు చర్యల్లో భాగంగా వాల్టా చట్టాన్ని ఆయా గ్రామాలలో అమలు చేస్తుంటారు. అమలుకాని మార్గదర్శకాలు.. ఆయా గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి చేరాయని, భవిష్యత్‌లో నీటి కష్టాలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని భూగర్భ జల వనరుల శాఖ అంచనా వేసింది. ఉదాహరణకు వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో గత ఏడాది ఫిబ్రవరిలో 16.728 మీటర్ల అడుగున ఉన్న నీటి నిల్వలు ఈ ఏడాది ఫిబ్రవరిలో 22.435 మీటర్లకు దిగజారాయి. మాచర్లలో 19.327 మీటర్ల అడుగున ఉన్న జలాలు ఈ ఏడాది 31.202 మీటర్ల అడుగుకు పడిపోయాయి. భూగర్భ జలాల వినియోగంపై సుప్రీం కోర్టు గతంలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం బోరు వేయటానికి 15 రోజుల ముందు సంబంధిత యజమాని భూగర్భ జల వనరుల అధికారులకు సమాచారం అందజేయాలి. వారి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు బోర్వెల్ తవ్వకం యంత్రాలు కలిగి ఉన్న నిర్వాహకులు విధిగా తమ పేర్లను సంబంధిత అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. గ్రామాలవారీగా బోర్ల వివరాలు పంచాయతీలు సేకరించాలి. అయితే వీటిలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోకపోవటంతో అవస్థలు తప్పటం లేదు. జిల్లాలో సుమారు 50 వేల పైచిలుకు బోర్లు ఉన్నాయి. వర్షాభావంతో రైతులు భూగర్భ జలాల పైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో భూగర్భ జలాల లభ్యత అడుగంటుతోంది. పట్టణ ప్రాంతాలలో అపార్ట్మెంట్లకు సైతం విచ్చలవిడిగా బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రైవేటు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి యథేచ్ఛగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. విచ్చలవిడిగా వివిధ అవసరాలకు బోర్లు వేయకుండా ప్రజలను చైతన్యం చేయటం ద్వారానే భూగర్భ జలాలు పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖలపై ఉంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వాగుల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు అధికం అయ్యాయని తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ చట్టం ప్రకారం ఇసుక తవ్వకాలు నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 18 గ్రామాలలో మాత్రమే భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకొని వాల్టా చట్టం అమలుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తీరు మారని పక్షంలో జిల్లాలోని మరెన్నో గ్రామాలకు భూగర్భ జలాల లభ్యత లేకుండాపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకుంటుందా... వాగులు వట్టిపోకుండా ఇసుక రవాణా నియంత్రించి భూగర్భ జలాల పెంపునకు సహకరిస్తుందా అనేది వేచి చూడాలి. తవ్వకాలు చేయరాదు.. సంబంధిత 18 గ్రామాల్లో కొత్తగా బోర్లు, బావుల కోసం ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. ఇసుక తవ్వకాలు చేయరాదు. సామూహిక తాగునీటి అవసరాల కోసం అనుమతితో మాత్రమే కొత్త బోర్లు వేయాల్సి ఉంటుంది. – ఎం. రామ్‌ప్రసాద్, డీడీ, భూగర్భ జల వనరుల శాఖ -
‘బోరు బావుల’పై సర్కారు మార్గదర్శకాలు
బోర్లు వేసే రిగ్లకు అనుమతులు తప్పనిసరి చేశాం హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నిరుపయోగ బోరు బావుల వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. బోర్లు వేసే రిగ్లకు అనుమతులను తప్పనిసరి చేశామని తెలిపింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో బోరు బావిలో పడి ఇటీవల ఓ చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో సుప్రీం మార్గదర్శకాలను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించా లంటూ పిల్ దాఖలవడం తెలిసిందే. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు. వికారాబాద్‌లో చిన్నారిని రక్షించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన బోరు యజమానిపై కేసు నమోదు చేశామని, బోరును మూసేసినా యజమాని అనుమతి లేకుండా తిరిగి తెరిచారన్నారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారంతోపాటు పిల్లలకు ఉచిత విద్య, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 3 వేల బావులకు మూతలు బిగించామన్నారు. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధిశాఖ మంత్రి సమీక్ష నిర్వహించి సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ తాజాగా మార్గదర్శకాలను రూపొందించామని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యంపై 30న హైకోర్టు విచారణ జరపనుంది. ఇవీ మార్గదర్శకాలు... ► డ్రిల్లింగ్ ఏజెన్సీలన్నీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ► ప్రతి రిగ్ యజమాని లేదా ఆపరేటర్ నెలలో భూగర్భ జలశాఖ వద్ద ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండేళ్లకోసారి దాన్ని పునరుద్ధరించుకోవాలి. ► రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే జరిమానా చెల్లించాలి. జరిమానా చెల్లించాక కూడా రిజిస్టర్ చేసుకోకుంటే క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ► బోరు తవ్వేందుకు తహసీల్దార్, ఎమ్మార్వో నుంచి అనుమతులున్నాయో లేదో రిగ్ యజమాని తెలుసుకోవాలి. అనుమతులు లేకున్నా బోరు తవ్వితే రిగ్ యజమానికి రూ. లక్ష జరిమానా. ► రిగ్ యజమాని బోరు తవ్వకం పూర్తయిన తరువాత బోరు తవ్విన విషయాన్ని తవ్విన 3 రోజుల్లోపు తహసీల్దార్ లేదా ఎమ్మార్వోకు తెలియచేయాలి. ► బోర్లకు మూతవేయలేదని తెలిస్తే ఎమ్మార్వో యజమానులకు నోటీసిచ్చి మూసివేతకు ఆదేశాలివ్వాలి. ► కలెక్టర్లందరూ క్షేత్రస్థాయి సిబ్బంది సాయంతో నిరుపయోగంగా ఉన్న, ట్యూబ్ బావులపై సర్వే చేసి వివరాలన్నింటినీ ఆన్లైన్ డేటాబేస్‌లో ఉంచాలి. ► నిరుపయోగంగా ఉన్న, తవ్వి వదిలేసిన బోరు బావుల యజమానులకు ఏడు రోజుల్లో మూసివేతకు నోటీసులివ్వాలి. మూసేయకుంటే రూ. 50 వేల జరిమానాతోపాటు క్రిమినల్ కేసు పెట్టాలి. -
బోరుబావుల ప్రమాదాల నివారణకు చర్యలేవీ?
సర్కార్‌ను వివరణ కోరిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: బోరు బావుల్లో పిల్లలు పడకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బోర్లు తవ్వి పూడ్చకుండా వదిలేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, తవ్వి వదిలేసిన బోర్లు ఎన్ని ఉన్నాయో చెప్పాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం కోరింది. బోరు బావులు నిరుపయోగంగా ఉన్న వాటి వల్ల జరుగుతున్న ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది బుద్దారపు ప్రకాశ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. చేవెళ్ల దగ్గరలోని ఇక్కారెడ్డిగూడలో బోరు బావిలో పడి చిన్నారి మరణించిన ఘటనలో ఆ బోరుబావి యజమానిపై పెట్టిన కేసు విచారణ ఏ దశలో ఉందో తెలపాలని కోరింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో బాలుడు చంద్రశేఖర్ బోరు బావిలో పడిన ఘటనపై ధర్మాసనం ప్రస్తావించింది. చేవెళ్ల ఘటనలో బోరుబావి యజమానిపై పెట్టిన కేసు పురోగతి వివరాలు తెలపాలని కోరిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. -
ఊరూరా రాకాసి నోళ్లు!
వందల సంఖ్యలో బోరుబావుల గుంతలు - బోరు విఫలమైతే పూడ్చని యజమానులు, బోర్‌వెల్స్ నిర్వాహకులు - ఆడుకుంటూ గుంతల్లో పడి బలవుతున్న చిన్నారులు - అమలుకాని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, వాల్టా చట్టం సాక్షి, హైదరాబాద్: ఊరూరా రాకాసి బోర్లు నోళ్లు తెరుచుకుని ఉన్నాయి. అభం శుభం తెలియని చిన్నారులను బలిగొంటూనే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచూ బోరుబావుల్లో చిన్నారులు పడి మృత్యువాత పడుతున్నా.. ప్రభుత్వాలు, అధికారుల్లో అదే బాధ్యతా రాహిత్యం, నిర్లక్ష్యం కనిపిస్తున్నాయి. బోరు యజమానులు, బోర్‌వెల్స్ నిర్వాహకుల నిర్లిప్తత చిన్నారులకు పెను గండంగా మారింది. బోర్ల తవ్వకం, గుంతల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, వాల్టా చట్టం వంటివి ఏ మాత్రం అమలుకావడం లేదు. వేల సంఖ్యలో బోర్లు.. తాగునీరు, సాగునీటి అవసరాల కోసం ఏటా వేల సంఖ్యలో విచ్చలవిడిగా బోరుబావుల తవ్వకాలు జరుగుతున్నాయి. అందులో పెద్ద సంఖ్యలో బోర్లు నీళ్లు పడక విఫలమవుతు న్నాయి. ఇలా విఫలమైనవాటిని వెంటనే పూడ్చివేయకుండా.. భూయజమానులు, బోర్ వెల్స్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏదో బండరాళ్లు పెట్టడం, ఇసుక బస్తాలు కప్పి వదిలేయడం చేస్తున్నారు. కొద్దిరోజులకే ఇసుక బస్తాలు చిరిగిపోవడం, ఎవరైనా బండరాళ్లు పక్కకు జరపడంతో.. బోరు గుంతలు రాకాసి నోళ్లు తెరుచుకుంటున్నాయి. ఆడుకుంటూ వచ్చిన చిన్నారులు వాటిలో జారిపడు తున్నారు. గంటలు, రోజుల తరబడి మృత్యు వేదనను అనుభవిస్తున్నారు. ఎంతో శ్రమించి బోరుబావులకి సమాంతరంగా తవ్వకాలు జరిపినా చిన్నారులు ప్రాణాలతో బయటపడడం లేదు. బోరు గుంతలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఎక్కడా అమలు కావడం లేదు. విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు జరపకుండా వాల్టా చట్టంలో పేర్కొన్న నిబంధనలూ కాగితాలకే పరిమితమయ్యాయి. బతికి బయటపడడం కష్టమే! ► 2012 డిసెంబర్ 8న కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం పల్లెకుంటలో అజిత్ (5) అనే బాలుడు ఇంటిపక్కన ఉన్న పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడి 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు. రెండు గంటల పాటు తవ్వకాలు జరిపినా.. బాలుడి మృతదేహమే లభించింది. ► 2014 అక్టోబర్ 10న రంగారెడ్డి జిల్లా మంచాల సమీపంలో గిరిజ (5) అనే బాలిక బోరుబావిలో పడి 45 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. మూడు రోజుల పాటు శ్రమించి సమాంతరంగా బావి తవ్వారు. బాలిక అప్పటికే మృతి చెందడంతో సగం మృతదేహాన్ని మాత్రమే బయటకు తీయగలిగారు. ► 2015 మార్చి 8న నల్లగొండ జిల్లా పులిచెర్లలో బాలగోని నర్సింహగౌడ్ కుమారుడు శివ (3) తన తాతకు చెందిన పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. మూడు గంటల పాటు శ్రమించి గుంత తవ్వినా కాపాడలేకపోయారు. ► 2015 నవంబర్ 28న మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో రాకేశ్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ 60 అడుగుల లోతున్న బోరుబావిలో జారిపడ్డాడు. 24 గంటల పాటు శ్రమించి గుంతను తవ్వినా.. అప్పటికే మృతి చెందాడు. ► 2016 డిసెంబర్ 7న నెల్లూరు జిల్లా కావలి మండలం నందెమ్మపురంలో మౌనిక(2) తమ ఇంటి ముందు తవ్విన బోరుబావి లోనే పడిపోయింది. ఆమెను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మృత్యుంజయులు కొందరే! ► మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలో నందిని అలియాస్ అంజలి (6) అనే బాలిక బోరుబావిలో పడినా ప్రాణాలతో బయటపడింది. నీరు పడలేదని బోరుబావిని పూడ్చేసినా దాదాపు 10 అడుగుల మేరకు వదిలేశారు. లోతు తక్కువగా ఉండడంతో బాలిక సురక్షితంగా బయట పడింది. రెండు గంటల పాటు తవ్వకాలు జరిపి బాలికను సురక్షితంగా బయటకు తీశారు. ► మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలం బింగదొడ్డి గ్రామానికి చెందిన తిరుమలేశ్ అనే ఏడాదిన్నర బాలుడు 2011 డిసెంబర్ 7న బోరుబావిలో పడిపోయాడు. బోరుబావికి సమాంతరంగా బావి తవ్వి 20 అడుగుల లోతు నుంచి తిరుమలేశ్ను సురక్షితంగా తీశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలివీ.. ► బోరు వేయడానికి 15 రోజుల ముందు భూ యజమాని సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా తెలియజేయాలి. ► బోరు చుట్టూ కంచె లేదా తగిన రీతిలో రక్షణ ఏర్పాట్లు చేయాలి. ► బోరు రంధ్రం చుట్టూ అర మీటరు పొడవు, అర మీటరు వెడల్పు, భూమిలో 0.3 మీటర్ల లోతు, భూఉపరితలంపై 0.3 మీటర్ల ఎత్తు ఉండేలా సిమెంట్ ప్లాట్‌ఫాం నిర్మించాలి. ► బోరుపై భాగంలో ఇనుప ప్లేటు లేదా బలమైన మూత బిగించాలి. ► మరమ్మతుల కోసం బోరు మూత తీసినా వెంటనే బిగించాలి. ► నీళ్లు పడని బోర్లను మట్టి, ఇసుక, రాళ్లతో భూ ఉపరితలం వరకు పూర్తిగా పూడ్చివేయాలి ► బోరు నిరుపయోగంగా ఉన్నా, నీరు పడకున్నా, నిరుపయోగమని అనుకున్నా సంబంధిత అధికారులకు తెలియజేసి, ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ► ప్రభుత్వ, ప్రైవేటు బోరువెల్స్ యంత్రాల నిర్వహకులు విధిగా జిల్లా అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. ► బోరు యజమాని, బోరు తవ్విన సంస్థ వివరాలు తెలుపుతూ బోరు బావి వద్ద బోర్డు ఏర్పాటు చేయాలి. ► గ్రామాల వారీగా బోర్ల స్థితికి సంబంధించిన సమాచారం సేకరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో పాటు సంబంధిత శాఖలు ఈ బాధ్యత నిర్వర్తించాలి. పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య ఇంజనీరింగ్ లేదా పురపాలక, భూగర్భ జల శాఖలు ఈ బాధ్యత తీసుకోవాలి. -
ఒకేచోట 67 బోరు బావులు
హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్లో రెవిన్యూ అధికారులు హడావుడి చేశారు. ఒకే ప్రాంతంలో పదుల సంఖ్యలో బావులను గుర్తించారు. దీంతో వాటిని పూడ్చివేసే చర్యలకు దిగారు. అబ్దుల్లాపూర్ మెట్లో ఒకే చోట పెద్ద సంఖ్యలో బోరు బావులు ఉన్నట్లు సాక్షిలో కథనం ప్రసారం కావడంతో అప్రమత్తమైన అధికారులు అక్కడికి వెళ్లి మొత్తం 67 బోరు బావులు గుర్తించారు. దీంతో వాటిని తీయించిన వారిని గట్టిగా మందిలిస్తూ వాటిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. బోరు వేసి వదిలేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఎమ్మార్వో విజయ చెప్పారు. -
అడుగంటిన ఆశలు
► మండుతున్న ఎండలు.. ఎండుతున్న వరి చేలు ► తగ్గుతున్న భూగర్భజలాలు, వట్టిపోతున్న బోరుబావులు ► సాగునీరు అందక 400 ఎకరాల్లో పంట ఎండుముఖం ► పశువులకు మేతగా మారిన పైర్లు ► నష్టపరిహారం అందించాలని రైతుల వేడుకోలు వరి చేలకు నీళ్లు లేక అన్నదాతకు కన్నీళ్లే మిగిలాయి. మండే ఎండలతో పొలాలు నెర్రెలు బారుతున్నాయి. పంట ఎండిపోవడంతో పశువులకు మేతగా మారుతోంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఎన్నో ఆశలతో సాగు చేసిన వరి చేతికందని పరిస్థితులతో రైతులు వేదనకు గురవుతున్నారు. మండుతున్న భానుడితో చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గిపోతోంది. బోర్లు ఎండిపోతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో సుమారు 400 ఎకరాల్లో వరికి నీళ్లు అందక ఎండిపోయింది. వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్ సరాఫరా అవుతున్నా.. భూగర్భ జలాలు అడుగంటడంతో ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్: సాగునీరు పుష్కలంగా ఉంటుందన్న ఆశతో రైతులు యాసంగిలో ఉత్సాహంగా వరి పంట సాగు చేశారు. ఈసారి కాస్తో కూస్తో కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీరు ఉందనే ఆలోచనతో ఎక్కువ విస్తీర్ణంలో పంట వేశారు. గత ఖరీఫ్‌లో 425 హెక్టార్లలో సాగవ్వగా.. ఈ యాసంగిలో సాధారణ విస్తీర్ణం 625 హెక్టార్లు కాగా సుమారు 800 హెక్టార్లలో సాగు చేశారు. ఈ నేపథ్యంలో దండుమైలారం, నెర్రపల్లి, పోల్కంపల్లి, రాయపోల్, ముకునూర్ గ్రామాల్లో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వేసవికి ముందే భూగర్భ జలాలు పడిపోయాయి. దీంతో చేతికొచి్చన పంటలు ఎండుముఖం పట్టాయి. ఎగువ భాగమైన కప్పపహాడ్, ఎల్మినేడు, కొంగరకలాన్, పోచారం, ఉప్పరిగూడ, తులేకలాన్, రాందాస్‌పల్లి గ్రామాల్లో పెద్దగా పంటలు ఎండిపోలేదు. దిగువభాగంలోని దండుమైలారం, నెర్రపల్లి, ముకునూర్ గ్రామాల్లో 400 ఎకరాలకు పైగా పంట ఎండిపోయింది. ప్రస్తుతం ఎండలు ఏమాత్రం ముదరక ముందే ఈ పరిస్థితి దాపురించిందంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండనుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తున్నప్పటికీ బోరుబావుల్లో నీరు లేకపోవడంతో ఇంతటి గడ్డు పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.25 వేలకుపైగా పంటకు పెట్టుబడులు పెట్టామని, నీళ్లు లేక వరి చేలు కళ్లముందే ఎండిపోతుంటే తల్లడిల్లుతున్నారు. ఎండిపోయిన పంటకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే మండలంలో 400 ఎకరాలకు పైగా పంటలు ఎండిపోతున్నా వ్యవసాయ అధికారులు మాత్రం గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేసిన దాఖలాలు లేకుండా పోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వారు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఇబ్బడి ముబ్బడిగా బోరుబావులు వేసవికాలంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అవగాహన లేకుండా బోర్లు వేసి రైతులు అప్పులపాలవుతున్నారు. కొద్దిగా నీరు వచ్చిన తరువాత ఎండిపోతున్నాయి. సహజ వనరులను కాపాడేందుకు తీసుకొచి్చన వాల్టా చట్టం కేవలం కాగితాలకే పరిమితమైంది. మండలంలోని వాల్టా చట్టానికి ప్రత్యేక కమిటీలుంటాయి. తహసీల్దార్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. బోరు వేసే ముందు తహసీల్దార్ అనుమతి తీసుకుని నిర్ణీత రుసుము చెల్లించాలి. అధికారులు సూచించిన లోతును మాత్రమే బోరుబావులు తవ్వించాల్సి ఉంటుంది. ప్రతి బోరుకు 250 మీటర్ల దూరం ఉండాలి. అనుమతులు తీసుకోకుండా అక్రమంగా వేసే బోరు యంత్రాలను వేసిన బోర్లను సీజ్ చేసే అధికారం తహసీల్దార్‌కు ఉంటుంది. షాబాద్ పంట నష్టం అంచనా వేస్తాం ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటడంతో నెర్రపల్లి, దండుమైలారం, రాయపోల్, ముకునూర్ గ్రామాల్లో పంటలు ఎండిపోతున్న విషయం మా దృష్టికొచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేస్తాం. రైతులను ఆదుకుంటాం. – వరప్రసాద్‌రెడ్డి, ఏఓ, ఇబ్రహీంపట్నం బోరుకు బంగారం తాకట్టు పెట్టాం నాలుగు ఎకరాల్లో వరి పంట వేశా. పుష్కలంగా నీరు ఉందన్న ఆశతో సాగు చేస్తే ప్రస్తుతం ఎండిపోయింది. రూ.70 వేలు ఖర్చు చేసి బోర్లు వేశాం. బంగారం తాకట్టు పెట్టి బోరు వేయిస్తే చుక్క నీరు రాలేదు. అప్పు చేసి సాగు చేసిన పంట ఎండిపోవడంతో ఏం చేయాలో తోచడం లేదు. – దోర్నాల అబ్బసాయిలు, రైతు -
పడమటి మండలాల గోడు పట్టదా?
► రెండు నియోజకవర్గాలకే పరిమితమైన ► ఎన్టీఆర్ జలసిరి కరువుకోరల్లో ఉన్నా పడమటి మండలాలను పట్టించుకోని అధికారులు ► రెండు వందల అడుగులకే ప్రభుత్వ నిధులంటూ ఆంక్షలు ► జిల్లాలో వెయ్యి అడుగులు లోతు తవ్వినా నీరుపడని వైనం ఇందిర జలప్రభ పథకాన్ని ఎన్టీఆర్ జలసిరిగా పేరుమార్చిన చంద్రబాబు సర్కార్ జిల్లాలోని కరువు ప్రాంతాలైన పడమటి మండలాలను గాలికొదిలేసింది. ఉచితబోరు బావుల తవ్వకాన్ని తూర్పు మండలాలైన శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోని 9 మండలాలకే పరిమితం చేయడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సాక్షి, చిత్తూరు: జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా బోరుబావులు తవ్వి మోటారుతో పాటు విద్యుత్ సర్వీసును సైతం ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పింది. ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని జిల్లావ్యాప్తంగా కాక కేవలం శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కేవీబీపురం, బీఎన్ కండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలకే పరిమితం చేసింది. ఈ మండలాల్లో 1020 బోర్లు బావులు తవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇక పేరుకు ఉచిత బోరుబావుల పథకమని చెప్పి రైతుకు మొక్కుబడి రాయితీ నిధులను మాత్రమే విదిల్చనున్నారు. అది కూడా కేవలం 200 అడుగులకు మాత్రమే అడుగుకు రూ.80 చొప్పున కేవలం రూ.16 వేలను ఉపాధి హామీ పథకం కింద ఇవ్వనున్నారు. దీంతోపాటు 20 మీటర్ల కేసింగ్ పైపుకు రూ.8 వేలు, కరెంట్ సరఫరాకు రూ.50 వేలు, మోటారుకు రూ.40 వేలు మాత్రమే ఇవ్వనున్నారు. ఈ లెక్కన ఒక్కొక్క బోరుబావికి రూ.1.15 లక్షల నిధులను మాత్రమే ప్రభుత్వం ఇవ్వనుంది. 1020 బోరుబావుల తవ్వకానికి రూ.12.24 కోట్లకు పైగా వెచ్చించనున్నారు. మొక్కుబడి రాయితీ జిల్లాలో ఒక్కొక్క బోరు బావి తవ్వకానికి రూ.4 నుంచి 5లక్షల వరకు ఖర్చు అవుతుండగా ప్రభుత్వం కేవలం రూ.1.15 లక్షలు మాత్రమే ఇస్తామని ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో గత 15 ఏళ్లుగా వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటాయి. గత నవంబర్‌లో భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. అయినా 200 అడుగుల లోపు బోరు బావులకు నీళ్లు పడే పరిస్థితి లేదు. ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా 1000, 1500 అడుగుల వరకు బోరు బావి తవ్వితేనే నీరు పడే పరిస్థితి ఉంది. శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంతాల్లో మాత్రమే భూగర్భ జలాలు పెరిగాయే తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదు. ఈ లెక్కన కనీసం వెయ్యి అడుగులైనా బోరు బావి తవ్వాల్సిందే. ప్రభుత్వం ఇస్తానన్న ప్రకారం గణించినా అడుగుకు రూ.80 చొప్పున వెయ్యి అడుగులకు రూ.80 వేల వరకు వెచ్చించాల్సిందే. ఇక బోరుబావి విద్యుత్ సరఫరా కోసం కనీసం రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం మాత్రం రూ.50 వేలు మాత్రమే ఇస్తాననడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రాయితీ కింద ఇచ్చే మొత్తం రైతుకు ఏమూలకు సరిపోదు. మిగిలిన మొత్తాన్ని వెచ్చించే గలిగే స్థోమత ఎస్సీ, ఎసీ, సన్న, చిన్నకారు రైతులకు లేదు. ఈ పథకం కింద ఎలాగూ జిల్లావ్యాప్తంగా మొక్కుబడిగా మాత్ర మే బోరుబావులు తవ్వుతారు కాబట్టి మొత్తం ఖర్చు ను ప్రభుత్వమే భరించాలని, దీంతో పాటు సొంతం గా బోరుబావులు తవ్ని నీరు పడక నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉచిత బోర్ల కోసం పచ్చచొక్కాల పాకులాట ఎన్టీఆర్ జలసిరి కింద ప్రభుత్వం ఉచిత బోరుబావుల తవ్వకానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో బోరుబావులను సొంతం చేసుకునేందుకు పచ్చచొక్క నేతలు రంగం సిద్ధం చేశారు. వాస్తవంగా ఈ పథకానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ పథకాన్ని ఆయా మండలాల ఎంపీడీవో, తహశీల్దారు, అగ్రికల్చర్ ఏవో, ఉపాదిహామీ ఏపీవో, ఇరిగేషన్ ఏఈ తదితరుల కమిటీ పర్యవేక్షించనుంది. ఆ తరువాత జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డ్వామా పీడీ, నీటిపారుదల శాఖ ఎస్ఈ, గ్రౌండ్‌వాటర్ డీడీ, వ్యవసాయశాఖ జేడీ, ఏపీఎస్ఐడీసీ అధికారుల కమిటీ బోరుబావుల తవ్వే రైతుల జాబితాలను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇప్పటికే పచ్చపార్టీ కార్యకర్తలను ఎంపిక చేసినట్లు సమాచారం. అర్హులైన ఎస్సీ,ఎస్టీ, పేద, బలహీన వర్గాల కోసమే ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ -2 పేరుకు ప్రకటించినా అర్హులైన వారికి అందే పరిస్థితి కనిపించడం లేదు. -
నీళ్లివ్వండి.. మహాప్రభో!
► నీటిని విడుదల చేయాలని కోయిల్‌సాగర్ ► రైతుల ఆందోళనచేతికందే దశలో వరి ► సాగునీటిని విడుదల చే స్తే తాగునీటి సమస్య తీరుతుందని ఆశ ► నేడు మరోసారి రైతుల ఆందోళన దేవరకద్ర: చేతికొచ్చిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయి.. బోరుబావులు ఎండిపోవడంతో తాగునీళ్లు మూగజీవాలు గోదరిల్లుతున్నాయి.. చెంతనే నీళ్లున్నా వాడుకోలేని దుస్థితిచూసి రైతుల గుండెలు మండిపోతున్నాయి.. అధికారులు, ప్రజాప్రతినిధులకు సమస్యను చెప్పినా పట్టించుకోవడం లేదని ఆందోళనబాట పడుతున్నారు. ఈ క్రమంలో వారంరోజులు క్రితం రైతు లు కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ముట్టడించి, షట్టర్లను బద్దలుకొట్టి నీటిని విడుదల చేశారు. రైతులు నీటికోసం యుద్ధవాతావరణం సృష్టించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గేట్లను మూయించారు. అయితే నీటిని వదిలే ప్రసక్తేలేదని జిల్లా ఉన్నతాధికారులు తేల్చిచెప్పడంతో మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు కింద దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ మండలాల పరిధిలో 12వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, రబీ సీజన్లో ఐదువేల ఎకరాల్లో వరిపంటలు సాగుచేశారు. సీజన్‌కు ముందుగానే అధికారులు రబీ కింద వరి పంటలు వేయొద్దని సూచించినా ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గ్రామాల రైతులు బోరుబావులపై ఆధారపడి వరిపైరును వేశారు. తీరా పంట పొట్టదశలోకి చేరుకున్నాక నీటివనరులు ఎండిపోయాయి.చేతికందేదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు కోయిల్‌సాగర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ వచ్చారు. కాల్వల ద్వారా నీటిని వదిలితే ఉన్న దశలో పంటల గట్టెక్కే అవకాశం ఉంది. కొంతనీరు వాగులో ప్రవహించి సమీపగ్రామాలకు తాగునీటి గోస ఉండదని రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 12 అడుగుల మేర నీరు ఉండగా.. రెండు తడులకు వదిలితే నాలుగు అడుగుల నీరు వినియోగమవుతోంది. మిగ తా 8 అడుగుల నీటిని పాలమూరు పట్టణానికి ఈ రెండునెలల పాటు అందించవచ్చు. జిల్లాకేంద్రం కోసం.. కోయిల్‌సాగర్ రిజర్వాయర్ నుంచి జిల్లాకేంద్రానికి తాగునీటిని అందిస్తున్నారు. రామన్‌పాడ్ తాగునీటి పథకం ద్వారా అందిస్తున్న నీరు ఇప్పటికే తగ్గిపోయింది. ప్రస్తుతం కోయిల్‌సాగర్ ఒక్కటే ఆధారం. భూగర్భజలాలు తగ్గినందున వచ్చే రెండు నెలలకు నీళ్లను సరఫరా చేసేందుకు అధికారులు కాపాడుతూ వస్తున్నారు. రబీ పంటలకు నీళ్లను విడుదల చేస్తే మున్ముందు సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
నోళ్లు తెరుచుకున్న బోర్లు..
గ్రామాల్లో వేసిన బోరుబావులు నోరు తెరుచుకున్నాయి. ప్రమాదాలు జరిగితే గానీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని పోతుగల్తాండా, హైతాబాద్, చందనవెళ్లి, దేవునిగడ్డ, బోడంపహాడ్, మన్మర్రి, అంతారం, సర్దార్‌నగర్, కక్కులూర్, కేశారం, నాందార్‌ఖాన్‌పేట్, మల్లారెడ్డిగూడ, సీతారాంపూర్ తదితర గ్రామాల్లో బోర్లు వేసినా నీరు సరిగా రాకపోవడంతో అలాగే వదిలేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మండలంలోని ఆయా గ్రామాల్లో నీరులేక వృథాగా పడి ఉన్న బోరుబావులను పూడ్చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. - షాబాద్ -
‘బిందు’వు కరువు!
అడుగంటిన భూగర్భజలాలు ఒట్టిపోయినబోరుబావులు {yిప్ ఇరిగేషన్‌పై ఆసక్తి చూపని రైతులు ఈ ఏడాది లక్ష్యం 23,935 హెక్టార్లు దరఖాస్తులు 7వేలు డీడీలు కట్టింది 1,200 మందే తీవ్ర వర్షభావంతో భూగర్భజలాలు అడుగంటాయి. బోరుబావులు ఒట్టిపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగం బిందుసేద్యంపై ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో బిందుపరి కరాలను పెద్ద ఎత్తున ఏర్పాటుచేసి నీటి పొదుపునకు చర్యలు చేపట్టాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. చిత్తూరు :జిల్లాలో 2015-16 సంవత్సరానికి గాను 23,935 హెక్టార్లలో బిందుపరికరా లు బిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు బిం దు పరికరాల కోసం 7వేల దరఖాస్తులు రాగా, 1,200 మంది రైతులు మాత్రమే పరికరాల కోసం డీడీలు చెల్లించారు. దరఖాస్తు చేసుకున్న మిగిలిన రైతులు డీడీలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగండడం, 2వేల అడుగుల లోతుకు బోర్లు వేసినా నీరందే పరిస్థితి లేకపోడమే అందుకు కారణమవుతోంది. ఇప్పటివరకు బోరుబావుల్లో వస్తున్న అరకొర నీరు సైతం ఇంకిపోవడంతో వేలాది బోర్లు ఒట్టిపోయాయి. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉన్న బోర్లు సైతం ఒట్టిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో నీటి ఎద్దడి నేపథ్యంలో బిందు సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీని అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే బిందు పరికరాలను బిగిస్తుండగా, ఐదు ఎకరాలు పైబడిన రైతులకు 50 శాతం సబ్సిడీతో పరికరాలను ఇస్తున్నారు. జిల్లాలో అధికంగా సాగవుతున్న వేరుశెనగ, మామిడి, చెరకు, కూరగాయల పంటలను సైతం బిందుసేద్యం పరిధిలోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు విస్తృత ప్రచారం కల్పించారు. ఇప్పటివరకు జిల్లాలో 79వేల హెక్టార్లలో బిందుపరికరాలు బిగించారు. ఈ ఏడాది 23,935 హెక్టార్లను బిందుసేద్యం పరిధిలోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ తీవ్ర వర్షాభావ పరిస్థితుల ఇందుకు అడ్డంకిగా మారాయి. తాజా గణాంకాలు చూస్తే ఏడాది ముగిసే నాటికి 1500 మంది రైతులకు మించి బిందు పరికరాల కోసం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2014-15 లో 6వేల హెక్టార్ల పరిధిలో 7వేల మంది రైతులు బిందుపరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 15 శాతం కూడా బిందు పరికరాల ఏర్పాటుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. 2010-11 లో 7,570 హెక్టార్లు లక్ష్యం కాగా 6,733.38 హెక్టార్లలో బిందు పరికరాలు బింగించారు. 2011-12లో 12,482 హెక్టార్లు లక్ష్యం కాగా 8596.57 హెక్టార్లలో, 2012- 13లో 6712 లక్ష్యంగా, 6494.62 హెక్టార్లలో, 2013-14 లో 7,981 లక్ష్యంగా 6,022.77 హెక్టార్లలో, 2014-15 8,428 హెక్టార్లు లక్ష్యం కాగా, 6169.06 హెక్టార్లలో బిందు పరికరాలను బిగించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోరుబావుల ద్వారా నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతోనే బిందుపరికరాల ఏర్పాటుకు రైతులు ఆసక్తి కనబరచడం లేదని సూక్ష్మనీటిసాగు పథకం పీడీ శ్రీనివాసులు తెలిపారు.