Democrats
-
హాంకాంగ్ జాతీయ భద్రతా కేసులో సంచలన తీర్పు
హాంకాంగ్: పార్లమెంట్లో తమకు అనుకూలంగా వ్యవహరించే నేతల ఎంపిక కోసం అనధికారికంగా ప్రైమరీ ఎలక్షన్స్ చేపట్టి సమాంతర పార్లమెంటరీ వ్యవస్థ నిర్వహణకు తెగించారంటూ 45 మంది ప్రజాస్వామ్య ఉద్యమకారులు, మాజీ చట్టసభసభ్యులకు హాంకాంగ్ హైకోర్టు కఠిన శిక్షలు విధించింది. వీరికి నాలుగేళ్ల నుంచి పదేళ్ల శిక్షలుపడ్డాయి. పార్లమెంట్లో మెజారిటీ సభ్యులను తమ వైపునకు తిప్పుకుని ప్రభుత్వాన్ని నిర్విర్యంచేయాలని కుట్ర పన్నారని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే విపక్షసభ్యులుగా ఉంటూ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లను తిరస్కరిస్తూ వీటో చేసేందుకు వీరంతా కుట్ర పన్నారని కోర్టు తీర్పులో ప్రస్తావించింది. 2020 జూలై 10, 11వ తేదీల్లో జరిగిన ఈ అనధికార ప్రైమరీ ఎన్నికల్లో 6,10,000 ఓట్లు పోలయ్యాయి. అయితే ఆనాడు అధికార ఎన్నికలను ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా వాయిదా వేయడం తెల్సిందే. అయితే హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద జాతీయ భద్రతా కేసుగా పరిగణించబడిన ఈ కేసులో ఉద్యమకారులపై అన్యాయంగా శిక్షలు మోపారని ప్రపంచ దేశాలు ఖండించాయి. పరోక్షంగా చైనా ఏలుబడిలో ఉన్న హాంకాంగ్‌లో సమాంతర పాలనకు ప్రయత్నించారంటూ 2021 ఏడాదిలో 47 మంది ఉద్యమకారులను ప్రభుత్వం అరెస్ట్‌చేసింది. కఠిన జాతీయ భద్రతా చట్టం–2020 కింద కేసులు నమోదుచేసింది. ఈ చట్టం కింద దోషులుగా తేలితే గరిష్టంగా జీవితఖైదు పడే అవకాశముంది. 47 మందిలో గత ఏడాది ఇద్దరు నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ ఉదంతంలో సూత్రధారిగా కోర్టు పేర్కొన్న బెన్నీ థాయ్‌కు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షపడింది. మాజీ విద్యార్థి నాయకుడు జోషువా వాంగ్, మాజీ చట్టసభ సభ్యులకూ వేర్వేరు శిక్షలు పడ్డాయి. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న విషయంపై తమకు కనీస అవగాహన కూడా లేదని కొందరు నిందితులు కోర్టులో చెప్పడంతో వారికి తక్కువ శిక్షలుపడ్డాయి. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, మీడియాపై కఠిన ఆంక్షలు, ఎన్నికల్లో సాధారణ ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించడం వంటి పరిణామాల తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఆనాడు ఇలా అనధికార ప్రైమరీ ఎన్నికలు నిర్వహించారు. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. బ్రిటిష్ వలసప్రాంతంగా అభివృద్ధిచెందిన హాంకాంగ్‌పై పాలనాపగ్గాలు 1997లో చైనాకు దఖలుపడ్డాక హాంకాంగ్‌లో నిరంకుశ చట్టాలను డ్రాగన్‌దేశం అమలుచేస్తోందని ప్రపంచదేశాలు తప్పుపట్టడం విదితమే. ‘‘హాంకాంగ్ ప్రాథమిక చట్టం ప్రకారం శాంతియుతంగా తమ నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై కక్షగట్టి ప్రభుత్వం కేసులు బనాయించి ఆగమేఘాల మీద తీర్పు వెలువరించి శిక్షించింది’’అని హాంకాంగ్‌లోని అమెరికా కాన్సులేట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ్రస్టేలియా, బ్రిటన్, ఐరోపా సమాఖ్యతోపాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవహక్కుల పరిరక్షణా సంస్థలు తీర్పును తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే తీర్పును చైనా స్వాగతించింది. -
చివరి వారాల్లో అధ్యక్ష పీఠంపై కమల?
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల హోరాహోరీ పోరులో కాస్తంత వెనకబడి తొలి మహిళా దేశాధినేతగా అధ్యక్షపీఠంపై కూర్చునే సువర్ణావకాశాన్ని పోగొట్టుకున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను గద్దెనెక్కించాలని గట్టిగానే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివాదాలకు కేంద్రబిందువైన ట్రంప్ స్థానికత సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి అంతర్జాతీయ దౌత్యనీతిని పక్కకునెట్టి, దిగజారుడు వ్యక్తిగత దూషణలకు దిగి ఎలాగోలా పాపులర్ ఓటును ఒడిసిపట్టారన్న విమర్శల వేళ అగ్రరాజ్యంలో కొత్తరకం డిమాండ్ తెరమీదకొచ్చింది. చిట్టచివర్లో రేసులోకి దిగి, ఎన్నికల్లో చివరిదాకా పోరాడి అద్భుత పోరాటస్ఫూర్తిని ప్రదర్శించిన కమలాహారిస్‌కు చివరివారాల్లో అయినా అధ్యక్ష పట్టాభిషేకం చేయాలని చాలా మంది డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. అయితే ఇదేతరహా డిమాండ్లకు తలొగ్గి అధ్యక్ష రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి ఏకంగా అధ్యక్ష పదవినే త్యాగం చేస్తారా? ఒకవేళ త్యజించినా హారిస్ అధ్యక్షపీఠమెక్కడం నైతికంగా ఎంత వరకు సబబు? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘‘ బైడెన్ అద్భుతమైన నేత. ప్రజల ఎన్నో కోరికలను ఆయన నెరవేర్చారు. ఈ ఒక్క విన్నపాన్నీ ఆయన మన్నించాలి. అధికార మార్పిడికి ఒప్పుకుని హారిస్‌కు అవకాశం ఇవ్వాలి. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టడానికంటే ముందే హారిస్ ఈ చివరి వారాలు అధికారంలో ఉంటే నైతిక విజయం కమలదే అనే బలమైన వాదనను వినిపించినవాళ్లమవుతాం. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయావకాశాలూ మెరుగవుతాయి. చివరి రోజుల్లో బైడెన్ చేయగల గొప్పపని అంటూ ఏదైనా ఉందంటే అది ఇదే’’ అని కమలాహారిస్ కమ్యూనికేషన్స్ విభాగ మాజీ డైరెక్టర్ జమాల్ సైమన్స్ ఆదివారం విజ్ఞప్తిచేశారు. ‘‘ దేశవ్యాప్తంగా ట్రంప్‌తో పోలిస్తే కేవలం 36 లక్షల ఓట్లు మాత్రమే హారిస్‌కు తక్కువ వచ్చాయి. కోట్లాది మంది హారిస్‌ను అధ్యక్షపీఠంపై చూడాలనుకున్నారు. బైడెన్ దిగిపోయి హారిస్‌కు అవకాశమిస్తే వారి కల నెరవేరుతుంది. అమెరికా సైతం తొలి అధ్యక్షురాలిని చూస్తుంది’’ అని మరో డెమొక్రటిక్ నేత, నటుడు ఆండీ ఓస్ట్రీ అన్నారు. ట్రంప్‌తో ముఖాముఖి డిబేట్‌కు ముందువరకు బైడెనే డెమొక్రటిక్ అభ్యర్థి. డిబేట్లో పేలవ ప్రదర్శన తర్వాత అత్యున్నతస్థాయి డెమొక్రటిక్ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే బైడెన్‌ను రేస్ నుంచి తప్పించారు. కమలను బరిలో నిలిపారు. ఈసారి కూడా టాప్ డెమొక్రాట్ల లాబీయింగ్ పనిచేస్తుందో లేదో ఎవరికీ తెలీదు. అసలు ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేవా అనే వార్తపై కూడా అంతర్జాతీయ మీడియాకు లీకులు రావడం లేదు. 25వ సవరణ ఏం చెప్తోంది?అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే కమల ప్రెసిడెంట్ కావడం సాధ్యమే. రాజ్యాంగంలోని 25వ సవరణలోని ఒకటో సెక్షన్ ప్రకారం అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించినా, అధ్యక్షుడు రాజీనామా చేసినా, లేదంటే చనిపోయినా అప్పటి ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నవారే అధ్యక్షులవుతారు. ప్రస్తుతం కమల ఉపాధ్యక్షురాలు కాబట్టి ఒకవేళ బైడెన్ రాజీనామా చేసి తప్పుకుంటే సహజంగానే కమలకు అధ్యక్షపగ్గాలు చేతికొస్తాయి. అయితే ఇలా ఉద్దేశపూర్వకంగా చేయడం అనైతికమవుతుందని రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘‘ ఈ దుశ్చర్య ఏకంగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర’’ అని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. కమల ఎందుకు అధ్యక్ష పదవికి అనర్హురాలో మరికొందరు భాష్యం చెబుతున్నారు. ఒక రాష్ట్రంలో అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే ఆ రాష్ట్రంలోని ఓట్లన్నీ ఒక్క అభ్యర్థికే ధారాదత్తం అవుతాయి. ఈ విధానం కారణంగానే 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. ఆ ఎన్నికల్లో హిల్లరీక్లింటర్ను దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు వచ్చాయి. అంటే పాపులర్ ఓటు సాధించారు. కానీ ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ సాధించలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో కనీసం పాపులర్ ఓటు సాధించిఉంటే కమలకు నైతిక అర్హత ఉండేదేమోనని కొందరు అభిప్రా యపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ట్రంప్ పాపులర్ ఓటుతోపాటు అత్యధిక ఎలక్టోరల్ ఓట్లనూ సాధించడం విశేషం. ఏదేమైనా పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి శ్వేతసౌధం నుంచి కూడా అర్ధంతరంగా బయటికొస్తారేమోనని కమల అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
US Election Results 2024: ముంచింది బైడెనే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డెమొక్రాట్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పార్టీ నేతల్లో తీవ్ర అంతర్మథనం జరుగుతోంది. ఓటమికి అధ్యక్షుడు జో బైడెనే ప్రధాన కారణమంటూ వారిలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. అధ్యక్ష రేసు నుంచి ఆయన ఆలస్యంగా తప్పుకోవడం పార్టీ పుట్టి ముంచిందంటూ మండిపడుతున్నారు. హారిస్ తీరునూ పలువురు నేతలు తప్పుబడుతున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ మానసిక సంతులనం సరిగా లేదని ముందే తెలిసి కూడా సకాలంలో బయట పెట్టలేదు. దానికి తోడు బైడెన్ స్థానంలో అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత కూడా ఆయన నీడ నుంచి బయట పడలేదు’’అంటూ వారు ఆక్షేపిస్తున్నారు. ‘‘దాంతో బైడెన్ విధానాలపై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పదేపదే తీవ్ర విమర్శలు చేసినా సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. వాటిలో లోటుపాట్లను సరిచేసుకుంటామని స్పష్టంగా చెప్పి ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు’’అంటూ వాపోతున్నారు. ఈ దారుణ ఓటమితో డెమొక్రటిక్ పార్టీ భవితపై నీలినీడలు కమ్ముకున్నాయన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. 81 ఏళ్ల బైడెన్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తానని 2023 ఏప్రిల్‌లోనే ప్రకటించారు. వయోభారం దృష్ట్యా తప్పుకోవాలని పార్టీ నేతలు చెప్పినా ససేమిరా అన్నారు. పారీ్టలో ట్రంప్‌ను ఓడించగల ఏకైక నేతను తానేనని వాదించారు. మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగే సత్తా తనకుందని, దేవుడు తప్ప ఎవరూ తనను తప్పించలేరని చెప్పుకున్నారు. కానీ ట్రంప్‌తో తొలి డిబేట్లో ఆయన దారుణంగా తడబడటం, ప్రసంగం మధ్యలో ఆగి పదాల కోసం తడుముకోవడం డెమొక్రాట్లను హతాశులను చేసింది. బైడెన్ మానసిక సంతులనంపై అనుమానాలు పెరిగాయి. అభిప్రాయానికి పార్టీ నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఎట్టకేలకు జూలైలో పోటీ నుంచి తప్పుకుని హారిస్‌కు దారిచ్చారు. దాంతో ప్రచారానికి ఆమెకు తక్కువ సమయం లభించింది. దానికి తోడు అప్పటికే ట్రంప్ గెలుపు ఖాయమనే తరహా వాతావరణం నెలకొని ఉంది. దాన్ని మార్చేసి ట్రంప్‌ను గట్టిగా ఢీకొట్టేలోపే పోలింగ్ తేదీ ముంచుకొచ్చింది. ఇదంతా ఆయనకు బాగా కలిసొచ్చిందని డెమొక్రాట్లు ఇప్పుడు తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.బైడెన్ నీడలోనే... అమెరికాలో గత 70 ఏళ్లలో అత్యంత తక్కువ ప్రజాదరణ పొందిన అధ్యక్షుడు బైడెనేనని గాలప్ పోల్ సర్వే తేల్చింది. ప్రజల మనసులు గెలవలేకపోయిన రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ కంటే కూడా ఆయనకు తక్కువ మార్కులు పడ్డాయి. అలాంటి అధ్యక్షుడి నీడ నుంచి హారిస్ బయటపడలేకపోవడం కూడా ఓటమికి గట్టి కారణంగా నిలిచిందని ఆమె సహాయకులే అంటున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ నిర్ణాయల్లో తాను భాగమేనని ఆమె భావించారు. అందుకే బైడెన్ విధానాలపై ట్రంప్ విమర్శలను తిప్పికొట్టడంలో వెనకా ముందయ్యారు. అలాగాక బైడెన్ విధానాల్లో లోటుపాట్లను సమీక్షించి దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సవరించుకుంటామని స్పష్టంగా చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’అని వారంటున్నారు. ఎకానమీ, వలసల వంటి కీలక విధానాలపై ట్రంప్ దూకుడుకు హారిస్ నుంచి గట్టి సమాధానమే లేకపోయిందని గుర్తు చేస్తున్నారు. కనీసం వాటికి దీటైన ఇతర అంశాలను తెరపైకి తేవడంలో కూడా ఆమె విఫలమయ్యారంటున్నారు. అంతేగాక అధ్యక్షుడి మానసిక ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి తెలిసి కూడా ముందే చెప్పకుండా తమను, అమెరికా ప్రజలను హారిస్ మోసగించారని పలువురు డెమొక్రాట్లు ఆక్రోశిస్తున్నారు. పైగా 78 ఏళ్ల ట్రంప్‌తో పోలిస్తే కొత్త ఓటర్లను ఆకట్టుకోవడంలో 60 ఏళ్ల హారిస్ విఫలమయ్యారని వారు విశ్లేషిస్తున్నారు. తమ ప్రచార తీవ్రత చాలలేదని హారిస్ ప్రచార కమిటీ సీనియర్ సలహాదారు డేవిడ్ ప్లోఫ్ అంగీకరించారు. ఇది దారుణమైన ఓటమేనంటూ ఎక్స్‌లో వాపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారతీయ అమెరికన్లలో హారిస్‌కు తగ్గిన ఆదరణ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ డెమొక్రాట్లకు చేదు కబురు. ఆ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ ఓటర్ల సంఖ్యలో గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా ఏడు శాతం తగ్గుదల నమోదైంది! భారత మూలాలున్న కమలా హారిస్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య 61 శాతానికి తగ్గింది. అంతేగాక తాము డెమొక్రాట్లమని చెప్పుకున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా 56 నుంచి 47 శాతానికి తగ్గింది. సోమవారం వెలువడ్డ ‘ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్స్’ సర్వేలో ఈ మేరకు తేలింది. ట్రంప్‌కు ఓటేస్తామని వారిలో 32 శాతం మంది పేర్కొన్నారు. 2020లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌కు 68 శాతం మద్దతు దక్కగా ట్రంప్‌కు 22 శాతం మాత్రమే జైకొట్టారు!→ ఇండియన్ అమెరికన్ మహిళా ఓటర్లలో 67 శాతం మంది హారిస్‌కు జైకొట్టారు. ట్రంప్‌కు మద్దతిచ్చిన వారు కేవలం 22 శాతమే.→ 40 ఏళ్ల పైచిలుకు వయసు వారిలో ఏకంగా 70 శాతం మహిళలు, 60 శాతం పురుషులు హారిస్‌కు జైకొట్టారు.→ 40 ఏళ్ల లోపువారిలో మాత్రం 60 శాతం మహిళలే హారిస్‌కు మద్దతిచ్చారు.→ ఇండియన్ అమెరికన్ పురుషుల్లో 53 శాతం హారిస్‌కు, 39 శాతం మంది ట్రంప్‌కు ఓటేస్తామని చెప్పారు.→ 40 ఏళ్లలోపు పురుషుల్లో మాత్రం ట్రంప్‌దే పైచేయి కావడం విశేషం. ఆయనకు 48 శాతం, హారిస్‌కు 44 శాతం జైకొట్టారు.→ యువ ఇండియన్ అమెరికన్లలో మాత్రం ట్రంప్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు సర్వే తేల్చింది.→ అమెరికాలో 52 లక్షలకు పైగా భారత సంతతి వారున్నారు. వారిలో ఓటర్ల సంఖ్య 26 లక్షల పై చిలుకు.→ హిందూయేతరులతో పోలిస్తే హిందువుల్లో ట్రంప్ మద్దతుదారులు అధికంగా ఉండటం విశేషం. ఆయనకు ఓటేస్తామని 58 శాతం మంది హిందువులు తెలిపారు. 35 శాతం హిందువులు హారిస్‌కు మద్దతిస్తామన్నారు.→ హిందూయేతర భారతీయ అమెరికన్లలో 62 శాతం హారిస్‌కు, 27 శాతం ట్రంప్‌కు మద్దతిచ్చారు.→ 17 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని ప్రధాన సమస్యగా పేర్కొన్నారు.→ ఉపాధి, ఆర్థిక అవ్యస్థ, అబార్షన్ ప్రధానాంశాలని 13 శాతం చెప్పారు.→ భారత్–అమెరికా సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పిన వారు కేవలం 4 శాతమే. -
అమెరికాలో భారతీయం
అమెరికా మొత్తం ఓటర్లు 16.1 కోట్ల పై చిలుకు. అందులో భారతీయ అమెరికన్ల సంఖ్య మహా అయితే 21 లక్షలు. కానీ ఆ దేశ రాజకీయాల్లో మనవాళ్లు నానాటికీ ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇప్పుడు వారి రాజకీయ శక్తిని ఏ మాత్రమూ విస్మరించే పరిస్థితి లేదు. అందులోనూ భారత మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈసారి ఏకంగా డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. దాంతో భారతీయ అమెరికన్ల ఉత్సాహానికి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. భారతీయ అమెరికన్లలో అత్యధికులు విద్యాధికులే. కేవలం ఓటర్లుగానే గాక అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధుల సేకర్తలుగా కొన్నేళ్లుగా వారి హవా బహుముఖంగా విస్తరిస్తోంది. దాంతో సహజంగానే అధికార సాధనలో వారి మద్దతు నానాటికీ కీలకంగా మారుతోంది.స్వింగ్ స్టేట్లలోనూ హవాఅధ్యక్ష ఎన్నికల్లో విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారే మిషిగన్, జార్జియా వంటి స్వింగ్ స్టేట్లలో భారతీయుల జనాభా చాలా ఎక్కువ. దాంతో వారి ఓట్లు, మద్దతు రెండు పార్టీలకూ మరింత కీలకంగా మారాయి. 2020లో బైడెన్ విజయంలో జార్జియా ఫలితమే నిర్ణాయకంగా మారడం తెలిసిందే. అక్కడ భారతీయ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. గత రెండు మూడు అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హారిస్, ట్రంప్ భాగ్యరేఖలు స్వింగ్ స్టేట్లలోని ఇండియన్ ఓటర్ల మనోగతంపై గట్టిగానే ఆధారపడ్డాయంటే అతిశయోక్తి కాదంటారు డాక్టర్ మిశ్రా.→ స్వింగ్ స్టేట్లుగా పేరుబడ్డ 10 రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లే మెజారిటీ.→ స్వింగ్ స్టేట్లలో పెన్సిల్వేనియాను అత్యంత కీలకమైనదిగా చెప్తారు. అలాంటి రాష్ట్రంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో బక్స్ కౌంటీది నిర్ణయాక పాత్ర. అక్కడ ఆధిపత్యం పూర్తిగా ఇండియన్లదే!→ దక్షిణాసియాకు చెందిన 48 లక్షల మంది పై చిలుకు యువ ఓటర్లను ప్రభావితం చేయడంలో భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు మిశ్రా వివరించారు.→ గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేశారు. 2020లో 71 శాతం మంది ఓటేశారు. తాజా ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వేలో ఏకంగా 91 శాతానికి పైగా ఈసారి ఓటేస్తామని చెప్పారు!పార్టీలకు నిధుల వెల్లువభారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం 1.45 లక్షల డాలర్లు. అమెరికన్లతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. కొన్నేళ్లుగా ప్రధాన పార్టీలకు వారినుంచి నిధులు పోటెత్తుతున్నట్టు డెమొక్రటిక్ పార్టీ నేషనల్ ఫైనాన్స్ కమిటీ (డీఎన్ఎఫ్సీ) సభ్యుడు అజయ్ భుటోరియా చెబుతున్నారు. ‘‘నేను 20 ఏళ్లకు పైగా నిధుల సేకర్తగా వ్యవహరిస్తున్నా. మనవాళ్లు ఈ స్థాయిలో రాజకీయ విరాళా లివ్వడం గతంలో ఎన్నడూ లేదు’’ అంటూ విస్మయం వెలిబుచ్చారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. డీఎన్ఎఫ్సీలో 5 శాతానికి పైగా భారతీయులే ఉండటం విశేషం. భూరి విరాళాలిస్తున్న వారితో పాటు పార్టీలకు, వాటి ఎన్నికల ప్రచార కార్యకలాపాలకు చిన్న మొత్తాలు అందజేస్తున్న అమెరికన్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోందని ఆసియన్ అమెరికన్ డయాస్పొరాలో అతి పెద్దదైన రాజకీయ కార్యాచరణ కమిటీ ఏఏపీఐ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ చెప్పుకొచ్చారు. 2012 నుంచీ ఇండియన్ అమెరికన్లలో ఈ ధోరణి బాగా పెరుగుతోందని డ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంగయ్ మిశ్రా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష పీఠానికి దారి సిలికాన్ వ్యాలీ గుండా వెళ్తుందన్నది నానుడి. కీలకమైన ఆ టెక్ రాజధానిలో భారతీయులదే హవా. హారిస్‌కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే ఏకంగా 5.5 కోట్ల డాలర్ల విరాళాలు పోగయ్యాయి! వాటిలో మనవారి నుంచి వసూలైనవే ఎక్కువ. డెమొక్రాట్ పార్టీకి భారీ విరాళాలిచ్చిన జాబితాలో 60 మందికి పైగా ఇండియన్ అమెరికన్లు న్నారు. వీరిలో పారిశ్రామిక దిగ్గజం ఇంద్రా నూయీ మొదలుకుని ఏఐ ఇన్వెస్టర్ వినోద్ ఖోస్లా దాకా పలువురి పేర్లున్నాయి.రిపబ్లికన్లకూ...రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సంపత్ శివాంగి, హోటల్ పరిశ్రమ దిగ్గజం డానీ గైక్వాడ్ వంటి పలువురు ఎన్నారైలు ట్రంప్ ప్రచార కార్యకలాపాలకు భారీ విరాళాలిస్తున్నారు. అయితే 2020 నుంచీ ఇండియన్ అమెరికన్లు, ముఖ్యంగా హిందువులు రిపబ్లికన్ పార్టీకి క్రమంగా దూరమవుతున్న వైనం స్పష్టంగా కన్పిస్తోంది.అధికార పదవుల్లోనూ...అమెరికాలో అన్ని స్థాయిల్లోనూ అధికార పదవుల్లో కూడా భారతీయుల హవా సాగుతోంది. సెనేట్, ప్రతినిధుల సభతో పాటు రాష్ట్రాల సెనేట్లు, అసెంబ్లీలు మొదలుకుని సిటీ కౌన్సిళ్లు, స్కూలు బోర్డుల దాకా, జిల్లా అటార్నీలుగా నియమితులవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.→ యూఎస్ కాంగ్రెస్‌లో ఐదుగురు భారతీయ అమెరికన్లున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది ఏడుకు పెరుగుతుందని భావిస్తున్నారు.→ అమెరికా యువజనుల్లో భారతీయులు కేవలం 0.6 శాతమే. కానీ 4.4 శాతం మంది ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.→ బైడెన్–హారిస్ పాలన యంత్రాంగంలో 150 మందికి పైగా భారతీయ అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారు.→ హారిస్ అధ్యక్షురాలిగా నెగ్గితే ఈ సంఖ్య 200 దాటుతుందని అంచనా.→ అమెరికా జనాభాలో యూదులు 2 శాతమే అయినా కాంగ్రెస్‌లో వారి సంఖ్య 10 శాతం. కొన్నేళ్లలో భారతీయులు అమెరికా సమాజంపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారన్నది ఒక అంచనా.సగానికి పైగా డెమొక్రాట్లే!→ తాజా సర్వే ప్రకారం భారతీయ అమెరికన్లలో ఏకంగా 55 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులమని ప్రకటించుకున్నారు.→ 25 శాతం మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నారు.→ స్వతంత్రులు, తటస్థులు 15 శాతం మందిగా లెక్క తేలారు. మిగతావాళ్లు తమ రాజకీయ మొగ్గుదలపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ప్రహేళిక
డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలు, వ్యక్తిత్వం, విధానాలు, వీటన్నిటితో కూడిన గందర గోళం పట్ల అమెరికన్లు ఎలా స్పందిస్తారు అనేది 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అతి పెద్ద చిక్కుప్రశ్న. ట్రంప్ పతనం నుంచి ఉత్థానం చెందారు. అలాగని ఆయన ప్రజాదరణకు తీవ్రమైన పరిమి తులున్నాయి. ప్రధానంగా 4 అంశాల్లో ట్రంప్ వైఖరిని పరిశీలించాలి.1. ట్రంప్ నిలకడతనం: కొద్ది నెలల కాలంలోనే ఆయన రెండుసార్లు మరణానికి చేరువగా వెళ్లివచ్చారు. ప్రజారంగంలో బలంగా ఉండటానికి అవసరమైన స్పష్టమైన భౌతిక ధైర్యం ఆయనకు ఉంది. 2015లో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి నప్పటినుంచీ రాజకీయ ప్రత్యర్థులు, అమెరికా రాజకీయ పండి తులు కనీసం ఎనిమిది సార్లు ట్రంప్ రాజకీయ సంస్మరణను ఖాయం చేసేశారు. రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ 2016లో గెలు స్తారని ఎవరూ అనుకోలేదు. హిల్లరీ క్లింటన్‌ను అధ్యక్ష రేసులో ఓడించగలరని అసలు అనుకోలేదు. ఆయన అభ్యర్థిత్వానికి రష్యా మద్దతు విషయంలో సాగిన దర్యాప్తు నుండి బయట పడతారనీ ఎవరూ అనుకోలేదు. కోవిడ్ మహమ్మారిపై ఆయన అశాస్త్రీయ నిర్వహణను అమెరికన్లు క్షమిస్తారని కొద్దిమందే భావించారు.2020 ఎన్నికల ఫలితాల చట్టబద్ధతను అంగీకరించడానికి నిరాకరించిన తర్వాత, యునైటెడ్ స్టేట్స్ కాపిటల్‌పై దాడికి ఒక గుంపును పంపిన తర్వాత కూడా ట్రంప్ ఆధిపత్యం చలాయించే ఆటగాడిగా ఉంటారని ఎవరూ భావించలేదు. రిపబ్లికన్లు సెనే ట్ను కోల్పోయిన తర్వాత, 2022 మధ్యంతర ఎన్నికలలో హౌస్‌ను గెలవ లేకపోయిన తర్వాత అందరూ ట్రంప్ పనయిపోయిందని వ్యాఖ్యా నించారు. పైగా ఆయన నేరారోపణ కేసుల నుండి బయట పడతారని ఎవరూ నమ్మలేదు. కానీ ట్రంప్ ప్రతిసారీ విమర్శకుల అంచనాలను తారుమారు చేశారు. మరింత ప్రజాదరణ పొందారు. రిపబ్లికన్ పార్టీని నియంత్రిస్తున్నారు. 2. ట్రంప్ ప్రజాదరణకు పరిమితులు: 2016 నవంబర్‌లో ఆయన అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత, ఆయన నాయకత్వంలో పాల్గొన్న అన్ని ఎన్నికలనూ రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రిపబ్లికన్లు హౌజ్‌ను కోల్పోయిన 2018 మధ్యంతర ఎన్నికలు ఇందులో ఉన్నాయి. 2021 జనవరిలో జార్జియా సెనేట్ ఎన్నికల్లో ఓటమి కూడా ఇందులో భాగం. అంతెందుకు, ట్రంప్ స్వయంగా ఓడిపోయిన 2020 అధ్యక్ష ఎన్నికలు కూడా దీంట్లో ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో రిపబ్లికన్ పార్టీ స్థిరంగా ఓడిపోయింది. విస్తృతమైన ఓటర్లలో దాని ఆకర్షణ తగ్గింది.3. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో జాత్యహంకారం: ‘మేక్ అమె రికా గ్రేట్ ఎగైన్’ అని ట్రంప్ చేసే ప్రచారం ‘మేక్ అమెరికా వైట్ ఎగైన్’ అని స్పష్టమైపోయింది. ఆయన వ్యాఖ్యానాలు పక్షపాతాన్ని, ద్వేషాన్ని, భయాన్ని కలిగించేలా ఉన్నాయి. ఒహయో పట్టణంలోని అక్రమ హైతియన్ వలసదారులు పెంపుడు జంతువులను తింటు న్నారని ట్రంప్, జేడీ వాన్ ్స (రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి) నిరా ధారమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి పట్టణంలోని వలసదారులు ఎవరూ చట్టవిరుద్ధంగా ఉండటం లేదు. వాళ్లెవరూ పెంపుడు జంతువులను తినడమూ లేదు. ఇక ట్రంప్ గట్టి మద్దతుదారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లారా లూమర్ 9/11 స్మారక స్థూపం వద్దకు ట్రంప్‌తో పాటు విమానంలో వెళ్లి, డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారతీయ మూలాలపై జాత్యహంకార దాడిని ప్రారంభించారు. ట్రంప్ స్వయంగా హారిస్‌పై జాత్య హంకార వ్యాఖ్యలను ప్రయోగించారు. ట్రంప్ గెలుపును వేడుకగా జరుపుకొనే భారత మితవాద శక్తులు దీనిని గుర్తుంచుకోవాలి.4. ట్రంప్ విదేశాంగ విధానం: డెమొక్రాట్లు, పాత రిపబ్లికన్లకంటే కూడా సంకుచిత భావన కలిగిన అమెరికా గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. నిజానికి, ట్రంప్ తన మొదటి హయాంలో ‘అబ్రహం ఒప్పందాల’కు మధ్యవర్తిత్వం వహించారు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా వైఖరిని పెంచారు. ఇరాన్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలను ఆమోదించారు. ఉత్తర కొరియాతో చర్చలు జరిపారు. ఇవన్నీ ఆయన ప్రపంచవ్యాప్త వ్యవహారాలు జరపగలరని సూచించాయి. కానీ అంతర్జాతీయ వ్యవస్థలో ప్రబలమైన ప్లేయ ర్గా ఉన్న అమెరికా ఆర్థిక, సైనిక బాధ్యతలను ట్రంప్ అసహ్యించుకుంటారు. దానితో వచ్చే ప్రయోజనాలను ఆయన చూడలేరు లేదా ఈ ప్రయోజనాలు లేవని నటిస్తారు. ప్రపంచీకరణ వల్ల, ప్రపంచంలో అమెరికా పాత్ర వల్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పో యారనీ, అసమానతలు పెరిగాయనీ వాదిస్తారు.ట్రంప్‌కు జనాదరణ ఉందనేది నిజం. అదే సమయంలో ఆయన ఆధిపత్యం కొనసాగడం లేదన్నదీ నిజమే. ఎన్నికల ఫలితా లను కచ్చితంగా అంచనా వేయడం ఎందుకు కష్టమో దీన్నిబట్టి అర్థమవుతోంది. గుర్తింపు ఆధారిత రాజకీయాలను ఆయన మిత వాదం నుండి స్వీకరించారు. పాత వామపక్షీయుల ఉదారవాద ఆర్థిక శాస్త్రం, విదేశాంగ విధాన విమర్శలనూ స్వీకరించారు.ట్రంప్‌ను సైద్ధాంతికంగా ఒక వర్గంలోకి చేర్చడం ఎందుకు కష్టమో ఇది వివరిస్తుంది. అమెరికన్లు ఆయన వ్యక్తిత్వాన్ని, విధాన మిశ్ర మాన్ని, దానితో వచ్చే గందరగోళాన్ని ఇష్టపడతారా లేదా అనేది 2024 ఎన్నికలకు సంబంధించిన ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది.ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
US ELECTION: టిమ్వాల్జ్కు తప్పిన ప్రమాదం
మిల్వాకీ: అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్వాల్జ్కు ప్రమాదం తప్పింది. సోమవారం(సెప్టెంబర్2) మిల్వాకీలో లేబర్ డే కార్యక్రమానికి వెళ్తుండగా టిమ్వాల్జ్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాల్జ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వాహనశ్రేణిలో ఉన్న పలువురు మీడియా సిబ్బంది గాయపడ్డారు.తమ వాహనాలను కాన్వాయ్‌లో వెనుక వచ్చే వాహనాలు బలంగా ఢీకొన్నాయని మీడియా సిబ్బంది తెలిపారు. ప్రమాదం అనంతరం టిమ్వాల్జ్తో డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిమ్వాల్జ్ ప్రస్తుతం మిన్నెసోటా గవర్నర్‌గా ఉన్నారు. -
హారిస్‌కే డెమొక్రాట్ల ఓటు
వాషింగ్టన్: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైంది. అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1,976 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఆమెకు మద్దతు తెలిపారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు అనధికారికంగా ఖరారు కావడంతో ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఆమె ఎవరిని ఎన్నుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. డెలావెర్‌లోని ప్రచార ప్రధాన కార్యాలయాన్ని హారిస్ సోమవారం సందర్శించారు.అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం హారిస్ మొదటిసారి రోజంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బైడెన్ ప్రచారం బృందంతో ఆమె సమావేశమయ్యారు. అదే బృందంతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 106 రోజులే ఉన్నాయని, గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. తన రిపబ్లికన్ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై హారిస్ విరుచుకుపడ్డారు.ఆయన కుంభకోణాలను గుర్తు చేశారు. నేరాలను ఎత్తి చూపారు. మహిళలను వేధించిన మృగం, మోసగాడు, తన స్వార్థ ప్రయోజనాలకోసం నియమా లను ఉల్లంఘించిన వ్యక్తని విమర్శించారు. ‘ట్రంప్ ఏ రకమో నాకు తెలుసు’ అంటూ ఎద్దేవా హారిస్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి పనిచేయడం తనకు దక్కిన ఒక గొప్ప గౌరవమన్నారు.ఆయన అమెరికా ప్రజలకోసం నిరంతరం శ్రమించారని కొనియాడారు. ఇక కరోనా బారినపడి ఐసోలేషన్‌లో ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లైన్లో సమావేశంలో పాల్గొన్నారు. కమలా హారిస్‌ను గెలిపించడానికి పనిచేయాలని డెమొక్రాట్లకు విజ్ఞప్తి చేశారు. తాను కోలుకోగానే ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. ట్రంప్‌పై విరుచుకుపడిన హారిస్.. ఇక హారిస్‌కు 40 మందికి పైగా డెమొక్రటిక్ సెనేటర్లు, దాదాపు 100 మంది హౌస్ సభ్యుల మద్దతు ఉంది. అత్యంత కీలకమైన మలుపు మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సైతం హారిస్‌కు మద్దతు పలకడం. అంతేకాదు కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్, కాంగ్రెషనల్ హిస్పానిక్ కాకస్, కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్తోపాటు సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్, అమెరికన్ ఫెడరేష ఆఫ్ టీచర్స్ అనే రెండు కీలక కార్మిక సంఘాలు సైతం ఆమెకు మద్దతు తెలుపుతున్నాయి.ఉపాధ్యక్ష రేసులో కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్, యుఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ పీట్ బుట్టిగీగ్, నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్, అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, ఇల్లినాయిస్ గవర్నర్ జె.బి. ప్రిట్జ్కర్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఉండొచ్చని భావిస్తున్నారు. -
USA Presidential Elections 2024: బైడెన్‌ను.. మార్చొచ్చా?
డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి చర్చలో జో బైడెన్ ఆద్యంతం తడబడటం, మాటల కోసం వెతుక్కోవడంతో డెమొక్రాట్లలో భయాందోళనలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 81 ఏళ్ల వయసులో బైడెన్ సమర్థుడైన అభ్యర్థి కాగలరా? మరో నాలుగేళ్లు అగ్రరాజ్యం అధినేతగా భారం మోయగలరా? అనే సందేహాలు ముప్పిరిగొన్నాయి. నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తుండటంతో వయోభారం రీత్యా అధ్యక్షుడి మానసిక సంతులతపై డెమొక్రాట్లలో అనుమానాలు తలెత్తుతున్నాయి. టెక్సాస్ నుంచి డెమొక్రాట్ ఎంపీ ఒకరు బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థగా జో బైడెన్‌ను మార్చే అవకాశంఉందా? స్వయంగా ఆయన రేసు నుంచి తప్పుకోవచ్చా? అప్పుడు ఎవరు అధ్యక్ష అభ్యర్థి అవుతారు? అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. బైడెన్‌పై తీవ్ర ఒత్తిడిఅవును.. తప్పుకోవచ్చు. కాకపోతే అందుకు ఆయన సిద్ధంగా లేరు. తానే డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థనని, వైదొలగాలని తననెవరూ ఒత్తిడి చేయడం లేదని బైడెన్ బుధవారం స్పష్టం చేశారు. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యరి్థని ఆగస్టు 19–22 వరకు షికాగోలో జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ (డీఎన్సీ)లో అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఓహియో రాష్ట్రంలో బ్యాలెట్ పేపర్‌పై పేరుండటానికి వీలుగా జూలై 21 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు జరిగే వర్చువల్ కన్వెన్షన్‌లో తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వివిధ రాష్ట్రాల ప్రైమరీల్లో వచి్చన ఫలితాల ఆధారంగా.. ఆ నిష్పత్తిలో అభ్యర్థులకు డెలిగేట్లను కేటాయిస్తారు. దాదాపు 4,000 డెలిగేట్లలో 99 శాతం బైడెన్ గెల్చుకున్నారు. డీఎన్సీ నిబంధనల ప్రకారం వీరందరూ బైడెన్‌కు మద్దతు పలకాలి. ఒకవేళ రాబోయే రోజుల్లో ఒత్తిడి మరీ పెరిగిపోయి.. రేసు నుంచి వైదొలగాలని బైడెన్ నిర్ణయించుకుంటే.. అప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో పాటు ఇతరులెవరైనా డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీపడవచ్చు. అప్పుడు డెలిగేట్లు జాతీయ కన్వెన్షన్‌లో (ఓపెన్ కన్వెన్షన్ అంటారు) తమకు నచ్చిన అభ్యర్థులను సూచించి ఒకరికి మెజారిటీ వచ్చేదాకా రౌండ్ల వారీగా ఓటింగ్ చేయొచ్చు. 1968లో అప్పటి అధ్యక్షుడు లిండన్ బి.జాన్సన్ మళ్లీ పోటీచేయకూడదని నిర్ణయించడంతో ఓపెన్ కన్వెన్షన్ నిర్వహించారు. బలవంతంగా తప్పించొచ్చా? పారీ్టలో మెజారిటీ మార్పును కోరుకొని బైడెన్ ససేమిరా అంటే ఆయన్ను బలవంతంగా తప్పించడానికి ఆస్కారం ఉంది. డీఎన్సీ నియమావళిలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ’జాతీయ కన్వెన్షన్‌లో డెలిగేట్లు తమను ఎన్నుకున్న వారి అభిప్రాయాన్ని/ మనోగతాన్ని ప్రతిబింబించాలి’ అని నిబంధనలు చెబుతున్నాయి. అంటే డెమొక్రాటిక్ పార్టీ డెలిగేట్లు ఇతరుల వైపు కూడా మొగ్గు చూపవచ్చు (అదే రిపబ్లికన్ పారీ్టలో అయితే డెలిగేట్లు ఎవరి తరఫున అయితే ఎన్నికయ్యారో వారికే బద్ధులై ఉండాలని స్పష్టంగా ఉంది). బైడెన్ తరఫున ఎన్నికైన 3,894 డెలిగేట్లలో 1,976 మంది పైచిలుకు డెలిగేట్లు వర్చువల్ కన్వెన్షన్‌లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలి. అప్పుడు స్పష్టమైన తీర్పు రాక అదనపు రౌండ్ల ఓటింగ్ జరుగుతుంది. డెలిగేట్లు ఇంత పెద్ద సంఖ్యలో తిరుగుబాటు చేస్తారా? అని అమెరికా రాజకీయ పండితులు సందేహిస్తున్నారు. అయితే అధ్యక్ష అభ్యరి్థని ఎన్నుకొనే నిబంధనలను డీఎన్సీ రూల్స్ కమిటీ ఏ సమయంలోనైనా మార్చవచ్చు. కమలా హారిస్‌కు ఛాన్స్ ఉందా? నాలుగేళ్ల పదవీకాలంలో అధ్యక్షుడు ఎప్పుడైనా తప్పుకొంటే.. ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ ఆటోమెటిగ్గా పగ్గాలు చేపడతారు. కానీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఇలాంటి ఆస్కారం లేదు. ఓపెన్ కన్వెన్షన్‌లో అందరి అభ్యర్థుల్లాగే భారతీయ–అమెరికన్ హారిస్ కూడా పోటీపడాల్సి వస్తుంది. మెజారిటీ డెలిగేట్ల ఓట్లను సంపాదించాల్సి ఉంటుంది. అధ్యక్ష డిబేట్ తర్వాత సీఎన్ఎన్ నిర్వహించిన పోల్‌లో ట్రంప్‌కు 47 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకగా, కమలా హారిస్‌కు 45 శాతం మంది మద్దతు లభించడం విశేషం. హారిస్‌కు అనుకూలించే మరో అంశం ఏమిటంటే.. డెమొక్రాటిక్ పార్టీ ప్రచార ఫండ్‌ను బైడెన్ కాకుండా ఆమె మాత్రమే నేరుగా పొందగలరు. బైడెన్ స్వయంగా వైదొలిగితే తప్పితే ఆయన్ను అధ్యక్ష అభ్యరి్థగా తప్పించడం అంత సులభం కాదు. సాంకేతికంగా అవకాశాలు ఉన్నప్పటికీ ఆచరణలో కష్ట సాధ్యమే. – సాక్షి నేషనల్ డెస్క్ -
కాటేస్తున్న ‘రహస్యాలు’!
అమెరికాలో మొన్న నవంబర్ మధ్యంతర ఎన్నికలు డెమోక్రాటిక్ పార్టీకి అంచనాలకు మించిన విజయాలనందించాయి. ఇప్పుడిప్పుడే ద్రవ్యోల్బణం సద్దుమణిగిన జాడలు కనిపిస్తున్నాయి. ఆర్థిక రంగం అంతో ఇంతో పుంజుకుంటున్నదని కూడా అంటున్నారు. ఈ విజయోత్సాహంతోనే కావొచ్చు... రెండోసారి సైతం తానే డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థినని అధ్యక్షుడు జో బైడెన్ ఢంకా బజాయిస్తున్నారు. ఇంతటి శుభ తరుణంలో ఉరుము లేని పిడుగులా ‘రహస్యపత్రాలు’ బయటికొస్తూ బైడెన్‌ను ఇరుకున పడేస్తున్నాయి. ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువై రెండేళ్లక్రితం అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలై నిష్క్రమించిన డోనాల్డ్ ట్రంప్ పోతూ పోతూ అత్యంత రహస్యమైన ఫైళ్లను సంగ్రహించారన్న ఆరోపణలు ఏడాదిన్నర క్రితం గుప్పుమన్నాయి. ఆ వ్యవహారంపై విచారణ సాగుతోంది. ట్రంప్ ఎస్టేట్‌లో, ఆయన కార్యాలయాల్లో అటువంటి రహస్యపత్రాలు దొరి కాయి కూడా. ఆ మరకను ఎలా వదుల్చుకోవాలో తెలియక రిపబ్లికన్లు కకావికలవుతున్న తరుణంలో బైడెన్ సైతం ఆ తానులోని ముక్కేనని వెల్లడికావటం డెమొక్రాట్లకు సహజంగానే దుర్వార్త. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించక స్వప్రయోజనాలు నెరవేర్చుకునే సాధనంగా పరిగ ణించేవారే చట్టాలను బేఖాతరు చేస్తారు. నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. ట్రంప్, బైడెన్‌లిద్దరూ ఆ పనే చేశారా అన్నది ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న. వాషింగ్టన్‌లోని బైడెన్ కార్యాలయంలో నిరుడు నవంబర్ 2న కొన్ని రహస్యపత్రాలు దొరికాయని గత వారం ఆయన న్యాయవాదులు ప్రకటించారు. 2017లో ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి పత్రాలివి. దానిపై రిపబ్లికన్లు రచ్చ చేస్తుండగానే విల్మింగ్టన్లోని బైడెన్ సొంతింట్లో గురువారం ఆ కాలానికి సంబంధించినవే మరికొన్ని రహస్యపత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ట్రంప్ పుణ్యమా అని అమెరికా సమాజం నిట్టనిలువునా చీలింది. ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేని ఆయన మద్దతుదార్లు ఫలితాలు వెల్లడైనరోజు విధ్వంసానికి తెగించారు. దౌర్జన్యాలకు దిగారు. ఆ ఉదంతంపై విచారణ సాగుతున్న కాలంలోనే ట్రంప్ చేతివాటం బయటికొచ్చింది. అధ్యక్షుడిగా తన పరిశీలనకు వచ్చిన అత్యంత రహస్యమైన పత్రాలను ఆయన కట్టలకొద్దీ పోగేసుకున్నారని వెల్లడైంది. ఈ విషయంలో ట్రంప్‌పై అనర్హత వేటు పడే ప్రమాదమున్నదని కూడా అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇప్పుడు బైడెన్‌కూ అలాంటి ప్రారబ్ధమే చుట్టుకుంటుందా? ఎన్ని లోటుపాట్లున్నా ఇప్పటికీ ప్రపంచంలో అగ్రరాజ్యంగానే కొనసాగుతున్న అమెరికాను గత దశాబ్దకాలంగా ‘రహస్యపత్రాలు’ అడపా దడపా కాటేస్తూనే ఉన్నాయి. అమెరికా రక్షణ విభాగంలో పనిచేస్తున్న చెల్సియా ఎలిజెబెత్ మానింగ్ తొలిసారి 2010లో వికీలీక్స్‌కు అత్యంత కీలకమైన రహస్య ఫైళ్లు అందజేశారు. అందులో ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లలో అమెరికా సైన్యం సాగించిన దురాగతాలకు సంబంధించిన వీడియోలు, అధికారిక పత్రాలు, ఉన్నతస్థాయిలో సాగిన సంభాషణలు వగైరాలున్నాయి. ప్రస్తుతం రష్యాలో తలదాచుకుంటున్న ఎడ్వర్డ్ స్నోడెన్ సైతం అప్పట్లో వివిధ దేశాధినేతలపై అమెరికా రాయబారులు తమ అధ్యక్షుడికి పంపిన కేబుల్స్ లీక్ చేసి ఆ దేశం పరువును పాతాళానికి నెట్టారు. వారి మాదిరిగా ట్రంప్, బైడెన్లు రహస్య ఫైళ్లలోని అంశాలు బయటపెట్టి ఉండకపోవచ్చు. కానీ అధికారం వెలగబెట్టినవారు చెల్సియా, స్నోడెన్ మాదిరే సొంతానికి ఫైళ్లు పట్టుకెళ్లారని వెల్లడికావటం అమెరికాను ప్రపంచంలో నవ్వులపాలు చేయదా? ఇప్పుడు డెమొక్రాట్లకు వచ్చిపడిన సమస్యేమంటే... ట్రంప్ చౌర్యం బయటికొచ్చిన ప్పుడు వారు కాలరెగరేశారు. ఘనమైన రాజకీయ అనుభవం, పాలనకు కావలసిన సమర్థత, జాతీయ భద్రత అంశంలో రాజీపడని తత్వం తమ సొంతమని దండోరా వేశారు. కానీ బైడెన్ ‘రహస్యపత్రాల’ వ్యవహారం కాస్తా వారి గాలి తీసేసింది. ట్రంప్ ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ విభాగం రహస్యపత్రాలు పట్టుకున్నప్పుడు ‘ఒక దేశాధ్యక్షుడు ఇంత బాధ్యతారహితంగా ఎలా ఉంటార’ని బైడెన్ బోలెడు ఆశ్చర్యపోయారు. ఇప్పుడాయనే ఇరకాటంలో పడ్డారు. రెండుచోట్లా రహస్యపత్రాలే దొరికినా ఇద్దరినీ ఒకేగాటన కట్టొచ్చా? దొరకడంలో సారూ ప్యత ఉన్నా దొరికిన పత్రాల తీవ్రతలో తేడాలుండొచ్చు. ఆ సంగతి పత్రాల పరిశీలన పూర్తయితే గానీ తేలదు. అలాగే అవి ఎవరెవరి కంటపడ్డాయో కూడా తెలియవలసి ఉంది. ట్రంప్ దగ్గర 33 బాక్సుల్లోపట్టేన్ని పత్రాలు దొరికితే అందులో అనేకపత్రాలు ‘టాప్ సీక్రెట్’కు సంబంధించినవి. బైడెన్ దగ్గర సంఖ్యరీత్యా ఇంతవరకూ దొరికినవి తక్కువ. పైగా ‘మీ హయాంలోని రహస్యపత్రాలు తీసుకుపోయారట. వాటిని తక్షణం మాకు అప్పగించండ’ని జాతీయ పత్రాల భాండాగారం ఏడా దిగా కోరుతున్నా ట్రంప్ బేఖాతరు చేశారు. న్యాయశాఖను కూడా ఆయన లెక్క చేయలేదు. అందుకే ఎఫ్బీఐను ఉరికించాల్సివచ్చింది. ఇక బైడెన్ న్యాయవాదులు స్వచ్ఛందంగానే పత్రాలు అప్పగించినా వారి వ్యవహారశైలిలో దోషముంది. రెండునెలలపాటు వాటి సంగతి దాచి ఉంచారు. గత నెల 20న న్యాయశాఖకు చెప్పినా ఆ శాఖ సైతం మూగనోము పాటించింది. చివరకు గత సోమవారం బయటపెట్టింది. ట్రంప్‌ను ఎలాగైనా శిక్షింపజేయాలని చూస్తున్న అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్‌కు తాజా పరిణామం మింగుడుపడనిదే. ఇప్పుడు రాబర్ట్ కె. హర్ నేతృత్వంలో సాగబోయే విచారణ బైడెన్ భవితనూ, డెమొక్రాట్ల రాతనూ నిర్ణయిస్తుంది. చేసుకున్నవారికి చేసుకున్నంత! -
US Midterm Elections 2022: అమెరికా సెనేట్‌పై పట్టు నిలుపుకున్న డెమొక్రాట్లు
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన ఎగువ సభ సెనేట్‌పై డెమొక్రాట్లు పట్టు నిలుపుకున్నారు. మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింట్లో డెమొక్రాటిక్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. నెవడాకు చెందిన డెమొక్రాటిక్ సెనేటర్ కేథరిన్ కార్టెజ్ మాస్‌తో తన రిపబ్లికన్ ప్రత్యర్థి ఆడం లక్సల్ట్పై విజయం సాధించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఆడం ఓటమి ట్రంప్‌కు వ్యక్తిగతంగా ఎదురు దెబ్బే. అరిజోనాలోనూ డెమొక్రాటిక్ సెనేటర్ మార్కె కెల్లీ గెలిచారు. దీంతో 100 మంది సభ్యులున్న సెనేట్‌లో డెమొక్రాట్ల సంఖ్య 50కి చేరింది. రిపబ్లికన్లకి 49 మంది సభ్యుల బలముంది. జార్జియాలో ఫలితం వెలువడాల్సి ఉంది. -
వర్జీనియాలో డెమెక్రాటిక్ పార్టీనే గెలిపించండి
నవంబరు 2న జరిగే ఎన్నికల్లో వర్జీనియా గవర్నర్‌గా టెర్రీని గెలిపించాలని వాషింగ్టన్ డీసీ డెమోక్రాటిక్ పార్టీ నాయకులు కోరారు. అమెరికా అధ్యక్షులు జోసఫ్ బైడన్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేసారు. ఇమిగ్రేషన్, బిజినెస్ ఫ్రెండ్లీ విధానాలను వక్తలు వివరంగా తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న అనుకూల విధానాలే కొనసాగాలంటే డెమోక్రాట్లు అధికారంలోకి రావాలని తెలిపారు. వాషింగ్టన్ డీసీ డెమోక్రాటిక్ పార్టీ నాయకులు శ్రీధర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో లౌడెన్ కౌంటీ, వర్జీనియా రాష్ట్రంలోని లౌడెన్ కౌంటీలో ప్రవాస భారతీయ నాయకులు తొలిసారిగా సభ నిర్వహించారు. ఈ సమావేశానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్హాహాఫ్ ముఖ్య అతిథి గా విచ్చేశారు. గత వర్జీనియా గవర్నర్, ప్రస్తుత ఎన్నికలలో పోటీ చేస్తున్న టెర్రీ మెకాలిఫ్, అటార్నీ జనరల్ గా పోటీ చేస్తున్న మార్క్ హేరింగ్, అమెరికా రిప్రజెంటేటివ్ జెన్నిఫర్ వెక్సన్, వర్జీనియా సెనేటర్ జెన్నిఫర్ బాయిస్కో, డెలిగేట్ సుహాస్ సుబ్రహ్మణ్యం, డెలిగేట్ వెండీ గూడిటిస్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో ప్రవాస భారతీయుల మద్దతు కోరారు. ఈ సమావేశంలో ప్రవాస తెలుగు, భారతీయ జాతీయ, ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు భాగమయ్యారు. ప్రసంగించిన వక్తలు వర్జీనియా రాష్ట్రంలో, డెమోక్రాటిక్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాలలో వివిధ రంగాలలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేశారు. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య, హై టెక్నాలజీ, ఎంప్లాయిమెంట్, కోవిడ్ వైరస్ నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించారు. -
ట్రంప్ అభిశంసనపై విచారణ మొదలు
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక మాజీ అధ్యక్షుడి అభిశంసనపై సెనేట్‌లో విచారణ మొదలైంది. ట్రంప్‌పై విచారణ అర్ధరహితం అంటూ రిపబ్లికన్ పార్టీ చేసిన వాదన ఓటింగ్‌లో వీగిపోయింది. ట్రంప్‌పై అభిశంసన విచారణ రాజ్యాంగబద్ధమేనంటూ సెనేట్ 56–44 ఓట్ల తేడాతో విచారణకు ఓకే చెప్పింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు విచారణకు మద్దతు పలికారు. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో ట్రంప్‌ని ముద్దాయిగా తేల్చడం, అలాంటి వ్యక్తికి రిపబ్లికన్లు కొమ్ము కాస్తున్నారని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసమే డెమొక్రాట్లు అభిశంసన తీర్మానంపై విచారణకు పట్టుపట్టారు. దీంతో రెండోసారి అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా, పదవి నుంచి దిగిపోయాక అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారు. అభిశంసన తీర్మానం సెనేట్‌లో నెగ్గే అవకాశం లేదు. సెనేట్‌లో రెండింట మూడు వంతుల మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తేనే తీర్మానం పాస్ అవుతుంది. అంటే 100 మంది సభ్యులున్న సభలో 67 మంది ఓట్లు వెయ్యాలి. రెండు పార్టీలకూ చెరి 50 మంది సభ్యుల బలం ఉంది. మరో ఆరుగురు రిపబ్లికన్లు అభిశంసనకు అనుకూలంగా ఉండడంతో 56 మంది అవుతారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే సభ చైర్మన్ కమలా హ్యారిస్ తన ఓటు వినియోగించుకుంటారు. ఏది ఏమైనా 67 మంది సభ్యుల మద్దతు లభించే అవకాశాలైతే లేవు. క్యాపిటల్ భవనం దాడి వీడియోలే ఆయుధం క్యాపిటల్‌పై దాడిని ట్రంప్ ప్రోత్సహించారన్న అభియోగాలపైనే అభిశంసన ప్రక్రియ కొనసాగుతుంది. సంబంధిత వీడియోలను వినియోగించాలని డెమొక్రాట్లు వ్యూహరచన చేస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా ట్రంప్ ఆందోళనకారుల్ని ఎలా రెచ్చగొట్టారో వీడియోల ద్వారా సభ సాక్షిగా నిరూపించడానికి సభ్యులు కసరత్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించి ట్రంప్‌ని బోనులు పెట్టడమే లక్ష్యంగా తాము ముందుకు వెళతామని సెనేట్‌లో ఇంపీచ్మెంట్ మేనేజర్ జామీ రాస్కిన్ చెప్పారు. అభిశంసనపై వాదనలు వినిపించుకోవడానికి ఇరుపక్షాలకు 16 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. అనంతరం సెనేట్ సభ్యులకు ఇరుపక్షాల్ని ప్రశ్నించడానికి నాలుగు గంటల సమయం కేటాయిస్తారు. అది పూర్తయి చర్చలు జరిగాక అభిశంసనపై ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ట్రంప్ అభిశంసనపై మాట్లాడుతున్న హౌజ్ ఇంపీచ్మెంట్ మేనేజర్ జేమీ రస్కిన్ -
ట్రంప్ అభిశంసన దిశగా..!
వాషింగ్టన్: గడువుకు ముందే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దేశ ప్రజాస్వామ్య సౌధం క్యాపిటల్ భవనంపై దాడికి కారణమయ్యారన్న ఆరోపణలపై అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రతినిధుల సభలో బుధవారం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి అనుచరులను రెచ్చగొట్టారన్న ప్రధాన ఆరోపణతో ఈ అభిశంసన తీర్మానాన్ని రూపొందించారు. డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో ఈ తీర్మానం ఆమోదం పొందితే.. వెంటనే దీనిని సెనెట్‌కు పంపిస్తారు. డెమొక్రాట్లతో పాటు పలువురు రిపబ్లికన్ సభ్యులు కూడా ఈ అభిశంసనకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్‌ను అభిశంసిస్తూ రూపొందించిన ఈ తీర్మానంపై ప్రతినిధుల సభలో బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం) దాటిన తరువాత కూడా చర్చ కొనసాగింది. అభిశంసన తీర్మానం అమోదం పొందుతుందన్న విశ్వాసాన్ని డెమొక్రాటిక్ సభ్యులు వ్యక్తం చేశారు. ‘అధ్యక్షుడిగా ట్రంప్ శ్వేత సౌధంలో ఉన్నంతకాలం మన దేశం, మన స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నట్లే. క్యాపిటల్ భవనంపై దాడికి బాధ్యత వహించాల్సింది ట్రంపే. ఆయనే ఈ దాడికి కుట్ర చేశారు.అనుచరులను రెచ్చగొట్టారు. అందువల్ల ట్రంప్‌ను అభిశంసించే ఈ తీర్మానానికి మద్దతు పలకవలసిందిగా సహచర సభ్యులను కోరుతున్నా’ అని ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన డెమొక్రాట్ సభ్యడు జేమ్స్ మెక్ గవర్న్ సహచర ఎంపీలను కోరారు. క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించి ‘తిరుగుబాటు చేసేందుకు రెచ్చగొట్టారు’ అనే ప్రధాన ఆరోపణతో అభిశంసన తీర్మానాన్ని రూపొందించారు. ‘దాడితో ధ్వంసమైన ఈ భవనాన్ని మరమ్మత్తు చేయవచ్చు. కానీ ప్రజాస్వామ్య సౌధంపై జరిగిన ఆ దాడికి ట్రంప్‌ను బాధ్యుడిని చేయనట్లయితే, ఈ దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం’ అని జేమ్స్ పేర్కొన్నారు. ‘దేశ ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ‘అమెరికాలో ఇలాంటివి(క్యాపిటల్ భవనంపై దాడి) ఎట్టి పరిస్థితుల్లో కుదరవన్న గట్టి సందేశం ఇప్పుడు ఇవ్వనట్లయితే.. ఇవి మళ్లీ మళ్లీ జరిగే ప్రమాదముంది’ అని ఎంపీ చెల్లీ పింగ్రీ హెచ్చరించారు. ట్రంప్ పై అభిశంసన నిర్ణయం సరైంది కాదని రిపబ్లికన్ సభ్యుడు స్టీవ్ చాబొట్ అభిప్రాయపడ్డారు. ‘విభజిత దేశాన్ని కలిపే ప్రయత్నం చేయకుండా, మరింత విడదీసే ప్రయత్నం చేస్తున్నార’ని డెమొక్రాట్లపై విమర్శలు గుప్పించారు. రాజకీయ రచ్చను పక్కనబెట్టి, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కలసికట్టుగా పరిష్కరించాల్సిన సమయం ఇదని సూచించారు. అంతకుముందు, 25వ రాజ్యాంగ సవరణ ద్వారా లభించిన అధికారంతో అధ్యక్షుడిగా ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కోరుతూ ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 223 ఓట్లు, వ్యతిరేకంగా 205 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్లలో ఒకరు తీర్మానానికి అనుకూలంగా ఓటేయగా, ఐదుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అయితే, 25వ రాజ్యాంగ సవరణ అధికారాన్ని వినియోగించుకుని ట్రంప్‌ను పదవి నుంచి దించాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ ఈ ఓటింగ్ కన్నా ముందే ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి మైక్ పెన్స్ ఒక లేఖ రాశారు. అనుకూలంగా ఓటేస్తా అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తానని భారతీయ అమెరికన్ ఎంపీ డాక్టర్ అమీ బెరా స్పష్టం చేశారు. క్యాపిటల్ భవనంపై దాడికి కుట్ర పన్నినందుకు గానూ అమెరికా చరిత్రలో చెత్తకుండీలో చేరే స్థాయికి ట్రంప్ చేరారని మండిపడ్డారు. అమెరికా చరిత్రలోనే జనవరి 6 చీకటి రోజన్నారు. దేశ ప్రజాస్వామ్య సౌధంపై ఆ రోజు జరిగిన దాడికి కుట్రదారు, వ్యూహకర్త ట్రంపేనని విరుచుకుపడ్డారు. ఇందుకు ఆయన కొన్నాళ్లుగా ప్రణాళికలు వేశారన్నారు. ట్రంప్ దుశ్చర్యలను వివరించేందుకు మాటలు లేవన్నారు. ట్రంప్‌ని తొలగించలేం: పెన్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 25వ సవరణ ద్వారా గద్దె దింపేయాలని వస్తున్న డిమాండ్లను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తోసిపుచ్చారు. ఆర్టికల్ 25 ద్వారా ట్రంప్‌ని పదవీచ్యుతుడ్ని చేయలేమని ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసికి లేఖ రాశారు. ‘‘మన రాజ్యాంగం ప్రకారం 25వ రాజ్యాంగ సవరణ అంటే అధ్యక్షుడికి శిక్ష విధించడం కాదు. అది ఎలాంటప్పుడు ఉపయోగించాలంటే భావి తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. అధ్యక్షుడు అసమర్థుడైనప్పుడు, పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ని ప్రయోగించాలి’’అని మైక్ పెన్స్ ఆ లేఖలో పేర్కొన్నారు. క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్‌ని గద్దె దింపేయాలంటూ డిమాండ్లు అధికమయ్యాయి. స్పీకర్ నాన్సీ ఈ డిమాండ్‌ను తీవ్రంగా వినిపించడంతో ఉపాధ్యక్షుడు ఆమెకు లేఖలో ఈ వివరణ ఇచ్చారు. అప్రమత్తతలో భాగంగా క్యాపిటల్‌లో మొహరించిన నేషనల్ గార్డ్ బలగాలు విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం -
ట్రంప్‌ను తొలగించే తీర్మానాన్ని అడ్డుకున్న రిపబ్లికన్లు
వాషింగ్టన్: రాజ్యాంగబద్ధ అధికారాలను వినియోగించుకుని ట్రంప్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కోరుతూ సోమవారం డెమొక్రాట్లు తీసుకువచ్చిన తీర్మానాన్ని ప్రతినిధుల సభలో రిపబ్లికన్ సభ్యులు అడ్డుకున్నారు. మద్దతుదారులను రెచ్చగొట్టి క్యాపిటల్ భవనంపై దాడికి ప్రోత్సహించారని, అధ్యక్షుడిగా అధికారంలో కొనసాగేందుకు ట్రంప్ అనర్హుడని పేర్కొంటూ డెమొక్రాట్లు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. 25వ రాజ్యాంగ సవరణ ద్వారా, కేబినెట్లోని మెజారిటీ సభ్యుల మద్దతుతో అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అవకాశముంది. ట్రంప్ పదవీకాలం 20న ముగియనుంది. ఈ లోపే అభిశంసన ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
చివరి రోజుల్లో.. అవమానభారంతో...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గద్దె దిగిపోవడానికి కేవలం పది రోజులే గడువు ఉన్నప్పటికీ అంతకంటే ముందే ఆయనను సాగనంపాలని డెమొక్రాట్లు కృతనిశ్చయంతో ఉన్నారు. క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో ఇక ఆయన చేష్టలు భరించలేని స్థితికి సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా వచ్చారు. దీంతో సోమవారం నాడు ట్రంప్‌పై ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానానికి మద్దతు పెరుగుతోంది. ట్రంప్ చర్యల్ని రిపబ్లికన్ నేతలు కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ‘‘ట్రంప్ చేసిన నేరం చిన్నది కాదు. వెంటనే ఆయనను గద్దె నుంచి దింపేయాలి’’అని రిపబ్లికన్ ప్రతినిధి పాట్ టూమీ వ్యాఖ్యానించారు. డెమొక్రాట్లకి ఆధిక్యం ఉన్న ప్రతినిధుల సభలో ట్రంప్‌పై ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానం నెగ్గడం లాంఛనమే. అయితే రిపబ్లికన్లు కూడా ట్రంప్ వైఖరితో విసిగి వేసారి ఉండడంతో వారి ఆధిక్యం ఎక్కువగా ఉన్న సెనేట్‌లో ఏమవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ఉభయ సభల్లో 150 మందికిపైగా రిపబ్లికన్ సభ్యులు ట్రంప్‌పై తీసుకురానున్న అభిశంసనకు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ట్రంప్‌ను ఎందుకు అభిశంసించాలని అనుకుంటున్నారో, దానికి సంబంధించిన ఆర్టికల్స్ రచించడం కూడా పూర్తయిందని డెమొక్రాట్ సభ్యుడు టెడ్ లూయీ చెప్పారు. ఈ ఆర్టికల్స్‌కి 180 మంది మద్దతు ఉందన్నారు. క్యాపిటల్ భవనంపై దాడికి తన మద్దతుదారుల్ని రెచ్చగొడుతూ ట్రంప్ చేసిన ట్వీట్లు, వీడియోలన్నీ ఇప్పటికే డెమొక్రాట్లు సేకరించి ఉంచారు. సోమవారం నాడు డెమొక్రాట్లు ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానంపై బుధవారం ఓటింగ్ ఉంటుంది. అప్పటికి ట్రంప్ అధ్యక్ష పీఠం వీడడానికి వారం మాత్రమే గడువు ఉంటుంది. ప్రతినిధుల సభలో నెగ్గిన వెంటనే అభిశంసన తీర్మానం సెనేట్‌కి వెళుతుంది. రిపబ్లికన్లంతా ఏకమై ట్రంప్‌ను వ్యతిరేకిస్తే.. సెనేట్ కూడా అభిశంసనని ఆమోదిస్తే ఆయన గద్దె దిగాల్సిందే. అభిశంసన తీర్మానం ఉభయ సభల్లో నెగ్గితే ట్రంప్ అవమానభారంతో ఇంటి దారి పట్టడమే కాదు, మళ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేకపోవచ్చు. అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిగా కూడా ట్రంప్ నిలిచిపోతారు. ఏకాకి అవుతున్న ట్రంప్ ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించలేకపోవడం, ప్రజాస్వామ్యానికి గుండె కాయలాంటి చట్టసభల భవనంపై దాడికి అనుచరుల్ని ఉసిగొల్పడం వంటి చేష్టలతో ట్రంప్ ఏకాకిగా మారుతున్నారు. ఆయన మద్దతుదారుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో పాటు, ఆయన కేబినెట్లోని కొందరు మంత్రులు కూడా ట్రంప్‌కి వ్యతిరేకంగా మారారు. లిసా ముర్కోవ్స్కీ, ఆర్–ఆలస్కా అనే ఇద్దరు మహిళా మంత్రులు ట్రంప్‌ని వెంటనే గెంటేయాలంటూ పిలుపునిచ్చారు. ‘‘ట్రంప్ పదవిలో కొనసాగినన్నాళ్లూ దేశానికి, ప్రజాస్వామ్యానికే కాకుండా రిపబ్లికన్ పార్టీకి కూడా ప్రమాదమేనని కాంగ్రెస్ సభ్యుడు ఆడమ్ స్కిఫ్ అన్నారు. మరోవైపు అభిశంసన ప్రక్రియని ట్రంప్ ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఎవరికీ తెలియడం లేదు. సామాజిక మాధ్యమాల్లో ట్రంప్‌ని తొలగించడంతో ఆయన ప్రత్యామ్నాయ వేదికను ఎంపిక చేసుకునే పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. -
నీరా నియామకాన్ని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు
వాషింగ్టన్: యూఎస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా ఇండో అమెరికన్ నీరాటాండన్ నియామకాన్ని రిపబ్లికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. సెనేట్‌లో కీలక సభ్యులు బహిరంగంగానే ఆమె నియామకంపై అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. గతంలో పలువురు సెనేటర్లకు వ్యతిరేకంగా ఆమె అనేక అవమానాస్పద వ్యాఖ్యలు చేసిందంటున్నారు. టాండన్ నియామకానికి సెనేట్ ఆమోద ముద్ర తప్పనిసరి. ఈనేపథ్యంలో రిపబ్లికన్ సెనేటర్ల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. నీరా నియామకం బైడెన్ ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో అత్యంత చెత్త నిర్ణయమని కీలకమైన సెనేటర్ జాన్ కార్నిన్ మండి పడ్డారు. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గమనిస్తే, ఆమెతో కలిసి పనిచేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. పాత వ్యాఖ్యలు బయటపడకుండా ఉండేందుకు ఆమె ఇటీవల తన పాత ట్వీట్లను చాలావరకు డిలీట్ చేసిందన్నారు. రిపబ్లికన్లను విమర్శిస్తూ చేసిన దాదాపు 1000 ట్వీట్లను ఆమె తొలగించిందన్నారు. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 50 సీట్లున్నాయి. డెమొక్రాట్లకు 48 సీట్లున్నాయి. కీలకమైన రెండు సీట్లకు జనవరి 5న ఎన్నిక జరగనుంది. నీరా పాత ట్వీట్లను పరిశీలిస్తే ట్రంప్‌పై, సెనేట్ మెజార్టీ లీడర్ మెక్కనెల్పై పలు విమర్శలున్నాయి. మెక్కనెల్ను ఆమె మాస్కో మిచ్ అని సంబోధించారు. అప్పుడప్పుడు డెమొక్రాట్లకు మద్దతు పలికే రిపబ్లికన్ సెనేటర్ కాలిన్స్‌ను పాథటిక్గా ఆమె వర్ణించారు. దీనికితోడు గతంలో ఆమె నిర్వహించిన పదవుల్లో వివక్షతో వ్యవహరించారని కొందరు సెనేటర్లు విమర్శించారు. అయితే టాప్ డెమొక్రాట్ సెనేటర్లలో కొందరు మాత్రం ఆమె నియామకాన్ని సమర్థించారు. ట్రంప్ కామెంట్లతో పోలిస్తే ఆమె కామెంట్లు చాలా సరళంగా ఉన్నాయన్నారు. బైడెన్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. -
యూఎస్: భారీగా పోస్టల్ బ్యాలెట్ల వినియోగం
రలీగ్ (అమెరికా): మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో పోస్టల్ ఓట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. అధ్యక్ష ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసే రిస్క్‌ను తీసుకోవడానికి చాలామంది సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో నార్త్ కరోలినాలో శుక్రవారం పోస్టల్ బ్యాలెట్లను పంపడం మొదలైంది. తొలిదశలో 6.18 లక్షల పోస్టల్ బ్యాలెట్లకు అభ్యర్థనలు అందాయి. నాలుగేళ్ల కిందటితో పోలిస్తే ఇది 16 రెట్లు ఎక్కువ. విస్కాన్సిన్లో కిందటిసారితో పోలిస్తే లక్ష అభ్యర్థనలు ఎక్కువ వచ్చాయి. ఫోర్లిడాలో 2016లో 33.47 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోగా... ఈసారి ఇప్పటికే 42.70 లక్షల అభ్యర్థనలు అందాయి. (చదవండి: అమెరికాలో నవంబర్ కల్లా కోవిడ్ టీకా) ఇక అత్యధికంగా డెమొక్రాటిక్ పార్టీ మద్దతుదారుల నుంచే పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థనలు అందుతుండటం విశేషం. వీరి తర్వాత తటస్థులు దీనిని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. కాగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకతవకలు జరిగే అవకాశం ఉందని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అనేకసార్లు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. పోస్టల్ శాఖకు అదనపు నిధుల మంజూరును ట్రంప్ అడ్డుకోవడంతో... భారీగా వచ్చే పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ కేంద్రాలకు చేర్చేందుకు వనరులు ఉండవనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సకాలంలో ఓట్లు లెక్కింపు, ఫలితాల వెల్లడిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.(చదవండి: వర్షంలో తడిస్తే నా జుట్టు పాడవుతుంది: ట్రంప్) చదవండి: అమెరికా ఎన్నికలు; పోస్టల్ పోరు -
రంగంలోకి ప్రజాప్రతినిధులు
-
అందుకే.. ఇలా చేయక తప్పలేదు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన సందర్భంగా హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. డెమొక్రాట్లను సామాజిక తీవ్రవాదులుగా అభివర్ణించిన రిపబ్లికన్లు... ట్రంప్‌ను ద్వేషిస్తూ కక్షపూరిత రాజకీయాలకు దిగారని మండిపడ్డారు. అదే విధంగా వాళ్లకు ఉక్రెయిన్ గురించి వివరాలు అక్కర్లేదని.. కేవలం అధికారం కోసమే అభిశంసనకు పట్టుబట్టారని ఆరోపించారు. ఇక అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యుడు బారీ లౌడర్మిల్స్ చర్చ సందర్భంగా.. ట్రంప్‌ను ఏకంగా జీసస్‌తో పోల్చారు. ‘ మీ చరిత్రాత్మక ఓటు ఉపయోగించుకునే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. వారం రోజుల్లో క్రిస్మస్ రాబోతుంది. ఆ జీసస్‌పై అసత్యపు ఆరోపణల నేపథ్యంలో.. విచారణలో తనపై ఆరోపణలు చేసిన వారిని ఎదుర్కొనే అవకాశం ఆయనకు లభించింది. కొన్ని హక్కులు కూడా లభించాయి. కానీ ఇక్కడ డెమొక్రాట్లు మాత్రం అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కేవలం అధ్యక్షుడిపై ఉన్న ద్వేషం కారణంగానే ఆయనను అభిశంసించారనే విషయాన్ని ప్రజలు తప్పక గుర్తుపెట్టుకుంటారని.. ఎన్నికల్లో డెమొక్రాట్లకు తగిన బుద్ధి చెబుతారని విమర్శలు గుప్పించారు.(అభిశంసనకు గురైన ట్రంప్) ఇందుకు స్పందనగా డెమొక్రాట్లు సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. ‘అధ్యక్షుడిపై వచ్చిన ఆరోపణలు, అందుకు గల సాక్ష్యాలను పరిశీలించకుండా... విమర్శలకు దిగుతూ అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. ట్రంప్ అభిశంసన జ్యుడిషియరీ కమిటీలో భాగమైన జెర్రీ నాడ్లర్ మాట్లాడుతూ.. ‘మేం వినాలనుకోవడం లేదు అందుకే వినబోము. ఎందుకంటే అధ్యక్షుడి తప్పులు కప్పిపుచ్చడమే మా పని అన్నట్లు ఉంది’ అని రిపబ్లికన్ల విమర్శలను తిప్పికొట్టారు. ఇక హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ మాట్లాడుతూ... ‘అధ్యక్షుడి అధికార దుర్వినియోగం కారణంగా అభిశంసనకు గురయ్యారు. ఇది చాలా విషాద ఘటన. అయితే ఇంతకుమించి ఆయన మాకు మరో అవకాశం ఇవ్వలేదు. ఇది జాతీయ భద్రతకు, ఎన్నికల వ్యవస్థకు సమగ్రతకు, విశ్వసనీయతకు సంబంధించిన అంశం. కాబట్టి సభ్యులకు ఇది తప్పలేదు’ అని పేర్కొన్నారు. ఇది అమెరికాపై దాడి తనను అభిశంసించడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘వామపక్ష తీవ్ర భావజాలం.. దారుణమైన అబద్ధాలు ఆడింది. డెమొక్రాట్లు ఇంకేమీ చేయలేరు. ఇది అమెరికాపై దాడి. రిపబ్లికన్ పార్టీపై దాడి’ అని ట్వీట్ చేశారు. అదే విధంగా అభిశంసన నేపథ్యంలో తనకు మద్దతుగా నిలుస్తున్న వారి ట్వీట్లు, తనకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్న వీడియోలను ట్విటర్లో షేర్ చేశారు. ఇక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. ప్రతిపక్ష డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న ప్రతినిధుల సభ ట్రంప్ అభిశంసన తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో జనవరిలో ఆయన సెనేట్‌లో అభిశంసనను ఎదుర్కోనున్నారు. అయితే అక్కడ రిపబ్లికన్ల ఆధిక్యం ఉండటంతో ట్రంప్ అభిశంసన నుంచి తప్పించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. SUCH ATROCIOUS LIES BY THE RADICAL LEFT, DO NOTHING DEMOCRATS. THIS IS AN ASSAULT ON AMERICA, AND AN ASSAULT ON THE REPUBLICAN PARTY!!!! — Donald J. Trump (@realDonaldTrump) December 18, 2019 -
ట్రంప్‌పై మళ్లీ అభిశంసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దించడానికి డెమొక్రాట్లు మరోసారి అభిశంసన తీసుకువచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జోయ్ బైడన్ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉంది. బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. బైడన్ కుమారుడు హంటర్ బైడన్‌కు ఉక్రెయిన్‌లో భారీగా వ్యాపారాలున్నాయి. ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్ దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూశారని, బైడన్ ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్టు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది. ట్రంప్ చర్యలన్నీ జాతీయ భద్రతకు భంగకరంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ డెమొక్రాట్లు వాదిస్తున్నారు. డెమొక్రాట్ ప్రజాప్రతినిధుల్ని కలుసుకొని చర్చించిన తర్వాత హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ట్రంప్‌పై అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసన ప్రక్రియ మొదలైనట్టు ప్రకటించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు, అధ్యక్షుడైనా సరే ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అని నాన్సీ అన్నారు. అభిశంసన ప్రక్రియపై ట్రంప్ స్పందించారు. తనని వెంటాడి వేధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ట్రంప్‌పై తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ బలం లేకపోవడంతో వీగిపోయింది. పదవి నుంచి ఎలా తొలగిస్తారు ? అమెరికా అధ్యక్షుడిని గద్దె దింపాలంటే సెనేట్ అత్యంత కీలకం. సెనేట్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో అధ్యక్షుడికి తన వాదనల్ని వినిపించుకునే అవకాశం ఉంటుంది. సెనేట్‌లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు (67 మంది) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవిని కోల్పోవలసి వస్తుంది. గతంలో ఎదుర్కొన్నవారెవరు? అమెరికా అధ్యక్షులెవరూ ఇప్పటివరకు అభిశంసనకు గురి కాలేదు. 1868లో ఆండ్రూజాన్సన్, తిరిగి 1998లో బిల్ క్లింటన్లపై అభిశంసన ప్రవేశపెట్టినా సెనేట్‌లో వారిద్దరికీ ఊరట లభించింది. ఇక 1974లో రిచర్డ్ నిక్సన్ అభిశంసన తీర్మానంపై చర్చ జరగక ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పటివరకు సభలో 60సార్లకు పైగా అభిశంసన ప్రక్రియ జరిగింది. -
‘చట్టబద్ధంగా వచ్చిన వారికే మా దేశంలో చోటు’
వాషింగ్టన్ : చట్టబద్దంగా వచ్చిన వారికే అమెరికాలో చోటు ఉంటుందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వలసదారుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తమ దేశానికి వచ్చేవారు న్యాయపరంగా రావాలని ట్రంప్ కోరారు. అక్రమ వలసదారులే దేశానికి పెను ముప్పని తేల్చారు. ఈ సందర్భంగా ట్రంప్ ‘అమెరికన్ల ఉద్యోగాలకు, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ బలమైన వలస వ్యవస్థను రూపొందించడం మా నైతిక బాధ్యత. న్యాయపరంగా వచ్చే వలసదారులు మా దేశానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. విదేశీయులు ఇంకా ఎక్కువ మంది మా దేశానికి రావాలని కోరుకుంటున్నాను. కానీ వారు న్యాయపరంగా రావాలి’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అక్రమ వలసల్ని, మాదక ద్రవ్యాలను అడ్డుకోవాలంటే సరిహద్దు గోడ నిర్మాణం తప్పనిసరని తేల్చారు. అమెరికా భద్రతకు అత్యంత కీలకంగా నిలిచే సరిహద్దు గోడ నిర్మాణాన్ని డెమోక్రాట్లు అడ్డుకోవడం సరికాదన్నారు ట్రంప్. గతంలో చాలా మంది సరిహద్దు గోడ నిర్మణానికి మద్దతు తెలిపారని.. కానీ నేడు వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఈ నెల 15 లోగా సరిహద్దు గోడ నిర్మాణం గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ గడువు విధించారు. చట్టబద్దంగా వచ్చిన వారికే అమెరికాలో చోటు ఉంటుందని తెలిపారు. అంతేకాక అదేసమయంలో 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంబంధించి డెమొక్రాట్లు చేస్తున్న విమర్శల విషయంలో ఘాటుగా స్పందించారు. వాటిని పనికిమాలిన ఆరోపణలుగా కొట్టిపారేశారు. -
గోడను అడ్డుకుంటే ఎమర్జెన్సీనే!
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ట్రంప్ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఇందుకు అవసరమైన నిధులు పొందడానికి జాతీయ అత్యవసర పరిస్థితి విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గోడ నిర్మాణానికి 5.6 బిలియన్ డాలర్లు మంజూరు చేయాలని ట్రంప్ ప్రభుత్వం కోరగా డెమొక్రాట్లు అడ్డుపడిన సంగతి తెలిసిందే. గోడ నిర్మాణ ప్రణాళికలకు మద్దతు కూడగట్టేందుకు ట్రంప్ టెక్సస్‌లో పర్యటించారు. అత్యవసర పరిస్థితి ప్రకటించే అవకాశాలపై మీడియా ప్రశ్నించగా..ఆ దిశగా ఆలోచిస్తున్నామని సమాధానమిచ్చారు. గోడకు రోనిల్ సోదరుడి మద్దతు.. ఇటీవల అక్రమ వలసదారుడి చేతిలో హత్యకు గురైన భారత సంతతి పోలీసు అధికారి రోనిల్ రాన్ సింగ్ సోదరుడు రెగ్గీ సింగ్..ట్రంప్ గోడ నిర్మాణ ప్రతిపాదనకు మద్దతిచ్చారు. తమ కుటుంబం మాదిరిగా ఇతరులు బాధపడకూడదంటే సరిహద్దును పటిష్టపరచాలని అన్నారు. టెక్సాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రెగ్గీ సింగ్.. ట్రంప్ పక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించారు. ‘నా సోదరునిలా మరో పోలీసు అధికారి బలికావొద్దు. ఈ ముప్పును తగ్గించడానికి ఏం చేయాలో చేయండి. మా కుటుంబం మద్దతుగా నిలుస్తుంది’ అని ట్రంప్‌తో రెగ్గీ అన్నారు. మీడియానే ప్రతిపక్షం.. ‘సరిహద్దుల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే డెమొక్రాట్లు వినడం లేదు. అక్కడ కృత్రిమ సంక్షోభం ఉందని కొత్తగా చెబుతున్నారు. నకిలీ మీడియా సంస్థల సృష్టే ఇది. వారు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నారు’ అని సరిహద్దు భద్రత, వలసలపై టెక్సాస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆర్మీ డబ్బులతో గోడ నిర్మాణం? ఆర్మీ కోర్ ఇంజినీర్ల విభాగంలో నిరుపయోగంగా ఉన్న నిధులతో గోడ నిర్మాణం చేపట్టాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలిసింది. గోడ నిర్మాణానికి కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? నిర్మాణం 45 రోజుల్లో ప్రారంభించొచ్చా? అనే విషయాలు తేల్చాలని ఆర్మీ కోర్‌ను ట్రంప్ ఆదేశించారు. మరోవైపు, కాంగ్రెస్ అనుమతి లేకుండానే నిధులు పొందేందుకు ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే ఏం చేయాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు యోచిస్తున్నారు. ట్రంప్ ఎమర్జెన్సీ విధిస్తే ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడానికి ఉన్న అవకాశాలను ప్రతిపక్ష డెమొక్రాటిక్ నాయకత్వం పరిశీలిస్తోంది. -
181 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
వాషింగ్టన్ : కొత్తగా కొలువుదీరిన ప్రతినిధుల సభ(హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్) 181 ఏళ్ల నిబంధనను తిరగరాస్తూ కొత్త చరిత్రను లిఖించింది. మత సంప్రదాయాలకు విలువనిస్తూ వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు తమ ఆచారం ప్రకారం తలపాగా(హిజాబ్, టర్బైన్) ధరించి సభకు హాజరయ్యేలా రూపొందించిన బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది. హౌజ్‌కు తొలిసారిగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా సరికొత్త రికార్డు సృష్టించిన రషిదా త్లాయిబ్, ఇల్హాన్ ఒమర్‌లు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం. ‘హెడ్‌గేర్ ధరించడంపై 181 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని 116వ కాంగ్రెస్ సభ్యులు ఎత్తివేశారు. నాకు ఇంతటి సాదర స్వాగతం పలికిన నా సహచరులకు ధన్యవాదాలు. ఈవిధంగానే.. ముస్లిం కుటుంబాలను అమెరికా నుంచి విడదీసే నిషేధానికి కూడా ముగింపు పలికే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ఇల్హాన్ ఒమర్ ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. కాగా నవంబరులో జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 100 మంది మహిళలు దిగువ సభ(హౌజ్)కు ఎన్నికయ్యారు. ఇందులో 28 మంది తొలిసారిగా ఈ సభలో అడుగుపెట్టబోతున్నారు. వీరంతా డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారే కావడం విశేషం. ఇక ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా రషిదా త్లాయిబా, సోమాలియాకు చెందిన ఇల్హాన్ ఒమర్‌లు గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. Yesterday, Congress voted to lift a 181 year ban on headwear to make the #116thCongress more inclusive for all. I thank my colleagues for welcoming me, and I look forward to the day we lift the Muslim ban separating families all over the U.S. from their loved ones. — Ilhan Omar (@IlhanMN) January 4, 2019 -
సెనెట్ నీది ‘హౌస్’ నాది!
వాషింగ్టన్: అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు రెఫరెండంగా భావించిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. ప్రతిపక్షానికి బాసటగా నిలిచే ఆనవాయితీని కొనసాగిస్తూ ప్రతినిధుల సభ డెమొక్రటిక్ పార్టీ వశమైందని ప్రాథమిక ఫలితాలు తేల్చాయి. కానీ, ఎగువ సభ సెనెట్‌లో అధికార రిపబ్లికన్ పార్టీ తన మెజారిటీని నిలబెట్టుకుంది. 435 స్థానాలున్న ప్రతినిధుల సభకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్లు సాధారణ మెజారిటీ కన్నా కనీసం 23 సీట్లు అధికంగా గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 235 సీట్లు, డెమొక్రాట్లకు 193 సీట్లున్నాయి. తాజా ఎన్నికల్లో రిపబ్లికన్ల నుంచి డెమొక్రాట్లు సుమారు 27 సీట్లు కైవసం చేసుకున్నారని ప్రాథమిక ఫలితాలు వెల్లడించాయి. కొత్త సభ వచ్చే జనవరిలో కొలువుదీరుతుంది. నలుగురు సిట్టింగ్ ఇండో–అమెరికన్లు ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికయ్యారు. వారంతా డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారే. ఈసారి రికార్డు స్థాయిలో 100 మంది మహిళలు దిగువ సభకు ఎన్నికయ్యారు. అందులో 28 మంది తొలిసారి ఈ సభలో అడుగుపెట్టబోతున్నారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన 78 ఏళ్ల నాన్సీ పెలోసి ప్రతినిధుల సభకు స్పీకర్‌గా ఎన్నికయ్యే చాన్సుంది. ఈ పదవి భారత్‌లో లోక్‌సభ స్పీకర్ హోదాతో సమానం. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా రషిదా త్లాయిబ్, సోమాలియాకు చెందిన ఇల్హాన్ ఒమర్‌లు గుర్తింపు పొందారు. మరోవైపు, 35 స్థానాలకు ఎన్నికలు జరిగిన సెనెట్ (మొత్తం సభ్యులు 100)లో రిపబ్లికన్లు తమ ఆధిక్యతను కొనసాగించారు. తాజా ఎన్నికల తరువాత ఎగువ సభలో వారి బలం 51 పైనే ఉందని స్థానిక మీడియా తేల్చింది. ఇండో–అమెరికన్ల విజయం.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో నలుగురు సిట్టింగ్ ఇండో–అమెరికన్లు ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికవగా, మరో డజను మందికి పైగా రాష్ట్రాల స్థాయిలో జరిగిన అసెంబ్లీ, సెనెట్, అటార్నీ జనరల్ ఎన్నికల్లో గెలుపొందారు. ఇలినాయిస్ 8వ కాంగ్రెషనల్ జిల్లాలో రాజా క్రిష్ణమూర్తి మళ్లీ గెలిచారు. కాలిఫోర్నియా 7వ కాంగ్రెషనల్ జిల్లాలో అమీ బేరా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. సిలికాన్ వ్యాలీలో రో ఖన్నా గెలిచారు. ప్రతినిధుల సభలో ఏకైక మహిళా ఇండో అమెరికన్ ప్రమీలా జయపాల్ భారీ మెజారిటీతో గెలిచారు. విస్కాన్సిస్ రాష్ట్రంలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన జోష్ కౌల్.. అటార్నీ జనరల్‌గా ఎన్నికై, ఈ పదవి దక్కించుకున్న తొలి ఇండో–అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీకే చెందిన నీమా కులకర్ణి కెంటుకీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అమీశ్, కెవిన్ థామస్‌లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ముజతబా మొహమ్మద్ ఉత్తర కరోలినాసెనెట్కు ఎన్నికయ్యారు. మీడియాపై ట్రంప్ ఫైర్ వాషింగ్టన్: మీడియాపై ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. మధ్యంతర ఎన్నికలు ముగిసిన తరువాత బుధవారం శ్వేతసౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాత్రికేయులతో వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా సీఎన్ఎన్ పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని మండిపడ్డారు. మీడియా సమావేశంలో ట్రంప్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి నిరాకరించి మైక్రోఫోన్‌కు దూరంగా జరిగారు. ట్రంప్ నేరగాళ్లుగా అభివర్ణించిన మధ్య అమెరికా ప్రజల వలసల గురించి సీఎన్ఎన్ పాత్రికేయుడు ప్రశ్నించగా..‘మీ పని మీరు చూసుకోండి..దేశ పాలనను నన్ను చేయనీయండి’ అని ట్రంప్ బదులిచ్చారు. రిపబ్లికన్ పార్టీ శ్వేత జాతీయులకు మద్దతిస్తోందా? అని మహిళా జర్నలిస్ట్ అడగ్గా.. ఆమె జాత్యహంకార ప్రశ్నలు వేస్తోందని మండిపడ్డారు. ట్రంప్‌తో వాగ్వాదానికి దిగిన సీఎన్ఎన్ విలేకరి ప్రెస్ ప్రవేశ అర్హతా పత్రాల్ని వైట్‌హౌజ్ రద్దుచేసింది. మీడియాకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రవర్తన హద్దులు మీరిందని సీఎన్ఎన్ ఆరోపించింది.