department of Housing
-
ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన పనులను వారంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆప్షన్–3 ఎంచుకున్న లబ్ధిదారులను కాంట్రాక్టర్లకు మ్యాపింగ్ చేయడం, అవగాహన ఒప్పందాలు, బ్యాంక్ ఖాతాలను ప్రారంభించడం తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. విశాఖపట్నంలో సుమారు 1.24 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నందున.. లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రతి లేఅవుట్లో ఇటుకల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ.. నిర్మాణాలకు సకాలంలో సామగ్రి సరఫరాతో పాటు బిల్లులు చెల్లిస్తామన్నారు. -
‘హౌసింగ్ బోర్డు’ రిజిస్ట్రేషన్లకు ఓకే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (హౌసింగ్ బోర్డు) స్థలాల్లో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మించిన జాయింట్ వెంచర్ల కొనుగోలుదారులకు తీపి కబురు అందింది. వారు కొన్న ఇళ్లు, వాణిజ్య స్థలాల రిజిస్ట్రేషన్‌కు మార్గం సుగమమైంది. జూలై ఒకటి నుంచి రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనితో దాదాపు 15 ఏళ్ల పాటు కొనసాగిన వివాదానికి తెరపడింది. విలువైన ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసినా.. రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆగిపోవటంతో కొనుగోలుదారుల్లో నెలకొన్న ఆందోళన సమసిపోయింది. ఏమిటీ వివాదం? హైదరాబాద్‌లోని కొండాపూర్, గచ్చిబౌలి వంటి విలువైన ప్రాంతాల్లో గృహనిర్మాణ మండలికి ఖాళీ స్థలాలున్నాయి. వాటిలో ప్రైవేటు సంస్థలతో కలిసి పీపీపీ పద్ధతిలో వాణిజ్య సముదాయాలు, నివాస గృహ సముదాయాలను అభివృద్ధి చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించారు. 2007లో అప్పటి ప్రభుత్వం 19 ప్రాజెక్టుల కోసం ప్రైవేటు సంస్థలకు భూములను కేటాయించింది. ఆయా సంస్థలు వివిధ దఫాల్లో కొంతమొత్తం సొమ్ము చెల్లించాయి. అయితే సదరు స్థలాల్లో కొన్ని సంస్థలు పనులు ప్రారంభించినా, మిగతావి జాప్యం చేశారు. సుమారు 12 ప్రాజెక్టుల్లో ఆశించినమేర ప్రాజెక్టులు ముందుకు పడలేదు. ఇలా దశాబ్దానికిపైగా గడిచింది. వాటిని చేపట్టిన సంస్థలు కమర్షియల్ స్పేస్ నిబంధనలు మార్చాలని, వన్‌టైమ్ సెటిల్మెంట్ వంటి ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ క్రమంలోనే ఆయా స్థలాల్లో చేపట్టిన నిర్మాణాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈ వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రభుత్వం 2016లో కేబినెట్ సబ్‌కమిటీని నియమించింది. ఆ కమిటీ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు స్థలాలను పరిశీలించి, సంస్థల ప్రతినిధులతో చర్చించి 2018లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇప్పటిదాకా నిర్ణయం వెలువడలేదు. ఈలోగా అన్ని ప్రాజెక్టులు దాదాపు పూర్తయి, నిర్మాణాలు అమ్ముడయ్యాయి. కానీ నిషేధం ఉండ టంతో రిజిస్ట్రేషన్లు జరగలేదు. తాజాగా రిజిస్ట్రేష న్లకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గృహనిర్మాణశాఖ ఇచ్చిన భూములకు సదరు సంస్థల నుంచి ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల వరకు అందనున్నట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా కూడా సర్కారుకు ఆదాయం రానుంది. -
గృహ నిర్మాణశాఖపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశంలో ఎనర్జీ, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఎనర్జీ సెక్రటరీ బి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హౌసింగ్‌పై సమీక్షలో ముఖ్యాంశాలు.. ►ఇళ్లపట్టాలు కోసం చేసిన ఖర్చు కాకుండా కేవలం నిర్మాణం కోసమే గడచిన ఆర్థిక సంవత్సంలో సుమారు రూ.3,600 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం. ►ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,105 కోట్లు గృహ నిర్మాణం కోసం ఖర్చు చేయనున్న ప్రభుత్వం. ►ఈ ఏడాది 35 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు, 3.46 లక్షల మెట్రిక్‌టన్నుల స్టీల్‌ను ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనున్న ప్రభుత్వం. సమీక్షలో సీఎం ఏమన్నారంటే.. ►కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్దంచేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. ►కేసులు పరిష్కారం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నచోట.. ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించే కార్యక్రమం చేపట్టాలన్న ముఖ్యమంత్రి. ►ఇందులో జాప్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. ► కోర్టు వివాదాలు తీరడంతో విశాఖలో 1.43 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం. ►విశాఖలో పట్టాల పంపిణీ పూర్తికాగానే, వాటికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు జూన్‌నాటికి ప్రారంభం అవుతాయన్న అధికారులు. ►దాదాపు 63 లే అవుట్లలో ఇళ్ల నిర్మాణంకోసం సమాయత్తమవుతున్న ప్రభుత్వం. ►ఇక్కడ భూమిని చదును చేయడంతోపాటు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, లే అవుట్లలో నీళ్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం. ►5వేలకుపైగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నచోట నిర్మాణ సామగ్రిని ఉంచడానికి వీలుగా గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించిన అధికారులు. ►66 గోడౌన్లలో 47 గోడౌన్ల నిర్మాణం ప్రారంభమయ్యిందన్న అధికారులు. ►ఇళ్లకు ఇచ్చే కరెంటు సామగ్రి అత్యంత నాణ్యతతో ఉండాలన్న సీఎం. ►బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు అన్నీకూడా నాణ్యతతో ఉండాలన్న సీఎం. ►నాణ్యతలేని పరికరాలు కొంటే తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించిన సీఎం. ►నాణ్యతా ప్రమాణాలు ఉన్నవాటినే కొనుగోలు చేయాలని అధికారులుకు స్పష్టం చేసిన సీఎం. ►పేదల ఇళ్ల నిర్మాణంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న ప్రజాప్రతినిధులను సత్కరించాలని నిర్ణయం. ►వారు చురుగ్గా వ్యవహరిస్తున్నచోట నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని వెల్లడించిన అధికారులు. ►ఇలాంటి స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించాలని నిర్ణయం. ►మండలానికి ఒక సర్పంచ్‌ని, మున్సిపాల్టీకి ఒక కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జిల్లాకు ఒక జడ్పీటీసీ చొప్పున అవార్డులు ఇవ్వాలని నిర్ణయం. ►జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి తాగునీరు, డ్రైనేజీ, కరెంటు లాంటి కనీస మౌలిక సదుపాయాలు ఉండాలని ఆదేశించిన సీఎం. ►దీని తర్వాత కాలనీలకు కావాల్సిన సామాజిక, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకు సాగాలన్న సీఎం. ►కాలనీల్లో సమగ్ర ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టుకుంటూ ముందుకు సాగాలన్న సీఎం. ►దీనికి సంబంధించిన విభాగాలన్నీ అత్యంత సమన్వయంతో ముందుకు సాగాలన్న సీఎం. ►భవిష్యత్తులో కూడా ప్రభుత్వానికి ఇది బృహత్తర ప్రణాళిక అనీ, జగనన్న కాలనీల్లో అభివృద్ధి పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటామన్న సీఎం జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని సమీక్షించిన సీఎం ►ఇప్పటివరకూ పథకాన్ని వినియోగించుకున్న 10.2 లక్షలమంది, 6.15 లక్షల మందికి రిజిస్ట్రేషన్ పూర్తి. ►మిగిలినవారికీ వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలని సీఎం ఆదేశం. ►ఈ ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ మరింత మంది ముందుకు వస్తారన్న ముఖ్యమంత్రి. ►టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం. ►టిడ్కో ఇళ్లు అత్యంత పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. ►దీనికోసం మార్గదర్శకాలు తయారుచేయాలన్న సీఎం. ఎంఐజీ ప్లాట్ల పథకంపైనా సీఎం సమీక్ష ►పట్టణాలు, నగరాలు ఉన్న 116 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల పథకానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. ►మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎంఐజీ ఇళ్ల పథకంకోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. ►ఇప్పటికే 41 నియోజకవర్గాల్లో 4127.5 ఎకరాల భూములను గుర్తించామని తెలిపిన అధికారులు. ►వివాదాలు, చిక్కులు లేనివిధంగా క్లియర్ టైటిల్‌తో సరసమైన ధరలకు ఈ ప్లాట్లు ఇస్తామన్న సీఎం. ►మౌలిక సదుపాయాలకోసం లే అవుట్లో అన్నిరకాల ప్రమాణాలను పాటిస్తామన్న సీఎం. ►ప్రతి నియోజకవర్గంలోకూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి. ►ఇతర లే అవుట్లకు మార్గదర్శకంగా ప్రభుత్వ ఎంఐజీ లేవుట్ ఉండాలన్న సీఎం. చదవండి: (విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన) -
పేదల ఇళ్లకు రాయితీపై 140 బస్తాల సిమెంట్
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రస్తుతం రాయితీపై ఇస్తున్న 90 బస్తాల సిమెంట్‌ను ఇకపై 140 బస్తాలకు పెంచుతున్నట్లు గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. తద్వారా లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సచివాలయం 4వ బ్లాక్‌లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం విశాఖపట్నంలో లక్ష మంది మహిళలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు ఫైలుపై తొలి సంతకం చేశారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు 140 బస్తాల సిమెంట్ ఇచ్చే ఫైలుపై రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి రమేష్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో లక్ష మంది మహిళలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుంటే కొందరు అడ్డుపడ్డారన్నారు. నవరత్నాల్లో మేలిమి రత్నం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకమని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిమందికే ఇళ్లు ఇచ్చారని.. నేడు కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంతృప్త స్థాయిలో ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక న్యాయం చేస్తున్న విప్లవవాది, అభినవ పూలే, బీఆర్ అంబేడ్కర్‌కు అసలైన వారసుడు వైఎస్ జగన్ అని ఉద్ఘాటించారు. కాగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డి. నాగేశ్వరరావు, రక్షణ నిధి, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్‌గుప్త, జాయింట్ ఎండీ శివశంకర్ జోగి రమేష్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. -
త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్
నెల్లూరు (అర్బన్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ఇష్టంతో ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగులకు త్వరితగతిన ప్రొబేషన్ పీరియడ్‌ను డిక్లేర్ చేసి పీఆర్సీ అమలు చేయనున్నారని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. నెల్లూరులో పలువురు సచివాలయ ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్కరించి, తమకు ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలంటూ స్థానిక కలెక్టరేట్లో అజయ్‌జైన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యపాలన తీసుకుని రావడంలో భాగంగా రాష్ట్రంలో ఒకే దఫా 1.20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. వారికి ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేసేందుకు లెక్కలు తీసుకుంటున్నామన్నారు. డిపార్ట్మెంట్ పరీక్ష పాసయిన ప్రతి ఒక్కరికి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారని చెప్పారు. ఎక్కువ శాఖల నుంచి వివరాలు సేకరించాల్సి ఉన్నందున కాస్త ఆలస్యం అయిందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జూన్‌నాటికి డిక్లేర్ చేస్తామని తెలపగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంకా ముందుగా వీలైనంత త్వరగా ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. అధికారులు అదే ప్రయత్నంలో ఉన్నారన్నారు. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడంలో తప్పులేదని, విధులు బహిష్కరించి రోడ్డెక్కడం మంచిపద్ధతి కాదని చెప్పారు. ఎవరో రెచ్చగొడితే ఇలా రోడ్డెక్కితే అంతిమంగా సచివాలయ ఉద్యోగులకే నష్టం జరుగుతుందన్నారు. ఇకనైనా విధులకు హాజరై ప్రజలకు మంచిగా సేవలందించాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వందశాతం న్యాయం చేస్తుందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన చెప్పారు. -
ఆ రెండు పథకాలకు అధిక ప్రాధాన్యతివ్వాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాల అమలుకు అధిక ప్రాధాన్యతివ్వాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు అధికారులను ఆదేశించారు. 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లు (గృహ నిర్మాణం), గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లతో మంగళవారం విజయవాడలోని గృహనిర్మాణ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ తొలి దశలో నిర్మిస్తోన్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన పనులను తక్షణం మొదలు పెట్టాలని ఆదేశించారు. ఆప్షన్–? ఎంచుకున్న లబ్ధిదారుల గృహాల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని సూచించారు. కాలనీలలో అంతర్గత రహదారుల నిర్మాణం, ఇళ్లు నిర్మించుకోవడానికి నీటి వసతి కల్పించాలని సూచించారు. 25 మంది లబ్ధిదారుల చొప్పున గ్రూపులు ఏర్పాటు చేసి, ఇళ్ల నిర్మాణాలకు స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు అప్పగించాలన్నారు. లేఅవుట్లకు 20 కిలో మీటర్ల లోపు ఇసుక రీచ్‌లు ఉండే విధంగా చూడాలని చెప్పారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఉచితంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందని, ఈ నెల 21 నుంచి సీఎం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దొరబాబు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సీఎం అదనపు కార్యదర్శి ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
వన్‌టైం సెటిల్మెంట్ పథకం అమలుకు సీఎం జగన్ ఆదేశం
-
ఇళ్ల నిర్మాణంపై ఈ ఏడుపేంటి!
ఏలూరు (మెట్రో)/ఉండి: పేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇళ్లు నిర్మిస్తుంటే.. జీర్ణించుకోలేని ఎల్లో మీడియా విషపు రాతలతో బురద చల్లుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ముత్యాలమ్మ గుడి వద్ద లే–అవుట్లో నిర్మిస్తున్న గృహాలను హౌసింగ్ జేసీ సూరజ్ ధనుంజయ్‌తో కలసి శనివారం మంత్రి పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పేదలకు సెంటు స్థలమైనా ఇచ్చాడా అని నిలదీశారు. ఆనాడు రామోజీరావుకు ఇది కనిపించలేదా అని ప్రశ్నించారు. ఒక్కో పేద కుటుంబానికి రూ.15 లక్షల ఆస్తి చొప్పున 31 లక్షల మంది పేదలకు ఆస్తులు ఇస్తుంటే ఓర్వలేకే విషపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం జరిగితే చూడగల శక్తి గానీ.. చూసి ఆనందించే శక్తి గానీ అటు రామోజీకి, ఇటు చంద్రబాబు కు, రాధాకృష్ణకు ఉందా అని నిలదీశారు. బాబు హయాంలో ఇళ్ల నిర్మాణంలో ఏపీ 27వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కొత్తగా స్థలాలు సేకరించి వందలాది ఇళ్ల నిర్మాణాల కోసం పూడికలు చేసి రోడ్లు నిర్మిస్తే అవి మునిగిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలు నిజాలు తెలుసుకోవాలన్నారు. వందేళ్లకు పైగా నిలబడేలా ఇళ్ల నిర్మాణాలు గ్రేటర్ కమ్యూనిటీలకు దీటుగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని, రాష్ట్రంలో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లు 100 నుంచి 150 ఏళ్లపాటు దృఢంగా నిలబడేలా కడుతున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. భూసేకరణ చేసిన రెండు నెలల్లోనే రూ.12 వేల కోట్లు ఖర్చుచేసి స్థలాలను పూడ్పించి విద్యుత్, మంచినీటి సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. రాష్ట్రంలో 17,500 వైఎస్సార్ జగనన్న లే–అవుట్లలో ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, దీనివల్ల అనేక మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 15.60 లక్షల గృహాలు నిర్మిస్తుండగా.. లబ్ధిదారుల్లో 3.27 లక్షల మంది మూడో ఆప్షన్ ఎంపిక చేసుకున్నారని తెలిపారు. వీరిలో ప్రతి 20 మంది లబ్ధిదారులకు ఒక అధికారిని నియమించి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. లే–అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, ఇనుము అందించి ఆర్థికంగా లబ్ధిదారులకు భారం కలగకుండా ప్రభుత్వం చేయూత అందిస్తోందని చెప్పారు. -
జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు అదుర్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ – జగనన్న పేదల ఇళ్ల కాలనీల్లో మధ్య తరగతి కాలనీల స్థాయిలో మౌలిక వసతులు కల్పించే దిశగా కార్యాచరణ సిద్ధమైంది. ఈ విషయంలో రాజీ పడేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలనీల్లో ఇరుకు రహదారులు, మొక్కుబడిగా మౌలిక వసతులు కల్పించి చేతులు దులుపుకుంటే కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీంతో మధ్యతరగతి ప్రజల కాలనీల్లో ఏ స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తున్నారో అదే స్థాయిలో ఈ కాలనీల్లో కూడా మౌలిక వసతుల కల్పనకు శాఖల వారీగా ప్రాథమిక అంచనాలను సిద్ధం చేశారు. పేదల కాలనీల్లో తొలుత 20 అడుగుల్లోపు రహదారులను అధికారులు ప్రతిపాదించగా ముఖ్యమంత్రి తిరస్కరించారు. ఓపెన్ ఏరియా 13 శాతం ఉండాల్సిందేనని ఆదేశించారు. దీంతో 20 అడుగుల నుంచి 60 అడుగుల వరకు రహదారుల నిర్మాణానికి, కాలనీల్లో 13 శాతం మేర ఓపెన్ స్పేస్‌కు అదనంగా అవసరమైన భూ సేకరణకు అధికారులు చర్యలను చేపట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వర్షపు నీరు కూడా వెళ్లేలా నిర్మాణాలు ఉండాలని, ఫుట్‌పాత్‌పై టైల్స్ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీ కోసం కూడా చర్యలు తీసుకోనున్నారు. అదనంగా 950 ఎకరాలు అవసరం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రహదారుల సైజు పెంచడం, ఓపెన్ ఏరియా 13 శాతం మేర ఉంచేందుకు చర్యలు తీసుకోవడం వల్ల అదనంగా 950 ఎకరాలు అవసరం అవుతుందని అంచనా వేయడంతో పాటు ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు గృహ నిర్మాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్–జగనన్న పేదల ఇళ్ల కాలనీల్లో ఏకంగా 11,412 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ రహదారుల వెంబడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్, ఎలక్ట్రిఫికేషన్ కేబుల్స్ రానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17,005 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాలను రెండు దశల్లో చేపట్టనున్న విషయం తెలిసింది. ఈ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.30,958 కోట్లు వ్యయం అవుతుంది. ఇందుకు అదనంగా సామాజిక మౌలిక వసతుల కల్పనకు మరో రూ.2,715 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మధ్యతరగతి కాలనీలకు ఏమాత్రం తీసిపోవు మధ్యతరగతి ప్రజల కాలనీలకు తీసిపోని స్థాయిలో వైఎస్సార్–జగనన్న పేదల ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పన ఉండాల్సిందేనన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రహదారులు, ఓపెన్ ఏరియా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటర్నెట్, ఎలక్ట్రిఫికేషన్ రీ–డీజైన్ చేశాం. శాఖల వారీగా ప్రాథమిక అంచనాలను రూపొందించాం. ఇందులో ఇంకా మార్పులు జరిగే అవకాశం ఉంది. కాలనీల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా, అత్యంత నాణ్యతతో పనులు చేపడుతున్నాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
ఇళ్ల నిర్మాణాల నాణ్యతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ఇళ్ల నిర్మాణ వేగం పెరగాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంజూరైన ఇళ్లకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి, ఆ మేరకు సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టేందుకు అవసరమై నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడంపై నిర్లక్ష్యం వహించకుండా వాటిపై వెంటనే దృష్టి సారించాలని సూచించారు. ఇళ్లు కట్టు కోవడానికి కరెంటు, నీళ్ల వంటి సదుపాయాలు లేవనే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కన్పించకూడదని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. వసతుల కల్పనపై నివేదిక ఇవ్వండి కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సౌకర్యం తదితర వసతుల కల్పనపై సీఎం వైఎస్ జగన్ సమగ్రంగా చర్చించారు. పట్టణాల్లో ఏవిధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామో అదే తరహాలో కొత్తగా నిర్మిస్తున్న కాలనీల్లోనూ వసతులు కల్పించాలని చెప్పారు. ఆ మేరకు తీసుకునే చర్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రోడ్ల వెడల్పు 20 అడుగులకు తగ్గకుండా చూడాలన్నారు. తామే ఇళ్లు నిర్మించుకుంటామని ఆప్షన్ ఎంచుకున్న లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి విషయంలో సహాయకారిగా నిలవాలని చెప్పారు. స్టీలు, సిమెంట్, ఇతరత్రా నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాల కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కొత్త కాలనీల రూపు రేఖలు, అక్కడ చేపట్టనున్న నిర్మాణాలు, కల్పిస్తున్న వసతులు, డిజైన్లపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. -
ఇళ్ల స్థలాల మంజూరు నిరంతర ప్రక్రియ
30,06,673 ఇళ్ల స్థలాల పట్టాలకు గాను ఇప్పటి వరకు 26,21,049 పట్టాల పంపిణీ పూర్తి చేశారు. అంటే 87.17 శాతం పట్టాల పంపిణీ పూర్తి అయింది. ప్రత్యేకంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఏకంగా 90.28 శాతం పట్టాల పంపిణీ పూర్తయింది. మిగిలిన వాటిని రెండు మూడు రోజుల్లో పంపిణీ చేయాలి. సాక్షి, అమరావతి: ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దీనిని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఇంటి స్థలం పట్టా కోసం దరఖాస్తు అందుకున్న రెండు మూడు వారాల్లో భౌతిక తనిఖీ, అర్హతల పరిశీలన, సోషల్ ఆడిట్ ప్రక్రియనంతా పూర్తి చేయాల్సిన బాధ్యత వలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బందిదేనని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన వారు అర్హులని తేలితే కచ్చితంగా 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ పురోగతితో పాటు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సామాజిక తనిఖీల ద్వారా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. నిర్మాణాల్లో ఏక రూపత, నాణ్యత కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కల్పిస్తున్న సదుపాయాలు, వాటి నిర్మాణ రీతులు తదితర అంశాలపై పూర్తి వివరాలను ఆయా కాలనీల వారీగా వేర్వేరుగా నివేదించాలని చెప్పారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించాలని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. డంపింగ్ యార్డుల్లో బయో మైనింగ్ చేయాలని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని ఆయన సూచించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌలిక సదుపాయాలపై డీపీఆర్ ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. మార్చి 31 నాటికి ఈ కాలనీల్లో కల్పించే మౌలిక సదుపాయాలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తామని తెలిపారు. ► వివిధ ప్రభుత్వ శాఖలు ఇందులో భాగస్వాములవుతాయని చెప్పారు. కాలనీల్లో జనాభాను అనుసరించి అంగన్వాడీ కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, బస్టాపులు తదితర నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ► ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తిరుపతి ఐఐటీతో గృహనిర్మాణశాఖ ఒప్పందం..
సాక్షి, అమరావతి: పేదలకు నిర్మించే ఇళ్లు మరింత పటిష్టంగా ఉండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నాణ్యత ప్రమాణాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇంజినీర్లకు శిక్షణ ప్రారంభించింది. పేదలకు నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించాలని గృహనిర్మాణశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. దీన్లో భాగంగా మొదటి విడత 15 లక్షల ఇళ్లు నిర్మించనున్నారు. ఇళ్ల నిర్మాణాలు దేశానికే ఆదర్శంగా ఉండేలా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు. దీంతో తమశాఖ ఇంజినీర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు గృహనిర్మాణశాఖ తిరుపతి ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ స్థాయిలకు చెందిన 1,100 మంది ఇంజినీర్లకు బృందాలుగా నాలుగురోజులు ఆన్లైన్లో ఇచ్చే శిక్షణ కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాల్లో గృహనిర్మాణశాఖ కార్యాలయాల్లో హాజరైన ఇంజినీర్లకు తిరుపతి ఐఐటీ నుంచి ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ సివిల్, పర్యావరణ విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్లతో శిక్షణ ఇస్తామని చెప్పారు. గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, గృహనిర్మాణసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్‌కుమార్ మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. ►పేదలందరికీ ఇళ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ►ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఈ శిక్షణ నిరంతరం కొనసాగుతుంది. ►నిర్మాణంలో ఇనుము, సిమెంట్, ఇతర ముడిపదార్థాలు నాణ్యమైనవి సరఫరా చేస్తాం. ►కాలుష్య రహితంగా, పూర్తి భద్రత ప్రమాణాలతో ఇళ్లు నిర్మించేలా ఇంజినీర్లు చొరవ చూపాలి. ►ఇంజనీర్ల బృందాలను తిరుపతి ఐఐటీ ప్రాంగణానికి పంపిస్తాం. అక్కడి ల్యాబ్‌లు తదితరాలు పరిశీలించి మరింత అవగాహన పెంచుకోవచ్చు. ►గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు కూడా శిక్షణ ఇస్తాం. ►గృహనిర్మాణసంస్థ చీఫ్ ఇంజనీర్ సీహెచ్ మల్లికార్జునరావు కూడా పాల్గొన్నారు. -
తొలి దశలో 15 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదల కోసం ప్రభుత్వం 15 లక్షల ఇళ్లను నిర్మించనుంది. రాష్ట్రంలో అర్హులైన 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనుండటంతో వారికి ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఇప్పటికే 26 వేల ఎకరాలకు పైగా భూముల్లో లేఔట్లు వేసి పట్టాలు పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక డిజైన్.. ► మొదటి విడతలో 15 లక్షల ఇళ్లు నిర్మించేందుకు వీలుగా గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ► ఇందులో భాగంగా ప్రీ–కాస్ట్ ఆర్సీసీ శ్లాబ్‌తో లబ్ధిదారులకు సరసమైన ఖర్చుతో ఇళ్లు నిర్మించేందుకు డిజైన్‌ను తయారు చేశారు. ► నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన సెంట్రింగ్ మెటీరియల్ సరఫరా చేసేందుకు గృహనిర్మాణ శాఖ టెండర్లు పిలిచింది. ► ప్రీ–కాస్ట్ ఆర్సీసీ శ్లాబ్‌తో నిర్మాణాల కోసం అనుభవం ఉన్న కంపెనీల నుంచి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు. ► భారీ నిర్మాణాల్లో అనుభవం ఉన్న కంపెనీలకే అవకాశం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ► ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ► నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ► లబ్ధిదారులు సొంతంగా లేదా అధికారుల పర్యవేక్షణలో నిర్మించుకునేందుకు కూడా అవకాశం కల్పించనున్నారు. ► టీడీపీ హయాంలో 2014 నుంచి 2016 వరకు ఒక్క ఇంటికి కూడా శంకుస్థాపన చేయలేకపోయారు. ► ఆ తర్వాత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్లతోపాటు వివిధ పథకాల కింద 6.20 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. ► ఇందులో 3.50 లక్షల వరకు మాత్రమే పూర్తి చేసినా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా నిధులన్నీ సార్వత్రిక ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించారు. ► టీడీపీ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను ఏం చేద్దామనే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. -
పోలవరం పునరా‘హాసం’
అందమైన వాతావరణం.. ప్రణాళిక ప్రకారం నిర్మించిన ఇళ్లు.. అంతర్గత రహదారులు, నీటి సరఫరా లాంటి సకల సదుపాయాలతో కనిపిస్తున్న ఈ పునరావాస కాలనీ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో ఉంది. కాలనీ పనులను పర్యవేక్షిస్తున్న గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాసరావును ‘సాక్షి’ పలకరించగా నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాల పనులను పక్షం రోజుల్లోగా పూర్తి చేస్తామని తెలిపారు. సాక్షి, అమరావతి: ఆయకట్టు రైతులకు చేకూరే ప్రయోజనాలకు దీటుగా, పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గోదావరిలో వరద ప్రవాహం పెరిగేలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 17,760 నిర్వాసిత కుటుంబాలకు పునరావాస పనులను శరవేగంగా చేసేందుకు రూ.3,383.31 కోట్లు ఖర్చు చేస్తోంది. 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని మిగిలిన 84,731 నిర్వాసిత కుటుంబాలకు దశలవారీగా పునరావాసం కల్పించాలని నిర్ణయించింది. మొత్తమ్మీద నిర్వాసితులకు సహాయ పునరావాసం కల్పించడానికి రూ.24,249.14 కోట్లను వ్యయం చేయనుంది. నాడు అరకొర పునరావాసం.. అస్తవ్యస్తంగా పనులు పోలవరం నిర్మాణం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లోని 373 గ్రామాలు ముంపునకు గురికావటంతో పాటు 1,05,601 కుటుంబాలు నిర్వాసితులుగా మారతారు. వారికి ‘భూసేకరణ చట్టం–2013’ ప్రకారం పునరావాసం కల్పించాలి. అయితే కమీషన్ల కోసం పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్న గత సర్కార్ పునరావాస కల్పనపై దృష్టిపెట్టకుండా కేవలం 3,110 కుటుంబాలకు మాత్రమే అరకొర పునరావాసంతో సరిపెట్టింది. కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఆ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత సర్కారు గోదావరి ప్రవాహాన్ని మళ్లించడానికి వీలుగా స్పిల్‌వేను పూర్తి చేయకుండానే ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణం కోసం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణాన్ని ప్రారంభించింది. కానీ ఆ పనులను ఆదిలోనే వదిలేయడంతో వరద ప్రవాహానికి కాఫర్ డ్యామ్‌లు అడ్డంకిగా మారి గతేడాది గోదావరి వరద ముంపు గ్రామాలను చుట్టుముట్టింది. ఫలితంగా ముంపు గ్రామాల ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. పునరావాసంపై నేడు ప్రత్యేక దృష్టి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. నిర్వాసితుల పునరావాసం, స్పిల్ వే, కాఫర్ డ్యామ్‌ల పనులను సమన్వయం చేసుకుంటూ 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల లబ్ధి పొందే రైతుల కంటే మిన్నగా నిర్వాసితుల జీవన ప్రమాణాలుండేలా పునరావాసం కల్పించాలని ఆదేశించారు. ► గిరిజనులకు రూ.3.59 లక్షలు. గిరిజనేతరులకు రూ.3.34 లక్షలతో 379.25 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం ఉండేలా పక్కా ఇళ్లను కట్టి నిర్వాసితులకు ఇవ్వాలని ఆదేశించారు. పునరావాస కాలనీలకు విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలన్నీ కల్పించాలన్నారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, గ్రామ సచివాలయం, ఆరోగ్య కేంద్రం కూడా నిర్మించాలని ఆదేశించారు. ► గిరిజనులకు భూమికి బదులుగా రెండెకరాల సాగు భూమిని సేకరించి ఇవ్వాలని ఆదేశించారు. నిర్వాసితులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని నిర్దేశించారు. ► గోదావరికి వరద పెరిగేలోగా 41.15 కాంటూర్ పరిధిలోని 17,760 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. మిగిలిన కుటుంబాలకు దశలవారీగా వేగంగా పునరావాస కల్పనకు చర్యలు చేపట్టాలని సూచిస్తూ పనుల పర్యవేక్షణకు పోలవరం అడ్మినిస్ట్రేటర్‌గా ఐఏఎస్ అధికారి ఓ.ఆనంద్‌ను నియమించారు. శరవేగంగా పనులు.. ► 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపునకు గురయ్యే 69,686 ఎకరాలకుగానూ 68,087.88 ఎకరాలను సేకరించారు. మరో 1600.50 ఎకరాలను సేకరణకు కసరత్తు చేస్తున్నారు. సేకరించిన భూమికి రూ.3,304.6 కోట్లను పరిహారంగా చెల్లించారు. మిగిలిన భూసేకరణకు రూ.273.43 కోట్లు ఖర్చు చేయనున్నారు. ► 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో ముంపునకు గురయ్యే 98 గ్రామాల్లోని 17,760 కుటుంబాల ప్రజలకు ఉభయ గోదావరి జిల్లాల్లో 47 పునరావాస కాలనీల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. పునరావాసం కల్పించే సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.6.36 లక్షలను పరిహారం ఇవ్వనున్నారు. గిరిజన కుటుంబాలకు మరో రూ.50 వేలను జత చేసి రూ.6.86 లక్షలను అందజేయనున్నారు. ► నిర్వాసితులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు. కష్టాలు గట్టెక్కుతున్నాయి వరద కష్టాలు గట్టెక్కే రోజు వస్తోంది. మూడేళ్లుగా ఈ రోజుల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నాం. ఎంత కాలానికి జగనన్న పుణ్యమాని అనుకున్నది అవుతోంది. ఏటా జూలై వస్తుందంటే వరదలకు ఎక్కడ తల దాచుకోవాలా అని భయపడే వాళ్లం. మరో నెల రోజుల్లో పునరావాస కాలనీకి వెళ్లే సంతోషంలో ఉన్నాం.. – గురుగుల సుబ్బరాజు, దేవీపట్నం. కల నెరవేరుతోంది.. నిత్యం గోదావరి ఆటుపోట్ల మధ్య బతుకు దుర్భరంగా ఉండేది. కాలనీ పూర్తయిందని అధికారులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొన్నామధ్య వరదలు వచ్చినప్పుడు మా కష్టాలను గట్టేక్కిస్తానని చెప్పారు. మాట ప్రకారం కాలనీలు పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల నెరవేరబోతోంది. – కొమరం పోచమ్మ, రమణయ్యపేట, దేవీపట్నం మండలం -
పేదల ఇళ్లకు స్విస్ టెక్నాలజీ
సాక్షి, అమరావతి: పేదల కోసం నిర్మించే ఇళ్లకు ఇండో–స్విస్ సాంకేతికతతోపాటు ఇంధన సామర్థ్య టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యుత్ ఆదాతోపాటు కొత్తగా నిర్మించే ఇళ్లల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 8 డిగ్రీల వరకు తగ్గుతాయని గుర్తించారు. ఈ ప్రాజెక్టు గురించి వివరించేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) అధికారులు ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌తో భేటీ అయ్యారు. రాష్టంలో బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్ (బీప్) అమలు చేసేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. దేశంలో తొలిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ రెసిడెన్షియల్ (ఈసీబీసీఆర్) ప్రకారం.. ఇండో స్విస్ ఇంధన సామర్థ్య సాంకేతికతను బలహీనవర్గాల గృహాలకు అందజేస్తామని తెలిపారు. హౌసింగ్, రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ, బీప్ అధికారులతో అజయ్ జైన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో మీడియాకు వెల్లడించారు. గృహ నిర్మాణ వ్యయం తగ్గుతుంది: బీఈఈ ఈసీబీసీఆర్ వినియోగించడం వల్ల గృహ నిర్మాణ వ్యయం కూడా కొంత వరకు తగ్గుతుందని బీఈఈ పేర్కొంది. 30 లక్షల ఇళ్లలో ఎల్ఈడీ లైట్లు, అత్యుత్తమ ఇంధన సామర్థ్యం కలిగిన ఫ్యాన్లు, ఇతర ఎనర్జీ సామర్థ్య ఉపకరణాలను అమర్చేందుకు సహకరించాల్సిందిగా ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషిఎన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ సీడ్కో) కోరినట్టు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఈసీబీసీ రెసిడెన్షియల్ కోసం కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలను నామినేట్ చేయగా, వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అసలేంటీ ప్రాజెక్ట్? - పేదలు, బలహీనవర్గాలకు 14,097 జగనన్న కాలనీల పేరుతో 30 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఈ గృహ నిర్మాణ పథకం దేశంలోనే అతిపెద్దది. - నిర్మించే ఇళ్లల్లో పెద్ద హాల్, బెడ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇంటి మొత్తం విస్తీర్ణంలో 16.66 శాతం ఓపెన్ ఏరియా ఉంటుంది. ఇంటి నిర్మాణంలో కొన్ని రకాల మెటీరియల్స్ వాడటం, సాంకేతిక చర్యలు చేపట్టడం ద్వారా ఇంట్లోని ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుతాయి. సీలింగ్ దగ్గరలో గ్లాస్ ఫిట్టింగ్ ఉండే కిటికీలు, ఇంటి పైకప్పు, గోడలను పర్యావరణహితంగా నిర్మించడం ఇండో–స్విస్ టెక్నాలజీలో ముఖ్యాంశాలు. - ఇండో–స్విస్ టెక్నాలజీతో ఇళ్లు కట్టడం వల్ల పగటిపూట ఇంటి లోపల సహజసిద్ధమైన వెలుతురు పెరుగుతుంది. కానీ చల్లదనం మాత్రం ఉంటుంది. - అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఇంధన ఆదా చేయగల విద్యుత్ ఉపకరణాలనే అమరుస్తారు. ఇల్లు చల్లగా ఉండటం, ఇంకోవైపు వాడే ఉపకరణాలు విద్యుత్‌ను ఆదా చేయడం వల్ల తక్కువ విద్యుత్ బిల్లులు వచ్చే వీలుంది. - స్విట్జర్లాండ్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఈ సాంకేతికతను ఆంధ్రప్రదేశ్‌కు అందిస్తుంది. ఏంటీ స్విస్ టెక్నాలజీ? స్విస్ టెక్నాలజీలో భాగంగా ప్రకృతిసిద్ధమైన గాలి, వెలుతురు విస్తారంగా లోనికి ప్రవేశించేలా ఇళ్లను డిజైన్ చేస్తారు. పై కప్పు, గోడల నిర్మాణంలో చల్లదనం ఎక్కువగా ఉండేలా, వేడిని లోనికి రానివ్వకుండా ప్రత్యేక పదార్థాలు వాడతారు. కిటికీలకు వాడే అద్దాలను కూడా ప్రత్యేకంగా రూపొందిస్తారు. దీంతో కాంతి మరింత ఎక్కువగా ప్రసరిÜ్తుంది. మరోవైపు ఇంధన సామర్థ్యం గల పరికరాలు, అతి తక్కువ కరెంట్‌ను వినియోగించుకునే ఉపకరణాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎల్ఈడీ బల్బులు, స్టార్ రేటెడ్ ఫ్యాన్లు వంటివి వాడటం వల్ల 20 శాతం కరెంట్ ఆదా అవుతుంది. స్విస్ టెక్నాలజీ వల్ల ఇంట్లో ఉష్ణోగ్రత 4 నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుతుంది. కాబట్టి ఏసీలు, కూలర్లు అంతగా వాడాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు స్విట్జర్లాండ్ కంపెనీలు అక్కడి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందిస్తాయి. -
దాదాపు 30 లక్షల మందికి.. గృహ యోగం!
సాక్షి, అమరావతి: నాలుగేళ్లలో 30 లక్షల గృహాలు.. మరో సంచలన నిర్ణయంతో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు దాదాపు 30 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నాలుగేళ్లలో వీటి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. గృహ నిర్మాణశాఖపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీరంగనాథరాజు, అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. గూడులేని నిరుపేదల సొంతింటి కలను 2024 నాటికి నెరవేర్చే దిశగా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇళ్లపై పూర్తిస్థాయిలో దృష్టి పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణ, ఏటా చేరుకోవాల్సిన లక్ష్యాలపై సమావేశంలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఇవ్వనున్న ఇళ్ల పట్టాలు, నిర్మించాల్సిన ఇళ్లపై పూర్తిస్థాయిలో సమీక్షించారు. పట్టణ, నగరాభివృద్ధి సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఇప్పటివరకు మంజూరైన వాటి వివరాలను పరిశీలించారు. రాష్ట్రానికి ఇంకా ఎన్ని ఇళ్లు మంజూరు కావడానికి ఆస్కారం ఉందో గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులు అవసరమవుతాయో సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం సమీక్షలో ఇతర ముఖ్యాంశాలు... – ఈ ఉగాదికి పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ. – ప్రస్తుతం పట్టాలు పొందే పేదలతోపాటు సొంతంగా ఇళ్ల స్థలాలున్న పేదలకూ ఇళ్లు మంజూరు. – రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలో 19.3 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక. – ఒక పడక గది, వంట గది, వరండా, మరుగుదొడ్డి ఉండేలా ఇళ్ల డిజైన్ తయారీ. – ఇళ్లన్నీ ఒకే నమూనాలో అత్యంత నాణ్యంగా, అందంగా ఉండేలా నిర్మాణం. – 14,097 వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణం. – గృహ నిర్మాణ శాఖలోని 4,500 మంది ఇంజనీర్లతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా నియమించిన 45 వేల మంది సిబ్బంది పేదలకు అందచేసే 30 లక్షల ఇళ్ల నిర్మాణ క్రతువులో పాలుపంచుకుంటారు. – అధిక వడ్డీలతో పేదలు ఇతరులపై ఆధారపడాల్సిన దుస్థితి లేకుండా గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక్కో ఇంటిపై రూ.25 వేల వరకు పావలా వడ్డీకే బ్యాంకు రుణం అందచేసి మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. – పేదల కోసం నిర్మిస్తున్న కాలనీల్లో పెద్ద ఎత్తున చెట్లు నాటడంతో పాటు సమగ్ర మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. – కాలనీల్లో విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పిస్తారు. -
రివర్స్ అదుర్స్
బొబ్బిలి: ఆశ్రిత పక్షపాతం, స్వప్రయోజనం గత ప్రభుత్వ విధానమైతే... ప్రజా సంక్షేమం, ఖజానాపై భారం తగ్గడం తాజా పాలకుల లక్ష్యం. అదే ఉద్దేశంతో రూపొందించిన రివర్స్ టెండరింగ్ విధానం జిల్లాలో మంచి లాభాలను చేకూర్చింది. గత ప్రభు త్వం జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలు, ఒక నగ ర పంచాయతీలో చేపట్టిన అర్బన్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం ఖజానాపై పెనుభారం మోపింది. ఎంతోమంది నిరుపేదలు ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నా... వారిని పట్టించుకోకుండా కేవలం జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన తమ సొంతవారికే వాటిని కట్టబెట్టింది. అలా మంజూరైన ఇళ్ల కాంట్రాక్టును అప్పట్లో విజయ్‌నిర్మాణ్ సంస్థకు పెద్ద మొత్తానికి అప్పగించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం 20శాతం లోపు నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టును రద్దు చేసి రివర్స్ టెండర్‌కు పిలవాలని నిర్ణయించడంతో బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మునిసిపాలిటీల్లోని ఇళ్లను కొత్త కంపెనీ తక్కువకు దక్కించుకుని ఖజానాకు రూ. 22కోట్లు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఆ మూడు మున్సిపాలిటీల్లో గతంలో రూ.148 కోట్లకు విజయనిర్మాణ్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంటే రివర్స్ టెండరింగ్‌లో రూ.126 కోట్లకే ఇంద్రజిత్ మెహర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ దక్కించుకుంది. ఈ పరిణామంతో ఇక పట్టణ గృహ నిర్మాణాలు వేగవంతం అవుతాయని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 20శాతం లోపు పనులు నిలుపుదల జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణ బాధ్యతను గతంలో విజయనిర్మాణ్ సంస్థ దక్కించుకుంది. అందులో బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మునిసిపాలిటీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణం 20శాతానికి మించలేదు. అందుకే ఈ మూడింటికి కొత్తగా రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త కాంట్రాక్ట్ పొందిన ఇంద్రజిత్ మెహర్ కంపెనీ పాత కంపెనీ ధరల కంటే 14.78 శాతం తక్కువకు కోట్‌చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీకి టెండర్లు ఖరారు చేసింది. ప్రభుత్వం క్లియరెన్స్ లెటర్ ఇచ్చాక పనులు ప్రారంభించేందుకు కొత్త సంస్థ సిద్ధంగా ఉంది. గత కాంట్రాక్టు పెద్ద మొత్తానికి వెళ్లినట్టు గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్మాణాలపై పలుమార్లు నివేదికలు కోరింది. మున్సిపల్ కమిషనర్లు, టిడ్కో ఇంజినీర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా వారి అనుమానం నిజమన్న విషయం తేటతెల్లమైంది. వెంటనే 20శాతం కంటే తక్కువ పనులు చేపట్టిన మూడు మునిసిపాలిటీలకు రివర్స్ టెండరింగ్ అమలు చేసింది. ఊపందుకోనున్న నిర్మాణాలు జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు అర్బన్ హౌసింగ్ నిర్మాణాలకు కొత్త కాంటాక్టరుకు అప్పగించడంతో ఇక పనులు చురుకుగా సాగే అవకాశం ఉందని లబి్ధదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు మునిసిపాలిటీల్లో ఈ సంస్థ 3072 ఇళ్లను నిర్మించనుంది. జిల్లా వ్యాప్తంగా 7,677 ఇళ్లను నిర్మించేందుకు అప్పట్లో పనులు చేపడితే మూడు మున్సిపాలిటీల్లో 3072 ఇళ్లకు మాత్రమే రివర్స్ టెండరింగ్‌కు పిలిచారు. విజయనగరంలో పనులు పూర్తవగా, నెల్లిమర్లలో అసలు టెండర్లు పిలవలేదు. కొద్ది రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అర్బన్ ఇళ్ల నిర్మాణానికి గత కాంట్రాక్టును నిలిపివేసిన ప్రభుత్వం కొత్తగా రివర్స్ టెండరింగ్ పిలిచింది. కొత్తగా మూడు మున్సిపాలిటీల్లో 3072 ఇళ్ల నిర్మాణానికి 14.78 శాతం తక్కువకు కోట్ చేసిన ఇంద్రజిత్ మెహర్ కన్స్ట్రక్షన్స్కు టెండర్ దక్కింది. ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ ఏక్సెప్టెన్సీ వచ్చాక సంస్థ పనులు ప్రారంభించనుంది. మరి కొద్ది రోజుల్లో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కానుంది. – మామిడి శ్రీనివాస్, ఈఈ, టిడ్కో హౌసింగ్ -
బోగస్ ఇళ్లు 16,111
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో దాదాపు రూ.250 కోట్ల మేర ప్రజాధనం లూటీకి టీడీపీ నేతలు పథకం వేసినట్లు క్షేత్రస్థాయి విచారణతో వెల్లడైంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా పేదలకు పెద్ద ఎత్తున ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రచారం చేసింది. స్థానిక టీడీపీ నేతలు గృహ నిర్మాణ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా 16,111 మంది అనర్హులకు ఇళ్లను మంజూరు చేయించుకున్నట్లు తాజాగా గుర్తించారు. టీడీపీ హయాంలో మంజూరై వివిధ స్థాయిల్లో ఆగిపోయిన ఇళ్ల వివరాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్లను క్షేత్ర స్థాయి పరిశీలనకు పంపడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తమ పేరుతో టీడీపీ నేతలు ఇళ్లు మంజూరు చేసుకున్నట్లు తేలటంతో గూడులేని పేదలు నివ్వెరపోతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఉగాది నాటికి ఇళ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ అధికారులు ఇప్పటికే స్థలసేకరణలో నిమగ్నమయ్యారు. అనర్హులకు ఇళ్లు ఇలా.. - ఇతరుల రేషన్‌కార్డు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి వారికి తెలియకుండా కొందరు అనర్హులు ఇళ్లు నిర్మించుకున్నారు. - ఒకే ఇంటిలో ఇద్దరి పేర్లతో ఇళ్లు మంజూరు చేయించుకుని ఉమ్మడిగా పెద్ద భవంతులు నిర్మించుకున్నవి మరికొన్ని. బిల్లులు నిలిపివేస్తాం.. ‘గత ప్రభుత్వ హయాంలో 16,111 మంది అనర్హులకు ఇళ్లు మంజూరైనట్లు క్షేత్రస్థాయి విచారణలో గుర్తించాం. ఈ బిల్లులు చెల్లించరాదని ఆదేశించాం. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’ – చెరుకువాడ శ్రీరంగనాథరాజు (గృహ నిర్మాణ శాఖ మంత్రి) -
ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి పకడ్బందీ ప్రణాళిక
సాక్షి, అమరావతి: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. గ్రామ, వార్డు వలంటీర్లు అర్హుల జాబితాను రూపొందించి, సమర్పించిన తర్వాత దానిని గ్రామసభలో చదివి వినిపించాలని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హులను తొలగించాలని, అర్హుల పేర్లు లేకపోతే గ్రామసభలో చర్చించి చేర్పించాలని పేర్కొన్నారు. ఇందుకు షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ‘‘లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సెప్టెంబర్ 25వ తేదీలోగా పూర్తి చేయాలి. 30వ తేదీలోగా ఎక్కడ ఎంత భూమి కావాలో ఖరారు చేసి, తదనుగుణంగా నివేదికలు రూపొందించాలి. ఇప్పటికే ఇల్లు లేదా ఇంటి స్థలం పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేస్తే తిరస్కరించాలి. డూప్లికేషన్‌ను నివారించడానికి ఆధార్‌ను జత చేయడం తప్పనిసరి చేయాలి’’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు. నేటి నుంచి ఉప ముఖ్యమంత్రి సమీక్షలు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని సజావుగా పూర్తి చేయడానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు నేటి నుంచి తేదీ నుంచి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజుతో కలిసి జిల్లాల్లో పర్యటించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ నిర్ణయించుకున్నారు. జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించి అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేస్తారు. ‘‘నిష్పక్షపాతంగా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాం. ఇంత తక్కువ కాలంలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేదల పట్ల ఉన్న అభిమానానికి, ముందుచూపునకు ఇది నిదర్శనం’’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. 30,152.73 ఎకరాల భూమి గుర్తింపు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అధికారులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటిదాకా 30,152.73 ఎకరాల భూమిని గుర్తించారు. రాష్ట్రంలో 1,45,72,861 కుటుంబాలుండగా, 1,26,26,879 కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామ, వార్డు వాలంటీర్లు సేకరించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. 25,64,897 కుటుంబాల వారు ఇళ్ల స్థలాలు పొందడానికి అర్హులని తాత్కాలికంగా నిర్ణయించారు. 1,00,61,982 కుటుంబాల వారు నివాస స్థలాలు పొందడానికి అనర్హులని తాత్కాలికంగా తేల్చారు. మిగిలిన కుటుంబాల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికాగానే గ్రామసభలు నిర్వహించి, లబ్ధిదారుల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇందులో అనర్హుల పేర్లు ఉన్నట్లు తేలితే తొలగిస్తారు. అర్హుల పేర్లు జాబితాలో చేరలేదని తేలితే పునఃపరిశీలిస్తారు. అర్హులని తేలితే జాబితాలో చేరుస్తారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఎవరూ ఉండరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన భూమిని సమకూర్చే పనిని వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీనాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఏడాది మార్చి 25న ఉగాది సందర్భంగా అర్హులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. -
ఏపీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు
-
పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: 19 మంది అఖిల భారత సర్వీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా అజయ్ జైన్ కొనసాగుతారు. ఇప్పటి వరకూ గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగిన అనంతరామును సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్‌కు(ఐఆర్ఏఎస్) చెందిన ఎం.మధుసూదన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్న కాంతిలాల్ దండే (ఫుడ్ ప్రాసెసింగ్, చక్కెర) పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు. పరిశ్రమల శాఖ కమిషనర్‌గా ఎవరినీ నియమించకుండా తాత్కాలికంగా అంతర్గత ఏర్పాట్లు చేసుకోవాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది. -
అతి పెద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పనుల పురోగతిపై శనివారం రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుమారు రూ.1,355 కోట్ల వ్యయంతో 124 ఎకరాల విస్తీర్ణంలో 15,660 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఈ కాలనీ... దేశంలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం గృహల కాలనీగా చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు. దాదాపు మున్సిపాలిటీగా ఉన్న ఈ కాలనీలో అంతర్గత రహదారులు, వీధి దీపాలు, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, పార్కులు, ప్లేగ్రౌండ్లు, పోలీసు స్టేషన్, పెట్రోల్ బంక్, విద్య సంస్థలు, కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా మొట్టమొదటి హౌజింగ్ కాలనీగా గుర్తిపు పొందిందన్నారు. ఈ గృహాల్లో 9, 10 ,11 అంతస్తుల్లో 117 బ్లాకుల్లో అత్యంత ఆధునిక శీర్వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ ఫామ్ పద్దతిలో నిర్మాణం జరుగుతుందన్నారు. -
సినిమా స్టూడియోను తలదన్నేలా...
సాక్షి, అమరావతి: ‘‘సొంత ఇంటిలో ఉంటే ఆనందం, భద్రత ఉంటుంది.. బాడుగ ఇంటిలో ఉంటే ఎప్పుడూ అద్దె అడుగుతారని భయంగా ఉంటుంది. పూరింట్లో ఉంటే వర్షం, ఎండలతో భయంగా బతకాలి.. వర్షాకాలమొస్తే ఎప్పుడు ఇళ్లు కూలిపోతుందో తెలియదు.. అందుకే ఐదేళ్లలో 19 లక్షల ఇళ్లు నిర్మిస్తాం’’.. అంటూ నిత్యం సీఎం చంద్రబాబు చెప్పే మాటలు. ఇలా మాటలు చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం అంతంతమాత్రంగా ఉంటోంది. గృహ నిర్మాణ శాఖకు ఏటా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నా ఆ మేరకు నిధులు మాత్రం ఖర్చు చేయడంలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2014–15లో రూ.808 కోట్లు కేటాయిస్తే ఇందులో కేవలం రూ. 298.04 కోట్లు ఖర్చుపెట్టారు. ఆ తర్వాత 2015–16 రూ.897కోట్లకు గాను. రూ.551.43 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. 2016–17లో రూ.1,132 కోట్లు, 2017–18లో రూ.1,457 కోట్లు కేటాయించినా అంతకుముందు ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లకు మాత్రమే బిల్లులు చెల్లించారు. ఎన్నికల సంవత్సరం కావడంతో 2018–19లో రూ.3,734 కోట్లు కేటాయించి హడావుడి చేస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా గురువారం విజయవాడ నుంచి ఒకేసారి 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమం ముఖ్యమంత్రి ఆర్భాటంగా నిర్వహించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న ఆపసోపాలు అంతా ఇంకా కాదు. అనంతపురం జిల్లాలో 12276570ఎన్‌హెచ్1099814 ఐడీతో ఆదిలక్ష్మమ్మ పేరిట ఇల్లు మంజూరు చేశారు. అయితే, నిర్మాణం పూర్తయినట్లు ఇంటి ఫొటో అప్లోడ్ చేయకుండా లగేజి బ్యాగ్ ఫొటో పెట్టి వాటిని కూడా గృహ ప్రవేశం చేసినట్లు గృహప్రవేశం ఖాతాలో వేశారు. అదేవిధంగా 122765504ఎన్‌హెచ్1156019 ఐడీతో ఆదినారాయణ ఇంటికి బదులు మోటార్ సైకిల్ ఫొటోను అప్లోడ్ చేసి ఇల్లు పూర్తయినట్లు చూపడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాక, ఈ పథకం కింద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎక్కువగా దక్కించుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాదీ ఇంతే.. ఇదిలా ఉండగా.. గత ఏడాది అక్టోబరు 2న కూడా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంకింద నిర్మించిన లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాల పేరిట విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. అప్పట్లో 15 వేలు ఇళ్లు కూడా పూర్తిచేయకుండానే లక్ష ఇళ్లు పూర్తిచేశామంటూ హడావుడి చేశారు. అలాగే, అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా రెండేళ్ల కిందట విజయవాడ శివారు ప్రాంతం జక్కంపూడి కాలనీలో సీఎం చంద్రబాబు 10 వేల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇది జరిగి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు పునాది కూడా పడలేదు. వివిధ జిల్లాల్లో గృహ నిర్మాణ తీరుతెన్నులు ఇలా ఉన్నాయి.. ♦ అనంతపురం జిల్లాలో 25వేల ఇళ్లను ప్రారంభించినట్లు టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి పరిస్థితికి పొంతన ఉండడంలేదు. చాలాచోట్ల ఇంటి నిర్మాణాలు అసంపూర్తిగానే ఉండడం గమనార్హం. ఈ జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామానికి చెందిన సి.తిమ్మరాజు తండ్రి మారెప్ప పేరుతో ఎన్టీఆర్ స్వగృహం మంజూరు కాగా ఇటీవల దానికి శ్లాబ్ వేశారు. ఇందుకు సంబంధించిన కట్టెలు కూడా ఇంకా తొలగించకుండానే గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులు రిబ్బన్ కత్తిరించి స్వీట్లు పంచిపెట్టారు. ♦ వైఎస్ఆర్ జిల్లావ్యాప్తంగా 10,200 ఇళ్లను ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, ఇందులో సగం వరకు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. జిల్లాలో రూ.40 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో వున్నాయి. ♦ కర్నూలు జిల్లా గడివేముల మండలం కరిమద్దెల గ్రామంలో ఏడాది కిందటే పూర్తయి నివాసం ఉంటున్న ఇళ్లలోనూ ప్రవేశాలు నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. ఏడాదిగా నివాసం ఉంటున్న మూడు ఇళ్లను ప్రారంభించడం చూసి గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా గృహప్రవేశాలు జరిగాయి. ♦ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ కాకిలెక్కలే కనిపిస్తున్నాయి. జిల్లాలో 2016–17 నుంచి ఇప్పటివరకు మూడేళ్ల లక్ష్యాలకు సంబంధించి 50,160 ఇళ్లను అధికారులు మంజూరు చేశారు. వాటిలో సగమే మాత్రమే పూర్తిచేశారు. గురువారం అధికారులు ప్రారంభించామని చెబుతున్న 18,890 ఇళ్లలోనూ అనేకం వివిధ దశల్లో ఇంకా నిర్మాణాలు సాగుతున్నాయి. ♦ శ్రీకాకుళం జిల్లాలో 17,498 ఇళ్లలో గురువారం సామూహిక గృహప్రవేశం చేసినా వాటిలో నిర్మాణం పూర్తయినవి సగం కూడా లేవు. ♦ విజయనగరం జిల్లాలో ప్రారంభోత్సవ జాబితాలో అసంపూర్తి ఇల్లు చేర్చడంతో జిల్లా మంత్రి ప్రారంభించకుండా వదిలేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఇవ్వడంలేదని జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ♦ గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలో మొత్తం 290 ఇళ్లకు పైకప్పులు పూర్తయ్యాయి. వీటిలో కొన్నింటినే అధికారులు, ప్రజాప్రతినిధులు గురువారం ప్రారంభించారు. వేమూరు నియోజకవర్గంలో టీడీపీ గ్రామ ముఖ్య నేత పర్వతనేని భానుప్రసాద్ గోడౌన్ తరహాలో ఇంటిని నిర్మించడంపై ఆక్షేపణలు వస్తున్నాయి. ఇళ్ల పేరుతో గోడౌన్లు నిర్మించుకోవచ్చా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇదే జిల్లా గోరంట్లలో దాదాపు ఆరు నెలల క్రితమే నిర్మాణాలు పూర్తి చేసుకుని లబ్ధిదారులు నివాసం ఉంటున్న ఇళ్ళను ప్రారంభించడం విమర్శలకు దారితీసింది. ♦ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 50,060 గృహాలు మంజూరు చేయగా ఇందులో 24వేల గృహ నిర్మాణాలు పూర్తిచేసినట్లు అధికారులు లెక్కలు చూపారు. కానీ, ఇందులో గురువారం 19,474 ఇళ్లకు మాత్రమే గృహ ప్రవేశాలు నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. కానీ, వీటిల్లో ఇందులో 20 శాతం గృహాలు కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. సినిమా స్టూడియోను తలదన్నేలా... గుంటూరు రూరల్: ముట్టుకుంటే జారిపోయే గోడలు.. పట్టపగలు నక్షత్రాలను తలపించే ఇంటి సీలింగ్.. ఇంట్లో రూ.35–50 వేల విలువ చేసే సోఫా సెట్లు... కళ్ళు మిరుమిట్లు గొలిపే ఇంటీరియర్.. సినిమా స్టూడియోనే తలదన్నే విధంగా ఇంటి నిర్మాణం.. ఇలా నిర్మించిన గృహాలను ఎవరైనా పేదవాళ్ళ ఇల్లంటారా? గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో నిర్మించిన ఇళ్ళలో ఇదొకటి. ప్రభుత్వం నుంచి రూ.2.5 లక్షల రుణం తీసుకుని గోరంట్ల గ్రామంలో అధికార పార్టీకి చెందిన సానుభూతిపరుడు నిర్మించిన ఇల్లు.. చూసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఇంటిని జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు, గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్ తదితరులు గురువారం ప్రారంభించారు. కలెక్టర్ ఆ ఇంటిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. రూ.25–35 లక్షలతో ఇంటిని నిర్మించిన లబ్ధిదారులకు, ఏవిధంగా ఎన్టీఆర్ గృహకల్పలో రుణం మంజూరు చేశారని అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం చిన్నమురహరిపురం (సీఎం పురం) గ్రామంలో కూడా ఇదే తరహాలో ఇల్లు నిర్మించారు. కీలు సాయమ్మ పేరుతో ఉన్న ఇల్లు ఖరీదు రూ.20లక్షల పైమాటేనని స్థానికులు చెబుతున్నారు. సాయమ్మ భర్త పోలయ్య టీడీపీలో కీలక కార్యకర్త. -
నిర్లక్ష్యం ఖరీదు రూ.125 కోట్లు
♦ ‘స్వగృహ’ పేర బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ ఇదీ ♦ బ్యాంకులతో వన్‌టైం సెటిల్మెంట్ ♦ వడ్డీ సహా రూ.300 కోట్లు చెల్లించిన ప్రభుత్వం ♦ మూడేళ్లుగా ఒక్క ఇంటినీ విక్రయించని వైనం ♦ ఫలితంగా పెరిగిపోయిన అప్పులు సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ అధికారుల నిర్లక్ష్యం ఖరీదు రూ.125 కోట్లు. కళ్ల ముందు నష్టం జరుగుతున్నా సరిదిద్దే నిర్ణయం తీసుకోకుండా చోద్యం చూసిన ఫలితమిది. రాజీవ్ స్వగృహ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులను సకాలంలో తీర్చలేకపోవటంతో రూ.125 కోట్ల మేర వడ్డీ పేరుకుపోయింది. ప్రజలకు తక్కువ ధరకే అన్నిరకాల వసతులున్న ఇళ్లను అందించే ఉద్దేశంతో గతంలో రాజీవ్ స్వగృహ ఉమ్మడి రాష్ట్రంలో 21 చోట్ల వెంచర్లు ప్రారంభించింది. బ్యాంకుల నుంచి దాదాపు రూ.1200 కోట్లు అప్పుగా తీసుకుంది. బ్యాంకు రుణాలు, డిపాజిట్ల మొత్తంతో కలిపి కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగా మరికొన్ని అర్ధాంతరంగా ఆగిపోయాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ప్రభుత్వం పర్యవేక్షణ కొనసాగింది. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో అధికారులు మిలాఖత్ అయి దాదాపు రూ.200 కోట్లు పక్కదారి పట్టిం చారు. ఆ నిధుల లెక్క సరిచేసే క్రమంలో ఒక్కసారిగా ఇళ్ల ధరలను పెంచేశారు. మరోవైపు చేతిలో చిల్లిగవ్వలేక పనులను ఆపేశారు. దీంతో ఆ ప్రాజెక్టు గుడ్‌విల్ దెబ్బతిన్నది. ధరల బూచితో ఇళ్ల అమ్మకం నిలిచింది. దానిపై నయాపైసా ఆదాయం రాకపోగా, బ్యాంకు అప్పులు కొండలా పేరుకుపోయాయి. ‘నమ్మకం’ సన్నగిల్లటంతో... ప్రభుత్వ పథకాలకు బ్యాంకుల చేయూత అవసరమైన తరుణంలో... ప్రధాన బ్యాంకులన్నీ స్వగృహ బకాయిల గురించి ప్రస్తావిస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు ఇటీవల కొత్తగా గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన అశోక్‌కుమార్ బ్యాంకర్లతో చర్చించి వన్‌టైం సెటిల్మెంటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కొన్ని బ్యాంకులు వడ్డీ మొత్తాన్ని తగ్గించగా, మరికొన్ని బ్యాంకులు ఉన్నంత మేర వడ్డీ చెల్లిస్తే భవిష్యత్తులో అసలు చెల్లించే వరకు వడ్డీ విధించబోమని స్పష్టం చేశాయి. వాటితో కుదిరిన ఒప్పందం మేరకు ప్రభుత్వం తాజాగా రూ.300 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. ఇందులో రూ.125 కోట్లు వడ్డీ పోగా మిగతాది ఓ బ్యాంకుకు సంబంధించిన అసలు మొత్తం ఉంది. గతంలోనే దిద్దుబాటు చర్యలకు దిగి ఉంటే ఇప్పుడు రూ.125 కోట్లు వృథా అయ్యేవికావు.