fci
-
మనకు భారత్ రైస్ భాగ్యం లేదా?
సాక్షి, హైదరాబాద్: బియ్యం ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో సబ్సిడీ ధరతో దేశవ్యాప్తంగా అవసరమైన వారందరికీ నాణ్యమైన బియ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బృహత్తర పథకం రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదు. బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించినప్పటికీ ధరలు అదుపులోకి రాకపోవడంతో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని రూ.29కే విక్రయించాలని నిర్ణయించింది. భారత్ రైస్ పేరుతో ఈ బియ్యం అమ్మకాలను ఫిబ్రవరి 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేషనల్ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో ఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ అవుట్లెట్లలో కూడా భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించారు. ఆమెజాన్, జియో మార్ట్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్ ద్వారా కూడా 5 కిలోలు, 10 కిలోల భారత్ రైస్ బ్యాగులను అందుబాటులోకి తెచ్చారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రూ.29 కిలోల బియ్యం బ్యాగులు విక్రయిస్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భారత్ రైస్ భాగ్యం సామాన్యులకు దక్కడం లేదు. కేటాయింపులు జరిపినప్పటికీ... ఫిబ్రవరి 6వ తేదీ నాటికే రాష్ట్రంలో కూడా అమ్మకాలు జరపాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ భావించింది. ఈ మేరకు నాఫెడ్ ప్రాంతీయ కార్యాలయానికి సమాచారం అందించింది. ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం సేకరించి 5 కిలోలు, 10 కిలోల బ్యాగులలో నింపి విక్రయించే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తొలి విడతగా నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌కు ఒక్కో సంస్థకు 2 వేల టన్నుల చొప్పున బియ్యం కేటాయించింది. అయితే ఇప్పటివరకు బియ్యం బ్యాగ్‌లు రిటైల్ అవుట్లెట్లకు చేరలేదు. డిపోలలోని బియ్యం ఇతర రాష్ట్రాలకే! భారత్ రైస్ బ్యాగ్‌లకు అవసరమైన బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నాఫెడ్‌కు సరఫరా చేయాలి. అయితే రాష్ట్రంలో నాఫెడ్‌కు అవసరమైన మేర బియ్యాన్ని ఎఫ్‌సీఐ పంపించలేదని సమాచారం. రాష్ట్రంలోని 52 ఎఫ్‌సీఐ డిపోలలో సుమారు 5లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ, ఆ బియ్యం మొత్తం సెంట్రల్ పూల్ కింద ఇతర రాష్ట్రాలకు పంపించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ రైస్ కోసం నాఫెడ్‌కు ఎఫ్‌సీఐ ప్రత్యేకంగా బియ్యాన్ని కేటాయించలేని పరిస్థితి నెలకొంది. దీనిపై కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖనే నిర్ణయం తీసుకోవాలని ఎఫ్‌సీఐ వర్గాలు చెపుతున్నాయి. బియ్యం రాలేదు రిటైల్ అమ్మకాల కోసం రైస్ బ్యాగులు మా దగ్గరికి రాలేదు. భారత్ రైస్ బ్యాగులకు ప్రజల నుంచి డిమాండ్ ఉంది. రోజూ ఎంక్వైరీలు వస్తున్నాయి. నాఫెడ్ ద్వారా ఈ బ్యాగులు రావలసి ఉంది. ఎప్పుడు పంపించినా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్ ఆటా పేరుతో పంపిన గోధుమ పిండి బ్యాగులు మాత్రం విక్రయించాం.- రమణమూర్తి, ఆర్.ఎం,కేంద్రీయ భండార్ -
నేటితో ముగియనున్న సీఎంఆర్ గడువు
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఖరీఫ్‌నకు సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ బుధవారంతో ముగియనుంది. ఆ సీజన్లో మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యం బకాయిలు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో కేంద్రాన్ని గడువు కోరవద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిల్లర్లు, అధికారులపై ఒత్తిడి తెచ్చి 50 రోజుల్లో 20 ఎల్ఎంటీ మేర బియ్యం సేకరించింది. ఇంకా 2022–23 సీజన్‌కు సంబంధించి మరో 4.80 ఎల్ఎంటీ ఎఫ్‌సీఐకి రావాల్సి ఉన్నా, రైస్‌మిల్లర్లు డెలివరీ చేయడంలో విఫలమయ్యారు. కాగా సీఎంఆర్ డెలివరీ గాడిన పడుతున్న నేపథ్యంలో మరో నెలరోజుల గడువు పొడిగించాలని మిల్లర్లు కోరుతున్నారు. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో బియ్యం ఎఫ్‌సీఐకి ఇస్తామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులుగా అక్కడే ఉన్న సీఎంఆర్ గడువు పొడిగింపునకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కనీసం నెల రోజుల టైమ్ ఇస్తే.. గతేడాది ఖరీఫ్ సీఎంఆర్ బకాయిలు పూర్తిచేసే అవకాశం ఉంటుంది. లేకపోతే 4.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల వద్దనే ఉండిపోతుంది. దీని విలువ కనీసం రూ.1,872 కోట్లు ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రికవరీ చేయటం కూడా కష్టంగా ఉంటుంది. ఎఫ్‌సీఐకి బదులుగా సివిల్ సప్లయీస్ కోటా కింద తీసుకోవాల్సి వస్తుంది. కానీ సివిల్ సప్లయ్ తీసుకునేది లేదని చెప్పిన నేపథ్యంలో నెల రోజుల గడువు పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. గత ఏడాది రబీ ధాన్యం వేలానికి... కాగా నిరుడు యాసంగి సీజన్‌కు సంబంధించిన బియ్యం బకాయిలు 32.74 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. అంటే 50 ఎల్ఎంటీ ధాన్యం గోడౌన్లలో ఉంది. ఇందులో 35 ఎల్ఎంటీ ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభు త్వం నియమించిన కమిటీ నిర్ణయించింది టెండర్లు కూడా ఆహ్వానించింది. కాగా ధాన్యం టెండర్లకు సంబంధించిన ప్రీ బిడ్డింగ్ సమావేశం బుధవారం పౌరసరఫరాలభవన్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కమిషనర్ డీఎస్.చౌహాన్ హాజరయ్యే అవకాశాలున్నాయి. -
ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయండి..
సాక్షి, హైదరాబాద్: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు ఇవ్వాల్సిన బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కస్టమ్ మిల్లింగ్‌పై దృష్టి సారించాలని, రైస్ మిల్లర్ల ద్వారా బియ్యం ఎఫ్‌సీఐకి అందజేయాలని స్పష్టం చేశారు. తాను ఇటీవల ఢిల్లీ పర్యటించినప్పుడు కేంద్ర అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, ఆశించిన స్థాయిలో బియ్యం నిల్వలు రావడం లేదని వారు ఫిర్యాదు చేశారని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో జనవరి 31వ తేదీలోపు బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇతర అధికారులతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి కలెక్టర్లు, పౌర సరఫరాల సంస్థ, ఎఫ్‌సీఐ అధికారులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం డెలివరీ చేయాలి.. ఈనెలాఖరు నాటికి 7.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, యాసంగి సీజన్‌కు 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాలో ఆలస్యం జరగకూడ దని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. మిల్లర్లంతా రాబోయే రోజులలో దాదాపు 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అందించేందుకు పౌరసరఫరాల సంస్థ రుణాలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పెట్టుబడిని తిరిగి పొందడం అనేది మిల్లర్లు ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీ చేయడంపైనే ఆధారపడి ఉంటుందని, జాప్యం జరిగితే కార్పొరేష న్కు పెద్ద ఎత్తున నష్టం కలుగుతుందన్నారు. గత పదేళ్లలో రూ.58,000 కోట్ల అప్పులు, రూ. 11,000 కోట్ల నష్టాల వల్ల పౌరసరఫరాలపై భారం పడింద ని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు రూ.3,000 కోట్ల వార్షిక వడ్డీ భారం పడుతోందన్నారు. బియ్యం సరఫరాలో జాప్యంతో రాష్ట్ర కేటాయింపులపై ప్రభావం సకాలంలో బియ్యం పంపిణీ చేయకుండా మిల్లర్లు పెద్దఎత్తున నిల్వలు ఉంచుకోవడం వల్ల లాభం లేదని ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరాలో జాప్యం వల్ల భవిష్యత్తులో తెలంగాణకు కేటాయింపులపై తీవ్ర పరిణామాలు వస్తాయని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల కార్పొరేషన్ భవిష్యత్తు కోసం బియ్యం పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను కోరారు. పీడీఎస్ బియ్యం నాణ్యత లోపించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పీడీఎస్ బియ్యాన్ని పాలిష్‌చేసి రీసైక్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కో బియ్యం బస్తాకు 45 కిలోల కంటే తక్కువ బియ్యం అందుతున్నట్లు రేషన్ షాపు యజమానుల నుంచి వచ్చిన ఫిర్యాదును కూడా మంత్రి ప్రస్తావించారు. కొందరి నిర్లక్ష్యం వల్ల రేషన్‌షాపుల యజమానులు ఎందుకు నష్టపోవాలనీ, దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాంః సీఎస్ సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఎఫ్‌సీఐకి పంపిణీ చేయాల్సిన బియ్యం లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల డాటా ఎంట్రీని ఆధార్, రేషన్ కార్డుల్లోని సమాచారం ఆధారంగా నమోదు చేయడంలో జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. -
వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు కందిపప్పు పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల (నవంబర్) నుంచి క్రమం తప్పకుండా లబ్దిదారులకు కిలో చొప్పున అందించనుంది. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 10 వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు ఆర్డర్ ఇచ్చింది. అయితే హాకా వద్ద కూడా తగినంత నిల్వలు లేకపోవడంతో 7,200 టన్నుల సరఫరాకు అంగీకరించింది. ఇందులో భాగంగా తొలి దశలో 3,660 టన్నులు, రెండో దశలో 3,540 టన్నులు అందించనుంది. ఇప్పటికిప్పుడు అంటే వచ్చే నెల అవసరాలకు గాను 2,300 టన్నుల సరఫరాకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయంగా పప్పుధాన్యాల కొరతతో రేట్లు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్‌కు వెళ్లిపోవడంతో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)వద్ద కూడా నిల్వలు కరువయ్యాయి. ఫలితంగా కందిపప్పు పంపిణీకి అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ నెలాఖరుకు సరుకు తరలింపు ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హాకా నుంచి మద్దతు ధర ప్రాతిపదికనే కందులు సేకరించినప్పటికీ.. వాటికి అదనంగా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు అవ్వనున్నాయి. ఈ మొత్తంలో రూ.67కు మాత్రమే కిలో కందిపప్పును ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వనుంది. అంటే దాదాపు సబ్సిడీ రూపేణా ప్రభుత్వం రూ.70పైగానే భరిస్తున్నట్టు సమాచారం. ఈ నెలాఖరు నాటికి చౌక ధరల దుకాణాల వద్దకు అందుబాటులో ఉన్న నిల్వల ప్రకారం సరుకును తరలించనుంది. డిసెంబర్, జనవరిల్లో పూర్తి స్థాయిలో కార్డుదారులకు సబ్సిడీ కందిపప్పును ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మార్కెట్ రేటుకే కందుల కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా 50 వేల టన్నుల కందిపప్పును కేటాయించాలని కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేసింది. తొలుత కర్ణాటకలోని బఫర్ స్టాక్ నుంచి 9,764 టన్నులు కందులు కేటాయించగా వాటిలో నాణ్యత లోపించింది. ఆ తర్వాత రెండుసార్లు జూన్, సెపె్టంబర్‌ల్లో కేటాయింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కానీ, కేంద్రం నుంచి స్పందన రాలేదు. మండల స్టాక్ సెంటర్ (ఎంఎల్ఎస్)ల్లోని స్టాక్ మొత్తాన్ని పంపిణీకి విడుదల చేయడంతో నిల్వలు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం హాకా నుంచి కందిపప్పును తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలలకు హాకా సరఫరా చేసే కందిపప్పును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించనుంది. భవిష్యత్తులో అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు జనవరి నుంచి పౌరసరఫరాల సంస్థ ద్వారా నేరుగా రైతుల నుంచి మార్కెట్ ధరకు ప్రభుత్వం కందులు సేకరించనుంది. తొలుత ఈ ఖరీఫ్‌లో 30 వేల టన్నులు సేకరించాలనే యోచనలో ఉన్నారు. వాటిని స్వయంగా మరాడించి ప్యాకింగ్ చేయించి సబ్సిడీపై కార్డుదారులకు అందించేలా ప్రణాళిక రూపొందించారు. బాబుగారి ‘పప్పు’ డ్రామా అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి డిమాండ్, సప్లై ఆధారంగా నిత్యావసరాల రేట్లు మారుతుంటాయి. చంద్రబాబు హయాంలో రేట్లు ఎంత పెరిగినా ఇచ్చే సబ్సిడీ మాత్రం పెరిగేది కాదు. పైగా ఆయన పాలన చేపట్టిన తర్వాత సెపె్టంబర్ 2014–జూలై 2015 వరకు కందిపప్పు ఊసే లేదు. ఆగస్టు 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున రూ.50 నుంచి రూ.120 మధ్యన రేట్లు పెంచి విక్రయించారు. 2015 డిసెంబర్లో ఏకంగా రూ.90కి పెంచారు. 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120 చేశారు. 2018లో కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ.63 ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.23 రాయితీ ఇచ్చింది. చివరి ఏడాది మాత్రం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు కిలోల కందిపప్పు డ్రామా ఆడారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మొత్తం పంపిణీ చేసింది కేవలం 93 వేల టన్నులు మాత్రమే. ఇందు కోసం రూ.1605 కోట్లు ఖర్చు చేసింది. కానీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 3.15 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.3,084 కోట్లు ఖర్చు చేసింది. కరోనా సమయంలో నిత్యావసరాలను పూర్తి ఉచితంగా అందించింది. కార్డుదారులకు నిరంతరాయంగా పంపిణీ చేసేలా చర్యలు కార్డుదారులకు ప్రతి నెలా నిరంతరాయంగా కందిపప్పు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాం. హాకా ద్వారా కందిపప్పును సేకరిస్తున్నాం. ఇప్పటికే నాణ్యత ప్రమాణాలను పరిశీలించాం. ఈ నెలాఖరు నాటికి ఎఫ్పీ దుకాణాలకు సరుకు చేర్చేలా ఆదేశాలు జారీ చేశాం. డిసెంబర్, జనవరిల్లో వంద శాతం కార్డులకు పంపిణీ చేస్తాం. ఈ ఖరీఫ్‌లో రైతుల నుంచి కందులు కొనుగోలు చేయనున్నాం. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు కందుల కొనుగోలుపై ప్రచారం కల్పించాలని ఆదేశించాం. మన రైతుల నుంచి మార్కెట్ ధరకు కందులు కొనుగోలు చేసి వాటిని రాష్ట్ర వినియోగానికి వాడుకుంటే.. రైతులకు, లబ్దిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
ఎఫ్‌సీఐ వల్లే సీఎంఆర్ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో మిల్లింగ్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటోందని రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సీఎంఆర్ విషయంలో మిల్లర్లను వేధించడ మే లక్ష్యంగా ఎఫ్‌సీఐ అధికారులు నిబంధన లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంప నాగేందర్ గుప్తా ఆరోపించారు. మంగళవారం నగరంలోని టూరిస్ట్ ప్లాజాలో మిల్లర్ల సంఘం సమావే శం జరిగింది. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. మిల్లర్లు మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్ల నుంచి తరలించాల్సిన ఎఫ్‌సీఐ నాలుగైదు నెలలైనా రైల్వే వ్యాగన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపడం లేదని, తద్వారా గోడౌన్లు నిండి పోయి మిల్లింగ్ జరగని పరిస్థితి నెలకొందని వివరించారు. ఒక్కో ఎఫ్‌సీఐ గోడౌన్‌కు వందలాది మిల్లుల నుంచి వచ్చిన బియ్యాన్ని కేటాయిస్తుండడంతో వారం రోజులైనా బియ్యం లారీలు అన్లోడింగ్ కావడం లేదన్నారు. దీంతో సమయానికి సీఎంఆర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాగైతే మిల్లింగ్ ఎలా? ప్రస్తుతం రాష్ట్రంలోని మిల్లర్ల వద్ద కోటి మె ట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, ఎఫ్‌సీఐ ఇలాగే వ్యవహరిస్తే ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం అసాధ్యమని గుప్త స్పష్టం చేశారు. ఎఫ్‌సీఐ కారణంగా 70 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయడానికి 24 నెలల కాలం పడుతుందన్నారు. మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లు, ఎఫ్‌సీఐ నుంచి రవాణా చార్జీలు రూ.700 కోట్లు రావలసి ఉందని, వాటిని వెంటనే చె ల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం పంపించే బలవర్ధక బియ్యం కెర్నల్స్ (ఎఫ్ ఆర్కే)లో నాణ్యత లేదని మిల్లులను ఎఫ్‌సీఐ డిఫాల్టర్లుగా ప్రకటించడం శోచనీయమన్నారు. సమావేశంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభాకర్ రావు పాల్గొన్నారు. -
అదనపు ధాన్యమంతా ఎగుమతులకే
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని సేకరించకుండా ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటీ పది లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం, నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో ఉందని, ఎఫ్‌సీఐ చర్యలతో ఆహారధాన్యాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని అధికారులు సీఎం దృష్టికి తేవడంతో కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. రానున్న రోజుల్లో అదనంగా వరి దిగుబడి కానున్న పరిస్థితుల్లో రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా రైతులకు మరింత లాభం చేకూరేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి, సీఎంఆర్ అప్పగింత, బియ్యం తిరస్కరణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కొత్త మిల్లుల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ శుక్రవారం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. అదనంగా పండే పంట కోసమే కొత్త మిల్లులు... ‘‘రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలి. అప్పడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతులు లాభాలు గడిస్తారు. అదనంగా పండే పంటను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నూతనంగా అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సటాకె వంటి కంపెనీలతో చర్చించాం. వారితో రేపట్నుంచే ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించాం’’అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులతోపాటు మరికొద్ది రోజుల్లో పూర్తికానున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల వరిధాన్యం దిగుబడి ప్రస్తుతమున్న ఏటా 3 కోట్ల టన్నుల నుంచి 4 కోట్ల టన్నులకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వీరే... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు ఉండగా మరో 2 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా కొత్త మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివిధానాల ఖరారు కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సారథ్యంలో కమిటీని ప్రకటించారు. ఇందులో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, టీఎస్ఐడీసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా ఉండనున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మేద్దాం! రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో ఉన్న ధాన్యంలో 40 లక్షల మెట్రిక్ టన్నులను గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్లు సకాలంలో ధాన్యం మిల్లింగ్ చేయకపోవడంతో మిలు్లల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. నిర్దేశత సమయంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంతో ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతోంది. దాదాపు 1.10 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం, 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో నిల్వల నేపథ్యంలో ధాన్యం విక్రయానికి సీఎం ఆదేశించినట్లు తెలిసింది. -
ఎఫ్‌సీఐ ఇలా చేస్తే కష్టం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పంపిణీ చేసే ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) విషయంలో ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రంలోని మిల్లర్లు మండిపడుతున్నారు. ఇటీవల 290 మిల్లుల నుంచి ఎఫ్‌సీఐకి పంపిన సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని (సీఎంఆర్) నాణ్యత సరిగా లేదంటూ ఎఫ్‌సీఐ తిరస్కరించడంంతో పాటు మిల్లుల నుంచి 2022–23కు సంబంధించిన సీఎంఆర్‌ను తీసుకునేందుకు కూడా నిరాకరించింది. దీంతో మిల్లింగ్ అయిన బియ్యం మిల్లుల్లోనే ఉండిపోతోంది. గత సంవత్సరం వానకాలం, యాసంగి ధాన్యం ఇప్పటికే కోటి టన్నులకు పైగా మిల్లుల్లో నిల్వ ఉండగా, మర పట్టించిన మేరకు బియ్యాన్ని కూడా ఎఫ్‌సీఐ తీసుకోవడం లేదని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మిల్లర్ల సంఘం నాయకులు సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ఎఫ్‌సీఐ ఘర్షణాత్మక వైఖరి: రాష్ట్రంలోని సుమారు 3 వేల మిల్లులు ధాన్యం, బియ్యంతో నిండిపోయి ఉన్నాయని, ధాన్యం నిల్వకు గోదాములు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రికి మిల్లర్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో మిల్లర్లు పంపించిన బియ్యాన్ని నిరాకరిస్తూ, దాదాపు 290 మిల్లుల్ని బ్లాక్ లిస్టులో పెట్టి ఎఫ్‌సీఐ ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ నాఫెడ్ సరఫరా చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్ఆర్కే) నాణ్యత సరిగా లేదంటూ ఎఫ్‌సీఐ బియ్యాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో రైస్ మిల్లింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు. ఎఫ్‌సీఐ ఇలాగే వ్యవహరిస్తే సీఎంఆర్ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఎఫ్‌సీఐ గోదాములు సమకూర్చకపోవడం వల్ల సకాలంలో సీఎంఆర్ చేయలేకపోతున్నట్లు తెలిపారు. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో.. గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు రైస్ మిల్లుల వద్ద పేరుకుపోయాయని మిల్లర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. కోటీ పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయాల్సి ఉండగా, అందులో గత వానాకాలంలో తడిసిన ధాన్యం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ధాన్యం పాడయ్యే ప్రమాదం ఉందని, అప్పుడు సీఎంఆర్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. వానాకాలం ధాన్యం తడిసిపోయిన నేపథ్యంలో ఈ సీజన్‌కు సంబంధించిన 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ చేసేందుకు ఆదేశాలివ్వాలని కోరారు. లేని పక్షంలో తమ దగ్గర ఉన్న ధాన్యాన్ని వెనక్కితీసుకోవాలని అన్నారు. ఎఫ్‌సీఐ కఠిన వైఖరి నేపథ్యంలో డిఫాల్ట్ పెట్టబోమని హామీ ఇస్తే ప్రభుత్వ ధాన్యానికి కస్టోడియన్‌గా ఉంటామని స్పష్టం చేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి గంగుల మిల్లర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మద్దతు ధరతో ధాన్యం కొను గోలుకు సీఎం ఆదేశాలిచ్చారని, కేంద్రం కూడా దేశంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకోకూడదని సూచించారు. తక్షణ మే ఎఫ్‌సీఐ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తే నెలకు పదిలక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా అప్పటికప్పుడు ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. వీలైనంత త్వరగా స్టోరేజీని పెంచి బియ్యం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్, జనరల్ సెక్రటరీలు వి.మోహన్ రెడ్డి, ఎ.సుధాకర్ రావ్, ట్రెజరర్ చంద్రపాల్, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, మిల్లర్లు పాల్గొన్నారు. -
మిల్లర్ల బకాయిలు రూ. 2,072 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. వేల కోట్లలో బకాయి పడ్డారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు. దీంతో 2019 యాసంగి నుంచి 2022 యాసంగి వరకు పౌరసరఫరాల సంస్థకు రూ. 2,072 కోట్ల విలువైన 5.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడ్డారు. ఈ మొత్తం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన నగదును 25 శాతం జరిమానాతో డిఫాల్ట్ అయిన మిల్లుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి హోదాలో కమిషనర్ అనిల్ కుమార్ ఇప్పటివరకు నాలుగు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఆయా మిల్లులకు రికవరీ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ బియ్యం విలువే రూ. 1,630 కోట్లు 2021–22 యాసంగికి సంబంధించి 2,37,310 మెట్రిక్ టన్నుల బియాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉండగా ఈ గడువు గత మే నెలాఖరుతో ముగిసింది. దీంతో ఈ బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో రికవరీ చేయాలని లేదంటే బియ్యం విలువ రూ. 842.09 కోట్లను 25 శాతం పెనాల్టితో వసూలు చేయాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గత నెల 23న 2021–22 వానాకాలానికి సంబంధించిన 2.22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో 494 మిల్లుల నుంచి రికవరీ చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ బియ్యం విలువ రూ. 787.67 కోట్లు. ఈ రెండు సీజన్లలోనే రూ. 1,630 కోట్ల వరకు రావాల్సి ఉంది. 2019 యాసంగి బకాయి 48,762 మెట్రిక్ టన్నులు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2019 యాసంగి సీజన్‌కు సంబంధించి 118 మిల్లుల నుంచి సీఎంఆర్ కింద లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలోనే పెనాల్టీతో 125 శాతం రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ మిల్లులు గడువులోగా బియ్యం ఇవ్వకపోవడంతో నెలకోసారి గడువును పెంచుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ నెలలో 14 మిల్లులు 125 శాతం బియ్యం రికవరీ చేశాయి. మరో 89 మిల్లులు 100 శాతం రికవరీ కింద సర్కారుకు సీఎంఆర్ అప్పగించాయి. ఇంకా 15 మిల్లులు ఎలాంటి రికవరీ చేయలేదు. దీంతో ఇంకా 48,762 మెట్రిక్ టన్నుల బియ్యం ఆయా మిల్లుల నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికీ ఈ మిల్లులకు పెండింగ్ సీఎంఆర్ రికవరీ చేసుకొనే అవకాశం ఇస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 2020–21 సంవత్సరం యాసంగికి సంబంధించి మరో 73 మిల్లుల నుంచి 75,878 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ఈ మొత్తాన్ని కూడా పెనాల్టితో 125 శాతం రికవరీ చేయాలని సైతం ఈ నెల 19నే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన బియ్యం 1.25 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ బియ్యం విలువనే రూ. 442 కోట్లు. 25 శాతం నగదు... 100 శాతం బియ్యం రికవరీ డిఫాల్ట్ మిల్లర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేసే ప్రక్రియలో ముందుగా 25 శాతం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన మొత్తాన్ని పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తేనే తరువాత సీజన్‌కు మళ్లీ సీఎంఆర్ ఇచ్చేందుకు వీలు కలుగుతుంది. అయితే 25 శాతం పెనాల్టిలో ఐదు శాతమే ఇప్పటికిప్పుడు ఇవ్వడం, మిగతా పెనాల్టీ మొత్తాన్ని 4 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉండటంతో మిల్లర్లు ఇదే అదనుగా వ్యాపారాన్ని య«థేచ్ఛగా సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. -
డిఫాల్టర్లకు పెనాల్టీ
సాక్షి, హైదరాబాద్: నిర్ణీత గడువులోగా ఎఫ్‌సీఐకి కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా విదిల్చింది. 2021–22 వానా కాలం సీఎంఆర్ గడువు పలు వాయిదాల తరువాత ఏప్రిల్ 31తో ముగిసింది. అయినా రాష్ట్రంలోని 494 రైస్ మిల్లులు బియ్యం అప్పగించలేదు. వీటినుంచి 2.22 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్‌సీఐకి చేరాల్సి ఉంది. ఈ బియ్యం రికవరీకి గడువు కోరినా ఎఫ్‌సీఐ అంగీకరించలేదు. దీంతో ఎఫ్‌సీఐ నుంచి సుమారు రూ. 700 కోట్లు రాలేదు. ఇప్పుడు మిల్లర్ల నుంచి బియ్యాన్ని రికవరీ చేసినా, నిబంధనల మేరకు ఎఫ్‌సీఐకి పంపకుండా రాష్ట్ర అవసరాలకే (స్టేట్ పూల్) వినియోగించుకోవాలి. దీంతో పౌర సరఫరాల శాఖ నష్ట నివారణకు చర్యలు చేపట్టింది. 494 రైస్ మిల్లులను డిఫాల్టర్లుగా ప్రకటించి, వారి నుంచి 25 శాతం పెనాల్టీతో 125 శాతం సీఎంఆర్‌ను రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హోదాలో పౌరసరఫరాల సంస్థ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 25 శాతం నగదు.. 100 శాతం బియ్యం.. డిఫాల్టర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మిల్లర్ల గుండెల్లో పిడుగు పడినట్లయింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ విలువ రూ. 700 కోట్లు అనుకుంటే... రూ. 175 కోట్లు(25 శాతం) పెనాల్టీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం వెంటనే చెల్లించాలి. అప్పుడే మిల్లర్ నుంచి బియ్యం రికవరీ ప్రారంభమ వుతుంది. మిల్లర్లు ఇప్పటికే బియ్యాన్ని విక్రయించినట్లు ఆరోపణల నేపథ్యంలో రికవరీకి రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి స్టేట్‌పూల్‌కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. వంద శాతం రికవరీయే కష్టమవుతుంది కాబట్టి, 25 శాతం బియ్యాన్ని నగదు రూపంలో వసూలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ, సంస్థ డీఎంలు, డీఎస్‌ఓలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. పెనాల్టీ నుంచి 5వ వంతు మిల్లర్ల నుంచి వసూలు చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఓ వైపు సీఎంఆర్.. మరోవైపు ధాన్యం అన్లోడింగ్.. ఇప్పుడు డిఫాల్ట్ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఓవైపు సీఎంఆర్ అప్పగించేందుకు మిల్లులు నడుపుతూ ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొనే విషయంలో సర్కార్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ధాన్యానికి కొర్రీలు పెడుతూ ప్రతి 40 కిలోల బస్తాపై 3 నుంచి 5 కిలోల అదనపు ధాన్యాన్ని రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
గోదాములు ఫుల్.. ఇక్కడ స్థలం లేక.. బీదర్‌కు మన బియ్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలసమస్య తలెత్తింది. దీని ప్రభావం ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పడుతోంది. సంగారెడ్డితోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ఇప్పటివరకు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఎఫ్‌సీఐ గోదాములకు డెలివరీ చేసేవారు. అయితే ఈ గోదాముల్లో ఇప్పుడు స్థలం లేకపోవడంతో నిల్వలన్నీ పేరుకుపోయాయి. దీంతో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాములకు తరలించాలని నిర్ణయించారు. అక్కడ కూడా స్థల సమస్య తలెత్తడంతో రాష్ట్రం నుంచి వెళ్లిన లారీలు అన్లోడ్ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు బీదర్‌కు వెళ్లి అక్కడి ఎఫ్‌సీఐ అధికారులతో చర్చలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే 1.02 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని బీదర్‌కు తరలించాలని ఎఫ్‌సీఐ నిర్ణయించింది. ఆ బియ్యం రవాణా అయితేనే... మిల్లుల్లో గత యాసంగి, వానాకాలం సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బియ్యం రవాణా అయితేనే స్థలం ఖాళీ అవుతుంది. అప్పుడే ఈ యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకునేందుకు వీలవుతుంది. కానీ ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలాలు లేక గత యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన బియ్యమే మిల్లుల్లో ఉండిపోయింది. దీంతో ఈ యాసంగి సీజనులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్ల వద్ద స్థలం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు తెరిచినా, ధాన్యం తూకాలు జరగడంలేదు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 77 కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కానీ ఇప్పటివరకు 400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ఆ కేంద్రాల నుంచి మిల్లులకు రవాణా చేయలేకపోయారు. -
డిఫాల్ట్ మిల్లర్లకు.. ధాన్యం బంద్
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని (కస్టమ్ మిల్లింగ్ రైస్ –సీఎంఆర్) ఎఫ్‌సీఐకి అప్పగించకుండా సతాయించే మిల్లులపై కొరడా ఝలిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల్లోగా ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉన్నా.. కొందరు మిల్లర్లు ఏడాదిన్నర దాకా జాప్యం చేస్తున్నారు. అప్పటికీ కొన్ని మిల్లుల నుంచి సీఎంఆర్ బియ్యం పెండింగ్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో సకాలంలో బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల సంస్థకు నష్టం కలిగిస్తున్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల మూడో వారం నుంచి మొదలయ్యే యాసంగి సీజన్ నుంచే దీనిని అమలు చేయనుంది. సీఎంఆర్‌లో జాప్యం చేస్తున్న 300కుపైగా మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా అధికారులు ఇప్పటికే గుర్తించి, జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మిల్లులకు ధాన్యం కేటాయింపులను పూర్తిగా నిలిపేసి.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ అధికారులు మంత్రి గంగుల ద్వారా సీఎంకు ప్రతిపాదనలు అందజేసినట్టు సమాచారం. ఆరునెలల్లోగా ఇవ్వాల్సి ఉన్నా.. వచ్చేనెల నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చాక రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయి. మిల్లర్లు ఆ ధాన్యాన్ని తీసుకున్నాక ఆరు నెలల్లోగా మరాడించి బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ మిల్లర్ల నుంచి తగిన సమయంలో సీఎంఆర్ రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐను గడువు పెంచాలని కోరడం ఏటా జరిగే తంతుగా మారింది. 2019–20 యాసంగి సీజన్‌కు సంబంధించి 118 మిల్లులు ఇప్పటివరకు సీఎంఆర్ ఇవ్వలేదు. మూడేళ్లుగా పెనాల్టీతో గడువు పెంచుతున్నా ఇప్పటికీ సీఎంఆర్ పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. గడువు ముగిసిన తరువాత ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకపోతే వాటిని రాష్ట్ర అవసరాలకు మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా సీఎంఆర్ ఆలస్యంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. దీనితో ఇకపై మిల్లర్ల ఆగడాలను ఉపేక్షించొద్దని, ధాన్యం కేటాయింపుల్లో కోత విధించాలని.. 6 నెలల్లో సీఎంఆర్ పూర్తి చేసే కెపాసిటీలోనే కేటాయింపులు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిల్లర్లకు కేటాయించగా మిగిలే ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారానే మిడిల్ పాయింట్ స్టోరేజీ గోడౌన్లకు తరలించి.. ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాలని కూడా యోచిస్తోంది. కొనుగోళ్ల బాధ్యతలు కలెక్టర్లకు.. రాష్ట్రంలో కొన్ని సీజన్లుగా ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ ప్రక్రియ అదనపు కలెక్టర్ల నేతృత్వంలో జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల సంస్థ అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్లో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా కలెక్టర్ల నేతృత్వంలో జరపాలని నిర్ణయించారు. దీనిపై ఏప్రిల్ 10న మంత్రుల సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఎంఆర్‌లో లేని మిల్లులకు ధాన్యం ఇప్పటివరకు సీఎంఆర్‌తో సంబంధం లేకుండా ప్రైవేటుగా ధాన్యం కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి అమ్ముకునే మిల్లులను ఈసారి సీఎంఆర్ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. మిర్యాలగూడ, నిజామాబాద్, నల్లగొండ వంటి కొన్ని ప్రాంతాల్లో 100కుపైగా మిల్లులు పౌరసరఫరాల శాఖ, సీఎంఆర్‌తో సంబంధం లేకుండా పనిచేస్తున్నాయి. వాటిని గుర్తించి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. -
మిల్లర్ల నిర్లక్ష్యం..సర్కార్‌పై రూ.1,257 కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడితో రైతుల కన్నా అధికంగా లాభాలు ఆర్జిస్తున్న మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడం లేదు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావలసిన రూ.వేల కోట్ల బియ్యం సొమ్ము రాకుండాపోతోంది. ఇదే క్రమంలో 2021–22 వానాకాలం సీజన్‌కు సంబంధించి 3.93 లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఫిబ్రవరి నెలాఖరులోగా ఎఫ్‌సీఐకి అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మరోనెల గడువు కోరినా కేంద్రం ససేమిరా అనడంతో ఈ బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడినట్లయింది. 47.04 ఎల్ఎంటీ బియ్యంలో ఇచ్చింది 43 ఎల్ఎంటీ.. 2021–22 వానకాలం సీజన్‌కు సంబంధించి 70.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి మిల్లర్లకు అప్పగించింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 47.04 ఎల్ఎంటీ బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్‌గా ఎఫ్‌సీఐకి డెలివరీ చేయాలని నిర్దేశించింది. అయితే ఏడాది గడిచినా కేవలం 43 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇంకా 3.93 లక్షల మెట్రిక్ టన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. దీని విలువ రూ.1,257 కోట్లు. మిల్లర్ల నుంచి 3.93 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐ తీసుకోకపోతే, ఆ బియ్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీసుకొని రాష్ట్ర అవసరాల కోసం స్టేట్ పూల్ కింద వినియోగించుకోవలసి ఉంటుంది. అయితే మిల్లర్లు రీసైక్లింగ్, ఇతర అక్రమ పద్ధతుల ద్వారా ఇచ్చే నాణ్యత లేని బియ్యాన్ని కార్పొరేషన్ అధికారులు ఎలాంటి తనిఖీలు లేకుండా తీసుకొని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తిరిగి రేషన్ దుకాణాలకు పంపించే అవకాశం ఉంది. 2021–22 యాసంగి సీఎంఆర్‌కు ఈనెలాఖరు వరకు గడువు గత 2021–22 యాసంగి సీజన్‌కు సంబంధించి ఈ నెల 31లోగా సీఎంఆర్ ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి జై ప్రకాశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యాసంగి సీఎంఆర్ గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నామని, తరువాత గడువు పొడిగించబోమని స్పష్టం చేశారు. గత యాసంగికి సంబంధించి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. 34.06 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్‌సీఐకి సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 21.45 ఎల్ఎంటీ బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇంకా 12.61 ఎల్ఎంటీ బియ్యం పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం ఈ నెలాఖరు వరకు గడువు ఇచి్చనప్పటికీ, రోజుకు 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లింగ్ చేస్తే తప్ప నెలాఖరుకు లక్ష్యం చేరుకోలేమని, అందుకు అనుగుణంగా మిల్లింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ శనివారం అధికారులను ఆదేశించారు. గత యాసంగికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మొత్తం సీఎంఆర్‌లో 14 ఎల్ఎంటీ మేర బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కూడా కేంద్రం అనుమతి ఇచి్చనప్పటికీ, మిల్లర్లు ఇంకా 6.64 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ పెండింగ్‌లో ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో సీఎంఆర్ పెండింగ్ అధికంగా ఉండటంపట్ల రవీందర్ సింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ధాన్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: వచ్చే యాసంగి సీజన్లో తెలంగాణలో పండే పంటలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జాతీయ అవసరాల కోసం సేకరించేందుకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. బుధవారం ఢిల్లీలో వివిధ రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ అధికారులు, మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వచ్చే రబీలో ఏయే రాష్ట్రం నుంచి ఎంత మేర ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలనే దానిపై స్పష్టత ఇచ్చారు. 80 ఎల్ఎంటీ ధాన్యాన్ని మిల్లింగ్ చేయగా వచ్చే 54 లక్షల మెట్రిక్ టన్నుల ముడిబియ్యాన్ని ఈ యాసంగి సీజన్లో కేంద్రం సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐ ద్వారా సేకరించనుంది. దీనికి సంబంధించి రైతులకు మద్ధతుధరను కేంద్ర ప్రభుత్వం చెల్లించేందుకు అంగీకరించింది. 1.28 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడికి అవకాశం యాసంగిలో సాగైన పంట విస్తీర్ణం ఆధారంగా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 1.28 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో బహిరంగ మార్కెట్లో విక్రయాలు, మిల్లర్ల కొనుగోళ్లు , రైతుల సొంత అవసరాలు పోగా 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నట్లు పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు నివేదికలు పంపింది. ఇక ఈ ఏప్రిల్ నుంచి ప్రభుత్వ పథకాలన్నింటికీ బలవర్ధక బియ్యం (ఫోరి్టఫైడ్ రైస్) ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ముడి బియ్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ (ఎఫ్ఆర్కే)తో 1:100 నిష్పత్తిలో కలిపి పంపిణీ చేయనున్నారు. కాగా యాసంగిలో ముడిబియ్యంగా కాకుండా బాయిల్డ్ రైస్‌గా తెలంగాణ నుంచి సేకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. సమావేశంలో తెలంగాణ ప్రతినిధులుగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ బి.అనిల్‌కుమార్, పౌర సరఫరాల కార్పొరేషన్ జీఎం రాజిరెడ్డి హాజరయ్యారు. -
ముంచుకొస్తున్న సీఎంఆర్ గడువు
సాక్షి, హైదరాబాద్: అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా రాష్ట్రంలో మిల్లర్ల తీరు మారడం లేదని తెలుస్తోంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఎఫ్‌సీఐకి సకాలంలో అప్పగించాల్సిన మిల్లర్లు ఎన్నిసార్లు గడువు పెంచినా లక్ష్యాన్ని అందుకోవడం లేదు. 2020–21 యాసంగికి సంబంధించి 1.36 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగింత గడువు ముగియడంతో ఆ మొత్తాన్ని స్టేట్ పూల్ కింద రాష్ట్ర అవసరాలకు మళ్లించారు. 2021–22 వానాకాలం సీఎంఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈనెలాఖరు వరకు గడువు ఇచ్చినప్పటికీ అప్పగింత ఇంకా పూర్తికాలేదు. వానాకాలం సీఎంఆర్ కింద 47.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే లెవీ రూపంలో ఎఫ్‌సీఐకి చేరింది. అంటే ఇంకా 11 లక్షల మెట్రిక్ టన్నులు రావలసి ఉంది. నెల రోజులలో 9 ఎల్ఎంటీ సీఎంఆర్ అప్పగింత విషయంలో జాప్యంపై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 24వ తేదీ నాటికి 27 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగించారు. లక్ష్యాన్ని పూర్తి చేయాలని అప్పట్లో మంత్రి గంగుల అధికారులతో సమావేశం అయి గట్టిగా చెప్పడంతో, కష్టంమీద నెలరోజుల్లో 9 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను అప్పగించారు. ఇక మిగిలింది 11 లక్షల మెట్రిక్ టన్నులు అయినా.. ఇంత బియ్యం మిల్లింగ్ చేసి అప్పగించడం అసాధ్యమేనని అర్థమవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో నెల గడువు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేయడమో.. లేక స్టేట్ పూల్ కింద సొంతానికి వాడుకోవడమో చేయాల్సి ఉంటుందని చెపుతున్నారు. ముందుకు కదలని గత యాసంగి సీఎంఆర్ 2021–22 యాసంగికి సంబంధించిన సీఎంఆర్ కూడా ముందుకు సాగడం లేదని అధికారవర్గాలు చెపుతున్నాయి. యాసంగిలో 50.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపగా, సీఎంఆర్ కింద 33.93 లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. అయితే గతనెల 24వ తేదీ నాటికి కేవలం 9.18 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే సీఎంఆర్ కింద ఇచ్చారు. అప్పటి నుంచి ఈ నెలరోజుల్లో కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అదనంగా మిల్లింగ్ చేసి పౌరసరఫరాల సంస్థ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇంకా 20.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. దీనికోసం మరో మూడు నెలల వరకు గడువు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. 4,183 కొనుగోలు కేంద్రాలు మూసివేత 2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 7,007 కొనుగోలు కేంద్రాలను తెరిచి రూ. 11,542 కోట్ల విలువైన 56.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన 4,183 కేంద్రాలను మూసివేశారు. రాష్ట్రంలో 9.95 లక్షల మంది రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. -
మిల్లుల్లోనే కోటి మెట్రిక్ టన్నులు!
సాక్షి, హైదరాబాద్: ఎప్పటికప్పుడు గడువు పెంచుతున్నప్పటికీ.. రాష్ట్రంలోని రైస్ మిల్లుల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఎఫ్‌సీఐ గోడౌన్లకు చేరడం ఆలస్యమవుతోంది. ప్రస్తుతం మిల్లర్ల వద్ద ఇప్పటికే ఏకంగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్టు పౌర సరఫరాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 2020–21 యాసంగి మొదలు 2021–22 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉంది. తాజాగా 2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి సేకరించిన 40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కూడా మిల్లులకు చేరింది. దీంతో రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్‌మిల్లులు ధాన్యం నిల్వలతో నిండిపోయినట్లు తెలుస్తోంది. ఇలావుండగా జనవరి నెలాఖరులోగా మరో 50 ఎల్ఎంటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సజావుగా సాగని మిల్లింగ్.. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపించేటప్పుడే 45 రోజుల్లోగా కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాలని పౌరసరఫరాల శాఖ మిల్లర్లతో ఒప్పందం చేసుకుంటుంది. అయితే మిల్లర్లు ఏనాడూ 45 రోజుల్లో మిల్లింగ్ పూర్తి చేసిన దాఖలాల్లేవు. ఇక గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో మిల్లింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ఎంతగా అంటే 2020–21 సంవత్సరపు యాసంగి ధాన్యం 2.03 ఎల్ఎంటీలను ఇక మిల్లింగ్ చేయలేమని మూడు నెలల క్రితం చేతులెత్తేసేంత వరకు. ప్రస్తుత వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతుండగా, 2021–22 వానాకాలం ధాన్యం 70.22 ఎల్‌ఎంటీల్లో 20.83 ఎల్ఎంటీలు మిల్లింగ్ చేయాల్సి ఉంది. ఇక అదే ఏడాది యాసంగికి సంబంధించిన 50.39 ఎల్ఎంటీల ధాన్యంలో ఇప్పటివరకు కేవలం 13 ఎల్ఎంటీలు మాత్రమే మిల్లింగ్ జరిగింది. ఇంకా 36.93 ఎల్ఎంటీల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. ఇలా గత మూడు సీజన్లకు సంబంధించి 59.79 ఎల్ఎంటీల ధాన్యం అంటే సుమారు 40 ఎల్ఎంటీల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. ఐదు నెలల్లో 34 ఎల్‌ఎంటీలే మిల్లింగ్! సీఎంఆర్ విషయంలో మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు, సీఎంఆర్ అప్పగింతలో ఆలస్యంపై కేంద్రం గత జూలైలో సీరియస్ అయింది. సీఎంఆర్ తీసుకునేది లేదని రాష్ట్రానికి అల్టిమేటం ఇచ్చింది. అప్పటికి రాష్ట్రంలో మూడు సీజన్లకు సంబంధించి 93.76 ఎల్ఎంటీల ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ లెక్కలు కట్టింది. మొత్తం మీద ఆగస్టు నుంచి తిరిగి సీఎంఆర్ తీసుకునేందుకు ఎఫ్‌సీఐ ముందుకు వచ్చింది. దీంతో మిల్లింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మిల్లింగ్ చేస్తున్నప్పటికీ.. ఐదు నెలల్లో లెవీ కింద ఎఫ్‌సీఐకి అప్పగించిన బియ్యం 34 ఎల్‌ఎంటీలే కావడం గమనార్హం. అంటే నెలకు 10 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా మిల్లింగ్ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ సీజన్లో 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి నేపథ్యంలో ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాలకు 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 6.85 లక్షల మంది రైతుల నుంచి 40.06 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. వచ్చే జనవరి నాటికి మరో 50 ఎల్ఎంటీల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిల్లుల్లోని ధాన్యాన్ని సీఎంఆర్ కింద ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ దిశగా అధికార యంత్రాంగం మిల్లర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. -
రాష్ట్రంలో గోదాములు ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ బియ్యం బస్తాలతో నిండుగా కనిపించే గోదాములు స్టాక్ లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. వాటి ముందు ‘గోదాములు కిరాయికి ఇవ్వబడును’అనే బ్యానర్లు వెలుస్తున్నాయి. దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఎఫ్‌సీఐ రాష్ట్రంలోని గోడౌన్లలో ఉన్న బియ్యాన్ని అవసరమైన రాష్ట్రాలకు పంపుతోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎఫ్‌సీఐ గోదాములకు చేరాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం దాదాపు నాలుగు నెలలుగా సరిగా రావడం లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు.. వివిధ కారణాలతో మిల్లింగ్ ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గోడౌన్లు ఖాళీగా ఉంటున్నాయి. వీటిని అవసరమైన వ్యాపారులు, సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు వేర్ హౌజింగ్ కార్పొరేషన్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. గోదాముల్లో స్టాక్ 43 శాతమే.. భారత ఆహార సంస్థ లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌సీఐ, సీడబ్ల్య్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోడౌన్లతోపాటు ప్రైవేటు వ్యక్తులకు చెందిన గోదాములు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అందులో ఎఫ్‌సీఐ తన సొంత గోదాములతోపాటు రాష్ట్ర, కేంద్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ల పరిధిలోనివి, ప్రైవేటుకు చెందినవి కలిపి 43 ప్రాంతాల్లోని గోదాములను లీజుకు తీసుకొని నిర్వహిస్తోంది. ఎఫ్‌సీఐ లెక్కల ప్రకారం 13.58 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న ఈ గోదాములలో ప్రస్తుతం 5.83 లక్షల టన్నుల స్టాక్ మాత్రమే ఉంది. ఇది పూర్తి సామర్థ్యంలో 42.94 శాతం మాత్రమే. ఇవికాకుండా ప్రైవేటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద కొన్ని, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే మరికొన్ని గోదాములు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. మిల్లుల నుంచి బియ్యం రాకపోవడంతో ఎఫ్‌సీఐ ఖాళీచేసిన గోదాములను ఇతర వ్యాపారులకు, సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు పని లేకపోవడంతో ఈ గోదాముల్లోని హమాలీలు ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడి గోదాములు బియ్యానికే పరిమితం రాష్ట్రంలో ఎఫ్‌సీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన గోదాములన్నీ బియ్యం నిల్వ చేయడానికి ఉద్దేశించినవే. ఎఫ్‌సీఐ అప్పుడప్పుడూ గోధుమలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ చేస్తుంది. ప్రస్తుతం గోదాముల్లో ఉన్న నిల్వల్లో గోధుమలు, ఇతర ఆహార పదార్థాలు కలిపి అంతా 5 శాతంలోపేనని.. మిగతా 95 శాతం బియ్యమేనని ఎఫ్‌సీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ బియ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు సెంట్రల్ పూల్ కింద ఇతర రాష్ట్రాలకు పంపిస్తుండడంతో ఖాళీలు ఏర్పడుతున్నాయని వివరించారు. మిల్లుల్లోనే 65 లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో సుమారు ఆరు నెలలుగా కస్టమ్ మిల్లింగ్ సజావుగా సాగడం లేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. మిల్లర్లు తమ సొంత అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. ఎఫ్‌సీఐ చర్యలకు దిగినప్పుడు మాత్రమే సీఎంఆర్ అప్పగిస్తున్నట్టు హడావుడి చేస్తున్న మిల్లర్లు.. తర్వాత తమ సొంత అవసరాల మేరకే మిల్లింగ్ జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది వానాకాలం ధాన్యం ఇప్పటికీ 15 లక్షల టన్నుల వరకు మిల్లర్ల వద్ద ఉండగా.. గత యాసంగికి సంబంధించిన 50లక్షల టన్నులు టార్పాలిన్ల కింద మగ్గిపోతోంది. అంటే 65 లక్షల టన్నుల ధాన్యం ఇంకా మిల్లర్ల వద్దే ఉంది. దీన్ని మిల్లింగ్ చేస్తే 40 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి అందుతుంది. ఆ బియ్యాన్ని గోడౌన్లకు తరలించి నిల్వ చేయనున్నారు. -
గత వానాకాలం సీఎంఆర్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం వానాకాలం (2021–22) సీజన్‌కు సంబంధించి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పెంచింది. సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసిన ఈ గడువును పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు పలుమార్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖను అభ్యర్థించినా స్పందించలేదు. దీంతో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని మిల్లులనుంచి వానాకాలం సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ తీసుకోవడం లేదు. గత వానాకాలం సీజన్లో 70.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, సీఎంఆర్ కింద 47.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సెంట్రల్ పూల్ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ నెలాఖరు నాటికి 30 ఎల్ఎంటీ బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చారు. మరో 17 ఎల్ఎంటీ అప్పగించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ, ఎఫ్‌సీఐ అధికారులతో మాట్లాడిన ఆయన, నవంబర్ వరకు గడువు ఇస్తే పూర్తిస్థాయిలో సీఎంఆర్ అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అశోక్‌కుమార్ వర్మ నవంబర్ ఆఖరు వరకు గడువు పెంచుతూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. యాసంగి ఫోర్టిఫైడ్ రైస్.. మరో 4 ఎల్ఎంటీకి కేంద్రం అనుమతి గత యాసంగిలో ఉత్పత్తి అయిన ధాన్యం నుంచి సీఎంఆర్ కింద అదనంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్‌ను సెంట్రల్‌పూల్‌కు తీసుకునేందుకు కూడా కేంద్రం ఒప్పుకున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గత జూలై నుంచి కురిసిన వర్షాలకు మిల్లుల్లోని ధాన్యం తడిసిపోగా, ముడి బియ్యంగా సీఎంఆర్ చేయడానికి పనికిరాని పరిస్థితి నెలకొందని తెలిపారు. అలాగే సాధారణ యాసంగి ధాన్యం సైతం ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువ వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 8 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ బియ్యంగా తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. తాజా అనుమతితో కలిపి మొత్తం 12 ఎల్ఎంటీ పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్‌ను సెంట్రల్‌పూల్‌కు ఇస్తామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. -
FCI data: ఐదేళ్ల కనిష్టానికి ఆహార ధాన్యాల నిల్వలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆహార ధాన్యం నిల్వలు ఏడాదిలో భారీగా తగ్గాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సెంట్రల్ ఫూల్ కింద సేకరించి పెట్టిన గోధుమ, బియ్యం నిల్వలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు అక్టోబర్ గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల క్రితం 2017లో బియ్యం, గోధుమల మొత్తం నిల్వలు 4.33 కోట్ల మెట్రిక్ టన్నుల కనిష్టానికి పడిపోగా, ప్రస్తుతం అదేరీతిన నిల్వలు 5.11 కోట్ల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. గత ఏడాది నిల్వలు 8.16 కోట్లతో పోల్చినా 37 శాతం నిల్వలు తగ్గడం, ఇందులో ముఖ్యంగా గోధుమల నిల్వలు ఏకంగా 14 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. ఉచితంతో బియ్యం.. దిగుబడి తగ్గి గోధుమలకు దెబ్బ.. దేశంలో కరోనా నేపథ్యంలో కేంద్రం 2020 ఏప్రిల్ నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 81 కోట్ల జనాభాకు ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇప్పటికే ఆరు విడతలుగా అమలు చేసిన బియ్యం పథకం కింద 11.21 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది. ప్రస్తుత అక్టోబర్ నుంచి మరో మూడు నెలలు ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం చేసింది. ఈ మూడు నెలల కాలానికి మరో 1.22 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరాలు ఉంటాయని అంచనా వేసింది. ఉచిత బియ్యం పథకం నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా బియ్యం నిల్వలు కేంద్రం వద్ద తగ్గాయి. గత ఏడాది కేంద్రం వద్ద అక్టోబర్‌లో 3.47 కోట్ల బియ్యం నిల్వలు ఉండగా, అది ఈ ఏడాది 2.83 కోట్లకు పడిపోయింది. అయితే బియ్యం నిల్వలు తగ్గినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏం లేదని, కేంద్ర పథకాల కొనసాగింపునకు ఇదేమీ అడ్డుకాదని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే ఖరీఫ్ పంటల కోతలు ఆరంభం అయినందున వీటితో మళ్లీ నిల్వలు పెంచుకునే అవకాశం ఉందని అంటోంది. అయితే గోధుమల పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. గోధుమల నిల్వలు గతంతో పోల్చితే తీవ్రంగా తగ్గాయి. 2017లో గోధుమల నిల్వలు 2.58 కోట్ల టన్నులు, 2018లో 3.56 కోట్లు, 2019లో 3.93 కోట్లు, 2020లో 4.37 కోట్లు, 2021లో 4.68 కోట్ల టన్నుల మేర నిల్వలు ఉండగా, అవి ఈ ఏడాది ఏకంగా 2.27 కోట్ల టన్నులకు తగ్గాయి. కరోనా పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా కరువు పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇతర దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఎగుమతులు పెరగ్గా, దేశంలో అతివృష్టి కారణంగా పంటలు దారుణంగా దెబ్బ తినడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో కేంద్రం వద్ద నిల్వలు తగ్గాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ ఏడాది మే నెలలో గోధుమల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. అయినప్పటికీ మే నుంచి అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ పంట దిగుమతులు తగ్గాయి. దీంతో అనుకున్న స్థాయిలో కేంద్రం నిల్వలు సేకరించలేకపోయింది. డిమాండ్‌ను గుర్తించి వ్యాపారులు ముందస్తు నిల్వలు చేశారు. ఈ ప్రభావం స్టాక్‌లపై పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారుల గోధుమ నిల్వలను బహిర్గతం చేయాలని ఆదేశాలివ్వడం, దేశీయ లభ్యతను పెంచడానికి స్టాక్ పరిమితులను విధించడం వంటి చర్యలను కేంద్రం పరిగణించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
మిల్లర్లకు ధాన్యం బంద్..!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గత రెండు మూడు సీజన్లలో సకాలంలో సీఎంఆర్ ఇవ్వడంలో విఫలమైన 80% డిఫాల్టర్ మిల్లులకు భవిష్యత్తులో మిల్లింగ్ కోసం ధాన్యాన్ని ఇవ్వకూడదని నిర్ణయించింది. మిల్లర్లకు శ్రమ లేకుండా ఏటా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరించి పంపుతున్నా, దాన్ని సకాలంలో కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) చేసి ఎఫ్‌సీఐకి అప్పగించడంలో వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వానాకాలం సీజన్ ధాన్యాన్ని రాష్ట్రంలోని మిల్లులకు బదులు పొరుగు రాష్ట్రాల్లోని మిల్లులకు పంపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆదివారం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర అధికారులు సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మిల్లుల్లో 75 ఎల్ఎంటీల నిల్వలు ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్‌మిల్లుల్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం నిల్వ ఉంది. గత వానాకాలం సీఎంఆర్ ఇప్పటివరకు 60 శాతం కూడా పూర్తి కాలేదు. 47 ఎల్ఎంటీ సీఎంఆర్‌కు గాను ఇప్పటివరకు 30 ఎల్ఎంటీ కూడా ఇవ్వలేదు. ఇంకా 25 ఎల్ఎంటీలకు పైగా ధాన్యం నిల్వలు మిల్లుల్లో ఉన్నాయి. అలాగే మొన్నటి యాసంగిలో సేకరించిన 50 ఎల్ఎంటీల ధాన్యం కూడా మిల్లుల్లోనే ఉంది. మరో రెండు నెలల్లో ఈ వానాకాలం ధాన్యం రాబోతోంది. ఈ సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా సుమారు 1.30 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా, ఇందులో కొనుగోలు కేంద్రాలకు సుమారు కోటి టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చే వానాకాలం ధాన్యాన్ని ప్రైవేట్ గోడౌన్లు వంటి మిడిల్ పాయింట్లలో నిల్వ ఉంచాలని నిర్ణయించింది. ఈ మిల్లుల నుంచి డిఫాల్టర్ మిల్లులకు ధాన్యం పంపకుండా నేరుగా ఇతర రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించింది. మిల్లర్ల తీరుకు తోడు కేంద్రం వైఖరితో.. రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ ధాన్యాన్ని మిల్లులకు అప్పగిస్తోంది. సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐ నేరుగా మిల్లుల నుంచి బియ్యాన్ని (సీఎంఆర్) తీసుకుంటోంది. ఎఫ్‌సీఐకి బియ్యం వెళ్లిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చెల్లించిన మద్దతు ధరను కేంద్రం రీయింబర్స్మెంట్ పద్ధతిలో తిరిగి చెల్లిస్తోంది. అయితే గత రెండేళ్లుగా పెరిగిన ధాన్యం దిగుబడి నేపథ్యంలో మిల్లర్లు సీఎంఆర్ విషయంలో మరింత ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు గడువు ముగిసిన తర్వాత సీఎంఆర్‌ను తీసుకునేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. గత వర్షాకాలం సీజన్ సీఎంఆర్‌కు ఈ నెలాఖరు వరకు గడువు కాగా, ఇప్పటివరకు ఎఫ్‌సీఐ గడువు పెంచలేదు. మిల్లర్ల ఆలస్యం కారణంగా 2019–20, 2020–21 యాసంగి సీజన్‌కు సంబంధించి సుమారు రూ. 700 కోట్ల భారం పౌరసరఫరాల శాఖపై పడింది. ఇలావుండగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ మొదలు బీజేపీ నేతలంతా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ సకాలంలో ఇవ్వడం లేదని, మిల్లర్ల ఆగడాలకు సహకరిస్తోందని విమర్శిస్తూ జాతీయ స్థాయిలో అప్రదిష్టపాలు చేస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో సీఎమ్మార్ అందించడంలో మిల్లర్లు ఆలస్యం చేయడం, కేంద్రం సీఎంఆర్ గడువు పెంచే విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి సీరియస్ రాష్ట్రంలోని మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు, తద్వారా ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకుంటున్న అంశంపై మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని మిల్లులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని పంపించి, మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు ఎఫ్‌సీఐ నుంచి అనుమతి పొందినట్లు సమాచారం. సోమవారం జరిగే పౌరసరఫరాల శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
మిల్లుల్లోని ధాన్యంపై ఎఫ్‌సీఐకి అధికారం ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చిన్నచిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమని ఎఫ్‌సీఐ లేఖ రాయడంతోనే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తోందని పేర్కొన్నారు. మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు ఎఫ్‌సీఐ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టంచేశారు. బుధవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ ఎఫ్‌సీఐ తీరును తప్పు బట్టారు. మిల్లుల్లోని వడ్లు, బియ్యంపై ఎఫ్‌సీఐ కి ఏం అధికారముందని ప్రశ్నించారు. రాష్ట్రం లోని రైస్ మిల్లుల్లో వడ్లు, బియ్యం నిల్వలపై ఎఫ్‌సీ ఐకి ఎలాంటి అధికారం లేదని మంత్రి చెప్పారు. సీఎం ఆర్ కింద బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చిన తరువాతే వారికి అధికారం వస్తుం దని పేర్కొన్నారు. తనిఖీ ల్లో తేడాలు వచ్చినా చర్యలు తీసుకో లేదని ఆరో పణలు చేస్తున్నారని, మార్చిలో ఆరు జిల్లాల్లోని 40 మిల్లులు తనిఖీ చేస్తే 4,53,896 బ్యాగులు లేవని చెప్పారని, రెండో మారు అవే మిల్లుల్లో తనిఖీ చేస్తే 10 మిల్లుల్లో మాత్రమే తేడా ఉందని అన్నారని పేర్కొన్నారు. ఒక్క గింజ తేడా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఊరుకో దని, మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమి నల్ కేసులు పెట్టిందని తెలిపారు. మరో రెండు మిల్లుల్లో మొత్తం ధాన్యాన్ని రికవరీ చేశామని, మిగతా ఐదు మిల్లులపై చర్యలు తీసుకోవా లని కలెక్టర్లకు లేఖలు రాశామని చెప్పారు. రెండో దశలో 63 మిల్లుల్లో తే డా.. అని ఎఫ్‌సీఐ అధికారులు జూన్ 4న లేఖ రాశారని, దాన్ని కలెక్టర్లకు పంపి పరిశీలించ మని ఆదేశించినట్లు వెల్లడించారు. జూన్ నుంచి నవంబర్ వరకు ఉచిత బియ్యం.. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యా న్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేయ డం లేదని ఎఫ్‌సీఐ చేసిన వ్యాఖ్యలు అర్థర హితమని మంత్రి గంగుల పేర్కొన్నారు. సాం కేతిక కార ణాల వల్ల 2 నెలలు ఉచిత బియ్యం సరఫరాలో ఆలస్యం అయిందని, ఈ జూన్ నుంచి యథాతథంగా సరఫరా చేస్తు న్నామని చెప్పారు. 2020 ఏప్రిల్ నుంచి కేంద్రంతో పాటు ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇచ్చా మని, తద్వారా ప్రభుత్వంపై 8 నెలల పాటు రూ.980 కోట్ల భారం పడిందని తెలిపారు. ఇక 2021 జూన్ నుంచి ఏప్రిల్ 2022 వరకు కూడా ఉచితంగా బియ్యం ఇచ్చామని వివరించారు. 2022 మార్చిలో.. ఏప్రిల్ నుంచి ఆరు నెలల పాటు ఉచిత బియ్యం ఇవ్వాలని కేంద్రం లేఖ రాసిందని, తదనుగుణంగా మూడో దశ కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించిన ప్పటికీ సేకరణ, ఇతర కారణాల వల్ల పంపిణీ ఆలస్యం అయిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 90,46,000 కార్డుల్లో కేవలం 53 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత అందరికీ ఉచితబియ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ జూన్ నుంచి తెల్ల రేషన్‌కార్డు దారులందరికీ రూ.436 కోట్ల భారాన్ని భరించి నవంబర్ వరకు ఆరు కిలోలకు అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 11 కేజీల చొప్పున ఉచితబియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, పెట్రోల్, డీజిల్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు చెప్పామని, స్టాక్ ఉండి కూడా ప్రజలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకపోతే బంకులపై చర్యలు తీసుకొం టామని గంగుల హెచ్చరించారు. . -
రైస్ రాకెట్.. రైట్ రైట్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో ‘రైస్ మాఫియా’మరింతగా రెచ్చిపోతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి (సీఎంఆర్) బియ్యాన్ని భారత ఆహా ర సంస్థ (ఎఫ్‌సీఐ)కి పంపాల్సిన మిల్లర్లు.. అడ్డ గోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రైతుల నుంచి వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, ఆ మంచి బియ్యాన్ని అధిక ధరలకు బయట అమ్ముకుంటున్నారు. ఆ స్థానంలో బయటకొన్న నాణ్యతలేని ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తూ, రేషన్ బి య్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ.. ఎఫ్‌సీఐకి అంటగడుతున్నారు. సివిల్ సప్లైస్, మార్కెటింగ్ అధికారులు, సిబ్బందికి ముడుపులు ఇస్తూ దందా నడిపిస్తున్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి ఇటీవల పోటెత్తిన ధాన్యం లారీలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చెక్‌పోస్టులున్నా రవాణా కొనసాగుతుండటాన్ని బట్టి ఆయా శాఖల అధికారుల సహకారమున్నట్టు స్పష్టమవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 2,200 రైస్ మిల్లులు ఉండగా.. అందులో వెయ్యి వరకు పారాబాయిల్డ్ మిల్లులు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జనవరి 24నాటికి రాష్ట్ర ప్రభుత్వం 69.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించింది. దీనికి సంబంధించి మిల్లర్లు 46.28 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ ఇప్పటివరకు 65శాతం మేర కూడా బియ్యాన్ని ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌తోపాటు పాలమూ రులో ఈ పరిస్థితి ఉంది. మిల్లర్లకు చేసిన కేటాయింపులకు, సీఎంఆర్ లెక్కలకు ప్రతి సీజన్లోనూ తేడాలు ఉండటం ఈ అక్రమాలకు నిదర్శనమని ఆరోపణలు వస్తున్నాయి. క్వింటాల్ రూ.1,400కే కొని.. రాష్ట్రంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్విం టాల్ ధాన్యం ఏ–గ్రేడ్ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 మద్దతు ధర పలుకుతోం ది. అదే కర్ణాటకలో క్వింటాల్‌కు రూ.1,400లే పలుకుతోంది. దీంతో కొందరు మిల్లర్లు ముఠాగా ఏర్పడ్డారు. నకిలీ వేబిల్లులతో కర్ణాటక నుంచి నాసిరకం ధాన్యాన్ని తీసుకొచ్చి, సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారు. మరోవైపు రేషన్ డీలర్లు, వినియోగదారుల నుంచి రేషన్ బియ్యం కొని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కోటాకు మళ్లిస్తున్నారు. చెక్‌పోస్టులను తప్పించుకుని.. కర్ణాటక సరిహద్దుల్లో తెలంగాణ పరిధిలోని నారాయణపేట జిల్లాలో, గద్వాల జిల్లాలో ఏడు చొప్పున చెక్‌పోస్టులు ఉన్నాయి. పలు చెక్‌పోస్టుల వద్ద రాత్రివేళ నిఘా అంతంత మాత్రంగానే ఉంటోందని.. సిబ్బంది ఒక్కో ధాన్యం లారీకి రూ.2 వేలు చొప్పున తీసుకుని వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఈ చెక్‌పోస్టులే గాకుండా ఇతర దారుల ద్వారా కూడా ధాన్యం లారీలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఎన్ని లారీలు పట్టుబడ్డా.. ♦ఈ నెల 11న కర్ణాటక నుంచి హైదరాబాద్ లోని మిల్లులకు ధాన్యం తరలిస్తున్న 2 లారీల ను కాన్కుర్తిలోని చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. ♦ఈ నెల 15న నారాయణపేట జిల్లా మక్తల్‌లో ధాన్యం లోడ్‌తో వస్తున్న 16 లారీలను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని సిర్పూర్, యాద్గిర్, మాన్విల నుంచి ఎలాంటి బిల్లులు లే కుండా హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లోని మి ల్లులకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ♦ఈ నెల 19న కర్ణాటకలోని మాన్వి నుంచి మిర్యాలగూడ, హైదరాబాద్‌లకు ధాన్యం లోడ్‌తో వస్తున్న నాలుగు లారీలను గద్వాల జిల్లా నందిన్నె చెక్‌పోస్టు వద్ద.. మరో రెండు లారీలను ఎర్రవెల్లి చౌరస్తా వద్ద పట్టుకున్నారు. -
రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ తనిఖీలు ఆపాలి: మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్: రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాల తీరుపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) చేస్తున్న దాడులపై తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గుంగుల కమలాకర్ స్పందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఎఫ్‌సీఐ తనిఖీల వెనుక కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమేమిటని ప్రశ్నించారు. రైతుల సజావుగా ధాన్యం అమ్ముకోకుండా చేసే కుట్రలో భాగంగానే ఎఫ్‌సీఐ దాడులంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణలో కొనుగోళ్లు ప్రారంభం కాగానే దాడులు చేస్తున్నారు. రైస్ మిల్లులలో ఉద్దేశ్య పూర్వకంగానే ఎఫ్‌సీఐ తనిఖీలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై దాడి చేయాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొనుగోళ్లు సంజావుగా సాగకూడదని కేంద్రం భావిస్తోంది. రైతులు పండించిన పంట రైస్ మిల్లుల వరకూ చేరకూడదని డబ్బులు అందకుండా చేయాలని కేంద్రం ఉద్దేశ్య పూర్వకంగానే తనిఖీలు చేయిస్తోంది. దానివల్ల రైతులు ఇబ్బందులు పడుతారు. వడ్లు మాయం కావు.. కొనుగోళ్లు పూర్తి అయ్యాక ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని కేంద్రానికి విన్నవిస్తున్నాం. చదవండి: (అక్రమాలపై ఎఫ్‌సీ‘ఐ’) కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ రైస్ మిల్లులలో ఎఫ్‌సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలి. కేంద్రానికి అధికారం ఉంది.. మేము వ్యతిరేకించడం లేదు అయితే ఇప్పుడిప్పుడే కోతలు పూర్తయ్యి ధాన్యం వస్తోంది. కాబట్టి ఇది సమయం, సందర్భం కాదు. దీనివల్ల ధాన్యం సేకరణ ఆగిపోతుంది.. రైతులకు ఇబ్బందులు కలుగుతాయి. ధాన్యం సేకరణ పూర్తయ్యాక తనిఖీలు చేస్తే సహకరిస్తామని' తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. చదవండి: (4.54 లక్షల బస్తాలు మాయం) -
4.54 లక్షల బస్తాలు మాయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘తెలంగాణలోని రైస్ మిల్లుల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఉండాల్సిన ధాన్యం నిల్వలు ఉండట్లేదు. గత నెల 31న ఎఫ్‌సీఐ అధికారులు చేసిన తనిఖీల్లో 40 రైస్ మిల్లుల్లో 4,53,896 బస్తాల ధాన్యం కొరత ఉన్నట్టు తేలింది’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యాన్ని ఎక్కడికి తరలించారు. ఎవరిని మోసం చేసేందుకు, ఎవరి బ్యాంక్ వడ్డీని తప్పించుకోవడం కోసం ప్రయత్నించారు. ఎఫ్‌సీ ఐకి అందించాల్సిన సమయంలో ధాన్యం ఎలా అం దిస్తారు?’ అని ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం అవకతవకల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రైస్ మిల్లుల్లో స్టాక్స్ పరిశీలనకు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఎఫ్‌సీఐ అధికారులను కేంద్రం ఆదేశించిందన్నారు. కొన్ని మిల్లుల్లో ధాన్యం కొరత విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరామని, రైస్ మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఎం దుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. మిల్లు లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం లేఖ రాయబోతోంద న్నారు. రైస్ మిల్లులు, కేంద్రానికి/ఎఫ్‌సీఐకి మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉండని కారణంగా నేరుగా సీబీఐ దర్యాప్తు చేయించే అవకాశం కేంద్రానికి ఉండదన్నారు. బియ్యం కొనుగోలుకు అంగీకరించి ఏర్పాట్లు చేయరా? ప్రస్తుత యాసంగి సీజన్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చేందుకు ఈ నెల 13న తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఈ నెల 18న కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఏర్పాట్లు ప్రారంభించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు, రైస్ మిల్లర్లకు స్పష్టత ఇవ్వలేదన్నారు. పైగా బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకరించిన తర్వాత కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గతంలో కేంద్రం అనేక సమావేశాలను నిర్వహిం చినా పచ్చి అబద్ధాలు, విష ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడంతో రాష్ట్రంలోని చాలా మంది రైతులు మద్దతు ధర కన్నా తక్కువకే ధాన్యం అమ్ముకున్నారని, దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. రాజకీయ స్వలాభం కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడారని, రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని విమర్శించారు. 15 కోట్ల గోనె సంచులకు రాష్ట్రం దగ్గర కోటి కూడా లేవు గత రబీ, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ టార్గెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత యాసంగి సీజన్ 60 ఎల్ఎంటీ ధాన్యం సేకరణకు కనీసం 15 కోట్ల గోనె సంచులు అవసరం కాగా తెలంగాణలో కోటి బస్తాలు కూడా లేవన్నారు. అన్ని రాష్ట్రాలూ జనవరి నుంచే గోనె సంచుల సేకరణ ప్రారంభించా యని, తెలంగాణలో మాత్రం ప్రారంభంకాలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ రకంగా ధాన్యాన్ని సేకరించి రవాణా చేస్తారన్నారు. ‘తండ్రీకొడుకుల ప్రభుత్వం.. తట్టల్లో బియ్యం మోస్తుందా?’ అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని, యుద్ధ ప్రాతిపదికన రైతుల నుంచి ధాన్యం కొనాలని, రైస్ మిల్లర్లపై అజమాయిషీ చేసి రైతులను ఆదుకునేందుకు ముందుకురావాలని అన్నారు. కమీషన్ల కోసం అప్పులు తెస్తున్నారు రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేసీఆర్ నష్ట పరిహారం ఇస్తే తమకేం ఇబ్బంది లేదని కిషన్‌రెడ్డి అన్నారు. అయితే రాష్ట్రంలో పేదలే లేనట్టు, రైతుల ఆత్మహత్యలు జరగనట్టు, నిరుద్యోగ యువకుల బలిదానాలు చేసుకోనట్టు చూపించే ప్రయత్నం చేయొద్దన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రాజకీయలు, దుర్మా ర్గాలు, మాఫియా కారణంగా ఆత్మహత్యలు చేసు కుంటున్న కుటుంబాలను ముందు ఆదుకోవాల న్నారు. రాష్ట్రంలో చనిపోయిన రైతులు, అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తోందని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం ఆలోచించే తమకు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబీకుల సర్టిఫికెట్ అవసరంలేదన్నారు. లేఖలు రాస్తే పట్టించుకోరా? ‘వరి, గోధుమ ఎక్కువగా పండే ప్రాంతాల్లో జీవ ఇంధన అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేయాలని 2018లో అన్ని రాష్ట్రాలను కేంద్రం కోరింది. అదే సంవత్సరంలో అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్.. సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 2019లో తెలంగాణ సీఎస్‌కు మరోసారి లేఖ రాశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాలసీని ఉపయోగించు కోలేదు. పైగా ఫోర్టిఫైడ్ రైస్ విషయంలోనూ రైస్‌మిల్లర్లను ప్రోత్సహించడంలో విఫలమైంది’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
అక్రమాలపై ఎఫ్‌సీ‘ఐ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ ద్వారా అప్పగించే క్రమంలో రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాల తీరుపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సీరియస్‌గా ఉంది. సేకరించిన ధాన్యాన్ని బియ్యం(సీఎంఆర్)గా ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన మిల్లర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని.. సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యానికి బదులు పాత బియ్యం, రీసైక్లింగ్ చేసిన పీడీఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) బియ్యం ఇస్తున్నారని భావిస్తోంది. దీంతో రాష్ట్రం లోని అన్ని మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేశాకే బియ్యం సేకరించాలని జిల్లాల వారీగా ఎఫ్‌సీఐ అధికారులకు ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులకు ఎఫ్‌సీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అశోక్‌కుమార్ బుధవారం లేఖ రాశారు. గత నెలలో భౌతిక తనిఖీల్లో మాయమైన ధాన్యం ఏమైందో తేల్చాలని కూడా రాష్ట్ర ఉన్నతాధికారులను ఎఫ్‌సీఐ ఆదేశించినట్లు సమాచారం. 18,156 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం 2020–21 యాసంగి, 2021–22 వానకాలం సీజన్లలో సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం తీసుకెళ్లిన రైస్ మిల్లులు.. ఆ బస్తాలను నిల్వ చేసి ఎప్పటికప్పుడు మర పట్టించి బియ్యంగా ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. అయితే బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించిన విషయం గత నెలలో వెలుగు చూసింది. దీంతో మార్చి 20 నుంచి 23వ తేదీ వరకు 425 మిల్లుల్లో 2020–21 యాసంగి ధాన్యం బస్తాలను, 533 మిల్లుల్లో మొన్నటి వానకాలం సీజన్ ధాన్యం బస్తాలను ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీ చేశారు. 2020–21 యాసంగి ధాన్యానికి సంబంధించి 19 మిల్లుల్లో 1.96 లక్షల ధాన్యం సంచులు, వానకాలం ధాన్యానికి సంబంధించి 21 మిల్లుల్లో 2.58 లక్షల ధాన్యం సంచులు.. మొత్తంగా 18,15 మెట్రిక్ టన్నుల (4.54 లక్షల బ్యాగులు) ధాన్యం మాయమైనట్టు గుర్తించారు. ఈ ధాన్యం బస్తాలకు సంబంధించిన వివరాలేవీ మిల్లర్లు వెల్లడించకపోవడంతో చర్యలు తీసుకోవాలని మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ సమాచారమిచ్చింది. గతంలోనూ 20 మిల్లుల్లో జరిపిన భౌతిక తనిఖీల్లో 2020–21 యాసంగి ధాన్యానికి సంబంధించి 1.76 లక్షల బ్యాగులు మిస్సయ్యాయి. ఏమాత్రం తేడా ఉన్నా.. గత మార్చిలో 3,278 రైస్ మిల్లుల్లో భౌతిక తనిఖీలకు ఎఫ్‌సీఐ ఆదేశించింది. అయితే 958 మిల్లుల్లో జిల్లా స్థాయి ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేయగా 40 మిల్లుల్లో అవకతవకలు బయటపడ్డాయి. ఇంకో 2,320 మిల్లుల్లో తనిఖీలు చేయాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల ప్రక్రియ సాగలేదు. తాజాగా యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలవుతున్నందున గత సంవత్సరం యాసంగి, వానాకాలం ధాన్యం నిల్వలపై తనిఖీలు జరపాలని సంస్థ నిర్ణయించిన ఎఫ్‌సీఐ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27 కల్లా మిగిలిన 2,320 మిల్లుల్లో ధాన్యం బస్తాలను లెక్కించేందుకు వీలుగా ఉంచాలని ఆదేశించింది. 28న అన్ని మిల్లుల్లో పౌరసరఫరాల శాఖతో కలిసి ఎఫ్‌సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ జరపనుంది. బస్తాల లెక్కతో పాటు ఇప్పటి వరకు మిల్లుల్లో సాగిన లావాదేవీలు, లెక్కలనూ అధికారులు తనిఖీ చేయనున్నారు. ధాన్యం బస్తాల నిల్వల్లో ఏమాత్రం తేడాలున్నా రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎఫ్‌సీఐ నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. యాసంగి సీజన్లో ముడి బియ్యాన్ని సీఎంఆర్‌గా చేసివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై ఇప్పటికే ఆందోళన చెందుతున్న మిల్లర్లకు ఇది అశనిపాతమే. పాతవో, కొత్తవో తేల్చేందుకు పరీక్షలు మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించే బియ్యం విషయంలో ఇక కఠినంగా ఉండాలని ఎఫ్‌సీఐ నిర్ణయించింది. బియ్యం ఏ సీజన్లో పండిన ధాన్యానికి సంబంధించిందో తేల్చడంతో పాటు ముడి బియ్యమా, ఉప్పుడు బియ్యమా లేక స్టీమ్డ్ రైసా నిర్ధారించేందుకు శాస్త్రీయ పద్ధతితో లిట్మస్ టెస్టు నిర్వహించనుంది. థియో–బార్బిట్యూరిక్ యాసిడ్ (టీబీఏ)తో పరీక్షించడం ద్వారా బియ్యం నాణ్యత తెలుస్తుందని ఇప్పటికే తేలడంతో ఎఫ్‌సీఐ ఈ నిర్ణయం తీసుకుంది. -
మిల్లింగ్‌పై కొర్రీలు పెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: రైతుల శ్రేయస్సు దృష్ట్యా అదనపు ఆర్థికభారాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరిస్తున్నందున మిల్లింగ్ విషయంలో ఎఫ్‌సీఐ అనవసర కొర్రీ లు పెట్టొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. యాసంగి ధాన్యం సేకరణ నేపథ్యంలో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో భేటీ అయ్యారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులతో కలసి ధాన్యం సేకరణ, సీఎంఆర్, గోడౌన్ సమస్యలపై చర్చించారు. యాసంగిలో తెలంగాణలో పండే ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూక శాతం ఎక్కువగా ఉం టుందనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. నూక శాతం పెరగడం వల్ల ఎదురయ్యే అదనపు భారాన్ని భరించి సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి ముడి బియ్యం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. నాణ్యతాప్రమాణాల మేరకు ముడిబియ్యం అందిస్తామని కేంద్రానికి, ఎఫ్‌సీఐకి లేఖలు రాసినట్లు చెప్పారు. గత యాసంగికి సంబంధించి ఎఫ్‌సీఐ సేకరించాల్సిన 5.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ‘ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్’రూపంలో తీసుకోవాలని సూచించారు. వానాకాలం సీజన్ కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని వేగంగా అందించేలా రైల్వే ర్యాకులు, అదనపు స్టోరేజీ కల్పించాలని కోరారు. ధాన్యం తక్కువ సేకరించే రాష్ట్రాలకు, అధి కంగా సేకరించే తెలంగాణకు సీఎంఆర్‌లో ఒకే గడువు ఇస్తున్నారని, ఈ అసమగ్ర విధానాన్ని పున:సమీక్షించాలని దీపక్ శర్మను కోరారు. ఈ యాసంగిలో దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నామని చెప్పారు. ఇందుకోసం 15 కోట్ల గన్నీ సంచులు అవసరమని, వీటి కోసం జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని చెప్పారు. యాసంగి ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడటానికి ఎఫ్‌సీఐ నుంచి డీజీఎం కమలాకర్, పౌర సరఫరాల సంస్థ జీఎం రాజిరెడ్డిని నోడల్ ఆఫీసర్లుగా నియమించనున్నట్లు చెప్పారు. పక్క రాష్ట్రాల ధాన్యాన్ని అడ్డుకోవాలి ఎఫ్‌సీఐ జీఎంతో సమావేశం అనంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి కమలాకర్ సమీక్షించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. పక్క రాష్ట్రాల నుంచి ఒక్క వడ్ల గింజ కూడా కొనుగోలు కేంద్రాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం విజిలెన్స్ టీం పక్కా ప్రణాళికలతో ఈ రెండు నెలలు క్షేత్రస్థాయిలో నిరంత రం పర్యవేక్షించాలన్నారు. రీసైక్లింగ్ బియ్యం రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని, వస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. అనంతరం ధాన్యం సేకరణలో ఉన్న ఆర్థికపరమైన అంశాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు. రుణాలపై రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ, గత బకాయిలు వంటి అంశాలను చర్చించారు.