former problems
-
ఆ చైతన్యం ఏది..?
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు ముందు రైతుల్లో అవగాహన కల్పించేందుకు ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించేది. అందులో భాగంగా ఆధునిక వ్యవసాయం, నకిలీ విత్తనాలు, సాగు పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూసార పరీక్షల అవశ్యకత, పంట మార్పిడి, పంటల ఉత్పత్తులు గోదాముల్లో నిల్వ చేసి రుణం పొందే విధానం, వర్షాభావ పరిస్థితుల్లో సాగు చేయాల్సిన పంటలు, చీడపీడల నివారణ, పాడి పశువుల ద్వారా అభివృద్ధి, పశు సంవర్ధక శాఖ అందిస్తున్న రాయితీలు, వ్యవసాయంలో విద్యుత్ వినియోగం, విత్తనోత్పత్తికి సంబంధించిన ప్రోత్సాహం వంటి అంశాలపై వ్యవసాయాధికారులతో రైతుల్లో చైతన్యం కలిగించేవారు. కానీ, గతేడాది ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఈ ఏడాది కూడా చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు లేదు. దీంతో రైతులు పలు అంశాలపై అవగాహన లేక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అసలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా? లేదా? అనే అయోమయంలో రైతులు ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం, కనీసం దీని గురించి కూడా ఊసెత్తకపోవడం గమనార్హం. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఖరీఫ్ పంటల సాగుకు ముందే ప్రభుత్వం ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించేది. ఈ కార్యక్రమాన్ని గతేడాది నిర్వహించకపోగా, ఈ ఏడాది కూడా నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం ‘రైతు చైతన్య యాత్ర’ పేరును ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’గా మార్చి ఏటా మే చివరి నుంచే రైతులకు సాగు అంశాలు, నకిలీ విత్తనాలు, ఆధునిక వ్యవసాయం, భూసార పరీక్షల అవశ్యకత, పంట మార్పిడి లాంటి అంశాలపై వ్యవసాయాధికారులతో సమావేశాలు (వారం రోజులపాటు) పెట్టించి రైతులకు అవగాహన కల్పించేవారు. కానీ ఈ చైతన్య యాత్రలను గతేడాది నిర్వహించలేదు. ఈ ఏడాదైనా నిర్వహిస్తారా? లేదా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ చైతన్య యాత్రలపై స్పష్టత లేకపోవడం, ప్రభుత్వం కనీసం ఊసెత్తకపోవడంతో నిరాశ వ్యక్తం అవుతోంది. అవగాహన లేకపోతే ఎలా? ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు ఏఏ పంటలు సాగు చేయాలి? ఖరీఫ్‌లో ఎలాంటి పంటలు సాగు చేస్తే రైతులకు ప్రయోజనం ఉంటుంది, ఏ పంట సాగు చేస్తే పెట్టుబడి తగ్గుతుంది, వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే అందుకు అనుగుణంగా సాగు చేయాల్సిన పంటల వివరాలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రావాలంటే పాటించాల్సిన సాగు పద్ధతులపై అవగాహన కల్పించకపోతే ఎలా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటితోపాటు పంటల సాగుకు విత్తనాల ఎంపిక ఏ విధంగా చేసుకోవాలి? నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలి? నకిలీ విత్తనాలతో వచ్చే నష్టాలు, ఆధునిక సాగు పద్ధతులు, యంత్రాలు, సేంద్రియ ఎరువుల వాడకం, చీడ పురుగుల నివారణ, భూసార పరీక్షలు అలాంటివి వ్యవసాయ రుణాలు, సబ్సిడీ రాయితీలు పొందే పద్ధతులు, పంటల మార్పిడి, వివిధ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు పద్ధతులతోపాటు ఆరుతడి పంటలపై మండలస్థాయి, జిల్లా స్థాయి వ్యవసాయధికారులే స్వయంగా ఆయా గ్రామాలకు వచ్చి రైతుల్లో చైతన్యం కల్పించడం ‘రైతు చైతన్య యాత్ర’ల ముఖ్య ఉద్దేశం. ఈ చైతన్య యాత్రలు, అవగాహన సదస్సుల్లో వ్యవసాయ శాఖతోపాటు ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ, ఆయిల్ ఫెడ్, మార్కెటింగ్ శాఖ, మరో 7 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు రైతుల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేవారు. కానీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ సారి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చైతన్య యాత్రలు నిర్వహించకపోతే రైతులకు ఎలా అవగాహన కలుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. యథావిధిగా కొసాగించాలి గతేడాది ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఆ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించాలి. సాగు పద్ధతులపై అవగాహన లేక రైతులు పంట వేసి నష్టపోయే అవకాశం ఉంది. సేంద్రియ వ్యవసాయంపై కూడా అవగాహన కల్పించాలి. జంగ జమలయ్య, వేంసూరు అవగాహన కల్పిస్తేనే మేలు ఖరీఫ్, రబీ సీజన్లో రైతులకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తేనే మేలు జరుగుతుంది. సాగు చేసే పంటలపై అవగాహన లేకపోతే పంటలు సాగు చేసి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం, రాయితీలపై అవగాహన కల్పిస్తే రైతులకు ఎంతో ప్రయోజనం. గతంలో మాదిరిగానే రైతు చైతన్య యాత్రలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. సంగీతం వీర్రాజు, రైతు, వేదాంతపురం -
ఉపాధి చిక్కుల్లో రాజధాని చిన్నరైతు!
సాక్షి, తాడేపల్లి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన దాదాపు 50 వేల మంది చిన్న, సన్నకారు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం చెప్పిన దానికి, జరుగుతున్న దానికి ఎక్కడా పొంతన ఉండడంలేదు. రాజధాని నిర్మాణం పేరుతో ఇక్కడ 33వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమీకరించింది. భూములిచ్చిన వారిలో అధిక భాగం రైతులు ఎకరం, అర ఎకరం ఉన్నవారే. దీంతో తమ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఇల్లు గడవక దిక్కుతోచడంలేదని బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం వీరికి ఏటా కౌలు చెల్లిస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ చాలడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలాగే, రైతుల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్కూళ్లలో చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చినా, అది ఎక్కడా అమలుకావడంలేదు. అప్పులు చేసి చదివించాల్సి వస్తోందంటున్నారు. అంతేకాక, రాజధాని మూడు మండలాల్లో సరైన ప్రభుత్వ వైద్యశాల లేక ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కూలి పనీ దొరకడం లేదు గతంలో ఉన్న ఎకరం, అరెకరంలో ఏదో ఒక పంట వేసుకుని, అప్పోసొప్పో చేసుకుని తినేవారమని, పంట చేతికి రాగానే అప్పులు తీర్చేవారమని రైతులు చెబుతున్నారు. రాజధాని పుణ్యమా అంటూ వడ్డీ వ్యాపారస్తులు రైతువారీ వడ్డీకి స్వస్తి చెప్పి అధిక వడ్డీలకు తిప్పుతున్నారని, ఆ అప్పు చేసి ఎలా తీర్చాలో అర్ధంకావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పొలాల్లో పనిలేక నిర్మాణ పనులకు వెళ్తే అక్కడా అన్యాయమే జరుగుతోందని వాపోతున్నారు. భవన యజమానులు, కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను అతితక్కువ కూలీకి తీసుకువచ్చి వారితో పనులు చేయించుకుంటున్నారని.. తమను తొలగిస్తున్నారని వాపోయారు. దీంతో ఇప్పుడు ప్రతిరోజూ పొట్ట చేతబట్టుకుని ఎక్కడ పని దొరుకుతుందా అని వెతుక్కుంటున్నామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడు పట్టించుకుని భూములిచ్చిన చిన్న, సన్నకారు రైతులకు పనులు కల్పించాలని వారు కోరుతున్నారు. పని కోసం వెతుక్కోవాల్సి వస్తోంది ఉన్న ఎకరాన్ని పూలింగ్‌కు ఇచ్చా. వచ్చిన కౌలు చాలకపోవడంతో రోజు కూలీ చేసుకుంటున్నాం. కురగల్లులో నిర్మిస్తున్న వర్సిటీలో రూ.10వేల జీతానికి చేరాను. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు రూ.7 వేలకే చేయడంతో మమ్మల్ని తొలగించారు. ఇప్పుడు పనికోసం వెతుక్కోవాలి. – దావులూరి వెంకటేశ్వరరావు పనిలేక ఇబ్బంది పడుతున్నాం ఉన్న 75 సెంట్లు పూలింగ్‌కు ఇచ్చాం. గతంలో అక్కడ కూరగాయలు పండించి అమ్ముకొని జీవించే వాళ్లం. ఇప్పుడు పనిపోయింది. కొత్త పని కోసం వెతుక్కుంటున్నాం. నాలాగా చాలామంది రైతుల పరిస్థితి ఇదే. ప్రభుత్వం దారి చూపకపోతే ఇచ్చిన ప్లాట్లు అమ్ముకుని వలస వెళ్లాల్సిందే. – నాగేశ్వరరావు, ఐనవోలు కూలీలకు పని దొరకడంలేదు గతంలో పొలాల్లో పనిచేసుకుని సాయంత్రానికి ఆరేడు వందలతో ఇంటికి తీసుకెళ్లేవాళ్లం. ఇప్పుడు సిమెంటు పనిచేసినా రూ.500 ఇవ్వడంలేదు. ఎవరిని అడిగినా పనిలేదు పొమ్మంటున్నారు. ఇలా అయితే మేం ఎక్కడకు వలస వెళ్లాలో అర్ధంకావడంలేదు. – బాణావతు దినేష్‌నాయక్, నవులూరు -
సూక్ష్మసేద్యం అనుమతులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూక్ష్మసేద్యానికి బ్రేక్ పడింది. రైతులు చుక్కచుక్కనూ సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి నిధులలేమి సమస్యగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క దరఖాస్తుకు కూడా ఉద్యానశాఖ అనుమతివ్వలేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెండేళ్లుగా నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో సూక్ష్మసేద్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రెండేళ్ల నుంచి రూ.200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. భారీ సబ్సిడీతో ప్రోత్సాహం ఇచ్చినా.. ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇస్తుంది. బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. ఎకరానికి సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ. 25–30 వేల వరకు ఖర్చు కానుంది. నాలుగు ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ. లక్షకు పైగానే ఖర్చుకానుంది. అయితే ఈ సూక్ష్మసేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కపైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీంతో రైతులు సూక్ష్మసేద్యం ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. 2016–17లో కేవలం 10,550 మంది రైతులు 32,710 ఎకరాలకు దరఖాస్తు చేసుకోగా, 2017–18లో ఏకంగా 3.85 లక్షల ఎకరాలకు 1.16 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరికి సూక్ష్మసేద్యాన్ని మంజూరు చేసింది. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం నాబార్డు నుంచి రూ. 800 కోట్లు రుణంగా తీసుకుంది. ఆ సొమ్ము అంతా కూడా గతేడాది నాటికి చెల్లింపులకు పూర్తయింది. ఇంకా రూ.200 కోట్లు కేంద్రం వాటా పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. పెండింగ్‌లో దరఖాస్తులు... ఇప్పటివరకు నిధులు పెండింగ్‌లో ఉండిపోవడం, ఈ ఏడాది బడ్జెట్లో సూక్ష్మసేద్యం పథకానికి కేటాయించిన రూ.127 కోట్లలో ఒక్క పైసా విడుదల చేయకపోవడంతో ఉద్యానశాఖ సందిగ్ధంలో పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1.20 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. నిధులు లేకపోవడంతో వాటి అనుమతులకు బ్రేక్ పడింది. తమ వాటాగా ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై తమకు కేంద్రం మెమో కూడా ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే సూక్ష్మసేద్యంలో తెలంగాణ వెనుకబడిందని కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల విడుదల చేసిన జాతీయ వ్యవసాయ గణాంక నివేదికలోనూ స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ తెలంగాణలో కేవలం 3.31 లక్షల ఎకరాల్లోనే సూక్ష్మసేద్యంతో రైతులు సాగు చేస్తున్నారని వెల్లడించింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. సూక్ష్మసేద్యం అమలుకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.800 కోట్ల రుణం తీసుకొచ్చినా పెద్దగా మార్పురాలేదన్న ఆరోపణలున్నాయి. -
‘గజపతి’ నియోజకవర్గంలోకి వైఎస్ జగన్.. ఘన స్వాగతం
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర ఎస్.కోట నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసుకొని గజపతినగరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జననేతకు ఆ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అప్పలనర్సయ్య, నియోజకవర్గ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. దీంతో కొత్త వలస-విజయనగరం రోడ్డు జనసంద్రంతో నిండిపోయింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గొడికొమ్ము గ్రామ మహిళలు కలిసి జననేతను కలిశారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు మోసం చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా వడ్డీలేని రుణాలు ఇవ్వటం లేదని, దీంతో తీసుకున్న రుణానికి ప్రతీ నెలా వడ్డీల రూపంలో రూ.3వేలు వసూలు చేస్తున్నారని రాజన్న తనయుడికి తమ ఆవేదన వక్యం చేశారు. పలు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గెలిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటంలేదని, సాయం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని దివ్యాంగురాలు, వెయిట్ లిఫ్టర్ రాజేశ్వరి వైఎస్ జగన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించింది. (జగన్‌ను కలిసిన సాహసవీరుడు) అంతకముందు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎలాంటి అభివృద్ది చేయటం లేదని, నియోజకవర్గ సమస్యలు అస్సలు పట్టించుకోవడంలేదని ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు జననేతకు చెప్పుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, స్థానిక సమస్యలను ఎమ్మెల్యే లలిత కుమరి పట్టించుకోవడం లేదని జామి మండల మైనారిటీలు జననేత దృష్టికి తీసుకెళ్లారు. తమను అక్రమంగా తొలగించారిన జామి మండల ఫీల్డ్ అసిస్టెంట్లు వైఎస్ జగన్‌కు పిర్యాదు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు జననేతకు వినతి పత్రం సమర్చించారు. (జగన్‌తో నడిచిన ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి) జననేతను కలిసిన జిందాల్ నిర్వాసితులు దివంగత నేత వైఎస్సార్ తర్వాత తమను పట్టించుకునేవారే లేరని జిందాల్ ఫ్యాక్టరీ నిర్వాసితులు వైఎస్ జగన్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాజన్న తనయుడిని జిందాల్ ఫ్యాక్టరీ నిర్వాసితులు, రైతులు టీడీపీ దుర్మార్గపు పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఫ్యాక్టరీ పెట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, జిందాల్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రైతుల వైఎస్ జగన్‌ను కోరారు. ప్రజల సమస్యలను ఓపిగ్గా విన్న జననేత వారికి భరోసానిస్తూ ముందుకు కదిలారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు మండుటెండను సైతం లెక్క చేయకుండా జననేత వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. (చారిత్రాత్మక పైలాన్ ఆవిష్కరణ) చదవండి: నడిచేది నేనైనా.. నడిపించేది మీ అభిమానమే చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ. -
ధర.. దైన్యం
అనంతపురం అగ్రికల్చర్: మార్కెట్లో టమాట రేటు చూసి రైతు నోట మాట రావడం లేదు. మిర్చి ధర వింటే మూర్ఛవస్తోంది. వరుస కరువులతో ఆర్థికంగా చితికిపోయిన ‘అనంత’ రైతులను ఉద్యానతోటలు కూడా ఊసురుమనిపిస్తున్నాయి. మార్కెటింగ్ సదుపాయం లేక పండిన పంట ఉత్పత్తులను అమ్ముకోలేక చతికిలపడుతున్నారు. సరైన ప్రణాళిక, సాగు స్థిరీకరణ, గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతుండటంతో రైతులు దారుణ నష్టాలు చవిచూస్తున్నారు. ఓవైపు ప్రకృతి కన్నెర చేస్తుండగా మరోవైపు పాలకులు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ‘అనంత’ రైతుల పాలిట శాపంగా పరిణమించింది. కూర‘గాయాలే’ ఇటీవలకాలంలో అంతో ఇంతో నీటి వనరులు ఉన్న రైతులు వేరుశనగ, వరి లాంటి పంటలకు పోకుండా కూరగాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ఉద్యానశాఖ, మార్కెటింగ్‌శాఖ నుంచి సరైన ప్రణాళిక, సాగు, మార్కెటింగ్ సదుపాయం లేక కూరగాయలకు ధరలు లేక దారుణ నష్టాలు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం టమాటా, మిరప సాగు చేసిన రైతులు ధరల పతనంతో ఈ సీజన్లో రూ.250 నుంచి రూ.300 కోట్లు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. పెరిగిన సాగు... తగ్గిన ధర జిల్లా వ్యాప్తంగా టమాట, మిరపసాగు బాగా పెరిగింది. దిగుబడులు కూడా బాగానే వచ్చాయి. అయితే మార్కెట్లో ధరలు పతనం కావడంతో పెట్టుబడులు కూడా దక్కించుకోలేకపోతున్నారు. ఈ రెండు పంటల ద్వారా ఏటా 10 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడులు వస్తుండగా... రమారమి రూ.900 నుంచి రూ1,000 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సీజన్లో ధరలు దారుణంగా పతనం కావడం, తరచూ ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో ఈ ఏడాది రైతులకు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం జరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వినియోగదారులు కిలో రూ.10 ప్రకారం కొంటున్నా మార్కెట్లో రైతులకు మాత్రం కిలో రూ.2 కూడా గిట్టుబాటు కావడం లేదు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం నివారించి, మార్కెటింగ్ సదుపాయం కల్పించడంలో యంత్రాంగం విఫలం కావడంతో రైతులు కుదేలవుతున్నారు. టమాట పరిస్థితి ఇలా... జిల్లా వ్యాప్తంగా కళ్యాణదుర్గం, కుందుర్పి, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కంబదూరు, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట, ఓడీచెరువు, నల్లమాడ, గోరంట్ల, తాడిమర్రి, బత్తలపల్లి, అనంతపురం, ధర్మవరం, ఆత్మకూరు, కూడేరు, రాప్తాడు, కనగానపల్లి, చిలమత్తూరు, మడకశిర, గుమ్మఘట్ట, కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హిరేహాళ్, గుత్తి, గుంతకల్లు, యాడికి, తాడిపత్రి, యల్లనూరు తదితర మండలాల్లో టమాట పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 14,200 హెక్టార్లలో పంట సాగులోకి రాగా ప్రస్తుతం 7,800 హెక్టార్లలో పంట పొలం మీద ఉన్నట్లు ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడి రూ.1.20 లక్షలు...రాబడి రూ.80 వేలు మామూలు పద్ధతిలో అయితే ఎకరా విస్తీర్ణంలో టామాట సాగుకు రూ.50 వేల నుంచి రూ.60 వేలు పెట్టుబడి అవుతుండగా, ట్రెల్లీస్, మల్చింగ్ పద్ధతిలో అయితే ఎకరాకు రూ.1.10 లక్షల నుంచి 1.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో పాటు క్రేట్స్, రవాణా, కమిషన్ల ఖర్చు అదనంగా భరించాలి. ఎకరా టమాట బాగా పండితే 30 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. మార్కెట్లో కిలో కనీసం రూ.10 పలికితే కాని గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కిలో రూ.10 ఉంటే అందులో పెట్టుబడులు, రవాణా, ఇతరత్రా ఖర్చులు కింద రూ.8 వరకు పోతుంది. మిగతా రెండు రూపాయలు మిగిలే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇపుడు కిలో రూ.2 కూడా గిట్టుబాటు కాకపోవడంతో భారీ నష్టాలు చవిచూస్తున్నారు. జిల్లాతో పాటు పక్కనున్న చిత్తూరు, మదనపల్లి, అలాగే కర్ణాటకలోని కోలార్, చింతామణి, హైదరాబాద్ చుట్టుపక్కల, కొన్ని తెలంగాణా జిల్లాల్లో టమాట సాగు పెరగడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టినట్లు చెబుతున్నారు. నవంబర్ వరకు ఇదే రకమైన మార్కెట్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిరపదీ అదే దారి జిల్లా వ్యాప్తంగా బుక్కరాయసముద్రం, నార్పల, గుత్తి, బొమ్మనహాళ్, కణేకల్లు, పరిగి, తాడిపత్రి, రాయదుర్గం, ధర్మవరం, బత్తలపల్లి, కూడేరు, ఆత్మకూరు, కళ్యాణదుర్గం, కంబదూరు, తనకల్లు, మడకశిర ప్రాంతాల్లో మిరప సాగు ఎక్కువగా ఉంది. ఉరవకొండ, గుంతకల్లు ప్రాంతాల్లో ఎండుమిర్చి ఎక్కువగా ఉంది. ఈ ఏడాది 4,100 హెక్టార్లలో మిరప సాగు చేయగా అందులో ప్రస్తుతం 2,400 హెక్టార్లలో పంట ఉన్నట్లు చెబుతున్నారు. ఎకరా పచ్చి మిరప సాగుకు రూ.1.10 నుంచి 1.50 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. పంట నాటిన 75 రోజుల తర్వాత నుంచి 7 నుంచి 8 నెలల వరకు పంట కోతలు ఉంటాయి. అంతా బాగుంటే ఎకరాకు 15 టన్నుల మిరప దిగుబడులు వస్తాయి. అన్ని రకాల ఖర్చులు పోనూ కిలో కనీసం రూ.15 పలికితే కాని మిరపకు గిట్టుబాటు కాదని అధికారులు చెబుతున్నారు. ఇపుడు కనిష్ట స్థాయికి పడిపోవడంతో మిరప రైతులు నిలువునా మోసపోతున్నారు. తెలంగాణ, మహరాష్ట్రలో విపరీతంగా మిరప సాగు, దిగుబడులు రావడంతో ఈ దుస్థితి తలెత్తినట్లు విశ్లేషిస్తున్నారు. దళారుల దందా కూరగాయల వ్యాపారంలో దళారీలే బాగుపడుతున్నారు. దళారీలు సిండికేట్ అయి ఒక రేటును ఫిక్స్ చేస్తున్నారు. రైతులనుంచి తక్కువ ధరలకు పంట కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా నూటికి రూ.10 కమిషన్ రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. పండించిన పంట అమ్ముకోవాలంటే కమిషన్, బాడిగ, హమలీ ఖర్చుల పోనూ మిగిలేదేమీ ఉండదని రైతులు వాపోతున్నారు. కూలి డబ్బులుకూడా వచ్చేట్లు లేవు నాకు ఐదెకరాల పొలం ఉండగా..రెండు ఎకరాల్లో టమాట సాగు చేశాను. ప్రస్తుతం 15 కిలోల టమాట బాక్సును వ్యాపారులు రూ.45 అడుగుతున్నారు. ఈ లెక్కన అమ్మితే పెట్టుబడి కాదుగదా.. కూలీలు కూడా వచ్చేట్టు లేవు.– సుబ్రమణ్యం, బుక్కరాయసముద్రం ధర అధ్వానం నాకు పదెకారల పొలం ఉండగా..రెండు ఎకరాల్లో డ్రిప్పు ద్వారా మిరప సాగు చేశాను. ఎకరాకు రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టాను. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత వ్యాపారస్తులు కిలో రూ.3, రూ.4కు అడుగుతున్నారు. పంట దిగుబడి ఉన్నా..ధర మాత్రం రావడం లేదు. కేజీ రూ.15 నుంచి రూ.20 పలికి ఉంటే ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల దాకా ఆదాయం వచ్చేది. – రవిచంద్రారెడ్డి, సంజీవపురం -
ప్రకృతి సేద్యంలో మేమే మేటి
సాక్షి, అమరావతి: సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రకృతిని కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. భారతదేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చెప్పారు. 8 మిలియన్ల హెక్టార్లలో 60 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రకృతి సేద్య విధానం ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా నిలిచిందని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారం ఐక్యరాజ్యసమితి సదస్సుల్లో ‘సుస్థిర సేద్యం–ఆర్థిక చేయూత–అంతర్జాతీయ సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. రాష్ట్ర జీఎస్డీపీలో 28 శాతం వ్యవసాయ రంగానిదేనని అన్నారు. రాష్ట్రంలో 62 శాతం జనాభాకు వ్యవసాయం, అనుబంధ రంగాలే జీవనాధారమని వెల్లడించారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘వ్యవసాయం అంటే అత్యధిక వ్యయం, శ్రమతో కూడుకున్నది. భూసారం క్షీణించి పర్యావరణం దెబ్బతింటుంది. ఉత్పత్తి, మార్కెటింగ్ చాలా కష్టంతో కూడుకున్నవి. పంటలు సరిగ్గా పండక గ్రామీణులు పట్టణాలకు వలస వెళుతుంటారు. వాతావరణ మార్పులతో కరవు కాటకాలు, వరదలు సంభవిస్తుంటాయి. ఈ దుష్ప్రభావాలను అధిగమించడానికే ప్రకృతి వ్యవసాయాన్ని (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ను) ప్రోత్సహిస్తున్నాం. ప్రకృతి సేద్యంలో మీరు ఒక డాలర్ పెట్టుబడి పెట్టినట్లయితే 13 డాలర్ల లాభం వస్తుంది. రసాయన ఎరువులతో వచ్చే దుష్ప్రభావాలు మేం ప్రవేశపెట్టిన ప్రకృతి వ్యవసాయంతో తొలగిపోతున్నాయి. సురక్షితమైన, మిక్కిలి పోషకాలతో కూడిన ఆహారోత్పత్తి సాధ్యమవుతోంది. వ్యవసాయాన్ని మేము లాభసాటిగా తీర్చిదిద్దడంతో ఐటీ నిపుణులు ఆ రంగంవైపు ఆసక్తి చూపుతున్నారు. రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైంది. యువతను వ్యవసాయం వైపు ఆకర్శిస్తున్నాం. ప్రకృతి సేద్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం. ప్రకృతి సేద్యంతో పండించిన ఆహారోత్సత్తులు తీసుకుంటుండటంతో తమ ఆరోగ్యం బాగుపడిందని ప్రజలు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో రైతాంగాన్ని 100 శాతం ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 2020 నాటికి 1.7 మిలియన్ల రైతులు, 2022 నాటికి 4.1 మిలియన్ల రైతులను ఈ సేద్యం వైపు మళ్లించాలన్నదే మా ధ్యేయం. కోర్ డ్యాష్‌బోర్డును మీకు కనెక్ట్ చేస్తా.. 20 ఏళ్ల క్రితం స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పుడు 9 లక్షల స్వయం సహాయక బృందాలున్నాయి. వీరంతా తమ గ్రామాలు దాటి తమ భాష రాని, తమ ప్రాంతం కాని ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి వ్యవసాయంపై రైతాంగానికి అవగాహన కలిగిస్తున్నారు. భూమి ఉపరితలంపై కురిసే వర్షపు నీటిని రియల్ టైమ్ మేనేజ్మెంట్ ద్వారా ఒడిసి పడుతున్నాం, భూగర్భ జలాలుగా మారుస్తున్నాం. అల్పపీడనాలు ఏర్పడి అవి తుపానులుగా మారి ఎక్కడ కేంద్రీకృతమయ్యాయో రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థతో చెప్పగలుగుతున్నాం. న్యూయార్క్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామంలో వీధిలైట్ల వ్యవస్థను నేను రియల్ టైమ్ వ్యవస్థ సహాయంతో నిర్వహించగలను. నాకు సీఎం కోర్ డ్యాష్‌బోర్డు ఉంది. సీఎం కోర్ డ్యాష్‌బోర్డును మీకు కనెక్ట్ చేస్తా. మీరు అందులోని అంశాలన్నీ చూడొచ్చు’’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. -
దేవుడి భూములకు పంగనామాలు
సాక్షి, అమరావతి: రాజధానిలో దేవుడి భూములకు రాష్ట్ర ప్రభుత్వం పంగనామాలు పెడుతోంది. ఆ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పులతో పాటు తాను చేసిన చట్టాలను, జారీచేసిన మెమోలను సైతం లెక్క చేయడంలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న దేవాలయాల భూములకు ఎటువంటి రైతువారీ పట్టాలు చెల్లబోవని, గతంలో రైతు వారీ పట్టాలు ఇచ్చినప్పటికీ అవి పనికిరావని స్పష్టం చేస్తూ సీఆర్డీఏ 2015 సంవత్సరంలో మెమో జారీ చేసింది. ఆ భూమలన్నీ కూడా ధార్మిక సంస్థలకే చెందుతాయని ఆ మెమోలో స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న ఆలయాల భూములకు కేవలం పరిహారం మాత్రమే సదరు ధార్మిక సంస్థలకు చెల్లించాలని, ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు మాత్రం ఆక్రమణదారుల పేరిట ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో దేవుడి భూములపై గతంలో హైకోర్టుకు సీఆర్డీఏ ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కి చట్టానికి విరుద్ధంగా రైతు వారీ పట్టాల సాకుతో ఈనాం భూముల ఆక్రమణదారులకు కోట్ల రూపాయల విలువైన ప్లాట్లను కట్టబెడుతుండటంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్లాట్లు, పరిహారం కూడా ఆలయాలకే రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా వివిధ దేవాలయాలకు చెందిన 843.87 ఎకరాలను సీఆర్డీఏ సేకరించింది. మరో 173.22 ఎకరాలకు సంబంధించి దేవాదాయ శాఖతో పాటు రైతులు కూడా ఆ భూములు తమవంటూ క్లెయిమ్ చేయడంతో ఆ భూములపై సీఆర్డీఏ నిర్ణయం తీసుకోలేదు. రాజధానిలోని ఆలయాలకు, చారిటబుల్ సంస్థలకు చెందిన భూములన్నీ ఆయా సంస్థలకే చెందాలని, ఎటువంటి రైతు వారీ పట్టాదారులకు ఆ భూములపై హక్కు లేదని దేవాదాయ శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని షరతులతో ఆ భూములను సీఆర్డీఏకు బదిలీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాలకు చెందిన భూములకు సంబంధించి పూర్తి పరిహారంతో పాటు అభివృద్ధి చేసిన ప్లాట్లను కూడా ఆయా ఆలయాల వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లకు జమ చేయాల్సిందిగా ఆ షరతుల్లో హైకోర్టు పేర్కొంది. దీనిపై హైకోర్టుకు సీఆర్డీఏ లిఖితపూర్వక అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగానే సీఆర్డీఏ మెమో జారీ చేసింది. ఆ మెమోలో.. ఎటువంటి రైతు వారీ పట్టాలు జారీ చేయడానికి వీల్లేదని, ఇప్పటికే జారీ చేసి ఉంటే అవి చెల్లుబాటు కావని, ఆ భూములపై పూర్తి హక్కులు ఆయా సంస్థలకే చెందుతాయని మెమోలో స్పష్టం చేసింది. రైతువారీ పట్టాలు చెల్లవు.. ఈనాం భూములకు ఇచ్చిన పట్టాలపై 2015లో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వింజమూరి రాజగోపాలచారి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నడిచిన కేసుల్లో హైకోర్టు గతంలో స్పష్టంగా పేర్కొంది. ఈనాం భూములకు సంబంధించి 1956 చట్టం ప్రకారం రైతు వారీ పట్టాలు ఇవ్వడానికి ఆస్కారం లేదని, ఒక వేళ రైతు వారీ పట్టాలు ఇచ్చినా అవి చెల్లుబాటు కావని, ఈనాం భూములన్నీ కూడా ఆయా ఆలయాలకు మాత్రమే చెందుతాయని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. రైతువారీ పట్టాలు జారీ చెల్లబోవని 2013లో చేసిన చట్టసవరణను ఈ తీర్పు ద్వారా హైకోర్టు సమర్థించినట్లు అయిందని న్యాయశాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా న్యాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఈనాం భూములను ఆక్రమించుకున్న రైతులు తమకే పరిహారం చెల్లించాలని కోరుతున్నారని, ఈ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సీఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో దేవుని భూములకు పరిహారాన్ని ఆయా ఆలయాలకు చెల్లించాలని, అభివృద్ధి చేసిన ప్లాట్లను మాత్రం ఆక్రమణదారులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పునకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడించిందని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
34 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్‌లో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. దీనికనుగుణంగా 3,140 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. సేకరణలో ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. శనివారం ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఆ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్, జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 1,128 ఐఏపీ సెంటర్లు, 1,799 ప్రాథమిక సహకార సంఘాల కేంద్రాలు, 213 ఇతర కేంద్రాలు కలిపి 3,140 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే సంఖ్య పెంచాలని, ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనడం ఆలస్యం చేయొ ద్దని సూచించారు. గ్రేడ్–1 మద్దతు ధర రూ.1,770, కామన్ వెరైటీకి రూ.1,750 ఇస్తామని, రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని కోరారు. ధాన్యం సేకరణకు 8.59 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని, పాత బ్యాగుల నాణ్యతలో కఠినంగా వ్యవహరించాలన్నా రు. ఈ ఖరీఫ్‌లో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. కేసులున్న మిల్లులకు వద్దు కేసులున్న రైస్ మిల్లులకు ధాన్యం సరఫరా చేయొద్దని, మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర అవసరాలకు పోనూ 17 లక్షల టన్నుల బియ్యం నిలువ చేయాల్సి వస్తుందని, అందులో 9.69 ఎల్ఎంటీ సివిల్ సప్లయ్ శాఖ వద్ద అందుబాటులో ఉందని మంత్రికి కమిషనర్ అకున్ సబర్వాల్ వివరించారు. మిగిలిన స్థలాన్ని ఎఫ్‌సీఐ నుండి తీసుకుంటామన్నారు. -
పత్తి కొనుగోలుకు 386 కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి 386 కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ మంత్రి టి.హరీశ్‌రావు భారత పత్తి సంస్థ (సీసీఐ)ను ఆదేశించారు. అందులో 98 మార్కెట్ యార్డుల్లో, 288 కొనుగోలు కేంద్రాలు జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేయాలన్నారు. 25 ముఖ్య మార్కెట్ యార్డు కేంద్రాల్లో వచ్చే నెల 10లోగా, మిగిలిన కేంద్రాలను 20వ తేదీలోగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు మంత్రి శనివారం మార్కెటింగ్, వ్యవసాయశాఖలు, మార్క్‌ఫెడ్, హాకా, గిడ్డంగుల సంస్థ, సీసీఐ అధికారులతో పత్తి, మొక్కజొన్న, పెసర, మినుముల కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. టెండర్లలో పాల్గొన్న 288 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసేలా జిల్లా కలెక్టర్లు, సీసీఐ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా నుంచి జిన్నింగ్ మిల్లుల యజమానులు టెండర్లలో పాల్గొనకపోవడంపై హరీశ్ అధికారులను ప్రశ్నించారు. ఆ జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించాలని సీసీఐ సీఎండీని ఫోన్లో కోరారు. అలాగే సీసీఐ సంచాలకులు అల్లిరాణితో ఫోన్లో చర్చించి జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిర్ణీత శాతం తేమ ఉండేలా చూసుకోండి... రైతులు పత్తిని మార్కెట్ యార్డులకు తెచ్చేటప్పుడు శుభ్రపరిచి, ఆరబెట్టి తేమ 8% నుంచి 12% మా త్రమే ఉండేటట్లు చూసుకొని తెస్తే సరైన ధర వస్తుం దని దీనిపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను హరీశ్ ఆదేశించారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.5,450గా కేంద్రం నిర్ణయించిందని, నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా పత్తిని తెచ్చి ఆ మేరకు లబ్ధి పొందాలని రైతులను కోరారు. మొక్కజొన్నల కొనుగోలుకు 259 కేంద్రాలను తెరవాలని మార్క్‌ఫెడ్ ఎం డీని కోరారు. పెసర కొనుగోలుకు 9 కేంద్రాలను ప్రా రంభించాల్సిందిగా ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కందులు, మినుములు, వేరుశనగ మద్దతు ధర కొనుగోలుకు ముందస్తు అనుమతి తీçసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్, హాకాల ఎండీ సురేందర్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారి, మార్క్‌ఫెడ్ పంట ఉత్పత్తుల సేకరణ మేనేజర్ ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఆర్ఐలకు ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ భూములుండి విదేశాల్లో నివసిస్తున్న(ఎన్ఆర్ఐ) పట్టాదారులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సొమ్ము అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి పేరిట ఉన్న చెక్కులను ఎవరికీ ఇవ్వకపోవడంతో వ్యవసాయశాఖ వద్దే ఉండిపోయాయి. ఒకానొక సందర్భంలో విదేశాల్లో ఉన్నవారికి ‘సొమ్ము ఇవ్వడం అవసరమా’అన్న ధోరణిలో వ్యవసాయ శాఖ వర్గాలున్నట్లు ప్రచారం జరిగింది. ఎన్నికల సమయంలో అనవసరంగా వ్యతిరేకత మూటగట్టుకోవడం అవసరమా అన్న భావనతో ఎన్ఆర్ఐలకు చెక్కులు ఇచ్చేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం కూడా నిర్వహించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో దాదాపు 61 వేల మంది ఎన్ఆర్ఐ రైతులకు లబ్ధి కలగనుంది. చనిపోయిన రైతుల పేరుతో ఉన్న చెక్కులు, రాష్ట్రం సహా దేశంలోనే వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పట్టాదారుల చెక్కుల పంపిణీపైనా నిర్ణయం తీసుకోలేదు. కుటుంబసభ్యులకు సొమ్ము... ఈ ఖరీఫ్‌లో 1.43 కోట్ల ఎకరాల భూమి కలిగిన 58.33 లక్షల మంది రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం చెక్కులను ముద్రించింది. అందుకోసం రూ. 5,730 కోట్లు బ్యాంకులకు అందజేసింది. అయితే, ఇప్పటివరకు కేవలం 48 లక్షల మంది రైతులే చెక్కులు తీసుకున్నారు. రూ. 5,100 కోట్లు రైతులకిచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఉన్న 61 వేల మంది పట్టాదారులకు ఇప్పుడు ఎలా ఇవ్వాలన్న దానిపై సర్కారు కసరత్తు చేస్తోంది. అత్యధిక మంది బతుకుదెరువు, వ్యాపార, ఉపాధి, ఉద్యోగాల కోసం గల్ఫ్సహా వివిధ దేశాల్లో ఉంటున్నారు. రైతుబంధు పథకం నిబంధనల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతే స్వయంగా వచ్చి చెక్కు తీసుకోవాలి. ఈ నిబంధన విదేశాల్లో ఉన్న పట్టాదారులకు ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐల డిక్లరేషన్ మేరకు వారి కుటుంబసభ్యులకు చెక్కులిచ్చే అవకాశాలున్నాయి. అయితే, కుటుంబసభ్యులెవరూ ఇక్కడ లేని పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. చనిపోయిన రైతుల పేరుతో 90 వేల చెక్కులు మరో 90 వేల చెక్కులు చనిపోయిన రైతుల పేరుతో ఉన్నాయి. వాటిని సర్దుబాటు చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరోవైపు, రాష్ట్రంలోనూ, దేశంలోనూ వివిధ ప్రాంతాల్లో ఉండే 1.14 లక్షల మంది చెక్కుల అందజేతపైనా మీమాంస కొనసాగుతోంది. చెక్కులను జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో కౌంటర్లు పెట్టి అందజేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పటికీ చెక్కులు జిల్లాల్లోనే ఉన్నాయి. దీంతో గ్రామాలకు వెళ్లడానికి వీలుపడని వారంతా కూడా ఆ చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. -
మళ్లీ యూటర్న్
తెలుగుదేశం ప్రభుత్వం ఆక్వా రైతులను మళ్లీ మోసం చేసింది. ఆక్వా చెరువులకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనతో హడావిడిగా తాను కూడా చార్జీలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబునాయుడు ఆచరణలో అమలు చేయలేదు. తాజాగా జారీచేసిన జీవో ప్రకారం.. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా యూనిట్‌కు రూ.3.86 రైతులు చెల్లిస్తే... తర్వాత మత్స్యశాఖ ద్వారా రూ.1.86 వెనక్కి చెల్లిస్తామని పేర్కొనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఆక్వా సాగు 72,945 హెక్టార్లు ఉండగా 29,922 కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద జరిగే సాగులో 40 శాతం వరకూ జిల్లాలోనే జరుగుతోంది. ఒకప్పుడు డాలర్లు కురిపించిన ఆక్వాసాగు నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. గిట్టుబాటు ధరలు పడిపోవడం, మరోవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడంతో అక్వా రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాలకు ఎగుమతులు తగ్గాయని, కుంటిసాకులు చెబుతూ దళారులు ధరలు తగ్గించి వేయడంతో రైతులు పూర్తిగా నష్టాలలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో మే నెలలో జిల్లాలోని ఉంగుటూరు, ఉండి, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాలలో ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తమ ఇబ్బందులు తీసుకువెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి ఆక్వా చెరువులకు ఉపయోగించే విద్యుత్ చార్జీలను యూనిట్ రూ.3.80 నుంచి రూ.1.50కి, ఆక్వా అనుబంధ పరిశ్రమలకు ఏడు రూపాయల నుంచి రూ.ఐదుకు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే సముద్ర తీర ప్రాంతాల్లో కోల్డ్‌స్టోరేజి, ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతానని, నాలుగో ఏడాది నుంచి ఆక్వాకు మద్దతు ధర ప్రకటిస్తానని ఆయన çహామీ ఇచ్చారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంపై జగన్ సీరియస్‌గా స్పందించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 26న హడావిడిగా సమావేశం ఏర్పాటుచేసి ఆక్వా వ్యాపారులు, రైతులతో చర్చించారు. విద్యుత్ చార్జీలు ఏడాది పాటు రూ.3.80 నుంచి రెండు రూపాయలకు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అయినా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కరెంటు బిల్లులు యూనిట్ రూ.3.80 టారిఫ్‌తోనే వచ్చాయి. ప్రస్తుతం జీవో విడుదల చేస్తూ రైతులు ముందు రూ.3.86 చొప్పున బిల్లులు చెల్లిస్తే తర్వాత రూ.1.86 మత్స్యశాఖ నుంచి ఇప్పిస్తామని అందులో పేర్కొన్నారు. మత్స్యశాఖ ద్వారా చెల్లింపులేంటి? వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటన ప్రకారం 2017–18లో రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తులు రూ. 42,110 కోట్లు కాగా ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి రూ.నాలుగువేల కోట్ల పైగా ఆదాయం వస్తోంది. కానీ 2018–19 బడ్జెట్లో మత్స్యశాఖకు కేటాయింపులు కేవలం రూ. 386 కోట్లు మాత్రమే. ఇవి మత్య్సకారుల సంక్షేమానికి సరిపోవడం లేదు. అటువంటప్పుడు మత్స్యశాఖ ద్వారా చెల్లిస్తాననడం వంచన అని ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వాలో విద్యుత్ కనెక్షన్లు భూయజమానుల పేరుతో ఉన్నాయి. బిల్లులు చెల్లించేది కౌలు రైతులైతే, భూ యజమానుల ఖాతాల్లో డబ్బులు పడతాయి. 1980 నుంచి తీసుకున్న విద్యుత్ కనెక్షన్‌దారులు అనేక మంది చనిపోయారు. ప్రస్తుతం భూములు వారి వారసుల పేరుతో ఉన్నాయి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో సమస్యాత్మకంగా మారతాయని ఆక్వారైతులు అంటున్నారు. ఆక్వాపై చంద్రబాబు హైడ్రామా ఆక్వా రైతులపై చంద్రబాబు మళ్లీ డ్రామా ఆడుతున్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించామని చెబుతూ రైతుల వద్ద నుంచి పాత బకాయిలు వసూలుకు మార్గం చూసుకున్నారు. ఓవర్‌లోడ్, ఏసీడీల పేరుతో భారీగా బిల్లులు వేసి, వాటిని చెల్లిస్తేనే రాయితీ ఇస్తాననడం సరికాదు. బిల్లు ఏక మొత్తంలో చెల్లించిన తరువాత తగ్గించిన సొమ్ము తిరిగి బ్యాంకు అకౌంట్లో యజమాని పేరున వేస్తాననడం విడ్డూరంగా ఉంది. చెరువులు సాగుచేసే లీజుదారులు లక్షలు వెచ్చించి రొయ్యల సాగు చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల రాయితీల పేరుతో బకాయిలు గుంజడానికే చంద్రబాబు ఎత్తుగడ. జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతులు నష్టాలతో విద్యుత్ బకాయిలు పడ్డారు. తగ్గించిన సొమ్మును మినహాయించుకుని బిల్లు చెల్లించే పద్ధతి తీసుకురావాలి. – వేగేశ్న వెంకట్రాజు (యండగండి శ్రీను), ఆక్వా రైతు, చినకాపవరం రాయితీ పేరుతో భారీ మోసం విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టే ఆక్వా రైతుపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రొయ్యల రైతుల విద్యుత్ బకాయిలు ముక్కుపిండి వసూలు చేసేందుకు విద్యుత్ బిల్లుల రాయితీలు ప్రకటించారు. విద్యుత్ బిల్లులో తగ్గించిన యూనిట్ ధరను యథావిధిగా ఎందుకు వసూలు చేయరు. డొంకదారుల్లో రాయితీలు ఇస్తాననడం చంద్రబాబు వంచన యోచనలో భాగం. యూనిట్‌కు రూ.1.86 పైసలు తగ్గించినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ సొమ్మును బిల్లులోనే తగ్గించి చెల్లించే విధంగా రైతులకు అవకాశం కల్పించాలి. పాత బకాయిల పేరుతో చార్జీలు తగ్గించకపోవడం దారుణం. – గొట్టుముక్కల సూర్యనారాయణరాజు (సూరిబాబు), ఆక్వా రైతు, ఆకివీడు -
దిగుబడికి దెబ్బే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 670 మండలాలకుగాను 394 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఈ ప్రభావం పంట దిగుబడులపై కూడా ఉంటుందని వ్యవసాయ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ.. రెండు సీజన్లలో కలిపి 186.41 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం కాగా అందులో ఒక్క ఖరీఫ్‌లోనే అత్యధికంగా 98.07 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం, అదును తప్పి కురుస్తున్న వర్షాలతో పంటల సాగు గాడి తప్పింది. ఫలితంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. అలాగే, రాష్ట్రంలో చిరుధాన్యాలు, నూనె గింజల పంటల పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయడానికి ఏం చేయాలో అర్ధంకాక వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు తలలుపట్టుకుంటున్నారు. దిగుబడి తగ్గితే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ప్రస్తుతం ఉన్న 30 శాతం వ్యవసాయ రంగం వాటా తగ్గి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆహార సంరక్షణ రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో 16.55 శాతం అధికంగా వృద్ధి సాధించడం సాధ్యమయ్యే పనిగా కనిపించడంలేదు. ప్రధాన పంటల పరిస్థితి ఇలా.. వ్యవసాయ, అనుబంధ రంగాలలో గుర్తించిన 23 అభివృద్ధి సూచికలలో 9 పంటల్ని ఎంపిక చేశారు. వాటిలో వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, ప్రత్తి, చెరకు, పొగాకు ఉన్నాయి. అయితే, వీటిల్లో ప్రస్తుతం ఏ ఒక్క పంట కూడా సరిగ్గాలేదు. 2018–19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 186.41 లక్షల మెట్రిక్ టన్నులు. గత ఏడాదితో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. వరిలో 14 శాతం, మొక్కజొన్నలో 15 శాతం, అపరాలలో 33 శాతం, నూనె? గింజల్లో 30 శాతం పెరుగుదల నమోదు చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికే రాయలసీమలో ప్రధాన పంట అయిన వేరుశనగ గాడి తప్పింది. ఇప్పటికే తొలిదశలో పంట దెబ్బతింది. ప్రస్తుత ఖరీఫ్‌లో వేరుశనగ దిగుబడిని 10.28 లక్షల టన్నులుగా అంచనా వేసినా అది ఇప్పుడు 2–3 లక్షల టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు. భారీగా తగ్గనున్న దిగుబడి ఇదిలా ఉంటే.. ఖరీఫ్‌లో మొత్తం 98.07 లక్షల టన్నుల దిగుబడి లక్ష్యం కాగా.. ప్రస్తుత అంచనాల ప్రకారం దాదాపు 20 లక్షల టన్నులకు పైగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాధార పంటలు సాగుచేసే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పంట ఉత్పత్తులు చేతికి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇక్కడ వర్షాభావంతో వేసిన పంటలు వేసినట్టే ఎండిపోతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా యావత్తు తీవ్ర లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. తుపానో, వాయుగుండమో వస్తే తప్ప ఇక్కడి పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశంలేదు. రాయలసీమలో ప్రధాన ఖరీఫ్ పంట వేరుశనగను సుమారు 9.25 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉంటే అధికారిక లెక్కల ప్రకారమే 6.60 లక్షల హెక్టార్లలో విత్తనాలు పడ్డాయి. అయితే, ఈ పంటలో మూడొంతులు వాడు ముఖం పట్టింది. ఫలితంగా దిగుబడి లక్ష్యం 10.28 లక్షల మెట్రిక్ టన్నులు నెరవేరే సూచనలు కనిపించడంలేదు. అపరాలదీ అదే పరిస్థితి. వరి సాగు విస్తీర్ణం కూడా లక్ష్యానికి దూరంగానే ఉంది. వరి పంట చేతికి రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నందున దిగుబడులు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. దేశంలో 7.3మిలియన్ టన్నుల అధిక దిగుబడి గత ఏడాది కంటే ఈ ఏడాది దేశంలో ఆహార ధాన్యాల దిగుబడి 284.80 మిలియన్ టన్నులకు చేరే అవకాశముందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఏడాది కంటే ఇది 7.3 మిలియన్ టన్నులు ఎక్కువని కేంద్రం చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వరుస కరువులతో రైతులు అల్లాడుతున్నారు. దిగుబడులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు. దేశంలో చిరు ధాన్యాల ఉత్పత్తి గత ఏడాది కంటే 7.3 శాతం, అపరాలు 9 శాతం పెరిగితే రాష్ట్రంలో ఈ పంటలు సైతం తిరోగమనంలో ఉండడం గమనార్హం. -
రైతుల పోరుపై ఉక్కుపాదం
తుళ్లూరు రూరల్/సాక్షి, అమరావతి: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం రాజధాని ప్రాంత రైతులు సోమవారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ చెక్పాయింట్లు ఏర్పాటుచేసి.. భారీఎత్తున మొహరించిన పోలీసులు రైతులను, నాయకులను అదుపులోకి తీసుకుని ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. అంతకుముందు.. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు రైతులు, లంక భూముల సొసైటీల అధ్యక్షులకు నోటీసులు ఇచ్చి నిర్బంధకాండ కొనసాగించారు. తుళ్లూరు మండలాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకు తరలివచ్చే అవకాశం ఉన్న రైతులందరినీ రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీకి రావద్దని.. అలాగే పెద్ద నాయకులందరూ ఇంటికే పరిమితం కావాలని హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు.. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సచివాలయం చుట్టూ ఆరు చెక్ పాయింట్లు పెట్టారు. మల్కాపురం మలుపు వద్ద మందడం జెడ్పీ ఉన్నత పాఠశాల వెనుక నుంచి సచివాలయానికి చేరుకునే ప్రధాన రహదారిపై ఒకేచోట మూడు చెక్ పాయింట్లు ఏర్పాటుచేశారు. వేర్వేరుచోట్ల నేతలు అదుపులోకి.. ఇదిలా ఉంటే.. ‘చలో అసెంబ్లీ’కి రైతులందరూ తరలివస్తున్నారని భావించిన వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. వీరందరినీ వేర్వేరు చోట్ల పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11గంటలకు సీపీఐకి చెందిన మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, సీఆర్డీయే ఏఐటీయూసీ కార్యదర్శి జీవీ రాజు, సీపీఎం సీఆర్డీయే కార్యదర్శి ఎం. రవి, జిల్లా రైతు విభాగం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌లను మందడంలో అదుపులోకి తీసుకున్నారు. ఐనవోలు వద్ద లింగాయపాలేనికి చెందిన రైతు నాయకుడు అనుమోలు గాంధీతోపాటు మరో న్యాయవాదిని 11.30గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో బాపట్ల వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్‌తోపాటు పార్టీ తుళ్లూరు మండల నేత చలివేంద్రం సురేష్‌ను మందడంలో అరెస్టుచేసి పెదకూరపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అలాగే, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు శృంగారపాటి సందీప్, లంక రైతు పులి ప్రకాష్‌లను తెల్లవారుజామున 6 గంటలకు అదుపులోకి తీసుకుని తుళ్లూరు స్టేషన్‌కు తరలించారు. తాడికొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చిలకా విజయ్ను ఉ.6గంటలకు గృహనిర్బంధం చేశారు. వెంకటపాలెంలో జనసేన నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరందరినీ సాయంత్రం అయిదు గంటలకు విడుదల చేశారు. తుళ్లూరు పోలీసుస్టేషన్లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, రాజధాని రైతులను తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టీనా పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. రైతుల డిమాండ్లు ఇవీ.. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో ఎక్కువ శాతం భూములు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ అసైన్డ్, లంక భూములను సాగుచేసుకుంటున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని రైతుల ప్రధాన ఆరోపణ. లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో లంక భూములు దాదాపు 1600 ఎకరాల వరకు ఉంటాయి. ఈ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు చట్ట ప్రకారం ప్యాకేజ్ ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా అధికారులకు, మంత్రులకు తమ సమస్యలను విన్నవించినా ఫలితం లేకపోవడంతో చివరి అస్త్రంగా రైతులు సోమవారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జరీబు ప్యాకేజీ ఇవ్వాలి : వైఎస్సార్సీపీ ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో దళితులకు అన్యాయం జరుగుతోందని, ప్యాకేజీ విషయంలో వివక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. రాజధానిలో 29 గ్రామాల్లో సాగు చేసుకునే ఐదు వేల ఎకరాల భూములను జీవో నంబర్ 259 ప్రకారం మాత్రమే తీసుకోవాలని, అందరికీ జరీబు ప్యాకేజ్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోతున్న వారికి తగిన పరిహారాన్ని అందజేయాలన్నారు. అక్రమ అరెస్టులపై వామపక్షాల ఖండన రాజధాని ప్రాంతంలో శాంతియుతంగా ఆందోళన చేయడానికి ప్రయత్నించిన వారిని అక్రమంగా అదుపులోకి.. అరెస్టులు చేయడాన్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి. మధు, కె. రామకృష్ణ సోమవారం ఖండించారు. అసైన్డ్ రైతులను, వారికి సంఘీభావంగా వెళ్లిన వివిధ పార్టీల నాయకులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. అసైన్డ్, లంక భూముల రైతులకు ఇతర రైతులతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు సామాజిక పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. -
అమరావతిలో అసైన్డ్ భూముల రైతులు విడుదల
-
రాజధానిలో ‘భూ’మంతర్
రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములు: 2,028 ఎకరాలు లంక, శివామ్ జమీందార్ భూములు: 2,284 ఎకరాలు ఎకరం అసైన్డ్ జరీబు భూమి విలువ: దాదాపు రూ.2.28 కోట్లు ఎకరం అసైన్డ్ మెట్ట భూమి విలువ: దాదాపు రూ.2.02 కోట్లు సాక్షి, తుళ్లూరు: రాష్ట్ర రాజధాని అమరావతిలో పేద దళిత, గిరిజన రైతులను ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు దారుణంగా వంచించారు. భూసమీకరణ కింద పరిహారం రాదంటూ మభ్యపెట్టి అసైన్ట్ భూములను కారుచౌకగా కొట్టేశారు. వాటిని భూసమీకరణలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి, పరిహారం కింద నివాస, వాణిజ్య స్థలాలు సొంతం చేసుకున్నారు. అమాయక దళిత, గిరిజనుల భూములను లాక్కోవడానికి భూబకాసురులు సాగించిన కుట్రలు, కుతంత్రాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. రాజధాని నిర్మాణం పేరుతో తెలుగుదేశం సర్కారు మోసపూరితంగా వ్యవహరించింది. అమరావతి ప్రాంతంలో రాజధాని నగరాన్ని నిర్మిస్తారనే ప్రకటన వచ్చాక ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతల కన్ను పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములపై పడింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని 29 గ్రామాల్లో అసైన్డ్, లంక, శివాయ్ జమీందార్ భూములు 4,312 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 2,028 ఎకరాలు అసైన్డ్, మరో 2,284 ఎకరాలు లంక, శివాయ్ జమీందార్ భూములు. వీటిని 1954, 1971, 1976, 2005 సంవత్సరాల్లో భూమిలేని నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం పంచి పెట్టింది. రాజధాని ప్రకటన వెలువడగానే ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వివరాలను ప్రభుత్వ పెద్దలు తెప్పించుకున్నారు. అందులో నవులూరు, కురగల్లు, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, ఐనవోలు, తుళ్లూరు, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అనంతవరం, మందడం, వెంకటపాలెం, నెక్కల్లు, నేలపాడు గ్రామాల్లోని ప్రభుత్వ భూములను టార్గెట్ చేశారు. వీటి అనుభవదారుల వివరాలు తీసుకుని రంగంలోకి దిగారు. బినామీలతో తప్పుడు ప్రచారం అసైన్డ్ భూములను గతంలో ప్రభుత్వాలే ఇచ్చాయి కాబట్టి వాటిని భూసమీకరణ కింద సీఆర్డీఏ వెనక్కి తీసుకుని పైసా కూడా పరిహారం ఇవ్వదు అంటూ టీడీపీ నాయకులు, మంత్రులు తమ బినామీలతో ప్రచారం చేయించారు. ఇప్పుడు అమ్ముకుంటే ఎంతో కొంత సొమ్ము వస్తుందంటూ అసైన్డ్ భూముల అనుభవదారులను మాటలతో వంచించారు. అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదంటూ సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు కూడా వంతపాడారు. దీంతో భయాందోళనకు గురైన అసైన్డ్ రైతులు తమ భూములను నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసి ఇచ్చేశారు. ఆ వెంటనే సీఆర్డీఏ అధికారులు అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించారు. తక్కువ ధరకు పేదల నుంచి భూములను కొట్టేసిన బడాబాబులు వాటిని ప్రభుత్వానికి ఇచ్చి, భారీగా పరిహారం జేబులో వేసుకున్నారు. అసైన్డ్ రైతులకు తీరని అన్యాయం అధికార పార్టీ నేతలు అసైన్డ్ రైతులను బెదరగొట్టి ఎకరా భూమికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల్లోపే చెల్లించారు. ప్రభుత్వం ప్రకటించిన అసైన్డ్ భూముల ప్యాకేజీ ప్రకారం.. ఎకరానికి 500 గజాల చొప్పున నివాస స్థలం, 100 గజాల చొప్పున వాణిజ్య స్థలం దక్కించుకున్నారు. నివాస స్థలం గజం విలువ రూ.22,000, వాణిజ్య స్థలం రూ.26,000 పలుకుతోంది. దాని ప్రకారం 500 గజాల విలువ రూ.1.10 కోట్లు. 100 గజాల వాణిజ్య స్థలం విలువ రూ.26 లక్షలు. అంటే ఎకరానికి రూ.1.36 కోట్ల విలువ ఉంది. అసైన్డ్ రైతులే తమ భూములను నేరుగా ప్రభుత్వానికి ఇచ్చి ఉంటే జరీబు ప్యాకేజీ ప్రకారం.. 800 గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం దక్కేది. 800 గజాల నివాస స్థలం విలువ రూ.1.76 కోట్లు, 200 గజాల వాణిజ్య స్థలం విలువ రూ.52 లక్షలు. అంటే ఎకరం భూమిని కారుచౌకగా ప్రభుత్వ పెద్దలకు విక్రయించడం వల్ల అసైన్డ్ రైతు రూ.2.28 కోట్లు నష్టపోయినట్లు లెక్క. మెట్ట భూమి ప్యాకేజీ ప్రకారం.. 800 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం ఇస్తారు. ఈ లెక్కన ఎకరం మెట్ట భూమి విలువ రూ.2.02 కోట్లు. జరీబు రైతులకు రూ.50 వేలు, మెట్ట రైతులకు రూ.30 వేల చొప్పున పదేళ్లపాటు ప్రభుత్వం నుంచి పరిహారం ఆందుతుంది. ఈ పరిహారాన్ని కూడా అసైన్డ్ రైతులు కోల్పోయారు. మా భూములు మాకిప్పించండి ‘‘రాష్ట్ర మంత్రులు, అధికార టీడీపీ నాయకులు తమ బినామీలను గ్రామాల్లోకి పంపించి.. అసైన్డ్ భూములకు పరిహారం రాదు, వీటిని తీసేసుకుంటుంది, కొనేవాళ్లు దొరికితే ఇప్పుడే అమ్మేసుకోండి అంటూ పుకార్లు పుట్టించారు. అధికారులు కూడా ఇవే మాటలు చెప్పారు. దీంతో భయపడి ఎకరా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకే అమ్మేసుకున్నాం. ఇప్పుడు ఆ భూములు రూ.కోట్లు పలుకుతున్నాయి. ప్రభుత్వం మా భూములను మాకు ఇప్పించి న్యాయం చేయాలి’’ – పొన్నూరి నాగేశ్వరరావు, అసైన్డ్ రైతు, ఉద్ధండ్రాయునిపాలెం చట్టం.. మాకు చుట్టమే! చట్టం ప్రకారం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ఇతరులెవరూ కొనుగోలు చేయకూడదు. ఎవరైనా కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఆయా భూములను తొలుత కేటాయించిన పేదలు ఉంటే వారికి ఇవ్వాలి. వారు లేకపోతే ఇతర పేద కుటుంబాలకు పంపిణీ చేయాలి. అయితే, అధికార పార్టీ నాయకులు చట్టాన్ని సైతం లెక్కచేయలేదు. అసైన్డ్ రైతులను భయపెట్టి భూములను లాగేసుకున్నారు. ఇదంతా బహిరంగంగానే జరిగినా అదేమిటని అడిగే నాథుడే లేకుండాపోయాడు. -
మద్దతు దక్కేలా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీ ఐ) ఏర్పాట్లు చేస్తోంది. పత్తికి మద్దతు ధర కల్పించడానికి సీసీఐ ప్రత్యేక కేంద్రాలు నెలకొల్పేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా జిన్నింగ్ మిల్లుల్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. గతేడాది ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే ఈ సారి కూడా కొనుగోలు కేంద్రాలు తెరుచుకోనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 68 వేల హెక్టార్లలో సుమారు లక్ష మందికిపైగా రైతులు పత్తి సాగు చేశారు. సుమారు 12 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారుల అంచనా ప్రస్తుతం పత్తి వివిధ దశల్లో ఉంది. మాడ్గుల, కొందర్గు, చౌదరిగూడ తదితర ప్రాంతాల్లో పూత దశకు చేరుకుంది. వర్షానికి వర్షానికి మధ్య చాలా రోజుల విరామం ఉండడంతో మొక్కల్లో ఎదుగుదల లోపించింది. దీనికితోడు పోషకాల లేమి కూడా ఎదురైంది. దీంతో పూర్తిస్థాయిలో పూత దశకు చేరుకోలేదు. నవంబర్ రెండో వారం నుంచి పత్తి దిగుబడి మొదలవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ లోగా అంటే న వంబర్ ఒకటి కల్లా కొనుగోలు కేం ద్రాలు తెరచాలన్న యోచనలో సీసీఐ ప్రతిని ధులు ఉన్నారు. గతేడాది వరకు దిగుబడి ప్రారంభ దశలో సీసీఐ కేంద్రాలు తెరచుకోలేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోయారు. వారు నిర్ణయించిందే ధరగా రైతు లు అమ్ముకున్నారు. ఈసారి ఇటువంటి పరిస్థితి రాకుండా దిగుబడి ఆరంభానికి ముందే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైతుకు ‘మద్దతు’.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పత్తి మద్దతు ధరను పెంచిన విషయం తెలిసిందే. గతేడాది వరకు క్వింటా పత్తి రూ.4,320 ఉండగా దీన్ని తాజాగా రూ.5,450కు పెంచడం విశేషం. ఈ పెంపు రైతులకు ఊరట కలిగించే అంశం. రైతులు పత్తిని వ్యాపారులకు కాకుండా సీసీఐ కేంద్రాల్లోనే విక్రయిస్తే మేలు జరుగుతుంది. ఈ మేరకు త్వరలో రైతులకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది రైతుల పేరిట వ్యాపారులు సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రైతుల నుంచి వివిధ సాకులతో తక్కువ ధరకు పత్తిని వ్యాపారులు సేకరించారు. ఆ తర్వాత సీసీఐ కేంద్రాల్లో అమ్మి మద్దతు ధరకు కాస్త అటుఇటుగా లాభపడ్డారు. అయితే రైతుల సమగ్ర వివరాలతో రూపొందించిన క్యూఆర్ బార్ కోడ్ కార్డులు రైతులకు ఆలస్యంగా అందజేయడంతో పెద్దగా వారికి ఒరిగిందేమీ లేదు. గతేడాది అందజేసిన క్యూర్ బార్ కోడ్ కార్డుల ద్వారానే రైతుల నుంచి సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 80 వేల మంది రైతుల వద్ద ఆ కార్డులు ఉన్నాయి. ఐదేళ్లపాటు ఈ కార్డులు మనుగడలో ఉంటాయని జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాయదేవి తెలిపారు. కార్డులు లేని రైతులు ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, వ్యవసాయ అధికారుల ఇచ్చే ధ్రువీకరణ పత్రం ఆధారంగా పత్తిని విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. -
ప్రైవేటు దోపిడీ
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: సాగర్ కుడి కాలువ కింద నీటిని విడుదల చేస్తున్న ప్రభుత్వం రైతులకు వరి విత్తనాలను సరఫరా చేయకపోవడంతో విత్తనాల కోసం బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. రైతులు ఏ రకం విత్తనాలు సాగు చేయాలో సూచించిన ప్రభుత్వం వాటిని అందుబాటులోకి తీసుకురాలేదు. ఇదే అదనుగా వ్యాపారులు విత్తనాల ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 25 కేజీల బస్తా విత్తనాలపై రూ.800 నుంచి రూ.1500 వరకు పెంచారు. దీంతో రైతులకు విత్తన కొనుగోల్లు భారంగా మారాయి. ఈ ధరలకు పేదరైతులు విత్తనాలు కొనలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, విత్తన వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిలువునా ముంచుతున్నారని, ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఎన్‌ఎల్‌ఆర్ 145 ఇవ్వని ప్రభుత్వం.. సాగర్ కుడికాలువ పరిధిలో ప్రకాశం జిల్లాలో 1.85 లక్షల ఎకరాల్లో వరిసాగు కానుంది. కొమ్మమూరు కెనాల్ పరిధిలో 72,800 ఎకరాలు ఉండగా గుండ్లకమ్మతో పాటు చెరువుల పరిధిలోని ఆయకట్టుతో కలుపుకుంటే మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. తొందరగా దిగుబడి ఇచ్చే వరి రకాలను సాగు చేయాలని ఇప్పటికే వ్యవసాయ అధికారులు సూచించారు. ప్రధానంగా ఎన్‌ఎల్‌ఆర్ 34449 తోపాటు ఎన్‌ఎల్‌ఆర్ 145 రకాలను సాగు చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వమే ఏపీ సీడ్స్ ద్వారా వరి విత్తనాలు సరఫరా చేస్తుందని అధికారులు ప్రకటించారు. అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం సాగవనున్న విస్తీర్ణానికి 80 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం. ఏపీ సీడ్స్ వద్ద మూడు వేల క్వింటాళ్ల ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకం విత్తనాలు మాత్రమే ఉన్నాయి. జిల్లా రైతాంగం దాదాపు 50 శాత విస్తీర్ణంలో ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం వరి సాగుచేస్తారు. ఈ రకం తక్కువ నీటితో పండించుకోవచ్చు. పైపెచ్చు 130 రోజుల్లోనే పంటకాలం ఉంటుంది. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో వినియోగిస్తుంది . దీంతో రైతులు సులభంగానే మద్దతు ధరతో ధాన్యాన్ని అమ్ముకొనే వెసులు బాటు ఉంటుంది. అందుకే రైతులు ఈ రకం వరి విత్తనాలకోసం ఎదురు చూస్తుంటారు. కానీ ప్రభుత్వం ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకరాలేదు. ఎన్‌ఎల్‌ఆర్ 34449 విత్తనాలను.. అది కూడా 80 వేల క్వింటాళ్లు అవసరమైతే మూడు వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ విత్తనాలు 12 వేల ఎకరాలకు మాత్రమే సరిపోతాయి. దీంతో రైతులు రెండు రకాల విత్తనాలకోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అందుబాటులో లేని ఎన్‌ఎల్‌ఆర్ రకం.. ప్రభుత్వం ఏపీ సీడ్స్ ద్వారా తగినన్ని విత్తనాలు సరఫరా చేయకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలు అధిక రేట్లకు కొనాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం సరఫరా చేస్తున్న ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకం విత్తనాలు (25 కిలోల బస్తా) కిలో రూ.28.15 ప్రకారం రూ.703.75గా ఉంది. ప్రభుత్వం కిలోకు రూ.5 సబ్సీడీ ఇస్తోంది. సబ్సీడీ పోను రైతు రూ.588.75 చెల్లించాలి. కానీ ఇవే ఇత్తనాలు బయట మార్కెట్లో రూ. 1300 అమ్ముతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో రైతు అదనంగా రూ.711.25 చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు 50 శాతం రైతులు సాగు చేసే ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. దీంతో రైతుల ఈ రకం విత్తనాలను ప్రైవేటు వ్యాపారుల వద్ద అధికధరలు వెచ్చించి కొనాల్సి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం 30 కిలోల బస్తా రూ.2 వేల నుంచి 2200 వరకూ అమ్ముతున్నారు. ఇది రైతులు కొనలేని ధర. ఒకరకంగా చెప్పాలంటే వ్యాపారులు అవకాశం చూసుకొని దోపిడీ చేస్తున్నట్లే. ఒక పక్క ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనాలు అధికంగా సాగుచేయాలని సూచిస్తున్న వ్యవసాయాధికారులు విత్తనాలను మాత్రం సరఫరా చేయకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలతో పాటు కొందరు అధికారులు సీడ్ వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వం ద్వారా విత్తనాలు సరఫరా చేయడం లేదన్న విమర్శలున్నాయి. దీని వెనుక రూ.కోట్లలో చేతులు మారినట్లు ప్రచారం సాగుతోంది. నాలుగేళ్లుగా జిల్లాలో కరువు తాండవిస్తోంది. పశ్చిమ ప్రకాశం తో పాటు తూర్పు ప్రాంతంలోనూ పంటలులేవు. దీంతో రైతాంగం కుదేలయింది. ఈ పరిస్థితిలో ఈ ఏడాది సాగర్ నీళ్లు వస్తున్నాయి. కనీసం ఇప్పుడైనా ఒక పండించుకుందామంటే కొనలేని పరిస్థితిలో విత్తనాల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రైవేటు దోపిడీని అరికట్టాల్సి ప్రభుత్వం వ్యాపారులకు కొమ్ముకాయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వ్యాపారుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు వరి విత్తనాలను సరఫరా చేయాలి. -
రాజధానికి భూములు ఇవ్వలేదని.. ప్రభుత్వం కక్ష సాధింపు
-
రాజధానికి భూములు ఇవ్వలేదని..
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణంలో భూములు ఇవ్వని రైతులపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు రైతులను ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేయాలో అన్నిరకాలుగా చేస్తున్నారు. తాజాగా పొలాలకు వెళ్లే వాటర్ పైపులను అధికారులు పగలగొట్టారు. దీనిపై వివరణ అడిగితే.. నిడమర్రు ఈ16 నిర్మాణం కోసమే వాటర్ పైపులు పగలగొట్టామని అధికారులు కాకమ్మకబుర్లు చెబుతున్నారు. కానీ రెండు రోజులుగా నీరు వృథాగా పోతున్నాయి. కొద్ది రోజుల క్రితమే వాటర్‌పైపులు పగల కొట్టవద్దంటూ స్థానిక రైతులు వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ అధికారులు మొండి వైఖరితో వారు అనుకున్న పని చేశారని రైతులు మండిపడ్డారు. తమ పొలాలకు నీరు వచ్చే మార్గం అదొక్కటేనని, ఇప్పుడు అధికారులు ఇలా చేయడంతో పొలాలు ఎండిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేపట్టారు. పగల కొట్టిన పైపులకు మరమ్మత్తులు చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. -
అనుమతి లేని నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: ఆగ్రోస్‌లో టార్పాలిన్ల విక్రయాలపై దుమారం చెలరేగుతోంది. సర్కారు నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా టార్పాలిన్లను సబ్సిడీపై రైతులకు సరఫరా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సబ్సిడీని నిర్ణయించడంలో కానీ, వాటి ని రైతులకు సరఫరా చేసే అంశంపైకానీ ఏదీ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదని తెలుస్తోంది. దీంతో రైతులకు ఇచ్చిన సబ్సిడీని ఎవరు చెల్లించాలి, దీనికి ఎవరు బాధ్యులన్నది చర్చనీయాంశమవుతోంది. సరఫరా కంపెనీలతో కొందరు కుమ్మక్కు కావడం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. టార్పాలిన్ల విలువ రూ. 5.4 కోట్లు... ఈ ఏడాది రైతులకు రూ.5.4 కోట్ల విలువైన టార్పాలిన్లను సబ్సిడీపై సరఫరా చేయాలని ఆగ్రోస్‌లో కొందరు నిర్ణయానికి వచ్చారు. వచ్చిందే తడవుగా జాబితాల్లో ఉన్న కంపెనీలతో మాట్లాడారు. సాధారణంగా బయట ఒక్కో టార్పాలిన్ ధర రూ. 2,500 కాగా, ఆగ్రోస్ ద్వారా రూ. 2,350కే రైతులకు ఇవ్వాలనుకున్నారు. అంటే బయటకంటే రూ. 150 తక్కువకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందులో రైతులకు సగం సబ్సిడీ ఇచ్చారు. అంటే వారికి రూ. 1175కు ఒక్కో టార్పాలిన్‌ను విక్రయించారు. మిగిలి న సగం ప్రభుత్వం భరించాలన్నమాట. ఈ వ్యవహా రానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదు. అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నాక, వ్యవసాయశాఖకు చెందిన మండల ఏవోల ద్వారా వాటిని రైతులకు విక్రయించారు. రైతుల వాటా సొమ్ము రూ. 2.70 కోట్లు కంపెనీలకు చెల్లించారు. ప్రభుత్వ వాటాగా మరో రూ. 2.70 కోట్లు కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో ఆ సొమ్మును చెల్లింపులపై ఇప్పుడు ఆగ్రోస్‌లో అంతర్మథనం మొదలైంది. అలాగనీ ఆగ్రోస్ భరించే స్థితిలో లేదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి కోరినా లభించే అవకాశాలు లేవు.దీంతో ఆగ్రో చిక్కుల్లో పడింది. అవును నిజమే: ఆగ్రోస్ ఎండీ ఈ విషయంపై ప్రస్తుత ఆగ్రోస్ ఎండీ సురేందర్‌ను వివరణ కోరగా, అనుమతి లేకుండా టార్పాలిన్లు విక్రయించిన మాట వాస్తవమేనని స్పష్టంచేశారు. తాను ఇటీవలే ఆగ్రోస్ బాధ్యతలు తీసుకున్నానని, తనకు పూర్తి వివరాలు తెలియవన్నారు. -
దళితుల భూపంపిణీకి ఎన్నికల జోష్
సాక్షి, హైదరాబాద్: దళితుల భూపంపిణీ పథకంపై ఎన్నికల ప్రభావం పడింది. రెండేళ్లుగా ఈ పథకానికి కేటాయింపులు తగ్గుతున్న క్రమంలో ఈసారి అతి తక్కువ లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో కేవలం 159 మంది లబ్ధిదారులకు భూపంపిణీ చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇందుకుగాను రూ.4.06 కోట్లు అవసరమని ప్రణాళికలో పేర్కొంటూ ప్రభుత్వానికి సమర్పించారు. కానీ, అనూహ్యంగా ఎన్నికల సీజన్ వచ్చిన దళితుల భూపంపిణీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 1,900 మంది రైతులకు భూపంపిణీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి రూ.407.32 కోట్లు కేటాయించింది. ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళికను ఆమోదిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భూమి ఎక్కడ ? గతంలో ఎన్నడూ లేనంత పెద్దమొత్తంలో ప్రభుత్వం దళితుల భూపంపిణీకి నిధులు కేటాయించినప్పటికీ, లక్ష్య సాధన సులువు కాదనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్థి రంగం పుంజుకుంది. దీంతో భూముల ధరలు పెరిగిపోయాయి. ప్రాజెక్టులు, కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం సేకరిస్తున్న భూమికి ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దళితుల భూపంపిణీ పథకానికి ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేయడం ఎస్సీ కార్పొరేషన్‌కు కష్టంగా మారింది. అన్ని వసతులతోపాటు సాగుకు యోగ్యమైన భూమినే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. ఎకరాకు రూ.7లక్షలు మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మొత్తంతో భూమి కొనుగోలు చేయడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. గత మూడేళ్లుగా నిర్దేశించిన లక్ష్యం తాలూకు సాధనే కష్టమైందని ఒక అధికారి ‘సాక్షి’తో అన్నారు. -
మొక్కజొన్న గజగజ
సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి ఉధృతమైంది. మొదట్లో సిద్దిపేట, మెదక్ జిల్లాలకే పరిమితమైన కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వార్మ్) ఆ తర్వాత గత వారంలో 8 జిల్లాలకు విస్తరించింది. ఇప్పుడు ఏకంగా 17 జిల్లాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపింది. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, గద్వాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని మొక్కజొన్న పంటపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని నివేదిక తెలిపింది. అలాగే పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి విస్తరించింది. గత వారం వ్యవసాయ శాఖ వర్గాల లెక్కల ప్రకారం మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే కనిపించిన గులాబీరంగు పురుగు, ఇప్పుడు ఏకంగా మరో 12 జిల్లాలకు విస్తరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, ఖమ్మం, భద్రాద్రి, నల్లగొండ, ఆసిఫాబాద్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోనూ కనిపించింది. మొక్కజొన్నపై కత్తెర, పత్తిపై గులాబీ పురుగు దాడి చేస్తున్నా చర్యలు చేపట్టడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. కోటి ఎకరాల్లో పంటల సాగు... ఖరీఫ్ సాగు గణనీయంగా పెరిగింది. ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికి 1.01 కోట్ల ఎకరాలకు అంటే 93 శాతానికి చేరింది. అందులో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 44.71 లక్షల (106%) ఎకరాల్లో సాగైంది. ఖరీఫ్ ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 49.06 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 45.91 లక్షల(94%) ఎకరాల్లో సాగయ్యాయి. ఆహార పంటల్లో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.11 లక్షల (102%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇటీవలి వర్షాలతో వరి నాట్లు సాధారణం కంటే గణనీయంగా పుంజుకున్నాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 11.48 లక్షల (86%) ఎకరాల్లో సాగైంది. కంది 97%, పెసర 72% సాగయ్యాయి. పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఏదీ? ఇటీవల కురిసిన వర్షాలకు అనేకచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అనేక జిల్లాల్లో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇవిగాక పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. పంట నష్టం ఇంత పెద్ద ఎత్తున ఉన్నా వ్యవసాయశాఖ కేవలం ప్రాథమిక నివేదిక వరకే పరిమితమైంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక పంపించలేదని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. కనీసం ప్రాథమిక నివేదిక కూడా తమకు చేరలేదని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 614.5 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, ఇప్పటివరకు 584.1 ఎంఎంలు నమోదైంది. జూన్ నెలలో 14 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 30 శాతం లోటు నమోదైంది. ఆగస్టులో 18 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు ఈ ఐదు రోజుల్లో 74 శాతం లోటు నమోదైంది. ఇటీవల భారీగా వర్షాలు కురిసినప్పటికీ ఇప్పటికీ 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ, నాగర్‌కర్నూలు, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో లోటు నమోదైంది. -
ఎరువు.. బరువు
సాక్షి భూపాలపల్లి: ఇప్పటికే విపరీతమైప ఒడిదుడుకుల మధ్య సేద్యం సాగుతోంది. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కుదేలైన అన్నదాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మరోవైపు గులాబీ రంగు పురుగు, కత్తెర పురుగు వంటి చీడపీడల ఉధృతికి వ్యవసా యం భారంగా మారుతోంది. దీనికి తోడు ప్రస్తుతం పెరిగి న ఎరువుల ధరలు అన్నదాతకు మరింత భారంగా పరిణమించాయి. ప్రభుత్వం పంపిణీ చేసే యూరియా మినహాయించి మిగతా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులపై రూ.50 నుంచి 100 వరకు ధరలు పెరిగాయి. రైతుకు ఎకరాకు ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి సాయం రూ.4000లకు మించి వ్యయం అవుతోంది. పెరుగుతున్న పెట్టుబడి వ్యయం జిల్లాలో రైతుల పరిస్థితి అంత బాగోలేదు. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు, కొత్తగా మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు రూపంలో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని అదుపు చేయడానికే రసాయ న మందులను పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి అదనంగా రెండు నుంచి మూడు వేల రూపాలయల ఖర్చు అవుతోం ది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పంటల చేలల్లో వర్షపునీరు నిలవడంతో మొక్కల ఎదుగుదల లోపించింది. వారం రోజులుగా వర్షాలు తెరిపినివ్వడంతో వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు ఎరువులు వేస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం మరో మారు ఎరువుల ధరలు పెరిగాయి. ఐదు నెలల్లో పెరగడం ఇది మూడోసారి. దీంతో వ్య యం కాస్త ఎకరానికి మరో వెయ్యిరూపాయలు పెరగనుంది. మున్ముందు కాలం ఎట్లుంటుందో తెలియదు. దిగుబడి ఏమేరకు వస్తదో.. ధర ఎట్టుంటదో.. ఇప్పుడు మాత్రం పెట్టుబడి ఎక్కువైతాంది.. అంటూ చాలామంది రైతులు వాపోతున్నారు. అధికమైన ఎరువుల వినియోగం రెండు వారాల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంట పొలాల్లో ఎరువులు చల్లుతూ రైతులు బీజీగా ఉన్నారు. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంట పండిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆశించిన విధంగా పత్తి, ఇతర పంటల్లో ఎదుగుదల లోపించింది. మొక్కల పెరుగుదల కోసం ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 85,000 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలో వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం అన్ని పంటకు కలిపి దాదాపు 85,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. ఎక్కువగా పత్తి, వరి పంటలు సాగుచేస్తుండడంతో రైతులు యూరియా, డీఏపీ, 20–20 ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల్లో డీఏపీ, 20–20 కూడా ఉన్నాయి. డీఏపీ ప్రతి బస్తాపై రూ.180, 20–20 బస్తాపై రూ.100 పెరిగింది. ప్రభుత్వం యూరియా బస్తాను 5 కిలోలు తగ్గించినా ధర రూ.290 దగ్గరే ఉంచింది. డీపీపీ బస్తా ధర మొదట్లో రూ.1081 ఉండగా తాజాగా 1,330కి పెరిగింది. అయితే ఇందులో జింక్, వేప æకలిపిన డీపీపీతోపాటు సాధరణ డీఏపీలను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. దీంతో ఏవి కొనుగోలు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణ డీఏపీ రూ.1,290, కోటెడ్ డీఏపీ పేరిట బస్తాకు రూ.40 నుంచి రూ.50 అదనంగా తీసుకుంటున్నారు. -
ఢిల్లీలో కదం తొక్కిన రైతు,కార్మిక సంఘాలు
-
రైతు సొమ్ము.. రాబందుల పాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు సొమ్ముపై రాబందుల కన్ను పడింది. రైతులకు పెట్టుబడి కింద ఇస్తున్న సొమ్మును కొన్నిచోట్ల అక్రమార్కులు కాజేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో పెట్టుబడి మొత్తాన్ని స్వాహా ఘటన వెలుగు చూడటంతో సర్కారు ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఎంతో పకడ్బందీగా పెట్టుబడి చెక్కులను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అక్రమాలు జరగడం ఆగలేదు. ఇందులో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు కీలక సూత్రధారులుగా ఉన్నట్లు తెలిసింది. దీంతో సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. పెట్టుబడి సొమ్మును బ్యాంకు, రెవెన్యూ అధికారులతోపాటు బయటి వ్యక్తులు అక్రమంగా కొట్టేసినట్లు ప్రాథమిక విచారణలో ఈ మేరకు వెల్లడైంది. సుమారు రూ.70 లక్షలు కాజేసినట్లు నిర్ధారణ అయింది. వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం కూ డా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయా అన్న కోణంలోనూ ప్రభుత్వం దృష్టి సారించింది. మిగిలిన చెక్కులు 7.7 లక్షలు గత మేలో ప్రభుత్వం రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 58.16 లక్షల మంది పట్టాదారులకు 58.81 లక్షల చెక్కులు ముద్రించారు. 51.11 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. 7.7 లక్షల చెక్కులు పంపిణీ కాకుండా మిగిలిపోయాయి. ఇందులో చనిపోయిన వారి పేరు మీద, భూమిని మొత్తం అమ్ముకున్న వారి పేర్ల మీద, విస్తీర్ణం ఉన్న దాని కంటే ఎక్కువ, తక్కువగా పడి మరికొందరి పేర్ల మీద చెక్కులు ముద్రితమయ్యాయి. అందులో విదేశాల్లో ఉన్నవారి పేరు మీద దాదాపు 70 వేలు, చనిపోయిన రైతుల పేరు మీద లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. కొన్ని రకా ల చెక్కుల్లో లోపాలున్నందున వాటిని తీసుకొచ్చే రైతులకు సొమ్ము చెల్లించవద్దని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీచేసింది. వాటిని విత్‌హోల్డ్‌లో పెట్టా లని ఆదేశించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు నల్లగొండలో ‘విత్ హోల్డ్’లో ఉన్న 551 చెక్కులను నగదుగా మార్చుకుని పంచుకున్నారు. నల్లగొండలోని నాంపల్లి మండలంలో ఎస్బీఐ బ్యాం కు క్యాషియర్, ప్రభుత్వాధికారులు, బయటి వారితో కలిసి సొమ్మును కాజేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెద్ద అడిశెర్లపల్లి, చింతపల్లి, నాంపల్లి, గుర్రంపోడు, దేవర కొండ, చండూరు మండలాలకు చెందిన విత్‌హోల్డ్‌లో ఉన్న రైతుబంధు చెక్కులు డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ సంఘటనలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు నుంచి ఎలా కొట్టేశారు నిబంధనల ప్రకారం సంబంధిత పట్టాదారు రైతు మాత్రమే చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళ్లాలి. నగదు తీసుకునే సమయంలో పట్టాదారు పాసు పుస్తకం చూపించాలి. ఒకవేళ పాసు పుస్తకం రానట్లయితే ఆధార్ కార్డు, ఓటరు ధ్రువీకరణ కార్డును చూపించాల్సి ఉంది. కాని ఇవేమీ పట్టించుకోకుండానే నాంపల్లి మండల ఎస్బీఐ క్యాషియర్.. విత్‌హోల్డ్‌లో ఉంచిన రైతుబంధు చెక్కులను రెవెన్యూ, ఇతర ప్రభుత్వాధికారులతో కలిసి అక్రమంగా నగదులోకి మార్చారు. అయితే రైతుల వద్ద ఉన్న చెక్కులను రెవెన్యూ అధికారులు, బ్యాంకర్లు ఎలా కొట్టేశారో ఇప్పటికీ తేలలేదు. మరోవైపు మిగిలిపోయిన చెక్కులను ప్రభుత్వం ఇంకా జిల్లాల్లోనే ఉంచడంలో అర్థం లేదన్న చర్చ జరుగుతోంది. పైగా విదేశాల్లో ఉన్న పట్టాదారు చెక్కులను పంపిణీ చేయడంలో తాత్సారం చేస్తుండటంపైనా విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్‌ను ఆదేశించాం పెట్టుబడి చెక్కుల సొమ్మును కాజేసిన అంశంపై విచారణ చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాం. ఇందులో రెవెన్యూ, బ్యాంకు అధికారులు బాధ్యులుగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. ఇప్పటికే బ్యాంక్ క్యాషియర్‌పై కేసు నమోదైంది. కలెక్టర్ నుంచి రెండు, మూడు రోజుల్లో నివేదిక రానుంది. పార్థసారథి, ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ