ghmc
-
పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త
హైదరాబాద్, సాక్షి: ఉద్యోగులకు జీహెచ్ఎంసీ దీపావళి శుభవార్త చెప్పంది. ఈరోజు సాయంత్రం వరకు జీతాలు విడుదల చేయనున్నట్లు ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. జీహెచ్ఎంసీ రూ.120 కోట్ల నిధులను విడుదల చేయనుంది. అయితే.. జీహెచ్ఎంసీ గత నెల వారం రోజుల ఆలస్యంగా జీతాలు ఇచ్చింది. దసరాకు ఐదు రోజులు ఆలస్యంగా జీతాలు ఇవ్వడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రెండు రోజులు ముందుగానే జీహెచ్ఎంసీ జీతాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. -
బాణాసంచా దుకాణాలకు తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ ఫీజు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండగను పురస్కరించుకొని బాణాసంచా (పటాకుల) దుకాణాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ తీసు కోవాలని జీహెచ్ఎంసీ పేర్కొంది. లైసెన్స్ లేకుండా దుకాణాల ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వబోమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. రిటైల్ అమ్మకాల కోసం దుకాణాలు ఏర్పాటు చేసేవారు రూ.11 వేలు, హోల్‌సేల్ విక్రయాలకు రూ. 66వేలు ట్రేడ్ లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు ఇలా.. బాణాసంచా దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్స్ పొంది నిబంధనలకనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్ణీత ట్రేడ్ లైసెన్స్ ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్/ జీహెచ్ఎంసీ వెబ్సైట్ (www.ghmc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిమాండ్ డ్రాఫ్ట్, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించవచ్చన్నారు. గుర్తింపు కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతులు ఇవ్వాలని కోరారు. బాణాసంచా షాపులను ఫుట్‌పాత్‌లు, జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదని తెలిపారు. తగిన ఫైర్ సేఫ్టీ ఉండాలి.. కాలనీలు, బస్తీలకు దూరంగా ఓపెన్ గ్రౌండ్లో/ పెద్దహాల్లో తగిన ఫైర్‌సేఫ్టీతో ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుకోని ప్రమాదం జరిగితే మంటలను ఆర్పడానికి వీలుగా అగ్నిమాపక నిరోధక పరికరాలు సిద్ధంగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి స్టాల్ వద్ద, చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దుకాణాలకు దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లోనూ బాణాసంచా కాల్చకూడదని, షాపులో ఏర్పాటు చేసే లైట్లు ఇతరత్రా కరెంటు పరికరాలకు నాణ్యమైన విద్యుత్ వైర్‌ను వినియోగించాలని సూచించారు. బాణాసంచా స్టాల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినట్లయితే స్టాల్ హోల్డర్దే బాధ్యతని, చట్టపరమైన చర్యలకు బాధ్యుడని తెలిపారు. ఈ విషయాన్ని తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్లో పొందుపరచనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి పేర్కొన్నారు.చదవండి: స్వీట్ క్రాకర్స్.. మతాబుల రూపాల్లో చాక్లెట్ల తయారీ ప్రభుత్వ ఉత్తర్వులు పాటించాలి.. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఫైర్ క్రాకర్స్ అయిన సిరీస్ క్రాకర్స్/లడీస్ తయారీ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం ఉందని, వాటి అమ్మకాలకు అనుమతించరని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955/న్యాయస్థానాలు/పీసీబీ/ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. బాణాసంచా విక్రయ స్టాళ్లను సంబంధిత డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్‌తో పాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అధికారుల బృందం కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. -
కేబీఆర్ పార్కులో ‘ప్రజా సంబరాలు’ నగరవాసుల సందడి..(ఫొటోలు)
-
HYDRA: హైడ్రాకు హైపవర్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు(హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి) బదలాయించింది. ఆర్డినెన్స్ అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ కట్టడాలు డిజాస్టర్స్ అసెట్స్ ప్రొటెక్షన్‌లో హైడ్రాకు అధికారాలు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధి మొత్తంలో అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపించే అవకాశం హైడ్రాకు కల్పించింది ప్రభుత్వం.గవర్నర్ ఆమోదంఇప్పటికే హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ‘హైడ్రా’ చట్టబద్ధతపై హైకోర్టు పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించి ఆర్డినెన్స్‌ను రూపొందించింది. ఇప్పటివరకు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఉన్న పలు అధికారాలను ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌తో తన అధీనంలోకి తీసుకుంది. అయితే ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నివృత్తి చేశారని, దీనితో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. కొత్తగా ‘సెక్షన్ 374–బీ’ని చేరుస్తూ ఆర్డినెన్స్జీహెచ్ఎంసీ చట్టం-1955లో ఇప్పటి వరకు 374, 374-ఎ సెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ 374-బి చేర్చుతూ ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించింది. అందులోని అంశాలకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇతర సంస్థకైనా అప్పగించవచ్చని ఆర్డినెన్స్ చెబుతోంది. ఆ ఆర్డినెన్స్‌కు అనుగుణంగానే..తాజాగా, ఆ అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. తద్వారా హైడ్రాకు అదనపు బలం సమకూరినట్లైంది.👉చదవండి : హైడ్రాకు బిగ్ రిలీఫ్ -
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఈటల భేటీ
ఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కంటోన్మెంట్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు కారుణ్య నియామకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.కరోనా సమయంలో పనిచేస్తూ దాదాపు 100 మందికి పైన పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారు. చనిపోయిన కార్మికుల అంశాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని కారుణ్య నియామకాలు చేపట్టాని కోరారు.కారుణ్య నియామకాలు ఐదు శాతం మించకూడదన్న నిబంధనను సడలించి , ఈ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
TG: ఆమ్రపాలికి కేంద్రం షాక్
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఆమ్రపాలితో పాటు తెలంగాణ కేడర్ కావాలన్న 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. వీరందరినీ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ 11 మంది ఐఏఎస్‌లలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు విద్యుత్ శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్ కూడా ఉన్నారు. వీరందరూ తమకు తెలంగాణ కేడర్ కావాలని కేంద్రంలోని డీవోపీటీ శాఖకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరి విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. ఇదీ చదవండి: ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం: వినోద్‌కుమార్ -
లంచగొండి భార్య... పట్టించిన భర్త!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి అవినీతి బండారాన్ని కట్టుకున్న భర్తే అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తన భార్య జ్యోతి ప్రతి రోజూ లంచం తీసుకుంటుందంటూ ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఉన్న డబ్బుల వీడియోలను విడుదల చేశారు ఆమె భర్త. ఇంట్లో డబ్బుల్ని దాచిన ప్రతి చోటు చూపిస్తూ వీడియోల్ని విడుదల చేశారు.జ్యోతి నిత్యం లక్షల్లో లంచం తీసుకుంటుందని, ఏడేళ్ల నుంచి లంచం తీసుకోవద్దని వద్దని వారించినా భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడం తనని మనోవేదనకు గురి చేస్తుందంటూ విడుదల చేసిన వీడియోల్లో పేర్కొన్నారు.లంచం మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చినా.. డబ్బులు తీసుకోకుండా ఇంటికి వచ్చేది కాదు. దాదాపూ రూ.80లక్షల విలువైన నోట్ల కట్టలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. తన భార్య తీసుకున్న లంచానికి ఇవే సాక్షాలంటూ వీడియోల్ని విడుదల చేశారు.మణికొండలోని కాంటట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటూ ఇంటికి భారీగా లంచాలు తీసుకువస్తుందంటూ ఆమె భర్తే ఆరోపించారు. ఇదే విషయంలో జ్యోతితో గొడవ పడ్డానని, అయినా తనలో మార్పురాలేదన్నారు. పైగా తాను లంచం తీసుకోకూడదు అని అనుకున్నా.. పై అధికారులు లంచం తీసుకోమని ప్రోత్సహిస్తున్నారని చెబుతూ వస్తుందని వాపోయారు. చివరికి భార్య చేస్తున్న తప్పును తట్టుకోలేక ఈ వీడియోలు తీసినట్లు జ్యోతి భర్త విడుదల చేసిన వీడియోలో తెలిపారు. మరోవైపు జ్యోతిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీకి బదిలీ చేయించుకున్నారు. -
‘జీహెచ్ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని నాలుగు కార్పొరేషన్లుగా విభజించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. ఈ విషయమై శనివారం(అక్టోబర్ 5) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ మహా నగరంలో జనాభా కోటిన్నరకు చేరింది.జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా చేసిన తర్వాత నలుగురు మేయర్లు ఉంటారు.రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలుగురు మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.ఈ నగరాన్ని ప్రపంచ పటంలో ఉంచేందుకు రూ.30వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)ను నిర్మిస్తాం.అమెరికా తర్వాత అత్యధికంగా ఎంఎన్సీ కంపెనీల హెడ్‌క్వార్టర్స్ హైదరాబాద్‌లోనే ఉండనున్నాయి’అని కోమటిరెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: హోం మంత్రి పదవి ఇవ్వాలని.. -
పెడల్ పవర్.. సైకిల్ ఫర్ ఎవర్
ఎటువైపు చూసినా ఆకాశమంత ఎత్తైన అద్దాల భవనాలు.. నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసిన రహదారులు.. కిలోమీటర్ల మేర బారులు తీరే వాహనాలు.. ఇది నగరంలోని రహదారుల పరిస్థితి.. దీంతో పాటు నగర శివారులోని టెక్ పార్కుల్లోనూ లక్షలాది మంది ఉద్యోగులతో ట్రాఫిక్ సమస్యలు తప్పడంలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కొంత కాలంగా వీధుల్లో సైక్లింగ్ ట్రెండ్ నడుస్తోంది. రహదారులకు సమాంతరంగా సైక్లింగ్ ట్రాక్‌లను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసింది. దీంతో టెకీల్లో చాలా మంది సైక్లింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారంలో కొన్ని రోజులైనా సైకిల్‌పై కార్యాలయానికి వెళ్లాలని కొంత మంది రూల్ పెట్టుకుంటున్నారు. క్లబ్‌లుగా ఏర్పడి వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలుకు శ్రీకారం చుడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడటం, ట్రాఫిక్‌లో సమయం, డబ్బు ఆదా, వాతావరణ కాలుష్య నివారణకు ఈ విధానం సహాయపడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టెక్కీలుగా స్థిరపడిన చాలా కుటుంబాల ఇళ్లల్లో కారు, మోటారు సైకిల్‌తో పాటు ఎలక్రి్టక్, గేర్, సాధారణ సైకిల్ తప్పనిసరిగా ఉంటోంది. మెట్రో స్టేషన్లకు, కూరగాయల మార్కెట్‌కు, వాకింగ్‌కో వెళ్లడానికి, ఐదు కిలో మీటర్ల లోపు పనులకు సైకిల్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. వివిధ సైక్లింగ్ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక టూర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కో వారం ఒక్కో రకమైన థీమ్ ఉండేలా సెట్ చేసుకుంటున్నారు. వందలాది కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణాలు చేస్తున్నారు. ఆపై ట్రెక్కింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే వారాంతంలో కుటుంబ సభ్యులతో కలసి టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా కారు వెనకన తమ సైకిల్ కట్టుకుని పోతున్నారు. రిసార్ట్, ఫాం హౌస్, ఇతర డెస్టినేషన్‌లో సైక్లింగ్ చేస్తున్నారు.డెడికేటెడ్ ట్రాక్స్ కోసం.. నగరంలోని సైక్లిస్టులంతా ప్రస్తుతం ఉన్న సైకిల్ ట్రాక్‌లను డెడికేటెడ్ ట్రాక్‌లుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కేబీఆర్ పార్క్, హైటెక్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. అయితే సాధారణ వాహనాలు సైతం ఈ సైకిల్ ట్రాక్‌పై నడిపిస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ట్రాక్‌పై పదుల సంఖ్యలో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌తో నిండిన రహదారిపై సైకిల్ తొక్కాలంటే భయమేస్తుదని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సైక్లింగ్ ట్రాక్స్‌కు బారికేడ్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇలా చేయడంతో మోటారు సైకిళ్లు, ఇతర వాహనాలు సైకిల్ ట్రాక్‌పైకి వచ్చే అవకాశం ఉండదు. దీంతో సైక్లిస్టులు వేగంగా, ధైర్యంగా ముందకు సాగేందుకు వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓఆర్ఆర్ సమీపంలో సోలార్ రూఫ్‌తో ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ దేశంలోనే ప్రత్యేకమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరహాలో నగరాన్ని సైక్లింగ్ సిటీగా తీర్చిదిద్దాలనే డిమాండ్ వినిపిస్తోంది.ఏడేళ్ల నుంచి సైక్లింగ్..చిన్న చిన్న ప్రయాణాలకు సైకిల్‌పైనే వెళతాను. ఏడేళ్ల నుంచి క్రమం తప్పకుండా సైక్లింగ్ చేస్తున్నాను. ప్రతి మహిళ సైక్లింగ్ చేయాలి. ఆరోగ్యం పరంగా చాలా ఉపయోగాలున్నాయి. ఇతరులపైఆధారపడకుండా స్వతహాగా బయటకు వెళ్లి కూరగాయలు, పాలు, ఇతర సామాగ్రి తెచ్చుకుంటా. ఆఫీస్‌కి వెళ్లేందుకు మెట్రో వరకూ సైకిల్‌పైనే వెళతాను. సరికొత్త మోడళ్లు..ప్రధానంగా టెక్ వీధుల్లో వివిధ మోడల్ సైకిళ్ల హవా కనిపిస్తోంది. మెట్రో స్టేషన్ల నుంచి తమతమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఉద్యోగులు సైకిళ్లను వినియోగిస్తున్నారు. ఎత్తుపల్లాలు ఉన్నా సైక్లిస్టులకు ఇబ్బంది లేకుండా బ్యాటరీ, గేర్ సైకిళ్లు అందుబాటులో ఉంటున్నాయి. రహదారికి సమాంతరంగా ఉన్నపుడు సైకిల్ తొక్కడం, ఎత్తు ఉన్నపుడు బ్యాటరీతో నడిపిస్తున్నారు. ఈ విధానం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కొనుక్కోవడం ఇష్టం లేకుండా, తమకు నచ్చినప్పుడు సైకిల్ సవారీ చేయడానికి అద్దె ప్రాతిపదికన వందలాది సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. టైం పాస్ కోసం.. సైక్లింగ్ టైం పాస్ కోసం ప్రారంభించాను. 10 కిలో మీటర్లు సైకిల్‌పై వెళ్లడానికి కష్టంగా ఉండేది. క్రమంగా అసోసియేషన్ సభ్యులతో సంబంధాలు ఏర్పడ్డాయి. సైక్లింగ్ వల్ల లాభాలపై అవగాహన వచి్చంది. ఇప్పుడు 100 కిలో మీటర్ల వరకూ వెళ్లిపోతున్నాం. వీలైతే ట్రెక్కింగ్ చేస్తున్నాం. సొంతంగా ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ క్లబ్ స్థాపించాను. వారాంతంలో టూర్ ప్లాన్ చేస్తుంటాం. – అశోక్, ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ నిర్వాహకులు21 వేల మంది సభ్యులు.. 2011లోనే సైక్లింగ్ రివల్యూషన్ ప్రారంభించాము. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పర్యావరణం, ఆరోగ్యం, సమయం, డబ్బు ఆదాపై అవగాహన కల్పించాం. హైదరాబాద్ బైస్కిల్ క్లబ్‌ను స్థాపించాం. ప్రస్తుతం ఇందులో 21 వేల మంది సభ్యులున్నారు. 60 ఏళ్ల వయసులో లండన్ నుంచి పారిస్ వరకూ 518 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లాను. మూడున్నర రోజులు పట్టింది. ఢిల్లీ, ఛంఢీఘర్, చెన్నైలోనూ సైక్లింగ్ అసోసియేషన్స్ స్థాపించాం. సుమారు 6 వేల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఏడేళ్ల క్రితం ఓఆర్ఆర్ సమీపంలో సైకిల్ ట్రాక్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించాం. 23 కిలోమీటర్ల సోలార్ రూఫ్ ట్రాక్ సిద్ధమైంది. – మనోహర్, ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ -
Ghmc: పోస్టర్లు బ్యాన్..ఆమ్రపాలి కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో వాల్ పోస్టర్లు బ్యాన్ చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి శుక్రవారం(సెప్టెంబర్27) సర్క్యులర్ జారీ చేశారు. జీహెచ్ఎంసీలో వాల్ పోస్టర్లు,వాల్ పెయింటింగ్స్ పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.సినిమాల పోస్టర్లు కూడా ఎక్కడా అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.ఒకవేళ ఆదేశాలను పట్టించుకోకుండా పోస్టర్లు వేస్తే మాత్రం జరిమానా విధించాలని సర్క్యులర్‌లో తెలిపారు.ఇదీ చదవండి: మూసీకి వరద..జీహెచ్ఎంసీ హై అలర్ట్ -
మూసీకి వరద..జీహెచ్ఎంసీ హైఅలర్ట్
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరానికి తాగునీరందించే జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్‌సాగర్‌లో నీరు ఫుల్‌ట్యాంక్‌లెవెల్ (ఎఫ్టీఎల్) స్థాయికి చేరింది. ఎగువ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు వరద నీరురావడంతో నీటి మట్టం పెరిగింది. జలాశయానికి ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు అధికారులు తెలిపారు.జలాశయం నిండడంతో పాటు ఇన్‌ఫ్లో ఉండడంతో రెండు గేట్లు ఎత్తి ఉస్మాన్‌సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో పాటు మూసీకి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందిని కమిషనర్ అమ్రపాలి అప్రమత్తం చేశారు.ఇదీ చదవండి: హైడ్రా ఎఫెక్ట్..మూసీ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత -
Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు!
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: నగరంలో గణేశ్ సామూహిక నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా గత ఏడాది ఎదురైన అనుభవాలను పాఠాలుగా తీసుకొని ఈసారి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా కసరత్తు చేస్తున్నారు. బందోబస్తు కోణంలో సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు ఫైనల్స్ వంటివి. గత కొన్నేళ్లతో పోలిస్తే గత ఏడాది ఈ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. 2023 సెప్టెంబర్ 28 తెల్లవారుజాము నుంచి 29 రాత్రి 10 గంటల వరకు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగింది. ఈ ఆలస్యానికి కారణాలను ఉన్నతాధికారులు విశ్లేషించి ఈసారి ఏ ఒక్కటీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఈ లోపాలను ప్రస్తావించారు. వీటిని జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాల దృష్టికీ తీసుకువెళ్లారు. రెండు క్రేన్ల మధ్య వంద అడుగుల దూరం... కొన్ని క్రేన్లలో ఇనుపతాళ్లకు బదులుగా బెల్ట్‌లు వాడారు. నిమజ్జనం సందర్భంలో ఇవి ఊడిపోవడంతో మరింత ఆలస్యమైంది. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు ఏర్పాటు చేయాల్సి వస్తే... ప్రతి రెండు క్రేన్ల మధ్య కనీసం 100 నుంచి 150 అడుగుల దూరం ఉండాలి. అలా చేస్తేనే నిమజ్జనానికి విగ్రహాలను తెచ్చిన లారీలు, ఖాళీ అయినవి తేలిగ్గా ముందుకు వెళ్తాయి. అయితే సరైన పర్యవేక్షణ లేని కారణంగా గత ఏడాది ప్రతి క్రేన్ మధ్య 30 నుంచి 40 అడుగుల దూరమే ఉంచారు. దీంతో విగ్రహాలను తీసుకొచ్చిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఫలితంగా నిమజ్జనానికి వచ్చే విగ్రహాల కోసం క్రేన్లు ఖాళీగా వేచి ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా ట్యాంక్‌బండ్‌పై బయటి ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులకు ఎక్కువగా డ్యూటీలు వేశారు. సరైన అవగాహన లేని వీళ్ళు సక్రమంగా తమ విధులను నిర్వర్తించలేకపోయారు. ఇదీ చదవండి: కీలక ఘట్టానికి వేళాయేపటిష్టంగా బారికేడింగ్ నిమజ్జనం చూడటానికి వచ్చే సందర్భకులు లారీల మధ్యలోకి, రోడ్డుపైకి రాకుండా ఇరువైపులా పటిష్ట బారికేడింగ్ ప్రతి ఏడాదీ ఏర్పాటు చేస్తుంటారు. ఇది గత ఏడాది సక్రమంగా జరగలేదు. దీంతో అనేకమంది లారీల మధ్యకు వస్తుండటంతో అవి చాలా ఆలస్యంగా కదిలాయి. మరోపక్క బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ వైపు వాహనాలను అనుమతించడం మరో ఇబ్బందికి కారణమైంది. విగ్రహాలు తీసుకువచ్చే లారీల వెనుక వచ్చే ద్విచక్ర వాహనాలు, ఇతరాలను గత ఏడాది పూర్తిస్థాయిలో అడ్డుకోలేదు. ఇది కూడా నిమజ్జనం ఆలస్యానికి కారణంగా మారింది. ఇవన్నీ విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు ఈసారి అవి పునరావృతం కాకుండా, గతం కంటే మెరుగైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇవీ లోపాలు... ముందుగా వచ్చే విగ్రహాలు నిమజ్జనం కాగానే బండ్ నుంచి 20 అడుగుల దూరం మేర నీటిలో పేరుకుపోయే వ్యర్థాలు, వస్తువులను వెంట వెంటనే తొలగించాలి. అలా జరగకపోవడంతో ఆ వెంటనే నిమజ్జనం చేసే విగ్రహాలు మునగడానికి చాలా సమయం పట్టింది. నిమజ్జనం సందర్భంగా సాగర్‌లో కనీసం నాలుగు, ఐదు ఫ్లోటింగ్ జేసీబీలను ఏర్పాటు చేయాలి. ఓ పక్క విగ్రహాలు నీటిలో పడుతుంటే, మరోపక్క వాటి వ్యర్థాలను తొలగించాలి. అయితే జీహెచ్ఎంసీ అధికారులు గత ఏడాది కేవలం ఒక్క ఫ్లోటింగ్ జేసీబీ మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ కారణాల వల్ల నిమజ్జనం ప్రక్రియ వేగంగా జరగడానికి తీసుకువచ్చిన అత్యాధునిక క్యూఆర్డీ హుక్స్ సరిగ్గా పనిచేయలేదు. క్రేన్ ప్లాట్‌ఫామ్‌కు ఉన్న నాలుగు మూలలు సమానంగా నీటిలోకి దిగితేనే ఇవి సక్రమంగా పని చేస్తాయి. అయితే సాగర్‌లో ఉన్న వ్యర్థాలు, విగ్రహాలు, ఇనుప సీకులకు తట్టుకుని నాలుగు వైపులా నీటిలో దిగక హుక్స్ వెంటనే రిలీజ్ కాలేదు. దీంతో కొన్ని విగ్రహాల నిమజ్జనానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టింది. -
నిమజ్జనానికి వచ్చే వారికి ఉచిత ఆహారం: అమ్రపాలి
సాక్షి,హైదరాబాద్:గణేష్ నిమజ్జనానికి జిహెచ్ఎంసి తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి చెప్పారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు‘17,18,19 తేదీల్లో మూడు రోజులపాటు 15వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పనిచేస్తారు.శానిటేషన్ సిబ్బంది,ట్యాంక్ బండ్లో గజ ఈతగాళ్లనుఏర్పాటు చేశాం.నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్‌లలో మంచినీళ్లు,ఆహారం ఏర్పాటు చేస్తున్నాం.ఇప్పటికే రోడ్లు రిపేర్ చేశాం.స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశాం.అన్ని మేజర్ చెరువుల వద్ద క్రేన్లు ఉంచాం.జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చిన్న చిన్న చెరువుల వద్ద బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేశాం.కాలనీలలో ఏర్పాటు చేసే చిన్న విగ్రహాలు అక్కడే నిమజ్జనం చేస్తారు.గణేష్ నిమజ్జనానికి జోనల్ కమిషనర్లతో పాటు పోలీసులు కోఆర్డినేషన్ చేసుకుంటూ పనిచేస్తారు’అని అమ్రపాలి తెలిపారు.ఇదీ చదవండి.. 17న నిమజ్జనం సెలవు -
హైడ్రా.. ఫ్లడ్ స్టడీ!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పరిశీలించింది. వరద ప్రభావిత ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు, అడ్డంకులను క్షేత్రస్థాయిలో గుర్తించింది. చెరువులు, నాలాల కబ్జా వల్ల కలిగే ఇబ్బందులను ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి వివరించే ప్రయత్నం చేసింది. హైడ్రా ఏర్పడ్డాక తొలి ముసురు... జీహెచ్ఎంసీలో అంతర్భాగంగా ఉన్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్)ను వేరు చేయడంతోపాటు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం హైడ్రాకు రూపమిచ్చింది. ఈ మేరకు జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాతి రోజే హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. వెంటనే చెరువుల ఆక్రమణలపై దృష్టిపెట్టి ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే గత 40 రోజుల్లో నగరంలో పలుమార్లు వర్షం కురిసినా శని, ఆదివారాల మాదిరిగా ముసురుపట్టి వివిధ ప్రాంతాలు మునకేసే పరిస్థితి కనిపించలేదు. ఈ రెండు రోజుల వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించడంతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి వరద ప్రవేశించింది. రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. షేక్‌పేట, టోలిచౌకి, బేగంపేటలలో పర్యటిస్తూ. ఈ పరిణామాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగారు. శని, ఆదివారాల్లో అనేక ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. షేక్‌పేట, టోలిచౌకి, బేగంపేట తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. నీళ్లు నిండిన రహదారులు, కాలనీల్లో తిరుగుతూ ఓపక్క డీఆర్ఎఫ్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తూనే మరోపక్క ఆ ముంపునకు కారణాలను వారికి వివరించారు. చెరువులు, నాలాల కబ్జాల వల్లే ఈ విపత్కర పరిస్థితులు వస్తున్నాయని, దీని ప్రభావం కబ్జా చేసిన వారి కంటే ఎక్కువగా సామాన్యులపై ఉంటోందని చెప్పారు. ఎవరికి వారు బాధ్యతగా మెలిగేలా, కబ్జాలు, ఆక్రమణలపై వారు ఫిర్యాదు చేసేలా వారిని ప్రోత్సహించారు. ఆ వాదనకు తెరదించేలా... నగరంలో గతంలో వర్షాలు కురిసిన సందర్భంలోనూ రంగనాథ్ క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. అయితే అప్పట్లో జీహెచ్ఎంసీ ఈవీడీఎం (ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్) డైరెక్టర్‌గా వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. అందులో భాగంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను కూడా ప్రయోగించారు. తాజాగా ఆయన హైడ్రా పగ్గాలు చేపట్టగా ఓ వర్గానికి చెందిన వారు ఆ సంస్థ చర్యలపై దుష్ఫ్రచారం ప్రారంభించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు ఉన్నా ఇబ్బందుల్లేవని... కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం హైడ్రాను ప్రయోగిస్తోందని ఆరోపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆయన శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ఆ వర్గాల వాదన నిజం కాదని నిరూపించే ప్రయత్నం చేశారు. -
హుస్సేన్ సాగర్ ఫుల్.. జీహెచ్ఎంసీ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో.. నదులు, చెరువుల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది.హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం కారణంగా బంజారా హిల్స్, పికెట్, కూకట్పల్లి ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు హుస్సేన్ సాగర్‌లోకి చేరుతోంది. దీంతో, సాగర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో తూముల ద్వారా వరద నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లోని నీటిమట్టం 513.70 మీటర్లకు చేరుకుంది, అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ 515 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఇన్‌ఫ్లో 10270 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 9622 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.మరోవైపు.. ఎడతెరపి లేని వర్షాలతో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మూసీ నదికి వరద పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసారంబాగ్ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ, అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి. నగరంలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలి. ఏదైనా సహాయం కావాలంటే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040-21111111 ను సంప్రదించాలి. మ్యానువల్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ అందరూ అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశించారు. -
హైడ్రాకు సవాల్.. జీహెచ్ఎంసీ ఆఫీసు కూల్చేస్తారా?: ఎంపీ అసద్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘హైడ్రా’ కూల్చివేతల అంశం హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ కట్టడాల కూల్చివేతలపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏం చేయబోతున్నారని ఆయన నిలదీశారు.కాగా, హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలపై తాజాగా అసదుద్దీన్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్న అధికారులు ఆ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చివేస్తారా?. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సంగతి ఏంటి?. అక్కడ నిర్మించిన ఆఫీసులను ఏం చేయబోతున్నారు. నెక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా?. నెక్లెస్ రోడ్డు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కదా?. మరి దాన్ని కూడా తవ్వేస్తారా?. గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్యాలయం కూడా నీటి కుంటలో నిర్మించినదే. మరి జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా? అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. దీంతో, అసద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.మరోవైపు.. అక్రమ కట్టడాల కూల్చివేతపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అలాగే, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారి కట్టడాలను కూడా కూల్చివేస్తాం. చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడ్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అందరూ సహకరించాలి. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు. రాజకీయం కోసమో.. నాయకులపై కక్ష కోసం కూల్చివేతలు చేయడం లేదు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు కూడా ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. -
‘హైడ్రా’ ఉక్కుపాదం.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత (ఫొటోలు)
-
ఆక్రమణదారులకు సింహస్వప్నం!
హైదరాబాద్ పరిధిలో అన్యాక్రాంతమైన అన్ని రకాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడా నికీ, కొత్తగా ఆక్రమణలకు గురికాకుండా చూడడానికీ ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్తగా ఆలోచన చేసి దీనిని ప్రత్యేక వ్యవస్థగా రూపుదిద్దారు. జీహెచ్ఎమ్సీ, హెచ్ఎమ్డీఏ పరిధిలోని వేలాది ఎకరాల ప్రభుత్వ, ఇనాం, వక్ఫు, దేవాదాయ భూములు, చెరువులు కబ్జాకు గురయ్యాయి. గత బీఆర్ఎస్ పాలనలో చెరువులను మాయం చేసి, కొండలు గుట్టలను ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అమ్మేశారు. జీవో 59 ముసుగులో భూములను రక్షించాల్సిన వారే భక్షించారు. అధికారులు వారికి వంత పాడారు. రోజురోజుకూ కబ్జాలు పెరిగిపోతుండడంతో ముఖ్యమంత్రి ఇతర దేశాల్లో ప్రభుత్వాస్తుల రక్షణకు చేపట్టిన విధి, విధానాలపై అధ్యయనం చేశారు. అక్కడ సత్ఫలితాలు ఇస్తున్న విధానాన్ని హైదరాబాద్ లోనూ అమలు చేయడానికి హైడ్రాను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేశారు. దీని విధి విధా నాలు ఖరారు చేస్తూ ఇటీవల జీవో 99ని జారీ చేశారు. దీనికి ఐజీ స్థాయి సీనియర్ పోలీసు అధికారి ఏవీ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియ మించారు.హైడ్రాను ఏర్పాటు చేసిన వెంటనే ప్రభుత్వం దానికి సంబంధించి రూ. 200 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అక్రమ నిర్మాణాల అంతు తేల్చడానికి ప్రభుత్వం ఎంత అంకితభావంతో ఉందో ఈ బడ్జెట్ కేటాయింపే నిదర్శనం. జీహెచ్ఎమ్సీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 2,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలను కలిపి స్వయం ప్రతిపత్తితో ఉండేలా హైడ్రాను అందుబాటులోకి తెచ్చారు. జీహెచ్ఎమ్సీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి,సంగారెడ్డి జిల్లాల్లోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) గా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఆ ప్రాంతం వరకు విపత్తు నిర్వహణ తదితర అధికారులతో హైడ్రాను ఏర్పాటు చేశారు. హైడ్రా పాలకమండలికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా, మున్సిపల్ మంత్రి, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి; హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల ఇన్చార్జి మంత్రులు; హైదరాబాద్ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు.చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం హైడ్రా త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నది. చెరువులు కుంటలు, నాళాలు, పార్కులు ప్రభుత్వ స్థలాల్లో జరిగిన అక్రమ కట్టడాలే కాకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఏళ్ల క్రితమే అనుమతులతో వెలసిన భవనాలను చట్ట ప్రకారం కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు రంగంలోకి దిగింది. అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతోంది. జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్, బంజారాహిల్స్‌లోని మిథిలా కాలనీ, గాజుల రామారం, భూమ్ రుఖా ఉద్ దవాల్ చెరువుల్లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆక్రమణలపై హైడ్రాకు రోజుకు 40 నుంచి 50 ఫిర్యాదులు వస్తుండడం విశేషంగా చెప్పవచ్చు.ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే ఇచ్చిన లే ఔట్లకు సంబంధించిన అనుమతులు రద్దు చేసే ఆలోచనతో హైడ్రా ముందుకు వెళ్తోంది. చెరువుల ఆక్రమ ణలు జరగకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సాంకేతికంగా కూడా చర్యలు తీసు కుంటున్నది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచ నున్నది. ప్లాట్లు, ఇండ్లుకొనే వ్యక్తులు ఈ స్థలం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా రాదా అన్నది తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందిస్తున్నారు.హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఈ పోలీస్ స్టేషన్ ద్వారానే ఎస్ఓటీ ఏర్పాటు చేసి కబ్జా దారులపై ఉక్కు పాదం మోపనున్నారు. హైడ్రాకు మొత్తం 3,500 మంది సిబ్బందిని త్వరలో నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. హైడ్రా కింద అసెట్ ప్రొటెక్షన్‌తో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు కూడా కొన సాగుతుంది. పట్టణ ప్రణాళిక– విపత్తుల నిర్వహణ విభాగాలు, ట్రాఫిక్ పోలీ సులతో సమన్వయం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో 72 టీమ్‌లు పనిచేస్తున్నాయి. త్వరలో కొన్ని జిల్లాల్లోనూ ఇటువంటి వ్యవస్థలను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ఆలోచించడం ముదావహం.– వెలిచాల రాజేందర్ రావు, వ్యాసకర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, 9849 061481 -
అనుమతి పొందిన కట్టడాలను ఎలా కూలుస్తారు?: బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: హైడ్రా ఆలోచన బాగున్నా ఆచరణలో మాత్రం సరైన తీరు లేదని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘సామాన్య ప్రజలకు శికం భూమా, బఫర్ జోన్లో ఉందా? అనేది తెలీదు. కష్టపడి సంపాదించిన సొమ్మంతా పెట్టి భూమి కొంటారు. అధికారులు చేసే పనుల వల్ల సామాన్య జనం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది’’ అని వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు.‘‘చెరువులను కాపాడాలి. అక్రమ కట్టడాలను కుల్చాలి కానీ అనుమతులు ఇచ్చిన అధికారులను ఏం చేస్తారు?. అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చితే మంచిదే.. కానీ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతి పొందిన వాటిని ఎలా కూలుస్తారు? రాజకీయ నాయకులు, అధికారులు కలిసి సామాన్య ప్రజలది తప్పు అన్నట్లు చేస్తున్నారు. రంగనాథ్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఉండటం తెలంగాణకు మంచిదే కానీ ఇలా ఎంతకాలం చేస్తారు?. నోటీసు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూలగొట్టడం మంచిది కాదు’’ అని వెంకటరమణారెడ్డి చెప్పారు.‘‘గత ప్రభుత్వ తప్పిదాలకు ప్రజలను బలి పశువు చేస్తారా..?. రేవంత్ రాత్రికి రాత్రి తీసుకునే నిర్ణయంతో సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. చెరువుల్లో కట్టడాలకు అనుమతి ఇచ్చిన వారికి బేడీలు వేసి జైల్లో వేయాలి అప్పుడే మిగతావారికి భయం వస్తుంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం పక్కకి పోయాయి ఇప్పుడు హైడ్రా కొన్నాళ్లు హడావుడి’’ అంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. -
Hyderabad: స్ట్రీట్ డాగ్స్‌కు.. ఫుడ్ పెట్టాలా?
సాక్షి, సిటీబ్యూరో: దయాగుణంతో వీధికుక్కలకు ఆహారం పెట్టేవారు తమ పేర్లను జీహెచ్ఎంసీ వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అందుకుగాను bit.ly/GHMCdogfreederform లింక్ ద్వారా లేదా సంబంధిత క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. తద్వారా జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కలకు ఆహారం ఉంచేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు జీహెచ్ఎంసీతో కలిసి పనిచేయవచ్చని పేర్కొంది.దాంతో ప్రజలు కుక్కల బారిన పడే ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. పేర్లు నమోదు చేసుకున్న వారికి కుక్కలకు ఆహారం వేసే విధానం, జంతు సంరక్షణ మార్గదర్శకాలు తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని తెలిపింది. స్టెరిలైజేషన్, వాక్సినేషన్ జరగని కుక్కల గురించి సమాచారమిచ్చి ఆ కార్యక్రమాల డ్రైవ్స్‌లో భాగస్వాములు కావొచ్చని పేర్కొంది. కార్యక్రమాలకు జంతు సంక్షేమ సంఘాలు కూడా సహకరించాలని కోరింది. తద్వారా నగరాన్ని సురక్షిత, ఆరోగ్యకర నగరంగా మార్చవచ్చని పేర్కొంది. వివరాలకు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాల్లో వెటర్నరీ అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించింది. -
మారని ఉద్యోగుల తీరు.. ఉదయం 11 దాటినా ఖాళీ కుర్చీలే దర్శనం
-
బల్దియాలో అంతే!.. మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు రాని సిబ్బంది
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం... బుధవారం ఉదయం 10.35 గంటలు⇒ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఒకటో అంతస్తులోని ఒక కార్యాలయంలోకి వెళ్లారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారో చూశారు. అవాక్కయ్యారు. 20 మందికి పైగా ఉండాల్సిన సెక్షన్లో ఐదుగురే ఉన్నారు. మిగతా వారేరీ? అంటే..ఇంకా రాలేదు అనే సమాధానం వచి్చంది.⇒ అలాగే ఒక్కో కార్యాలయం చూసుకుంటూ ఒక అంతస్తు తర్వాత మరో అంతస్తుకు జీహెచ్ఎంసీలో వివిధ విభాగాలున్న ఆరంతస్తుల వరకు వెళ్లారు. అన్ని చోట్లా దాదాపుగా అవే సీన్లు. ఉద్యోగులు 10.30 గంటలకే కార్యాలయాల్లో ఉండాల్సి ఉండగా, 11 గంటలు దాటినా లేరు. 11.30 గంటలవుతున్నా పూర్తిస్థాయిలో లేరు. ⇒ అప్పుడే వస్తున్నవారిని చూసి ఆఫీస్ టైమెప్పుడు? ఎప్పుడు వస్తున్నారంటే ఆలస్యమైందంటూ తడబడుతూ సమాధానమిచ్చారు. మ. 12 గంటలైనా ఇంకా వస్తున్న వారున్నా రు. ఆ తర్వాత వచి్చన వారు సైతం ఉన్నారు. మేయర్ ఆకస్మిక విషయం ఒక్కసారిగా గుప్పుమనడంతో చాలామంది హడావుడిగా వచ్చారు. అన్ని విభాగాల్లో దాదాపుగా ఇవే పరిస్థితులుండటంతో మేయర్ మండిపడ్డారు. ⇒ ప్రజాప్రభుత్వంలో ఇలా ఉంటే నడవదని, ‘ఉండాలనుకుంటే ఉండొచ్చు..లేకుంటే వెళ్లిపోవచ్చు’ అని సీరియస్ అయ్యారు. రేపట్నుంచి 10.35 గంటల వరకు మాత్రం హాజరు రిజిస్టర్లు కార్యాలయాల్లో ఉంచి, 10.40 గంటలకు తన కార్యాలయానికి పంపించాల్సిందిగా అధికారులకు సూచించారు. రాని వారికి మెమోలు జారీ చేయాల్సిందిగా అడిషనల్ కమిషనర్ (పరిపాలన) నళిని పద్మావతికి సూచించారు.‘ఫేస్ రికగ్నిషన్’ అమలు చేస్తాం.. తనిఖీల అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, క్రమశిక్షణ, సమయపాలన పాటించని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమయానికి రానివారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులపై హెచ్ఓడీల పర్యవేక్షణ ఉండాలన్నారు. పలు విభాగాల్లో ఉద్యోగులు ఆలస్యంగా వస్తూ, సాయంత్రం 4 గంటలకే వెళ్తున్నట్లు తన దృష్టికి రావడంతోపాటు పలు ఫిర్యాదులందడంతో ఈ తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఫేస్ రికగి్నషన్ అటెండెన్స్‌ను కూడా అమల్లోకి తెచ్చే ఆలోచన ఉందన్నారు. ఇది ఇక్కడ మామూలే.. మేయర్ తనకీ విషయం ఇప్పుడే తెలిసినట్లు చెప్పినప్పటికీ, బల్దియాలో అది సాధారణ తంతు. అందుకే ఒకసారి బల్దియాలో చేరిన వారు బదిలీలైనా పోకపోవడానికున్న కారణాల్లో ఇదీ ఒకటి. బల్దియా వ్యవహారాల గురించి బాగా తెలిసిన వారి సమాచారం మేరకు, మధ్యాహ్నం 12 గంటలైనా చాలామంది విధులకు రారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ‘లంచ్ టైమ్’ మొదలవుతుంది. బల్దియాలో సాధారణ లంచ్‌బ్రేక్ అంటూ లేదు. ఎవరిష్టం వారిది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ అది నడుస్తుంటుంది. 4 గంటలు దాటాక ఇళ్లకు తిరుగుముఖం ప్రారంభమవుతుంది. పై ఆదాయం వచ్చే వారు మాత్రం సీట్లలో సాయంత్రం 5.30 గంటలు దాటినా ఉంటారు. ఇక, కార్యాలయాల్లో ఉండేవారిలో సైతం అందరూ పనులు చేస్తున్నారని చెప్పలేం. కొందరు కంప్యూటర్లలో గేమ్స్ ఆడుతుంటారు. కొందరు ఎక్కువ సమయంలో ఫోన్లలో యూట్యూబ్ చిత్రాలు చూస్తుంటారు. బల్దియాలోని వైఫై సదుపాయంతో నిరి్వరామంగా ఫోన్లు, కంప్యూటర్లతో కాలం గడుపుతారు. అలాగని అంకితభావంతో పనిచేస్తున్నవారు లేరని చెప్పలేం. కాకపోతే వారి సంఖ్య స్వల్పం. ఉదయం సమయానికే వచ్చి పొద్దుపోయేంత వరకు తలమునకలుగా పనులు చేసే వారూ ఉన్నారు. అలాంటి వారివల్లే బల్దియా బతుకుతోంది. నిజంగా చర్యలుంటాయా ? మేయర్ హెచ్చరికల్ని ఎవరైనా ఖాతరు చేస్తారా అన్నది అనుమానమే. గతంలో ఆహార కల్తీ తనిఖీలకు సంబంధించి ఏ రోజు ఎన్ని తనిఖీలు జరిపారో, ఏం చర్యలు తీసుకున్నారో ఏ రోజుకారోజు సాయంత్రం తనకు నివేదికలు పంపాలని ఆదేశించారు. అది ఏమాత్రం అమలవుతుందో సంబంధిత విభాగానికి, మేయర్ కార్యాలయానికే తెలియాలి. బయోమెట్రిక్ ఉత్తుత్తిదేనా ? కారి్మకులతోపాటు కమిషనర్ దాకా బయోమెట్రిక్ హాజరు వేయాలని గతంలో చెప్పారు. ఒకరిద్దరు కమిషనర్లు సైతం దాన్ని పాటించారు. కనీసం ఉద్యోగులైనా బయోమెట్రిక్ హాజరును వినియోగిస్తున్నారో, లేదో తెలియని పరిస్థితి మేయర్ తనిఖీతో వెల్లడైంది. నిజంగా వినియోగిస్తే అంత ఆలస్యంగా ఎందుకు వస్తారు? ఒకవేళ ఆలస్యంగా వచ్చినా వారికి పూర్తి జీతాలెందుకు చెల్లిస్తున్నారు? అన్నవాటికి సంబంధిత అధికారులే సమాధానం చెప్పాలి. కొన్ని సీట్లు ఖాళీగా ఉండటం తనిఖీలో గుర్తించిన మేయర్..ఆ సీట్లు ఎవరివి అంటే వారి పేర్లు కూడా సహచరులు చెప్పలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని సెక్షన్లలో నాలుగైదు రోజులకోమారు వచ్చి ఒకేసారి అన్ని రోజులకూ సంతకాలు పెట్టుకుంటారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఇక బయోమెట్రిక్ ఎందుకు..దాని నిర్వహణకు లక్షలాది రూపాయల వ్యయమెందుకు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జోన్లు..సర్కిళ్లలో.. ప్రధాన కార్యాలయంలో పరిస్థితి ఇలా ఉంటే జోన్లు, సర్కిళ్లలోనూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ ఇంకో సదుపాయం కూడా ఉంది. లేని వారి గురించి సంబంధిత సెక్షన్లలో అడిగితే ప్రధాన కార్యాలయానికి పనిమీద వెళ్లారని టక్కున సమాధానం చెబుతారు. సర్క్యులర్ జారీ మేయర్ ఆదేశాల నేపథ్యంలో చర్యలకు సిద్ధమైన సంబంధిత అడిషనల్ కమిషనర్ (పరిపాలన) నళిని పద్మావతి ఆ మేరకు సర్క్యులర్ జారీ చేశారు. ఉద్యోగులంతా కార్యాలయ వేళల మేరకు ఉదయం 10.30 గంటలకల్లా హాజరు కావాలి. పది నిమిషాల గ్రేస్ సమయం మాత్రం ఉంటుంది. అంటే 10.40 గంటల వరకు మినహాయింపు ఇస్తారు. జిల్లా ఆఫీస్ మాన్యువల్ మేరకు మూడు పర్యాయాలు అంతకంటే ఆలస్యంగా వస్తే ఒక సీఎల్‌గా పరిగణిస్తారు. తరచూ ఆలస్యంగా హాజరయ్యే వారిపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. -
బల్దియాలో బదిలీలు నై?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ విభాగాల్లో బదిలీలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలోనూ బదిలీల పర్వం ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు పదిమంది మున్సిపల్ కమిషనర్లు, ఇతర త్రా విభాగాల్లో ఒకరో, ఇద్దరివో బదిలీలు మాత్రమే జరిగాయి తప్ప కీలక విభాగాల్లో ఉన్న వారివి జరగలేదు. వారితో పాటు సీనియర్లుగా ఎంతోకాలంగా ఇక్కడే పాతుకుపోయిన ఉన్నతస్థాయిల్లోని వారి బదిలీలూ జరగలేదు. వారిలో చాలా మంది తామిక్కడే ఉంటామని, తమనెవరూ కదల్చలేరని సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం మున్సిపల్ శాఖలో తమ హోదాకు తగిన పోస్టులు రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లలో ఖాళీ లేనందున తమను ఎక్కడికీ పంపలేరని చెబుతున్నారు. రాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారులు కమిషనర్లుగా ఉన్నందున, తమను ఎక్కడికీ ఎవరూ కదల్చలేరని భరోసాగా ఉన్నారు. అంతేకాదు బదిలీలు 40 శాతానికి మించి జరగరాదనే నిబంధనతోనూ అన్ని స్థాయిల పోస్టులను పరిగణనలోకి తీసుకొని తమను కదల్చలేరని పదేళ్లకుపైగా పని చేస్తున్నవారు సైతం నమ్మకంగా ఉన్నారు. వారే కాదు.. ఎంటమాలజీ వంటి విభాగాల్లోని వారిది సైతం అదే ధీమా. సీనియర్ ఎంటమాలజిస్టు పోస్టు లు రాష్ట్రంలో చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నందున తాము ఇక్కడే ఉంటామని ధీమాగా ఉన్నారు. కదలరు అంతే.. జీహెచ్ఎంసీలో దాదాపు రెండేళ్లు పనిచేసినా చాలు ఎవరైనే సరే ఇక్కడినుంచి ఇంకెక్కడికీ కదలరు. అందుకు కారణం ఇక్కడ లభించే సదుపాయాలు, పై ఆదాయాలు ఇంకెక్కడా లభించవు. అందుకే పదోన్నతులను సైతం కాదనుకొని ఇక్కడే ఉంటున్నవారు. ఉండేందుకు ప్రయతి్నస్తున్న వారూ ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కమిషనర్ స్థాయి వారికి, క్షేత్రస్థాయి పర్యటనలు ఉండేవారికి మాత్రమే వాహన సదుపాయం ఉంటుంది. ఇక్కడైతే సూపరింటెండెంట్లకు, అంతకంటే దిగువ స్థాయి వారికి సైతం వాహన సదుపాయం ఉంటుంది. అంతేకాదు.. కార్యాలయం నుంచి కాలు బయట పెట్టని వారికి సైతం వాహన సదుపాయం ఉంటుంది. దాన్ని మరోలా వినియోగించుకొని నెలవారీ ఆదాయం పొందుతున్న వారూ తక్కువేం లేరు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా వివిధ వై¿ోగాలకు అవకాశం ఉన్నందున, వాటికి అలవడిన వారు ఇక్కడి నుంచి కదలడం లేదు. వచ్చేవారే.. వెళ్లేవారు లేరు ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యుటేషన్లపై బల్దియాకు వచ్చిన వారు సైతం ఇక్కడి నుంచి కదలనే కదలరు. డిప్యుటేషన్లు ముగిసినా, ఏళ్లకేళ్లుగా తిష్టవేసిన ఎందరో ఉన్నారు. యూసీడీ విభాగం నుంచి మొదలు పెడితే ఇలాంటి వారికీ లెక్కేలేదు. బదిలీల సమయంలో సైతం వారిని కదల్చలేకపోతున్నారంటే వారి ‘పవర్’ ఏమిటో అంచనా వేసుకోవచ్చు. మున్సిపల్ శాఖకు చెందిన వారు ఎందరో కొందరు బదిలీ అవుతున్నప్పటికీ, ఇతర విభాగాల వారు మాత్రం కావడం లేదంటే వారి హవా ఎంతో ఊహించుకోవచ్చు. ఏళ్లకేళ్లుగా.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ హోదాలో కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. వీరిలో ఇరవయ్యేళ్లకుపైగా ఇక్కడే ఉంటున్నవారు ఎందరో ఉన్నారు. అంతేకాదు.. 30 నుంచి 40 ఏళ్లుగా నగరంలోనే ఉంటున్నవారు కూడా ఉన్నారంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. సీనియర్లయిన తమను ఎక్కడకూ పంపలేరని భావిస్తున్న వారు ఇతర ప్రాంతాల్లో తమ హోదాకు తగ్గ పోస్టుల్లేవంటున్నారు. కానీ.. ఇతర విభాగాల నుంచి ఇక్కడికి డిప్యుటేషన్‌పై వస్తుండగా లేనిది మున్సిపల్ శాఖ నుంచి ఇతర విభాగాలకు ఎందుకు డిప్యుటేషన్లపై వెళ్లడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్నింటికీ ఒకటే సమాధానం. సదుపాయాలు.. పై ఆదాయం. ప్రత్యేక చాంబర్లు. అందుకే వచ్చేవారు తప్ప వెళ్లేవారు కనబడటం లేదు. గతంలో ఇద్దరు ముగ్గురు అధికారులు మాత్రం అలా ఇతర విభాగాలకు వెళ్లారు. అలా మిగతా వారెందుకు వెళ్లరో వారితోపాటు ఉన్నతాధికారులకే తెలియాలి. బల్దియాకు భారం.. స్టాఫింగ్ ప్యాటర్న్‌పై ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు జీహెచ్ఎంసీలో ఆరుగురు అడిషనల్ కమిషనర్లు మాత్రమే ఉండాలి. కానీ ప్రస్తుతం డజను మంది ఉన్నారు. గతంలో ఐదారుగురు అడిషనల్ కమిషనర్లు మాత్రమే అన్ని విభాగాలనూ నిర్వహించేవారు. ప్రస్తుతం అధికారులు పెరిగారు. పనులు తగ్గాయి. పనులు తగ్గినందున సమర్థంగా పని చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎస్టేట్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్, ట్రేడ్‌లైసెన్స్‌ల వంటి విభాగాల ద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయంలో ఇరవై శాతం కూడా రావడం లేదంటే పరిస్థితిని అంచనా వేసుకోవవచ్చు. సీనియర్లు, పెద్ద హోదాల వల్ల వారి జీతభత్యాలు, సదుపాయాల కల్పనతో జీహెచ్ఎంసీకి ఆర్థిక భారం పెరుగుతోంది. అయినా.. మేమింతే. ఇక్కడే ఉంటామంటున్న వారిని ఎవరైనా కదల్చగలరా? వేచి చూడాల్సిందే! ప్రసాదరావు కమిటీ సిఫారసుల మేరకు సర్కిల్ కార్యాలయాలను 12 నుంచి 30కి పెంచారు. అయిదు జోన్లను ఆరుగా చేశారు. ప్రధాన కార్యాలయంలో 11 మంది అడిషనల్ కమిషనర్లను 6కు తగ్గించాలని సిఫారస్ చేస్తే ప్రస్తుతం డజను మంది ఉన్నారు. బదిలీలపై వచ్చేవారితో ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. టౌన్ న్‌ప్లానింగ్, రెవెన్యూ, హెల్త్, ఎస్టేట్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్ తదితర విభాగాలను బలోపేతం చేయాల్సి ఉందని కమిటీ సూచించింది. కానీ మెరుగవలేదు. -
ఎన్నాళ్ల నుంచో ఇబ్బంది పడుతున్నాం.. హీరో రాజశేఖర్ ట్వీట్
రోజువారీ జీవితంలో అందరికీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సామాన్యుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తుంటారేమో గానీ ప్రముఖుల విషయంలో మాత్రం కాస్త త్వరగానే పని పూర్తి చేస్తుంటారు. కానీ ఇప్పుడు తెలుగు హీరో, ప్రముఖ నటుడు రాజశేఖర్ మాత్రం తన అసహనాన్ని బయటపెడుతూ ట్వీట్ చేశారు. డ్రైనేజీ లీక్ సమస్య వల్ల ఎన్నాళ్ల నుంచో ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి)హైదరాబాద్ ఫరిదిలోని జూబ్లీహిల్స్ రోడ్ నం.70లో అశ్విని హైట్స్ దగ్గర డ్రైనేజీ లీకేజీ సమస్య ఎన్నాళ్ల నుంచో తమని వేధిస్తోందని, జీహెచ్ఎంసీ అధికారులకు ఎప్పుడో ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇప్పటికీ పరిష్కారం కాలేదని రాజశేఖర్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారించాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. లీకేజీ ఎలా ఉందో తెలియజేసే ఓ ఫొటోని కూడా పోస్ట్ చేశారు.చివరగా 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాలో నటించిన రాజశేఖర్.. కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. ఈయన కుమార్తెలు శివాత్మిక, శివాని మాత్రం పలు సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వీళ్లిద్దరి కెరీర్ ఓ మాదిరిగా సాగుతోంది.(ఇదీ చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా)There has been a drainage leak at Ashwini heights, Road no 70, Jubilee Hills, 500033 since ages. We have been speaking to @GHMCOnline to fix it, which hasn’t been done yet. Requesting @CommissionrGHMC @gadwalvijayainc @GHMCOnline to please, immediately look into it. pic.twitter.com/IXK8MrumZE— Dr.Rajasekhar (@ActorRajasekhar) July 29, 2024 -
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీకీ సీఎం ప్రత్యేక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరానికి మంగళవారం(జులై 16) సాయంత్రం వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్‌గా ఉండాలని ప్రత్యేకంగా ఆదేశించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.భారీ వర్షం కురిసేటపుడు 141 లాగిన్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఉండి వెంటనే నీళ్లు క్లియర్ చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలన్నారు. వర్షం కురిసినప్పుడు విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.