Goa Assembly Election 2022
-
ఆమె బీజేపీ ఏజెంట్.. మమ్మల్ని ఓడించారు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మతిస్థిమితం కోల్పోయారని, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించడం సరికాదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. శనివారం ఆయన ‘ఏఎన్ఐ’ మాట్లాడుతూ.. బీజేపీ ఏజెంట్‌గా మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘పిచ్చివాళ్లపై స్పందించడం సరికాదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 700 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీదీ దగ్గర ఉన్నారా? ప్రతిపక్షాల మొత్తం ఓట్లలో కాంగ్రెస్‌కు 20 శాతం ఓట్ షేర్ ఉంది. ఆమె వద్ద అంత ఓట్ షేర్ ఉందా? బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు, ఆ పార్టీ ఏజెంట్‌గా వ్యవహరించేందుకు ఆమె ఇలా మాట్లాడుతున్నార’ని అధిర్ రంజన్ చౌదరి అన్నారు. (క్లిక్: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు) కాంగ్రెస్ పార్టీ జీవం కోల్పోయిందని, ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తామని మమత వ్యాఖ్యానించిన నేపథ్యంలో అధిర్ స్పందించారు. ‘కాంగ్రెస్‌పై ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? కాంగ్రెస్ లేకుంటే మమతా బెనర్జీ లాంటి నాయకులు వెలుగులోకి వచ్చివుండేవారు ఉండేవారు కాదు. ఈ విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలి. బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు గోవాలో పోటీ చేసి కాంగ్రెస్‌ను ఓడించారు. గోవాలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారు, ఇది అందరికీ తెలుస’ని మండిపడ్డారు. (చదవండి: ప్రాంతీయ పార్టీలతో బీజేపీ వ్యతిరేక కూటమి) -
మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు
పణజి: గోవా శాసనసభ ఎన్నికల బరిలోకి దిగిన ఐదు జంటలకు మిశ్ర ఫలితాలు వచ్చాయి. మూడు జంటలు విజయాన్ని అందుకోగా, రెండు జంటలు ఓటమిపాలయ్యాయి. బీజేపీ తరపున పోటీ చేసిన రెండు జంటలు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక జంట విజయాన్ని సాధించాయి. ప్రతిష్టాత్మక పణజి నియోజకవర్గం నుంచి 716 ఓట్ల స్వల్ప మెజారిటీతో అటానాసియో మోన్సెరెట్టే గెలిచారు. ఆయన భార్య జెన్నీఫర్.. తలైగావ్ స్థానం నుంచి విజయాన్ని నమోదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి టోనీ ఆల్ఫ్రెడో రోడ్రిగ్స్ పై 2041 ఓట్ల ఆధిక్యంతో జెన్నీఫర్ విజయం సాధించారు. రాణే జంట విన్ బీజేపీ నేత, వైద్యశాఖ మంత్రి విశ్వజిత్ ప్రతాప్‌సింగ్ రాణే.. వాల్పోయి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన సతీమణి దేవీయ విశ్వజిత్ రాణే.. పోరియం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దేవీయ 13 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం విశేషం. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న దేవీయ మామగారు రంజిత్ జయసింగ్రావు రాణే కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడి నుంచి పోటీ చేశారు. అయితే ఆయన ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసిన విశ్వజిత్ రాణే రెండో స్థానంలో నిలిచారు. లోబో కపుల్స్ విక్టరీ కాంగ్రెస్ అభ్యర్థి మైఖేల్ విన్సెంట్ లోబో.. కలన్గుట్ స్థానం నుంచి గెలుపొందగా, ఆయన భార్య డెలిలా మైఖేల్ లోబో.. సియోలిమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1727 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి దయానంద్ రాయు మాంద్రేకర్ను డెలిలా ఓడించారు. మైఖేల్.. 4979 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి జోసెఫ్ రాబర్ట్ సెక్వేరాపై గెలిచారు. కవ్లేకర్ దంపతుల పరాజయం ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్లేకర్, ఆయన సతీమణి సావిత్రి కవ్లేకర్ కూడా పోటీలో ఉన్నారు. క్యూపెమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన చంద్రకాంత్ 3 వేల పైచిలుకు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్టన్ డికోస్టా చేతిలో ఓడిపోయారు. సంగెం అసెంబ్లీ సీటు భంగపడిన సావిత్రి.. ఇండింపెండెంట్‌గా పోటీ స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. (క్లిక్: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?) తృణమూల్ జంట ఓటమి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అల్డోనా నియోజకవర్గం నుండి కిరణ్ కండోల్కర్కు టికెట్ ఇవ్వగా, అతని భార్య కవిత.. థివిమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే వీరిద్దరూ ఓటమిపాలయ్యారు. (క్లిక్: గెలిచినా సంతోషం లేదంటున్న బీజేపీ అభ్యర్థి) -
గెలిచినా సంతోషం లేదంటున్న బీజేపీ అభ్యర్థి
పణజి: గెలిచినా సంతోషం లేదంటున్నారు బీజేపీ అభ్యర్థి అటానాసియో మోన్సెరెట్టే. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా భావించిన పణజి నియోజవర్గం నుంచి 716 స్వల్ప ఆధిక్యతతో ఆయన గెలిచారు. ఇక్కడి నుంచి స్వతంత్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్పల్ పారికర్.. అటానాసియోకు గట్టిపోటీ ఇచ్చారు. ‘బాబూష్’గా పాపులర్ అయిన అటానాసియోకు 6787 ఓట్లు, ఉత్పల్‌కు 6071 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎల్విస్ గోమ్స్ కు 3175 ఓట్లు దక్కాయి. అతి తక్కువ ఆధిక్యంతో గెలవడం పట్ల అటానాసియో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ ఫలితం నాకు చాలా అసంతృప్తి కలిగించింది. చాలా మంది హార్డ్‌కోర్ బీజేపీ ఓటర్లు ఉత్పల్‌కు ఓటు వేశారు. అందుకే ఆయనకు అన్ని ఓట్లు వచ్చాయి. స్థానిక బీజేపీ నాయకుల్లో కొందరు నాకు సహకరించలేదు. ఈ విషయాన్ని బీజేపీ నేతలకు చెప్పాను. రాష్ట్ర బీజేపీ విభాగం కార్యకర్తలకు సరైన సందేశం ఇవ్వలేదు. దీంతో నాకు నష్టం జరిగింది. నిజం చెప్పాలంటే నేను బీజేపీ, కాంగ్రెస్‌తో పోరాడాను. నన్ను అభిమానించే కొంతమంది మద్దతుదారుల సహాయంతోనే మేము సీటును నిలబెట్టుకోగలిగామ’ని ఆయన వాపోయారు. గోవాలో కచ్చితంగా తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అటానాసియో దీమా వ్యక్తం చేశారు. ప్రమోద్ సావంత్ తమ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కాగా, అటానాసియో సతీమణి జెన్నిఫర్ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం. (క్లిక్: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?) -
ఏంటీ పరిస్థితి..! ఆశలు సమాధి.. అక్కడా ‘చేయి’చ్చారు
నాలుగు రాష్ట్రాల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు గోవాలోనూ ఆశలు గల్లంతయ్యాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో చేతులెత్తేసిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ.. గోవాలోనైనా అధికారంలోకి వచ్చి పరువు కాపాడుకోవాలని ప్రయత్నించగా అక్కడా నిరాశే ఎదురైంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 12 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 20 స్థానాలు గెలిచింది. మెజారిటీకి అడుగు దూరంలో నిలిచింది. అయితే, స్వతంత్రులుగా గెలిచినవారిలో ముగ్గరు తమకు మద్దతు ఇస్తారని కమళ దళం ఇప్పటికే ప్రకటించింది. గోవాలో అధికారాన్ని తిరిగి చేపడతామని స్పష్టం చేసింది. ఇక గోవాలో హంగ్ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 21 సీట్లు రావాల్సి ఉంది.. అయితే ఇప్పటికే గోవాలో 20 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకుంది. టీఎంసీ రెండు స్థానాలు, ఆప్ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు నాలుగు స్థానాలు గెలుచుకున్నారు. కాగా ఒక్క ఇండిపెండెంట్‌ను లాక్కోగలిగినా బీజేపీ సర్కార్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో గోవాలో ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ, ఇండిపెండెట్లే కీలకం కానున్నారు. మరోవైపు ఉన్న ఎమ్మెల్యేలనైనా కాపాడుకునేందుకు తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేతలు రిసార్ట్‌కు తరలించారు. చదవండి: ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఏమన్నాడంటే.. గోవాలో మ్యాజిక్‌ఫిగర్‌కు చేరువలో బీజేపీ ఆగిపోవడంతో ప్రభుత్వ ఏర్పాట్లలో కమలనాథులు నిమగ్నమయ్యారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన సమర్పించాలని భావిస్తోన్న బీజేపీ ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. మరోవైపు బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అంటున్నారు. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ సహా స్వతంత్రుల మద్ధతు తమకే ఉందని ప్రమోద్ సావంత్ ధీమా వ్యక్తం చేశారు. చదవండి: సీఎంను ఓడించిన సామాన్యుడు.. ఎవరతను? -
గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?
Goa Assembly Election 2022 Results: పంజాబ్‌లో ఘన విజయం సాధించి దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గోవాలో బోణి కొట్టింది. పర్యాటక రాష్ట్రం గోవాలో రెండు స్థానాలను గెల్చుకుంది. బెనాలియ్, వెలిమ్ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. బెనాలిమ్ స్థానం నుంచి కెప్టెన్ వెంజీ విగాస్ గెలుపొందారు. క్రజ్ సిల్వా.. వెలిమ్ సీటును కైవసం చేసుకున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. తమ పార్టీ అభ్యర్థుల విజయంతో గోవాలో నిజాయితీ రాజకీయాలకు శ్రీకారం చుట్టామని ట్వీట్ చేశారు. బెనాలిమ్ నియోజకవర్గంలో కెప్టెన్ వెంజీ విగాస్కు 6267 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్ధి అయిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చర్చిల్ అలెమావోకు 4996, కాంగ్రెస్ అభ్యర్థి ఆంటోనియో ఫెలిసియానోకు డయాస్ 4609 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దామోదర్ (సమీర్) బందోద్కర్కు కేవలం 821 ఓట్లు మాత్రమే దక్కించుకున్నాయి. వెంజీ విగాస్ స్థానం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసిన క్రజ్ సిల్వాకు 5279 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి డిసిల్వా సావియోకు 5067 ఓట్లు, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బెంజమిన్ సిల్వా 4039 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సావియో రోడ్రిగ్స్ కు 1312 ఓట్లు వచ్చాయి. (క్లిక్: యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్) -
యూపీలో ఈసారి సీఎం ఆయనే!
-
గోవా ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
పణజి: హంగ్ అసెంబ్లీ ఏర్పడనుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో గోవాలో రాజకీయ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముందు జాగ్రత్తగా, కాంగ్రెస్ తన అభ్యర్థులందరినీ రిసార్టులో క్యాంప్ వేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేపీకి చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్టీ సీనియర్ నేతలంతా గోవా ఎన్నికల ఇన్చార్జి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ పూర్తవ్వగా, ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. ముందు జాగ్రత్తలో కాంగ్రెస్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ఓ కన్నేసి ఉంచేందుకు సీనియర్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు పి.చిదంబరం, రాష్ట్ర ఇన్చార్జి దినేశ్ గుండూరావు ఆదివారం నుంచి గోవాలోనే ఉన్నారు. గెలిచేందుకు అవకాశాలున్న ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో వీరు టచ్‌లో ఉన్నారు. ‘కాంగ్రెస్ సభ్యులంతా బుధవారం ఉత్తరగోవాలోని ఓ రిసార్టులో ఉంటారు. అక్కడి నుంచి వారు కౌంటింగ్ కేంద్రాలున్న పణజి, మార్గావ్లకు వెళతారు. ఫలితాల అనంతరం గెలిచిన వారు పార్టీ కార్యాలయానికి తిరిగి రావాల్సి ఉంటుంది’అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఢిల్లీలో ప్రమోద్ సావంత్ గోవా సీఎం ప్రమోద్ సావంత్ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. గెలుపు, ప్రభుత్వం ఏర్పాటునకు గల అవకాశాలపై వారితో చర్చించారు. గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్, కార్యదర్శి సతీశ్ ముంబై వెళ్లి గోవా ఎన్నికల ఇన్చార్జి దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరపనున్నారు. గెలిచేందుకు అవకాశం ఉన్న తమ సభ్యులందరినీ పణజిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలంటూ బీజేపీ ఆదేశించింది. బేరసారాలపై టీఎంసీ అప్రమత్తం గోవాలో గెలిచే ప్రతి సీటూ కీలకమైంది కావడంతో టీఎంసీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. బేరసారాలు, క్యాంపు రాజకీయాలకు ఎక్కువ అవకాశం ఉందని భావిస్తోంది. ఇటువంటి వాటిని ఎదుర్కొనేందుకు పార్టీకి చెందిన కీలక నేతలు అభిషేక్ బచ్చన్, డెరెక్ ఒ బ్రియాన్లతోపాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించింది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే.. 40 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ చెరో 16 సీట్లు గెలుచుకుంటాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మెజారిటీ సంఖ్య మాత్రం 21. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో జట్టుకట్టి రాష్ట్రంలో మొదటిసారిగా అభ్యర్థులను బరిలోకి దించిన టీఎంసీకి మూడు సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. దీంతో, గోమంతక్ పార్టీ, టీఎంసీలతోపాటు ఆప్‌తోనూ చర్చలకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ తెలిపింది. చిన్న పార్టీలు మాత్రం ఇందుకు బదులుగా సీఎం పోస్ట్‌నే కోరుతున్నాయని. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే ప్రభుత్వ ఏర్పాటు ఎవరికీ అంత సులభమైన వ్యవహారం కాదని పరిశీలకులు అంటున్నారు. -
మొదలైన నంబర్ గేమ్; ఎత్తుకు పైఎత్తులు.. ఎవరిది పైచేయి!
న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు గోవాలో నంబర్ గేమ్ మొదలయింది. తమకు మెజారిటీ రాకుంటే ఏం చేయాలనే దానిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ కొట్టిపారేసింది. గోవాలో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామని కమలనాథులు అంటున్నారు. ఢిల్లీలో సావంత్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి ఢిల్లీకి వచ్చారు. గోవాలో అధికారాన్ని నిలుపుకునే అవకాశాల గురించి ప్రధానికి ఆయన వివరించనున్నారు. గోవా బీజేపీ ఇన్ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కోసం తర్వాత ముంబైకి వెళ్లనున్నారు. బీజేపీ కసరత్తు అధికారాన్ని నిలుపుకుంటామని చెబుతూనే.. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), స్వతంత్రులతో చర్చలు బీజేపీ సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రమోద్ సావంత్‌కు మద్దతు ఇవ్వడానికి ఎంజీపీ మొగ్గు చూపడం లేదని సమాచారం. ఒకవేళ తమ మద్దతు తప్పనిసరి అయితే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎంజీపీ డిమాండ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎదురయితే బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ముందు జాగ్రత్త గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అటు కాంగ్రెస్ పార్టీ కూడా జాగ్రత్తగా పావులు కదుపుతోంది. అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమవుతున్నట్టు సూచనప్రాయంగా వెల్లడించింది. ‘బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామ’ని కాంగ్రెస్ నాయకుడు, గోవా ఇన్ఛార్జ్ దినేష్ గుండూరావు ఎన్డీటీవీతో ప్రకటించారు. సీనియర్ నాయకులు పి. చిదంబరం, డీకే శివకుమార్లను ఇప్పటికే గోవాకు పంపించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు వీరిద్దరూ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గెలిచే అవకాశమున్న కాంగ్రెస్ నేతలను ఇతర రాష్ట్రాలకు పంపించారు. గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా చూసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. (క్లిక్: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?) ఎగ్జిట్‌పోల్స్ ఏం చెప్పాయి తాజా ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 16 సీట్ల చొప్పున వస్తాయని తెలిపాయి. తృణమూల్‌కు 3, ఇతరులకు 5 సీట్లు వచ్చే అవకాశముందని అంచనా వేశాయి. ఎంజీపీతో పొత్తు పెట్టుకుని తొలిసారిగా గోవాలో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్‌కు 3 సీట్లు వస్తాయని అంచనా వేయడంతో ఆ పార్టీ ఈసారి కీలకం కానుంది. గోవాలో ఎవరు అధికారం చేపడతారో తెలియాలంటే మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే దాకా వేచిచూడాల్సిందే. (క్లిక్: గోవాలో హంగ్.. కింగ్ మేకర్ అయ్యేది ఎవరో?) -
గోవాలో హంగ్.. కింగ్ మేకర్ అయ్యేది ఎవరో?
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా భావిస్తున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 10న మొదలైన అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం సోమవారంతో ముగిశాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల హడావుడి మొదలైంది. ఎన్నికలు పూర్తవడంతో ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో.. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో వంటి అనేక అంశాలపై పోస్ట్ పోల్ సర్వేలు తమ అంచనాలను వెల్లడించాయి. ఈ క్రమంలో గోవాలో ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 40 స్థానాలున్న రాష్ట్రలో అధికారాన్ని చేపట్టేందుకు 21 సీట్లు రావాల్సి ఉంది. అయితే గోవాలో ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో ఆప్ రంగంలోకి దిగడంతో ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. చదవండి: మణిపూర్ ఎగ్జిట్ పోల్స్: కమలం Vs కాంగ్రెస్.. వారిదే పైచేయి గోవాలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొన్నప్పటికీ ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడం గమనార్హం. సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వివరాల ప్రకారం, బీజేపీ 16 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది. హంగ్ తప్పనిసరైతే.. కింగ్ మేకర్‌గా ఎవరు మారనున్నారో మార్చి 10న తేలనుంది. చదవండి: పంజాబ్‌లో వచ్చేది ఆ పార్టీయేనా? ఆసక్తికర ఫలితాలు టైమ్స్ నౌ బీజేపీ:14 కాంగ్రెస్-16 ఆప్-4 జీ న్యూస్ బీజేపీ:15 కాంగ్రెస్-16 ఆప్-2 ఇతరులు7 జన్ కీ బాత్ బీజేపీ: 17 కాంగ్రెస్ కూటమి 17 ఆప్: 1 ఇతరులు: 4 న్యూస్ఎక్స్-పోల్‌స్ట్రాట్ బీజేపీ:17-19 కాంగ్రెస్:11-13 సీఎన్ఎక్స్ బీజేపీ- 16-21 కాంగ్రెస్11-17 ఆప్0-2 ఇతరులు5-7 -
ఫలితాలు రానేలేదు .. ప్రశాంత్ కిషోర్‌పై సంచలన ఆరోపణలు
పనాజీ: రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్, గోవా తృణముల్ కాంగ్రెస్ చీఫ్ కిరణ్ కండోల్కర్ మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. కండోల్కర్.. ప్రశాంత్ కిషోర్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఫిబ్రవరి 14వ తేదీన గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే, ఈ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్‌కు ఎన్నికల సలహాదారులుగా ప్రశాంత్ కిషోర్ బృందం వ్యవహరించింది. ఇదిలా ఉండగా కిరణ్ కండోల్కర్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సలహాదారు I-PAC(ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) తమ పార్టీ అభ్యర్థులను విడిచిపెట్టిందని విమర్శించారు. కాగా, ప్రశాంత్ కిషోర్, అతని బృందం తీరుతో కలత చెందానని అన్నారు. ఈ క్రమంలోనే తాను తృణమూల్ కాంగ్రెస్ గోవా యూనిట్ చీఫ్ పదవిని వదులుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి I-PAC (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) సాయం అందించిన విషయం తెలిసిందే. మరోవైపు, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్.. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. కండోల్కర్.. ఆల్డోనా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయగా, అతని భార్య కవిత తృణమూల్ టిక్కెట్‌పై థివిమ్ నుండి పోటీ చేశారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగనుంది. -
ముగిసిన మూడు రాష్ట్రాల పోలింగ్
-
ప్రచార సమయం పెంపు.. పాదయాత్రలకు ఓకే
న్యూఢిల్లీ: ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న రాష్ట్రాల్లో కోవిడ్–19 సంబంధిత ఆంక్షలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం మరింతగా సడలించింది. పరిమిత సంఖ్యలో జనంతో పాదయాత్రలు చేసుకోవడానికి అనుమతిచ్చింది. అలాగే ప్రచార సమయాన్ని రోజుకు నాలుగు గంటలు పెంచింది. ఇప్పటిదాకా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల దాకా ప్రచారం చేసుకోవడానికి వీలుండేది. ఈ ప్రచార వేళలను ఈసీ ఉదయం 6 నుంచి రాత్రి పది గంటలకు వరకు పొడిగించింది. ఫలితంగా అభ్యర్థులు, పార్టీలకు రోజుకు నాలుగు గంటలపాటు అదనంగా ప్రచార సమయం లభించనుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు జనవరి 8న షెడ్యూల్‌ను ప్రకటిస్తూ కోవిడ్–19 కారణంగా ఈసీ పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. ర్యాలీలు, రోడ్‌షోలు, పాదయాత్రలపై నిషేధం విధించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ స్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న ఈసీ క్రమేపీ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. యాభై శాతం సామర్థ్యానికి పరిమితమై బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని ఈసీ శనివారం తెలిపింది. మరోవైపు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థల ఆంక్షలనూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని, బహిరంగ వేదికల్లో సమావేశస్థలి సామర్థ్యంలో ఎంత శాతం మందిని అనుమతించాలనే విషయంలో ఈసీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు పెట్టిన పరిమితుల్లో ఏది తక్కువగా ఉంటే.. అదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
స్వల్ప ఓట్ల తేడాతోనే తలరాత మారుతుంది!
Goa Assembly Election 2022: గోవా అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠని రేపుతున్నాయి. లెక్కకు మించిన పార్టీలు ఎన్నికల బరిలో నిలిచి అధికార బీజేపీకి సవాల్ విసురుతున్నాయి. చిన్న చిన్న నియోజకవర్గాలతో ఓటింగ్ మార్జిన్, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో నిలిచిపోయిన మైనింగ్ కార్యకలాపాలే ఈసారి కీలకంగా మారాయి. బీజేపీ అధికార వ్యతిరేకత, అంతర్గత సమస్యలతో అల్లాడిపోతూ ఉంటే, కాంగ్రెస్ ఫిరాయింపులతో సతమతమవుతోంది. ఈ రెండు పార్టీల మధ్యలో ఆమ్ ఆద్మీ నేనున్నానంటూ ఈసారి గట్టి ప్రయత్నమే చేసింది. గోవాలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. బీజేపీ హిందుత్వ ఎజెండా స్థానంలో అభివృద్ధి ఎజెండాను తీసుకువచ్చిన మనోహర్ పారికర్ వంటి దిగ్గజ నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి తీరని లోటుగా మారింది. పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్‌కు పనాజీ నుంచి టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం, కాంగ్రెస్ వలస నేతలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంతో ఏర్పడిన అంతర్గత సమస్యలు కమలనాథులకి తలనొప్పిగా మారాయి. ఇక కాంగ్రెస్ కూడా ఫిరాయింపుల సమస్యని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ నుంచి గత అయిదేళ్లలో ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, మాజీ ముఖ్యమంత్రి లూజినో ఫలేరియో తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. రాష్ట్ర స్థాయిలో సరైన నాయకులు లేకపోవడంతో కాంగ్రెస్ ఏకంగా 31 మంది కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. వారిలో 18 మంది మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో ఆప్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వార్డ్ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2017 ఎన్నికల్లో 39 స్థానాల్లో పోటీ చేసిన ఆప్ ఒక్క స్థానాన్ని గెలవలేకపోయినా 6.27 శాతం ఓట్లు సాధించడంతో పాటుగా అత్యధిక స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి కూడా మైనింగ్ పునరుద్ధరణ, క్యాథలిక్ బెల్ట్‌పై అధికంగా దృష్టి సారించి బీజేపీ, కాంగ్రెస్‌లకు సవాల్ విసురుతోంది. మమతా బెనర్జీ తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌తో తొలుత హల్చల్ చేశారు. కాంగ్రెస్ నుంచి నాయకుల్ని తమ పార్టీలోకి లాగినప్పటికీ ప్రచారంలో బాగా వెనుకబడిపోయారు. ఇక ఎన్సీపీ, శివసేన పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నా వారి ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. అయితే వివిధ పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. స్వల్ప ఓట్ల తేడాతోనే తలరాత మారుతుంది! 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా అతి చిన్న రాష్ట్రం కావడంతో ఓటింగ్ మార్జిన్ ఎప్పుడూ కీలకాంశంగా ఉంటుంది. కేవలం 500 ఓట్ల తేడాతోనే అభ్యర్థులు విజయం సాధించడం ఇక్కడే చూస్తుంటాం. ఒక్కో నియోజకవర్గంలో దాదాపుగా 26–28 వేల మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. దీంతో స్వల్ప ఓట్ల తేడాతో విజయావకాశాలు తారుమారు అవుతాయి. ఈసారి ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొని ఉండడంతో... ప్రజా నాడి తెలుసుకోవడం కష్టంగా మారింది. 2017 ఎన్నికల్లో ఏడు స్థానాల్లో వెయ్యి కంటే తక్కువ ఓట్లతోనే విజయం లభించింది. కాంగ్రెస్ పార్టీ కంకోలిమ్లో కేవలం 33 ఓట్లతో నెగ్గితే, మార్మగోవాలో బీజేపీ 140 ఓట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. మైనింగ్ నిలిచిపోయి.. 1.5 లక్షల మంది ఉపాధిపై దెబ్బ మైనింగ్ అంశం ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. దేశంలో ఉక్కు ముడి ఖనిజం, మాంగనీస్ ఉత్పత్తిలో గోవా మూడో స్థానంలో ఉంది. సుప్రీంకోర్టు మైనింగ్ కార్యకలాపాల్ని 2018లో నిలిపివేయడంతో 1.5 లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. 1961లో గోవా ఆవిర్భావం సమయంలో మైనింగ్ తవ్వకాల్ని 2007 వరకు లీజుకి ఇచ్చారు. లీజు గడువు ముగిసిపోయినా అక్రమ తవ్వకాలు నిరాటంకంగా సాగడంతో కొందరు కోర్టుకెక్కారు. దీంతో సుప్రీంకోర్టు మైనింగ్‌ను నిలిపివేసింది. ఆ తర్వాత జరిగే ఎన్నికలు ఇవే కావడంతో రోడ్డున పడ్డ కుటుంబాలు ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్‌లు మైనింగ్‌పై ఆధారపడే కుటుంబాలను ఈ ఎన్నికల్లో తరచూ కలుసుకున్నారు. కేజ్రివాల్ ఓ అడుగు ముందుకేసి తాము అధికారంలోకి వస్తే మైనింగ్ కార్యక్రమాలు పునరుద్ధరించేంత వరకు నిరుద్యోగ భృతి కింద వారికి నెలకి రూ.5,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక అధికార బీజేపీ అక్రమంగా మైనింగ్ చేసిన వారి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేసే పనిలో ఉంది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అక్రమ మైనింగ్ దారులపై విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. ప్రచారాస్త్రాలు ఇవే.. గోవా ఎన్నికల ప్రచారంలో అవినీతి ప్రతిపక్షాలకు అతి పెద్ద అస్త్రంగా మారింది. మాజీ గవర్నర్, బీజేపీ నాయకుడు సత్యపాల్ మాలిక్ స్వయంగా గోవాలో ప్రతీ చోటా అవినీతి ఉందని వ్యాఖ్యానించడంతో ఇదే ప్రధానాంశం అయింది. మేఘాలయా గవర్నర్‌గా బదిలీ కాకముందు మాలిక్ 2019 నవంబర్ నుంచి 2020 ఆగస్టు వరకు గోవా గవర్నర్‌గా ఉన్నారు. కాసినో (జూదం) సంస్కృతి కూడా ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా వినిపించింది. 2012లో బీజేపీ అధికారంలోకి రాకముందు కాసినోలపై నిషేధం విధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాసినో ఇండస్ట్రీకి అధికార పార్టీ కొమ్ము కాస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ జూదశాలలపై నిషేధం విధిస్తామని హామీ ఇస్తూ విస్తృతంగా ప్రచారం చేసింది. గోవా ప్రాంత సంస్కృతి పరిరక్షణ కూడా ప్రముఖంగా మారింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఏ భాషలో బోధన కొనసాగించాలన్న అంశం వివాదాస్పదమైంది. కొంకణి, మరాఠి, ఇంగ్లిషు భాషల్లో ఎందులో బోధించాలనే చర్చ కూడా జరుగుతోంది. గోవాకు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఈసారి కొన్ని పార్టీలు ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ వల్ల ప్రత్యేక హోదా రాదని మెజార్టీ గోవా ప్రజల అభిప్రాయంగా ఉంది. దీంతో ఆప్ ఈ అంశాన్ని తమకి అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర జనాభాలో 26 శాతం ఉన్న క్యాథలిక్ క్రైస్తవుల నివాస ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
‘ప్రేమ’కు శాపంగా మారిన గోవా ఎన్నికలు! ఆ రోజు డ్రై డే.. మరి ఎలా?
పనాజి: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ఎందరో ప్రేమికుల్లో కొత్త జోష్ని నింపుతోంది. డెస్టినేషన్ ప్రేమికుల రోజు జరుపుకోవాలనుకునే ప్రేమికులకు ఈసారి ఊహించని విధంగా పోలింగ్ దెబ్బ తగిలింది. కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఎంచక్కా గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేమికుల హుషారుపై ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నీళ్లు చల్లాయి. ఫిబ్రవరి 14నే గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో అక్కడ ఆ రోజు డ్రై డే. ఎన్నికల నియమావళి ఉండడంతో నైట్ క్లబ్బులు కూడా మూసేశారు. రాత్రి 11 గంటల తర్వాత మద్యం ఉండదు. హోటల్స్, బార్లలో ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటల నుంచి, 15వ తేదీ వరకు మందు దొరికే ప్రసక్తే లేదు. దీంతో చలో గోవా అనుకున్న జంటలు నిరాశకు లోనవుతున్నారు. సాధారణంగా వాలెంటైన్స్ డే సమయంలో గోవాకి పర్యాటకులు పోటెత్తుతారు. కరోనాతో ఇన్నాళ్లూ అల్లాడిపోయిన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పట్టి ఆంక్షల్ని సడలిస్తున్నారు. (చదవండి: చలికాలంలో చుండ్రు బాధా? జుట్టు మెరవాలంటే ఏం చేయాలి?) దీంతో పర్యాటక రంగం గాడిలో పడుతుందనుకుంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చేశాయి. ‘‘ఎన్నికలు మా ఆదాయాన్ని దెబ్బ తీస్తున్నాయి. నెల రోజుల పాటు నైట్ క్లబ్బుల్ని ఎందుకు మూసేశారు ? గోవా ప్రశాంతమైన రాష్ట్రం. ఎప్పుడూ ఘర్షణలు చెలరేగే యూపీలో కూడా ఇంత కఠిన నిబంధనలు లేవు’’ అని కాండోలిమ్‌లో వాటర్ ఫ్రంట్ యజమాని నందన్ కుడ్చద్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల విషయం తెలియక హోటల్స్‌ని బుక్ చేసుకున్నవారు ఇప్పుడు రద్దు చేసుకుంటున్నారని, కరోనా థర్డ్ వేవ్, ఆ వెంటనే ఎన్నికలు గోవా ఆదాయాన్ని బాగా దెబ్బ తీశాయని గోవా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ రాల్ఫా డిసౌజా చెప్పారు. ప్రతీ ఏడాది వాలెంటైన్స్ డేకి గోవాలో హోటల్స్ 90% వరకు నిండిపోతాయి. కానీ ఈసారి పావు వంతు కూడా నిండే అవకాశం లేదన్న అంచనాలున్నాయి. (చదవండి: ‘లాక్డౌన్’ కోసం పక్కా ప్లాన్.. రూ.2 లక్షలు ఇచ్చి కిడ్నాప్, ప్రేమతోనే అలా?) -
సర్కారీ కొలువుల్లో మహిళలకు 30 శాతం
పణజి: గోవాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఉపాధి కల్పనకు రూ.500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. సోమవారం నువెం అసెంబ్లీ సెగ్మెంట్లో బహిరంగ సభనుద్దేశించి ఆమె మాట్లాడారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో కుంభకోణాలకు చెక్ పెట్టడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. న్యాయ్ పథకం కింద బలహీన వర్గాల వారికి నెలకు రూ.6,000 అందిస్తామని చెప్పారు. మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంపు, మార్గోవా, పణజిల్లో వర్కింగ్ విమెన్‌కు హాస్టళ్లు, పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.80 మించకుండా చూడటం వంటి పలు హామీలను ఆదివారం విడుదల చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ప్రకటించింది. 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిచింది. కానీ చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
Goa Assembly Polls 2022: అక్కడందరూ‘ రాణె’లే..!
పనాజి: పేరులో ఏముందిలే అనుకుంటాం కానీ, కొన్నిసార్లు పేరు చుట్టూ చాలా వింతలు విశేషాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈసారి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పొరియె నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో అందరూ రాణె ఇంటి పేరు ఉన్నవారే ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు, గోవాకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రతాప్ సింగ్ రాణె గత అయిదు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గానికి రారాజు. ఇప్పుడు మాత్రం ఆయన పొరి యె రేసు నుంచి తప్పుకున్నారు. రాణెకోడలు దేవియ రాణె బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉండడంతో కుమారుడు తీసుకువచ్చిన ఒత్తిడికి తలొగ్గి ప్రతాప్ సింగ్ తన నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రంజిత్ సింగ్ రాణెని అభ్యర్థిగా రంగంలోకి దింపింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విశ్వజిత్ కృష్ణారావు రాణె ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో జరిగే ఎన్నికల ప్రచారంలో రాణె అన్నపేరు మారు మోగిపోతోంది. చదవండి: (Punjab Assembly Election 2022: మాల్వా చిక్కితే అసెంబ్లీ అందినట్టే) ఎవరీ రాణెలు? రాణెలు అంటే ప్రాచీన కాలంలో వివిధ రాజవంశాల్లోని సైనికులుగా కిరాయికి పని చేసేవారు. వీరిలో దయాదాక్షిణ్యం మచ్చుకైనా ఉండేవి కావు. రాజు చెప్పిందే వేదం. పన్నులు వసూలు చేయాలన్నా, శత్రువుల ప్రాణాలు తీయాలన్నా రాణెలకే ఆ పనులు అప్పగించేవారు. ప్రతాప్ సింగ్ రాణె పూర్వీకులు మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో పని చేసేవారు. కొన్ని తరాలుగా పన్నులు వసూలు చేసే పనుల్లో ఉన్న వీరంతా పోర్చుగీసుల హయాంలో పాలకులపై తిరగబడ్డారు. భూ హక్కులు కావాలంటూ ఒక విప్లవమే తీసుకువచ్చారు. చేసేదేమి లేక పోర్చుగీసు ప్రభుత్వం రాణెలకు భూములపై హక్కులు కల్పిస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నేటి మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో గ్రామాలకు గ్రామాలే వారి వశం అయ్యాయి. అప్పట్నుంచి సమాజంలో వీరి ప్రాబల్యం పెరిగిపోయింది. చదవండి: (ఆరునెలల్లోనే సీఎం అభ్యర్థి రేంజ్‌కి.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ) అలా గోవాలో ఇప్పుడు రాణెలు ఎక్కువ మందే కనిపిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న ప్రతాప్ సింగ్ రాణె (80) 16వ తరానికి చెందిన నాయకుడు. ఈసారి పొరియె నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. 1972 నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చిన ప్రతాప్ సింగ్ రాణెకు ఈ నియోజకవర్గంపై బాగా పట్టు ఉంది. అయితే పొరియె కాంగ్రెస్‌కు కంచుకోటగానే ముద్ర పడింది. ఈ ఎన్నికల్లో ఆయన కోడలు ప్రత్యర్థి పార్టీ బీజేపీ నుంచి రంగంలోకి దిగడంతో ఓటర్లలో కొంతవరకు గందరగోళం నెలకొంది. రాణె తన కుమారుడి కోసం నియోజకవర్గం నుంచి తప్పుకోవడంపై ఓటర్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
ఆరునెలల్లోనే సీఎం అభ్యర్థి రేంజ్‌కి.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా..? ఈ డైలాగ్ పండుగాడికే కాదు, అమిత్ పాలేకర్‌కు కూడా వర్తిస్తుంది. రాజకీయాలకు కొత్త. అయితేనేం గోవాలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఆరునెలల్లోనే సీఎం అభ్యర్థి రేంజ్‌కి ఎదిగారు. పార్టీలో చేరిన రెండు నెలల్లోనే గోవా వారసత్వ సంపద (సహజ వనరులు) కాపాడడానికి నిరాహారా దీక్షకు దిగి ప్రభుత్వం మెడలు వంచారు. కోవిడ్–19 సంక్షోభం నెలకొన్న వేళ మానవత్వంతో స్పందించి ఎందరి ప్రాణాలనో కాపాడారు. సామాజిక సమస్యల పట్ల అవగాహన ఎక్కువ. సామాజిక, ఆర్థిక తారతమ్యాలను రూపుమాపడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నారు. ఇప్పుడు ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ గోవా ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ►1976 సంవత్సరంలో పుట్టారు. గోవా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. ►కొద్ది రోజుల పాటు స్థానిక పత్రికలో జర్నలిస్టుగా పని చేశారు. ►అమిత్ పాలేకర్ తల్లి జ్యోతి పాలేకర్ బీజేపీ నాయకురాలు. మెర్సెస్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా 25 ఏళ్ల పాటు కొనసాగారు. మనోహర్ పారికర్ మరణానంతరం ఆమె రాజకీయాలను వీడారు. ►తల్లి ఇచ్చిన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చారు అమిత్. సామాజిక సేవ చేయాలన్న కోరికతో ఆప్‌లో చేరారు. ఇప్పుడు తల్లి జ్యోతి కూడా అమిత్‌కు అండగా ఉన్నారు. ►వృత్తి రీత్యా లాయర్. సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్‌గా 22 సంవత్సరాలుగా పని చేశారు. సివిల్, క్రిమినల్ కేసులు వాదిస్తూ పేరు తెచ్చుకున్నారు. ►అమిత్ భార్య రషిక కూడా లాయరే. గోవాలో రెస్టారెంట్ కూడా నడుపుతూ ఉంటారు. వారికి ఆరేళ్ల కూతురు ఉంది. ►చిన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కలలు కనేవారు. కానీ తండ్రికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో అది సాధ్యం కాలేదు. దీంతో యుక్త వయసు నుంచి ఆర్థిక, సామాజిక తారతమ్యాలను రూపుమాపాలని ఆలోచించేవారు. ►కరోనా సెకండ్ వేవ్ సమయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేశారు. ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు ►ఆక్సిజన్ కొరతపై తొలిసారిగా కోర్టుకెక్కిన కొంతమందిలో అమిత్ పాలేకర్ కూడా ఉన్నారు. 40 మందికిపైగా ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోవడంతో బాంబే హైకోర్టు (గోవా బెంచ్)లో పిటిషన్ దాఖలు చేశారు. ఆక్సిజన్ సరఫరా జరిగేలా చూశారు. ►అక్టోబర్ 2021లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ►పాత గోవాలో వారసత్వ సంపద పరిరక్షణకు చేసిన నిరాహార దీక్షతో పార్టీలోనూ, ప్రజల్లోనూ గుర్తింపు పొందారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ప్రశంసలు కూడా దక్కాయి. ►గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమిత్ పాలేకర్ పేరుని 2022, జనవరి 19న ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. ►అమిత్ పాలేకర్ భండారీ వర్గానికి చెందిన ఓబీసీ నాయకుడు. గోవా జనాభాలో 35 శాతం ఈ వర్గానికి చెందిన వారే. అందుకే కేజ్రివాల్ వ్యూహాత్మకంగా అమిత్‌ను ఎంపిక చేశారన్న విశ్లేషణలు ఉన్నాయి. ►ఢిల్లీలో సాధించిన అభివృద్ధి గోవాలో జరగాలంటే ఆప్కే ఓటు వెయ్యండి అన్న నినాదంతో ముందుకు వెళుతున్నారు. ►పాఠశాలలు, ఆసుపత్రులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని, ఆ పని తాను చేస్తామని అమిత్ ప్రచారం చేసుకుంటున్నారు. ►ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్ని కోరుతున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి నిరాహార దీక్షతో గుర్తింపు ఆప్‌లో చేరిన రెండు నెలల్లోనే పాత గోవాలోని వారసత్వ ప్రాంతమైన గొయెమ్కార్పాను పరిరక్షించడానికి, అందులో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరాహార దీక్షకు దిగారు. మొదట్లో ఎవరూ ఈ దీక్షని పట్టించుకోలేదు. కానీ ఒక్క రోజులోనే పరిస్థితులు మారిపోయాయి. అమిత్ దీక్షకు స్థానిక ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీక్షా శిబిరానికి జనం వెల్లువెత్తారు. దీంతో అయిదు రోజుల్లోనే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ నిర్మాణాలను కూల్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అమిత్ సాధించిన తొలి విజయం అది. -
ఒట్టేసి చెబుతున్నాం.. పార్టీ మారబోం
పనాజి: గోవా రాజకీయాలంటేనే ఫిరాయింపులకు పెట్టింది పేరు. 40 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి కండువాలు మార్చేస్తూ ఉంటారు. దాంతో ప్రభుత్వాలు ఎప్పుడు పడిపోతాయో చెప్పలేం. ఈ దెబ్బకు సీఎంగా ఎవరున్నా నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఈ ఫిరాయింపుల సంస్కృతికి ఇక స్వస్తి చెప్పాలంటూ కాంగ్రెస్ నినదిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయంలో కొత్త సంప్రదాయానికి తెర తీశారు. పార్టీకి విధేయులుగా ఉంటామంటూ కాంగ్రెస్ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. 37 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, భాగస్వామ్య పక్షమైన గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్‌పీ)కి చెందిన ముగ్గురు శుక్రవారం రాహుల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సమక్షంలో ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. గెలిచాక పార్టీ ఫిరాయించబోమని ముక్తకంఠంతో చెప్పారు. పార్టీ మారబోమని వీరంతా ఇప్పటికే ఆలయం, చర్చి, మసీదుల్లో ఒట్టు వేశారు. ఇప్పుడు రాహుల్ ముందూ ప్రతిజ్ఞ చేసి ఆ మేరకు ఆయనకు విధేయతా పత్రం సమర్పించారు. ఈసారి కాంగ్రెస్, జీఎఫ్‌పీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, అందుకు అన్నివిధాలా సహకరిస్తామని అందులో పేర్కొన్నారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలిచినా ఏకంగా 15 మంది బీజేపీలోకి ఫిరాయించారు. దీంతో ఈసారి రాహుల్ ఇలా అభ్యర్థులతో ముందే ప్రమాణం చేయించుకున్నారు. -
ఓటర్లకు అఫిడవిట్ కాపీలు; కేజ్రీవాల్ వెరైటీ ప్రచారం
పణజి: విలక్షణ ఆలోచనలు, విభిన్న పోకడలతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. గోవా మెరుగైన భవిష్యత్తు కోసం తమ పార్టీకి ఓటు వేయాలని బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలను ‘ఆప్’ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ‘బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలు ఆప్‌లో చేరేందుకు తమ పార్టీలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. మీ పిల్లలు, గోవా భవిష్యత్తు కోసం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు గుర్తుకు ఓటు వేయండి. దయచేసి ఈసారికి మీ పార్టీని మరచిపోండి’ అని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే నిజాయితీగా పనిచేస్తామని ‘ఆప్’ అభ్యర్థులతో అఫిడవిట్లపై సంతకాలు చేయించారు కేజ్రీవాల్. అంతేకాదు గెలిచిన తర్వాత పార్టీ ఫిరాంచబోమని, ‘ఆప్’నకు విశ్వాసపాత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ సమక్షంలో గోవా ముఖ్యమంత్రి అభ్యర్థి అమిత్ పాలేకర్ అభ్యర్థులందరితో ప్రమాణం చేయించారు. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... చెల్లెలి అలుపెరుగని పోరాటం) ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మా పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులందరూ నిజాయితీపరులే. అయితే వీరంతా నిజాయితీపరులని ఓటర్లు నిర్ధారించేందుకు ఈ అఫిడవిట్లు అవసరం. మా అభ్యర్థులు తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సంతకం చేసిన అఫిడవిట్ కాపీని పంపిణీ చేస్తారు. అలా చేయడం ద్వారా, మా అభ్యర్థులు అఫిడవిట్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై విశ్వాస ఉల్లంఘన దావా వేసే అధికారాన్ని మేము ఓటర్లకు అందిస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేపథ్యాలను పరిశీలించేందుకు ప్రతి ఒక్కరికీ అనుమతి ఉంది. గోవా ప్రజల నమ్మకాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పటికీ వమ్ము చేయద’ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గోవాలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల్లో ఆప్ అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. (చదవండి: బీజేపీకి తప్పని తిరుగుబాట్ల తలనొప్పి) -
బీజేపీకి తప్పని తిరుగుబాట్ల తలనొప్పి
పణజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ నాలుగు స్థానాల్లో అసమ్మతిని ఎదుర్కొంటోంది. పనాజీ, మాండ్రేమ్, సంగూమ్, కుంభర్జువా స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు కమలం పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇటీవల బీజేపీని వీడిన ఉత్పల్ పారికర్ ప్రతిష్టాత్మక పణజి స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2019లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న అటానాసియో మోన్సెరట్టెపై ఆయన పోటీ చేస్తున్నారు. మాండ్రెమ్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ బీజేపీకి తిరుగుబాటు తప్పలేదు. మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వరకు బీజేపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇటీవలే కమలం గూటికి నుంచి బయటకు వచ్చారు. 2017లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను ఓడించిన దయానంద్ సోప్టేపై ఆయన బరిలోకి దిగుతున్నారు. 2019లో దయానంద్ అధికార బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. (చదవండి: ప్రధాన పార్టీలకు.. వలసల దెబ్బ) సంగెం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవేలార్ భార్య సావిత్రి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆమె.. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుభాష్ ఫాల్దేశాయ్‌పై పోటీకి రెడీ అయ్యారు. సంగెం స్థానానికి ప్రస్తుత సభలో స్వతంత్ర శాసనసభ్యుడు ప్రసాద్ గాంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి నిలబడ్డారు. కుంభార్జువా నియోజకర్గంలోనూ కాషాయ పార్టీకి తిరుగుబాటు తప్పలేదు. రోహన్ హర్మల్కర్ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పాండురంగ్ మద్కైకర్ భార్య జైనితా మద్కైకర్పై ఆయన పోటీ చేస్తున్నారు. అయితే పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కుమారుడు సిద్ధేష్ నాయక్‌ను బీజేపీ శాంతింపజేయడంతో కొంతలో కొంత ఊరట. కాగా, గోవా అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో ఫిబ్రవరి 14న జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. (చదవండి: పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి) -
గోవా రాజకీయాల్లో కీలక మార్పు.. పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి
పనాజీ: గోవా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రతాప్ సింహ రాణే .. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. గతేడాది డిసెంబరులో కాంగ్రెస్ పార్టీ ఆయనను పోరియం నియోజకవర్గం నుంచి పోటీకి ఎంపిక చేసింది. అయితే, తాజాగా, ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం గోవా రాజకీయాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. అయితే, భారతీయ జనతా పార్టీ పోరియం నియోజక వర్గం నుంచి ప్రతాప్ రాణే కోడలు.. దేవీయ విశ్వజిత్ రాణేను బరిలో బరిలో దింపింది. అయితే, దీనిపై ప్రతాప్ సింహ రాణే (87ఏళ్లు) స్పందించారు. ప్రస్తుతం వయసురీత్యా శారీరక సమస్యల వలనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఒత్తిడులు లేవని స్పష్టం చేశారు. కాగా, ప్రతాప్ సింహ రాణే పోరియం నియోజక వర్గం నుంచి 11 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అత్యధిక కాలం గోవా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అదే విధంగా, ఆయన కుమారుడు విశ్వజీత్ రాణే గోవా బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. విశ్వజిత్ రాణే.. 2017లో బీజేపీలో చేరారు. అయితే, దీనిపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి చిదంబరం స్పందించారు. ప్రతాప్ రాణే పోటీ నుంచి తప్పుకోవడం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ అన్నారు. పోరియం నియోజక వర్గానికి ఆయనకు.. 50 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఆ నియోజక వర్గం కాంగ్రెస్‌కు కంచు కోటలాంటిదన్నారు. అయితే, మీరే ఆ నియోజక వర్గం నుంచే పోటీ చేయండి లేదా సరైన నాయకత్వ లక్షణాలున్న అభ్యర్థిని సూచించాలని ప్రతాప్ సింహ రాణేను కోరారు. చదవండి: యువతిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి.. సాముహిక అత్యాచారం.. ఆపై -
బీజేపీకి గుడ్‌బై.. ఏ పార్టీలోకి వెళ్లను.. ‘ఏక్ నిరంజన్’: మాజీ సీఎం
పణజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్రెమ్ స్థానం నుంచి ఒంటరిగా బరిలో దిగనున్నట్టు ఇటీవల బీజేపీకి గుడ్‌బై చెప్పిన గోవా మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రకటించారు. శనివారమే పార్టీకి రాజీనామా లేఖను పంపానని, అన్ని పదవులను వదిలేశానని చెప్పారు. రాజీనామాకు ముందు వరకు ఆయన బీజేపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. తాను రాజీనామా చేశాక చాలా పార్టీలు సంప్రదింపులు జరిపాయని, తాను ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తానన్నారు. మాండ్రెమ్ టికెట్‌ను తనకు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే దయానంద్ సోప్టేకు పార్టీ ఇవ్వడంతో పర్సేకర్ తీవ్ర నిరాశ చెందారు. 2002 నుంచి 2017 వరకు మాండ్రెమ్ ఎమ్మెల్యేగా పర్సేకర్ గెలుపొందుతూ వచ్చారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సోప్టే.. పర్సేకర్‌ను ఓడించారు. తర్వాత 2019లో బీజేపీలో చేరారు. పర్సేకర్ 2014 నుంచి 2017 వరకు గోవా సీఎంగా పని చేశారు. అప్పటి గోవా సీఎం మనోహర్ పరీకర్ కేంద్ర రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పర్సేకర్‌ను సీఎంగా పార్టీ ఎన్నుకుంది. -
గోవా: కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.. పార్టీ ఫిరాయిస్తే ఇక అంతే!
పనాజీ: గోవాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థల జాబితాను ఆదివారం ప్రకటించింది. రాష్టంలోని 40 స్థానాలకుగాను 36 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను వెల్లడించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి పార్టీ ఫిరాయిస్తే మాత్రం మళ్లీ కాంగ్రెస్‌లో చేర్చుకోబోమని తేల్చిచెప్పారు. గతంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు ఘటనలు కాంగ్రెస్‌పార్టీకి నష్టం కలిగించాయని గుర్తుచేశారు. 2017లో 17 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని తెలిపారు. దానికి గాల కారణం.. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ ఫిరాయించడమని పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు ఈ ఎన్నికల తర్వాత జరగకూడదని అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీలో సమున్నతమైన స్థానం లభించిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక పార్టీ ఫిరాయిస్తే మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉండదని చిదంబరం పేర్కొన్నారు. 40 స్థానాలు ఉన్న గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. -
బీజేపీకి మరో ఎదురుదెబ్బ.. మాజీ సీఎం కూడా..
పణజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ శుక్రవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా రాజీనామా అస్త్రాన్ని సంధించారు. బీజేపీకీ రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇక బీజేపీలో కొనసాగాలని కోరుకోవడం లేదని, రాజీనామా చేయాలనుకుంటున్నట్టు పీటీఐతో చెప్పారు. భవిష్యత్ కార్యాచరణ తర్వాత ప్రకటిస్తానని తెలిపారు. పర్సేకర్ ప్రస్తుతం గోవా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. పార్టీ కోర్ కమిటీ సభ్యుడి కూడా ఆయన కొనసాగుతున్నారు. 2002 నుంచి 2017 వరకు మాండ్రేమ్ అసెంబ్లీ నియోజకవర్గానికి పర్సేకర్ ప్రాతినిధ్యం వహించారు. తాజా ఎన్నికల్లో ఈ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే దయానంద్ సోప్టేకు కట్టబెట్టింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన పర్సేకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే 2019లో మరో 9 మంది నాయకులతో కలిసి దయానంద్ అధికార బీజేపీలో చేరారు. (చదవండి: బీజేపీ గెలవాలని కోరుకుంటున్న ములాయం!) పర్సేకర్.. 2014 నంచి 2017 వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను రక్షణ మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పర్సేకర్‌ను సీఎంగా నియమించారు. కాగా, ఫిబ్రవరి 14న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికలకు 34 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. (చదవండి: ఇక బీజేపీకి గుడ్ బై: మాజీ సీఎం తనయుడు) -
కరోనానే పెద్ద పరీక్ష!
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు రోజురోజుకీ పెరుగుతున్న కరోనా తీవ్రత పెద్ద పరీక్ష పెడుతోంది. ఓ వైపు పెరుగుతున్న కేసులకు తోడు మరోవైపు అనుకున్న స్థాయిలో ముందుకు సాగని వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇటు ఎన్నికల సంఘానికి అటు రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్‌గా పరిణమిస్తోంది. గడిచిన పది రోజుల్లోనే ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో 70 శాతానికి పైగా కేసులు పెరగడం, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం లేకపోవడం కలవరపెట్టేలా ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేయాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆయా రాష్ట్రాలను ఆదేశించినప్పటికీ అది క్షేత్రస్థాయిలో ఎంతమేర పుంజుకుంటుందన్నది ప్రశ్నగానే మారింది. మరిన్ని రోజులు నిషేధమే! దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత ఇంతకింతకీ పెరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈ నెల 8న దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4.72 లక్షలు ఉండగా, అదే రోజున రోజువారీ కేసుల సంఖ్య 1.41 లక్షలుగా ఉంది. అయితే క్రమంగా పెరుగుతూ ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 20.18 లక్షల వరకు చేరగా, రోజువారీ కేసులు 3.47 లక్షలకు చేరాయి. ఇక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క యూపీలోనే పది రోజుల కిందటి కేసుల సంఖ్యతో పోలిస్తే కేసులు 11 వేల నుంచి 18వేలకు చేరాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ దృష్ట్యానే బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలపై ఈ నెల 15వరకు ఉన్న నిషేధాన్ని ఎన్నికల సంఘం 22 వరకు పొడిగించింది. 22 తర్వాత సైతం దీనిపై షరతులతో కూడిన సభలకు అనుమతించే అవకాశాలున్నాయని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేయాలని పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ రాష్ట్రాల్లో మొదటి విడత వ్యాక్సినేషన్ పంజాబ్‌లో 79 శాతం, మణిపూర్‌లో 58 శాతం మాత్రమే పూర్తయింది. యూపీలో రెండో విడత వ్యాక్సినేషన్ 56.40 శాతమే పూర్తవడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని ఈసీ సూచించింది. అయితే ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా లేకపోవడం, మరణాల రేటు తక్కువగా ఉండటం కొంత ఉపశమనం ఇస్తోంది. బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఓటర్లను చేరుకునేందుకు నానాయాతన పడుతున్న పార్టీలు, ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ప్రచారాలు మొదలుపెట్టాయి. డిజిటల్ క్యాంపెయినింగ్ ప్రక్రియ ముమ్మరంగా చేస్తున్నప్పటికీ ఏ ప్లాట్ఫారంలో లేని ఓటర్లను చేరుకోవడం అన్ని పార్టీలకు పెద్ద సవాలుగా మారనుంది.