GROUND WATER
-
ఆదమరిస్తే జల సంక్షోభమే!
సాక్షి, అమరావతి: వరద జలాలను ఒడిసి పట్టడం.. భూగర్భ జలాలను పెంపొందించడం వంటి జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే దేశంలో తీవ్ర జల సంక్షోభం తలెత్తే ప్రమాదముందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆందోళన వ్యక్తంచేసింది. గ్రీన్హౌస్ ప్రభావంవల్ల భూతాపం క్రమేణా పెరుగుతుండటం.. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికమవుతుండటంవల్ల రుతుపవనాల గమనంపై తీవ్ర ప్రభావం చూపుతోందని దేశంలో నీటి లభ్యతపై ఇటీవల చేసిన తన అధ్యయనంలో పేర్కొంది. పర్యవసానమే అతివృష్టి.. అనావృష్టి పరిస్థితులతోపాటు వర్షపాత విరామాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని తెలిపింది. అతివృíÙ్ణ పరిస్థితులు ఏర్పడినప్పుడు వరద జలాలను ఒడిసిపట్టి జలాశయాలు నింపుకోలేకపోవడం.. భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపట్టకపోవడంవల్ల నీటి ఎద్దడికి దారితీస్తోందని వెల్లడించింది. ఫలితంగా సాగునీటితోపాటు తాగునీటికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. కర్ణాటక రాజధాని బెంగుళూరులో నెలకొన్న తీవ్రమైన నీటి ఎద్దడిని ఇందుకు ఉదహరిస్తోంది.ఇలాగైతే కష్టమే..! పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తంచేసింది. సాగునీటి సమస్య పంటల సాగుపై ప్రభావం చూపుతుందని.. ఇది ఆహార సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొంది. నీటి లభ్యతను పెంచేలా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాల్లో నిల్వచేయడం, జల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జల సంక్షోభాన్ని నివారించవచ్చని కేంద్రానికి సూచించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించి.. నదీ జలాలను మళ్లించి వాటిని నింపడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవాలని స్పష్టంచేసింది. నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపర్చుకోకుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదని తేలి్చచెప్పింది. అలాగే, ఏటా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరగకుంటే ఆహార సంక్షోభానికి కూడా దారితీస్తుందని సీడబ్ల్యూసీ హెచ్చరించింది.తలసరి నీటి లభ్యత తగ్గుముఖం.. ఇక దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తలసరి నీటి లభ్యత పెరగడంలేదనే అంశాన్ని కూడా సీడబ్ల్యూసీ ప్రస్తావించింది. తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (ఒక క్యూబిక్ మీటర్ వెయ్యి లీటర్లకు సమానం) ఉంటే.. 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోయిందని వెల్లడించింది. అలాగే, నీటి లభ్యతను పెంచే చర్యలు చేపట్టకపోతే 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1,282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోతుందని అంచనా వేసింది.సీడబ్ల్యూసీ అధ్యయనంలో ఏం తేలిందంటే..దేశంలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన అంశాలేమిటంటే.. » దేశంలో ఏటా సగటున 1,298.60 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. తద్వారా 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. » ఈ వర్షపాతంవల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా.. ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. » ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలిసిపోతున్నాయి. అంటే.. వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్లు వెల్లడవుతోంది. » దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటినిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వచేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను వాడుకుంటున్నాం. » ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. -
9 అడుగుల్లో బోరు.. కరెంటు లేకున్నా 20 ఏళ్లుగా నీరు
సాక్షి, ఆదిలాబాద్: మండుతున్న ఎండలతో రాష్ట్రంలో నీటి సంక్షోభం తీవ్రమవుతోంది. చెరువులు ఎండిపోతున్నాయి. పంటలకు నీరందక చేలలో బీటలు కనిపిస్తున్నాయి. మరో వైపు తాగునీటి సమస్య కూడా జఠిలమవుతోంది. భూగర్భ జలాలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దుబ్బగూడ (ఎస్)లోని ఓ గిరిజన రైతు పంట చేనులో మాత్రం బోరు నుంచి జలం ఉబికి వస్తూనే ఉంది. విచిత్రం ఏమిటంటే అసలు ఈ బోరుకు కరెంటు కనెక్షనే లేదు. దాదాపు 20 ఏళ్లుగా సహజంగా నీళ్లు ఇలా వస్తూనే ఉన్నాయి. 2005 నుంచి కొనసాగుతున్న ధార.. గిరిజన రైతు టేకం తుకారాంకు 26 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన ముగ్గురు కుమారులతో కలిసి దీన్ని సాగుచేస్తున్నాడు. 2005లో తుకారాం చేనులో బోరు వేయించాడు. అప్పుడు 9 అడుగులకే నీళ్లు ఉబికి వచ్చాయి. కరెంటు కనెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఆ జలధార ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం 13 ఎకరాల్లో జొన్న, గోధుమ పంటలు పండిస్తున్నాడు. వీటికి నిరంతరాయంగా బోరు నుంచి వచ్చే నీరే అందిస్తున్నాడు. ఆర్టీసియన్ బావి కారణంగానే.. దీన్ని భూగర్భ జలశాస్త్రం ప్రకారం ఆర్టిసియన్ బావి అంటారు. దుబ్బగూడ (ఎస్)కు సమీపంలో గుట్ట ఉంది. వర్షం కురిసినప్పుడు ఆ గుట్ట ప్రాంతంలో జలం రీచార్జ్ అవుతుంది. అక్కడి నుంచి నిలువుగా ఉన్నటువంటి పొర దిగువన గుట్ట దిగిన తర్వాత తుకారాం చేనులో నుంచి వెళ్తుంది. పైపొర గుట్ట పైభాగం నుంచి మొదలు కాగా చివరి పొర తుకారాం చేనును దాటి వెళ్తోంది. దుబ్బగూడలో ఒక లేయర్లో భూగర్భ జలాలు పైవరకు ఉంటాయి. మధ్య ప్రాంతంలో ఎవరైనా బోరు వేసినప్పుడు ఈ పొరను తాకడంతో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఒక ట్యూబ్‌కు మధ్యలో ఎక్కడైనా పంచర్ పడ్డప్పుడు గాలి, నీరు ప్రెషర్‌తో బయటకు వచ్చినట్లే ఇక్కడ కూడా పైపొర, చివరి పొర మధ్యన బోరువేసినప్పుడు నీటికి బయటకు వెళ్లే మార్గం ఏర్పడింది. గుట్టకు సమీపంలో ఉండే ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ రూరల్ మండలం బోరింగ్‌గూడలో కూడా ఇలాగే నీళ్లు ఉబికి వస్తాయి. –టి. పుల్లారావు,అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్, ఆదిలాబాద్ -
కిడ్నీ వ్యాధితో ఊరు ఖాళీ
తాంసి: చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం.. ప్రశాంతమైన వాతావరణం. కాలుష్యానికి ఏమాత్రం తావులేదు. గ్రామంలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉంది. సీసీ రోడ్లు, డ్రెయినేజీ లైన్లు, విద్యుత్ సౌకర్యం తదితర వసతులు న్నాయి. కానీ సరైన రక్షిత నీటి సరఫరా లేదు. ఇప్పుడదే తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామస్తుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎంతలా అంటే ఏ ఒక్క కుంటుంబం కూడా మిగలకుండా ఊరు ఖాళీ చేసి వెళ్లిపోయేంతగా..! విధిలేని పరిస్థితుల్లో భూగర్భ జలాలనే తాగునీటిగా వినియోగిస్తున్న గిరిజనుల్లో పలువురు కిడ్నీ (మూత్రపిండాలు) సంబంధిత వ్యాధుల బారిన పడటం, ఇటీవలి కాలంలో మరణాల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. గడిచిన మూడేళ్లలో ఈ వ్యాధి బారిన పడి 12 మంది మృత్యుఒడికి చేరారు. గ్రామంలోని చేద బావులు, చేతిపంపుల నీటిని తాగడం వల్లే తమ కిడ్నీలు పాడవుతున్నాయని ఆందోళనకు గురవుతున్న భీంపూర్ మండలం కమట్వాడ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవింద్పూర్ గిరిజనులంతా గ్రామాన్ని ఖాళీ చేసి మరో చోటికి వెళ్లిపోయారు. హామీలిచ్చి మరిచిపోయారు ఆదిలాబాద్ జిల్లా గోవింద్పూర్ గ్రామంలో 40 ఆదివాసీ గిరిజన కుటుంబాలు (200 మంది జనాభా) ఉన్నాయి. వారికి తాగునీటి వసతి సరిగ్గా లేదు. మిషన్ భగీరథ నీరు పూర్తిస్థాయిలో రావడం లేదు. దీంతో గ్రామంలోని రెండు చేతి పంపులతో పాటు చేద బావుల నీటినే గిరిజనులువినియోగించే వారు. అయితే గడిచిన మూడేళ్లలో వరుసగా కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణాలు సంభవిస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. యువకులు సైతం వ్యాధుల బారిన పడుతుండటంతో ఊరు వదిలి వెళ్లడం ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించిన ‘సాక్షి’ 2022 నవంబర్ 4న ‘ఊరొదిలిపోతున్నారు..’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో కొందరు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామాన్ని విడిచి వెళ్లవద్దని, గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, అవసరమైన వైద్య పరీక్షలు చేస్తామని భరోనా ఇచ్చారు. కానీ హామీలేవీ నెరవేరలేదు. క్రమంగా జబ్బుపడే వారి సంఖ్య, మరణాలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారు ఊరు ఖాళీ చేసి పక్కనే ఉన్న అడవి సమీపంలో గుడిసెలు వేసుకున్నారు. ఇక్కడ వారికి ఎలాంటి వసతులు లేవు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో గుడ్డి దీపాలతో నెట్టుకొస్తున్నారు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఇతర అవసరాల కోసం పక్కనున్న చెరువు, వాగు నీటిని వినియోగిస్తున్నారు. నీటిలో అధికంగా భార మూలకాలు ‘సాక్షి’ కథనంతో స్పందించిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం భీంపూర్ వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గిరిజనుల రక్త, మూత్ర నమూనాలు, గ్రామంలోని చేతిపంపుల నుంచి నీటిని సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. నీటిలో భార మూలకాల శాతం అధికంగా ఉందని, ఈ కారణంగానే కిడ్నీ సంబంధిత వ్యాధులు సోకుతున్నాయని అప్పట్లోనే ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ అప్పట్నుంచీ ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సమస్య తీవ్రత చెప్పినా పట్టించుకోలేదు బోరు బావి నీటిని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు, కిడ్నీ వ్యాధులకు గురవుతున్నామని అధికారులకు మొర పెట్టుకున్నాం. దీంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – జమునబాయి, మాజీ సర్పంచ్, గోవింద్పూర్ భార్యను బతికించుకోవాలనుకున్నా కానీ.. నా భార్య కుమ్ర భీంబాయి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడ పరిక్షించిన వైద్యులు కిడ్నీ సమస్య ఉందని చెప్పారు. దీంతో ఆమెను బతికించుకునేందుకు రెండేళ్ల కిందటే మా గ్రామాన్ని వదిలేసి పక్కనే ఉన్న జెండా గూడకు వలసవెళ్లాం. కానీ కొన్నాళ్లకే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి చనిపోయింది. ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడుకునేందుకు గ్రామానికి దూరంగా ఉంటూ, వ్యవసాయ పనులు కూడా ఇక్కడి నుంచే చేసుకుంటున్నా. – కుమ్ర పరశురాం, గోవింద్పూర్ గ్రామస్తుడు మరోసారి వైద్య పరీక్షలు చేస్తాం గోవింద్పూర్ గ్రామాన్ని వైద్య సిబ్బందితో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేస్తాం. స్థానికులు గ్రామాన్ని విడిచివెళ్లిన విషయం ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. గతంలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో పరీక్షలు చేశాం. మరోసారి నీటి పరీక్షలతో పాటు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – నిఖిల్ రాజ్, భీంపూర్ మండల వైద్యాధికారి -
గొంతెండుతోంది!
వేసవికాలం మొదలైంది. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, బావులు కూడా బోసిపోతుయి. దీనితో గ్రామాల్లో నీటికి కటకట మొదలైంది. ఎండాకాలం ప్రారంభంలోనే నల్లాల ద్వారా మంచినీటి సరఫరా తగ్గిపోయింది. ఊర్లలో నీటి ట్యాంకర్ల హడావుడి మొదలైంది. గ్రామాల్లో పంచాయతీలు, వార్డుల వారీగా ట్యాంకర్లతో నీటి సరఫరా జరుగుతోంది. పట్టణాల్లో అయితే ప్రైవేటు ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుని వాడుకోవాల్సిన దుస్థితి మొదలైంది. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. కిలోమీటర్ల కొద్దీ నడిచి వాగుల వద్దకు వెళ్లి చెలిమల నుంచి నీటిని మోసుకురావాల్సి వస్తోంది. మైదాన ప్రాంత గ్రామాల్లోనూ పలుచోట్ల నీటికి ఎద్దడి ఏర్పడటంతో శివార్లలోని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే రెండు నెలల పాటు ఎలా వెళ్లదీయాల్సి వస్తుందోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి నెట్వర్క్ మా‘నీరు’ తగ్గుతోంది కరీంనగర్‌తోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రాంతాలకు ఆధారమైన లోయర్ మానే ర్ డ్యామ్‌లో నీటి నిల్వల పరిస్థితి ఇది. ఈ డ్యామ్ నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలైతే.. ప్రస్తుతం 7.4 టీఎంసీలే ఉన్నాయి. ఎండలు మండుతుండటంతో ఈ నీళ్లు ఎన్ని రోజులకు సరిపోతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాహం కోసం.. దారి పట్టారు గిరిజన గ్రామాల్లో తడారిపోతున్న గొంతులకు గుక్కెడు నీళ్లు దొరకాలంటే దూరాలకు వెళ్లక తప్పని దుస్థితిని చూపే చిత్రమిది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సోలంగూడకు చెందిన గిరిజనులు ఇలా వ్యవసాయ పొలాల నుంచి డబ్బాలలో నీళ్లు తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నారు. ట్యాంకర్ వస్తేనే దాహం తీరేది.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం తాటిపర్తిలో గ్రామపంచాయతీ ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకుంటున్న ప్రజలు. దాదాపు నెల రోజులుగా నల్లా నీటి సరఫరా నిలిచిపోయిందని, ట్యాంకర్ నీళ్లే దిక్కు అవుతున్నాయని వారు వాపోతున్నారు. కిలోమీటర్ల కొద్దీ నడిస్తేనే గొంతు తడిచేది నిర్మల్ జిల్లా పెంబి మండలం ధూమ్‌ధరి గ్రామపంచాయతీ పరిధిలోని చికమున్ వాగులో చెలిమ తోడుకుని నీళ్లు నింపుకొంటున్న గిరిజనులు వీరు. దీనికి ఇరువైపులా ఉన్న వస్పల్లి కొత్తగూడెం, గిరిజనగూడెం రెండు గ్రామాలవారికి ఈ వాగు చెలిమలలోని నీరే దిక్కు. బిందెల్లో నీళ్లు నింపుకొని కిలోమీటర్ల కొద్దీ మోసుకుంటూ వెళ్తేనే.. ఇంటిల్లిపాదీ గుక్కెడు నీళ్లు తాగే పరిస్థితి. ఊరంతటికీ చెలిమ నీరే ఆధారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రేగళ్ల గుంపులో చెలిమ నీటిని తోడుకుంటున్న ఆదివాసీలు వీరు. జనవరిలోనే వాగులు ఎండిపోవడంతో చెలిమలో నీటి ఊట కూడా తక్కువగా ఉంటోందని, ఈసారి నీటి కష్టాలు ఎలా ఉంటాయోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా?
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడే రైతులు తమ పొలాల్లో నీటి జాడలను కనిపెట్టేందుకు జియాలజిస్ట్‌లను పిలిపించలేరు. ఎందుకంటే వారు అంత డబ్బు వెంచ్చించలేరు. పైగా అంత సమయం కూడా ఉండదు. అందుకని రైతులు నీటి జాడలను కనిపెట్టే వారిపై ఆధారపడుతుంటారు. అయితే ఇది శాస్త్రీయమేనా? దీని గురించి సైన్సు ఏం చెబుంతుంది తదితరాల గురించే ఈ కథనం. చాలమంది రైతులు తమ పొలాల్లో బోర్లు వేయడానికి ఫీల్డ్ సర్వేయర్లను పిలుస్తారు. వారు చేతిలో కొబ్బరికాయ, వేప పుల్ల, నీళ్ల చెంబు తదితరాలను ఉపయోగించి నీటి జాడలను చెబుతారు. దీన్నే విశ్వసించి రైతులు వారు చెప్పిన చోట బోర్లు వేయించుకుంటారు. ఇటువంటి పద్ధతులు నిజానికి శాస్త్రీయమా? దీని గురించి రైతులు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే.. మూడు పద్ధతుల్లో నీటి జాడను.. తనకు తెలిసిన పద్ధతుల్లో నీటిజాడలను గుర్తిస్తున్న వారిలో సురేందర్ రెడ్డి ఒకరు. ఆయన చిత్తూరు, తిరుపతి జిల్లాలో పలువురు రైతులకు వాటర్ పాయింట్లను ఈ పద్ధతిని అనుసరించే ఏర్పాటు చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పొలవరానికి చెందిన వారు. సుబ్బారెడ్డి నీటిని కనుగొనడానికి కొబ్బరికాయ లేదా వై ఆకృతిలోని వేప కర్ర లేదా కానుగ కర్ర, వాటర్ బాటిల్‌ని ఉపయోగిస్తారు. కొబ్బరి పీచులు వేళ్ల వైపు ఉండేలా కొబ్బరికాయను అరచేతిలో ఉంచుతారు. పొలంలో అలా చేతిలో కొబ్బరికాయ పెట్టకుని వెళ్తున్నప్పుడూ ఎక్కడ కొబ్బరికాయ నిటారుగా నిలబడితే అక్కడ నీటి జాడ ఉందని నమ్ముతారు. అదికాకపోతే అరచేతిలో వై ఆకారంలో ఉన్న వేప ఆకులతో ముందుకు వెళ్తారు. నీటి జాడ ఉన్న చోట పుల్ల పైకి లేస్తుంది లేదా మరీ ఎక్కువగా ఉంటే గిరిగిర తిరుగుతుంది. అదే నీళ్ల చెంబు పద్ధతి అయితే నీరు ఎక్కడ పక్కకు ఒరిగితే అక్కడ నీళ్లు వస్తాయని సురేందర్ రెడ్డి చెబుతున్నారు. ఇలానే ఎన్నో బోర్లు వేయించానని, ఈ పద్ధతిని తానే సొంతంగా నేర్చుకున్నట్లు తెలిపారు. కొబ్బరికాయను బట్టి నీరు ఎన్ని అడుగుల్లో ఉందో చెప్పేయొచ్చు అని అన్నారు. జియాలజిస్టులు యంత్రాల సాయంతో తనిఖీ చేసినా ఎంత నీరు పడుతుందనేది కచ్చితంగా చెప్పలేరని అన్నారు. తాను నీటి జాడను గుర్తించిన ప్రతి చోటు 99 శాతం విజయవంతమయ్యాయని సురేందర్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. నీళ్లు ఉన్నప్పుడు ఇన్ని అడుగుల దగ్గర పుల్ల లేస్తుంది అనుకుంటాం. పుల్ల కానీ, టెంకాయ గానీ పైకి లేస్తుంది. రెండు మూడు లైన్లు కలిసే చోట ఎక్కువ తిరుగుతుంది. ఒక లైను పోయే చోట లేచి నిల్చుకుంటుంది. దీంతో ఇక్కడ జంక్షన్ ఉంది. ఏ వైపు ఎక్కువ నీళ్లు వస్తాయని అంచనాకు వస్తాం. మరీ ఫోర్స్‌గా లేస్తే ఎక్కువ నీళ్లు ఉంటాయి. మూడు లేదా నాలుగు అంగుళాలు పడతాయి. ఒక్కో చోట ఒకే లైన్ అయినా కూడా ఎక్కువ నీళ్లు వస్తాయన్నారు సురేందర్ రెడ్డి. శాస్త్రీయ పద్ధతిలోనే కనిపెట్టగలం.. కొబ్బరి వేపపుల్ల, వాటర్ బాటిళ్లతో నీటి జాడలను గుర్తించే పద్ధతులను అశాస్త్రీయమైనవని తిరుపతికి చెందిన జియాలజిస్టు, భూగర్భ జల మైనింగ్ కన్సల్టెంట్ సుబ్బారెడ్డి చెబుతున్నారు. టెంకాయ కాకుండా ఉత్తరేణిపుల్ల, వేప పుల్ల, రేగి చెట్టు పుల్ల, లాంటి వాటితో కూడా నీటిజాడలను గుర్తిస్తారు. వీటిని అశాస్త్రీయమైనవిగా పరిగణించాలన్నారు. అంతేగాదు కొందరి చేతుల్లో నీటి రేఖ ఉందని, తమ కలలో దేవుడు కనిపించి చెప్పాడని అంటుంటారు కానీ అవన్నీ సరైన పద్ధతులు కావని తేల్చి చెప్పారు. కేవలం శాస్త్రీయ పద్ధతుల్లోనే నీటి జాడను కచ్చితంగా కనిపెట్టగలమని చెప్పారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పుడూ ఏ పద్ధతిలోనైనా నీరు పడుతుంది. ఛాలెంజింగ్ ఏరియాల్లో..వెయ్యి అడుగులు బోరు వేసినా పడని ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి చోట్ల ఈ పద్ధతులు విఫలమయ్యే అవకాశం ఉందని సుబ్బారెడ్డి అన్నారు. అలాంటి చోట భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు బోర్లు వేసి డబ్బులు వృథా చేసుకొవద్దని రైతులకు సూచిస్తామని చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల్లో కచ్చితత్వం.. భూగర్భంలో నీటి జాడలను కనిపెట్టడంలో శాస్త్రీయ పద్ధతులు సమర్థవంతంగా పనిచేస్తాయని సుబ్బారెడ్డి చెబుతున్నారు. భూగర్భ జలాల జాడను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నా శాస్త్రీయ పద్ధతుల్లో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ సర్వే ఒకటి అని సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్ ద్వారా పరిశీలిస్తే..భూమి పొరలుగా ఉన్నట్లు కనిపిస్తుంది. రాళ్లు మట్టి కలిసి ఉంటాయి. భూమి పొరల రెసిస్టివిటీని అంచనావేసి నీటి జాడను నిర్థారిస్తాం అని సుబ్బారెడ్డి తెలిపారు. పూర్వీకుల నుంచే నీటి జాడలు కనిపెట్టే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. భూమి భౌగోళిక లక్షణాల ప్రకారం కొందరూ నీటి జాడను అంచనా వేయగలరని చెప్పారు. వరహ మిహరుడు గ్రంథంలో నీటి అన్వేషణ.. భూగర్భ జల వనరులను ఎలా గుర్తించాలో వరాహ మిహిరుడు ఒక గ్రంథాన్ని రాశాడు. నీటి అన్వేషణ కోసం చెప్పిన టెక్నిక్‌లో బయో ఇండికేటర్లు గురించి కూడా ప్రస్తావించారు. నీరు ఉన్నచోట ఉడగ, రెల్ల, మద్ది, తంగేడు వంటి చెట్లు గుంపులుగా ఉంటాయని పూర్వీకులు ప్రగాఢంగా నమ్మేవారు. దీన్ని ఆధారం చేసుకునే భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సైతం నీరు పడే అవకాశాలను చెబుతారని అన్నారు. నీటి కుంటలు ఉండే చోట కూడా నీరు పడుతుందని నిరూపితమైంది. జియాలజిస్ట్‌లు సైంటిఫిక్ పద్ధతుల తోపాటు వీటిని కూడా పరిగణలోని తీసుకుంటారని చెప్పారు. ఇక్కడ అనుభవం కీలకం... చిత్తూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బోర్ పాయింట్‌ని గుర్తించాలంటే.. జిల్లాలో ఎంత లోతులో నీరు పడుతుందో, ఏ వైపు సర్వే చేస్తే బాగుంటుందో అవగాహన ఉండాలి. నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి, అది నాకు సులభం. అదే కొత్త ప్రాంతమైతే.. అక్కడి జియాలజిస్ట్ కమాండింగ్ చేస్తున్నాడు. అక్కడ నాకంటే ఆయనే ఎక్కువ విజయాలు సాధిస్తారు అని సుబ్బారెడ్డి అన్నారు. కొన్నిసార్లు ఆయా ప్రాంతాల్లో ఏపుగా పెరిగిన వేప చెట్లను కూడా పరిగణలోనికి తీసుకుని చెబుతారు. దీన్ని జీవ సూచికగా పరిగణిస్తారు. “వేప చెట్టు ఆరోగ్యంగా ఉండి, దాని కొమ్మలు మరియు ఆకులు ఒక వైపుకు వంగి ఉంటే... అటువంటి ప్రాంతాల్లో ఎక్కడో ఒక నీటి కాలువ ఉందని సూచిస్తుంది. అటువంటి ప్రాంతంలో పరికరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ముఖ్యం. ఇది ఆ ప్రాంతంలోని జియాలజిస్ట్ పరిజ్ఞానం, అనుభవంపై ఆధారపడి ఉంటుంది, ”అని సుబ్బారెడ్డి చెబుతున్నారు. కొన్నిసార్లు రాతి నిర్మాణాలు చాలా సవాలుగా ఉంటాయని, అలాంటి చోట భూగర్భ శాస్త్రవేత్తలు మాత్రమే నీటి వనరులను గుర్తించగలరని ఆయన అన్నారు. భూగర్భ జలాలను గుర్తించే సాంకేతికత 1910 నుంచి అభివృద్ధి చెందుతోందని, విమానంలో ప్రయాణిస్తూ కూడా నీటి జాడలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి సర్వేలు అందుబాటులో ఉన్నాయని సుబ్బారెడ్డి చెబుతున్నారు. (చదవండి: 130 వేల ఏళ్ల నుంచే మానవుల ఉనికి! వెలుగులోకి విస్తుపోయే విషయాలు!) -
విశాఖ జిల్లా వాసులకు శుభవార్త : పెరిగిన భూగర్భ జలాలు
సాక్షి, విశాఖపట్నం: ఎండలు మండుతున్న వేళ విశాఖ జిల్లాలోని భూగర్భ జలాలు ఊరటనిస్తున్నాయి. ఇవి అందుబాటులో ఉంటూ జనానికి ఉపశమనం కలిగిస్తున్నాయి. సాధారణంగా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటుతుంటాయి. తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ప్రస్తుతం ఈ ఏడాది సమ్మర్లో ఆ పరిస్థితి లేదు. నీటి మట్టాలు ఆశాజనకంగానే ఉంటున్నాయి. భూగర్భ జల వనరులు, జలగణన శాఖ తరచూ నీటి మట్టాలను పరిశీలిస్తుంది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పీజోమీటర్ల ద్వారా వాటి స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. భూగర్భ శాఖ జిల్లాలో నమోదు చేసిన వివరాల ప్రకారం మార్చి ఆఖరి వరకు భీమిలి మండలం చుక్కవానిపాలెంలో భూగర్భ జలాలు అత్యంత పైన అంటే మూడు మీటర్లకంటే తక్కువ లోతులోనే లభ్యమవుతున్నాయి. ఎండాడ ప్రాంతంలో అత్యంత దిగువన అంటే 19.35 మీటర్ల లోతు వరకు లభ్యం కావడం లేదు. 0–3 మీటర్ల మధ్య చుక్కవానిపాలెంతో పాటు చిప్పాడ, పాలవలస, నరవ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే 3–10 మీటర్ల మధ్య నీటి లభ్యత పందలపాక, శొంఠ్యాం, వెల్లంకి, భీమిలి, నగరంపాలెం, అగనంపూడి, బీహెచ్‌పీవీ, గొల్లలపాలెం, గోపాలపట్నం, అనంతవరం, ఐనాడ, పాండ్రంగి, టి.దేవాడ, స్టీల్‌ప్లాంట్, అప్పుఘర్, విశాలాక్షినగర్, పాండురంగాపురం, మధురవాడ, మారికవలస, తాటిచెట్లపాలెం ప్రాంతాలున్నాయి. కణితి కాలనీ, పెందుర్తి, ఆరిలోవ, పెద్ద రుషికొండ, శివాజీపాలెం, వైఎస్సార్ పార్కు ప్రాంతాలు 10–20 మీటర్ల లోతులో నీటిమట్టాలున్నాయి. హెచ్చుతగ్గులు ఇలా.. మార్చి నెలలో విశాఖ జిల్లాలో సగటు నీటిమట్టం 7.48 మీటర్లుగా ఉంది. గత ఏడాది మార్చిలో 6.82 మీటర్లలో ఉండేది. గత మార్చితో పోల్చుకుంటే స్వల్పంగా 0.66 మీటర్ల దిగువకు వెళ్లినట్టయింది. గత సంవత్సరం మార్చితో భూగర్భ జలాల పరిస్థితిని పరిశీలిస్తే మొత్తం 31 పీజోమీటర్లకు గాను 14 చోట్ల పెరగ్గా, 17 చోట్ల దిగువకు వెళ్లాయి. వీటిలో శొంఠ్యాం, వెల్లంకి, భీమిలి, చుక్కవానిపాలెం, నగరంపాలెం, గొల్లలపాలెం, కణితి కాలనీ, పాండ్రంగి, పాలవలస, టి.దేవాడ, నరవ, పెందుర్తి, స్టీల్‌ప్లాంట్, మారికవలస ప్రాంతాల్లో నీటిమట్టాల స్థాయి పెరుగుదల కనిపించింది. అలాగే పందలపాక, చిప్పాడ, అగనంపూడి, బీహెచ్‌పీవీ, గోపాలపట్నం, అనంతవరం, ఐనాడ, ఏపీటీడీసీ, ఆరిలోవ, బీవీకే కాలేజీ, యోగా విలేజీ, పెద్ద రుషికొండ, ఎండాడ, మధురవాడ, ఏపీఎస్ఐడీసీ, శివాజీపాలెం, వైఎస్సార్ పార్క్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు దిగువకు వెళ్లాయి. జిల్లా మొత్తమ్మీద 20 మీటర్లకంటే దిగువన నీటిమట్టాలున్న ప్రాంతాలు ఒక్కటీ లేకపోవడం విశేషం! భూగర్భ జలాల సంరక్షణ అవసరం భూగర్భ జలాలనూ అందరూ బాధ్యతగా సంరక్షించుకోవాలి. వర్షం నీరు వృథాగా పోకుండా ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వేసవిలో భూగర్భ జలాలు అందుబాటులో ఉంటూ నీటి ఎద్దడికి ఆస్కారం ఉండదు. ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఆశాజనకంగా ఉంది. – లక్ష్మణరావు, జిల్లా భూగర్భ జల శాఖాధికారి సగటు భూగర్భ జలాల లభ్యత మండలాల వివరాలు ఇలా.. 3 నుంచి 8 మీటర్ల లోపలే ఆనందపురం, భీమిలి, గాజువాక, ములగాడ, పద్మనాభం, పెందుర్తి, గోపాలపట్నం, పెదగంట్యాడ 8 నుంచి 20 మీటర్ల లోపు మహారాణిపేట, సీతమ్మధార విశాఖపట్నం రూరల్ -
భూగర్భ జలాల సంరక్షణలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: భూగర్భ జలాలను పెంపొందించడం, పొదుపుగా వినియోగించడం, వాటిని సంరక్షించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 7,089 మండలాలు, బ్లాక్‌లు, వ్యాలీలు, ఫిర్కాల పరిధిలో భూగర్భ జలమట్టంపై కేంద్ర జల్ శక్తి శాఖ అధ్యయనం చేసింది. భూగర్భ జలాలను పరిమితికి మించి తోడేస్తున్న మండలాలు, బ్లాక్‌లు 1,006 ఉంటే.. అందులో కేవలం 6 మాత్రమే ఏపీలో ఉన్నాయి. పరిమితికి మించి భూగర్భ జలాలను తోడేస్తున్న ప్రాంతం దేశంలో సగటున 14.19 శాతం ఉంటే.. ఇందులో రాష్ట్రంలో 0.98 శాతం ప్రాంతం మాత్రమే ఉంది. భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరిన రాష్ట్రాల్లో పంజాబ్(76.47 శాతం వినియోగం) మొదటి స్థానంలో ఉండగా.. రాజస్తాన్(72.52 శాతం) రెండో స్థానంలో, హరియాణా(61.54 శాతం) మూడో స్థానంలో, ఢిల్లీ(44.12 శాతం) నాలుగో స్థానంలో, తమిళనాడు(30.87 శాతం) ఐదో స్థానంలో నిలిచాయి. దాద్రానగర్ హవేలి, డయ్యూ డామన్‌లో భూగర్భ జలాలను వంద శాతం తోడేయడం వల్ల వాటి పరిస్థితి ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. దేశంలో భూగర్భ జలాల పరిస్థితిపై కేంద్ర భూగర్భ జలవనరుల మండలితో కలిసి 2020లో ఒకసారి.. 2022లో మరోసారి కేంద్ర జల్ శక్తి శాఖ అధ్యయనం చేసింది. ఇందులో వెల్లడైన ప్రధానాంశాలు.. రాష్ట్రంలో 28 శాతమే వినియోగం.. ♦ దేశంలో గతేడాది కురిసిన వర్షాల వల్ల భూగర్భంలోకి 15,451.65 టీఎంసీల నీళ్లు ఇంకిపోయి భూగర్భ జలాలుగా మారాయి. ఇందులో 14,056.20 టీఎంసీలను వినియోగించుకోవచ్చు. అందులో 8,444.73 టీఎంసీలను(60 శాతం) ఇప్పటికే ఉపయోగించారు. ♦ ఏపీలోని 667 మండలాల పరిధిలో గతేడాది కురిసిన వర్షాల వల్ల 961.13 టీఎంసీలు భూగర్భ జలాలుగా మారాయి. ఇందులో 913.11 టీఎంసీలను ఉపయోగించుకోవచ్చు. కానీ.. 263.05 టీఎంసీలు(28 శాతం) మాత్రమే వినియోగించారు. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి, ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు, శ్రీసత్యసాయి జిల్లాలోని గాండ్లపెంట, హిందూపురం , రొళ్ల, తనకల్లులో మాత్రమే పరిమితికి మించి భూగర్భ జలాలను ఉపయోగించారు. ♦ రాష్ట్రంలో 667 మండలాల పరిధిలోని భౌగోళిక విస్తీర్ణం 1,40,719.5 చదరపు కిలోమీటర్లు కాగా, ఇందులో 1,380.65 చదరపు కిలోమీటర్ల భూ భాగంలో మాత్రమే భూగర్భ జలాలను పరిమితికి మించి వాడారు. సమృద్ధిగా వర్షాలు.. పెరిగిన భూగర్భ జలాలు.. రాష్ట్రంలో 2019 నుంచి ఏటా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటిని ఒడిసిపట్టి.. ప్రాజెక్టులు, చెరువులు నింపుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అత్యధిక ఆయకట్టుకు ఏటా నీళ్లందిస్తోంది. భూగర్భ జలాల సంరక్షణ కట్టడాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. 2020లో 850.91 టీఎంసీలు భూగర్భ జలాల రూపంలోకి మారగా.. 2022లో 961.13 టీఎంసీలు రూపాంతరం చెందాయి. 2020లో ఉపయోగించుకోదగ్గ భూగర్భజలాలు 810.36 టీఎంసీలుగా ఉండగా.. 2022 నాటికి 913.11 టీఎంసీలకు పెరిగింది. గతేడాది భూగర్భ జలాలను 269.41 టీఎంసీలు వాడుకోగా.. 2022లో 263.05 టీఎంసీలు మాత్రమే ఉపయోగించారు. రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సురక్షిత స్థాయిలో ఉన్న మండలాలు 2020లో 551 ఉండగా.. 2022లో వాటి సంఖ్య 598కి పెరిగింది. పరిమితికి మించి తోడేసిన మండలాలు 2020లో 23 ఉండగా.. 2022లో వాటి సంఖ్య 6కు తగ్గింది. -
2040 నాటికి నీటి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? కనీసం..
గాలి తర్వాత ప్రాణాధారం నీటిచుక్క. గొంతెండిపోతే నోట్లకట్టలు దాహం తీర్చవు. నీటి చుక్క కోసం... అర్రులు చాచాల్సి వస్తుంది. ధారపోయడానికి చేతిలో డబ్బున్నా సరే... నేలతల్లి కడుపులో చుక్క మంచి నీరుండదు. జాగ్రత్త పడదాం... భవిష్యత్తును కాపాడుకుందామని... దేశాన్ని చైతన్యవంతం చేస్తున్నారు వసంతలక్ష్మి. ‘‘2040 నాటికి నీటి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? భావి తరాల కోసం ఆస్తులు కూడబెడుతున్నాం, బాగా చదివి పెద్ద ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించాలని వాళ్లకు నేర్పిస్తున్నాం. చేతి నిండా డబ్బు ఉండి గొంతు తడుపుకోవడానికి నీటి చుక్క లేని జీవితాలను పిల్లలకు అందిస్తున్నాం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే రాబోయే తరాలు కాదు కదా, మనతరమే నీటి ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు సంపాదనను వ్యసనంలాగ పిల్లల బుర్రల్లోకి ఎక్కించేస్తున్నాం, నీటి వృథాను అరికడదామని మాట మాత్రంగానైనా చెప్తున్నామా?’’ ఇలా సాగుతుంది వసంతలక్ష్మి ప్రసంగం. నీటి సంరక్షణ గురించి పాఠం చెప్తోందామె. నేడు వరల్డ్ వాటర్ డే సందర్భంగా తన నీటి ఉద్యమం వివరాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. జలమే ధనం ‘‘వర్షాలొస్తే రోడ్లు జలమయం, ఎండకాలం మొదలయ్యే నెల నుంచే రోడ్ల మీద నీటి ట్యాంకుల స్వైరవిహారం. ఆ ట్యాంకర్లను చూస్తే డేంజర్ బెల్స్ మోగించుకుంటూ వెళ్తున్నట్లే అనిపించేది. మనిషి భవిష్యత్తు ఎంతటి ప్రమాదంలో పడుతుందోననే దిశలో నా ఆలోచన సాగడంతో అధ్యయనం మొదలుపెట్టాను. గణాంకాలు భయపెట్టాయి. ఇదే ధోరణిలో నీటిని వృథా చేస్తుంటే మన తరమే నీటికోసం అల్లాడే రోజు వస్తుంది. అందుకే జలాన్ని మించిన ధనం మరొకటి లేదని చైతన్యవంతం చేసే పనిలో ఉన్నాను. కశ్మీర్లో మొదలు పెట్టిన ‘జల్ ధన్ యాత్ర’ ఉత్తరాఖండ్, హరియాణా మీదుగా ఢిల్లీకి చేరింది. వరల్డ్ వాటర్ డే (మార్చి 22) పురస్కరించుకుని గుర్గావ్లో 20వ తేదీన అవగాహన సదస్సు నిర్వహించాం. జలగండం! నీటి గురించిన వివరాల్లోకి వెళ్లేకొద్దీ వెన్నులో నుంచి వణుకు పుడుతుంది. మనదేశంలో మనిషి సగటున ఒక రోజుకి వృథా చేసే నీరు పదకొండు గ్యాలన్లుగా ఉంటోంది. జలపొరల్ని చీల్చుకుని మరీ తోడేస్తున్నాం. మహారాష్ట్రలో భూగర్భజలాలు మైనస్‌లోకి వెళ్లిపోయాయి. మూడు వందల అడుగుల వరకు నీటి చుక్క ఆనవాలుకు కూడా అందడం లేదు. తమిళనాడులో ఒకప్పుడు 57 జీవనదులు ప్రవహించేవి. మనిషి భూమి ఆక్రమణ ఆకలికి నదులు కూడా బలయిపోయాయి. ఇప్పుడు ఐదారుకి మించి జీవనదుల్లేవక్కడ. మనకు నీటిని పొదుపు చేయడం, వృథాను అరికట్టడంలో విచక్షణ లేదు. అలాగే పరిశ్రమల వ్యర్థాల కారణంగా నీటి వనరులు కలుషితం కావడం గురించి ఏ మాత్రం ముందుచూపు లేదు. ప్రజల్లో చైతన్యం ఉంటే పరిశ్రమలు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వెనుకాడతామయనేది నా అభిప్రాయం. పరిశ్రమల నిర్వహకులు తాము వాడిన నీటిని శుద్ధి చేసి భూమిలోకి వదలాల్సి ఉండగా, ఆ నియమాలేవీ పాటించకుండా నేలకు రంధ్రాలు చేసి వదిలేస్తున్నారు. దాంతో భూగర్భజలాలు కలుషితమైపోతున్నాయి. పంజాబ్‌లో ఒక రైలును స్థానికులు క్యాన్సర్ రైలని పిలుస్తారు. ఆ రైలులో ప్రయాణించే వాళ్లలో... కలుషిత నీటిని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడిన వాళ్లు ఢిల్లీకి వైద్యానికి వెళ్లే వాళ్లే ఎక్కువని చెబుతారు. మనదేశంలో నీటి కాలుష్యానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి. ‘ఉదాసీనంగా ఉంటే రాబోయే తరాలు మనల్ని క్షమించవు. మేల్కోండి’ అని ఎలుగెత్తి చెబుతున్నాను’’ అని చెప్పారు సామాజిక కార్యకర్త చీరాల వసంతలక్ష్మి. వాటర్ షెడ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వసంతలక్ష్మి గత ఏడాది ‘వాటర్ వారియర్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ‘జల్ ధన్ యాత్ర’ ద్వారా దేశవ్యాప్తంగా పర్య టించి గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విద్యార్థులు, మహిళలు, రైతులకు గణాంకాలతో సహా నీటి గురించి వివరిస్తున్నారు. సామాజిక ‘స్నేహిత’ చీరాల వసంతలక్ష్మి పుట్టింది ఆంధ్రప్రదేశ్, నెల్లూరు నగరంలో. ‘అమ్మతనానికి అవమానం జరగకూడదు. బిడ్డలందరూ సమానంగా పుడతారు. ఏ బిడ్డా అన్వాంటెడ్ కాదు... కాకూడదు. ఆడపిల్లను వద్దంటే నాకివ్వండి... బతికిస్తాను’... ఈ ‘అమ్మ ఒడి’లో ప్రేమ ఉంది, ‘ఇదిగో ఊయల’... అని పాతికేళ్ల కిందట నగరంలో 27 ఊయలలు పెట్టారు. 87 మంది పిల్లలకు అమ్మ అయ్యారామె. ఆ ఊయలను ప్రభుత్వం చేపట్టింది, తమిళనాడులో జయలలిత ప్రభుత్వమూ అందుకుంది. సమాజంలో తల్లులందరూ తమ పిల్లలను అనారోగ్యాల నుంచి సంరక్షించుకోగలిగిన అవగాహన కలిగి ఉండాలనే ఆశయంతో మొదలైన నా సేవలో ఏదీ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదు. ఒక్కొక్కటిగా వచ్చి చేరుతూ నా బాధ్యతలను పెంచుతూ వచ్చాయి. జపనీస్ ఎన్సెఫలైటిస్ వచ్చినప్పుడు పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించాలంటే రిజిస్టర్ అయిన సంస్థ ఉండాలన్నారు. అలా నా సేవ 1998లో వ్యవస్థీకృతమైంది. స్పెషల్ కిడ్స్ 150 మందిని దత్తత తీసుకున్నాను. వాళ్లతో డీల్ చేయడం కోసం నేను స్పెషల్ బీఈడీ చేసి వాళ్లకు ఎడ్యుకేటర్‌గా మారాను. అలాగే మహిళల సమస్యల గురించి పోరాడే క్రమంలో చట్టాలు తెలుసుకోవడానికి బీఎల్ చదివి... సేవలను ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించాను. కరాటేలో బ్లాక్‌బెల్ట్, రైఫిల్ షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్‌ని కావడంతో బాలికలు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి కాలేజీ విద్యార్థినులు, స్వయం సహాయక బృందాల మహిళలు మొత్తం పదిహేను వేల మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రమాదాల బారిన పడకుండా కొన్ని మెళకువలు నేర్పించాను. అలాగే చనిపోవాలనుకున్న వాళ్లకు ‘స్నేహిత’నయ్యాను. సర్వీస్ అనే ఉద్దేశంతో మొదలు పెట్టలేదు, కానీ ఎక్కడ అవసరం ఉందనిపిస్తే అక్కడ వాలిపోతూ నా ప్రయాణం నీటి సంరక్షణ దిశగా సాగుతోంది. – సీహెచ్. వసంతలక్ష్మి. అడ్వొకేట్, వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అండ్ రీసెర్చ్ సెంటర్ – వాకా మంజులారెడ్డి చదవండి: మళ్లీ పిలిపించే అవసరం రాకుండా చూసుకోండి! బతుకుజీవుడా అని బయటపడ్డా! -
భూగర్భ జలాల పరిరక్షణలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: దేశంలో భూగర్భ జలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు(ఎన్హెచ్పీ) అమలులో దేశంలో రాష్ట్రానిది తొలిస్థానం. భూగర్భ జలవనరుల పరిరక్షణ కోసం దేశంలో మూడేళ్ల నుంచి ఎన్‌హెచ్‌పీని కేంద్రం అమలుచేస్తోంది. దేశవ్యాప్తంగా జలసంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13.09 లక్షల జల సంరక్షణ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టంది. వాటి ద్వారా వర్షపు నీరు అధిక శాతం భూమిలోకి ఇంకి.. భూగర్భ జలమట్టం పెరగడానికి దోహదం చేసింది. డ్రిప్, స్ప్రింక్లర్లతో తగ్గిన నీటి వినియోగం రాష్ట్రంలో 15 లక్షల వ్యవసాయ బోరు, బావుల కింద 40 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. ఈ బోరు బావులను ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేసింది. ఈ బోరు బావుల కింద సుమారు 13 లక్షల మంది రైతులకు 34.58 లక్షల ఎకరాలలో సూక్ష్మనీటిపారుదల విధానంలో పంటల సాగుకు డ్రిప్, స్ప్రింక్లర్లను ప్రభుత్వం అందజేసింది. ఇది భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించేలా చేసింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 1,254 ఫిజియో మీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు భూగర్భ జల మట్టాన్ని పర్యవేక్షిస్తూ భూగర్భ జలాలను పరిరక్షించింది. పుష్కలంగా భూగర్భ జలం ఇక గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ చర్యలతో భూగర్భ జలమట్టం పెరిగింది. 2017తో పోలిస్తే 2020 నుంచి రాష్ట్రంలో ఏటా భూగర్భ జలాల లభ్యత 208 టీఎంసీలు పెరిగిందని కేంద్రం తేల్చింది. అలాగే, భూగర్భజలాల వినియోగం ఏటా సగటున 48 టీఎంసీలు తగ్గిందని పేర్కొంది. దీంతో.. భూగర్భ జలాల లభ్యత ఏటా పెరగడం.. వినియోగం తగ్గడంతో దేశంలో భూగర్భ జలాల సంరక్షణలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5.65 మీటర్లలోనే భూగర్భ జలాలు లభ్యమవుతుండటం గమనార్హం. ఇలా భూగర్భ జలాల లభ్యత పెరగడంతో అటు సాగునీటికి.. ఇటు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పోయాయి. -
సముద్రంలో చదరంగం.. 60 అడుగుల లోతుకు డైవ్ చేసి
కొరుక్కుపేట: చెన్నైలో 44వ చెస్ ఒలంపియాడ్ జరుగుతున్న నేపథ్యంలో ఆరుగురు స్థానిక ఆటగాళ్లు వినూత్నంగా ఇలా సముద్రం లోపల చెస్ ఆడారు. అరవింద్ తరుణ్ శ్రీ అనే టెంపుల్ అడ్వెంచర్స్ డైవింగ్ సెంటర్ల వ్యవస్థాపకుని నేతృత్వంలో ఆదివారం ఈ ఘనత సాధించారు. స్థానిక నీలంకరై తీరం నుంచి పడవలో సముద్ర తీరం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లారు. అక్కడి నుంచి 60 అడుగుల లోతుకు డైవ్ చేశారు. పావు గంటకు ఓ గేమ్ చొప్పున రెండు గంటల పాటు చెస్ ఆడారు. ఇందుకోసం ప్రత్యేకమైన చెస్ బోర్డులు, పావులు రూపొందించారు. ఇందులో పాల్గొన్న ఆటగాళ్లంతా శిక్షణ పొందిన స్కూబా డైవర్లు కావడం విశేషం. 20 నిమిషాలకోసారి నీళ్లలో నుంచి పైకి వచ్చిపోయారట. -
World Water Day 2022: అడుగంటిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకుందాం!
మార్చి నెల ముగియకుండానే మండే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎండలతోపాటు మనకు గుర్తొచ్చేది నీరు. నీరు లేకపోతే జీవం లేదు. నీరు కరువైతే ప్రకృతి లేదు.. మనిషి మనుగడ లేదు. ప్రపంచవ్యాప్తంగా తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క అల్లాడి పోతున్న అభాగ్యులెందరో. నీటి వనరులు, భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటిపోతున్నా అంతులేని నిర్లక్ష్యం. అందుకే నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తుంచుకుంటాం. గంగమ్మ తల్లి సంరక్షణలో పౌరులుగా మన బాధ్యతను గుర్తించాల్సిన సమయం ఇది. మంచినీటి కొరత ఇపుడొక ప్రపంచ సంక్షోభం. దీనిపై ప్రతీ పౌరుడు అవగాహన కలిగి ఉండటంతోపాటు, బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమిది. నీటి పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించాలంటూ 1992లో రియో డి జనేరియోలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణం మరియు అభివృద్ధి సదస్సు తీర్మానించింది. అలా 1993లో మొదటి ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకున్నాం. ప్రతీ ఏడాది ఒక థీమ్‌తో వరల్డ్ వాటర్ డేని నిర్వహించడం ఆనవాయితీ. 2022 ఏడాదికి సంబంధించి 'గ్రౌండ్ వాటర్: మేకింగ్ ది ఇన్విజిబుల్ విజిబుల్' అనేది థీమ్. నానాటికి అదృశ్యమైన పోతున్న భూగర్భ జలాల్ని కాపాడుకోవడం అనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించు కోవాలని ఐక్యరాజ్యసమతి పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అంద జేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. భూగర్భ జలాలు కనిపించవు, కానీ దాని ప్రభావం ప్రతిచోటా కనిపిస్తుంది. కనుచూపు మేరలో, మన కాళ్ళ కిందుండే భూగర్భ జలాలు మన జీవితాలను సుసంపన్నం చేసే గొప్ప నిధి. ఈ విషయాన్ని గుర్తించక మానువుని అంతులేని నిర్లక్ష్యం, అత్యాశ పెనుముప్పుగా పరిణ మిస్తోంది. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే మనం మాత్రం తాగునీటిని వృధా చేస్తున్నాం. సముద్రాలు, నదులు, కాలువలు, చెరువులు అన్నింటినీ నిర్లక్ష్యం చేస్తున్నాం. కలుషితం చేస్తున్నాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే..2050 నాటికి ఈ భూమ్మీద తాగడానికి పుష్కలమైన నీరు లభించదనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు మానవ అవసరాల పేరుతో అడవులను విచక్షణా రహితం నరికిపారేస్తున్నాం. అటవీ నిర్మూలనతో జీవవైవిధ్యం దెబ్బ తినడమే కాదు భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. పెరుగుతున్న పారిశ్రామికీకరణ, అతి వినియోగం, సహజ వనరుల దోపిడీకారణంగా తీవ్రమైన నీటి కొరత లాంటి దారుణమైన పరిస్థితులను జనజీవనం ఎదుర్కొంటోంది. వీటన్నింటికి తోడు కాలుష్య కాసారం వుండనే ఉంది. నీటిని వృధా చేయడం అంటే రాబోయే తరాలకు భవిష్యత్తులేకుండా చేయడమని అందరం అర్థం చేసుకోవాలి. ఈ భూగోళంలో కేవలం 0.3 శాతం మాత్రమే శుద్ధనీటి వనరులు ఉన్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టూ విలువైనదే అన్న అవగాహన పెంచుకోవాలి. ఈ భూ ప్రపంచంపై మానవుడితో పాటు సమస్త ప్రాణికోటి సుభిక్షంగా సురక్షితంగా మనుగడ సాగించాలి అంటే ప్రతీ నీటిచుక్కను రక్షించుకోవాలి. ఈ అవగాహన, బాధ్యత ప్రతీ ఒక్క మనిషిలోనూ రావాలి. లేదేంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు. -
ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తున్నట్లు?
భూగోళంలో 71 శాతం మేర నీరు ఆవరించి వుంది. అందుకే భూమిని ‘నీటి గోళం’ అని అంటుంటాం. జీవరాశుల ఉనికికి నీరే ప్రధాన కారణం. సుమారు 65 నుంచి 75 శాతం మేర జీవుల దేహాల్లో నీరే వున్నది. మన దేహంలో ఒక శాతం మేర నీరు తగ్గినట్లైతే దాహార్తిని కలిగిస్తుంది. అదే 10 శాతం మేర తగ్గితే ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఈ నీరే స్వేదం రూపంలో మానవుల్ని, భాష్పోత్సేకం ద్వారా మొక్కల్ని ఎండ వేడిమికి వడలిపోకుండా కాపాడుతుంది. ఉష్ణానికి నీరు వాహకంగా ఉపయోగపడుతూ, సూర్యతాపం నుంచి భూగోళాన్ని కాపాడుతుంది. మొక్కలు కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకునే పిండి పదార్థానికి అవసరమయ్యే హైడ్రోజన్ మూలకాన్ని నీరే అందిస్తుంది. రాబోయే కొద్దిరోజుల్లో నీరే హైడ్రోజన్ ఇంధనంగా రూపు దిద్దుకుంటుందనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. నీరు ముఖ్యంగా తాగడానికి, వంట చేయడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు, మురికిని కడగడానికి అవసరమవుతున్న సంగతి తెలిసిందే. ఉపయోగపడే నీరు కొంచెమే! నీటి గోళమైన భూమిపై నీటి కష్టాలు అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇది పచ్చి నిజం. ఇందుకు ముఖ్యకారణం 97 శాతం ఉప్పు నీరుగా సముద్రాల్లోను, 2 శాతం ధ్రువాల్లో మంచు గడ్డల రూపంలో వుండి మొత్తం 99 శాతం మేర వినియోగార్హత కోల్పోవడమే. మనకు ఉపయోగపడుతున్న నీరు అత్యల్పం. భూమి మీద ఉన్న నీరంతా 100 లీటర్లుగా భావిస్తే మనకు ఉపయోగంగా వుండేది కేవలం 3 మిల్లీ లీటర్లు. అంటే, వంద లీటర్లకు అర టీ స్పూనంతన్న మాట! నీరు లేని జీవనాన్ని ఊహించుకోలేం. అందుకే మన ప్రాచీన నాగరికతలన్నీ నదీ తీర ప్రాంతాల్లోనే రూపుదిద్దుకోవడం చూస్తాం. గత 2 వేల సంవత్సరాల కాలంలో ప్రపంచ జనాభా 50 రెట్లు పెరిగినా నీటి వనరుల్లో ఏ మాత్రం మార్పు లేదు. దీనికి తోడు పారిశ్రామిక, హరిత విప్లవాల వలన, నీటి వినియోగం అనూహ్యంగా పెరిగింది. అంతే కాకుండా, వున్న పరిమిత నీటి వనరుల్ని కలుషితం చేసి నీటి సమస్యను తీవ్రతరం చేసుకుంటున్నాం. ఒకటికి 8 లీటర్లు కలుషితం నీరు విశ్వవ్యాప్తంగా లభించే ఏకైక సహజ ద్రావకం. ఎన్నోరకాల మలినాల్ని తనలో కరిగించుకోగలదు. ఈ ధర్మమే నీటి నాణ్యతను దెబ్బతీస్తున్నది. దీనికి తోడు వ్యర్థాలను పలుచబర్చడం ద్వారా కాలుష్యాన్ని పరిష్కరించవచ్చు అనే మూఢ నమ్మకం.. అన్నీ కలిసి నదులు, సరస్సులు, సముద్రాలను తీవ్ర కాలుష్యానికి గురి చేస్తున్నాయి. ఒక లీటరు కలుషిత నీరు ఇంచుమించు 8 లీటర్ల శుద్ధ జలాన్ని కలుషితం చేయగలదు. వీటన్నిటికి తోడు భూతాపం నీటి సమస్యను తీవ్రతరం చేస్తున్నది. సకాలంలో వర్షాలు రావు, వస్తే పడవలసిన చోట పడవు. పడితే అతివృష్టి, తుపాన్లు, వరదలు లేకపోతే అనావృష్టి, కరువు కాటకాలు, ఆకలి చావులు. ఒక్క మాటలో చెప్పాలంటే కలుషిత నీరు యుద్ధం కంటే ప్రమాదకారి. ఎక్కువ ప్రాణాల్ని బలిగొంటుంది. 80 శాతం జబ్బులు నీటి వనరుల ద్వారానే సంక్రమిస్తూ ప్రపంచస్థాయి చావుల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి. ప్రతి రోజు 6 వేల మంది పిల్లలు డయేరియా, మలేరియా మొదలగు వ్యాధులతో చనిపోవడానికి నీరే కారణమవుతోంది. దీనికి తోడు ఫ్లోరైడ్, నైట్రేట్, ఆర్సెనిక్ (పాషాణం), సైనైడ్, పాదరసం మొదలగునవి నీటి కాలుష్యాన్ని జటిలం చేస్తున్నాయి. పారిశ్రామికంగా ముందంజలో వున్న అమెరికా నీటి వనరుల్లో వెయ్యికి పైగా కాలుష్య కారకాలున్నట్లు తేలింది. 3 లీటర్లు తోడుకుంటే ఇంకుతున్నది లీటరే నీటి కాలుష్యం, నాణ్యత లోపాలకు తోడుగా, 2025 నాటికి ప్రపంచ జనాభాలో మూడు వంతుల్లో రెండు వంతులు తీవ్ర నీటి కొరతను ఎదుర్కోబోతున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా. మనదేశం విషయానికొస్తే.. ప్రపంచ జనాభాలో 19 శాతం ఉన్న మన జనాభా అవసరాలకు, ప్రపంచ నీటి వనరుల్లో మనకున్న 4 శాతం నీటి వనరులతో సరిపెట్టుకోవలసి వస్తోంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక వర్షపాతం గల ప్రదేశంగా గతంలో గణుతికెక్కిన చిరపుంజి ప్రాంతం సైతం, తీవ్ర నీటికొరతను ఎదుర్కొంటున్నది. రానురాను నీటికోసం పోరాటాలు తప్పవేమో అనిపిస్తోంది. మనకు సరఫరా అవుతున్న నీటిలో 68 శాతం వరకు ఆవిరి కావడమో లేక కారిపోవడమో జరుగుతున్నదని ఓ అంచనా. నీటి ఎద్దడి తీవ్రతను అధిగమించడానికి భూగర్భ జలాల్ని లోతుల్లోంచి వెలికితీసి దుర్వినియోగానికి పాల్పడుతున్నాం. భూగర్భం నుంచి మనం వెలికితీసే ప్రతి 3 లీటర్ల నీటికి, ఒక లీటరు వర్షం నీటిని మాత్రమే భూమిలోకి ఇంకించగలుగుతున్నాం. ఇందువల్ల తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి భూమి కుంగిపోతోంది. భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారుతున్నాయి. పర్యవసానంగా భూమిలోపలి పొరల్లో శూన్యం ఏర్పడి తీరప్రాంతంలోని జనావాస నిర్మాణాలు భూమిలోకి కుంగిపోతున్నాయి. చమురు, సహజ వాయువుల వెలికితీత మూలంగా కూడా మనరాష్ట్రంలో కృష్ణా.. గోదావరి బేసిన్లో భూమి కుంగిన సంఘటనలు ఉన్నాయి. భూమి కుంగడంతో పాటు భూగర్భ జలాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు రావటం సర్వసాధారణం. జల రవాణా మార్గాలు, మురుగు నీటి కాల్వల వల్ల కూడా ఉప్పు నీరు భూగర్భ మంచినీటిలో కలిసే ప్రమాదాలున్నాయి. ఒకటికి 40 అడుగుల మేర ఉప్పు నీరు వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వ్యవసాయ, జనాభా పెరుగుదల, జీవనోపాధికై వలసలు సహజంగానే నీటి వనరులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. దీనికితోడు వాతావరణ ఒడిదుడుకులు, వర్షాభావ పరిస్థితులు నీటి లభ్యత, నాణ్యతలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పర్యవసానంగా లెక్కకు మిక్కిలి బోరుబావులను తవ్వి లోతు నుంచి ఎక్కువ నీరు తోడేస్తున్నారు. దానివల్లా భూగర్భజల మట్టం గణనీయంగా పడిపోతోంది. ఆ మేర పీడనం తగ్గడంతో సమీపంలోని సముద్రపు నీరు మంచినీటితో కలుస్తోంది. దాంతో ఈ నీరు తాగటానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు (మత్స్య పరిశ్రమ, ఉప్పు తయారీ పరిశ్రమలకు మినహాయించి) పనికిరావటం లేదు. భూగర్భంలోని మంచినీటి మట్టం ఒక అడుగుమేర తగ్గినట్లైతే, సుమారు 40 అడుగుల మేర ఉప్పు నీరు అనూహ్యంగా పైకి ఎగబాకి భూగర్భంలోని మంచినీటిని ఉప్పు నీరుగా మారుస్తుందని ఒక అంచనా! నీటి కొరత నీటి నాణ్యతను, ఆ కలుషిత నీరు ప్రజల ఆరోగ్యాన్ని, నేల సారాన్ని, వ్యవసాయాన్నీ దెబ్బతీస్తోంది. ఏదైనా ఒక రంగానికి దారులు మూతబడుతున్నాయంటే, ఇంకో రంగానికి దారులు తెరుచుకుంటున్నాయి అని అనుకోవాలి. తీర ప్రజల జీవనోపాధులపై ప్రభావం ఇప్పటికే కొన్ని తీర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారినందున ఆయా ప్రాంతాల్లో రైతులు వ్యవసాయానికి స్వస్తి పలికి, చేపలు, రొయ్యల పెంపకానికి శ్రీకారం చుట్టారు. భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారినందున మత్స్యకారులే కాదు సమీప పట్టణ, నగరవాసులూ మంచి నీటిని కొనుక్కొని తాగవలసి వస్తున్నది. జల కాలుష్య నివారణ, శుద్ధి కార్యక్రమాలు, తాగునీటి సరఫరా పేరుతో కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు, పలురకాల జీవనోపాధులు ఏర్పడుతున్నాయి. సముద్రపు ఆహార ఉత్పత్తులు, ఎగుమతులు, వాణిజ్యం పెరగడం వలన జీవనోపాధులతోపాటు స్థూల జాతీయోత్పత్తి కూడా పెరిగి దేశ ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందనటంలో సందేహం లేదు. ఆహారం లేకుండా ఓ 60 రోజులు ఉండగలమేమో గానీ, నీరు తాగకుండా 60 గంటలు ఉండటం అసాధ్యం. నీటిని సంరక్షించుకోవడానికి మన పూర్వీకులు ఆచరించిన పద్ధతులు, నేడు మనకున్న నవీన పద్ధతులను మేళవించి నీటివనరుల్ని సంరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. ఉమ్మడి వనరులాంటి నీటిని వాడుకోవడంలో ఆసక్తి, కాపాడుకోవడంలో అనాసక్తి జగమెరిగిన సత్యం. నీటి కొరతకు తోడు దుర్వినియోగం కూడా సమస్య జటిలమవడానికి కారణమవుతోంది. ప్రకృతిలోనే పరిష్కారం! నేడు నీటికి పాలతో సమాన ధర చెల్లించి కొంటున్నాం. ఇప్పుడు మనం వాడుకుంటున్న 700 క్యూబిక్ కిలోమీటర్ల నీరు కాక, ఇంకో 1000 క్యూబిక్ కిలోమీటర్ల నీరు మన దేశానికి కావలసి వుంటుంది. కొత్త నీటి వనరులను వెదుకుతూ... వున్న వనరుల్ని దుర్వినియోగపర్చకుండా తెలివిగా, పొదుపుగా వాడుకోవాలి. మన పూర్వీకులు పాటించిన నీటి యాజమాన్య పద్ధతులు హర్షణీయం. అనుసరణీయం. ఎప్పుడు ఎక్కడ వర్షం పడితే అక్కడ పట్టి దాచుకో, వాడుకో. బకెట్ సాన్నం, బిందు సేద్యంలాంటి పద్ధతులు నీటిని బాగా ఆదా చేస్తాయి. చాలా సమస్యలకు ప్రకృతే మనకు పరిష్కారం చూపుతుంది. ఇది ప్రకృతిని నిశితంగా పరిశీలిస్తే బోధపడుతుంది. ప్రకృతిలో, అడవులు, సరస్సులు, మైదాన భూములు, వర్షపు నీటిని పట్టి వుంచి మనకు నిరంతరాయంగా అందిస్తుంటాయి. వాటిని ధ్వంసం చేసి నీటి సమస్యల్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఎడారి ప్రాంతవాసులకు తెలిసినంత నీటి యాజమాన్యం మరి ఇంకెవ్వరికీ తెలియదు. కనుక వారి పద్ధతులను గమనించాలి. ఆపై ఆచరణలో పెట్టాలి. బెంజిమన్ ఫ్రాంక్లిన్ చెప్పినట్లు బావుల్లో నీరు ఎండిపోయిన నాడు మనకు నీటి విలువ బాగా తెలిసివస్తుంది. -డా. ఈదా ఉదయ భాస్కర్ రెడ్డి విశ్రాంత ఆచార్యులు, పర్యావరణ శాస్త్ర విభాగం, ఆంధ్రా విశ్వవిద్యాలయం చదవండి: Pudami Sakshiga: 2050 నాటికి సగం ప్రపంచ జనాభా నగరాల్లోనే.. అదే జరిగితే! -
వామ్మో.. ఆ నీళ్లు తాగితే డైరక్ట్ దవాఖానానే..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ను ఆనుకొని ఉన్న పలు పారిశ్రామిక వాడల్లో భూగర్భజలం తీవ్రంగా కలుషితమైంది. పలు పరిశ్రమలు విడుదల చేస్తున్న పారిశ్రామిక వ్యర్థజలాలను నాలాలు, బహిరంగ ప్రదేశాలు, వట్టిపోయిన బోరుబావుల్లో వదిలివేస్తున్నారు. దీంతో భూగర్భ జలాల్లో భారలోహాలు, నైట్రేట్లు, పాస్ఫరస్ తదితర మూలకాల ఉనికి కనిపించినట్లు జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) ప్రాథమిక అధ్యయనంలో తేలింది. పూర్తిస్థాయి నివేదిక ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి సిద్ధమవుతుందని ఆ సంస్థ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. భూగర్భ జల కాలుష్యానికి ప్రధాన కారణాలివే.. ► మహానగరం పరిధిలోని 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భజలాలు, చెరువుల నీటి నమూనాలను ఇటీవల ఎన్జీఆర్ఐ (జాతీయ భూ¿ౌతిక పరిశోధన సంస్థ) సేకరించి ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించింది. ► ప్రధానంగా నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాల్లో కరిగిన ఘన పదార్థాలు, నైట్రేట్లు, పాస్ఫరస్ అధికంగా ఉండడంతోపాటు భార లోహాల ఉనికి బయటపడింది. ► పలు రసాయన, బల్‌్కడ్రగ్, ఫార్మా పరిశ్రమల నుంచి బహిరంగ ప్రదేశాలు, సమీప చెరువులు, నాలాలు, మూసీలోకి దశాబ్దాలుగా పారిశ్రామిక వ్యర్థజలాలు చేరడం. ఈ జలాలు క్రమంగా భూగర్భజలాల్లోకి చేరుతున్నాయి. ► రోజువారీగా గ్రేటర్లో 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో 700 మిలియన్ లీటర్ల నీటినే శుద్ధిచేసి మూసీలోకి వదిలిపెడుతున్నారు. ► మిగతా 700 మిలియన్ లీటర్ల జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ నిర్వహించకుండానే మూసీలో కలుస్తున్నాయి. ► ఇందులో సుమారు 350 మిలియన్ లీటర్ల మేర పారిశ్రామిక వ్యర్థజలాలున్నాయి. ఈ నీరు క్రమంగా భూగర్భజలాల్లోకి చేరుతుండడంతో భూగర్భజలాలు గరళంగా మారాయి. భూగర్భజలాల్లో ఉన్నమూలకాలు, భారలోహాలివే.. సోడియం, క్యాల్షియం, మెగీ్నీషియం, సెలీనియం, బోరాన్, అల్యూమినియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, నికెల్, ఆర్సెనిక్, జింక్, లెడ్, నైట్రేట్, పాస్ఫరస్. ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలశాఖ నెలవారీగా భూగర్భ జలమట్టాలను లెక్కిస్తోంది. ఇక నుంచి ఆయా ప్రాంతాల్లో బోరుబావులు తవ్వి భూగర్భజలాల నాణ్యత ను ఎన్జీఆర్ఐ సౌజన్యంతో పరిశీలించనుంది. ఈ వివరాలను జీఐఎస్ మ్యాపుల్లో పొందుపరిచి భూగర్భజలశాఖ వెబ్సైట్లో అందరికీ లభ్య మయ్యేలా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు ఆ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి నగరంలో పారి శ్రామిక వాడలతోపాటు ఇతర ప్రాంతాల్లో భూ గర్భజలాల నాణ్యతపై పూర్తిస్థాయి నివేదికను ఎన్జీఆర్ఐ సిద్ధం చేయనుందని వెల్లడించాయి. -
నీటి లభ్యత విపరీతంగా పెరిగింది: మంత్రి అనిల్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుభిక్షంగా వర్షాలు పడి, డ్యామ్‌లు నిండటంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అనిల్ కుమార్ యాదవ్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది కన్న ఈ సంవత్సరం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలో చెరువులు నిండటంతో పాటు రిజర్వాయర్లు నిండుకున్నాయని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరదనీరు దిగువకు వస్తోందని, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించామని అన్నారు. కాగా ప్రకాశం బ్యారేజీ రాత్రి కి 7 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించామని తెలిపారు. భారీ వర్షాలకు గ్రౌండ్ వాటర్ పెరగడంతో నీటి లభ్యత విపరీతంగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో రైతాంగం సంతోషంగా ఉన్నారని, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే ఖరీఫ్‌లో సైతం రికార్డు స్థాయిలో పంటల దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. మరోవైపు వరద పరిస్థితి పై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ టేలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఇంతియాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కాగా ప్రకాశం బ్యారేజి దిగువ ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు, స్నానాలకు వెళ్ళడం చేయరాదని ఇంతియాజ్ ప్రజలకు సూచించారు. -
ఇంకుడు బోరు!
తాగటానికో, వ్యవసాయం కోసమో భూమి లోపలి పొరల్లో నీటిని పైకి తెచ్చుకోవడానికి బోర్లు తవ్వుకోవడం మనకు తెలుసు. భూగర్భం వేగంగా ఖాళీ అయిపోతోంది. వర్షం పడినప్పుడైనా నీటిని భూమిలోకి ఇంకింపజేసుకోవాలి కదా.. అందుకే, ఇప్పుడు భూమిలోకి ఇంకింపజేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా తక్కువ లోతు (6 నుంచి 50 అడుగుల లోతు) బోర్లు తవ్వుకోవటమే ఉత్తమ మార్గం అంటున్నారు ప్రముఖ శాస్త్రవేత్త డా. జగదీష్. ఈ ‘ఇంకుడు బోర్ల’ కథా కమామిషు ఏమిటో చూద్దాం..! భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపధ్యంలో వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భంలోకి ఇంకింపజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. నెల్లూరుకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ. జగదీష్ ఓ వినూత్నమైన వాన నీటి సంరక్షణ పద్ధతిని ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పాటూరువారి కండ్రిగలోని కొబ్బరి తోటలో ఈ ఇంకుడు బోరు’ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించారు. ఇంకుడు బోరు ప్రత్యేకత ఏమిటి? సాధారణ ఇంకుడు గుంట కొన్ని చదరపు మీటర్ల చోటును ఆక్రమిస్తే.. దీనికి కేవలం ఒక చదరపు మీటరు చోటు సరిపోతుంది. భూమి లోపలికి నిలువుగా బోరు గుంత తవ్వి, అందులోకి పీవీసీ పైపును దింపి, దాని పైన గరాటను అమర్చితే చాలు. దీన్ని ఇంకుడు గుంత అనే కంటే ‘ఇంకుడు బోరు’ అని పిలవటమే సమంజసం. భూమి లోపలకు నిలువుగా దింపే పీవీసీ పైపు ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వర్షపాతాన్ని బట్టి ఎంతో కొంత వర్షపు నీరు గరాటా ద్వారా కూడా భూమి లోపలికి ఇంకుతుంది. దీన్ని ఆరు బయట, పొలాల్లోనూ, బోరు బావి దగ్గర్లో గానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటిపై నుంచి వచ్చే వర్షపు నీరును భూమిలోపలికి ఇంకింపజేసుకోవడానికి కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటిపై నుంచి వచ్చే నీటిని గరాటలో పడే విధంగా కూడా పెట్టుకోవచ్చు. గరాట మూలంగా ఏర్పడే వత్తిడి కారణంగా భూమి లోపలికి నీరు చాలా వేగంగా, ఎక్కువ పరిమాణంలో ఇంకిపోతుందని డా. జగదీష్ అంటున్నారు. ఇది సాధారణ ఇంకుడు గుంత కన్నా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సులువుగా ఎవరైనా తమంతట తాము ఏర్పాటు చేసుకోగలిగిన వాన నీటి సంరక్షణ వ్యవస్థ అని డా. జగదీష్ తెలిపారు. సాధారణ ఇంకుడు గుంట కన్నా ఇది ఎంతో సమర్థవంతంగా వాన నీటిని భూమి లోపలికి ఇంకింపజేయగలుగుతుందన్నారు. ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ‘ఇంకుడు బోరు’ ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు.. పీవీసీ పైపు, మెష్, గరాట, కొంచెం ఇసుక, గులకరాళ్లు మాత్రమే. పీవీసీ పైపునకు చుట్టూతా అంగుళం వెడల్పు ఉండే బెజ్జాలు పెట్టాలి. గుంత ఎంత లోతు తీస్తామో అంత పొడవు పైపు వాడాలి. ‘ఇంకుడు బోరు’ 6 అడుగుల నుంచి 50 అడుగుల వరకు లోతు పెట్టుకోవచ్చు. అంతకన్నా లోతు పనికిరాదు. పైపు ఒక చివరన అడుగు ఎత్తున పైపును వదిలేసి మిగతా పైపునకు మాత్రమే బెజ్జాలు పెట్టాలి. పైపు అడుగు వైపు, చుట్టూతా బెజ్జాలు వేసిన ప్రాంతం మొత్తానికీ ఫైబర్ మెష్‌ను చుట్టాలి. రెండు పొరలుగా చుడితే మంచిది. దీని ద్వారా భూమి లోపలికి ఇంకే వాన నీటితోపాటు మట్టి రేణువులు, ఇసుక రేణువులు పైపు లోపలికి వెళ్లకుండా ఈ మెష్ అరికడుతుంది. భూమి లోపలికి నిలువుగా హేండ్ బోరు (మరీ లోతుగా అయితే బోరు యంత్రం వాడాలి)తో గుంత తవ్వు కోవాలి. ఆ గుంతలో అడుగున అర అడుగు ఎత్తున గులకరాళ్లు వేయాలి. ఆ తర్వాత.. బెజ్జాలు వేసి మెష్ చుట్టి సిద్ధం చేసుకున్న పీవీసీ పైపును దింపాలి. దాని చుట్టూ ఇసుక, గులక రాళ్లు వేసి పూడ్చేయాలి. పైపు పై భాగంలో జీఐ షీటుతో చేసిన గరాటను అమర్చితే సరి.. ‘ఇంకుడు బోరు’ రెడీ అయినట్టే! పీవీసీ పైపు ఎంత పొడవుండాలి? నీటి లభ్యతను బట్టి 6 అడుగుల నుంచి 50 అడుగుల వరకు ఎంత లోతు అవసరం అనుకుంటే అంత లోతున్న ‘ఇంకుడు బోరు’ను ఏర్పాటు చేసుకోవచ్చు. లోతు పెరిగే కొద్దీ పీవీసీ పైపు వ్యాసం, పొడవుతో పాటు దాని పైన అమర్చే గరాటా సైజు కూడా ఆ మేరకు పెంచుకోవాలి. ఉదాహరణకు.. 6 అడుగుల లోతు చాలు అనుకుంటే.. 6అడుగుల పొడవు, 6 అంగుళాల వ్యాసం ఉన్న పైపు వాడాలి. గరాటా 1 అడుగు వెడల్పు ఉన్న గరాట పెట్టుకోవచ్చు. అదే.. 10 అడుగుల లోతు ‘ఇంకుడు బోరు’ కావాలనుకుంటే పైపు పొడవు 10 అడుగుల పొడవు, వ్యాసం 8అంగుళాలు ఉండాలి. గరాటాను కూడా మీటరు వెడల్పున ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక 50 అడుగుల లోతు వరకు 10అంగుళాల వ్యాసం కలిగిన పైపునకు 1 మీటరు వ్యాసం కలిగిన ఫనల్(గరాటా) అమర్చుకోవచ్చు. అధిక మోతాదులో నీటిని ఒడిసిపట్టుకొని భూగర్భంలోకి ఇంకింపజేసుకోవచ్చు. – కేఎస్వీ రాజన్, సాక్షి, ముత్తుకూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సన్న, చిన్నకారు రైతులకు మేలు వర్షపు నీటి సంరక్షణ కోసం గతంలో ప్రభుత్వం నిర్మించిన ఇంకుడు గుంతలు విఫలమయ్యాయి. అయితే, ఈ నూతన పద్ధతి ద్వారా వర్షపు నీటిని సులభంగా ఒడిసిపట్టుకోవచ్చు. ఈ పద్ధతి సమర్థవంతంగా పనిచేస్తుంది. నిర్వహణ సమస్యలు ఉండవు. సన్న, చిన్నకారు రైతుల పొలాల్లో, ఇళ్ల దగ్గర ఇది ఏర్పాటు చేసుకోవచ్చు. స్థానికంగా లభించే పరికరాలతో కారు చౌకగా ఈ పరికరాన్ని తయారు చేసుకొని, తక్కువ సమయంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. – డాక్టర్ ఏ. జగదీష్, శాస్త్రవేత్త, (94901 25950, 95336 99989) డైరెక్టర్, నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్, నెల్లూరు ఇంకుడు బోరు నిర్మాణానికి గుంత తవ్వుతున్న దృశ్యం, పీవీసీ పైపునకు బెజ్జాలు వేసి మెష్‌ను చుడుతున్న దృశ్యం -
ప్రతి నీటి చుక్కనూ ఒడిసిపట్టాలి
సాక్షి, హైదరాబాద్: ప్రతి నీటి బొట్టు అమూల్యమైందని, దాన్ని ఒడిసి పట్టాలని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు వాన నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టాలని, దీనికి ప్రజలంతా కలసి రావాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి సంరక్షణపై ఈ వేసవిలోనే కార్యక్రమాలు చేపట్టాలని, ఇది రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలు ఇస్తుందని మంత్రి సూచించారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో జలమండలి నిర్మించిన థీమ్ పార్కును సందర్శించిన మంత్రి, అక్కడే జలమండలి చేపట్టిన ప్రాజెక్టులపై, బోర్డు కార్యకాలాపాలపై సమీక్ష జరిపారు. థీమ్ పార్కులో ఏర్పాటు చేసిన పలు రకాల నమూనాలను మంత్రి తిలకించారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కు.. నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఎన్నో వ్యయప్రయాసలు పడి జలమండలి వందల కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా, గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి, నగర వాసులకు సరఫరా చేస్తుందన్నారు. ఈ నీటిని ప్రజలు వృథా చేస్తే ప్రభుత్వానికి నష్టంతో పాటు రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని తెలిపారు. మంచినీటి వృథాను అరికట్టడానికి జలమండలి రూపొందించిన వాక్ కార్యక్రమం అద్భుతంగా ఉందన్నారు. ప్రజలు, అధికారులు సమష్టిగా నీటి వృథాపై అవగాహన కార్యక్రమాలు చేపట్ట డం శుభ పరిణామమని మంత్రి అన్నారు. జలమండలి క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వర కు తయారుచేసిన యూనిఫామ్ జాకెట్‌ను, ‘వాక్’ వివరాలు నమోదు చేసుకోవడానికి రూ పొందించిన డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంఏయూడీ ప్రిన్సిపాల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, జలమండలి డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఇంకుడుగుంత లేకుంటే ఉపాధి కల్పించం!
సాక్షి, వికారాబాద్: ఇంట్లో ఇంకుడు గుంత లేనివారికి ఉపాధి పనులు కల్పించేది లేదని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీలో వంద రోజుల కొత్త పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆలోపు కూలీలు తమ ఇళ్లలో ఇంకుడుగుంతలు తవ్వుకోవాలని పిలుపునిచ్చారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె మంతన్‌గౌడ్‌తండా, ఎక్మాయి, కంసాన్పల్లి(బి), మైల్వార్, నీళ్లపల్లి, జలాల్పూర్ గ్రామాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. పారిశుద్ధ్యం, మురుగు కాలువలు, అంతర్గత రోడ్లు, విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఇంట్లో టీవీలు ఉంటాయ్.. స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. బైక్‌లు, ట్రాక్టర్లు ఉన్నవారు సైతం ఇంకుడుగుంతలు, మరుగుదొడ్డి కట్టుకోమంటే బిల్లులు రావడం లేదని చెప్పడం సమంజసనమేనా..? ఇంట్లోని వస్తువులన్నింటినీ ప్రభుత్వమే కొనిచ్చిందా..? మరుగుదొడ్డి, ఇంకుడు గుంత కూడా మీ కోసం నిర్మించుకోవాలి.. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఆలస్యమైనా తప్పకుండా వస్తాయి.. సంక్రాంతి తర్వాత ఎవరి ఇంట్లోనైనా ఇంకుడు గుంత, మరుగుదొడ్డి నిర్మించుకోకపోయినా, రోడ్లపైకి మురుగు నీళ్లు వదిలినా..? రహదారుల పక్కన మలమూత్రాలు విసర్జించినా కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 52, 88 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. వారికి జరిమానాలు కూడా విధిస్తాం. ఫైన్లు కట్టనివారి ఇంటి ఆస్తులు వేలం వేసి పంచాయతీలతో పారిశుద్ధ్య పనులు చేయిస్తాం’ అని హెచ్చరించారు. పారిశుద్ధ్యం బాగుంటే విషజ్వరాలు రాకుండా ఉంటాయన్నారు. దీని కోసం సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒక్క మొక్క కనిపిస్తలేదు.. మండలంలోని నీళ్లపల్లిలో పర్యటించిన కలెక్టర్‌కు సర్పంచ్ సువర్ణ, గ్రామస్తులు డప్పులతో ఘనంగా స్వాగతంపలికారు. అయితే కాలనీల్లో పర్యటించిన కలెక్టర్‌కు ఎక్కడా మొక్కలు కనిపించకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో హరితహారం నిర్వహించలేదా..? ఒక్క మొక్క కూడా లేదు.. నీటిని వృథా చేస్తున్నారు..? రోడ్ల పక్కనే చెత్త, మురుగు వేశారు.. ఇలాగైతే ఎలా అని పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ గ్రామంలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డు తప్పని సరిగా ఉండాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రగతి పనుల పరిశీలనకు కలెక్టర్ తనతో పాటు వివిధ శాఖల అధికారులను తీసుకువస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌రావు, మండల ప్రత్యేక అధికారి రవి, జిల్లా అధికారులు మనోహర్‌రావు, బాబు శ్రీనివాస్, జానకిరామ్, ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్ ఉమామహేశ్వరి, సర్పంచులు గాయిత్రి చౌహన్, నారాయణ, వెంకటయ్య, సీమా సుల్తాన, సువర్ణ, వసంతమ్మ, వివిధ శాఖల మండల అధికారులు, ఉపాధి, రెవెన్యూ సిబ్బంది, పాల్గొన్నారు. -
చేను కింద చెరువు
సాక్షి, సిద్దిపేట: వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ఏ అవకాశాన్ని వదలడం లేదు. జలశక్తి అభియాన్‌లో భాగంగా నీటి వనరులను కాపాడుకోవడం, వాటి ని భూగర్భ జలాలుగా మల్చుకోవడం మొదలైన పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా చేను కింద చెరువు అన్నట్లుగా ప్రతీ రైతు చేను కింద కందకాలు తవ్వుతున్నారు. దీంతో సరి హద్దు ఇబ్బంది కాకుండా ఉండటంతో పాటు చెలకలో పడిన ప్రతీ వర్షపు చుక్క ఆ రైతు భూమిలోనే ఇంకి పోయే విధంగా కందకాలు తవ్వుతున్నారు. పూర్వకాలంలో ప్రతీ రైతు తన పొలంలో బావులు, పడావు పడిన గుంతలు ఉండేవి. వర్షం కురిసినప్పుడు చెలకలో పడిన నీరు బావులు, నీటి గుంతల్లోకి చేరేది. దీంతో అనూహ్యంగా భూగర్భ జలాలు పెరిగేవి. ప్రస్తుతం మారిన కాలంతో పాటు, టెక్నాలజీ పెరగడంతో అందరు బోర్లపై ఆధారపడి పోయారు. దీంతో బావులు, ఇతర నీటి గుంతలను పూడ్చివేశారు. దీంతో చెలకలో పడిన నీరు పల్లానికి ప్రవహించడంతో ఆయా భూముల్లో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. బోర్లు నిలువునా ఎండిపోతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ రైతు తమ చెలక కింది భాగంలో కందకాలు తవ్వలని, అలా తవ్వడంతో చెలకలో పడిన ప్రతీ నీటిబొట్టు అక్కడే ఇంకిపోవడం, కందకాల్లో నీరు నిల్వ ఉండటంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు రుజువు చేశారు. భూగర్భ జలాలు పెంచే ఈ కార్యక్రమంపై జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించే పనిలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నిమగ్నమైంది. పది మండలాల్లో.. చెరువు కింద కందకాలు తవ్వే పనిలో భాగంగా ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు రూ.71.57 లక్షల పనులు చేపట్టి కూలీ రూపంలో డబ్బులు చెల్లించారు. రైతుల వారీగా భూ విస్తీర్ణం లెక్కలోకి తీసుకొని కందకాలు తవ్విన పనికి పని దినాల చొప్పున డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో పలువురు రైతు కూలీలు తమ పొలంలోనే తాము కందకాలు తవ్వితే కూలీ డబ్బులు వస్తున్నాయి. ఇలా జిల్లాలోని పది మండలాల్లో ఇప్పటి వరకు 260 పనులు చేపట్టారు. ఇందులో బెజ్జంకి మండలంలో 5 పనులకు గాను రూ. 71వేలు, చేర్యాల 16 పనులకు రూ. 3.42 లక్షలు, దౌల్తాబాద్ 4 పనులకు రూ. 42 వేలు, దుబ్బాక 69 పనులకు రూ. 18.19 లక్షలు, గజ్వేల్ 21 పనులకు రూ. 2.51 లక్షలు, కోహెడ 8 పనులకు రూ.1.57 లక్షలు, మద్దూరు 97 పనులకు రూ. 38.2 లక్షలు, సిద్దిపేట 29 పనులకు రూ. 6.57లక్షలు చెల్లించారు. అదేవిధంగా తొగుటలో 8 పనులు, మిరుదొడ్డిలో మూడు పనులు జరుగుతున్నాయి. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు అత్యధికంగా మద్దూరు మండలంలో అత్యధికంగా కందకాలు తవ్వుకునేందుకు రైతులు మొగ్గు చూపడం విశేషం. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.. చేనులో పడిన వర్షం నీరు పల్లానికి పోవడం పరిపాటి. పొలంలో పడిన ప్రతీ చినుకును ఒడిసి పట్టి ఎక్కడ పడిన వర్షం నీరు అక్కడే ఇంకిపోయేలా చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా ప్రతీ ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. ప్రతీ రైతు చెలకలో కింది భాగాన కందకాలు తవ్వడం ప్రారంభించాం. దీంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులకు పని కల్పించడంతోపాటు, వారి వారి పొలంలో కందకాలు తవ్వితే భూగర్భ జలా పెంపునకు దోహదపడుతుంది. –గోపాల్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
చెక్‌డ్యాంలతో సత్ఫలితాలు
సాక్షి, బాలానగర్: మండలంలోని గుండేడ్–బాలానగర్, మాచారం – నందారం, పెద్దాయపల్లి–బోడజానంపేట, కేతిరెడ్డిపల్లి గ్రామాల శివారులోని దుందుబీ వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో వర్షాలు పడితే చెక్‌డ్యాం లు నిండి పరిసర గ్రామాల్లో నీటి కష్టాలు తీరను న్నాయి. ఏళ్లుగా గ్రామాల్లో నీటికష్టాలు మిన్నంటి నా గతంలో దుందుబీ నదిపై నిర్మించిన చెక్‌డ్యాం లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో మరిన్ని చెక్‌డ్యాంల నిర్మాణానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో మండలంలోని గుండేడ్ శివారులో రూ.కోటి 4 లక్షలతో రెండు, బోడాజానంపేట శివారులో రూ.29 లక్షలతో మరొకటి మొత్తం మూడు చెక్‌డ్యాంలు నిర్మించడానికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తిచేశారు. ప్రస్తుత చెక్‌డ్యాంలు సత్ఫలితాలు మండల కేంద్రంతోపాటు, పెద్దాయపల్లి, గౌతా పూర్ శివారులో ఏర్పాటు చేసిన చెక్‌డ్యాంలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గత వర్షాకాలంలో చెక్‌డ్యాంలు నిండి భూగర్భజలాలు పెరిగి వ్యవసా య బోర్లలో నీరు సంవృద్ధిగా లభించింది. వ్యవసాయ బోర్లలో నీరు సంవృద్ధిగా లభ్యమై బోరు మోటార్లు కాలిపోయే పరిస్థితి తప్పుతుంది. అంతేకాకుండా గతేడాదితో పోల్చితే తాగునీటి సమస్య పెద్దగా రాలేదు. పశువులకు తాగునీరు కొరత లేకపోవడమే కాకుండా సాగు విస్తీర్ణం పెరిగింది. గ్రామాలకు ప్రయోజనాలు మండలంలోని గుండేడ్, బోడజానంపేట శివారులో దుందుబీ నదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే చెక్‌డ్యాంల పరిసర గ్రామాలైన మాచారం, నందారం, గుండేడ్, బాలానగర్, చెన్నంగులగడ్డ తండా, పెద్దాయపల్లి, గౌతాపూర్, సేరిగూడ, బోడజానంపేట, గాలిగూడ గ్రామాలకు ప్రయోజనం లభించనుంది. ఆయా గ్రామాల శివారులలో భూగర్భజలాలు పెరిగి తాగునీటితోపాటు, వ్యవసాయానికి సైతం నీరు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
మం‘జీరబోయింది’..
రేగోడ్(మెదక్): భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లు బోరుమంటున్నాయి. నీటిగండం తరుముకొస్తోంది. మంజీర ఎడారిని తలపిస్తోంది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఎస్ఆర్ఎస్పీకి 16 టీఎంసీల నీటిని తరలించడంతో ఇటు తాగడానికి.. అటు వ్యవసాయానికి నీళ్లు కరువయ్యాయి. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని మంజీరా పరీవాహకం వద్ద నీళ్లు అడుగంటిపోయి బురద తేలుతోంది. సింగూరు ప్రాజెక్ట్ సైతం డెడ్ స్టోరేజీకి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి ఏప్రిల్ చివరి వరకు మాత్రమే నీటి సరఫరా అయ్యే అవకాశం ఉంది. సింగూరు, మంజీరా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న వేలాది బోరుబావులు, బావులు ఎండుముఖం పట్టాయి. లక్షలాది ఎకరాలు పడావుగా మారాయి. బీడు భూములను చూస్తూ రైతులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా ప్రాంతాలకు కొన్ని రోజులుగా రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా అవుతోంది. వచ్చిన నీళ్లు సరిపోక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో తాగునీళ్లు వస్తాయా..? రావా..? అన్న ఆందోళన నెలకొంది. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి నీటి ఎద్దడిని నివారించాలని ప్రజలు కోరుతున్నారు. ముందస్తు చర్యలు చేపట్టాలి బోర్లు ఎండిపోయాయి. రెండు రోజులకోసారి నీళ్లొస్తున్నాయి. నీళ్లు సరిపోక అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి నీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలి. –పాపయ్య, రేగోడ్ బోర్లు లీజుకు తీసుకుంటున్నం గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నీటి ఇబ్బందులు ఎక్కడా రానీయకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. – లచ్చాలు, ఎంపీడీఓ రేగోడ్ -
అప్పుడే నీటి కటకట..!
సాక్షి, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో ఈ ఏడాది నెలకొన్న వర్షాభావపరిస్థితులతో తాగునీటికి ఇబ్బందులు తప్పటం లేదు. అదేవిధంగా సాగునీరు అందక రైతులు పంటల సాగును తగ్గించారు. సాగుచేసిన పంటలకు కూడా సరిపడా నీరందని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. జిల్లాలో కేవలం బోర్లు, విద్యుత్ మోటార్ల కిందనే రబీ పంటలు సాగు చేపట్టారు. భూగర్భజలాలు అడుగంటడంతో పంటలకు సరిపడా నీరు అందటం లేదు. అదేవిధంగా వలస ఆదివాసీ గ్రామాల్లో ఇప్పటికే తాగునీటికి కటకట ఏర్పడింది. మారుమూల గ్రామాల ప్రజలు సమీపంలోని వాగులు, వంకలు ఎండిపోవటంతో అక్కడే లోతుగా చెలిమలు తీసి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. మార్చి మొదటి వారంలోనే ఇలాంటి పరిస్థితులుంటే మే నెలలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఆందోళనలో ప్రజలున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న భూగర్భ జలాల క్షీణత గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భూగర్భజలాలు గణనీయంగా పడిపోయాయి . జిల్లాలో భూగర్భ జలాల క్షీణత రోజురోజుకు ఎక్కువవుతుది. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో భూగర్భజలాల వినియోగం ఎక్కువైంది. రబీలో సాగుచేసిన పంటలకు నిరంతర ఉచిత విద్యుత్‌తో సాగునీరు అందిస్తున్నారు. దీంతో భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బోర్లలో నీరు రానటువంటి పరిస్థితులున్నాయి. గుండాల, పినపాక, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో సాగునీటికి ఇబ్బందులు మొదలయ్యాయి. రబీలో సాగుచేసిన పంటలు చేతికందుతాయనే నమ్మకం రైతుల్లో సన్నగిల్లుతుంది. వరిపంటకు నీటి ఎద్దడి తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేతకు అలమటిస్తున్న పశువులు వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగు తగ్గిపోవటంతో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఒక ఎకరం మాగాణిలో వరిగడ్డి రూ.8 వేలు పలికింది. ఎండుగడ్డి కొరతతో పాటు పశువులు పొలాలకు వెళ్లి మేసేందుకు ఎక్కడా మేతలేదు. మేతకు వెళ్లిన పశువులు కనీసం తాగేందుకు వాగులు, వంకలు, చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేదు. ఒక పశువు మేతకు రోజుకు యాభై నుంచి వంద రూపాయలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రైతులకు పశుపోషణ భారంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో రైతులు పశువులను తెగనమ్ముకుంటున్నారు. మండుతున్న ఎండలు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. రోజురోజుకు ఎండ తీవ్రత పెరిగిపోతుంది. గ్రామాలలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మిషన్ భగీరథ పనులు పూర్తికాకపోవటంతో తాగునీటికి గ్రామాల్లో ఇబ్బందులు తప్పటం లేదు. తాగు, సాగునీటి ఇబ్బందులపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవసరముంది. అదేవిధంగా పశుగ్రాసం కొరతను నివారించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పశువుల మేత, దాణా అందించాలని రైతులు కోరుతున్నారు. -
క్లైమేట్ టైం బాంబ్
సాక్షి, నాలెడ్జ్ సెంటర్: భూమి మీద జీవరాశి అంతా ఇప్పుడు క్లైమేట్ టైం బాంబ్ మీద కూర్చుంది. ఇది మేమంటోన్న మాట కాదు. స్వయంగా శాస్త్రవేత్తలు చేస్తోన్న హెచ్చరిక. మరో 100 ఏళ్లలో భూమిపైన సగం జీవరాశికి చుక్కనీరు కూడా లేకుండా భూమిపొరల్లోని నీరంతా ఇంకిపోనుంది. తీవ్రమైన వాతావరణ మార్పులతో భూగర్భ జలాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదకర పరిస్థితినే శాస్త్రవేత్తలు ‘క్లైమేట్ టైం బాంబ్’ అని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల మంది జనాభా తాగునీటికీ, సాగునీటికీ ఆధారపడుతోంది మట్టిపొరలు, ఇసుక, రాళ్లల్లో దాగి ఉన్న భూగర్భ జలాలపైనే. వర్షాల కారణంగా భూమిపైన జలాశయాలూ, నదులూ, సముద్రాల్లోకి నీరు చేరుతుంది. మనం తోడేసిన భూగర్బజలాలు ఓ మేరకు ఈ వర్షాలతో తిరిగి పుంజుకుంటాయి. అయితే వాతావరణంలో ఏర్పడిన తీవ్రమైన మార్పుల ప్రభావం కారణంగా కొన్ని చోట్ల అసలు వర్షాలు లేకపోవడం, మరికొన్ని చోట్ల మితిమీరిన వర్షపాతం నమోదవడం వల్ల భూగర్భ జలాలపై కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే భూగర్భ జాలాల నిల్వలు క్షీణించి వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడంతో పంట దిగుబడి తగ్గిపోయింది. దీనికి తోడు ఒకవైపు కరువు పరిస్థితులూ, మరోవైపు అత్యధిక వర్షపాతం రెండూ కూడా తీవ్రమైన నష్టానికి కారణమౌతోందని ‘నేచర్ క్లైమేట్ చేంజ్’ లో ప్రచురితమైన అధ్యయనం తేల్చి చెప్పింది. వాతావరణ మార్పుల వల్ల నీటి నిల్వలు ఎలా ప్రభావితం అవుతున్నాయనే విషయాలను కంప్యూటర్ మోడలింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డేటా ఆధారంగా అంతర్జాతీయ అధ్యయన బృందం అంచనా వేసింది. టైం బాంబ్: ‘‘ఇప్పుడు ఎదుర్కొంటోన్న వాతావరణ మార్పుల ప్రభావం దీర్ఘకాలిక సమస్య. ఇది కొన్ని చోట్ల తక్కువగానూ, మరికొన్ని చోట్ల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైనట్లు కార్డిఫ్ వర్సిటీ స్కూల్ ఆఫ్ ఎర్త్ సోషల్ సైన్సెస్ కి చెందిన మార్క్ క్యూత్‌బర్ట్ వెల్లడించారు. రాబోయే శతాబ్దకాలంలో కేవలం సగం భూగర్భజలాలు మాత్రమే తిరిగి భర్తీ అవుతాయనీ, పొడి ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిగా క్షీణించే ప్రమాదాన్ని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఈ పరిస్థితినే పర్యావరణవేత్తలు ‘టైం బాంబ్’గా పరిగణిస్తున్నారు. భావి తరాలపై ప్రభావం... భూగర్భజలాలు తిరిగి పుంజుకోవడం ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అందుకు కొన్ని చోట్ల శతాబ్దాలు పట్టొచ్చు. పెద్ద పెద్ద తుపానులు, విపరీతమైన కరువు పరిస్థితులూ, అధిక వర్షపాతం భూగర్భజలాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందనీ, ఫలితంగా కొన్ని తరాలపై దీని ప్రభావం పడనుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎడారి ప్రాంతాల్లోనైతే భూగర్భ జలాల పరిస్థితి మెరుగుపడటానికి వేల సంవత్సరాలు పట్టొచ్చన్నది ఈ అధ్యయనకారుల అభిప్రాయం. సహారా ఎడారిలో 10,000 ఏళ్ల క్రితం భూగర్భజలాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు మార్క్ క్యూత్‌బర్ట్ వెల్లడించారు. అయితే ఇప్పటికీ అక్కడి భూగర్బజలాలు పుంజుకోకపోవడాన్ని వారు ఉదహరించారు. తీవ్రమైన వాతావరణ మార్పుల నుంచి కాపాడుకోవడానికి తక్షణమే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు నీటి చుక్క దొరకదని వీరు హెచ్చరిస్తున్నారు. -
పాతాళంలోకి భూగర్భజలాలు
వేములవాడ అర్బన్: ఇసుకాసురుల పైసాచికానందానికి మూలవాగు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక అక్రమంగా తరలిపోతుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలలో భూగర్భజలాలు అంతరించిపోతున్నాయి. ఇప్పటికే మూలవాగుతోపాటు చుట్టూపక్కల ప్రాంతాలలో చుక్క నీరు కనిపించని పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటికీ మూలవాగులోని ఇసుక ఖాళీ కావడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. వేములవాడ పట్టణంలో దాదాపు 30 ట్రాక్టర్లు ఉన్నాయి. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు. పాతాళంలోకి భూగర్భజలాలు: ఈ ఏడాది జిల్లాలో సగటు వర్షపాతంలో 21 శాతం లోటు ఉంది. జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 14.25 మీటర్లు లోతులో ఉంది. వర్షాకాలంలో వర్షాలు సాధారణ వర్షపాతం 823.19 మిల్లీమీటర్లుకాగా 646.40 మిల్లీమీటర్లు కురిసింది. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో ఈ సంవత్సరం మూలవాగు పారలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని నీటి వనరులు ఎండిపోయాయి. శీతాకాలం ప్రారంభంలోనే భూగర్భజలాల పాతాళంలోకి పోవడంతో అటు అన్నదాతులు.. ఇటు పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. వేములవాడ అర్బన్‌లో 24.72 మీటర్ల అత్యధిక లోతుల్లో నీరు ఉంది. మూలవాగే ఆధారం... కోనరావుపేట మండలంలోని కొన్ని గ్రామాలు, వేములవాడ మండలంలోని నాంపల్లి, అయ్యోరుపల్లి, వేములవాడ, జయవరం, తిప్పాపూర్, మల్లారం, హన్మాజీపేట గ్రామాలకు మూలవాగే ఆధారం. ఆయా గ్రామాలలో సాగు, తాగునీరు కోసం మూలవాగుపైనే ఆధారపడతారు. ఇసుక అనుమతులు.. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పనులకు మాత్రమే అధికారులు ఇసుక అనుమతి ఇస్తున్నట్లు చెబుతున్నారు. అది కూడా మిడ్‌మానేరు ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని పరిసరాల వాగులో ఇసుకను తీసేందుకే అనుమతి ఇస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ పనులకు అయితే మంగళవారం, గురువారం, శనివారం మూడు రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇస్తున్నారు. కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ తెచ్చిన తర్వాత ఒక ట్రాక్టర్ ఇసుక ట్రిప్పునకు రూ.220 డీడీ చెల్లించాలి. అనంతరం వారు తహసీల్దార్ కార్యాలయంలో అనుమతులు పొందాలి. తర్వాతనే ఇసుకను తరలించే అవకాశం ఉంటుంది. కానీ వేములవాడ మూలవాగులో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకను ఇష్టారీతిగా తోడేస్తున్నారు. అక్రమంగా రవాణా చేస్తే చర్యలు... వేములవాడలోని ప్రభుత్వ పనులకు మాత్రమే ఇసుకను అనుమతి ఇస్తున్నాం. అది కూడా కేటాయించిన రోజు, సమయానికే తరలించాలి. మూలవాగులో ఇసుక తోడేందుకు ఎలాంటి అనుమతి లేదు. అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. -నక్క శ్రీనివాస్ తహసీల్దార్, వేములవాడ బావుల వద్ద తోడుతున్నారు మూలవాగులో ఉదయం 4 గంటలకే ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. వ్యవసాయ బావుల వద్ద కూడా ఇసుకను తోడేస్తున్నారు. ఇదేం పద్ధతి అం టే బెదిరింపులకు దిగుతున్నారు. అధికారులే పట్టించుకోవాలి. -చిర్రం శేకర్ రైతు గొల్లపల్లి అడుగంటుతున్న భూగర్భ జలాలు వర్షాలు సరిగ్గా కురువక మూలవాగులోని వ్యవసా య బావుల్లో నీరు అడుగంటిపోయింది. బావులల్లా నీరు మోటార్ల ద్వారా ఒక్క గంట కూడా పోయడం లేదు. ఏసంగి వ్యవసాయం చేయడం కష్టమే. -ఎం.మల్లేశం రైతు గొల్లపల్లి -
నీటి ఆదా బాధ్యత రైతులదేనా?
రోజు రోజుకు తరిగిపోతున్న భూగర్భ జలాలను ‘నీరు విపరీతంగా తాగే’ పంటల సాగు ద్వారా తోడేస్తూ, వాడుకుంటూ పోతే ఏమవుతుందో మనం ఆలోచించడం లేదు. తరిగిపోతున్న నీటి లభ్యత ఫలితంగా ముదురుతున్న నీటి సంక్షోభం నేపథ్యంలో కొత్త సాగు పద్ధతుల అమలుకు కట్టుదిట్టంగా జోక్యం చేసుకోకుండా, త్యాగాలు చేయాలని మనం రైతులను మాత్రమే కోరితే లాభం లేదు. ఈ విషయంలో త్యాగాలు చేయడం ద్వారా ఆదర్శప్రాయంగా నిలవాల్సింది సంపన్నులే. ఫైవ్‌స్టార్ హోటళ్లు సహా అన్ని హోటళ్లలో స్నానాల తొట్టెలను నిషేధించడంతో నీటిని పొదుపు చేసే పని ప్రారంభించాలి. ఆ తర్వాతే అందరూ నీటి పొదుపును పాటిస్తారు. కొన్నేళ్ల క్రితం నీటి సంక్షో భం, వాతావరణ మార్పు లపై జరిగిన సమావేశంలో పాల్గొన్నాను. దేశంలో అనేక ఫైవ్ స్టార్ హోటళ్లు నడిపే ఓ బడా భారత కంపెనీ ఉన్నతాధికారి మాట్లా డుతూ, తమ సంస్థ ఎలా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తోందో వివరించారు. అంట్లు తోమేట ప్పుడు నీరు వృథా కాకుండా ఎలా చూడాలో ఇళ్లలో పనిచేసేవారికి నేర్పడానికి గురుగ్రామ్‌లో ఈ కంపెనీ ఓ కార్యక్రమం ప్రారంభించిందని తెలిపారు. వెంటనే ఆయన మాటలకు ప్రశంసాపూర్వకంగా చప్పట్లు మోగాయి. పనిమనుషుల్లో సామాజిక బాధ్యత పెంపొందించడానికి ఈ కంపెనీ ప్రయత్నిస్తోందని అర్థమైంది. ఓ బకెట్ నీటిలో ఒక మగ్గు నీటిని పొదుపు చేసినా, గురుగ్రామ్ వంటి నగరంలో ఎంత మొత్తంలో నీరు వృథా కాకుండా మిగులుతుందో ఊహించుకోవచ్చు. నీటిని పొదుపుగా వాడాలనే విషయం చక్కగా అర్థమయ్యేలా చెప్పినందుకు ఆయ నకు నేను నా ప్రసంగంలో కృతజ్ఞతలు చెప్పాను. దేశంలో తలసరి నీటి లభ్యత ఆందోళనకరమైన రీతిలో తగ్గిపోతున్న తరుణంలో ఐదు నక్షత్రాల హోటళ్లు బాత్రూముల నుంచి స్నానాల తొట్టెలను ఎందుకు తొలగించవని నేను ప్రశ్నించాను. నీటిని పొదుపు చేయడం అంత ముఖ్య విషయం అయి నప్పుడు స్నానాల తొట్టెలు వాడవద్దని ధనికులు, ఉన్నత స్థాయి వ్యక్తులకు ఎందుకు చెప్పరు? భారీ మొత్తంలో హోటల్ గదులకు అద్దె చెల్లించే స్తోమత కొందరికి ఉన్న కారణంగా ఇలా వందలాది లీటర్ల నీరు వృ«థాగా పోతున్నప్పుడు ఓ మగ్గు నీరు ఆదా చేయడం ఎలాగో ఇళ్లలో పనిచేసేవారికి నేర్పడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? 30అంగుళాల వెడల్పు, 60 అంగుళాల పొడవు ఉన్న స్నానం తొట్టెలో 300 లీటర్ల నీరు పడుతుంది. ఏదైనా లగ్జరీ హోటల్లో సగటున వంద గదులుంటే ప్రతి రోజూ స్నానాల కారణంగా 30 వేల లీటర్ల నీరు వాడేస్తున్నారు. ఇది న్యాయం కాదు. ఓ పక్క సంపన్నులు విలాస జీవన శైలి పేరుతో ఇంతగా నీటిని వృథా చేయడాన్ని అను మతిస్తూ మరో పక్క పేదలను నీరు లేకుండా త్యాగాలు చేయాలని బలవంతపెట్టలేం. వ్యవసాయంపైనే అనవసర ఫిర్యాదులు! కొన్ని నెలల క్రితం కజకిస్తాన్‌లోని అల్మటి నగరంలో జరిగిన ఐరోపా–ఆసియా సమావేశంలో కూడా ఇలాంటి ప్రశ్నే లేవనెత్తాను. ప్రపంచ నీటి సంక్షో భంపై ఏ జాతీయ లేదా అంతర్జాతీయ సమావేశాల్లో జరిగిన చర్చల్లోనైనా ఒకే విషయం ప్రస్తావిస్తున్నారు. నీటిని అతిగా వినియోగించే రంగం వ్యవసాయమే నని ఈ సదస్సుల్లోని వక్తలు ఫిర్యాదు చేస్తున్నారు. దాదాపు 70 శాతం నీటి వాడకం జరిగేది వ్యవ సాయంలోనే. ఇది వాస్తవమే. దీంతో సాగు రంగంలో జల వినియోగం తగ్గించడంపైనే దృష్టినంతా కేంద్రీ కరిస్తున్నారు. మంచు పర్వతాలు శరవేగంతో కరిగి పోతున్నాయి. భూగర్భజలాలను అడ్డూ అదుపూ లేకుండా వాడడంతో నీటి పారుదలకు ఆస్కారమిచ్చే నేలలోని రాళ్లు ఎండిపోతున్నాయి. ఫలితంగా నానా టికి తీవ్రమౌతున్న నీటి సంక్షోభం మనిషికి మనిషికి మధ్య, దేశాల మధ్య అనేక ఘర్షణలకు కారణమౌ తోంది. భారతదేశంలో దేశ ధాన్యాగారంగా పిలిచే పంజాబ్–హరియాణా ప్రాంతం మరో పదిహేనేళ్లలో నీరులేక ఎండిపోతుంది. 2025 నాటికి వ్యవసాయా నికి లభ్యమయ్యే భూగర్భజలాల పరిమాణం బాగా తగ్గిపోతుందని కేంద్ర భూగర్భ జల మండలి తన 2007 నివేదికలో అంచనా వేసిందని ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్పటికే పంజా బ్లో ప్రతి సంవత్సరం 45 శాతం కన్నా ఎక్కువగా భూగర్భ జలాలను తోడేస్తోంది. జంట ఉపగ్రహాలు ‘గ్రేస్’ పంపిన వివరాల ఆధారంగా అమెరికా అంత రిక్ష సంస్థ నాసా తాజాగా రూపొందించిన నివేదికలో వెల్లడించిన విషయాల నేపథ్యంలో పై అధ్యయనా నికి ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే ఆరు సంవత్సరాల్లో పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లు 109 ఘనపు కిలోలీటర్ల నీటిని వినియోగిస్తాయని నాసా నివేదిక చెబుతోంది. దేశంలోని వాయవ్య ప్రాంతాల్లో 38,061 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వరిసాగు చేస్తున్న కారణంగా ఇక్కడ ఏటా భూగర్భ జలాలు ఓ అడుగు చొప్పున కిందికి పోతున్నాయి. 1990లతో పోల్చితే, ప్రస్తుత దశాబ్దంలో భూగర్భ నీటి మట్టాలు తరిగిపోవడం 70 శాతం ఎక్కువని గంగానదీ పరీ వాహక మైదానప్రాంతాలపై జరిపిన మరో అధ్యయ నంలో నాసా వెల్లడించింది. గత కొన్ని సంవత్సరా లుగా పరిస్థితి వాస్తవానికి క్షీణించింది. రెండేళ్ల అనావృష్టితో ముదిరిన సంక్షోభం! వరుసగా 2014, 2015 సంవత్సరాల్లో అనావృష్టి ఫలి తంగా నీటి సంక్షోభం తీవ్రమైంది. ప్రస్తుతం నెల కొన్న కరువు పరిస్థితులకు (వరదలకు కూడా) 30 శాతం కారణం సరిగా కురవని వర్షాలైతే, 70 శాతం బాధ్యత మనుషులపైనే ఉందని నేనెప్పుడూ చెబు తుంటాను. మానవ తప్పిదాలే నీటి సంక్షోభానికి ప్రధాన కారణాలని నమ్ముతున్నాను. గత కొన్నేళ్లుగా విచ్చలవిడిగా, విచక్షణారహితంగా భూగర్భ జలా లను తోడేస్తూ వాడుకోవడం వల్లే మౌలికంగా మనం ఈ సమస్య ముదిరిపోవడానికి దోహదం చేస్తున్నాం. అయితే, మనం దీని నుంచి ఏవైనా గుణపాఠాలు నేర్చుకున్నామా? సమస్య పరిష్కారానికి అవసర మైన కీలక మార్పులు చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అంటే దానికి లేదనే జవాబు వస్తుంది. ఈ పరిస్థితుల్లో పార్లమెంటులో ఓ ప్రశ్నకు ఇచ్చిన జవాబు నాకు చాలా సంతృప్తినిచ్చింది. పంటల అభివృద్ధి కార్యక్రమాల కింద వివిధ పంటల పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తోందని కిందటి వారం పార్లమెంటుకు ప్రభుత్వం తెలిపింది. ఆయా ప్రాంతాల వ్యవసాయ –వాతావరణ పరిస్థితి, నేల, నీటి వంటి వనరుల లభ్యత, మార్కెట్ శక్తులు, రైతుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై పంటలు సాగుచేసే పద్ధతులు, వాటిలో మార్పులు ఆధారపడి ఉంటాయి. బిందు, తుంపర సేద్య విధానాలు, డ్రిప్ సాగు, రెయిన్‌గన్ సాగు పద్ధతులకు ప్రోత్సాహకాలు ప్రకటించడంతోనే ప్రభు త్వం బాధ్యత తీరిపోదు. సాగు పద్ధతుల్లో మార్పులకు సమగ్ర విధానం నీటి లభ్యత, వినియోగం ఆధారంగా పంటల మార్పు పద్ధతుల్లో మార్పులు తేవడానికి వ్యవ సాయం జోరుగా సాగే ప్రాంతాలపై సమగ్ర విశ్లేషణ అవసరం. అవసరాలకు తగ్గట్టు పంటల మార్పు విధానం అమలు చేయాలని నేనెప్పటి నుంచో కోరుతున్నాను. 2005 జూన్ రెండున ఇంగ్లిష్ దిన పత్రిక డెక్కన్ హెరాల్డ్‌లో ‘పంటల మార్పు పద్ధ తులు’ శీర్షికతో రాసిన వ్యాసంలో, ‘‘మెట్ట ప్రాంతాల్లో నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలు పండించడంలో అర్థం లేదు. అలాంటి పంటలు బీడు భూములను పెంచేస్తాయి. రాజస్తాన్ వంటి నీరు తక్కువగా లభించే ప్రాంతాల్లో నీటిని విపరీతంగా పీల్చుకునే చెరకు సాగు ఏ విధంగానూ న్యాయం కాదు. కిలో మెంథాల్ ఆయిల్‌కు అవసరమైన పుదీనా పంట సాగుకు లక్షా 25 వేల లీటర్ల నీరు అవసర మౌతుంది. బుందేల్‌ఖండ్ వంటి నీరు తక్కువగా దొరికే చోట్ల పుదీనా సాగు మేలు. ఇలాంటి ప్రాంతాల్లో తక్కువ నీరు అవసరమైన పంటల సాగే మేలని చెప్పడానికి పెద్ద ఆలోచన అవసరం లేదు. నీరు తగినంత లభ్యంకాని భూముల్లో మనం వాస్త వానికి సంకర జాతి వరి, హైబ్రిడ్ జొన్న, హైబ్రిడ్ మక్క జొన్న, హైబ్రిడ్ పత్తి, హైబ్రిడ్ కూరగాయలు వంటి సంకర పంటల సాగు చేస్తున్నామంటే ఇది మనం దిగ్భ్రాంతి చెందాల్సిన విషయం. ఎందుకంటే అధిక దిగుబడి ఇచ్చే వంగడాల కంటే ఈ సంకర జాతి పంటలకు ఒకటిన్నర నుంచి రెండు రెట్లు ఎక్కువ నీరు అవసరం. అయినా నీటి వినియోగం ఎక్కువగా ఉండే హైబ్రిడ్ పంటల సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నాం. నీటి సంక్షోభం ముదిరిపోవడానికి కారణ మౌతున్నాం’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాను. అదీగాక, జన్యు మార్పిడి పంటల సాగుకు ప్రభుత్వం ఇప్పుడు విపరీత ప్రాధాన్యం ఇస్తోంది. విచక్షణారహితంగా ప్రోత్సహిస్తోంది. మొదట ఈ తరహా బీటీ పత్తి సాగును ప్రోత్సహించింది (ఇప్ప టికీ చేస్తోంది). సంకర జాతి పత్తి కన్నా బీటీ పత్తి సాగుకు పది నుంచి 12 శాతం ఎక్కువ నీరు అవ సరం. జన్యు మార్పిడి ఆవాలు వాణిజ్య సాగుకు అనుమతి కోసం కేంద్ర పర్యావరణ, అటవీశాఖలోని జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రయిజల్ కమిటీ (జీఈఏసీ) ప్రస్తుతం ఆతృతతో ఎదురు చూస్తోంది. జీఎం ఆవాల పంటకు ఎంత పరిమాణంలో నీరు అవ సరమో నాకు తెలియదు గాని, బీటీ పత్తి సాగు అను భవం ప్రకారం చూస్తే–ఈ కొత్త ఆవాల పంటకు 20 శాతం ఎక్కువ నీరు అవసరమౌతుందని అంచనా వేయవచ్చు. రోజు రోజుకు తరిగి పోతున్న భూగర్భ జలా లను ఇలాంటి ‘నీరు విపరీతంగా తాగే’ పంటల సాగు ద్వారా తోడేస్తూ, వాడుకుంటూ పోతే ఏమవు తుందో మనం ఆలోచించడం లేదు. తరిగిపోతున్న నీటి లభ్యత ఫలితంగా ముదురుతున్న నీటి సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం సూచిస్తున్న మార్పులు, కొత్త సాగు పద్ధతుల అమలుకు కట్టుది ట్టంగా జోక్యం చేసుకోకుండా, తీవ్రమౌతున్న సాగు నీటి సమస్యకు నిందను మార్కెట్ శక్తులపై వేయడం న్యాయం కాదు.గత కొంత కాలంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. త్యాగాలు చేయాలని మనం రైతులను మాత్రమే కోరితే లాభం లేదు. ఈ విష యంలో త్యాగాలు చేయడం ద్వారా ఆదర్శప్రా యంగా నిలవాల్సింది సంపన్నులే. ఫైవ్‌స్టార్ హోటళ్లు సహా అన్ని హోటళ్లలో స్నానాల తొట్టెలను నిషేధించడంతో నీటిని పొదుపు చేసే పని ప్రారం భించాలని నేను భావిస్తున్నాను. దీని ద్వారా నీటిని వృథాగా వాడడాన్ని రైతులేగాక, పట్టణప్రాంతాల జనం కూడా తగ్గించుకుంటారు. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు -
పనుల్లో వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: సాగు నీటి శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఏఐబీపీ, డ్రిప్, భూగర్భజలాలు, ట్రిపుల్ఆర్ పథకాలపై మంత్రి హరీశ్‌రావు జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ట్రిపుల్ఆర్ పనుల నిమిత్తం కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆరా తీశారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు యుటిలైజేషన్ పత్రాలు కేంద్రానికి సమర్పించి రావాల్సిన నిధులు పొందాలని సూచించారు. ఇక డామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (డ్రిప్) కింద వరల్డ్ బ్యాంకు నిధులతో చేపట్టే పథకంలో భాగంగా రాష్ట్రం నుంచి 33 ప్రాజెక్టు డామ్‌ల ఆధునీకరణ, మరమ్మతులకు రూ.665 కోట్ల కోసం ప్రతిపాదనలు పంపామని అధికారులు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు ఎంత పెరిగాయన్న వివరాలను హరీశ్ భూగర్భ జలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద వచ్చే రూ.70 కోట్ల నిధులతో గ్రౌండ్ డేటా సిస్టంను బలోపేతం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. భూగర్భ జలాల సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సేకరించడం, భూగర్భ జలశాఖ కార్యకలాపాలు, ప్రణాళికను మరింత ఆధునీకరించడం వంటి పనులు చేపట్టాల్సి ఉందని ఈ ఏడాది రూ.16 కోట్లతో కొన్ని పనులు చేపడుతున్నట్లు మంత్రికి తెలిపారు. ఈ పనులు త్వరగా పూర్తి చేసి కేంద్రం నుంచి మరిన్ని నిధుల విడుదలకు చర్యలు చేపట్టాలని హరీశ్ సూచించారు. భూగర్భ జలాల సమాచార సేకరణకు 800 కొత్త పీజో మీటర్లు, 900 వాటర్ లెవల్ రికార్డర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ ప్రకాశ్, ఈఎన్సీ మురళీధర్, కాడా కమిషనర్ మల్సూర్, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.