Horticulture Department
-
తీసికట్టుగా ‘సుగంధాల’ సాగు
సాక్షి, హైదరాబాద్: ఎండు మిర్చి, పసుపు సాగులో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం.. ఇతర సుగంధ ద్రవ్యాల సాగులో తీవ్రంగా వెనుకబడిపోయింది. చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మొదలైన నిత్యం వంటింట్లో వినియోగించే 11 రకాల మసాలా దినుసులకు రాష్ట్రంలో కొరత ఏర్పడింది. చివరికి చింతపండును కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొంది. పసుపు, మిర్చి సాగులో మెరుగు రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో పసుపు ఎక్కువగా సాగవుతోంది. 56 వేల ఎకరాల్లో 1.74 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అవుతోందని ఉద్యానవన శాఖ లెక్కలను బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలో రోజువారీగా పసుపు వినియోగం 56.25 మెట్రిక్ టన్నులు. ఏటా రాష్ట్ర అవసరాలకు 23 వేల మెట్రిక్ టన్నులు సరిపోతుంది. మిగతాది ఎగుమతి అవుతోంది. అలాగే రాష్ట్రంలో సుమారు 2.78 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. ఏటా 5.73 మెట్రిక్ టన్నుల ఎండు మిరప ఉత్పత్తి అవుతోంది. మిరప ఉత్పత్తిలో ఏపీ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో రోజువారీగా కారం వినియోగం 93 మెట్రిక్ టన్నులు. ఏటా రాష్ట్ర అవసరాలకు వాడేది 39 వేల మెట్రిక్ టన్నులు కాగా, మిగతా 5.34 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి చేస్తున్నారు. చింతపండు, అల్లం, వెల్లుల్లి కూడా దిగుమతే! లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, జీలకర్ర వంటి విలువైన సుగంధ ద్రవ్యాలను ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి. కానీ చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధనియాల వంటివాటిని కూడా ప్రస్తుతం దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఏటా 61,564 మెట్రిక్ టన్నుల చింతపండును దిగుమతి చేసుకొంటున్నారు. రాష్ట్రంలో అల్లం 2,103 ఎకరాల్లో 20,489 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుండగా, వినియోగం మాత్రం 68,419 మెట్రిక్ టన్నులు ఉంటున్నది. 47,930 మెట్రిక్ టన్నుల మేర ఇతర రాష్ట్రాల నుంచి వస్తోంది. వెల్లుల్లి 27 ఎకరాల్లో మాత్రమే సాగవుతోంది. 148 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తోంది. కానీ, వినియోగం మాత్రం 39,417 మెట్రిక్ టన్నుల మేర ఉంటోంది. అలాగే ధనియాలు కూడా రాష్ట్రంలో 13,532 మెట్రిక్ టన్నుల వినియోగం ఉండగా, పండుతున్న పంట 4,971 ఎకరాల్లో 2,431 మెట్రిక్ టన్నులే. లక్ష ఎకరాల్లో సుగంధ ద్రవ్యాల సాగు అవశ్యం రాష్ట్రంలో ప్రతిరోజు సగటున ఒక్కొక్కరు 21.21 గ్రాముల సుగంధ ద్రవ్యాలను వినియోగిస్తారు. ఇలా రోజుకు 731 మె ట్రిక్ టన్నుల డిమాండ్ ఉండగా, ఏటా 2.63 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధని యాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు వంటి 11 సుగంధ ద్రవ్యాలు 1.78 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నది. ఈ డిమాండ్‌కు సరిపడా పంట రావాలంటే రాష్ట్రంలో ఇంకా 1.09 లక్షల ఎకరాల్లో ఈ పంటలు సాగుచే యాల్సి ఉంటుందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. -
చెట్టంత చేయూత
సాక్షి, అమలాపురం: వయసు మళ్లిన కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఉద్యాన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ) పాత చెట్లను తొలగించి కొత్త చెట్లు పాతుకునేందుకు ఆర్ అండ్ ఆర్ (రీ ప్లాంటింగ్ అండ్ రెజువెనేషన్) పథకంలో భాగంగా హెక్టారుకు రూ.53,500 చొప్పున అందించనుంది. ఈ సొమ్ముతో తోటల్లో దిగుబడి తక్కువగా వస్తున్న.. తెగుళ్లు అధికంగా సోకి దెబ్బతిన్న కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి పాతుకునే వీలుంటుంది. కోనసీమలో 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఇప్పుడున్న తోటల్లో మూడో వంతు తోటల వయసు 60 ఏళ్లకు పైబడింది. దేశవాళీ కొబ్బరి చెట్ల వయసు 60నుంచి వందేళ్లు ఉంటోంది. కానీ.. 60 ఏళ్లు దాటిన తరువాత వీటిలో దిగుబడి 40 శాతానికి పడిపోతోంది. అలాగే కొబ్బరి తోటలు సహజ సిద్ధమైన శక్తిని కోల్పోయి తెగుళ్లు, పురుగుల్ని తట్టుకోలేకపోతున్నాయి. వీటి స్థానంలో కొత్తవి వేసుకోవాల్సి ఉంది. అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలు, హైబ్రీడ్, పొట్టి రకాల చెట్లు వేసేందుకు ఇదే మంచి సమయం. దీనివల్ల దిగుబడి, కొబ్బరి కాయ సైజు పెరిగి ఉత్తరాది మార్కెట్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రోత్సాహం ఇలా.. కొత్త చెట్లను పాతుకునే విషయంలో కోనసీమ రైతులు పూర్తిగా వెనుకబడ్డారు. పాత చెట్లను యథాతథంగా ఉంచి.. పక్కనే కొత్త చెట్లు పాతుతుంటారు. ఇలా చేయడం వల్ల కొబ్బరి తోటలో చెట్ల సంఖ్య పెరిగి అంతర పంటలు వేసుకునే అవకాశం ఉండటం లేదు. మరోవైపు దిగుబడి సైతం తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్ని గుర్తించిన కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, ఆర్ అండ్ ఆర్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద హెక్టారుకు 32 చెట్లను తొలగించి కొత్త చెట్లు పాతుకోవాల్సి ఉంటుంది. చెట్టు తొలగింపు, ఆ ప్రాంతంలో మందులు వేసి భూమిని బాగు చేయడంతోపాటు కొత్త చెట్టు పాతుకోవాల్సి ఉంటుంది. హెక్టారుకు 32 చెట్లు తొలగింపునకు చెట్టుకు రూ.వెయ్యి చొప్పున రూ.32 వేలు, ఎరువులు, ఇతర వాటికి రూ.17,500 వినియోగిస్తారు. రూ.4 వేలను మొక్కలు నాటుకునేందుకు ఇస్తారు. చెట్టు పాతిన తరువాత రెండేళ్ల పాటు ఎరువులకు సైతం ఈ నిధులనే వినియోగించాల్సి ఉంటుంది. దిగుబడే కాదు.. కాయ సైజు తగ్గింది గతంలో ఎకరాకు సగటు దిగుబడి ప్రతి దింపులో 1,200 కాయలు వచ్చేవి. ఇప్పుడు 800 మించడం లేదు. ఏడాదికి ఆరు దింపులకు గాను సగటు 4,800 కాయలకు రూ.40,800 వరకూ వస్తుంటే.. దింపు కూలీకే రూ.9,600 వరకూ ఖర్చవుతోంది. తోటలకు పెట్టుబడులు సైతం పెరిగిపోయాయి. మరోవైపు పెద్ద వయసు చెట్లను తెగుళ్లు, పురుగులు ఆశించి నిలువునా గాయం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల కొబ్బరి దిగుబడితోపాటు కాయ సైజు గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో రైతులకు కనీస ఆదాయం కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే.. రైతులు కొత్త చెట్లను నాటాల్సిన అవసరం ఏర్పడింది. -
నారికేళం ‘ధర’హాసం
సాక్షి అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధర పతనమై రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నాఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేయించింది. దీంతో కొబ్బరి ధరలు అమాంతంగా పెరిగాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తరువాత పచ్చి కొబ్బరి వెయ్యి కాయలకు రూ.రెండు వేల వరకు ధర పెరగ్గా.. ఎండు కొబ్బరి క్వింటాల్‌కు రూ.500 చొప్పున పెరగడం విశేషం. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. ఉభయ గోదావరి జిల్లాలలోనే అత్యధికంగా 1.78 లక్షల ఎకరాల్లో ఉంది. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం సగటున 106.9 కోట్ల కాయల దిగుబడిగా వస్తోంది. ఇందులో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.03 లక్షల ఎకరాలు, కాకినాడ జిల్లాలో 20 వేల ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 18,754 ఎకరాల్లో సాగు కొబ్బరి సాగవుతోంది. నాఫెడ్ కేంద్రాలు.. వరుస పండుగలతో.. రాష్ట్రంలో కొబ్బరి మార్కెట్ ధరలు అంబాజీపేట మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. కొబ్బరి ధరలు పతనం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కోనసీమ జిల్లాలో నాఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేయించింది. ప్రస్తుతానికి అంబాజీపేట మార్కెట్ యార్డు కేంద్రంగా కార్యకలాపాలకు అధికారులు సిద్ధమయ్యారు. తొలిసారి ఆర్బీకేల ద్వారా కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మిల్లింగ్ కోప్రా (ఎండు కొబ్బరి)ను క్వింటాల్‌ను రూ.10,860, బాల్ కోప్రా (కురిడీ కొబ్బరి గుడ్డు) క్వింటాల్ రూ.11,750 చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో కొబ్బరి మార్కెట్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఈ పరిస్థితుల్లో స్థానిక వ్యాపారులు దిగి వచ్చి ధరలు పెంచారు. మరోవైపు దసరా, దీపావళి, కార్తీక మాసం రావడంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు జోరందుకున్నాయి. దీంతో పచ్చికాయ, ముక్కుడు కాయల ధరలు పెరిగాయి. ప్రస్తుత మార్కెట్లో వెయ్యి కాయల ధర రూ.8 వేల నుంచి రూ.8,500 వరకు ఉంది. గడచిన 10 రోజులలో ధర రూ.2 వేల వరకు పెరగడం విశేషం. -
ఆయిల్‌పామ్ @ 2.30 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించింది. ఉద్యాన శాఖ సాగు ప్రణాళికకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం వేగంగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో 38 నర్సరీలు ఏర్పాటు చేసిన కంపెనీలు అవసరమైన మొక్కల్ని పెంచుతున్నాయి. ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి గల రైతులు ఆయా జిల్లాల ఉద్యానశాఖ అధికారులు, గ్రామాల్లోని ఏఈఓలను సంప్రదించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ♦ ఆయిల్‌ఫెడ్‌కు ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో సాగు లక్ష్యాన్ని నిర్దేశించించింది. ఈ సంస్థ 8 జిల్లాల పరిధిలో 76,900 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలి. తర్వాత ప్రీ యూనిక్ కంపెనీ 7 జిల్లాల్లో 34,800 ఎకరాలు, లోహియా కంపెనీ 27,100 ఎకరాలు, రుచిసోయా 24,300 ఎకరాలు, తిరుమల ఆయిల్ కంపెనీ 14,900 ఎకరాల్లో రైతులను సాగుకు ప్రోత్సహించేలా అనుమతి ఇచ్చింది. ♦ జిల్లాల వారీగా సాగు టార్గెట్ చూస్తే...కరీంనగర్ జిల్లాలో 18 వేల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 17,800 ఎకరాలు, కొత్తగూడెంలో 16,800 ఎకరాలు, పెద్దపల్లిలో 14,900 ఎకరాలు, భూపాలపల్లిలో 12,800 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ♦ గతేడాదివరకు రాష్ట్రంలో 27 జిల్లాలకే ఆయిల్‌పామ్ సాగు పరిమితమైంది. ఈ ఏడాది కొత్తగా రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఈ జాబితాలో చేరాయి. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలను మినహాయిస్తే మొత్తం 31 జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగుకానుంది. ♦ రంగారెడ్డి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ కంపెనీ ముందుకురాగా, ఈ ఏడాది 5,500 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించారు. వికారాబాద్ జిల్లాలో హెల్తీ హార్ట్స్ కంపెనీకి 3 వేల ఎకరాలు, మెదక్ జిల్లాలో లివింగ్ కంపెనీకి 5 వేల ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో గోద్రెజ్ కంపెనీకి 5 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టేలా అనుమతి ఇచ్చింది. ♦ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆయిల్‌పామ్ సాగు కేవలం 36 వేల ఎకరాలు మాత్రమే. ప్రస్తుతానికి ఈ సాగు 1.54 లక్షల ఎకరాలకు పెరిగింది. సాగు గణాంకాల్లో దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ రెండోస్థానంలో ఉంది. -
వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలని పేర్కొన్నారు. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సన్నద్ధతతో పాటు వ్యవసాయ అనుబంధశాఖల్లో చేపడుతున్న కార్యక్రమాల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఈ–క్రాపింగ్‌లో జియో ఫెన్సింగ్ ఫీచర్ కూడా కొత్తగా ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు. ఖరీఫ్ పంటల ఈ– క్రాపింగ్ మొదలైందని, ఈసారి ముందస్తుగానే మొదలుపెట్టామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు డేటాను అప్లోడ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇప్పటికే పురుగుమందుల వినియోగం లాంటి కార్యక్రమాలు డ్రోన్ల ద్వారా చేస్తున్నామని తెలిపారు. ఇదే కాకుండా డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు చేయించే పరిస్థితిని తీసుకురావాలని తెలిపారు. తద్వారా ఆర్బీకే స్థాయిలో భూసార పరీక్షలు చేసే స్థాయికి ఎదగాలని చెప్పారు. భూసార పరీక్షలను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా తెలుసుకునే పరిస్థితి వస్తే.. ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. డ్రోన్ల ద్వారా వ్యవసాయానికి, రైతులకు మరింత మేలు డ్రోన్ల ద్వారా డేటా కూడా కచ్చితత్వంతో ఉండేందుకు అవకాశం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. దీంతోపాటు పంట దిగుబడులపై అంచనాలకు కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వరి దిగుబడులపై డ్రోన్ల ద్వారా అంచనాలు పొందేలా డ్రోన్ టెక్నాలజీని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పగా.. మిగతా పంటల విషయంలో కూడా ఈ తరహా ప్రయోజనాలు డ్రోన్ టెక్నాలజీ ద్వారా వచ్చే పరిస్థితి ఉండాలని సీఎం పేర్కొన్నారు. బహుళ ప్రయోజనకారిగా డ్రోన్లను వినియోగించుకోవడంవల్ల వ్యవసాయ రంగానికి, రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన అగ్రిల్యాబ్‌లు ద్వారా 2.2 లక్షల శాంపిళ్లను సేకరించి రైతులకు ఫలితాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టిపెట్టామని చెప్పారు. అయితే కౌలు రైతులకుకి రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకూ రూ. 7802.5 కోట్లు 54.48 లక్షల మందికి పరిహారంగా అందించామని అధికారులు తెలిపారు. రబీ సీజన్‌కు సంబంధించి పంట బీమా పరిహారాన్ని అక్టోబరులో ఇచ్చేందుకు అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నామన్నారు అధికారులు. ►10వేల ఆర్బీకేల్లో 10వేల డ్రోన్లు తీసుకు వచ్చి వాటితో వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావాలి: సీఎం ►ముందస్తుగా 2వేల డ్రోన్లు తీసుకు వస్తున్నామన్న అధికారులు. ►డ్రోన్ టెక్నాలజీలో 222 రైతులకు శిక్షణ ఇచ్చి.. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్న అధికారులు. ►డ్రోన్ల విషయలో భద్రత, సమర్థవంతమైన నిర్వహణ, సర్వీసు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామన్న అధికారులు. ►డ్రోన్ ఖరీదైనది కాబట్టి భద్రత, రక్షణ విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►డీజీసీఏ సర్టిఫికేషన్‌ను పాటిస్తున్నామన్న అధికారులు. ►అన్నిరకాల భధ్రతా ప్రమాణాలు పాటించేలా, ఎదురుగా వచ్చే వస్తువును ఢీకొట్టకుండా నిలువరించే వ్యవస్థ ఉండేలా, నిర్దేశించిన మార్గంలోనే ఎగరవేసేలా, ఒకవేళ ఇంధన సమస్య వస్తే వెంటనే ఆటో పద్ధతిలో ల్యాంచింగ్ ఫ్యాడ్‌కు చేరుకునేలా ఈ డ్రోన్లు ఉంటాయన్న అధికారులు. ► సాగులో శిక్షణ కార్యక్రమాలపై మరిన్ని వీడియోలు రూపొందించి ఆర్బీకే ఛానెల్ ద్వారా మరింతగా రైతులకు చేరువ చేయాలన్న సీఎం. ►రైతుల పంటలకు ఎంఎస్పీ ధీమా, సీఎం ఆదేశాలతో చట్టానికి రూపకల్పన. ► ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు రైతుల దగ్గరనుంచి కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా ఎంఎస్పీ ధరలు ఇవ్వాల్సిందే. ► సీఎం ఆదేశాలమేరకు దీనికి సంబంధించి ఏపీ ఎంఎస్పీ యాక్ట్– 2023ని తీసుకురానున్న ప్రభుత్వం. ► ఆక్వా రైతులకు, డెయిరీ రైతులకు ఈ చట్టం ద్వారా వారి ఉత్పత్తులకు రక్షణ కల్పించే అవకాశం. ► దీనికి సంబంధించి చట్ట రూపకల్పన జరుగుతోందని తెలిపిన అధికారులు. ►గడచిన నాలుగేళ్లలో వ్యవసాయ పంటల నుంచి 4.34 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలవైపు మళ్లింపు. ► రెగ్యులర్ మార్కెట్‌కే కాకుండా ఫుడ్‌ప్రాసెసింగ్‌కు అనుకూలమైన వంగడాలను ఉద్యానవన పంటల్లో ప్రోత్సహించాలని అధికారులకు సీఎం ఆదేశం. ► గోడౌన్లు, కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్స్ నిర్మాణాన్ని పూర్తి చేయడం పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం. ► దీనివల్ల పంట ఉత్పత్తుల జీవితకాలం పెరుగుతుందని, రైతులకు మంచి ధరలు వస్తాయన్న అధికారులు. ► ముఖ్యంగా ఉద్యానవన పంటలకు ఈ మౌలిక సదుపాయాలు చాలా అవసరమని తెలిపిన అధికారులు. ► ఫుడ్‌ప్రాసెసింగ్ విషయంలో మరింత ముందుకు వెళ్లాలి: సీఎం ► వివిధ జిల్లాల్లో పండుతున్న పంటల ఆధారంగా ఇప్పటికే ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు మొదలుపెట్టాం. ► త్వరలో కొన్ని యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ► నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ చేయాలి. ►ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు గురయ్యే టమోటా, ఉల్లిలాంటి పంటల ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ► ఈ పంటల సాగు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి ► అంతేకాకుండా మహిళలతో నడిచే సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకొచ్చే ప్రయత్నంచేయాలి. ► మహిళల్లో స్వయం ఉపాధికి ఇది ఉపయోగపడుతుంది. ► ఆరువేల మైక్రో యూనిట్లు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ► చేయూత లాంటి పథకాన్ని వినియోగించుకుని.. ఈ యూనిట్ల ద్వారా మహిళలు స్వయం ఉపాధికి ఊతమివ్వాలని అధికారులకు సీఎం ఆదేశం. ►పంటల సాగులో, బీమా కల్పనలో, ధాన్యం కొనుగోలులో రైతుభరోసా కేంద్రాలు ఇప్పటికే రైతులను చేయిపట్టుకుని నడిపిస్తున్నాయి. ►ధాన్యం సేకరణలో ఆర్బీకేల ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేశాం. ►కనీస గిట్టుబాటు ధరలు రాని ఏ పంట కొనుగోళ్లులో అయినా ఆర్బీకే జోక్యం చేసుకుంటుంది. ►మిగిలిన పంటల కొనుగోలు కూడా ఆర్బీకే కేంద్రంగా జరిగేలా చూడాలి. ►ఏ రకమైన కొనుగోళ్లుకు అయినా ఆర్బీకే కేంద్రం కావాలి. ►విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వేటిలోనూ నకిలీలు, కల్తీ లేకుండా నివారించడంలో ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ►ఇప్పుడు మార్కెటింగ్‌లో కూడా ఆర్బీకేలు ప్రమేయం ఉండాలి. ►ప్రభుత్వం వ్యవసాయ ఉపకరణాలు, డ్రయ్యింగ్ ప్లాట్‌ఫాంలతో పాటు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తుంది. ►ఇతర పంటలకు కూడా మార్కెట్‌తో సమన్వయం చేసి.. మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించాలి. ►ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. -
యంత్ర వ్యవ‘సాయం’
ఖరీఫ్ నాటికి నూరు శాతం ఆర్బీకేల్లో యంత్ర సేవా కేంద్రాలు అందుబాటులో ఉండాలి. ఆర్బీకేలకు అనుబంధంగా కిసాన్ డ్రోన్స్‌ను సత్వరమే ఏర్పాటు చేయాలి. జూలైలో కనీసం 500 కిసాన్ డ్రోన్స్, డిసెంబర్ కల్లా మరో 1,500 డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. రైతులకు వ్యక్తిగతంగా టార్పాలిన్లు, స్ప్రేయర్ల పంపిణీకి సాధ్యమైనంత త్వరగా శ్రీకారం చుట్టాలి. జూలైలో టార్పాలిన్లు, జూలై–డిసెంబర్ మధ్య మూడు విడతల్లో స్ప్రేయర్లు పంపిణీ చేయాలి. – వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ‘వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. గ్రామ స్థాయిలో ప్రతి రైతుకు ఆధునిక యంత్రాలను అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే మెజార్టీ ఆర్బీకేల్లో రైతు గ్రూపులకు యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశాం. సాధ్యమైనంత త్వరగా మిగిలిన ఆర్బీకేల్లో ఏర్పాటు చేయాలి. అవసరమైన మేరకు టార్పాలిన్లు, స్ప్రేయర్లు వంటి వ్యక్తిగత పరికరాలను రైతులకు పంపిణీ చేయాలి. అలా చేస్తే వ్యవసాయ యాంత్రీకరణ మరింత పెరిగి.. రైతులు మరింతగా లబ్ధి పొందేందుకు దోహద పడుతుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అధికారులు రూపొందించిన వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్‌కు బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖలపై జరిగిన సమీక్షలో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుత రబీ సీజన్‌తో పాటు రానున్న ఖరీఫ్ సీజన్లో అనుసరించాల్సిన కార్యాచరణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇంకా మిగిలిన 4,225 ఆర్బీకేల్లో సీహెచ్‌సీలకు ఏప్రిల్‌లో యంత్రాల పంపిణీ పూర్తి చేయాలని చెప్పారు. రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్నారు. రైస్ మిల్లర్ల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఇటీవలి అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న పంటలకు సంబంధించి ఎన్యుమరేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించాలని, ఈ విషయంలో మరింత శ్రద్ధ పెట్టడంతో పాటు నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఆర్బీకేల్లో కియోస్క్‌లు నూరు శాతం పని చేసేలా చూడటంతో పాటు, వాటి సేవలు పూర్తి స్థాయిలో రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కియోస్క్‌ల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్నారు. ఆర్బీకేల ద్వారా 10.5 లక్షల టన్నుల ఎరువులు 2023–24 సీజన్లో 10.5 లక్షల టన్నుల ఎరువుల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఎరువులతో పాటు రైతులకు అవసరమైన స్థాయిలో పురుగుల మందులను ఏపీ ఆగ్రోస్ ద్వారా పంపిణీకి చర్యలు చేపట్టామని చెప్పారు. రబీ సీజన్లో 100 శాతం ఈ క్రాపింగ్ పూర్తయిందని, దీని ఆధారంగానే రబీ ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎగుమతికి ఆస్కారం ఉన్న వరి రకాలను ప్రోత్సహిస్తున్నామని, 2022 ఖరీఫ్‌లో 2.74 లక్షల హెక్టార్లలో ఎగుమతి చేయదగ్గ వరి రకాలను సాగు చేసేలా ప్రోత్సహించామని చెప్పారు. తద్వారా దాదాపు 6.29 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చిందని తెలిపారు. ప్రస్తుత రబీ.. 2022–23 సీజన్లో 1.06 లక్షల హెక్టార్లలో ఎగుమతి వెరైటీలను రైతులు సాగు చేశారని, 3.79 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నామని వివరించారు. ఇంకా ఏం చెప్పారంటే.. ► పొలంబడి శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నాం. వీటి వల్ల్ల వరి, వేరుశనగలో 15 శాతం, పత్తిలో 12 శాతం, మొక్కజొన్నలో 5 శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. పత్తిలో 16 శాతం, మొక్కజొన్నలో 15 శాతం, వేరుశనగలో 12 శాతం, వరిలో 9 శాతం దిగుబడులు పెరిగినట్టుగా క్షేత్ర స్థాయి పరిశీలనలో గుర్తించాం. ► పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల దిశగా అడుగులు వేయడానికి ఇది తొలిమెట్టు కానుంది. 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో)లకు జీఏపీ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికేషన్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ► రాష్ట్రంలో మిల్లెట్స్ సాగును ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించాం. 19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున మిల్లెట్ క్లస్టర్లు ఏర్పాటు చేశాం. వీటితో పాటు మూడు ఆర్గానిక్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేశాం. అకాల వర్షాల వల్ల పంట నష్టంపై అంచనా వేసేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో నివేదికలు ఖరారు చేసి, రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదల చేస్తాం. ► ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ, ఉద్యాన శాఖల సలహాదారులు తిరుపాల్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, ఏపీ ఆగ్రోస్ చైర్మన్ బి.నవీన్ నిశ్చల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకష్ణ ద్వివేది, వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు చేవూరు హరికిరణ్, ఎస్.ఎస్. శ్రీధర్, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్‌పాండే, ఏపీ సీడ్స్, ఆగ్రోస్ ఎండీలు డాక్టర్ శేఖర్ బాబు, ఎస్.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ తరహాలో ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్: సీఎం ► ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి దశల వారీగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి. ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ► జూన్‌లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి పరీక్షా ఫలితాలు వచ్చేలా చూడాలి. వాటి ఆధారంగానే రైతులకు సాగులో పాటించాల్సిన పద్ధతులపై పూర్తి వివరాలు, అవగాహన కల్పించాలి. భూ పరీక్ష కోసం నమూనాల సేకరణ, పరీక్షలు, ఫలితాలు, వాటి ఆధారంగా సాగు పద్ధతులు, రైతులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై ఒక సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించుకోవాలి. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగానే శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు పంటలకు అవసరమైన స్థాయిలో ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలి. అప్పుడే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్.. ఆర్బీకే సేవలు మరో దశకు వెళ్తాయి. ► ఉద్యాన వన పంటల సాగు విస్తీర్ణం ఏటా పెరగడం వల్ల దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్త తరహా ఉత్పత్తులు వస్తున్నాయి. అందుకు తగినట్టుగా మార్కెటింగ్ ఉండాలి. రైతులు తాము పండించిన పంటలను విక్రయించుకోవడానికి ఏ దశలోనూ ఇబ్బంది పడకూడదు. ఆ విధంగా మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యాన పంటలు పండించే రైతులను మార్కెటింగ్‌కు అనుసంధానం చేయాలి. అప్పుడే వారికి మంచి ఆదాయం వస్తుంది. -
పేపర్ల లీకేజీ బాగోతం.. మరో పరీక్ష వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ బాగోతం ఇప్పట్లో సద్దు మణిగేలా కనిపించడం లేదు. విద్యార్థుల భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకుని, సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేశారు. తాజాగా మరో పరీక్షను సైతం వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 17కు వాయిదా వేసింది రాష్ట్ర ఉద్యోగ నియామక కమిషన్. కాగా, ప్రశ్నపత్రాల లీకేజీతో గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన కమిషన్.. వరుసగా ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 12వ తేదీన జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షను వాయిదా వేయగా... మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేసింది. నిందితులకు కస్టడీ, రిమాండ్ ఇదిలాఉండగా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ముగ్గురు నిందితులకు ఐదురోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. షమీమ్, సురేష్, రమేష్ లను నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. మరోవైపు ఇదే కేసులో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్య నాయక్, రాజేశ్వర్ మూడు రోజుల కష్టడీ విచారణ మంగళవారంతో ముగిసింది. నలుగురు నిందితులకు కింగ్ కోఠి లోని ప్రభుత్వ ఆస్పత్రి లో వైద్యపరీక్షలు పూర్తి చేశారు. అనంతరం నాంపల్లి న్యాయమూర్తి ముందు పోలీసులు వారిని హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు వారికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. నలుగురు నిందితులను సిట్ అధికారులు చంచల్ గూడ సెంట్రల్ జైల్ తరలించారు. (చదవండి: భార్యకు తెలియకుండానే మరో ఇద్దరికి పేపర్ లీక్ ) -
బత్తాయి..భలే భలే..
సాక్షి, అమరావతి: మోసంబిగా పిలిచే బత్తాయి పండ్లకు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంది. ఏపీలో సాగవుతున్న బత్తాయిల్లో సగానికి పైగా ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మార్కెట్లకు సైతం ఏపీ నుంచే వెళ్తున్నాయి. కొంతకాలంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి నేపాల్‌కు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు ఇకనుంచి సింగపూర్, మలేషియా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ తదితర దేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బత్తాయి పండ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ ఏడాది పెద్దఎత్తున ఎగుమతి చేసేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జ్యూస్ ఎక్కువగా వచ్చే సాతుగుడి రకం బత్తాయిలను బెంగుళూర్, చెన్నై, ఢిల్లీ నుంచి విదేశాలకు పంపించనున్నారు. ఏపీలోనే సాగు అధికం బత్తాయి సాగు, దిగుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ పండే బత్తాయి పండ్లకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. సాగు విస్తీర్ణంలో సగానికి పైగా రాయలసీమ జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రంలో సాతుగుడి, చీని రకాల బత్తాయి సాగవుతుండగా.. రైతులు ఏటా రెండు పంటలు తీస్తున్నారు. 2018–19లో రాష్ట్రవ్యాప్తంగా 2.14 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా సాగు విస్తీర్ణం 2.85 లక్షల ఎకరాలకు విస్తరించింది. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు తోట బడుల పేరిట శిక్షణ ఇస్తుండటంతో దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో పండే పంటలో 85 శాతం ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. 15 శాతం మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు వెళుతోంది. మొదలైన ఎగుమతులు రాష్ట్రంలో సాగయ్యే బత్తాయిల్లో సగానికి పైగా ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతోంది. ప్రస్తుతం బత్తాయి కోతలు ప్రారంభం కాగా.. కళ్లాల నుంచే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఢిల్లీ మార్కెట్ నుంచి ఆర్డర్లు కూడా మొదలయ్యాయని అనంతపురానికి చెందిన వ్యాపారి శ్రీనివాసరావు తెలిపారు. ఈసారి విదేశాలకు సైతం బత్తాయిల ఎగుమతికి వ్యాపారులు పూనుకోవడంతో ధర కూడా మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ధర బాగుంది ఈసారి బత్తాయి పంట బాగుంది. రికార్డు స్థాయిలోనే దిగుబడి నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో టన్ను రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్య పలుకుతోంది. గతంలో ఎప్పుడూ ఈ సమయంలో ఇంత రేటు పలికిన సందర్భాలు లేవు. ఈసారి టన్ను రూ.లక్ష మార్క్‌ను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్, ఉద్యాన శాఖ -
రాష్ట్రమంతా ఈ–మిర్చ్
సాక్షి, అమరావతి/గుంటూరురూరల్: మిరపలో నాణ్యత, దిగుబడుల పెంపే లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘ఈ–మిర్చ్’ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రమంతా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని డిజిటల్ గ్రీన్ వ్యవస్థాపకుడు రికీన్ గాంధీ(యూఎస్ఏ), బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కంట్రీ హెడ్ శ్రీవల్లీకృష్ణన్లు తెలిపారు. 2021లో చేపట్టిన ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వ సహకారంతో విజయవంతమైందన్నారు. తామందించిన సాంకేతిక పరిజ్ఞానం రైతు భరోసా కేంద్రాల వల్ల గ్రామ స్థాయిలో రైతులకు వేగంగా చేరిందని, ఆర్బీకే వ్యవస్థ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ముందడుగని అభివర్ణించారు. ఆర్బీకేల ద్వారా వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టును రాష్ట్రమంతా విస్తరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మిరపతో పాటు ఇతర పంటలకు కూడా అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తామని చెప్పారు. మిరప రైతుల కోసం డిజిటల్ ఆవిష్కరణలపై గుంటూరులో బుధవారం నిర్వహించిన ఒక రోజు జాతీయ వర్క్‌షాప్‌లో వారు మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని మిర్చి రైతులకు డిజిటల్ మార్గాల ద్వారా సలహాలు అందించామన్నారు. రసాయన పురుగు మందుల వినియోగాన్ని నియంత్రించుకుంటూ.. విత్తు నుంచి మార్కెటింగ్ వరకు అనుసరించాల్సిన ఉత్తమ యాజమాన్య పద్ధతులపై 4–6 నిమిషాల నిడివితో రూపొందించిన వీడియో సందేశాలను ఆర్బీకే స్థాయిలో పికో ప్రొజెక్టర్ల ద్వారా రైతులకు చేరువచేశామని వివరించారు. ఉద్యాన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్ ఉత్పత్తి, ఉత్పాదకతలతో పాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు డిజిటల్ గ్రీన్, బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. -
ఆయిల్‌పామ్ సాగులో ఏపీ నంబర్–1
సాక్షి, అమరావతి: ఆయిల్‌పామ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే లీడర్ ఆఫ్ ది స్టేట్‌గా నిలిచిందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హెచ్‌పీ సింగ్ పేర్కొన్నారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో మూడు రోజులపాటు జరగనున్న 3వ జాతీయ ఆయిల్‌పామ్ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఆయిల్‌పామ్ రంగంలో అత్యుత్తమ పురోగతి సాధిస్తున్న రాష్ట్రంగా ఎంపికైన ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్ర ఉద్యాన కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్ ఇన్ ఇండియా’ అవార్డును అందుకున్నారు. సదస్సులో హెచ్‌పీ సింగ్ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో 4 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగవుతుంటే.. 1.90 లక్షల హెక్టార్లు ఏపీలోనే ఉందన్నారు. ఏపీని స్ఫూర్తిగా తీసుకుని ఇతర రాష్ట్రాలు ఆయిల్‌పామ్ తోటల విస్తరణకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 29 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ను విస్తరించేందుకు అనువైన ప్రాంతం ఉందన్నారు. విస్తరణ కోసం పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాలు సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయిల్‌పామ్ సాగులో భారత్ పురోగతి సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మలేషియా ఆయిల్‌పామ్ బోర్డు డైరెక్టర్ జనరల్ అహ్మద్ పర్వేజ్ ఖాదీర్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగులో భారతదేశం మంచి పురోగతి సాధిస్తోందన్నారు. మలేషియాలో వర్షాధారంగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని, అందువల్ల పెట్టుబడి చాలా తక్కువ అవుతోందని చెప్పారు. ఇక్కడి రైతులు ఉత్తమ యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తూ సాంకేతికంగా దిగుబడులను పెంచుకునే మార్గాలను అన్వేషించాలన్నారు. అధిక దిగుబడులను ఇచ్చే కొత్త వంగడాలతోపాటు యాంత్రీకరణపై దృష్టి సారించాలన్నారు. ఏపీ ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్‌పామ్ సాగు విస్తరణలో మంచి పురోగతిని సాధిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 12 పారిశ్రామిక జోన్లలో గంటకు 460 టన్నుల ఆయిల్‌పామ్‌ను ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ నీరజా ప్రభాకర్, సొసైటీ చైర్మన్ పి.రత్నం, కేంద్ర వ్యవసాయ సమాచార కేంద్రం చైర్మన్ మోని మాధవ స్వామి, వెజిటబుల్ ఆయిల్స్ ఏషియా ప్రోగ్రామ్ హెడ్ సురేష్ మోత్వాని, వైస్ ప్రెసిడెంట్ ఆర్కే మాథూర్ మోత్వాని, ఆదర్శ ఆయిల్‌పామ్ రైతు టీటీ కృష్ణమూర్తి, ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్లు కె.బాలాజీ నాయక్, ఎం.వెంకటేశ్వర్లు ప్రసంగించారు. -
తెలంగాణ కంటే మిన్నగా..
సాక్షి, అమరావతి: ఆయిల్ పామ్‌కు ప్రకటించిన ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో) ప్రకారం నెలవారీ ధరలను నిర్ణయిస్తూ ఉద్యాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2021–22 సీజన్లో రైతుల నుంచి సేకరించే ఆయిల్ పామ్ గెలలకు 19.22 శాతం ఓఈఆర్తో పాటు కెర్నిల్ నట్స్‌కు 10.25 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓఈఆర్కు అనుగుణంగా ప్రకటించిన నెలవారీ ధరల ప్రకారం రైతులకు చెల్లిస్తారు. తాజా ధరలతో తెలంగాణ రైతులకంటే రాష్ట్ర రైతులకు ఎక్కువగా లబ్ధి చేకూరనుంది. ఉదాహరణకు ఈ సీజన్లో తెలంగాణ రైతులకు మార్చి నెలలో టన్నుకు గరిష్టంగా రూ.19,499 ధర లభిస్తే.. అదే నెలలో ఏపీ రైతులకు రూ.22,461 చొప్పున ధర లభించింది. ఈ లెక్కన తెలంగాణతో పోలిస్తే ఏపీ రైతులు టన్నుకు రూ. 2,962 వరకు అదనంగా లబ్ధి పొందుతున్నారు. ఈ సీజన్లో ఏపీలో గరిష్టంగా మే నెలలో టన్నుకు రూ.23,365 రైతులకు లభిస్తుంది. అదే తెలంగాణలో రూ.22,841 (ఏప్రిల్ నెలలో) మాత్రమే. -
మామిడి రైతుకు ‘యుద్ధం’ గుబులు..
సాక్షి, అమరావతి: వచ్చే నెల నుంచి మామిడి మార్కెట్లోకి రాబోతుంది. గడిచిన రెండేళ్లు మామిడి మార్కెట్‌ను కరోనా తీవ్రంగా దెబ్బతీసింది. దేశీయ మార్కెట్లకు తరలించే విషయంలో ప్రభుత్వ ప్రోత్సాహం మామిడి రైతుకు కొంతమేర ఉపశమనం కలిగించింది. ఈసారి కరోనా ప్రభావం లేకపోవడంతో కాస్త మంచి రేటు వస్తుందన్న ఆశాభావంతో ఉన్న రైతులకు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో విమాన రాకపోకలపై యూరప్ దేశాలు విధిస్తోన్న ఆంక్షలు కలవరపెడుతున్నాయి. మామిడి పూర్తి స్థాయిలో మార్కెట్‌కు వచ్చే సమయానికి పరిస్థితులు చక్కబడతాయన్న ఆశాభావంతో వారున్నారు. 3.35లక్షల హెక్టార్లలో.. రాష్ట్రంలో ఈ ఏడాది 3.35లక్షల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. గతేడాది చివర్లో కురిసిన వర్షాల ప్రభావంతో ఈసారి పూత కాస్త ఆలస్యమైంది. ప్రారంభంలో పూతపై అక్కడక్కడ కన్పించిన నల్ల తామర పురుగు (త్రిప్స్ పార్విస్ పైనస్) ప్రభావం ప్రస్తుతం ఎక్కడా కన్పించకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హెక్టార్‌కు 12 టన్నుల చొప్పున 40.26లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. ఆర్బీకేల కేంద్రంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ తోట బడులతో పాటు ఫ్రూట్‌కేర్ విధానాల వల్ల దిగుబడుల్లో నాణ్యత పెరుగుతోంది. ఎగుమతులకు ప్రామాణికమైన “ఫైటో శానిటరీ సర్టిఫికెట్’ జారీకోసం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పంట ఎగుమతుల కోసం ఇప్పటి వరకు 18,486 మంది రైతులు (కొత్తగా 17,416 మంది) నమోదు చేసుకున్నారు. ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమ తుల అభివృద్ధి అథారిటీ (ఎంపెడా) సౌజన్యంతో విజయవాడ, తిరుపతిల్లో బయ్యర్స్–సెల్లర్స్ మీట్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పండే బంగిన పల్లి, సువర్ణరేఖ, తోతాపూరి, చిన్న రసాలకు దేశీయంగానే కాదు.. విదేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉంది. గడిచిన రెండేళ్లు ఆశించిన స్థాయిలో రేటు పలకలేదని, కనీసం ఈ ఏడాదైనా టన్ను రూ.లక్ష వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. లాక్డౌన్ పరిస్థితులున్నప్పటికీ ప్రభుత్వం చర్యల వల్ల గతేడాది గల్ఫ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేయగలిగారు. యూరప్ దేశాల ఆంక్షలతో కలవరం సాధారణంగా ఎగుమతుల్లో 30–40 శాతం యూరప్ దేశాలకు, 40–50 శాతం గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. కాగా ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్ దేశాలు విమాన రాకపోకలపై విధిస్తోన్న ఆంక్షలు మామిడి ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన నెలకొంది. పూత ఆలస్యం కావడంతో పూర్తిస్థాయిలో మామిడి మార్కెట్‌కు రావడం ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలవుతుందని, ఈలోగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులన్నీ చక్కబడతాయని ఆశాభావంతో ఎగుమతిదారులు, రైతులు ఉన్నారు. కాగా ఈ ఏడాది దిగుమతులపై అమెరికా ఆంక్షలు ఎత్తి వేయడంతో ఆ దేశానికి ఎగుమతి చేసేందుకు ఎగుమతి దారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి మంచి దిగుబడులు గడిచిన రెండేళ్లు కరోనా వల్ల ఆశించిన స్థాయిల్లో ఎగుమతులు జరగక రైతులు ఇబ్బంది పడ్డారు. శాస్త్రవేత్తలు, ఉద్యానవనశాఖాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తుండడం వలన మంచి ఫలితాలొస్తున్నాయి. ఆర్బీకేలు వేదికగా నిర్వహిస్తోన్న తోటబడులు, ఫ్రూట్‌కేర్ యాక్టివిటీస్ వల్ల ఎక్స్పోర్ట్ క్వాలిటీ మామిడి దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. – ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యానవన శాఖ -
‘ద్రాక్ష’కు పూర్వ వైభవమే లక్ష్యం
గజ్వేల్: రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఉద్యానవనశాఖ సిద్ధమవుతోంది. ఒకప్పుడు ద్రాక్షకు హబ్‌గా ఉన్న ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలతోపాటు సాగుకు అనుకూలంగా ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో రైతులను ప్రోత్సహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో సిద్దిపేట జిల్లా ములుగు కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యానవర్సిటీ కీలకంగా వ్యవహరించనుంది. రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాలలో శనివారం నిర్వహించిన సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో 50వేల ఎకరాల్లో సాగు.. రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు ఒకప్పుడు ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఆధారం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ కొంత సాగయ్యేది. ఏటా 50వేల ఎకరాలకుపైగా తోటల్లో పండేది. ద్రాక్ష గజ్వేల్ సాగులో సింహభాగాన్ని ఆక్రమించేది. సీడ్లెస్ థామ్సన్, తాజ్గణేష్ రకాలను ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అయ్యేది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ద్రాక్ష రైతులు కోట్లలో నష్టపోయారు. దీంతో అక్కడ సాగు కనుమరుగైంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లిలో రవీందర్‌రెడ్డి అనే రైతు, విశ్వనాథపల్లిలో ధర్మారెడ్డితోపాటు జిల్లాలోని మరో 10మంది రైతులు కలిసి 88ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ద్రాక్ష దిగుమతి అవుతోంది. సాగు పెంపునకు ఏం చేద్ధాం? రాజేంద్రనగర్‌లోని ఉద్యానవన కళాశాలలో జరిగిన మేధోమథన సదస్సులో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ నీరజాప్రభాకర్, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి, వైఎస్సార్‌హెచ్‌యూ మాజీ చాన్స్‌లర్ డాక్టర్ శిఖామణి, జాతీయ ద్రాక్ష పరిశోధనా సంస్థ డైరెక్టర్ సోమ్‌కుమార్ పాల్గొన్నారు. ఏటా వెయ్యి ఎకరాల్లో ద్రాక్ష సాగు, అధిక దిగుబడి రకాలు, కొత్త వంగడాలపై రైతులకు అవగాహన తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పుణేలోని జాతీయ ద్రాక్ష పరిశోధనా సంస్థ సహకారంతో లాభసాటి రకాల వృద్ధి, సాగు విస్తీర్ణం పెంపు లక్ష్యంగా ప్రణాళిక చేశారు. ఇది కొద్ది రోజుల్లోనే కార్యరూపం దాల్చనుందని ములుగు వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్ ‘సాక్షి’కి చెప్పారు. -
‘చాక్లెట్’ పంట.. ఏపీ వెంట
సాక్షి, అమరావతి: చాక్లెట్ పంటగా పిలిచే ‘కోకో’ సాగును రాష్ట్రంలో మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. చాక్లెట్స్, బిస్కెట్స్, ఇతర తినుబండారాలతో పాటు పానీయాలు, ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే ‘కోకో’కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. కోకో సాగుతో పాటు ఉత్పాదకతలోనూ మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గడచిన రెండేళ్లలో కొత్తగా 8 వేల హెక్టార్లలో విస్తరించిన ఈ సాగును రానున్న మూడేళ్లలో కనీసం 15 వేల హెక్టార్లలో పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 1990లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా ప్రారంభించిన కోకోను ఆ తర్వాత ఆయిల్‌పామ్ తోటల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగవుతున్న ఈ పంట తాజాగా కోస్తా, రాయలసీమ జిల్లాలకూ విస్తరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,199 హెక్టార్లలో ఇది సాగవుతుండగా.. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 22,015 హెక్టార్లలో విస్తరించింది. బహుళ ప్రయోజన పంటగా.. నాటిన మూడో ఏడాది నుంచి మొదలయ్యే కోకో దిగుబడి కనీసం 40 ఏళ్లపాటు కొనసాగుతుంది. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేసే కోకో చెట్ల నుంచి ఏటా టన్ను నుంచి రెండు టన్నుల ఆకులు రాలి నేలలో కలిసిపోతాయి. దీనివల్ల భూసారం పెరుగుతుంది. భూమిపై ఏర్పడే ఆకుల పొర వల్ల కలుపు శాశ్వతంగా నిర్మూలించబడుతుంది. ఇదే సందర్భంలో తోటల్లోని భూమిలో తేమ శాతం నిలిచి ఉండి ప్రధాన పంటకు నీటి కొరత లేకుండా చేస్తుంది. పైగా కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో పిందె రాలిపోవడాన్ని నివారిస్తుంది. అంతర పంటగా కోకో సాగు చేయడం వల్ల ప్రధాన పంటల్లో 20 శాతం దిగుబడి పెరుగుతుందని సీటీఆర్ఐ స్పష్టం చేసింది. ఏలూరులో కోకోవా, వెనీలా ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతులకు సాగు ఖర్చుల కింద మూడేళ్ల పాటు హెక్టారుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. సూక్ష్మ సేద్య పరికరాలపై చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ అందిస్తోంది. ఇదిలావుండగా.. ఏలూరులో రూ.75 కోట్లతో కోకోవా, వెనీలా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. మూడెకరాల్లో కోకో వేశా ప్రభుత్వం ప్రోత్సాహంతో అంతర్ పంటగా గతేడాది 3 ఎకరాల్లో కోకో మొక్కలు నాటాను. ఉద్యాన శాఖ అధికారులు సాంకేతిక సహకారం అందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. – కె.గంగాధర్, రామన్నగూడెం, ప.గోదావరి రైతుల ఇంటి వద్దే కొనుగోలు కోకో సాగు విస్తరణకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. రైతులకు అన్నివిధాలుగా సాంకేతిక సహకారం అందిస్తున్నాం. రైతుల ఇంటి వద్దకే వెళ్లి కోకో కాయలను కొనుగోలు చేస్తున్నాం. – ఎ.రవీంద్రరావు, అసిస్టెంట్ మేనేజర్, క్యాడ్బరీ ప్రభుత్వం ప్రోత్సాహం కోకో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోంది. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో పూర్తి స్థాయిలో కోకోను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. – పావులూరి హనుమంతరావు, జాయింట్ డైరెక్టర్, ఉద్యాన శాఖ -
అన్ని జిల్లాల్లో.. రూ.100కే పండ్లకిట్
సాక్షి, అమరావతి: ఫ్రూట్ కిట్ల విక్రయాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కలెక్టర్లకు శనివారం లేఖలు రాశారు. కర్నూలు జిల్లాలో శుక్రవారం ప్రయోగాత్మకంగా అమలు చేసిన రూ.100కే పండ్ల కిట్ అమ్మకం విజయవంతమైనందున రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. లేఖలో అంశాలివీ.. స్థానికంగా దొరికే ఏవైనా ఐదు రకాల పండ్లను కిట్ రూపంలో తయారు చేసి రూ.100 చొప్పున విక్రయించాలి. ఇందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో), ఉద్యాన శాఖ సహకారాన్ని తీసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు 350 గ్రాముల కూరగాయలు, వంద గ్రాముల పండ్లు తీసుకోవాలి. ఆ సూత్రం ఆధారంగా కరోనా వైరస్ వ్యాధి నివారణకు ఉపయోగపడే విటమిన్ ఏ, సీ ఉండే పండ్లను పంపిణీ చేయాలి. అనూహ్య స్పందన ‘లాక్డౌన్ సమయంలో.. రైతు సేవలో ఎఫ్‌పీవోలు’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన వార్తకు వివిధ వర్గాల నుంచి విశేష స్పందన వచి్చంది. వందలాది మంది ఫోన్లు చేసి పండ్ల కిట్ల పంపిణీలో పాలు పంచుకుంటామని చెప్పినట్లు ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ పి.హనుమంతరావు తెలిపారు. అపార్ట్మెంట్ అసోసియేషన్లు, కాలనీ సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీలు, పండ్ల వ్యాపారులు, ఏజెంట్లు, పండ్ల రైతులు, వెండర్లు.. ఇలా అన్నివర్గాల నుంచి స్పందన రావడంతో వాళ్లను సమీపంలోని ఎఫ్‌పీవోలకు అనుసంధానం చేశామన్నారు. ఇతర జిల్లాలకూ విస్తరిస్తున్నాం ప్రజల వద్దకే పండ్ల పంపిణీ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచి్చనందున ఇతర జిల్లాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదురి తెలిపారు. ఆయన ఏం చెప్పారంటే.. గుంటూరు, విజయనగరం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పండ్ల కిట్ల పంపిణీ ప్రారంభమైంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి. చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, తూర్పు, పశి్చమ గోదావరి జిల్లాల్లో వెండింగ్ వ్యాన్ల ద్వారా ఉద్యాన శాఖ సిబ్బంది అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్‌లు, సొసైటీల వద్ద ప్రభుత్వం అనుమతి ఇచి్చన సమయంలో విక్రయిస్తున్నారు. -
రైతులకు స్థిర ఆదాయ కల్పనే లక్ష్యం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రైతులకు స్థిరమైన ఆదాయం సమకూర్చాలనే ప్రతిపాదనపై చర్చ జరగాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఉపాధి కోసం యువతను వ్యవసాయం దిశగా మళ్లించేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఇక్కడి తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థలో శ్రీగంధం, వెదురు, సరుగుడు, టేకు మొక్కల పెంపకంపై ఆగ్రో ఫారెస్ట్రీ విభాగం నిర్వహిం చిన రైతు అవగాహన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగం తో అనుసంధానించాలని, లేనిపక్షంలో ఆ రంగం తీవ్ర సంక్షో భంలో కూరుకుపోతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ అనుకూల వాతావరణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దీంతో రైతుల పరిస్థితి మెరుగైందని పేర్కొన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం తెలంగాణే అని అన్నారు. రైతులు ఆత్మహత్యల దశ దాటి ఆత్మవిశ్వాసం దిశగా పయనిస్తున్నారని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొత్తిమీర, పుదీనా సాగుకు ప్రోత్సాహం కొత్తిమీర, పుదీనాను అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేసేందుకు ప్రత్యేకప్రాజెక్టును రూపొందించాలని ఉద్యానవన శాఖ అధికారులకు మంత్రి సూచించారు. పుదీనా, కొత్తిమీర, సుగంధగడ్డి సాగును ప్రోత్సహించేందుకు సూక్ష్మ, బిందుసేద్యంపై 95 శాతం సబ్సిడీ ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. రైతులను కోటీశ్వరులుగా చేసేందుకు ఆగ్రోఫారెస్ట్రీ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. ఐదో విడత హరితహారంలో అటవీశాఖ సహకారంతో 20 లక్షల శ్రీ చందనం మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశిం చామని మంత్రి చెప్పారు. కేరళ నుంచి నాణ్యమైన శ్రీచందనం విత్తనాలు కొనుగోలు చేసి అటవీ, ఉద్యాన నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేసినట్లు ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రాంరెడ్డి వెల్లడించారు. హరితహారంలో వెదురు, టేకు, శ్రీగంధం, సరుగుడు మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తాత్కాలిక విషయాల మీద నిర్ణయాలు వద్దు సాగునీటి రంగంలో పంజాబ్, హరియాణా సహా ఏ రాష్ట్రమూ తెలంగాణతో సరితూగలేదని నిరంజన్‌రెడ్డి అన్నారు. 42 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తికి మూడు దశాబ్దాలు పట్టిందని, 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను కేవలం నాలుగేళ్లలో కొలిక్కి తెచ్చి వెట్‌రన్ చేసినట్లు చెప్పారు. ఆలస్యమైనా ఉద్యోగులకు డీఏ, పీఆర్సీలు వస్తాయని, కానీ వాటి ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయం తీసుకోవడం సరికాదని ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. -
బిందు సేద్యంతో నీటి ఆదా..
వర్ధన్నపేట: రైతులు బిందుసేద్యంతో ఎంతో నీటిని ఆదా చేసుకోవడంతో తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసుకుని అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా హార్టీకల్చర్ అధికారి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ రాయితీ ద్వారా రైతులకు అందించిన బిందు సేద్యం పరికరాలను గురువారం వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద, బండౌతాపురం, దమ్మన్నపేట తదితర గ్రామాల్లో తోటలకు హార్టీకల్చర్ అధికారి శ్రీనివాసరావు, వర్ధన్నపేట మండల హెచ్ఈఓ యమున, మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు వెళ్లి రైతులు క్షేత్రస్థాయిలో అమర్చుకున్న పరికరాలను తనిఖీలు చేశారు. తనిఖీలతో పాటు ఇల్లందలోని చొల్లేటి యమునాదేవి మామిడి తోటలో అమర్చుకున్న బిందు సేద్య పరికరాలతో పాటు మామిడి తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మామిడి తోటలో సూక్ష్మధాతు లోపాలు ఉన్నాయన్నారు. వీటి భర్తీకి జింక్ సల్ఫేట్ 100 గ్రాములు ప్రతి చెట్టుకు అందించాలని తెలిపారు. దీంతో పాటు బోరాన్ లోపం ఉన్న తోటల్లో సాలిబోర్ 3 గ్రాములు ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం మామిడి తోటలు పూత దశలో ఉన్నాయని తెలిపారు. ఇంకా పూత రాని తోటలో తేలికపాటి నీటి తడులతో పాటు మల్టీకే(13–0–45) 10 గ్రాములు ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. తెల్లపూత సమయంలో వచ్చే తేనె మంచు పురుగులు, తామర పురుగులు పూత చుట్టూ ఉండి నాశనం చేస్తాయని తెలిపారు.దీని నివారణకు ఇమిడాక్లోరిపైడ్ 0.3 మిలీ, ప్లానోఫిక్స్ 0.25 మిలీ ఒక లీటరు నీటితో కలిపి పిచికారి చేసుకుని నివారించుకోవాలని పేర్కొన్నారు. -
సీషెల్స్‌కు రాష్ట్ర ఉద్యాన శాఖ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యాన శాఖ టెక్నా లజీని సీషెల్స్ దేశం అందిపుచ్చుకోనుంది. అధునాతన సాంకేతికతతో పాలీహౌస్‌లు నిర్మించి కూరగాయలు, పండ్ల తోటలు, పూలసాగును తమ దేశంలో చేపట్టేందుకు సహకరించాలని ఆ దేశ వ్యవసాయ మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా అందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి అనుమతించారు. త్వరలోనే ఆ దేశ వ్యవసాయాధికారులు ఎనిమిది మంది రాష్ట్రంలో పర్యటించి పాలీహౌస్‌లు, పండ్ల తోటలు, ఇతర టెక్నాలజీపై శిక్షణ తీసుకోనున్నారు. సీషెల్‌లో 4 పాలీహౌస్‌ల నిర్మాణం చేపట్టి, వాటి పనితీరును కూడా వివరించాలని చేసిన విజ్ఞప్తి పై కూడా ఉద్యానశాఖ సంచాలకులు ఎల్.వెంకట్రామ్రెడ్డి కస రత్తు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల పనితీరు, పంటల సాగుపై అధ్యయనం చేయడానికి సీషెల్స్ వ్యవసాయశాఖ బృందం ఇటీవల మన దేశ పర్యటనకు వచ్చింది. రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జీడిమెట్లలో నడుస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని సందర్శించింది. -
ఇంటిపంటలతో మెరుగైన ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటిపంటలతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఉద్యాన– పట్టు పరిశ్రమశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో తెలంగాణ ఉద్యానశాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అర్బన్ఫార్మింగ్ అండ్ వర్టికల్ గార్డెనింగ్ మొదటి రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ప్రభుత్వ సీఎస్ ఎస్కేజోషి, వ్యవసాయ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కూరగాయల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేదన్నారు. దీన్ని చేరుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో కిచెన్‌గార్డెన్, వర్టికల్గార్డెన్ అర్బన్ఫార్మింగ్, ఇంటితోటల పెంపకాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రసాయనాలతో పండించిన కూరగాయల్ని కొని తినే బదులు, ఇంట్లో పండించిన కూరగాయలు మేలన్నారు. ఆహార సమస్యల కారణంగా తలెత్తే వ్యాధులను ఇంటిపంటలతో అరికట్టవచ్చని సూచించారు. సీఎస్ ఎస్కే.జోషి మాట్లాడుతూ..గతంలో తాను వ్యవసాయశాఖలో పనిచేసినపు డు అనేక సదస్సులు నిర్వహించామని, కానీ రైతుల నుంచి ఇంతటి ఆదరణ ఎప్పుడూ చూడలేదన్నారు. సీఎస్ ఘెరావ్..ఉద్రిక్తత: సమావేశం ముగిసిన అనంతరం ఎస్కే జోషిని పాలీహౌస్ రైతులు చుట్టుముట్టి తమ బకాయిలు చెల్లించాలంటూ నినాదాలు చేయడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం పాలిహౌస్‌ల్లో వ్యవసాయం చేయాలని ఆశచూపి ఇప్పుడు రూ.80 లక్షల వరకు బకాయిలు ఎగ్గొట్టిందని ఆరోపించారు. నాలుగేళ్లుగా సచివాలయం, ఉద్యాన శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా..ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యానశాఖ డైరెక్టర్‌తోనూ రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన వెంకట్రామ్రెడ్డి అసలు పాలీహౌస్ సాగును ఎవడు చేపట్టమన్నాడు? అంటూ మండిపడ్డారు. రైతులపై సీఎస్ అసహనం.. సీఎస్ కారుకి రైతులంతా అడ్డంగా వచ్చి కదలకపోవడంతో చాలాసేపు జోషి కారులోనే ఉండిపోయారు. దీంతో ఆయన అసహనానికి గురై వారిని మందలించారు. బిల్లులు చెల్లించేందుకు కృషిచేస్తానని సీఎస్ హామీనివ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. -
ఇంటికి ఆకుపచ్చ పందిరి
సాక్షి, హైదరాబాద్ : పరిపూర్ణ ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు కావాలనుకుంటున్నారా? పుచ్చులులేని, పురుగుమందులు వాడని పండ్లు ఉంటే బావుంటుందని భావిస్తున్నారా? అయితే మీ ఇంట్లోనే వీటిని పండిం చుకోవచ్చు. ఇంటి పైకప్పులు, బాల్కనీలు, పెరట్లో కేవలం 200 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు సొంతంగా సాగు చేసుకోవచ్చు. కనీసం 100 చదరపు అడగులున్నా సరే ఇంటిల్లిపాదికీ ఏడాదిపాటు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, రెండు మూడు రకాల పండ్లు పండించుకోవచ్చు. ప్రస్తుతం నగరవాసులు తాజా కూరగాయలు, ఆకుకూరల కోసం సొంత సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 40 వేల ఇళ్లలో అర్బన్ ఫార్మింగ్ జరుగుతోంది. వాస్తవానికి నగరంలో దాదాపు 22 లక్షల ఇళ్లలో ఇంటిపంటకు అవకాశం ఉండగా, కేవలం 40వేల ఇళ్లలో మాత్రమే రూఫ్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ జరుగుతోంది. అయితే, దేశంలో ఇంటిపంటల నిర్వహణలో కేరళ, కర్ణాటక తర్వాత మన హైదరాబాద్ మూడో స్థానంలో ఉండటం విశేషం. కొచ్చిన్, త్రివేండ్రమ్ వంటి నగరాల్లో ఇంటిపంటలను తప్పనిసరి అవసరంగా చాలామంది గుర్తించి ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూడా సొంత సాగు దిశగా పయనిస్తోంది. హైదరాబాద్ ఎంతో అనుకూలం... ఇంటిపంటలకు హైదరాబాద్ ఎంతో అనుకూలమైన నగరం. సగటున 40 డిగ్రీల గరిష్ట, 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో కూడిన నగర వాతావరణంలో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగుచేసుకోవచ్చు. నగరంలో ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 3వేల టన్నుల ఆకుకూరలు, కూరగాయలతోపాటు 100 టన్నుల పండ్లు వినియోగమవుతున్నాయి. పోషకాహార నిపుణుల అంచనా ప్రకారం ప్రతి మనిషికీ రోజుకు 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు అవసరం. దాదాపు 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న గ్రేటర్ భూభాగంలో నగర అవసరానికి సరిపడా ఇంటి పంటలు పండించుకోవడం ఏమాత్రం కష్టం కాదు. నగరంలో సుమారు 22 లక్షల ఇళ్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. వీటి పైకప్పులు, బాల్కనీలు, పెరట్లో సుమారు 14,824 ఎకరాల సాగు స్థలాలు ఉన్నట్లు అంచనా. ఇందులో కనీసం సగం స్థలంలో ఇంటిపంట సాగుచేసినా నగర ప్రజల కూరగాయల అవసరాలు తీరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం 40వేల ఇళ్లలో సాగుతున్న రూఫ్ గార్డెనింగ్ స్థలాన్ని లెక్కిస్తే అది కనీసం వంద ఎకరాలు కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇంటిపంటల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, వారిని సొంత సాగు దిశగా ప్రోత్సహించేందుకు ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఇంటిపంట కిట్లను రాయితీపై అందజేస్తున్న ఉద్యానశాఖ.. దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమాయత్తమవుతోంది. మరోవైపు సహజ ఆహారం వంటి స్వచ్చంద సంస్థలు, పలువురు ఆర్గానిక్ ఆహార ప్రియులు సైతం ఇంటిపంటను ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాయితీ పై అర్బన్ ఫార్మింగ్... ఇంటిపంటలను ప్రోత్సహించేందుకు ఉద్యానవనశాఖ గత ఐదేళ్లుగా అర్బన్ ఫార్మింగ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా రూఫ్ గార్డెన్, కిచెన్ గార్డెన్ సామగ్రిని రాయితీపై అందజేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ కిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 500 మందికి వీటిని అందజేసినట్లు ఉద్యానవనశాఖ అధికారి మధుసూధన్ ‘సాక్షి’తో చెప్పారు. 50 చదరపు అడుగుల నుంచి 200 చదరపు అడుగుల గరిష్ట స్థలం అందుబాటులో ఉన్న నగరవాసులు అర్బన్ ఫార్మింగ్ పథకానికి అర్హులు. ఈ పథకంలో కూరగాయలు పెంచేందుకు అవసరమైన సిల్ఫాలిన్ కవర్లు (మొక్కలు నాటేందుకు కావాల్సినవి), మట్టి మిశ్రమం, విత్తన సంచి, వేపపిండి, వేపనూనె, పనిముట్లు అందజేస్తారు. సాధారణంగా ఈ కిట్ ధర రూ.6వేలు కాగా, ఉద్యానవనశాఖ 50 శాతం రాయితీతో రూ.3వేలకే అందజేస్తోంది. ఇంటిపంట పట్ల ఆసక్తి ఉన్న నగరవాసులు నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఉద్యానవనశాఖ కార్యాలయానికి వెళ్లి తమ ఆధార్‌కార్డు, పాస్ఫోర్ట్సైజ్ ఫొటోతోపాటు సబ్సిడీ మొత్తాన్ని చెల్లించి కిట్ పొందవచ్చు. అందులో 40 అంగుళాల వెడల్పు, 12 అంగుళాల లోతు ఉన్న 4 సిల్ఫాలిన్ కవర్లు, 52 ఘనపు అడుగుల ఎర్రమట్టి, పశువుల ఎరువుతో కూడిన 20 పాలీ బ్యాగులు, 12 రకాల ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు, 25 కిలోల వేపపిండి, 500 మిల్లీలీటర్ల వేపనూనె ఉంటుంది. సాగు ఉపకరణాలతోపాటు షవర్, చేతి సంచి కూడా లభిస్తాయి. -
గీతన్నకు మొగిపురుగు దెబ్బ
సాక్షి, సిద్దిపేట: రియల్ ఎస్టేట్ వెంచర్లు, భారీ విద్యుత్లైన్లు వేయడం, బీడు భూములను వ్యవసాయానికి వాడుకోవడం వంటి కారణాలతో ఇప్పటికే తాటి వనాలు కనుమరుగు అవుతుండగా.. తాజాగా గీత కార్మికులకు మొగిపురుగు రూపంలో మరో దెబ్బ తగులుతోంది. కుండల కొద్దీ కల్లు వచ్చే తాటి చెట్లు చూస్తుండగానే మొగి విరిగిపోవడం, నిలువునా ఎండిపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని గీత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొగిపురుగు తొలిచేయడం వల్ల చెట్లు చనిపోతున్నాయని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి నివారణ మార్గం లేదని వారు చేతులెత్తేస్తున్నారు. 3 వేలకు పైగా చనిపోయిన తాటిచెట్లు రాష్ట్ర వ్యాప్తంగా మొగిపురుగు సోకి ఇప్పటికే మూడు వేలకు పైగా తాటిచెట్లు చనిపోయినట్లు గీత కార్మిక సంఘం చేసిన సర్వేలో తేలింది. ప్రధానంగా గీత వృత్తిపైనే ఆధారపడి జీవించేవారు అధికంగా ఉన్న నల్లగొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో ఈ మొగిపురుగు బెడద తీవ్రంగా ఉంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలోని నంగునూరు, మద్దూరు, హుస్నాబాద్, కరీనంగర్ జిల్లాలోని చిరుగు మామిడి, జగిత్యాల, జనగామ జిల్లాల్లోని వడ్లకొండ, నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్‌లో అధికసంఖ్యలో తాటి చెట్లు మొగిపురుగు బారిన పడి చనిపోతున్నాయి. ఈ మొగిపురుగు చెట్టు మొగిలో చేరి రసాన్ని పీల్చుతూ.. కిందికి తొలుచుకుంటూ పోతుంది. చెట్టు చనిపోగానే మరో చెట్టుపైకి చేరుతుంది. పురుగును నిర్మూలించకపోతే తాటివనాలు కనుమరుగవుతా యని గీత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోల్పోతున్నాం సిద్దిపేట మండలంలోని పలు గ్రామాల్లో తాటి చెట్లు ఎండిపోవడంతో గౌడ కులస్తులు ఉపాధి కోల్పోతున్నారు. మొగిపురుగు తినేయడంతో తాటి చెట్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. మొగిపురుగు బారి నుంచి చెట్లును కాపాడి గౌడ కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలి. – పల్లె మధుసూదన్‌గౌడ్, మద్దూరు గీత వృత్తిని కాపాడాలి ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాటి, ఈత చెట్లను కొట్టేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు మొగిపురుగు కూడా కార్మికుల పాలిట శాపంగా మారింది. ఏపుగా పెరిగి కుండల కొద్దీ కల్లు ఇచ్చే చెట్లను మొగి పురుగు తొలిచేస్తోంది. అధికారులు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలి. – ఎంవీ రమణ, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి -
‘సూక్ష్మం’పై మక్కువ..!
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ భారమున్నా సూక్ష్మసేద్యం కోసం రైతులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రైతులు జీఎస్టీ భరించాలి. ఆ భారాన్ని కేంద్రం తగ్గిస్తుందని భావించారు. కానీ కేంద్రం కరుణించలేదు. ఈ నేపథ్యంలో భారమైనా సరే సూక్ష్మసేద్యానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో సూక్ష్మసేద్యంపై 5 శాతం వ్యాట్ ఉండేది. అందులో రూ.5 వేలకు మించకుండా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేది. 18 శాతం జీఎస్టీలో 5 శాతాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. మిగిలిన 13 శాతం ఇప్పుడు రైతులు భరిస్తున్నారు. అయితే ఇంత భారమైనా రైతుల నుంచి సూక్ష్మసేద్యం కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో కన్నా భారీగా దరఖాస్తులు.. 2017–18లో ఇప్పటి వరకు 3.85 లక్షల ఎకరాలకు 1.16 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. జీఎస్టీ లేనప్పటికంటే ఇప్పుడే భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారని చెబుతున్నారు. 2016–17లో 10,550 మంది రైతులు 32,710 ఎకరాలకు దరఖాస్తు చేసుకోగా.. గత ఆర్థిక సంవత్సరం కంటే పది రెట్ల ఎకరాలకు దరఖాస్తులు రావడం విశేషం. గతేడాది సూక్ష్మసేద్యం కోసం దరఖాస్తు చేసుకుంటే నిధుల్లేక చాలా వరకు నిలిచిపోయాయి. ఈ ఏడాది ప్రభుత్వం నాబార్డు నుంచి రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకోవడంతో నిధుల సమస్య తీరింది. ఎస్సీ, ఎస్టీలకు పథకం ఉచితం.. ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇస్తుంది. బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. ఎకరానికి సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ.25–30 వేల వరకు ఖర్చు కానుంది. 4 ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ.లక్షకు పైగానే ఖర్చవుతుంది. అయితే ఈ సూక్ష్మసేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ జీఎస్టీ రావడంతో వారు కూడా తప్పనిసరిగా రూ.13 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీసీలు, ఇతర వర్గాలపైనా ఇదే భారం పడనుంది. ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా సూక్ష్మసేద్యం అందుబాటులోకి తేవడంతో రైతులు జీఎస్టీ గురించి ఆలోచించకుండా దరఖాస్తు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. అధికంగా దరఖాస్తులు ‘ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సూక్ష్మసేద్యంపై భారాన్ని తగ్గిస్తారని అనుకున్నాం. కానీ తగ్గలేదు. కాబట్టి 18 శాతం వరకు భారం పడుతుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం భరిస్తుంది. మిగిలిన జీఎస్టీ భారం రైతులపై పడుతుంది. విరివిగా సూక్ష్మసేద్యం ఇస్తుండటంతో రైతులు జీఎస్టీ భారాన్ని లెక్కచేయట్లేదు.’ – వెంకట్రామిరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్ -
అక్కడ డ్రాగన్ ఫ్రూట్.. ఇక్కడ గులాబీ పండు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘గులాబీ పండు‘పేరుతో కొత్తరకం పంటను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. చైనాలో డ్రాగన్ ఫ్రూట్, యూఎస్‌లో అమెరికన్ బ్యూటీ పేర్లతో సాగు చేస్తున్న పండును నూతన సంవత్సరం సందర్భంగా రైతులకు పరిచయం చేయాలని నిర్ణయం తీసుకుంది. డ్రాగన్ ఫ్రూట్‌కు ‘గులాబీ పండు అమృత రాజఫలం’గా నామకరణం చేశామని, మొక్కలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ)లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నామని ఉద్యాన డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం కొల్తూరు గ్రామంలో 15 ఎకరాల్లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గులాబీ పండును సాగు చేస్తున్నారని చెప్పారు. మిర్యాలగూడ సమీపంలో రైతు రవి కూడా 15 ఎకరాల్లో పండించి తొలిసారి మార్కెట్లోకి పండ్లను తీసుకొచ్చారన్నారు. భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్, మిజోరంలోని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్‌లోనూ మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంలో బేర్ యాపిల్‌ను తెలంగాణ యాపిల్‌గా నామకరణం చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెంకట్రామిరెడ్డి చెప్పారు. 30 ఏళ్లు పండ్లే పండ్లు.. ‘డ్రాగన్ ఫ్రూట్ తెలుపు, గులాబీ రంగుల్లో లభిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పుడిప్పుడే పండిస్తున్నారు. తీగజాతికి చెందిన ఈ పండు డయాబెటిక్, బీపీ రోగులకు ఎంతో ఊరటనిస్తుంది. క్యాన్సర్‌పై పోరాడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది’అని వెంకట్రామిరెడ్డి తెలిపారు. పౌడర్‌గా తయారుచేసుకొని ఫ్లేవర్‌గా ఉపయోగించుకోవచ్చని, సలాడ్ రూపంలోనూ తీసుకుంటారని, తెలంగాణ వంటి వర్షాభావ ప్రాంతాలకు అనువైనదని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, తక్కువ నీటి వనరులున్న ఇతర ప్రాంతాల్లోనూ సాగు చేయొచ్చని.. ఒక్కో చెట్టుకు రోజుకు 2 లీటర్ల నీరు సరిపోతుందని తెలిపారు. ఒకసారి మొక్క నాటితే 25 నుంచి 30 ఏళ్లపాటు పండ్లనిస్తుందని చెప్పారు. ఏడాదికోసారి పంట మొదట్లో ఎకరానికి 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఖర్చుంటుందని, తర్వాత ఏటా రూ. 25 నుంచి రూ. 30 వేలు నిర్వహణకు ఖర్చు చేయాలని వెంకట్రామిరెడ్డి చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్స్ ఏడాదికోసారి పండుతాయని, తొలి ఏడు ఎకరానికి టన్ను పంట పండుతుందని, లక్షన్నర వస్తుంద న్నారు. రెండో ఏడాది 2 టన్నులు 3 లక్షలు, మూడో ఏడాది 3 టన్నులు 4.5 లక్షలు, నాలుగో ఏడాది 4 టన్నులు 6 లక్షలు, ఐదో ఏడాది 5 టన్నులు 7.5 లక్షలు, ఆరో ఏడాది 6 టన్నులు 9 లక్షలు ఆదాయం వస్తుంద న్నారు. 25–30 ఏళ్ల వరకు 6 టన్నుల వరకు పండ్లు పండుతాయని.. 9 లక్షల ఆదాయం వస్తుందన్నారు. వివరాలకు 83744–49091 ను సంప్రదించాలని కోరారు. 120 -
డీలాపడ్డ టమాటా!
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో టమాటా ధర రోజురోజుకూ పడిపోతోంది. ఒకటి రెండు నెలల కింద కిలో రూ. 100కు చేరి భయపెట్టిన టమాటా.. ఇప్పుడు ఐదు రూపాయలకు తగ్గి నేల చూపులు చూస్తోంది. వినియోగదారులకు తక్కువ ధరకే అందుతున్నా.. రైతులకు మాత్రం కిలోకు రూపాయి, రెండు రూపాయలు మాత్రమే దక్కుతోంది. ముందు ముందు టమాటా ధర ఇంకా పడిపోతుందనే అంచనాతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులు లేకపోవడం, టమాటా ప్రాసెసింగ్ పరిశ్రమలేవీ లేకపోవడం వల్లే రాష్ట్రంలో టమాటా ధరలు విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని అంటున్నారు. దళారులకే గిట్టుబాటు!: రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో టమాటా సాగుచేస్తారు. ప్రధానంగా వికారాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో టమాటా విస్తారంగా సాగవుతుంది. ఇతర ప్రాంతాల్లోనూ కొద్ది మొత్తంలో సాగు చేస్తారు. దీనికితోడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి టమాటా దిగుమతి అవుతుంది. సాధారణంగా చలికాలంలో టమాటా ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు టమాటా సీజన్‌గా చెబుతారు. చలి పెరిగితే టమాటా దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ కాలంలో టమాటా ధర పడిపోతుంది. టమాటా ధరలు ఏడాదిలో బాగా పెరగడం, తగ్గడం జరుగుతుంది. కానీ సరఫరా ఎక్కువున్నా, తక్కువున్నా బాగుపడేది మాత్రం దళారులే. డిమాండ్ అధికంగా ఉండి ధర పెరిగితే.. ఆ మేరకు సొమ్ము రైతులకు చేరడం లేదు. గిట్టుబాటు ధరే లభిస్తుంది. అదే సీజన్లో టమాటా ధర తగ్గినప్పుడు రైతులకు ఏమీ మిగలడం లేదు. రైతులకు నామమాత్రంగా కిలోకు రూపాయో, అర్ధరూపాయో ఇస్తున్న దళారులు.. మార్కెట్లో మాత్రం నాలుగైదు రూపాయలకు కిలో చొప్పున అమ్ముకుంటున్నట్లు మార్కెటింగ్ వర్గాలే చెబుతున్నాయి. ఏటా లక్ష టన్నులు వృథా.. రాష్ట్రంలో టమాటా, వంకాయ, బెండ, బీర, కాకర తదితర కూరగాయలు 8.68 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. మొత్తంగా ఏటా 50.01 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తవుతుండగా.. తగిన నిల్వ వసతి లేక ఏటా 16.50 లక్షల టన్నులు కుళ్లిపోతున్నట్లు అంచనా. ఇలా కుళ్లిపోతున్న పంటలో దాదాపు లక్ష టన్నుల మేర టమాటాయే ఉంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యా లను పండించాక వాటిని సరైన చోట, తగిన విధంగా నిల్వ ఉంచాలి. మార్కెట్లో గిట్టుబాటు ధర రానప్పుడు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసి.. డిమాండ్ పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. కానీ రాష్ట్రంలో సరిపడా శీతల గిడ్డంగులు అందుబాటులో లేవు. ఉద్యాన పంటల దిగుబడుల మేరకు రాష్ట్రంలో 216 శీతల గిడ్డంగులు అవసరంకాగా.. ఉన్నవి 56 మాత్రమే. టమాటా పూర్తిగా పండని స్థితిలో ఉన్నప్పుడు కోల్డ్ స్టోరేజీలో పెడితే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. పండినదైతే 20 రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు. కానీ శీతల గిడ్డంగులు సరిపడా లేక టమాటాలు కుళ్లిపోతున్నాయి. వినియోగం పెంచాలి.. ‘‘ఏయే సీజన్లో ఏ కూరగాయలు బాగా పండితే వాటి వినియోగం పెంచేలా చర్యలు చేపట్టాలి. టమాటా ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగం పెంచాలి. కూరల్లో చింతపండుకు బదులు టమాటాను పులుపుగా వాడుకోవచ్చు. చలికాలంలో టమాటా సూప్ తయారు చేసుకోవచ్చు. అందరూ టమాటా కొనాలి.. తినాలి.. తాగాలి..’’ – ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ప్రాసెసింగ్ యూనిట్లు అవసరం టమాటా ధరలు స్థిరీకరించేందుకు నిల్వ వసతులను పెంచడంతోపాటు టమాటా ఉప ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలను నెలకొల్పడం కూడా అవసరం. టమాటాతో జామ్ తయారు చేయవచ్చు, ఎండబెట్టి పొడిగా చేసి విక్రయించొచ్చు. దీనికి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాల్లో టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. ఆ రకమైన ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్రంలో నెలకొల్పాలి. వాటిని మహిళా సంఘాలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తే వారికీ ఉపాధి దొరుకుతుంది. రైతులకు గిట్టుబాటు అవుతుంది. ♦ హాస్టళ్లలో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం టమాటా సూప్ తయారు చేసి ఇవ్వొచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ♦ చలికాలంలో సూప్‌లు అందుబాటులోకి వస్తే టీ లాగా వినియోగదారులు సూప్‌లను తాగేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల టమాటా పొడి, సూప్‌ల తయారీకి సంబంధించి చర్యలు చేపట్టాలి. ఇందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని, శిక్షణను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు అందజేయాలి. ♦ టమాటా రైతుల నుంచి ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి ఉప ఉత్పత్తులు తయారు చేయించాలి. -
సీఆర్టీల నియామకాల్లో అక్రమాలు నిజమే
సాక్షి, మహబూబాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గతేడాది జరిగిన కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (సీఆర్టీ) నియామకాల్లో అక్రమాలు జరగడం వాస్తవమేనని గుర్తించారు. ‘సాక్షి’ దినపత్రికలో గత నెల 30న ‘సీఆర్టీల నియామకాల్లో అక్రమాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి బెన్హర్ మహేష్‌దత్ ఎక్కా స్పందించారు. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లను విచారణకు ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సూర్యనారాయణను విచారణకు పంపారు. ఆయన ఆశ్రమ పాఠశాలలను సందర్శించి వివరాలు సేకరించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 2016–17కిగానూ 48మంది అభ్యర్థులను సీఆర్టీలుగా నియమించారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కలెక్టర్ అప్రూవల్ తీసుకోకుండా అడ్డదారుల్లో వారిని నియమించారనేది ఆరోపణ. జిల్లాలో పనిచేస్తున్న ఓ సహాయ గిరిజనాభివృద్ధి అధికారి ఒక్కో అభ్యర్థి వద్ద రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి మరో ఐదుగురు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే నియామకమైనట్లు గుర్తించినట్టు సమాచారం.