iit
-
విదేశాల్లో.. ‘త్రివర్ణ’ విద్యా పతాక!
నూతన విద్యావిధానంలో భాగంగా విదేశీ వర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు భారత్ తలుపులు బార్లా తెరిచింది. అదేసమయంలో విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతక రెపరెపలకూ సిద్ధమవుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు తమ క్యాంపస్‌లను విదేశాల్లో ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మొట్టమొదటిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) తమ క్యాంపస్‌లను దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ‘వాణిజ్య సంప్రదింపులు’ అనే కొత్త సబ్జెక్ట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ ప్రకటించారు. విదేశాల్లో క్యాంపస్‌లను స్థాపించాలనుకునే భారతీయ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలను అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం2021 నుంచి అడుగులు...! విదేశాల్లో భారతీయ విద్యాసంస్థల క్యాంపస్‌ల ఏర్పాటుపై 2021లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఐఐటీల్లోని డైరెక్టర్లతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 1:10 నిష్పత్తిలో విద్యార్థులను తీసుకోవాలని, ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని ఇలా కొన్ని ప్రతిపాదనలు కూడా పరిశీలించారు. ఇక గతేడాది దేశానికి చెందిన ప్రభుత్వ రంగ ఉన్న విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం విదేశాల్లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దుబాయ్, టాంజానియా, ఈజిప్‌్ట, ఆఫ్రికా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ఆయా సంస్థలు ఆలోచిస్తున్నాయి.ఐఐటీ ఢిల్లీ – యూఏఈలో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అయితే, విదేశాల్లో భారతీయ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అధికారికంగా ముందుకొచి్చంది ఐఐఎఫ్‌టీ మాత్రమే.విదేశాల్లో భారత్‌కు చెందిన 10 ప్రైవేట్ వర్సిటీలు1. అమిత్ యూనివర్సిటీ: 2013లో దుబాయ్‌లో ఈ క్యాంపస్ ఏర్పాటైంది. విదేశీ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది.2. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2000లో ఈ వర్సిటీ ఏర్పాటుచేసింది. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో వివిధ కోర్సులను అందజేస్తోంది. అక్కడి వర్సిటీల్లో టాప్–10లో కొనసాగుతోంది. 3. ఎస్పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్: 2004లో దుబాయ్, సింగపూర్, సిడ్నీ దేశాల్లో వర్సిటీలను ఏర్పాటు చేసింది. 4. బిట్స్ పిలానీ: దుబాయ్‌లో 2000లో ఈ సంస్థ ఏర్పాటైంది. భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో.. దుబాయ్‌లోని అంతే క్రేజ్ కొనసాగుతోంది. ఇక్కడ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. 5. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: 2010లో దుబాయ్‌లో సేవల్ని ప్రారంభించిన ఎస్ఆర్ఎం.. తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. 6. మహాత్మాగాంధీ యూనివర్సిటీ: 2013లో రువాండాలో ఏర్పాటైంది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐటీలో పీజీ, ఎంబీఏ కోర్సులను అందిస్తోంది. 7. అమృత విశ్వ విద్యాపీఠం: దుబాయ్‌లో 2015లో ఈ యూనివర్సిటీ సేవలు ప్రారంభించింది. విభిన్న కోర్సుల్ని అందిస్తోంది. 8. సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ: దుబాయ్‌లో 2008లో క్యాంపస్ ఏర్పాటు చేసింది. 9. జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2002లో మొదలైంది. 10. విట్ యూనివర్సిటీ: 2017లో తన సేవల్ని దుబాయ్‌లో విస్తరించింది. భారత్‌లోనూ విదేశీ క్యాంపస్లుఉన్నత విద్యకోసం విదేశాలు వెళుతున్న భారతీయల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో... విదేశీ విద్యా సంస్థలే భారత్‌కు వస్తున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం అనుమతులిచ్చేందుకూ సిద్ధంగా ఉంది. ఈక్రమంలోనే దేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ముందుకొచ్చింది. తమ క్యాంపస్‌ను గుర్గావ్లో ఏర్పాటు చేయనున్నామని, జూలై 2025లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. ఇలా విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతాకను ఎగురవేసేందుకు భారత్ అడుగులు వేస్తుండగా, విదేశీ విద్యాసంస్థలు సైతం భారత్‌లో వర్సిటీల స్థాపనకు సిద్ధమవుతున్నాయి. టాప్–10లో స్థానమే లక్ష్యం..చదువుల్లో నాణ్యత, ఉద్యోగవకాశాలు, సాంస్కృతిక అనుకూలత వంటి అంశాల ఆధారంగా ఆయా దేశాల్లో జెండా పాతేందుకు దేశీయ వర్సిటీలు సిద్ధమవుతున్నాయి. ఆసక్తి, అభిరుచి, డిమాండ్, ఫ్లెక్సిబిలిటీ, ఆర్థిక స్థోమత మొదలైనవి పరిగణనలోకి తీసుకొని ఆ దేశ విద్యార్థులకు అవసరమయ్యే కోర్సుల్ని ప్రవేశపెడుతూ విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా.. విదేశాల్లోనూ పాగా వేస్తూ.. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్–10లో భారతీయ విశ్వవిద్యాలయాలే ఉండే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ఏపీలోనూ ‘కోటా ఫ్యాక్టరీ’లు
సాక్షి, అమరావతి: ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షల శిక్షణకు రాజస్థాన్‌లోని కోటా నగరం ప్రసిద్ధి చెందింది. అక్కడ ప్రతి ఇల్లూ ఓ శిక్షణ సంస్థే. కోటా ఇన్స్టిట్యూట్స్లో శిక్షణ తీసుకుంటే ర్యాంక్ గ్యారంటీ అనే ప్రచారం బలంగా ఉండడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యార్థులు వస్తుంటారు. అయితే అక్కడి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ఇతరులకు తెలియదు. శిక్షణ కోసం కోటా వచ్చిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక గతేడాది 26 మంది ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు వదిలారు. వీరంతా 17–19 ఏళ్ల వయసువారే. ఇక సివిల్స్ శిక్షణకు బ్రాండ్ సిటీ లాంటి ఢిల్లీలో ఇటీవల ఓ పేరొందిన స్టడీ సర్కిల్‌ను వరద ముంచెత్తడంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి వీటికి భిన్నంగా ఏమీ లేదు. మన వద్ద కూడా అన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇంటర్, పోటీ పరీక్షల్లో ర్యాంకుల కోసం విద్యార్థులపై ఇదే తరహా ఒత్తిడి నెలకొంది.పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థకోచింగ్ సెంటర్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు ఆధారంగా ప్రత్యేక చట్టాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తేనుంది. శిక్షణ సంస్థలపై పర్యవేక్షణకు 12 మంది అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతత్వంలో పాఠశాల, వైద్య, సాంకేతిక విద్య కార్యదర్శులు, డీజీపీ సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సంస్థల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సెంటర్లు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండుసార్లు వరకు జరిమానా, ఆ తరువాత సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. విద్యార్థి శిక్షణ మధ్యలో మానేస్తే దామాషా ప్రకారం ఫీజు రీఫండ్ చేయాల్సి ఉంటుంది. కోటాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం అనంతరం ఐఐటీ, నీట్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ పేరుతో 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవడం, సాధారణ పాఠశాలల్లో చేరిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.బలవన్మరణాలు..విశాఖ పీఎం పాలెంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఈ ఏడాది జనవరిలో 9వ తరగతి చదివే ఓ విద్యార్థికి టెన్త్ పాఠ్యాంశాలు బోధిస్తూ టెస్టుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో తిరుపతి జిల్లా గూడూరులో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీల సందర్భంగా రికార్డులు సమర్పించాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో 21 ఏళ్ల విద్యార్థి హాస్టల్ భవనంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు 2021లో ఏపీలో 523 మంది విద్యార్థులు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడినట్లు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య మూడింతలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2014 తరువాత 57 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై మార్కులు, ర్యాంకుల ఒత్తిడి పెరగడంతో అంచనాలను అందుకోలేక సగటున వారానికి ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి కార్పొరేట్ విద్యాసంస్థల వేధింపులను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజస్థాన్‌లో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయడంతో పాటు కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ‘‘కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు–2024’’ పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. -
ఒడుపైన ఎత్తు.. ఒత్తిడే చిత్తు
సాక్షి, హైదరాబాద్: ఒకచోట అర్ధరాత్రి ఆత్మల్లా విహారం. మరోచోట ఆమని ఒడిలో చిన్నారుల్లా కేరింతలు. భయపెడుతూ, భయపడుతూ, భయాన్ని అధిగమించే సన్నివేశం ఒకటి. బాల్యంలోకి తీసుకెళ్లి బడి ఒత్తిడిని తగ్గించే కార్యక్రమం మరొకటి. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీల్లో విద్యార్థులకు మానసిక ఒత్తిడి, భయాన్ని తగ్గించేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఐఐటీ భువనేశ్వర్‌లో ఏటా నిర్వహించే హాలోవీన్ నైట్, ఐఐటీ హైదరాబాద్ నిర్వహించే సన్‌షైన్ కార్యక్రమాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి.ఐఐటీలో ఆత్మల రాత్రి అర్ధరాత్రి.. ఆత్మ మాదిరిగా వేషధారణ.. అక్కడక్కడ శవపేటికలు.. దెయ్యాల కొంపల్లా భవనాల అలంకరణ.. పుర్రెలతో డెకరేషన్.. మసక మసక చీకటితో కూడిన లైటింగ్.. ఐఐటీ భువనేశ్వర్‌లో ఏటా అక్టోబర్ చివరలో నిర్వహించే హాలోవీన్ నైట్ కార్యక్రమం దృశ్యాలివి. విద్యార్థులను తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థలో నవంబర్ మూడో వారం నుంచి సెమిస్టర్ పరీక్షలు మొదలవుతాయి. ఈ పరీక్షల కోసం విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ల్యాప్‌టాప్‌లలో మునిగిపోతారు.ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కొందరైతే డిప్రెషన్లోకి వెళ్లిపోతుంటారు. ప్రధానంగా మొదటి సంవత్సరం విద్యార్థుల్లో ఈ భయం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు ఈ ఉన్నత విద్యా సంస్థ ఏటా ఇలా హాలోవీన్ నైట్ (పిశాచాల రాత్రి) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు ఇందులో సీఎస్టీ (కౌన్సిలింగ్ సర్వీస్ టీం) అనే ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. ఇందులో విద్యార్థులతో పాటు పాఠాలు బోధించే ఫ్రొఫెసర్లు, వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా ఉంటారు.ఐఐటీహెచ్‌లో మెంటల్ హెల్త్ మంత్రాళ్లపై బోమ్మలు (స్టోన్ పెయింటింగ్).. మట్టితో వివిధ ఆకృతులు (క్లే థెరపీ).. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్లే స్కూల్లో చిన్నారులు చదువుకునే విధానంలా ఉంది కదా? కానీ, టెక్నాలజీ పరంగా దేశంలోనే అత్యున్న విద్యా సంస్థల్లో ఒకటైన హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు అవలంభిస్తున్న మార్గాలివి. సన్‌షైన్ పేరుతో పనిచేస్తున్న ప్రత్యేక విభాగం ఏటా అక్టోబర్‌లో మెంటల్ హెల్త్ మంత్ నిర్వహిస్తోంది. విద్యార్థులు చదువుల ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మ్యూజిక్ ఆర్ట్ థెరపీ, ఎమోస్నాప్.. హీల్ అవుట్ లౌడ్.. ఇలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఈ సన్‌షైన్ విభాగంలో స్టూడెంట్ బడ్డీ, మెంటార్స్, కౌన్సిలర్లు, మానసిక వ్యక్తిత్వ నిపుణులు భాగస్వాములుగా ఉంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌నే అబివృద్ధి చేశారు. చాట్‌బాట్ రూపంలో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒత్తిడిని జయించే మార్గాలను సలహాలను సూచనలు పొందేలా ఏర్పాట్లు చేశారు. ఐఐటీహెచ్‌లో తొలి నేషనల్ వెల్బీయింగ్ కాంక్లేవ్ హైదరాబాద్ ఐఐటీ వేదికగా తొలి నేషనల్ వెల్బీయింగ్ కాంక్లేవ్ శనివారం ప్రారంభమైంది. దేశంలోని అన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిబుల్ఐటీలు, ఇతర ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఫ్రొఫెసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. విద్యార్థులు ఒత్తి డిని జయించేందుకు ఆయా విద్యా సంస్థలు అవలంభిస్తున్న మార్గాలను వివరించేందుకు ప్రత్యేకంగా స్టాల్లను ప్రదర్శించారు. ఒత్తిడిని జయించేందుకు ఎంతో ఉపయోగం విద్యార్థులు మానసిక ఒత్తి డితో బాధపడుతు న్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే ఆ విద్యార్థితో స్టూడెంట్ గైడ్ మాట్లాడుతారు. అవస రం మేరకు ఆ విద్యార్థి పరిస్థితిని వ్యక్తిత్వ వికాస నిపుణుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను అధిగమించేలా చేస్తున్నాము. ఇందుకోసం మా విద్యా సంస్థల్లో సీఎస్టీ (కౌన్సిలింగ్ సరీ్వస్ టీం) పనిచేస్తోంది. – మంగిపూడి శ్రావ్య, బీటెక్ మెట్లర్జీ, ఐఐటీ భువనేశ్వర్ -
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో రాష్ట్రంలోని నాలుగు పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఎంపిక చేసిన కళాశాలల్లో ఐఐటీ శిక్షణను ఆదే కళాశాలకు చెందిన జూనియర్ లెక్చరర్లు ఇచ్చేవారు. ఈసారి నారాయణ కళాశాలలకు చెందిన ఐఐటీ, నీట్ సిలబస్ బోధించే సిబ్బందితో శిక్షణ ఇప్పించేందుకు ఇంటర్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది.తొలుత కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు లేదా పది కి.మీ. పరిధిలోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నారాయణ సిబ్బంది ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, ప్రతిభ చూపిన వారిని ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులు నిర్ణీత సెంటర్లో ఇంటర్ రెగ్యులర్ తరగతులతో పాటు అంతర్భాగంగా ఐఐటీ, నీట్ శిక్షణను కూడా నారాయణ విద్యా సంస్థల సిబ్బందే ఇవ్వనున్నారు.విద్యార్థుల కాలేజీలు వేరైనప్పటికీ ఈ ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో వారి హాజరు ఆన్లైన్లో నమోదు చేస్తారు. దీనివల్ల వారి అటెండెన్స్ ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఇదే తరహా శిక్షణను ఇంటర్ బోర్డు చేపట్టింది. ఈ ప్రత్యేక శిక్షణపై ఆసక్తి గల ప్రభుత్వ లెక్చరర్లతో వారు పనిచేస్తున్న కాలేజీల్లోనే శిక్షణ ఏర్పాట్లు చేశారు. అయితే, అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో ఈ ఏడాది శిక్షణ విధానం మార్చినట్టు తెలుస్తోంది. విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణ, ఐఐటీ, నీట్ నమూనా పరీక్షల నిర్వహణ వంటి అన్ని అంశాలను నారాయణ విద్యాసంస్థలే చూసుకోనున్నాయి. -
Supreme Court: ఆ విద్యార్థికి ఐఐటీ సీటివ్వండి
న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివినా సమయానికి ప్రవేశరుసుం కట్టలేక ప్రతిష్టాత్మక ఐఐటీ ధన్బాద్లో సీటు కోల్పోయిన దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. వెంటనే ఆ విద్యార్థి అతుల్ కుమార్‌కు సీటు ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. జూన్ 24వ తేదీ సాయంత్రం ఐదింటిలోపు అడ్మిషన్ ఫీజు రూ.17,500 కట్టలేకపోవడంతో బీటెక్ సీటు కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ‘‘ విద్యార్థి ఆరోజు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు కోసం మధ్యాహ్నం మూడు గంటలకే లాగిన్ అయ్యాడు. తర్వాత పదేపదే ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌లో రిమైండ్లతో గడువును గుర్తుచేశాం’’ అని ఐఐటీ సీట్ల కేటాయింపు విభాగం వాదించింది. దీంతో సీజేఐ కలగజేసుకుని ‘‘మీరెందుకంతగా వ్యతిరేకిస్తున్నారు?. ఈ పిల్లాడికి ఏమైనా చేయగలవేమో చూడండి. ఆ డబ్బులే ఉంటే కట్టకుండా ఎందుకుంటాడు? అణగారిన వర్గాలకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు. పైగా అతనిదిదారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం. ఐఐటీలో సీటు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ప్రతిభగల ఇలాంటి విద్యార్థిని మనం ఊరకనే వదిలేయలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అసాధారణ అధికారంతో మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. ఇదే ఏడాది అదే బ్యాచ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థికి సీటివ్వండి. హాస్టల్ వసతి సహా అర్హతగల అన్ని ప్రయోజనాలు అతనికి అందేలా చూడండి’’ అని ఐఐటీ కాలేజీ విభాగాన్ని కోర్టు ఆదేశించింది. కిక్కిరిసిన కోర్టు హాలులో అంతసేపూ చేతులు కట్టుకుని నిలబడిన విద్యార్థితో ‘‘ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో’’ అని సీజేఐ అన్నారు. బాగా చదువుతూ ఇంజనీరింగ్ చేస్తున్న అతని ఇద్దరు అన్నల బాగోగులు తదితరాల గురించి కూడా ఆయన ఆరాతీశారు.ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ ఐఐటీ ధన్బాద్లో సీటు వచ్చినా పేదరికం కారణంగా డబ్బులు కట్టలేక నిస్సహాయుడయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తలో చేయి వేసి నగదు సర్దినా చివరి నిమిషంలో ఆన్లైన్ చెల్లింపు విఫలమై ఫీజు కట్టలేకపోయాడు. జార్ఖండ్ హైకోర్టు లీగ్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించగా పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించినందున మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ నెమ్మదించడంతో ఈసారి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. -
ఐఐటీల్లో అరుదైన కోర్సులు (ఫోటోలు)
-
ఏఐని వాడుకుంటాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వ శాఖల్లో మెరుగైన సేవలందించేందుకు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), హైదరాబాద్ ఐఐటీలో అభివృద్ధి చేస్తున్న సాంకేతికతను వాడుకునే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇప్పటికే డ్రోన్ల ద్వారా పంటలకు మందులు పిచికారీ చేసే విధానాన్ని వ్యవసాయశాఖ వినియోగిస్తోందని, అలాగే రవాణా, హెల్త్‌కేర్ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నామని తెలిపారు.సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో పరిశోధన విభాగం టీహాన్ అభివృద్ధి చేస్తున్న డ్రైవర్ రహిత (అటానమస్ నావిగేషన్) వాహనాన్ని పరిశీలించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి ఈ వాహనంలో ప్రయాణించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమెరికా, యూకే, యూరప్ దేశాల్లో మాదిరిగా మన దేశంలోని రోడ్లు, ట్రాఫిక్ తీరుకు అనుగుణంగా పనిచేసే డ్రైవర్ రహిత వాహన టెక్నాలజీని హైదరాబాద్ ఐఐటీ అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ఈ వాహనాలను రోడ్లపైకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ పరిశోధనకు సహకరిస్తున్న జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీ ప్రతినిధులను, పరిశోధన విభాగం విద్యార్థులు, ప్రొఫెసర్లను మంత్రి అభినందించారు. ఐఐటీని ఇక్కడకు తీసుకొచి్చంది వైఎస్సే దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఈ హైదరాబాద్ ఐఐటీని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి సంగారెడ్డి జిల్లా కందిలో స్థాపించారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. స్కిల్స్ యూనివర్సిటీలో ఒక డైరెక్టర్‌గా ఉండాలని మంత్రి హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తిని కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో టీహాన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
నీట్, జేఈఈ క్రాక్ చేసి.. మెడికల్, ఐఐటీ వద్దంటూ..
ఏదైనా సాధించాలనే తపన మనసులో గాఢంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఇందుకు నీట్, జేఈఈ పోటీపరీక్షలు మినహాయింపు కాదని నిరూపించాడు అసోంకు చెందిన ఓ కుర్రాడు. సీబీఎస్సీ 12వ తరగతి బోర్డు పరీక్షలో టాపర్‌గా నిలవడమే కాకుండా నీట్, జేఈఈలలో మంచి స్కోర్ సాధించాడు. అయినప్పటికీ తన అభిరుచికే పట్టంకడుతూ.. మెడికల్ సీటు, ఐఐటి మద్రాస్ అవకాశాన్ని వదిలి ఐఐఎస్సీలో సైన్స్ గ్రాడ్యుయేషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు.ఆ కుర్రాడి పేరు అధిరాజ్ కర్. అసోంతోని గౌహతి నివాసి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించి, సీబీఎస్సీ బోర్డు 12వ తరగతి పరీక్షలో కెమిస్ట్రీలో వందశాతం మార్కులు సాధించడంతోపాటు టాపర్‌గా నిలిచాడు. అలాగే నీట్ యూజీలో అసోంలో టాపర్‌గా నిలిచాడు. అదేవిధంగా మద్రాస్ ఐఐటీలోనూ సీటు దక్కించుకున్నాడు. అయితే అధిరాజ్ అటు ఐఐటీగానీ, ఇటు ఎంబీబీఎస్‌లను ఎంచుకోకుండా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో సైన్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు.అధిరాజ్ కెమిస్ట్రీ, బయాలజీలో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ తరహాలోని వివిధ జాతీయ స్థాయి పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచాడు. పరిశోధనారంగంలో అతనికున్న అభిరుచి అతనిని ఐఐఎస్సీ వైపు నడిపించింది. అకడమిక్ విద్యకు అతీతంగా అధిరాజ్కు వన్యప్రాణుల సంరక్షణ, సంగీతంపై అమితమైన ఆసక్తి ఉంది. ఈ నేపధ్యంలోనే డబ్ల్యుడబ్ల్యుఎఫ్ నేచర్ వైల్డ్ విజ్డమ్ క్విజ్‌లో మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. అధిరాజ్ గౌహతి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బిమల్ కర్, డాక్టర్ మధుశ్రీ దాస్‌ల కుమారుడు. -
అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు
సాక్షి, గుంటూరు: అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు ఎదుర్యయాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఐఐటీ హైదరాబాద్, మద్రాస్ బృందాలు.. నిర్మాణాల నాణ్యతను పరిశీలించాయి. రాజధానిలో వరద చేరడంతో బృందాలు.. పడవలో వెళ్లి పనులు పరిశీలించాయి.ఎస్డీఆర్ఎఫ్ సహాయంతో వరద నీటిలో బృందాలు పర్యటించాయి. జీఏడీ టవర్లు, హైకోర్టు పునాదులు, ర్యాప్ట్ ఫౌండేషన్ పనులను బృంద సభ్యులు పరిశీలించారు. వరద నీటిలో ఉన్న జీఏడీ టవర్లు, హైకోర్టు పునాదులను కూడా ఐఐటీ బృందం పడవలో వెళ్లి పరిశీలించింది. వరద నీటిని చూసి షాక్ తిన్న ఐఐటీ బృందం.. చిన్నపాటి వర్షాలకే ఇలా వరద చేరడంపై ఆశ్చర్యపోయింది. -
దారి చూపే దివిటీలు
పిల్లల కంటే ముందే వారి కలలు తల్లిదండ్రులు కంటారు. ‘నేను సాధించగలను’ అని పిల్లలు అనుకోవడానికి ముందే ‘మా పిల్లలు సాధించగలరు’ అనే బలమైన నమ్మకం తల్లిదండ్రులకు కలుగుతుంది. తమ పిల్లలను పై స్థాయిలో చూడాలని కలలు కంటారు. కేవలం కలలకే పరిమితం కాకుండా ‘పిల్లల కోసమే మా జీవితం’ అన్నట్లుగా కష్టపడతారు. ఆ నిబద్ధతే ఎంతోమంది పిల్లలు విజేతలుగా నిలవడానికి కారణం అవుతుంది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీర్చిదిద్దే శిల్పులు. వారి భవిష్యత్ చిత్రపటాన్ని అందంగా మలిచే చిత్రకారులు.తండా నుంచి ఐఐటీ దాకా...ఈ ఫొటో చూడండి...దారి కూడా సరిగ్గా లేని ఒక మారుమూల గిరిజన తండా. అబ్బాయిల సంగతి ఎలా ఉన్నా తండా దాటి పై చదువులకు వెళ్లడం అనేది అమ్మాయిలకు అంత సులువేమీ కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని గోన్యానాయక్ తండాకు చెందిన బదావత్ రాములు, సరోజ దంపతులు ‘మా అమ్మాయి చదివింది’ చాలు అని ఎప్పుడూ రాజీ పడలేదు.‘నువ్వు ఎంత పెద్ద చదువు చదివితే మాకు అంత సంతోషం’ అనేవాళ్లు తమ కూతురు మధులతతో. ఈ మాటలు మధులతకు బలమైన టానిక్‌లా పనిచేశాయి. ‘ఏదో ఒకటి సాధించి తల్లిదండ్రుల కలను నిజం చేయాలి’ అని బలంగా అనుకునేలా చేశాయి. రాములు, సరోజ దంపతుల చిన్న కూతురు మధులత. పెద్ద కూతురు మంజుల, రెండో కూతురు మమతను డిగ్రీ వరకు చదివించారు. మూడో తరగతి వరకు వీర్నపల్లి సర్కారు బడిలో చదివిన మధులత నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరరకు సిరిసిల్ల సంక్షేమ హాస్టల్లో ఉంటూ గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుంది. సారంపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకులంలో తొమ్మిది నుంచి పదవ తరగతి వరకు చదువుకుంది. ఇంటర్మీడియట్లో 939/1000 మార్కులు సాధించింది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రావడంతో తన మీద తనకు నమ్మకం బలపడింది. ఆ నమ్మకం వృథా ΄ోలేదు. అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే జేఈఈ (అడ్వాన్స్డ్)లో ఆల్ ఇండియా స్థాయిలో 824 ర్యాంకు సాధించింది. మధులతకు సంబంధించి ఇదొక అపురూప విజయం. ఎందుకంటే...ఆమె కుటుంబ నేపథ్యం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, పేదవాళ్లు.‘మా బిడ్డ గొప్ప చదువులు చదువుతుంది’ అనే నమ్మకం తప్ప వారి దగ్గర ఏమీ లేదు. అయితే తల్లిదండ్రుల ్ర΄ోత్సాహం, తన మీద పెట్టుకున్న ఆశలు మధులతను ముందుకు నడిపించాయి. ‘నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించకు. ఉన్న దాని గురించి దృష్టి పెట్టు’ హైస్కూల్ రోజుల్లో తాను చదివిన మంచి మాట మధులతకు బాగా గుర్తుండి ΄ోయింది. పేదరికం తప్ప తన దగ్గర ధనం లేక΄ోవచ్చు, కాని విద్య రూపంలో విలువైన నిధి ఉంది. ఆ నిధిపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది మధులత. ఏదో సాధించాలనే తపనతో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.ఖరీదైన కోచింగ్‌లు లేక΄ోయినా సొంతంగా ఆల్ ఇండియా స్థాయిలో ‘జేఈఈ’లో ర్యాంక్ తెచ్చుకునేలా చేసింది. పట్నా ఐఐటీలో సీటు సాధించిన మధులతకు ఉన్నత చదువుపై ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఆమెను ఇంటికే పరిమితం అయ్యేలా చేశాయి. ఇక ఏమీ చేయలేక, పై చదువులకు వెళ్లలేక తండాలో మేకలు కాయడం మొదలుపెట్టింది మధులత. మధులత దీన పరిస్థితిపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఐఐటీకి వెళ్లలేక మేకల కాపరిగా’ కథనం చూసి స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి మధులత చదువుకు అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తామని ప్రకటించారు. ఆరోజు ఎంత బాధ పడ్డానో!‘చదివించింది చాలు. ఎందుకంత కష్టపడతావు’ అనే వాళ్లు కొందరు. అయితే మధు మీద మాకు చాలా నమ్మకం, చదువు తనకు ్ర΄ాణం. పట్నంలో ఎప్పుడైనా పెద్ద ఆఫీసర్ అమ్మలను చూసినప్పుడు వారిలో నా బిడ్డే కనిపించేది. ఏదో ఒకరోజు నా బిడ్డను ఇలా గొప్పగా చూస్తాను అనుకునేవాడిని. డబ్బులు లేక, పై చదువుకు పట్నాకు వెళ్లలేక మధు ఇంట్లోనే ఉండి΄ోవాల్సి రావడం నాకు చాలా బాధగా ఉండేది. చదువు ఇచ్చిన దేవుడు దారి చూడడా! అనుకునే వాడిని. దేవుడు దయ తలిచాడు.– బదావత్ రాములు, మధులత తండ్రిచదువే లోకం...నా బిడక్డు చదువే లోకం. సెలవులకు వస్తే కూడా చదువుకొనుడు లేదా మా మేకలతో వెళ్లేది. మా తండాకు తొవ్వ కూడా లేదు. ఇప్పుడు మా బిడ్డకు ర్యాంకు వచ్చిందని మండల అధికారులు మా ఇల్లు వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది. మా బిడ్డ బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నా. – సరోజ, మధులత తల్లి – వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ సిరిసిల్ల– ఫొటోలు: వంకాయల శ్రీకాంత్ -
సీఎస్‌ఈకే ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) నిర్వ హించిన కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం ఐదవ విడత సీట్ల కేటా యింపు పూర్తిచేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీట్ల భర్తీకి ఇది చివరిదశ. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంకా రెండు విడతల సీట్ల కేటాయింపు చేపడతారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 17,740 సీట్లు భర్తీ చేశారు. 31 ఎన్ఐటీల్లో 24,226, దేశంలోని 26 ట్రిపుల్ ఐటీల్లో 8,546 సీట్లు, ఇతర సంస్థలు కలుపుకొని మొత్తం 60 వేల ఇంజనీరింగ్ సీట్లు భర్తీ చేశారు. జోసా కౌన్సెలింగ్‌లో ఈసారి 121 కాలేజీలు పాల్గొన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు పొందిన వారికి ఐఐటీల్లో, జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా ఇతర జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. కలిసొచ్చిన కటాఫ్... సీట్ల పెరుగుదలఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కటాఫ్ పెరిగింది. దీంతో పాటు ఐఐటీల్లో అదనంగా వెయ్యి సీట్లు కొత్తగా చేర్చారు. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ ర్యాంకులు వచ్చినా సీట్లు దక్కించుకునే అవకాశం లభించింది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ (నిట్)ల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఐఐటీల్లో ఏదో ఒక బ్రాంచీలో సీటు పొందే ఆలోచనకు దూరంగా ఉన్నారు. తాము కోరుకున్న సీటు ఎన్ఐటీల్లో పొందవచ్చని భావించారు. ఫలితంగా నిట్ వంటి సంస్థల్లో సీఎస్ఈకి ఈసారి ఎక్కువ పోటీ కనిపించింది. దీంతోపాటు రాష్ట్రస్థాయిలో ఉండే మంచి కాలేజీల వైపు జేఈఈ ర్యాంకర్లు కూడా మళ్లుతున్నారు. ఐఐటీ అడ్వాన్స్డ్ రాసినవారి సంఖ్య గతం కన్నా బాగా పెరిగింది. ఈ కారణంగానూ ఈసారి ఐఐటీ సీట్లు పొందే కటాఫ్ పెరిగింది. కానీ కౌన్సెలింగ్‌లో విద్యార్థుల పోటీ మాత్రం ఐఐటీల్లో అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది.సీఎస్ఈ రాకుంటే ఐఐటీల్లో చేరడం లేదు అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు వచ్చినా విద్యార్థులు ఎన్ఐటీల్లో సీట్ల కోసమే ప్రయత్నిస్తున్నారు. ఐఐటీల్లో సీఎస్ఈలో సీటు వస్తే చేరేందుకు ఇష్టపడుతున్నారు. కానీ ఇతర బ్రాంచీల్లో సీటు వచ్చినా ఇష్టపడటం లేదు. వీరంతా ఎన్ఐటీల్లో, రాష్ట్ర టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం వెళుతున్నారు. ఈ కారణంగానే ఐఐటీల్లో గత ఏడాదికన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి సీట్లు వచ్చాయి. ఎన్ఐటీల్లో మాత్రం పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది. – ఎంఎన్.రావు, గణిత శాస్త్ర నిపుణుడు -
ఇకపై హిందీలోనూ ఇంజినీరింగ్.. ఐఐటీ జోధ్‌పూర్‌లో చేరొచ్చు
దేశంలో నూతన ఆవిష్కరణల విషయంలో రాజస్థాన్ ఎప్పుడూ ముందుంటుంది. విద్య లేదా వైద్యం... ఏదైనా ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక నూతన ఆవిష్కరణలు చేస్తూనే ఉంటారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఐఐటీ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది.ఇకపై ఐఐటీ జోధ్‌పూర్‌లో చేరే విద్యార్థులు బీటెక్ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తారు. దేశంలో హిందీలో బీటెక్ చదువులను అందించే తొలి ఐఐటీగా జోధ్‌పూర్ ఐఐటీ నిలిచింది.ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం కలిగిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని జోధ్‌పూర్ ఐఐటీ ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. జాతీయ విద్యా విధానం 2020 కింద ఈ నూతన కోర్సును ప్రవేశపెడుతున్నారు. జోధ్‌పూర్ ఐఐటీలో ఇకపై హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో బిటెక్ చేయవచ్చు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని ఇతర ఐఐటీలలో కూడా దీనిని అమలు చేసే అవకాశాలున్నాయి.దేశంలోని 50 శాతం మంది విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలుకంటుంటారు. అయితే ఆంగ్లంలో ఈ కోర్సులు ఉండటం వలన చాలామంది విద్యకు దూరమవుతున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకే జోధ్‌పూర్ ఐఐటీ ఇంజినీరింగ్ కోర్సులను హిందీ మాధ్యమంలో ప్రవేశపెడుతోంది. -
బియాండ్ సేవల విస్తరణ...
తమ సేవల్ని మరిన్ని నగరాలకు విస్తరిస్తామని ఇంటీరియర్ ఉత్పత్తులకు పేరొందిన నగరానికి చెందిన బియాండ్ కలర్ సంస్థ వ్యవస్థాపక సీఈఓ కుమార్ వర్మ తెలిపారు. గత మూడు రోజులుగా మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐడీ) షో కేస్ ప్రదర్శన ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఐఐడీ షో కేస్‌లో ప్రదర్శించిన తమ ఉత్పత్తులకు నగరవాసుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు. -
అడ్వాన్స్‌డ్‌లో ఏపీ మెరుపులు
సాక్షి, అమరావతి : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో టాప్–10లో నలుగురు ఏపీ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లే ఉన్నారు. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్‌కు చెందిన భోగలపల్లి సందేశ్ 360కి గాను 338 మార్కులతో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లాకు చెందిన పుట్టి కుశాల్ కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్విక్ సుహాస్ 329 మార్కులతో 10వ ర్యాంకుతో మెరిశారు. ఏపీకి చెందిన మత బాలాదిత్య (ఐఐటీ భువనేశ్వర్ జోన్)కు 11వ ర్యాంకు రాగా, ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్‌గా ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 355 మార్కులతో సత్తా చాటాడు. తొలి పది ర్యాంకుల్లో ఐఐటీ రూర్కీ జోన్‌కు ఒకటి, ఐఐటీ ఢిల్లీ జోన్‌కు రెండు, ఐఐటీ బాంబే జోన్‌కు మూడు, అత్యధికంగా ఐఐటీ మద్రాస్ జోన్‌కు నాలుగు ర్యాంకులు దక్కడం విశేషం. ఇక ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేష్ కుమార్ పటేల్ జాతీయ స్థాయిలో 332 మార్కులతో 7వ ర్యాంకు సాధించడమే కాకుండా బాలికల విభాగంలో టాపర్‌గా నిలిచింది. గతేడాది తొలి పది స్థానాల్లో ఆరుగురు హైదరాబాద్ జోన్‌కు చెందిన విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. పెరిగిన ఉత్తీర్ణత దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఏటా 2.50 లక్షల మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది 1,86,584 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,80,200 మంది పరీక్షకు హాజరవ్వగా 48,248 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది 2023లో 43,773గా ఉంది. అడ్వాన్స్డ్ ఉత్తీర్ణతలో బాలికల సంఖ్య కూడా పెరిగింది. 2023లో 7,509 మంది ఉంటే తాజాగా 7,964 మంది ఉత్తీర్ణులయ్యారు. 331 మంది ఓవర్సీస్ ఇండియన్స్ పరీక్ష రాస్తే 179 మంది, 158 విదేశీ విద్యార్థులు పరీక్షకు హాజరైతే కేవలం 7 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం.నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పిస్తోంది. అనంతరం 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాల్గవ దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది. జూలై 23న మిగిలిన సీట్లు ఉంటే వాటికి కూడా కౌన్సెలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది.నా లక్ష్యం ఐఏఎస్మాది నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్ గ్రామం. అమ్మ వి.రాజేశ్వరి, నాన్న బి.రామ సుబ్బారెడ్డి.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 10/10 పాయింట్లు వచ్చాయి. ఇంటర్లో 987 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో 99.99 పర్సెంటెల్‌తో ఆల్ ఇండియా లెవెల్లో 252వ ర్యాంకు వచ్చింది. జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో 368 మార్కులకు 338 వచ్చాయి. ఓపెన్ క్యాటగిరీలో ఆలిండియాలో 3వ ర్యాంక్, సౌత్ ఇండియాలో మొదటి ర్యాంక్ రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివి, సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. – బొగ్గులపల్లి సందేశ్, 3వ ర్యాంకు ముందస్తు ప్రణాళికతో చదివా మాది కర్నూలు జిల్లా కృష్ణగిరి గ్రామం. అమ్మానాన్నలు కృష్ణవేణి, శేఖర్.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 570, ఇంటర్లో 981 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా లెవెల్లో 83వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా లెవెల్లో 8వ ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ ముంబైలో సీఎస్ఈ చదవాలని ఉంది. ముందస్తు ప్రణాళికతో చదవడం వల్లే ఉత్తమ ర్యాంకు సాధించాను. – కె.తేజేశ్వర్, 8వ ర్యాంకుపెరిగిన కటాఫ్ మార్కులుజేఈఈ అడ్వాన్స్డ్ అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్ మార్కులు పెరిగాయి. గతేడాది జనరల్ ర్యాంకు కటాఫ్ 86 ఉండగా ఇప్పుడు 109కి పెరిగింది. ఓబీసీ 98, ఈడబ్ల్యూఎస్ 98, ఎస్సీ, ఎస్టీ, వివిధ పీడబ్ల్యూడీ విభాగాల్లో 54గా ఉండటం గమనార్హం. 2017 తర్వాత భారీ స్థాయిలో కటాఫ్ మార్కులు పెరిగాయి. సత్తా చాటిన లారీ డ్రైవర్ కుమారుడునరసన్నపేట: ఒక సాధారణ లారీ డ్రైవర్ కుమారుడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 803వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 118 వ ర్యాంకు సాధించాడు. నరసన్నపేట మండలం దూకులపాడుకు చెందిన అల్లు ప్రసాదరావు కుమారుడు రామలింగన్నాయుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టాడు. పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి మొదటి నుంచి పట్టుదలతో చదివేవాడు. ఆరో తరగతి నుంచి వెన్నెలవలస నవోదయలో చదువుకున్నాడు. తండ్రి ప్రసాదరావు లారీ డ్రైవర్ అయినప్పటికీ, కుమారుడికి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి ప్రోత్సహించారు. విద్యార్థి తల్లి సుగుణ గృహిణి. కోర్సు పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని రామలింగన్నాయుడు తెలిపారు. -
సోలార్ పవర్‌తో ఈవీ ఛార్జింగ్.. ఇది కదా మనకు కావాల్సింది
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యూయెల్ కార్ల మెయింటెనెన్స్ కంటే.. ఈవీల వినియోగానికి ఖర్చు తక్కువే అయినప్పటికీ.. ఛార్జింగ్ టైమ్ అనేది వాహన వినియోగదారులకు ఓ సమస్యగా ఏర్పడింది. ఈ సమస్యకు ఐఐటీ-జోధ్‌పూర్ ఓ చక్కని పరిష్కారం చూపింది. ఇంతకీ ఆ పరిష్కారం ఏంటి? ఛార్జింగ్ సమయాన్ని ఎలా తగ్గిస్తుంది? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ఐఐటీ-జోధ్‌పూర్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓ స్పెషల్ అడాప్టర్‌ను అభివృద్ధి చేసింది. దీంతో వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను సౌర శక్తిని ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రజలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో రీఛార్జ్ చేసుకునే వ్యవస్థను రూపొందించాలని నరేంద్ర మోదీ గతంలో వెల్లడించిన మాటలను ఐఐటీ-జోధ్‌పూర్ నిజం చేసింది.రూ.1,000 కంటే తక్కువ ధర వద్ద లభించే ఈ అడాప్టర్ సోలార్ ప్యానెల్ కార్యక్రమం విజయవంతమైతే.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తమ వాహనాలను ఛార్జింగ్ వేసుకోవడానికి ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఐఐటీ జోధ్‌పూర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ తెలిపారు.ఈ అడాప్టర్ అన్ని రకాల వాహనాలలో పని చేస్తుందని, దీనికి సంబంధించిన ప్రోటోటైప్‌ను రూపొందించి విజయవంతంగా పరీక్షించామని, త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని కుమార్ తెలిపారు. కొండలు, మారుమూల ప్రాంతాల్లో కనీస ఛార్జింగ్ సదుపాయాలు లేని ప్రాంతాల్లో కూడా ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.ఒకవైపు ఛార్జింగ్ అడాప్టర్ సోలార్ ప్యానెల్‌కు, మరోవైపు కంపెనీ అందించిన ఛార్జర్‌కు కనెక్ట్ అవుతుంది. దీంతో అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా సరఫరా అవుతుందని ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ అన్నారు. అమెరికా, కెనడా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నాయని చెప్పారు.ఈ ప్లాన్‌లో సోలార్ సాకెట్‌తో.. సోలార్ ప్యానెల్‌ను వాహనాలలో ఉంచే బాధ్యత ఈవీ కంపెనీలదేనన్నారు. రాబోయే ఐదేళ్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ఓ సవాలుతో కూడుకున్న పని, కాబట్టి అడాప్టర్ సోలార్ ప్యానెల్ అద్భుతంగా పనిచేస్తుందని నిశాంత్ కుమార్ అన్నారు. -
తగ్గిన ప్లేస్మెంట్లు.. ఐఐటియన్లకు ఉద్యోగాలు కరువు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఐఐటీ విద్యార్ధుల కొంప ముంచుతోంది. విద్యా సంవత్సరం (అకడమిక్ ఇయర్) 2023-2024లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పూర్తిచేసిన 7 వేల మంది విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు రాలేదని సమాచారం. పెరిగిపోతున్న చాట్‌జీపీటీతో పాటు ఇతర లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) వల్ల ప్లేస్మెంట్ శాతం తగ్గుతోంది. ఐఐటీ కాన్పూర్, ఐఐఎం కోల్‌కతా పూర్వ విద్యార్ధి ధీరజ్ సింగ్ సమాచారహక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు లభించిన సమాచారం ద్వారా ఈ వివరాలు తెలిశాయి. ఆ వివరాల మేరకు.. దేశంలో మొత్తం 23 ఐఐటీ క్యాంపస్‌లలో ఉద్యోగాలు పొందే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది.ఏకమైన ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్ధులు..దీంతో ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్ధులు.. ఇటీవల ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 400 మంది విద్యార్ధులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చారు. ఒక వేళ తమ సంస్థలో ఉద్యోగాలు లేకపోతే ఇతర సంస్థల్లో జాబ్ వచ్చేలా రిఫరెన్స్ ఇవ్వడం, ఇంటర్నషిప్‌ను సమయానికి మరింత పొడిగిస్తామని హామీ ఇచ్చారు.విద్యార్ధులకు సహకరించాలనిఈ సందర్భంగా ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో విద్యార్ధులకు ట్రైనింగ్, ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం అందించే ఆఫీస్ ఆఫ్ కెరియర్ సర్వీసెస్ (ఓసీఎస్) విభాగం విద్యార్ధులకు ఉద్యోగాలు వచ్చేందుకు సహకరించాలని దేశంలో అన్నీ రాష్ట్రాలను విజ్ఞప్తి చేసింది. నిరుద్యోగులుగా 250మంది విద్యార్ధులుమరోవైపు బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బీఐటీఎస్), ఐఐటీ బాంబే సైతం రెండు నెలల క్రితమే తమ పూర్వ విద్యార్ధుల మద్దతు కోరాయి. ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 250 మంది అభ్యర్థులు జూన్ చివరి నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉద్యోగాలు పొందలేకపోవడం గమనార్హం.చాట్‌జీపీటీ ఎఫెక్ట్ బిట్స్ గ్రూప్ వైస్-ఛాన్సలర్ వి రాంగోపాల్ రావు మాట్లాడుతూ.. ఆర్ధిక, సాంకేతిక కారణాల వల్ల ప్లేస్మెంట్ తగ్గుముఖం పట్టాయని అన్నారు. ప్రతిచోటా ప్లేస్మెంట్లు 20శాతం నుంచి 30 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. జాబ్ మార్కెట్‌పై చాట్‌జీపీటీతో పాటు లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం)లు ప్రభావం చూపుతున్నాయన్న ఆయన.. వీటివల్ల ఇద్దరు లేదా ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయడం సాధ్యమవుతుంది. కాబట్టే 30 శాతం క్యాంపస్ ప్లేస్మెంట్ తగ్గిందన్నారు. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు భారీగా దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సులకు దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో దరఖాస్తులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 11 ఏళ్ల తర్వాత గరిష్టంగా 1.91 లక్షల మంది పరీక్షకు నమోదు చేసుకున్నారు. గతేడాది ఈ పరీక్షకు 1,89,744 మంది దరఖాస్తు చేశారు. సాధారణంగా జేఈఈ మెయిన్‌లో ప్రతిభ చూపినవారిలో టాప్ 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. వీరిలో రెండేళ్ల కిందటి వరకు 60 శాతం మంది కూడా అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేవారు కాదు. అలాంటిది ఇప్పుడు వారి సంఖ్య ఏకంగా 76 శాతానికి పెరిగింది. ఉత్తీర్ణత శాతం తక్కువే..అడ్వాన్స్డ్ పరీక్షకు నమోదు చేసుకున్నవారితో పోలిస్తే హాజరయ్యేవారి సంఖ్య ఏటా తక్కువగానే ఉంటోంది. అలాగే పరీక్ష రాసిన వారిలో ఉత్తీర్ణులయ్యేవారి సంఖ్య కూడా స్వల్పమే. గత కొన్నేళ్లుగా పరీక్షలకు సంబంధించి కటాఫ్ మార్కులతో పాటు ఉత్తీర్ణత శాతం కూడా తగ్గుతూ వచ్చింది. జనరల్‌తో పాటు రిజర్వుడ్ కేటగిరీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. గతేడాది అత్యధికంగా 1.80 లక్షల మందికి పైగా పరీక్ష రాస్తే 43,773 మంది మాత్రమే అర్హత సాధించారు. గతేడాది కటాఫ్ కూడా బాగా పెరిగింది. ఇక అడ్వాన్స్‌డ్‌లో పురుషులతో పోలిస్తే మహిళల హాజరు, ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ వంటి పరీక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని, వాటిలో అర్హత సాధించాలంటే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. రెండు సెషన్లలో పరీక్షదేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఈ నెల 26న నిర్వహించనున్నారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆన్లైన్లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని 23 ఐఐటీల్లో 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 21,844, తెలంగాణ నుంచి 24,121 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. దేశవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందిన 2.50 లక్షల మందిలో సుమారు 60 వేల మందికిపైగా పరీక్షకు దరఖాస్తు చేయలేదు. వారు 12వ తరగతి/ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించలేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. -
ఎక్కడ చదివామన్నది కాదు..! జాబ్ వచ్చిందా? రాలేదా?
అహర్నిశలు కష్టపడి, పోటీ పరీక్షల్లో నెగ్గి ఐఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎలాగోలా సీటు సంపాదిస్తున్నారు. ఇకేముంది ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు వచ్చింది కదా.. కొలువు గ్యారెంటీ అనుకుంటున్నారేమో. కాలం మారింది. కంపెనీల తీరు మారింది. ప్రముఖ సంస్థలు ఉద్యోగార్థుల్లో చూసే క్వాలిటీ మారింది. దాంతో ఎంతపెద్ద విద్యాసంస్థలో టాప్ ర్యాంకుతో డిగ్రీ పూర్తి చేసినా కొన్నిసార్లు కొలువు దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటీ సంస్థల్లో ఐఐటీ-ముంబయికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే కదా. అయితే ఆ సంస్థలోని 36 శాతం గ్రాడ్యుయేట్లు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల్లో కొలువు సాధించలేకపోయారు. గతంలోనూ ఐఐఎం సంస్థల్లోని విద్యార్థులు కూడా కొలువులు రాక ఇతర మార్గాలను ఎంచుకున్నట్లు నివేదికలు వెల్లడయ్యాయి. దాంతో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ చదివామని కాకుండా.. ఏం చదివామనే దానిపై దృష్టిసారించాలని నిపుణులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం కంపెనీలు ప్రధానంగా మూలధన పెట్టుబడివైపు ఆసక్తి కనబరిచేవి. నిజానికి ఆ సమయంలో సంస్థలు ఆశించిన మేరకు అభివృద్ధి చెందాయి. ఇటీవల నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితులు, బౌగోళిక అనిశ్చితులు, ఖర్చులు తగ్గించుకోవడం, ఉన్నంతలో ఏయే విభాగాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చో తెలుసుకుని చర్యలు తీసుకుంటున్నారు. ఉత్పత్తి ఆధారిత కంపెనీలు ప్రధానంగా మిషనరీ, మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తాయి. అయితే ఐటీ కంపెనీలకు మాత్రం వేతనాల రూపంలో తమ ఉద్యోగులపైనే భారీగా పెట్టుబడి పెడుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాస్ట్‌కటింగ్ పేరిట ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దాంతో చాలా మంది టెకీలు ఆందోళన చెందుతున్నారు. కంపెనీలు అత్యవసరమైతే తప్పా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఒకవేళ రిక్రూట్మెంట్ చేసినా టాప్ ఇన్స్టిట్యూట్ల నుంచే కొలువులు భర్తీ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఐఐటీ, ఐఐఎంల్లో చదివినా కంపెనీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేవని సంస్థలు గ్రహిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వారిని పక్కనపెట్టేస్తున్నాయి. పైగా ఐఐటీ, ఐఐఎంలో చదివిన వారు అధిక వేతనాలు ఆశిస్తున్నారు. ఇదికూడా ఒకింత ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అవుతోంది. దాంతో ప్రముఖ సంస్థల్లో చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఐఐటీ ముంబయిలో తాజాగా 2000 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరైతే 712 మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 2023లో 85 మంది ఐఐటీ బాంబే విద్యార్థులకు రూ.కోటికి పైగా జీతాలతో ఉద్యోగాలు వచ్చినట్లు ముందుగా ప్రకటించారు. కానీ దాన్ని సవరించి కేవలం 22 మందికే ఈ వేతనం వరిస్తుందని కంపెనీలు చెప్పడం గమనార్హం. ఐఐఎంల్లోనూ అదే తీరు.. ఐఐఎం విద్యార్థులను కంపెనీలు ప్రధానంగా మేనేజ్మెంట్ స్థాయిలో ట్రెయినీలుగా నియమించుకుంటాయి. ప్రస్తుత అనిశ్చితుల గరిష్ఠ వేతనాలు కలిగిన టాప్ మేనేజ్మెంట్ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దాంతో కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా కంపెనీలు ఆలోచించడం లేదనే వాదనలున్నాయి. ఒకవేళ కొన్ని కంపెనీలు తమ అవసరాల కొద్దీ ఉద్యోగాలు కల్పించినా దాదాపు 10-15 శాతం వేతనాలు తగ్గించి ఆఫర్ లేటర్లు విడుదల చేస్తున్నట్లు తెలిసింది. ఐఐఎంలో చదివి కొన్నేళ్లు ఉద్యోగం చేసి కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారిపై వెంచర్ క్యాపిటలిస్ట్‌లు ఆసక్తి చూపుతారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ ఊసే లేకుండాపోయిందని నిపుణులు చెబుతున్నారు. కనీసం రిటైల్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీల్లో సైతం ఉద్యోగాలు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: క్రియేటివిటీ పేరుతో అరాచకం..! భారత్‌లో నిరక్షరాస్యత, అరకొర పారిశ్రామికోత్పత్తి, నాసిరకం నైపుణ్యాలు తదితరాలు నిరుద్యోగానికి కారణాలుగా నిలుస్తున్నాయి. భారత్, చైనా వంటి దేశాలు తమ యువతకు సరైన ఉపాధి కల్పిస్తే ప్రపంచ జీడీపీ ఒక్కపెట్టున విజృంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కాలంతో పాటు సాంకేతికతలూ మారుతున్నాయి. వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీలతో వృత్తి శిక్షణ ఇస్తే కొత్త తరం ఉద్యోగాలకు కావాల్సిన సిబ్బంది తయారవుతారు. అధునాతన సాంకేతికతల వినియోగం, ఇంక్యుబేషన్ విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ శిక్షణ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే సైన్స్ విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి శిక్షణను సర్కారు అందుబాటులోకి తెచ్చింది. వీరిని ఉత్తమంగా తీర్చిదిద్ది పోటీ పరీక్షలకు సిద్ధంచేస్తోంది. గత ఏడాది ఆగస్టులో పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు రెండు కళాశాలల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 51 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ శిక్షణను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో 3 వేల మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్, ఏపీఈఏపీ సెట్‌కు శిక్షణనిస్తున్నారు. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లెక్చరర్లు 800 మందికి శిక్షణనిచ్చి, వారి సూచనల మేరకు విద్యార్థులకు శిక్షణ ప్రారంభించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఎంబైబ్ సంస్థ ఉచితంగా అందిస్తోంది. సైన్స్, మ్యాథమెటిక్స్ తరగతులకు అవసరమైన మెటీరియల్, వీడియో పాఠాలను ఈ సంస్థ అందిస్తోంది. శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఈ ఏడాది జరిగే ఏపీఈఏపీ సెట్, నీట్, జేఈఈ పరీక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగా శిక్షణలో అవసరమైన మార్పులుచేసి రాష్ట్రంలోని 470 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోను ఈ శిక్షణను ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. స్వచ్ఛంద బోధనకు లెక్చరర్ల అంగీకారం.. ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న ఐఐటీ, నీట్, ఏపీఈఏపీ సెట్ శిక్షణకు ఉచితంగా సాంకేతిక సహకారం అందించేందుకు వెంబైబ్ సంస్థ ముందుకొచ్చింది. దీంతో సాధాసాధ్యాలను అంచనా వేసేందుకు ఇంటర్ బోర్డు లెక్చరర్ల సహకారం తీసుకుంది. ఒక్కో సబ్జెక్టు నుంచి ఆసక్తిగల 10 మందిని ఎంపిక చేసి, వారికి ఎంబైబ్ సంస్థ పరిశీలన కోసం మెటీరియల్‌ను పంపించింది. వీడియో పాఠాలు, నమూనా పరీక్ష పత్రాలను పరిశీలించిన అనంతరం వారు సూచించిన మార్పులు చేసి శిక్షణను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఖరీదైన ఐఐటీ, నీట్ వంటి శిక్షణను అందించేందుకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా 800 మంది జూనియర్ లెక్చరర్లు ముందుకొచ్చారు. వారికి నిపుణులతో శిక్షణపై ఇంటర్ బోర్డు పూర్తి అవగాహన కల్పించింది. రెగ్యులర్ పాఠాలు పూర్తయిన తర్వాత ఎంపీసీ విద్యార్థులకు ఐఐటీ, ఏపీఈఏపీ సెట్.. బైసీసీ విద్యార్థులకు నీట్, ఈఏపీ సెట్ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఐఎఫ్‌పీలపై 3డీలో వీడియో పాఠాలు.. మెటీరియల్‌తో పాటు సబ్జెక్టు వారీగా వందలాది వీడియో పాఠాలను ఎంబైబ్ సంస్థ అందించింది. నాడు–నేడులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను అందించింది. మరికొన్ని కాలేజీల్లో ప్రొజెక్టర్లు ఉన్నాయి. వీటిద్వారా విద్యార్థులకు 3డీలో సైన్స్ వీడియో పాఠాలను బోధిస్తున్నారు. పాఠం పూర్తయ్యాక టాపిక్ వారీగా ఆన్లైన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో స్వయంగా టాపిక్ల వారీగా టెస్టు పేపర్లు తయారుచేసుకునే విధానం అందుబాటులోకి తెచ్చారు. గతంలో వచ్చిన ప్రశ్నలను విశ్లేషించి, ఏ తరహా ప్రశ్నలు రావచ్చో ఈ టెక్నాలజీ వివరిస్తోంది. గతంలో హెచ్‌సీఎల్ నిర్వహించిన “టెక్ బీ’ ప్రోగ్రామ్‌కు 4,500 మంది విద్యార్థులు శిక్షణ పొందగా, 900 మంది ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇస్తున్న జేఈఈ, నీట్‌లోను విద్యార్థులు విజయం సాధిస్తారని ఇంటర్మీడియట్ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఆశాభావం వ్యక్తంచేశారు. -
మరో 4 వేల సీట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో ఇంజనీరింగ్ సీట్లు పెంచే అవకాశం ఉందని సమాచారం. 3 వేల నుంచి 4 వేల సీట్లు పెరిగే అవకాశం ఉందని ఐఐటీ డైరెక్టర్ ఒకరు తెలిపారు. సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్‌లో మార్పు జరిగి చేరికల్లో ఎక్కువ మందికి చాన్స్ లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా నిధులూ అవసరమవుతాయి. దీంతో ఆన్లైన్ కోర్సుల నిర్వహణ ద్వారా ఐఐటీలు కొంతమేర నిధులు సమకూర్చుకునే ప్రతిపాదన ముందుకు వస్తోంది. కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ నేపథ్యంలో.. దేశంలో కంప్యూటర్ నేపథ్యం ఉన్న కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ప్యాకేజీల దృష్ట్యా రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఎన్ఐటీలు, ఐఐటీల్లోనూ కంప్యూటర్ ఆధారిత కోర్సులపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. జేఈఈలో అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్ష¯న్గా పెట్టుకుంటున్నారు. మరోవైపు నైపుణ్యంతో కూడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సదస్సులోనూ ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఐఐటీలు సైతం కంప్యూటర్ కోర్సుల డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఐటీలు, ఐఐటీల్లో సీట్లు పెంపు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బొంబయి ఫస్ట్..ఢిల్లీ, మద్రాస్ నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 15 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బొంబయి ఐఐటీకి ప్రతి ఏటా డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ ఐఐటీని జేఈఈ అడ్వాన్స్‌డు ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ఖరగ్‌పూర్, మద్రాస్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఐఐటీ ఉంటోంది. గత ఏడాది ముంబై ఐఐటీలో ఓపె¯న్ కేటగిరీలో బాలురైతే 67, బాలికలైతే 291వ ర్యాంకు వరకు సీటు కేటాయింపు జరిగింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకు సీటు దక్కింది. ఇక విద్యార్థులు అంతగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో భిలాయ్ ఐఐటీ ఉంది. ఈ నేపథ్యంలో సీట్లు పెరిగితే మరింత మంది విద్యార్థులకు అవకాశం దక్కనుంది. ఎన్ఐటీల్లోనూ అవకాశాలు దేశవ్యాప్తంగా ఐఐటీ సీట్లు పెరిగితే ఎన్ఐటీల్లోనూ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల మెరుగైన ర్యాంకులు పొందినవారు ఐఐటీలో చేరుతారు. మరోవైపు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని, ఎక్కువమందికి సీట్లు లభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2022లో వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో 1996 ర్యాంకు వరకు సీటు వస్తే, 2023లో బాలురకు 3115 ర్యాంకు వరకు సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకు సీటు వచ్చే వీలుందంటున్నారు. తిరుచిరాపల్లి ఎన్ఐటీలో బాలురకు 2022లో 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోయాయి. గత ఏడాది మాత్రం బాలురకు 1509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్‌నే ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యతగా కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకు బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకు ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. బయో టెక్నాలజీలో 48 వేల వరకు సీటు వచ్చింది. -
ప్రఖ్యాత విద్యాసంస్థల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మూత్రం నుంచి విద్యుత్
పాలక్కడ్: కాలుష్యకారక శిలాజ ఇంథనాలకు బదులు పునరుత్పాదక ఇంథనంపై ప్రపంచం దృష్టిపెట్టాలన్న ఆకాంక్షల నడుమ ఐఐటీ పాలక్కడ్ పరశోధకులు పునరుత్పాదక ఇంథనాన్ని మూత్రం నుంచి ఉత్పత్తిచేసి ఔరా అనిపించారు. సంబంధిత పరిశోధనా పత్రాన్ని ప్రముఖ ఆన్లైన్ జర్నల్ ‘సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ’లో ప్రచురించారు. ఈ పునరుత్పాదక విద్యుత్ తయారీ కోసం వారు కొత్తగా ఎలక్ట్రో కెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్(ఈఆర్ఆర్ఆర్)ను తయారుచేశారు. ఇందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రోరసాయనిక చర్యల ద్వారా విద్యుత్‌ను, సహజ ఎరువును ఉత్పత్తిచేస్తారు. ఈ విద్యుత్‌తో స్మార్ట్ఫోన్లును చార్జ్చేయొచ్చు. విద్యుత్ దీపాలను వెలిగించవచ్చు. రీసెర్చ్ స్కాలర్ వి.సంగీత, ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీజిత్ పీఎం, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్‌లో రీసెర్చ్ అసోసియేట్ రీను అన్నా కోషీల బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఈఆర్ఆర్ఆర్ ద్వారా నైట్రోజన్, ఫాస్పరస్, మెగ్నీషియంలు ఎక్కువగా ఉండే సహజ ఎరువునూ పొందొచ్చని ఐఐటీ పాలక్కడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమ్మోనియా సంగ్రహణి, క్లోరినేషన్ గది, ఎలక్ట్రికల్ గొట్టాల సమన్వయంతో ఈ రియాక్టర్ పనిచేస్తుంది. ఇందులో మెగ్నీషియంను ఆనోడ్‌గా, గాలి కార్భన్ను కాథోడ్‌గా వాడతారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లో మూత్ర విసర్జన ఎక్కువ. ఇలాంటి చోట్ల ఈ రియాక్టర్ల ద్వారా ఎక్కువ స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేసి అక్కడి విద్యుత్దీపాలను వెలిగించవచ్చు. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగ దశలోనే ఉందని ఐఐటీ పాలక్కడ్ స్పష్టంచేసింది. ఈ టెక్నాలజీపై పేటెంట్ కోసం బృందం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రాజెక్టుకు కేంద్రమే నిధులిచ్చింది. -
మద్రాస్ ఐఐటీలో స్పోర్ట్స్ కోటా
న్యూఢిల్లీ: అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన ఐఐటీగా మద్రాస్ ఐఐటీ నిలిచింది. 2024–25 అకడమిక్ సెషన్ నుంచి ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అదనంగా రెండు సీట్లను ఇందుకోసం సృష్టించాలని నిర్ణయించినట్లు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్(ఎస్ఈఏ) ప్రోగ్రాం కింద సృష్టించిన ఈ రెండు సీట్లలో భారతీయ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో ఒకటి విద్యార్థినులకు రిజర్వు చేస్తామన్నారు. ఐఐటీల్లో ప్రస్తుతం స్పోర్ట్స్ కోటా లేదు. -
ఐఐటీల్లో మరిన్ని సీట్లు.. కటాఫ్ మేజిక్‌లో మార్పు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లను పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులను విద్యార్థులు కోరుకుంటున్నారని చెప్పాయి. కొన్ని ఆన్లైన్ కోర్సులను కూడా అందించాలనే ప్రతిపాదనను ఐఐటీలు చేశాయి. జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్‌లనే కౌన్సెలింగ్‌లో మొదటి ఐచి్ఛకంగా ఎంచుకున్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది కనీసం 4 వేల కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగే వీలుంది. ప్రస్తుతం ఐఐటీల్లో 15 వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. ముంబైకి మొదటి ప్రాధాన్యం సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే ముంబై ఐఐటీకి మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఈ కాలేజీని జేఈఈ అడ్వాన్స్ ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్‌కు ప్రాధాన్యమిచ్చారు. తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ నిలిచింది. ముంబై ఐఐటీల్లో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని ఐఐటీలు భావిస్తున్నాయి. ఎన్ఐటీల్లో చాన్స్ పెరిగేనా? వచ్చే సంవత్సరం ఎన్ఐటీల్లో కటాఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల కొంతమంది ఐఐటీల్లో చేరతారు. మరోవైపు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ 2022లో 1,996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2023లో బాలురకు 3,115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే వీలుంది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్ ను ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం గమనార్హం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. ఈసారి సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. -
గోవా ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికై న శ్రీకాకుళం వాసి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన డాక్టర్ సువ్వారి ఆనందరావు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యో గం సాధించారు. ఆయన స్వస్థలం ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ పరిధిలోని కమ్మవారిపేట గ్రామం. అత్యున్నత ప్రమాణాలు కలిగిన గోవా ఐఐటీ సంస్థలో ఆర్థిక శాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డాక్టర్ ఆనందరావు ఉగ్యోగానికి ఎంపికయ్యాడు. శుక్రవారమే ఆయన బాధ్యతలు స్వీకరించారు. కమ్మవారిపేటకు చెందిన సువ్వారి నీలాచలం, పద్మావతిలు ఆనంద రావు తల్లిదండ్రులు. పాఠశాల స్థాయి నుంచి ఆనందరావు చదువుల్లో చురుగ్గా ఉండేవారు. ప్రాథమిక విద్య అనంతరం ఎకనామిక్స్‌పై ఆసక్తితో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఐఎంఏలో చేరి ఉత్తీర్ణులయ్యారు. అక్కడే క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా ఓ బీమా సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేశారు. అయితే పరిశోధనలపై ఉన్న ఆసక్తితో ‘ఎఫీషియన్సీ అండ్ ఫెర్మార్మన్స్ అసెస్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్యూరెన్స్ ఇండస్ట్రీ, సమ్ న్యూ ఎవిడెన్స్ ఫర్ ఇండియా’ అనే అంశంపై పీహెచ్డీ పూర్తిచేసి చేసి డాక్టరేట్ అందుకున్నారు. అనంతరం ఆయన 2019 జూలై నుంచి 2020 వరకు ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ విభాగంలో అధ్యాపకులుగా పనిచేశా రు. 2020 నవంబరు నుంచి 2023 జనవరి వరకూ ఏపీ ఎస్ఆర్ఎం విశ్వ విద్యాలయంలో సహాయ ఆచార్యునిగా, ఎకనామిక్స్ హెచ్ఓడీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2023 నుంచి హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ) హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచే స్తూ.. తాజాగా ప్రతిష్టాత్మక ఐఐటీ గోవాలో ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇప్పటివరకు ఆయన ప్రచురించిన జర్న ల్స్ అంతర్జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి.