Imprisonment
-
చిన్నారిపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
నెల్లూరు (లీగల్): నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మిక్కిలింపేట గ్రామానికి చెందిన బాలిక 2020 ఫిబ్రవరి 16వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటిముందు ఆడుకుంటుండగా సమీపంలోని ఇంట్లో నివసించే ఉప్పు రవికుమార్ అనే యువకుడు బాలికను ఇంటికి తీసుకుపోయి లైంగిక దాడికి పాల్పడ్డాడు.బాలిక తల్లి అదేరోజు కొడవలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. -
పరువు నష్టం కేసులో ఎంపీ సంజయ్‌రౌత్‌కు 15 రోజులు జైలు
ముంబై: శివసేన(ఉద్దవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో సంజయ్‌రౌత్‌కు ముంబై కోర్టు 15 రోజులు జైలు శిక్ష విధించింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయనకు 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద రౌత్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. ఆయనకు రూ.25 వేలు జరిమానా కూడా విధిస్తున్నట్లు వెల్లడించింది.మేధ సోమయ్య ముంబైలోని రుయా కళాశాలలో ఆర్గానిక్ కెమెస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె యువ ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థ నడుపుతున్నారు. అయితే తన ఎన్జీవతో కలిసి ఆమె రూ.100 కోట్ల మరుగుదొడ్ల కుంభకోణానికి పాల్పడినట్లు రౌత్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలు మీడియాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. చదవండి: ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?.. ఈడీకి సుప్రీం కోర్టు మందలింపువీటిని ఖండించిన కిరీట్ సోమయ్య సతీమణి మేధ.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టును ఆశ్రయించారు. 2022 నుంచి రౌత్ తనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని, అవి పలు పత్రికలు, ఎలక్ట్రానిక్‌తోపాటు సోషల్ మీడియాలోనూ ప్రచురితమయ్యాయని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనతోపాటు తన భర్తపై సంజయ్ రౌత్ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారని చెబుతూ.. పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు సంజయ్ రౌత్ న్యాయవాది, ఆయన సోదరుడు సునీల్ రౌత్ మాట్లడుతూ.. బెయిల్ పిటిషన్ వేస్తామని తెలిపారు. అలాగే ఈ ఉత్తర్వులపై ముంబై సెషన్స్ కోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. -
కోర్టు ధిక్కార కేసులో అధికారులకు జైలు శిక్ష, జరిమానా
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే (ప్రస్తుతం రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి)కు హైకోర్టు రూ.2 వేల జరిమానా విధించింది. ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) ఎస్.శ్రీనివాస్‌కు 2 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యా యమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖర్ శుక్రవా రం తీర్పు వెలువరించారు.వారిద్దరినీ రిజి స్ట్రార్ (జ్యుడీషియల్) ముందు లొంగిపోవాలని ఆదేశించారు. ఈ తీర్పు వెలువడగానే, దీనిని సవాలు చేస్తూ కాంతిలాల్ దండే, శ్రీనివాస్‌లు వేర్వేరుగా ధర్మాసనం ముందు కోర్టు ధిక్కార అప్పీళ్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పు అమలును రెండు వారాలు నిలిపేసింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.పదోన్నతినివ్వడం లేదంటూ పిటిషన్..తన సుదీర్ఘ సర్వీసు ఆధారంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)గా పదోన్నతినివ్వడం లేదంటూ గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) బి.వసంత 2021లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు నాలుగు నెలల్లో ఏఈలు, ఏఈఈలు, డీవైఈఈల సీనియారిటీ జాబితా ఖరారు చేయాలని 2022లో అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయడంలేదంటూ వసంత కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు 1న మరోసారి విచా రణకు రాగా.. న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరావు అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ ఈ నెల 9న తీర్పు ఇచ్చారు. కోర్టుకు హాజరైన ఇరువురు అధికారులు కోర్టు ఆదేశాల అమలుకు మరింత గడువు కోరారు. దీంతో న్యాయమూర్తి తన ఉత్తర్వుల అమలును మూడు వారాలు నిలిపివేశారు. తిరిగి ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా.. గతంలో శిక్ష విధించిన నేపథ్యంలో వెంటనే రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ఇరువురినీ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
రష్యా హక్కుల నేతకు 30 నెలల జైలు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిన తీరును తీవ్రంగా తప్పుబడుతూ వ్యాసాలు రాసిన రష్యా మానవ హక్కుల కార్యకర్తపై అక్కడి కోర్టు కన్నెర్రజేసింది. ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ ఆర్టికల్స్ రాయడం నేరమంటూ 70 ఏళ్ల ఒలెగ్ ఓర్లోవ్‌కు 30 నెలల కారాగార శిక్ష విధిస్తూ మాస్కో కోర్టు తీర్పు చెప్పింది. రాజకీయ దురుద్దేశ్యంతో పెట్టిన కేసు ఇది అని ఆయన చేసిన వాదనలను కోర్టు పట్టించుకోలేదు. ఆయనకు రెండు సంవత్సరాల 11 నెలల జైలు శిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా రెండు సంవత్సరాల ఆరునెలల శిక్షను కోర్టు ఖరారుచేసింది. ఈ కేసులో గతంలోనే విచారణ ముగిసింది. అప్పుడు ఆయనకు కొంతమేర జరిమానా కట్టాలని మాత్రమే కోర్టు సూచించింది. అయితే పుతిన్ ప్రభుత్వంపై విమర్శలను సహించేది లేదని, కఠిన శిక్ష వేయాల్సిందేనని ప్రాసిక్యూషన్ ఈ కేసు పునర్విచారణను కోరి చివరకు ఇలా శిక్ష పడేలా చేసింది. గతంలో నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని అందుకున్న మానవహక్కుల సంస్థ ‘మెమోరియల్’కు ఓర్లోవ్ సహ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఓర్లోవ్‌ను శిక్షించడాన్ని మెమోరియల్ సంస్థ తీవ్రంగా తప్పుబట్టింది. తమ ఉద్యమం ఆగదని పేర్కొంది. -
Toshakhana corruption case: తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ కోర్టు 14 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. విదేశీ నాయకులు ఇచ్చిన ఖరీదైన బహుమతులను విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు ఇమ్రాన్ దంపతులపై అభియోగాలు నమోదయ్యాయి. దర్యాప్తులో అదంతా నిజమేనని తేలడంతో న్యాయస్థానం బుధవారం శిక్ష ఖరారు చేసింది. దోషులకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదంటూ కోర్టు ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు కూడా వేసింది. 1.5 బిలియన్ల జరిమానా చెల్లించాలని ఇమ్రాన్ దంపతులను ఆదేశించింది. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. విదేశాలకు అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి దేశాధినేతలు బహుమతులు ఇస్తుంటారు. అవన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. తోషఖానాలో భద్రపర్చాల్సి ఉంటుంది. ఇమ్రాన్ మాత్రం సొంత ఆస్తిలాగా అమ్మేసుకున్నారు. అధికార రహస్యాల వెల్లడి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మూడు రోజుల క్రితం 10 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. -
బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు
ఢాకా: బంగ్లాదేశ్ ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్(83)కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్ టెలికం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మరీనా సుల్తానా సోమవారం యూనస్‌కు ఆరు నెలల జైలు శిక్ష విస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాదు, తలా రూ.19 వేల జరిమానా విధించారు. అనంతరం వారు పెట్టుకున్న పిటిషన్ల మేరకు నలుగురికీ బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పును వీరు హైకోర్టులో సవాల్ చేసుకునే వీలుంటుంది. ఈ నెల 7న బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
చెక్ బౌన్స్ కేసులో దోషిగా మంత్రి
బెంగళూరు: కర్ణాటక పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ మంత్రి మధు బంగారప్పను చెక్ బౌన్స్ కేసులో ప్రత్యేక కోర్టు దోషిగా తేలి్చంది. ఫిర్యాదుదారులైన రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు రూ.6.96 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆయనను ఆదేశించింది. మరో రూ.10 వేలను కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించాలని స్పష్టం చేసింది. జరిమానా చెల్లించకపోతే ఆరు నెలలపాటు సాధారణ జైలు శిక్ష అనుభించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెట్‌ను మొదటి నిందితులుగా, ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధు బంగారప్ప రెండో నిందితుడిగా కోర్టు గుర్తించింది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ నుంచి మధు బంగారప్ప రూ.6 కోట్లు డిపాజిట్ రూపంలో తీసుకున్నారు. చాలా రోజులు తిరిగి చెల్లించలేదు. గట్టిగా నిలదీయగా చెక్కు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయ్యింది. దాంతో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. -
జైలు నుంచే చదువు.. పీజీ గోల్డ్ మెడల్ కైవశం
కోవెలకుంట్ల: జైలు శిక్షపడిన యువ ఖైదీ అక్కడి అధికారుల సహకారం, పట్టుదలతో లా కోర్సు చదివి న్యాయవాద పట్టాతో తన తండ్రిని నిర్దోషిగా నిరూపించేందుకు న్యాయస్థానంలో వాదించి గెలిచిన ఘటనను 20 ఏళ్ల క్రితం స్టూడెంట్ నంబర్ –1 సినిమాలో చూశాం. అదే తరహాలో యావజ్జీవ కారాగార శిక్షపడిన ఓ యువకుడు నిజ జీవితంలో విజయం సాధించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన దూదేకుల నడిపి మాబుసా, మాబున్నీ కుమారుడు మహమ్మద్ రఫీ 2014లో బీటెక్ చదివేవాడు. ఆ సమయంలో ప్రేమ వ్యవహారంలో ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి హత్యకు కారకుడని భావించి ఆ యువకుడిపై పోలీస్‌స్టేషన్‌లో హత్యకేసు నమోదైంది. కోర్టులో విచారణ అనంతరం 2019 జూలై నెలలో రఫీకి జీవితఖైదు విధించారు. అప్పటి నుంచి కడప కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఖైదీలను సైతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అక్కడి జైలు అధికారులు చదువుపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించారు. పది చదివిన వారిని దూర విద్య కోర్సుల ద్వారా పై చదువులకు ప్రోత్సహించారు. శిక్షపడే నాటికే డిగ్రీ పూర్తి చేసిన మహమ్మద్ రఫీకి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, ఇతర జైలు అధికారులు ప్రోత్సాహమందించారు. 2020లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేసేందుకు అవకాశం కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకు మహమ్మద్ రఫీ ఎంఏ సోషియాలజీలో అడ్మిషన్ పొందాడు. వివిధ రకాల పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను సమకూర్చుకుని జైలులోనే నాలుగు గోడల మధ్య కష్టపడి చదివాడు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు 2022లో పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని యూనివర్సిటీ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎంఏ సోషియాలజీలో మొదటి ర్యాంకుతో గోల్డ్ మెడల్ కైవశం చేసుకున్నాడు. జైలులో ఉంటున్న రఫీకి పీజీ పట్టా గోల్డ్ మెడల్ ప్రదానం చేయాలని యూనివర్సిటీ అధికారులు ఇటీవల జైలు అధికారులకు సమాచారం అందించారు. కోర్టు అనుమతితో నాలుగు రోజులు బెయిల్ మంజూరు కావడంతో గురువారం హైదరాబాద్‌లోని అంబేడ్కర్ యూనివర్సిటీలో వైస్ చాన్స్‌లర్ జగదీశ్ ఆధ్వర్యంలో గోల్డ్‌మెడల్ బహూకరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ తన జీవితం జైలు పాలైనప్పటికీ చదువుపై ఉన్న మమకారంతో పట్టుదలతో పీజీ సాధించానన్నారు. తన తల్లిదండ్రులకు ఈ గోల్డ్‌మెడల్ అంకితం చేస్తున్నట్లు తెలిపారు. -
ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణ శిక్ష రద్దు
న్యూఢిల్లీ: ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణ శిక్ష పడిన 8 మంది భారత నావికాదళం మాజీ అధికారులకు భారీ ఊరట లభించింది. వారికి విధించిన మరణ శిక్షను ఖతార్ అప్పిలేట్ కోర్టు రద్దు చేసింది. ఈ శిక్షను కేవలం జైలు శిక్షగా మారుస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. అయితే, వారు ఎంతకాలం జైలులో శిక్ష అనుభవించాలన్నది తెలియరాలేదు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ కేసులో ఖతార్ కోర్టు 8 మందికి శిక్షను తగ్గించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. గూఢచర్యం కేసులో 8 మంది నేవీ మాజీ అధికారులు 2022 ఆగస్టులో ఖతార్‌లో అరెస్టయ్యారు. అప్పిలేట్ కోర్టు తాజా తీర్పును భారత దౌత్య విజయంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాప్–28 సదస్సు సందర్భంగా ఇటీవల దుబాయ్‌లో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్–థానీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖతార్‌లో 8 మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష గురించి ఈ భేటీలో మోదీ ప్రస్తావించినట్లు సమాచారం. శిక్ష నుంచి వారికి విముక్తి కలి్పంచాలంటూ మోదీ చేసిన విజ్ఞప్తి పట్ల ఖతార్ పాలకులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమంపై అల్–థానీతో చర్చించినట్లు ఈ భేటీ తర్వాత మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరణ శిక్షను రద్దు చేసి, జైలు శిక్షగా కుదిస్తూ ఖతార్ కోర్టు తీర్పు ప్రకటించింది. బాధితులకు అండగా ఉంటాం ఖతార్ కోర్టు తాజా తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. తదుపరి చర్యల విషయంలో న్యాయ నిపుణులతో, బాధితుల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. కోర్టులో గురువారం జరిగిన విచారణకు ఖతార్‌లోని భారత రాయబారి, ఇతర అధికారులు, బాధితుల కుటుంబ సభ్యులు కొందరు హాజరయ్యారని తెలియజేసింది. బాధితులకు అండగా ఉంటామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టంచేసింది. ఏమిటీ కేసు? 8 మంది భారత మాజీ అధికారులు ఖతార్ రాజధాని దోహాకు చెందిన అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఈ సంస్థ ఖతార్ సైనిక దళాలకు, సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇస్తోంది. ఇతర సేవలు అందిస్తోంది. అల్–దాహ్రా సంస్థలో పని చేస్తున్న 8 మంది భారతీయులను గత ఏడాది ఆగస్టులో ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ దేశ రహస్యాలను చోరీ చేస్తున్నట్లు వారిపై అభియోగాలు మోపారు. ఇతర దేశాలకు సమాచారం చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. అయితే, ఈ అభియోగాలను బహిరంగపర్చలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఖతార్ కోర్టు 8 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచి్చంది. దీంతో భారత ప్రభుత్వం న్యాయ పోరాటం ప్రారంభించింది. శిక్షను వ్యతిరేకిస్తూ ఖతార్‌లోని కోర్టు ఆఫ్ అప్పీల్‌ను ఆశ్రయించింది. ఖతార్‌లో శిక్ష పడిన వారిలో నవతేజ్ గిల్, సౌరభ్ వశి‹Ù్ట, పూర్ణేందు తివారీ, అమిత్ నాగ్‌పాల్, ఎస్.కె.గుప్తా, బి.కె.వర్మ, సుగుణాకర్ పాకాల, సైలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ పాకాల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవారు. -
ఇన్నేళ్ళకు న్యాయం!
మూడు దశాబ్దాల పైచిలుకు క్రితం కేసులో బాధితులకు ఎట్టకేలకు కాసింత ఊరట దక్కింది. పోలీసుల దమనకాండకు ప్రతిరూపమైన తమిళనాడు వాచాత్తి ఘటనలో సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ రకంగా చిరకాలం గుర్తుండిపోతుంది. మారుమూల గ్రామంలోని గిరిజనులపై దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన కేసు అది. అటవీ, పోలీసు అధికారులతో సహా మొత్తం 269 మంది దోషులంటూ కింది కోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. దోషులు పైకోర్టును ఆశ్రయించి, జాగు చేశారు. తాజాగా మద్రాస్ హైకోర్ట్ ఆ అప్పీళ్ళను కొట్టివేసింది. కింది కోర్ట్ తీర్పును హైకోర్ట్ సమర్థించడమే కాక, 215 మందినీ దోషులుగా తీర్మానిస్తూ, ఒక్కొక్కరికీ 1 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితులకు ఇన్నాళ్ళకైనా న్యాయం దక్కిందనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మిగులుతోంది. నిజానికి, తమిళనాట ధర్మపురి జిల్లాలో తూర్పు కనుమల్లో నెలకొన్న గిరిజన గ్రామం వాచాత్తి గురించి ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎవరూ విననైనా విని ఉండరు. కేవలం 655 మంది, అందులోనూ 643 మంది మలయాళీ షెడ్యూల్డ్ తెగల వారున్న 200 గడపల గ్రామం అది. కానీ, ఆ రోజు జరిగిన ఆ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు, అటవీ అధికారులు గ్రామంపై దాడి చేశారు. అక్కడ గిరిజనులపై సాగించిన అమానుషం, బడికెళ్ళే ఓ చిన్నారి సహా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారం, తాగునీటిలో విషం కలిపిన తీరు, పశువుల్ని ఊచకోత కోసి ఊరి బావిలో పడేసిన వైనం... ఆ గ్రామం రూపురేఖల్నే మార్చేశాయి. ‘గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్రామం’ అని ముద్రవేస్తూ అమాయకులపై అధికారులు సాగించిన ఆ దమనకాండ ఓ మాయని మచ్చ. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లోతుగా విచారించి అధికారుల తప్పు తేల్చినా, ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వచ్చిన న్యాయం ఇన్నాళ్ళకు దక్కింది. బాధితులకు కాస్తయినా ఊరట దక్కింది. 1992 జూన్ 20 నుంచి మూడు రోజులు సాగిన అమానుష ఘటనలో మొత్తం 269 మంది నిందితులు కాగా, వారిలో 54 మంది న్యాయ విచారణ కాలంలోనే కన్నుమూశారు. మిగిలినవారికి ఇప్పుడు శిక్ష పడింది. ఈ కథ ఇక్కడి దాకా రావడం వెనుక న్యాయం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటం ఉంది. అప్పట్లో అధికారులపై కేసులు నమోదు కాకపోగా, గిరిజనులపైనే స్థానిక పోలీసులు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. గిరిజనులు తమ ఇళ్ళను తామే ధ్వంసం చేసుకున్నారని అధికారులు బుకాయించారు. హైకోర్ట్ ఆదేశిస్తే గానీ చివరకు సీబీఐ దర్యాప్తు జరగలేదు. అంతరాయాలతో విచారణ సుదీర్ఘంగా 19 ఏళ్ళు సాగి, చివరకు 2011లో ధర్మపురి సెషన్స్ కోర్ట్ అధికారులను దోషులుగా తేల్చి, శిక్ష వేసింది. దోషులు మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించడంతో మరో 11 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఈ కేసు విచారణ సత్వరమే పూర్తి చేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు ఈ ఏడాది మొదట్లో పట్టుబట్టడంతో ఇప్పటికైనా కథ ఓ కొలిక్కి వచ్చింది. చిత్రం ఏమిటంటే – వాచాత్తి దమన కాండపై అప్పట్లోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు అలాంటి నేరాలకు పాల్పడరంటూ జడ్జి దాన్ని కొట్టేయడం! జయలలిత సారథ్యంలోని అప్పటి అన్నాడీఎంకె పాలకులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారంలో ఉన్న డీఎంకె, అన్నాడీఎంకె సర్కార్లూ తమ బ్యూరోక్రాట్లకు కాపు కాసేందుకే ప్రయత్నించాయి. కొందరు ఉద్యమకారులు, లాయర్లు, నిజాయతీపరులైన అధికారులు, జడ్జీల వల్ల చివరకు న్యాయం జరిగింది. అత్యాచార బాధితులు పట్టువిడవకుండా పోరాడడంతో ఇప్పటికైనా సత్యం గెలిచింది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ధర్మం నిలిచింది. కేవలం 655 మంది ఆదివాసీలు బలమైన రాజ్యవ్యవస్థతో తలపడి, విజయం సాధించడం చరిత్రాత్మకం. ఆ రకంగా ఇది బలవంతులపై బలహీనుల గెలుపు. ఆదివాసీల హక్కుల గెలుపు. న్యాయవ్యవస్థ స్వతంత్రమనీ, పాలకుల తప్పులను సైతం సహించదనీ రుజువైంది. ఎస్సీ– ఎస్టీ చట్టం ఇప్పటికీ బలంగానే ఉందని తేలింది. అయితే, నేటికీ కొనసాగుతున్న అనేక దమనకాండ కేసుల్లో ఇంత సుదీర్ఘ పోరాటం, సత్యాన్ని వెలికితీసి దోషులకు శిక్షపడేలా బృహత్ యత్నం సాధ్యమేనా? న్యాయం దక్కడంలో ఆలస్యమైతే, న్యాయం చేయనట్టే! వాచాత్తి ఘటనలో అపరిమిత ఆలస్యమైంది. దోషుల్లో పలువురు బెయిల్‌పై బయట గడిపి, ఉద్యోగ ప్రయోజనాలన్నీ పొంది, హాయిగా రిటైరయ్యారు. ఇప్పటికైనా దోషులను శిక్షించడమే కాక, బాధితులకు తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాలిస్తే సరిపోదు. నలుగురిలో గౌరవంగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వలసవాద బ్రిటీషు పాలన లక్షణాలను పోలీసులు, అధికారులు ఇప్పటికైనా వదిలించుకొంటే మేలు. తమిళనాట గిరిజనులపై అమానుషాల నుంచి మిజోరమ్‌లో గ్రామాల దహనం, కశ్మీర్లో నిర సనకారులపై కాల్పుల దాకా దశాబ్దాలుగా చూస్తున్నవే. బ్రిటీషు దౌర్జన్యానికి మన భారతీయ పోలీ సులు వారసులుగా మారిన వైనానికి ఇవి ప్రతీకలు. పదే పదే సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలు. అందుకే, ‘‘దాడుల పేరిట చట్టవ్యతిరేక చర్యలకు’’ పోలీసులు బరి తెగించడం దుస్సహమని కోర్ట్ అన్న మాట కీలకం. నిన్నటికి నిన్న కూడా వార్తల్లో కనిపిస్తున్న ఇళ్ళపై దుర్మార్గ దాడుల ధోరణిని వ్యవస్థ సత్వరమే వదిలించుకోవాలి. వాచాత్తి కేసు గుర్తుచేస్తున్న పాఠం అదే! -
కామాంధులకు 20 ఏళ్ల జైలు, జరిమానా
కామంతో కళ్లు మూసుకు పోయి అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు కామాం ధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పులిచ్చాయి. కర్నూలు(లీగల్)/పార్వతీపురంటౌన్/అనంతపురం: కామంతో కళ్లు మూసుకుపోయి వేర్వేరు ప్రాంతాలకు చెందిన అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన ముగ్గురు కామాంధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పునిచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామానికి చెందిన పెరుమాళ్ల వెంకటేశ్వర్లు కుమార్తె (17) నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉండేది. 2019 నవంబర్ 12వ తేదీన కళాశాల నుంచి ఇంటికి వచ్చిన కుమార్తెను భయపెట్టి మధ్యాహ్నం సమయంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పదిరోజుల అనంతరం తన తండ్రి చేసిన అఘాయిత్యం గురించి తల్లికి చెప్పింది. దీంతో తల్లి, కుమార్తె నందివర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి వెంకటేశ్వర్లుపై పోక్సో చట్టం, ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలు జిల్లా పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలసలోని ఓ పాఠశాలలో నాలుగోతరగతి చదువుతున్న చిన్నారిని విడిచిపెట్టి తల్లి ఎటో వెళ్లిపోయింది. చిన్నారి ఐరన్ షాపులో పనిచేస్తున్న తండ్రి వద్దనే ఉంటూ చదువుకుంటోంది. 2022 సంవత్సరం జూలై నెలలో చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారం రోజుల తరువాత చిన్నారి పుట్టినరోజు సందర్భంగా నిందితుడు కేక్ తెచ్చాడు. దీంతో చిన్నారి తన స్నేహితురాలిని ఇంటికి ఆహ్వానించింది. బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాలు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిద్రపోతుండగా ఇద్దరిపైనా కసాయి తండ్రి లైంగికదాడికి యత్నించాడు. చిన్నారులు ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టాడు. విషయాన్ని బాధితురాలి స్నేహితురాలు తన తల్లికి చెప్పింది. వెంటనే ఆమె ఇద్దరు బాలికలను తీసుకెళ్లి రెండు ఘటనలపైనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ కేసు నమోదు చేశారు. రెండు కేసుల్లోనూ నేరం రుజువు కావడంతో ఎస్సీ, ఎస్టీ పోక్సోకోర్టు ఇన్చార్జి జడ్జి షేక్‌సికిందర్ బాషా ముద్దాయికి ఒక్కో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధిత చిన్నారులు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ వివరాలను పార్వతీపురం మన్యం జిల్లాఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. అదే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామంలో తల్లిదండ్రులతో కలసి 13 ఏళ్ల బాలిక ఉండేది. 2019 ఆగస్టు 7వ తేదీన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పూజారి ఈశ్వరయ్య అనే వ్యక్తి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు గోరంట్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ముద్దాయిపై అభియోగాలు రుజువు కావడంతో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష , రూ.5 వేల జరిమానా విధిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. -
బీజేపీ ఎంపీకి బిగ్ షాక్.. రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
BJP MP Ramshankar Katheria.. లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ ఎంపీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన లోక్‌సభకు అనర్హుడయ్యే అవకాశం కూడా ఉంది. అయితే, సదురు ఎంపీకి ఓ వ్యక్తిపై దాడి కేసులో కోర్టు జైలు విధించడం విశేషం. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఇతావా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రామ్ శంకర్ కటారియాకు ఆగ్రా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసులో కటారియాకు కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పును వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ నుంచి అనర్హత వేటు పడే అవకాశమున్నది. కాగా, 2011లో ఆగ్రాలోని విద్యుత్ సరఫరా కంపెనీ మేనేజర్‌పై తన అనుచరులతో కలిసి దాడి చేశారు. నాడు ఆగ్రా ఎంపీగా ఉన్న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, 12 ఏళ్ల నాటి దాడి కేసుపై ఆగ్రా కోర్టు విచారణ జరిపింది. రామ్ శంకర్ కటారియాను దోషిగా నిర్ధారించింది. రెండేళ్లు జైలు శిక్షతోపాటు రూ.50,000 జరిమానా విధించింది. ఇదిలా ఉండగా.. కోర్టు తీర్పుపై బీజేపీ ఎంపీ రామ్ శంకర్ స్పందించారు. కోర్టు తీర్పును గౌరవిస్తానని తెలిపారు. అయితే రెండేళ్ల జైలు శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన న్యాయ విధానాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రామ్ శంకర్ కటారియా నవంబర్ 2014 నుండి జూలై 2016 వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. అతను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆఫ్ డిఫెన్స్ మరియు కన్సల్టేటివ్ కమిటీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సభ్యుడుగా కొనసాగారు. #WATCH | "...I appeared before the court normally. Court has given a decision against me today. I respect the court, I have the right to appeal and I will exercise it," says BJP MP Ramshankar Katheria #RamshankarKatheria pic.twitter.com/QVmx8pfcAX — NewsMobile (@NewsMobileIndia) August 5, 2023 ఇది కూడా చదవండి: గుజరాత్లో బీజేపీకి షాక్.. జనరల్ సెక్రెటరీ ప్రదీప్ గుడ్ బై -
బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఆటో డ్రైవర్‌కు 15 ఏళ్లు జైలు
విశాఖ లీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆటోడ్రైవర్‌కు 15 ఏళ్లు జైలుశిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ విశాఖ నగరంలోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనందిని గురువారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద బాలికకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి సూచించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాల మేరకు... విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రాంజీ ఎస్టేట్‌కు చెందిన పదహారేళ్ల బాలిక 2016లో నగరంలోని రామా టాకీసు వద్ద ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది. మరికొందరు బాలికలతో కలిసి ఆమె ప్రతి రోజు ఆటోలో కళాశాలకు వెళ్లేది. ఈ క్రమంలో 2016, సెప్టెంబర్ 29న ఆటో డ్రైవర్ సాయిగణేష్(25) ఆ బాలికను ఒంటరిగా రామాటాకీస్ దగ్గర నుంచి పోర్టు స్టేడియం రోడ్డు మీదుగా అక్కయ్యపాలెం పైపుల సందులోకి తీసుకువెళ్లాడు. అక్కడ బాలికతో వికృతంగా ప్రవర్తించి లైంగిక దాడి చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తిరిగి ఆటోలో తీసుకువచ్చి ఆమె ఇంటి దగ్గర వదలిపెట్టాడు. ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి తెలియజేసింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తొలుత ఆమెను సెవెన్ హిల్స్ ఆస్పత్రికి, ఆ తర్వాత కేజీహెచ్‌కి తరలించి చికిత్స చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విశాఖ నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేశారు. అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో 15 ఏళ్లు జైలు శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
అంగ్ సాన్ సూకీ జైలు శిక్ష తగ్గింపు
బ్యాంకాక్: పదవీచ్యుతురాలైన అంగ్ సాన్ సూకీ(78) జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. రెండున్నరేళ్ల క్రితం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సైనిక పాలకులు కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అనంతరం సూకీపై 19 నేరారోపణలు మోపారు. వీటిలో కొన్నిటిపై విచారణ జరిపిన సైనిక కోర్టులు సూకీకి 33 ఏళ్ల జైలు శిక్షలు విధించాయి. బౌద్ధులు మెజారిటీగా ఉన్న మయన్మార్‌లో మంగళవారం ‘గౌతమ బుద్ధుని మొదటి ఉపన్యాస’దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ సందర్భంగా మిలటరీ కౌన్సిల్ చీఫ్, సీనియర్ జనరల్ మిన్ సుమారు 7 వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. వీరిలో సూకీ, మాజీ అధ్యక్షుడు విన్‌మింట్ ఉన్నారు. సూకీకి ఆరేళ్ల జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం, ఆమె మరో 27 ఏళ్లపాటు జైలు జీవితం గడపాలి. -
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు: నలుగురికి పదేళ్ల జైలు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్‌లో దిల్సుఖ్నగర్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన నలుగురికి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బుధవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిలో డానిశ్ అన్సారీ, అఫ్తాబ్ ఆలం (బిహార్), ఇమ్రాన్ ఖాన్ (మహారాష్ట్ర), ఒబైదుర్ రెహా్మన్ (హైదరాబాద్) ఉన్నారు. వీరికి 2006 వారణాసి పేలుళ్లకు, 2007 ఫైజాబాద్, లక్నో పేలుళ్లు, 2008 జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్ వరుస పేలుళ్లు, 2010 బెంగళూరు స్టేడియం పేలుడు, 2013 హైదరాబాద్ జంట పేలుళ్లతో సంబంధాలున్నట్టు ఎన్ఐఏ పేర్కొంది. పాకిస్తాన్‌కు చెందిన కుట్రదారులతో కలిసి పథక రచన చేసినట్టు వివరించింది. ఈ కేసుల్లో ప్రత్యేక కోర్టు ఇప్పటికే యాసిన్ భక్తల్ తదితరులపై అభియోగాలు మోపడం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఢిల్లీ వీరిని 2013 జనవరి–మార్చి మధ్య అరెస్టు చేసింది. చదవండి: Chandrayaan-3: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! -
దేశద్రోహానికి ఏడేళ్ల జైలు శిక్ష
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసుల్లో దోషులకు విధించే జైలుశిక్షను కనిష్టంగా మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ పెంచాలని భారత న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. దీనివల్ల నేర తీవ్రతను బట్టి శిక్ష విధించే అవకాశం న్యాయస్థానాలకు లభిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఈ నివేదికను న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూరాజ్ అవస్థీ (రిటైర్డ్) ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్కు సమర్పించారు. దేశద్రోహానికి జైలు శిక్షను ఏడేళ్లకు పెంచాలంటూ న్యాయ కమిషన్ సిఫార్సు చేయడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తప్పుబట్టారు. దేశద్రోహ చట్టాన్ని మరింత క్రూరంగా మార్చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మెక్సికోలో కలకలం.. -
సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’
సూరత్: మోదీ ఇంటి పేరును అనుచితంగా వాడారనే పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వేటును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరఫున ఆయన న్యాయవాదులు గురువారం సూరత్ కోర్టులో వాదనలు వినిపించారు. ‘ నేర నిరూపణ విధానం సవ్యంగా లేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టు జడ్జి అసమతుల్య సాక్ష్యాధారాలను ఆధారం చేసుకుని తీర్పు చెప్పారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో మొత్తం కేసు ఆధారపడింది. రాఫెల్ కేసులో రాహుల్ చెప్పిన బేషరతు క్షమాపణ అంశాన్ని ఈ కేసుకు సంబంధంలేకున్నా ఇందులో జతచేశారు. మరీ ఇంత పెద్ద శిక్షా ?. ఈ కేసులో గరిష్ట శిక్షను అమలుచేయాల్సిన అవసరం లేదు’ అని అదనపు సెషన్స్ జడ్జి ఆర్పీ మొగెరా ముందు రాహుల్ లాయర్ ఆర్ఎస్ ఛీమా వాదించారు. శిక్షను నిలుపుదల చేయాలని కోరారు. ‘ దొంగలందరి ఇంటి పేరు మోదీ అనే ఎందుకుంది? అనే ప్రసంగం చేసే నాటికి రాహుల్ దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారు. దేశ ప్రజలపై ఆయన ప్రసంగ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రసంగాన్ని సంచలనం చేయాలనేది ఆయన ఉద్దేశ్యం. ఇలాంటి పరువునష్టం కేసులు ఆయన వేర్వేరు చోట్ల చాలా ఎదుర్కొంటున్నారు. రాఫెల్ కేసులో అనుచిత వ్యాఖ్యలు, ఆనక క్షమాపణల తర్వాతా ఆయన ఇలాంటి ప్రసంగాలు చేశారు’ అని పరువునష్టం కేసు వేసిన పూర్ణేశ్ మోదీ తరఫు లాయర్ హర్షిత్ తోలియా వాదించారు. తర్వాత జడ్జి తీర్పును 20వ తేదీకి వాయిదావేశారు. -
సత్ప్రవర్తనతో రెండు నెలల ముందే... సిద్ధూ విడుదల
పటియాలా: పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ జైలుశిక్ష ముగించుకుని శనివారం పటియాలా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. బయటకు రాగానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను బానిసలుగా తమ ఇష్టానికి వాడుకుంటున్నారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆప్ నేత, సీఎం భగవంత్ మాన్‌ను అక్బారీ (పత్రికల్లో ప్రకటనలిచ్చే) ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. రాష్ట్రం శాంతిభద్రతలు, రుణాల సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. ‘దేశాన్ని నిరంకుశ పాలన పట్టిపీడించిన ప్రతిసారి దేశంలో విప్లవం పుట్టుకొస్తుంది. అలా ఈసారి పుట్టుకొచ్చిన విప్లవమే రాహుల్ గాంధీ’ అని సిద్ధూ వ్యాఖ్యానించారు. 1988లో ఒక రోడ్డు ప్రమాద గొడవలో ఘర్షణ పడటంతో ఒకరి మృతికి కారణమైన నేరానికి సిద్ధూకు సుప్రీంకోర్టు గత ఏడాది మేనెలలో ఒక ఏడాదిపాటు జైలుశిక్ష విధించిన విషయం విదితమే. సత్ప్రవర్తన కారణంగా సిద్ధూ 10 నెలలకే విడుదలయ్యారని ఆయన న్యాయవాది తెలిపారు. సిద్ధూ విడుదల సందర్భంగా జైలు ప్రాంతం ఆయన మద్దతుదారులతో నిండిపోయింది. -
కీచక తండ్రికి మరణించే దాకా జైలుశిక్ష
బంజారాహిల్స్: కన్నకూతురికి భోజనంలో నిద్రమాత్రలు కలిపి తినిపించి ఆమె నిద్రపోయాక కొంతకాలంపాటు అత్యాచారానికి పాల్పడిన కీచక తండ్రికి న్యాయస్థానం మరణించే వరకు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలసవచ్చింది. కుటుంబ పెద్ద జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్ వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. 2003లో వివాహమైన ఈ దంపతులకు 16 ఏళ్ల కూతురు, 14 ఏళ్ల కొడుకు ఉన్నారు. సొంత జిల్లాలోని బంధువుల ఇంట్లో కొడుకు 8వ తరగతి చదువుతుండగా కూతురు తల్లిదండ్రుల వద్దే ఉంటూ 9వ తరగతి మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. 2021 జూలై 16న కూతురు తీవ్ర అనారోగ్యానికి గురై వాంతులు చేసుకోగా ఆందోళన చెందిన తల్లి నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి నాలుగు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కూతురిని నిలదీయగా తండ్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి తినిపించి నిద్రపోయాక అత్యాచారానికి పాల్పడేవాడని చెప్పింది. నిద్రలోంచి లేచి చూసుకుంటే తన ఒంటిపై బట్టలుండేవి కావని, ఒళ్లంతా నొప్పులు ఉండేవని వివరించింది. ఓసారి మద్యం మత్తులో ఇంటికొచ్చి మరోసారి లైంగికదాడికి పాల్పడ్డాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించడంతో భయపడి మిన్నకుండిపోయానని రోదించింది. ఈ ఉదంతంపై బాధితు రాలి తల్లి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడు వెంకటరమణను అరెస్టుచేసి నాంపల్లిలోని 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. వెంకటరమణపై పక్కా ఆధారాలు సమర్పించారు. వాదనలు విన్న జడ్జి అనిత శుక్రవారం వెంకటరమణను దోషిగా తేల్చి అతనికి మరణించే వరకు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
80 ఏళ్ల వయసులో వెంటాడిన జైలు శిక్ష
సాక్షి, అమరావతి: ఓ ప్రధానోపాధ్యాయుడి నుంచి రూ.5 వేల లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ అధికారులు 25 ఏళ్ల క్రితం పెట్టిన కేసు ఓ మాజీ ఎంపీడీవోను వృద్ధాప్యంలోనూ వెంటాడింది. 80 ఏళ్ల వయసులో ఆ అధికారి జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురైంది. తన వయసు 80 ఏళ్లని.. అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపిన ఆ మాజీ ఎంపీడీవో.. తనను కనికరించాలని అభ్యర్థించాడు. నిర్ధ్వందంగా తిరస్కరించిన హైకోర్టు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే గరిష్ట శిక్షతో కాకుండా కనిష్ట శిక్షతో సరిపెట్టింది. లంచం తీసుకున్నందుకు ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. అప్పటి అధికారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద 6 నెలల జైలు, రూ.5వేల జరిమానా విధించింది. అలాగే సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు శుక్రవారం తీర్పు వెలువరించారు. విధుల్లోకి చేర్చుకునేందుకు లంచం డిమాండ్ కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన యూవీ శేషారావు అప్పట్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసే వారు. ఆయనకు అదే జిల్లాలోని నడిమ తిరువూరు పాఠశాలకు బదిలీ కావడంతో.. విధుల్లో చేరేందుకు వెళ్లిన శేషారావును విధుల్లో చేర్చుకోలేదు. దీంతో ఆయన పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయడంతో పాటు జీతం బకాయిలను ఇప్పించాలని కోరుతూ శేషారావు అప్పటి తిరువూరు ఎంపీడీవో బత్తిన వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లారు. ఇందుకు వెంకటేశ్వరరావు రూ.5 వేల లంచం అడిగారు. ఇవ్వలేనని చెప్పినా వినలేదు. దీంతో శేషారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శేషారావు నుంచి లంచం తీసుకుంటుండగా ఎంపీడీవో వెంకటేశ్వరరావును ఏసీబీ అధికారులు 1998లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు లంచం తీసుకున్నారనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ వెంకటేశ్వరరావుపై ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ 2005లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ అధికారులు 2007లో హైకోర్టులో అప్పీల్ చేశారు. అప్పటి తీర్పును తప్పుపట్టిన హైకోర్టు ఈ అప్పీల్‌పై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు విచారణ జరిపి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పును తప్పుపట్టారు. వెంకటేశ్వరరావు లంచం తీసుకున్నారనేందుకు ఆధారాలు ఉన్నాయని తేల్చారు. లంచం డిమాండ్ చేశారనేందుకు, లంచం తీసుకున్నారనేందుకు ఏసీబీ అధికారులు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచారని తెలిపారు. ఈ సాక్ష్యాధారాలను ఏసీబీ ప్రత్యేక కోర్టు సరైన కోణంలో విశ్లేషించలేదని ఆక్షేపించారు. వాదనల సమయంలో తన వయసు 80 ఏళ్లని, అనారోగ్యంతో బాధపడుతున్నానని వెంకటేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను తోసిపుచ్చుతున్నట్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే అవినీతి నిరోధక చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షకు బదులు కనిష్ట శిక్ష విధిస్తున్నట్టు పేర్కొన్నారు. సెక్షన్ 7 కింద 6 నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా, సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. -
ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలూకా, ఇరుంజీ గ్రామానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ధనపాల్ రాజా కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.పది లక్షల జరిమానా విధిస్తూ రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ కోర్టు జడ్జి నాగరాజు సోమవారం తీర్పు చెప్పినట్లు ఆ కోర్టు ఏపీపీ కె.నగేష్ తెలిపారు. కోర్టు కానిస్టేబుళ్లు నందకుమార్, శివకుమార్ తెలిపిన కేసులోని వివరాల మేరకు.. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం దుంగల రక్షణ కోసం ఎస్వీఎన్పీ శ్యామల రేంజ్ నాగపట్ల సెక్షన్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ హరిబాబు, సిబ్బంది 2016 ఆగస్టు 29వ తేదీ సాయంత్రం కూంబింగ్ నిర్వహించారు. చెట్లు నరుకుతున్న శబ్దం విని పోలీసులు తోళ్లగుంట రిజర్వు ఫారెస్ట్ వద్దకు వెళ్లగా సుమారు 20 నుంచి 30 మంది స్మగ్లర్లు పోలీసులపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు తమ రక్షణ కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పరారయ్యారు. 2016 ఆగస్టు 30వ తేదీ రాత్రి పోలీసులు అదే ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి నిందితుడు ధనపాల్ రాజాని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి నిందితుడు ధనపాల్ రాజాకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా సొమ్ము చెల్లించని యెడల మరో రెండేళ్లు అధికంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. -
జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు
చండీగఢ్: తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ అరాచకాలు సాగించిన జిలేబీ బాబా అలియాస్ అమర్‌వీర్ అలియాస్ బిల్లూ అలియాస్ అమర్‌పురి (63) పాపం పండింది. 100 మందికిపైగా మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఓ బాలికపై రెండు సార్లు అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం సెక్షన్ 6 కింద అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు హరియాణాలోని ఫతేహాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా జడ్జి బల్వంత్‌సింగ్ బుధవారం ప్రకటించారు. జిలేబీ బాబాను హరియాణా పోలీసులు 2018లో అరెస్టు చేశారు. అతడి ఫోన్లో 120కి పైగా అశ్లీల వీడియో క్లిప్పింగ్‌లను గుర్తించారు. జిలేబీ బాబా హరియాణాలోని తోహన్ పట్టణంలో బాబా బాలక్‌నాథ్ మందిరం అధినేతగా ప్రాచుర్యం పొందాడు. మహిళలకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారం చేయడం, ఆ దురాగతాన్ని వీడియోలో చిత్రీకరించడం, వాటిని చూపి బ్లాక్మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజడం అతని స్టైల్. -
ధన బ్యాంక్ కేసులో 21 మందికి పదేళ్ల శిక్ష
ఏలూరు (టూటౌన్): డిపాజిటర్లకు రూ.3 కోట్లు ఎగవేసిన ఏలూరు ధన బ్యాంక్ కేసులో 21 మందికి పదేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ ఏలూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి కోర్టు న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్ సోమవారం తీర్పునిచ్చారు. దీంతోపాటు ఒక్కొక్కరికీ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి డిపాజిటర్స్ యాక్ట్ కేసులో ముద్దాయిలకు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో 20 ఏళ్ల న్యాయపోరాటం ఫలించింది. కేసు పూర్వాపరాలివీ.. జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ప్రత్యేక పీపీ లామ్ అజయ్ ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 2002లో ఏలూరు టూటౌన్ పరిధిలోని ధన బ్యాంక్ పలువురు డిపాజిటర్లకు రూ.3 కోట్లను చెల్లించకుండా మోసం చేసింది. అప్పట్లో ధన బ్యాంక్‌కు చెందిన మొత్తం 27 మందిపై ఎస్సై ఎం.సుధాకర్ కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ బి.పెద్దయ్య ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేశారు. మొత్తం 27 మంది ముద్దాయిల్లో ఐదుగురు చనిపోగా.. ఒకరు పరారీలో ఉండటంతో మిగిలిన 21 మందికి న్యాయమూర్తి శిక్షను ఖరారు చేశారు. శిక్షపడిన వారిలో రావూరి సత్యసాగర్ (బ్యాంక్ చైర్మన్), తల్లాప్రగడ నాగేంద్రప్రసాద్, గోలి కృష్ణకుమారి, అమ్మనమంచి శివాజీ, రావిపాటి వీరవెంకట రామారావు, బాదంపూడి లక్ష్మీకుమారి, చింతా గిరి, కొవ్వూరి శ్రీనివాసరావు, ఇనుగంటి వెంకట సతీష్, బండారు నర్సింహమూర్తి, మామిడిబత్తుల నాగ శ్రీనివాస్, జక్కంపూడి శ్రీనివాస్, దాసరి బోసురాజు, గొల్ల భాస్కర సత్యనారాయణ ప్రసాద్, నక్కా శ్రీనివాసరావు, బోడ సాంబమూర్తి, రావూరి నాగ వెంకట సత్యనారాయణ, గుమ్మిడి వెంకట రమణమూర్తి, చెన్నకేశవులు రంగనాథ్, దుగ్గిరాల శేషసాయి సత్యశేఖర్, గద్దె ఉషారాణి ఉన్నారు. గుండాల గోపి అనే నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉండగా.. దుగ్గిరాల రవికుమార్, పయ్యావుల దామోదరరావు, బాలనాగు సోమేశ్వరగుప్త, దళపతి కోటమరాజు, గద్దె రుష్యేంద్ర నాగవెంకటప్రసాద్ మృతి చెందారు. -
Hyderabad: మందుబాబుకు 30 రోజుల జైలు
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడపవద్దని పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేసే వాహనదారుల కళ్లు బైర్లుకమ్మేలా కోర్టు తీర్పు వెలువరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 రోజుల జైలు శిక్ష విధించింది. వరుసగా నాలుగుసార్లు డ్రంకన్ డ్రైవ్ (డీడీ) కేసులలో గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన సదరు మందుబాబుకు కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. రక్తంలో ఆల్కాహాల్ స్థాయి (బీఏసీ) 50గా ఉంది. ఇక, శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో పట్టుబడిన మరో మందుబాబుకు 22 రోజుల పాటు జైలు శిక్ష ఖరారైంది. ఈయన బీఏసీ 550గా నమోదయింది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత నెలలో 3,835 డీడీ కేసులు నమోదయ్యాయి. 93 మందికి కోర్టు జైలు శిక్షను, రూ.1.21 కోట్లు జరిమానాను విధించింది. కాగా గత నెలలో 18 మంది మైనర్ మందుబాబులు పట్టుబడ్డారు. ఆయా కేసులలో న్యాయస్థానం రూ.22 వేలు జరిమానా ఖరారు చేసింది. మొత్తం 479 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) రద్దు కోసం ట్రాఫిక్ పోలీసులు సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ)లకు సిఫార్సు చేశారు. అత్యధికంగా 615 డీడీ కేసులు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో నమోదయ్యాయి. ఆయా కేసులలో న్యాయస్థానం రూ.18.52 లక్షలు జరిమానా, మొత్తం 13 మందికి జైలు శిక్షను విధించింది. ఏకంగా 153 మంది వాహనదారుల డీఎల్ రద్దుకు ఆదేశించారు. చదవండి: (మాగుంట కుటుంబంలో విషాదం) -
లైంగికదాడి కేసులో ఇద్దరికి 20 ఏళ్లు జైలు
కర్నూలు (లీగల్): యువతిపై లైంగిక దాడి కేసులో ఇద్దరికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ ఏడవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం... కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామచంద్రానగర్‌కు చెందిన ఒక యువతి (23) తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో సోదరి సహాయంతో 2016, డిసెంబర్లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆమె తిరిగి ఇంటికి వెళ్లగా, మానసిక స్థితి సరిగా లేని తన తండ్రి కనిపించలేదు. దీంతో తమ కుటుంబానికి పరిచయస్తుడైన ఎల్లన్న(30) వద్దకు వెళ్లి తన తండ్రి గురించి అడిగింది. ‘మీ తండ్రి డోన్ రోడ్డు వైపు వెళ్లాడు. తీసుకువద్దాం పదా..’ అని ఆ యువతిని ఎల్లన్న తన బైక్‌పై ఎక్కించుకుని దూరంగా ముళ్లపొదల వైపు తీసుకువెళ్లి ఆపాడు. అక్కడకు శివకళాధర్(32) అనే వ్యక్తి వచ్చి తాను పోలీసునని బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎల్లన్న కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు విచారణలో యువతిపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైంది. దీంతో ఎల్లన్న, శివకళాధర్‌కు 20 ఏళ్లు కఠిన కారాగారశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి తీర్పు చెప్పారు. జరిమానా మొత్తాన్ని ఫిర్యాదికి ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.