Madhav shingaraju
-
మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్బుక్) రాయని డైరీ
వాషింగ్టన్ లో ప్రెసిడెంట్ ఇనాగరేషన్ కు వెళ్లి, తిరిగి క్యాలిఫోర్నియాలో మేము ఉంటున్న పాలో ఆల్టోకి వచ్చేసరికి వైట్ హౌస్ నుండి ఫోన్ కాల్!‘‘మిస్టర్ జుకర్‌బర్గ్! నేను అలెక్స్ ఎన్ వాంగ్, యునైటెడ్ స్టేట్స్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌ని మాట్లాడుతున్నాను. ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ లైన్ లోకి రావటం కోసం దయచేసి కొద్ది క్షణాలు మీరు వేచి ఉండగలరా?’’ – అని !! ‘‘ఎస్... ప్లీజ్’’ అన్నాను.‘ఎవరు?!’ అన్నట్లు ప్రిసిల్లా నావైపు చూసింది. టేబుల్ మీద ఉన్న ‘లాస్ ఏంజిల్స్ టైమ్స్’ లో ట్రంప్ ఫొటోను కనుసైగగా ఆమెకు చూపించాను.పిల్లల్ని తీసుకుని ప్రిసిల్లా పక్క గదిలోకి వెళ్లిపోయింది. మాక్సిమా, ఆగస్ట్, ఆరేలియా ఎప్పుడూ తల్లిని చుట్టుకునే ఉంటారు. తొమ్మిదేళ్లొకరికి, ఏడేళ్లొకరికి. రెండేళ్లొకరికి! కాలేజ్‌లో ప్రిసిల్లా అంటే... ప్రిసిల్లా–నేను. ఇప్పుడు ప్రిసిల్లా అంటే ‘ఆల్ గర్ల్ టీమ్’ లా పిల్లలు–తను! కలిసి తిరుగుతుంటారు. కలిసి ఆడుతుంటారు. బుద్ధి పుడితే ఎప్పుడైనా ‘పోన్లే పాపం డాడ్...’ అన్నట్లు నన్ను తమ జట్టులోకి చేర్చుకుంటారు.‘‘మిస్టర్ జుకర్‌బర్గ్! లైన్ లోనే ఉన్నారా...?’’ అన్నారు అలెక్స్ ఎన్ వాంగ్, నిర్ధారణ కోసం.‘‘ఎస్... మిస్టర్ వాంగ్! నేను లైన్ లోనే ఉన్నాను...’’ అన్నాను.హఠాత్తుగా ‘‘హాయ్ జాక్...’’ అంటూ లైన్ లోకి వచ్చేశారు ట్రంప్!‘‘సర్ప్రైజింగ్, మిస్టర్ ప్రెసిడెంట్!’’ అన్నాను.‘‘నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనని చెప్పటానికే నీకు ఫోన్ చేశాన్ జాక్...’’ అన్నారు ట్రంప్!!‘‘ఏ విషయం గురించి మిస్టర్ ప్రెసిడెంట్!!’’ అని అడిగాను.‘‘వెల్... జాక్! నా ఇనాగరేషన్ లో నువ్వు నీ పక్కనున్న స్త్రీమూర్తిని – ఆమె కంఠానికి దిగువనున్న భాగం వైపు – ఆపేక్షగా చూశావని అంతా నిన్ను ట్రోల్ చేయటం గురించే అంటున్నా! మగవాళ్లు నిప్పులా ఉన్నా నిందలు తప్పవు. లుక్! స్త్రీ విషయంలో నోరు జారిన మగాడినైనా ఈ లోకం క్షమిస్తుంది కానీ, చూపు జారిన మగాడికి ఏ లోకంలోనూ క్షమాపణ లభించదు...’’ అన్నారు ట్రంప్.‘‘థ్యాంక్యూ మిస్టర్ ప్రెసిడెంట్’’ అన్నాను.ఆయన అంటున్న ఆ స్త్రీ మూర్తి లారెన్ సాంచెజ్! జెఫ్ బెజోస్ ప్రియురాలు. ఇనాగరేషన్ లో నాకు ఒక పక్క నా భార్య,ఇంకో పక్క ఆమె ఉన్నారు. ఆమెకు అటువైపున నిలబడి ఉన్న జెఫ్ బెజోస్ ఏదో చెబుతుంటే, నేను తలతిప్పి చూసినప్పుడు, నా చూపు ఆమె ‘లో–నెక్’ లోపలికి స్లిప్ అయినట్లుంది. అంత బ్యాడ్ మోమెంట్ లేదు నా లైఫ్‌లో!ఇలాంటి సంక్షోభ సమయంలో లోకంలోని ఒక మగవాడు నాకు సపోర్ట్‌గా రావటం బాగుంది. అయితే ఆ మగవాడు డోనాల్డ్ ట్రంప్ కాకపోయుంటే నాకు మరింత సపోర్టివ్‌గా అనిపించేది.‘‘వింటున్నావా జాక్? నువ్వు ఆమెను చూడాలని చూడలేదని నాకు తెలుసు. చూడటం వేరు. చూపు పడటం వేరు. కానీ జాక్, నీపైన వచ్చిన లక్ష కామెంట్లలో ఒకటైతే నాకు భలే నచ్చింది. మొదటిసారి నువ్వొక హ్యూమన్ లా స్పందించావట! హాహ్హహా...’’ అంటూ పెద్దగా నవ్వారు ట్రంప్. నేనూ నవ్వాపుకోలేకపోయాను.‘హాయ్ జాక్’ అంటూ లైన్ లోకి వచ్చినంత హఠాత్తుగా ‘బాయ్ జాక్’ అంటూ లైన్ లోంచి వెళ్లిపోయారు ట్రంప్.ఫోన్ పెట్టేశాక, ‘‘ఏమిటట?’’ అని ప్రిసిల్లా.పక్కన పిల్లల్లేరు! నిద్రబుచ్చి వచ్చినట్లుంది.‘‘అదే, ఆ బ్యాడ్ మోమెంట్ గురించి ట్రంప్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు... ’’ అని చెప్పాను.ప్రిసిల్లా నవ్వింది.‘‘అది బ్యాడ్ మోమెంట్ కాదు బాస్, బ్యాడ్ ఫొటోగ్రాఫ్... ‘ అంది, నన్ను అతుక్కుపోతూ.ప్రిసిల్లా అంటే... ఇప్పుడు మళ్లీ ప్రిసిల్లా–నేను... కాలేజ్ డేస్ తర్వాత ఇన్నేళ్లకు! -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
‘‘తప్పై పోయింది మోదీజీ...’’ అన్నారు అమిత్‌షా, దించిన తల ఎత్తకుండానే. ‘‘మీరన్న మాటలో తప్పేమీ లేదు అమిత్జీ. కానీ, మీరసలు ‘ఆయన’ మాటే ఎత్తకుండా ఉండాల్సింది కదా...!’’ అన్నాను.‘‘నిజమే మోదీజీ. ‘ఆయన’ మాట ఎత్తినా తప్పే, ఎత్తకపోయినా తప్పేనన్న కాలమాన పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్నప్పుడు ‘ఆయన’ మాట ఎత్తి తప్పు చేయటం కంటే, ఎత్తకుండా తప్పు చేయటమే కొంతైనా నయంగా ఉండేది...’’ అన్నారు అమిత్‌షా. పక్కనే జేపీ నడ్డా, కిరణ్ రిజుజు, అశ్వినీ వైష్ణవ్, పీయుష్ గోయల్ ఉన్నారు. ‘‘అప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి, ‘ఆయనంటే’ మనకెంత గౌరవమో చెప్పాం మోదీజీ...’’ అన్నారు జేపీ నడ్డా. ‘‘అవును మోదీజీ... ‘ఆయనకు’ రెస్పెక్ట్ ఇవ్వటంలో కాంగ్రెస్ కన్నా మన పార్టీనే ఎప్పుడూ ముందుంటుందని కూడా చెప్పాం...’’ అన్నారు కిరణ్ రిజుజు. ‘‘నిజానికి కాంగ్రెస్సే ‘ఆయన’కు యాంటీ అని; ‘ఆయన’కు మాత్రమే కాదు... రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు కూడా కాంగ్రెస్యాంటీనే అని కూడా చెప్పాం మోదీజీ...’’ అన్నారు అశ్వినీ వైష్ణవ్, పీయుష్ గోయల్.మంటల్ని ఆర్పేందుకు శతవిధాల ప్రయత్నించి వచ్చి, అలసట తీర్చుకుంటున్న ఫైర్ ఇంజన్లలా కనిపిస్తున్నారు మంత్రులు నలుగురూ. ‘‘మనం ‘ఆయన’ మాటెత్తటం వల్ల సడన్‌గా ఇప్పుడాయన మన పార్టీ ఇమేజ్‌కి సెంటర్ పాయింట్ అయ్యారు కనుక ఇకపై మనలో ఎవరు ఏం మాట్లాడినా ‘ఆయన్ని’ సెంటర్ పాయింట్‌గా చేసుకునే మాట్లాడాలి...’’ అన్నాను అమిత్‌షా వైపు చూస్తూ.వెంటనే రిజుజు స్పందించారు. ‘‘నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మోదీజీ! ‘దేశంలో ‘ఆయన’ తర్వాత లా మినిస్టర్ అయిన తొలి బుద్ధిస్టును నేనే...’ అనే సంగతిని ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాను...’’ అన్నారు రిజుజు. ‘‘నేనేతై, మోదీజీ పాలనలో ‘ఆయన్ని’ ఇన్సల్ట్ చేయడమన్నదే జరగదు...’’ అని గట్టిగానే జవాబిచ్చాను...’’ అన్నారు నడ్డా. ‘‘కాంగ్రెస్ ‘ఆయన’ విషయంలో అమిత్జీ మాటల్ని మెలిదిప్పి, బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని ప్రజలకు చాటి చెబుతున్నాం మోదీజీ...’’ అన్నారు వైష్ణవ్, పీయుష్ గోయల్. పార్టీలో ఒక నాయకుడిపై బయటి నుంచి విమర్శలు వచ్చినప్పుడు పార్టీలోని అందరూ ఆ విమర్శలు చేసిన వారిపై వరుసపెట్టి విరుచుకుపడటం బీజేపీలోని ఒక సత్సంప్రదాయం. ఆ సంప్రదాయం క్రమంగా బలహీనపడుతోందా? అందుకే...‘ఆయన’ మాటెత్తినందుకు అమిత్‌షాను మంత్రిగా తొలగించమని డిమాండ్ చేసేంతగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బలపడుతున్నాయా? అమిత్ షా వైపు చూశాను. ‘‘అమిత్జీ... కనీసం మీరు – ‘కాంగ్రెస్ పార్టీ పదే పదే ‘ఆయన’ జపం చేస్తోంది’ – అన్నంత వరకే ఆగి పోవలసింది. మధ్యలోకి దేవుడిని తెచ్చి... ‘ఆ జపమేదో దేవుడికి చేస్తే పుణ్యమైనా దక్కేది...’’ అని అనటం వల్లనే.. ‘ఆయన వేరు, దేవుడు వేరా!’ అని కాంగ్రెస్ రెచ్చగొడుతోంది...’’ అన్నాను. ‘‘నేనలా అనుకోవటం లేదు మోదీజీ...’’ అన్నారు అమిత్‌షా!‘‘మరి?!’’ అన్నాను. ‘‘ఆయన వేరు, దేవుడు వేరా – అని కాదు మోదీజీ... కాంగ్రెస్ రెచ్చకొడుతోంది, అసలు ‘ఆయన’కు వేరొకరితో పోలికేమిటని ‘ఊక’పొయ్యిని రాజేస్తోంది...’’ అన్నారు అమిత్‌షా!!నా నోట మాట లేదు! అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడు అశ్వత్థామకు పెట్టిన శాపం విని అప్రతిభుడై, శిలా ప్రతిమలా నిలుచుండి పోయిన వ్యాసమహర్షి నాకు – అదాటున – గుర్తొచ్చారు. మంటలు, కాల్చి బూడిద చేస్తాయి. మాటలు బూడిద నుంచి కూడా మంటల్ని రేపుతాయి! -
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
‘‘మేము ఏకగ్రీవంగా చెబుతున్నాము. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో.. దానికి సరిగ్గా ఆపోజిట్‌గా మరొక వేదిక ఏర్పాటు చేసి, అదే రోజు నారా లోకేశ్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్.’’ఈ డిమాండ్ చేసింది ఎవరో తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్త కాదు! ఇటీవల చంద్రబాబు కటౌట్‌ను రక్తంతో కడిగిన ఆ పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న!! నాయకుడు అధినాయకుడిని డిమాండ్ చేయటం ఏంటి? పైగా లోకేష్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయమని డిమాండ్ చేయటం ఏంటి? అందునా.. ఏక కాలంలో ఎదురెదురుగా రెండు వేదికలను ఏర్పాటు చేసి – ఈ వేదికపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఎదురు వేదికపై చినబాబు పార్టీ అధ్యక్ష ప్రమాణ స్వీకారం జరగాలని కోరటం ఏమిటి? ఎందుకు ‘బుద్ధన్న’ అలా అన్నారు. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది?లోకేశ్ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన్నిప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్ధా వెంకన్న డిమాండ్. అంటే.. ఇండైరెక్టుగా లోకేశ్‌ను సీఎంను చేయాలని సూచించటమా? లేక చినబాబుకు దగ్గర కావాలన్న వ్యూహమా? లేదంటే, చంద్రబాబు సూచన మేరకే అలా డిమాండ్ చేసి ఉంటారా? ఇవేవీ కాదంటే.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఆయన అలా ఏమైనా అన్నారా? ఏదేమైనా టీడీపీలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఆసక్తికరమైన పరిణామం... బుద్ధా వెంకన్న డిమాండ్.టీడీపీ అధికారంలోకి వస్తుందా, రాదా అన్నది అటుంచి.. అసలు బుద్ధన్న ఇలాంటి ప్రకటన ఎందుకు చేసినట్లు అని ఆ పార్టీలోని నాయకులే అయోమయంగా ముఖాలు చూసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఏదైనా గందరగోళం మొదలైందా అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.నిజానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ఆలోచిస్తున్నది లోకేశ్ బాబు అధ్యక్షుడు అవుతాడా కాడా అని కాదు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అని. ఓటమి అంటే చంద్రబాబుకు భయం. అందుకే ఆయన ఒంటరిగా పోటీ చేయరు. పొత్తు కోసం చూస్తారు. పొత్తు కుదరకపోతే కొత్త ఎత్తులు ఏవైనా వేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కూటమిని కట్టారు కనుక... ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఎలా ముందుకు వెళ్లాలా అని ఆయన ఇప్పుడు ఆలోచిస్తుండవచ్చు. కొత్తగా ఏర్పడే జగన్ ప్రభుత్వంలో తొలి 100 రోజుల్లో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించటానికి రామోజీ తో కలసి ఏదైనా వ్యూహాన్ని ఆలోచిస్తూ కూడా ఉండొచ్చు. చెప్పలేం. గెలుపు కోసం చంద్రబాబు ఏమైనా చేయగలరు. ఓడిపోయినా కూడా... ఏమైనా చేయించగలరు!ఈ నేపథ్యంలో గత 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆయన్ని ఓడించిన స్వయంకృతాపరాధాలు, ఆయన్ని గెలిపించిన ఎత్తులు, పొత్తులు; గెలుపు వంటి ఓటములు, ఓటమి వంటి గెలుపుల గురించి చూడటం అవసరం.చంద్రబాబుకు మొదటి అతి పెద్ద ఓటమి 2004లో ఎదురైంది. అంతకు ముందు 1999లో జరిగిన ఎన్నికలు ఆయన్ని పార్టీలో తిరుగులేని నేతగా నిలబెట్టాయి. అక్కడి ఉంచి నేరుగా, మళ్లీ లేవలేనంతగా 2004లో కిందికి పడేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనంలో సైకిల్ కొట్టుకుపోయింది. స్కూల్ టీచర్లు, ప్రభుత్వోద్యోగులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయటం మాత్రమే కాదు, చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా పనిచేశారు. జన్మభూమి కార్యక్రమాలకు తమను ఉపయోగించుకోవటం వారికి ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వోద్యోగుల పని విధి విధానాలలో కొత్తగా తెచ్చిన మార్పులు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభావం చూపెట్టాయి.ఇంతకన్నా ముఖ్యం.. విద్యుత్ చార్జీలు, నీటి చార్జీల పెంపు. దీనిపై రైతులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తే... హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో జరిగిన ధర్నాలో నిరసనకారులైన రైతులపై చంద్రబాబు పోలీసుల చేత కాల్పులు జరిపించారు. పోలీస్ కాల్పులలో రామకృష్ణ, విష్ణువర్థన్ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. బాబు పాలనలో మాయని మచ్చగా మిగిలిన ఉదంతం అది. ఇక 1995–2004 మధ్య రాష్ట్రంలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. అప్పుడే తెలంగాణ ఉద్యమం, అప్పుడే వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర! 2004 ఎన్నికల్లో ఆ రెండూ తమదైన ప్రభావం చూపి, బాబు ఓటమికి కారణం అయ్యాయి.ఇవికాక, మరికొన్ని కారణాలు కూడా ఆనాటి చంద్రబాబు ఘోర పరాజయానికి ఆజ్యం పోశాయి. తూర్పు ఆసియా దేశాల పద్ధతులను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు కనిన స్వర్ణాంధ్ర ప్రదేశ్, విజన్ –2020 కలలు బెడిసికొట్టాయి. కేవలం సమాచార సాంకేతిక విజ్ఞానం మీద, బయో టెక్నాలజీ మీదా ఆధారపడి ఆయన ఆ కలలు కన్నారు. అవి సమాచార సాధనాలను, విదేశీ అధినేతలను, విదేశీ వాణిజ్యవేత్తలను ఆకట్టుకుని ఉంటే ఉండొచ్చు. కానీ కేవలం వాటి ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు భ్రమ పడ్డారు. గెలుపై ధీమాగా ఉన్నారు. చివరికి బోర్లా పడ్డారు. వ్యవసాయ రంగం అభివృద్ధి మీద, పేదరికం నిర్మూలనపైనా ఆయన దృష్టి సారించకపోవటం కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.అంతకు ముందు 1999 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన మాట నిజమే అయినా అది ఏమాత్రం చంద్రబాబు ఘనత కాదు. కార్గిల్ యుద్ధ ప్రభావం గెలుపునకు దోహదపడింది. పాకిస్థాన్‌తో కార్గిల్ యుద్ధంలో గెలిచిన అనంతరం.. సాధారణ సమయానికి భిన్నంగా, కొన్ని నెలల ఆలస్యంగా సార్వత్రిక ఎన్నికలు ఆ ఏడాది సెప్టెంబరులో జరిగాయి. వాటితో పాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా. ఆ ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో టై–అప్ అయ్యారు. తాము గెలిస్తే, కేంద్రంలో బీజేపీకి బయటి నుండి మద్ధతు ఇస్తామన్న హామీతో ఆయన ఆ ఎన్నికలకు వెళ్లారు.కార్గిల్ యుద్ధంలో గెలుపు వాజ్‌పేయిని గొప్ప నాయకుడిగా నిలబడితే ఆ నాయకుడితో చేయి కలపడం చంద్రబాబుకు గొప్పగా కలిసొచ్చింది. మొత్తం 294 సీట్లలో తెలుగుదేశం 269 సీట్లకు, బీజేపీ 24 సీట్లకు పోటీ చేస్తే తెలుగు దేశం 180 సీట్లలో గెలిచింది. అయినప్పటికి మునుపటి కన్నా 36 సీట్లు తగ్గాయి. బీజేపీకి మాత్రం అంతకుముందు కన్నా 9 సీట్లు పెరిగాయి. అంటే.. వాజ్‌పేయి ఆధ్వర్యంలోని జాతీయ పార్టీ బీజేపీ ప్రభావంతోనే చంద్రబాబు నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఎక్కువ సీట్లు సాధించింది తప్ప అది చంద్రబాబు చరిష్మా కాదు. ఇంకా చెప్పాలంటే కేవలం కార్గిల్ ప్రభావం.2004 ఎన్నికల తర్వాత వరుసగా 2009లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అందుకు కారణంగా చంద్రబాబు ఎలాంటి సాకులు చెప్పినా.. అసలు కారణం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమ నాయుడు విశ్లేషణలో కనిపిస్తుంది.‘‘2009లో మా పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం పీఆర్పీ పార్టీ, లోక్‌సత్తా పార్టీలు కొత్తగా రావటం. దాంతో యాంటీ కాంగ్రెస్ ఓటు చీలటం జరిగింది. రెండవది – టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నందు వల్ల ఈ హైదరాబాద్‌లో గానీ, రంగారెడ్డి జిల్లాలో గానీ మాకు ఏం సీట్లు కూడా రాలేదు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డిలో వాళ్లు, రాష్ట్రం సపరేట్ కాకూడదని ఎక్కువమంది జనం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒకే ఒక్క సీటు రావటం జరిగింది. అందువల్ల మేము ఘోరంగా ఓడిపోవటం జరిగింది. యాంటీ కాంగ్రెస్ ఓటు చిరంజీవి, జయప్రకాష్ నారాయణ్ చీల్చుకోవటం కూడా మా ఓటమి కారణం. అప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంకు దాదాపు 13 శాతం తగ్గింది. 2004లో 51 శాతం ఉన్న ఓట్ బ్యాంకు వాళ్లకు 38 శాతం అయింది. మేము 37 శాతంతో ఓడిపోయాం. ఒక్క పర్సెంట్ ఓట్ల తేడాతోనే మేము 2009 ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. గెలుపు అంచుకు వచ్చి ఓడిపోయాం. 92 సీట్లు గెలిచాం మేము. కాంగ్రెస్ 155 మాత్రమే గెలిచింది. వాళ్లకు 35 సీట్లు తగ్గినయ్. మాకు దాదాపు 45 సీట్లు పెరిగాయి. రాజశేఖర రెడ్డి విజృంభించి ప్రచారం చేయటం కూడా జనంలో కొంత భయం కల్పించింది’’ అన్నారు ముద్దు కృష్ణమ నాయుడు.2014లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లోనూ చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపారు. వారి పొత్తు ఫలించి తెలుగుదేశానికి 25 సీట్లు, బీజేపీకి 7 సీట్లు పెరిగినప్పటికీ, వైఎస్సార్సీపీ ప్రభావంతో తెలుగు దేశం పార్టీ 117 సీట్లుకు మించి సాధించలేకపోయింది. ఆ మాత్రమైనా మోదీ హవాతో కొట్టకొచ్చిన సీట్లు, ఓట్లు మాత్రమే అవి.2019 గురించి ఇక చెప్పేదేముంది? వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 175కి 151 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లు మాత్రమే సాధించగలిగింది. అందుకు అనేక కారణాలున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు, స్పెషల్ స్టేటస్‌పై యు–టర్న్, అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా మెల్లిగా నడిపించటం, కాపు ఓట్లు చీలుస్తాడని అనుకున్న పవన్ కల్యాణ్ హీరో ఫ్యాక్టర్ పని చేయకపోవటం, అవినీతి.. వీటన్నిటితో పాటు రాష్ట్రానికి అందవలసిన నిధుల విషయంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించి ఎన్.డి.ఎ. నుంచి బయటికి రావటం కూడా టీడీపీని దెబ్బకొట్టేసింది. దానికి మించి పార్టీలో చంద్రబాబు ‘వన్ మ్యాన్ షో’ పార్టీని ఒంటరిని చేసింది.ఈ అనుభవం రీత్యా మళ్లీ ఈ తాజా ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఆ పొత్తు ఫలిస్తుందా, మొదటికే మోసం తెస్తుందా అని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతలో, ఆయన్ని బలపరుస్తుండే మీడియాలో కలవరం రేకెత్తిస్తోంది. అందుకే ఎన్నికలు ముగిసి, ఫలితాలు ఇంకా రాకముందే తెలుగు దేశం నాయకులు, రామోజీ రావు.. ‘గెలుపు కూటమిదే’ అని నినదిస్తున్నాయి. ఒకటి గమనించారా? ‘గెలుపు తెలుగుదేశానిదే’ వారు అనటం లేదు. – మాధవ్ శింగరాజు -
రామ్‌దేవ్ బాబా (యోగా గురువు) రాయని డైరీ
వరానిదేముందీ, నేను కాకపోతే దేవుడు అనుగ్రహిస్తాడు. వరాన్ని అందుకునే చేతులకే.. శక్తి ఉండాలి. శక్తి లేకపోతే వరమిచ్చిన దేవుడు గానీ, ఈ రామ్‌దేవ్ బాబా గానీ వరాన్ని వెనక్కు తీసుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. వరం అందుకోడానికి చేతులకు మాత్రమే శక్తి ఉంటే సరిపోదు. అది వరం అని గుర్తించే మనోశక్తి కూడా ఉండాలి. ఎందరికి ఉంది ఈ దేశంలో వరాన్ని గుర్తించే మనోశక్తి. వరం.. ‘మేడ్ బై దేవుడు’ అని ప్యాక్ మీద ఉన్నా, దేవుడి వరానికి అమెరికా వాళ్ల ఎఫ్.డి.ఎ. ఆమోదం ఉందా అని చూస్తారు. దేవుడిచ్చిన వరం జనంలోకి వెళ్లడానికి తిప్పలు పడటంలో అసహజం ఏమీ లేదు. ఆయన ఎక్కడో పైన ఉంటాడు. కింద ఉండే ఈ రామ్‌దేవ్‌కి కూడా ఇన్ని తిప్పలేమిటి చిన్న మెడిసిన్‌ని వరంలా విక్రయించుకోడానికి! మూడు నెలలుగా ఎవరూ ఖాళీగా లేరు. ఎవరికి తోచిన వరాన్ని వారు ప్రసాదించే పనిలో ఉన్నారు. మాస్కుల వరం, పాలూ పండ్లూ కూరగాయల వరం, ఉడకేసిన బియ్యం వరం, ఉప్మా ప్యాకెట్ల వరం, టికెట్లు తీసి బస్సులు, రైళ్లు ఎక్కించే వరం.. ఇలా వరాలిచ్చే వారితో ఈ భూమి నిండి పోయింది. ఇక వరాలు తీసుకునేవారికి చోటెక్కడ ఉంటుంది?! ఆచార్య బాలకృష్ణ వచ్చి కూర్చున్నాడు. ‘‘వరాలు ఎక్కువై ఈ మూర్ఖపు జనులకు వరం విలువ తెలియకుండా పోయింది బాబాజీ. మన కరోనిల్ కిట్లను ఐదు వందల నలభై ఐదు రూపాయలకే వరంగా ఇస్తున్నా ఎవరూ చెయ్యి పట్టడం లేదు. ఎవరైనా వరానికి ధరేంటని అనుమానంగా చూస్తారు. వీళ్లు వరాన్నే అనుమానంగా చూస్తున్నారు’’ అన్నాడు. అతడి చేతిలో కరోనిల్ కిట్ ఉంది. దానిని నా చేతుల్లోకి తీసుకున్నాను. ‘‘కోరుకోని వరం లభిస్తే ఎవరైనా ఆనందించకుండా ఎలా ఉండగలరో అర్థం కావడం లేదు ఆచార్యా’’ అన్నాను. అర్థం కావడం లేదని ఆచార్యతో అన్నాను కానీ, బొత్తిగా అర్థం కాకుండా ఏమీ లేదు. కోరుకోని వరం కోరుకున్న చోటు నుంచి రావాలని వీళ్లంతా కోరుకుంటున్నారు. వీళ్లకు రెమ్‌డెసివిర్ కావాలి. రామ్‌దేవ్‌బాబా వద్దు. ‘‘ఆచార్యా.. మన కిట్ల మీద ‘టెస్టెడ్ అండ్ వెరిఫైడ్ ఫ్రం పతంజలి’ అని కాకుండా.. ‘అప్రూవ్డ్ బై.. ఎఫ్.డి.ఎ.’ అని వేయించడానికి వీలవుతుందా?’’ అని అడిగాను. ‘‘రెండు విధాలుగా వీలుకాకపోవచ్చు’’ అన్నాడు! వీలుకాకపోవడం అన్నది ఒక విధంగా వీలు కాకపోయినా, రెండు విధాలుగా వీలుకాక పోయినా.. చివరికి వీలు కాకపోవడం ఒక్కటే మిగులుతుంది. ‘‘వీలయ్యే విధానాలు ఏమైనా ఉంటే చెప్పండి ఆచార్యా..’’ అని అడిగాను. ‘‘వీలు కాని విధాలను కొట్టేసుకుంటూ పోతే, వీలయ్యే విధానం ఎక్కడైనా పట్టుబడొచ్చు బాబాజీ’’ అన్నాడు. నా సహచరుడు అతడు. ఆయుర్వేద ఆచార్యుడు. నేను హర్యానా నుంచి వస్తే, అతడు హరిద్వార్ నుంచి వచ్చాడు. నాది యోగా, అతడిది ఫార్మసీ. అతడు శుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని శాలువాగా కప్పుకుని కుర్చీలో ఆసీనుడై ఒక చేత్తో పుస్తకాన్ని, ఒక చేత్తో బాల్ పెన్ను పెట్టుకుని ఉంటే çపరిశోధనావస్థలో ఉండే యోగీశ్వరుడిలా ఉంటాడు. ‘‘వీలవని ఆ రెండు విధానాలేమిటి ఆచార్యా..’’ అని అడిగాను. ఆచార్య బాలకృష్ణ మాట్లాడలేదు. ‘‘చెప్పండి.. ఆచార్యా..’’ అన్నాను. ‘‘వీలవనివి తెలుస్తూ ఉండి, వీలయ్యేవి ఏవో తెలియనప్పుడు.. వీలయ్యేవి ఏమిటో ముందు తెలుసుకుని అప్పుడు వీలవని వాటిని కొట్టేసుకుంటూ పోతే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను బాబాజీ’’ అన్నాడు!! తెలియని ఆసనమేదో తెలియకుండా పడిపోయినట్లనిపించింది. -
రాయని డైరీ : ఇమ్రాన్ ఖాన్ (పాక్ ప్రధాని)
తలనొప్పిగా ఉంది! అరవై ఆరేళ్ల వయసులో తలనొప్పి రావడం సహజమా అసహజమా కనుక్కొని రమ్మని డాక్టర్ దగ్గరికి మనిషిని పంపాను. ఆ మనిషి ఇంతవరకు రాలేదు. ‘‘ఎవరి కోసం చూస్తున్నారు ఇమ్రాన్‌జీ’’ అంటూ వచ్చారు షా మెహమూద్ ఖురేషీ. ‘‘మీరు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కదా షాజీ.. ఇంటర్నల్ ఇష్యూస్ చెప్పుకోవడం బాగుంటుందా మరి?’’ అన్నాను. ‘‘నేను చూసేది ఫారిన్ అఫైర్సే అయినా, అవన్నీ ఇంటర్నల్ అఫైర్స్ కోసమే ఇమ్రాన్‌జీ.. పర్వాలేదు చెప్పండి’’ అన్నారు. ‘‘అరవై ఆరేళ్ల వయసులో తలనొప్పి రావడం సహజమా అసహజమా కనుక్కొని రమ్మని డాక్టర్ దగ్గరికి మనిషిని పంపాను షాజీ. ఇంతవరకు ఆ మనిషి రాలేదు. రాని మనిషి గురించి ఆలోచిస్తూ, వచ్చిన తలనొప్పిని మర్చిపోగలుగుతున్నాను కానీ.. మనిషి రాలేదేమిటన్న ఆలోచనతో తిరిగి నా తలనొప్పి నాకు గుర్తుకువచ్చేస్తోంది’’ అన్నాను. నాకంటే మూడేళ్లు చిన్నవాడు ఖురేషీ. కానీ నాకన్నా పదేళ్లు చిన్నవాడిలా ఉంటాడు. అది కాదు ఆశ్చర్యం, ఫారిన్ మంత్రిగా అతడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా ఉన్నాడో, పన్నెండు నెలల తర్వాత ఇప్పుడూ అలానే ఉన్నాడు! ఆరోజే అడిగాను.. ‘షాజీ.. మీరింత ఫిట్‌గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అని. పెద్దగా నవ్వాడు. ‘ఇమ్రాన్‌జీ, ఒకటి చెప్పమంటారా.. క్రికెట్ ఆడేవాళ్ల కన్నా క్రికెట్ చూసేవాళ్లే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారు. ఇప్పటికీ నేను ఇండియా మీద మీరు ఆడిన పాత మ్యాచ్‌లన్నిటినీ రీప్లే చేసుకుని మరీ చూస్తుంటాను’ అన్నాడు! మనసుని రంజింపజేయడంలో ఖురేషీ గొప్ప ఆటగాడు. ‘‘తలనొప్పి కశ్మీర్ వంటిది ఇమ్రాన్‌జీ. ఉందని గుర్తు చేసుకుంటే వస్తుంది. లేదని గుర్తు పెట్టుకుంటే గాయబ్ అవుతుంది’’ అన్నారు ఖురేషీ. ‘‘ఈ గుర్తుపెట్టుకోవడమే పెద్ద తలనొప్పిగా ఉంది షాజీ. అయినా లేని దానిని ఉందని గుర్తుపెట్టుకోగలం కానీ, ఉన్నదానిని లేదని ఎలా గుర్తుపెట్టుకోగలం చెప్పండి?’’ అన్నాను. ‘‘తలనొప్పి కశ్మీర్ వంటిది అంటే, కశ్మీర్ తలనొప్పి వంటిదని కాదు ఇమ్రాన్‌జీ. ఉన్నదానిని లేదని గుర్తుపెట్టుకునే అవసరం లేకున్నా, లేనిదానిని ఉందని గుర్తుపెట్టుకోవడం మర్చిపోలేదన్న సంగతిని గుర్తు చేస్తుండడం అవసరం. కశ్మీర్‌ను మన తల అనుకున్నప్పుడు ఆమాత్రం తలనొప్పి సహజమే. నా ఉద్దేశం మీ తలనొప్పి మీ అరవై ఆరేళ్ల వయసు వల్ల వస్తున్నది కాదు. డెబ్బయ్ రెండేళ్ల కశ్మీర్ వల్ల వస్తున్నది’’ అన్నారు ఖురేషీ! ‘హాహ్హాహా’ అని పెద్దగా నవ్వాను. ‘‘అంటే నేను వయసుకు మించిన భారాన్ని మోస్తున్నాననే కదా షాజీ’’ అన్నాను. ‘‘మీరు గుండెల నిండా నవ్వడం చాలా రోజుల తర్వాత చూస్తున్నాను ఇమ్రాన్‌జీ! మీకు గుర్తుందా.. ఏడాది క్రితం సరిగ్గా ఇదే నెలలో మీరు ప్రధాని అయ్యారు. ఆరోజు చూడ్డమే చిన్న చిరునవ్వునైనా మీలో! మళ్లీ లేదు’’ అన్నారు ఖురేషీ. ‘‘ధన్యవాదాలు షాజీ’’ అన్నాను. ఎప్పుడూ కశ్మీర్ గురించే కాకుండా, పాక్ ప్రధాని సంతోషం గురించి కూడా కాస్త ఆలోచించే ఒక పౌరుడిని నా దేశంలో నేను మొదటిసారిగా చూస్తున్నాను! డాక్టర్ దగ్గరికి వెళ్లిన మనిషి ఇంకా రాలేదు! ఖురేషీతో మాట్లాడుతుంటే తలనొప్పి తగ్గినట్లే ఉంది కానీ, ఖురేషీ వెళ్లిపోయాక మళ్లీ తలనొప్పి వస్తే?! ‘‘మీరే డాక్టర్ దగ్గరికి వెళ్లవలసింది ఇమ్రాన్‌జీ. లేదా, డాక్టర్నే మీ దగ్గరికి రప్పించుకోవలసింది. మీరు పంపిన మనిషికి మీ తలనొప్పి సంగతి గుర్తుంటుందని ఎలా చెప్పగలం? అతడికేం తలనొప్పులున్నాయో..’’ అన్నారు ఖురేషీ. కశ్మీర్ విషయం ఐక్యరాజ్య సమితితో మాట్లాడమని నేను చైనాను పంపడం గురించి కాదు కదా ఖురేషీ మాట్లాడుతున్నది!! -
మంచి కోరే మనిషి
కర్పూర కు ఆ కాలనీలో మొదట పరిచయమైంది శ్యామలి. పక్కపక్క ఇళ్లు కావడం వల్ల అయిన పరిచయం కాదది. కర్పూర, శ్యామలి వేర్వేరు వీధుల్లో ఉంటారు. ఎప్పుడైనా.. కాలనీ బయట మెయిన్ రోడ్డులో ఉన్న సూపర్ మార్కెట్లో ఒకరికొకరు కనిపిస్తుంటారు. అప్పుడైన పరిచయం. ‘కర్పూర.. పేరు బాగుంది’ అంది శ్యామలి.. పరిచయం కాగానే. ‘శ్యామలి పేరు కూడా కొత్తగా ఉంది. శ్యామల, కోమలి కలిసినట్లు’ అని నవ్వింది కర్పూర. కాలనీలో కోమలి తప్ప కర్పూరకు మరొక పరిచయం లేదు! ∙∙ నెలక్రితమే కర్పూర ఆ కాలనీకి వచ్చింది. ఆమె భర్త రోహిత్. భార్యకు చూపించకుండానే రోహిత్ రెంట్ అడ్వాన్స్ కట్టేసి, ఆ కాలనీకి ఆమెను తీసుకొచ్చాడు. నమ్మకం. కాలనీ గానీ, ఇల్లు గానీ తనకు నచ్చిందంటే భార్యకూ నచ్చుతుందని. అతడికున్న నమ్మకాన్ని మించి కర్పూరకు ఆ ఇల్లు చాలా నచ్చింది. రోహిత్‌కి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం. కర్పూర పెళ్లికి ముందే చెప్పేసింది.. తనకు ఉద్యోగం చేసే ఆసక్తి లేదని. పెళ్లయి రెండేళ్లవుతోంది. ఈ మధ్యలో ఒకట్రెండుసార్లు అడిగాడు రోహిత్.. ‘‘మంచి కంపెనీ అట. నీ క్వాలిఫికేషన్స్కైతే నిన్ను కళ్లకద్దుకుని తీసుకుంటారు’’ అని. ‘‘ఎంత కళ్లకద్దుకుని తీసుకున్నా.. నేను ఉద్యోగం చెయ్యనని’’ చెప్పేసింది కర్పూర. ‘‘హాయిగా ఇంట్లోనే ఉంటాను రోహిత్’’ అంటుంది ఎప్పుడూ కర్పూర. భవిష్యత్తును చక్కబెట్టుకోవడం కన్నా ఇల్లు చక్కబెట్టుకోవడం ఆమెకు ఇష్టం. ఆ సంగతిని మొదట్లోనే గ్రహించాడు రోహిత్. అందుకే ఆమెను బలవంతపెట్టడు. పిల్లలు అప్పుడే వద్దనుకున్నారు కాబట్టి.. వాళ్లిద్దరి మధ్య డబ్బూ కాకుండా.. పిల్లలూ కాకుండా.. ఆ వయసులో ఉండే సరదా కబుర్లే ఉండేవి. ఇలా సరదాగా కబుర్లతో సాగిపోతున్న కర్పూర జీవితంలోకి అకస్మాత్తుగా శ్యామలి కాకుండా ఇంకో కొత్త వ్యక్తి ప్రవేశించడం జరిగింది. ఆ వ్యక్తి స్త్రీ కాదు. పురుషుడు! ‘‘మీతో కాస్త మాట్లాడొచ్చా?’’ అన్నాడు ఆ వ్యక్తి, కర్పూర దగ్గరకు వచ్చి. కంగారు పడింది కర్పూర. అది చీకటి పడబోతున్న సాయంత్రం కానీ, తెల్లారబోతున్న చీకటి కానీ కాదు ఆమె కంగారు పడడానికి. మిట్ట మధ్యాహ్నం. ఆ టైమ్‌లో కాలనీలో బయటెవరూ ఉండకపోవడం కాలనీకి వచ్చిన మొదట్లోనే గమనించింది కర్పూర. ఉద్యోగాలు చేసేవాళ్లంతా ఆఫీసులకు వెళ్లిపోయాక, పిల్లల్ని స్కూల్లో వదిలొచ్చిన ఆడవాళ్లు ఇంట్లో పనిలో పడిపోయాక, కాలనీ వీధులు నిశ్శబ్దంగా అయిపోతాయి. బహుశా ఆ కాలనీ కొత్తది కావడం వల్ల కావచ్చు.. జన సంచారం ఉండదు.‘‘మీతో కాస్త మాట్లాడొచ్చా’’ అని అతడు అడిగాక.. కంగారుపడి, బిత్తరపోతున్నట్లుగా అతడిని చూసింది కర్పూర. ‘‘భయపడకండి. మీ మంచి కోరేవాడిని. ఊదా రంగు ఇంట్లోనే కదా మీరు ఉంటారు’’ అన్నాడు ఆ వ్యక్తి. ఆ మాటకు కర్పూర మరింత భయపడింది. అంటే.. ఎప్పటి నుంచో గమనిస్తున్నాడన్నమాట! ‘మీరెవరు? నా మంచి కోరడం ఏంటి?’ అని ఆమె అడగొచ్చు. కానీ అతడికి ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వదలచుకోలేదు. అక్కడి నుంచి వేగంగా నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. మెయిన్ రోడ్డు మీదకు చేరుకుంటుండగా.. ఆమెకు అనిపించింది.. ‘వెనక్కు తిరిగి చూస్తేనో..’ అని. కానీ చూడలేదు. తను చూస్తే, తను చూడ్డం అతను చూస్తే.. మాట్లాడేందుకు అతడు మళ్లీ అవకాశం తీసుకుంటే!! సూపర్ బజార్లో కావలసినవేవో తీసుకుని తిరిగి అదే దారిలో వస్తూ ఉంటే.. ‘మళ్లీ రాడు కదా’ అనుకుంది. రాలేదు! ఊపిరి పీల్చుకుంది. ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ చాలాసేపటి వరకు కబుర్లు చెప్పుకుంటూ మేల్కొనే ఉన్నారు కానీ.. ఆ మధ్యాహ్నం తారసపడిన ఆ మంచికోరే మనిషి గురించి కర్పూర రోహిత్‌కి చెప్పలేదు. ఆ తర్వాత ఆమె కూడా ఆ సంగతి దాదాపుగా మర్చిపోయింది. అలా మర్చిపోతున్న సమయంలో.. మళ్లీ అదే చోట, అదే సమయంలో అతడు ఓ రోజు ప్రత్యక్షమయ్యాడు! గుండె గుభేల్మంది కర్పూరకి. ‘‘భయపడకండి. మీ మంచి కోరేవాడిని’’ అన్నాడతను. మళ్లీ అదే మాట!‘‘చూడండి. మీరు నాకేం చెప్పనవసరం లేదు. నేనేం వినే అవసరం లేదు. సాయంత్రం నా భర్త వస్తాడు. మీరు చెప్పదలచుకుంది ఏమైనా ఉంటే ఆయనకు చెప్పండి’’ అని చెప్పి.. వేగంగా కదిలి వెళ్లిపోయింది. అక్కడి నుంచి సూపర్ మార్కెట్‌కి వెళ్లకుండా.. నేరుగా పక్క వీధిలోని శ్యామలి ఇంటికి వెళ్లింది. శ్యామలి ఆశ్చర్యంగా కళ్లింత చేసి చూసింది. ‘‘మీరేంటి.. ఇలా?’’ అంది. కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చింది. గటగటా నీళ్లు తాగేసింది కర్పూర. ఆ తర్వాత.. ఆ మంచి కోరే వ్యక్తి గురించి చెప్పింది. ‘‘వాడేంటట.. నీ మంచి కోరేది’’ అంది శ్యామలి చిరాగ్గా. ‘‘రోహిత్‌కి చెప్పేదా?’’ అంది కర్పూర.‘‘చెప్పడమే మంచిది. ఇప్పటికే రెండుసార్లు ఇలా అయింది కదా. మూడోసారి కాకూడదనేముందీ’’ అంది శ్యామలి. ఆ రాత్రి రోహిత్‌కి బాగా దగ్గరకి జరిగి, అతడి గుండె మీద చెయ్యి వేసింది కర్పూర. సాధారణంగా అతడే ఆమెవైపు జరుగుతాడు. ఆ రోజు కర్పూరే అతడి వైపు జరిగింది. ‘‘కాలనీ మారిపోదాం రోహిత్’’ అంది. రోహిత్ నవ్వాడు. ‘‘ఏంటిది సడెన్‌గా?’’‘‘నాకంతా చికాకు చికాకుగా ఉంది రోహిత్. అతనెవరో.. నా మంచి కోరతానని.. కాలనీలో నా వెంట పడుతున్నాడు’’.. చెప్పింది కర్పూర. ‘‘అవునా!’’ అన్నాడు అశ్చర్యంగా. ‘‘ఈసారి నీతో మాట్లాడ్డానికి ట్రై చేస్తే ఫోన్ కలిపి అతనికివ్వు’’ అన్నాడు. ఆ తర్వాత కర్పూర నిశ్చింతగా నిద్రపోయింది.రోహిత్‌కే నిద్రపట్టలేదు. రాత్రి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తనని ఓ వ్యక్తి ఆపడం రోహిత్‌కి గుర్తొచ్చింది. ‘మీది ఊదా రంగు ఇల్లే కదా అన్నాడు. మీ మంచి కోరి ఓ విషయం చెప్తాను’ అన్నాడు. చెప్పమన్నాడు రోహిత్. అతడు చెప్పాడు! ఉదయం ఆఫీస్‌కి బయల్దేరేముందు ఇంటి ఓనర్‌కి ఫోన్ చేసి.. ‘‘ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండిపోయిన టెనెంట్ ఫొటో ఉందా మీ దగ్గర? ఉంటే వాట్సాప్ చేస్తారా?’’ అని అడిగాడు. ‘‘ఎందుకు?’’ అటువైపు నుంచి ప్రశ్న. ‘‘వెంటనే ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటున్నాడు మమ్మల్ని. మా మంచికేనట’’ చెప్పాడు రోహిత్. ‘‘సరే పంపిస్తాను’’ అన్నాడు ఇంటి ఓనర్. ఆ లోపే ఇంట్లోంచి పెద్దగా అరుస్తూ బయటికి వచ్చింది కర్పూర. ‘‘ఇదిగో.. ఇతనే.. ఇతనే..’ అంటూ భయంగా ఒణికిపోతోంది. ఆమె చేతిలో ఎవరిదో గ్రూప్ ఫొటో ఉంది. అటక మీద నుంచి ఫ్యాన్ గాలికి బూజుతో పాటు రాలి పడిన ఫొటో అది. ఫొటో తీసుకుని చూశాడు రోహిత్. ‘‘ఇతనే.. కాలకనీలో నాతో మాట్లాడాలని ట్రై చేస్తోంది’’ చెప్పింది కర్పూర. బయటికి వచ్చాక ఇంటి ఓనర్‌కి ఫోన్ చేసి.. ‘‘ఫొటో పంపక్కర్లేదు’’ అని చెప్పాడు రోహిత్. చెప్పి, అటక మీద నుంచి రాలి పడిన ఫొటోలో ఆ మంచి కోరే మనిషిని మాత్రం ఫొటో తీసి ఇంటి ఓనర్‌కి వాట్సాప్ చేశాడు. వెంటనే రిప్లయ్ వచ్చింది.‘ఇతనే ఆ టెనెంట్. చనిపోయి చాలాకాలం అయింది’ అని. ఆ సంగతి కర్పూరకు చెప్పలేదు రోహిత్. ఆ తర్వాత కొద్దిరోజులకే కాలనీ మారిపోయారు రోహిత్, కర్పూర. ఇల్లు మారితే సరిపోతుంది కదా అంటే.. కర్పూరే.. ‘‘వద్దు.. కాలనీనే మారిపోదాం’’ అంది. -
ప్రధాని కాని ప్రధాని..రాజపక్స
హిజ్ ఎక్సలెన్సీ మైత్రిపాల సిరిసేన చేసిన పని తప్పా ఒప్పా అని డిసెంబర్ ఏడున సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఆ లోపే హిజ్ ఎక్సలెన్సీ మైత్రిపాల సిరిసేన తనకు తనే తీర్పు ఇచ్చుకునేలా ఉన్నాడు.. తను చేసింది తప్పేనని! ప్రెసిడెంట్ అంటే ఎలా ఉండాలి! పార్లమెంట్‌ని డిజాల్వ్ చేశాడు. బాగుంది. తనిచ్చిన డిజాల్వ్ ఆర్డర్ మీద తను నిలబడాలి కదా. కోర్టువాళ్లొచ్చి తన ఆర్డర్ కాగితాలను చింపేసి వెళ్లకముందే తనే వాటిని చింపేస్తే ఆ కాగితం ముక్కల్ని పడేయడానికి ‘మన దగ్గర డస్ట్‌బిన్ ఉందా’ అని ప్రెసిడెంట్స్ హౌస్‌లో ఎవర్నో పట్టుకుని అడిగాడట! అక్కడివాళ్లెవరో ఇక్కడికొచ్చినప్పుడు చెప్పారు. పదేళ్లు ప్రెసిడెంట్‌గా ఉన్నాను. రెండేళ్లు ప్రధానిగా ఉన్నాను. ఎప్పుడూ ఇంత వీక్‌గా లేను. మైత్రిపాల వచ్చి తన ప్రెసిడెంట్ పోస్ట్నీ, తనే పిలిచి నాకిచ్చిన ప్రధాని పోస్ట్నీ.. రెండిటినీ వీక్ చేసి పడేశాడు. శ్రీలంకలో రాజ్యాంగ సంక్షోభం అని దేశాలన్నీ రోజూ ఉదయాన్నే పేపర్లలో చదివి నివ్వెరపోతూ ఉండి ఉంటాయి.. ‘ఎల్టీటీఈ’నే లేకుండా చేసిన సివిల్ వార్ హీరో రాజపక్స ఇంకా బతికే ఉండగా శ్రీలంకలో సంక్షోభం ఏమిటి!’ అని. మైత్రిపాలకేం.. తను బాగానే ఉన్నాడు. నాకే తలవంపులు. సంక్షోభాలు వస్తూనే ఉంటాయి.. వాటిని సంక్షేమాలుగా మార్చుకోవాలి గానీ, వెళ్లి కన్ఫెషన్ బాక్స్‌లో నిలబడతాను అనడం రాజనీతిజ్ఞతేనా? రాజకీయ సంక్షోభాల కంటే క్లిష్టమైనవా రాజ్యాంగ సంక్షోభాలు?! ‘తప్పు చేశాను, నా గెజిట్‌ను నేను రద్దు చేసుకుంటాను. తప్పు చేశాను, నేను నీకిచ్చిన షేక్‌హ్యాండ్‌ను వెనక్కు తీసుకుంటాను..’ అంటారా గ్రేట్ లీడర్ ఎవరైనా! పార్లమెంట్లో నన్నెవరూ సపోర్ట్ చెయ్యడం లేదు. అయినా నేను వెళ్లి రోజూ పార్లమెంటులో కూర్చొని రావడం లేదా? విక్రమసింఘే రోజూ వచ్చి నన్ను ప్రధాని సీట్లోంచి తోసేసి తను కూర్చుంటున్నాడు. నేనేమైనా హర్ట్ అవుతున్నానా! అతడినే హర్ట్ చేసి మళ్లీ నా సీట్లో నేను కూర్చోవడం లేదా?! ‘‘నేను ప్రధానిని. లెయ్ నా ప్రధాని సీట్లోంచి’’ అంటాడు సింఘే. ‘‘నేనూ ప్రధానినే. నన్నెందుకు లేపుతున్నావ్ నా ప్రధాని సీట్లోంచి’’ అంటాను. ‘‘నేను ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని. నువ్వు ప్రెసిడెంట్ ఎన్నుకున్న ప్రధానివి’’ అంటాడు. పార్లమెంటులో జనాన్ని పోగేసి ఒక్క నెలలోనే రెండుసార్లు నా మీద అవిశ్వాసం పెట్టించాడు. ‘‘చూశావ్ కదా. నేనే ప్రధానిని. నువ్వు కాదు’’ అన్నాడు. ఆ రెండుసార్లూ నేనేమైనా ప్రధాని సీట్లోంచి పరాజితుడిలా లేచి వెళ్లానా? ‘‘టీవీలో రోజూ నన్ను చూస్తూనే ఉన్నారు కదా మైత్రిపాలా.. మీరేమీ ఇన్స్పైర్ కావడం లేదా?’’ అని ఫోన్ చేసి అడిగాను. ‘‘ఇన్స్పైర్ అయ్యే మూడ్‌లో లేను’’ అన్నాడు! ‘‘ఇన్స్పిరేషన్కి మూడ్‌తో పనేంటి మిస్టర్ ప్రెసిడెంట్? మూడ్ రావడానికే కదా ఇన్స్పిరేషన్ ఉండాలి’’ అన్నాను. ‘‘మూడ్ వల్ల ఇన్స్పిరేషన్ వస్తుందా, ఇన్స్పిరేషన్ వల్ల మూడ్ వస్తుందా అని ఆలోచించే మూడ్ కూడా లేదు రాజపక్సా..’’ అన్నాడు. ‘‘మరేం ఆలోచించే మూడ్‌లో ఉన్నారు?’’ అని అడిగాను. ‘‘దేశాధ్యక్షుడనే మనిషి కంపల్సరీగా ఏదో ఒకటి ఆలోచించే మూడ్‌లో ఉండాల్సిందేనా రాజపక్సా’’ అన్నాడు! ఆయన పక్కనుంచి మాటలు వినిపిస్తున్నాయి. ‘‘రాజపక్స ఎలాగూ కోర్టు మాట వినడు. కోర్టు కన్నా ముందే మీరు మీ ఆర్డర్‌ని డిజాల్వ్ చేసుకుని.. మైత్రిపాల చెప్పినా రాజపక్స వినలేదని అనిపించుకోవడం ఎందుకు?’’ అంటున్నారెవరో.. తెలివైనవాళ్లు. మాధవ్ శింగరాజు -
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్)
స్మృతి, నేను, రమేశ్ సర్, సుధా మేడమ్.. ఏర్పోర్ట్ లాంజ్‌లో కూర్చొని ఉన్నాం. ఫ్లయిట్కింకా టైమ్ ఉన్నట్లుంది. ఇంకా ఎంత టైమ్ ఉందో చెయ్యి వెనక్కు తిప్పి చూసుకునే మూడ్‌లో గానీ, నా పక్కనే ఉన్న స్మృతి చెయ్యి వెనక్కు తిప్పి చూసే మూడ్‌లో గానీ నేను లేను. చేతులంటేనే భయంగా ఉంది. బ్యాటింగ్ చేసిన చేతులు.. బౌలింగ్ చేసిన చేతులు.. ఫీల్డింగ్ చేసిన చేతులు.. టీ–ట్వంటీ కప్పు లేకుండా ఇప్పుడు ఇండియా బయల్దేరిన చేతులు! హర్మన్‌ప్రీత్ కౌర్ కప్పు తెచ్చేస్తుందని పంజాబ్‌లో అందరూ అనుకుంటున్నారట. హమ్జీత్ రోజూ ఫోన్ చేసి చెప్పేది. అది నా చెల్లెలు. స్మృతిలా బాగా యాక్టివ్. ‘‘అక్కా.. నువ్వు కప్పు తెస్తే ఇండియాకే అది ఫస్ట్ కప్ అవుతుంది. అప్పుడు నువ్వు కూడా ఫస్ట్ అవుతావు.. ఫస్ట్ కప్పు తెచ్చి’’ అంటుండేది. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఓడిపోగానే హమ్జీత్ మళ్లీ ఫోన్ చేసింది. ‘‘అక్కా ఫీల్ అవకు. కెప్టెన్‌గా నీ తర్వాతే ఎవరైనా. కానీ అక్కా.. మిథాలీ అక్కను సెమీస్ లోంచి డ్రాప్ చేయకుండా ఉంటే బాగుండేది కదా’’ అంది. ‘‘పంజాబ్‌లో మనవాళ్లు ఏమను కుంటున్నారు చెప్పు?’’ అన్నాను. ‘‘అదే అక్కా.. మిథాలీ అక్కను డ్రాప్ చేయకుండా ఉండాల్సింది అనుకుంటున్నారు’’ అంది. ‘‘హమ్జీత్.. సరిగా చెప్పు.. ఇండియా ఓడిపోయిందని అక్కడ ఎవరూ అనుకోవడం లేదా?’’అని అడిగాను. ‘‘లేదక్కా.. అంతా మిథాలీ అక్క గురించే మాట్లాడు కుంటున్నారు..’’ అంది! ఏర్పోర్ట్కి వచ్చే ముందు కూడా హమ్జీత్ ఫోన్ చేసింది. ‘‘అక్కా.. మిథాలీ అక్కతో ఓసారి మాట్లాడించవా?’’ అని. ‘‘దగ్గర్లో లేదు. వచ్చాక మాట్లాడిస్తాను’’ అని చెప్పాను. అది వదలట్లేదు. ‘‘మీరంతా ఒకే చోట లేరా?’’ అని అడిగింది. ‘‘ఎయిర్‌పోర్ట్‌లో కలుస్తాంలే’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ‘‘ఏంటి హర్మీత్.. ఆలోచిస్తున్నావ్? ఒకరెవరికో టీమ్‌లో ఆడే అవకాశాన్ని మనం ఇవ్వనంత మాత్రాన టీమ్ ఓడిపోతుందా?! టీమ్‌లో అంతా బాగా ఆడినా కూడా ఓడిపోయామంటేనే.. ఆటలో లేని ఆ ఒక్కరి వల్ల మనం ఓడిపోలేదని తెలుస్తూనే ఉంది కదా ’’ అన్నారు రమేశ్ సర్. ‘‘అక్కా.. నేను బాగానే ఆడాను కదా’’ అంటోంది స్మృతి మాటిమాటికీ. హమ్జీత్ కూడా ఇలాగే అడుగుతుంటుంది.. ‘‘అక్కా.. నాన్న నిన్ను తిట్టడానికి నేౖ¯ð తే కారణం కాదు కదా’’ అని. నవ్వాను. ‘‘మా అందరికన్నా నువ్వే బాగా ఆడావ్’ అని చెప్పాను. స్మృతి ఒక్కటే టీమ్‌లో ఎక్కువ రన్స్ చేసింది. ఫోర్లు కూడా తనే ఎక్కువ కొట్టింది. ఒక సిక్సర్ కూడా. మిథాలీ కూడా ఉంటే బాగుండేదేమో. అప్పుడింత ఆలోచన ఉండేది కాదేమో.. ఓడినా. ‘‘ఇప్పుడేమైందని అలా ఉన్నావ్ హర్మీత్?’’ అంటున్నారు రమేశ్ సర్, సుధా మేడమ్. రమేశ్ సర్ కోచ్. సుధా మేడమ్ సెలక్టర్. స్మృతి నలుగురిలో చిన్నది. ‘‘అక్కా.. అలా ఉండకు’’ అంది. సుధా మేడమ్ మా అందర్లోకీ పెద్ద. నా భుజాన్ని తట్టి ‘‘నో ఎమోషన్స్ బేబీ’’ అంది. టీమ్ మేనేజర్ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు.. ‘‘ఇక్కడున్నారా..’’ అంటూ. ఆవిడ వైపు చూశాను. ‘‘పిచ్ టఫ్‌గా ఉంటుందనే కదా, టఫ్‌గా లేని ప్లేయర్‌ని వద్దనుకున్నాం. కోచ్ ఎవరైనా అదే చెబుతారు. కెప్టెన్ ఎవరైనా అదే చేస్తారు. ఇందులో నీ తప్పేంటి?’’ అన్నారు. కన్విన్స్ కాలేకపోతున్నాను. ఆడి ఓడిపోయిన టీమ్‌ని పట్టించుకోకుండా, ఆటలో లేకుండా పోయిన ప్లేయర్ గురించే దేశమంతా మాట్లాడుతోందంటే.. తప్పు కెప్టెన్‌దే. -మాధవ్ శింగరాజు -
హారరిన్దీమిడ్నైట్
ఎడిటర్ భార్గవ పెద్దగా నవ్వాడు. ఎంత పెద్దగా అంటే.. ఆ పత్రికా కార్యాలయమే కనుక ఒక పెద్ద ఊడల మర్రి అయి ఉంటే.. ఆ ఊడలన్నీ కదిలిపోయేంత పెద్దగా!గాయత్రి అనే చిన్న పాప రాసిన ఉత్తరం ఆయన చేతిలో ఉంది. ఆ ఉత్తరం చదివాడు. అందుకే అంత పెద్దగా నవ్వాడు. ‘ప్రళయ’ పత్రికా కార్యాలయం అది. ఆ పత్రిక ఎడిటరే భార్గవ. ప్రళయ.. న్యూస్ పేపర్ కాదు. ‘వ్యూస్’ పేపర్. దినపత్రికే కానీ, ఘటనలను ఇవ్వదు. ఘటనల వెనుక ఉన్నదేమిటో ఊహించి ఇస్తుంది. అది కూడా మామూలు ఘటనలు కావు. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, విలయాలు, విపత్తులు, విధ్వంసాలు.. ఇలాంటి వాటిపై వ్యూస్ ఉంటాయి. కేరళలో మొన్న వరదలు వచ్చినప్పుడు ‘అయ్యప్పస్వామికి కోపం వచ్చిందా?’ అని ఈ పత్రిక విరామం లేకుండా స్టోరీల మీద స్టోరీలు కొట్టింది! అయ్యప్పస్వామికి కోపం వచ్చిందో లేదో తేల్లేదు కాదు, ప్రళయపై విమర్శలు మాత్రం వచ్చాయి. కానీ, సర్క్యులేషన్ పెరిగింది! ఏదైనా పత్రికలో ఒకటీ రెండూ కాలమ్స్ బాగా పాపులర్ అయి ఉంటాయి. ‘ప్రళయ’లో అలాక్కాదు. ప్రతి కాలమ్, ప్రతి పేజీ పాపులరే! రోజూ మూడో పేజీలో వచ్చే దెయ్యం కథైతే.. హారరిన్దీమిడ్నైటే! ప్రళయ.. వాకిట్లో పడగానే, దాన్ని చేతుల్లోకి తీసుకున్నవాళ్లు.. వెంటనే పేజీ తిప్పి రైట్ సైడ్ మూడో పేజీలో ఉండే దెయ్యం కథ కోసం వెతుక్కుంటారు. దానికో పెద్ద దెయ్యం బొమ్మ ఉంటుంది. కథ చదవగానే ఎంతటి ధైర్యస్థులకైనా దెయ్యం పట్టినట్లు అవుతుంది. అంత ఘోస్టీ›్లగా ఉంటుంది. పేజ్ త్రీలో వచ్చే కథ.. ‘పేజ్ త్రీ గర్ల్’లా ఉండాలని అంటాడు భార్గవ. అంటే.. వ్యామోహం కలిగించేలా! దెయ్యాల బొమ్మల్ని కూడా అతడు అందమైన అమ్మాయిల్లా వేయిస్తాడు. అసలా పైశాచిక అందానికే సగం ఛస్తారు పాఠకులు. విరబోసుకున్న జుట్టు, ఎరుపెక్కిన కళ్లు, ‘వాడాయ్..’ అని పాట పాడుతున్నట్లు ఉంటుంది ఆ దెయ్యం ఇలస్ట్రేషన్. నవ్వు ఆపుకోలేక పోతున్నాడు భార్గవ. అతడి చేతిలో గాయత్రి అనే ఆ పాప రాసిన ఉత్తరమింకా అలానే ఉంది. మళ్లీ ఒకసారి చదివాడు. ‘‘డియర్ అంకుల్.. మీరు వేసే కథల్లో, బొమ్మల్లో ఎప్పుడూ ఆడ దెయ్యాలే ఉంటాయెందుకు? దెయ్యాల్లో మగ దెయ్యాలు ఉండవా? దయచేసి నా సందేహానికి సమాధానం చెప్పగలరు’’– ఇట్లు మీ పత్రిక రీడర్, గాయత్రి, టెన్త్ క్లాస్, హైదరాబాద్.భార్గవకు సంతోషం వేసింది. ‘ప్రళయ’కు టీనేజ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న సంతోషం అది. కాలింగ్ బెల్ నొక్కాడు.ధడేల్మని తలుపు తోసుకుని వచ్చాడు ప్రళయ కిశోర్. ఆఫీస్ బాయ్ అతడు. అతడి పేరు కిశోర్ మాత్రమే. ప్రళయలో పని చేస్తున్నాడు కాబట్టి ప్రళయ కిశోర్. ఆ ఆఫీస్‌లో ప్రతి ఒక్కరి పేరుకు ‘ప్రళయ’ అన్న మాట ప్రీఫిక్స్గా ఉంటుంది. ఆ నియమం పెట్టింది కూడా భార్గవే. చేస్తున్న పని మీద, చేస్తున్న వృత్తి మీద గౌరవం ఉన్నా లేకున్నా, ఆఫీస్‌లో ఉన్నంత వరకు గౌరవం పాటించడానికి పెట్టిన నిబంధన అది. తనని కూడా ప్రళయ భార్గవ అనే అనమంటాడు భార్గవ.‘‘ప్రళయ మనోహర్ని రమ్మను’’.. బాయ్‌తో చెప్పాడు భార్గవ. మనోహర్ వచ్చాడు. కూర్చోమనలేదు భార్గవ. అతడికి తెలుసు.. తన స్టాఫ్ ఎవరికీ ఎడిటర్ ఎదురుగా కూర్చునేంత తీరిక ఉండదని. ‘‘ఇవాళ్టి పేజ్ త్రీ దెయ్యం కథ వచ్చిందా?’’ అడిగాడు. ‘‘రాలేదు సార్’’ అన్నాడు ప్రళయ మనోహర్. ‘‘ఎందుకు రాలేదు?’’ పెద్దగా అరిచేశాడు భార్గవ. ఉలిక్కిపడ్డాడు ప్రళయ మనోహర్. మూడో పేజి ఇన్‌ఛార్జి అతడు. పేజ్ త్రీ దెయ్యం కథ బయటి నుంచి వస్తుంది. దాన్ని రాస్తున్నది ప్రళయ భయంకర్. భయంకర్ అసలు పేరు దీనదయాళ్. భార్గవే అతడికి భయంకర్ అనే పేరు పెట్టాడు.‘‘ఇంకా పది కథలు రెడీగా ఉన్నాయి సార్’’ అన్నాడు ప్రళయ మనోహర్.. ‘ఇంకో పది రోజుల దాకా ప్రళయ భయంకర్ కథ ఇవ్వకున్నా పర్లేదు’ అన్న టోన్‌లో. ‘‘సో.. మిస్టర్ ప్రళయ మనోహర్.. ఇంకో పది రోజులు మిమ్మల్ని నా క్యాబిన్లోకి పిలవక్కర్లేదనేనా మీరు అంటున్నారు!’’ అన్నాడు భార్గవ. ప్రళయ మనోహర్ భయంతో బిగదీసుకుపోయాడు. అతడి భయం చూసి భార్గవ కాస్త తగ్గుముఖం పట్టాడు. ‘‘ఎన్ని కథలు రెడీగా ఉన్నా, ఇవాళ్టి కథను మనం రెడీ చేసుకోవాల్సిందే మనోహర్. లేకుంటే పత్రికను నడపలేం’’ అన్నాడు. ‘‘సర్.. ఫోన్ చేశాను. వాళ్ల మిసెస్‌కి బాగోలేదట. అయినప్పటికీ, లెవన్త్ అవర్లోనైనా ఇచ్చేస్తానన్నారు’’.. చెప్పాడు మనోహర్.‘‘ఏం బాగోలేదట?’’.. క్యాజువల్‌గా అడిగాడు భార్గవ. చాలా క్యాజువల్‌గా. జనరల్‌గా అతడు అలా అడగడు. ఆఫీస్ స్టాఫ్‌లో కూడా లేడీస్‌కి ఎవరికైనా బాగోలేదని తెలిస్తే, ‘ఏమైంది?’ అని అడగడు. జస్ట్ బాగోలేదు అన్నంతవరకే ఆ టాపిక్‌కి ఆపేస్తాడు. ‘‘ఏం బాగోలేదట?’’ మళ్లీ అడిగాడు.. ఆ అడగడంలో, తనకు కథ రాలేదన్న అసహనం కన్నా, భయంకర్పై కన్సర్నే ఎక్కువగా ఉంది. ‘‘దెయ్యం పట్టిందట సర్.. వాళ్లావిడకు’’ చెప్పాడు మనోహర్. ‘‘వ్హాట్..!’’ అన్నాడు భార్గవ. భార్గవ క్యాబిన్లో అతడి ఎదురుగా కూర్చొని ఉన్నాడు భయంకర్. అతడి చేతిలో ఆవేళ్టి కథ ఉంది. ఇస్తానన్నట్లుగానే క్రితం రోజు కథను క్రితం రోజు రాత్రే చివరి నిముషంలో పంపించాడు కూడా. ‘‘మిసెస్ భయంకర్ ఇప్పుడెలా ఉన్నారు’’ అడిగాడు భార్గవ. ‘‘తను ఓకే.. నేనే బాగోలేనట..’’ ‘‘డాక్టర్ చూసింది తననా, మిమ్మల్నా?’’ నవ్వాడు భార్గవ.‘‘తనని చూసి, నాకు చెప్పాడు. దెయ్యం పట్టినట్లు బిహేవ్ చేస్తోంది డాక్టర్ అని చెప్పాను. ‘అయితే అది ఆమె ప్రాబ్లమ్ కాదు, మీ ప్రాబ్లమ్’ అన్నాడు. ‘అదేంటి డాక్టర్?’ అన్నాను. మీరు ఆమెను పట్టించుకోకపోవడం వల్లనే, ఆ స్పేస్‌లో ఆమెకు దెయ్యం పట్టింది’ అన్నాడు!’’.. చెప్పాడు భయంకర్. భయంకర్ వెళ్లిపోయాక, శ్రీకంఠను పిలిపించాడు భార్గవ. దెయ్యం కథకు రెగ్యులర్‌గా బొమ్మలు వేస్తుండే ఆర్టిస్ట్ అతడు.‘‘ఇవాళ్టి నుంచి, దెయ్యం కథకు మగ దెయ్యం బొమ్మ వెయ్యండి’’ చెప్పాడు భార్గవ. సంశయంగా అక్కడే ఆగిపోయాడు శ్రీకంఠ. ‘‘సర్క్యులేషన్ పడిపోయినా పర్లేదు.. మగదెయ్యం బొమ్మ వెయ్యండి’’ చెప్పాడు భార్గవ. - మాధవ్ శింగరాజు -
మానుకైనా వస్తుంది
కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా.. అంటారు. మానులకు వచ్చే కష్టాల గురించి మనకు తెలియక అలా అనుకుంటామేమో మరి. మానులకు కష్టాలు వస్తాయా లేదా అనే మాట అంటుంచితే మానుల వల్ల మనుషులకు వచ్చే కష్టాలు తక్కువే. ఏవో విపత్తులు, విలయాలు సంభవించి మానులు విరిగిపడితే తప్ప మనుషులకు కష్టాలు రావు. అందుకే మనిషికి కష్టం వచ్చిందంటే అది మనిషి వల్లనే అయి ఉంటుంది. ఎంత మంది మనుషులున్నారో, మనుషుల వల్ల మనుషులకు అన్ని రకాల కష్టాలు వస్తుంటాయి. కష్టాల పాలయ్యే మనుషుల గురించి, కష్టాల పాల్జేసే మనుషుల గురించి కొత్తగా చెప్పుకోడానికి ఎప్పుడూ ఏమీ ఉండదు. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు పడిపోయినప్పుడు తెలుసుకోవడమే. కష్టం అనేది చిన్న మాట. ఇందులో తీవ్రతలు ఉంటాయి. కష్టాన్ని తట్టుకునే మనిషిని బట్టి ఆ తీవ్రతలు కొద్దివో, పెద్దవో అవుతుంటాయి తప్ప, తీవ్రతకు కొలబద్ద అంటూ ఏమీ ఉండదు. బతకలేకపోవడం అన్నిట్లోకీ పెద్ద కష్టం. డబ్బు లేక బతకలేక పోవడం, ఆరోగ్యం లేక బతకలేకపోవడం, అవమానం తట్టుకోలేక బతకలేకపోవడం, ఆత్మగౌరవం దెబ్బతిని బతకలేకపోవడం.. ఇవన్నీ పెద్ద కష్టాలే. ముఖ్యంగా ఆడపిల్లలు. రక్షణ ఉండాలి వాళ్లకు. అది లేకపోవడం బతకలేకపోవడాన్ని మించిన కష్టం. కొద్దిరోజులుగా వింటున్నాం. జగత్తుకు ఏ చీడో పట్టినట్లు అన్నీ అత్యాచారాల ఘటనలే. అడవిలో మానుల్ని కూడా వదిలిపెట్టేలా లేదు ఈ చీడ. మామూలుగా.. కష్టపడిన వాళ్లపై సానుభూతి ఉంటుంది. కష్టపెట్టినవాళ్లపై కోపం ఉంటుంది. తప్పు ఎటుందీ అని కాకుండా, కష్టం ఎటుందీ అనే దాన్ని బట్టే లోకంలో తీర్పులు ఉంటాయి. తప్పులేదు. తాత్కాలికంగా అలాంటి తీర్పులు అవసరమే. ‘జాగ్రత్తగా లేకపోవడం నీ తప్పే’ అని.. కష్టంలో ఉన్నవాళ్లను ఇంకా కష్టపెట్టలేం కదా. అలాగని జాగ్రత్త చెప్పకుండా ఉండడం కూడా కష్టంలోకి నెట్టడమే అవుతుంది. ఒక అమ్మాయికి కష్టం వచ్చిందంటే అందులో ఆమె కొని తెచ్చుకున్న కష్టం కూడా కొంత ఉంటుందని మమతా మోహన్‌దాస్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ మాట ఎవరికీ రుచించలేదు. ‘అందమైన లోకమనీ, రంగురంగులుంటాయని’ నమ్మడం ఆడపిల్ల తప్పెలా అవుతుందని అన్నారు. నిజమే కానీ ఆ రంగుల మధ్య మగవాడి అసలు రంగును పోల్చుకోలేకపోవడం ఆడపిల్ల తప్పే అవుతుంది. – మాధవ్ శింగరాజు -
గోడవతలి పాట
ఇంటì కెళ్లకుండా కొన్ని గంటలుగా బయట బయటే తిరుగుతున్నాడు ఖడ్గధారి. ఇంటికెళితే భార్య ఏడుపు చూడలేడు. అందుకే బయట తిరుగుతున్నాడు. అతడితో పాటు అతడి ఆలోచనలూ తిరుగుతున్నాయి. భర్త చనిపోతే భార్య ఎందుకు ఏడుస్తుందో అతడికి అర్థం కావడం లేదు! కడుపున పుట్టినవాళ్లు చనిపోతే ఏడ్వడంలో అర్థం ఉంది. కట్టుకున్నవాడు కడుపున పుట్టినవాడు కాదు. మరెందుకు ఏడుస్తారు ఈ ఆడవాళ్లు?! భర్తనేవాడు ఎక్కడో బయటి నుంచి వస్తాడు. ఎప్పుడో చెప్పాపెట్టకుండా వెళ్లిపోతాడు. మధ్యలో కొన్నాళ్లు కలిసి ఉన్నందుకేనా ఇంత దుఃఖం! భార్య మీద కోపం వచ్చిందతడికి. పెద్ద పిల్లే కదా. చావులు చూడకుండానే పెరిగిందా! ఇదేమైనా చావులు లేని లోకమని ఎవరో చెబితే నమ్మి వచ్చేసిందా! చికాకేసింది ఖడ్గధారికి. భార్య అమాయకత్వం అతడిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఎట్లా బతుకుతుందీ అనుకున్నాడు. ఆ వెంటనే మళ్లీ అనుకున్నాడు. తను ఆమెను బతికించిందేమీ లేదు కనుక, ఎలా బతుకుతుందన్న చింత తనకు అవసరం లేదనుకున్నాడు. కానీ ఆమె ఏడుపే! ఎవరూ పట్టలేకపోతున్నారు. గుండెలు బాదుకుంటోంది. స్పృహ తప్పి పడిపోతోంది. ముఖం మీద నీళ్లు చల్లుతున్నారు. కళ్లు తెరిచి చూసి, మెడలో మంగళసూత్రాన్ని రెండు గుప్పెళ్లతో బిగించి పట్టుకుని, దేవుణ్ణి శాపనార్థాలు పెడుతోంది! రోజూ పూజ చేసే దేవుణ్ణేనా తను ఇంతగా తిట్టగలుగుతోంది?! ఖడ్గధారి చనిపోయి అప్పటికి కొన్ని గంటలే అయింది. ఆ ఉదయం నోట్లో బ్రష్ పెట్టుకుని పళ్లు తోముకుంటూ, కళ్లు మూసుకుని పక్కింట్లోంచి టీవీలో వస్తున్న డైలాగులేవో వింటూ అకస్మాత్తుగా గుండె ఆగి చనిపోయాడు. అవేమీ గుండెను ఆపేంత బరువున్న డైలాగులు కావు. వాటికి సంబంధం లేకుండా గుండె తనకై తాను ఆగిపోయింది. తను విన్న ఆ చివరి డైలాగ్ ఖడ్గధారికి గుర్తుంది. ఏ సినిమాలోనిదో మరి. రాజేంద్రప్రసాద్ అంటుంటాడు.. ‘ఇదివరకట్లా ఆడవాళ్లు అమాయకులు కాదు’ అని. ఆ మాట.. కోట శ్రీనివాసరావుతోనో, మరెవరితోనో అంటున్నట్లున్నాడు. ఖడ్గధారికి ఓ అలవాటుంది. మాట గానీ, పాట గానీ ఏదీ పూర్తిగా వినడు. టీవీ అయినా అంతే. సినిమా అయినా అంతే. మనుషులైనా అంతే. వినకూడదనేం కాదు, కొంత విన్నాక, కొంత చూశాక తనకు తెలియకుండానే ఆ విన్నదాన్ని, ఆ చూసినదాన్ని పట్టుకుని తన ఆలోచనల్లోకి తను వెళ్లిపోతాడు. ‘ఇదివరకట్లా ఆడవాళ్లు అమాయకులు కాదు’ అన్న మాటను పట్టుకున్నాయి అతడి ఆలోచనలు. అసలు ఆడవాళ్లు ఇప్పుడైనా, ఎప్పుడైనా అమాయకంగా ఎందుకుండాలి? ఉంటారని ఎందుకనుకోవాలి? ఒకవేళ ఆడవాళ్లు అమాయకులే అయితే, వాళ్లను అమాయకులుగా ఉంచేసింది మగవాళ్లే కదా.. ఇలా ఆలోచనలు సాగుతూ ఉండగా.. నోట్లో బ్రష్షు నోట్లో ఉండగానే టప్పున ఎగిరిపోయాడు ఖడ్గధారిలోని జీవుడు! ఖడ్గధారి కుప్పకూలిన విషయం లోపల ఉన్న భార్యకు తెలీదు. ఎప్పట్లా అతడు బయట సింకు దగ్గర నిలబడి గోడవతలి నుంచి వచ్చే పాటల్ని, మాటల్ని వింటూ కాలకృత్యాలను మెల్లిగా కానించుకోవడం ఆమెకు తెలియని సంగతేం కాదు. ప్రతి ఉదయం అతడికి అదొక ఇష్టమైన వ్యాపకం.పక్కింట్లోంచి వినిపించే పాటే.. వీళ్లింట్లోనూ వస్తుంటుంది. అయితే అది అతడి గమనింపులో ఉండదు! అటువైపు నుంచి వచ్చే పాటలకు, మాటలకు మాత్రమే అతడు ట్యూన్ అవుతాడు. ఆ అలవాటు అతడికి ఎలా అయిందనే మాట అటుంచితే.. అది ఎంతలా అయ్యిందంటే.. పక్కింటివాళ్లు ఓసారి నాలుగు రోజులు ఊరెళ్లినప్పుడు ఖడ్గధారి బాగా ఇబ్బందిపడిపోయాడు. ఆ సంగతిని అతడి భార్య ఏదో సందర్భంలో పక్కింటి వాళ్లతో చెప్పింది కూడా. అందుకు వాళ్లు ఎంతగానో సంతోషించారు. తిరిగినంతా తిరిగి, ఇంటివైపు నడుస్తున్నాడు ఖడ్గధారి. తన భార్య ఇంకా గుండెలు బాదుకుంటూనే ఉంటుందా? ఏడిచే ఓపిక కూడా లేక సొమ్మసిల్లి పడిపోయి ఉంటుందా? చీకట్లో నడుస్తూ ఆలోచిస్తున్నాడు. దారి మధ్యలో శ్మశానం ఉంది. అది దాటుకుని కిలోమీటరు దూరం వెళితే ఖడ్గధారి ఇల్లు వస్తుంది. నడక మధ్యలో ఓ మనిషి ఖడ్గధారికి తగిలాడు. ఖడ్గధారిని అతడు అనుమానంగా చూశాడు. ‘‘ఏంటలా చూస్తున్నావు?’’ అడిగాడు ఖడ్గధారి. ‘‘ఈ దారిన, ఈ సమయంలో వెళ్లేవాళ్లందర్నీ నేను ఇలాగే చూస్తాను. నన్ను ఈ శ్మశానం నుంచి దాటిస్తారా?’’ ప్రాధేయపడినట్లుగా అడిగాడు ఆ వ్యక్తి. ‘దెయ్యాలంటే ఈ మనుషులెందుకు ఇంత భయపడి చస్తారో’ అనుకున్నాడు ఖడ్గదారి. ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. ‘‘ఎప్పుడో గానీ ఈ దారి గుండా రాను. కానీ నేనెప్పుడు ఇటువైపు వచ్చినా ఒక చితి కాలుతూ ఉంటుంది’’ అన్నాడు ఆ వ్యక్తి. ఖడ్గదారి అతడివైపు, చితివైపు చూశాడు. దూరంగా కాలుతున్న చితి మంటల వెలుగులో అతడి ముఖంలోని భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ చితిలో మండుతున్నది తనేనని అతడికి చెప్తే! ‘‘ఏమైనా మాట్లాడండి.. మౌనంగా ఉంటే నాకు అదోలా ఉంది’’ అన్నాడు ఆ భయపడుతున్న మనిషి. మాట్లాడే మూడ్‌లో లేడు ఖడ్గధారి. ‘నువ్వే మాట్లాడొచ్చు కదా’ అనొచ్చు. కానీ అతడు మాట్లాడినా వినే మూడ్ ఖడ్గధారికి లేదు. భార్య గురించి ఆలోచిస్తున్నాడతడు. తనిక్కడ చితిలో ఉంటే తనక్కడ కాలిపోతూ ఉంటుంది. త్వరగా ఇంటికి చేరుకుని, ‘ఇలాగైతే ఎలా! ధైర్యంగా ఉండలేవా?!’ అని ప్రేమగా మందలించాలని అతడి మనసు ఆరాటపడుతోంది. ఖడ్గధారి, ఆ వ్యక్తి.. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే కొంత దూరం నడిచారు. చితిని కూడా దాటుకుని ముందుకు నడిచారు. ‘‘ఒక్కటే అనుకున్నాను’’ అన్నాడు ఆ వ్యక్తి. ‘‘ఏంటి.. ఒక్కటే ?’’ అని అడిగి, సమాధానం వినకుండా మళ్లీ ఆలోచనల్లో పడిపోయాడు ఖడ్గధారి. మరికొంత దూరం కలిసి నడిచాక, ఇద్దరూ విడిపోయారు. ఖడ్గదారి నేరుగా తన ఇంటివైపు వెళ్లాడు. ఇంటి దగ్గర వీధిలో మాటలు వినిపిస్తున్నాయి. ‘‘ఇద్దర్నీ పక్కపక్కనే పేర్చారు. ఎంతైనా భార్య కదా. పాడెను లేపుతుంటే చూళ్లేక అక్కడే కుప్పకూలిపోయింది’’.‘‘పక్కింటి వాళ్లతో ఏవేవో ఆలాపనగా మాట్లాడిందట. ‘ఆయన చనిపోలేదు, ఉదయాన్నే టీవీ పెట్టడం మర్చిపోకండి’ అని అంటుంటే వాళ్లకు కన్నీళ్లు ఆగలేదట’’. ఖడ్గధారి గుండె ముక్కలయింది. తిరిగి అతడు చితి వైపు గాలిలోకి లేస్తుండగా ఎవరో అంటున్న మాట చెవులకు సోకింది – ‘‘ఈ భార్యలు ఇంత అమాయకంగా ఉంటారెందుకో!’’ - మాధవ్ శింగరాజు -
దెయ్యాలపల్లి
‘‘నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది’’ అన్నాడు కుర్రాడు. ‘‘ఏమో.. చెప్పలేం.. ఉండిపోవలసి వస్తుందేమో’’ అన్నాడు ఆ గురువులాంటి ఆయన. ‘దెయ్యాలపల్లి’ ఇంకో రెండు కిలోమీటర్ల దూరంలో ఉందనగా, వేగంగా వెళుతున్న ఆ వ్యాన్‌లోని నలుగురికీ ‘దెయ్యాలపల్లికి స్వాగతం’ అనే బోర్డు.. ఇలా కనిపించి, అలా మాయమైపోయింది. ‘దగ్గరికొచ్చింది’ అనుకున్నారు. ఆ నలుగురిలో ఒకరు డ్రైవరు కాదు. డ్రైవరు ప్లస్ నలుగురు. మొత్తం ఐదుగురున్నారు వ్యాన్‌లో. డ్రైవరుకు, దెయ్యాలపల్లికి సంబంధం లేదు. వాళ్లు రమ్మంటే వచ్చాడు. ఎందుకు, ఏమిటి అని అడగలేదు. డబ్బులిస్తాం అన్నారు. సరేనని వచ్చేశాడు. పెట్రోల్ వాళ్లే కొట్టించాలి. భోజనం వాళ్లే పెట్టించాలి. రోజుకు ఇంతని ఇవ్వాలి. అదీ ఒప్పందం. అప్పుడు కూడా డ్రైవర్ అడగలేదు. ఏమిటీ, ఎన్నిరోజులు అని. ఎన్ని రోజులైతే మాత్రం ఏంటి? తన బండి ఖాళీగా ఉండదు. అదే అతడికి కావలసింది. ‘దెయ్యాలపల్లికి దేనికి సార్?’ అని ఒక్కమాట అడిగి ఉంటే.. డ్రైవర్ మనసు మార్చుకుని ఉండేవాడేమో అనుకోనవసరం లేదు. అతడికి దెయ్యాలపల్లి అయినా, దేవుళ్లపల్లి అయినా ఒకటే. జీవితం అతyì కి రోజూ మనుషుల్లోనే ఎక్కడో ఒకచోట దెయ్యాలను, దేవుళ్లను చూపిస్తూనే ఉంటుంది. అందుకని ఒకవేళ అతడికి దేవుడినో, దెయ్యాన్నో చూడాలని అనిపించినా దెయ్యాలపల్లికో, దేవుళ్లపల్లికో వెళ్లే అవసరం ఉండదు. ఆరు గంటలుగా అతడు డ్రైవ్ చేస్తున్నాడు. తన వ్యాన్‌లో కొంతమంది మనుషులున్నారని, వాళ్లేదో మాట్లాడుకుంటున్నారనీ ధ్యాస లేదు అతడికి. అయినా అప్పుడప్పుడు కొన్ని మాటలు అతడి చెవిలో పడుతూనే ఉన్నాయి. వాళ్ల నలుగురూ దెయ్యాలపై రిసెర్చ్ చెయ్యడానికి దెయ్యాలపల్లి బయల్దేరారని మాత్రం అతడికి అర్థమైంది. ‘పిచ్చి పని’ అనుకున్నాడు. దెయ్యాలు ఉంటే ఉంటాయి? లేకపోతే లేదు. ఉన్నాయని నిర్ధారించుకున్నందు వల్ల, లేవని నిరూపించినందు వల్ల ఈ దెయ్యాల గొడవ అక్కడితో వదిలిపోయేది కాదు. కొత్తగా మనుషులు పుట్టుకొస్తున్నట్లే.. ఆ కొత్త మనుషులకు దెయ్యాల గురించి ఈ పాత సందేహాలే మళ్లీ పుట్టుకొస్తుంటాయి. ‘‘దెయ్యాలు లేకపోతే దెయ్యాలపల్లి అనే పేరు ఎలా వస్తుంది?’’ అని అంటున్నాడు నలుగురిలో చిన్నవాడైన కుర్రాడు వ్యాను బయల్దేరినప్పటి నుండి. మిగతా ముగ్గురిలో ఇద్దరు అతడి కన్నా వయసులో కాస్త పెద్దవాళ్లు. నాలుగో మనిషి ఈ బృందానికి లీడర్లా ఉన్నాడు. గడ్డం తెల్లబడింది. జుట్టు నల్లగా ఉంది! ‘ఊళ్లు–పేర్లు’ అనే అంశంపై వాళ్లు అధ్యయనం చేస్తున్నప్పుడు ‘దెయ్యాలపల్లి’ అనే ఈ ఊరు వారి దృష్టిలో పడింది. ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో ‘తవ్విచూద్దాం’ అని ప్రాజెక్ట్ వర్క్ ప్లాన్ చేసుకున్నారు. ‘‘నిధులు, నిక్షేపాల్లా.. దెయ్యాలు భూగర్భంలో ఉండవు.. తవ్వి తియ్యడానికి..’ అన్నాడు ఆ తెల్లగడ్డం మనిషి. మిగతావాళ్లు నవ్వారు. సర్పంచ్ గెస్ట్ హౌస్ దగ్గర వీళ్ల వ్యాన్ ఆగింది. ‘తొందరగా భలే వచ్చేశాం!’ అనుకున్నారు కానీ.. అప్పటికే సూర్యుడు కొండ దిగుతున్నాడు. ‘‘లోపల గదులన్నీ మీవే. ఉన్నన్ని రోజులు ఉండొచ్చు. ఊళ్లో తిరిగినన్ని రోజులు తిరగొచ్చు. మీకే వివరం కావాలన్నా ఊళ్లోవాళ్లు చెబుతారు. భోజనాలూ అవీ గెస్ట్ హౌస్‌కే వస్తాయి’’ అని చెప్పాడు సర్పంచ్ పంపిన మనిషి.‘‘ఆ.. మీ డ్రైవరు కూడా లోపలే ఓ గదిలో ఉండొచ్చు. వ్యాన్‌లో పడుకోనవసరం లేదు’’.. వెళ్తున్నవాడల్లా మళ్లీ వెనక్కొచ్చి చెప్పాడు ఆ మనిషి. ఆ మాటను పెద్దగా పట్టించుకోలేదు డ్రైవర్. స్నానాలు అయ్యాక, ఫ్లాస్క్‌లో సిద్ధంగా ఉన్న కాఫీని తాగుతూ బాల్కనీలోంచి బయటికి చూస్తూ నిలబడ్డారు ఆ నలుగురూ. ఊళ్లో ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. దగ్గర్లో రామాలయంలోంచి భక్తి పాటలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. ఆ ఊరి పేరుకు, ఆ ఊరున్న తీరుకూ ఎక్కడా పొంతన లేదు. అసలు ఊళ్లోకి వస్తున్నప్పుడే వాళ్లు గమనించారు.. ఊరంతా పచ్చగా, ప్రశాంతంగా ఉండడం! పొద్దునెప్పుడో పేడనీళ్లు చల్లి, ముగ్గు వేసిన ముంగిళ్లు సాయంత్రం అవుతున్నా కూడా పొద్దు పొడవడానికి ముందే సిద్ధమైపోయినట్లుగా పచ్చి వాసన కొడుతున్నాయి. ‘‘నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది’’ అన్నాడు కుర్రాడు. ‘‘ఏమో.. చెప్పలేం.. ఉండిపోవలసి వస్తుందేమో’’ అన్నాడు ఆ గురువులాంటి ఆయన. మిగతా ఇద్దరూ అర్థం కానట్లు చూశారు. ‘‘దెయ్యాలపల్లికి ఆ పేరెలా వచ్చిందో శోధించడానికి వచ్చాం మనం. కానీ అదంత తేలిగ్గా అనిపించడం లేదు. చూశారుగా.. ఇది దెయ్యాలపల్లిలా లేదు. దేవుళ్లపల్లిలా ఉంది. గుడి, చర్చి, మసీదు ప్రతి ఊళ్లోనూ ఉండేవే. కానీ ఈ ఊళ్లో ప్రతి ఇల్లూ ఓ ప్రార్థనాస్థలంలానే ఉంది’’ అన్నాడు ఆయన. ‘‘దెయ్యాలు ఉంటేనే దేవుళ్లు అవసరం ఉంటుంది సర్’’.. అకస్మాత్తుగా వెనుకనుంచి మాట వినిపించింది.చప్పున తలతిప్పి చూశారు అంతా. ఆ మాట అన్నది డ్రైవర్! వాళ్లకు నాలుగడుగుల దూరంలో ఉండి కాఫీ తాగుతున్నాడతను.తెల్లగడ్డం ఆయన పెద్దగా నవ్వాడు. ‘‘రిసెర్చ్ అవసరం లేకుండానే ఒక్క మాటతో తేల్చేశాడు’’ అన్నాడు. మిగతావాళ్లూ నవ్వారు. తెల్లారే అందరికంటే ముందు డ్రైవర్ లేచాడు. కోనేటì లో స్నానం చేసి వచ్చాడు అతడు. గుడికి కూడా వెళ్లొచ్చినట్లున్నాడు. నుదుటిపై కుంకుమ బొట్టు ఉంది. ‘‘అప్పుడే తెరిచారా?’’ అన్నాడు తెల్లగడ్డం ఆయన. ‘‘ఎప్పుడూ మూయరట’’ అన్నాడు డ్రైవర్. ‘‘అవునా! ఏ గుడి?’’ అడిగాడాయన. చెప్పాడు డ్రైవర్.లె ల్లగడ్డం ఆయన వింతగా చూశాడు. ఆ మధ్యాహ్నం తనొక్కడే ఊళ్లొకి వెళ్లొచ్చాక తన టీమ్‌కి చెప్పాడు. ‘‘రిసెర్చ్ అయిపోయింది. వెళ్దాం, సర్దుకోండి’’.డ్రైవర్‌తో పాటు మిగతా ముగ్గురూ ఆశ్చర్యంగా చూశారు. వారం తర్వాత వీళ్ల ప్రాజెక్టు రిపోర్టు సిద్ధమైంది. అందులో తెల్లగడ్డమాయన చేతి రాతతో ముగింపు వాక్యం ఇలా ఉంది:‘దెయ్యాలపల్లిలో ఒక గుడి ఉంది. అది దేవుడికి కట్టినది కాదు. ఊరికి కట్టిన గుడి! దెయ్యాలపల్లికి ఆ పేరు ఎలా వచ్చిందో ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఊరికన్నా ముందే ఆ గుడి అక్కడ వెలసింది! - మాధవ్ శింగరాజు -
వచ్చినతను
ఆశీర్వదిస్తున్నట్లుగా చెయ్యి ఆమె తలపై ఉంచాడు ఆ వచ్చినతను. తలపై ఉంచాడే కానీ, చేతిని ఆమె తలకు తాకనివ్వలేదు. ‘‘ఉంది’’ అన్నాడు ఆ వచ్చినతను!ఉలిక్కిపడి, భర్త చేతిని గట్టిగా పట్టుకుంది కోవెల. దేవ్ కళ్లల్లో ఎలాంటి ఎక్స్ప్రెషనూ లేదు. ఆ వచ్చినతను ‘ఉంది’ అన్నప్పుడు దేవ్ ఎలా ఉన్నాడో, భార్య ఉలిక్కిపడినప్పుడూ అలాగే ఉన్నాడు. అభావంగా!డూప్లెక్స్ అది. ఇంట్లోనే మెట్లుంటాయి. కొనేముందే వద్దంది కోవెల. ఇంట్లో మెట్లుండడం ఆమెకు ఇష్టం ఉండదు. చిన్నప్పుడు టీవీలో ఏ సినిమాలోనో చూసింది, సరిగ్గా వాళ్లిప్పుడున్న ఇల్లు లాంటి ఇంట్లోనే రాత్రిళ్లు ఒక దెయ్యం మెల్లగా మెట్లు దిగుతూ ఉండడం. దెయ్యం బయటి నుంచి వస్తుందనుకుంటే తలుపులు వేసుకుని పడుకోవచ్చు. ఇంట్లోనే దెయ్యం ఉంటే తలుపులు తెరుచుకుని బయటికి పారిపోయే టైమ్ అయినా ఉంటుందా? అందుకే వద్దంది. అప్పుడు దేవ్ నవ్వాడు. ఇప్పుడూ నవ్వేవాడే కానీ, భార్య భయపడుతోంది. అందుకే నవ్వలేదు. ఇంకొకందుకు కూడా దేవ్ నవ్వలేదు. ఆ వచ్చినతన్ని తక్కువ చేసినట్లవుతుందని. అందుకే అభావంగా ఉండిపోయాడు. లేని ఫీలింగ్‌ని తెచ్చిపెట్టుకోవడం సులభమే. ఫీలింగ్‌ని దాచి పెట్టుకోవడం కష్టం. అయితే ఆ కష్టాన్ని కూడా బయటికి తెలియనివ్వడం లేదు దేవ్. ‘‘ఉంది’’ అన్నాడు ఆ వచ్చినతను మళ్లీ ఒకసారి. ‘‘ఉంది’’ అని ఆ ఇంట్లోకి వచ్చీరాగానే అనలేదు అతను. మొదట వాస్తు చూశాడు. ఉండడానికి వీల్లేదన్నాడు.గడపలన్నీ తాకి చూశాడు. ఉండడానికి వీల్లేదన్నాడు. గదులన్నీ తిరిగి చూశాడు. ఉండడానికి వీల్లేదన్నాడు. మూలల్ని కొలిచి చూశాడు. ఉండడానికి వీల్లేదన్నాడు. దూలాల్ని తట్టి చూశాడు. ఉండడానికి వీల్లేదన్నాడు. కోవెల ఊపిరి పీల్చుకుంది. ఇక లేనట్లే అనుకుంది. పూజలూ అవీ చేయిస్తే అరాకొరా ‘గాలి’ ఏమైనా ఉంటే అదీ పోతుంది అనుకుంది. ‘‘కొన్నిళ్లను చూడగానే బయటి నుంచే తెలిసిపోతుంది, ఏమీ లేవని. కానీ మీ తృప్తి కోసం ఇంట్లోకి వచ్చి చూశాను. ఏమీ లేవు, హాయిగా ఉండండి’’ అన్నాడతను. కోవెల అతడి కాళ్లకు దండం పెట్టింది. ఆశీర్వదిస్తున్నట్లుగా చెయ్యి ఆమె తలపై ఉంచాడు ఆ వచ్చినతను. తలపై ఉంచాడే కానీ, చేతిని ఆమె తలకు తాకనివ్వలేదు. దేవ్ కూడా అతడికి దండం పెట్టాడు.. కోవెల కోసం. దండం పెడుతుండగా దేవ్‌కి సందేహం వచ్చింది. దెయ్యాలను పోగొట్టేవాళ్లు కూడా గుళ్లో పూజారుల్లా మనుషులను ఆశీర్వదిస్తారా అని. హాల్లోంచి ముగ్గురూ బయటికి వచ్చారు. ఆ వచ్చినతను మళ్లొకసారి వెనక్కి తిరిగి చూశాడు.. ఇంట్లోకి. ఆ వెంటనే కోవెల వైపు, దేవ్ వైపు చూశాడు. ఎందుకో అతడి ముఖం అప్రసన్నంగా మారిపోయింది!‘‘ఉంది’’ అన్నాడు! అతడలా అన్నప్పుడే.. కోవెల ఉలిక్కిపడి, దేవ్ చేతిని గట్టిగా పట్టుకుంది. దేవ్ ఆలోచిస్తున్నాడు. ‘ఉండడానికి వీల్లేదు’ అన్న మనిషి.. ‘ఉంది’ అని అకస్మాత్తుగా అన్నాడంటే.. అతడికేదో కనిపించి ఉండాలి. కనీసం అనిపించి ఉండాలి. అంటే.. కోవెలకు అనిపించిన విధంగానే అతడికీ అనిపించిందా?! ‘‘ఉంది. ఇక్కడే ఉంది’’ అన్నాడు అతను.‘‘లేదన్నారూ..’’ అంది కోవెల. ఆ అమ్మాయి గొంతు ఆర్చుకుపోతోంది. కొత్త జంట. జీవితాన్నింకా మొదలుపెట్టనే లేదు. ‘‘నేను కాకుండా ముగ్గురు కనిపిస్తున్నారు నాకిక్కడ’’ అన్నాడతను!కళ్లు తిరిగిపడిపోయింది కోవెల. ‘‘మీతో విడివిడిగా మాట్లాడాలి’’ అన్నాడతను.దేవ్, కోవెల ఒకర్నొకరు చూసుకున్నారు. ‘‘మేము ఇద్దరం కాదు. ఒక్కరిమే. కలిపే మాట్లాడండి’’ అన్నాడు దేవ్. దేవ్‌ని అతడు తీక్షణంగా చూశాడు. ‘‘మీరిద్దరూ కలిపి ఒక్కరే. కానీ మీ ఇద్దరినీ వేరు చేయడానికి వచ్చిన వారొకరున్నారు మీ లోపల’’ అన్నాడతను. కోవెల అదిరిపడింది. దేవ్ మళ్లీ అభావంగా ఉండిపోయాడు. ఇలాంటివాటిపై దేవ్‌కి నమ్మకం లేదు. కోవెల కోసం అతణ్ణి పిలుచుకొచ్చాడంతే. దేవ్‌ని ఇంకా అలాగే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు అతను. రెండోసారి కళ్లు తిరిగి పడిపోడానికి సిద్ధంగా ఉంది కోవెల. ఆ అమ్మాయి ఇప్పుడు దెయ్యానికి భయపడడం లేదు. దేవ్‌ని, తనని విడదీయడానికే ఆ దెయ్యం వచ్చిందనే మాటకు భయపడుతోంది. దేవ్‌కి దగ్గరగా జరిగి కూర్చుంది. వాళ్ల ఎదురుగా అతను కూర్చొని ఉన్నాడు. ‘‘అలా అంటుకుని కూర్చోకమ్మా’’.. కోవెలతో సౌమ్యంగా చెప్పాడతను. ఆ సౌమ్యతను అతడు దేవ్ దగ్గర ప్రదర్శించడం లేదు. ఆ సంగతిని దేవ్ గ్రహించాడు. ‘‘ఇప్పుడే కాదు, జీవితంలో ఎప్పుడూ.. మూడో వ్యక్తి ఉన్నప్పుడు నీ భర్తను అంటుకుని కూర్చోకు తల్లీ’’ అన్నాడు. కోవెల తలూపింది. భర్తకు దూరంగా జరిగి కూర్చుంది. ఆ వచ్చినతను కాసేపు కళ్లు మూసుకున్నాడు. తర్వాత కళ్లు తెరిచాడు. దేవ్, కోవెల ముఖాలు చూసుకున్నారు. అతడు మళ్లీ కళ్లు మూసుకుని, కాసేపటి తర్వాత కళ్లు తెరిచాడు. ‘‘పట్టేశాను!’’ అన్నాడు. కోవెల ఉలిక్కిపడింది. దేÐŒ లో ఎప్పట్లాగే ఏ భావమూ లేదు. ‘‘మీ ఇద్దరూ ఒకటే అంటున్నారు కాబట్టి, మీలో ఉన్న మూడో మనిషి మీ ఇద్దరిలో ఎవరిలో ఉన్నారో చెప్పడం భావ్యం కాదు. అయితే ఒకటి మాత్రం చెప్తాను. మీ ఇద్దరిలో ఒకరు.. ఒకరు కాదు. ఇద్దరు’’ అనేసి పైకి లేచాడు. కోవెల, దేవ్ కూడా పైకి లేచారు.భయంతో కళ్లు తేలేసింది కోవెల. ఇంటి బయటికి.. గేటు దగ్గరికి వచ్చాక కోవెలను మాత్రమే దగ్గరకు రమ్మన్నట్లు చూశాడు అతను. కోవెల వెళ్లింది. ఆశీర్వదిస్తున్నట్లుగా ఆమె తలపై చెయ్యి ఉంచాడు అతను.‘‘కోవెలలో దైవం కానిదేదీ ఎక్కువ కాలం ఉండలేదు. ధైర్యంగా ఉండు’’ అన్నాడు. ఆమె తలను తాకుతూ ఆ మాట చెప్పాడతను. మాధవ్ శింగరాజు -
వెనకే ఉంది
దేవుణ్ణి నమ్మేవారికి దేవుడు కనిపించినట్లుగా, దెయ్యాలను నమ్మనివాళ్లకు దెయ్యాలు కనిపించకుండా ఉండవు. ‘‘...అండ్, మీట్ మిస్టర్ దీపక్ మిశ్రా.. దెయ్యాల స్పెషలిస్ట్!’’‘హోటల్ చోళా ఇంటర్నేషనల్’ కాన్ఫరెన్స్ హాలు బయట లాంజ్‌లో రాత్రి బాగా పొద్దుపోయాక జరిగింది ఈ పరిచయం. దీపక్ మిశ్రాను భగవాన్‌కి పరిచయం చెయ్యడానికి ముందు, భగవాన్ని దీపక్ మిశ్రాకు పరిచయం చేశాడు దేవన్.. ‘‘హి ఈజ్ మిస్టర్ భగవాన్, హెడ్ ఆఫ్.. ‘నో గాడ్, నో ఘోస్ట్.’’ దేవన్ జర్నలిస్ట్. చెన్నైలోని ఒక ఆంగ్ల దినపత్రికలో సీనియర్ రిపోర్టర్. చోళా ఇంటర్నేషనల్‌లో దెయ్యాలపై ఆ మర్నాటి నుండి మూడు రోజులపాటు డీప్ డిబేట్ జరగబోతోంది. మిశ్రాది ఢిల్లీ. డిబేట్ కోసం చెన్నై వచ్చి చోళా ఇంటర్నేషనల్‌లో దిగాడు. భగవాన్‌ది హైదరాబాద్. డిబేట్లో మిశ్రాను డీ కొనడం కోసం చెన్నై వచ్చి అదే హోటల్లో తనకు కేటాయించిన గదికి చేరుకున్నాడు. ‘చోళా’తో దేవన్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రముఖులెవరు వచ్చినా, వెంటనే దేవన్‌కు ఫోన్ వెళుతుంది. ‘‘వెల్, మిస్టర్ భగవాన్.. మీరు నో గాడ్.. నో ఘోస్ట్ అంటున్నారు. నుదుటిపై పెద్ద బొట్టుతో కనిపిస్తున్నారు?!’’.. అడిగాడు మిశ్రా. భగవాన్ పెద్దగా నవ్వాడు. ‘‘అది దేవుడికీ, దెయ్యానికీ సంబంధం లేని బొట్టు. నా కూతురు తనకేమీ తోచకపోతే, ఒక్కోసారి నాకు జడేసి, రబ్బరు బ్యాండు పెడుతుంది. అలాగే వచ్చేస్తాను బయటికి. ఇవాళ పెద్ద బొట్టు పెట్టింది’’.. చెప్పాడు భగవాన్. ‘‘మరి భగవాన్ అనే పేరేమిటి?’’‘‘దేవుడిని నమ్మనివాళ్లకు భగవాన్ అనీ, దెయ్యాల్ని నమ్మేవాళ్లకు దీపక్ అని.. పేరు ఉండకూడదనేముందీ?’’అలా.. కొంత టాపిక్ నడిచాక.. ‘రేపు డిబేట్లోకలుద్దాం’ అని చెప్పి, దేవన్ వెళ్లిపోయాడు. దీపక్, భగవాన్ మిగిలారు.‘‘సో.. రేపు మీరు దెయ్యాలు లేవని నాతో వాదించబోతున్నారు..’’ నవ్వాడు దీపక్. ‘‘లేవని వాదించబోవడం లేదు మిస్టర్ మిశ్రా. ఉంటే చూపించండని వాదించబోతున్నాను’’ అన్నాడు భగవాన్ తనూ నవ్వుతూ. ‘‘ఇప్పుడు చూపిస్తాను, మీకేమైనా అభ్యంతరమా?’’ అన్నాడు మిశ్రా సడన్‌గా. దెయ్యాల్ని నమ్మేవాళ్లకు, దెయ్యాలున్నాయని వాదించేవాళ్లకు భగవాన్ విలువ ఇవ్వడు. ఇవ్వకపోగా, ఒక్కోసారి తేలిగ్గా తీసిపారేస్తాడు. ఇప్పుడు మిశ్రానీ అలాగే తీసిపారేశాడు. ‘‘చూపించనక్కర్లేదు. మిమ్మల్ని చూస్తున్నాను కదా’’ అన్నాడు! మిశ్రా హర్ట్ కాలేదు. ‘దేవుణ్ణి నమ్మేవారికి దేవుడు కనిపించినట్లుగా, దెయ్యాలను నమ్మనివాళ్లకు దెయ్యాలు కనిపించకుండా ఉండవు మిస్టర్ భగవాన్’’ అందామనుకున్నాడు కానీ, భగవాన్.. దేవుడిని కూడా నమ్మడు. అందుకే దేవుడి ప్రస్తావన లేకుండా.. ‘‘దెయ్యాలు.. మనుషులకు కావలసినప్పుడు కనిపించవు. దెయ్యాలకు మనుషులు కావలసినప్పుడు కనిపిస్తాయి’’ అని మాత్రమే అన్నాడు. ‘‘మరి ఇందాక చూపిస్తానన్నారు!’’ అడిగాడు భగవాన్. ‘‘అవునవును. కానీ మీరు నాలో దెయ్యాన్ని చూశాక, నేను చూపించే దెయ్యంలో మీకేం ఇంట్రెస్టు ఉంటుంది చెప్పండి?’’‘‘అవుననుకోండి, మనుషులకు కావలసినప్పుడు దెయ్యాలు కనిపించవని అన్నారు కదా, దాంతో నాకు ఇంట్రెస్టు పెరిగింది. మీరెలా చూపిస్తారో చూద్దామని’’ అన్నాడు భగవాన్. ‘‘చూడదలచుకున్నారా.. చెప్పండి’’ అడిగాడు మిశ్రా. ‘‘చూశాక, అది దెయ్యం కాదంటే, మీరు ఒప్పుకుంటారా? ’’ అన్నాడు భగవాన్. ‘‘దెయ్యం అవునో కాదో మీ మనసుకు తెలిసినప్పుడు నా ఒప్పుకోలుతో ఇక పనేముంటుంది?’’‘‘మీరు దెయ్యం అని నాకు చూపించిన దాన్ని, నేను దెయ్యం కాదు అంటే మీరు ఒప్పుకోవాలి కదా!’’‘‘అదే అంటున్నా.. మిస్టర్ భగవాన్. దెయ్యాన్ని చూపించడం వరకే నా పని. అది దెయ్యమా కాదా అన్నది మీ మనసుకు అనిపించినదాన్ని బట్టి ఉంటుంది.’’‘‘అలాంటప్పుడు అది దెయ్యం ఎలా అవుతుంది మిస్టర్ మిశ్రా. మీరు దెయ్యాన్ని చూపించినప్పుడు, ఆ దెయ్యాన్ని నేను కూడా చూడగలిగితేనే కదా అది దెయ్యం అవుతుంది.’’ ‘‘రైట్. మిస్టర్ భగవాన్. మీ వెనుక నేనిపుడు దెయ్యాన్ని చూస్తున్నాను. ఈ క్షణంలో చూస్తున్నాను. ఆ దెయ్యాన్ని మీరు చూడాలని అనుకుంటున్నారా?’’‘‘అనుకోవడం లేదు. ఎందుకంటే నా వెనుక ఏ దెయ్యమూ ఉండదని, ఏ దేవుడూ ఉండడని నాకు తెలుసు’’.‘‘ఒకే దెన్. మీరు మీ మాట మీద నిలబడగలరా?’’ అడిగాడు మిశ్రా. ‘‘ఎస్’’ అన్నాడు భగవాన్.‘‘అయితే ఈ క్షణంలో మీరు.. మీరొక్కరే వాష్‌రూమ్‌లోకి వెళ్లిరాగలరా?’’‘‘వెళ్లి?’’‘‘అద్దంలో మీ ముఖం చూసుకుని రండి.’’ ‘‘చూసుకుంటే?!’’ ‘‘మీ వెనుక.. ఎవరున్నారో మీకు కనిపిస్తుంది.’’‘‘కనిపించకపోతే?’’‘‘కనిపించకపోతే.. నా దగ్గరికి వచ్చి చెప్పండి’’ అన్నాడు మిశ్రా. భగవాన్ లేచి, వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు. తిరిగొచ్చి చూస్తే.. అక్కడ మిశ్రా లేడు!లాంజ్‌లో లైట్స్ ఆఫ్ అయి ఉన్నాయి. డిమ్ లైట్లో.. ‘‘మిస్టర్ మిశ్రా.. మిస్టర్ మిశ్రా’’ అని వెతుక్కుంటున్నాడు భగవాన్. ‘‘రాత్రి ఏమైపోయారు.. అకస్మాత్తుగా’’.. డిబేట్ హాల్లో గుసగుసగా అడిగాడు భగవాన్. ‘‘నిద్రొచ్చి వెళ్లిపోయాను. దెయ్యం కనిపించిందా?’’ ‘‘అది చెప్దామనే వచ్చాను. మీరు కనిపించలేదు’’ చెప్పాడు భగవాన్. ‘‘నేను కనిపించలేదు సరే, దెయ్యం కనిపించిందా?’’ అడిగాడు మిశ్రా. ‘‘కనిపించలేదు’’ చెప్పాడు భగవాన్. ‘‘నమ్మను. మీరు అద్దంలో చూసుకోకుండానే వచ్చేసి ఉంటారు’’ అన్నాడు మిశ్రా. ‘‘చూశాను. కనిపించలేదు’’.. అబద్ధం చెప్పాడు భగవాన్. ‘‘ఏం కనిపించలేదు?’’‘‘దెయ్యం’’మిశ్రా నవ్వుకున్నాడు. డిబేట్ హాల్లో భగవాన్ వెనుక మిశ్రాకు స్పష్టంగా దెయ్యం కనిపిస్తోంది. భయం అనే దెయ్యం! భయం ఉందంటే దెయ్యం ఉందనే. లేనిది మాత్రం..వాష్‌రూమ్‌లో అద్దం. - మాధవ్ శింగరాజు -
జస్ట్ మ్యారీడ్
పెళ్లి చూపులు అయ్యాయి. అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చేశాడు. ‘అమ్మాయికి నచ్చితే చాలండీ, ఈ పెళ్లి జరిగిపోతుంది’ అని అబ్బాయి తండ్రి.. ముందే చెప్పేశాడు కాబట్టి అబ్బాయికి అమ్మాయి నచ్చిందా లేదా అన్నది ప్రశ్నే కాదసలు. తల్లి లేని బిడ్డ. ఒకడే బిడ్డ. చేతనైనంత త్వరగా వాడికో తోడును జత చేయడం తన బాధ్యత అనుకున్నాడు ఆ తండ్రి. అంతే తప్ప ‘నా కొడుకు నచ్చకపోతాడా’ అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కాదది. పెళ్లిచూపులు అయ్యాక, వరుడు చిరంజీవి అలోక్, వధువు చి.ల.సౌ. అఖిల అని శుభలేఖలు ప్రింట్ అవడానికి ముందు.. అలోక్ తండ్రి అలోక్‌కి తెలియకుండా మళ్లీ ఒకసారి అఖిల తల్లిదండ్రులను కలిశాడు. అప్పుడు అక్కడ అఖిల లేదు. ‘‘కడుపులో దాచుకుంటానంటే మీకొక విషయం చెబుతాను. చెప్పడం నా ధర్మం అనుకున్నాను. దాచుకోవడం మీ ధర్మం అనుకుంటారని ఆశిస్తున్నాను’’ అన్నాడు భారంగా. ఆ తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి, ‘‘అలోక్ ఇప్పటికీ నా గదిలోనే పడుకుంటాడు’’ అన్నాడు. ‘అందులో ఏముందీ’ అన్నట్లు చూశారు వియ్యంకులు. ‘‘ఇప్పటికీ వాడు నా పక్కనే పడుకుంటాడు’’ అన్నాడు.‘‘గారాబంగా పెరిగినట్లున్నాడు.. తల్లి లేని బిడ్డ కదా’’ అని నవ్వారు.‘‘గారాబం కాదు చెల్లెమ్మా’’ అన్నాడు అలోక్ తండ్రి.. అఖిల తల్లి వైపు చూసి. ఆమె తన భర్త వైపు చూసింది. ఇద్దరూ కలిసి మళ్లీ అలోక్ తండ్రి వైపు చూశారు. ‘‘మావాడికి.. దెయ్యాలంటే భయం. రాత్రి పూట ఒక్కడే పడుకోలేదు’’ అన్నాడు ఆయన.. కాస్త ఇబ్బంది పడుతూ. రాబోయే నవ్వును ఆపుకున్నారు అలోక్‌కి కాబోయే మామగారు. నవ్వితే బాగుండదని అలా ఉండిపోయింది అలోక్‌కి కాబోయే అత్తగారు. ‘‘అన్నయ్యా.. అసలిది విషయమే కాదు. మీరు మాకేం చెప్పలేదు. మేమేమీ వినలేదు. మీ అబ్బాయికీ తెలియనివ్వకండి. మా అమ్మాయికీ తెలియనివ్వం’’ అంది అఖిల తల్లి. ఆ వెంటనే ఇంకో మాట కూడా అంది ఆవిడ. ‘‘దెయ్యాలకు భయపడడం అంటే.. ఉన్నాయని భయపడతాడా? ఉన్నాయేమోనని భయపడతాడా?’’ అని. ‘‘తను నిద్రపోతున్నప్పుడు రోజూ రాత్రి ఇంట్లోకి ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుందని భయపడతాడు చెల్లెమ్మా’’ అన్నాడు. ‘‘ఎప్పట్నుంచి ఆ భయం మొదలైంది’’. ‘‘గుర్తులేదు బావగారూ.. ఓసారెప్పుడో మెలకువ వచ్చి చూస్తే, పెద్దగా ఎవరితోనో పోట్లాడుతున్నాడు. ఆ అరుపుకే నేను లేచింది. ‘‘ఏమైంది అలోక్..’’ అని దగ్గరికి వెళ్లి అడిగితే.. ఇంట్లోనే ఓ మూలకు చెయ్యి చూపిస్తూ భయంతో వణికిపోతున్నాడు’’. ‘‘ఆ తర్వాత?’’ ‘‘ఆ తర్వాతెప్పుడూ వాడు అరవలేదు. ఎందుకంటే.. ఆ తర్వాత ఎప్పుడూ వాడు ఒంటరిగా పడుకోలేదు’’ అని చెప్పాడు అలోక్ తండ్రి. అలోక్, అఖిల పెళ్లి జరిగిపోయింది. పెళ్లిలో చాలాసార్లు అల్లుడి ముఖం చూశారు అఖిల తల్లి, తండ్రి. దెయ్యాలకు భయపడే అబ్బాయిలా అనిపించలేదు. ∙∙ ఫస్ట్ నైట్ ముగుస్తుండగా..తెల్లవారు జామునే అఖిల నుంచి ఫోన్! ‘‘మమ్మీ.. మమ్మీ.. డాడీ.. డాడీ..’’ అంటోంది కానీ, ఏమీ చెప్పలేకపోతోంది. ఆమె తల్లిదండ్రుల ఆలోచన అల్లుడి మీదకు మళ్లింది. ఫోన్ స్పీకర్ ఆన్ చేశారు. ‘‘చెప్పమ్మా అఖీ.. ఏమైంది? నువ్వెలా ఉన్నావ్? అల్లుడుగారు ఎక్కడ?’’ అని అడిగారు. ‘‘అలోక్.. అలోక్..’’ – అఖిల చెప్పలేకపోతోంది. ఆయాస పడుతోంది.‘‘ఊ.. అలోక్‌కి ఏమైందమ్మా...’’‘‘అలోక్.. అలోక్.. అలోక్.. అలోక్వాళ్ల డాడీ చనిపోయారమ్మా.. చనిపోయారు’’.వెంటనే బయల్దేరారు అఖిల తల్లిదండ్రులు అఖిల దగ్గరకు. సిటీలోనే వాళ్లది ఆ మూల, వీళ్లది ఈ మూల. అలోక్ దుఃఖాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. ‘‘రాత్రి నాకు.. పక్క గదిలోంచి ‘అలోక్.. అలోక్’ అని నాన్న అరవడం వినిపించింది. కలలా అనిపించింది. అప్పుడే వెళ్లుంటే ఇంతపని జరిగి ఉండేది కాదు’’ అంటున్నాడు. ‘‘ఏం జరిగింది బాబూ’’ అని భుజం మీద చెయ్యేసి అడిగారు అత్తమామలు. ‘‘డాక్టర్ హార్ట్ ఎటాక్ అంటున్నారు. కాదని నాకు తెలుసు. కచ్చితంగా తెలుసు. ఆయన్ని దెయ్యం చంపేసింది. ఇన్నాళ్లూ నేను నాన్న పక్కన పడుకునేవాణ్ణి కాబట్టి అది నాన్నను ఏమీ చేయలేకపోయింది. ఒక్కరోజు లేకపోయేసరికి దానికి అవకాశం దొరికింది’’ అంటున్నాడు అలోక్. ‘‘నీకెలా తెలుసు బాబూ’’ అన్నారు మామగారు. ‘‘నాకు తెలుసు. నాకే తెలుసు. నాన్నకు కూడా తెలీదు. ఓరోజు రాత్రి నేను దెయ్యంతో గొడవపడ్డాను. నాన్నను చంపుతాను అని అది ఆయన గదిలోకి వెళ్లబోతుంటే నేను పెద్దగా అరుస్తూ దాన్ని తరిమేశాను. ‘చూస్తా ఎంతకాలం మీ నాన్నను కాపాడుకుంటావో’ అని వికృతంగా నవ్వుకుంటూ గాలిలో కలిసిపోయింది. ఆ రోజు నుంచీ నేను నాన్న మంచం మీదే, నాన్న పక్కనే పడుకుంటున్నాను. దెయ్యాలు కలలోకి వస్తున్నాయి నాన్నా.. అని నాన్నకు అబద్దం చెప్పి ఆయన పక్కనే పడుకుంటున్నాను’’ అని చెప్పాడు అలోక్. అత్తమామమలు ముఖముఖాలు చూసుకున్నారు. అఖిలకైతే ఏమీ అర్థం కావడం లేదు. పదో రోజు. ఫ్యామిలీ అల్బమ్ చూస్తున్నాడు అలోక్. పక్కనే అఖిల ఉంది. ‘‘ఎవరీవిడ?’’ అంది ఆల్బమ్‌లో ఓ ఫొటోపై వేలు ఉంచి.‘‘మా పిన్నమ్మ’’ అని చెప్పాడు. ‘‘మీ అమ్మ సొంత చెల్లెలా?’’ అని అడిగింది. ‘‘అవును. మా నాన్నంటే తనకు కోపం. ప్రేమించిన తనను కాదని, నాన్న తను ప్రేమించిన అమ్మను చేసుకున్నాడని. అమ్మ అనారోగ్యంతో చనిపోయినప్పుడు.. ‘అది బతికుండగా నన్ను చేసుకోలేదు. ఇప్పుడైనా చేసుకుంటావా?’ అని నాన్నను అడిగితే నాన్న కాదన్నారట. నాన్న మీద ప్రేమతో, అమ్మ మీద కోపంతో ఆమె పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. మనోవేదనతో మంచం పట్టి ఏడాదిన్నర క్రితం చనిపోయింది’’ అని చెప్పాడు అలోక్. అఖిల మౌనంగా ఉండిపోయింది. అలోక్ చెబుతున్న దానికీ, ఆ రోజు మామగారి గదిలో ఆయన మంచం పక్కనే అత్తగారి ఫొటో పడి పగిలి ఉండడానికీ... ఏదైనా సంబంధం ఉందా అని ఆమె ఆలోచిస్తోంది. -
నరేంద్ర మోదీ రాయని డైరీ
మధ్యాహ్నం ఫ్లయిట్‌కి చైనా వెళ్లాలి. ముందు ప్రమాణ స్వీకారాలు చే యించేస్తే, పోర్ట్‌ఫోలియోల సంగతి అమిత్‌షా చూసుకుంటాడు. చైనాలో బ్రిక్స్ మీటింగ్. మీటింగ్‌కి వచ్చేవాళ్లంతా ప్రెసిడెంట్లు. నేనొక్కడినే ప్రైమ్ మినిస్టర్‌ని. ప్రత్యేకంగా కనిపించాలి. ఫ్లయిట్ కుదుపులకు సూట్‌కేస్‌లోని బట్టలు చెదరకుండా లగేజీ సర్దమని చెప్పాను. మూడున్నర గంటల ప్రయాణానికి బట్టలకేం కాదని ఎక్స్టర్నల్ ఎఫైర్స్ మినిస్ట్రీ నుంచి నివేదిక రావడానికైతే వచ్చింది కానీ నాకైతే డౌటే. ఎన్ని ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఫెయిల్ కాలేదూ! ‘‘దీనికి పెద్దగా ఇంటెలిజెన్స్ అవసరం లేదు సార్’’ అన్నాడు సుబ్రహ్మణ్యం జైశంకర్. ‘‘దేనికి పెద్దగా ఇంటెలిజెన్స్ అక్కర్లేదు జైశంకర్’’ అని అడిగాను. ‘‘అదే సర్.. మూడున్నర గంటల విమాన ప్రయాణానికి సూట్‌కేస్‌లో సర్దిన బట్టలకు ఏమీ కాదు అని చెప్పడానికి’’ అన్నాడు. జైశంకర్ ఫారిన్ సెక్రెటరీ. ‘వెరీ ఇంటెలిజెంట్ ఫెలో’ అని అతడి గురించి సుష్మా స్వరాజ్ ఎప్పుడో చెప్పినట్లు గుర్తు. మయన్మార్‌లో వేసుకోవలసిన బట్టల బ్యాగ్ సపరేట్గా ఉంది. అక్కడేం సమ్మిట్ లేదు. మయన్మార్ ప్రెసిడెంట్‌తో కలిసి అక్కడా ఇక్కడా తిరగడమే. బట్టలతో ప్రాబ్లమ్ లేదు. ఆయన పేరుతోనే ప్రాబ్లమ్! సుష్మా స్వరాజ్‌కి ఫోన్ చేసి నా ప్రాబ్లమ్ చెప్పాను. సుష్మ నవ్వారు. ‘‘పేరుతో పనేముంది మోదీజీ.. ‘మిస్టర్ ప్రెసిడెంట్’.. ‘మిస్టర్ ప్రెసిడెంట్’ అంటూ ఉండండి చాలు’’ అన్నారు. ‘‘అది ఓకే.. సుష్మాజీ, అక్కడున్న రెండు రోజుల్లో ఒక్కసారైనా ఆయన్ని పేరుతో సంబోధిస్తే సంతోషిస్తారు కదా.. భారత ప్రధానికి తన పేరు గుర్తుందని..’’ అన్నాను. ‘‘నిజమే మోదీజీ.. అయితే పొరపాటున మీరాయన్ని మిస్టర్ ‘హ్యూటిన్ జా’ అనబోయి మిస్టర్ ‘జా హ్యూటిన్’ అనే ప్రమాదం ఉంది’’ అన్నారు సుష్మ. ‘‘అందులో ప్రమాదం ఏముంది సుష్మాజీ!’’ అని అడిగాను. ‘‘జా హ్యూటిన్ అనే ఆయన బర్మా ఆర్మీ చీఫ్. చనిపోయి పదేళ్లవుతోంది మోదీజీ’’ అన్నారు సుష్మ. ‘వావ్..! సుష్మాజీ’ అనుకున్నాను. బ్రిలియంట్ తను. ‘‘కానీ సుష్మాజీ.. ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. మయన్మార్ ప్రెసిడెంట్ ఒక మగవాడు అన్న విషయమే నాకు గుర్తుండడం లేదు’’ అన్నాను. సుష్మ పెద్దగా నవ్వారు. ‘‘ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్‌ని నాకే గుర్తుండడం లేదు మోదీజీ. తల నిండా పూలు పెట్టుకున్న ఆంగ్ సాన్ సూకీ నే ఎప్పటికీ నాకు మయన్మార్ ప్రెసిడెంట్లా అనిపిస్తుంటారు’’ అన్నారు. నవ్వాను. ‘‘సుష్మాజీ.. ఎప్పటికీ మీరే మా ఎక్స్టర్నల్ మినిస్టర్’’ అన్నాను. -మాధవ్ శింగరాజు -
లాలూ ప్రసాద్ రాయని డైరీ
కాలం కలిసి రాకపోతే స్నేహితులు చెయ్యిస్తారు. శత్రువులు సలహాలు ఇస్తారు. సుశీల్‌కుమార్ మూడు రోజులుగా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ‘లాలూజీ, ఈ వరదల్లో ర్యాలీ ఎందుకు? పోస్ట్‌పోన్ చేసుకోండి’ అని సలహా ఇచ్చి వెళుతున్నాడు. వస్తాడు. సలహా ఇస్తాడు. వెళతాడు. టీ తాగి వెళ్లమంటే తాగడు. ‘బాగుండదు లాలూజీ’ అంటాడు! ‘ఏం బాగుండదు సుశీల్‌జీ’ అని అడిగితే.. ‘వరదల్లో ర్యాలీ బాగుండదు’ అంటాడు తప్ప, ‘మీ ఇంట్లో టీ తాగానని నితీశ్ కుమార్‌కు తెలిస్తే బాగుండదు’ అని మాత్రం అనడు. ‘‘డిప్యూటీ సీఎంగా తాగకండి సుశీల్‌జీ. పాట్నా యూనివర్సిటీలో మనకు ఓల్డ్ ఫ్రెండ్షిప్ ఉంది కదా. అప్పటి ఫ్రెండ్షిప్ అనుకుని తాగండి’’ అన్నాను.. మొన్న మళ్లీ ఇంటి బయట తచ్చాడుతున్నప్పుడు. సుశీల్ ఇబ్బంది పడ్డాడు. ‘మన మధ్య ఓల్డ్ ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు లాలూజీ, ఓల్డ్ రైవల్రీ కూడా ఉంది’’ అన్నాడు. నాపై దాణా కేసు వేసి, నన్ను జైలుకు పంపింది అతడే! పెద్దగా నవ్వి, ‘తాగండి సుశీల్‌జీ’ అని, గోడ ఇవతలి నుంచి టీ కప్పు అందించాను. అందుకున్న కప్పుని వెంటనే పిట్టగోడ మీద పెట్టి, ‘బాగుండదు లాలూజీ’ అన్నాడు సుశీల్. ‘‘ఏం బాగుండదు సుశీల్‌జీ’’ అని అడిగాను. ‘‘వరదల్లో ర్యాలీ బాగుండదు లాలూజీ’’ అన్నాడు. ‘‘ఎందుకు బాగుండదు సుశీల్‌జీ’’ అని అడిగాను. ‘‘ప్రధాని ఏరియల్ సర్వేకి వస్తున్నప్పుడు, ప్రధానికి వ్యతిరేకంగా మీరు నడుపుతున్న ర్యాలీ బాగుండదు లాలూజీ’’ అన్నాడు. ‘‘సుశీల్‌జీ.. బిహార్‌కు మోదీ కొత్త కానీ, వరదలు కొత్త కాదు. పదిహేనులో వరదలు వచ్చాయి. మోదీ రాలేదు. పదహారులో వరదలు వచ్చాయి. మోదీ రాలేదు. అప్పుడు రాని మోదీ, ఇప్పుడొస్తున్నారు! మేం ర్యాలీ పెట్టుకున్నాం కదా.. దానికి ఒక రోజు ముందు వస్తున్నారు.. డైవర్ట్ చెయ్యడానికి’’ అన్నాను. సుశీల్ వెళ్లిపోయాడు. మళ్లీ రాలేదు. శనివారం ఏరియల్ సర్వేకి మోదీ వచ్చాడు, వెళ్లాడు. ర్యాలీకి వస్తానన్నవాళ్లే ఇంకా రాలేదు! సోనియాజీకి ఒంట్లో బాగోలేదు. రాహుల్ బాబు ఇంట్లో లేడు. మాయావతి రానన్నారు! ములాయం హ్యాండిచ్చారు. సి.సి.ఎం. నోరెత్తడం లేదు. ఫరూక్ ఫోన్ తియ్యడం లేదు. శరద్ యాదవ్ సైలెంట్ అయిపోయాడు. వీళ్లెవరూ లేకుండా పట్నా గాంధీ మైదాన్‌లో ‘బీజేపీ భగావో, దేశ్ బచావో’ అని నేను, నా ఇద్దరు కొడుకులు మైకు పట్టుకుని ఎంత అరిస్తే మాత్రం.. దేశ ప్రజలకు వినిపిస్తుందా?! బలం చూపిద్దాం అనుకుంటే బలహీనతలు బయటపడేలా ఉన్నాయి! -మాధవ్ శింగరాజు -
నవాజ్ షరీఫ్ (పాక్ ప్రధాని)
రాయని డైరీ ఐ లవ్ మై కంట్రీ! ఏ దేశ పౌరుడు ఆ దేశాన్ని ప్రేమించడంలో విశేషం ఏమీ లేదు. కానీ దేశ ప్రధానిగా ఉంటూ దేశాన్ని ప్రేమించడం పాకిస్తాన్లో విశేషమే. పాకిస్తాన్ కూడా తన దేశ పౌరుల్ని ప్రేమించినంతగా ఏనాడూ తన దేశ ప్రధానిని ప్రేమించలేదు. అందుకు నేనేమీ నా దేశాన్ని నిందించడం లేదు. ఎవరి ప్రేమ వాళ్లది. నన్ను ప్రేమించట్లేదు కాబట్టి, నేను ప్రేమించట్లేదు అని ముషర్రఫ్ లాంటి వాళ్లే అనగలరు. ప్రేమించక పోయినా ప్రేమించడమే నిజమైన ప్రేమ. ఈ మాటని అప్పుడప్పుడు ఇమ్రాన్‌ఖాన్ అంటుంటాడు. కానీ అతణ్ణి నేను నమ్మను. ఏ దేశంలోనూ పాలకపక్షం ప్రతిపక్షాన్ని ప్రేమించదు. ‘ప్రేమించకపోతే నాకేంటి? నేను ప్రేమిస్తాను’ అని నిజంగా అనుకునేవాడే అయితే ప్రతిపక్ష నేతగా ఇమ్రాన్ మా పార్టీని ప్రేమించి ఉండాలి. కనీసం నన్నైనా ప్రేమించి ఉండాలి. ప్రేమించలేదు. ప్రేమిస్తే నాపై కోర్టులో కేసెందుకు వేయిస్తాడు?! కోర్టు తీర్పు రాగానే, దుబాయ్ నుంచి ముషర్రఫ్ ఫోన్ చేశాడు. వెంటనే లిఫ్ట్ చేశాను. ఎంతైనా.. నేను ప్రేమించే నా దేశపు పూర్వ అధ్యక్షుడు అతడు. అతడూ నాలాగే నా దేశాన్ని ప్రేమించాడా లేదా అన్నది నాకు అనవసరం. నా దేశాన్ని ప్రేమించినట్లే, నేనూ నా దేశపు పూర్వ అధ్యక్షులను కూడా ప్రేమిస్తాను. ‘‘మిస్టర్ ముషర్రఫ్.. ఎలా ఉంది మీ ఆరోగ్యం?’’ అని ఎంతో ప్రేమగా అడిగాను. పెద్దగా నవ్వాడు ముషర్రఫ్. అతడి ఆరోగ్యం మెరుగుపడినట్లే ఉంది! ‘‘షరీఫ్ జీ.. నేను దుబాయ్ నుంచి వచ్చేసరికి పాకిస్తాన్‌లోని దుకాణాలలో నాకు ఒక్క మిఠాయి పొట్లం అయినా మిగిలి ఉండే అవకాశం ఉంటుందా?’’ అని అడిగాడు! అతడేం మారలేదు. ‘‘మిస్టర్ ముషర్రఫ్.. ఆ సంగతి చెప్పలేను. కానీ నా పదవి పోయిందన్న ఆనందాన్ని ఇక్కడి వాళ్లతో పంచుకోవడానికి మీరే అక్కడి నుంచి కొన్ని మిఠాయి పొట్లాలు తెచ్చుకోవడం మెరుగైన ఆలోచన కదా’’ అని అన్నాను. అతడిపై నాకేం కోపం రాలేదు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నప్పుడు.. అతడు నన్నెంత ద్వేషించినా.. నేనతడిని ప్రేమించకుండా ఎలా ఉండగలను? ‘‘నెక్స్ట్ ఏంటీ?’’ అన్నాడు ముషర్రఫ్. పాక్ ప్రధానులెవరూ నెక్స్ట్ ఏంటీ అని ఆలోచించరని అతడికి మాత్రం తెలీదా? ‘‘నెక్స్ట్ ఏమీ లేదు మిస్టర్ ముషర్రఫ్.. ఎప్పటిలా నేను నా దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటాను’’ అని చెప్పాను. నా దేశంలోని గొప్పతనం ఏంటంటే.. ఇక్కడ ఏ ప్రధానీ పూర్తికాలం ఐదేళ్లూ ఉండడు. కానీ దిగిపోయిన ప్రతి ప్రధానీ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు! మాధవ్ శింగరాజు -
లాలూ ప్రసాద్ యాదవ్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు తినకూడనిదేదో తింటున్నట్లున్నాడు నితీశ్ కుమార్. మోదీ లంచ్‌కి పిలవగానే బిహార్‌లో తను తింటూ ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌ని కూడా వదిలేసి ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కేశాడు! సోనియా లంచ్‌కి పిలిస్తే వెళ్లనివాడు, మోదీ లంచ్‌కి పిలవగానే ఆ ఎంగిలిచేత్తోనే వెళ్లిపోయాడు. ‘ఏమయ్యుంటుంది ప్రసాద్’’ అని రఘువంశ్ ప్రసాద్ సింగ్‌ని అడిగాను. ఇలాంటి ప్రశ్నలకు ప్రసాద్ మీసాలతో నవ్వుతాడు. గడ్డంతో నవ్వుతాడు. ముక్కుతో నవ్వుతాడు. కనుబొమలతో నవ్వుతాడు. అంతే తప్ప, నవ్వు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుండి మాత్రం నవ్వడు. ‘‘చెప్పు ప్రసాద్.. శుక్రవారం సోనియాజీ లంచ్‌కి పిలిస్తే వెళ్లకుండా, శనివారం మోదీ లంచ్‌కి పిలిస్తే నితీశ్ ఎందుకు వెళ్లి ఉంటాడు?’’ అని అడిగాను. మళ్లీ అంతకుముందులానే నవ్వాడు ప్రసాద్. ‘‘సోనియాజీ ఇచ్చే లంచ్ కన్నా, పీఎం ఇచ్చే లంచ్ టేస్ట్‌గా ఉంటుందని అనుకుని ఉంటాడు’’ అన్నాడు. ప్రసాద్ సరిగ్గానే గెస్ చేశాడు. మోదీ ఏం చేసినా నితీశ్‌కి నచ్చుతోంది. సర్జికల్ స్రై్టక్లు నచ్చాయి. డీమోనిటైజేషన్ నచ్చింది. నా మీద, నా ఇద్దరు కొడుకుల మీద, నా పెద్ద కూతురు మీద బినామీ ఆస్తుల కేసులు పెట్టడం నచ్చుతోంది. అంటే.. నితీశ్‌కి మోదీజీ ముఖం నచ్చుతోంది! వెంటనే నితీశ్‌కి ఫోన్ చేశాను. ‘‘నా ముఖానికి ఏమయింది నితీశ్! నచ్చలేదా?’’ అని అడిగాను. రిప్లయ్ లేదు. ‘‘నాకు సీట్లు ఎక్కువొచ్చినా, నిన్ను సీఎం సీట్లో కూర్చోబెట్టాను కదా నితీశ్’’ అన్నాను. రిప్లయ్ లేదు. ‘‘చెప్పు నితీశ్.. మళ్లీ బీజేపీతో టై అప్ అయ్యి, ఎన్డీయేలోకి వెళ్లిపోతావా?’’ అన్నాను. ‘‘సార్ లేరు.. ఢిల్లీ వెళ్లిపోయారు’’ అన్నాడు! ‘‘నిన్ను నువ్వు సార్ అనుకునే స్థాయికి దిగజారిపోయావా నితీశ్!’’ అని అడిగాను. ‘‘నిజంగానే నేను సార్‌ని కాదు సార్’’ అన్నాడు వాడెవడో. చిరాకొచ్చేసింది. ‘‘నువ్వెవరు?’’ అన్నాను. ‘‘సార్ దగ్గర ఉంటాను సార్’’ అన్నాడు! ‘‘ఏమైంది లాలూజీ’’ అంటున్నాడు ప్రసాద్. ‘‘సోనియాజీ ఫోన్ ఎత్తుతుంది. మమతా బెనర్జీ ఫోన్ ఎత్తుతుంది. మాయావతి ఫోన్ ఎత్తుతుంది. అఖిలేశ్ యాదవ్ ఫోన్ ఎత్తుతాడు. చెయ్యను కానీ.. చేస్తే నరేంద్ర మోదీ, అమిత్‌షా కూడా ఫోన్ ఎత్తుతారు. నితీశ్ ఎందుకు ఫోన్ ఎత్తడు ప్రసాద్!’’ అని అడిగాను. ‘‘తింటున్నాడేమో లాలూజీ’’ అన్నాడు ప్రసాద్. కళ్లు మూసుకున్నాను. కనురెప్పల్ని వేళ్లతో అదుముకున్నాను. నిజమే. ఢిల్లీలో ఒక మతవాది, ఒక లౌకికవాది కలిసి కూర్చొని లంచ్ చేస్తున్నారు! మళ్లీ కళ్లు మూసుకుని, మళ్లీ కనురెప్పల్ని వేళ్లతో అదుముకున్నాను. లంచ్ పూర్తయింది. ఇద్దరు మతవాదులు సోంపు నములుకుంటూ డైనింగ్ హాల్లోంచి పెద్దగా నవ్వుకుంటూ బయటికి వస్తున్నారు. -
జూలియన్ అసాంజె రాయని డైరీ
మనసుకు గొప్ప ఉత్సాహంగా ఏమీ లేదు. ‘‘హ్యాపీనా?’’ అని అడుగుతున్నాడు స్వీడన్ నుంచి నా లాయర్ శామ్యూల్సన్.. ఫోన్ చేసి. ‘‘డే ఆఫ్ విక్టరీ కదా!’’ అంటున్నాడు. ‘‘యా.. మిస్టర్ శామ్’’ అన్నాను. ‘‘ఫన్నీ ఏంటంటే మిస్టర్ అసాంజె.. ఐదేళ్లుగా మిమ్మల్ని అరెస్టు చెయ్యలేక, ఐదేళ్ల తర్వాత మీపై విచారణను ఆపేయడం. హాహ్హాహాహా’’... పెద్దగా నవ్వుతున్నాడు శామ్. నాకు నవ్వు రావడం లేదు. పిల్లలు గుర్తుకొస్తున్నారు. తండ్రి ఉండీ, తండ్రి లేకుండా నా పిల్లలు ఎక్కడెక్కడో పెరిగి పెద్దవాళ్లవుతున్నారు. అదీ నాకు ఇంప్రిజన్మెంట్. రేపు నేను దొరికితే బ్రిటన్, ఆమెరికాలు విధించబోయేది కాదు ఇంప్రిజన్మెంట్. బాల్కనీలోంచి లోపలికి వచ్చాను. చిన్న గది. ఒక బెడ్డు, కంప్యూటర్, సన్ల్యాంప్, ట్రెడ్మిల్, మైక్రోవేవ్, ఓ పిల్లి! ‘‘బాగా పాలిపోయారు మిస్టర్ అసాంజె’’ అన్నారు ఒకరిద్దరు రిపోర్టర్లు.. బాల్కనీ లోంచి నేను వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు. నిజానికి నా కన్నా కూడా నా పెట్ క్యాట్ బాగా పాలిపోయి ఉంది. కొన్నాళ్లుగా లండన్‌లోని ఈ ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో నాతో పాటు అది సహ శరణార్థిగా ఉంటోంది. తిండి మీద ధ్యాస ఉండదు దానికి. లాస్ట్ అక్టోబర్‌లో ఒకసారి, ఈ ఫిబ్రవరిలో ఒకసారి.. పమేలా నాకోసం లంచ్ తెచ్చినప్పుడు మాత్రం కాస్త ఎంగిలి పడింది. అప్పుడు కూడా ‘హూ ఈజ్ షీ?!’ అన్నట్లు పమేలాను చూడ్డానికే దానికి సరిపోయింది. చేతుల్లోకి తీసుకుని తలపై మెల్లిగా తట్టాను. ‘మ్యావ్’ అంది నా కళ్లలోకి చూస్తూ. మానవ జాతి మీద దిగులు పెట్టుకున్నట్లుగా ఉంటాయి దాని కళ్లు. ‘ఇంకా ఎన్నాళ్లు మనమిలా ఈ ఇరుకు గదిలో అసాంజె?’ అన్నట్లు చూస్తుంది ఒక్కోసారి! నిజమే.. నాట్ ఎనఫ్ రూమ్ టు స్వింగ్ ఎ క్యాట్. ‘డాడీకి తోడుగా ఉండు పో..’ అని ఏడాది క్రితం నా పిల్లలు ఈ పిల్లిని ఆస్ట్రేలియా నుంచి నాకు గిఫ్టుగా పంపించారు. జేమ్స్ అని పేరు పెట్టి పంపించారు! చిన్న పిల్లలు ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. గిఫ్ట్‌గా ఇచ్చే పెట్‌కి పేరు పెట్టాలన్న ఐడియా నాకైతే రాదు ఈ జన్మకి. సిస్టమ్ ఆన్ చేసి కూర్చున్నాను. న్యూస్ స్క్రోల్ అవుతోంది. యూఎస్ అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ అంటున్నాడు.. ‘అసాంజెని అరెస్ట్ చెయ్యడం మా ప్రయారిటీ. అతడి మీద నేరారోపణలు లేకపోయినా.. అది మా ప్రయారిటీ..’ అని. ఒక్కసారిగా నవ్వొచ్చింది నాకు. పెద్దగా నవ్వాను. నాకే కాదు, నా పిల్లికి కూడా నవ్వు తెప్పించే సంగతి అది. పట్టుకోలేక స్వీడన్ నన్ను వదిలేస్తే, పట్టుకోవడం ఇష్టం లేక యూఎస్ నన్ను వదిలేది లేదంటోంది. గాటిట్! హిల్లరీ ఈ–మెయిల్ లీక్స్‌ని ప్రెసిడెంట్ ట్రంప్ ఎలా మర్చిపోగలడు? మాధవ్ శింగరాజు -
రేణుకా చౌదరి రాయని డైరీ
- మాధవ్ శింగరాజు అమ్మవారి కిరీటం బాగుంది. ధగధగా మెరుస్తూ ఉంది. పచ్చబంగారంలో పింక్ కలిపినట్లుగా ఉంది. బంగారంలో రాగి కలుపుతారు. రాగి పింక్ కలర్లో ఉండదు. మరి కిరీటానికి ఈ పింక్ కలర్ ఎలా వచ్చింది?! కిరీటాన్ని మళ్లీ ఒకసారి చూశాను. పచ్చటి బంగారం! పింక్ అస్సలు లేదు. కళ్లు నులుము కున్నాను. అంతా కేసీఆర్ మాయ. తెలంగాణలో ఉన్నవాళ్లందరికీ పింక్ కామెర్లు తెప్పించేస్తున్నాడు! పింక్ పొలాలు, పింక్ జలాలు, పింక్ జిల్లాలు... ఎవ్రీథింగ్ పింకిష్. కేసీఆర్ వేసే పిల్లి మొగ్గలు కూడా పింక్ మొగ్గలే. దసరా షాపింగ్ పూర్తి కాలేదు. కేసీఆర్ కటౌట్లను తప్పించుకుని తిరగడం కష్టమౌతోంది రోజురోజుకీ సిటీలో. ట్రాఫిక్ జామ్ కన్నా, కటౌట్ల జామ్ ఎక్కువగా ఉంది. సిగ్నళ్లే లేని హైదరాబాద్‌ను నిర్మిస్తానంటున్నాడు! ఎల్లో, రెడ్, గ్రీన్ తీయించి, పింక్ ఒక్కటే పెట్టిస్తాడేమో. ‘అవునవును. పింక్ అయితే బాగుంటుంది. పార్టీ ఆఫీసుకు త్వరగా చేరుకోవచ్చు’ అని మా పార్టీ నేతలు కూడా సరదా పడుతున్నారు. వాళ్లు ఉంటున్న పార్టీ ఆఫీసు ‘గాంధీభవన్’. వాళ్లు అంటున్న పార్టీ ఆఫీసు ‘తెలంగాణ భవన్’. ఆమాత్రం కనిపెట్టలేనా? ‘రెండేళ్లయింది రాష్ర్టంలో కాంగ్రెస్ లేక’ అన్న బాధ లేదు మావాళ్లకు. ‘రెండేళ్లయింది టీఆర్ఎస్లో చేరక’ అన్న బాధ కనిపిస్తోంది వాళ్ల కళ్లలో. గాంధీభవన్‌కి వచ్చి నీరసంగా దివాలా తీసినట్టు కూర్చుంటున్నారు. దివాలా తీయడం పార్టీ వ్యతిరేక కార్యకలాపం ఏమీ కాదు. దివాలా తీసినట్టు కనిపించడమే పార్టీకి అసలైన ద్రోహం. బాధ ఎవరికి లేదు? టీడీపీకి లేదా? బీజేపీకి లేదా? తెలంగాణ ప్రజలకు లేదా? వాళ్లంతా ముఖాలు వే లాడేసుకునే కూర్చుంటున్నారా? ఉదయాన్నే లేచి ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోవడం లేదా? మనల్ని ఒకళ్లు కొట్టారంటే, తిరిగి వాళ్లను కొట్టేవరకు.. ఐదేళ్లయినా, పదేళ్లయినా.. పంచె బిగించే ఉండాలి. పంచ్ విసరబోతున్నట్లు పిక్చర్ ఇస్తూనే ఉండాలి. ఆ తెలివి లేదు. అదేమంటే రివర్స్‌లో నా మీదకు వచ్చేస్తారు! పార్టీకి దూరంగా ఉంటున్నాననీ, మీటింగులకు రావట్లేదనీ! ఆ భగవంతుడి దయ, శ్రీమతి సోనియాగాంధీ గారి దయ ఉండబట్టి గానీ, లేకుంటే కేసీఆర్‌తో కలిసి రోజూ నేను టీ తాగుతున్నానని ఢిల్లీకి లెటర్లు రాసినా రాసుండేవాళ్లు. కేసీఆర్ కాంగ్రెస్‌కు చేసిన ద్రోహాన్ని వీళ్లంతా మర్చిపోయారేమో, నేను మర్చిపోను. మొక్కు తీర్చుకోడానికి కేసీఆర్... అమ్మవారికి మూడున్నర కోట్లు పెట్టి కిరీటం చేయించాడు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు తనను సీయెంను చేసిన సోనియా అమ్మవారికి చెల్లించవలసిన మొక్కు గురించి మాత్రం మర్చిపోయాడు! సోనియాకు కిరీటం చేయించనవసరం లేదు. తన తలపై ఉన్న కిరీటాన్ని చేయించింది సోనియా మేడమ్ అని కేసీఆర్ గుర్తుంచుకుంటే చాలు. -
భర్తలకీ, బాయ్‌ఫ్రెండ్స్‌కీ ఇది అర్థమౌతుందా?
ఇదేం ప్రేమ కాదు. పెళ్లీ కాదు. టెన్నిస్! టెన్నిస్ నా ప్రాణం. గెలిచి తీరాలి. కోర్టుకి అసలు నేను గెలవడానికే వెళ్తాను. లేకుంటే కోర్టుతో నాకేం పని?! నా దేశం స్విట్జర్లాండ్‌తో ఏం పని? వెళ్లిపోయేదాన్ని ఎప్పుడో, స్వేచ్ఛగా.. ఆల్ప్స్ పర్వతాల మీదుగా, తెల్లని ధూళినై.. గమ్యమే లేకుండా.. గాలిలో తేలుకుంటూ! ప్రేమల్ని నిలుపుకోడానికి లైఫ్‌లో నేను ఒక్క ప్రయత్నం కూడా చెయ్యలేదు. పెళ్లి కూడా అంతే. నా భర్త హ్యుటిన్ ఏడ్చేవాడు.. ‘షి ఈజ్ అన్ఫెయిత్పుల్’ అని. ‘ఆ బిచ్కి ఒక్కడు కాదు’ అని వీధుల్లో పొర్లాడి పొర్లాడి ఏడ్చేవాడు. అతని ఏడుపు అతనిది. నేనెందుకు అతనితో కలిసి ఏడవాలి? డబుల్స్ ఆడుతున్నామా! ఇంకో ఏడుపుగొట్టు జట్టుపై ఏడ్చి విజయం సాధించడానికి?! ‘లీవ్ మీ ఎలోన్’ అన్నాను ఒకరోజు. ‘మరైతే.. ఎవడితో ఎలోన్‌గా ఉండబోతున్నావ్?’ అన్నాడు. విడిపోడానికి ఒక్కమాట చాలు. వంద వాదులాటలు అక్కర్లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ టెన్నిస్. నా లవర్, నా లైఫ్ పార్ట్నర్ టెన్నిస్. ‘ఒక్కడితోనైనా సఖ్యతగా ఉన్నావా?’ అని అడిగి, అలిగి వెళ్లిపోయేవాడే నా ప్రతి బాయ్‌ఫ్రెండూ. ‘నాకన్నా టెన్నిస్సే ముఖ్యమా నీకు’ అని వాళ్ల ప్రశ్న. పెద్దగా అరుస్తారు. ఫ్లవర్‌వాజ్ పగలగొట్టేస్తారు. ‘ఆట తప్ప నీకేదీ ముఖ్యం కాదా?’.. నాకెప్పటికీ అర్థం కాని ప్రశ్న ఇది! ఒక మనిషికి జీవితంలో ఒకటేగా ముఖ్యమైనది ఉంటుంది. ముఖ్యమైనవి చాలా ఉన్నాయీ అంటే, ఆ మనిషికి ఏదీ ముఖ్యమైనది కాదని, ఆ మనిషి జీవితంలో ఏదీ ముఖ్యమైనది లేదని. నార్మన్, గార్షియా, రాడెక్, ఐవో, అలేన్సో... అంతా ఒకేలా మూతి బిగించి కూర్చున్న మగాళ్లే. ఒక్కరి మోకాళ్లలో కూడా ఫ్రెండ్‌గా నిలబడే సత్తువ లేదు! హ్యుటిన్ మాత్రం మూతి పగలగొట్టడానికి వచ్చేవాడు. భర్త కదా! ‘ఆట కోసం నువ్వు దేన్నైనా వదులుకుంటావ్.. సిగ్గులేని దానివి’ అనేవాడు ఉక్రోషంగా. ఆటతో నాకు దగ్గరై, తన కోసం అదే ఆటకు దూరంగా ఉండమని నన్ను ఆదేశిస్తున్నాడంటే.. షేమ్ ఆన్ మీ? షేమ్ ఆన్ హిమ్? ఇష్టమైనదాని కోసం దేన్నయినా వదులు కోవాలి. అప్పుడే మన ఇష్టానికి మీనింగ్ ఉంటుంది. టెన్నిస్‌ను నేను ఇష్టపడుతున్నానంటే, టెన్నిస్‌ను నేను ప్రేమిస్తున్నానంటే, టెన్నిస్‌ను నేను నా ప్రాణంగా చేసుకున్నానంటే... టెన్నిస్‌ను నేను ఆడి తీరాలి. టెన్నిస్‌లో నేను గెలిచి తీరాలి. ప్రేమలో, పెళ్లిలో.. గెలిచానా ఓడానా నాకు పట్టింపు లేదు. టెన్నిస్ కోసం నేను ప్రేమ నుంచి, పెళ్లి నుంచి ఎన్నిసార్ల యినా బయటికి రావడం కూడా నాకు గెలుపే. గెలవడం కోసమే సానియా, నేను కలసి ఆడాం. గెలుస్తున్నంత కాలం కలిసే ఆడాం. ఇప్పుడు విడిపోయాం. గెలవడం కోసమే విడిపోయాం. కలిసున్నామా, విడిపోయామా అని కాదు. ఎవరి దారిలో వాళ్లం గెలుస్తున్నామా లేదా? అదీ ముఖ్యం. భర్తలకీ, బాయ్‌ఫ్రెండ్స్‌కీ ఈ మాట ఎప్పటికైనా అర్థమౌతుందా? నో. నెవర్. - మాధవ్ శింగరాజు మార్టినా హింగిస్ (టెన్నిస్ స్టార్) రాయని డైరీ -
రాజ్‌నాథ్ సింగ్ (హోం మంత్రి)రాయని డైరీ
శ్రీనగర్! నెహ్రూ గెస్ట్ హౌస్. ఇండియా నుంచి వచ్చి అప్పుడే ఇరవై నాలుగు గంటలు అవుతోంది! ఇండియా నుంచా?! హే రామ్... ఎటు పోతున్నాను?! శ్రీనగర్ ఇండియాలోనే కదా ఉంటుంది! నాకివాళ ఏదో అయినట్లుంది. ఇవాళే అయిందా? టూ డేస్ బ్యాక్ పార్లమెంటులో కశ్మీర్ యువకుల్ని దేశభక్తులు అన్నప్పుడే అయిందా? అనవసరంగా పాకిస్థాన్ చేతిలో గన్ పెట్టినట్టున్నాను! గన్ని గురి పెట్టాలి కానీ, చేతిలో పెట్టకూడదు. ఫిజిక్స్‌లో ఈ సూత్రం ఉండదు. ఆర్.ఎస్.ఎస్.లో ఉంటుంది. ప్చ్.. నో యూజ్. కాలేజీ బయటికి రాగానే మర్చిపోయిన ఫిజిక్సు, పార్లమెంటు లోపల గుర్తుకు రాని ఆర్.ఎస్.ఎస్. లెసన్... రెండూ ఒకటే. విధి చాలా వెరైటీగా బిహేవ్ చేస్తుంది! నెహ్రూ విధానాలంటే పడని నాలాంటి వాడిని తెచ్చి నెహ్రూ విడిది గృహంలో పడేసింది. ఏమాటకామాట. నెహ్రూ గెస్ట్ హౌస్ ఆహ్లాదకరంగా ఉంది. కానీ అలా అనుకోడానికి నాకు మనస్కరించడంలేదు. సెపరేటిస్టులు ఒకరొకరుగా వచ్చి కూర్చుంటున్నారు. ‘‘మేమేం మీ అతిథులం కాదు. ఇక్కడికెందుకు రప్పించారు?’’ అని అడిగాడు గులామ్ మహ్మద్ షఫీ. హురియత్ కాన్ఫరెన్స్ కన్వీనర్ అతడు. అతడి చేతి కింద చిన్నా చితకా కలిపి ఇరవై ఆరు దాకా పార్టీలున్నాయి. ఎంత చక్కటి ఆర్గనైజ్డ్ వేర్పాటువాదం! మహ్మద్ షఫీ గడ్డాన్ని చూస్తే ముచ్చటేసింది. ‘‘అతిథులు మీరు కాదు షఫీ భాయ్.. మీ రాష్ట్రానికి వచ్చిన నేను’’ అన్నాను. షఫీ భాయ్ కళ్లు ఎర్రబడ్డాయి. ‘‘మాది రాష్ట్రం కాదు. దేశం. మేము రాష్ట్ర ప్రజలం కాదు. దేశం పౌరులం’’ అన్నాడు. ఎప్పుడొచ్చాడో... మా జనరల్ సెక్రెటరీ రామ్ మాధవ్ పెద్దగా నవ్వాడు. షఫీ భాయ్ కోపంగా చూశాడు. రామ్ మాధవ్ సర్దుకున్నాడు. ‘‘నేనంటున్నది మీ పౌరసత్వం గురించి కాదు షఫీ భాయ్. ‘అతిథులు’ అని మీరు అన్న మాట గురించి. లోకల్ అయినా, నాన్‌లోకల్ అయినా నెహ్రూ గెస్ట్ హౌస్‌కి అందరూ గెస్టులే’’ అన్నాడు. షఫీ భాయ్ కోపం తగ్గలేదు. కశ్మీర్లో పి.డి.పి.ని, బి.జె.పి.ని కలిపిన వాడు రామ్ మాధవ్. షఫీ భాయ్‌కీ, ఆయన టీమ్‌కి పి.డి.పి. అంటే ఇష్టం లేదు. బి.జె.పి. అంటే ఇష్టం లేదు. ఆ రెండిటినీ కలిపిన రామ్ మాధవ్ అంటే అసలు ఇష్టం లేదు. సెపరేటిస్టులంతా వచ్చేశారు. సి.ఎం. మెహ బూబా ముఫ్తీ కోసం వెయిటింగ్. ఆమె ఎంతకూ రావడం లేదు! ఫోన్ చేశాను. ‘‘మెహబూబాజీ.. మీ నాయకత్వంలో రాష్ట్రం రగిలిపోతోంది. హింస పేట్రేగిపోతోంది. పరిస్థితి అదుపు తప్పుతోంది. మీరేం చేయలేకపోతున్నారు. అదే బి.జె.పి. అయితేనా...’’ అని ఆవేశంగా అంటున్నాను. ‘‘రాజ్‌నాథ్‌జీ.. మీరన్నవన్నీ నిజమే. కానీ నేను మెహబూబాని కాదు. ఆనందిబెన్ని’’ అని అటువైపు నుంచి రిప్లై!! విధి ఒక్కోసారి మన లైన్‌ని మనకే కలుపుతుంది! - మాధవ్ శింగరాజు -
ఆశాదేవి (నిర్భయ తల్లి) రాయని డైరీ
నేరము-శిక్ష! చట్టానికి ఇంతవరకే తెలుసు. మహామహులు దీర్ఘంగా ఆలోచించి, ఆ ఆలోచనల్ని పెద్ద బౌండ్ బుక్కులా కుట్టి, దానికో గట్టి అట్ట వేసి, అల్మరాలో భద్రంగా పెట్టి వెళ్లిన చట్టానికి ఇంతవరకే తెలుసు. పుస్తకంలో ఏ నేరానికి ఏ శిక్ష రాసి ఉంటే ఆ శిక్షను వేసి చేతులు దులుపుకుంటుంది చట్టం. పుస్తకానికి అంటుకుని ఉన్న దుమ్మును మాత్రం దులపదు. చేతులు దులుపుకున్నాక పుస్తకాన్ని దులిపితే మళ్లీ ఆ దుమ్ము తన చేతులకు అంటుకుంటుందనేమో.. తిరిగి ఆ పుస్తకాన్ని ముట్టుకోదు. తిరిగి ఆ పుస్తకాన్ని తిరగేయదు. తిరిగి ఆ పుస్తకాన్ని తిరగరాయదు. ఎప్పుడో ఇంకో నేరస్థుడు వస్తాడు. అప్పుడే ఆ పుస్తకమూ బయటికి వస్తుంది. నేరస్థుడిని బోనులో నిలబెట్టాక న్యాయకోవిదులు వాదనలు వినే చట్టం ఒకటి, నేరస్థుడిని విడిపించుకోడానికి కోర్టు మెట్లు ఎక్కి వస్తూ న్యాయవాదులు తమ వెంట తెచ్చుకునే చట్టం ఒకటి. వాదనల కోసం రాసుకున్న ఈ పుస్తకాలలో వేదనలకు ఉపశమనాలుంటాయా?! ఉంటే ఈ తీర్పులు ఇలా ఉంటాయా? నేరస్థుడిని విడుదల చేస్తున్నారట! ఇవాళో రేపో బయటికి వస్తాడట. ‘పిల్లవాడు’ అని వదిలేస్తున్నారట! అలా అని చట్టంలో ఉందట! మృగాన్ని బయటి ప్రపంచంలోకి వదిలిపెడితే మనుషులు ఏమైపోతారోనని చట్టం ఆలోచించడం లేదు. మృగానికి మనుషులెక్కడ హాని తలపెడతారోనని ఆలోచిస్తోంది! మనుషుల్లోకి వెళ్లబోతున్న మృగం.. మనిషిలా మారడానికి చేయవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తోంది! ఆ మృగం చేత టైలరింగ్ షాపు పెట్టిస్తోంది. ఆ షాపుకో సైన్ బోర్డు రాయిస్తోంది. షాపులోకి టైలరింగ్ మెటీరియల్‌ని, రసీదు పుస్తకాలను తెప్పిస్తోంది. షాపు ప్రారంభోత్సవానికి తప్పనిసరిగా ముఖ్యమంత్రి కూడా వెళ్లి తీరాలన్న రూలు చట్టంలో లేదేమో మరి! ఇన్నాళ్లూ చట్టం ఆ మృగం పేరును మాత్రమే దాచిపెట్టింది. ఇప్పుడు ఆ మృగాన్నే దాచిపెడుతోంది. నాకైతే ‘చట్టం’ అనే పుస్తకాన్ని కడిగిపారేయాలనిపిస్తోంది. నా కూతురు.. మా జీవనజ్యోతి.. ప్రాణాలతో పోరాడి పోరాడి, ఆశలలో రెపరెపలాడి ఆడి, ఆరిపోయాక.. ఈ ప్రపంచమే నాకు ధైర్యం చెప్పింది. చెంతకొచ్చి కన్నీళ్లు తుడిచింది. చనిపోయిన నా కూతురికి నామకరణం చేసింది. ఇక నుంచీ ప్రతి కూతురి పేరూ ఇదేనని ఇల్లిల్లూ ప్రతిధ్వనించేలా చెప్పింది. నిర్భయంగా చదువుకొమ్మని, నిర్భయంగా ఉద్యోగాలు చేసుకురమ్మని ఆడపిల్లలకు చెప్పింది. మీ కూతుళ్లను నిర్భయంగా బయటికి పంపండని కన్నవాళ్లకు చెప్పింది. కన్నబిడ్డను పోగొట్టుకున్న తల్లి పడే ఆవేదన లోకంలో ఎవరూ తీర్చలేనిదని తీర్పునిచ్చింది. ఆ మాత్రం తీర్పును ఈ చట్టం ఇవ్వలేకపోయింది! కడుపు రగిలిపోతుంటే.. నాకివాళ కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. కన్నీళ్లతో కడిగితే చట్టం ప్రక్షాళన అవుతుందా? ఓ తల్లి కన్నీళ్లకు కరిగిపోయేంత మానవీయత ఈ చట్టానికి ఉందా? చట్టాలను తీర్చిదిద్దడానికి మహామహులు మాత్రమే సరిపోరు. వారిలో మహనీయులు కూడా ఉండాలి. -మాధవ్ శింగరాజు -
శోభా డే రాయని డైరీ
నైదర్ ఎ హాక్ నార్ ఎ డోవ్! యుద్ధమూ కాదు, శాంతీ కాదు. మరేమిటి? కుర్షిద్ మహ్మద్ కసూరి ఈ పుస్తకాన్ని ఒక అణ్వాయుధంగా గానీ, శాంతి కపోతంగా కానీ కనిపించనివ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్లున్నారు. అలాంటప్పుడు వాస్తవాలను ఏ డేగో వచ్చి తన్నుకుపోదా? అబద్ధాలు ఏ పావురం ముక్కు ద్వారానో బట్వాడా కాకుండా ఉంటాయా? పేజీలు తిప్పుతున్నాను. చేతి వేళ్లకు అంటిన జాతీయవాద మసి.. పుస్తకంలోని భారత్-పాక్ సంబంధాల వెలుగు నీడల్ని ఏ మూలనైనా అలికిపడేస్తుందేమోనన్న స్పృహతో అతి జాగ్రత్తగా చదవవలసి వస్తోంది. ఆవిష్కరణ సభకు వెళ్లిన సుధీంద్ర కులకర్ణి ముఖానికి ముంబై దేశభక్తి వాదులు పులిమిన సిరా.. తలసరి రుణంలా దేశప్రజలందరి చేతులకూ తలా ఇంత తగులుకుంది మరి. బహుశా ఈ మసి.. పుస్తకంలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ, నట్వర్‌సింగ్, యశ్వంత్ సిన్హా, మన్మోహన్సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయ్‌లకు కూడా అంటుకుని ఉండొచ్చు! పాక్ చరిత్రలో పరదేశీ హాక్ ఎవరో, దేశం లోపలి డోవ్ ఎవరో చెప్పకుండా కుర్షిద్ మహ్మద్ తన పుస్తకంలో పాటించిన విదేశాంగ మర్యాదను.. నా దేశం కనీసం పుస్తకమైనా తెరవకుండానే దేశవాళీ నేషనలిజంతో మంట కలిపింది. ఎటు వెళ్తున్నాం? గోద్రాలు, దాద్రీల క్రానలాజికల్ ఆర్డర్లో మనమొక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంపదగా నిర్మించుకుంటున్నామా? ఇష్టమైన సంగీతాన్ని వినడానికి లేదు. ఇష్టం లేని సినిమాలను చూడకుండా ఉండేందుకు లేదు. ఇష్టమైన ఆహారాన్ని గిన్నెల్లో ఉడికించుకునేందుకు లేదు! పాట వినడానికి, పుస్తకం చదవడానికి కూడా ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెట్టించుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. బెడ్రూమ్లోంచి గులామ్ అలీ పాడుతున్నాడు. హాల్లో కుర్షిద్ మహ్మద్ పుస్తకానికి ఆయన సింక్ అవడం లేదు. ఇంటి పని చేసుకుంటూ హిందూస్థానీ సంప్రదాయ సంగీతంతో శ్రావ్యంగా బ్లెండ్ అయి ఉండే ఉస్తాద్ గులామ్ అలీ ఘజల్స్ వినడమంత సౌఖ్యం కాదు కదా.. శత్రుదేశాల దౌత్యస్నేహాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం! కానీ అర్థం చేసుకోవాలి. భారత్ ఏమిటో తెలుసుకోవాలంటే, పాక్ ఏమిటో తెలుసుకుని ఉండాలి. హాక్‌లు ఎవరో తెలుసుకోవాలంటే మోదీ, దేవేంద్ర ఫడ్నవిస్‌ల ప్రసంగాలను వినాలి. డోవ్‌లు ఎవరో తెలుసుకోవాలంటే గులామ్ అలీ ఘజల్స్‌ను ఆలకించాలి. నవంబర్ 8న ఢిల్లీలో అలీ కచేరీ ఉంది. ముంబైలో రద్దయిన కచేరీ అది. మోదీ వస్తే బాగుంటుంది. కానీ, అదేరోజు అంతకన్నా మనోరంజకంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వినిపించే విజయగీతం కోసం ఆయన ఎదురుచూస్తూ కూర్చుంటారనుకుంటా... సెవన్ రేస్ కోర్స్ రోడ్డులోని తన కార్యాలయంలో. మాధవ్ శింగరాజు